AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
3. ఆంధ్రపౌరుషము: చారిత్రక-సాంస్కృతికాంశాల విశ్లేషణ
డా. మాడ్గుల ప్రఫుల్ల
విశ్రాంతాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్,
అనంతపురం – 515001. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440285985, Email: mpraphulla@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
జ్ఞానపీఠపురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రుల వైభవాన్ని, శౌర్యపరాక్రమాలను స్మరిస్తూ వ్రాసిన కవితాఖండిక ఆంధ్రపౌరుషము. ఆధునిక కవిత్వారంభదశలో భావకవిత్వం విస్తృతంగా ప్రజాదరణ పొందింది. విశ్వనాథ ఎప్.ఎ. చదువుతున్న రోజుల్లో అంటే 1916లో చేశారీ రచన. భావకవిత్వశాఖలలో దేశభక్తి కవిత్వం ఒకటి. తెలుగులో దేశభక్తి శాఖకు చెందిన కవిత్వంలో ఆంధ్రదేశాభిమానాన్ని ప్రకటించే కవిత్వమే ఎక్కువ. ఆంధ్రపౌరుషము ఈ కోవకు చెందినదే. ఆంధ్రపౌరుషంలో ఆంధ్రుల చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, కళావైభవాల చిత్రణలు కళ్ళకు కట్టించినారు విశ్వనాధవారు. ఆంధ్రుల చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక , కళావైభవాల గొప్పదనాన్ని , ఆంధ్రుల ప్రతాపాన్ని తెలియజేయడం, ఆంధ్రదేశానికి పూర్వవైభవం తీసుకుని రావడం ఆంద్రులందరి బాధ్యత అన్న విషయాన్ని గుర్తుచేయడం ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశం.
Keywords: ఆంధ్రదేశము, ఆంధ్రులపౌరుషము, సంస్కృతి, కళావైభవము, నదులు, కవి ఆవేదన
1. ఉపోద్ఘాతం:
ఆంధ్రదేశము అతిప్రాచీనమైన రాజ్యాలలో ఒకటి. ఆంధ్రుల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుందని, మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేశారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలిన విషయం. విష్ణుసహస్రనామంలో ՙచాణూరాంధ్ర నిషూదనః՚ అన్న విశేషణం ద్వారా కంసుని ఆస్థానంలోని బలశాలి అయిన మల్లయోధుడు చాణూరుడు ఆంధ్రుడన్న విషయం స్పష్టమౌతోంది. ֞మౌర్య చంద్రగుప్త చక్రవర్తి కాలానికే ఆంధ్రరాజ్యము మగధసామ్రాజ్యము తర్వాత మిక్కిలి బలశక్తి సమన్వితమైనదని"1 మెగస్తనీసు వ్రాతలవల్ల తెలుస్తోందని చరిత్రకారుల అభిప్రాయం. "క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దియందో, అంతకు కొంచెం ముందో"2 ఆంధ్ర రాజ్యస్థాపనము జరిగి ఉంటుందని విశ్వసించారు ఆచార్య లక్ష్మీరంజంనం . శాతవాహనులు, చాళుక్యచోడులు, వెలనాటిచోడులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరరాజులు, నాయకరాజులు ఆంధ్రదేశాన్ని పాలించారు. వారి పాలనలో సాంఘికాభివృద్ధి జరిగింది. కళలకు, సాహిత్యానికి పోషణ ఉండేది.
2. ఆంధ్రపౌరుషము కవితాఖండిక - ప్రాశస్త్యము:
జ్ఞానపీఠపురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రుల వైభవాన్ని, శౌర్యపరాక్రమాలను స్మరిస్తూ వ్రాసిన కవితాఖండిక ఆంధ్రపౌరుషము. ఆధునిక కవిత్వారంభదశలో భావకవిత్వం విస్తృతంగా ప్రజాదరణ పొందింది. భావకవిత్వం యువకులను ఎక్కువగా ఆకర్షించింది. విశ్వనాధ ఎప్.ఎ. చదువుతున్న రోజుల్లో అంటే 1916లో చేశారీ రచన. భావకవిత్వశాఖలలో దేశభక్తి కవిత్వం ఒకటి.
