AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. శశిశ్రీ ‘అలికిడి’కథ: సీమకరువు చిత్రణ
డా. బత్తల అశోక్ కుమార్
అతిథి సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490194780, Email: ashokbathala.cuap@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
రాయలసీమ ప్రాంతంలోని ప్రసిద్ధ కవి, కథా రచయిత, శశిశ్రీగా పిలువబడే షేక్ బేపారి రహ్మతుల్లా రాసిన అలికిడి కథ ద్వారా రాయలసీమ ప్రాంత స్థితిగతులను, ఇక్కడి వ్యవసాయ, కరువు పరిస్థితులను సమాజానికి తెలియజేయడం. శశిశ్రీ రాసిన రెండు కథా సంపుటాలను పరిశీలించి అందులో రాయలసీమ వ్యవసాయక జీవనముతో పాటుగా రాయలసీమ ప్రాంత స్థితిగతులను వెల్లడించడానికి అవకాశం ఉన్న కథను ఎంచుకొని అందులో ఉన్న అంశాలను చెప్పదలిచాను. అందుకు అలికిడి కథ ఉపకరించింది అని భావించి దాని ద్వారా రాయలసీమ ప్రాంత స్థితిగతులను, ఇక్కడి వ్యవసాయ, కరువు పరిస్థితులను సమాజానికి తెలియజేయడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం. రాయలసీమ ప్రాంత సమాజం గురించి, ఇక్కడి పరిస్థితులపై రాయలసీమేతర సమాజానికి ఉన్న వివిధ భావనలను తొలగించడానికి, రాయలసీమ రచయితలు చేస్తున్న ప్రయత్నాన్ని సమాజం ముందు ఆవిష్కరించడానికి ఈ కథను ఎన్నుకొని ఇందులో రచయిత అభిప్రాయాన్ని సోదాహరణంగా విశ్లేషణాత్మక పద్ధతిలో పరిశీలించడమైనది.
Keywords: కథాసాహిత్యం,రాయలసీమ,కరువు, శశిశ్రీ, అలికిడి, స్థితిగతులు, మానవసంబంధాలు.
1. ఉపోద్ఘాతం:
భారతదేశంలో అత్యంత తక్కువ వర్షపాతంగల ప్రాంతం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతమైతే, రెండో అత్యల్ప వర్షపాత ప్రాంతమైన అనంతపురంజిల్లా ఈ రాయలసీమలోది కావడంతో ఇతర ప్రాంత వాసులకు ఈ ప్రాంత దుర్భిక్షపరిస్థితి సులభంగా అర్థం కాగలదు. ఈ కరువు తీవ్రతకు ఎన్నో గ్రామాలు ప్రతి సంవత్సరం వలసపోతుంటాయి. హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు కూలీలుగా వలస వెళ్ళడం వర్షాలు పడితే ఆశగా తిరిగివచ్చి వ్యవసాయం చేయప్రయత్నించడం, కూడబెట్టింది కూడా పోగొట్టుకొని మరలా పట్టణాలకు వెళ్ళి పనులు చేస్తున్న రైతన్నల వేదనలు ప్రసార మాధ్యమాల్లో వస్తూ వుండటం ఈ సీమ దుర్భర వేదనకు తార్కాణాలు.
సాహిత్యం సామాజానికి కళాత్మక విమర్శనాత్మక ప్రతిబింబం. ఉత్తమసాహిత్యం ఎప్పుడూ సమకాలీన సమాజంలోని వేదనలోంచే వస్తుంది. రాయలసీమ కవులు, రచయితలు అత్యుత్తమ సాహిత్యాన్ని అందివ్వడానికి కారణం ఇక్కడి యదార్థ సంఘటనలు. సాహితీ స్రష్టలు ఎప్పుడూ సమాజాన్ని మునుముందుకు నడిపించే ప్రయత్నమే చేస్తారు. సామాజిక రుగ్మతలు, వ్యథలు, ప్రకృతి వైపరీత్యాలు కవిని ఆర్తికి లోను చేస్తాయి. సమాజపు అలికిడిని గుర్తించి మొదటగా వినేవాడు కవి. అలికిడి అతని హృదంతరాళాల్లో పెద్ద కల్లోలాన్ని రేపుతుంది. ఆ కల్లోలపు అలజడితో హృదయం కంపన ప్రకంపనాలకు లోనవుతుంది. అది తీవ్ర వేదనకు దారితీస్తుంది. ఆ వేదనలోంచే ఒక భావం, ఆ భావానుకూలంగా సంఘటనలు కవి ఆలోచనల్లో మెదలుతాయి. భావానికి తగిన ఘటనల్ని కళాత్మకంగా, విమర్శనాత్మకంగా చక్కని పదాలతో వస్తువుగా మలుస్తాడు కవి లేదా రచయిత. అలాంటి రచయితే శశిశ్రీ.
