headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ‘శప్తభూమి’ నవలాకాలంనాటి నమ్మకాలు: విశ్లేషణ

బుక్కే ధనక నాయక్

పరిశోధకులు, తెలుగు & ప్రాచ్యభాష విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com



డా. ఎన్. వి. కృష్ణారావు

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు & ప్రాచ్యభాష విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490218173, Email:vkraonarisetty@yahoo.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 14.11.2024        ఎంపిక (D.O.A): 29.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

నవల ఒకసుదీర్ఘ సాహిత్యప్రక్రియ. దీర్ఘకాలంపాటు కొనసాగినప్పటికీ కథలోలీనమై, కథాసారాంశాన్ని, కథలోని వ్యక్తులవ్యక్తిత్వాలను, పాఠకులు తమజీవనశైలికి అన్వయించుకుంటూ ఉంటారు. శప్తభూమినవల అనంతపురంజిల్లా దళిత, బహుజనుల జీవనవిధానాన్ని, చారిత్రాకాంశాలను చిత్రీకరించిన గొప్పరచన. అగ్రకులాలవారు దళితకులాలపై తారాస్థాయిలో వివక్షచూపించడంవల్లే శప్తభూమి రాయబడినట్లు నవలచదివితే స్పష్టమౌతుంది. నవలకథాంశంలో మూఢనమ్మకాలే కీలకపాత్రపోషించాయి. కనుకనే ఈ మూఢవిశ్వాసాలను, అజ్ఞానాన్ని, పరిశీలించి, వివరించుటకు “శప్తభూమి నవలాకాలంనాటి నమ్మకాలు : విశ్లేషణ” అనే శీర్షికతో విశ్లేషించే ప్రయత్నం జరిగింది. ఈ నవలకథాకాలం క్రీ.శ 1775 నుంచి 1788 వరకు కొనసాగింది. కేవలం అనంతపురంజిల్లా ప్రజలజీవనస్థితిగతులు, మూఢనమ్మకాలనుమాత్రమే ఈ వ్యాసంలో స్వీకరించడంజరిగింది. శుభసూచకం, బ్రాహ్మణహత్య, ఆకుపూజ, గులిగానప్పా పరస, గాలిదేవర జాతర, అగ్నిదివ్వె పరీక్ష, మరులమందు, వీరశిరోమంటపం మొదలగు ఉపశీర్షికలను పొందుపరచడం ఈ విశ్లేషణలో ప్రధానమైనవి. ఇంతకుముందు “రాయలసీమ దళితవర్గం” అనే పేరుతో గౌతమిమాసపత్రికలో సారాడవెంకయ్య ప్రచురించినవ్యాసములో దళితవర్గంవారి ఆర్థికస్థితిగతులగురించి కూలంకుషంగాచర్చించి, సాంఘికాంశాలనువిడిచిపెట్టారు. భూమికమాసపత్రికలో భూమటికాంచన రాసిన “గద్దలాడతండైనవలలో శప్తభూమి ఆనవాళ్ళు” అనే వ్యాసములో బడుగులదైవారాధనలు మాత్రమే చర్చించారు. అలాగే యోగివేమన విశ్వవిద్యాలయంలో “రాయలసీమరచనల్లో దళితనవలలు” అనేపేరుతో పరిశోధనగ్రంథాన్ని పారానరసింహరావు సమర్పించారు. ఈ గ్రంథంలో దళితస్త్రీల ప్రస్తావనద్వారా ఉన్నతవర్గం స్త్రీలస్థానమేంటో వెల్లడవుతుంది. బండి నారాయణస్వామి శప్తభూమినవల, దీనిపైవచ్చిన విమర్శావ్యాసములు, పరిశోధనాగ్రంథాలు మొదలగురచనలు ఈ వ్యాసమునుకు ఆధారాలుగా స్వీకరించబడింది. నవలాకాలంనాటి సాంఘికదురాచారాలు, మూఢనమ్మకాలు వంటివికేవలం నిరక్షరాస్యత, అజ్ఞానంవలనే ఏర్పడింది. అప్పటికాలంలోనూ విద్యకుప్రాధాన్యత ఉండిఉంటే మూఢనమ్మకాలకు చోటు ఉండేదికాదు. దీనిద్వారా ప్రస్తుతసమాజానికి విద్య ఆవశ్యకత తెలియజేయడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.

Keywords: అవిద్య, మూఢనమ్మకాలు, కులవివక్ష, మైలపడటం, ఆకుపూజ, అస్పృశ్యత.

1. ఉపోద్ఘాతం:

శప్తభూమి అంటే శపించబడిననేల అనిఅర్థం. 18వశతాబ్దంలో రాయలసీమ ప్రాంతానికిచెందిన చరిత్రను రచయిత ఈ నవలలో నమోదు చేశాడు. శ్రీకృష్ణదేవరాయల పాలన తరువాత పాలెగాళ్ళ సంస్థానాలలోని రాజకీయాలు, కక్షలు,కార్పణ్యాల మధ్యనలిగిన ప్రజలజీవితాలు, పాలెగాళ్ల దౌర్జన్యాలు, బసివిని వ్యవస్థ, సతీసహగమనం వంటి అనాచారాలు, కరువు కాటకాలకు తట్టుకోలేక పసిపిల్లలను అమ్ముకునేదుస్థితీ ఈ నవలలో కనిపిస్తాయి. రచయిత తనకుతెలిసిన గాలిదేవరసమాధి, గులిగానప్ప పరస, కదిరప్పస్వామి పరస, వీరగల్లులు మొదలైన చారిత్రకదాఖలాలను ఆధారంచేసుకుని ఈ నవలనురాసాడు. అదేసమయంలో వర్తమానసందర్భమైన తెలంగాణా ఉద్యమం కూడా రచయితను ప్రభావితం చేసింది. రాయలసీమప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతికపరమైన చరిత్రను నవలరూపంలో అందించాలని రచయిత భావించాడు.

