AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. ‘పానుగంటి’ ‘సాక్షి’ వ్యాసాలు: గద్యరచనావైశిష్ట్యం
డా. తలారి వాసు
సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9949294254, Email: vasutalari@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ప్రపంచాన్ని, జీవితాన్ని కాచి వడగట్టి సాక్షి వ్యాసాల్లో ఉంచారు పానుగంటి లక్ష్మీనరసింహారావు. ప్రాణ దురంధరమైన శైలిని సృష్టించి తెలుగు గద్యరచనకు నూతనత్వాన్ని కలిగించారు. హాస్యరసానికి దాస్యవిముక్తి కలిగించి స్వతంత్ర ప్రతిపత్తిని ప్రసాదించిన వారిలో పానుగంటి వారిది సువర్ణమయమైన ఒక ప్రత్యేక పీఠం. లోకోత్తర శక్తి స్ఫోరకమైన హాస్య ప్రకాశానికి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాలు తిరుగులేని సాక్ష్యం. సాక్షివ్యాసాల ద్వారా పానుగంటి గద్యరచనా వైశిష్ట్యాన్ని పరిశీలించి, సోదాహరణంగా విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం. భాషాసాహిత్యాల విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ పరిశోధనలో రూపుదిద్దుకుంది. పూర్వపరిశోధకులు, విమర్శకులు, కవిపండితుల అభిప్రాయాలు, “సాక్షి”వ్యాసాలు ఈ పరిశోధనకు విషయసామగ్రి.
Keywords: పానుగంటి, గద్యం, సాక్షివ్యాసాలు, స్వభాష. భాష, వ్యంగ్యం, హాస్యం.
1. ఉపోద్ఘాతం:
“నేను సభా భవనమునకేగుసరికి జంఘాలశాస్త్రి ఏమియో ఉపన్యాసించుచుండెను. అంతకుముందు ఏమి ఉపన్యాసించెనో నాకు తెలియదు కానీ నేను వెళ్ళిన పిదప ఇట్లుపన్యసించెను. నాయనలారా! "లక్ష్మీ నరసింహారావు పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి, ఎంచేతంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియడం నేనుగంటి!"1
సాక్షి వ్యాసాల పద్ధతిని, ఆ గద్య రచనలోని ఉధృతిని వర్ణించటం కంటే శ్రీశ్రీ రాసిన ఈ మాటల్ని స్మరించటం మేలు.
పానుగంటి వారిది నైసర్గికమైన మహాప్రతిభ. సునిశితమైన చూపు సర్వంకషమైన ప్రజ్ఞ. అపూర్వమైన ఒక కల్పిత సంఘాన్ని సృష్టించి మానవ సంఘసంస్కరణ ప్రయత్నం చేశారు. ఆయన చర్చించని, ప్రతిపాదించని విషయమే లేదు.
2. పానుగంటి – పరిచయం:
రాజమహేంద్రవరానికి సమీపంలోని సీతానగరం ఆయన ప్రాంతం. గొప్ప కవి, విమర్శకులు, భావకులు. సమాజదర్శనం మరువనివారు. సంఘసంస్కరణం కోరిన వారు. గద్యరచన ద్వారా పాఠకులను ఆకట్టుకొనుటలో కనికట్టు కనిపెట్టిన వారు. నాటకాల్లో కన్యాశుల్కం ఎటువంటిదో గద్యరచనలో "సాక్షి" అటువంటిదన్నారు ఆంధ్రీమయమూర్తి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.2
3. పానుగంటి గద్యం – ప్రత్యేకత:
పానుగంటి వారి గద్యంలోని ఎత్తుగడలు, దింపుగడలు, అక్కర లేకపోయినా గతి విశేషానికి వేసిన యతిప్రాసలు, నివేదనాలు, నవ్వింపులు, గిలిగింతలు, గిల్లడాలు, ఊరడింపులు... ఇవన్నీ పోగుపడిన ఆయన గద్య శైలి తెలుగు పాఠక హృదయ ఫలకాలపైన బలంగా ముద్రపడ్డాయి.
“నాయనలారా!” అనే సంబోధనకు పేటెంట్ హక్కులు ఆయనవే. సర్వ మానవానుభవ సారమైన వస్తువును ఆధారం చేసుకుని ఆయన కలం హాస్యరస లాస్యం చేసింది.