2. రచయిత పరిచయం :
‘‘ప్రతి ఖండికలోనూ ఏదో ఒక వేదన, బాధ ప్రస్ఫుటమౌతూ వుంది. ఆ బాధ తెచ్చి పెట్టుకున్నది కాదు. ఆరోపించుకున్నదైతే దాని రంగు వేరుగా వుండి వుండేది. ప్రతి భావం అతని బొడ్డుదగ్గర్నుంచి వచ్చింది, వస్తోంది. కవిత్వానికి కావాల్సిన ప్రధాన లక్షణం యిది’’ అంటూ సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణచార్యులవారు మెచ్చుకున్న ప్రముఖ కవి, కథా రచయిత శశిశ్రీ.
శశిశ్రీగా ప్రసిద్ధి చెందిన ఈ కథా రచయిత అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా. ఆశుకవిగా, సీనియర్ జర్నలిస్టుగా మంచిపేరు పొందిన శశిశ్రీ 1957, డిసెంబరు 6న నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. తల్లి షేక్ బేపారి సలీమాబీ, తండ్రి షేక్ బేపారి అబ్దుల్ రసూల్. శశిశ్రీ హైస్కూల్ చదువుతున్న సమయంలోనే వీరి కుటుంబం సిద్ధవటానికి 20 కి.మీ.దూరంలో వున్న కడపకు వలస పోయింది. కడపకు వెళ్ళడం శశిశ్రీ జీవితంలో సాహితీ ప్రస్థానానికి నాంది అయ్యింది.
3. సీమ కరువును చిత్రించిన ‘‘అలికిడి’’:
ఈ కథలోని వస్తువు కరువు. రాయలసీమకు కరువు చాలా దగ్గరి చుట్టము. బంధు వర్గం ఏదైనా శుభకార్యాలకి పిలిస్తే వస్తారు. పిలవని పేరంటానికి వచ్చే వాళ్ళు తక్కువే. కాని రాయలసీమకు కరువు పిలవకున్నా వచ్చి తిష్టవేసే పాపిష్ఠి బంధువు. ఎంతకాదన్నా ఈ సీమకు కరువు ఏటా అలా పలకరింపుగా అయినా వచ్చి వెళ్ళాల్సిందే. రతనాల రాయలసీమగా ప్రసిద్ధి చెందినా, నేడు రాళ్ళసీమగా మాత్రమే పేరు నిలిచింది. బంగారం వేస్తే బంగారాన్ని చెట్లకు కాయించే అతి సారవంతమైన ఎర్రనేలలు, నల్లనేలలు, ఇసుక నేలలు అపారంగా వున్నాయి కాని, వర్షాభావం వల్ల, నీళ్ళులేక కరువు తాండవిస్తుంటుంది. ఒక సంవత్సరం పొలాలు దున్నుకోవడానికి వర్షంవస్తే, మరో సంవత్సరం విత్తనం వేయడం దాకా వస్తే, మరో సారి అసలేరాదు. తాగునీటికి కూడా కటకట పడవలసిన రోజులు ప్రతి సంవత్సరం ఈ సీమలో ఏదో ప్రాంతంలో తప్పక వుంటాయంటే కరువు తీవ్రతను సులభంగానే ఎవరైనా ఊహించగలరు.
4. రాయలసీమ కరువు - చారిత్రిక కోణం :
“క్రీ.శ. 1391-92 సం||ల్లో వచ్చిన ఒక కరువుని గురించి కదిరి లక్ష్మీనరసింహ వాలయం'లో ఉన్న ఒక శాసనం చెబుతోంది. ఆ కరువులో ఆకలితో మరణించిన - పుర్రెలు దేవాలయం ముందు గాలికి దొర్లుతున్నాయని ఆ శాసనం వివరిస్తోంది. Innumerable skulls were rolling about and paddy could not be had en at the rate of nail per annum) ఈ శాసనాన్ని ధ్రువపరిచే ఇంకొక కారం కూడా వుంది. క్రీ.శ. 1396-97లో పన్నెండు సంవత్సరాల కరువు వచ్చిందని రాబర్ట్ సీవెల్ అంటున్నట్టు కంభంపాటి సత్యనారాయణ చెప్పారు. సీవెల్ విజయనగర సామ్రాజ్య చరిత్రను 'A Forgotten Empire' -గా రాశాడు. దక్షిణ భారతదేశం దుర్గామాత కోపంతో పన్నెండు సంవత్సరాల కరువొచ్చినందున - దేవి కరువు' గా ఈ కరువుని పిలుస్తారని కూడా చెప్పాడు. కదిరి శాసనం ప్రకారం క్రీ.శ. 1390-91లో కరువొచ్చింది. సీవెల్ చెబుతున్న పన్నెండు త్సరాల కరువు క్రీ.శ. 1396-97లో వచ్చింది. అంటే ఈ రెండు ప్రస్తావనలూ కరువుని గురించేనని స్పష్టమవుతోంది. ఈ కరువు సింధూ ప్రాంతంలో ఉత్తర భారత దేశాన్నీ అతలాకుతలం చేసింది”. (నాడు - నుడి, పుట 62) అని చెప్పడాన్ని బట్టి రాయాలసీమకు కరువులు కొత్త కాదు అన్న విషయం స్పష్టమవుతోంది. కరువును గురించి ఇంకా ఎన్నో చరిత్రపుటలు సాక్ష్యమిస్తున్నాయి.