"ఆధునికాంధ్రకవిత్వములో దేశభక్తి రెండుపాయలుగా ప్రవహించింది. ఒకటి భారత జాతీయాభిమాన సంబంధి. రెండవది ఆంధ్రాభిమానసంబంధి".3 అని దేశభక్తి కవిత్వాన్ని తెలుగులో దేశభక్తి శాఖకు చెందిన కవిత్వంలో ఆంధ్రదేశాభిమానాన్ని ప్రకటించే కవిత్వమే ఎక్కువ. ఆంధ్రపౌరుషము ఈ కోవకు చెందినదే.
రెండురకాలుగా విభజించారు సి. నారాయణ రెడ్డి. "ఆంధ్రుడు, ఆంధ్రజాతి క్రమపరిణామము, ఆంధ్రసంస్కృతీ నాగరికతల క్రమవికాసము, ఆంధ్రుల సామ్రాజ్యనిర్మాణాదులు, లలితకళలకు ఆంధ్రులెత్తిన నివాళులు, ఆంధ్రుల వాణిజ్యము, నౌకావ్యాపారము, ఆంధ్రుల కరవాలాంచల ధాళధళ్యములు మున్నగు అనేక విషయములపై ఆనాటి చారిత్రకులు, కవులు తమ దృష్టిని కేంద్రీకరించా"4 రంటారు నారాయణ రెడ్డి. ఆంధ్రపౌరుషము కవితాఖండికను చదివితే ఈ విషయాలన్నీ కనిపిస్తాయి.
3. ఆంధ్రుల గతవైభవం:
కవిత్వమంతటా గతవైభవస్మరణము, ఆ రోజులు గడిచిపోయాయన్న ఆవేదన, గతవైభవాన్ని పునరుద్ధరించాలనే ఆరాటం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆంధ్రపౌరుషంలో ఆంధ్రుల చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక , కళావైభవాల చిత్రణలు కళ్ళకు కట్టించినారు విశ్వనాధవారు.
ఒకనాడు గలదాంధ్రయువకులు తూరుపుకనుమల నేలిన దినంబు
ఒకనాడు గలదు శిల్పకళాసరస్వతి ఆమరావతి నృత్యమాడుదినమ్ము
ఒకనాడు గలదాంధ్ర సకలప్రపంచమ్ము కృష్ణాస్రవంతి నూగిన దినంబు
ఒకనాడు గలదు నిల్వకపాఱు శత్రుల నాంధ్రసైన్యంబు వేటాడు దినము
ఒకనాడున్నయది యాంధ్రయుద్ధభూమి
కత్తివాడికి రిపుల రక్తంబు నదులు
కట్టిన దినంబు నేటికి కాలవశత
నస్మదున్నతి తలక్రిందులయ్యెగాని ఆం. పౌ. 2
ఈ పద్యంలో విశ్వనాథవారు ఆంధ్రపౌరుషము కవితాఖండిక యొక్క రచనా ప్రణాళికను పొందుపరిచారు. కవితలో ఆంధ్రరాజులు, ఆంధ్రకళాసరస్వతి, నదులు, ఆంధ్రుల శౌర్యపరాక్రమాలను ప్రశంసించారు. స్మరించారు. నేటికి కాలవశత నస్మదున్నతి తలక్రిందులయ్యెగాని అని అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని అని తమ ఆవేదనను వ్యక్తంచేశారు.
4. ఆంధ్రరాజులు:
ՙతెలుగుంజాతికిఁ బౌరుషంబుగలదు՚ అన్నారు విశ్వనాథవారు. ՙప్రతాపరుద్రుడు రుద్రుడై ఓరుగల్లుకోటపై కాలుమోప, విద్యానగరరాజవీధి పట్టపుటేన్గుపై కృష్ణరాయలు పాఱఁజూడ, బొబ్బిలికోట పుండరీకము పాపరాయడు కన్నులురుమ՚ ఆంధ్రశౌర్యలక్ష్మి విరాజిల్లింది. కాపు వీరులు, రెడ్డిరాజులు, కమ్మశూరులు తమ తమ పరాక్రమాలచే దిగంతాలను గడగడలాడించారు. ఆంధ్రవీరులు సింహాలవలె కోటగోడల నుండి కుప్పించినారు. కొండ అడుగునుండి కొండపై వరకు గుర్రాలను దూకించినారు. కోటతలుపులను ఢీ కొనడానికి వచ్చిన ఏనుగులను పిడిగుద్దులతో చంపినారు. వేలకువేల శత్రువీరులమధ్య లంఘించి వారిని కూల్చినారు. రణస్థలిలో ఆంధ్రశత్రువులు పారిపోయినారు. ఇంతటి అద్భుతపరాక్రమం ఆంధ్రులది. అందుకే కవి "కుఠారకృత్తరిపురాట్కంఠ- స్రుతాసృజ్ఞ్నదీజలసంసిక్తజయేదిరాస్యమ్ము మహాశౌర్యంబు సామాన్యమే" అని ՙఆహవక్షోణియందు మా యాంధ్రవీరులెంతలెంతలు చేసిరో యెవ్వడెరుగు՚ అని ఆశ్చర్యంతో కూడిన గర్వాన్ని ప్రకటించారు.
