AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. 'నమస్తే తెలంగాణ' దినపత్రిక కవిత్వవ్యాసాలు (2016-17): పరామర్శ
వేముల హర్షిత
తెలుగు పరిశోధకురాలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
తెలుగు అధ్యాపకురాలు, తెల. సాం. సం. గు. మహిళా డిగ్రీ కళాశాల,
జగద్గిరిగుట్ట, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9248393960, Email: vemulaharshitha04@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ప్రస్తుతం దినపత్రికలలో అన్ని రకాల వార్తాసమాచారాలతో పాటు సాహిత్యాంశాలు చోటుచేసుకుంటున్నాయి. దినపత్రికల్లో సాహిత్యంశాలను నామమాత్రంగా ప్రచురించకుండా, సాహిత్యానికి ఒక ప్రత్యేకపుటను కేటాయిస్తున్నారు. దీని ద్వారా సమకాలీన సాహిత్యాన్ని విభిన్న ప్రక్రియలలో పాఠకులకు అందిస్తున్నారు. సాధారణంగా సాహిత్యపుటల్లో సాహిత్యవ్యాసాలు, కవితలు, సమీక్ష వ్యాసాలు, పుస్తక పరిచయాలు, సాహిత్యసమావేశాల సమాచారం వంటి అంశాలను ప్రచురిస్తూ సాహిత్యాభివృద్ధికి దినపత్రికలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ సంప్రదాయాన్ని “నమస్తే తెలంగాణ” దినపత్రిక కూడా పాటిస్తూ సాహిత్యాభివృద్ధికి చాలావరకు కృషి చేస్తుంది. వీటిలో అధికభాగం కవిత్వసంబంధవిషయాలు మనకు కనిపిస్తాయి. అందువలన ఎటువంటి కవిత్వాన్ని ఈ పత్రిక ప్రచురిస్తుందో తెలపడమే ఈ పత్రప్రధానలక్ష్యం. అందుకుగాను నమస్తే తెలంగాణ పత్రికలో 2016-17 సంవత్సరాల్లో వచ్చిన కవిత్వసంబంధవ్యాసాలను స్వీకరించి వాటిని విమర్శనాత్మదృష్టితో విశ్లేషించాను.
Keywords: నమస్తేతెలంగాణ, దినపత్రిక, కవిత్వవ్యాసాలు, కవిజీవిత-కావ్యసమన్వయవిమర్శ ప్రాంతీయ అస్తిత్వవాదవిమర్శ, కవితాపుస్తకసమీక్షావ్యాసాలు.
1. ఉపోద్ఘాతం:
తెలంగాణ ప్రాంతంలో వెలుడుతున్న ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ. ఇది జూన్ 6, 2011 న ‘మన రాష్ట్రం - మన ఆత్మగౌరవం’ అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధనయే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. 2014 లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ‘మన రాష్ట్రం – మన పత్రిక’ నినాదంతో కొనసాగుతూ, తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రధాన దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర ప్రగతి, నాగరికత, సంస్కృతిని ప్రోత్సహించే విధంగా పత్రిక రూపొందింది. ఈ పత్రికలో రకరకాల వార్త సమాచారాలతో పాటు ప్రతి ఆదివారం ‘చెలిమె... సాహిత్య సర్వస్వం’ పేరుతో సాహిత్య పుటను ప్రచురిస్తున్నారు. దీనిలో సాహిత్యం, భాష, కవిత్వం, కవులు, రచయితలకు సంబంధించిన వివిధ రకాల వ్యాసాలుంటాయి.
2. నమస్తే తెలంగాణ - చెలిమె:
నమస్తే తెలంగాణ దినపత్రికలో సాహిత్య పుట ‘చెలిమె… సాహిత్య సర్వస్వం’ పేరుతో పత్రిక ప్రారంభం నుండి వెలువడుతుంది. పత్రిక ప్రారంభంలో ఇది ప్రతి బుధవారం వచ్చేది. 2014 లో రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత దీనిని సోమవారానికి మార్చారు. ప్రస్తుతం చెలిమె పుటను ప్రతి ఆదివారం ప్రచురిస్తున్నారు. ‘చెలిమె’ పదానికి తెలంగాణ మాండలిక వ్యవహారంలో ఒక ఊట జల అని అర్థం. దీన్ని ఇతర ప్రాంతాల్లో ‘చెలమ’ అని వ్యవహరిస్తారు. చెలిమెలో నీరు తీసిన కొద్ది ఊరుతూ ఉంటుంది. అంతం అనేది ఉండదు. సాహిత్యం కూడా ఒక చెలిమె వలె అంతం లేనిదనే అర్థంలో ఈ పేరు పెట్టారని నా అభిప్రాయం.
