AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. భారతీయమహిళాభ్యున్నతి: ‘మార్గరెట్ గ్రెట్టా ఎలిజబెత్ గిల్లెస్పీ’ మౌలికకృషి
డా. జి. తిరుమల వాసుదేవరావు
ఉపన్యాసకుడు & చరిత్రశాఖ అధ్యక్షుడు,
ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల,
నగరి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
నాగరికత పరిణామక్రమంలో మానవులకు అందుబాటులోకి వచ్చిన మడకతో వ్యవసాయం, గుర్రపు స్వారీ మొదలైన అంశాలు మానవసమాజంలో పురుషుల స్థాయిని ఉన్నతీకరించాయి. అనేక ఆర్థిక, సామాజిక కారణాల వలన విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరమైన మహిళలు అన్ని రంగాలలోనూ వెనకబడి ద్వితీయశ్రేణిపౌరులుగా మార్చబడ్డారు. భూస్వామ్య, పితృస్వామ్యభావజాలంతో ప్రభావితమైన గ్రామీణసామాజికనిర్మితి భారతీయమహిళల స్థాయిని మరింతగా దిగజార్చి సామాజికవికలాంగులుగా మార్చింది. భారతీయ సామాజిక సంస్కర్తలు, క్రైస్తవ మిషనరీలు మరియు అభ్యుదయ భావాలు గల ఆంగ్ల అధికారుల కృషి ఫలితంగా మహిళల స్థితిగతుల పై కొంత సామాజిక చైతన్యం వచ్చింది కానీ క్షేత్రస్థాయిలో భారతీయమహిళల పరిస్థితులు పెద్దగా మెరుగుపడలేదు. మహిళలకోసం మహిళలే ఉద్యమాలు నిర్మించుకోనిదే వాస్తవపరిస్థితులలో మెరుగుదల కనపడదని ప్రపంచ అనుభవాలు తెలుపుతాయి. భారతదేశం తమ జన్మభూమి కాకపోయినా కొంతమంది విదేశీయులు ఇక్కడి ప్రజల సమస్యలతో మమేకమై చైతన్యపరిచారు. అటువంటి కారణజన్ములలో మార్గరెట్ ఒకరు. తన బహుముఖప్రజ్ఞతో వివిధ రంగాలలో తన ప్రభావాన్ని చూపుతూ చిరస్మరణీయురాలుగా చరిత్రలో మిగిలారు. ఈ వ్యాసం ద్వారా ఆధునిక భారతదేశచరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆర్జించుకున్న, కాలప్రవాహంలో విస్మరణకు గురి అవుతున్న చారిత్రకమూర్తులను పున: స్మరించుకోవడం జరిగింది. వివిధప్రాథమిక, ద్వితీయ ఆధారాల కొరకు చారిత్రక గ్రంథాలు, పరిశోధన వ్యాసాలు పరిశీలించి మార్గరెట్ మనదేశమహిళల అభ్యున్నతికి జరిపిన మౌలికకృషిని వివరించడం జరిగింది.
Keywords: మార్గరెట్, దివ్యజ్ఞానసమాజకళాశాల, జాతీయగీతం, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్, ఆల్-ఇండియా-ఉమెన్స్-కాన్ఫరెన్స్, ఆల్-ఆసియన్-ఉమెన్స్-కాన్ఫరెన్స్, భారతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమం.
1. ఉపోద్ఘాతం:
కొంతమంది విదేశీయులు జన్మత భారతదేశంలో జన్మించకపోయినా తెలియని అనుబంధాన్ని ఏర్పరచుకుని విశ్వ మానవ సౌభాతృత్వాన్ని చాటుతూ మన భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించి భారత దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలను అర్పించుకొని భరతమాత కంఠంలో మణిహారాలుగా మిగిలిపోయారు. తాను ఐర్లాండ్ దేశంలో జన్మించినా భారతదేశాన్ని తన కర్మభూమిగా భావించి భారతదేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోజ్వల మహిళా రత్నం మార్గరెట్ (గ్రెట్టా) ఎలిజబెత్ గిల్లెస్పీ.
2. ఎలిజబెత్ ప్రారంభ జీవితం:
మార్గరెట్ బ్రిటన్ దేశంలో ఒక ఐరిస్ కుటుంబంలో నవంబరు ఏడవ తేదీన 1878 లో జన్మించారు. మార్గరెట్ కు పదిమంది తోబుట్టువులు. ఈమెను ఇంట్లో గ్రెట్టా అని పిలిచేవారు. డబ్లింన్ లోని రాయల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్ నుండి 1902 లో పట్టబద్రురాలైన మార్గరెట్ ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. సామాజిక న్యాయం, విశ్వ మానవ సౌభాతృత్వం తన జీవిత ఆదర్శాలుగా ఈమె ఏర్పరచుకున్నారు. తన సహ విద్యార్థి అయిన జేమ్స్ కజిన్ స్ ను 1903 లో వివాహం చేసుకున్నారు. ఇతను కవి మరియు సాహిత్య విమర్శకుడు.
వీరిద్దరూ ఇంగ్లాండ్ లోని సోషలిస్టు పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. వీరికి 1907 దివ్యజ్ఞానం సమాజం భావజాలంతో పరిచయం ఏర్పడింది. మార్గరెట్1907 లో ఐరిస్ శాఖా హార సంఘంలో చురుకైన నాయకురాలుగా మారారు. మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు[1]. ప్రముఖ మహిళా హక్కుల నాయకురాలు హన్నా స్కేపింగ్ టెన్ తో కలిసి ఐరిష్ ఉమెన్ లీగ్ ను స్థాపించారు. అంతేకాక ఈ సంస్థ మొదటి కోశాధికారిగా పనిచేశారు.ఈ సంస్థ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమాన్ని నడిపింది మహిళ సాధికారిక కొరకు రాజకీయ ప్రాతినిథ్యం కొరకు 1910 లో నిర్వహించబడిన మహిళా పార్లమెంటుకు డబ్లిన్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు మహిళలలో వీరు ఒకరు[2]. లండన్ లోని హౌస్ ఆఫ్ కామర్స్ కు ప్రదర్శన నిర్వహించి పోలీసు నిర్బంధానికి గురి అయ్యారు.