4. పానుగంటి దృష్టిలో గద్యం:
ఆంధ్ర సాహిత్యపరిషత్ 11వ వార్షికోత్సవంలో (1922) సభాధ్యక్షులుగా ఉన్నప్పుడు గద్య సాహిత్యరంగం గురించి వారు మాట్లాడుతూ---
"చిత్రమైన శైలీభేదములు మన భాషలో మిగుల నరుదుగానున్నవని వేరే చెప్పనేల? రైమని పేకచువ్వ పైకెగిరినట్లున్న శైలీభేదమేది? కాకి పైకెగిరి యెగిరి రెక్కలు కదలకుండా సాపుగా వాలుగా దిగునప్పటి లఘుపతన చమత్కృతి కనబరచు శైలీపద్ధతి ఏది? తాళము వాయించునప్పటి తళుకు బెలుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలుగల శైలి ఏది?.... భయంకరమయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్దవ యుక్తమై, ధారళమయ్యు విశాలమై, స్వభావ సమృద్ధమయ్యు సరసాలంకార భూయిష్టమై, సముద్ర ఘోషము కలదయ్యు సంగీతప్రాయమై.... చదువువరులకు కనుకట్టై,వాకట్టై, మదిగట్టై తలపులిమినట్లు, శ్వాసయైన సలుపకుండజేసినట్లు, ముష్టివాని చిప్పనుండి మూర్థాభిషిక్తుని కిరీటము వరకు, భూమి క్రిందయరల నుండి సముద్రములోని గుహల వరకు, ఎవరెస్టు కొండ నుండి ఇంద్ర ధనుస్సు రంగుల వరకు, మందాకినీ తరంగ రంగద్ధంసాంగనా క్రేంకారముల నుండి మహాదేవ సంధ్యా సమయ నాట్య రంగమున వరకు మనోవేగముతో నెగురు శక్తిగల చిత్ర విచిత్ర శైలీభేదము లింక నిన్నియో భాషలో పుట్టవలసి యున్నవి..." 3
ఇదండీ ఆయన కోరుకున్నది. ఆయన ఆశించిన గద్యం. సరైన గద్యం ఎటువంటిది అనటానికి కూడా ఈ అధ్యక్ష వచనమే నిర్వచనం. ఆయన ఆశించిన గద్యం ఆయన వల్లనే, సాక్షివ్యాసాల ద్వారానే మనకు లభించింది. సాక్షి సంపుటాలు గద్య కావ్యాలనిపించగల గుణసమన్వితాలు.
"కోణములు మార్చి సాక్షిపైన వంద పరిశోధన గ్రంథములు ఉదయింపజేయవచ్చును. వేయి ఉపన్యాసము లీయవచ్చున"4 నన్నారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
5. వ్యంగ్యమర్యాద:
ఉదాత్తమైన వ్యంగ్య మర్యాద పానుగంటి వారి హాస్య రసానికి మూల ప్రతిష్ఠ. మచ్చునకు ఒక గద్యం. జంఘాలశాస్త్రి స్వప్నోపన్యాసం. సభను వర్ణిస్తూ....
