headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. ప్రాచీన తెలుగు సాహిత్యం: కాకతీయుల కాలం నాటి దేశీ జానపద కళారూపాలు- నృత్యరీతులు

డా. బొల్లేపల్లి సుదక్షణ

అసోసియేట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ సిటి కళాశాల (స్వ.ప్ర.), హైదరాబాద్,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9849520572, Email: sudhakshanabollepally@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, జానపదగిరిజనసంస్కృతి, వారసత్వం, లలితకళలు ఇవన్నీ తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలుపుతాయి. తెలుగు వారి సంస్కృతి విశిష్టమైనది. ఈ సంస్కృతి గొప్పదనాన్ని చాటిచెప్పే కళారూపాలు తెలుగునాట ఎన్నో కన్పిస్తాయి. మానవుని అనుభవం నుండి ఉద్భవించిన ఈ కళలు వారి జీవనంతో అల్లుకుపోయి, సమాజ కులరీతులకు అనుగుణంగా వారి మునుగడతోబాటు అభివృద్ధి చెందాయి. కాలానుగుణంగా అనేక మార్పులకు, చేర్పులకు లోనవటమేగాదు. కొన్ని కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని కళారూపాల జాడలు ఇప్పటికే అంతరించిపోయాయి. కాకతీయులకాలంలో ప్రాచుర్యంలో ఉన్న కళారూపాలపై పాల్కురికి సోమనాథుడు, జాయాపసేనాని, వినుకొండ వల్లభరాయుడు, శ్రీనాథుడు తమ గ్రంథాలలో వివరించారు. ఈ గ్రంథాలలో చెప్పబడిన కళారూపాలు చాలామటుకు అంతరించిపోయాయి. అంతటి అద్భుత కళారూపాలు కాలగర్భంలో కలిసిపోకుండా వెలుగులోనికి తెచ్చి సమాజానికి పరిచయం చేసే ఉద్దేశ్యమే ఈ పరిశోధన ముఖ్యలక్ష్యం. ఈ నృత్యరీతుల వివరణ సమకాలీన గ్రంథాలలో లేదు కనుక ద్వితీయ ఆధారాలకంటే ప్రాథమిక ఆధారాలను పరిశీలించడం జరిగింది.

Keywords: ప్రేంఖణము, చర్చరి, రాసకము, బహురూపము, శివప్రియము, ఘటసి నృత్యము, భాండిక నృత్యము, గొండ్లి, జానపదము.

1. ఉపోద్ఘాతం:

తెలుగువారి సంస్కృతికి జీవన విధానానికి ప్రతిబింబాలు జానపదకళారూపాలు. ఇవి ఎంతో ప్రాచీనమైనవి. విశిష్టత గల్గినవి. తెలుగుప్రాంతంలో ఈ కళారూపాలు ఎన్నో కనిపిస్తాయి. ఇది మానవుని అనుభవాల నుండి కష్టసుఖాలనుండి అనుభూతుల నుండి ఉద్భవించాయి. వారి జీవనంతో అల్లుకుపోయి వారి జీవన ప్రక్రియలకు, నమాజ కులరీతులకు కాలానికి అనుగుణంగా అనేక మార్పులకు చేర్పులకు గురయ్యాయి. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. రాజుల కాలాలలో వారి రాజరికాల ఆధ్వర్యంలో వీటి పోషణ సాగింది. రాజరికాలు అంతరించడంతో పోషకులు లేక ఇవి అంతరించిపోయాయి. ఒకనాడు నవరసాలతో అద్భుతమైన ప్రతిభను చూపి రాజుల, ప్రజల మన్ననను పొందిన ఈ కళారూపాల జాడ ఈనాడు కన్పించదు. మృతసదృశమైన ఈ కళారూపాలు మరొక్కసారి సమాజానికి పరిచయం చేసే ఉద్దేశ్యమే ఈ పరిశోధన వ్యాసం ముఖ్యలక్ష్యం. 

దేశీజానపదకళారూపాలపై బిరుదరాజు రామరాజు, తెలుగు జానపద గేయసాహిత్యంలోను, తూమాటి దొణప్ప జానపద కళాసంపదలోను, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తెలుగువారి జానపద కళా రూపాలు గ్రంథంలోను, ఆర్వీయస్ సుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం గ్రంథాలలో వివరించారు. 

అయితే ఈ గ్రంధాలలో వీరు ఎక్కువగా జానపదసాహిత్యంపైననే దృష్టి సారించారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తన గ్రంథంలో కొన్ని జానపదకళారూపాల తీరుతెన్నులు మాత్రమే వివరించారు. దొణప్ప గ్రంథంలో చాలా జానపద కళారూపాల వివరణ ఉన్నప్పటికి ప్రాచీన దేశ నృత్యరీతుల వివరణ ఎక్కువగా లేదు. 

కాకతీయుల కాలంలో ఉన్న దేశీ జానపద కళారూపాల వివరణ ఆకాలంనాటి గ్రంథాలలో ఉంది. ఈ ప్రాథమిక ఆధారాల పరిశోధన ద్వారా ఈ పరిశోధనా పత్రం రాయబడింది.

