AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. నన్నయ భారతభాష: దిగ్దర్శనం
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు
తెలుగు శాఖాధ్యక్షులు,
కాశీ హిందూ విశ్వవిద్యాలయం
వారణాసి, ఉత్తరప్రదేశ్.
సెల్: +91 9441330511, Email: budatibhu@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
నన్నయ భాష గురించి ఎన్నో విమర్శలు, పరిశోధనలు వెలుగుచూశాయి. నన్నయ్య భాషాసంస్కారాన్ని, స్త్రీ వాచకంగా సర్వనామాలు వాడటానికి కారణాల్ని, నన్నయ సాహిత్యంలో కారక వైచిత్రిని ఈ వ్యాసం చర్చిస్తుంది. నన్నయభాషను కొన్ని భాషావిశేషాలను దర్శింపజేస్తూ, శైలి ప్రధాన ప్రస్తావనలతో విహంగవీక్షణం గావించడం ఈ వ్యాసపరమావధి. ఇందులోని కొన్ని విషయాలు పూర్వ పరిశోధకులు ప్రస్తావించినవే!
Keywords: భాషాసంస్కారం, స్త్రీవాచక సర్వనామాల వాడుక, కారకవైచిత్రి, శైలి, భాషావిశేషాలు.
ఉపోద్ఘాతం:
శుక్రాచార్యుని గర్భంలోనుండి బయటీకి వచ్చిన కచుడు, మృతసంజీవనీవిద్యతో శుక్రుడిని బ్రతికించిన సందర్భంలో-
తే.గీ. విగతజీవుడై పడియున్నవేదమూర్తి
యతని చేత సంజీవితుడై వెలుంగె
దనుజమంత్రి యుచ్చారణ దక్షుచేత
నభిహితంబగు శబ్దంబునట్లపోలె (ఆది. 2.127)
పునర్జీవితుడైన శుక్రుడు ఉచ్చారణదక్షుడైన వాని చేత పలుకబడిన శబ్దంలాగా ప్రకాశించాడట. ఇది నన్నయ ఉపమయే. మూలంలో-
“దృష్ట్వా చ తం పతితం బ్రహ్మరాశిం
ఉత్థాపయామాస మృతంకచోऽపి
విద్యాం సిద్ధాం తామవాప్యాభివాచ్య
తతః కచస్తం గురుమిత్యువాచ”
(బ్రహ్మరాశిలాగా పడియున్న ఆశు క్రుడిని చూచి కచుడు తాను పొందిన విద్యచేత బ్రతికించి పైకి లేవదీశాడు. సంజీవని విద్యను పొంది కచుడు నమస్కరించి పిదప యిలా అన్నాడు) అని ఉన్నది.
నన్నయ శాబ్దికదక్షత, వాగనుశాసనత్వం, శాబ్దికబ్రహ్మోపాసనత్వం అలాంటిది. “అపశబ్ద భయంనాస్తి అప్పాలాచార్య సన్నిధౌ" అన్నట్లు నోటికి వచ్చింది, చేతికి తిరిగింది రాసే లోకానికి ఆ శబ్దపు విలువ తెలియదు. 'ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గలోకే కామధుక్ భవతి"- అనే శబ్దసంస్కారం నన్నయది.
నన్నయ భారతాన్ని చదువుతుంటే ఉదాత్తమైన ఆర్షవాణిని విన్న అనుభూతి కలుగుతుందని కృష్ణశాస్త్రి వంటి మహాకవులే చెప్పారు. దేవయాని కచుడిని సంజీవనితోపాటు నన్నుకూడా స్వీకరీంచమని అడిగినపుడు "లోకనింద్యమగు నర్థమునీ వాకునకు దెచ్చుటుచితమె?" - అని కచుని నోట పలికించిన ధార్మికశీలి నన్నయ. ధర్మేతరమైన ఈ సందర్భంలో ’వాక్కు’ అని గట్టిగా నొక్కి చెప్పటానికి కూడా ఇష్టపడని తత్త్వం నన్నయది.
స్త్రీవాచకసర్వనామాలు:
ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో ఒక "మహావిమర్శకుడు" నన్నయ “స్త్రీ సంబోధన”ల గురించి చాలా అన్యాయమైన వ్యాఖ్య చేసి మాట్లాడాడు. నన్నయస్త్రీని అది, ఇది అని అవమానకరంగా రాశాడు. స్త్రీపట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించని సంస్కారరాహిత్యం నన్నయలో కనిపిస్తుందని. నిజమే! నన్నయ ఇది, అది, దాని, దీనివంటి సర్వనామాలతోనే స్త్రీని ప్రస్తావించటాన్ని గమనించవచ్చు.
ఇది:
"యెవ్వరిసతియిది సెప్పుమా జాతవేద!" (ఆది.1-129)
"ఇది నాకు దొల్లి వరియింపబడినభార్య" (ఆది.1-130)
"శర్మిష్ఠంజూపి యిదివృషపర్వునికూతురు"(ఆది. 3-169)
"ఇది మునినాథకన్యయని" (ఆది. 4-51)
"హిడింబంజూచి యిది వనదేవతయో (ఆది.6-213)
"ఇది పరమసాధ్వి" (ఆది.6-226)
"ఇది నా వల్లభ యిది నా హృదయేశ్వరియనుచు" (ఆది.8.108)
"జననాథ యిది దుష్టద్యూతమునెపమునఁ బరిభూతయయ్యె" (సభా.2-222)
"నలినాక్షి యిది విదర్భేశు తనయ" (ఆర. 2-149)
"అబల యిది భవన్మాత" (ఆర. 3-3-6)
అది:
"అదియు దమయంతిందోడ్కొని" (ఆర.2-117)
"అదియు దత్సమాగమంబున గర్భిణియై (ఆర.3-179)
"అదియు విదర్భేశు సతియయ్యె" (ఆర.2-151)
"రాధకునిచ్చిన నదియును గరము సంతసిల్లి (ఆది.5-32)
"దమయంతికిం జెప్పిన నదియును జింతించి (ఆర.2-202)
దాని:
“దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబుననెఱిగి” (ఆది.3-37)
“నీనేర్చు విధంబున దాని చిత్తంబువడసి” (ఆది.3-107)
“దేవయాని దాని కడకు వచ్చి” (ఆది. 3-179)
“దాని సాభిలాషుడై జూచె” (ఆది. 4-123)
“దానిశరీర సౌరభము, దాని విలోలవిలోకనంబులున్
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మితవక్త్ర కాంతియున్
దాని విలాసముంగడు ముదంబునఁ జూచి” (ఆది. 4-172)
దీని:
"దీనిభ్రూమధ్యంబునం బద్మప్రభంభై" (ఆర. 2-150)
"మెలతగా దీనియందు" (ఆర. 2-160)
"దీని విజితగా నేల యొడంబడుదురు" (సభా. 2-229)
"ఏకవస్త్రయైయున్న దీని సభకుందోడ్కొని (సభా. 2-229)
ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నిజమే! వీటినిబట్టి నన్నయను కామెంట్ చెయ్యబోయేముందు తెలుగుభాషాలక్షణాన్ని, దాని పరిణామాన్ని గమనించాలి.
ప్రాచీనద్రావిడభాషలో మహదమహద్భేదమే ఉండేది. పురుషవాచకశబ్దాలు మహత్తు, ఇతరాలు అమహత్తు; ఈ విధమైన నిర్మాణం ఇంకా దక్షిణద్రావిడభాషలలోని కొన్ని భాషలలో, మధ్యద్రావిడభాషలలోను నిలచే ఉంది. స్త్రీ-పురుష సమూహాన్ని నిర్దేశించే చోట మహద్బహువచన రూపమే అన్ని ద్రావిడ భాషల్లోనూ ఉంది. కొన్ని దక్షిణ ద్రావిడభాషల్లో కేవల స్త్రీ సమూహానికి కూడా ‘వారు’ వంటి రూపం వాచకమైంది.
తెలుగులో లింగబేధం ఏకవచనంలో మహత్తు(వాడు), అమహత్తు(అది), బహువచనంలో మనుష్యవాచకాలు (వారు), అమనుష్య వాచకాలు(అవి)- ఇలా ఉంటుంది. తెలుగుతోదగ్గర సంబధం లేని కుడుఖ్, మాల్తో భాషల్లో కూడా ఇటువంటి లింగభేదమే ఉండటం చేత, దక్షిణద్రావిడభాషలలో స్త్రీవాచక ప్రత్యయమైన- “ఆళ్” మొదట్లో ప్రత్యేక శబ్దమైనందువల్లా, తెలుగు, కుడుఖ్, మాల్తోలతో ఉన్న లింగభేదమే మూలద్రావిడంలో ఉండేదని భాషావేత్తల నిశ్చితాభిప్రాయం (ఎమెనో 1955). కాబట్టి ఈ విషయంలో తెలుగు మూలద్రావిడస్థితిని యధాతథంగా నిలుపుకొంది అని చెప్పాలి. మిగిలిన మధ్య ద్రావిడ భాషలలో బహువచనంలో కూడా ఏకవచనంలోలాగే మహదమహద్భేదమే ఉంది. ఆమె/ఆవిడ అనే స్త్రీ వాచకం పదాలు అర్వాచీనాలని గమనించాలి. వీటికి ప్రత్యేకమైన క్రియారూపం లేనందువల్ల వీటితో అమనుష్యైకవాచకరూపం (ఆమె వచ్చింది) కాని, మనుష్యబహువచనరూపం (ఆమె వచ్చారు) కాని వాడాలి.
‘ఆమె’- అనే ప్రయోగంఒక్కటి కూడా నన్నయలో లేకపోవటానికి కారణం, అప్పటికింకా భాషాపరిణామంలో ’ఆమె’ రూపం సర్వనామంగా స్థిరపడియుండకపోవచ్చు!
Morphologyలో తెలుగు, Phonologyలో తమిళం ఎక్కువగా ప్రాచీనలక్షణాలు కనిపిస్తాయి.
ఆ+అమ్మ> ఆయమ్మ> ఆయమ>ఆమె
ఆ+ అప్ప>ఆయప్ప>ఆయప>ఆపె
ఆ+ అక్క> ఆయక్క> ఆయక>ఆకె
నన్నయ ఈ మూడింటిని వాడలేదు.
ఆచార్య దొణప్ప “ఆ+మెయి> ఆమె” అని చెప్పారు. మలయాళంలో ‘అద్దేహ’ - అనటం ఉంది.
భాష నాగరీకరణ చెందేకొద్దీ, భాషాపరిణామంలో చోటు చేసుకొనే అర్వాచీనవిషయాలు ప్రాచీనకాలంలో లేకపోవటాన్ని తప్పుగా చూడరాదు!