“తిండిలేక మనుషులే మాడిపోతుంటే పశువుల సంగతి చెప్పనక్కరలేదు. వర్షాలు లేక, బీళ్ళలో గడ్డిలేక, రైతుదగ్గర గడ్డిలేక డొక్కలు ఎండి, బక్కచిక్కిన పశువులు సంతలకు అటునుండి కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు ఈ సీమకు బాగా పరిచయమే. దేశానికి వెన్నెముక రైతు అన్నది కాదనలేని సత్యం. రైతన్నకు వెన్నెముక పంట. ఆ పంటకు వెన్నెముక నీరు. ఆ నీటికి ఆధారం వర్షం. ఈ సీమలో పిలిచినా పలకనిది వర్షం పిలవకున్నా పలికేది కరువు”(శశిశ్రీ రచనలు- సవిమర్శ పరిశీలన, అముద్రిత పిహెచ్. డి. సిద్ధాంత గ్రంథం, పుట -272.)
అలనాటి ఆదికవి వాల్మీకి మహర్షి సమాజంలోని స్త్రీ పురుష సంబంధాల వికృతివల్ల, రావణుడి వంటివారి వల్ల వేదనకు లోనై, సామాజిక బాధ్యతగా శ్రీమద్రామాయణాన్ని రచించారు. వ్యాసమహర్షుల వారు తనకు పుట్టి, తన ఎదుట పెరిగిన కురువంశ రాజుల మితిమీరిన రాజ్యకాంక్షను, ఆర్థిక అసమానత్వాన్ని, దురహంకారాల్ని, దౌర్జన్యాల్ని చూచి వేదనకు గురై, ఆస్తిని అందరూ సమానంగా పొందాలని అలా కాకుంటే పోట్లాటలు వస్తాయన్న సామ్యవాద సిద్ధాంతానికి, అనేక నీతి, న్యాయ సన్నివేశాల్ని జోడించి శ్రీమహాభారతాన్ని రచించాడు. ఇదే వ్యాసులవారు సంఘంలో భక్తిభావం పాదుకొల్పడానికి భాగవతాది పురాణాల్ని వ్రాశారని ప్రతీతి. ఈ విధంగా ప్రాథమికమైన అర్థకామాలకు, ఆ తరువాత మోక్షానికి సంబంధించిన భారతీయ మహాగ్రంథాలు మహానుభావులు పొందిన సామాజిక స్పృహవల్లనే వచ్చాయి. అట్లనే రాయలసీమ సాహిత్యం కూడా సామాజిక స్పృహ కలిగి వుంది కాబట్టి ఉత్తమ సాహిత్యమైంది. వల్లంపాటిగారన్నట్లు మంచి కథకు సంక్షిప్తతతో పాటు సంఘర్షణ చాలా ముఖ్యం. “ప్రకృతికీ, మానవునికీ మధ్య రాయలసీమలో జరుగుతున్న సంఘర్షణను సింగమనేని, కేతు విశ్వనాథరెడ్డి, చక్రవేణు, స్వామిలాంటి ఎందరో రచయితలు చిత్రిస్తున్నారు” (కథా శిల్పం, పుట 15) అలాంటి వరుసలోనివే శశిశ్రీగారి కథలు కూడా.
సిద్ధవటం ప్రాంతం పెన్నానదిలోని ఇసుకల్లో బీదసాదలు ఏరుపారి నిలిచిపోయాక వేసుకొనే దోస, కళింగర తోటలు. తండ్రి నర్సయ్య, కొడుకు శీనుల్లా ఎందరో ఆ ఇసుక తడిలో పళ్ళతోటలు పెట్టుకొని జీవనానికి కొంత సంపాదించుకుంటారు. దొంగలు పడి ఎత్తుకు పోకుండా, జంతువులు రాకుండా కంచెలు వేసుకొని, గుడిసెలు వేసుకొని పగలు,రాత్రి కాపాలా కాస్తుంటారు.
