headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ‘విశ్వనాథ’ మరపురాని పాత్ర ‘హాహాహూహూ’: విశ్లేషణ

డా. కె. కరుణశ్రీ

తెలుగు అధ్యాపకులు
డి. కె. ప్రభుత్వమహిళా కళాశాల (స్వయం)
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9441540317, Email: karunasai16@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

మన జీవితంలో మనకు తారసపడి మన జీవన గమనాన్ని మార్చగలిగే గురువులు అరుదుగా ఉంటారు. అలాంటి ప్రత్యక్ష గురువులు మనకు తారసపడకపోయినా అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు మనకి పరోక్ష గురువులుగా మారి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి కొన్ని రచనలు చదువుతుంటే సాధారణంగా ఉన్నట్టే అనిపిస్తాయి. చదవడం పూర్తైన తర్వాత, అంతరార్థం బోధపడడం మొదలైన తర్వాత దాని అసాధారణత్వం వల్ల ఆ పుస్తకం మనల్ని మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది. అలాంటి ఒక నవలను పరిచయం చేయడమే ఈ వ్యాసముఖ్యోద్దేశం. ఈ నవలలోని విభిన్న విషయాలను ఆధ్యాత్మికపరమైన, మతపరమైన, విజ్ఞాన పరమైన, సాంఘిక పరమైన అన్న నాలుగు అంశాలుగా విభజించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధంగా విభజించడం వలన పాఠకులకు సులువుగా ఈ నవలలోని ప్రత్యేకత అర్ధమౌతుంది

Keywords: ప్రకృతి, కృత్రిమ జ్ఞానం, మతం, ఆధునికత, భారతీయత

1. ఉపోద్ఘాతం:

మరపురాని అంటే మనకు గుర్తొచ్చే  అని మాత్రమే కాదు మన జీవితంలో ఏదో ఒక దశలో మనతోపాటు మన ఆలోచనల్ని, మన దృష్టిని విశాలం చేసే పాత్ర. ఎన్నిసార్లు చదివినా చదివిన ప్రతీసారీ ఒక కొత్త భావనలను కలిగించే పాత్ర. పాత్ర ద్వారా  కవి నిర్దేశించిన భావాన్ని  సహృదయుడు పట్టుకోగలిగే శిల్పం ఉన్న పాత్ర. చదివిన ప్రతిసారీ ఆనందాన్నో, ఆవేదననో, ఆశ్చర్యాన్నో, ఒక కొత్త ఆలోచననో కలిగించే పాత్ర. తలపు కొచ్చిన  ప్రతిసారీ ఇంత గొప్ప పాత్ర ఎలా సృష్టించగలిగాడబ్బా అని ఆశ్చర్యపడే పాత్ర. జవాబు చెప్పలేని ప్రశ్నల్ని, జీవితమంతా మనం సమాధానాలు వెతుక్కోవాల్సిన సందేహాల్ని మనకు మిగిల్చే పాత్ర. సర్వకాలాల్లోనూ సమకాలీనత గలిగిన పాత్ర.  ఏ నవలలో నైనా అలాంటి పాత్ర  అది ప్రత్యేక పాత్రైనా అది మరపురాని పాత్రే.