2. నవల ఇతివృత్తం:

1775 ప్రాంతాలలో అనంతపురసంస్థానాన్ని హండేరాజు సిద్ధరామప్పనాయుడు పరిపాలిస్తుంటాడు. తనశత్రువులైన తాడిమర్రిసంస్థానం వారు బుక్కరాయసముద్రం చెరువుకు గండిపడేటట్లుచేసి అనంతపురాన్ని ముంచివేయాలనే కుట్రపన్నుతారు. కానీ బిల్లే ఎల్లప్ప అనే గొర్రెలకాపరి సాహసంతోవారి కుట్రనుభగ్నం చేస్తాడు. రాజు మెచ్చి అతడిని అమరనాయకుడిగా నియమిస్తాడు. అతడు ఎల్లప్పజెట్టీగా పిలువబడుతుంటాడు. తన రాజు బొక్కసం నింపడంకోసం తాడిమర్రి సంస్థానానికి చెందిన యెల్లుట్లను దోచుకుంటాడు.

సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబు టిప్పుసుల్తానుకు రెండు సంవత్సరాలు ఖండినీరూకలు బాకీపడినాడు. దానిని వసూలుచేసుకోవడానికి మైసూరునవాబు తరఫున గుత్తిసుబేదార్ అనంతపురం సంస్థానంపై దాడికిదిగుతాడు. అతడితో చెరువులోపల్లె పరగణా కుదువ పెట్టడానికి, ఇరవైఐదువేల రూకలు చెల్లించడానికి ఒప్పందం కుదురుతుంది. ఐతే పద్నాలుగు వేలరూకలు మాత్రమే సర్దుబాటు కావడంతో గుత్తి సుబేదార్ కోపంతో కోటవాకిళ్లు, దివాణంవాకిళ్లు పడగొట్టిపోతాడు. తమదొరకు జరిగిన అవమానానికి ఎల్లప్పజెట్టీ కృంగిపోతాడు. వానలకోసం వీర మంటపం ఎక్కడానికి శ్రీశైలం మల్లికార్జునస్వామికి మొక్కుకుంటాడు ఎల్లప్పజెట్టీ. గండకత్తెరతో తనశరీరంలోని అంగాలను ఆన్నింటిని కత్తిరించి మల్లికార్జునికి అర్పించి దేహ త్యాగం చేయడంతో నవల సమాప్తమౌతుంది.

ఈ కథలో ఎల్లప్పజెట్టీని తిరస్కరించి వివాహబంధంనుండి బయటపడిన ఇమ్మడమ్మ, నాయకరాజులసంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న రాచవేశ్య పద్మసాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆమెకుమారుడు మన్నారుదాసు, కండబలం ఉన్నా కులంబలం లేక అన్యాయాన్ని ఎదురించలేని కంబళి శరభుడు, తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకునే హరియక్క, మతం ముసుగుతో లైంగికదోపిడీకి పాల్పడే నాగప్పప్రగడ, ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించే గురవడు, తనకూతురి దుర్గతికికారణమైన స్త్రీలోలుడు సిద్ధప్పనాయుడి పతనానికి ఎత్తులువేసిన బయ్యన్నగారి అనంతయ్యశ్రేష్టి మొదలైనవారి కథలు ఉన్నాయి.

3. శప్తభూమినవల - అనంతపురంజిల్లా ప్రజలనమ్మకాలు:

శప్తభూమినవలలో చిత్రీకరించిన అనంతపురంజిల్లా ప్రజలనమ్మకాలను విశ్లేషించి చూద్దాం.  ఈ నవలలో దళిత, బహుజన, చారిత్రకాంశాలు ప్రధానమైనవి. రాయలసీమకుచెందిన అనేక చారిత్రక సంఘటనలతోపాటు చారిత్రకపాత్రల ఆధారంగా ఈ నవల రూపొందించడంజరిగింది. ఇందులో శుభసూచకం, ఆకుపూజ, గులిగానప్ప పరస, గాలిదేవర జాతర, అగ్నిదివ్వె పరీక్ష, మరులమందు, అస్పృశ్యత, వీరశిరోమండపం మొదలగు అంశాలతో చారిత్రక మరియు కల్పితపాత్రలసృష్టితో నవలకొనసాగుతుంది. రచనకు పూనుకోవడానికి ముందు నారాయణస్వామి-

కైఫీయత్తులు, శిలాశాసనాలను, వీరగల్లులను మాత్రమేకాకుండా ఆయా కాలఘట్టాలను, సామాజికనమ్మకాలను, ఆచారవ్యవహారాలను, కూలంకషంగా అధ్యయనం చేశారు” (శప్తభూమి నవల ముందుమాట) అని అంటారు కన్నడ రచయిత వీరభద్రప్ప.

ఈ మాటద్వారా రచనచేయడానికి ముందు రచయిత అన్నివైపుల అన్నిఆధారాలను సేకరించే రచనకునాందిచెప్పారని స్పష్టమౌతుంది.

3.1 శుభ సూచకం:

18వశతాబ్దంలో కన్యలను, బ్రాహ్మణులను, కపిలగోవులను దర్శించడం శుభసూచకంగా భావించేవారు. ఈ నవలలలో హండేసిద్ధప్పనాయకుడు స్నానానంతరం కన్యలను, బ్రాహ్మణులను, కపిలగోవులనుదర్శించి, ఆరాధ్య నామావళిలనువిని సభకువెళ్లేవాడు. గ్రామపెద్ధైనప్పటికీ హాండె సిద్ధప్పనాయకుడు అప్పటివిశ్వాసాలకి లోబడి ఉన్నాడని అర్థమవుతుంది.

