headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. ‘మాతు’ కల్పనలో ‘నాదరూప’ సమాలోచన

డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

సంగీత సహాయక ఆచార్యులు
రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయం
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9866786829, Email: vyzarsu4balu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

దక్షిణభారతీయశాస్త్రీయసంగీతరంగంలో ప్రఖ్యాతవాగ్గేయకారుల రచనలలో భగవంతుని నాదరూపునిగా చిత్రీకరించిన సంగీతరచనలసమగ్రవిశ్లేషణ ఈవ్యాస ముఖ్యోద్దేశ్యం. ఈవాగ్గేయకారుల రచనలలోని కవితా, భక్తి వ్యక్తీకరణలను నిశితంగా పరిశీలించడం, మరియు సంగీతమాధ్యమం ద్వారా నాదమే భగవత్ స్వరూపంగా వివరించడాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధనావ్యాసం యొక్క లక్ష్యం. ఉపనిషత్తులలో, పురాణాలలో, సంగీతలక్షణగ్రంథాలలో నాదానికి భగవంతునికి వ్యత్యాసం లేదని, నాదమే భగవత్ స్వరూపమని చెప్పిన విషయాలను ఉటంకిస్తూ, ‘మాతు’ కల్పనద్వారా వాగ్గేయకారులు మనకందించిన కథావస్తువును సమాలోచన చేయడానికీ, అంతర్లీనంగాఉన్న నాదోపాసన అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం దోహదపడుతుంది. ఈ వ్యాసరచనకు ప్రముఖ వాగ్గేయకారుల రచనలను, సంగీత లక్షణగ్రంథాలను, సంగీత మహిమను దెలిపే ఇతర సంస్కృత గ్రంథాలను ఆలంబనగా చేసుకుని విషయాన్ని సేకరించడం జరిగింది.

Keywords: నాదము, ప్రణవ, మాతు, నాదోపాసన, నాదరూప, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్.

1. ఉపోద్ఘాతం:

ధాతు (స్వరం), మాతు(సాహిత్యం)లకు సమానప్రాధాన్యత వుంటూ ఆధ్యాత్మిక చింతనకు, లౌకిక, అలౌకిక అనుభవాలకు సంగీతం ఒక సాధనంగా వున్నది. దాక్షిణాత్య వాగ్గేయకారులందరూ అద్భుతమైన ధాతు, మాతువులతో తాము అందించిన రచనలద్వారా నాదోపాసనచేసి జీవన్ముక్తులయ్యారు. నాద స్వరూపమే భగత్ స్వరూపము అని తమ పూర్వీకులు ఉపనిషత్తులలో, పురాణాలలో సంగీతలక్షణగ్రంథాలలో ఉటకించిన విషయాన్ని ఈ వాగ్గేయకారులందరూ తమ రచనలలో మాతు కల్పన ద్వారా  అందించి మనకు మార్గదర్శనం చేసారు.

2. నాద రూపముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు :

కావ్యాలాపశ్చ యే కేచిద్గీతాని సకలాని చ |
శబ్దమూర్తిధరస్యైతే విష్ణోరంశా మహాత్మనః ||

(తానేష చంద్ర ఉప్రేతి, విష్ణుమహాపురాణం ఆఫ్ మహర్షి వేదవ్యాస  సంస్కృత  కామెంట్రీ, ప్రథమ సంపుటం, పుట: 205)

కావ్యం (కవిత్వం)తో సహా సంగీతం మరియు సాహిత్యం యొక్క అన్ని రూపాలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆకృతిగా పరిగణించబడతాయి.  భాష మరియు ధ్వని ద్వారా దైవిక సారాన్ని ప్రతిబింబిస్తాయి అని శ్రీవిష్ణు పురాణము లో పేర్కొనబడింది. ఇదే భావాన్ని త్యాగరాజస్వామి వారి కృతిలో ఇనుమడించేసిన విధాన్ని చూద్దాం.