2. ప్రాచీన తెలుగు సాహిత్యం- దేశీనృత్యరీతుల ప్రస్తావనలు:

దేశీసంప్రదాయాన్ని ఏ కాలమునుండి గ్రంధస్థం చేశారో చెప్పడం కష్టమే. కాకతీయుల కాలంనాటి జానపదకళారూపాలు. దేశీనృత్య రీతుల గురించి ఆకాలం నాటి గ్రంథాలైన బసవపురాణం, పండితారాధ్యచరిత్ర, క్రీడాభిరామము, నృత్యరత్నావళి, కాశీఖండం మొదలైన గ్రంథాలలో వివరించబడ్డాయి. శ్రీనాథుడు కళారూపాలు ప్రజాజీవనం నుండే పుట్టుకొని వచ్చాయని చెప్తూ కాశీఖండంలో ఆనాటి కళారూపాలను వివరించాడు.

"కుండలీ, దండలాసక పేరణి, ప్రేంఖణ, సిందుకందుక, ధమాళి చేలమతల్లి హల్లిస కారి నృత్యంబు లవలోకించుచు"1

అని, భీమేశ్వరపురాణంలో "కొదము మొగుళ్ళుదెరలను దడంబడబడు వలద వడగండ్లు పుష్పాంజలులను మరయ చప్పుళ్ళు మర్దళ ధ్వనులుగా గగన రంగస్థలంబున్  గ్రొమ్మెరంగు మెళంగు బోడి గొండ్లి పరిఢవిల్లె.”2

అని, నాచన సోముడు ఉత్తరహరివంశంలో ప్రేంఖణము, గోండ్లి, కోలాటము అను రీతులను పేర్కొన్నాడు.3 పాల్కురికి సోమనాథుడు “కోలాటము భాత్ర గొండ్లి ప్రేరణము గేళిక జోకము లీల నటింప”4 అని, పండితారాధ్య చరిత్రలో-

చప్పట్లు వెట్టంగ ఒక్కనలేచి - యప్పాట వెడయాట లాడెడువారు.
వేడుకలో జిందు లాడంగ నుబ్బి- కోడంగియాటల గునిసెడువారు
బ్రన్నని నిజదేశీభాషల జతుల - కన్నికోడంగాటలాడెడివారు
బ్రమరముల్ సాళెముల్ బయకముల్ - రమణబంచాంపి ప్రేరణమాడువారు
ప్రమధ పురాతన పటు చరిత్రములు - గ్రామమెంద బహు నాటకములాడువారు
లలితాంగ రస కళాలంకార రేఖ - లలవడ బహురూప మాడెడువారు
గరణముల్ మెరవలుల్ గతులు జిత్రములు - నరుదుగ వెడ్డంగ మాడెడువారు
నావియద్గతి బక్షులాడెడు నట్టి - భావనా మ్రోకులపై నాడువారు
భరతాదికథల జీరమఱుగుల - నారంగ బొమ్మలాడించువారు
గడునద్భుతంబుగ గంబ సూత్రంబు - లడరంగ బొమ్మల నాడించువారు"5

అని ఈ గ్రంథములో జానపదులైన శివభక్తుల జీవితాలను, కథలను విపులంగా వర్ణించిన సోమనాథుడు వారి జీవితాలలో అంతర్భాగంగా ఉన్న జానపద కళలను వర్ణించాడు. కొందరు నాటకాలు ఆడుతున్నారని చెప్తూ, ఆడే ఘట్టాలను వివరించాడు. వెడయాటము, వెడ్డంగము, కోడంగియాట, మెరవణి, బహురూపుల గురించి వివరించాడు.

వివిధ వేషాలు వేసుకొని తిరిగే పగటి వేషగాళ్ళ గురించి, అద్భుతంగా బొమ్మలనాడించేవారి గురించి వివరించాడు. ఇక వినుకొండ వల్లభరాముడు క్రీడాభిరామములో-

"మైలారు దేవభటులు గొండ్లి ఆడించుచున్నారు. గొరగపడుచు నాడుచున్నచూడు మూర్దాభినయము. తాను నెట్టిన సీలంతలేదు"6 అని గొండ్లిని గురించిన వివరణ ఇచ్చాడు.

కాకతీయుల కాలంనాటి దేశీ జానపద నృత్యాలను జాయప రెండు వర్గాలుగా విభజించాడు. ప్రథమ వర్గంలో దేశీస్థానిక ఉత్ప్లుతీకరణము, బ్రామరి, పాదము, పాట, చారి, గతి, లాస్యాంగ బేధాలు ఉంటాయి. ఇవి నృత్యానికి అనుబంధమై ఉంటాయి. రెండవవర్గంలో నృత్యాలయిన ప్రేరణి, రాసకము, చర్చరి, చింతువృత్తము, గొండ్లి, శివప్రియము, ప్రేంఖణము, ఘటసి నృత్యము, కందుక, భాండిక, కోలాటము, చారణము మొదలగు నృత్యరీతులుంటాయి. ఈ రీతుల జానపదకళలలను మళ్ళీ సర్వజానపదకళలు, నృత్య జానపదకళలుగా విభజించారు. ఇందలి ప్రతి ఒక్క కళారూపము ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. అట్టివానిలో కొన్నింటిని ఈ పరిశోధనలో భాగంగా పరిశీలించడం జరిగింది.

