AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. శ్రీనాథుని కృతులు: పదపూర్వార్ధవక్రత
వేముల శరణ్య
తెలుగు పరిశోధకురాలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
తెలుగు అధ్యాపకురాలు, తె. సాం. సం. గురు. మహిళా డిగ్రీ కళాశాల,
జగిత్యాల, తెలంగాణ.
సెల్: +91 9493613830, Email: vemulasharanya11@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని కవిత మార్గం అనితర సాధ్యం చిర స్మరణీయం మధుర మధు సంభరితం. ఎంతోమంది విమర్శకులు శ్రీనాథుని కవితా చర్చ చేశారు తమవైన అభిప్రాయాలను వెల్లడి చేశారు శబ్దార్థ సౌష్టవంతో కూడిన అతని రచన వక్రోక్తి మార్గాన్ని అనుసరించిందని కుందూరు ఈశ్వర దత్తు, కొర్లపాటి శ్రీరామమూర్తి మొదలైన విమర్శకుల అభిప్రాయానికి అంగీకారంగా కుంతకుని వక్రోక్తి సిద్ధాంత లక్షణాలకు అనుగుణంగా శ్రీనాధుని పద్యాలను సమన్వయం చేస్తూ కుంతకుడు చెప్పిన ఆరు రకాల వక్రతల్లో రెండవది అయిన పదపూర్వార్ధ వక్రత నిరూపించే ప్రయత్నం ఈ పత్ర ఉదేశ్యం.
Keywords: శ్రీనాథుని కవిత్వం, కుంతకుని వక్రోక్తి,పదవక్రత భేదాలు,లక్షణలక్ష్య సమన్వయం.
1. ఉపోద్ఘాతం:
శ్రీనాథుడు వక్రత మార్గం అనుసరించాడు అని చెప్పిన వారిలో కుందూరి ఈశ్వరదత్తు ఉన్నాడు. శ్రీనాథుని కవిత తత్త్వం మీద పరిశోధన చేసిన కుందూరి ఈశ్వరదత్తు శ్రీనాథుడు అనుసరించిన మార్గం విచిత్ర మార్గం అని తెలిపి విచిత్ర మార్గం అంటే ఏమిటో వివరిస్తూ -
"విచిత్ర మార్గము 1. ప్రతిభాజాతశబ్దార్ధ చమత్కారము, 2. అలంకార సహితము, 3. ఉక్తి వైచిత్ర్యము 4. ప్రతీయమాన అర్థచమత్కారము, 5. వక్రోక్తి నిబంధనము"1 అని తెలిపాడు.
కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీనాథుని మీద ప్రసిద్ధమైనపరిశోధన చేసి చారిత్రిక ఆధారాలను చూపెట్టి శ్రీనాథుని కవితా మార్గం గూర్చి ప్రస్తావిస్తూ-"భరతముని ప్రోక్తమైన రసము కుంతకుని ప్రతిపాదితమైన వక్రోక్తి శైలీ పరిణతమైన ప్రౌఢిమ సత్కావ్య లక్షణములని శ్రీనాథుని సిద్ధాంతము. ఈ మూడును తన కవితా రీతులని శ్రీనాథుని ఋజుముఖ ప్రకటనము."2 అంటూ వక్రోక్తి మార్గంగా సూచించాడు. వీరి అభిప్రాయాల దృష్ట్యా, “హరచూడా హరిణా౦క వక్రత” పద్యంలో చెప్పిన వక్రత పద ఆధారంగా శ్రీనాథుని కృతులు: పద పూర్వార్ధ వక్రత శీర్షికన పదవక్రతను శ్రీనాథుని రచనల్లో చూపదలిచాను.
2. కుంతకుడు – పదవక్రత:
కుంతకుడు ప్రధానంగా ఆరు వక్రతలను తెలిపాడు 1. వర్ణవిన్యాసవక్రత 2. పదపూర్వార్థవక్రత 3. పదపదార్ధవక్రత 4. వాక్యవక్రత 5. ప్రకరణ వక్రత 6. ప్రబంధవక్రత.