“గురులకుశిష్యులు పుత్రులు”- అన్న వాడిని, “గృహనీతివిద్యకు గృహము”, “భార్య నవమానించుట ధర్మవిరోధంబు" అని స్త్రీని కీర్తించిన వాడి సంస్కారాన్ని - మన సంస్కారాలతో కొలిచి తక్కువ చేయటం తగదు.
పురుషవాచకసర్వనామాలు:
కేవలం స్త్రీనేకాదు, పురుషుడిని సైతం వాడు, వీడు అనే సర్వనామప్రయోగాలతోనే ప్రస్తావించటం కనిపిస్తుంది. ఇప్పటలా వాటికి నిమ్నార్థం ఆనాటి వ్యవహారంలో లేదని ఈ క్రింది ప్రయోగాన్ని చూస్తే అర్థమవుతుంది.
వాడు:
"వాడు ఋతుపర్ణువంటలవాఁడటె" (ఆర. 2-195)
"వా డెల్లవారి నడిగి" (ఆర.3-178)
"వాడు దానవికిఁ జేసిన నెయ్యమెరిగి (ఆది. 3-92)
"వీడు భీముఁడు వాడుగవ్వడి" (సభా. 1-193)
“వాఁడును గడుబాలుండు” (ఆది. 6-272)
వీడు:
“వీడు మహాబలసంపన్నుఁడు” (ఆది. 6-277)
“వీడు పుట్టినపదియగునాడు” (ఆది. 6-284)
“వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు” (ఆది. 6-309)
“వీ డఖిలభువనయౌవరాజ్యాభిషేకమునకు సమర్థుండగు” (ఆది. 4-65)
“వీరుడు వీడు పాండవుడు” (ఆది. 8-199)
"ఏను గృష్ణుడ వీడు భీముడు (సభా. 1-193)
ఇలా మగవాడిని కూడా వాడు-వీడని పరోక్షంలో కాదు, సమక్షంలోనే అనటాన్ని గమనించాలి.
కారకవైచిత్రి:
విద్యావిషయకంగా నన్నయ కారకవైచిత్రిని ప్రత్యేకంగా గమనించాలి. లోకంలో ఎవరైనా నేను ఫలానా గురువు వద్ద చదువుకున్నానని చెప్పటం తెలుగు సంప్రదాయం. ఫలానా గురువుతో అని చెప్పటం తెలుగు కారకవిధానం కాదు. కాని ఋషివంటి నన్నయ-
- "చ్యవనసుతుఁడైన సుమతితోఁ జదివి సకల వేదవేదాంగములు" (ఆది. 2-1 62)
- సాంగంబులగుచుండ సకలవేదంబులు సదివె వసిష్ఠుతో సకల ధర్మ-శాస్త్రాదిబహువిధ శాస్త్రముల్" (ఆది. 4-168)
- "విలువిద్యఁ గఱచుచుండిరి... కుమారకులు కృపఁ ద్రోణాచార్యుల తోడ (ఆది. 5-181)
- వేదంబుల్ సదివించె భూసురులతో విఖ్యాతిగా (ఆది. 5-190)
- ధనుర్వేద మగ్నివేశుల తోడనర్థింగఱచి (ఆది. 7-5)
- ధౌమ్యుతో వేద మంగయుతంబుగాఁ జదివెన్; ధనుంజయుతో ధనుర్వేద మిమ్ముగ నభ్యసించె (ఆది. 8-227)
- చిత్రసేను డగ్గంధర్వపతితోడ గారవమున, వజ్రధరుడు గీతవాద్యనృత్యంబులు గఱవపంచె (ఆది.1-369)
ఇలా వేద విద్యాభ్యాసాన్ని ఒక అపూర్వమైన కారకవిధానంతో చెప్పాడు. ఈ ఉదాహరణలలో వేదవిద్యాబోధకుడైన గురువుకు తృతీయావిభక్తియైన 'తో’ చేరుతోంది. వేదం స్వరప్రధానమైనది. అది నిత్యమూ సాధనలో ఉండటం వల్లనే అపస్వరానికి తావుండదు. అపస్వరం నరకప్రాప్తికి హేతువనినమ్మే గురువు ఏమరుపాటులేకుండా, శిష్యునకు చెప్పేటప్పుడు, శిష్యునితోపాటు వేదమంత్రాల్ని ఉచ్చరిస్తుంటాడనే అభిప్రాయాన్ని ఈ ఉదాహరణలు కలిగిస్తున్నాయి. సంగీతం కూడా అలాంటిదే కాబట్టి చివరి ఉదాహరణలో కూడా 'తోడ’ ప్రయోగం సముచితమే.
బాలవ్యాకర్త 'ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడ వర్ణకంబగు"- అని సూత్రీకరించి, 'నియమ పూర్వక విద్యాస్వీకారం బుపయోగంబనంబడు- అని వృత్తిలో వివరించి 'రామకృష్ణులు సాందీపనితోడ వేదంబులంజదివిరి. సాందీపని వలనని యర్థము. (బా.వ్యా.కార.7). దీనికి ఆధారం ''ఆఖ్యాతోపయోగే" అనే పాణినీయసూత్రం (1-4-29). "నియమపూర్వకవిద్యాస్వీకారే వక్తా ప్రాక్ సంజ్ఞః స్యాత్"- అని భట్టోజీ వివరణ. కాని కారకవిధానంలో సంస్కృతాంధ్రాలకేమాత్రం సంబంధం లేదు. సంస్కృతంలో "ఆఖ్యాతా, ఉపయోగే (అపాదానం), "ఉపాధ్యాయాదధీతే'- అనే విధంగా పంచమి విధింపబడింది. తృతీయ రానేరాదు. ఉపయోగమనే పదం ప్రయోజనార్థమనే అర్థంలో కాకుండా, నియమపూర్వకమగు విద్యావిధానమనే అర్థంలో ప్రయోగించబడింది. నియమమంటే బ్రహ్మచర్యాది నియతజీవనం.
సంస్కృతకారకం, తెలుగు నుడికారానికి చాలా సందర్భాలలో భిన్నంగా కనిపించినప్పటికీ, సంస్కృతకారకాన్ని అనుసరించి నన్నయ చేసిన ఈ ప్రయోగం (ఆఖ్యాతకు ‘తోడ’ లేక ‘తో’ అనే తృతీయా విభక్తిని చేర్చటం) వేదాధ్యయన, అధ్యాపకరహస్యాన్ని ఇమిడ్చి చెప్పినట్లు అనిపిస్తుంది. దానినే సూరి సూత్రబద్ధం చేశాడు.
‘వలన’కు ప్రయోగాలు, అంటే ఈ విద్యాస్వీకారసందర్భంలో నన్నయలో లేవా? అంటే ఉన్నాయి. ‘చేత’- వర్ణకం కూడా ఆఖ్యాతకు చేరిన ప్రయోగాలున్నాయి. చూడండి.
వలన:
- "మహాముని వలన ధనుర్విద్యాపారగుండై (ఆది. 5-196)
- " తన వలన విలువిద్యగఱచి (ఆది. 7-6)
- "బ్రాహ్మణుల వలన వేదార్థంబు లెఱుంగుచు విని (ఆర.2-317)
- "భూసుర వరుల వలన వెదంబులును ధనుర్వేదాది విద్యలు గఱచుచు"(ఆది. 3-12)
చేత:
నన్నయ భారతభాషావిశేషాలను గురించి రాసిన అవధాని కూడా ఈ చేతవర్ణకం ఆఖ్యాతకు చేరిన ప్రయోగాల్ని గమనించలేదు.
- "పరశురాము చేత దివ్యాస్త్రములు, ప్రయోగరహస్యమంత్రంబుల తోడంబడసి (ఆది. 5-202)
- ఎవ్వరి చేత విలువిద్య గఱచితన (ఆది.5-236)
- అతని చేత అక్ష హృదయ మన్విద్య జేకొను (ఆర.2- 129)
- బరులచే విద్యయు (ఆది.7-54)
ఈ ప్రస్తావించిన ప్రయోగాలలో మొదటిది దివ్యాస్త్రాలకు సంబంధించింది, ధనుర్వేదానికి సంబంధించిందే అయినప్పటికీ గురువుశిష్యునితోపాటుగా అభ్యసించేది ఉండదు. మంత్రోపదేశం చేసి, బాణాన్ని తన చేతి మీదుగా గురువు ఇస్తాడు కాబట్టి ’చేత’ వర్ణకం ఇక్కడ సబబే.
రెండవ ప్రయోగం ఏకలవ్యుని విద్యాభ్యాసానికి సంబంధించినది. ఈ ప్రశ్న పాండవులు వేశారు. "ఎవ్వరితోడ"-అని అడిగినా సరిపోతుంది. కాని చేతవర్ణకం “ఉపయోగంబు నం దాఖ్యాత”కు చేరిందని చెప్పవచ్చు.
సులభ వ్యాకర్త ఈ ప్రయోగాలను గమనించే "ఉపయోగంబునందాఖ్యాతకుఁ దృతీయావలన లగు" (కార.11) అని సూత్రించాడు. ఇక్కడ మూడు విషయాల్ని గమనించాలి.
- విద్యాభ్యాము
- విద్యాలబ్ధి
- విద్యాగ్రహణం
విద్యాభ్యాసాన్ని శిష్యునితోపాటు గురువు కూడా చేసినపుడు "తోడ", గురువు విద్యాలబ్ధికి హేతుభూతుడు కావటం చేత "చేత", విద్యాగ్రహణంతో "వలన" వర్ణకాలు ప్రయోగించటం సముచితం.
ఇంగ్లీషులో ‘He studied with me’
హిందీని "రాం ఔర్ కృష్ణ్ నే సాందీపన్ కే సాథ్ వేదోంకో అధ్యాపన్ కియా" - అంటారు.
'సే"- అనే పంచమిని కూడా వాడవచ్చు. అప్పుడది సంస్కృత ప్రభావమవుతుంది. మిగిలినవి ఆ భాషలోని విలక్షణత.
ఏతావతా నన్నయ "తోడ" ప్రయోగంతో ఉత్తమోత్తమవిద్యావిధానాన్ని స్ఫురింపచేశాడు. వేదవిద్యే కాదు, ఏ విద్యయైనా బోధన వలననే గురువు నిత్యవిద్యార్థి అవుతాడు. "వృద్ధాః శిష్యాః గురోర్యువా" అన్నట్లు విద్య నేర్చిన వాడు ముసలివాడు అవుతాడేమోగాని, బోధకుడెప్పుడూ నిత్యోత్సాహియే.