2.1 పేరణము: 

ఈ నృత్యము విస్తృతంగా ప్రతిపాదించబడి ప్రేరణి, పేరిణిగా ప్రసిద్ధి పొందింది. శైవ సంబంధము కలిగిన పంచాంగ సహిత నృత్యము. ఈ పంచాంగాలు ప్రేరణానికి ఆత్మ వంటివి. అవి నృత్తము, తైవారము, ఘర్జరము, వికటము, గీతము,”7 లాస్యము, తాండవము అన్న రెండు భేదాలు గలదిగా చెప్పబడేదే నృత్తము. చక్రవర్తుల రాజుల శౌర్యాన్ని గుణగణములను పొగడటమే కైవారము, ఇదే కథావస్తువు. తాళగతితో గర్జరిని వాయించడమే ఘర్జరి, దీనికి ఏడు రీతులున్నాయి. 

1. చావడము (పాదములతో భూమిని లయబద్ధంగా తాకుట), 2. పడివాడము (పాదాగ్రములతో భూమిని తాకుట), 3. రున్దము (పాదాగ్రములను ఎదురెదురుగా ఉంచి భూమిని తాకుట), 4. సిరిభిరము(జంఘుభాగములతో కంపనము చేయుట), 5.ఖలూహలము (పాదములను వివిధ రకాలుగా లయబద్ధంగా కదిలించుట), 6. అలగ్నపాటవము (పాదములను తిప్పుట) 7. సిరిపటము (గజ్జెలతో పాదములను చలింపజేయుట). తాళ సహితముగా వికృత (పిశాచ, భూత, ప్రేత, వానర) చేష్టలతో వికృతంగా నర్తించడాన్నే వికటము లేదా నాగదము అంటారు. 

గీతము అనగా శుద్ధరాగములతో తాళగతిలో శృతిలయలతో జనులందరికి అర్థమయ్యేటట్లుగా, రక్తికట్టునట్టుగా పాడటం. ఈలక్షణాలన్నింటిని మేళవించి చేసే  నృత్యాన్నే పేరణి అంటారు. ఈ నృత్యంలో నలుగురుగాని, ఆరుగురుగానీ, ఎనిమిది మంది గానీ పాల్గొంటారు. వీరు జంటలు జంటలుగా రంగమండపంలోకి ప్రవేశిస్తుండగా వారి మధ్యలో ప్రేరణి ప్రవేశిస్తాడు. ఇతను ముఖ్య నర్తకుడు. ఇతని లక్షణములు శ్లాఘించదగినవి. రూపసంపన్నుడు. అంగవికారము లేనివాడు. ప్రసిద్ధి గలవాడు, ప్రసిద్ధ వంశమున జన్మించినవాడు, రసానుభవముకలవాడు, తాళజ్ఞుడు, గమకములందు నిష్ణాతుడు, రాగ అంగాది భేధములు, వివిధ వాయిద్యములు ఎరిగినవాడు, రక్తి కలిగించువాడు, పంచాగములందు బుద్ధి కుశలతగలవాడు. అన్ని భాషలందు పట్టుగలవాడు గీత ప్రబంధములు పాడగలిగినవాడు. లాస్వతాండవ పద్ధతి తెలిసినవాడు. ఉత్స్లుతీకరణము లాఘవంగా చేయగలిగినవాడు పేరణిగా ఉంటాడు. ఇతను గవ్వలతోగానీ, బంగారు, రత్నములతోగానీ చేసిన నగలు ధరిస్తాడు. తెల్లని విభూతిని శరీరానికి పూసుకొని, జుట్టునిలుపుకొని తలక్షౌరము చేసుకొని, ఒకచేతిలో కృత్రిమమైన నాగుపామునుగానీ రంగముష్టినిగానీ ధరించి, మరొక చేతిలో చామరమును పట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఉంటాడు. తోటి నాట్యకారులు విభూతిని ధరించి గజ్జెలు కట్టుకొని ఉంటారు. అందరూ కలసి నృత్య విధానములోని ఏడు విధానములను పాటిస్తూ, రక్తికట్టునట్టు పాడుతూ, గజ్జెలు కట్టుకున్న పాదములను లయబద్ధంగా కదిలిస్తూ, పుష్పాంజలిని ఘటించి నర్తిస్తారు. ఈ నృత్యంలో హుడుక్క, కరట, దేశీపటహము మొదలయిన వాయిద్యాలు, శ్రవ్యంగా వినిపించడానికి కంచుతాళాలను వాయిస్తారు. వీరుపాడే గీతాలలో ముఖ్యంగా శివస్తుతులు ఉంటాయి.

2.2 రాసకము:

ఇది బృందనృత్యము రసమునుండే రాసకము వచ్చింది. గోపికాకృష్ణుల రాసలీలయే రసము. దీని నుండి ఉద్భవించినదే రాసకము. ఇందలో గోపికా కృష్ణుల రాసలీలతో బాటు రాజుయొక్క, పోషకులయొక్క వీరశృంగార వర్ణనలుంటాయి. మండలాకారములో చేయు ఈ నృత్యము పదార్థభినయాత్మకై ఉండును. హిందోళరాగ సంబంధ మందారకరములను నాట్యంలో భాగంగా దండములు, కోలాటపుకర్రలు, చామరులు, చురకత్తులు పట్టుకుంటారు. దండచామరే ఛురికాదండక అనే దేశీ విధానములో నర్తకులు రంగస్థలంపైకి వస్తారు. పిండితో కూడిన కట్టుబాట్లతో పదహారు గానీ, పన్నెండుగానీ, ఎనిమిది మందిగానీ చేసే నృత్యం ఇది. ఇందు పిండి, శృంఖలిక, బేధ్యము, లత అనే నాలుగు వర్గాలున్నాయి. నర్తకులందరు ఒక్కదగ్గరికి గుమిగూడటాన్ని పిండి అని, పాములాగ మారడాన్ని శృంఖలిక అని, విడివిడిగా నిలబడటాన్ని భేద్యముఅని, వలలాగ నిలబడటాన్ని లత అని అంటారు. మధ్యవయస్కులైన నర్తకులు ఈ నాలుగు రీతులను నృత్యంలో చూపిస్తారు. చాలావరకు పదహారుమందే ఈ నృత్యంలో పాల్గొంటారు. నర్తకులు చీరగానీ, చల్లడముగానీ, కుబుసము గానీ, రవిక గానీ ధరించి కొప్పుగానీ, జడగానీ వేసుకొని చేతికి కడియాలు, కాళ్ళకు అందెలు ధరిస్తారు. ఈ నాట్యంలో పాల్గొనే నర్తకీమణులు తెల్లని మేనిఛాయతో అందంగా ఉండి ఆకర్షణీయంగా తయారవుతారు. అందమైన శారీర లావణ్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉరువులు, కటి, స్థనములు, పిరుదులు లావుగా మిగిలిన శరీరమంతా మనోహరమైన లావణ్యంతో ఉంటారు. జుట్టును అందంగా జడలుగానీ, ముడులుగానీ వేసుకుంటారు. జంటలుగా తయారై వాయిద్యాలతో బాటుగా తెరకు రెండు వైపులనుండి రంగ మండపమునకు వస్తారు. పాటకు అనుగుణంగా నర్తిస్తూ, లయబద్ధంగా చిటికెలు వేస్తూ,  చప్పట్లు చరుస్తూ ఒకరి చేతులపై ఒకరు తాళము తడుతూ, మనోహరంగా నాట్యం చేస్తారు. వీరంతా రాజు యొక్క గుణగణాలను వర్ణిస్తారు. లేదా గోపికాకృష్ణుల రాసలీలావర్ణనం చేస్తారు. ఇది ముఖ్యంగా స్త్రీల బృంద నృత్యము. భరతముని వర్ణించిన పిండీ బందములకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నృత్యము ముఖ్యంగా వసంతోత్సవ సమయంలో చేస్తారు.

2.3 చర్చరి:

రాసకములోనే నాయికలు వర్ణతాళములతో కూడిన వాద్యముతో మధురంగా వీనుల విందుగా పాడుతూ రంగస్థలానికి ప్రవేశించి నాయకుని అందాన్ని, వీరత్వాన్ని, గుణగణాలను, కీర్తిని పొగడుతూ గానీ, వసంతోత్సవమునందు ఋతువులను వర్ణిస్తూ నాట్యం చేయడాన్ని చర్చరి అంటారు. ఇందులోని నర్తకీమణులు యౌవ్వనవతులై అద్భుతమైన సౌందర్యము, ఒంపుసొంపుల లావణ్యముగలవారై ఉంటారు. రాజాగారి గుణగణాలను, శౌర్యాన్ని, చరిత్రను అభినయించడాన్ని నాట్యరాసకము అంటారు. ఎనిమిది నుండి అరవైనాలుగు మంది నర్తకులు జట్లు జట్లుగా ఏర్పడి రెండు చేతులలో కోలలుగానీ, చామరము గానీ, చురకత్తి గానీ ధరించి వాద్యములకు అనుబంధంగా లాస్యాంగములైన బ్రమరులు, పాదములు, చారులతో బాటు కోలలను, చామరులను, చురకత్తులను లయబద్ధంగా తిప్పుతూ నర్తించడాన్ని దండ రాసకం అంటారు.

2.4 ప్రేంఖణము:

జాయపసేనాని, నృత్యరత్నావళిలో ఈ నృత్యము గురించి వివరించాడు. ప్రేంఖణము, పేఖ్ఖణము కాలక్రమేణ ప్రేంఖణముగా మారింది. సంస్కృతమున దీనికి ప్రేక్షణము అని కూడా అంటారు. ఇది ఉద్ధత నృత్యము, ఉత్ప్లుతీకరణాలను కలిగినది. ఇది గీత శబ్ద ప్రబంధ జన్యమని, నానార్థ రససంపన్నమని, నరనారీ ప్రవక్తికమని, విచిత్రమని, మనోహరి అని స్వేచ్ఛాకల్పితమని చెప్పబడింది. ఈ నాట్యములో వాద్యప్రబంధములుంటాయి. చమత్కారిక కరణమయిన నర్తన ఉండటం ఈ నాట్య ప్రత్యేకత. తాళము లేని ఆలాపనతో కూడిన పదరూపక రాగము ఇందులో కవితము, అవచ్ఛేదము, మలపము, ప్రహరణము అను ప్రబంధము లుంటాయి. రాగయుక్తమయిన పాటతో సమంగా ఉత్ప్లుతీకరణములతో, భ్రమరులతో, ఉద్ధతమైన చారీ మండలములతో నాట్యం చేయడం ఈ కళయందలి ముఖ్య అంశము. రాజుల చక్రవర్తుల మనోరంజనము, మానసిక పరావర్తనము కోసం ఈ నృత్యము చేస్తారు. ఇందులో ముఖ్యనర్తకి చండాలవనిత, ఆమె హుడుక్క వాద్యమును భుజంపై ధరించి మధుర గానముతో ఆధ్యాత్మక తత్వకీర్తనలు పాడుతుంది. ఆమెతోబాటు మిగిలిన స్త్రీ పురుష నర్తకులు వేణువూదుతూ వాద్యములు మ్రోగిస్తూ నృత్యం చేస్తారు.

