AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. తెలుగులో పరిశోధన రచనలు: అంతర్జాతీయ ప్రమాణాలు
ఆచార్య పమ్మి పవన్ కుమార్
ప్రొఫెసర్, తెలుగు శాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
హైదరాబాదు, రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9866486934, Email: pavankpammi@uohyd.ac.in
Download
PDF
వ్యాససంగ్రహం:
ఈ పత్రం తెలుగు భాష, సాహిత్యాలపై పరిశోధన చేస్తున్న యువపరిశోధకులకోసం ఉద్దేశించబడింది. పరిశోధన రచనకు సంబంధించి గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రధానమైన విషయాలు ఈ పత్రంలో వివరించబడ్డాయి. ఆయా విశ్వవిద్యాలయాలలో మెథడాలజి తదితర కోర్సులలో శిక్షణ పొందిన, పొందుతున్న పరిశోధకులకు ఈ పత్రంలోని అంశాలు విషయావగాహనను ఇతోధికం చేయగలుగుతాయి. ఈ పత్రంలో పరిశోధన రచనలు అనే పదబంధాన్ని research writings అన్న అర్థంలోనూ, పరిశోధన పత్రం అనే పదబంధాన్ని research paper అన్న అర్థంలోనూ, సిద్ధాంతవ్యాసం అనే పదబంధాన్ని dissertation అన్న అర్థంలోనూ, సిద్ధాంతగ్రంథం అనే పదబంధాన్ని thesis అన్న అర్థంలోనూ వాడుతున్నాం. తెలుగు పరిశోధకులకు ఈ మాటలతో, సంబంధిత కార్యకలాపాలతో విశేషమైన సంబంధం ఉంటుంది. తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించిన మౌలికమైన రచనలను చదివి ఆ విశేషాలను బహురూపాలలో వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాని, మౌలికమైన రచనలపై సూత్ర, సిద్ధాంత నిర్మాణానికి ఆయా రచనలను చదివితే సరిపోదు; అధ్యయనం చేయవలసి ఉంటుంది. మౌలికమైన గ్రంథాలను అధ్యయనం చేయడం ఒక పాయగా, వాటిలోని సారాన్ని సూత్ర/సిద్ధాంతాలుగా ప్రతిపాదించడంకోసం పరిశోధన పద్ధతులను అధ్యయనం చేయడం మరొక పాయగా, తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించి పూర్వ పరిశోధకులు ఇప్పటికే ప్రకటించిన విశేషాలను అధ్యయనం చేయడం ఇంకొక పాయగా కొత్తతరం పరిశోధకులు సాధన చేయవలసి ఉంటుందని తెలియజేయడం ఈ పత్ర రచనలోని ముఖ్య ఉద్దేశం. తెలుగు పరిశోధన రంగాన్ని మిక్కిలిగా ప్రభావితం చేసే ఈ ‘త్రిపుటి’ని, పరిశోధకులు గుర్తించి అనుసరించడంద్వారా విలువైన సూత్రాలను, సిద్ధాంతాలను ప్రతిపాదించగలుగుతారు.
Keywords: పరిశోధన రచనలు, ప్రపంచభాష, అంతర్జాతీయభాష, అంతర్జాలం, సాంస్కృతిక ప్రసరణం, వర్ణనాత్మక పరిశోధన పద్ధతి, అనువర్తిత పరిశోధన పద్ధతి, గతితార్కికత, సర్వేక్షణ పత్రం, వ్యక్తినిష్ఠ, వస్తునిష్ఠ, శైలీపత్రం.
1. ఉపోద్ఘాతం:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 75మిలియన్లకు పైబడి తెలుగు భాషావ్యవహర్తలున్నారు. భారతదేశంలో 82.7 మిలియన్లకుపైగా తెలుగు మాట్లాడేవారున్నారు. భాషావ్యవహర్తల సంఖ్య ఆధారంగా ప్రపంచభాషలలో ప్రస్తుతం తెలుగుభాష పదహారోస్థానంలో ఉంది. గత కొన్ని దశాబ్దులుగా అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషలలో తెలుగుభాషకూడా ఒకటి. అంతర్జాలం (internet)లో విస్తృతంగా వాడేభాషలలో తెలుగు ఐదోస్థానంలో ఉంది. కాబట్టి, తెలుగు ఇప్పుడు ప్రపంచభాష లేదా అంతర్జాతీయ భాష. సంగణకాలపై వాడకానికి అనువుగా లిపి కలిగిఉన్న భాషలన్నీ నేడు ప్రపంచభాషలే.