- "నాకు దొల్లి వరియింపబడిన భార్య": (నాచే) ఇటువంటి సందర్భాల్ని గమనిస్తే,
"యదర్థం కన్యాం వృణీధ్వమ్"- వంటి వేదమంత్ర ప్రభావాన్ని గమనించాలి.
- యయాతి కలుగు – పౌష్యునకనుగ్రహించు వంటి రూపాలలో “కి, కు”ల మూలాల్ని పాణినీయం నుండి చూసుకోవాల్సిందే!
ధ్వని- వర్ణ విశేషాలు:
- ఋ-రి: నన్నయ భారతంలో కనిపించే ఋ-రిల యతి ఋకు గల రికారోచ్చారణను సూచిస్తుంది.
- ర- ఱ: రేఫ- శకటరేఫలు నన్నయ భాషలో భిన్నవర్ణాలుగానే కనిపిస్తాయి. అంటే వాటికి భిన్నోచ్చారణమున్నదని, నన్నయ్య నాటికి ఈ ధ్వనుల మధ్య సాంకర్యం లేదని. నన్నయ భారతంలో ర-ఱల ద్వైరూప్యం కనిపిస్తుంది. అంటే ఒకేపదం ఒకసారి సాధురేఫతో, మరోసారి శకటరేఫతో కనిపిస్తుంది.
ఉదా: అరుదు/అఱుదు; చీరు/చీఱు
ఊరార్చు/ఊఱార్చు; చెదరు/ చెదఱు
కురుంగవి/ కుఱుంగవి; తూరు/ తూఱు
క్రుమ్మరియెడు/ క్రుమ్మఱియెడు
దరికొను/దఱికొను; పరగు/ పఱగు
ముందర/ముందఱ; పెరుగు/పెఱుగు
నన్నయ భాషలో “కూతురు” శబ్దం సాధురేఫతోనే కనిపిస్తుంది. కాని శాసనాలలో శకటరేఫతో కనిపిస్తుంది.
- క్ష: క్షకారానికి యతిమైత్రి క వర్గాక్షరాలతోనే కల్పించబడిందిగాని, షకారం, దాని మిత్రాక్షరాలతో కాదు. అంటే ఈ సంయుక్తాక్షరంలో కకారోచ్చారణకే ప్రాధాన్యమన్నమాట. తరువాతి కవులు యధేచ్ఛగా పాటించారు.
- జ్ఞ: నన్నయ దీనిని చఛజఝలతో కలిపి యతిని పాటిస్తే, తిక్కన కకారంతో యతిని చెప్పటం గమనించవచ్చు.
- నన్నయ దేశ్యాలను, సంస్కృత శబ్దాలను ప్రాసతో కలిపి చెప్పాడు. దేశ్యశబ్దాల్లో దీర్ఘం మీది అనుస్వారాన్ని తేల్చి పలకటం భాషాపరిణామక్రమంలో జరిగిన మార్పు. ఇలా తేల్చి పలకటం సంస్కృత శబ్దాలలో లేదు. ఉదా. వాఁడు; భాండము (సం).
దీర్ఘంమీది అనుస్వారాన్ని పలకటం మాండలికాల్లో కనిపిస్తుంది. ఆ ప్రభావమే తిక్కనాది కవులలో సబిందు, నిర్బిందు ప్రాసలు పాటించటంగా కనిపిస్తుంది.
ఉదా: ఆండది – ఆఁడది
తోంక - తోఁక
కోంతి – కోతి
- లోప దీర్ఘత: మనం లు-ల-నల సంధిగా చెప్పే ఈ సంధి రూపాలు నన్నయలో మచ్చుకైనా కనిపించవు- వ్యావహారిక ప్రభావంతో తిక్కనాది కవులలో కనిపిస్తాయి.
- ఇయ>ఎ: నన్నయ ఇయాంతరూపాలు, ఎత్వరూపాలు రెండూ వాడారు.
ఉదా: గద్దియ>గద్దె, పల్లియ> పల్లె
కన్నియ, పక్కియ, లొట్టియ
కేతన ఆంధ్రభాషాభూషణంలో ఇయాంత రూపాలనే వాడాలని చెప్పాడంటే, అప్పతికింకా ఎత్వరూపాలకు శిష్టజనామోదం లేదని, తరువాతికాలంలో కూచిమంచి తిమ్మకవి, అహోబల పండితుడు మొ.న వాళ్ళు అంగీకరీంచారు.
- డ>ద: పదాదిన మూర్ధన్యాక్షరాలు లేకపోవటం ద్రావిడభాషల సహజలక్షణం. కాని వర్ణవ్యత్యయం వల్ల ప్రాఙ్నన్నయ యుగ భాషలోనే కనిపిస్తాయి.
అటిచు>టిఅచు>టిచ్చు>డచ్చు.
అడంగు> డాంగు>డాఁగు
ఈ పదాది డకారం నన్నయకాలం నుండి దకారంగా మారింది. అందుకే నన్నయలో డ/ద ద్వైరూప్యం కనిపిస్తుంది.
ఉదా: డప్పి/దప్పి
డాఁచు/ దాచు
- పదమధ్య అజ్లోపం: పదమధ్యంలో అచ్చు లోపించటం నన్నయలోనేకాదు కవులందరిలోనూ కనిపిస్తుంది. ఉదా: నన్నయలో
తొడుగు- తొడ్గు; పొలతి - పొల్తి
ఉనికి - ఉన్కి
ఇది వ్యావహారిక భాషా ప్రభావం వలననేనని చెపుతారు. వ్యవహారంలో ఊతలేని అక్షరంలో అచ్చు లోపించటం సహజం. కాని కావ్యభాషలో ఎక్కువగా ఛందఃప్రభావం వల్లనే జరుగుతుంటాయి. నగణం కావాలంటే "పొలతి" – రూపాన్ని కేవల గురులఘువు మాత్రమే కావాలకున్నచోట ’పొల్తి’ - రూపాన్ని కవి ప్రయోగిస్తాడు. (బాలవ్యా. ప్రకీర్ణక. 17,18) ఇక్కడ ఇలా ప్రయోగించటానికి ఛందస్సే కారణం. దానికి వ్యావహారిక రూపాలు దోహదం చేస్తే చేసి యుండవచ్చు.
- భావనామాలు: అంట (అనుట), కొంట (కొనుట) వంటి భావనామాలు నన్నయలో కనిపించవు. అంటే అనుట "అంట"గా, కొనుట "కొంట"గా కనిపించిందని అర్థం.
యాదృచ్ఛిక మహాప్రాణత్వం గాని, యకారం, వువూవొవోలను తెలుగుమాటలకు మొదట వాడటంగాని, శ-సలు తారుమారు చేయటం గాని, తాలవ్యాచ్చుకు ముందున్న వకారానికి బదులు యకారం రాయటం (గోవింద-గోయింద; కోవెల- కోయిల) గాని, థ>ధల తడబాటుగాని పొరపాటున కూడా నన్నయ భాషతో కనిపించవు.
ధ్వని పరిణామరీతులు:
- వర్ణ సమీకరణం: సంస్కృత అజంత పుంలింగ శబ్దాలకు తెలుగు ఉత్త్వ, డుఙ్ లు చేరటం సహజం. కాని నన్నయ భారతంలో దీనికి భిన్నంగా "గరుడఁడు" (1-2-76) శబ్దం కనిపిస్తుంది.
- వర్ణ వినిమయం: ప్రత్యేకవర్ణాలుగా వ్యవహరించబడే కొన్నింటి వినిమయం కనిపిస్తుంది.
క/గ: కొనకొని/ కొనగొని
గ/వ: పగలు/ పవలు
చ/స: ముమ్ము/ సుమ్ము
డ/ట: ఆడదాన/ ఆటదాన
డ/ణ: అడగు/ అణగు
త/ద: తందడి/దండడి
వ/ మ: నివురు/ నిమురు
ల/న: తెలుగు/ తెనుగు
అచ్చులు: అ/ఇ: అదరిపడు/ అదిరిపడు
అ/ఉ: మెలపారు/ మెలుపారు
అ/ఎ: తీగ/ తీగె
ఇ/ఉ: ఎఱింగించు/ ఎఱుంగించు
ఇ/ఎ: కోరికి/ కోరికె
ఉ/ఒ: డుల్లెన్/ డొల్లెన్
దీర్ఘాచ్చు/హ్రస్వాచ్చు: పలుమారు/ పలుమరు
సంధి:
నన్నయ కావ్యభాషలోని సంధి విధానాన్ని వాకర్తలు వ్యాకరించిన విధం సవివరంగా పండితులకు తెలుసు. ఈ సంధి సూత్రాలకు నన్నయలో నియత ప్రవృత్తి కనిపిస్తుంది. అందుకు కారణం నన్నయ్య కావ్యభాషను దృష్టిలో పెట్టుకొని సూత్రనిర్మాణం చేయటమే.
అచ్సంధి:
పూర్వపరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావటాం తెలుగుభాషలో సహజ లక్షణం. సంధిలేని చోట యకారం సంధ్యాక్షరంగా వస్తుంది. పూర్వపదాంతస్వరం ఇత్వమైతే దానికి నిత్యలోపం. పూర్వపదాంతస్వరం ఇత్వమైతే మధ్యమపురుషక్రియలలోని ఇత్వం నిత్యంగా, ప్రధమోత్తమ పురుషల్లోని ఇకారానికి వైకల్పికంగా లోపం వస్తుంది.
"ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికమని" వ్యాకర్తలు చెప్పారు. కాని నన్నయలో అచ్చులోపించిన సందర్భాలు లేవు. నామాలతో ఇకారం లోపించిన రూపాలు కనిపిస్తాయి.
ఉదా: రాతిరి+ఎల్ల = రాతిరెల్ల ( భార.ఆది. 6-160)
క్త్వార్థక ఇకార లోపం నన్నయ భారతంలో లేదు.
అత్వసంధి:
అకారాంతాలైన స్త్రీవాచకాలైన శబ్దాలకు తత్సమ సంబోధనాంతములకు సంధిలేదని సూరి చెప్పాడు. స్త్రీవాచక శవ్దాలతో, షష్ఠీ రూపాలలో అత్వం లోపించకుండటం సాధారణ విధి. లోపించిన ఉదాహరణాలు నన్నయలో ఉన్నాయి.
ముందరింద్రుపంచిన (ఆది 8-238), అంతవమునము (సభా. 3- 263), ఉర్వీశువొద్ద (ఈది 7-221)
గ-స-డ-ద-వాదేశం:
ప్రశ్నార్థకాలపైన, షష్థీ విభక్తి రూపాలపైన, క్రియాజన్య విశేషణాలపైన కోల్పడు, తోడ్యొను మొదలైన ధాతువులలోను, అవధారణార్థకమైన అకారంపైన గసడదవాదేశం రాదు.