2.5 శివప్రియము: 

శివోత్సవాల సమయంలో చేయబడే నృత్యము గనుక దీనిని శిప్రియము అంటారు. ఇందులో నర్తకులు శరీరమంతా విబూధి పూసుకొని, రుద్రాక్షమాలలు ధరించి, కంచుతోగాని, రాగితోగాని చేసిన పాములను ఎడమ చేతిలోను, త్రిశూలాలు కుడిచేతిలో పట్టుకొని స్త్రీ పురుషులు ఎదురెదురుగా నిలబడి వాయిద్యములకనుగుణంగా లయబద్ధంగా "కిరికిట" అనే శబ్ధం చేస్తూ శివుని ధ్యానిస్తూ పాటలు పాడుతూ లయబద్దంగా చేసే నృత్యాన్ని శివప్రియం అంటారు. ఈ నాట్యకారులు శివదీక్షాపరులై ఉంటారు. ఈ నృత్యాన్ని ఎక్కువగా జాతరలలో, శివరాత్రి ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. రుద్రదేవుని కాలం నుండి ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. కాకతీయులు వీరశైవాన్ని, ఆరాధ్య శైవాన్ని ఆదరించడం, బసవేశ్వర ఆరాధన ప్రాముఖ్యత సంతరించుకోవడంతో ఈ నృత్యానికి కాకతీయుల కాలంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. గణపతి దేవుని మంత్రి శివదేవయ్య ఈ నృత్యరీతిని, నాట్యకారులను పోషించాడు. శైవ ఉత్సవాల కాలంలో త్రికూటాలయంలో జరిగే ఈ నాట్యాలను రాజ కుటుంబీకులు  వీక్షించేవారని ప్రతాపరుద్ర చరితం చెబుతుంది.

2.6 కోలాటము: 

దీనిని కోల్హాటమని కూడా అంటారు. ఇది శుద్ధదేశీ నృత్యము. దోమ్మురవారు చేస్తారు గనుక దీనిని దొమ్మర నృత్యము అనికూడా అంటారు. ఇందులో ముఖ్యంగా తాడుపైకి పాకడం, ఊగడం, వేలాడటం, పొడవైన గడపైనకెక్కడం, నిల్చోవడం, ప్రమాదము జరుగకుండా కత్తులను ఝళిపించడం, ఊహించశక్యంగాని బరువులను మోయడం, దూరంగా దూకడం, ఎత్తుకు ఎగరడం, కూలాటీలు వేయడం వంటి విద్యలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో ముఖ్యభూమిక పోషించేవి వాయిద్యాలు. దొమ్మరుల ఆటను అవి రక్తి కట్టిస్తాయి. జాతరలలో పండుగలు ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయాలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిసారు. ఈ ప్రదర్శనలలో స్త్రీ పురుషులతోబాటు చిన్నపిల్లలు కూడా పాల్గొంటారు. నర్తకులందరు వాయిద్యాల కనుగుణంగా ప్రదర్శన చేస్తారు. ఇందులో ముఖ్యుడైన కోల్లాటుడు చతురుడు, మాటచాతుర్యం గలవాడు, కత్తి తిప్పడంలో నేర్పరి, వాయిద్యాల కనుగుణంగా నర్తించడంలో దిట్ట, గోడలపై, తాళ్లపై నడవడంలో నిష్ణాతుడు, పదునైన ఖడ్గాలను, వస్తువులను మలచడంలో ఊహించలేనంత బరువులను మోయడంలో, పక్షివలె ఎగరడంలో దిట్ట. ఇన్ని విద్యలతో రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు.

2.7 ఘటసి నృత్యము:

ఇది కేవలం స్త్రీలతో చేయబడు బృంద నృత్యం. ఇందు ముఖ్య నర్తకి చండాలి, మాలెత లేదా మాతంగ కన్య. ఈమె మధురమైన స్వరం కలిగి, కిరాత వేశంలో ఉన్న శివుణ్ణి కీర్తిస్తూ ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ నర్తిస్తుంది. ఇతర నర్తకీమణులు భుజముపై హుడుక్కా వాద్యమును ధరించి మాతంగకన్య చుట్టూ నర్తిస్తారు. చేసే నృత్యరీతులకు అనుబంధంగా హుడుక్కా వాద్యంతోబాటు వేణువు వాయిస్తారు. వాయిద్యాలతో, అద్భుతమైన గీతాలతో నాట్యం రక్తికడుతుంది. నాట్యం మధ్య మధ్యలో, మద్దెల కాంస్య తాళములను వాయిస్తారు. ఇంతమందితో కూడి చేయు ఈ నృత్యం గంభీరంగా ఉంటుంది. నృత్యాన్ని తిలకిస్తున్న శివభక్తులకు ఒక్కోసారి పూనకాలు కూడా వస్తాయి. దీనిలో ఒకవేళ పురుషులు పాల్గొన్నా వారు స్త్రీ వేషము వేసుకుంటారు. శివోత్సవాలలో, శివదీక్షల సమయంలో, శివరాత్రి జాతరల సమయంలో ఈ నృత్యం ప్రదర్శిస్తారు. కాకతీయులకాలంలో శివభక్తులకు అత్యంత ప్రీతికరమైనది ఈ నృత్యము. ఈ నృత్యానికి రాజుల, సామంతుల, ఉన్నతోద్యోగుల పోషణ ఉండేది.

