headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. చక్రవేణు ‘కువైట్ సావిత్రమ్మ’ కథ: పాత్రలు- మానవసంబంధాలు

డా. తంగి ఓగేశ్వరరావు

తెలుగు అధ్యాపకులు
వి. వి. గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడప,
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

చక్రవేణు రాయలసీమ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యంగా కడప గ్రామాలను దగ్గరగా పరిశీలించారు. పైగా తానూ పుట్టిపెరిగిన ప్రాంతం రాయలసీమ కావడం వాళ్ళ కూడా అతని కథలలో రాయలసీమ పల్లెలలోని కరువు పరిస్థితులు, కరువు మానవసంబంధాలను ప్రభావితం చేసే తీరు వాస్తవికంగా కనిపిస్తుంది. పూర్వం నుండి కూడా రాయలసీమ కరువు నేపధ్యంలో అనేక కథలు వచ్చినా గల్ఫ్ వలసల నేపధ్యంలో వచ్చిన అతికొద్ది కథలలో ఈ కువైట్ సావిత్రమ్మ కథ ఒకటి. నిజానికి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళినవారు ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలో కనిపిస్తారు. వాళ్ళు దేశం కాని దేశానికి వలస వెళ్ళడానికి అనేక కారణాలు ఉంటాయి. అటువంటి కొన్ని కారణాలను తీసుకొని చక్రవేణు ఈ కువైట్ సావిత్రమ్మ కథను రాశారు. ఈ కథలోని సావిత్రమ్మలు నేడు మన రాష్ట్రంలోని ప్రతిగ్రామంలోనూ కనిపిస్తారు. పేదరికం మానవసంబంధాలను ప్రభావితం చేసే విధానాన్ని కూడా రచయిత ఈ కథలో చూపించిన తీరు వాస్తవికంగా ఉంది. నేడు మన పల్లెల యథార్ధ గాథను చక్రవేణు కువైట్ సావిత్రమ్మగా అక్షరబద్ధం చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కథను రాయడానికి అవసరమైన సమాచారాని మా కళాశాల గ్రంథాలయం నుండి మరియు అంతర్జాలం నుండి సేకరించాను. రాయలసీమ సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల నేపధ్యంలో వచ్చిన అనేక తెలుగు పరిశోధనా సిద్ధాంత వ్యాసాలలో చక్రవేణు కథల గురించి పేర్కోవడం జరిగింది. డా.యం.వి.నాగ సుధారాణి గారు తన ‘రాయలసీమ కథలు-క్షామ చిత్రణ' అనే సిద్ధాంత గ్రంథంలో ఇతని కథలను గురించి విస్తృతంగా చర్చించారు. అదే విధంగా రాయలసీమ రచయితల కథా సంకలనైన ‘సీమ కథలు’ మొదలైన సంకలనాలలో ఇతని కథలను చేర్చారు.

Keywords: కువైట్ సావిత్రమ్మ, రహిమన్, చిన్నబ్బ, పెద్దబ్బ, రామలక్ష్మమ్మ, మానవసంబంధాలు, కథ, చక్రవేణు.

1. ఉపోద్ఘాతం:

కడప జిల్లా రైల్వేకోడూరు సమీపలోని లక్ష్మిగారిపల్లె కు చెందిన చక్రవేణు 1960 లో జన్మించారు. ఈయన పూర్తి పేరు చక్రవేణుగోపాల్. వీరు ‘కసాయి కరువు’, ‘కొత్త చదువు’, ‘మృత్యుహక్కు’ ‘తెగిన పేగు’, ‘కువైట్ సావిత్రమ్మ’ వంటి మంచి కథలు రాసారు. ఈయన నలుపు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉపసంపాదకుడిగా పని చేశారు. వీరి కథలతో ‘కొత్తచదువు’ కథాసంకలనం వెలువడింది. 1993 లో తిరుపతిలో ఆంధ్రజ్యోతి కార్యాలయానికి విధి నిర్వహణకు వెళ్తూ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ప్రమాదానికి గురై చిన్న వయసు లోనే మృతి చెందారు.

చాలా తక్కువగా రాసి చాలా ఎక్కువగా జిజ్ఞాసువుల దృష్టిని ఆకర్షించిన రచయిత చక్రవేణు”1 అని డా.ద్వా.నా.శాస్త్రి గారు ప్రశంసించారు.
చక్రవేణు రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ అప్పట్లో ఒక సంచలనం. ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో విలక్షణమైన గొప్ప కథగా విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ కథ 20 జూలై 1990న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. పల్లెల పచ్చదనం గురించీ, పల్లెవాసుల మానవ సంబంధాల జీవన సౌందర్యం గురించీ సాహిత్యంలో కలల ప్రపంచాన్ని సృష్టించే మధ్యతరగతి మిథ్యాజీవుల రచనా ధోరణికి భిన్నంగా– ఓ కర్కశ జీవిత వాస్తవాన్ని మరింత నిర్దాక్షిణ్యంగా కథలోకి తెచ్చిన అరుదైన రచయిత చక్రవేణు.

కతాభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన కడపజిల్లా రచయితా చక్రవేణు. 1985లో రచన ప్రారంభించిన చక్రవేణు తన ఏడెనిమిది సంవత్సరాల రచనా జీవితంలో రాసింది ఏడు కథలు మాత్రమే. వీనిలో ‘కువైట్ సావిత్రమ్మ’ శాశ్వత విలువలు కలిగిన కథ………రోషాలకు నిలయమైన కడపజిల్లాలో కరువు కారణంగా చితికిపోయిన రైతు కుటుంబాలవారు ఎలాంటి నైతిక పతనానికైనా సిద్ధం కావటాన్ని హృదయ విదారకంగా చిత్రించిన కథ ‘కువైట్ సావిత్రమ్మ'”2 అని డా.యం.వి. నాగ సుధారాణి గారు పేర్కొన్నారు.

కథా చిత్రణలో flashback ను ప్రతిభావంతంగా వాడుకోవటం, పాఠకుడికి ఊపిరాడనంత వేగంగా కథను పరిగెత్తించిన తీరు, సూటిగా క్లుప్తంగా మామూలు మాటల్లో జీవితపు కాఠిన్యాన్ని చిత్రించటం ఈ ‘కువైట్ సావిత్రమ్మ’ కథలో కొట్టొచ్చినట్టు కనపడే రచనా శైలి. కడప ప్రాంతం నుంచి బొంబాయి వెళ్ళే కిక్కిరిసిపోయిన ఆనాటి రైళ్ళూ, ఊళ్ళూ ఈ కథా నేపద్యం.

2. ఇతివృత్తం:

ఉన్న ఊరు కడుపుకింత తిండి పెట్టలేకపోతే, తిండి సంపాదించుకునేందుకు తగ్గ పని చూపించలేక పోతే, పొట్ట చేత పట్టుకుని ప్రయాణం కట్టాల్సింది ప్రవాసానికి. పెద్దగా చదువుకోని వాళ్లకి, బరువు పనులు చేయడానికి వెనకాడని వాళ్లకి, వాళ్ళు చేయగలిగినంత పనిచేయించుకుని ప్రతిఫలాన్ని దీనార్లలో ముట్టచెప్పడానికి గల్ఫ్ దేశాలు ఉన్నాయి. పుట్టి పెరిగింది కోనసీమైనా, రాయలసీమైనా ఊరు ఉపాధి చూపించలేనప్పుడు ప్రయాణం కట్టాల్సింది కొయిటాకే. సావిత్రమ్మ కువైట్ వెళ్ళడానికి కారణం కూడా ఇదే. కువైట్ కధాంశంగా వచ్చిన అతి కొద్ది కథల్లో  'కువైట్ సావిత్రమ్మ'  ఒకటి.
కువైట్ నుంచి తిరిగి వచ్చిన సావిత్రమ్మ పెద్దూరులో స్థలం కొని, ఇల్లు కట్టుకొని  తన కూతురికి, కొడుక్కి వైభవంగా వివాహం చేయడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో అందరూ ఆమెను గౌరవంగా చూస్తారు. తమ వారికి కువైట్కి వీసాలు తెమ్మని అడుగుతారు. ఈ సందర్భంలో సావిత్రమ్మ తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది.

తన భర్త మరణాంతరం పెద్దూరులో తమ బంధువులు ఎవరూ ఆదుకోకపోగా, ఎలాగో గుట్టుగా బ్రతుకుతున్న తనను తన బావ, మరిది పంచాయితీలో పెట్టి  ఆ ఊరును వదిలి వెళ్ళేలా చేయడం గుర్తుకువచ్చి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తన పిల్లలను కాపాడుకోవడానికి కువైట్ వెళ్ళవలసి రావడం, అక్కడ తాను పెడ్డ ఇబ్బందులు అన్ని జ్ఞప్తికి వచ్చి దుఃఖిస్తుంది.

ఒకప్పుడు తనను అవమానించి, అన్యాయంగా ఆ గ్రామం నుండి వెళ్ళిపోయేలా చేసిన వారే ఇప్పుడు సావిత్రమ్మను సహాయం చేయమని ఆమె చుట్టూ తిరిగితారు. చివరికి పంచాయితీలో సావిత్రమ్మను అవమానించిన ఆమె మరిది చిన్నబ్బ కూడా ఆమె వద్దకు వచ్చి తన భార్య రామలక్ష్మిని కువైట్కి తీసుకు వెళ్ళమంటాడు.  సావిత్రమ్మ రామలక్ష్మితో కువైట్ వెళ్ళే సమయంలోనూ, కువైట్లోనూ ఎదురైయ్యే ఇబ్బందులను వివరిస్తుంది. చివరికి వారిద్దరూ కువైట్కి ప్రయాణం కావడంతో ఈ కథ ముగుస్తుంది.