కుంతకుడు వర్ణవిన్యాస వక్రత తెలిపిన తర్వాత పదవక్రతలను, వాటి అంతర్భేదాలను తెలియజేశాడు. మొదటగా పదం అనే అర్థాన్ని వివరించాల్సి ఉంది. వ్యాకరణపరంగా పదం అంటే “సుప్తిఙన్తం పదమ్’ ‘సుబన్తం తిఙన్తఞ్చ పదసంజ్ఙంస్యాత్’ సుబన్తమునకును తిఙన్తమునకును పదమని పేరు. ‘రామ’ మొదలగు ప్రాతిపదికల యన్తమున చేర్చబడు విభక్తి ప్రత్యయములు ‘సుప్’ ప్రత్యయములు. కావున ‘రామః’ ‘రామం’ మొదలగునవి సుబన్తములు. ‘భూ’ మొదలగు ధాతువుల యన్తమున చేర్పబడు ‘తి’ మొదలగు ప్రత్యయములు ‘తిఙ్’ ప్రత్యయములు. కావున ‘భవతి’ మొదలగునవి తిఙన్తములు. ఇట్టి సుబన్త తిఙన్తములకు పదములని పేరు”3.
సుబంతముల పూర్వర్థంలో ప్రాతిపదిస ఉంటుంది. తిఙంతపదాల పూర్వార్థాల్లో ధాతువు ఉంటుంది. సుబంతాలు నామవాచకాలను తెలిపితే, తిఙంతాలు క్రియలను తెలుపుతాయి. ఇలా పదాలు సుబంతాలు, తిఙంతాలు అని రెండు రకాలుంటాయి. పదంలో ప్రకృతి–ప్రత్యయం అనే భాగాలుంటాయి. ప్రకృతి భాగాన్ని పదపూర్వార్థమని, ప్రత్యయభాగాన్ని పదపరార్థం అని అంటారు. సుబంతానికి ప్రకృతి అయిన దాన్ని ‘ప్రాతిపదిక’ అంటారు. తిఙంతానికి ప్రకృతి అయిన దాన్ని ధాతువు అంటారు. పదం పూర్వంలో అంటే ప్రకృతిలో (ప్రత్యయం కాకుండా కేవల పదాల్లో) జరిగే వక్రతను పదపూర్వార్థవక్రత అని అంటారు. అందులో కుంతకుడు మళ్ళీ అంతర్భేదాలను తెలిపాడు.
3. పదపూర్వార్థవక్రత-భేదాలు:
పదపూర్వార్థవక్రత పది రకాలు. అవి 1) రూఢి వైచిత్రయవక్రత, 2) పర్యాయవక్రత, 3) ఉపచారవక్రత, 4) విశేషణ వక్రత, 5) సంవృతి వక్రత, 6) పదమధ్యాంతర్భూత ప్రత్యయ వక్రత, 7) వృత్తి వైచిత్ర్య వక్రత, 8) భావవైచిత్ర్య వక్రత, 9) లింగవైచిత్ర్య వక్రత 10) క్రియావైచిత్ర్య వక్రత.
3.1 రూఢి వైచిత్ర్య వక్రత:
కా॥ యత్ర రూఢేరసంభావ్యధర్మాధ్యారోపగర్భతా,
సర్ధర్మాతి శయారోపగర్భత్వం వావ్రతీయతే.
కా॥ లోకోత్తరతిరస్కార శ్లాఘ్యోత్కర్షాభిధిత్సయా,
వాచ్యస్య సోచ్యతే కాపిరూఢివైచిత్ర్య వక్రతా. (వ.జీ.ఉన్మే.ద్వి.కా. 8, 9)
“వాచ్యమగు అర్థమునకు, లోకోత్తరమగు తిరస్కారమును గాని, శ్లాఘ్యమగు ఉత్కర్షను గాని చెప్పవలెననెడు ఇచ్ఛచే, ఎచట రూఢ శబ్దము అసంభావ్యమగు ధర్మము యొక్క అధ్యారోపము గర్భమునందున్నట్లుగ గాని, వాస్తవముననున్న ధర్మముయొక్క అతిశయము యొక్క ఆరోపము గర్భమునందున్నట్లుగ గాని, ప్రతీతమగునో అది (అట్టి ప్రతీతి). ఒకానొక అపూర్వమగు రూఢివైచిత్రయ వక్రతయని చెప్పబడుచున్నది”4 (శ్రీరామచంద్రుడు, పుల్లెల. వక్రోక్తి జీవితం. 2007. పుట.178).
రూఢి రూఢములైన పదాల వలన వైచిత్ర్యం కలిగితే రూఢివైచిత్ర్యం అలాగే వాచ్యార్థము వల్ల ఉత్కర్ష, అపకర్ష ఏదైనా కలిగినా కూడా అది రూఢి వైచిత్ర్య వక్రతగా కుంతకుడు తెలిపాడు. ఉత్కర్ష వివక్షాకృతమైన రూఢివైచిత్ర్యానికి ఉదాహరణ.