“..... దిగి మొగ్గలు కొన్ని, రవంత వికసించిన మొగ్గలు కొన్ని, సంపూర్ణముగ వికసించినవి కొన్ని, రాలిపోయిన రేకులు గలవి కొన్ని గల గులాబీ తోట కంటే ఆ సభ సహస్రాధిక సౌందర్య సమన్వితమై ఉన్నది. చంపకొప్పులవారు, ముచ్చట ముళ్ళవారు, కత్తిరింపుల ముంగురులవారు, కాగితపు పూలవారు, కత్తిరింపు బుర్రలవారు, వాలుకన్నెల వన్నెలాడులు,గుండ్ర కన్నుల కోమలాంగులు, అడుసు కన్నుల అబలా శిరోమణులు, చింపిరి కనుల శీతాంశముఖులు, మెల్లకనుల పల్లవ పాణులు, ఒంటి కంటి ఉవిదలు... ఓ... కర్ణాటకపు చీరలతో, బుటేదారు కోకలతో, కలంకారి లంగాలతో, పాము మీసపు జనానా కండువాలతో, స్వదేశీయపు సెల్లాలతో, మిలమిలలతో, జలజలలతో, కల కలలతో, గణగణలతో, పెట పెటలతో, లొటలొటలతో వహవ్వా! సర్వజన నయనానంద ధురీణులై ప్రకాశించుచున్నారు. సెంట్ల వాసనలు, పువ్వుల వాసనలు, అగరు నూనె వాసనలు, కాంతామనుల ముఖ పద్మ సౌరభములతో కలసిఉండ అచటి వాయువంతయు మత్తెక్కినటులున్నది. ఆడుది ఉన్న చోటనే అన్ని సౌరభములు. మగవాడున్నచోటనేమున్నది. ముక్కు పొడుము వాసన, చుట్ట కంపు, సిగరెట్టు గొట్రు కంటెనేమున్నది. పురంధ్రీమణుల చేతను, పుష్పకముల చేతనుగదా భూమి కలంకారము!” 5
చమత్కారం ఏమిటంటే, వేలకొలదిగా ఉన్న సభలో పానుగంటి వారి కటాక్షం ఏ ఒక్క సభ్యుణ్ణి, ఏ ఒక్క సభ్యురాల్ని పలకరించకుండా ఉండదు. ఆయన అధిక్షేపం సహస్రాక్షంగా ఉంటుంది. ఆయన గద్యరచన హాస్య రస లాస్యం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఆయన రచన గిల్లునట్లుండును. గిల్లును. అవసరమైనపుడు, చర్మం దళసరి అని భావించినప్పుడు రక్కి యైన నొక్కి చెప్పునుకాని వదిలే ప్రసక్తి లేదు. అందువల్లనే సాక్షి, ఛాందసులకు సింహస్వప్నం. కాదు కాదు లక్ష్మీనరసింహ స్వప్నం. నిబ్బరమైన పానుగంటి వచనరచనకు అబ్బురపడని గద్య ప్రేమికులుండరు.
6. స్వభాషవ్యాసం గద్యరచనాధోరణి- దేశభక్తి:
పానుగంటివారి తెలుగు వాక్యాలు పరోక్షంగా క్రియాత్మక దేశభక్తిని ప్రబోధిస్తాయి. "స్వభాష" వ్యాసంలో ఆంగ్లభాషా వ్యామోహంలో తెలుగు మాట్లాడటానికి ఇష్టపడని వారిని ఆయన దులిపిన తీరు అందరికీ తెలిసిందే.
"మ్యావుమని కూయలేని పిల్లి ఎచ్చటనైననున్నదా? ఈతరాని కప్ప ఏ దేశమందైనా నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకు ఏమైనా సందేహమా? ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైన ననవరత శ్రవణమున ఆంధ్రమును మాట్లాడుచుండగా... అయ్యయో! మనుజుడే అంత మనుజుడే... ఆంధ్ర మాతా పితామహులకు పుట్టినవాడే, ఆంధ్రదేశీయ వాయు నిరాహారపారణమొనర్చినవాడే అధమాధమం ఆరు సంవత్సరముల ఈడు వరకు ఆంధ్రమున మాటలాడినవాడే అట్టివాడాంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమును మాటలాడ లేకుండునా?...”6
అని పానుగంటి వారు రాసిన ఈ మాటలు ఎంత దలసరి చర్మం వారినైనా మార్చగల శక్తి కలిగినవి.
మన హృదయాల్లో నాటుకునే ఒక మాట రాశారాయన. అదేమిటంటే... "వచన గ్రంథ రచనా బహుళ్యము కాని భాష అభివృద్ధి పొందనేరదు" అని. సాక్షి వ్యాసాలు అధునాతన కాలమున తెలుగువారికి బృహత్ సంహితలు! తెలుగులో సాక్షి వ్యాసాల ద్వారా మంచి గద్యాన్ని అందించిన పానుగంటి లక్ష్మీనరసింహారావు "సమయానుసార సర్వతోముఖ సమ్మోహినీ కరుణ సరస్వతీ మూర్తి."