“ఛీ పాడుపిల్లి శుభమాను సభకుపోతాంటే ఎదురొచ్చిందేమిటి? ఈరోజు ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో, ఎలాంటి ఆపద వస్తుందో” (రాయలసీమరచనల్లో దళితనవలలు, పరిశోధనగ్రంథం, పుట. 113)

అంటూ ఊళ్ళోకి వెళుతూ తిరిగొచ్చి మళ్ళీ స్నానంచేసి బ్రాహ్మణులను, కపిలగోవులను దర్శించుకుని సభకువెళ్ళాడు. ఈ సంఘటనద్వారా ఉన్నత వర్గంవారి నుంచి దళితవర్గంవరకు అలాంటి మూఢవిశ్వాసాలు ఆ ప్రాంతప్రజల్లో తీవ్రంగాఉందని తెలుస్తుంది అత్యవసర పరిస్థితుల్లోనూ ఇలాంటిఆటంకాలువస్తే కచ్చితంగాస్నానంచేసి, బ్రాహ్మణులను, కపిలగోవులను దర్శించుకుని మళ్లీ బయటికివెళ్లే ఆచారం రానురాను విద్యాప్రవృత్తులు పెరిగేక్రమంలో ఈ విశ్వాసాలు తగ్గుముఖంపట్టాయి. ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో కొందరు విశ్వసిస్తూనే ఉన్నారు. ఈ విశ్వాసాలు పూర్తిగా అంతరించడానికి విద్య చాలాఅవసరం.

3.2 బ్రాహ్మణ హత్య

బ్రహ్మహత్య మహాపాతకమనేవిశ్వాసం ప్రజలలోబలంగా ఉండేది. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నతస్థానంలో ఉండేవారు. వీరికి ప్రత్యేకగుర్తింపు ఉండేది. వీరుతప్పు చేస్తే శిక్షించడానికికూడా భయపడేవారు. పవాడప్పనాయుడు అనంతపురంజిల్లా గుంతకల్లుగ్రామానికి గ్రామపెద్దలలో ఒకరు.

కుట్రచేసిన బ్రాహ్మణుడైన రామోజీప్రగడకి కారాగార శిక్షవిధించి, అతనికి సహకరించిన బ్రాహ్మణేతరులకుమాత్రం మరణశిక్షవిధిస్తాడు పవాడప్పనాయుడు.  కారాగారశిక్ష భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడు. దీనికి కారణం తానేనని బ్రహ్మహత్య చేసినపాపమై అతనిని బ్రహ్మరాక్షసుడుగా వెంటాడుతున్నాడని భయపడతాడు పవాడప్పనాయుడు. పాపపరిహారంకోసం గోదానం, భూదానం, సువర్ణదానం చేయమని బ్రాహ్మణులుసూచిస్తారు. ఇవేకాకుండా అగ్రహారదానంకూడా చేస్తాడు పవాడప్పనాయుడు. ఈ పాపం పీడలాగచుట్టుకొని తననివెంటాడుతుందని  భ్రమపడి, భయపడి తనగొంతునుతానే నులుముకుని చనిపోతాడు.

"అయ్యో  పరమేశ్వరా! అట్ల ఎందుకు చేస్తున్నావు నన్ను. అనంతపురం బ్రాహ్మణులందరి ఇంటి గడపలకు పసుపురాసి, మొక్కుతాను నన్ను కాపాడు ఈశ్వరా!" (శప్తభూమి, పుట.116) 

అని పవడప్పనాయుడు చెప్పేమాటల్లో దళితవర్గంవారికి మరణశిక్ష విధించినప్పటికీ పవాడప్పనాయుడుకి భయంకానీ, జాలికానీ అనిపించలేదని అర్థమవుతుంది.  కనీసం ఆ వర్గంవారు తిరిగి రాక్షసులుగామారి హింసిస్తారన్న ఆలోచన అసలేలేదు. కానీ ఒకబ్రాహ్మణుడు ఆత్మహత్యచేసుకోగా దానికికారణమైన ఇతనిని చంపుతాడన్న భయము ఇతనిలో స్థిరపడింది. ఈ బ్రాహ్మణులకు ఇంతటి శక్తి, ధైర్యం ఉందని ఇతని ఆలోచన. దీనిని గ్రామస్తులుకూడా విశ్వశించారు. దిగువర్గంవారికి అంతటిశక్తి, భయము వారుమరణించినప్పటికీ రాదని పవాడప్పనాయుడుతోపాటుగా ఆ ప్రాంతప్రజల మనస్తత్వం. మరణం తర్వాతకూడా వర్గాల ప్రాధాన్యత ఇక్కడ  కనిపిస్తూనే ఉంది.  అప్పటి అనంతపురం సమాజంలో ఎంతటి దగా చేసినా బ్రాహ్మణులకు ఉన్నత గౌరవం ఉండనే ఉంది. శిక్షద్వారా మరణించిన దళితుల ఉటుంబాలకు సానుభూతి తెలిపే మరో వర్గం మనిషి ఉండనే ఉండవచ్చు ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే అధికవర్గం మరియు బ్రాహ్మణవర్గంవారి దృష్టిలో దళితులు ఆట వస్తువులే అని అర్థమవుతుంది. బ్రాహ్మణులు ఉన్నత వర్గంవారు. మనకు ఉపయోగపడతారు అన్న ఆలోచనకంటే మన ద్వారా వాళ్లకు హాని కలిగితే  మనకు నష్టము, కీడు కలుగుతుందన్న ఆలోచన, భయం అక్కడి ప్రజల్లో పటిష్టంగా కనిపిస్తుంది.