ఆంధ్రదేశానికి సముద్రాలే సరిహద్దులు అయినాయి. ఆంధ్రుల విజయభేరి విశ్వమునందంతట నినదించింది. "ఆంధ్రచళుక్యవంశార్ణవంబనినంత గంగాప్రవాహహముప్పొంగిపోయి" నది. సకల దిఙ్మండలేశ్వరులు కృష్ణరాయలకు కప్పములు చెల్లించినారు "ఈజిప్టునుండి తెలుగుదేశమ్ము వరకు కాన్కలుస్రవించి"నవి.
ఆంధ్రదేశస్థ సర్వాపగాభంగతరంగరంగముల శౌర్యములు నేర్చి
ఆత్మప్రతాపశౌర్యములు తాలిచి సుమిత్రాబోర్నియో ద్వీపతతులు గెలిచి
వంగమహారాష్ట్రవార్ధులు పరిచయస్థలములై వినయమ్ము సలుప
ఈజిప్టు నుండి కృష్ణాజలమ్ములకు బారంబాటగా పరాక్రమము జూపి
సకల దీవుల విజయధ్వజముల నాటి
తనదు తెరచాప వార్ధిరాజునకు కట్టు
కోకగాఁబూర్వమాంధ్రుల నౌక రాజ్య
మమరజేసిన దేడుసంద్రముల మీద. ఆం. పౌ. 30
ఇట్టిది ఆంధ్రుల ప్రతాపము. ՙసర్వాపగాభంగతరంగరంగముల శౌర్యములు՚ అని ఉవ్వెత్తున ఎగసిపడు నదీకెరటాలలాగా శౌర్యపరాక్రమాలున్నవనుటలో ఆంధ్రవీరుల ఉత్సాహము కన్నులముందు మెదులుతోంది. కేవలము భూమి మీదనే కాదు సముద్రాలమీద కూడ ఆధిపత్యము సాధించారు ఆంధ్రులు. అంతే కాదు సముద్రాలు దాటి సుమిత్రా బోర్నియో ద్వీపతతులను, ఈజిప్టును చేరింది ఆంధ్రపౌరుషము.
రోమీయులైన వీరులు రెండు కెలకుల రమ్యమౌ వింజామరలు వీవ
సకలదేశాగతక్ష్మాతలేంద్రులు పదమ్ముల తలల్ మోపి కాన్కలనొసంగ
తన పేరు వినిన రిపూత్కరముల శిశువులు భూధరాంతముల పోరువెట్ట
తన విలోచనకృపాంబునిధానముల గోరి యఖిలదేవతలు నందంద నిలువ
దక్షిణపదంబునన్ బద్మదళంబునందు
కనకసింహాసనంబునఁ గాలుమోపి
రాచకార్యంబున పరీక్షనాచరించె
రమ్యమోహనాకృతి నాంధ్రరాజ్యలక్ష్మి. ఆం. పౌ. 27
దేశవిదేశాల పాలకులు భీతితో కానుకలు సమర్పించగా, ఇరువైపుల వింజామరలతో, పాదాలవద్ద అర్పించిన కానుకలతో, కృపాకటాక్షాల కోసం వేచి ఉన్నదేవతా సముదాయంతో రమ్యమోహనాకృతితో ఉన్న ఆంధ్రరాజ్యలక్ష్మి వైభవము కన్నుల ముందు కనిపిస్తుంది.