3. నమస్తే తెలంగాణ దినపత్రిక కవిత్వ వ్యాసాలు - పరామర్శ:
నమస్తే తెలంగాణ దినపత్రిక చెలిమె పుటలో నేను పరిశీలించిన వరకు ఎక్కువగా కవిత్వ సంబంధ విషయాలను ప్రచురిస్తున్నారు.
- కవితలు, కవులు, కవిత్వ సంబంధ వ్యాసాలు,
- కవిత్వ పుస్తక సమీక్షా వ్యాసాలు,
- కవిత్వసంబంధ నివేదిక వ్యాసాలు వంటి అనేక రకాలైన కవిత్వ విషయాలు ఈ పుటలో కనిపిస్తాయి.
- కవిత్వ వ్యాసాల్లో కూడా కవిజీవిత కావ్యవిమర్శ ధోరణి, ప్రాంతీయ అస్తిత్వ వాద విమర్శ ధోరణి, సమీక్షా రూప వ్యాసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
3.1 కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ:
కవుల జయంతి, వర్ధంతి సందర్భంగా అలాగే సన్మానాలు, సత్కారాలు లభించిన ప్రత్యేక సందర్భాలలో కవులకు సంబంధించిన జీవిత విషయాలను ఎక్కువగా చెలిమె పుటలో ప్రచురిస్తున్నారు. అయితే లోతులకు వెళ్లకుండా వాటి మూలాలను మనకు అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాహిత్య పునర్నిర్మానం జరగాల్సిన అవసరం ఉంది. కావున తెలంగాణ సాహిత్యానికి Biographical Criticism’ ఎంతో అవసరం. ఇంతకాలం మరుగున పడిన కవులను, నూతన కవులను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా పత్రికల పైనే ఉంది. కావున ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన నమస్తే తెలంగాణ పత్రిక సాహిత్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తుంది.
‘Biographical Criticism’ (కవిజీవిత కావ్య సమన్వయ విమర్శ) – నిర్వచనాలు:
- “కవుల జీవిత ఘట్టాలు, వారి మానసిక స్థితులూ, వారి తాత్విక భావనలు వారి రచనలలో ఎలా ప్రతిఫలించాయని కానీ, వారి వ్యక్తిత్వాలు కృతులనెలా రూపొందింపజేశాయని కానీ వివేచించే విమర్శనా పద్ధతి’’ అని జి. వి. సుబ్రహ్మణ్యం “ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం’’ అనే గ్రంథంలో నిర్వచించారు. (1983: పుట: 145,146).
- “కవి జీవితమునకు, కావ్య రచనకు ఉన్న సంబంధమును పరిశీలించి వాని సమన్వయముతో విమర్శకు పూనుకొనిన అది కవి జీవిత కావ్య విమర్శగా” పేర్కొనవచ్చునని యస్. వి. రామారావు “తెలుగులో సాహిత్య విమర్శ’’ అనే గ్రంథంలో తెలిపారు. (2007: పుట: 11).
- “కవుల వ్యక్తిగత జీవిత పరిస్థితుల ప్రభావమూ, వారి మానసిక పరిస్థితులూ, వారు నమ్మే సిద్ధాంతాలు వారి రచనల్లో ఎలా ప్రతిబింబించాయో ఆలోచించే, నిరూపించే విమర్శనా పధ్ధతి కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ’’. కవుల మానసిక స్థితి, వ్యక్తిత్వము అంచనా వేయటమే ఇందులో ప్రధానంగా జరిగేది కాబట్టి ఆ తర్వాత కాలంలో ఇది మనోవిశ్లేషణాత్మక విమర్శల్లో భాగంగా మారిపోయింది. యస్. యస్ నళిని “సాహిత్య విమర్శ పదాల డిక్షనరీలో” పేర్కొన్నారు. (2021: పుట: 60)
- “కవి జీవిత కావ్య విమర్శ కావ్యంలో కవి యొక్క ఆత్మీయత ప్రతిఫలించే తీరును వివేచిస్తుంది. కవి జీవితాన్ని పరిశీలించిన అతని కావ్య తత్త్వము ఏమిటో తెలుస్తుంది.” అని యస్. ఝాన్సీరాణి ‘’Biographical Criticism in Telugu’’ అనే వీరి యమ్.ఫిల్. గ్రంథంలో తెలిపారు. (1992: పుట: 19).