ఉదాహరణ:
తే. ఏ భయంబును నెచ్చోట నెన యలేదు
నరున కెప్పాట విద్యాధనంబ ధనము
చోర బాధాదికములచేఁ జూఱవోవు
ధనము ధనమౌనె యెన్ని చందములఁ దలఁప. (కాశీ. 4-112)
కాశీఖండంలో గుణ నిధి బాధపడుతున్న సందర్భంలోనిది ఈ పద్యం.ఎక్కడ ఏ భయం లేకుండా ఉండే ధనమే గొప్పధ నం అని దొంగల చేత దోచుకోబడేది,పోయేది ధనమవుతుందా? కాదంటూ విద్యా ధనమే నిజమైన ధనము అని చెప్పడం ఈ పద్య భావం. ఇక్కడ విద్యాధనంబ ధనము, ధనము ధనమౌనే అనే పదప్రయోగాల్లో మొదట చెప్పిన ధనం అనే పదం కన్నా రెండవ పదంగా చెప్పిన పదానికి ఉత్కర్ష ఉంది. తాత్పర్య భేదం కనిపిస్తుంది. రూఢి వైచిత్ర్య వక్రతకు ఉదాహరణగా చెప్పవచ్చు.
3.2 పర్యాయవక్రత:
రూఢి వైచిత్ర్య వక్రత తర్వాత పర్యాయ వక్రత భేదాన్ని ఇలా తెలిపాడు.
కా॥ అభిధేయాన్తరతమస్తస్యాతిశయ పోషకః౹
రమ్యచ్ఛాయాన్తరస్పర్శాత్తదలఙ్కర్తుమీశ్వరః॥
కా॥ స్వయం విశేషణేనాపి స్వచ్ఛాయోత్కర్షపేశలః౹
అసమ్భావ్యార్థపాత్రత్వ గర్భం యశ్చాభిధీయతే॥
కా॥ అలఙ్కారోపసంస్కార మనోహారినిబన్ధనః౹
పర్యాయస్తేన వైచిత్ర్యం పరాపర్యాయవక్రతా॥ (వ.జీ.ద్వి.ఉన్మే.కా.10-12)
సమానమైన అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలంటారు. ఒక్కొక్క శబ్దానికి చాలా పర్యాపదాలుంటాయి. కవి తన రచనలో సౌందర్యాన్ని పోషించడానికి సందర్భానుసారమైన పర్యాయ పదాలను, కావ్య శోభాహేతుకమైన వాటిని కూర్చుతాడు దానినే కుంతకుడు పర్యాయ వక్రతగా చెప్తున్నాడు. కేవలం పర్యాయాలను వాడటం కాకుండా సందర్భానికి తగిన రీతిగా పర్యాయాలను వాడటంలోనే విశేషం ఉంది. కొన్ని సందర్భాల్లో అర్థ ద్వయం ఉన్నప్పుడు ప్రకృతానికి సరిపోయే పదాన్ని తీసుకోవాలి. సంయోగము మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి.
ఉదాహరణ:
శా. ఆనందంబున నర్ధరాత్రమునఁ జంద్రాలోకముల్ కాయఁగా
నానా సైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభుఁ గా
శ్రీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు
న్మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలోన్ (భీమ. 2-91)
అగస్త్యుడు కాశిని తలచుకొని తన్మయత్వం చెందే సందర్భంగా రాసిన ఈ పద్యం నిజంగా చందమామ వెన్నెలను తలపిస్తున్నదా అన్నట్లే మనోహరమైన పర్యాయ పదాలతో అల్లినది. ఆనందంగా అర్థరాత్రి సమయంలో వెన్నల కాస్తుండగా ఆ చంద్రశేఖరుని కొ లిచేవాడిని అంటూ తరునేందు శేఖరునిన్, శంభున్, శివున్, శ్రీ కంఠునిన్ అంటూ కవి వర్ణించిన తీరు మనోజ్ఞమైంది. శిరస్సునందు, చంద్రుడు, గంగానది ఇసుక తిన్నలపై వెన్నలలు కాయటం దగ్గరి సంబంధాన్ని కలిగిన ఉన్న పర్యాయాలను కవి సందర్భానుసారంగా వాడాడు. సిగదండగాం గల శివుడు చల్లని గాయిని గొల్పుతున్నాడనే కవి హృదయం ఇది. సరైన పర్యాయలను వాడటం కూడా సౌందర్యమే. ఇది పర్యాయ వక్రత.