5. నదులు – కళలు – వైభవము:
కృష్ణా, గోదావరీ, తుంగభద్ర, పెన్నా ఆంధ్రదేశంలో ప్రవహించే ప్రధాన నదులు. సాధారణంగా గాలి, నీరు, మట్టిలోని సారమంతా జనాల్లో తెలివితేటలు, కళానైపుణ్యాలు, కవితాపాండిత్యాల, శౌర్యపరాక్రమాల రూపంలో ప్రతిఫలిస్తుంది. అందుకే పెద్దన అరుణాస్పదపురాన్ని వర్ణిస్తూ ՙఅచటఁబుట్టిన చిగురుఁ గొమ్మైన చేవ՚ అన్నారు. ఆంధ్రుల విషయంలోను ఆ మాట వర్తిస్తుంది. ఆంధ్రపౌరుషము ఖండికలో నదుల ప్రస్తావన ప్రత్యేకాంశంగా కనిపిస్తుంది. ఆయా నదీతీరాలలో వెలసిన పుణ్యక్షేత్రాలను, సారస్వతవైభవాలను గుర్తు చేసుకున్నారు విశ్వనాథవారు.
గోదావరీపావనోదారవాః పూరమఖిలభారతము మాదన్ననాడు
తుంగభద్రాసముత్తుంగరావముతోడ కవులగానము శ్రుతి గలయునాడు
పెన్నానదీసముత్పన్న కైరవదళశ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పమ్ము తొలిపూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమలకృష్ణానదీ సైకతములందు
కోకిలంపుబాట పిచ్చుకగూండ్లుకట్టి
నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు ఆం. పౌ. 40
కవుల గానాలు తుంగభద్రా తరంగాలతో శ్రుతి కలిపింది. అంటే తుంగాతీరములోని కృష్ణరాయల భువనవిజయంలో తెలుగుకవుల కావ్యగానాలు స్ఫురిస్తున్నాయి. పెన్నాతీరంలో అంటే రాయలసీమలో తెలుగు భాష వాసికెక్కినదంట. కృష్ణాతరంగనిర్ణిద్రగానముతో ఆంధ్రశిల్పము తొలిపూజ (బహుశా కళామతల్లికి) చేసిందట. ఈ మాటల్లో అమరావతి గుహల అపురూపశిల్పాలు కనిపిస్తున్నాయి.
విశ్వనాథవారికి కృష్ణానది పట్ల మక్కువ ఎక్కువ. ՙమును కృష్ణాతటినీ జలాంతరమునన్ బొంగెత్తి యుద్భూతమై ననతేనెల్ స్రవియింప సుధానాదం మోగింది՚ అని ՙదెసలన్నియున్ జివురులెత్తెన్ మున్ను తద్రావమున్՚ అని అంటారు కవి. కృష్ణానదీ మధుమధుర జలాలతో, గలగలలతో ఆంధ్రప్రాంతమంతా సస్యశ్యామలంగా, చైతన్యవంతంగా ఉండేది ఒకప్పుడు. శ్రీకృష్ణుడు కృష్ణ అన్న పేరులో ఉన్న సామ్యం వల్లనో ఏమో ఈ నది పై మనసు పుట్టి అక్కడ చేరుకున్నాడు. ఈ విషయం ఈ క్రింది పద్యంలో కనిపిస్తుంది.
కృష్ణానదీరవామృతమన్న మనసయ్యె విమలకాళిందిపై వెగటుబుట్టి
భూప్రజాపాలనంబునఁగోర్కి హెచ్చయ్యె గోపాలకత యన్న కొంకు కలిగి
ఏకపత్నీవ్రతంబే మంచిదనిపించె కన్యాళిపై విరాగమ్ము గలిగి
సకలభూవలయరక్షాకార్యమనువయ్యె భూభరమ్ము హరించు బుద్ధి తిరిగి
రమ్యమౌ నాంధ్రభూమి సారంబుగలది
బృందమునకన్నయని మదినెంచినాడు
సుందరమ్మగురీతి రాత్రిదినంబులు
పాట పాడెను బాలగోపాలమౌళి. ఆం. పౌ. 41
కృష్ణాజిల్లాలో నెమలి, వినుకొండ, మొవ్వ, హంసలదీవి మొదలయిన ప్రాంతాల్లో ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయాలున్నాయి. బహుశా ఈ విషయాన్ని స్పురింపజేస్తూ కృష్ణునికి కాళిందిపై, కన్యాళిపై, గోపాలత్వం పై విసుగు, విరాగము పుట్టి కృష్ణాతీరం చేరినాడని కవి వర్ణించడం ఒక రమణీయభావన. అంతే కాక ՙఆంధ్రభూమి సారవంతమైనది. బృందావనానికి అన్న՚ అనటంలో ఆంధ్రప్రాంతం యొక్క గొప్పతనం స్ఫురిస్తోంది.