ఈ విధంగా అనేకమంది కవి జీవిత కావ్య విమర్శను నిర్వచించారు. మొత్తం మీద కవి జీవిత విమర్శ అంటే కవికి సంబంధించిన కవి జీవిత పరిశీలనలు, కవి మీద ఏయే ప్రభావాలు పనిచేసాయి అనేదికూడా కవి జీవిత విమర్శ అవుతుంది. ఆ కవి ఆత్మకథలు రాస్తాడు. ఉత్తరాలురాస్తాడు. వీటి గురించి ఎక్కడైనా ప్రస్తావించిన అది కూడా ‘’Biographical Criticism’’ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కవి జీవితం, ఆయన రచనలకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను వివరించేదే కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ. ఈ శాఖను ఆంగ్ల సాహిత్యంలో ప్రారంభించినవారు డ్రైడన్. పత్రికలకున్న పరిధి రీత్యా అత్యధిక శాతం కవి జీవిత విమర్శకు సంబంధించిన వ్యాసాలే ప్రచురిస్తున్నారు. కావున నమస్తే తెలంగాణ పత్రికలో ఇలాంటి వ్యాసాలను మనం చూడవచ్చు.
ఉదా: కవిత్వ అగ్ని ధార దాశరథి – ఎస్వీ. సత్యనారాయణ (జూలై 18, 2016: చెలిమె)
అభినవ కాళిదాసు కృష్ణమాచార్యులు - మల్లారపు రాజు (ఆగస్టు 14, 2017: చెలిమె)
వ్యాసం:1 కవిత్వ అగ్ని ధార దాశరథి – ఎస్వీ. సత్యనారాయణ (జూలై 18, 2016: చెలిమె)
దీనిలో వ్యాసకర్త దాశరథిని కవిత్వ అగ్నిధారగా తెలుపుతూ ఆయన జీవిత విషయాలను, రచనా విషయాలను, చారిత్రక అంశాలను పొందుపరిచారు. కవిత్వంలోని వస్తువుకు అధిక ప్రాధాన్యతనిస్తూ దాశరథి కవితా వస్తువును తెలుపుతూనే కవి యొక్క జీవిత విషయాలను, తెలంగాణ ఉద్యమచరిత్ర, ఆనాటి సామాజిక పరిస్థితులు వంటి అనేక అంశాలను పాఠకులకు అందించారు. జూలై 22 న దాశరథి జన్మదిన సందర్భంగా చెలిమె పుటలో ఆయన జీవిత విషయాలను, రచన విషయాలను తెలుపుతూ ఎస్వీ. సత్యనారాయణ రాసిన వ్యాసం ఇది. దీనిని కవి జీవిత విమర్శగా చెప్పవచ్చు.
కవిజీవిత పరిశీలనలు:
దీనిలో వ్యాసకర్త దాశరథి కవి జనన సంబంధ జీవిత విశేషాలను పేర్కొనడం వలన ఇది బయోగ్రాఫికల్ క్రిటిసిజం అవుతుంది.
“...1925 జూలై 22 న ఖమ్మం జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో శ్రీమతి వెంకటమ్మ, శ్రీ వెంకటాచార్యుల దంపతులకు పుట్టిన కుమారుడు దాశరథి కృష్ణమాచారి. అతని తమ్ముడు దాశరథి రంగాచారి. బాల్యంలో కృష్ణమాచారి తండ్రి వద్ద సాంప్రదాయ రీతిలో విద్యాభ్యాసం చేశారు….” అని చెప్తూ దాశరథి సృజనాత్మక రచన చేస్తూనే ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఉద్యమ చరిత్రను తెలిపారు.
“…1942 లో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన రహస్య సమావేశాలకు హాజరయ్యాడు. ఆంధ్ర మహాసభ సభ్యత్వం స్వీకరించి హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో తన మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. మరోవైపు 1944 లో వరంగల్లో ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సభల్లో పాల్గొని ఉద్యమ కవిత్వాన్ని గానం చేశాడు... ” అంటూ ఇలా కవి జీవిత విషయాలను, ఆయన స్వభావాన్ని ఇందులో తెలపడం వలన ఇది ఈ Biographical Criticism అవుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు తెలంగాణ చరిత్ర, కవుల గురించిన రచనలు సరిగా రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి, కవులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. వీరిపై అనేక రచనలు చేస్తున్నారు. వాటిని మనకు అందించాల్సిన బాధ్యత పత్రికలపై ఉంది. దీన్ని నమస్తే తెలంగాణ పత్రిక నిర్వర్తిస్తుందని చెప్పవచ్చు.