2.8 భాండిక నృత్యము:

భాండిక నృత్యము హాస్యజనకమైనది. మనోవ్యాకులత కలిగినపుడు మనస్సు విషణ్ణమైనపుడు ఇవి వినోదాన్ని కలిగిస్తుంది. రాజులు పరిపాలనా బడలికలో ఉన్నప్పుడు ఈనృత్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేవారు. అలాగే సామాన్య ప్రజలకు కూడా ఆనందాన్ని అందించేది. ఇందులో ముఖ్య పాత్రధారి భాండుడు అనగా హస్యకారి. ఇతన్ని విదూషకుడు అని కూడా అనవచ్చును. నర్తకులు రకరకాల పక్షుల కూతలను, జంతువుల అరుపులను అనుకరిస్తూ నృత్యం చేస్తారు. వీరి అరుపులకు ఒక్కోసారి చిన్నపిల్లలు బెదిరిపోతారు. ఈ నృత్యములో వాద్యముల మేళవింపు చాలా ముఖ్యమైనది. పక్షుల కూతలు జంతువుల అరుపులకు తోడగునట్లు వాద్యములు వాయిస్తుండగా గతిచారి నైపుణ్యాలతో వాద్యాలను అనుసరిస్తూ నర్తకులు, విదూషకుడు పక్షులను, జంతువులను అనుకరిస్తూ హాస్యాన్ని సృష్టిస్తూ ప్రేక్షకానందాన్ని కలిగిస్తారు.

2.9 బహురూప వర్తనం:

బహుపాత్రలు బహునృత్య స్వభావాలు కలిగి ఆహార్యము, ఆంగికము, వాచికము ప్రత్యేకంగా ఉండే నృత్యరూపకం ఇది. దీనిలో ప్రధాన నర్తకుడు బహురూపి. చాలా సమర్ధత గలవాడు, వేషమును భాషను అత్యంత వేగముగా మార్చగలడు. అతను మార్చే వేషభాషలే ఈ నృత్యానికి ప్రధాన ఆకర్షణ, బహురూపి అందగాడు, వివిధ భాషలలో మాట్లాగలిగే నైపుణ్యం ఉన్నవాడు, నర్వవిధ నాట్యోపయోగ లక్షణములు గలవాడు. నానారకాల వేషభూషలను, చేష్టానుకర కల్పనలో సమర్థుడు, లోకరంజనుడు, మధురమైన మాటలు పలికేవాడు, ఊహకలత్వం కలవాడు, సంకలన సమర్థుడు, అందమైన శరీరాకృతి గలవాడు, రసికుడు, రసానుభావములు విశేషంగా ముఖములో పలికించగలిగినవాడు, భావుకుడు, సర్వ అవయనములు అందంగా తీర్చిదిద్దినట్లు పొంకంగా ఉండేవాడు. ఎక్కువ పొడుగు, ఎక్కువ పొట్టి కాకుండా ఉండేవాడు. అతివేగంగా వేషం మార్చే నైపుణ్యం గలిగినవాడు బహురూపిగా ఉంటాడు. ఆయుష్కర్మ విధానంలో గడ్డము, మీసము, శిరోజములను గొరిగించుకుంటాడు. ఇన్ని సద్గుణాలతో అతను ఆడే నృత్యమును బహురూపము అంటారు. ఇవే సద్గుణాలు ఉన్న వనిత బహురూప అవుతుంది. ఈమె కూడా కేశముండనము చేయించుకుంటుంది. నృత్యములో స్త్రీ పురుషులు బహురూపికి అనుగుణంగా అందంగా నర్తిస్తూ ప్రేక్షకానందం కలిగిస్తారు. వీరి నటన ఎంతో లలితంగా ఉంటుంది. పాల్కురికి సోమనాధుడు-

"బహు నాటకములాడు వారు, లలితంగా, రసాలంకార రేఖ లలనడ బహురూపములాడు వారు" అన్నాడు.8

వీరి నాట్యము ఎంతో లలితంగా, రస్మాత్మకంగా ఉంటుంది. అత్యంతవేగంగా వేషభూషలను మార్చడం వలన బహురూపులనే పేరు వీరికి సార్ధకమవుతుంది. ఈ నర్తనములో హావభావములకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ద్విపాతులు, చతుష్టాతులుగా వివిధ వేషాలతో వీరుచేసే అభినయం రక్తికట్టి ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంది. ఈ విధంగా ఇల్లిల్లు తిరిగి తమ నైపుణ్యాన్ని, విద్యను ప్రదర్శించి వారిచ్చింది తీసుకొని మరో గ్రామానికి వెళ్తారు. తమ నర్తనము ద్వారా లోకము బహు రూపము, బహుభావము, బహువిధము అని చెప్పడమే ఈ నృత్యము ముఖ్య ఉద్దేశ్యము.