ఈ కథను పరిశీలిస్తే ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే’ అన్న మార్క్స్ మాటలు గుర్తుకు వస్తాయి. చిన్నబ్బ, పెద్దూరు గ్రామస్తులు, షావుకారు నాగయ్య, రెహమాన్ మొదలైన పాత్రలను పరిశీలిస్తే డబ్బు ముందు నైతికత తలవంచిన విషయం స్పష్టమవుతుంది. కథకుడు మనుషులు మధ్య బంధుత్వంగాని, స్నేహంగాని సంపదను బట్టే ఉంటాయని చూపించిన తీరు వాస్తవికంగా ఉంది. 

3. పాత్రల చిత్రణ:

3.1 సావిత్రమ్మ:

సావిత్రమ్మ పెద్దగా చదువుకున్నది కాదు. పెద్దబ్బ ఇంటికి కోడలయ్యింది. పెద్దబ్బ అన్న పేరుకి తగ్గట్టుగానే ఆ ఊరికంతటికీ వాళ్ళదే చాలా పెద్ద రైతు కుటుంబం. నలుగురికీ మంచీ చెడూ చెప్పే కుటుంబం. వాళ్ళ పేరుమీదనే ఆ ఊరికి పెద్దూరు అని గుర్తింపు వచ్చింది. సావిత్రమ్మ ఆ వైభవాన్ని చూసింది. వ్యాపారంలో నష్టం వచ్చి దివాలా పరిస్థితి వచ్చినపుడు, భర్త అన్నదమ్ములతో వేరుపడి, అప్పులకింద తన ఇంటి వాటా తమ్ముళ్ళకి వదిలేసినప్పుడు దారిద్ర్యాన్ని చూసింది.

వేరు పడ్డ ఏడాది తిరక్కుండానే భర్త మరణించిన తర్వాత సావిత్రమ్మ చూసింది మాత్రం కటిక దరిద్రాన్ని. తన వాళ్ళెవరూ పూట భోజనానికి పిలవలేదు. పిల్లలకి వండి పెట్టమని శేరు గింజలైనా కొలవలేదు. తనే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే బావ, మరుది ఆమెని వీధిన పెట్టారు. వ్యభిచారం చేసి ఇంటి పరువు బజారున పెడుతోందని యాగీ చేశారు. ఊరు విడిచి పెట్టి వెళ్ళాల్సిందే అన్నారు. మరిది చిన్నబ్బ అయితే పంచాయితీ పెద్దల ఎదుట వీరంగమాడాడు. “అది నాకు వదిన కాదు. మా అన్న చచ్చిన రోజే నాకు వదిన కాకుండా పోయింది”3 అనేశాడు.

పిల్లల్ని తన తల్లి దగ్గర వదిలి, ఏజెంట్ రెహ్మాన్ సాయంతో కువైట్ వెళ్ళింది సావిత్రమ్మ. ఆ ప్రాంతం నుంచి ఆ దేశానికి వెళ్ళిన మొదటి మనిషి ఆమె. అందుకే ‘కువైట్’ అన్నది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. కష్టపడింది సావిత్రమ్మ. రెక్కలు ముక్కలు చేసుకుంది. సంపాదించింది. సంపాదించిన దానితో తన భర్త ఊళ్లోనే స్థలం కొని ఇల్లు కట్టింది. ఒకేసారి కూతురికీ, కొడుక్కి పెళ్ళిళ్ళు చేసింది. ఊళ్ళో అప్పటివరకూ ఏ పెళ్ళి అంత వైభవంగా జరగలేదు. అంతేనా మధ్య మధ్యలో ఊరికి వచ్చిన ప్రతిసారీ వీసాలు తెచ్చి సాయం కోరిన కొందరిని కువైట్ తీసుకెళ్ళింది.

కూతురు కాపురానికి వెళ్ళిన సాయంత్రం మరిది చిన్నబ్బ, తోడికోడలు రామలక్ష్మమ్మ వచ్చారు ఆమె ఇంటికి. వీసాలు తెచ్చిందేమో అడిగారు. తను తేలేదనీ, రెహ్మాన్ని అడగమనీ చెప్పింది సావిత్రమ్మ. “రెహిమానన్నని అడిగితే మొగోళ్ళకి తేలేదు. ఆడోళ్ళకు కావాలంటే వీసాలు తెచ్చినామని చెప్పినాడు వదినా!”4 చిన్నబ్బ మొదటిసారిగా నోరు విప్పాడు. ఒకప్పుడా రెహమాన్ సాహిబ్ నూ తననూ ఇంట్లో వేసి అగ్గి పెడతానని గలాటా చేసిన చిన్నబ్బ, ‘రెహిమానన్న’ అనడం ఆశ్చర్యంగా అనిపించింది సావిత్రమ్మకి. అతని నీచమైన మనస్తత్వాన్ని అసహించుకుంది.