3.3 ఆకుపూజ:

ఐదురోజులపాటు భోగేశ్వరిమాతకు ఆకుపూజచేస్తే సంతానంలేనిస్త్రీలకు సంతానం కలుగుతుందనే భావన ఎక్కువగా ఉండేది. ఐదురోజులుపాటు గుడిలోనేనిద్రించాలి. ఈ స్త్రీలకు తోడుగా వెళ్లినవారు గుడిబైటే పడుకోవాలి. సంతానంలేనిస్త్రీలు గంధర్వులే వారికడుపున పుడతారనే భక్తిభావంతో గుడిలో ఒంటరిగా పడుకోవాలి. దీనిని ఆసరాగాతీసుకొని గుడిపూజారులు ఒంటరిగా ఉన్నస్త్రీలకు మూలికలిచ్చి లైంగికంగా అనుభవించేవారు. సంతానం అనేది స్త్రీపురుషులు సంఘం వలన మాత్రమే ఏర్పడుతుంది. దీనికి మూలం పెళ్లి. భార్యాభర్తలు శారీరకంగా కలవడంద్వారా పిల్లలుపుడతారన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందే. కానీ ఈ నవలాకాలంనాటి 18వ శతాబ్దంలో విద్యా, లోకజ్ఞానంలేని తత్వంద్వారా దేవుళ్లకు నోములు, పూజలు, పునస్కారాలు చేయడంద్వారా పుడతారన్న మూఢవిశ్వాసం తారాస్థాయిలో ఉంది. 

గౌరమ్మ అనే స్త్రీ సంతానలేమితో బాధపడుతుంది. అందరూ విశ్వసించినట్లే భోగేశ్వరిమాతకు ఆకుపూజకోసం గుడికివెళ్లి ఒంటరిగా గుడిలోనిద్రించింది. రాత్రిపూటపూజారి గుడిలోప్రవేశించి

“గౌరీ మనసులో ఆ భోగేశ్వరీమాతను తలుచుకునిప్రేమగా ఆరాధించి ఈ మూలికనుతీసుకొని గంధర్వులనువిశ్వసించి మనసారానిద్రించు, తప్పక నీకు పిల్లలు పుడతారు” (సారాడ వెంకయ్య, రాయలసీమ దళితవర్గం, గౌతమీమాసపత్రిక 2022 జూన్, పుట 33) అని మూలికనిచ్చాడు.

మరుసటిరోజు ఉదయం గౌరమ్మ తన కుంకుమబొట్టు చెరిగిపోవడం, బట్టలునలిగిపోవడం గమనించింది. అయినప్పటికీ పూజారిపై ఆమెకి ఎలాంటి అనుమానం రాలేదు. కారణం అగ్రకులాల వారిపైన భక్తి, విశ్వాసం, నమ్మకం. ఇలా విశ్వసించడం ఈ దళితవర్గంవారి మూఢవిశ్వాసం. అమాయకత్వం. ఇలాంటి సందర్భాలన్నింటినో ఎంతోమంది పిల్లలలేక బాధపడుతూ, గుడిలోని నిద్రిస్తున్నస్త్రీలను లైంగికంగా వేధించిన పూజారులు ఎందరోమరెందరో శప్తభూమి నవలాకాలంనాటి సమాజంలో  ఉన్నారు.

3.4 గులిగానప్ప పరస:

గులిగానప్ప పరస అంటే అనంతపురంలో జరుపుకునే ఒకజాతర లేదా పండుగ. ఈ పరసలో కొత్తగాపెళ్లిచేసుకున్న పెళ్లిజంట గుండ్లుకొట్టించుకొని గుండుచుట్టూ సున్నపు బొట్లుపెట్టుకొని అగ్రహారస్వామికి నేరసుంకంచెల్లించాలి. ఒక మాదిగయువకుడు ఆంగ్ల అధికారినిచూసి అతనుకూడా క్రాఫ్ / కటింగ్ చేయించుకొని ఊరిలోతిరుగుతూ ఉంటాడు. ఆ క్రాఫ్ లో అతను మరింతఅందంగా కనిపించడంవల్ల ఊరిలోని కన్యలందరూకులాలతో సంబంధంలేకుండా అతనిపై మనసుపడతారు. అదిగ్రహించిన గ్రామపెద్దలు యువకుడు తమఅధికారానికి అడ్డంకిగామారుతాడని భావించిఅతడికి గుండుకొట్టించి గుండుచుట్టూ సున్నపుబొట్లు పెట్టించి గ్రామబహిష్కరణచేస్తారు. ఆతరువాత మరెవ్వరూక్రాఫు చేయించుకోకూడదని తీర్మానంచేస్తారు. పెళ్ళైన కొత్తజంట గుండ్లుకొట్టించుకొని గుండుచుట్టూ సున్నపుబొట్లుపెట్టుకొని నేరసుంకం రెండుకాసులుబంగారం అగ్రహారంస్వామికి చెల్లించాలి. లేకపోతేవారికి మరోతరంఉండదని శాసనంచేశారు. దీనినివ్యతిరేకిస్తే వారికికీడు కలుగుతుందనే నమ్మకంబలపడింది. రానురాను అదేవిశ్వాసంగా మారిపోయింది.  ఇక్కడ యువకుడిద్వారా గ్రామపెద్దల అధికారానికి అడ్డంకివస్తుందని భావిస్తే అదిపొరపాటు అవుతుంది.