ద్రుతసంధి:
తెలుగు శబ్దాలలో ద్రుతనకారం ఒక్కతే చివరనుండే హల్వర్ణం. నన్నయ కళలుగా ప్రయోగించిన శబ్దాలు కొన్ని తరువాతి కాలంలో ద్రుతప్రకృతికాలయ్యాయి.
ఉదా: ఎల్లయందు (ఆది: 2-157)
ద్రుతప్రకృతికంగా, కళగా వాడబడినవీ ఉన్నాయి.
ఉదా. ఏని ప్రత్యయం
ఎందేని నుండి (ఆది. 3-181)
ఎయ్యేనియునొక్కు (ఆది. 4-128)
ద్రుతద్విత్వసంధి:
పదాంతంలోనున్న ద్రుతానికి అచ్చుపరమైతే ద్విత్వం రావటం.
ఉదా: పరిచర్యలొనర్చుచున్న పరిమిత నిష్ఠా (ఆది. 1-192)
అన్నిష్టసఖి (ఆది. 3-140)
వర్ణ సమీకరణం:
ద్రుతానికి మకారం పరమైనప్పుడు అది సమీకరణం చెందటాం కనిపిస్తుంది.
కమ్మనిలతాంతమ్ములకు మ్మొనసి (కున+మెనసి)
నామం: విశేష్యం:
- "పాఱ"- వంటి శబ్దాలు నన్నయకు పూర్వయుంగంలో ప్రత్యయ విరహితంగా కనిపించేవి. నన్నయ భారతంలో ఉత్వడుఙ్ లు చేరి పాఱుడు (అది. 5-203) అని కనిపిస్తుంది.
- తత్సమ శబ్దాల విష్యంలో నన్నయ భారతంలో వాకు, జగము, పాత్రుడు, మిత్రుడు వంటి రూపాలే తప్ప వాక్కు, జఘత్తు, మిత్రము, పాత్రము వంటి రూపాలు కనిపించవు.
- తత్సమ శబ్దాలు వీలయినంత మేరకు లింగబొధక ప్రత్యాలతోనె కనిపిస్తాయి. మహత్ బోధకం - డుఙ్, అమహత్, వోధకంగా- ంబు/ -మ్ము/-ము. దేశ్య శబ్దాలైన బల్లిదాదుల వంటి కొన్ని శబ్దాలలో డుఙ్ చేరుతుంది. అమహత్ శబ్దాలపై 'ము" చేరుతుంది.
దేశ్య శబ్దమైన 'కూతు" శవ్దం ప్రథమైకవచనంకు "కూతురు" అని, తదితర విభక్తులలో, "కూతు" అనే రూపాలున్నాయి.
దూతశబ్దంపై ఉత్వ డుఙ్ లు లేని రూపమే నన్నయ వాడాడు.
నీవుమాకదురంగ దూతవై (ఆ. 2-34)
బ్దంఅసుర/అసురుడా రెండు రూపాలలో "అసుర" శబ్దమే నన్నయ ఎక్కువగా వాడాడు.
"అయ్యసుర నిన్నెఱింగె (ఆది. 1-132)
" పెక్కండ్రసురలు" (ఆది. 6-278)
*తరుణీశబ్దంలో ఈకారం హ్రస్వమై "తరుణి" అవుతుంది. కాని నన్నయ "తరుణియ"- అనే రూపాన్ని వాడాడు.
"తరుణియలొప్పనాడిరి ముదంబున" (ఆది. 8-175)
తత్సమాల పై ఇయ వచ్చిన రూపాలులో ఇదొక్కటే.
గద్దియల్ (ఆర. 1-344), వొట్టీయల్ (సభా. 10-267)వంటీ ఇయాంత రూపాలే అధికంగా నన్నయలో కనిపిస్తాయి.
* శంతను, శ్వేతకేతు, స్థాణూ, పూరుశబ్దాలు "వు"- వర్ణరహింతంగానే కనిపిస్తాయి. రాహుశబ్దం వు వర్ణ రహితంగా, సహితంగా కనిపిస్తుంది.
* సూరి బాలవ్యాకరణాంలో మిత్రపాత్రాది మహద్వాచకాలు వైకల్పికంగా పుంలింగ తుల్యాలవుతాయని చెప్పాడు. కని నన్నయ భారతంలో అవి నిత్యంగా పుంలింగ తుల్యాల్య్గానే కనిపిస్తున్నాయి. మిత్రము – పాత్రమున ఏ ప్రయోగాలు లేవు
పరాశరాంభోరుహమిత్రుగాల్చి (ఆది.1.22)
పాత్రునాపస్తంభసూత్రు (ఆది. 1-9)
*ఉరగ శవ్దం ఏకవచణ్లో "ఉరగము", బహువచనంలో ఉరగలు/ఉరగములు రెండురూపాలు వాడాడు.
ఉరగములకు శాపం బిచ్చెన్ (ఆది. 2-36)
అయ్యురగులు నమృతంబుపయోగింపంగానక (ఆది. 2-122)
*జకారాంతాలైన ఋత్విక్, భుక్ శబ్దాలు
ఋత్విజుడు (సభా. 2-11)
భిక్షాభుజులు (ఆర. 8-111)
అని కనిపిస్తాయే కాని, ఋతిక్కు, భుక్కు అని కనిపించవు.
* జగత్ శబ్దానికి "జగము" అనే రూపమే కాని "జగత్తు"- అనే రూపం కనిపించదు.
* "కోమలీ"- అనే ఈకారాంత శబ్దం సంస్కృతంలో లేదు. "కోమలా"- అనే ఈకారాంత శబ్దమేగా ఉంది. ఈకారాంత శబ్దం వ్యాకరణ సమ్మతం కాదు. కాబట్టి తెలుగులో తత్సమంగా వాడటం వ్యాకరణ సమ్మతం కాదు. కాబట్టీ తెలుగులో తత్సమంగా వాదటాం యుక్తం కాదు. కాని నన్నయ "కోమలి కృష్ణజూచి"(సభా. 2-249) అని వాడాడు. "అక్కోమలిమాయందు" (ఆర. 2-35)
* కోమల శబ్దాన్ని పిప్పలాదిగణంలో చేర్చి ఙీప్ ప్రత్యయం చెప్పుకొని కోమలీ శబ్దాన్ని సాధిస్తే అప్పుడు "కోమలి* అనేరూపం ఏర్పడుతుంది.
* ఊర్ధ్వరేత శబ్దానికి ఊర్ధ్వరేతుడు (ఆది-4-32)
ఊర్ధ్వరేతసుడు(ఆది-3-60) అని రెండు రూపాలు కనిపిస్తాడు.
* హనుమత్ శబ్దానికి హనుమంతుడు(ఆర.3-319)
హనుమ(ఆర.3-314)
అనే రెండు రూపాలు ఉన్నాయి.
ఔపవిభక్తికాలు:
-ఇ,-టి,-0టి,-తి న నాలుగు ఔపవిభక్తిక ప్రత్యయాలు కనిపిస్తున్నాయి. -ఇ తో కూడా రూపాలు అత్యధికం. నీరు శబ్దానికి మీద- ఇ చేరిన రూపాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. -టి ఆవేశంగా వచ్చినా రూపాలు ఉన్నాయి.
నీటిలో (ఆది: 3-201)
- ఆంధ్ర భాషాచరిత్రలో పాలుశబ్దం యొక్క ఔపవిభక్తిక రూపం ‘పాడి’-అని చెప్పటాన్ని విచారించాలి.
- ఏమి శబ్దం పై ఔపవిభక్తిక చేరిన రూపాలు రెండు విధాలుగా కనిపిస్తాయి.
1.ఏమి శబ్దంలో మీ లోపించి చేరటం: ఇన్నిదినములయ్యె నేటికీ నా తోడ (సభ:2- 92)
వారి నేటికీ వారింపదు (ఆది:3-5)
2.ఏమి మీ దటి చేరటం: నీ కూర్మియుని యలుకయు నాకవి యేమిటికి(సభ: 2-67)
అనౌపవిభక్తికాలు:
ఎల్లవారును జూడంగ నిట్టి బయల నెట్ల సంగమమగు(ఆది:3-42)
ఎదురను దవ్వుల జూచినపొడవులెల్ల (ఆర 2-169)
ఎదురు, బయట అనే రూపాలు అప్పటికి లేవు. ఇవే కాదు ఎన్నడూ, కన్ను,కాలు, కేలు, వడలు, నెత్తురు, పగలు, ముళ్ళు, రేలు కొలను వంటి శబ్దాలు ఔప విభక్తికాలు లేకుండానే ప్రయోగించటాన్ని నన్నయతో చూస్తాం.
*అలుగు, కరుణించు, అనుగ్రహించు, సైజు మొదలైన క్రియలతో షష్టికారకాన్ని ఉపయోగించటం నన్నయలో కనిపిస్తుంది.
ఉదా: యయాతికి నలిగి (ఆది 3-39)
పౌష్యునకు ననుగ్రహించి( ఆది 5-31)
* అట, ఇట, ఎట అనే ప్రత్యయాలపై ‘క’ప్రత్యయం చేరకపోవటం నన్నయభాషలో విలక్షణంగా కనిపిస్తుంది.
ఉదా: ఇటయేల వచ్చితి (ఆది-2-210)
ఇచ్చనుప యెటవోయెడు ( ఆది-2-102)
* అక్కడ, ఇక్కడ,ఎక్కడ శబ్దాలు కొన్ని చోట్ల ప్రయోగించబడ్డాయి.
ఉదా: ఎక్కడ అంగదలనేరకున్నాడా( అరణ్య. 3-245)
* నన్నయలో ఒకచోట తాకుకు అనే రూపం కనిపిస్తుంది. ( అరణ్య. 4-12)
సర్వ నామాలు:
ఉత్తమ మధ్యమ పురుష సర్వనామాలలో ఏక బహువచన రెండు రూపాలలో రెండేసి రూపాలు కనిపిస్తాయి.
ఉదా: : ఏను- నేను ఈవు -నీవు
ఏము- మేము ఈరు -మీరు
తచ్చబ్ద సర్వనామమైన ‘వాడు’కు అది, ఇది రూపాలకు ఇప్పటిలాగా నీచార్థ స్ఫురణ లేదు.
ఉదా: వీడు భీముడు ( సభ. 1-193)
వాడు గవ్వడి(సభ. 1-193 )
దమయంతిని ఉద్దేశించి ‘అది సంతసించి’( ఆర. 2-202)
నన్నయ వారు బహువచన రూపాన్ని వాడాడు. వీరు, వారు శబ్దాలపై లు చేర్చి వీరలు, వారలు వంటి బహువచన రూపాలు వాడడం అయింది.