కువైట్ వెళ్ళమని తన భర్త చిన్నబ్బ పెట్టె బాధలను చెప్పుకొని, తనను కూడా కువైట్ తీసుకెళ్ళమని ప్రాదేయపడిన రామలక్ష్మమ్మతో “అక్కడ చానా ఇబ్బందులుంటాయి. వాటిని ఓర్చుకునేట్టుగా ఉంటేనే రావాల. ఒకేల వచ్చినాక అక్కడి పనులు చేయలేమనుకుంటే మీకే నష్టం.. అందుకని ముందుగానే ఆలోచించుకోండి”5 అని గట్టిగానే చెప్పింది సావిత్రమ్మ. ఏజెంట్ల గుట్టునీ, దళారీతనాన్నీ తోడికోడలికి పూస గుచ్చినట్టు వివరించింది. “నిన్ను తీసుకుపోతా ఉండారే ఏజెంట్లు, వాళ్ళు నిన్ను మర్యాదగా చూస్తారనుకోగాకు. వాళ్లకు కావాల్సిన మొగోళ్ళ దగ్గరకల్లా నిన్ను పంపిస్తారు. వాళ్ళు చెప్పింది చెయ్యకుండా కోవేటుకి పోలేవు. నేను చెప్పేది మాత్రం అచ్చరాల నిజం. అందుకని బాగా ఆలోచించుకో”6 అంది చివరగా.

మనుషుల మీద డబ్బు ప్రభావం ఎంతగా ఉంటుందో, పేదరికం మనిషి చేత ఏమేం చేయిస్తుందో కళ్ళ ముందుంచే విధంగా రచయిత సావిత్రమ్మ పాత్రను తీర్చిదిద్దారు.

3.2 చిన్నబ్బ :

ఇతను సావిత్రమ్మ మరిది. స్వార్ధపరుడు. తన ఆనందం కోసం ఎన్ని జీవితాలను బలిపెట్టడానికైనా వెనుకాడడు. తన అన్న మరణించి నెలరోజులు తిరగక ముందే వదినను చెరిచిన నీచుడు. పతనమవుతున్న కుటుంబ సంబంధాలకు ఈ చిన్నబ్బ నిదర్శనం. చిన్నబ్బ భార్య రామలక్ష్మమ్మ కువైట్కి తీసుకెళ్ళమని సావిత్రమ్మను అడిగినప్పుడు “నాకు ఎందనా యిదిలేక, బిడ్డల్ని పస్తులు పండుకోమని చెప్పలేక, వాళ్ళ తిండికోసమని, కాని కూడని పనికి కక్కుర్తిపడితే, నీ మొగుడు పంచాయితీ పెట్టి వూరెళ్ళగొట్టినాడు.ఇప్పుడు నిన్నేమో తెలిసి కూడా అతనే ఎభిచారంలోకి దింపుతున్నాడు. దీన్నేమంటారో అడగలేక పోయినావా!”7 అని సావిత్రమ్మ చిన్నబ్బ గురించి అతని భార్యతో చెబుతుంది.

అదేవిధంగా “మామా, ఊర్లో యిన్ని రోజులా ఇది, ఎవురెవురతోనో ఎభిచారం చేసింది. ఎన్నిసార్లో కొట్టినాం, తిట్టినాం. అయినా మానుకోలా. నలుగుర్లో మా పరువు తీసింది. ఇప్పుడు అక్కడెక్కడి నుంచో కువైట్ కు పోయి ఒకనా కొడుకు వచ్చివున్నాడు. ఈళ్ళమ్మగారి వూరంట, రహిమాన్ అంట, ఆడితో కులకతా వుండింది. మా వంశాన్ని నాశనం చేయడానికే ఇది మా యింటి కొచ్చింది”6 అని చిన్నబ్బ నలుగురి మందు సావిత్రమ్మను అవమానిస్తాడు. ఇలా సావిత్రమ్మను అవమానించిన చిన్నబ్బే ఆమె కువైట్ వెళ్ళి డబ్బు సంపాదించడం చూసిన తర్వాత సిగ్గు మానం వదిలి ఆమె వద్దకు వచ్చి తన భార్యను కువైట్ తీసుకెళ్ళమనడం, ఒకప్పుడు తాను అవమానించిన రెహమాన్నే రెహమాన్ అన్న అని పిలవడం, తన భార్యకు కిష్టం లేదని ఎంతచెప్పినా వినకుండ కొట్టి బలవంతంగా కువైట్ వెళ్ళడానికి ఒప్పించడం చూస్తే ప్రస్తుత సమాజంలో తన స్వార్ధం కోసం ఇతరులతో సంబంధాలను పెట్టుకునే వ్యక్తులకు ప్రతినిధిగా రచయిత ఈ చిన్నబ్బ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.