పల్లవి : నాదసుధారసంబిలను నరాకృతాయెరా మనస
అనుపల్లవి : వేదాగమ శాస్త్ర పురాణాదులకాధారమౌ
చరణం : స్వరములారున్నొకటి ఘంటలు వర రాగము కోదండము
దురనయ దేశ్యము త్రిగుణము నిరత గతి శరమురా
సరస సంగతి సందర్భము కలగిరములురా
ధర భజ నే భాగ్యమురా త్యాగరాజు సేవించు
(కృష్ణమాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల., త్యాగరాజ గేయార్థకుంచిక, పుట: 303)

ఘన రాగాలలో ఒకటైన ఆరభి రాగంలో ఈ కృతిని త్యాగరాజు రచించారు.  తన ఇష్ఠదైవమైన శ్రీరాముని నాదాకృతి దాల్చిన రూపంగా భావించి ఆపాదమస్తకమునూ మధ్యస్థాయి నుండి తారస్థాయి వరకూ వివిధ రంజక, సంవాది ప్రయోగములతో ఘనంగా, రూఢిగా అత్యంత సుందరంగా వర్ణించారు. అంతేకాక ఈ నాదసుధారసము వేదాలకు, పురాణాలకు, స్మృతులకు ఆధారమైనదని కూడా వివరించారు. ఈ విధంగా త్యాగరాజు నాదరూపుడైన రాముణ్ణి నాదోపాసన ద్వారా సేవించి తరించారని పై కృతి ద్వారా తెలుస్తోంది.

నాదోపాసనయా దేవ బ్రహ్మవిష్ణుమహేశ్వర: ।
భవత్యుపాసితా నూనం యస్మాదేతే తదాత్మకా: ॥ (సుభద్ర చౌదరి, సంగీతరత్నాకరం, ప్రథమ సంపుటం, పుట: 57)

నాదస్వరూపులైనటువంటి త్రిమూర్తులు అనగా బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నాదోపాసనచేత  నిశ్చయముగా ఉపాసించబడుదురు అని శార్ఙదేవుడు తన సంగీతరత్నాకరం లో వివరించాడు.

నాదరూపః స్మృతో బ్రహ్మా నాదరూపో జనార్దనః|
నాదరూపా పరాశక్తిః నాదరూపో మహేశ్వరః ॥ (ప్రేమలత శర్మ, బృహద్దేశి, పుట: 6)
బ్రహ్మ,జనార్ధన(విష్ణు),మహేశ్వరుడు మరియు పరాశక్తి ఈ నలుగురు కూడా నాద స్వారూపులుగా స్మరించబడ్డారు అని మతంగముని విరచిత బృహద్దేశిలో చెప్పబడింది.

న నాదేన వినా నృత్తం తస్మాన్నాదాత్మకం జగత్ |
నాదరూప: స్మృతో బ్రహ్మా నాదరూపో జనార్దనః ॥ (ప్రేమలత శర్మ, బృహద్దేశి, పుట: 6)

నాదము లేనిదే నృత్తము లేదు, కనుక జగమంతా నాదాత్మకమే బ్రహ్మవిష్ణువులు  నాదరూపాలుగా చెప్పబడుచున్నారన్న విషయాన్ని కూడా బృహద్దేశిలో నే చెప్పబడింది.
ఓంకారం చ పరబ్రహ్మ యావదోంకార సంభవః | / అకారోకారమకార ఏతే సంగీత సంభవాః ||

అకారో విష్ణురూపంచ ఉకారో బ్రహ్మరూపకం | / మకారో భర్గరూపంచ సర్వమోంకారరూపకం॥ 

(వెంకటరమణ దాసు, వీణ, వీణ రహస్య ప్రకాశిక,  పుట: 16)

పై శ్లోకం విజయనగర ఆస్థాన విద్వాంసుడైన వీణ వెంకట రమణదాసు రచించిన వీణారహస్య ప్రకాశిక అను గ్రంథంలో చెప్పబడింది. ఓంకారము పరబ్రహ్మస్వరూపమైనటువంటిది. బ్రహ్మ ఓంకారము నుండి ఉద్భవించినాడు. అట్టి ఓంకారము లోని ఆకార ఉకార మకారాలు సంగీతం లో నుండి ఉద్భవించినవవి. అకారము విష్ణురూపము, ఉకారము బ్రహ్మరూపము మకారము శివరూపము, కావున జగమంతా ఓంకారమయమే అని దీని భావము. 

పై శ్లోకాలలో చెప్పిన భావాన్ని త్యాగయ్యగారు ఈ క్రింది బేగడ రాగ కృతిలో ప్రస్ఫుటంగా తెలియచేసారు.