ఈ అలికిడి కథలో దోస, కళింగర కాయల తోటకు రాత్రి కాపలా పడుకొన్న తండ్రీ కొడుకులకు మొదట ఒక అలికిడి వినబడతుంది. ఒక హైనా దోసపండును నోటితో కరచుకొని తోటకు అడ్డుగా వున్న కంచెలో ఇరుక్కొని అటుపోలేక, ఇటు రాలేక ఇబ్బంది పడుతుంటే, పాముచెవుల్లాంటి చెవులున్న కొడుకు శీను విని, దగ్గరికెళ్ళి కంప కదిలించగా అది వెళ్ళిపోతుంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని. గుడిసెలో నిద్రపోతూ ఈ అలికిడికి మెలకువ వచ్చిన తండ్రి నర్సయ్య కొడుకు ద్వారా విషయం విని, దొంగచాటుగా వచ్చి దోసపళ్ళు ఎత్తుకు పోతున్న హైనాను దుడ్డుకర్రతో కొట్టి చంపకపోయావా అన్నాడు కసితో. ఈ మాటలు జరుగబోయే కథకు నాందీ వాక్యాల్లా భవిష్యత్కథా సందర్భ సూచకాలు.
5. కరువు - జీవకారుణ్యం :
తిండిలేని ‘‘దుమ్ములగొండి’’ (హైనా) తిండికోసం దొంగతనానికి రావడం, చావుదప్పి కాయను వదిలేసి పరిగెత్తిపోవడం, ఒక జీవి ఆహారానికి పడిన పాట్లను తెలుపుతుంది. రాయలసీమ తంపై మిగిలిన ప్రాంతాల ప్రజల అభిప్రాయం వేరుగా ఉంటుంది. ఇక్కడి ప్రజలను రాక్షసులుగా, దగాకోరులుగా, ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసి ప్రచారం చేస్తుంటారు. ఇక్కడి ప్రజల అనురాగాన్ని గుర్తించరు. అందుకు చాలా చలన చిత్రాలు మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. అయితే వాస్తవ పరిస్థితుల్లో ఇక్కడి జన సామాన్యం ఉందన్న విషయాన్ని రాయలసీమలోని అనేకమంది కవులు, రచయితలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలంటి వారిలో శశిశ్రీ ముందువరుసలో ఉంటారు. ఇక్కడి ప్రజలు ఎంతగా జీవ కారుణ్యాన్ని ప్రదర్శిస్తారో చెప్పడానికి అలికిడి కథలోని ఈ వాక్యాలు చాలు.
“ఎవరో కంచె తీస్తున్నారు నాయనా” అని, వేగంగా కంచె దగ్గరికి నడుస్తూ టార్చిలైటు వేశాను. టార్చి వెలుగు కంచెపై సూటిగా పడింది. ఆ వెలుగులో చారలు చారలున్న ‘దుమ్ములగొండి’ (హైనా) నోటికి దోసపండు ఇరికించుకొని – అది కళ్ళకు అడ్డురావడంతో – దిక్కుతెలియక కంపల్లో చిక్కుకొని గింజుకుంటోంది.
ఆ దృశ్యం చూసి నాకు నవ్వు వచ్చింది. ఈ చావు ఎవరు చావమన్నారు దీన్ని? దొంగతిండి తినబోతే ఇదే గతి.
దగ్గరగా పోయి – కట్టెతో దాని కళ్ళకు అడ్డుగా ఉన్న దోసపండును కదిలించాను. జారి కిందపడింది. అడ్డు తొలగిపోవడంతో – దోకుకుంటూ పారిపోయింది దుమ్ములగొండి.
“ఏందిరా.. ఎవర్రా అది?” రొప్పుకుంటూ వచ్చి అడిగాడు నాన్న. జరిగింది చెప్పాను.
“దీనెమ్మ ……. ఊరికే పోనిచ్చినావా.. దుడ్డుకర్రతో నాలుగు ఇడ్సి వుంటే చచ్చి ఊరుకుండేది కదా” దోసపండు తినిపోయిందనే అక్కసుతో అన్నాడు – వెనుదిరిగి వస్తున్న నన్ను అనుసరిస్తూ.
“పోన్లే నాయనా! ఈరోజు అది పడిన పాట్లకు – ఈ మధ్యలకు ఇంకెప్పుడూ రాదు.” అంటూ గుడిసె దగ్గరికి నడిచాను” (దహేజ్ కథల సంపుటి, అలికిడి కథ, పుట 39-40).