3.3 రామలక్ష్మమ్మ :

ఈమె చిన్నబ్బ భార్య. సావిత్రమ్మ తోటికోడలు. దుర్మార్గుడైన భర్త పెట్టె బాధనలు మౌనంగా బరించే పాత్ర. “గతంలో వేర్లు పోకమునుపు కూడాగా వున్నప్పుడు కూడా తోడికోడలు రామలక్ష్మమ్మ తనతో వ్యతిరేకంగా వుండింది కాదు. అయితే మరిది చిన్నబ్బ చేసిన కట్టుదిట్టానికి భయపడి తనతో సన్నిహితంగా వుండేది కాదు. ఆ విషయం సావిత్రమ్మ ముందు నుంచి కూడా అర్థం చేసుకొన్నందువల్లనే, సావిత్రమ్మ; రామలక్ష్మమ్మ పట్ల అభిమానంగా వుండేది”8 అని రచయిత అన్న మాటలు రామలక్ష్మమ్మ అస్వాతంత్రురాలని స్పష్టంజేస్తున్నాయి.

సావిత్రమ్మ కువైట్ వెళ్ళాలని నిశ్చయించుకున్న రామలక్ష్మమ్మతో కువైట్ ప్రయాణంలో ఉండే కష్టాలను వివరుస్తుంది. ఆమె మాటలు విన్న రామలక్ష్మమ్మ “మా యింటాయనకు ఆ సంగతులన్నీ తెలిసి కూడా నన్ను పంపిస్తన్నాడక్కా…! వాళ్లు ఏమి చెప్పినా నన్ను ఒప్పుకొమ్మని చెప్పినాడు, నేను ఆ మాదిరిగా చేయను, పోనంటె నన్ను పట్టుకొని కొడతన్నాడు. ఇంక ఈ దెబ్బలతో ఇక్కడ చచ్చేదానికన్నా, ఆడికిపోయి బతకడమే మేలనిపిస్తా వుంది”9 అంటూ ఏడుస్తూనే తన నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది.

కువైట్కి బయలుదేరినప్పుడు రైలు బండిలో ఆమె దుఃఖాన్ని చూసి రైలులో ఉన్నవారందరూ జాలిపడతారు. భర్త బలవంతతో ఇష్టం లేకపోయినా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళే ఎంతో మంది స్త్రీలకు ప్రతీకగా చక్రవేణు రామలక్ష్మమ్మ పాత్రను నిర్మించారు.

3.4 రెహమాన్ :

ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే మహిళలకు వీసాలను ఏర్పాటుచేసి అక్కడకు పంపించే ఏజెంట్ రెహమాన్. భర్త మరణాంతరం పేదరికంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సావిత్రమ్మను కువైట్కి పంపించింది ఇతనే. పంచాయితీలో చిన్నబ్బ సావిత్రమ్మ గురించి అన్న మాటలనూ, కువైట్కి తనను తీసుకు వెళ్ళమని అడిగిన రామలక్ష్మమ్మతో సావిత్రమ్మ చెప్పిన మాటలను పరిశీలిస్తే ఈ రెహమాన్ కువైట్కి పెంపించే స్త్రీలను తానూ శారీకంకా వాడుకోవడమే కాకుండా విమానం ఎక్కించడానికి ముంబాయి తీసికువెళ్ళి అక్కడ ఇతర ఏజెంట్ల వద్దకు కూడా పంపిస్తాడని తెలుస్తుంది. గల్ఫ్ దేశాలకు తీసుకు వెళ్ళే ఏజెంట్లకు ప్రతీకే ఈ రెహమాన్.