భాష ఒక తరం నుంచి మరోతరానికి అందుతుంది. అంటే; ఆయా భాషావ్యవహర్తలు తమకు కలిగిన భావాలను తమతోటివారితో పంచుకోడంతోపాటు, తమ పిల్లలకు (తరాలవారికి)కూడా అందిస్తుంటారు. దీనినే సాంస్కృతిక ప్రసరణం (cultural transmission) అనే భాషాలక్షణంగా పేర్కొంటారు భాషాశాస్త్రవేత్తలు. ఒకరికి కలిగిన అభిప్రాయాలను తోటివారితో పంచుకోవాలన్నా, తమ తరాలవారికి అందించాలన్నా భాషావ్యవహర్తలకు వినటం, మాట్లాడడం, చదవటం, రాయటం అనే కౌశలాలు అవసరం అవుతాయి. ఈ కౌశలాలు చిన్నపిల్లలకు భాషను బోధించడానికి మాత్రమే పరిమితంకావు. జీవిత పర్యంతం భాషా వ్యవహర్తలపై ఇవి ప్రభావాన్ని చూపుతాయి.
వినికిడి సమస్యలేనివారందరూ తమ తోటివారు మాట్లాడినదానిని వినగలరు. దానికి తగినట్టుగా ప్రతిస్పందించడం మాట్లాడడంద్వారా (మాట్లాడగలిగిన వారివల్ల) సాధ్యమవుతుంది. ఈ రెండు కౌశలాలను భాషావ్యవహర్తలు సులభంగా పొందగలుగుతారు.
భాషాకౌశలాలలో చదవటం, రాయటం అనే రెంటినీ ప్రయత్నపూర్వకంగా సాధించవలసి ఉంటుంది. ఇందుకోసమే శిక్షణ, విద్యాలయాలు అవసరం అవుతాయి. అయితే, పరిశోధనలో ‘చదవడం’ అన్నమాటను ‘అధ్యయనం చేయడం’ అన్న అర్థంలోనూ, ‘రాయడం’ అన్నమాటను ‘కొత్తవిషయాలను లిఖితరూపంలో వెల్లడించడం’ అన్న అర్థంలోనూ గ్రహించాలి. ‘మాట్లాడడం’ద్వారా వెల్లడయ్యే మాటలు (సాధారణంగా) త్వరనాశం (rapid fade away) పొందుతాయి. ‘రాయడం’ అనేది భాషకు ఉండే స్థల, కాల అవధులను అధిగమించేలా చేస్తుంది. ఆ విధంగా, ‘రాయడం’ అనేది భాషావ్యవహారంలో ప్రభావశీలమైన ప్లుతి. అత్యంతవిలువైన ఈ కౌశలాలను పట్టి నిలుపుకోడంలో భాషావ్యవహర్తలందరూ కృషిచేయవలసి ఉంటుంది. ఈతరం పరిశోధకులకు చదవడంలో (అధ్యయనం చేయడంలో)నూ, రాయడంలోనూ మరింతగా సహకరించే ఆకరాలు, సమాచార నిధులు, సాంకేతిక వనరులు నేడు అందుబాటులో ఉన్నాయి.
2. పరిశోధన అనేది మానసిక-బౌద్ధిక కార్యకలాపం:
శాస్త్రీయమైన అధ్యయనంచేసి కొత్తవిషయాలను వెల్లడించడమే పరిశోధన. ఇక్కడ, శాస్త్రీయమైన అధ్యయనం అన్న పదబంధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడడం-గమనించడం, చదవడం-అధ్యయనం చేయడం, గుర్తించడం-కనిపెట్టడం లేదా గుప్తంగా ఉన్నదానిని వెల్లడిచేయడం, వివరించడం-సంక్షిప్తీకరించడం, వివరించడం-సిద్ధాంతీకరించడం, కలగలుపుగా ఉంచడం- గుర్తించదగిన సమూహాలుగా కూర్చడం... అనే జంట పదబంధాలను గమనించండి. పూర్వంలోఉన్న పద/పదబంధాలు వెల్లడించే కార్యకలాపాలను, పర పద/పదబంధాలలోని కార్యకలాపాలతో పోల్చిచూడండి. పర పద/పదబంధాలలోని కార్యకలాపాలను నిర్వహించడానికి విశేషమైన బౌద్ధికశ్రమ అవసరమవుతుందని సులభంగా బోధపడుతుంది. అందువల్ల, పరిశోధనలు(అవి ఏ రంగానికి/శాస్త్రానికి సంబంధించినవి అయినా) విశేష మైన బౌద్ధిక శ్రమను కోరతాయి.
వర్ణనాత్మక (descriptive), వివరణాత్మక (explanatory), గుణాత్మక (qualitative), పరిమాణాత్మక (quantitative), చారిత్రక (historical), తులనాత్మక (comparative), శుద్ధ (pure), అనువర్తిత (applied)... ఇత్యాదిగా వింగడించడం పరిశోధనలు నిర్వహించడంలో సౌలభ్యం కోసమే.