3. భారతదేశాన్ని అభిమానించడం:
ప్రఖ్యాత ఐరిష్ రచయిత మరియు ఆధ్యాత్మికవేత్త అయిన జార్జ్ విలియం రస్సెల్ పరిచయం ద్వారా మార్గరెట్, జేమ్స్ కజిన్ స్ దంపతులకు భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంతో పరిచయం ఏర్పడింది[3]. రస్సెల్ భారతీయ తత్వశాస్త్రం, కళ మరియు ఐరిష్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సొసైటీ యొక్క ఆదర్శవాదంపై మొదలైన అంశాలపై చేసిన ప్రసంగాలకు వీరు హాజరయ్యేవాళ్లు. 1913 లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం గురించి ప్రముఖ కవి డబ్ల్యు.బి. యేట్స్[4] ద్వారా తెలుసుకున్న వీరు రవీంద్రుడి రచనలపై ఆసక్తిని పెంచుకున్నారు.
భారతదేశ సంస్కృతి- సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకున్న ఈ దంపతులు 1915 నవంబర్ 1లో భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశంతొ ఆనిర్వచనీయమైన ప్రేమానురాగాలను ఏర్పరచుకున్న మార్గరెట్ ఈ దేశాన్ని తన మాతృదేశంగా భావించింది. మార్గరెట్ భారతదేశంలో చేసిన కృషిని మూడు రకాల భావజాలాలు ప్రభావితం చేశాయి. అవి అభ్యుదయవాద, వలస వాదం పై వ్యతిరేకత, అంతర్జాతీయ మహిళా వాదం మరియు జాతీయ రాజకీయాలలో మహిళలకు ప్రాతినిధ్యం.
భారతదేశంలో ఈ దంపతులు దివ్యజ్ఞాన సమాజ నాయకురాలు మరియు హోమ్ రూల్ ఉద్యమ నిర్వాహకురాలైన అన్నిబిసెంట్ గారి న్యూ ఇండియా పత్రికలో పనిచేశారు[5]. అయితే జేమ్స్ కజిన్ స్ ప్రచురించిన వ్యాసం పై ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో అన్నిబిసెంట్ పత్రికా నిర్వహణ నుండి వీరిని తొలగించి, తాను చిత్తూరు జిల్లా మదనపల్లి లో ఏర్పాటు చేసిన బిసెంట్ థియోసాఫికల్ కాలేజీ(దివ్యజ్ఞాన కళాశాల)కి జేమ్స్ కజిన్స్ ను వైస్ ప్రిన్సిపాల్ గా నియమించింది[6].
4. విద్యారంగానికి మార్గరెట్ సేవలు:
మార్గరెట్ కూడా ఆ కళాశాలలో నే ఆంగ్ల అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. స్కూల్ పార్లమెంటు నిర్వహించి విద్యార్థులలో రాజకీయ పాలనాపరమైన నైపుణ్యాలను పెంచి రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. అయితే విద్యార్థులకు రాజకీయాల్లో భాగస్వామ్యం కావడానికి ఆమె వ్యతిరేకించేవారు. ప్రదర్శనలలో పాల్గొనటానికి మాత్రమే అనుమతి ఇచ్చేవారు.
మార్గరెట్ దివ్యజ్ఞాన సమాజ కళాశాలలో పనిచేస్తూ ఉన్న సమయంలోనే స్కౌట్, గైడ్స్ ఉద్యమంలో భాగస్వామ్యులుయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ రాబర్ట్ బాడెన్-పావెల్ 1907 లో అంతర్జాతీయ స్కౌట్ ఉద్యమాన్ని, ఇతని భార్య లేడీ ఒలేవ్ బాడెన్-పావెల్ బాలికల గైడ్స్ ఉద్యమాన్ని విద్యాసంస్థలలో ప్రారంభించారు. దీనిని దివ్యజ్ఞాన సమాజ భావజాలానికి సరిపడే విధంగా కొన్ని మార్పులకు గురిచేసి భారతీకరణ చేసే కృషిలో అన్నీ బెసెంట్, జార్జ్ సిడ్నీ అరండేల్ తో పాటు మార్గరెట్ కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా ఇండియన్ బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ మదనపల్లెలో రూపుదిద్దుకుంది.
1919-1920 మధ్య కాలంలో మంగుళూరులోని జాతీయ బాలికల పాఠశాలకు మార్గరెట్ గారు హెడ్మాస్టర్ గా పనిచేశారు. విద్యారంగం పైన, మహిళల సాధికారిక పైన మార్గరెట్ గారి కృషిని గుర్తించిన పూనా మహిళా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మహర్షి కార్వే మార్గరెట్ ను పూనా మహిళ విశ్వవిద్యాలయ పాలక మండలి లో సభ్యురాలిగా నియమించాడు[7].
5. జాతీయ గీతంతో మార్గరెట్ అనుబంధం:
ఫిబ్రవరి 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లె కళాశాలను సందర్శించి అక్కడ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఠాగూర్ స్వయంగా అందించిన గమనికల ఆధారంగా చేసుకుని ప్రస్తుత భారతజాతీయగీతం "జనగణమన"కు సంగీతం ట్యూన్‌లను మార్గరెట్ రూపొందించింది. అదేవిధంగా జనగణమన గీతానికి ఆంగ్ల అనువాదం కూడా ఈ సందర్భంలోనే దివ్యజ్ఞాన కళాశాలలో జరిగింది. ఈ జనగణమన ఆంగ్ల అనువాదాన్ని "ఉదయం పాట" అని పిలుస్తారు.