పల్లవి: నాదోపాసనచే శంకర
నారాయణ విధులు వెలసిరి ఓ మనసా
అనుపల్లవి: వేదోద్ధారులు వేదాతీతులు
విశ్వమెల్ల నిండి యుండే వారలు
చరణం: మంత్రాత్ములు యంత్రాత్ములు మరిమ
స్వంతరములెన్నో గలవారలు
తంత్రీ లయ స్వర గాన విలోలురు
త్యాగరాజ వంద్యులు స్వతంత్రులు
(కృష్ణమాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల., త్యాగరాజ గేయార్థకుంచిక, పుట: 306)

మృదంగనాదాన్ని అద్భుతంగా పలికింప కలిగిన బ్రహ్మదేవుడు, వేణునాదప్రియుడు, నిపుణుడైన  శ్రీకృష్ణుడు, ఢక్క అనే సంగీతవాద్యాన్ని మ్రోగించే నటరాజస్వామి వంటి విషయాలనెరిగిన   త్యాగరాజస్వామి ఈ కృతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాద స్వరూపులని, వేదములకు అతీతులని, వేదములను ఉద్ధరించినవారని మంత్రములతో స్మరింపుబడువారని,   నాదోపాసనతో వీరు వెలసినారని వివరించారు.

ఈ కృతి బేగడరాగంలో కూర్చబడింది. బేగడ చాలా నిశిత బుద్ధితో, జాగ్రత్తతో,శాస్త్రీయపు కట్టుబాట్లతో పాడవవలసిన రాగం. “నిద్దుర నిరాకరించి, ముద్దుగ తంబూర బట్టి, శుద్ధమైన మనసుతో, సుస్వరముతో, పద్దుతప్పక” (అనునిత్యమూ)- అని త్యాగరాజు చెప్పినట్లుగా నిశితబుద్ధితో, ఇన్ని జాగ్రత్తలతో నాదోపాసన చేయవలెనన్న భావము బేగడ రాగాన్ని ఈ కృతికి త్యాగరాజు ఎందుకు ఎంచుకున్నారో మనకు బోధపడుతుంది.

శివో నాదమయః సత్యం నాదః శివమయస్తథా ।
ఉభయోరన్తరం నాస్తి నాదస్య చ శివస్య చ ॥

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాద స్వరూపము. నాదము ఈశ్వరమయము. నాదానికి మరియు శివునికి ఆంతర్యము లేదు అని లో శివపురాణం పేర్కొనబడింది.

బ్రహ్మగ్రన్థిజమారుతానుగతినా చిత్తేన హృత్పఙ్కజే
మూరీణామను రఞ్జకః శ్రుతిపదం యో ఽయం స్వయం రాజతే ।
యస్మాద్ గ్రామవిభాగవర్ణరచనాఽలంకారజాతిక్రమో
వన్దే నాదతనుం తముద్ధురజగద్గీతం ముదే శంకరమ్ ।।
(సుభద్ర చౌదరి.,సంగీతరత్నాకరం, ప్రథమ సంపుటం, పుట: 1)

సంగీత రత్నాకరకారుడైన శార్ఙదేవుడు శంకరుని స్తుతిస్తూ పై శ్లొకంలో నాదమే తనువు గలవానిగా కీర్తించాడు.  ఇదే భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని త్యాగరాజస్వామి వారు కూడా ఈ దిగువనీయబడిన కృతిలో శంకరుని నాదరూపునిగా కీర్తిస్తూ  త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నేను నమస్కరించుచున్నాను అన్న కృతి ద్వారా మనకు అందించారు.

పల్లవి : నాదతనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా
అనుపల్లవి : మోదకర నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం
చరణం : సద్యోజాతాది పంచ వక్త్రజ
సరిగమపదనీ వర సప్తస్వర
విద్యాలోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజపాలం
(కృష్ణమాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల., త్యాగరాజ గేయార్థకుంచిక, పుట: 302)

త్యాగరాజు ఈ కృతిని చిత్తరంజని అనే అపూర్వరాగంలో కూర్చారు. సామవేద గానానికి ఆలంబనగా వుండే  షడ్జగ్రామానికి చేరువైన  చిత్తరంజని రాగాన్ని ఎంచుకోవడం కాకతాళీయము అస్సలుకాదేమో. అంతేకాక "సరిగమపదనీ" అనే స్వరాక్షర సాహిత్యం ద్వారా రాగ మూర్చననూ, రాగ పరిమితినీ సూచనప్రాయంగా తెలియచేసారు.  ఎందుకనగా చిత్తరంజని రాగం నిషాదాంత్య రాగం ఆనగా నిషాదము తరువాత మరలా షడ్జం లేదు. రాగప్రస్తారము లేదు. షడ్జం అనే భూమిమీద జన్మించిన మానవుడు నాదోపాసనద్వారా  పునరావృత్తి రహిత పథాన్ని చేరుకొంటాడని సూచన ప్రాయంగా సంగీత సాహిత్య సమన్వయము ద్వారా తెలియచేసారు. 