విశ్వనాథ సత్యనారాయణ సృష్టించిన “హాహాహూహూ” నవలలోని ‘హాహాహూహూ’ అనే పాత్ర పైన చెప్పిన లక్షణాలు కలిగిన మరపురాని పాత్ర. ఒక పాత్ర మరపురాని పాత్ర కావాలంటే అది మనిషి పాత్రే కానవసరం లేదు అన్నదానికి హాహాహూహూ పాత్ర ప్రతీక. హాహాహూహూ సగం మనిషి, గుర్రo తల, రెక్కలు కూడా ఉన్నాయి. మనిషి, జంతు, పక్షి లక్షణాలు కలిగిన ప్రధాన పాత్రతో విశ్వనాథ రచించిన హాహాహూహూ నవల సాంఘిక ప్రతీకాత్మక నవల. అందులోని హాహాహూహూ అనే పాత్ర భారతీయ సంస్కృతికి ప్రతీక. భారతీయ ఆత్మకు, భారతీయ విజ్ఞానానికి ప్రతినిధి. మనం ఆలోచించాల్సిన సాంఘిక, తాత్త్విక, ఆధ్యాత్మిక, విజ్ఞాన పరమైన భావాల్ని మన ముందుంచే పాత్ర. ఆరోజు హాహాహూహూ చర్చించిన అనేక విషయాలు నేటికీ మనం చర్చించాల్సిన  అంశాలే. ఈ నవల రచనా కాలం 1952 కావచ్చని, హాహాహూహూ నవల ప్రథమ ముద్రణ ఏ సంవత్సరంలో జరిగిందో సరిగ్గా తెలియదు కానీ 1982లో ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడిందని, 2006 లో ఏడవ ముద్రణ పొందిందనీ 2013లో ముద్రించబడిన పుస్తకంలో విశ్వనాథ పావని శాస్త్రిగారి నవలా పీఠిక వల్ల తెలుస్తోంది. 2013లో హాహాహూహూ నవలను హాహాహూహూ అన్న పేరుతోనే వెల్చేరు నారాయణరావు  ఆంగ్లంలోకి అనువదించారు. 1981లో ఈ నవల గురించి వెల్చేరు నారాయణరావు రాసిన 'ఏ హార్స్ హెడెడ్ గాడ్స్ అండ్ వైట్ స్కిన్డ్ మాన్ - ఎ సెకండ్ లుక్ ఎట్ విశ్వనాథ సత్యనారాయణాస్' అనే విమర్శా వ్యాసం 'జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్' లో ప్రచురితమైంది.

2. హాహాహూహూ పాత్ర- విశ్లేషణీయాంశాలు:

సాధారణంగా నవల చదవడం పూర్తయ్యాక ఒక పాత్ర స్వభావం మనల్ని వెంటాడినా ఆ పాత్ర పేరు మాత్రం కొద్ది కాలనికి మర్చిపోతాం. కానీ ఈ నవలలో “హాహాహూహూ” అనే గంధర్వ పాత్ర పేరు  మన కెప్పటికీ గుర్తుండి పోతుంది. పాత్ర స్వభావాన్ని బట్టి పాత్రలకు పేర్లు పెట్టడంలో విశ్వనాథ సత్య నారాయణ  గారు సిద్ధహస్తులు. భాగవతంలో గజేంద్రమోక్ష ఘట్టంలో శాప విమోచనం పొందిన మొసలి హాహూ అనే గంధర్వుడు. ఈ ఇద్దరు గంధర్వులకు ఎక్కడా పేరులో తప్ప పోలిక లేదు. ఇందులో-

ఈ నవలలో హాహాహూహూ పాత్ర సంధించిన జవాబు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. అవి-

  • నిజంగానే మనిషి ఆధునికత పేరుతో జ్ఞానాన్ని పొందుతున్నాడా?
  • కృత్రిమ జ్ఞానం పొందిన మనిషి ఏం సాధించాడు? ఏం సాధిస్తున్నాడు?
  • ప్రకృతికి భిన్నంగా మనిషి సాధించాననుకునే జ్ఞానం నిజంగా నిజమైన జ్ఞానమేనా?
  • సైన్సు అన్నిటినీ పరీక్షించి సత్యం తెలుసుకోమంటుంది. మరి జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్నీ మనం శల్య పరీక్ష చేయగలమా?
  • ఆలోచనా మాత్రంగా ఒక దాన్ని గురించి ఊహించలేని మనిషి సాధించే జ్ఞానం ఏ రకమైనది?
  • జీవితంలో మనకు వాసనా మాత్రంగా కూడా పరిచయం లేని దాని గురించి మనం తెలుసుకోగలిగే జ్ఞానం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
  • మనం ఇంతకు ముందు సాధించిన జ్ఞానానికి భిన్నమైన జ్ఞానం మన ఎదురుగా వచ్చినప్పుడు కూడా దాన్ని మనం అంగీరించక మన పూర్వ మతాన్నే అనుసరించాలనుకోవడం ఎంత వరకు సబబు?