3.3 ఉపచారవక్రత:
ఉపచార వక్రతను వివరిస్తూ ఈ కారికలను తెలిపాడు.
కా॥ యత్ర దూరాన్తరే౽న్యస్మాత్సామాన్యముపచర్యతే౹
లేశేనాపి భవత్కాంచిద్వక్తుముద్రిక్త వృత్తితామ్॥
కా॥ యన్మూలా సరసోల్లేఖారూపకాదిరలంకృతిః౹
ఉపచార ప్రధానాసౌ వక్రతాకాచిదుచ్యతే॥ (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 13,14)
అత్యంతము విభిన్నములైన పదార్థముల సాదృశ్యాతిశయము కారణంగా భేద ప్రతీతిని కప్పిపుచ్చి అభేద ప్రతీతిని కల్పించుట ఉపచారము. అమూర్థ పదార్థములందు మూర్తపాదర్థఛర్మారోపము. ఘనపదార్థములందు ద్రవపదార్థ ధర్మారోపము, అచేతనములకు చేతన ధర్మారోపము ఉపచారము.
ఉదాహరణ:
శా. పంచారామవిలాసినీధవళదృక్పాఠీన జాలాయమా
నాంచత్కోమలనిర్నిబంధన మనోజ్ఞాకార రేఖా (కళా)
పంచాస్త్రుండగు నా కుమారుఁడురుదర్పస్ఫూర్తి నవ్వీటిలో
సంచారం బొనరించెం గాంచనమహాసౌధాగ్రభాగంబులన్. (శివ. 2-85)
సుకుమారుని సౌందర్య వర్ణన ఇది. పంచారామంలోని స్త్రీల సౌందర్య చూపులనెడి కొర్రచేపలకు, సుకుమారుని, మృదువైన, మనోహరమైన సౌందర్యానికి వల అవుతున్నదని భావం. స్త్రీల చూపులు అనేవి అమూర్థం కనిపించదు. తాకలేదు. కాని సుకుమారుడు వల అవటం అనేది మూర్థ భావన. చూపులకి వలకి సంబంధాన్ని చెప్పటం సుకుమారుని సౌందర్యం అనే అనే అమూర్థాన్ని వల అంటూ భౌతికంగా తాకే వస్తువుగా చెప్పటం పద్యంలోని రమణీయత. ఇది ఉపచారవైచిత్ర్య వక్రత.
3.4 విశేషణవక్రత:
కుంతకుడు విశేషణ వక్రతను ఇలా వివరించాడు.
కా॥ విశేషణస్య మహాత్మ్యాత్ క్రియాయాః కారకన్య వా౹
యత్రోల్లసతి లావణ్యం సా విశేషణవక్రతా॥ (వ.జీ.ద్వి.ఉన్మే.కా.15)
విశేషణం చేత క్రియకు గానీ, కారకానికి గానీ సౌందర్యం చేకూరుతుందో అది విశేషణ వక్రత. ఉదాహరణగా సంస్కృత శ్లోకాన్నిచ్చి వివరించబడింది.
ఉదాహరణ:
తే. వేదశాఖా విభాగ సంవేది యతఁడు
లలిత బిల్వ త్రిశాఖా పలాశ సమితి
సంగమేశ ఘటోద్భవ శంకరులకు
నర్చనము సేయుఁబ్రణవ పంచాక్షరముల. (భీమ. 2-71)
వ్యాస మహర్షి గొప్పదనాన్ని పొగుడుతూ “వేదశాఖా విభాగ సంవేది యతడు” అంటూ వేదాలను శాఖలుగా విభజించటంలో జ్ఞాని అని, సంగమేశ్వర, అగస్త్యేశ్వరులను , త్రిబిల్వంతో ప్రణవ పంచాక్షీరితో పూజి స్తాడని చెప్పటం హృదయంగమముగా ఉంది.ఈ విశేషణం వ్యాసుని ఉన్నతునిగా చేసింది. విశేషణం చేత రమణీయత చేకూరింది కనుక విశేషణ వక్రత.
3.5 సంవృతి వక్రత:
కుంతకుడు సంవృతి వక్రతను ఇలా వివరించాడు.