క్రాఫు చేయించుకున్న యువకుడు మాదిగకులంలో పుట్టిన దళితుడు కావడమే ఇక్కడ ప్రధానసమస్య. అదే యువకుడు అగ్రకులస్తుడైవుంటే అతడి క్రాప్ అంగీకరించేవారు. అందరూక్రాప్ చెయ్యిచుకోవడం ఆనవాయితీగా ఉండాలని శాసనంచేసి ఉండేవారు” (రాయలసీమ రచనల్లో దళితనవలలు, పరిశోధన గ్రంథం, పుట.206)

ఈ వాక్యంద్వారా  అధికారుల పిల్లలు లేదా ఉన్నతవర్గంవారు తప్పుచేసినప్పటికి గ్రామపెద్దలు అంగీకారమేనని అర్థమవుతుంది.  ధర్మాధర్మాలు పాటించని అధికారం దళితులను కనీసం సాటిమానిసిగా కూడా చూడలేదని తెలుస్తుంది.

3.5 గాలిదేవర జాతర:

గాలిదేవరజాతరజరిపితే వర్షాలుపడతాయని ప్రజలునమ్మేవారు. జాతరజరపడం వారిస్తోమతకు మించినఖర్చు. అయినప్పటికీ అప్పులు చేసిమరీ గాలిదేవరజాతర జరిపేవారు. గ్రామదేవతల నైవేద్యంగా దేవరపోతుని బలిచ్చి పొలిమేరలో పొలి అన్నం చల్లి

“వానరాని గాలి దేవుడా
చెరువు నిండనీ గాలి దేవుడా
మమ్మల్ని సల్లంగా చూడు గాలి దేవర” (శప్తభూమి, పుట. 73)

అంటూ పూజించి తమఇళ్ళల్లో ఏటలుకోసేవారు. ఈ నవలలో చెరువులోపల్లి ప్రజలుకూడా గాలిదేవర జాతరచేసి పూజించారు. కానీ ఆ ప్రాంతంలో వర్షంపడలేదు. ఇప్పటికీ జంతుబలులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిద్వారా వర్షం ఎలాపడగలదు. ఈ మూఢవిశ్వాసాన్ని ఇప్పటికీ ఆచారంగా భావించి, కప్పలపెళ్లిళ్లు, జంతుబలులు, కొన్ని అనాగరికప్రాంతాల్లో ఉండనే ఉన్నాయి. నాగరిక ప్రాంతంలోకూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. దైవం అనేది ఒకవిశ్వాసమే. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి దేవుడు ఉన్నాడు. లేడు అనుకున్న వాళ్ళకి దేవుడు లేడు. కానీ మంచి అనేది ఎప్పటికైనా వ్యక్తిత్వాలకి ప్రాంతాలకి అన్నిరంగాలకి మంచిదే. మూర్ఖత్వం, మోసం, అన్యాయం ఎప్పటికీ చెడ్డవే. చెరువులోపల్లి ప్రజలు గాలిదేవరజాతర చేసినప్పటికీ వర్షంపడకపోవడంవల్ల వారుమరింత కరువుకు,పేదరికానికి బానిసయ్యారు. కారణం వారుచేసుకున్న అప్పులు తీర్చలేని వడ్డీలు.

3.6 అగ్నిదివ్వె పరీక్ష:

పాపపుణ్యాలకుసాక్షిగా అగ్నిదేవుడిని నమ్మేవారుప్రజలు. ఎర్రగాకాల్చిన ఇనుపగుండును నేరమారోపించిన వ్యక్తిచేతుల్లోఉంచి చేతులుకాలితే ఆ వ్యక్తి నేరస్తుడిగా, చేతులుకాలకపోతే నిర్దోషిగాప్రకటించేవారు. కంబళిశరబడు ఎర్రకొండాపురంలో నల్లనాగిరెడ్డిదగ్గర పనిచేస్తున్న ఒక దళితుడు. అతడిని అందరూ బాలభీముడనిపిలిచేవారు. ఆ ఊరిలో చిన్నగుండు, నల్లగుండు, గండశిల అనే మూడు ఎత్తుగుండ్లు ఉన్నాయి. ఎవరికితెలియని కాలంలో నల్లగుండును ఎత్తినమొనగాడేలేరని చెప్పుకునేవారు. దసరాపండుగ సందర్భంగా నల్లనాగిరెడ్డి నల్లగుండునెత్తి ఊరిప్రశంసలు పొందుతాడు. అదిచూసి కంబళిశరబడుకి నల్లగుండును ఎత్తాలన్న కోరికపుడుతుంది. ఆ ఊరిలో ఒక నియమముంది. సాయంత్రం 6 గంటలనుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు దళితులకు ఊరిలో ప్రవేశంలేదు. అర్ధరాత్రి ఎవరూచూడకుండా నల్లగుండును ఎత్తడానికివెళ్లి దానిపక్కనేఉన్న గండశిలపైదృష్టిపడి దానినే ఎత్తుతాడు. ఇంతవరకుగండశిలను ఎత్తినమొనగాడేలేడు. దానిని చూసినతలారి ఊరిపెద్దలతోచెప్పి పంచాయతీపెట్టిస్తాడు. ఆ పంచాయతీలో తనుగండశిలనుఎత్తానని, కావాలంటే మళ్లీ అందరి ముందు ఎత్తుతానని అంటాడు శరభడు. గండశిలను అందరిముందు ఎత్తితే నల్లనాగిరెడ్డికంటే బలవంతుడిగా దళితుడైనశరభడు గుర్తించబడతాడని అధికవర్గీయులభయం. ఒక్కసారి ముట్టుకుంటేనేమైలపడినశిల మరోసారి ముట్టుకుంటే మరెంత మైలపడుతుందోఅంటూ దానిని నిరూపించుకునేందుకు అగ్నిదివ్వె పరీక్షపెడతాడు నల్లనాగిరెడ్డి. ఎర్రగాకాల్చిన ఇనుపగుండును శరబడిచేతుల్లో ఉంచగా అతనిచేతులుకాలి బొబ్బలువస్తాయి. దానితో శరభడినేరంరుజువైందని శిక్షిస్తారు. అక్కడ గ్రామస్తుల ఉద్దేశం గండశిలను ఎత్తినందుకు కాదు. మాలమాదిగలు ఊరిలో ప్రవేశించారని మాత్రమే. కానీ గ్రామపెద్దల భయంవేరుకదా! దేవర నేనునిజంగా గండశిలను ఎత్తినాను. కావాలంటే అందరిముందల మరోసారి గండశిలను ఎత్తుతాను. ఏమిరా ఒళ్ళు బలిసిందా నువ్వు ఒక్కసారి పట్టంగానే అది మైలపడినది. మరోసారి నీ మాదిగ చేతులతో శిలనుఎత్తుతావా. మళ్లీ ఇంకోసారి పట్టుకుంటాను, ఎత్తుకుంటానని వాగుతుండావు. శిలమరెంత మైలపడుతుందో దూరంగాజరుగు. (శప్తభూమి, పుట 112) అంటూ శరబడినోరుమూయించారు గ్రామపెద్దలు. గ్రామపెద్ద ఎర్రనాగిరెడ్డిచెప్పే ఈ మాటను గమనిస్తే ఎగువవర్గం వారిదృష్టిలో దళితులస్థానం స్పష్టమౌవుతుంది.