2.10 గొండ్లి: 

దేశీ మార్గ నృత్యములలో పేర్కొన్న వాటిలో గొండ్లి ఒకటి. జాయప దీనిని కుండలి అన్నాడు. గొండ్లి కుండలి అను పదానికి సమానమైనది, కుండలాకర నృత్యమే గొండ్లి. దీనికి వేటకత్తెనృత్యము అని కూడా అంటారు. దీనికి రూపురేఖలు దిద్దినవాడు చాళుక్య సోమేశ్వరుడు, జాయప వర్ణించిన దేశీ పద్ధతికి ఇది సన్నిహితంగా ఉంది. క్రీడాభిరామములో మైలారుదేవుని కొలిచే గొరగపడుచులు ఆడే నృత్యమే గొండ్లి. వీరభద్రుని కొలిచే-

"మైలారు దేవరవీర భటులు గొండ్లి యాడించుచున్నారు. గొరగ పడుచు నాడుచున్నది. చూడు మూర్థాభినయము తాను నట్టిక సీలంతగాని లేదు."9

అని గొండ్లిని వివరించినాడు. జాయప నృత్యరత్నావళిలో గొండలి యొక్క పుట్టుక విశేషాలను చెప్పాడు. చాళుక్య భూలోక మల్ల సోమేశ్వరుడు గొండ్లిని ప్రచారము చేశాడని తెలుపుతూ-

కళ్యాణి కటకే పూర్వం భూతమాతృ మహోత్సవం సోమేశ:, కుతుకీ కాంచిత్ భిల్లనేష ముసే ముషిం నృత్యంతి యథ గాయంతి స్వయం ప్రేక్షక మనోహరం ప్రీతో నిర్మతనాన్ చిత్ర గొండలీ విధి మత్సయం యతో భిల్లి మహారాష్ట్రే గొండ్లి గీత్సాభయతే" అన్నాడు.

దీనిని బట్టి గోండలి విధానమును సోమేశ్వరుడు నిర్మించాడని, కళ్యాణికటకములో ఈ నృత్యాన్ని భిల్లువనిత ఆడగా సోమేశ్వరుడు ఈ నృత్యాన్ని చూసి దానిని నియామామసారంగా మార్చి గోండలి విధి అని పేరు పెట్టాడు.10 మహారాష్ట్రలో భిల్లపురంధ్రిని గొండలి అంటారు. పార్వతీదేవి మృదుమనోహర అవయవములు గలిగి కేశపాశ రమ్యమైన కుండలి అనే పేరు గలిగిన దివ్య వనితను ఆదరించింది. దివ్య రూపము గలిగిన కుండలి పార్వతి దేవి నుండి సంగీతాన్ని, నాట్యాన్ని అనుగ్రహంగా పొందింది. కుండలి చేసిన నృత్యం గనుక ఇది కుండలి నృత్యంగా ప్రసిద్ధి పొందింది. జాయప కూడా దీనిని కుండలి అన్నాడు. గోండలియే సంస్కృతంలో కుండలి అయ్యింది. నృత్యరత్నావళిలో జాయప కుండలిని శక్తిగా భావించి దేశీ నృత్య రూపకమునకు యోగ ప్రాభవము ప్రతిపాదించాడు. ఇందులోనే శుద్ధ గోండలి, సంకీర్ణ గోండలి భేధములను చెప్పి దీనిలో సంకిల నృత్యము గురించి బహుపాత్ర యుతము చేసి దానికి పిండీబంధ యోజనమును ఆపాదించి గీత వాద్య తాళ ప్రబంధముల అనుబంధాన్ని చెప్పాడు. సంగీత రత్నాకరంలో శార్గ్ణదేవుడు ఈ గోండలి విధిని గోండలి నృత్యమని అన్నాడు. ఈ నృత్యములో దీపవర్తన ప్రయోజ్యములైన కఠిన వాద్య ప్రబంధములుండవు. గీతములు, లాస్యాంగములు ఉంటాయి. నర్తకి కోమలాంగములతో స్వయంగా గానము చేస్తూ నాట్యము చేస్తుంది. కేవలం వాద్యముపైనే నృత్యము చేయడాన్ని మూక గోండలి అంటారు. ఈ నృత్యములో మొదట గణాధిపతిని, పార్వతిని, పరమేశ్వరుని స్మరించి నమస్కరించి ఆత్మశిక్షకునికి, సభాపతికి వందనం చేసి అనంతరం రంగదేవతను ఆరాధిస్తారు.

"పూర్వం గానంతతో వాద్యం నృత్యం పశ్చాత్"11 అను నియమానుసారంగా అన్ని విశేషాలను అనుసరిస్తూ ప్రాయోగికములైన నృత్య విధానాలను క్రమంగా అనుసరిస్తారు.