పై  ప్రశ్నలు జీవితంలో ఎదురయ్యే  ప్రతిసారీ హాహాహూహూ కళ్ళముందే ప్రత్యక్షమౌతుంది. నవలా సంఘటనలను పరిశీలిస్తే – హాహాహూహూ పాత్ర మరపురాని పాత్రగా మిగిలిపోవడానికి ఉన్న ప్రధానమైన కారణాలు నాలుగు. అవి -

1. ఆధ్యాత్మిక పరమైనవి
2. మతపరమైనవి 
3.  విజ్ఞాన (సైన్స్) పరమైనవి 
4.  సాంఘికపరమైనవి

2.1 ఆధ్యాత్మిక పరమైనవి : 

భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి హాహాహూహూ పాత్ర ప్రతినిధి. హాహూ ప్రతి రోజూ ప్రాణాయామం, ధ్యానం చేస్తుంది. శీర్షాసనం లాంటి ఆసనాలు వేస్తుంది. జ్ఞానం తపస్సు వల్లే కలుగుతుందని నొక్కి వక్కాణించింది. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని పండితులు అడిగిన ప్రశ్నలకు హాహూ చెప్పిన సమాధానం ఇది.

ఎవళ్ళ మతగురువులు చెప్పింది ఆ మతంలో వాళ్ళకి సంబంధించినంత మట్టుకు నిజం. ఎందుకంటే ఆ  జ్ఞానం వాళ్ళ సంస్కారానికి  అనుగుణంగా ఉంటుంది కనుక. వాళ్ల స్వభావం చేత  దానిని విశ్వసించ గలిగినంత శక్తి మాత్రమే వాళ్లకి ఉంటుంది కనుక. చిన్న చేప చిన్న చెరువులో ఉంటుంది. పెద్ద చేప పెద్ద చెరువులో ఉంటుంది.  తిమింగలం సముద్రములో ఉంటుంది. చిన్న చెరువులో మంచి నీళ్ళలో ఉండే చేపను  సముద్రంలో వేస్తే చస్తుంది. మన శరీరాలు మన సంస్కారానికి అనుగుణంగా ఉంటవి. మన మనశ్శక్తి మనం ఉన్న దేశాన్ని,  మన శరీరాన్ని, మన పూర్వుల ఆచరణాన్నీ పట్టి ఉంటుంది. ఇది ఒక గాఢమైన బంధం. నమ్మకం వ్యక్తిని బట్టి భేదిస్తుంది. వర్ణాన్ని బట్టి భేదిస్తుంది. జాతిని బట్టి భేదిస్తుంది. తనకు దేని యందు విశ్వాసం ఉన్నదో అది కాని దాన్ని గురించి చెబితే దానిలో విశ్వాసం ఉండదు. ఒక పెద్ద పర్వతం మీద నివసించే వాడితో సముద్రం ఉందని చెబుతావు. వాడు విశ్వసిస్తాడు. ప్రయోజన మేమున్నది? వెళ్లి చూస్తాడు. అనుభవంలో కొంచెం భేదం. దాని మీద ప్రయాణం చేస్తాడు. అది వేరే అనుభవం. ప్రయోజనమేముంది. అప్పటికైనా సముద్రం వాడికి సంపూర్ణంగా తెలిసిందా. ఏది మనకు గాఢమైన అనుభవంలోకి వస్తే దాని యందే మనకు  చరితార్ద్రత. తక్కిన  వ్యర్ర్ధోపన్యాసాలతో ఏమీ పని లేదు. అందుకనే తెలుసుకోవలసిన విషయాలు ఎక్కువ పొగుచేస్తాననడం కన్నా ఒక్క విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కృతార్ధత ఎక్కువ.”1

పై చర్చలో మనిషి తన ముందున్న దాన్ని గురించి,ఈ లోకం గురించి తెలుసుకుంటే చాలు. పరలోకం గురించి,చనిపోయిన తర్వాత ఏమౌతాం అన్నదాని గురించి తెలుసుకున్నా, తెలుసుకోక పోయినా ప్రయోజనం శూన్యం అంటాడు హాహూ. మనం నమ్మినా నమ్మకున్నా పరలోకం గురించి మన కవసరం లేదు. అదే విషయాన్ని హాహూ ఉదాహరణ పూర్వకంగా సమర్ధించాడు. ఇలాంటి ఆధ్యాత్మ పరమైన ఆలోచనలు మనకు జీవితమంతా గుర్తొస్తాయి. మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