మరుగునపడిన తెలంగాణ కవులను, వారి సృజనను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ధ్యేయంగా చెలిమె పుట నడుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో మరుగున పడిన కవులకు, తెలంగాణ సాహిత్య సంబంధ వ్యాసాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. చాలామందికి నామమాత్రమైన తెలియని మట్టిలో మాణిక్యాల వంటి ఎందరో తెలంగాణ కవులను చెలిమె పుట పాఠకులకు పరిచయం చేస్తుంది
వ్యాసం: 2 అభినవ కాళిదాసు కృష్ణమాచార్యులు - మల్లారపు రాజు (ఆగస్టు 14 2017: చెలిమె)
నిజామాబాద్ జిల్లాకు చెందిన గొప్ప కవి, అవధాని శిరిసినహల్ కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా వచ్చిన వ్యాసం ఇది. దీనిలో వ్యాసకర్త కవి జీవిత విషయాలను తెలుపుతూ ఆయన రచనా విశిష్టతను తెలియజేసి ఇంతకాలం మనకు తెలియని ఒక గొప్ప కవిని పాఠకులకు పరిచయం చేశారు. కవి జీవిత విమర్శ పద్ధతిలో మల్లారపు రాజు రాసిన వ్యాసం ఇది.
కృష్ణమాచార్యుల గురించి తెలుపుతూ “...ఈయనను తొలి తెలంగాణ శతావధానిగా పేర్కొనవచ్చు. ఈయన 1929 ‘కళాభ్యుదయం’ అనే కవితా సంపుటిని వెలువరించారు. అపారమైన పాండిత్యం, అనర్గళమైన వాక్చాతుర్యం కలిగిన తొలితరం కవికులజుడు. విశిష్టాద్వైతావలంబికులు శిరిసినహల్ కృష్ణమాచార్యులు నిజాం రాజ్య తొలి శతావధానిగా పేరొందారు...”
ఈ విధంగా కృష్ణమాచార్యుల గొప్పతనాన్ని, ఆయన జీవిత విషయాలను పాఠకులకు అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇలాంటి మరుగునపడిన మాణిక్యాలను వెలికి తీసి వారి రచనలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కావున దీన్ని కూడా కవి జీవిత విమర్శగా చెప్పవచ్చు.
ఈ విధంగా కవుల జయంతి, వర్ధంతి అలాగే ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని బయోగ్రాఫికల్ క్రిటిసిజం పద్ధతిలో కవిత్వ సంబంధ వ్యాసాలు చెలిమె పుటలో చాలా కనిపిస్తాయి. ఉత్తరాలు, ఇంటర్వ్యూ రూప వ్యాసాలు ఇవన్నీ కూడా బయోగ్రాఫికల్ క్రిటిసిజం కిందికే వస్తాయి.
‘చెలిమె’లో కవిత్వ వ్యాసాలు - Biographical Criticism:
- ధిక్కార స్వర ఆది గురువు - అమ్మంగి వేణుగోపాల్ (సెప్టెంబర్ 5, 2016 చెలిమె). కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషాదినోత్సవ సందర్భంగా వచ్చిన వ్యాసం ఇది.
- సాహిత్య భావుకుడు దిలావర్’ (సెప్టెంబర్ 12, 2016). దిలావర్ 75 వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్బంగా స్కైబాబ చేసిన ఇంటర్వ్యూ ఇది.
- సాహిత్యమంటే జీవితమే’ (నవంబర్ 28, 2016). ఇది నందిని సిద్ధారెడ్డి ఇంటర్వ్యూ
- పచ్చనాకుపై వెచ్చని రాత – కవి యాకూబ్ (నవంబర్ 13, 2017) కె. శివరెడ్డికి కబీర్ సమ్మాన అవార్డ్ లభించిన సందర్భంగా రాసిన వ్యాసమిది.
- విశ్వమానవుడు సినారె – B. S. రాములు (జూన్ 19, 2017) సినారె మరణ సందర్భంగా వచ్చిన వ్యాసం.
ఇలా కవిజీవిత విమర్శ ధోరణి కవిత్వ వ్యాసాలు మనకు చెలిమె పుటలో చాలా కనిపిస్తున్నాయి.
3.2 ప్రాంతీయ అస్తిత్వవాదవిమర్శ:
తెలంగాణ ప్రాంతపత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ చెలిమె పుటలో ప్రాంతీయ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని తెలుపుతూ ప్రాంతీయ ఆస్తిత్వవాద విమర్శవ్యాసాలను ప్రచురిస్తున్నారు. చెలిమె పుటలో తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని తెలిపే కవిత్వ వ్యాసాలు మనకు కనిపిస్తాయి. ఇంతకాలం వలస పాలనలో మగ్గిపోతూ తమ సాహిత్యానికి జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ, నేడు ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తమ ప్రాంత సాహిత్య విశిష్టతను తెలియజేస్తూ సాహిత్య అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని, మిగతా ప్రాంత సాహిత్యాలకు తెలంగాణ ప్రాంత సాహిత్యం, చరిత్ర ఏ మాత్రం తీసిపోదని తెలియజేసే ప్రాంతీయ అస్తిత్వవాద ధోరణిలో కవిత్వ వ్యాసాలు కనబడుతున్నాయి. వీటిలో రూప చర్చ కన్నా, వస్తు చర్చకే అధిక ప్రాధాన్యత ఉంటుంది.
ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ – నిర్వచనాలు:
- “ప్రాంతీయ ఆస్తిత్వవాద విమర్శలో కనిపించే విషయాల్లో ప్రధానమైనది ఇక్కడి ప్రాంతంలో (తెలంగాణ) కవిత్వం లేదు, కథ లేదు అన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలపై ప్రతిస్పందన రూపంగా తెలుగులో ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ వెలవడింది. 1934 లో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక, 1970 ఏళ్ల తర్వాతే తెలంగాణ కథ అన్న అభిప్రాయం మీద వచ్చిన ప్రతిస్పందన రూప విమర్శ వ్యాసాలు ఇందుకు ఉదాహరణలు” అని లక్ష్మణ చక్రవర్తి, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం గ్రంథంలో తెలిపారు. (2016: పుట: 124).
- “స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు అస్తిత్వ దృష్టికి ఏర్పరచిన పునాదిని కేంద్రంగా చేసుకొని తమ ప్రాంతం విస్మృతికి గురైందని భావించి ఆ సాహిత్యాన్ని నలుగురికి తెలియపరచాలన్న దృక్పథంతో తమ ప్రాంత సాహిత్య వైశిష్యాన్ని చెప్పాలనుకోవడం ప్రాంతీయ చైతన్యం. ఇందులో తమ ప్రాంత సాహిత్య మూలాలను, సాహితీకారుల సృజన నేపథ్యం, అభివ్యక్తిలో కనిపించే భేదం వంటివి ప్రధానపాత్ర వహిస్తాయి” అని లక్ష్మణచక్రవర్తి, తెలుగు సాహిత్యవిమర్శ దర్శనం గ్రంథంలో తెలిపారు. (2016: పుట: 125)
- “ప్రాంతీయవాద పరిధి చాలా పెద్దది. ప్రాంతీయవాదంలో తమను ఇతర ప్రాంతాల వారు అణిచివేస్తున్నారని ఆధిపత్య వర్గాలపై ఆగ్రహం అడుగున కనిపిస్తుంది. పాలకులు, వలసవాదులు చూపిస్తున్న వివక్షపై నిరసన ఉంటుంది. తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలపై ఆత్మ గౌరవంతో కూడిన అభిమానం ఉంటుందని” వెలమల సిమ్మన్న తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో తెలిపారు. (2011: పుట: 643)
పై నిర్వచనాలను బట్టి చూస్తే ఒక ప్రాంత అణచివేతల నుండి ఆవిర్భవించింది ప్రాంతీయ ఆస్తిత్వవాద విమర్శ అని అర్థమవుతుంది. దీనిలో ఒక ప్రాంతానికి గుర్తింపు లేకపోవడం లేదా విస్మృతికి గురి కావడం అనేవి ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంతకాలం జరిగిన తెలంగాణ ప్రాంత అణచివేతను, విస్మృతిని గుర్తు చేస్తూ తెలంగాణప్రాంత సాహిత్య గొప్పతనాన్ని, తెలంగాణ కవిత్వ గొప్పదనాన్ని తెలిపే వ్యాసాలు చెలిమె పుటలో కింది విధంగా ఉన్నాయి.
వ్యాసం: 1 సాహిత్యంలో తొలి రచనలు - డాక్టర్. ద్వా. నా. శాస్త్రి. (మే 02, 2016 చెలిమె)
తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు తెలంగాణ ప్రాంతమే పుట్టినిల్లు అని తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని తెలియజేస్తూ రాసిన వ్యాసం ఇది. తెలంగాణ ప్రాంత కవులను స్మరిస్తూ తెలంగాణలో పుట్టిన సాహిత్య ప్రక్రియలను పరిచయం చేస్తూ వ్యాసాన్ని రాశారు. దీనిని ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శగా చెప్పవచ్చు. ద్వా.నా. శాస్త్రి రాసిన ‘సాహిత్యంలో తొలి రచనలు’ అనే వ్యాసం నమస్తే తెలంగాణ చెలిమె పుటలో మే 02, 2016 న వెలువడింది. దీనిలో తెలుగు సాహిత్యంలోనీ ప్రాచీన పద్య కావ్యాల నుండి నేటి ఆధునిక కవిత్వ ప్రక్రియలైన దీర్ఘ కవితల వరకు అనేక తొలి రచనలకు పుట్టినిల్లు తెలంగాణ అంటూ పేర్కొన్నారు
ప్రాంతీయ ఆస్తిత్వవాద విమర్శ పరిశీలనలు:
“...ఏ భాషా సాహిత్యానికైనా ప్రక్రియ వైవిధ్యం, రచన వైవిద్యం అనేవి దిక్సూచికలు. ఒక సాహిత్యా భివృద్ధి గాని, వైశిష్ఠంగానీ తొలి రచనలపై ఆధారపడి ఉంటుంది. తెలుగు సాహిత్య చరిత్ర మొత్తం పరిశీలిస్తే తెలంగాణ సాహిత్యం వెనుకబడి లేదని అనేక తొలి రచనలతో ప్రత్యేకతను నిలబెట్టుకుందని తెలుస్తుంది. తొలి రచన అంటే మూలం. దాన్ని అనుసరించే రచనల పరంపర కొనసాగుతుంది. తెలంగాణ సాహిత్యచరిత్ర వేరువేరు కోణాల నుంచి పరిశీలించవలసి ఉంటుంది వాటిలో ఒక కోణం తొలి రచనలు….