6. భారతీయ మహిళా ఉద్యమంలో మార్గరెట్:
సాంఘిక మతసంస్కరణ ఉద్యమాలలో భాగంగా మహిళా సమాజంలోకూడా చైతన్యం వ్యాపించింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మహిళాసంఘాలు ఏర్పడ్డాయి. బెంగాల్ రాష్ట్రంలో. బెంగాల్‌లోని భారత్ ఆశ్రమం (ఇండియన్ హెర్మిటేజ్)[8] 1870లలో కేశవచంద్ర సేన్ చేత స్థాపించబడింది. స్వర్ణకుమారి దేవి (రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి)1882లో సఖి సమితిని అనే మహిళా సంఘాన్నిస్థాపించారు[9]. అదే సంవత్సరంలో పండిత రమాబాయి సరస్వతి పూనాలో ఆర్య మహిళా సమాజాన్ని స్థాపించి, బొంబాయి ప్రెసిడెన్సీ లోఅనేక పట్టణాలలో దీనికి అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసింది[10], [11]. 1908వ సంవత్సరంలో గుజరాత్ స్త్రీ మండఐ ఏర్పడింది. సరళాదేవి 1910 లో అలహాబాద్‌లో భారత స్త్రీ మహామండల్ ని స్థాపించారు.
పంజాబ్‌లోని అంజుమన్-ఎ-ఖవాతిన్-ఎ-ఇస్లాం (ముస్లిం మహిళాసంఘం), మియాన్ కుటుంబానికి చెందిన అమీర్-ఉన్-నిసాచే స్థాపించబడింది[12]. భారత మహిళా పరిషత్ (లేడీస్ సోషల్ కాన్ఫరెన్స్)1905 లో జాతీయ సామాజిక సదస్సులో భాగంగా ఏర్పడింది[13].
మహిళల పాత్ర గృహాలకి పరిమితం కాబట్టి సామాజిక వ్యవహారాలలో మహిళల పాత్ర నిషేధించబడిన కాలంలో మహిళలు తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ స్వతంత్ర రాజకీయాలను నడపడం ఎండమావిగా మారింది.
యూరోపియన్ మహిళల కన్నా భారతీయ మహిళల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, పేదరికంతోపాటు సామాజిక వివక్ష మరియు లింగపరమైన నిర్బంధాలకు గురి అవుతున్నారని, వందమంది బాలికలలో ఒకరికి మాత్రమే విద్యా అవకాశాలు లభిస్తున్న వాస్తవాన్ని భారతదేశానికి వచ్చిన కొద్ది రోజులలోనే మార్గరెట్ గ్రహించింది. చిన్న వయసు నుండి స్త్రీ - పురుషుల సమానత్వం పై గట్టి పట్టుదల ఆమె మదనపల్లె లో మహిళలతో టీ సమావేశాలు నిర్వహించి చైతన్యపరిచింది. మహిళా అభ్యున్నతికి "అబల అభివర్ధని సమాజ్" అనే మహిళా సంఘాన్ని ప్రారంభించారు.
అయితే అబల అనే పదం తన సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం కావడంతో ఈ సంస్థ పేరు మార్చివేసింది[14]. మహిళాభివృద్ధి వారి ఆర్థిక ప్రగతి పై ఆధారపడి ఉంటుంది అని భావించి, మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి చేతివృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మార్గరెట్ బర్మాలో పర్యటించి వృత్తి నిపుణు లను మదనపల్లికి రప్పించింది. మార్గరెట్ చేతి పనుల లో మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు దివ్యజ్ఞాన కళాశాలలో మహిళలకు క్రీడలలో శిక్షణ కొరకు ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేశారు. బాలికల కొరకు బ్యాట్మెంటన్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచారు.
భారతదేశంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు, విద్యావకాశాలు లేకపోవడం- స్వేచ్ఛ లేకపోవడం, సామాజిక నిర్బంధాలు ఎదుర్కోవడం గురించి మార్గరెట్ ఆందోళన చెందుతూ, తీవ్రంగా బాధపడేవాళ్లు[15].
7. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్:
మదనపల్లి లో మార్గరెట్ మహిళా సంఘం ఏర్పాటు కృషి అడయార్ (మద్రాసు)లోని డొరతి జిన రాజధాస దృష్టిని ఆకర్షించింది. మార్గరెట్ మహిళా సంఘం నమూనాలోనే ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ను మద్రాసులో రూపొందించమని ప్రోత్సహించింది.
భారతీయ మహిళల సర్వతోముఖ సమగ్రఅభివృద్ధి కొరకు అభ్యుదయవాద మహిళల నిర్వహణలో మద్రాసులోని అడియారు కేంద్రంగా 8తేదీ మే నెల 1917 లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించబడి భారతీయ మహిళా అభ్యుదయ చరిత్రనలో నూతన అధ్యయనికి శ్రీకారం చుట్టింది[16]. ఈ సంస్థను మార్గరెట్ ఎలిజబెత్ గిల్లెస్పీ ఇ కజిన్స్ స్థాపించారు[17].
ఈ సంస్థ మొదటి అధ్యక్షురాలు అన్నీ బెసెంట్ [18]. వ్యవస్థాపక సభ్యులలో అంబుజమ్మాళ్ [19] కమలాదేవి చటోపాధ్యాయ, మేరీ పూనెన్ లూకోస్, బేగం హస్రత్ మోహని, సరళాబాయి నాయక్, ధన్వంతి రామారావు, ముత్తులక్ష్మి రెడ్డి, డొరతి జిన రాజధాస, మంగళమ్మాళ్ సదాసివియర్ మరియు హేరాబాయి టాటా ఉన్నారు. ప్రారంభంలో ఈ సంస్థలో 70 మంది మహిళలు సభ్యులుగా ఉండేవాళ్లు[20]. అంతర్జాతీయ మహిళా ఉద్యమ నిర్వహణలో విశేషమైన అనుభవాలు గల మార్గరెట్ ఈ సంస్థను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించారు.
ఈ సంస్థ ప్రచురించే "స్త్రీ ధర్మ"అనే ఆంగ్లపత్రిక (జర్నల్)కు ఎడిటర్గా ఉంటూ ప్రపంచ స్థాయిలో మహిళల విషయాలలో వస్తున్న మార్పులను భారతీయ మహిళ విద్యావంతులకు తెలియబరిచేవారు ఈ పత్రిక తెలుగు మరియు తమిళంలో కూడా ప్రచురితమయ్యేది[21],[22].