3.5 షావుకారు నాగయ్య :

సావిత్రమ్మపై ఆమె బావ, మరిది పంచాయితీ పెట్టినప్పుడు మధ్యవర్తిగా ఈ షావుకారి నాగయ్యను పిలుస్తారు. “నాగయ్య మద్దిస్తం జరుపుతున్నాడంటే, జిత్తులమారి నక్క పంచాయితీ పెట్టింది”10 అనేది ఆ  గ్రామంలో ప్రతీతి. అందుకే ‘చెప్పు నాయనా – నక్క తీర్పు చెప్పు’ అన్నారు అక్కడున్నవారు.  సాధారణంగా గ్రామాలలో బలవంతుల పక్షం వహించి, మధ్యవర్తిత్వం పేరుతొ బలహీనులకు అన్యాయం చేసే వ్యక్తులకు నిదర్శనం ఈ షావుకారి నాగయ్య. 
పై పాత్రలతోపాతూ రామయ్య (సావిత్రమ్మ బావ), పెద్దూరు ఇతర మహిళలు, రాజయ్య(సావిత్రమ్మ భర్త), పెద్దబ్బ (సావిత్రమ్మ మామ), లక్ష్మమ్మ(సావిత్రమ్మ తల్లి) మొదలైన పాత్రలను రచయిత కథా గమనంలో ఉపయోగించుకున్నారు.

4. మానవ సంబంధాలు: 

ఆరోగ్యకరమైన సమాజం పటిష్టమైన మానవీయ విలువల మీద ఆధారపడి ఉంటుంది. మానవత్వం లోపించి అవాంఛనీయమైన విషయాలు మనస్సులో ప్రవేశించినప్పుడు సమాజం చిన్నాభిన్నం అవుతుంది. ప్రేమ, త్యాగం, నిస్వార్ధత మొదలైనవి మానవీయ లక్షణాలు. ఇవి కూడా ఆర్థిక అంశాలకు అనుగుణంగా మారుతూ ఉండటం కన్పిస్తుంది. స్వార్థం అనేక మానవీయ విలువలను రూపుమాపే దుర్గుణం. రాయలసీమ సమాజంలో ఆర్థిక పటిష్టత అంతగా లేకపోవడం వల్ల దీని ప్రభావం మానవ జీవితంపై అధికంగా పడుతున్నది. సమాజంలోని వ్యక్తుల మధ్య సహజంగా ఉండవలసిన అవగాహన కరవైంది. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులే. ఆర్థిక పరిస్థితి మానవత్వపు విలువలను దిగజార్చుతున్న విషయాన్ని చక్రవేణు ఈ కువైట్ సావిత్రమ్మ కథలో చక్కగా అక్షరబద్ధం చేశారు.

పిల్లల పెళ్ళిళ్ళుచేయటానికి కువైట్ నుంచి తన ఊరు వచ్చింది సావిత్రమ్మ. భర్త చనిపొయాక తన మీద అత్యాచారం చేసిన సొంత మరిది చిన్నబ్బ ఆమే వ్యభిచారం చేస్తోందని ఒకప్పుడు పెట్టించిన పంచాయితీ, భర్త పోయాక ఆదుకోవాల్సిన బంధువుల, ఊరిజనాల వెలివేత, ఫలితంగా ఊరొదిలి రహెమాన్ సాహెబ్ అండదండలతో కువైట్ వెళ్ళి డబ్బు సంపాదించి వచ్చాక తిరిగి వాళ్ళే నెత్తిన పెట్టుకోవటం, తమ భార్యల్నీ కూడా కువైట్కి పంపమని తరలివచ్చిన అదే మగప్రపంచం… వీటన్నింటిని పరిశీలిస్తే ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు కేవలం స్వార్ధపూరిత సంబంధాలుగా మారడం గమనించవచ్చు.

భర్త మరణించి దిక్కుతోచని స్థితిలో ఉన్న సావిత్రమ్మను ఆడుకోవలసింది పోయి ఊరు నుండి వెళ్ళగొట్టడం, తనకు ఇష్టం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా కువైట్కి వెళ్తానని ఒప్పుకునే వరకు కొట్టి భార్యను వేదించడం వంటి దుర్మార్గాలకు పాల్పడిన చిన్నబ్బను చూస్తే ప్రస్తుత సమాజంలో నైతికత కనుమరుగై, దాని స్థానాన్ని స్వార్ధం, ధనాశ ఆక్రమించుకున్న తీరు అవగతమవుతుంది. “అంతేనమ్మే! దండిగా డబ్బులొచ్చేట్టుగా వుంటే, వాళ్లు, పాలుడ్డ పడేది కాకుండా, పెండ్లాలను కూడా అమ్మేస్తారు, నీ మొగుడులాంటోళ్లు…’’11 అని సావిత్రమ్మ రామలక్ష్మమ్మతో అన్న మాటలు చిన్నబ్బ నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తాయి. అదేవిధంగా ఈ కథలో షావుకారు నాగయ్య, రెహమాన్ పాత్రలు కూడా అవకాశవాద మనస్తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తాయి.