కథలో ఈ మాటలు తండ్రీ కొడుకుల మధ్య సాగడం గమనించినట్లితే తండ్రి తాము కష్టపడి సాగు చేసి పండించిన పంటను దొంగతనం చేయడానికి వచ్చింది జంతువు అని తెలిసి మొదట కొట్టమని చెప్పినా, కొడుకు శీను మాటలతో మెత్తబడ్డాడు. హైనాకు అడవుల్లో జంతుజాలముంటే, వేటాడి తింటుంది. లేదంటే పులుల వంటి మృగాలు వేటాడి తిని, మిగిలినవాటినో, చనిపోయిన కళేబరాలనో తిని బతుకుతుంది. అడవికి కరువు వచ్చింది కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న ఏటిలోకి వచ్చి పండుకోసం వెళ్లి, ఆ తోటకు చుట్టూ రక్షణగా వేసుకున్న ముల్లకంపల్లో ఇరుక్కుపోయింది. ఈ పరిస్థితులు రాయలసీమ ప్రాంతంలో కరువు మనుషులకే కాదు మాటలు రాని మూగ జీవాలకు కూడా ఉందన్న విషయాన్ని స్పష్టపరుస్తోంది. ఆకలి నేరమెరుగదు కాబట్టి, అట్లా దోసపండును ఎత్తుకు పోవడం నేరమని తెలియదు కాబట్టి, వచ్చి తినబోయి కంపల్లోపడి, పారిపోయింది. శీను గనుక కొట్టివుంటే దెబ్బకు చచ్చి వుండేది హైనా. ఇక్కడ రైతు కొడుకు చూపిన జీవ కారుణ్యం రాయలసీమ ప్రాంత వాసుల జీవకారుణ్యానికి ప్రతీకగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వతహాగా రాయలసీమ ప్రాంతవాసులు మనుషులపైనే కాదు, మూగ జీవాలపట్ల జీవకారున్యాన్ని ప్రదర్శిస్తారన్న విషయాన్ని రచయిత “అలికిడి” కథ ద్వారా పాఠకులముందు ఉంచుతున్నాడు.
6. పండించిన పంట రక్షణపై జాగ్రతలు :
తండ్రీ, కొడుకులు తోటకు కాపాలా కాస్తూ మరలా నిద్రలోకి జారుకున్నారు. తండ్రి గురకలు పెట్టి నిద్రపోతూ వుంటే కొడుకు శీనుకు ఇసుకలో ఏదో ఈడ్చుకుపోతున్నట్లు రెండవసారి అలికిడి వినిపించింది. ఇసుకలో దేన్నో ఈడ్చుకొని పోతున్న శబ్దం స్పష్టంగా శీనుకు వినిపిస్తుంది. అది జంతువుల శబ్దం కాదని, మానవ మృగాలు దోసపళ్ళును సంచుల్లో వేసుకొని ఇసుకలో జరజరా ఈడ్చుకుపోతున్నారని గ్రహించిన శీను తండ్రిని లేపి, ఆ శబ్దం వస్తున్న దిశగా టార్చిలైటు వేస్తూ పరుగెత్తారు. నిక్కరు మాత్రమే వేసుకొన్న ఓ మానవాకారం సంచిని ఈడ్చుకొంటూ వెళుతుండటం గమనించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కనీసం శరీర అలసట తీరడానికి అవసరమైన నిద్రను కూడా నిద్రపోకుండా పంటను కాపాడుకోవడంలో రాయాలసీమ రైతు పంటను కాపాడుకోవడం పట్ల తీసుకున్న జాగ్రత్త కనిపిస్తుంది. అసలే కరువు ప్రాంతమైన రాయలసీమలో పంటలు పండటమే ఒక అపూర్వం. కాబట్టి దాన్ని కాపాడుకోవటానికి కుటుంబానికి చెందిన ఇద్దరు మగవాళ్ళు రాత్రుళ్ళు కాపలాకు వెళ్ళటం, అదీ ఎంతో జాగ్రతతో పంటను కాపాడుకోవటాన్ని మనం గమనించవచ్చు.
7. రాయలసీమలో వ్యవసాయం - పెట్టుబడి - కరువు చిత్రణ :
‘‘గత డెబ్బయిరోజులుగా చిన్న పిల్లల్ని సాకినట్లుగా ఆ దోస చెట్లను సాక్కుంటున్నాం. ఆ చెట్ల కోసం ఇంట్లో మిగిలిన చివరి సొత్తు అమ్మ చెవులకున్న కమ్మలు కూడా తెగనమ్మితే కానీ, ఎరువులకు, పురుగుమందులకు సరిపోలేదు” (దహేజ్ కథల సంపుటి, అలికిడి కథ, పుట43).