కా॥ యత్ర సంవ్రియతే వస్తు వైచిత్రస్య వివక్షయా
సర్వనామాదిభిః కైశ్చిత్ సోక్తా సంవృతి వక్రతా (వ.జీ.ద్వి.ఉన్మే.కా.16)
కవి సౌందర్యాన్ని ఉద్దీపింపజేయాలని ఎక్కడైతే సర్వనామాది పదాలతో వర్ణించదగిన వస్తువును కప్పిపుచ్చడం జరుగుతుందో అది సంవృతి వక్రత. సంవృతి అంటే కప్పి పుచ్చడం అని అర్థం. దీనికి ఉదాహరణగా కుమారసంభవంలోని అష్టమసర్గలోని శ్లోకం ఉదాహరణగా ఇచ్చాడు కుంతకుడు.
ఉదాహరణ:
ఆ. డాయఁబోయి యప్పుడాయమ్మ యెవ్వరో
యేకులంబు నదియొ యెఱుఁగకయును
నేజోహారు నిడితి హృదయంబనేరుచు
నెదురు ప్రాభవంబు నేర్పరింప. (భీమ. 2-112)
వ్యాసుడు కాశిని శపించే సందర్భంలో ఇలాచెప్పుతూ ఆ ఇల్లాలు ఎవరో ఏ కులమో తెలియకనే సమీపించాను. ఎదుటి వాళ్ళ గొప్పదనం తెలుసుకోవడానికి మనస్సేసరి అయినది. ఆమె ఎవరో అనే సర్వనామాన్ని తెలుపుతూ వచ్చిన వారిని కప్పి పుచ్చడం సంవృతి. ఎవ్వరో అనటంలో ఆపదలో ఆదుకున్నది. ఏ పూణ్యాత్మురాలో అనే విషయాన్ని ఈ సర్వనామం తెలుపుతుంది. ఇది సంవృతి వక్రత.
3.6 పదమధ్యాతంర్భూతప్రత్యయవక్రత:
సంవృతివక్రత తర్వాత పదం మధ్యలో వచ్చే కృతద్ధితాది ప్రత్యయాలు వస్తే పదమధ్యాంతర్భూత ప్రత్యయ వక్రతగా చెప్పాడు కుంతకుడు.
కా॥ ప్రస్తుతౌచిత్య విచ్ఛిత్తిం స్వమహిమ్నావికాసయన,
ప్రత్యయః పదమధ్యే౽ న్యాముల్లాసయతి వక్రతామ్.
కా॥ ఆగమాదిపరిస్పన్దసున్దరః శబ్ద వక్రతామ్
పరః కామపి పుష్ణాతి బన్ధచ్ఛాయా విధాయినీమ్ (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 17, 18)
పదమధ్యంలో ప్రత్యయం వస్తే ప్రస్తుతార్థానికి శోభ కలగటం ఒక రకమైన వక్రతకాగా, ఇదే వక్రతలో భాగంగా పదం మధ్యలో ముగాగమాది కృదాది ప్రత్యయాలు, వర్తమాన కాలాన్ని బోధించే శతృ ప్రత్యయాలు కూడా కావ్య సౌందర్యానికి దోహదం అవుతాయని తెలిపాడు. దీనికి ఉదాహరణగా “స్నిహ్యత్కటాక్షే దృశౌ” అనే వాక్యాన్ని వివరిస్తూ ‘నేత్రములు స్నేహపూర్ణములగుచున్న కటాక్షములు కలవి అని శ్రీరామచంద్రుడు వ్యాఖ్యానించాడు. అగుచున్న అనేది వర్తమాన కాలాన్ని బోధించే ‘శతృ’ ప్రత్యయం కనిపిస్తుంది. ఇలా ప్రత్యయాల ద్వారా పదం మధ్యలో సౌందర్యం చేకూరిచే అది వక్రతగా భావించాలని తెలియజేశాడు కుంతకుడు.
ఉదాహరణ:
శా. ఆటోపారభటి న్మునీశ్వరుఁడు తన్నందంద వర్ణింపఁ
చ్చాటు ప్రౌఢికిఁ జేసె ధూర్జటి మహాశ్లాఘాశిరఃకంపమున్
జూటీకూట విటంకకోటి విలుఠత్ స్రోతస్వినీవీచికా
కోటీధాటి రటత్కరోటి కుహర క్రోడావకాశంబుగాన్ (కాశీ. 4-253)
ఆరభటి వృత్తితో, ఆటోపంతో తోటక వృత్తాలు చదువుతూ బృహస్పతి మాటిమాటికి శివున్ని స్తుతిస్తూ ఉంటే ఆస్తుతికి శ్లాఘాపుర్వక కంపముచేసాడు. అప్పుడుజటాజూటాశిఖరములోని పొరలి పడుతున్నదైన గంగానది కెరటాల పరంపలు రవళించి బ్రహ్మ కపాల రంధ్రంలో నుండి మార్మోగాయి అని వర్ణించాడు కవి. 'విటంక కోటి విలుఠత్' అనే పదం, ధాటీరఠత్, అనే శతృ ప్రత్యయాలు పద్యానికి సౌందర్యాన్నిచేకూర్చాయి. నిజంగా గంగా నదీ ప్రవాహ రవళిని ఆలకిస్తున్నాయా? అన్నట్లు ఈ పదాలు వాడడం వలన అనిపించింది.