ఆంధ్రుల కవిత్వ, శిల్పకళా, తత్వశాస్త్రములు సాటిలేనివి. వివిధరాజుల పాలనలో ఆదరింపబడినాయి. పోషింపబడినాయి. వృద్ది చెందినాయి. దేశవిదేశీయులను అలరించినాయి.
మతికబ్రమగు తృణీకృతదేవగురుమతిప్రతిమానదుర్గనిర్మాణ శక్తి
ఆశ్చర్యమగు ధ్వంసమైనప్పటికి నిప్పటికి చిహ్నలున్న శిల్పకళసొగసు
అంతంతఱాళ్లెట్టు లాపైకినెత్తిరో దేవతలో యేమొ తెలియరాదు
చూచినంజాలు నచ్చోటి సరోవరంబులు లోతు నేటికి తెలియరాదు
ఆ బలమ్ము, నా పని నేర్పు, నా విలాస
మెంత యున్నదొ మును చూచునంత నోము
నోచుకొనలేకపోతి మయ్యో చివరకు
నేటికా చోట్లనైన జన్మించ లేదు. ఆం. పౌ. 16
బాగా తెలివితేటలున్నవారిని గురించి బుద్ధిలో బృహస్పతి అంటాం. ఆంధ్రులు బృహస్పతిని మించినవారు. శిల్పాలు ధ్వంసమయినా వాటి సొగసు తగ్గలేదని, అంతంత రాళ్ళు ఎలా పైకి ఎత్తారో అని, ఆ బలాన్ని, ఆ పనితనాన్ని, ఆ విలాసాన్ని మెచ్చుకున్నారు, ఆశ్చర్యపడినారు విశ్వనాథవారు. తాము ఆనాడు పుట్టనందుకు విచారపడినారు.
మూడుమూర్తుల తత్వముల్ మొనసి బ్రహ్మ
మందు చివరకుఁ జని లీనమైనయట్లు
ఆంధ్రశిల్పకవిత్వతత్వార్థములును
ప్రకృతిపురుషులలీల లోఁప్రతిఫలించు. ఆం. పౌ . 38
ప్రకృతిపురుషులెట్లు అభిన్నాలో ఆంధ్రశిల్పకవిత్వతత్వార్థాలు అభిన్నాలు. పరస్పరసంబద్ధాలు. శిల్పానికైనా, కవిత్వానికైనా కావలసింది స-రసహృదయం. ఆ రసమే బ్రహ్మము. రసో వై సః అంటోంది కదా వేదం. అదే తత్వార్థం. ՙఅందుకే అక్షరజ్ఞానమెరుగదో ఆంధ్ర జాతి՚ అని విశ్వనాథ వారు ప్రశ్నించడంలో అక్షరమైన బ్రహ్మతత్వాన్ని తెలిసినవారు ఆంధ్రులు అన్న విషయం ధ్వనిస్తోంది. ఈ విషయం తెలియని వారు ఆంధ్రుల కవిత్వశిల్పసంపదలోని పసందును ఆస్వాదించలేరు.
6. నేటి స్థితి – కవి ఆవేదన:
ՙఆంద్రుల యశంబు దశదిశావ్యాప్తమైన కుటిలభూపాలురకు గన్ను గుట్టిపోయె՚. నేడు రాజ్యాలు పోయాయి. దుర్గాలు, కోటగోడలు పాడుబడినాయి. ఆంధ్రుల శౌర్యపరాక్రమాలు, కళాసంపద అంతా నశించిపోయింది. ఆంధ్రులు తమ తెలివితేటలను మరిచిపోయారు. పరాయివారికి గులాములయ్యారు.