అంటూ ఇలా తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని సాహిత్య గొప్పతనాన్ని తెలుపుతూ అనేక ప్రక్రియలకు తెలంగాణ పుట్టినిల్లు అని తెలిపారు. ఇది ప్రాంతీయ ఆస్తిత్వవాద విమర్శ ధోరణిలో రాసిన వ్యాసం.
తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన ఎన్నో కళారూపాలను, సంస్కృతిని, సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తూ ఇంతకాలం మరుగున దాగిన తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి చెలిమె పుట ఎంతగానో కృషి చేస్తుంది. ప్రాంతీయ అస్తిత్వవాద ధోరణిలో తెలంగాణ సాహిత్యాన్ని మన ముందుకు తెస్తుంది.
చెలిమె పుట కవిత్వ వ్యాసాలు - ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ:
- ఒక పాలకుర్తి, ఒక బమ్మెర – అనుమాండ్ల భూమయ్య (ఫిబ్రవరి 29, 2016)
- ఇది మన స్వేచ్చా నర్తనం – శ్రీ రామోజు హరగోపాల్ (జూలై 04, 2016)
- సాహిత్యంలో స్వాభిమాన ప్రకటన – ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య (ఆగస్టు 08, 2016)
- దేశి పుట్టినిల్లు... – డాక్టర్. గండ్ర లక్ష్మణ రావు (ఫిబ్రవరి 13, 2017)
3.3 కవితా పుస్తకసమీక్షావ్యాసాలు:
చెలిమె పుటలో కవిత్వసంబంధ సమీక్షావ్యాసాలను ప్రచురిస్తున్నారు. కవిత్వపుస్తకాలకు సంబంధించిన సమీక్షలు, నూతనపుస్తక ఆవిష్కరణ సందర్భంగా సమీక్ష రూపవ్యాసాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సమీక్ష వ్యాసాల వలన పాఠకుల్లో ఆ పుస్తకాన్ని చదవాలనే ప్రేరణ కలుగుతుంది. నూతన కవులు, కవిత్వగ్రంథాల సమాచారంతోపాటు సాహిత్యంలో వస్తున్న కొత్త కొత్త కవిత్వ రూపాలను పరిచయం చేస్తూ పాఠకుల్లో పఠణాభిలాషను కల్పించడంలో చెలిమె పుట తన వంతు పాత్ర నిర్వహిస్తుంది.
సమీక్షావ్యాసాలు - నిర్వచనం:
- “బ్రౌన్య ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువులో రివ్యూకు ‘పునర్విమర్శ, ‘పునర్విచారణ’ అనే అర్థాలను పేర్కొన్నారు. (1990: పుట 964)
- “సమీక్ష వ్యాసం వస్తుతః సాహిత్య విమర్శ స్వభావం కలది. శైలిలో జర్నలిజం జీవలక్షణాన్ని పొందుపరచుకున్నది. అస్పష్టతారాహిత్యం, అక్లిష్టత, సంక్షిప్తత, ఆసక్తి, అవగాహన, అనుభూతి అనేవి జర్నలిజానికి అంటే పత్రికా రచనకు జన్మతః ఉండే షడ్గుణాలు. ఈ ఆరు గుణాలలో ఒక అభివ్యక్తిని కల్పించుకొనే తెలుగు వచన రచన సమీక్షా వ్యాసరూపం. సమీక్షా వ్యాసంలోని శక్తి చర్చనీయం, ఆసక్తి రచయిత వ్యాఖ్యాన వైఖరి, నవ్యత రచయిత దృక్కోణం, అభివ్యక్తి పత్రికా రచనా ప్రవృత్తి. సమీక్షా వ్యాసం ఒక సాహిత్యానికి మాత్రమే పరిమితమైంది కాదు” అని జి.వి. సుబ్రహ్మణ్యం ‘సాహిత్యం చరిత్రలో చర్చనీయాంశాలు’ అనే గ్రంథంలో తెలిపారు (2012: పుట: 707)
- “ఒక పుస్తకం ప్రచురించబడిన వెంటనే ప్రచురణ వివరాలతో ఆ పుస్తకంలోని విషయాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తూ, వివిధ పత్రికల్లో వచ్చేవి సమీక్షలు” అని కేతవరపు రామకోటి శాస్త్రి ‘శాస్త్రీయ సమీక్షలు – ముందుమాటలు’ అనే గ్రంథంలో నిర్వచించారు. (2013: పుట: 5)
- “సమీక్ష ఒక ప్రక్రియ సమీక్ష వ్యాసాలుగా ఇవి కనిపిస్తుంటాయి రివ్యూ అంటే మరోసారి పరిశీలించడం అని అర్థం. కొత్త పుస్తకాలను గురించి రాయడం/పరిచయం చేయడం అనే అర్థంలో ప్రసారమాధ్యమాల్లో ఇది వాడుకలో ఉంది” అని పమ్మి పవన్ కుమార్, ‘ప్రసారమాధ్యమాలు - భాష నైపుణ్యాలు’ అనే గ్రంథంలో నిర్వచించారు.(2016: పుట: 150).