ఈ సంస్థ రాజకీయ మత తాత్విక భావజాలాలతో సంబంధం లేకుండా ఇండియా యూరప్ మహిళల భాగస్వామ్యంతో రూపొందించబడి, నిర్వహించబడింది. భారతీయ మహిళా సమాజాన్ని పట్టిపీడిస్తున్న నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, దేవదాసి వ్యవస్థ మొదలగు సామాజిక సమస్యల నిర్మూలనకు సమర్థవంతమైన రాజకీయ పోరాటాలను ఈ సంస్థ నిర్వహించింది.
1921లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్ట్ ఉమెన్ ప్రపంచ సదస్సుకి[23]సమీప మరియు మధ్యప్రచ్య దేశాల నుండి 25 మంది మహిళా ప్రతినిధులతో పాటు మార్గరెట్ పాల్గొన్నారు.
8. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్:
భారతదేశంలోని మహిళలకు విముక్తి కోసం మార్గరెట్ చేసిన పనులలో శిఖరాయమానంగా 1927 లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC)యొక్క స్థాపనను గుర్తించవచ్చును[24]. ఆల్ ఇండియన్ ఉమెన్స్ కాంగ్రెస్ మొదటి సమావేశం పూనాలో జరిగింది. మార్గరెట్ ఈ కాన్ఫరెన్స్‌ను శ్రీమతి డోరతీ జినరాజదాస, డాక్టర్ లక్ష్మీబాయి రాజ్వాడే మరియు డాక్టర్ ఎస్. ముత్తులక్ష్మి మొదలగు మహిళలతో కలిసి రూపొందించింది[25]. ఏ.ఐ.డబ్ల్యూ.సీ తన ప్రధాన ఎజెండాను ప్రత్యేకంగా శ్రద్ధతో రూపొందించింది.మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్యం, విద్య మరియు వృత్తి శిక్షణ మొదలగు అంశాలపై తన దృష్టిని కేంద్రీకరించింది. ఓటు హక్కుతో పాటు విద్యారంగంలో మహిళ భాగస్వామ్యం పెంచడానికి ఉపాధ్యాయులు గాను మరియు వైద్య రంగంలో మహిళా ఆరోగ్య సంరక్షకులుగాను శిక్షణా కేంద్రాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రారంభించాలని పాలకులను కోరింది.
ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు జరపాలని, మరొకవైపున మహిళలలో విద్యావ్యాప్తిని పెంచడానికి మహిళల వసతి గృహాల నిర్వహణ గురించి శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 1936 లో ఈ సంస్థకు మార్గరెట్ అధ్యక్షురాలుగా పనిచేశారు. అమెరికన్ బర్త్ కంట్రోల్ కార్యకర్త మార్గరెట్ సాంగెర్ చేత ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మహిళల ఆరోగ్య సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆవశ్యకత గురించి మార్గరెట్ ఉపన్యాసం ఇప్పించింది.
ఈ ఏ.ఐ.డబ్ల్యూ.సీలో కీలకనాయకురాలైన డాక్టర్ ఎస్. ముత్తులక్ష్మి మార్గరెట్ కు చాలా సన్నిహిత మిత్రురాలు మరియు మహిళా ఉద్యమంలో సహచరురాలు. ముత్తులక్ష్మి ఎడ్యుకేటర్, సర్జన్, లా మేకర్, సంఘసంస్కర్త. ఆమె శాసనసభలలో మొదటి భారతీయ మహిళ మరియు మహిళా హక్కుల ప్రచారకర్త. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రూప శిల్పి[26],[27]. ఈ సంస్థలోని మరొక ప్రముఖ నాయకురాలు డాక్టర్ లక్ష్మీబాయి రాజ్వాడే తర్వాత కాలంలో భారత ప్రణాళికా సంఘంలో మహిళాభివృద్ధిశాఖకు అధిపతిగా విధులు నిర్వహించారు [28].
బాలికల వివాహ వయసు పెంపుదలపై ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ స్పష్టమైన వైఖరి ప్రకటించింది. బాల్యవివాహాల వలన అనారోగ్యం మరియు అకాల మరణాలకు గురి అవుతున్నారు అని ప్రకటించింది. అంతేకాకుండా గర్భస్రావాలకు కూడా కారణమై, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాలను దెబ్బతీసి, భావితరాల ను నిర్వీర్యం చేస్తున్నదని తెలిపింది. భారతీయ బాలికల వివాహ వయస్సును 16 సంవత్సరాలకు పెంచాలని సిపార్సు చేయడమే కాక దీని కొరకు ప్రజా ఉద్యమాన్ని నిబద్ధతతో నిర్వహించింది. ఈ సంస్థ ప్రభుత్వ చట్టాలను మహిళల కోణంలో పరిశీలించి, విమర్శించి తగిన మార్పులను సూచించేది[29].
8. ఆల్-ఆసియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్:
మహిళా సమస్యలపై అంతర్జాతీయ దృక్పథం గల మార్గరెట్, ఆసియా ఖండంలోని మహిళలను సమైక్యపరుస్తూ ఆల్-ఆసియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AAWC) ను జనవరి 1931లో లాహోర్‌లో నిర్వహించారు[30]. ఇది మొదటి అఖిల -ఆసియన్ మహిళా సమావేశం[31].ఈ సదస్సులో అంతర్జాతీయ మహిళా నాయకులు సిలోన్ నుండి శ్రీమతి భండారనాయకే, ఆఫ్ఘనిస్తాన్ నుండి శ్రీమతి కమాలుద్దీన్, శ్రీమతి షిరిన్ లు, పర్షియా నుండి ఫోజ్దార్, బర్మాకు చెందిన Ms.మే ఔంగ్ మరియు జపాన్ నుండి Ms. హోషి మొదలగు వారు ప్రతినిధులుగా పాల్గొన్నారు.
ఈ సమావేశాలకు భారతీయ మహిళా ప్రతినిధులుగా సరోజినీ నాయుడు జైలు శిక్ష వలన సమావేశాలకు హాజరు కాలేకపోయారు. డాక్టర్ ముత్తులక్ష్మి ,రాజకుమారి అమృత్ కౌర్, లేడీ అబ్దుల్ ఖాదిర్, రాణి లక్ష్మీబాయి రాజ్వాడే, హిల్లా రుస్తోంజీ ఫరీదూంజీ మొదలగువారు ఈ సమావేశాల నిర్వహణలో చురుకుగా పాల్గొని తమలోని నాయకత్వలక్షణాలను మెరుగుపరుచుకున్నారు.