సర్వాంగ శోభా సంపాదకమైన విశేషమున లీలావిలాస రసపూర్ణ విఘార్ణములతో శాస్త్ర విధానములో హస్త ప్రచారముచేసి ఉపాంగగానం, వంశగానం చేస్తూ పుష్పాంజలి అర్పిస్తారు. ఈ విధంగా చేయు కుండలీ నృత్యము సర్వపాపకోటి వినాశనము. ఈ కుండలి నృత్యమునకు కుండలి విధానమునకు సంబంధము గలదని కొందరి భావన. మానవుని దేహమున మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, ఆవాహనము, విశుద్ధము, ఆజ్ఞ అను ఆరు చక్రములు బ్రహ్మాండముననుసరించి ఉంటాయి. కుండలిని శక్తి మూలాధార కలదైనందున, యోగావలంబనమున పైపైకి ప్రసరిస్తుంది. ఈ శక్తి వల్లనే మానవుడు యోగసిద్ధి పొందుతాడు. ఇది యోగ తంత్ర విషయం. ఈ విశేషములన్ని నర్తకిలో ఉండుటచే కుండలి సిద్ధి కలగుతుంది. 

ఇన్ని లక్షణముల ఈ నృత్యాన్ని పార్వతీదేవి కుండలికి చెప్పగా, ఆమె గోపాలాంగనలకు చెప్పింది. వారు సౌరాష్ట్రసుందరులకు చెప్పారు. అనంతరం ఇది దేశమంతా వ్యాపించింది. ప్రస్తుతకాలంలో ఈ నృత్యం ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన తాండవ నృత్యరీతివలె మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రదర్శింపబడుతూ సరిహద్దుల అరణ్య ప్రాంతాలలోని ఆటవిక జాతుల మధ్య సంబంధాల వలన, రాకపోకల వలన తెలుగు ప్రాంతాలలో కూడా ఈ నృత్యం గొండ్లి, గోండలి పేరుతో సజీవంగా ఉంది.

3. ముగింపు:

భాష, సాహిత్యం చరిత్ర, సంస్కృతి, వారసత్వం, లలితకళలు, జానపదకళలు ఇవన్నీ ఒక ప్రాంత స్థానాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతాయి. అందులో జానపద కళారూపాలు ప్రజల జీవన విధానాల నుండి ఉద్భవించినవి. సంతోషం, బాధ, కోపం, ప్రేమ మొదలైన భావాలను వ్యక్తపర్చుటలో మనిషి ఈ కళా రూపాలను ఆసరాగా తీసుకున్నాడు. అందుకే అవి వారి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. కనుకనే వాటికి సమాజంలో ఎంతో గుర్తింపు వచ్చింది.

మానవ మనుగడ మొదలు పెట్టిన కాలం నుండి నేటి వరకు ప్రాంతాలను బట్టి భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను బట్టి ఏర్పడిన ఈ కళారూపాలు కాలానుగుణంగా మార్పులకు లోనయ్యాయి. కొన్ని ప్రచారంలో లేక కాలగర్భంలో కలసిపోయాయి.

కాకతీయుల కాలంలో ఉన్న కళారూపాలు ప్రజలలో ఆనందాన్ని, ఆత్మీయతను, ఏకత్వాన్ని పెంపొందింపజేశాయి. ఆయా కాలాలలో సంస్కృతిలో భాగమై తమ అస్తిత్వాన్ని చాటుకున్నాయి. కాకతీయ రాజుల పోషణ వీటి మనుగడకు దోహదపడింది. 

ఇటువంటి సాహిత్య విలువలున్న జానపద కళారూపాలను కాపాడుకోవలిసిన బాధ్యత ఎంతైనా ఉంది. వీరి నృత్యరీతులను, వీటి గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కళారూపాలు కనుమరుగు కాకుండా శోధించి, పరిరక్షించి తెలుగు సంస్కృతి శోభను నిలుపవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

4. పాదసూచికలు:

  1. కాశీఖండము - పుట 23
  2. భీమేశ్వర పురాణము- పుట 118
  3. ఉత్తరహరివంశము- పుట 172
  4. బసవపురాణము- పుట 22
  5. పండితారాధ్య చరిత్ర - పుట 435
  6. క్రీడాభిరామము - పుట 104
  7. నృత్య రత్నావళి- పుట 345
  8. బసవపురాణము - పుట 39
  9. క్రీడాభిరామము - పుట 104
  10. బసవపురాణము - పుట 215
  11. సంగీత నృత్య రత్నావళి- పుట 21.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి. నృత్యరత్నావళి. ఆంధ్రపదేశ్ సంగీత నాటక అకాడమి, హైదరాబాద్, 1969.
  2. పసవుల నాగయ్య, చింతకుంట. పండితారాధ్య చరిత్ర. శ్రీవిజయరామచంద్ర ముద్రాక్షరశాల, విశాఖపట్టణం, 1914.
  3. మాధవరాయశర్మ, జమ్మలమడక. నృత్యరత్నావళి. ప్రథమభాగం, నరేంద్ర సాహిత్య మండలి, తణుకు, 1971.
  4. రాధాకృష్ణమూర్తి, మిక్కిలినేని. తెలుగువారి జానపద కళారూపాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్, 1992.
  5. రామగోపాల కృష్ణమూర్తి, కంభంపాటి. శ్రీనాథకృత భీమేశ్వరపురాణము, కళ్యాణి ప్రెస్, విజయవాడ, 1958.
  6. లింగమూర్తి, పూడిపెద్ది. బసవపురాణము, వచనకావ్యము, శ్రీచింతామణి ముద్ర కళాశాల, రాజమహేంద్ర వరం. 1927.
  7. సింగరాచార్య, బి.వి. వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామము. ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, 2009.
  8. సుందరం, ఆర్వీయస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్. 1983.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]