అని అలికిడి కథలో నర్సయ్య కొడుకు ద్వారా చెప్పించడాన్ని మనం గమనిస్తే రాయలసీమలో వ్యవసాయం చేయాలంటే ప్రతి పంట పెట్టే సమయంలో ఇంట్లో ఉన్న వస్తువులను, కుటుంబంలో ఉన్న స్త్రీల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడమో, లేక అమ్మివేయడమో సర్వ సాధారణం అని గమనించాలి. అందువల్ల ఆ దోస చెట్ల పెంపకానికి చివరికి ఇంటాలి చెవులకున్న కమ్మలు కూడా తెగనమ్మారు మందులకు, ఎరువులకు. ఈ పంటలో కాస్తో, కూస్తో వస్తే వాళ్ళమ్మాయి వెంకటలక్ష్మి పెళ్ళి చేయాలని ఆశిస్తున్నారు.
8. రాయలసీమలో కరువు ప్రభావం - మోతుబరి రైతు దొంగగా మారటం:
కొంచెమైనా కష్టాలు తీరుతాయని భావించిన వీరి పంటను దొంగలు ఈడ్చుకు పోతుండటం చూసి, నర్సయ్య నోటికి వచ్చిన బండబూతుల్ని తిడుతూ, వెంబడించి, చేతికర్రను దొంగపైకి విసిరాడు. ఆ కర్ర సరిగ్గా దొంగకు తగిలింది. ఎక్కడ తగిలిందో కాని, ఓయమ్మో అంటూ బాధతో అరుస్తూ కంచెదాటి పరుగెత్తాడు. శీను పట్టుకోబోతుంటే ‘‘ఓ నర్సయ్యా నేనేలేరా’’ అంటూ చావుబతుకుగా ఏటి నీళ్ళలో దిగి పరుగెత్తాడు. నర్సయ్యకు ఆ గొంతు ఎవరిదో తెలిసింది. గుండెలో ఏదో అలికిడయ్యింది. దొంగను పట్టుకోబోతున్న కొడుకును ఆపాడు. ఆ దొంగ ఎవరో చెప్పాడు.తిరిగి గుడిసెవద్దకు వచ్చి ఆరిపోతున్న నిప్పులను రగిలించి మంట వేసుకొని, ఆ నిప్పులతోనే బీడిలను అంటించుకొని వెంటవెంటనే కాలుస్తూ అప్పుడప్పుడు కారుతున్న కన్నీళ్లను భుజంపై ఉన్న తుండు గుడ్డతో తుడుచుకుంటున్న తండ్రిని-
“ఏంది నాయనా! ఎందుకు బాధపడుతున్నావ్. ఇంతకూ ఆ దొంగ ఎవరు” అనునయంగానే నిజం రాబట్టాలని అడిగాను.
“ఎవరో అయితే నేను ఎందుకు బాధపడుతాన్రా అబ్బీ! ఎవరో కాదురా, మన ఆసామి నేకనాపురం రామయ్య కొడుకు కిష్టప్ప!” రహస్యం విడదీస్తూ చెప్పాడు.
నెత్తి మీద పిడుగు పడినట్లయింది నాకు.
రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. వాళ్ల పరిస్థితి దిగజారినా – నలుగురిలో నామోషీగా ఉంటుందని కూలికి పోలేక…… భూముల్లేని పేదోళ్ళ ఏటి సేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ల కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’పోయింది.
పదేళ్ళ క్రితం వరకు నాన్న ఆయప్ప అంచున భూములు చేసుకొనే సేద్యగానిగా ఉండేవాడు. రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. నాన్నను సేద్యగానిగా పెట్టుకోవడం వాళ్ల పాలికి అదనపు బరువు అయ్యింది. ఆ విషయం చెప్పలేక – వాళ్లు వెనకా ముందు అవుతుంటే – ఆరోగ్యం సరిగా ఉండటం లేదని నాయనే అబద్ధం చెప్పి పని మానుకొన్నాడు” (దహేజ్ కథల సంపుటి, అలికిడి కథ, పుట.46).