కపుర్తలా మహారాణికి కుమార్తె, మండి రాణి తన స్వాగత ఉపన్యాసంలో మాట్లాడుతూ "ఆసియా ఖండ మహిళలు భౌతిక మరియు మానసిక పరుదులు దాటి ఆసియా ఖండ మహిళలు తమ పునరుజీవనోద్యమంలో భాగంగా తమ ఆలోచనలను పరస్పరం పంచుకొని, ఉమ్మడి లక్ష్యాలను ఏర్పరచుకుని మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలి" అని పిలుపునిచ్చారు.
1930 దశకంలో మన దేశంలోని మహిళా ఉద్యమం నిర్వహణబాధ్యతలను భారతీయ మహిళలకు అప్పగించిన మార్గరెట్ మహిళా ఉద్యమాలకు పరోక్షంగా తన స్ఫూర్తిదాయకమైన సహకారం అందించింది.
9. భారతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమం:
నవ సమాజంలో సమ భాగస్వామ్యం లో భాగంగా మహిళలకు పురుషులతో సమానంగా రాజకీయ భాగస్వామ్యం, చట్టసభలలో నిర్ణయాధికారం మరియు సాధికారికత ఉండాలంటే ఓటు హక్కు తప్పనిసరి[32] అని భావించిన భారతీయ మహిళా నాయకులు అప్పుడు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కొరకు విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తున్న కమిటీకి భారతీయ మహిళల మనోభావాలను తెలియపరచడానికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలి అనుకున్నారు.
ఈ విజ్ఞాపన పత్రాన్ని రూపొందించే గురుతర బాధ్యతలను మహిళా నాయకులు మార్గరెట్ కు అప్పగించారు[33]. 1917లో ఈ విజ్ఞాపన పత్రాన్ని మాంటేగ్ - చెమ్స్‌ఫోర్డ్ ప్రతినిధి బృందానికి సమర్పించబడింది. అయితే ఫలితాలు మహిళా నాయకులకు నిరాశను కలిగించాయి. సౌత్‌బరో ఫ్రాంఛైజ్ కమిటీ ఓటు హక్కు పొడిగింపును సిఫారసు చేయలేదు. అయితే పట్టు వదలని వీరి ప్రయత్నాలు దీర్ఘకాలంలో శాసన నిర్మాతలపై ప్రభావాన్ని చూపాయి[34]. చిట్ట చివరకు రాజకీయ ప్రాతినిధ్యంతో లింగపరమైన వివక్షను తొలగించడానికి పార్లమెంటరీ జాయింట్ కమిటీ అంగీకరిస్తూనే మరొకవైపున వీటి విధి విధానాలను రూపొందించే బాధ్యతను ప్రావిన్షియల్ లెజిస్లేచర్లకు అప్పగించారు[35]. 1920లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్ సంస్థానం లోను, 1921లో మద్రాస్ మరియు బొంబాయి రాష్ట్రాలలోనూ, 1923లో యునైటెడ్ ప్రావిన్సెస్ లోను1926లో పంజాబ్ మరియు బెంగాల్ లోను మరియు 1930లో అస్సాం, సెంట్రల్ ప్రావిన్సులు మరియు బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలోనూ మహిళలకు (ఆస్తి అర్హతల ఆధారంగా) ఓటుహక్కు ఇవ్వబడింది.
10. భారత స్వాతంత్ర పోరాటంలో మార్గరెట్ భాగస్వామ్యం:
ప్రజాస్వామ్యవాది అయిన మార్గరెట్ బ్రిటిష్ వారి అణిచివేత చర్యలను వ్యతిరేకిస్తూ, భారత స్వాతంత్ర పోరాటాన్ని అభిమానించే వారు. భారతస్వాతంత్రోద్యమం పట్ల సానుభూతిగల మార్గరెట్ గాంధీ పిలుపునందుకుని శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ నిర్బంధ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేసి నిర్బంధించబడి జైలు శిక్షకు గురి అయ్యారు. వేలూరు జైలులో ఒక సంవత్సర కాలం జైలు జీవితం గడిపింది.
మార్గరెట్ తన భర్త జేమ్స్ కజిన్స్ తో కలిసి అమెరికా దేశానికి పర్యటన కొరకు వెళ్లారు. ఈ విదేశీ పర్యటన సందర్భాన్ని విదేశాలలో భారతదేశంలో బ్రిటీష్ వారి వలస పాలనస్వభావాన్ని వివరిస్తూ భారత స్వాతంత్ర పోరాటం గురించి ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నది[36].
దక్షిణ భారతదేశమంతా విస్తృతంగా పర్యటించి స్వాతంత్ర ఉద్యమ సభలలో ప్రసంగాలు చేశారు. 1936 ఫిబ్రవరి,10వ తేదీన కాకినాడలో కాంగ్రెస్ నాయకులచే నెలకొల్పబడిన గాంధీ గారి విగ్రహాన్ని మార్గరెట్ ఆవిష్కరించారు. [37]
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో హంస మెహతా నాయకత్వంలోని జాతీయ జెండా సమర్పణ కమిటీలు మార్గరెట్ సభ్యురాలు [38]. ఈ కమిటీ 14 ఆగస్ట్1947లో రాజ్యాంగ సభకు భారతీయ మహిళల తరపున జాతీయ జెండాను సమర్పించింది [39].
11. మొదటి మహిళ న్యాయాధికారిగా మార్గరెట్ (మేజిస్ట్రేట్):
మార్గరెట్ జీవితంలో మరో ముఖ్యమైన సంఘటన మద్రాసులోని సైదాపేట జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్ గా బాధ్యతలు నిర్వహించారు[40]. భారతదేశము లో మార్గరెట్ మొదటి మహిళ న్యాయాధికారి. ఆమె ఈ పదవినిలో 19 ఫిబ్రవరి 1923న నియమించబడ్డారు. ఆమె 1928 వరకు ఈ పదవిలో కొనసాగారు[41].