పై నిర్వచనాల ఆధారంగా చూస్తే ఓ గ్రంథాన్ని గురించి పరిచయం చేసే వ్యాసాలను సమీక్ష వ్యాసాలుగా చెప్పవచ్చు. చెలిమె పుటలో కవితా పుస్తక సమీక్షా వ్యాసాలు మనకి చాలా కనిపిస్తాయి.
ఉదా: బతుకాట సవ్వడుల గవ్వలు – వెల్డండి శ్రీధర్ (మార్చి 13, 2017 చెలిమె)
జిందం అశోక్ రాసిన ‘గవ్వలు’ అనే లఘు కవితా సంపుటి గురించి వెల్డండి శ్రీధర్ బతుకాట సవ్వడుల గవ్వలు అనే పేరుతో సమీక్షా రూప వ్యాసాన్ని రాశారు. ఇది మార్చి 13, 2017 న చెలిమె పుటలో వెలువడింది. దీనిలో వ్యాసకర్త వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో అనేక అభివ్యక్తి రూపాలు రోజురోజుకు పాఠకుడిని పరవశింప చేస్తున్నాయని, నన్నయ పద్యం మొదలుకొని నేటి వరకు కవిత్వంలో ఎన్నో నూతన రూపాలు ఆవిర్భవిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాంటి నూతన కవితా ప్రక్రియ జిందం అశోక్ సృష్టించిన ‘గవ్వలను’ పేర్కొంటూ గవ్వల నిర్మాణాన్ని, వస్తువును పరిచయం చేస్తూ సమీక్ష రూపంలో సాగిన వ్యాసం ఇది. దీనిలో వస్తువును ఎక్కువగా విశ్లేషించారు. వ్యాసకర్త జిందం అశోక్ రాసిన గవ్వలను పచ్చీసుతో పోలుస్తూ “పచ్చీసులో ప్రధానమైన గవ్వలకు రెండు ముఖాలే ఉంటాయి. కానీ జీవితపు పచ్చీసు ఆటలో ఈ గవ్వలకు మనిషి, రాజ్యం, సమాజం, వ్యవస్థ వంటి అనేక పార్శ్వలను చూపించాడని” గవ్వలలోని వస్తువును వివరించారు.
ఇలాంటి సమీక్ష వ్యాసాల ద్వారా నూతన ప్రక్రియలు, కవులు, కవితా పుస్తకాల పరిచయంతో పాటు మూల గ్రంథాన్ని చదవాలన్న ప్రేరణ కలుగుతుంది. అలాగే పాఠకుడిలో నూతన కవితా సృజనను ప్రేరేపిస్తాయి. పుస్తకావగాహనతో పాటు కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. ఈ విధంగా చెలిమె పుట సమీక్షా వ్యాసాల ద్వారా సమకాలీన కవిత్వాన్ని, కవిత్వంలోని నూతన రూపాలను పాఠకులకు అందిస్తుంది.
‘చెలిమె’లో కవిత్వ పుస్తక సమీక్షా వ్యాసాలు:
1. సంఘర్షణల మధ్య మూడో మనిషి – పుష్యమీ సాగర్ (మార్చి 28, 2016)
2. తెలంగాణ హృదయం – డాక్టర్. వి. జయప్రకాష్ (ఏప్రిల్ 25, 2016)
3. అధిక్షేప ముక్తకాలు – పెన్నా శివరామ కృష్ణ (జనవరి 2, 2017)
4. ఆధునికాంధ్ర కవిత్వం – సినారె పరిశోధన – అమ్మంగి వేణుగోపాల్ (జూలై 10, 2017)
4. ముగింపు:
- ఈ విధంగా నమస్తే తెలంగాణ దినపత్రిక చెలిమె పుటలో కవిత్వ సంబంధ విషయాలను వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు, కవితలు వంటి అనేకరూపాలలో విభిన్న విమర్శా ధోరణులతో ప్రచురిస్తున్నారు. ఈ పత్రంలో కేవలం 2016, 2017 సంత్సరాలలో వచ్చిన కవిత్వ వ్యాసాలను విమర్శనాత్మకంగా విశ్లేషించాను.