పూర్వీకుల అనుభవాలను అర్థంచేసుకోడానికి సిద్ధమైఉన్న సాహిత్య ఆధారాలు వాటికవిగా ఉపయోగపడవు. వాటిని విశ్లేషించి, వివిధ అవసరాలకోసం వినియోగంలోకి తీసుకొనిరావడానికి పరిశోధన సహకరిస్తుంది. భాష, సాహిత్యాల గతితార్కికతను అర్థంచేసుకోడానికి మనకు పరిశోధనలకు మించిన మార్గాలు లేవు. ఆయాకాలాలలోని సమాజగమనాన్ని సమకాలీనులకు ‘కొత్త’గా అనిపించేట్టుగా చెప్పాలంటే లోతైన అధ్యయనం జరపాలి. వ్యక్తిగత అభిరుచిగా పరిశోధన ప్రారంభమయినప్పటికీ, అది అందించే ఫలితాలు వారికిమాత్రమే పరిమితం కావు. చాలా సందర్భాలలో పరిశోధనల ఫలితాలు సామూహిక చేతనకు, వృద్ధికి బాటలు పరుస్తాయి.
2. పరిశోధనాంశం ఎంపిక ఎలా?:
పరిశోధనకు లేదా ఒక పత్ర రచనకు అంశాన్ని ఎంపికచేసుకోడం అనేది ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఒక సవాలు. వారి వారి చదువులకు సంబంధించి గ్రహించిన విషయాలను ప్రకటించడానికి, ఆపై పరిశోధనరంగంలోకి ప్రవేశించడానికి పరిశోధన పత్ర రచన, ప్రకటన అనేవి తప్పనిసరి అవుతాయి.
పరిశోధనాంశంలో పరిశోధన సమస్యను/సవాళ్ళను అధిగమించడం అన్నది రెండో మెట్టు. ఇది విద్యార్థులకు, పరిశోధకులకు, పర్యవేక్షకులకు నికార్సైన పరీక్ష. ఈ పరీక్షలో గెలవాలంటే వీరివద్ద ఒక సున్నితపుత్రాసు ఉండాలి. ఒక సిబ్బెలో తాము గ్రహించిన పరిశోధనాంశాన్ని ఉంచాలి. పరిశోధనకు లభిస్తున్న ఆకరాలను, వాటిని వస్తునిష్ఠతో విశ్లేషించడానికి గల సానుకూలతను, విశ్లేషించిన సమాచారాన్ని క్రోడీకరించడానికి ఉన్న అవకాశాన్ని, వచ్చిన ఫలితాంశాలను సూత్రీకరించడానికి లేదా సిద్ధాంతీకరించడానికి కావలసిన సామర్థ్యాన్ని, సూత్రీకరించిన/సిద్ధాంతీకరించిన ప్రతిపాదనలను అనువర్తించడానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని, వీటన్నిటినీ సమాకరించడానికి కావలసిన విషయ సామర్థ్యం, సాంకేతిక కౌశలాలను మరో సిబ్బెలో ఉంచి బేరీజు వేసుకోవాలి. తరాజులోని ముల్లు తటస్థంగాఉన్నా, పరిశోధనాంశంవైపు మొగ్గుచూపినా, గ్రహించిన అంశాన్ని పరిశోధకుడు తగినంత అధ్యయనం చేయలేదని అర్థం. లభిస్తున్న ఆకరాలు... తదితరాలను ఉంచిన సిబ్బెవైపు మొగ్గుచూపితే అది అధ్యయనంచేసి నిగ్గుతేల్చవలసిన పరిశోధనాంశం అని అర్థం. పరిశోధన పత్రం(research paper), సిద్ధాంత వ్యాసం(dissertation), సిద్ధాంతగ్రంథ(thesis) రచనలలో ఈ సున్నితపు త్రాసు వాడకం తెలిసినవారు మంచి విద్యార్థులు/పరిశోధకులు అవుతారు. అధ్యయనం, పరిశోధనలను కొనసాగించే పర్యవేక్షకులకు అటువంటి పరిశోధకులు లభించినపుడు పరిశోధనలలో నాణ్యత పెరుగుతుంది.