3.7 వృత్తివైచిత్ర్య వక్రత:
వృత్తివైచిత్ర్య వక్రతను ఇలా నిర్వచించాడు.
కా॥ అవ్యయీభావ ముఖ్యానాం వృత్తీనాం రమణీయ తా
యత్రోల్లసతి సాజ్ఞేయా వృత్తివైచిత్ర్య వక్రతా (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 19)
అవ్యయీభావం వలన రామణీయకత ఏర్పడితే అది వృత్తివైచిత్ర్య వక్రతగా చెప్పాడు. ఒక శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చి అందులో “అధిమధులతానాం నవరసః” అని ఉండగా అందులో ‘అధిమధు’ అనే అవ్యయీభావసమాసం వలన శ్లోకానికి సౌందర్యం ఏర్పడిందని అర్థవంతంగా ఉన్నదని వివరించాడు.
ఉదాహరణ:
శా. తల్లీ! యిన్నిదినాలకేనియు సుధాధారా రసస్యందియై
యుల్లంబున్ సుఖియింపఁజేయు పలుకెట్లో వింటి నివ్వీటిలోఁ
బెల్లాకొన్న కతాన నేనొకఁడనే భిక్షానకున్ వత్తునో
యెల్లన్ శిష్యులఁగొంచు వత్తునొ నిజంబేర్పాటుగా జెప్పుమా. (భీమ 2-120)
వ్యాసుడు అమ్మా! ఇన్ని దినాలకైన ఈ పట్టణంలో అమృత తుల్యమై మనసుకు సంతోషం కలిగే మాట విన్నాను. భిక్షకు ఒక్కడినే రావాలా? ఎల్ల శిష్యులను తీసుకొని రావాలా? అని ప్రశ్నించే సందర్భంగా "యిన్నిదినాలకేనియు "అనే సముచ్చయార్థక పదం అవ్యయం. ఈ అవ్యయాన్ని వాడటం బట్టి ఎన్నోరోజుల నుండి వేచి చూస్తున్న హృదయ ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు అయ్యింది. దీనివల్ల పద్యానికి సొబగు చేకూరింది. ఇది వృత్తి వైచిత్ర్యం.
3.8 భావవైచిత్ర్య వక్రత:
భావవైచిత్రయ వక్రతను నిర్వచిస్తూ ఇలా చెప్పాడు.
కా॥ సాధ్యతామప్యనాదృత్య సిద్ధత్వేనాభిధీయతే,
యత్ర భావో భవత్యేషా భావవైచిత్ర్య వక్రతా (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 20)
ఎక్కడైతే భావం సాధ్యరూపంలో ఉన్న సిద్ధరూపంలో చెప్పబడుతుందో అది భావవైచిత్ర్య వక్రత. అనిష్పన్నమైన భావమును నిష్పన్నమైనట్లు చెప్పడం అంటే క్రియలు జరగకముందే జరిగినట్లు వర్ణించటం కూడా భావవైచిత్ర్య వక్రతగా కుంతకుడు భావించాడు.
ఉదాహరణ:
చ. ఇతడు దరిద్రుఁ డౌ ననుచు నేర్పడ నర్థి లలాటపట్టికన్
శతధృతి వ్రాసినట్టి లిపి జాల మనర్థము గాని యట్లుగా
వితరణ ఖేలనా విభవ విభ్రమ నిర్జిత కల్పభూరుహుం
డతఁడు దరిద్రతాగుణమునందు దరిద్రునిఁ జేయునాతనిన్. (శృం.నై.1-57)
నలుని గొప్పతనాన్ని కవి వర్ణిస్తూ దాత అయిన రాజుయాచకుల నొసటన బ్రహ్మరాసిన పేదరికం. లిపిని ధనమిచ్చి అబద్దం చేసి చూపాడని నుతించాడు. అలాగే పేదరికంలోనే పేద వారిగా చేసాడంటూ ' 'దరిద్రతాగుణమునందు దరిద్రుని జేయు " కవి గొప్పవర్ణన. ఇక్కడ బ్రహ్మ రాసిన లిపిని ఎవరు తప్పించలేరు. అది సహజం కానీ దానిని కూడా తప్పించగలడని చెప్పడం సాధ్యం. అసాధ్యం సుసాధ్యం అయ్యింది కనుక భావ వైచిత్ర్యం.