12. రచయితగా మార్గరెట్:
1922లో మార్గరెట్ "ది అవేకనింగ్ ఆఫ్ ఆసియన్ వుమన్‌హుడ్" అనే పుస్తకాన్ని రచించింది. ఇందులో ఆసియా ఖండంలోని ముహమ్మదీయులు, యూదులు, భారతీయులు, ది బర్మీస్, చైనీస్ మరియు జపనీస్ మహిళల గురించి మనోహరంగా విశ్లేషిస్తూ ఆసియా ఖండం మహిళలు మేధోపరంగా ఎదుగుదల కనపరుస్తున్నారని, వారి ఆలోచన పరిధి విస్తరిస్తున్నదని మరియు స్వాతంత్ర కాంక్షతో వారి హృదయాలు జ్వలిస్తున్నాయని, వారు ప్రగతి పథంలో పయనించడానికి సిద్ధపడ్డారు అని వివరించింది.మార్గరెట్ బహు గ్రంథకర్త ఈమె ది అవేకనింగ్ ఆఫ్ ఆసియన్ వుమన్‌హుడ్ 1922 తో పాటు "ఓరియంట్ మరియు ఆక్సిడెంట్ సంగీతం"పరస్పర అవగాహనల వైపు వ్యాసాలు" (1935), నేడు భారతీయ స్త్రీత్వం ( 1941), జేమ్స్ కజిన్స్‌తో మేమిద్దరం కలిసి (1950), మొదలగు పుస్తకాలను రచించారు.
ప్రారంభంలో మహిళా ఉద్యమాల సందర్భంగా రాడికల్ భావజాలానికి ఆకర్షితురాలైన మార్గరెట్ భారత దేశంలో రాజకీయ పరిణితి కనపరిచి మహిళ హక్కుల కొరకు రాజ్యాంగపరమైన పద్ధతులను అవలంబించారు[42]. మతం, విద్య, దేశభక్తి మరియు ప్రేమ మహిళలలకు సామాజిక ప్రతిబంధకాల నుండి విముక్తిని ప్రసాదిస్తాయ మార్గరెట్ భావించేది. మహిళల హక్కులు వారి అర్దిక స్వాలంబన పై ఆధారపడి ఉన్నాయి అని భావించిన మార్గరెట్ మహిళలకు ఉపాధి అవకాశాల పెరుగుదలకు మరియు పని వాతావరణంసృష్టించడానికిమార్గాలుఅన్వేషించే వారు[43].
1944 లో గుండెపోటుకు గురైన మార్గరెట్ పక్షవాత లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. ఆమె ఆరోగ్యం బాగు కొరకు మద్రాసు ప్రభుత్వం మరియు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శ్రద్ధ తీసుకుని ఆర్థికంగా ఆదుకున్నారు. దీర్ఘకాలం అనారోగ్యంతో పోట్లాడి 1954 లో మానవజాతి ఉన్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ధన్యజీవిగా మార్గరెట్ సగర్వంగా కన్నుమూశారు. ఆమె ఆలోచనలు, పట్టుదల, కృషి అనిచివేయబడిన మహిళా వర్గాలకు నిరంతర స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటాయి.
13. ముగింపు:
ఐర్లాండ్ దేశంలో జన్మించిన మార్గరెట్ విద్యార్థిదశ నుండి సామాజికన్యాయం సిద్ధాంతంపై చంచలమైన విశ్వాసంతో నిరంతరపోరాటాలను నిర్వహించారు. మహిళలకు పురుషులతో సమాన స్థాయిని కోరుతూ రాజకీయరంగంలో మహిళల ప్రాతినిత్యంకొరకు ఓటుహక్కును డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించారు.
విశ్వమానవ సోదరభావాన్ని నమ్మిన మార్గరెట్ భారతదేశాన్ని తన కార్య క్షేత్రంగా ఎన్నుకొని పత్రికా రంగంలోనూ, విద్యారంగంలోనూ విశేష కృషి చేశారు. భారత జాతీయ గీతమైన జనగణమన కు సంగీత బాణీలను సమకూర్చి, రూపకల్పన కృషిలో భాగస్వామ్యులయ్యారు. గాంధీ గారి సత్యాగ్రహ పోరాట సిద్ధాంతంపై శ్వాసాన్ని పెంచుకున్న మార్గరెట్ భారతస్వతంత్రపోరాటంలో చురుకైన పాత్రను పోషించడమే కాక జైలుశిక్షణను కూడా అనుభవించారు.
భారతీయమహిళల స్థితిగతులపై తీవ్రంగా కలత చెందిన మార్గరెట్ తనలాంటి అభ్యుదయ భావాలుగల భారతీయమహిళలను సమీకరించి మహిళాసంఘాలను నెలకొల్పడమేకాక వివిధరంగాలలో భారతీయమహిళల స్థాయిని పెంచడానికి ప్రయత్నించారు.
క్రమబద్ధమైన నిర్మాణాత్మక కృషిని నిరంతరం నిర్వహించె కర్మయోగి అయిన మార్గరెట్ కృషికి సాక్షాలుగా మొదలైన సంస్థలు నిలిచి ఉండి భారతీయ మహిళలను జాగృతి పరుస్తూ ఉన్నాయి.
దేశాల సరిహద్దుల భావనను అధిగమించి, జాతి, మత భావాలకు అతీతంగా మానవత్వాన్ని తన మతంగా భావించిన ఈమె భారతీయమహిళలకు స్నేహితురాలుగా, హితురాలుగా మరియు సన్నిహితురాలుగా నిలిచిపోయింది.
ఈ వ్యాసంలో మార్గరెట్ ఐర్లాండ్, ఇంగ్లాండు ప్రాంతంలో జరిపిన రాజకీయ ఉద్యమాలను క్లుప్తంగా వివరించి ముగించాము. అదేవిధంగా మార్గరెట్ భారతదేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా జరిపిన కృషిని కూడా వివరించలేదు.
14. సూచికలు & ఉపయుక్తగ్రంథసూచి:
- లెనెమాన్, లేహ్., (జూన్ 1997)"మేల్కొన్న ప్రవృత్తి: శాఖాహారం మరియు బ్రిటన్‌లో మహిళల ఓటు హక్కు ఉద్యమం". మహిళల చరిత్ర సమీక్ష, వాల్యూమ్.6(2) పేజీలు. 271-287.