సంఖ్యా వాచకాలు: ‘ఏను’ రూపమే కనిపిస్తుంది కానీ ‘ఐదు’ రూపం కనిపించదు.
ఒకరుడు, ఒక్కండా, ఒక్కండా రూపాలే కనిపిస్తాయి. కానీ ఒకటి వంటి రూపాలు నన్నయ భారతంలో కనిపించవు.
మహతి వాచకంగా ఒక్కత, ఒక్కతి, ఒక్కతే, ఒక్కర్తో వంటి రూపాలను వాడాడు.
పూరణార్థకంగా వచ్చే ‘అవక్’ నన్నయలో ఉంది.
క్రియా ధాతువులు, విభక్తులు:
* ధాత్వనుబంధం చేరని ప్రాచీన ధాతువుల కొన్నింటి వాడుక నన్నయ భారతంలో కనిపిస్తుంది.
ఉదాహరణ: తోడు (ఆది.8-174)
* ఎటువంటి రూపభేదము లేకుండానే అకర్మక సకర్మకాలు వాడబడ్డాయి.
ఉదాహరణ: కురియు: “అంగారవృష్టి గురియిచు” ( ఆది. 7-107)
“వాన కురిసే”( అరణ్య. 3-298)
ఒలుకు: “కమాండలు జలంబు నొలికిన” (ఆది.7-126)
“రక్తధారలొలుక"(ఆది. 2-100)
పూను: హయములు పూనిన రథమెక్కి (ఆర.1-164)
ఇద్దరును పూనిరి సర్వము నిర్వహింపగన్ (ఆది.2-9)
* సంస్కృత ధాతువులకు ఉన్న మూలార్ధం నన్నయ వాడడం చేత అవి మనకిప్పుడు విలక్షణంగా అనిపిస్తాయి.
ఉదా: ‘విహరించు’ ధాతువుకు విభాగించు అనే అర్థం ఉంది.
నన్నయ ‘అగ్నులు విహరింపమని పంచి’ (ఆది.1-130) అని సకర్మకంగా ఈ క్రీను ప్రయోగించాడు.
* కొన్ని సకర్మక క్రియలు కర్మ లేకుండానే నన్నయ వాడటాన్ని గమనించవచ్చు
“పొలుపుగా మూసి కట్టితోడి భూరి విభూతి ప్రకాశింతంబుగా( ఆది. 8-124)
* తద్ధర్మార్థక క్రియ వర్తమానం, భవిష్యత్ కాలంలోనేగాక భూతకాలానికి కూడా వాడబడటానికి నన్నయలో ఉదాహరణలు ఉన్నాయి.
ద్యూత క్రీడకు కొండకనేర్తున్( నేర్చియున్నాను) ;
విజితేంద్రియుండున గ్రనిమ్ముని బాయక విందు వింటిని (ఆది-4-30)
* అన్వాదులకు ప్రత్యయం చేరినప్పుడు నన్నయలో ఆండ్రు, కొండ్రు వంటి మూర్దన్య యుద్ధరూపాలు కనిపిస్తాయి.
* సువర్ణాంత ధాతువుపై వచ్చే తద్ధర్మార్థక ‘దు’ ప్రత్యయం తకారంగా మారుతుంది. ధాత్వంత చకారం ఏ కారణం మారే వ్యవహారక రూపాలు ఉన్నాయి. ఇవేవీ నన్నయలో లేవు.
* వ్యతిరేక క్రియ అర్థత్రయాన్ని బోధించడం కూడా కనిపిస్తుంది.
ఉదా: నలుగానమివ్వనా (భూత)
వర్తమానం: పలుకదు సఖులతో లలితాంగి (అరణ్య.2-26)
భవిష్యత్తు: నఋఅనకానినళినదళనేత్రవరియింపదట్టె ( అరణ్య. 3-52)
వ్యతిరేక క్రియలలో కాలాన్ని సూచించదల్చినప్పుడు అగు- సహాయక్రియ రూపాలను చేర్చి చెప్పటం ఉంది.
ఉదా: ఎఱుగనయితిని, నమ్మనేరనయ్యెదను, లేదవు
* విద్వర్థకంలో“ఉండకుండనది” అనటానికి బదులుగా ఉండకున్నది అనటం నన్నయలో కనిపిస్తుంది.
“దుర్జన యోద్రుల కడనుండకున్నది (ఆది. 3- 206)
* క్రియాజన్య విశేషణాలకు తచ్చబ్దం చేరిన రూపాలు విశేషరూపాలు క్రియార్ధాన్ని పొందటం కావ్యభాషలో కనిపిస్తుంది. తచ్చబ్ద ‘వ’కారలోపంతో కూడిన సంగ్రహరూపాలు అంటే వండుచున్నాడు, వంటిది నన్నయలో లేదు
* కలుగు దాతు సకర్మకంగా, అకర్మకంగా కనిపిస్తుంది.
ఎఱుకగలరే (సకర్మకంగ)
* కలఙ్యనుబంధంతో కూడిన భవిష్యత్తు క్రియలు కనిపించవు.
* -పడు కర్మన్యార్థకాలను వాడటం (సంస్కృత ప్రభావం వలన) విశేషంగా నన్నయలో కనిపిస్తుంది.
* -కొను సహాయక్రియ లేకుండానే కొన్ని క్రియలు ఆత్మార్గంలో నన్నయవాడాడు.
ఉదా: బబ్రు భార్య తనకు భార్య చేసే( సభా. 2-6)
* ఏవార్థకం ప్రత్యయంగా ‘అ’ -నన్నయలో కనిపిస్తుంది. ఈ ఏవార్థకం నామాలతోనే కాకుండా క్రియా పదాలతో వాడబడింది.
ఉదా: మీదాన గాన (ఆది.6-260)
* సముచ్ఛయార్ధకం: ఉన్ ప్రత్యయం నుని రూపాంతరాలు. తనకిష్టుడాన్ (ఆది.1-25)
* ప్రశ్నార్థకం: ఎ/ఏ ప్రత్యయంలో నన్నయతో ‘ఎ’ మాత్రమే వాడబడింది.
వగచితే (ఆది. 2-174)
కాముశక్తి నోర్వగలరే జనులు( ఆర. 3-38)
* విశేషణాలు: ఒకే రూపం విశేషణంగా, విశేష్యంగా వాడుతూ తెలుగులోనే కాదు ఇతర ద్రావిడ భాషలలో ఉంది. నన్నయ ‘అ’ప్రత్యయంతో కూడిన ‘నల్ల’రూపాన్ని విశేషంగా వాడాడు.
‘నల్ల లేదయ్యనేని’ (ఆది.సభ-32)
* క్రియా విశేషణాలు: ఆ-ఈ-ఎ తో పాటు ప్రాచీన ద్రావిడభాషలో మధ్యస్థాన్ని బోధించే ఓ ప్రాతిపదిక ఒకటి ఉండేది. దీని నుండి ఏర్పడిన ‘ఉల్ల’ (అల్లదిగో, ఇల్లిదిగో వంటి రూపాలలోని అల్లా, ఇల్లా) రూపాన్ని నన్నయ ప్రయోగించారు.
క్రియా విశేషణాలైన అవ్యయాలకు ఉదాహరణలుగా నన్నయ భారతంలో మొగి, ఒయ్య, నెమ్మి, ఓవి, క్రచ్చఱ, పరువడి మొదలుగనవి కనిపిస్తాయి.
ఔపమాన్యాన్ని బోధించే అవ్యయాలు:
కరణీ, భంగి, మాడ్కి, వడువు, పోలె వంటి కనిపిస్తే కొన్నింట్లో రెండేసి రూపాలు ఉన్నవి కూడా కనిపిస్తాయి. ఉదా: అట్లు వోలే,
* క్త్వార్థక విధానం:
వందురి విగచుచున్న( ఆది. 5-30)
వచ్చి వధింతు కాక (ఆది-6-201)
వచ్చి వంతరలాడు( ఆది-2-101)
* నామాల నుండి క్రియా విశేషణాలను నిష్పన్నం చేయటానికి అగు ధాతువైన అన్నంతరూపం ‘కాన్’ చేర్చబడుతోంది.
- కాన్ -గాన్, కన్, గన్
కానీ నన్నయ భారతంలో ఈ సహాయక క్రియారూపం లేకుండానే క్రియావిశేషణంగా వాడటాన్ని గమనించవచ్చు.
“ అమర భావంబున సుఖంబు జీవింతురటే” (ఆది.4-151)
* ధ్వన్యనుకరణ: మలమల మరంగుచు( ఆది 3-111)
వడ వడ వడంకుచు (ఆది-2-85)
* మిక్కిలి అనే అర్థంతో ‘తద్ద’/ తద్దయు అనే పదం ఎక్కువగా వాడబడింది.
“పెద్ద కాలమునికి తద్దతగదు”(1-4-175)
“కుంతయు విస్మయంబంది”(1-5-27)
* క్లిష్టమైన సమస్య ఏర్పడిన సందర్భంలో పాత్రల అంతస్సంఘర్షణను సూచిస్తూ ‘బాగా ఆలోచించి’ అనే భావంతో గాని ఎక్కువసేపు ఆలోచించి అనే అర్థంతోగాని సూచిస్తూ “పెద్దయంబ్రొద్దు చింతించి”- అని నన్నయ ప్రయోగించడాన్ని గమనించవచ్చు.
విభక్తి ప్రత్యయాలు:( డు.ము. వు.లు)
డు: బిందు పూర్వకమై కనిపిస్తుంది. మహద్వాచకాలైన తెలుగుశబ్దంపై కూడా ఇది కనిపిస్తుంది. తమ్ముడు, అల్లుడు, మనుమడు,పాలుడు మొదలైనవి.
* అట్టి, ఇట్టి, ఎత్తి అనే వాటి తరువాత కూడా బిందుపూర్వక ‘డు’ వర్ణం చేరుతున్నది.
అట్టిడు (ఆది:4-168) ; అట్టివాడు>అట్టిండు( వాలోపం)
ఇత్తుడు( ఆది. 5.230) ఇట్టి వాడు>ఇట్టిండు( వాలోపం)
* కలడు అనే రూపం కూడా అలాగే వచ్చింది. కలవాడు (కలడు)
వు: అర్ఘ, ధర్మ వంటి అకారాంత శబ్దాలలోని చివరి అకారం ఉకారంగా మార్చి వు చేర్చి అర్ఘువు, ధర్మువు వంటి రూపాలు ఉపయోగించాడు.