ఆంధ్రభూధవుల కార్యాలయాంతఃపురప్రతతి కోతులకు నావాసమయ్యె
రాజకిరీట రారాజన్మణిచ్ఛటల్ ప్రతిఫలించెడు చోట్లు పాడువడియె
పట్టపేనుగులు గర్వసమేతముగ నేగుకడల జిల్లేడు మొక్కలు జనించె
ఆంధ్రపౌరుషమాటలాడుచోటుల శిలాదృతిని మార్గము నిరోధించినిలిచె
ఆంధ్రతేజమ్ముగని మోదమందినట్టి
యాకసముగూడ మాలిన్యమై చెలంగె
కాలమా! నీ కృతమ్ములు గలవుగద శ
తమ్ములున్ వేలు నేమి ఫలమ్ము చెప్పి. ఆం. పౌ. 10
కాలో జగద్భక్షకః అన్నారు. ఈనాటి ఆంధ్రదేశస్థితికి కాలమే కారణమని కవి అభిప్రాయం. ՙకాలము మారి యోడలను కట్టిరి బండ్లపైన՚ అని ՙకదలుచున్నది కాలచక్రమ్ము దానినాపగలవాడెండు లేడవని యందు՚ అని వాపోయారు కవి. కాలమహిమ కాకపోతే మరి ఇదేమి? ՙరాజ్యాంగతంత్రనిర్మాణ కుశలురయిన వారికి ఆఫీసుల్లో ఫైళ్లు చంకన పెట్టుకుని తిరుగు తున్నారు. సింహాసనాలెక్కి అధికారం చెలాయించినవారు బానిసలయినారు. ఆధ్యాత్మదివ్యవిద్యావేత్తలకు దేహం మీద మోహం పెరిగింది.՚ ՙపెద్దపులి పిల్లి అయింది. పిల్లి పెద్దపులి అయింది՚.
అంతర్వైరములుద్భవిల్లినవి యైక్యమ్మంతమున్ బొందె నొ
క్కింతేమూలను డాగి యున్నదియొ కానీ! జాతిశిల్పమ్ము వే
దాంతమ్మున్ గవనమ్ము తత్వము సమస్తంబున్ నశించెన్ వృథా
భ్రాంతిన్ సర్వమునేటఁ గల్పుకొనిరాంధ్రస్వాములీరీతిగన్. ఆం. పౌ. 28
ఆంధ్రులలో ఐకమత్యం నశించిపోయింది. పాలకుల మధ్య వైరాలు, ద్వేషాలు,యుద్ధాలు మొదలయినాయి. కళలు నిరాధారమయినాయి. ՙనిరాధారాః న శోభంతే పండితా వనితా లతా՚ అని ఆర్యోక్తి. పాలకుల పోషణ లేకపోవడం వల్ల నామ మాత్రంగా నిలిచినాయి. అందుకే ՙవృథా భ్రాంతిన్ సర్వమునేటఁ గల్పుకొనిరాంధ్రస్వాములీరీతిగన్՚ అని వేదన చెందారు కవి. ՙనేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటికున్న చాలు՚ అన్న స్థితికి దిగజారినారు. ՙజాతీయతా భావం చచ్చిపోయింది.՚ వెనుకటి వైభవాన్ని మర్చిపోయినారు.
విశ్వనాథవారికి ఇంకో ఆలోచన కూడ కలిగింది. వేదోచ్ఛారణలో స్వరం తప్పిపోయిందో, లేక పతివ్రతలలో లోపమేదైనా గలిగిందో, లేక అగ్నిహోత్రాది కర్మలలో లోపం కలిగిందో , పురాణాగమశాస్త్రాలను తప్పుగా చెప్పినారో, లేక ఆంధ్రవిష్ణువుకు కోపం వచ్చిందో ఏదో జరగకపోతే ఇంత అనర్థం ఎలా సంభవిస్తుందని సందేహం కలిగింది.
ఆ గిరిదుర్గముల్ ప్రకృతమందెటులున్నవొ చూచి, పూర్వపుం
భోగములూహ చేసి కనుపొంతల జాఱెడు బాష్పనీరముల్
చేగిలించి యెవ్వడు కృశింపడు వాని నరంబులందు శౌ
ర్యాగమవేత్తలైన మన యాంధ్రుల రక్తమె పారుచుండినన్. ఆం. పౌ. 12
ఆంధ్రుల ప్రస్తుత పరిస్థితికి శరీరంలో ఆంధ్రరక్తం ప్రవహిస్తున్నవాడెవ్వడయినా స్పందిస్తాడు. విశ్వనాథవారిది ఆంధ్రరక్తం. అందుకే ఒకనాడు అంతటి వైభవాన్నికలిగిన నేటి ఆంధ్రస్థితిని చూసి కళ్ల నీళ్లు నిండినాయి. కంఠం రుద్ధమయింది. గుండె ద్రవించింది. అందుకే అన్నారు - కన్నుల నీరు వచ్చినను గాని హృదంతరమగ్ని సన్నిధిన్ వెన్న విధానగాగ విలపించినగాని తలంచ లాభమేమున్నది- అని. ఒకనాటి ఆంధ్రుల శౌర్యాన్ని, పాండిత్యాన్ని తలచుకుని ՙనేత్రంబుల్ సబాష్పంబులై తాపంబందె మనంబు కంఠమతిరుద్ధంబయ్యె నూహించినన్՚ అని కంట తడి పెట్టుకున్నారు.