3. నాద రూపముగా అమ్మవారు :

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా
హ్రీఙ్కారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా

బ్రహ్మాండ పురాణంలో ఇవ్వబడిన లలిత అమ్మవారి సహస్ర నామాలలో ఒకటి  నాదరూపిణి. ఈ స్తోత్రంలో అమ్మవారిని నాదరూపిణిగా వర్ణించారు.
(షణ్ముఖ శర్మ సామవేదం., శ్రీ లలిత విద్య, పుట: 1267)

ఇదే విషయాన్ని శ్రీ శ్యామశాస్త్రులవారు “సరి ఎవరమ్మా అంబ” అనే భైరవి రాగ కృతిలో అమ్మవారిని నాదరూపిణిగా వర్ణించారు.  ఈ కృతి చరణం యొక్క పంక్తిని చూస్తే మనకు అవగతమవుతుంది - “మాధవ సోదరి గౌరీ మహా భైరవి శాంభవి నాదరూపిణి జనని దేవీ నారాయణీ నళినాక్షి” (పినాకపాణి, శ్రీపాద., సంగీత సౌరభం, తృతీయ సంపుటం, పుట: 569)

అటులనే శ్యామశాస్త్రి విరచిత జనరంజని రాగ కృతి “నన్ను బ్రోవరాదా” -  మూడవ చరణంలో -

శ్యామకృష్ణ సహోదరీ ఓంకారీ శాంభవీ ఓ జననీ నాదరూపిణీ నళినాక్షి” అని అమ్మవారిని నాదరూపిణిగా కొనియాడిన తీరును మనం గమనించవచ్చు.

(గోవిందరావు,టి.కె., కాంపోజిషన్స్ ఆఫ్ శ్యామశాస్త్రి, సుబ్బరాయశాస్త్ర్ అండ్ అన్నాస్వామి శాస్త్రి, పుట:80)

మైసూరు సంస్థానధీశులు, శ్రీవిద్యోపాసకులు, మహావాగ్గేయకారులైన శ్రీ  జయచామరాజ వడయార్ రచించిన కల్యాణి రాగ కృతి “మహా త్రిపురసుందరి శంకరి మాం పాహి” చరణంలో  మహా త్రిపురసుందరి అమ్మవారిని నాదరూపిణిగా కీర్తించిన వైనాన్ని  ఈ క్రింది చరణంలో మనం చూడవచ్చు.

“సరోజదళ నేత్రే అతి పవిత్రే సుచరిత్రే సమస్త బ్రహ్మాండ తోషితే
సామవేదనుతే సమరాసక్త మహామాయే మహోదయే కర్ణరంజన మధుర
భాషిణి శ్రీ విద్యా స్వరూపిణి కర్ణానందకర నాదరూపిణి కల్యాణి”
(కృష్ణమూర్తి,యస్., శ్రీవిద్య గానవారిధి, పుట: 112)

మైసూరు అస్థాన విద్వాంసులు, హర్తికథకులు, గాయకశిఖామణి అయినటువంటి శ్రీ హరికేశనల్లూర్ ముత్తయ భాగవతార్ గారు విజయనాగరి రాగంలో రచించిన “విజయాంబికే విమలాత్మికే” అన్న కృతి చరణంలో అమ్మవారిని సంగీతరూపిణిగా వర్ణించిన విధానాన్ని మన చూడవచ్చు.