లు: అదంతంబయి, దీర్ఘ పూర్వ లోపదంబయిన మహత్తుల మీద లూ వర్ణకానికి రువర్ణం రావడం సహజం. కానీ దీర్ఘపూర్వలో పదాలు కానీ శబ్దాలపై కూడా కొన్నిచోట్ల బహువచన లకారం రేపగా మారటం నన్నయలో కనిపిస్తుంది.
అల్లూరు( ఆది :8-53)
అట్టిరు (ఆది:4-17)
నెయ్యురు( సభ:1-16)
* ఱు కొన్నిచోట్ల ప్రధమ బహువచన ప్రత్యయంగా కనిపిస్తుంది.
“పలుకుల జెయ్వు ఱు బాండవులకు బ్రీతి గల యట్ల యుండుదు” ( ఆరా:8-21)
* అంద ఱు, ఎంద ఱు, ఎందఱు, కొందఱు శబ్దాలలోనే రెఫ బహువచన ప్రత్యయం. దీనికి ఏకవచన రూపాలు లేవు. పగఱన్, చూపఱు అనే రూపాలు నన్నయలో కనిపిస్తాయి.
కడగీ చెఱచు పగలు( సభ. 2-144)
చూచి చూపఱు ప్రభాతశ్చర్యలైన రచ్చటన్ ( ఆది. 6-30)
* రలడాంత శబ్దాలపై చేరిన లూవర్ణం, పూర్వ వర్ణంతో సమీకరణం చెందిన రూపాలు, చెందని రూపాలు రెండూ ఉన్నాయి.
“ఆర్దీకృతములైన యంగళులనొప్పె”(ఆది-6-118)
రెన్నాళ్లు (ఆది-1-68), కన్నీళ్లు (ఆది.6-259)
ఈ సమీకరణం చెందిన ‘ళ్లు’ రూపాలు ముద్రిత ప్రతులతో ఉన్నాయి. ళ్ళు/డ్లు రెండు రూపాలు శాసనాలలో ఉన్నాయి. నన్నయ కు’డ్లు’- రూపాలే సమ్మతమని గంటిజోగి సోమయాజి (ఆం. భా.వి.403)
‘ఏఱులు’ రూపమేగానీ ‘ఏళ్లు’- నన్నయ వాడలేదు.
పునరక్త బహువచనం: “సుందరి! నా కోడండ్రుర
యందభ్యర్చితవు నీప (సభ-2-257)
ఓలిన మేలుగా బడసి యూళ్ళులనున్నది( ఆది:6-267)
ఒక్కసతికి బ్రతులు పెక్కండ్రారగుటిది( ఆది. 8-25)
ఇక పారలు, వీరలు, మీరలు వంటి ప్రయోగాలు కొల్లలు.
ద్వితీయ: నన్నయ భారతంలో ‘న్’- అనేదే ద్వితీయ విభక్తిగా పెక్కుచోట్ల కనిపిస్తుంది.
‘జడంబు ద్వితీయకుం బ్రధయగు’- ఇది సాధారణ లక్షణం. అజడంబు ద్వితీయకు ప్రధమ రావటం నన్నయలో కనిపిస్తుంది.
ఉదా: అమ్మదనాగ మెదుర్చి (ఆది.4-207)
* మనం తృతీయ విభక్తులుగా చెప్పుకునే చేత/చే నన్నయ భారతంలో పంచమీ విభక్త్యర్థంలో వాడటాన్ని గమనించవచ్చు.
“తక్షకు చేతకుండలంబులుగొని” (ఆర.1-113) (నుండి)
“ధర్మనందనుడా హర్పతి చేత వరంబు పేర్మితో బడసి” (వలన) (ఆర.1-44)
* ‘చేసి’ అనే క్త్వార్థకరూపం తృతీయ విభక్తి అంతాలకే తృతీయ అర్థంలో చేరటాన్ని నన్నయలో గమనించవచ్చు.
“భారత భారతీశుభగభస్తిభయంబులజేసి”(ఆది.1-22) (కరణార్థం- చేత)
“నీ కులిశాభి రక్షణ స్ఫురణనజేసి సుస్థిరతబొందు” (ఆది.2-46)
* మెయి/మైలు తృతీయార్థంలో, జడ వాచకాల తర్వాత కనిపిస్తాయి.
“తెనుగునరచియింపుమధిక ధీయుక్తిమెయిన్” (ఆది.1-16)
“పూవులు జందనంబు జనునె బలిమిమై గొని తాల్ప” (సభ.1-18)
చతుర్థి: నన్నయ భారతంలో ‘పొంటెన్’- ‘తదర్థము’ చతుర్థీ విభక్త్యర్థంతో కనిపిస్తుంది.
కార్య సంప్రయోగము పొంటేన్ ( సభ. 1-26)
‘పొంటెత’ ధర్మక్రియాజన్య విశేషణంపై కూడా వాడబడింది.
అఘములు వాయు పొంటె (ఆది:8-144)
పతి నన్వేషించు పొంటేనరిగెడు ( ఆరా:2-120)
తదర్థం: నీతదర్థంబులై నిఖిలవేదంబులు వర్ధిలు ( సభ. 1-258)
నాతదర్థమాచరింపుము బ్రహ్మచర్యవ్రతంబు (ఆరా.1-275)
వలన: అపాయ, భయ, త్రాణ, గ్రహణ, వారనార్థాలతో కనిపిస్తుంది. ఈ ‘వలన’ ప్రత్యయం పై ఒక్కొక్కసారి తృతీయ ప్రత్యయమైన చేసి చేరటం నన్నయలో కనిపిస్తుంది.
క్రోదంబు వలన జెసి( ఆరా. 22-312)
కంటె: అన్యార్థాది యోగజనమైన పంచమికిని, నిర్ధారణ పంచమికి కంటే వర్ణకం వస్తుంది. వీటితో పాటు కొన్నిచోట్ల ‘కంటె’ కు ముందు ‘న’ ఆగమంగా వస్తుంది.
ఉదా: తత్క్రతుశతంబున కంటె( ఆది. 4-93)
క్రియాజన విశేషణాల మీద కంటే:
“ఎలుకచే చచ్చుకంటే” ( ఆది:8-93)
కోలెన్: "లాటన్ గోలె ద్విజిహ్వులు నాబరగిరి (ఆది: 2-122)
"దాని శరీర సౌగంద్ర్హము య్హోజనంబునంగోలె" (ఆది: 3-11)
కృతమున: ‘వలన’- అనే అర్థంలో ‘కృతమున’ అనే పదాన్ని వాడటం నన్నయలో కనిపిస్తుంది.
“నీ కృతమున గౌరవాన్వయ మా కల్బిషకీర్తి ప్రకాశిత మగున్”( ఆర. 1-51)
“నీ కతమున నా దాస్యము వాయును పాయబు ( ఆ. 2-50)
యొక్క: ‘యొక్క’- నన్నయ భారతంలో కనిపించదు. డుమంత శబ్దాలలోని ‘డు’ లోపిస్తే మిగిలిన డుమంత రూపాలు సంబంధార్థంలో వాడటం నన్నయలో కనిపిస్తుంది.
ఉదా: గౌతమ శిష్యులు( ఆది. 5-210)
* ‘కు’ ప్రత్యయం చతుర్దంలో ప్రయోగించటం నన్నయలో కనిపిస్తుంది. మనమిప్పుడు మీద, పై అనే వాడే చోట్ల నన్నయ’కు’- వాడటం కనిపిస్తుంది.
శుక్రుండాయయాతి కలిగి( ఆది. 3-187) ( యయాతిపై)
* ‘లో-లోపల’- అందు అనే అర్థంలో వాడాడు. అందుకు వ్యస్తప్రయోగం ఉంది. స్థలార్ధ బోధకమైన అందుక్రమంగా ప్రత్యేకంగా కుదురుకుంది. నన్నయ భారతంలో అందు వివిధర్ధాలలో ప్రయోగించబడింది.
“అట్టియందు గోవిందుడు స్త్రీ వధయును, గోవధయును చేసే” (సభ. 2-42)
“సర్పయాగంబు నందయ్యెడు”( ఆది. 5-90)
* అంద్వర్థంలో ‘న’ ప్రయోగించబడింది.
“తెనుగునరచియింపు మధిక ధీయుక్తిమెయిన్”( ఆది. 1-16)
వివిధార్థాలు-అందు:
స్థలార్ధకం: అతిధివై వచ్చి నీవు మాయందు గడిచి (ఆర-390)
మీద: శుమంతుండా నిజపుత్రుడగు దిలీపునందు రాజ్య భారముర్చి (ఆరా. 3-72)
తాల్మియందు బృథివిని బ్రోనిదాని( ఆది. 5-34) (తాల్మి విషయంతో)
అవివేకియందు బ్రయక్తంబులైన సుభాషితంబులుంబోలె (ఆరా.1-313) ( అవివేకి ఎ )
* షష్ఠి సంబంధార్థంలో అ- ఇ వర్ణాలు చేరటం
హంసల నడబెడగుజూచి (ఆర.2-12)
తనకుల బ్రాహ్మణు( ఆది. 1-9)
దాని శరీర సౌరభము, దాని విలోల విలోకానమునన్ (ఆది.4-171)
వ్యాసుడి ‘చ’కారం -నన్నయ ‘యు’:
“అఖిల బాంధవులయు బ్రాహ్మణులయు తోడ
ధౌమ్యులయు దమ్ములయు తోడ”
నన్నయ్య సంస్కృత శైలి:
నన్నయ్య సంస్కృతపదశైలి శృతిమధురమైన ప్రవాహగతి. ‘ఉభయభాషా కావ్య రచనాభిశోభితూ’(ఆది.1-9) డనని చెప్పుకున్నాడు. ఉభయ భాషలు అంటే సంస్కృతాంధ్రలని వేరే చెప్పవలసిన పనిలేదు. తొలిపద్యమే ‘శ్రీవాణీ గిరిజాశ్చరాయ’- సంస్కృతం. ఆదిపర్వంలోని మొదటి ఆశ్వాసంలోని ఎనిమిదవ పద్యంలో ‘వలయిత’ –అని.