ఏ నాటి మాటలో భూనాథవంశ దీపాయితుండైన కృష్ణావనీంద్రు
డెప్పుడున్నాడొ పృథ్వీశరత్నంబు కాకతివంశవీరుడుత్తమగుణుండు
ఏమయిరో రెడ్డి భూమీధవులు వారి యౌదార్యమెల్ల యేమీద చనెనొ
ఎన్నాళులైనట్టులున్నది బొబ్బిలి వీరకోటులు స్వర్గవీధికేగి
ప్రాణులకునెల్ల నెప్పటికైనఁగాని
యవి జరామరణంబులున్నవియె నిజము
దానికేమి నాశములేని తత్వశిల్ప
కవితలేమాయెనో యెరుగంగరాదు. ఆం. పౌ. 35
అని ఆంధ్ర రాజులను స్మరించుకున్నారు. ప్రాణులకు జరామరణాలున్నాయని కదా అని తనకు తానే సర్ది చెప్పుకున్నారు కవి. కాని నాశము లేని తత్వశిల్పకవిత్వాలు ఎందుకు ప్రాభవాన్ని కోల్పోయినాయో ఊహకందని విషయమయింది. తెలుగు విద్యార్థులు విమల కృష్ణానదీసైకతములందు శిల్పశాస్త్రగోష్ఠి ముందే మానేశారు. ఏది ఏమయినా
దివ్యవాహిని కృష్ణానదీస్రవంతి
మోహననినాదగానమ్ము మురువు తఱిగె
తన్మనోహర గానగీతమ్ము మరల
బాడగావలె మృదువుగాఁ బ్రకృతిమాత ఆం. పౌ. 5
అనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు విశ్వనాథవారు. కవి ఆశను సఫలం చేయడం, ఆంధ్రదేశానికి పూర్వవైభవం తీసుకుని రావడం ఆంద్రులందరి బాధ్యత.
7. కవితాసౌందర్యము:
రచనలో సౌందర్యం లేకపోతే అది కవిత్వమనిపించుకోదు. కావ్యం గ్రాహ్యమలంకారాత్ అని, సౌందర్యమలంకారః అని ఆలంకారికోక్తి. శబ్దార్థాలంకారాలు, రసభావోచితపదప్రయోగం, లక్షణావ్యంజనాదులు, రసానందం ఉంటేనే కవిత్వం. ఆంధ్రపౌరుషము కవితాఖండికలోని సౌందర్యాన్ని స్థానీపులాకన్యాయంగా చూద్దాం.
ఆంధ్రులశౌర్యపరాక్రమాలను వర్ణించే సందర్భంలో ՙకుఠారకృత్తరిపురాట్కంఠ-స్రుతాసృఙ్నదీజలసంసిక్తజయేందిరాస్యము మహాశౌర్యంబు సామాన్యమే՚ అనే సుదీర్ఘసమాసం భావోచితం. సందర్భోచితం.
ఆంధ్రయశోలత దిగంతాలకు వ్యాపించిన విధాన్ని విశ్వనాథవారు వర్ణించినతీరు అత్యంతరమణీయం.