ఇక్కడ రాయలసీమ రైతు పరిస్థితి, వరుస కరువుల వల్ల ఆర్థికంగా మోతుబరి రైతులు కూడా చిక్కిపోవడమూ, వరుస కరువులు వెంటాడుతున్నా వ్యవసాయం చేయడం మాత్రం ఆపక పోవడం, వ్యవసాయాన్ని వదిలివేస్తే సమాజంలో గౌరవం ఉండదు అని భావించడం రాయలసీమ రైతు కుటుంబాలలో సర్వసాధారణం. అందువల్లనే నేకనాపురం రామయ్య ఆర్థికంగా ఎలా చితికిపోయిందీ రాయలసీమ ప్రాంత కరువును చిత్రించడమే కాదు, రైతుగా వ్యవసాయాన్ని ఎంతలా ఇష్టపడుతారో, దాని వల్ల ఏమి కోల్పోతున్నారో చెప్పే ప్రయత్నం చేశారు శశిశ్రీ గారు. అయితే రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం చేయడం జూదం ఆడటం లాంటిదే అని సింగమనేని నారాయణ గారు 1978 లోనే చెప్పారు. ఆంద్ర రాష్టంలోని ఏ ఇతర ప్రాంత రచయిత ఈ సమయానికి ఇటువంటి అభిప్రాయాన్ని అభివర్ర్ణించలేదు. ఈ స్థల కాల చైతన్యం సింగమనేని నారాయణగారి ఊబి (1987) విముక్తి (1987)కథలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది (అస్తిత్వ వ్యాస సంపుటి, పుట 97)
నర్సయ్య పదేళ్ళ క్రితం వరకు నేకనాపురం రామయ్యగారింట్లో సేద్యగానిగా పనిచేశాడు. ఆ రామయ్య కొడుకు కిష్టప్ప. చాలా మంచి కుటుంబం. కరువు దెబ్బలతో రానురాను వారి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇల్లు గడవడమే కష్టమైంది. నర్సయ్యను వద్దనలేక సతమతమవుతున్న విషయాన్ని గమనించి, తన ఆరోగ్యం బాగాలేదని నర్సయ్యే మానుకొని, సొంతంగా కూలినాలితో, రెక్కల కష్టంతో బతుకుతున్నాడు. నాటినుండి నేటి దాకా కూలినాలిపై బతికేవాళ్ళు కాబట్టి నర్సయ్య కుటుంబం పూర్తిగా చెడిందీ లేదు, గొప్పగా బతికిందీ లేదు. కానీ పెన్నానదిలో ఏరు నిలిచాక దోస, కలింగర తోటలు వేసుకుంటూ కొంత నిలదొక్కుకున్నాడు. కాని రామయ్యగారి సంసారం ఏటికేటికి దిగదుడుపే అయ్యింది.
‘‘నలుగురిలో నామోషిగా వుంటుందని కూలికి పోలేక, భూముల్లేని పేదోళ్ళ ఏటిసేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’ పోయింది’’ (దహేజ్ కథల సంపుటి, అలికిడి కథ, పుట46) అనే మాటలను గమనిస్తే నలుగురికి సాయం చేసే స్థితిలో బతికి, కరువు రాక్షసి కరాళ నృత్యపు తాకిడికి లోనై సీమలోని ఎందరో రైతుల్లా ఆత్మహత్యలు చేసుకోలేక, జీవచ్ఛవాలుగా మిగిలారు.
నర్సయ్యను గనుక అడిగివుంటే రాముడికి దోసపళ్ళు ఎన్నయినా పంపివుండే వాడు. నర్సయ్యకు వారి కుటుంబంపై అంత అభిమానం. కాని తమ దగ్గర సేద్యగానిగా పనిచేసిన వ్యక్తి దగ్గర చెయ్యి చాచడం చిన్నతనమని భావించి ఆపనీ చేయలేకపోయారు. ఆకలి ఏ పనినైనా చేయిస్తుంది, అందువల్ల అర్ధరాత్రిపూట, తమకు తెలిసిన నర్సయ్య సాగుబడి చేసి పండించిన కాయల్నే దొంగిలించవలసిన పరిస్థితి వచ్చింది.
రాయలసీమ ప్రాంత రైతు ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు ఎన్ని సార్లు పంటలు నష్టపోయినా తిరిగి మళ్ళీ పంట వేయడానికే ఇష్టపడుతాడు. తన పొలాన్ని బీడుగా వదిలేయలేడు. అలా అని వేరే ప్రాంతానికి ఉపాధికీ వెళ్ళలేడు. కానీ ఆకలి తీర్చుకోవడం తప్పని సరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక తమ కుటుంబం వద్ద పాలేరుగా పనిచేసిన వారి తోటలోకి దొంగతనానికి వెళ్లి, అదీ చేతగాక చివరికి మరణాన్ని ఆశ్రయించడం ఈ ప్రాంత రైతు జీవన పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇలాంటి సంఘటనలను రాయలసీమ రచయితలు చిత్రంచడం వారిలోని దయార్ద్ర హృదయాలకు సాక్ష్యం. సీమలో రైతుగా పుట్టడం ఎంతటి హీనస్థితో దీన్ని బట్టి అర్థమవుతుంది.