ఇది ఇలచ్ ప్రత్యయాంతం. తారకాదులకు ఇలచ్ చేరుతుంది. వలయతారకాదుల్లో లేదు. అయితే రాకాది ఆకృతగణమని సమర్థించవచ్చు. తారకాదుల్లో వలయత అనే ప్రయోగం ఉన్నందున వలయ చేరుతుందని సమర్థిస్తే మరో సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏమంటే అర్థసంబంధమైనది. తారకాతిగణ గణితాలకు అర్థవిషయంలో ఒక ప్రత్యేకత ఉంది. “తత్ అస్యసంజాతం”- అనే అర్థంలో ఈప్రత్యయం వస్తుంది. అంటే ‘తారకలు ఆకాశంలో పుట్టాయి.’ ‘ఆకాశంలో తారకలు ప్రకాశిస్తున్నాయి’- వంటి అర్థంలో మాత్రమే ఈ ప్రత్యేక వస్తుంది. తారకాతిగణంలో చెప్పుకునేవన్నీ ఈ సూత్రానికి బద్దమై వర్తించేవే. పులకిత, కొరకిత అనేవన్నీ ఇలాంటివే. వలయిత అలాంటిది కాదు. నిగూఢంగా ఉన్న వలయం వెలికి వచ్చినట్లు చెప్పటం కుదురుతుందా?ఈ సందర్భంలో ఇతచ్, అభూత తద్భావార్థాన్ని చెప్పవలసి ఉంటుంది. వేలవలయం కాదు. దానికి భిన్నమైనది లేదా అద్భుత తద్భావార్థాన్ని పొందటం ఇందులోని విశేషం. అందుచేత వలయతను అర్థసంబంధమైన అనుపత్పత్తి వల్ల ఆకృతిగణంలో (రూపదృష్ట్యా) చేర్చినప్పటికీ తారకాదులలో చేర్చి చెప్పటానికి వీలుకాదు. పోనీ తెలుగు వ్యాకరణ సూత్రాల ప్రకారం చెప్పెద్దామన్న వీలుకాని రూపం. ‘అనుక్తమాన్యతోగ్రాహ్యం’- అనటానికి సంస్కృతంలో ఈ అర్థంలో ‘ఇతచ్’ చేరటాన్ని వ్యాకరణం చెప్పలేదు. వలయ, ఇతచ్ రెండు సంస్కృతాలే అయినా వీటి కలయిక తెలుగువారు సాధించిన సాధ్యరూపం. అవయవాల దృష్ట్యా సిద్ధమే అయినా, అర్థం దృష్ట్యా సాధ్యం అంటే సాధ్యమైనా సిద్ధరూపమని నన్నయ్య వంటి తెలుగుకవులు చేసిన ఇటువంటి ప్రయోగాల్ని ప్రత్యేకంగా పరిశీలించాలి.
అలాగే ‘జరద్వేశ్య’(ఆర.3-39) అనేది. ఇందుల్ జరత్ - శస్త్రంత రూపం. శత్రర్థంలో తెలుగులో ‘చున్’ ప్రత్యయాన్ని వ్యాకరణాలు విధించాయి. దీనికి వర్తమానార్థం మాత్రమే ఉంది. సంస్కృతంలో శత్రంతాలు వర్తమానార్థంలో(లట్) మాత్రమే కాకుండా లక్షణార్థంలోను, హేత్వర్థంలోనూ ప్రయుక్తమవుతాయి. "లక్షణ హేత్వోః క్రియాయాః" (3-2.126) ఈ సూత్రార్థాన్ని ఈ ‘జరద్వేశ్య’-వంటి ప్రయోగాలకు అన్వయిస్తేనే అర్థం సరిపోతుంది. ఇక్కడ లక్షణార్థాన్ని అన్వయిస్తే ‘ముదిమ శరీరావయవాలలో పొడచూపిన వేశ్య’- అని అర్థమవుతుంది.
“అరాళకుంతల విభాసిని కుమారి”(ఆది.7-20)
“త్రిభువన పావనీయైన ఇష్టరమమూర్తి” (ఆది.7-42)
“వసుధ సురాజయయ్యే”( ఆది. 8-82)
“పుత్ర సహితయగు శలినియున్నగు జరితంజూచి” (ఆది.8-318)
“కురుపతికిన్ యుధిష్ఠిరునకున్సకలక్షితిపాలసేవ్య సుస్థిరవిభవాభిరామునకు”
( సభ. 1.35)
“వల్కలాజిన ధరణించేసి ధర్మచారిణి దోడ్కొనిచని” (ఆరా.2-331)
వంటి ప్రయోగాలలో విశేషణ విశేష్యాలకు లింగ వచన విభక్తులు సంస్కృతంలోలాగా పాటించడం గమనించవచ్చు. అయితే విశేష్యంలాగా విశేషణాలకు లింగ వచన విభక్తులు సామ్యంతో లేని ప్రయోగము లేకపోలేదు.
“అతి సుగంధులయిన కుసుమంబులు” (ఆర. 3-119)
కుసుమాలు విశేష్యం. సుగంధులు విశేషణం. సుగంధికి బహువచనం సుగంధులు. సుగంధి పుంలింగం. కుసుమం నపుంసకలింగం. ఈ ప్రయోగంలో బహువచనంలో వచన సామ్యమున్నప్పటికీ లింగం విషయంలో సామ్యం లేదు.
తెలుగులో సమాసరచనలో నాలుగు పదాలుమించి ఉండేది చాలా తక్కువ. బహుపద ఘటిత తెలుగు సమాసాలలో క్రియాజన్య విశేషణాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటి తోడ్పాటు లేకుండా ఎక్కువ పదాలు సమాసంగా ఏర్పడటం తెలుగులో సాధ్యంకాదు. సంస్కృత పద్ధతిలో ఆయా సమాసాలు అన్నిటిని తెలుగు కావ్యంలో వాడుకునే పద్ధతికి దారి చూపింది నన్నయ. తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వ సమాసాలు సిద్ధ సాధ్య రూపంలో నన్నయ వాడాడు.
బహువ్రీహి సమాసాలు:
కృతధార పరిగ్రహలండు( ఆది. 2-149)
ఉద్యద్దివాకర సత్పింగ జటాకలాపుడా( ఆది.3-3)
విహితోద్ధానుడు (ఆది.3-166)
ప్రణమితోత్తమాంగుడు(ఆది.3-166)
అలబ్ద ప్రతి వచన (ఆది.3-183)
సంగతోత్తుంగ పయోధర( ఆది. 4-135)
భూరిపద ఘాత జాతధరా రేణు ప్రకర ధూసరిత శరీరులు (ఆది.6-211)
అపేత చూతము (ఆరా.2-42)
శూన్య కమల (ఆరా.2-142)
దక్షిణ జాను స్పష్టమహీతలు ఉండా( ఆరా. 2-237)
నిటలాక్షకుతభక్షబక్షితానంకుడు (ఆరా.3-49)
చందనగంధి (ఆర.2-90), ఉన్మప్తవేణి(ఆర.2-116)వంటి ద్విపద ఘటితాలైన బహువ్రీహి సమాసాలను కొన్నిటిని ప్రయోగించినప్పటికీ బహుపదు ఘటిత బహువ్రీహి సమాసాలకే ప్రాచుర్యం నన్నయలో కనిపిస్తుంది. ‘భూరిపద ఘాత జాతరాదరేణ ప్రకర ధూసరిత శరీరులు’- అన్నచోట తొమ్మిది పదాలున్నాయి.
కొన్ని సమాసాల్లో కొన్ని పదాలు అధికంగా ప్రయోగించటాన్ని గమనించవచ్చు.
* ‘సహపుత్ర సహమిత్ర బాంధవ జనుండు’ (ఆది.2-203)
పుత్ర, మిత్ర, బాంధవ అనే మూడు పదాలలో పుత్ర మిత్రాలకు మాత్రమే సహశబ్దం గమనించవచ్చు. అవ్యయీభివే కాలే(6-3-81) అనే సూత్రాన్ని బట్టి ఒకచోట సహా ఉన్న, సహకు పర్యాయంగా సరిపోతుంది. కానీ రెండు చోట్ల ‘సహ’ వాడటాన్ని గమనించవచ్చు.
* ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపుడా (ఆది.3-3) ఇందులో ఉద్యత్ అనేది శత్రు ప్రత్యేకంగా భావిస్తే, లక్ష్యార్ధాన్ని చెప్పుకోవాలి. భవత్>భవతి, గచ్చత్>గచ్చతిలాగా ‘ఉద్యతి’- అని చెప్పటానికి ‘ఉద్యతి’- అనే క్రియాపదం దొరకదు. ‘ఉణ్’- ఉపసర్గను మినహాయిస్తే మిగిలిన ‘యత్’- అనేది క్రియాపదంగా భావించాలంటే అలా నిష్పన్నమయ్యే ధాతువు ధాతుపాఠంలో కనిపించదు. కాబట్టి ఇది నన్నయ విశేష ప్రయోగంగా చెప్పాలి.
‘సర్వభూత వర్గంబెల్ల’ (ఆది.5-95) - ఇందులో సర్వ- ఎల్ల సమానార్థకాలు. అలాగే ‘తననిజ మార్మ్యము’(ఆది.8-128). ఇందులో ‘తన’- తెలుగు పదం. ‘నిజ’- సంస్కృత పదం. రెండు సమానార్థకాలే. నీ తధాత్తము నీ, తత్- రెండు తుల్యార్ధకాలే. తస్య అర్థం తదార్థం కదా! అలాగేనా తదర్ధము( ఆర. 3-275)
“బృహద్రుధిర ధారలు( సభ. 2-68)
సాధారణంగా ధారారూపంలో ఉన్నవాటికి వేగధైర్ఘ్యాలను చెపుతారు. కానీ ఇక్కడ వైపుల్యాన్ని చెప్పటాన్ని గమనించాలి.
శైలి: నన్నయ్య సంస్కృత పదశైలి శృతి మధురమైన ప్రవాహ గతి.
"ఉన్మిషన్నలినరజస్సుంగధియమునాహ్రద
తుంగతరంగ సంగతానీలశిశిర స్థలాంతర
వినిర్మిత నిర్మల హార్మ్యరేఖలన్ " ( ఆది. 8.232)
"బహువనపాదపాబ్ధి..."
"త్రేతాద్వాపర సంధినిద్ధత..."
"వివిధోత్తుంగ తరంగ ఘట్టన
వంటి వందల పద్యాలనుదాహరించవచ్చు. నన్నయ శైలి పాఠకునికి ప్రవాహానికి వాలుగా ఈదినట్లు సుఖంగా ఉంటుంది. ఆ శబ్దాల పోహళింపు అలాంటిది. ఆనాదధర్మం నన్నయనుండే తెలుగుకవి లోకం ఉపాసించింది.