“శృతి స్వర గ్రామ మూర్చనాలంకార నాద జనిత రాగ రస భరిత
సంగీత రూపిణి గౌరీ పాలిసౌ మాతే హరికేశ మనమోదిని”
(అక్షంతల విమలదేవి, శ్రీ హరికేశనల్లూరు ముత్తయ భాగవతార్ గారి సంగీతమకరందము, ద్వితీయ సంపుటం, , పుట 91)

శ్రీమనోభిరామకృష్ణనామకం పరాత్పరమ్ సామవేదమూర్తిమాద్యమచ్చుతం జగత్ప్రభుమ్ ।
గ్రామమూర్ఛనాది రమ్యవేణుగానలాలనమ్ క్షేమసౌఖ్యసంపదాదిదాయకం హరిం భజే ॥

(వెంకట నరసింహాచార్యులు, తెన్మతం., అండ్ వెంకట వరదాచార్యులు, తెన్మతం.,
సంగీతానంద రత్నాకరం, పుట: 1)

మనోహరుడైన శ్రీకృష్ణభగవానుడు సామవేదస్వరూపుడని, గ్రామ, మూర్ఛన మొదలగు సంగీతరీతులతో కూడిన   వేణుగానమునందు మిక్కిలి ఆసక్తి గలవానిగా  సంగీతానంద రత్నాకరంలో చెప్పబడింది.

గానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాలా” గానమూర్తి రాగ కృతిలో శ్రీకృష్ణుడు - గానమే ఆకృతిగా కలవాడని, వేణుగానానికి మిక్కిలి ప్రీతి పొందుతాడని త్యాగరాజస్వామి యదాతధంగా ఇదే భావాన్ని వ్యక్తపరిచారు. (కృష్ణమాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల., త్యాగరాజ గేయార్థకుంచిక, పుట: 215)

4. నాదరూపముగా గణపతి :

ముత్తుస్వామి దీక్షితులవారు కూడా వాతాపిగణపతిం కృతిలో “ప్రణవ స్వరూప వక్రతుండం” అనే పంక్తిలో మరియు గజాననయుతం కృతిలో “కుంజర భంజన చతురధరకరం గురుగుహాగ్రజం ప్రణవాకారం” అనే పంక్తిలో  గణపతిని ప్రణవాకారంగా వర్ణిస్తారు. (పినాకపాణి, శ్రీపాద., సంగీత సౌరభం, తృతీయ సంపుటం, పుట: 464 & ప్రథమ సంపుటం, పుట: 569)

నాదోత్పత్తికరం దేవం నమామి ప్రణవాకృతిమ్ |
మూలాధారస్థితం జ్ఞానమోక్షసిద్ధిప్రదం గజమ్ ||

(భాగవతార్, ముత్తయ., హరికేశనల్లూర్ శ్రీమత్ త్యాగరాజవిజయ కావ్య, పుట: 1)

నాదోత్పత్తి చేసేవాడు, ప్రణవ ఆకృతి కలిగినవాడు, మూలాధారమున ఉన్నవాడు, మోక్షాన్ని సిధ్ధింపచేసేవాడైన గణపతికి నమస్కరిస్తున్నాను అని దీక్షితులవారి తదనంతర వాగ్గేయకారులైన ముత్తయ భాగవతార్ గారు తాము రచించిన త్యాగరాజవిజయకావ్యంలో తెలిపారు.

5. ముగింపు:

  1. ఈ వ్యాసం ద్వారా విశిష్ట వాగ్గేయకారుల రచనల్లో భగవంతుడు నాదస్వరూపమన్న విషయం రూఢిగా తెలుస్తోంది.
  2. ఈ సమాలోచన ద్వారా వాగ్గేయకారులు నాదరూపుడైన భగవంతుని ఆరాధించి, నాదోపాసనను మోక్షమార్గానికి ఎంచుకొని సఫలీకృతులయ్యారని మనకి బోధపడుతుంది.
  3. తరువాతి తరం వాగ్గేయకారులు, విద్వాంసులు ఇదేమార్గాన్ని అనుసరించి సఫలీకృతులయ్యారని చరిత్ర అధ్యయనం చెపుతోంది. అయినప్పటికీ నేటి తరం విద్వాంసులు ఈ విషయాన్ని మరచి లౌకికమైన విషయాలలో మునిగిపోయి సన్మార్గాన్ని త్యజించడం ఒక రకంగా బాధాకరం.
  4. అలౌకికానందంకోసం సాధనచేస్తే అందులో లౌకికం కూడా అనగా ఇహ పర సాధన సాధ్యమవుతుందన్న విషయాన్ని గ్రహించి తాము తరిస్తూ తమ విద్యార్థులను కూడా ప్రేరేపించడానికి బాటవేస్తే సంగీత సాధన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. 