3. సర్వేక్షణపత్రాలు(survey papers)-పరిశోధన పత్రాలు(research papers):
ఏ ఙ్ఞాన శాఖలోనైనా వివిధ స్థాయిలలో మొదట వెలువడేవి సర్వేక్షణపత్రాలే. ఉన్నత తరగతుల విద్యార్థులచేత ఇటువంటి పత్రాలను రాయించడాన్ని విధిగా ఆచరింప చేయడంవల్ల వారిలో పరిశోధనపట్ల ఆసక్తిని, సానుకూల దృక్పథాన్ని పెంపొందించవచ్చు. గ్రహించిన అంశం, దానికి సంబంధించిన సంక్షిప్తి, కీలకపదాలు, పరిచయం, లభించిన ఆకరాల సమీక్ష, ముగింపు, ఆకరాల వివరాలు మొదలైన అంశాలతో సర్వేక్షణపత్రాలు రాయవచ్చు. ఇవి విషయ/సమాచార ప్రధానమైనవి. సర్వేక్షణపత్రాలలో సూత్ర/సిద్ధాంతాల ప్రసక్తి ఉంటుంది కానీ, వీటిని ప్రతిపాదించాలన్న నియమం ఉండదు.
పరిశోధన పత్ర రచనలో- గ్రహించిన అంశం, దానికి సంబంధించిన సంక్షిప్తి, కీలకపదాలు, పరిచయం, పత్ర రచనలో పాటిస్తున్న పరిశోధన పద్ధతి, గ్రహించిన అంశానికి సంబంధించి ఇంతవరకూ జరిగిన కృషి, వాటి ఫలితాంశాలను ప్రస్తుత పరిశోధన ఫలితాంశాలతో పోల్చిచూపుతూ ఆ అంశాలను ప్రకటించడం(సూత్ర, సిద్ధాంతాల ప్రతిపాదన), ముగింపు, ఆకరాల వివరాలను కూర్చడం మొదలైన విషయాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి సూత్రీకరణకు లేదా సిద్ధాంతీకరణకు ప్రాధాన్యతనిచ్చేవి అయి ఉంటాయి. సర్వేక్షణ పత్రాలకు, పరిశోధన పత్రాలకు ఉన్న తేడాను పరిశోధకులు గ్రహించాలి. సర్వేక్షణ పత్రాల రచనతో ప్రారంభించి, పరిశోధన పత్రాలను రాయడాన్ని అభ్యసించాలి.
4. పరిశోధన నైతికత(research ethics):
పరిశోధన రచనలు చేసే పరిశోధకులకు కొన్ని లక్షణాలు ఉండాలి. ‘నైతికత’ అనే సమస్తపదంలో పరిశోధకులకు ఉండవలసిన అన్ని లక్షణాలూ ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ భౌతికమైనవి కావు, బుద్ధిగతమైనవి. వీటిలో మొట్టమొదటి లక్షణం నిజాయితీ(honesty). విశేషమైన అధ్యయనం చేసిన తరువాత తాను వెల్లడించబోయే విషయాలను పరిశోధకులు నిజాయితీగా చెప్పగలగాలి. వ్యక్తినిష్ఠ(subjectivity), వస్తునిష్ఠ(objectivity)లలో రాగ-విరాగాలకు తావివ్వకుండా వస్తునిష్ఠ వైపే పరిశోధకులు మొగ్గుచూపాలి. మరోలక్షణం సమగ్రత(integrity). పరిశోధకులకు ఉన్న సమగ్రతను వారి రచనలే పట్టిచూపుతాయి. అధ్యయనంలోని గాఢతను రచనలో వెల్లడించడానికి పరిశోధకునికి సహకరించే లక్షణం సమగ్రత.
పరిశోధకుల ఉండవలసిన మరొక ముఖ్య లక్షణం సమర్థత(competence). గ్రహించిన విషయాన్ని బలంగా ప్రతిపాదించడం మాత్రమే కాకుండా, దానిని పూర్వపక్షంచేసి, వచ్చే సమస్యలకు కూడా తమ పరిశోధనలో వివరణ కూర్చగలిగితే, ఆ పరిశోధకుడు పరిశోధన రంగంలో దీర్ఘకాలం కొనసాగగలిగే సమర్థతను కలిగిఉన్నాడని అర్థం. సహపరిశోధకులపై గౌరవం(respect to peers) కలిగిఉండడం అనేది పరిశోధకుల కనీస బాధ్యత. తాము చేసిన పరిశోధనకు సంబంధించిన విషయాలను పరిశోధకులు సహపరిశోధకుల దృష్టికి తీసుకొని రావాలి. ఒక అంశాన్ని అనేకమంది పరిశోధకులు బహుముఖాలుగా చర్చించడంవల్ల అసలు పరిశోధకుడికి ఎంతో బౌద్ధికశ్రమ ఆదా అవుతుంది. పరిశోధనలో నైశిత్యం పెరుగుతుంది. సమయం ఆదా అవుతుంది.