- దీనిలో కనిపిస్తున్న కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ, ప్రాంతీయ అస్తిత్వ వాద విమర్మ, సమీక్షా వ్యాసాలను మాత్రమే సోదాహరణంగా వివరించాను. ఇంకా ఇలాంటి అనేక విమర్శా ధోరణి వ్యాసాలు మనకు సాహిత్య పుటలో కనిపిస్తున్నాయి.
- కవిత్వ సంబంధ ఇంటర్వ్యూలు, వివిధ కవితోద్యమ సంబంధ వ్యాసాలు, సదస్సు సందర్భంగా వచ్చిన కవిత్వ నివేదిక వ్యాసాలు, మాండలిక కవితలు, ఇవన్నీ కూడా కవిత్వ విమర్శలో భాగాలే కానీ పత్ర నిడివి దృష్ట్యా వాటిని ప్రస్తావించలేదు.
- దినపత్రికల్లో వార్తాసమాచారంతోపాటు సాహిత్యసంబంధవిషయాలను ప్రత్యేకపుటలద్వారా పత్రికావ్యాసలక్షణాలను పాటిస్తూనే విమర్శాప్రమాణలుగల వ్యాసాలుగా మలచి పాఠకులకు అందిస్తున్నారు. సాహిత్యభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నాయి.
- కావున వీటిని విమర్శనాత్మక దృష్టితో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దినపత్రికల సాహిత్యంపై ఈ కోణంలో ఇంకా పరిశోధనలు జరగవలసి ఉంది.
5. పాదసూచికలు:
- సుబ్రహ్మణ్యం, జి. వి. “ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం’’ (1983: పుట: 145,146).
- రామారావు, యస్. వి. “తెలుగులో సాహిత్య విమర్శ’. (2007, పుట: 11).
- నళిని, యస్. యస్ “సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ”(2021: పుట: 60 )
- ఝాన్సీరాణి, యస్. ‘’Biographical Criticism in Telugu’’. (1992: పుట 19).
- లక్ష్మణ చక్రవర్తి, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం.(2016: పుట: 124).
- సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర. (2011: పుట: 643)
- బ్రౌన్య ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువు. (1990: పుట 964)
- సుబ్రహ్మణ్యం, జి. వి ‘సాహిత్యం చరిత్రలో చర్చనీయాంశాలు’ (2012: పుట: 707)
- రామకోటి, కేతవరపు శాస్త్రి ‘శాస్త్రీయ సమీక్షలు – ముందుమాటలు’. (2013: పుట: 5)
- పవన్ కుమార్, పమ్మి. ‘ప్రసారమాధ్యమాలు-భాషనైపుణ్యాలు’.(2016: పుట: 150).
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఝాన్సీరాణి, యన్. 1992. Biographical Criticism in Telugu. యం. ఫిల్. పరిశోధన వ్యాసం. హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
- నమస్తే తెలంగాణ దినపత్రిక - 2016, 2017 చెలిమె సాహిత్య పుటలు
- నళిని, యస్.యస్. 2021. సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ. నవోదయ బుక్ హౌస్. హైదరాబాద్.
- పవన్ కుమార్, పమ్మి. 2016. ‘ప్రసారమాధ్యమాలు – భాషా నైపుణ్యాలు’. శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్. విజయవాడ.
- బ్రౌన్, సి.పి. 1990. బ్రౌణ్య ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువు. తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.
- రామకోటిశాస్త్రి, కేతవరపు. 2013. శాస్త్రీయసమీక్షలు–ముందుమాటలు. జిజ్ఞాస ప్రచురణలు. హైదరాబాద్.
- రామారావు, యస్. వి. 2007. తెలుగులో సాహిత్యవిమర్శ. శ్రీకళా ప్రింటర్స్. హైదరాబాద్.
- లక్ష్మణచక్రవర్తి. 2016. తెలుగు సాహిత్య విమర్శ దర్శనం. తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.
- సిమ్మన్న, వెలమల. 2011. తెలుగు సాహిత్య చరిత్ర. దళిత సాహిత్య పీఠం. విశాఖపట్నం.
- సుబ్రహ్మణ్యం, జి.వి. 1983. ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం. యువభారతి. హైదరాబాద్.
- సుబ్రహ్మణ్యం, జి.వి. 2012. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. తెలుగు అకాడెమీ. హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.