2. 2. మతపరమైన ఆలోచనలు: 

నీ మతం ఏమిటి అని ఒక బిషప్పు అడిగిన ప్రశ్నకు హాహూ “సామాన్యులకు మతం లేదు.మహర్షులకే మతము ఉంటుంది. ఒకానొక మహర్షి చెప్పిన మతము నందు ఒకనికి విశ్వాసం ఉంటుంది. అల్పుని విశ్వాసం అల్పమైంది. అధికుని విశ్వాసం అధికమైంది. ఏ లోకంలో అయినా తక్కువ శక్తి గల ఈ లోకంలో గాని ఎక్కువ శక్తి గల ఇతర లోకాల్లో గాని  అందరూ వాంఛాదూషితులు. వాంఛాతీతుడై బ్రహ్మ పదాన్ని ఎవడు సేవిస్తాడో, వాడికి  అల్పమైన ఇట్లాంటి వాటితో అవసరం లేదు. మతమంటే ఏమిటో ఏమి  తెలుస్తుంది. మొట్టమొదట లోకము యొక్క నశ్వరత్వం తెలిస్తే చాలు”2 అని సమాధానం చెప్పాడు. లోకంలో మనిషి పుట్టాకే మతం పుట్టింది. మనం పెరిగిన కుటుంబ మత విశ్వాసాలే మనల్ని జీవితమంతా వెంటాడతాయి. ఇది ఏ కాలంలోనైనా మనం కాదనలేని సత్యం. 

2.3. విజ్ఞాన (సైన్స్) పరమైన ఆలోచనలు: 

“శారీరకంగా పరిశీలించి ఎంత జ్ఞానమని నేర్చుకుంటారు. ఏకాగ్ర మనస్కులై భావిస్తే దాని విషయం తెలుస్తుంది కదా!”3

“శాస్త్ర పరిజ్ఞానం కలిగిన తర్వాత బుద్ధి పరిపక్వమైతే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఉండనక్కరలేదు”4

“పండితులు నాతో చెప్పే ఈ విషయాన్ని బట్టి చూస్తే మీ దేశంలో అజ్ఞానమే ఎక్కువగా ఉన్నట్టుందే. కొన్ని కొన్ని వ్యాధుల కౌషధాలే  లేవట.  కలరా మశూచి కాలు వచ్చి జనం చచ్చిపోతుంటారట. వంద ఏండ్లు కూడా సరిగా బ్రతకరట.”5
“భూమి మీద మనుషులు, మృగాలు, పక్షులు వాటి లక్షణాలు వేరువేరుగా ఉంటవి. ఈ భూమి కాని ఇంకోచోట ఇవన్నీ కలిసియే ఉండవచ్చు.”6

ఇవన్నీ పండితులతో జరిగిన అనేక చర్చల్లో హాహాహూహూ చెప్పిన విషయాలు. ఇవన్నీ అక్షర సత్యాలే కదా!

ఒక రోజు హాహూకి లండన్లో ఉన్న యంత్రాలన్నీ చూపించి పండితులు మేము మహా విషయాలు కనిపెట్టామని, ప్రపంచంలో ఏ జాతులూ ఇలాంటివి చేయలేదని చెప్పినప్పుడు హాహూ ఒకే ఒక్క మాటన్నాడు. “మీరు భారత దేశం ఎరుగుదురు గదా!”7 అని. హాహూ చెప్పిన ఈ ఒక్క వాక్యం చాలు. భారతదేశ ఆధ్యాత్మిక ప్రగతి ప్రపంచానికే  తలమానికం అని చెప్పడానికి. నవల చివరలో కూడా హాహూని వెంబడించిన విమానాలు కొన్ని తిరిగొచ్చాయి. కొన్ని తిరిగి రాలేదు. హాహూ జాడని కూడా కనుక్కోలేకపోయాయి. సైన్సు ద్వారా ఎంతో సాధించామనుకొనే మనిషికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయని నవలలో ఈ ఘటన చెప్తోంది. హాహూ ఒక పండితుడి చేతికిచ్చిన ఉత్తరంలో కూడా ఇదే విషయం ఉంది. “మనిషి కృత్రిమ జ్ఞానం వృద్ధి చేసి పాడై పోతున్నాడు.”8 ఈ మాట నేటికీ మనం కాదనలేని అక్షర సత్యం. ప్రకృతి హితమైన జ్ఞానమే జ్ఞానం కానీ తక్కినది కాదు.