7. ముగింపు:
వ్యాసమనే ప్రక్రియ "సాక్షి" ద్వారా నవ్యాంధ్ర సాహిత్య ప్రపంచంలో కీర్తి పతాకను ఎగురవేసింది. పానుగంటి వారు ఈ నూతన సృష్టి ద్వారా తెలుగు పరువు నిలబెట్టారు. సాక్షి వ్యాసాల్లో పానుగంటి వారి విశేష గ్రహణశక్తి గలబుద్ధి, సమాజపు లోతుల్ని పరిశీలింపగల నిశిత దృష్టి, స్పందన గల హృదయం మనకు కనిపిస్తుంది. ఆయన లోకాన్ని బాగా దర్శించిన మనీషి. సమాజాన్ని సంస్కరించడానికి కల్పిత సాక్షి సంఘాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవ విషయాలకు చమత్కారాన్ని అతికి షుగర్ కోటెడ్ మాత్రల వేశారు. నాలుకకు తీపిగా ఉంటుంది. చేదుమందు లోపల పని చేస్తుంది. హాస్యాన్ని అనుభవిస్తూనే వాతల్ని భరించేలా సంస్కరించారు. ఒక్కొక్క సాక్షి వ్యాసపఠనంతో పాఠకునిలో అహంకారం,అజ్ఞానం పోయి అచ్చమైన తెలివి కలుగుతుంది. తెలుగులోని తీయదనం కూడా తెలుస్తుంది.
నేడు డిగ్రీ వరకు ఉన్న చదువుల్లో తెలుగు పాఠ్యపుస్తకాల్లో "స్వభాష" లాంటి వ్యాసం ఏదో ఒకటి అర మాత్రమే నేటి విద్యార్థులకు పరిచయం కలుగుతుంది.కానీ సాహిత్య విద్యార్థులు,సాహిత్య ప్రియులు పట్టుమని పది వ్యాసాలైనా పఠిస్తే ప్రాచీన,ఆధునిక శాస్త్ర సంగతుల్ని సంప్రదాయ వేత్తలా పానుగంటివారు ఎలా ప్రశంస చేశారో తెలుస్తుంది. అంతేకాక వైరుధ్యమైన అంశాల్ని ప్రస్తావించి ఎలా ఎగతాళి చేశారో కూడా గమనించవచ్చు. తెలుగు వచన రచనా వైభవంతో పాటు, పానుగంటి వారి సంఘసంస్కరణ ప్రియత్వం, స్త్రీ జనాభ్యుదయ కాంక్ష, విద్యా సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాలని ఆలోచన, నాగరకత వ్యామోహానికి లోను కావద్దనే హెచ్చరిక, మాతృభూమి, మాతృభాషాభిమానాలను కలిగి ఉండాలనే హితవు, దైవభక్తికి కావలసిన నిరాడంబరమైన అంతశ్శుద్ధి... ఇటువంటి విషయాలను సాక్షి వ్యాసాల ద్వారా మనం గ్రహిస్తాం. సుప్తమైన జాతిని జాగృతం చేయటానికి గతవైభవ స్మరణం కూడా సాక్షి వ్యాసాల్లో అంతర్లీనమైన సారాంశం. తెలుగు వచనంలోని తీయదనం, చమత్కారం నేటి సాహిత్య విద్యార్థులు సాక్షి వ్యాసాల ద్వారా పొందుదురుగాత!
8. పాదసూచికలు:
- సిప్రాలి, పు: 42
- మధునాపంతుల సాహిత్యవ్యాసాలు, పుట: 84
- సాక్షి ,మూడవసంపుటి, పుట: 258
- మధునాపంతుల సాహిత్య వ్యాసాలు, పుట: 85
- సాక్షి, మొదటి సంపటం పుట: 250
- సాక్షి, రెండవసంపుటి, పుట:38
9. ఉపయుక్తగ్రంథసూచిక:
- రవికృష్ణ, మోదుగుల. పానుగంటి లక్ష్మీనరసింహారావు. VVIT ప్రచురణ, గుంటూరు,
- లక్ష్మీనరసింహారావు, పానుగంటి. సాక్షివ్యాసాలు 3 సంపుటాలు, అభినందన పబ్లిషర్స్, విజయవాడ,1991.
- శారదామణిమంజీరం, ప్రసన్న భారతి గ్రంథమాల, విశాఖపట్నం(2015)
- సత్యనారాయణశాస్త్రి, మధునాపంతుల. మధునాపంతుల సాహిత్యవ్యాసాలు (ద్వితీయముద్రణ), మయూరి కళాసమితి, రాజమహేంద్రి,
- శ్రీనివాసులు, బందునాథం. పానుగంటివారి సాక్షి వ్యాసాల్లో హాస్యం. ఎం.ఫిల్. (సి.వ్యా.), శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం,1982.
- శ్రీశ్రీ, సిప్రాలి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. 2015.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.