మానవుడు సంఘజీవి. ఒక సమాజంలోని మనుషులు పరస్పరం ఒకరికొకరు సహకరించుకొని జీవించాలి. అప్పుడే మానవ జీవితం ఫలవంతమవుతుంది. కాని ఈ కథలో ‘‘ఈళ్లకందరికీ నేనేదో తల తీసేసినట్టు లోకానికి విరుద్ధంగా నేనొక్కదాన్నే కాని పని చేస్తావున్నట్లు మాట్లాడతన్నారే - ఇన్ని రోజులూ ఈళ్ళెవురన్నా మమ్మల్ని ఆదుకున్నారా మా యింటాయన పోయినాక, పాపం బిడ్డల గల్లదే అని విచారించి, ఒక పూటకు అన్నానికి సేరు గింజలుగానీ, రూపాయి డబ్బుగానీ ఇచ్చినోళ్లున్నారా చెప్పమనండి చూద్దాం!”12 అని సావిత్రమ్మ అన్న మాటలు మానవుల మధ్య ఉండవలసిన సహకారం లోపించడాన్ని చూసిస్తున్నాయి.

సావిత్రమ్మ కువైట్ నుండి తిరిగి వచ్చి తన భర్త ఊరిలో తన కుమార్తెకు, కుమారుడికి ఒకేసారి వైభవంగా వివాహం చేస్తుంది. ఈ సందర్భంలో “కడుపు నిండా కూడుపెట్టి లడ్డూ కారాలూ, చేసుకున్న పలారాలన్నీ కొరవ లేకుండా పెట్టించింది సాయిత్రమ్మ. పనీ పాటోళ్లను మరిసిపోకుండా చూసింది, నా తల్లి. ఈ చుట్టుపక్కల ఏ పెద్ద రైతన్నా ఇట్టా పెండ్లి కూడుపెట్టినోళ్లుండారంటమ్మే! పొద్దిట్నించీ మాయిటాల్దాకా పెండ్లింటి ముందు కూకోపెట్టి ఆకిరికి అంతా అయిపోనిచ్చి అడుగుబుడుగు ఊడిచేసింది సిలుం కూడు- చారునీళ్లు మన మొకాన పోస్తారు. ఇట్టా మన సాయిత్రమ్మలాగా ఎవురన్నా మంచి కూడుగానీ, పలారాలుగానీ పెట్టినోల్లుండారా!”13 అని మాలపల్లి ఆడోళ్లు సావిత్రమ్మ గురించి అన్నమాటలను, “ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా”14  అని పెదవి విరచి మాట్లాడిన  మరికొందరి స్త్రీల మాటలను పరిశీలిస్తే సమాజంలో ఒకే సంఘటనను మనుషులు భిన్నంగా స్పందించడం గమనించవచ్చు. విరుద్ద భావజాలాల సమాహారమే సంఘం. మానవజీవితం ఈ భిన్నదృక్కోణాలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే పరిపూర్ణమవుతుందని రచయిత అంతర్లీనంగా తెలియజేశారు.

కువైట్కి బయల్దేరే సమయంలో రైల్వేస్టేషన్ వద్ద పదహారు సంవత్సరాలున్న, ఇంకా పెళ్ళికాని ఒక ముస్లిం అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా కువైట్కి పంపిస్తారు. రైల్వేస్టేషన్ ఆ యువతి బిగ్గరిగా రోదిస్తుంది. ఆమెను చూసి సావిత్రమ్మ “పెండ్లికాని పసిబిడ్డను, కాని దేశానికి తరిమి ఆ డబ్బులూ, సంపాదన లేకుంటే ఏమి! ఛీ… దానికన్న ఇక్కడే అడుక్కోని బతికినా గౌరవమే! అమ్మా, నాయిన దగ్గరుండి కసాయికి గొడ్డును తోలినట్టు తోల్తున్నారే, మనుషులేనంటయ్యా!!’’15 అని నిట్టూరుస్తుంది. ఈ సందర్భంలో సావిత్రమ్మ మదిలో మెదిలిన భావాలు కనుమరుగవుతున్న మానవసంబంధాలను, వాటి స్థానాన్ని డబ్బు ఆక్రమించడాన్ని సూచిస్తున్నాయి.

సావిత్రమ్మకు తాను భరించిన కష్టాల జీవితానుభవం, అవి నేర్పిన పాఠాలు, బతుకుసూత్రాన్ని వడగాచి తెలుసుకున్నట్లుంది. అందుకే కొడుకూ-కోడలు, కూతురూ-అల్లుడూ, బంధువులంతా కనుమరుగవుతున్నా కళ్లల్లో కన్నీరు మాత్రం కారలేదు. మనుషులూ మాయలూ-మర్మాల్నీ చదువుతున్నట్లుగా కళ్లు మూసుకుని, విరక్తిగా నవ్వుతూ ఆలోచిస్తా వుంది సావిత్రమ్మ”16 అంటూ రచయిత కథను ముగిస్తాడు. ఇక్కడ ఒకసారి “జీవితం, మనిషిలో మార్పు తెస్తుంది. అందుకు అనుభవం కారణమవుతుంది"17 అన్న కాళీపట్నం రామారావుగారి మాటలను గుర్తుచేసుకోవాలి. సావిత్రమ్మ తానూ గతంలో పొందిన అనుభవాలే మానవ సంబంధాల పట్ల ఆమెలో నెలకొన్న నిర్లిప్తానికి కారణం.