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణమాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల., త్యాగరాజ గేయార్థకుంచిక, కృష్ణమాచార్య కళాపీఠం, విజయవాడ, 2010.
  2. కృష్ణమూర్తి,యస్., శ్రీవిద్య గానవారిధి, ఆర్.రాజాచంద్ర,బెంగళూరు, 2010.
  3. గణపతిశాస్త్రి, చర్ల., గాంధర్వ వేదము సంగీతరత్నాకరము, లలిత ఆర్ట్ ప్రెస్ , విశాఖపట్నం,1987
  4. గోవిందరావు,టి.కె., కాంపోజిషన్స్ ఆఫ్ శ్యామశాస్త్రి, సుబ్బరాయశాస్త్ర్ అండ్ అన్నాస్వామి శాస్త్రి, గానమందిర్ పబ్లికేషన్స్,చెన్నై, 2003.
  5. తానేష చంద్ర ఉప్రేతి, విష్ణుమహాపురాణం ఆఫ్ మహర్షి వేదవ్యాస  సంస్కృత  కామెంట్రీ, ప్రథమ సంపుటం,  ఆత్మప్రకాస ఆఫ్ శ్రీధరాచార్య, ప్రథమ సంపుటం, పరిమళ పబ్లికేషన్స్, న్యూ ఢిల్లీ, 2011.
  6. పినాకపాణి, శ్రీపాద., సంగీతసౌరభం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1995, 1998
  7. ప్రేమలత శర్మ, బృహద్దేసి ఆఫ్ శ్రీ మతంగముని, ఇందిర గాంధి నేషనల్ సెంటర్  ఫర్ ఆర్ట్స్, మోతిలాల్ బనరసీదాస్ ఫుబ్లిషెర్స్ ప్రెవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ, 1994.
  8. భాగవతార్, ముత్తయ., హరికేశనల్లూర్ ముత్తయ భాగవతార్ సంకీర్తనంగళ్, ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు చతుర్థ సంపుటాలు, ది ఇండియన్ మ్యూజిక్ పబ్లిషింగ్ హౌస్, మద్రాసు, 1968.
  9. భాగవతార్, ముత్తయ., హరికేశనల్లూర్ ముత్తయ భాగవతార్, శ్రీమత్ త్యాగరాజవిజయ కావ్య, ఆనంతశయనం , 1941.
  10. మంజుశ్రీ త్రిపాఠీ, సంస్కృత - సంగీత – మంజూష, -జ్ఞానభారతి పబ్లికేషన్ , ఢిల్లీ, 2015.
  11. విమలదేవి,అక్షంతల., శ్రీ హరికేశనల్లూరు ముత్తయ భాగవతార్ గారి సంగీతమకరందము, ద్వితీయ సంపుటం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2023.
  12. వెంకట నరసింహాచార్యులు, తెన్మతం., అండ్ వెంకట వరదాచార్యులు, తెన్మతం., సంగీతానంద రత్నాకరం, తెన్మతం శ్రీ రంగాచార్యులు, మద్రాస్, 1917.
  13. వెంకటరమణ దాసు, వీణ, వీణ రహస్య ప్రకాశిక,  నాట్యకళ, ఆంధ్ర ప్రదేశ్  సంగీత నాటక అకాడమి, హైదరాబద్ , జనవరి-ఫిబ్రవరి.,1971
  14. శాంతిలాల్, శివ మహాపురాణ -ఆంగ్ల అనువాదం- - పరిమళ్ పబ్లికేషన్, ఢిల్లీ, 2007.
  15. శింగరాచార్యులు, తచ్చూరి, చిన్న శింగరాచార్యులు, తచ్చూరి., గాయకలోచనము, పుష్పరథ షెట్టి అండ్ కో. , చెన్నై, 1902
  16. షణ్ముఖ శర్మ సామవేదం., శ్రీ లలిత విద్య, ఋషిపీఠం , సికింద్రాబాద్, 2021.
  17. సుభద్ర చౌదరి, సంగీతరత్నాకర్,  సరస్వతి వ్యాఖ్య ఔర్ అనువాద్ సహిత్, తృతీయ ఖండ్ , రాధ పబ్లికేషన్స్, న్యూ ఢిల్లీ – 2006.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]