3.9 లింగవైచిత్ర్య వక్రత:
లింగవైచిత్ర్య వక్రతను వివరిస్తూ ఇలా చెప్పాడు.
కా॥ భిన్నయోర్లింగయోర్యస్యాం సామానాధికరణ్యతః౹
కాపి శోభాభ్యుదేత్యేషా, లిఙ్గవైచిత్ర్య వక్రతా॥ (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 21)
కా॥ సతి లిఙ్గాన్తరే యత్ర స్త్రీ లిఙ్గంచ ప్రయుజ్యతే
శోభానిష్పత్తయే యస్మాన్నామైవ స్త్రీతి పేశలమ్ (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 22)
ఎక్కడైతే రెండు భిన్న లింగాలకు సమానాధికరణం ఉంటుందో అక్కడ గొప్పనైన శోభ ఏర్పడితే అది లింగవైచిత్ర్యం అని చెప్పాడు. అలాగే ఎక్కడైతే ఇతర లింగ పదాలున్నప్పటికి శోభను కూర్చడానికి స్త్రీలింగాన్ని వాడుతారో అక్కడ కూడా లింగవైచిత్ర్యం ఉన్నట్లే అని తెలిపాడు.
ఉదాహరణ:
తే. మీతలం పే నెఱుంగుదు, మిన్నకుండుఁ
డంబుజాననలార, యాయాస ముడిగి;
యే ననాది సంచారిణి యైన యాత్మ
హేతు పంక్తికి విధికి నధీన బుద్ధి. (శృ.నై. 3-137)
దమమంతి తన చెలులతో చెప్తూ మీ ఆలోచన నాకు తెలుసు ఊరుకోండి. అనాది నుండి ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాను. ఆకర్మ నన్ను అనుసరిస్తుంది. ఆ పరంపర అనాది నుండి తెంపు లేక ప్రవహిస్తుంది. ఆ క్రమానికి నేను వశమయ్యాను నలున్నే నా బుద్ధి వరించేలా చేస్తుంది. పంక్తి అనే శబ్దం ఇక్కడ స్త్రీలింగం మరియు అమహత్తు రెండు కానీ దీనికి సంచారిణీ అనే మహాతీ వాచకాన్ని విశేషంగా వాడారు. సౌకుమార్యం కోసం స్త్రీ లింగ వాచకాన్ని వాడటం కూడా వక్రతే కనుక అది ఈ పద్యంలో కనిపిస్తుంది.
3.10 క్రియావైచిత్ర్య వక్రత:
కుంతకుడు సుబంత తిఙ్గంతాలలో ప్రాతిపదిక రూపంలో ఉన్న వక్రతను చెప్పిన తర్వాత ధాతురూప పదాల్లో పూర్వభాగంలో వక్రత ఎలా సంభవిస్తుందోనని తెలుపుతూ ధాతురూపం అంటే క్రియనే కాబట్టి క్రియావైచిత్ర్య వక్రత ఎన్ని రూపాలుగా జరుగుతుందనే విషయాన్ని వివరించాడు.
కా॥ కర్తురత్యన్తరంగత్వం కర్త్రన్తర విచిత్రతా౹
స్వవిశేషణవైచిత్ర్యముపచార మనోజ్ఞతా॥
కా॥ కర్మాది సంవృతి పంచప్రస్తుతౌచిత్యచారవః౹
క్రియావైచిత్ర్య వక్రత్వప్రకారాస్త ఇమేస్మృతాః॥ (వ.జీ.ద్వి.ఉన్మే.కా. 24, 25)
క్రియావైచిత్ర్య వక్రత అనేది ఐదు రకాలుగా ఉంటుంది. 1) కర్తురత్యంతరంగత్వం కర్తకు దగ్గరగా ఉండే క్రియ. 2)కర్త్రన్తరవిచిత్రత = కర్తకు మాత్రమే సాధ్యమయ్యే క్రియను తెలపటం. 3) సవిశేషణవైచిత్ర్యం = విశేషణతో కూడిన క్రియ 4) ఉపచార మనోజ్ఞత = ధర్మాంతరం ఆరోపించే క్రియ. 5) కర్మాది సంవృతి= కర్మాదికాన్ని కప్పివేసే క్రియ.