2.4 సాంఘికపరమైనవి:

హాహాహూహూ పాత్రను కవి సృష్టించింది స్వాతంత్రోద్యమ కాలంలో. స్వాతంత్రోద్యమ కాలంనాటి ఆంగ్లేయ ధోరణి, భారతీయుల పట్ల భారతీయ సంస్కృతి పట్ల వారికున్న చిన్నచూపుకు సమాధానమే హాహాహూహూ నవల. నవల ప్రారంభంలో లండన్లో ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద హాహూ దొరికినప్పుడు అక్కడవున్న వారు మాట్లాడిన మాటలు భారతీయులపట్ల విదేశీయులకున్న చిన్నచూపును వ్యక్తంచేస్తున్నాయి. హిందూ దేశంలో మనుషులే మృగాలు అన్న అక్కడి జనాల మాటల్లో, వారి నవ్వుల్లో భారతీయులను ఆంగ్లేయులు చూసిన విధానమే ప్రతిఫలిస్తోంది. ఈ జంతువును హిందూ దేశస్తులెవరో పెంచి ఉండొచ్చని ఒకడనగా  దానికి మరొకతను-

”హిందూ దేశంలో వాళ్ళు ఎప్పుడూ ఆఫ్రికా అడవుల్లో కానీ దక్షిణ అమెరికా అడవుల్లో గానీ వేటకు పోరు. వాళ్లట్లా పోవడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. అందుచేత యీ మృగాన్ని వాళ్ళు పట్టుకున్నదీ అబద్దమే. వాళ్ల దేశంలో పెంచినదీ అబద్ధమే”9 అన్న మాటల్ని బట్టి ఈ నవలా కాలం 1947 కి పూర్వం అని చెప్పవచ్చు. 

జర్మనీలో పెద్ద భాషా శాస్త్రవేత్త, ఫ్రాన్స్లో మరొక పశు శాస్త్రవేత్త ఇద్దరూ గుర్రం మాట్లాడుతుందంటే సందేహపడి, దాన్ని చూడ్డానికి వచ్చి వారిరువురూ హాహూ తలను కోసి  పరిశీలిస్తామనగానే హాహూ అడిగిన ప్రశ్న అతనిది మాత్రమే కాదు ఆనాటి సమస్త భారతీయులదీ.

ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికీ స్వాతంత్ర్యం ఉందట కదా. మొన్న ఒక పండితుడు చెప్పాడు. ఆ స్వాతంత్ర్యం మీ దేశాల్లో పుట్టిన వాళ్ళకేనా? ఇతర దేశాల నుంచి ఇక్కడకు వస్తే వాడికా స్వాతంత్ర్యం ఉండదా? నేనొక వ్యక్తిని. మరి నా స్వాతంత్ర్యం ఏమి కావలె.”10 

మరొకసారి జ్ఞానం ఆకారం చేతే నిర్ణయించబడుతుందన్న వారితో వాదిస్తూ హాహూ “మీకున్న ఆకారమే జ్ఞానమున కుండవలసిన ఆకారమై నాకున్నది కాకపోవుట యెట్లు? నాకీ ఆకారమున్నది. నాకీ జ్ఞానమున్నది. పూర్వము నీకు గల అనుభవం ప్రకారం ఈ రెంటియందు పొందిక లేదు. ఇప్పుడు నా యందు ఆ పొందిక  కనబడుతోంది. ఎందుకొప్పుకోవు?”11

అని హాహూ చేసిన వాదన మానవుడు నిరంతర జ్ఞాన పరివర్తనా శీలిగా ఉండాలన్న విషయాన్ని కూడా ధృవీకరిస్తోంది.