పరిశోధకులు తమ పరిశోధనలో గమనించిన వివరాలను వెల్లడించడంలోనూ (openness), గోప్యతను పాటించడంలోనూ (confidentiality) రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వివరాలను వెల్లడించడంలో నైతికతను, గోప్యతను పాటించడంలో సంయమనాన్ని కోల్పోకూడదు. పరిశోధకులకు కాపీరైట్లు-మేధహక్కుల చట్టాలపట్ల అవగాహన (copyrights and intellectual property rights) ఉండితీరాలి. వీటిని ఉపేక్షిస్తే, పరిశోధన రచనల ఉనికికే భంగం కలుగుతుంది. న్యాయ-చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి. పరిశోధకులు తాము చేస్తున్న పరిశోధనలను కేవలం తమకు పేరు, ప్రతిష్ఠలను తెచ్చేవిగా భావించకూడదు. పరిశోధన చేయడం అనేది ఒక సామాజిక బాధ్యత (social responsibility). పై లక్షణాలన్నీ కలిగిన పరిశోధకులు ఈ సామాజిక బాధ్యతను చక్కగా నిర్వహించగలుగుతారు. పరిశోధన రంగాన్ని పరిపుష్టం చేయగలుగుతారు.
ఆకర గ్రంథాలు, పత్రాలు, రచనలలోని ఏ ఏ భాగాలు యధాతథంగా ఇప్పటి పరిశోధన రచనలలో ఉటంకించబడ్డాయో తెలియజేసే ‘గ్రంథచౌర్య విశ్లేషణ, గుర్తింపు’ సాఫ్టువేర్లు/పరికరాలు ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలు, ఉపకరణాలు విశ్లేషించి ఇచ్చే నివేదికలను పరిశోధన పత్రాలకు, గ్రంథాలకు జతచేసి వాటిని ముద్రణకు, డిగ్రీలు పొందడానికి సమర్పించాలన్నది ఇప్పుడు పరిశోధన రంగంలో అమలులో ఉన్న మార్గదర్శకాల సారాంశం. తొలుత ఆంగ్లభాషలో వెలువడిన రచనలకు పరిమితమైన ఇటువంటి సాఫ్టువేర్లు/ పరికరాలు తరువాతి కాలంలో ఇతర భాషలలోని సమాచారాన్నీ విశ్లేషించగలిగే సామర్ధ్యాన్ని సంతరించుకొన్నాయి. Turnitin, Grammarly, Plagiarism checker X, Dupli checker, Urkund మొదలైనవి ‘గ్రంథచౌర్య విశ్లేషణ, గుర్తింపు’ సాఫ్టువేర్లు/పరికరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వీటిలో Urkund అనే సాఫ్టువేర్ ప్రపంచభాషలలో అనేక భాషలలోని (తెలుగుతో సహా) యధాతథ గ్రంథభాగాలను గుర్తించి, విశ్లేషించి, ప్రదర్శించగలిగే సామర్థ్యాన్ని కలిగిఉంది.
5. పరిశోధన రచన- భాష:
భాషను వాడని వ్యవస్థలు ఏ సమాజాలలోనూ ఉండవు. బోధన-పరిశోధన రంగాలు, ప్రసార-ప్రచార మాధ్యమ రంగాలు తక్కిన అన్ని వ్యవస్థలకన్నా ఎక్కువగా భాషను వినియోగిస్తాయి. ప్రసార-ప్రచార మాధ్యమ రంగాలలో భాష వాడకానికి సంబంధించి కొన్ని శైలీ పత్రాలు(style sheets/manuals) ఉన్నాయి. అంటే, భాష వాడకంలో విధి నిషేధాలను తెలియజెప్పే రచనలన్నమాట. పరిశోధన రంగంలో భాషకు సంబంధించిన ఇటువంటి శైలీ పత్రాల ఆవశ్యకత చాలా ఉంది (ఇవి పరిశోధన పద్ధతులను పరిచయం చేసే గ్రంథాలకి భిన్నం). బహుధా విభజితమైన అధ్యయన అంశాలతో అలరారే తెలుగు పరిశోధన రంగంలో ఇటువంటి ప్రయత్నాలు ఎంత తొందరగా మొదలుపెడితే, తెలుగు పరిశోధనలో నాణ్యత అంతగా పెరుగుతుంది. శ్రమతో కూడుకొన్నదైనప్పటికీ, పరిశోధకులూ, పర్యవేక్షకులూ ఈ వైపు దృష్టి సారించాలి.