తలారి “కంబళిశరభడు నల్లగుండును ఎత్తినాడు కానీ గండశిలను ఎత్తినానని అబద్ధం చెబుతున్నాడు” (శప్తభూమి, పుట 112)  ని తానే అబద్ధమాడతాడు. ఈవిషయాన్నిపరిశీలిస్తే గ్రామపెద్దలు తలారిని బెదిరించి అయిన ఉండాలి.

మరో ఎత్తుగడవల్ల ఉద్యోగం పోతుందని హెచ్చరించి ఉండాలి. కారణం వర్గాధిక్యం. నల్లగుండుఎత్తాడని తలారి, గండశిలనే యత్తినానని శరభడు వాదనలు చేసుకున్నారు. దీనికి “నువ్వునిజంగా గండశిలనే ఎత్తినట్లయితే అగ్నిదివ్య పరీక్షలో నెగ్గు, ఇందులో విఫలమైతే నువ్వు నల్లగుండుని ఎత్తినట్లు” (గద్దలాడతండై నవలలో శప్తభూమి ఆనవాళ్ళు, మొదటి భాగం, పుట.7) అని గ్రామపెద్దవీరనాగిరెడ్డి శరబడికి పరీక్షపెడతాడు.

“సత్యానికి నిలువెత్తు రూపి నువ్వే అగ్నిదేవా! నా సత్యాన్ని నువ్వే నిరూపించాలా” (రాయలసీమ రచనల్లో దళితనవలలు, పరిశోధన గ్రంథం, పుట.232) అంటూ అగ్నిగుండును చేతిలోపెట్టుకొని విఫలమవుతాడు శరభడు.

అగ్నిగుండునుచేతిలో ఉంచుకుంటే ఎవరికైనా తప్పక కాలుతుంది కదా! మరి ఎందుకు ఈ దళిత వర్గానికి ఆ నిజం తెలియదు. లేదు వారికికూడా తెలుసు. కాదుకూడదని చెప్పేధైర్యమే లేదు. బాలభీముడుగా పేరుమోసిన శరభడు గండశిలను ఎత్తినట్లువారికికూడా తెలిసిఉండవచ్చు. కానీ నిరూపించుకునే మార్గము, సాహసము వీరికిలేదని అర్థమవుతుంది. బలమున్న మనిషికి ధైర్యం ఉంటుంది. ధైర్యమున్న మనిషి దౌర్జన్యం చేయగలడు. ఈ విధముగా మనిషిలో బలానికి, ధైర్యానికి, దౌర్జన్యానికి లంకపడి ఉంటుంది. కానీ కంబళి శరబడిబలం, ధైర్యంనుంచి, దౌర్జన్యంనుంచి మినహాయింపబడిఉంది. దెబ్బకాచుకోవడంతప్ప దెబ్బతీయడం అతని మాలపుట్టుకలోలేదు . దళిత మనిషి ఒక వ్యక్తికిమాత్రమే బానిస కాడు. మొత్తం వ్యవస్థకే బానిస. బానిసత్వం వలనే పెద్దకులాల వ్యక్తులుపట్ల వీరికి భక్తి ఏర్పడింది.