- జెన్నిఫర్, ఉగ్లో., (1999),ది నార్త్ ఈస్టర్న్ డిక్షనరీ ఆఫ్ ఉమెన్స్ బయోగ్రఫీ. మాగీ హెండ్రీ, యుపిఎన్ఈ, పేజీలు. 140.
- కైన్,ఆర్.ఎం,ఓబ్రెయిన్,జే.హెచ్.,(1976). జార్జ్ రస్సెల్ (బక్నెల్ యూనివర్సిటీ ప్రెస్.)
- ఫోస్టర్,(1998),యీట్స్: ఒక జీవితం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్.
- మోర్టిమర్,(1983). "అన్నీ బెసెంట్ మరియు భారతదేశం 1913-1917". జర్నల్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ,వాల్యూమ్.18(1), పేజీలు.61-78.
- కాండీ, సి.ఎం.,{1996). "ఆధునిక ఐర్లాండ్ మరియు భారతదేశంలో మార్గరెట్ కజిన్స్ యొక్క స్త్రీవాదం" 1878-1954. లయోలా యూనివర్సిటీ, చికాగో.
- కీత్ మున్రో., (2018),"మార్గరెట్ కజిన్ దృష్టిలో"హైవ్ స్టూడియో బుక్స్,డెర్రీ. (బ్రిటన్).
- ప్రశార్, పి., (2017), "ఆధునికభారతదేశంలో మహిళలు మరియు సామాజికసంస్కరణ ఉద్యమాలు", నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్,వాల్యూమ్.3, పేజీలు.590-596.
- రే.,(2017), "ఇరవై నాలుగు. ఇన్ ది మెనీ వరల్డ్స్ ఆఫ్ సరళా దేవి: ఎ డైరీ ది ఠాగూర్స్ అండ్ సార్టోరియల్ స్టైల్: ఎ ఫోటో ఎస్సే పేజీలు.183 -188,రూట్లెడ్జ్.
- ఖుల్లర్. ఎం.,(1997), భారతదేశంలో మహిళా ఉద్యమం ఆవిర్భావం. ఆసియన్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్,వాల్యూమ్. 3,(2),పేజీలు.94.
- కుమార్,ఎస్., (2023),"భారతదేశంలో లింగ ఆందోళనల మరియు సామాజిక సంస్కరణ ఉద్యమాలు", రెస్మిలిటరిస్, వాల్యూమ్.13,(2),పేజీలు.6688-6695.
- జునిక్‑ లూనివ్స్కా,కె.,(2016),"మలాలా నుండి బుర్కా అవెంజర్ వరకు: సమకాలీన పాకిస్తాన్‌లో మహిళా రోల్ మోడల్‌లను మార్చడంపై కొన్ని వ్యాఖ్యలు", పొలితేజ-పిస్మో ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పొలిటికల్ స్టడీస్ ఆఫ్ ది జాగిలోనియన్ యూనివర్సిటీ, వాల్యూమ్.13(40), పేజీలు.273-300.
- ఫేజ్,ఎఫ్.,(1985),"భారతదేశంలోని మహిళా సంస్థలు".
- కీత్ మున్రో.,(2018),"మార్గరెట్ కజిన్ దృష్టిలో", హైవ్ స్టూడియో బుక్స్ ,డెర్రీ (బ్రిటన్).
- కుమ్ జయవర్దన., (1995), "ది వైట్ ఉమెన్స్ అదర్ బర్డెన్: బ్రిటీష్ పాలనలో పశ్చిమ మహిళలు మరియు దక్షిణ ఆసియా", టేలర్ & ఫ్రాన్సిస్, పేజీలు147-155.
- ఖుల్లర్,ఎం., (1997),"భారతదేశంలో మహిళా ఉద్యమం ఆవిర్భావం", ఆసియన్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్,వాల్యూమ్.3(2),పేజీలు.94.
- అత్వాల్.జె.,(2022),మార్గరెట్ ఎలిజబెత్ కజిన్స్ అండ్ ట్రాన్స్‌నేషనలిజం: "కలోనియల్ ఇండియాలో యాంటీ-కలోనియల్ ఫెమినిస్ట్‌గా ఒక ఐరిష్ సఫ్రాగెట్. లింగం మరియు చరిత్రలో", పేజీలు.248-264, రూట్‌లెడ్జ్ ఇండియా.
- మోర్టిమర్,జె. ఎస్.,(1983),"అన్నీ బెసెంట్ మరియు భారతదేశం 1913-1917", జర్నల్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ,వాల్యూమ్.18(1),పేజీలు.61-78.
- రామనాథన్,ఎం.,(1998),"20 వ శతాబ్దం ప్రారంభంలో మద్రాసు ప్రెసిడెన్సీలో మహిళలు చేసిన సవాలు మరియు ప్రతిస్పందన: అంబుజమ్మాల్ మరియు సోదరి సుబ్బలక్ష్మి", ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, వాల్యూమ్. 59,పేజీలు.629-641.
- సుదర్కోడి, ఎస్., (1997),"ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అండ్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ", ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క ప్రొసీడింగ్స్, వాల్యూమ్.58, పేజీలు.742-743.
- బ్రూమ్, ఎస్. కె.,"స్త్రీ-ధర్మ: భారతీయ మహిళా హక్కుల ఉద్యమం 1928-1936 వాయిస్", డాక్టరు పట్టం థీసిస్,జార్జియా స్టేట్ యూనివర్శిటీ.
- ఎలిజబెత్ టుసాన్,ఎం.,(2003) “స్త్రీ ధర్మ రచన: అంతర్జాతీయ స్త్రీవాదం,జాతీయవాద రాజకీయాలు మరియు చివరి వలస భారతదేశంలోని మహిళల పత్రికా న్యాయవాదం”, ఉమెన్స్ హిస్టరీ రివ్యూ,వాల్యూమ్.12(4),పేజీలు.623-649.
- మార్లిన్ బి. యంగ్.,రేనా రాప్.,సోనియా క్రుక్స్.,(1989), "ప్రామిసరీ నోట్,ఉమెన్స్ ఇన్ ట్రాన్సిషన్ టు సోషలిజం",మంత్లీ రివ్యూ ప్రెస్లు,యునైటెడ్ స్టేట్స్.