తెలుగు పదశైలి:
నన్నయ సంస్కృతాన్ని ఇబ్బడిముబ్బడిగా వాడి తెలుగుకు అన్యాయం చేశాడని మాట్లాడే వ్యక్తులు బహుళంగా తారసపడుతుంటారు. ఏ కవి దేన్ని సమాజం మీద రుద్దడు. రుద్దిన దాన్ని సమాజం స్వీకరించదు. ఒకవేళ తప్పనిసరి స్వీకరించిన దాని అవసరం ఉంటేనే సమాజం బ్రతికించుకుంటుంది. సంస్కృతం విషయం కూడా అంతే. గంభీరమైన భావాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు భావాన్ని తీవ్రంగా చెప్పవలసి వచ్చినప్పుడు కవులు అందుకు అనుగుణమైన భాషను కవిత్వంలో ప్రయోగిస్తారు. సంస్కృతం అలాంటి సందర్భాలలో కవులకు బాగా ఉపకరించింది. దాని గురించిన చర్చనలా ఉంచి నన్నయ ప్రయోగించిన తెలుగు విషయాన్ని ముచ్చటించుకుందాం.
"అఱపొఱడు, కుఱుచ చేతులు
నొఱవశరీరంబు గలిగి యొరులకు జూడం
గొఱగాకుకుండియుమన్మధు
నొఱపుల బడియెడునితండు యువతీప్రియుడై"
శరీరము, మన్మధుడా, యువతీప్రియుడా- అనే ఈ మూడుపదాలు తప్ప మిగిలిన పదాలన్నీ తెలుగుపదాలే.
"పగలిదిరేయిదియని మెఱుంగ" (ఆర.1-188)
"వినవెతొల్లి యేలయో యెఱుంగనేను" (ఆర.2-137)
"నావద్దయుండుదేని" (ఆర. 2-131)
"అట్టులజేయుచు" (ఆర. 2-131)
"అతనికొలిచియందుండుము" (ఆర.2-129)
"ఇంకను పదియడుగులరుగుము" (ఆర.2-128)
"దాని విడిచిపోవగానోపకఱచుచు" (ఆర. 2-13)
"నడబెడంగు జూచినగుచువానినెగచి యెగచి యందునెగయకుండగు" (ఆర. 2-12) వంటి తెలుగు వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి. మరి ఇటువంటి వాక్యాలను చూచి అయినా నన్నయ తెలుగును గురించి మాట్లాడాలి కదా!
అది గావున (ఆది.8-114)
పెద్దయుం బ్రొద్దు (ఆది.4-179)
కడజనువోడా (సభ 1-32)( పేరున్న వాడు అనే అర్థంలో)
కడుంబెక్కులు( ఆర. 3-248)
నాడు నాటికిన్ (ఆది.8-183)
పయి బెట్టుకొను (ఆర.2-219) ( పైన వేసుకోవటం)
ఉండానంత (ఆర.2-11)
ఎల్ల ప్రొద్దు (ఆర.1-217)
పేద వడిన (ఆరా.1-215)
సూచి సూచి ( ఆరా. 1-216)
ఎంతయుం బ్రొద్దునకు(1-192 ఆరా)
నిన్న కేయకుండుము ( ఆరా. 1-178)
సెవుడు వడగనోలసి ( ఆరా. 1-180)
వంటి పదబంధాలను గమనించినప్పుడు నన్నయ్య తెలుగు తెలివిడి ఎంతటి మార్గదర్శకమో వివేచించవచ్చు.
వాక్యంలో కాకువు:
సంభాషణకు జీవం పోసేది కాకువు. ఈ కాకువును వ్యవహారికం నుండే రచయిత పిండుకుంటాడు. దానిని ఎంతగా తన రచనలో రచయిత ఒదిగించడానికి శ్రమిస్తాడో ఆ రచనకంత జవజీవాలు సమకూరుతాయి. క్రియాపదం మీద నామపదాల మీద ఎత్వం చేర్చి ఎక్కువగా ఈ కాకువును సృష్టించడం నన్నయలో కనిపిస్తుంది.
"వీరెవరయ్య ద్రుపదమహారాజులే" (ఆది.6-89)
"అన్నలతోనరిగెదయ్య" (సభా.2-288)
"వీనిచేత దలంపబడియెడు వనిత వీనికంతెలెస్సకాకున్నె?" (ఆర.3-136)
"నీవేకళ్ళంజూచితే అక్క?" (ఆది. 2-31)
"దశార్హుండుపూజార్హుడే" (సభా.2-8)
"అచ్యుతునర్చితుజేయ బాడియే"(సభా.7- 274)
" సింహాసనమెక్కనీకుదగునే దర్పించి" (ఆది.7- 274)
"నన్నుచూచిన నగరె" (ఆర. 2-137)
క్రియాపదం మీద ‘అయ్య’ చేర్చి పలికే విలక్షణ స్వరం వలన ‘వీరెవరయ్య’, ‘అన్నలతో అరిగెదయ్య’- చోట్ల కాకువు సిద్ధిస్తోంది. ‘అన్నలతో అరిగెదయ్య’ అన్నది విషాద స్ఫోరకం చేసే కరుణరస విహిత కాకువు.
“వీరెవరయ్య ద్రుపదమహారాజులే" (ఆది.6-90)
వీటిలోని నానుడి,కాకువు సంస్కృతీకరిస్తే రసస్పూర్తి కలుగదు.
“ఆదిపర్వంబది వినగానొప్పు” ( ఆది. 1-35)
“హస్తిపురంబది రాజధానిగా న్” (ఆది.5-6)
వంటి ప్రయోగాలలో ‘అది నిరర్థకమని ‘stylistic’గా వాడబడ్డాయని కల్లూరి నాగభూషణరావు ప్రస్తావించారు కా నీ అది ప్రధాన్య వివక్ష కోసం వాడబడింది. అది సంస్కృతంలో సః, యః వంటివి.
* కొన్ని క్రియలు ఇప్పటి అర్థంలో కాకుండా ప్రయోగించబడ్డాయి.
ఎత్తి: “దుర్యోధనుండు ష్కార్యమెత్తి" (ఆది. 3-12)
త్తి: పూను
ఒడుచు: "లోని సహజవైరి వర్గంబునొడిచినవాడ యొడుచు వెలుపలి యహితతతుల"
(ఆది: 3-206)
ఒడుచు: ఓడించు ఈ అర్థంలో ఇప్పుడు లేదు.
ఉరివి: “వారి రూహనేత్రమదల ప్రేరితమై లజ్జయురివి” (ఆర. 2-42)
ఉరివి : విడుచు
ఈ ధాతువు అసలు ఇప్పుడు వాడుకలో లేదు.
పట్టు: “జలధారావలి నెల్లందత్క్షణంబ పట్టగజేసెన్” ( ఆర. 4-67)
పట్టు : శుష్కించు
వేచు: “నభశ్చరములెల్ల నీ కరుణయ వేచిమండ్తు” ( ఆది. 2-46)
వేచు: కాంక్షించు
అర్థ విపరిణామం:
నన్నయ కొన్ని శబ్దాలను వాటి దాత్వర్ధంలోనే ఉపయోగపయోగించాడు.
అసహ్యం: నిదాఘవాసరములు జీవులకసహ్యములయ్యె (ఆది.8-230)
ఏవగింపు (నేటి అర్థం) భరించరానిదన్న ధాత్వం.
ఉపదేశించు:(మార్గం చూపు)” మంత్రోపదేశం, హితోపదేశం వంటి సందర్భాలలో ఉపదేశమంటే వినిపించే అర్థానికి భిన్నంగా “నాకాహారంబుదేశింపుము”(ఆది. 2-58)
తర్పణం: (తృప్తిని కలిగించుట): భూదేవతర్పణ మహీయః ప్రీతి( ఆది. 1-12)
ఈ వేళ ‘శ్రాద్ధ విధి’- అని అర్థం.
రచించు:(అమర్చు): “స్వయం వరంబు రచించుచున్నవాడు” (ఆది.7.4) రాయటం అన్న అర్థం వేళ
వ్యవసాయం: (పని): “పాపవ్యవసాయముల చేయూలర్ధవంతములగునే”(ఆది.5-176) సేద్యం అని నేటి అర్థం.
ఉత్తరించు: (త్రూ+ ఇంచు): దాటటం: “భాగీరధినుత్తరించి” (ఆది. 7-157) తరువాతి కాలం వేళ వాని కంఠంబు నొస్తరించి వంటి ప్రయోగాలలోను ఖండించి వంటి అర్థాలున్నాయి.
చీరలు: “ఆ ఋషి పుత్రుడు కట్టిన చీరలు” (ఆర.3-104)
నన్నయ్య వచనం:
“అని కద్రువ వినతను జూచి” “చూడవె యల్లయతిధళాంబైన యశ్వంబునందు సంపూర్ణ చంద్రునందు నల్లయుంబోలె వాల ప్రదేశంబునందు నల్లనైయున్నయది"- యనిన వినివినతనగి "నీవేకన్నులం జూచితే యక్క! యెక్కడిదినల్ల, యూనశ్వరాజుమూర్తి మహాపురుషుకీరియుంబోలెనతి నిర్మలంబై యొప్పుచున్నయది" యనినవిని నవ్వి వినతకు గద్రువ యిట్లనియె.” (ఆది.2-31)
ప్రసన్నమధురంగా అలతి అలతి వాక్యాలతో సంభాషణాత్మక శైలిలో సాగే వచనమిది. ఇందులోని వాక్యవిన్యాసాన్ని గమనిస్తే తెలుగు వాక్యపుసొగసు తెలుస్తుంది. ఎక్కువ క్త్వార్థకక్రియలతో సాగిన ఈ వచనం దీర్ఘవాక్యంలా అనిపింపజేస్తుంది.
ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణమూర్తి, భద్రిరాజు. (సం.) తెలుగు భాషాచరిత్ర. ప్రథమముద్రణ, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, 1974.
- పురుషొత్తం, బొడ్డుపల్లి. తెలుగు వ్యాకరణవికాసము. ప్రథమముద్రణ, శ్రీగిరి ప్రచురణలు, గుంటూరు, 1969.
- బ్రహ్మానంద, హెచ్.ఎస్. తెలుగు సాహితి నన్నయ వొరవడి. అక్షరప్రసార ప్రచురణలు, అనంతపురం, 1988
- రామకృష్ణారావు, అబ్బూరి. దివాకర్లవేంకటావధాని, (సం). నన్నయ పదప్రయోగకోశము. ప్రథమముద్రణ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబద్, 1960.
- వేంకటావధాని, దివాకర్ల. ఆంధ్రవాఙ్మయారంభదశ. ప్రథమముద్రణ, అమరావతి ప్రెస్, హైదరాబాద్, 1960.
- సోమయాజి, గంటిజోగి. ఆంధ్రభాషావికాసము. ప్రథమముద్రణ, త్రివేణి ప్రచురణలు, 1947.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.