9. రైతు ఆత్మహత్య - మానవత్వ అలికిడి :
ఉదయాన్నే రాముడి ఇంటికి ఓ గోనెసంచెడు దోసకాయల్ని పంపుదామనుకొన్న వీరికి హృదయ విదారకమైన క్రిష్ణయ్య చావు వార్త కూలీల ద్వారా తెలిసింది. ఎగువపేట మిట్టమీద క్రిష్ణయ్య పురుగుల మందుతాగి చనిపోయాడని అందరూ అనుకొంటున్నారు. తన ఆత్మగౌరవాన్ని పాడుచేసిన దొంగతనంవల్ల క్రిష్ణయ్య ఆత్మహత్య చేసుకొని వుంటాడు. లేదా నర్సయ్య చేతి కర్రదెబ్బకైనా చనిపోయి వుంటాడు. క్రిష్ణయ్య అకాల మరణానికి తామే కారణమని తండ్రీ కొడుకులిద్దరి హృదయాల్లో ముళ్ళుగుచ్చుకొన్నంత బాధ కలిగింది. ఇద్దరి మనసుల్లో మానవత్వపు అలికిడి అయ్యింది. సీమ కరువు కరుణ సార్వత్రికమయ్యింది.
10. ముగింపు:
ఈ అలికిడి కథలో మూడు అలికిడులున్నాయి. మొదటి అలికిడి దోసకాయలకోసం దొంగతనంగా వచ్చిన హైనా చేసింది. కొడుకు శీను ఆ అలికిడి విన్నాడు. కంపల్లో ఇరుక్కొన్న దాన్ని కంపతీసి బయటికి వెళ్ళేటట్టు చేశాడు. హైనాపట్ల శీనుకు సానుభూతి వుంది. జంతువు తిండి ఆశతో వచ్చిందన్న మానవత్వం వుంది. అందుకేదాన్ని చంపే అవకాశమున్నా, చేతిలో బలమైన కర్ర వున్నా, అది తనకు చేరువలోనే వున్నా దాన్ని వదిలేశాడు. చంపరాదన్న భావం జీవకారుణ్య హృదయంలో అలికిడి చేసింది. హైనా చేసిన దొంగతనపు అలికిడి, శీను హృదయంలో మానవత్వపు అలికిడి చేసింది.
రెండవ అలికిడి దొంగతనానికి వచ్చిన రాముడు కొడుకు క్రిష్ణయ్య చేసింది. దోసపండ్లను గోనె సంచిలో వేసుకొని ఇసుకలో ఈడ్చుకొని పోతున్న శబ్దమది. ఆశబ్దం వచ్చిన వైపు తండ్రి కొడుకులు పరుగెత్తారు. మనిషి గోనెసంచిలో దోసపండ్లను ఈడ్చుకు పోతున్న దృశ్యాన్ని చూచిన వెంటనే ఇద్దరికీ హృదయాల్లో ఆవేశం, కోపం, బాధతో కూడిన అలికిడి అయ్యింది. ఆ అలికిడికి ప్రతిస్పందనగా తండ్రి చేతిలోని దుడ్డుకర్ర విసరబడిరది. క్రిష్ణయ్యకి తగిలింది. దొంగతనానికి వచ్చిన క్రిష్ణయ్య అరుపుకు తండ్రి నర్సయ్యకు మరలా మానవత్వపు అలికిడి అయ్యింది.
“హృదయంలో క్రిష్ణయ్య చావుకబురు విని ముచ్చటగా మూడవసారి తండ్రీ కొడుకులు ఇద్దరికీ ఒకేసారి ఒకే విధంగా హృదయంలో శోకభరితపు అలికిడి అయ్యింది. ఈ మహా అలికిడి రాయలసీమలో మానవత్వమున్న మనుషులు, కవులు, రచయితలు పొందుతున్నదే. ఈ మూడింటి కంటే ముందు ప్రప్రథమంగా కథకుడిలో కలిగిందే మొదటి అలికిడి”.
11. ఉపయుక్తగ్రంథసూచి:
- జ్యోత్స్న, యం.టి. (2018). శశిశ్రీ రచనలు-సవిమర్శ పరిశీలన, అముద్రిత పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం, శ్రీకృష్ణదేవరాయవిశ్వవిద్యాలయం, అనంతపురము.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి (1995) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- వెంకటయ్య, తవ్వా (సంపాదకుడు) (2015), రాయలసీమ తొలితరం కథలు, అక్షరదీపిక పబ్లికేషన్స్, తవ్వారుపల్లి, కడపజిల్లా.
- వెంకటయ్య, తవ్వా (సంపాదకుడు) (2014), సీమ కథా తొలకరి, వ్యాస సంపుటి, అక్షరదీపిక పబ్లికేషన్స్, తవ్వారుపల్లి, కడపజిల్లా.
- శశిశ్రీ (2015). రాతిలోతేమ(కథల సంపుటి), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- శశిశ్రీ (2015). దహేజ్ (కథల సంపుటి), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- శ్రీనివాస్, అంకే (2023). అస్తిత్వవ్యాససంపుటి, కవన ప్రచురణలు, అనంతపురము.
- శ్రీనివాస్, అంకే (2023). నాడు - నుడి వ్యాససంపుటి, కవన ప్రచురణలు, అనంతపురము.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.