పరిశోధకులు పరిశోధన పత్రాలను విధిగా తమ తమ మొదటిభాష (first language)లోనే రాయాలి. ఒకటికి మించిన భాషలలో పరిశోధకులకు అభినివేశం ఉన్నపుడు ఆయాభాషలలోని పత్రాన్ని అనువదించి ప్రకటించే ప్రయత్నం చేయాలి. దీనివల్ల పరిశోధనకు, పరిశోధకునికి పరిధి పెరుగుతుంది. పరిశోధనపత్రాలు ప్రధానంగా ఙ్ఞానవికాసాన్ని కలిగిస్తాయి. అందువల్ల వీటి రచనలోనూ, అనువాదంలోనూ వచ్చే సమస్యలను సున్నితంగా అధిగమించవలసి ఉంటుంది. మాండలికాల వాడకంలో (ప్రాంతీయ, సాంస్కృతిక, వృత్తి... మాండలికాలతో కలుపుకొని) ప్రత్యేకమైన విధి, నిషేధాలు లేనప్పటికీ, అవసరమైన మేరకు వివరణలు కూర్చుతూ కలగలిసిపోయే విధంగా మాండలికాలను రచనలోకి తీసుకురాగలగాలి. పరిశోధకులు ప్రయత్నించి ఈ నైపుణ్యాన్ని సాధించాలి. పరిశోధన పత్రాలలో రాసే విషయాలన్నీ ‘అందరికీ అర్థమయ్యే విధంగా’ రాయడం అనేది బరువైన ఆదర్శం. దీన్ని ఏ మేరకు అధిగమించగలమన్న అంశంలో పరిశోధకుల ప్రతిభే గీటురాయి.
శైలి విషయంలో పరిశోధకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడడంలోనూ, రాయడంలోనూ ఉండే అలవాట్లు లేదా పద్ధతినే ‘శైలి’ అంటారు. మౌఖిక, లిఖిత వ్యవహారాలు రెంటిలోనూ మనం భిన్న శైలులను పాటిస్తుంటాం. భాషాధ్యయనంలో ‘శైలి’ అతి విస్తృతమైన అంశం. సాధారణ, సంక్లిష్ట, మిశ్ర శైలులు, వీటన్నిటి కలగలుపు పరిశోధన రచనలలో కనిపిస్తుంటాయి. విషయం రూపంలో ఉన్న భావమంతా చదువరులకు మనం భాషద్వారానే అందించవలసి ఉంటుంది. రాతలో ఇంతకు మించిన దారిలేదు. అందువల్ల ‘రచన’ను పదునుతేర్చుకోడం అనే పనిలోని వివిధ దశలను పరిశోధకులు, పత్ర రచయితలు అభ్యశించవలసి ఉంటుంది. పరిశోధన పత్రం, సిద్ధాంత వ్యాసం, సిద్ధాంత గ్రంథం... రచన ఏదైనప్పటికీ, దానిలో ‘కలగలుపు’ లక్షణం కనిపిస్తోందంటే- పరిశోధనకు సంబంధించిన భాష, పరిభాష, విషయానికి సంబంధించిన పరిభాష, సాంకేతిక పదాలవాడకం... మొదలైన విషయాలలో పరిశోధకులు మరింత అభినివేశం పొందవలసి ఉండని అర్థం. పరిభాష లేకుండా పరిశోధన రచనలు సాగవు. వీటిని నేర్పే/అలవాటుచేసే క్రమంలో పర్యవేక్షకులు పరిశోధకులచేత రెండు, మూడు ప్రతులు (drafts) రాయించే ప్రయత్నం చేస్తుంటారు. పరిశోధకుల దృష్టినుంచి చూసినపుడు ‘విసుగు పుట్టించే ఈ కార్యకలాపం’ వారి భవిష్యత్తు దృష్ట్యా పర్యవేక్షకులకు ఒక అనివార్యకార్యం అవుతుంది.
6. పరిశోధన రచన-ప్రచురణ:
పరిశోధకులు తమ రచనలను ఎటువంటి పత్రికలలో ప్రచురించాలన్న విషయంపై అవగాహన కలిగిఉండాలి. తెలుగు తదితర భారతీయ భాషా సమాజాలలో కాలికపత్రికల (periodicals) సంఖ్య ఎక్కువ. నిర్ణీతకాలవ్యవధిలో (వార, పక్ష, మాస...) వెలువడే ఈ పత్రికలలోని సమాచారం భిన్న రంగాలకు సంబంధించినదై ఉంటుంది. విషయవైవిధ్యం, విషయాన్ని జనరంజకంగా అందించడం అన్నవాటికి కాలికపత్రికలలో ప్రాధాన్యం ఉంటుంది.