నిజానికి గుర్రం తల గలిగిన ఆ మనిషి పేరు కూడా ఎవరికీ తెలియదు. తనకే గుర్తులేని తన పేరు ఏమిటని అక్కడ ఉన్న వారు పదే పదే అడగగా సరిగా జ్ఞాపకం రావడం లేదు హాహా అని ఆ జంతువు చేసిన శబ్దాలకి, సంస్కృత శబ్ద మంజరిలో హాహాహూహూ అనే పేరు ఒక గంధర్వుడిదిగా చదివిన ఒక పండితుడు “మీ పేరు హాహాహూహూ అనా?” అని అడగగా దానికి అవునని కానీ, కాదని కానీ అతను సమాధానం ఇవ్వకపోయినా అక్కడి పండితులు అతని పేరును హాహాహూహూగా నిర్ధారించారు. 70 పేజీల లోపు ఉన్న ఈ నవల చిన్నపిల్లలు చదివితే అది వారికొక జానపదకథలా కనిపిస్తుంది. పెద్దవారు చదివితే ఇదొక ప్రతీకాత్మక నవలనిపిస్తుంది. విమర్శకులు చదివితే ఇందులో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరికి కావలసింది వారికి ఈ చిన్న నవల ద్వారా విశ్వనాథ సత్యనారాయణ అందించగలిగారు. హాహాహూహూ పాత్ర ద్వారా కవి సంధించిన ప్రశ్నలకు 70 సంవత్సరాల తర్వాత కూడా మనం సమాధానాలు వెతుక్కుంటూనే ఉన్నాం. సార్వకాలీనత కలిగిన హాహాహూహూ పాత్ర ఇప్పుడే కాదు మరో వందేళ్ల తర్వాత కూడా చదివిన ప్రతివారికీ జీవితమంతా మరపురాని పాత్రే. 

3. ముగింపు:

ఏ రచన చేసినా దానికదే సాటనిపించుకోవడంలో విశ్వనాథ వారిది అందవేసిన చేయి. వారు రచించిన ఈ హాహాహూహూ నవలలో పాత్రలకు పేరు పెట్టడం దగ్గర్నుంచి, సన్నివేశ కల్పన వరకు ప్రతిదీ ప్రతీకాత్మకంగానే సాగింది. విశ్వనాథ వారి దూరదృష్టి ఎలాంటిదో, వారు ఎటువంటి స్వాతంత్ర్యం రావాలని కోరుకున్నారో, ఎటువంటి సమాజాన్ని ఆకాంక్షించారో ఈ నవల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడమే ఈ వ్యాసరచన ముఖ్య ఉద్దేశ్యం.

4. పాదసూచికలు:

  1. హాహాహూహూ, పుట – 45, 46
  2. పైదే, పుట – 42
  3. పైదే, పుట -34
  4. పైదే, పుట -34
  5. పైదే, పుట-35
  6. పైదే, పుట -39
  7. పైదే, పుట -47
  8. పైదే, పుట -49
  9. పైదే, పుట -3
  10. పైదే, పుట -36
  11. పైదే, పుట -36

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. సత్యనారాయణ, విశ్వనాథ. హాహాహూహూ. శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్, మారుతినగర్, విజయ వాడ, 2013.
  2. నాగభూషణశర్మ, మొదలి. తెలుగు నవలావికాసము. నాట్యకళాప్రెస్, హైదరాబాదు, తెలంగాణ, 1971.
  3. వీరభద్రయ్య, ముదిగొండ. నవల- నవలా విమర్శకులు. మూసీ. హైదరాబాదు. 2000.
  4. వెంకటేశ్వర్లు, పుల్లాబొట్ల. తెలుగు నవలాసాహిత్యవికాసము. కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాదు, 1994.
  5. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. నవచేతనాపబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, తెలంగాణ. 2021.
  6. నారాయణరావు, వెల్చేరు. వికీపీడియా, ఆర్కైవ్ నకలు

https://web.archive.org/web/20140514091954/http://www.mesas.emory.edu/home/assets/pdf/cv/CV_VNRao_Nov2010.pdf

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]