ఉదాహరణ:
తే. ఇష్టమానస మయిన యా హేమఖగము
నలునిమానస మానంద జలధియందుఁ
గర్ణ శష్కులి కలశంబుఁ గౌఁగిలించి
నా యీఁదఁ జేయుచు మృదుభాష నిట్టు లనియె. (శృం.నై. 2-7)
ప్రియమైనట్టి మానస సరస్సు కల ఆ బంగారు పక్షి నలుని మానసం అనే జలధిలో చక్కిలంలాంటి చెవియనే కలశాన్ని కౌగలించుకొని ఈ దుతున్నది. ఈదిన కొలది ఈత సముద్రంలో తనివి అను భూతమయినట్లు విన్నా కొద్ది అధిక ఆనందం పొందే విధంగా, తన మానసానికి ఆనందం కలిగించే నలుని మానసానికి మహదానందాన్ని కావించింది హంస. మానసం అనే అమూ ర్థమైన జలధిలో హంస ఈదటం అనే మూర్థ క్రియను చెప్పటం కనిపిస్తుంది. క్రియలో ఈ వక్రత ఉన్నందున ఉపచార మనోజ్ఞత. కావున ఇది క్రియావైచిత్ర్య వక్రతలో భాగం.
4. ముగింపు:
- శ్రీనాథుని పద్యాల్లో కుంతకుని వక్రోక్తి సిద్దాంత లక్షణాలకు అనుగుణంగా లక్ష్యాలను చూపడం జరిగింది.
- విమర్శకుల అభిప్రాయానుసారంగా అలాగే ప్రస్తుతం చూపెట్టిన ప్రయోగాల ఆధారంగా కవి రచనల్లో వక్రోక్తి ఉందని చెప్పవచ్చు.
- శ్రీనాథుని కవితా ప్రస్థానం వక్రోక్తిగా చెప్పడానికి గల కారణం కుంతకుడు చెప్పిన పదపూర్వార్ద వక్రతలోని అన్నిటికి పద్య ప్రయోగాలు లభించాయి.
- వీటి ఆధారంగా వక్రోక్తి అతని మార్గం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
5. పాదసూచికలు:
- ఈశ్వర దత్తు. కుందూరి. శ్రీనాథుని కవితా తత్త్వం.పుట. 157.
- శ్రీ రామమూర్తి, కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర పుట 123.
- శ్రీరామచంద్రుడు, పుల్లెల. లఘు సిద్దాన్త కౌముదీ.పుట.13.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఈశ్వరదత్తు, కుందూరి. (1964). శ్రీనాథుని కవితాతత్త్వం, ఆంధ్రసారస్వతపరిషత్, హైదరాబాద్.
- మృత్యుంజయరావు, జొన్నలగడ్డ. (2000). కవి సార్వభౌమ విరచిత శ్రీ శివరాత్రి మహాత్మ్యం (వ్యాఖ్యానం), తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్.
- లక్ష్మీనారాయణ, గుండవరపు. (1997). శ్రీనాథ మహా కవి విరచిత శ్రీ భీమేశ్వర పురాణం (వ్యాఖ్యానం), ఫాలాక్ష ప్రచురణ, గుంటూరు.
- వెంకటరాయశాస్త్రి, వేదం. (2012). శ్రీనాథ మహాకవి కృత శృంగార నైషధం( సర్వంకష వ్యాఖ్య), ఎమెస్కో, హైదరాబాద్.
- శరభేశ్వర శర్మ, మల్లంపల్లి. (1992), శ్రీనాథ విరచిత శ్రీ కాశీఖండం (వ్యాఖ్యానం). తెలుగు విశ్వ విద్యాలయం. హైదరాబాద్.
- శ్రీరామచంద్రుడు, పుల్లెల. (1998)లఘు సిద్ధాంత కౌముధి. బాలానందిని వ్యాఖ్య. సంస్కృత భాష ప్రచార సమితి, హైదరాబాద్.
- శ్రీరామచంద్రుడు, పుల్లెల (2007). వక్రోక్తి జీవితం (బాలానందిని వ్యాఖ్యానం), సాహిత్య అకాడెమి, న్యూఢిల్లీ.
- శ్రీరామమూర్తి, కొర్లపాటి. (1992). తెలుగు సాహిత్య చరిత్ర. రమణశ్రీ ప్రచురణలు, విశాఖపట్టణం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.