- రోరిచ్.ఎల్.,(2013),డిసెంట్రింగ్ ఫెమినిస్ట్ ఇంటర్నేషనల్స్: ప్రపంచ యుద్ధాల మధ్య భారతీయ మరియు అంతర్జాతీయ మహిళా సంస్థలు. కంపారిటివ్,వాల్యూమ్.23(4-5),పేజీలు.47-67.
- బసు.ఎ.(1995) భారతదేశంలో స్త్రీవాదం మరియు జాతీయవాదం జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హిస్టరీ,వాల్యూమ్.7(4),పేజీలు.95-107.
- శాంతి,శరవణకుమార్,ఎ. ఆర్.,(2020). "మహిళా సాధికారత-ఒక చారిత్రక అధ్యయనంలో డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి సహకారం"ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్, వాల్యూమ్.9(3),పేజీలు.1244-1253.
- కామచ్చి, ఎం.,(2016,జనవరి). "ముత్తులక్ష్మి రెడ్డి: సౌత్ ఇండియాలో మొదటి మెడికల్ ఉమెన్ ప్రొఫెషనల్", ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, వాల్యూం.77, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, పేజీలు.612-623.
- రాజ్వాడే, రాణి లక్ష్మీబాయి; సారాభాయ్, మృదుల; దుబాష్, పూర్విస్ ఎన్. (1947). షా, K. T. (ed.). ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో స్త్రీ పాత్ర: సబ్-కమిటీ నివేదిక. నేషనల్ ప్లానింగ్ కమిటీ సిరీస్. బొంబాయి: వోరా పబ్లిషర్స్.
- సేన్.,(2000). "స్త్రీవాద రాజకీయాల వైపు,చారిత్రక దృక్పథంలో భారతీయ మహిళా ఉద్యమం" ప్రపంచ బ్యాంక్, డెవలప్‌మెంట్ రీసెర్చ్ గ్రూప్/పావర్టీ రిడక్షన్ అండ్ ఎకనామిక్ మేనేజ్‌మెంట్ నెట్‌వర్క్.
- ముఖర్జీ.,(2017). "ఆల్-ఆసియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ 1931: భారతీయ మహిళలు మరియు పాన్-ఆసియన్ ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క వారి నాయకత్వం", ఉమెన్స్ హిస్టరీ రివ్యూ, వాల్యూమ్.26(3),పేజీలు.363-381.
- నిజవాన్.,(2017),"ఏషియన్ సెంటర్ నుండి ఇంటర్నేషనల్ ఫెమినిజం: ది ఆల్-ఆసియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ (లాహోర్1931)యాజ్ ఎ ట్రాన్స్‌నేషనల్ ఫెమినిస్ట్ మూమెంట్", జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హిస్టరీ,వాల్యూమ్.29(3),పేజీలు.12-36.
- సిన్హా, ఎం.,"మదర్ ఇండియా చదవడం: సామ్రాజ్యం,దేశం మరియు స్త్రీ స్వరం", జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హిస్టరీ, వాల్యూమ్.6(2), పేజీలు.6-44.
- బసు,ఎ., (2008)"ఓటు కోసం మహిళల పోరాటం: 1917-1937",ఇండియన్ హిస్టారికల్ రివ్యూ,వాల్యూమ్.35(1),పేజీలు.128-143.
- శర్మ,కుముద్.,(2000),"అధికారం మరియు ప్రాతినిధ్యం: భారతదేశంలో మహిళలకు రిజర్వేషన్", ఏషియన్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్,సియోల్, వాల్యూమ్.6(1), పేజీలు.47.
- లతీఫ్, ఎస్.,(1977),"భారతీయ మహిళా ఉద్యమం ఎక్కడ",ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ,వాల్యూమ్.12(47),పేజీలు.1948-1951.
- .అలాన్, డెన్సన్,.(1967)జేమ్స్ హెచ్. కజిన్స్ మరియు మార్గరెట్ ఇ. కజిన్స్ ఎ బయో-బిబ్లియోగ్రాఫికల్ సర్వే", కెండల్.
- కొడాలి ఆంజనేయులు(ed)., (1976), “ఆంధ్రదేశంలో గాంధీజీ పర్యటనలు”, తెలుగు అకాడమీ, హైదరాబాదు.పేజీలు.787.
- భారత రాజ్యాంగ అసెంబ్లీ చర్చలు (ప్రోసీడింగ్‌లు)- వాల్యూమ్, "జాతీయ పతాకం యొక్క ప్రదర్శన",లోక్ సభ.nic.in.
- రాయ్,ఎస్.,(2006)"స్వేచ్ఛకు చిహ్నం: భారతీయ జెండా మరియు జాతీయవాదం యొక్క పరివర్తన,1906-2002", ది జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, వాల్యూమ్.65(3),పేజీలు. 495-527.
- జేమ్స్ అండ్ మార్గరెట్ కజిన్స్.,(1950),"వి టూ టుగెదర్",గణేష్& కో, మద్రాస్,పే.406.
- కాండీ,కేథరీన్.,(1996),"ది అకల్ట్ ఫెమినిజం ఆఫ్ మార్గరెట్ కజిన్స్ ఇన్ మోడ్రన్ ఐర్లాండ్ అండ్ ఇండియా,1878-1954",లయోలా యూనివర్సిటీ, చికాగో, పేజీలు.142
- కాండీ,కేథరీన్.,(1996),"ది అకల్ట్ ఫెమినిజం ఆఫ్ మార్గరెట్ కజిన్స్ ఇన్ మోడ్రన్ ఐర్లాండ్ అండ్ ఇండియా,1878-1954",లయోలా యూనివర్సిటీ, చికాగో,పేజీలు.164.
- కేథరీన్ కాండీ(2001), “ది ఇన్‌స్క్రూటబుల్ ఐరిష్-ఇండియన్ ఫెమినిస్ట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఆంగ్లో-అమెరికన్ హెజిమోనీ”, 1917-1947, జర్నల్ ఆఫ్ కలోనియలిజం అండ్ కలోనియల్ హిస్టరీ, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ప్రెస్. వాల్యూమ్ 2, నంబర్ 1, స్ప్రింగ్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.