ఈ కథ గురించి ‘వలస అన్నది మనిషిని ఆదుకుంటూనే ఉంది. ఒక చోట తిండి దొరకకపోతే మరో చోటకి వెళ్ళి తిండి వెతుక్కుంటాడు మనిషి. ఆ మనిషి మగ వాడైతే శ్రమ దోపిడి మాత్రమే ఎదుర్కోవాలి. ఆడది ఐతే శరీర దోపిడీని కూడా భరించాలి. ఒక వైపు స్త్రీకి కట్టడి విధించే సమాజమే అదే స్త్రీని సంతలో నిలబెట్టి బానిసను చేసి అమ్మేస్తుంది’ అని రచయిత చెప్పిన మాటలు ఈ కథ వెనుక ఉన్న వాస్తవికతను తెలియజేస్తున్నాయి.

5. ముగింపు:

  1. ముడుపదుల వయస్సు నిండకుండానే మరణించిన చక్రవేణు రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని, అక్కడి మానవ సంబంధాలను గొప్పగా అవగాహన చేసుకున్నట్లు అతని కథలను పరిశీలిస్తే అవగతమవుతుంది.అతని సామాజిక అవగాహనకు ఈ కువైట్ సావిత్రమ్మ కథ ఒక నిదర్శనం.
  2. డబ్బు మానవ సంబంధాలను ప్రభావితం చేసే తీరును రచయిత కథలో వాస్తవికంగా దృశ్యమానం చేశారు.
  3. కష్టం ఒకటే అయినప్పటికీ అది పురుషులు  కంటే స్త్రీల జీవితాలను మరింత దుర్భరం చేసే వైనాన్ని రచయిత ఈ కథలో చిత్రించిన తీరు యథార్ధంగా ఉంది.
  4. బలవంతుల మాట సమాజంలో చెల్లుబాటు అయ్యే విధానాన్ని, బలహీనులు తమ ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా బలవంతుల అదుపాజ్ఞాలకు లోనైన తీరును చిన్నబ్బ, షావుకారి నాగయ్య, సావిత్రమ్మ, రామలక్ష్మమ్మ పాత్రల ద్వారా రచయిత సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యే రీతితో ఈ కథలో వాస్తవికంగా చూపించారు.

6. పాదసూచికలు:

  1. తెలుగు సాహిత్య చరిత్ర. పుట. 613
  2. రాయలసీమ కథలు - క్షామ చిత్రణ. పుట. 52,53.
  3. తెలుగు కథకి జేజే. పుట. 123
  4. ఇదే. పుట. 127
  5. ఇదే. పుట. 127
  6. ఇదే. పుట. 128
  7. ఇదే. పుట. 128
  8. ఇదే. పుట. 124
  9. ఇదే. పుట. 126
  10. ఇదే. పుట. 128
  11.  ఇదే. పుట. 123
  12. ఇదే. పుట. 129
  13.  ఇదే. పుట. 119
  14. ఇదే. పుట. 119
  15. ఇదే. పుట. 130
  16. ఇదే. పుట. 130
  17. కాళీపట్నం రామారావు రచనలు. పుట. 313 (భయం కథ)

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్రజ్యోతి, 20 జూలై 1990,  దీపావళి ప్రత్యేక సంచిక.
  2. ఓబుల్ రెడ్డి తవ్వా. (2007). కడప కథ(సం), అబ్బిగారి రాజేంద్రప్రసాద్ (ప్రచురణ కర్త), హైదరాబాద్.
  3. దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక స్వరూప స్వభావాలు, శివాజీ ప్రెస్, సికింద్రాబాద్.
  4. ద్వా.నా.శాస్త్రి. (2013). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
  5. నాగరాజు సాకం. (2007). తెలుగు కథకు జేజే !(సం), అభినవ ప్రచురణలు, తిరుపతి.
  6. నాగసుధారాణి, యం.వి. (2008). రాయలసీమ కథలు - క్షామ చిత్రణ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
  7. నారాయణ సింగమనేని. (1994). సీమకథలు(సం.), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  8. రామారావు, కాళీపట్నం. (2010). కాళీపట్నంరామారావు రచనలు, మనసుపౌండేషన్,  బెంగుళూరు.
  9. వెంకటసుబ్బయ్య వల్లంపాటి.(2008). కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]