నిర్ణీతరంగానికి (విద్య, వైద్యం, వ్యవసాయం...) సంబంధించిన అంశాలను ముద్రించే కాలిక పత్రికను జర్నల్ అంటారు. ఇటీవలి కాలంలో తెలుగులో ఇటువంటి జర్నళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇవి ముద్రణ/ఎలక్ట్రానిక్ రూపంలో వెలువడుతూ వ్యాప్తిని పొందుతున్నాయి. ఔచిత్యమ్, మూసీ, ప్రసన్నభారతి, శ్రీవాణి, మిసిమి, చినుకు… మొదలైన జర్నళ్ళు తెలుగు పరిశోధన రచనల ప్రచురణను ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాయి. విషయనిపుణులతోకూడిన సంపాదకమండలిని కలిగి ఉండడం, ముద్రించబోయే పత్రాన్ని ముందుగా సమీక్షించి మార్పులు చేర్పులు చేయడం లేదా చేయించగలిగే వ్యవస్థను కలిగిఉండడం, అంతరాయాలు లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో ముద్రణను వెలువరించడం, సంప్రదాయముద్రణ (print), ఎలక్ట్రానిక్ ముద్రణలు రెంటిలో ఏదో ఒకటిగాని, రెండు రూపాలలోనూగానీ జర్నల్ ను అందుబాటులోకి తేవడం అనేవి… ఈ జర్నళ్ళ వ్యవస్థల బలం.
7. పరిశోధన సమాచార నిధులు(research databases):
అంతర్జాల వాడకం పెరిగిన తరువాత పరిశోధనలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఆంగ్లభాష కేంద్రంగా అనువర్తనకు సహకరించిన పరిశోధన వనరులు ఇప్పుడు అన్ని భాషల పరిశోధకులకూ అందుబాటులోకి వచ్చాయి. పత్ర రచయితలు, పరిశోధకులు గమనించవలసిన ప్రధానమైన విషయం ఇది. పరిశోధన రచనలను దీర్ఘకాలంపాటు సమాచారనిధులలో భద్రపరచుకొనే వెసులుబాటు ఇప్పుడు అందరికీ ఉంది. తమ తమ పరిశోధన రచనలను, సిద్ధాంతవ్యాసాలను, గ్రంథాలను తప్పనిసరిగా శోధ్ గంగలో నిక్షిప్తంచేయాలన్నది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు చేస్తున్నవారందరికీ తెలిసిన నియమమే.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అధ్యయనానికి, పరిశోధనకు కావలసిన వనరులను/ఆకరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందుబాటులో ఉంచడం అన్నది సమాచార నిధుల ప్రధాన లక్ష్యం. స్థల, కాల అవధులను అధిగమించగలగడం, సుదీర్ఘకాలాలపాటు సమాచారం అందుబాటులో ఉంచడం, సమాచారాన్ని మార్పు, చేర్పు, మదింపు, కూర్పు, నవీకరణలకు అనుగుణంగా ఉంచడం, విద్య, ఙ్ఞానాత్మక అవసరాలకోసం ఈ పనులన్నిటినీ ఏకకాలంలో అనేక ప్రాంతాలనుంచి చేయగలిగే వెసులుబాటు కల్పించడం ఇప్పటి సమాచార నిధుల ప్రత్యేకత. Google Scholar, SCOPUS, Web of Science, ORCID, Research Gate, Microsoft Academia, Gale Research, Road Directory of Open Access Scholarly Resources, Academic Business Current Data, Pro-quest, EBSCO Host... మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన పరిశోధన ఆకరాలు. వీటిలో కొన్ని నియత విషయాలను శోధించడానికి అక్కరకు వస్తాయి. మరికొన్ని విషయాలను సంక్షిప్తంగా, విషయపట్టికలలాగా ప్రదర్శిస్తాయి. ఇంకొన్ని అంతర్జాలం(internet)పై ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒపెన్ సోర్స్ లైబ్రరీల వంటివాటినుంచి సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి ప్రదర్శిస్తాయి. మరికొన్ని, పైన పేర్కొన్న పరిశోధకులకు అవసరమైన కార్యకలాపాలను అన్నిటినీ నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటూ పరిశోధనలకు సహకరిస్తున్నాయి. పరిశోధన రంగాన్ని పరిపుష్టం చేస్తున్నాయి.
ఈ పత్రంలో చర్చించిన విషయాలను బాగా ఆకళింపు చేసికొని, అధ్యయనాలకు అనువర్తించుకోడంద్వారా కొత్తతరం పరిశోధకులు తమ పరిశోధన రచనలను మరింత గుణాత్మకంగా రాసే నైపుణ్యాన్ని సాధించగలుగుతారు. ‘గడప దాటని పరిశోధన’లు అనే అపప్రథ నుంచి ముందుకుసాగి, అంతర్జాతీయప్రమాణాలకు అనుగుణంగా తెలుగు పరిశోధన రచనలను ప్రకటించగలుగుతారు.