3.7 మరుల మందు:

ఎవరికైనా మరులమందుపెడితే తమనివిడిచిపోరని నమ్ముతారు. ఈ నవలలో హరియక్క కోడనీలడిని వివాహం చేసుకొని తననువిడిచిపెట్టి వెళ్లకుండా ఉండడానికి తాంత్రికక్రతువు నిర్వహించిన మరులమందును పెడుతుంది. అయినప్పటికీ కోడేనీలడు హరియక్కను విడిచివెళ్ళిపోతాడు. భార్య, భర్తను ఆకట్టుకోవడానికి భర్తపై అమితమైన ప్రేముంటే సరిపోతుంది. ఆమె ఒక క్షత్రియ స్త్రీ. ఆమె ద్వందయుద్ధంలో పరపురుషులతో యుద్ధంచేసి తనశరీరమంతా గట్టిగాదృఢంగా మార్చుకుంది. భర్తకు సంపూర్ణంగా ప్రేమని, శారీరక సుఖాన్ని ఇవ్వలేకపోవడంకూడా హరియక్క విఫలానికి ప్రధాన కారణం. అలాగని ఎదుటివారిని ఆకట్టుకోవాలంటే కేవలం శారీరకసుఖం ఇవ్వడమే ప్రధానంకాదు. నడవడిక, అలవాట్లు, ప్రేమ, అనురాగం చాలా కీలకమైనవి. కోడెనీలడు హరియక్కతో మాట్లాడుతూ “ఏమోయీ నీళ్లు తీసుకురా. దాహంగా ఉంది” (రాయలసీమరచనల్లో దళితనవలలు, పుట.117) అంటూ గట్టిగా అరుస్తాడు. హరియక్క నేనొక క్షత్రియకన్యను సేవచేయ్యమని నన్నుఅడుగుతున్నాడేంటి అనుకున్నట్టుగా పనివారితో.  నీళ్లు ఇప్పిస్తుంది. ఇది సరైనదా అంటే కాదు. ఇలా ప్రేమలేనిచోట మరలమందు ఎలా ఉపయోగపడుతుంది. తనభర్తని ఈ మందుద్వారా వసపరుచుకోవచ్చు అనేఅంశమునకు కారణం అజ్ఞానం మాత్రమే.

3.8 వీరశిరో మంటపం:

వీరశిరోమంటపం ప్రస్తావన సురవరంప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘికచరిత్రలోనూ ఉంది. వీరశిరోమంటపమెక్కి మల్లికార్జున స్వామిని మెప్పిస్తే కోరినకోరికలు తీరతాయని ప్రజలునమ్మేవారు. ఈ నవలలో వర్షాలుపడక బుక్కరాయసముద్రంపూర్తిగా ఎండిపోయింది. కరువుతో ప్రజలు అల్లాడుతుంటారు. దానితోటిప్పుసుల్తానికి చెల్లించాల్సినరూకలు చెల్లించలేకపోతాడు హాండే సంస్థానాధీశుడు సిద్ధరామప్పనాయకుడు. సిద్ధప్ప నాయకుడువద్ద అమరనాయకుడిగా ఉన్న ఎల్లపజెట్టి ప్రభుపై ఉన్నభక్తితో అనంతపురంలో వర్షాలుకురిసి బుక్కరాయసముద్రం నిండాలని, హండేసంస్థానం బాగుపడాలని, దీనికోసం ఆత్మబలిదానానికి సిద్ధమై శ్రీశైలంవెళ్లి వీరశిరో మండపమెక్కి శైవాగమ మంత్రదీక్ష నిర్వాహకుడు అందించిన గండకత్తెరతో-

అష్టదిశలలోని అష్టభైరవుల్లారా! నా అష్టంగాల రుధిరంతోమిమ్మల్ని అభిషేకిస్తాను. ఆరాధిస్తాను. నా దేవుని కోసం నేను ఇట్లా నా మాంసాన్ని ఖండిస్తున్నాను” (బండి నారాయణస్వామి, శప్తభూమి, ద్వితీయయార్థం, పుట.207)

అంటూ తనకుడి కాలిని ఉత్తరించి తూర్పుదిశకు, ఎడమకాలిని ఉత్తరించి పశ్చిమదిశకు సమర్పణ చేసుకుంటాడు.చివరగా తలనుఖండించుకొని తనకుతాను ఆత్మార్పణచేసుకుంటాడు. అయినప్పటికీ అనంతపురంపై వర్షాలుకురవలేదు. హండే రామప్పనాయకుడిని సుల్తానుబందీగాచేసి తీసుకువెళతాడు. దీనితో హండే సంస్థానంక్షీణించింది. కరువు ప్రాంతంలో నీటిసరఫరాకోసం కొన్నిప్రాజెక్టులను తీసుకురావాలి. లేదా నీటిసరఫరా సరిగ్గావున్న ప్రదేశానికి పెళ్లి అక్కడి రాజులతో ఒప్పందాలు మాట్లాడి, వ్యవసాయాన్ని అభివృద్ధిచేయాలి. వర్షంకోసం హరితాన్ని అభివృద్ధిచేయాలి. ఇవేవీ బిల్లెయల్లప్పజట్టిలో కనిపించలేదు. మూఢనమ్మకాన్ని నిజమేననిభావించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. విద్య లేమి వల్లే ఇంతటి అఘాతం ఏర్పడిందని కళ్ళకు స్పష్టమవుతుంది.

4. ముగింపు:

  • శప్తభూమి నవలాకాలంనాటి అనంతపురంజిల్లా సమాజాన్ని ప్రస్తుతసమాజానికి పరిచయం చేసి,  విద్యయొక్క ఆవశ్యకతను తెలిపే ప్రయత్నంలో ఇప్పుడు ఈ వ్యాసం రాయడం విద్యద్వారానే సాధ్యమైనది. 
  • సారాడ వెంకయ్య రాసిన రాయలసీమ దళితవర్గమనే వ్యాసములో రాయలసీమ ప్రాంతంలో ఉన్నతవర్గంవారితో పోలిస్తే దళితవర్గంవారు,  ఆర్థికంగా 100కి 87%  వెనుకబడివున్నారు అనే అంశానికి ఏకీభవించవలసి వచ్చింది.
  • రాయలసీమ దళితవర్గమనే వ్యాసములో విడిచిపెట్టిన సాంఘికాంశాలను  కూలంకషంగాచర్చించి, అనంతపురం ప్రజల్లో అక్షరాస్యతశాతం కూడా ఉన్నతవర్గంవారితో పోలిస్తే   100శాతంలో  కనీసం 10వ వంతైనా లేదు.
  • వాస్తవానికి సాంఘికపరిస్థితులమీదే ఆర్థికపరిస్థితులు ఆధారపడి ఉంటుంది. ఉన్నతవర్గంవారు లేదా అధికారులు  దిగువర్గంవారికి ఎలాంటి పన్నులు విధించారు. వారినుంచి ఎలాంటి సేవలనుచేయించుకున్నారు. ఎంతవేతనమిచ్చారన్న అంశం చాలా ముఖ్యమైంది.
  • అప్పుడే ఆకాలంనాటి దిగువర్గంవారి ఆర్థికపరిస్థితులు సంపూర్ణంగా అర్థంమౌతుంది. ఆర్థికస్థితిగతులనుబట్టే దిగువర్గంలో ఎలాంటి నమ్మకాలు చొరబడ్డాయన్న విషయం తెలుస్తుంది. 
  • ఎటువంటి సమాజంలోనైనా పేదవారికి మాత్రమే ఇలాంటి మూఢవిశ్వాసాలపై బలమైన నమ్మకం ఉండడానికి కారణం అజ్ఞానమే. 
  • సమాజంలోని ప్రజలని  అక్షరాస్యులుగా మార్చడంద్వారా ఆర్థికంగ, సామాజికంగా అభివృద్ధి చేయగలం. 
  • ఆకుపూజదోపిడీలో స్త్రీలపైజరిగిన లైంగికదాడులువారికి తెలిసేవికావు. కారణం ఆ స్త్రీలకు లోకజ్ఞానం లేకపోవడం. ఆలోచన పరిజ్ఞానం లేకపోవడమే.
  • అలాగే కంబళిశరభడు శారీరకంగా బలవంతుడైనా మానసికంగా ఉన్నతవర్గంవారికి సేవకుడిగానే మిగిలిపోవడానికికారణం కూడా పైన వివరించిన అంశాలే.
  • అమరనాయకుడైన బిల్లేఎల్లప్పజట్టికి ప్రభువుపై భక్తిభావంతో, మూఢనమ్మకంతో, ప్రాణత్యాగానికి సైతంసిద్ధంమవ్వడానికి  కారణం సత్యాసత్యాలు తెలియకపోవడమే. మూఢనమ్మకాలతో ప్రకృతినిసాధించలేము. ప్రకృతిని మెప్పించలేమన్న నిజాన్ని గ్రహించకపోవడం ప్రధానమైనది.
  • జ్ఞానం కేవలంవిద్యతోనే సాధ్యమవుతుంది. 1775 సంవత్సరంలో ఇప్పటి అనంతపురంలో అలాంటి మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు ఎలా ఉండగలిగాయి?. అనేవిషయాన్ని శప్తభూమినవల చదవడం ద్వారా ఇప్పటి సమాజం ఖంగు తింటుంది. 
  • అప్పటి చరిత్రను తెలుసుకోగలడం కేవలంవిద్య ద్వారానే సాధ్యమైంది. ఒకవ్యక్తి, ఒకవర్గం వద్ద నలిగిపోకుండా తనంతటతాను మానసికంగానిలబడడానికి విద్యఎంతగానో అవసరమని చెప్పడంలో ఎలాంటిసందేహంలేదు. 
  • అనంతపురం జిల్లాప్రజల్లో మూఢవిశ్వాసాలు ప్రస్తుతసమాజంలో చాలా తగ్గుముఖంపట్టాయి. మరికొన్నిమిగిలే ఉన్నాయి. వాటినికూడా సంపూర్ణంగా వదిలిపెట్టడానికి విద్యచాలా అవసరం. లోకజ్ఞానం తప్పక కావాల్సిందే.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కాంచన, భూమాటి (2019-ఆగస్టు) గద్దలాడుతుండై నవలలో శప్తభూమి ఆనవాళ్లు, భూమిక మాసపత్రిక, హైదరాబాద్.
  2. గురువయ్య, వేదం (2020)జ్ఞానభూమి, కథాసంపుటి, విశాలాంధ్ర పబ్లికేషన్స్ , విజయవాడ.
  3. నరసింహరావు,పారా(2022)రాయలసీమ రచనల్లో దళిత నవలలు, పరిశోధనగ్రంథం, యోగివేమన విద్యాలయం, కడప.
  4. నారాయణస్వామి,బండి,(2021)గద్దలాడతండాయి,అన్వేక్షికి,పబ్లికేషన్స్,ప్రైవేట్లిమిటేడ్, హైదరాబాద్.
  5. నారాయణస్వామి, బండి, మీరాజ్యం మీరేలండి (2021) అన్వేక్షికి పబ్లికేషన్స్, ప్రైవేట్ లిమిటేడ్, హైదరాబాద్.
  6. నారాయణస్వామి, బండి (2022)శప్తభూమి.అన్వేక్షికిపబ్లికేషన్స్,ప్రైవేట్లిమిటేడ్, హైదరాబాద్
  7. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి(2011)నవలాశిల్పం,గౌరీపబ్లికేషన్స్,ఎడిషన్12, కర్నూలు.
  8. వీరరాఘవయ్య, సాహూ(2022సెప్టెంబర్,4)రాయలమ మట్టి,కథ,ఈనాడు,దినపత్రిక.AP 
  9. వెంకయ్య, సారాడ (2023-జనవరి) రాయలసీమ దళితవర్గం,గౌతమిమాసపత్రిక, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]