మోసెత్తి చిన్నారి మొలకయై బాలదళాకారమై పసియాకు విడిచి
దినమొక్క చాయదేరి నిరంతరాంబుధారాపోష్యమగుచు సారంబువడసి
అల్లనల్లన ప్రాకులాడి ఱెమ్మలు వేసి నల్గడల్ వ్యాపించి నలుపుతిరిగి
చిగిరించి కొంగ్రొత్తలిగురెత్తి గొనబొత్తు పులకరించినరాలు పూతపూచి
అంతఁజంద్రికాధావళ్యమనుకరించు
సూనసంతానములు దిగ్వితానములు
పూచి దెసలందు సౌందర్యమునుఘటించె
ధరణినాంధ్రయశోలతాంకురము పొలిచి. ఆం. పౌ. 26
ఒక తీగ దినదినాభివృద్ధి చెందుతూ ఏ విధంగా పరిసరాలను అల్లుకొని ఆక్రమిస్తుందో సూక్ష్మంగా పరిశీలించారు కవి అనే విషయం ఈ పద్యంలోని ప్రతిపాదం నిరూపిస్తుంది. యశోలత అనే రూపకాలంకారం సార్థకం. సాభిప్రాయం. తీగ అందుబాటులో ఉన్నవాటి ఆసరాతో ఎంత దూరానికైనా పాకిపోతుంది కదా. ఆంద్రుల కీర్తి మోసెత్తి చిన్నారి మొలక అయింది. ఆంధ్రవీరుల శౌర్యపరాక్రమాలనే నీటితో పుష్టిని, సారాన్ని పొందింది. కొత్త చిగుళ్లతో, మొగ్గలతో, పూలతో క్రమక్రమంగా పాకుతూ దిగంతాలకు వ్యాపించి పరిమళాలను వెదజల్లింది. ఎంత గొప్ప భావన. ఎంత అందమైన భావన.
వైదికులు మత్తమధుకరఫణితిమ్రోయు
వేదరవముల దెసలపుష్పింపజేయ
నొక్కయప్పుడు మాయాంద్రులుండిరనెడు
జ్ఞానమొక్కండది మనఃప్రశాంతి నాకు. ఆం. పౌ. 15
ఆంధ్రదేశంలోని వేదపండితుల వేదఘోషలు దిగంతాలకు వ్యాపించాయి. ఆంధ్రులు పరాక్రమవంతులే కాదు వేదపారంగతులన్న విషయం కవికి మనశ్శాంతిని చేకూర్చింది. ఈ పద్యంలో ఒక విషయం గమనార్హం. తేటి పూవులపై వాలడం సహజం. ఇక్కడ తేటి ఝంకారంతో పూలు పుష్పించడం వింత. వైదికులు మత్త మధుకరాలట. వేదఘోషలు తేటిఝంకారాలు. ఆ రావాలతో దిక్కులు పుష్పించాయట. ఆంధ్రవేదపండితుల పాండిత్యప్రకర్షను ప్రశంసించడానికి కవి ఎన్నుకున్న అలంకారం అద్భుతం.
8. ముగింపు:
ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్ అన్నారు అప్పయ్యదీక్షితులు. నేటి ఆంధ్రులకు తమ గొప్పతనం, ఘనమైన చరిత్ర తెలియడం లేదు.పాఠశాలలో కాని, కళాశాలలో కాని పాఠ్యభాగంగా ఆంధ్రుల చరిత్రను బోధించడం లేదు. ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న తెలుగువారిని జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రపౌరుషం ఖండకావ్యం నేటి తరానికి మన పూర్వవైభవాన్ని, మన చరిత్రను, మన శౌర్యపరాక్రమాలను, కవిత్వపాండిత్యాలను, కళలను తత్త్వశాస్త్రాలను తెలిపే ఒక సత్కృతి. ఇటువంటి కృతులు నేటితరానికి అవశ్యం పఠనీయాలు.
9. పాదసూచికలు:
- ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. పుట:11
- ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి. పుట: 111
- ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు. పుట: 356
- ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు. పుట: 372
10. ఉపయుక్తగ్రంథసూచి:
- నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటము). నవ్యపరిశోధక ప్రచురణలు, హైదరాబాద్, 2019.
- నారాయణ రెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు. తృతీయముద్రణ, విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1999.
- లక్ష్మీరంజనం, ఖండవిల్లి, లక్ష్మీరంజనం, బాలేందుశేఖరం. ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. బాలసరస్వతీడిపో, ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, కర్నూల్, 1957.
- సత్యనారాయణ, విశ్వనాథ. శ్రీ విశ్వనాథ వారి లఘుకావ్యాలు-7, విశ్వనాథపావనిశాస్త్రి, హైదరాబాద్.
- సూర్యనారాయణ, పంపన. విశ్వనాథ వారి భక్తి - దేశభక్తి. చిట్టిప్రోలు పబ్లిషర్స్, పెద్దాపురం, 1990.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.