8. ముగింపు:
- పరిశోధన అనేది మానసిక-బౌద్ధిక కార్యకలాపం; ఒక సామాజిక బాధ్యత.
- తెలుగు భాష అంతర్జాతీయభాష. తెలుగు పరిశోధన రచనలుకూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రకటించాలి.
- మౌలికమైన గ్రంథాలను అధ్యయనం చేయడం, పరిశోధన పద్ధతులను అధ్యయనం చేయడం, పరిశోధించి రాసిన సూత్ర/సిద్ధాంత ప్రతిపాదిత గ్రంథాలను అధ్యయనం చేయడం అన్నవి పరిశోధకుల ప్రాథమికమైన విధులు.
- వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే భాషాకౌశలాలు వ్యవహర్తలందరికీ సంబంధించినవి. వ్యక్తుల జీవితాలపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపించేవి.
- భాష, సాహిత్యాల గతితార్కికతను అర్థంచేసుకోడానికి పరిశోధనలకు మించిన మార్గాలు లేవు.
- పరిశోధనల ఫలితాలు సామూహిక చేతనకు, వృద్ధికి దోహదకారులుగా ఉండాలి.
- కొత్తతరం పరిశోధకులు సర్వేక్షణ పత్రాల రచనతో ప్రారంభించి, సుశిక్షితులైన తరువాత, సూత్ర/సిద్ధాంత ప్రతిపాదన శీలమైన పరిశోధన పత్రాలను వెలువరించాలి.
- ‘అనిపించిన’ పరిశోధనాంశాన్ని, వస్తునిష్ఠతో తూచి నిగ్గుతేల్చిన తరువాత అధ్యయనాన్ని కొనసాగించి, సూత్ర/సిద్ధాంత ప్రతిపాదన చేయాలి.
- `నైతికత’ అనే సమస్త పదంలోని అన్ని విషయాలను పరిశోధకులు ఆకళింపు చేసుకొని పరిశోధనను కొనసాగించాలి.
- కాపీరైట్లు-మేధ హక్కుల చట్టాలపట్ల పరిశోధకులు అవగాహనను పెంచుకోవాలి.
- ‘గ్రంథచౌర్య విశ్లేషణ, గుర్తింపు’ మొదలైన సాఫ్టువేర్లు/పరికరాల వాడకం పరిశోధకుల తెలిసి ఉండాలి.
- విషయబోధకు ఆటంకం కలిగించని భాష వాడడంలో మెళకువ, శైలీ మర్యాదలు తెలిసి ఉండడం, అనువదించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం, పరిభాష, సాంకేతిక పదాల వాడకంలో శ్రద్ధ,... మొదలైన లక్షణాలు పరిశోధకులకు మంచి కీర్తిని తెచ్చిపెడతాయి.
- పరిశోధన రచనలలో మాండలికాలను సార్థకంగా వాడుకోగలిగే నేర్పును పరిశోధకులు ప్రయత్నించి సాధించాలి.
- అంతర్జాలంలో అందుబాటులో ఉన్న పరిశోధన ఆకరాలను వినియోగించుకొనే సాంకేతిక నైపుణ్యాన్ని పరిశోధకులు అభ్యసించాలి.
- పరిశోధన రచనలను కాలిక పత్రికలలోకన్నా, జర్నళ్ళలో ప్రచురించడం మంచిది.
9. ఉపయుక్తగ్రంథసూచి:
తెలుగు:
- చంద్రశేఖర రెడ్డి, రాచపాళెం., బ్రహ్మానంద, హెచ్. ఎస్. 1997. సాహిత్య పరిశోధన సూత్రాలు. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
- నిత్యానందరావు, వెలుదండ. 2013. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. హైదరాబాద్: నవోదయ బుక్ హౌస్.
- రామానుజరావు, దేవులపల్లి., ఇతరులు(సంపా.) 1983. తెలుగులో పరిశోధన. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
- సుబ్బాచారి, పి. 2014. పరిశోధన విధానం-సిద్ధాంతగ్రంథ రచన. హైదరాబాద్: నవోదయ బుక్ హౌస్.
English:
- Helen Kara. 2018. Research Ethics in the real world: Euro-Western and Indigenous Perspectives. Great Britain: Policy Press, University of Bristol.
- Paul Oliver. 2010. The Student’s Guide to Research Ethics. England: Open University Press.
- Sana Loue. 2002. Text book of Research Ethics:Theory and Practice. New York: Kluwer Academic Publishers.
Research Manual & Handbook:
- Publication Manual of the American Psychological Association(7th ed.). 2019. (online version)
- The Modern Language Association of America - MLA Handbook(9th ed.). 2021. (online version)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.