AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. ‘సురవరం’ పండుగల విశ్లేషణలు: ఆధునికదృక్పథాలు
గూడూరి శైలజ
తెలుగు ఉపన్యాసకురాలు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి),
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9703817390, Email: shailajagudurinavya@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలంగాణలోని తొలితరం పరిశోధకుల్లో పేరెన్నదగినవారు సురవరం ప్రతాపరెడ్డి. వీరి సాహిత్యసేవ ఎంత ఘనమైనదో, వీరి పరిశోధనా దృక్పథము అంతకుమించి పదునైనది. చిన్నతనం నుండి ముక్కుసూటిగా వ్యవహరించే సురవరం పరిశోధనలో కూడా అలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, తనకు వాస్తవమని తోచిన అంశాలను తగిన ప్రమాణాలతో ఋజువు చేస్తూ పరిశోధనా వ్యాసంగాన్ని వాస్తవికతకు దగ్గరగా, హేతుబద్ధంగా మలిచాడు. అట్టి సురవరం ప్రతాపరెడ్డి, హిందువుల పండుగలు అనే పరిశోధన గ్రంథములో వారు ప్రతిపాదించిన అంశాలలోని ఆధునిక దృక్పథాలను గూర్చి తెలియజేయడం నా వ్యాసం యొక్క ఉద్దేశ్యం. హిందువుల పండుగలు అనే గ్రంథములో సురవరం ప్రతాపరెడ్డి పండగల విషయమై ప్రతిపాదించిన అంశాలలో సంప్రదాయ బద్ధమైన వాదాలను, ఐతిహ్యాలను, జానపద గాథలను, చారిత్రక దృక్పథాన్ని, వాస్తవికవాదము, హేతువాదము వంటి ఆధునిక వాదాలను గుర్తించి వాటి నుండి చారిత్రక దృక్పథాన్ని, వాస్తవికవాదము, హేతువాదము వంటి ఆధునిక వాదాలను వేరుపరచి ఆధునిక దృక్పథాలను గుర్తించి ఆవిష్కరించి, సురవరం ప్రతాపరెడ్డి పరిశోధనలో ఆధునికవాదాలు కూడా ఉన్నవని తెలియజేయడం. సురవరం ప్రతాపరెడ్డి, హిందువుల పండుగలు మరియు కె.కె. రంగనాథాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు అనే గ్రంథాలను ప్రాథమిక వనరులుగా స్వీకరించి ఆధునిక దృక్పథాలలో వెలువడిన ఇతర గ్రంథాలను, సురవరం ప్రతాపరెడ్డి రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గ్రంథాలను ద్వితీయ వనరులుగా ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: సురవరం ప్రతాపరెడ్డి, హిందువుల పండుగలు, ఆధునిక దృక్పథాలు, పండుగలు, పర్వదినాలు.
1. ఉపోద్ఘాతం:
తెలంగాణా వైతాళికత్రయములో (మాడపాటి హనుమంతరావు, రాజా బహద్దూర్ వెంకటిరామిరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి) సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. సంఘసంస్కర్తగా, రాజకీయనాయకునిగా, పత్రికాసంపాదకుడిగా ప్రజలలో వీరు కలిగించిన జాగృతి, చేసిన కృషి చారిత్రాత్మకమైనవి. అట్లే కవిగా, కథకునిగా, నాటకకర్తగా, పండితునిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, బహుభాషావేత్తగా, బహుగ్రంథకర్తగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇటువంటి అసమాన ప్రతిభాపాటవాలు కలిగిన సురవరం ప్రతాపరెడ్డి రామాయణ విశేషములు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు అనే పరిశోధనాత్మక గ్రంథాలను రచించారు. వీటిలో సూరవరం ప్రతాపరెడ్డి పరిశోధనాతృష్ణకు ప్రథమ సోపానమైన హిందువుల పండుగలు అనే గ్రంథము ఆధారంగా సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక దృక్పథాలను తెలియజేయదలచాను.
కె.కె. రంగనాథాచార్యుల తన ఆధునిక తెలుగుసాహిత్యంలో విభిన్నధోరణులు అనే సంపాదకీయ- వ్యాసంలో ఆధునికతను రెండు రకాలుగా నిర్వచించవచ్చు. మొదటిది సమకాలీనతనే ఆధునికతగా నిర్వచించడం. ఈ దృష్టిలో సమకాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సాంప్రదాయకంగాని, నవీనం గాని ఆధునికం అవుతుంది. రెండవది మారిన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు పునాదిగా ఏర్పడిన కొత్త దృక్పథాలను, స్వరూపాన్ని సంతరించుకోవడమే ఆధునికత అని నిర్వచించడం. ఈ విధమైన సాహిత్యానికి అంతకు ముందు లేని ప్రత్యేక లక్షణాలు, కొత్త విలువలు ఉంటాయి. ఇక్కడ ఆధునికత అనేది కాలాన్ని సూచించేది కాదు. అది ఒక తత్వం. ఒక తత్వంగా ఆధునికతలో రెండు భిన్న ధోరణులు కనిపిస్తాయి. సామాజిక ప్రయోజనం, హేతుబద్ధమైన శాస్త్రీయ దృష్టి, వాస్తవికతల పైన ఆధారపడిన సాహిత్య దృక్పథాలు తాత్విక భూమికగా కలిగిన ఆధునికత ఒకటి. అభ్యుదయ వాద, విప్లవవాద, వాస్తవికతావాదాలు, కొంత హేతువాదం ఈ కోవలోకి వస్తాయి. పైన చెప్పిన విలువలు లేకుండా వ్యక్తివాద, అరాచకవాదాలు, తాత్వికభూమికగా కనిపించే ఆధునికత రెండవది.1 అని పేర్కొన్నారు.
ఇక సురవరం ప్రతాపరెడ్డి, హైదరాబాదు కోత్వాల్ అయిన రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి కోరిక మేర హిందువుల పండుగలు అనే గ్రంథాన్ని 1930లో రచించడం జరిగింది. ఈ గ్రంథాన్ని రచించడానికి సురవరం శాస్త్రపురాణేతిహాసాల్ని, భారతీయ భాషల్లో ప్రచురింపబడ్డ మత సంబంధమైన గ్రంథాలని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 54 ముఖ్యమైన పండగలను గురించి సహేతుక వివరణతో వీరీ గ్రంథాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ పండగలను జరుపుకోవడానికి గల కారణాలను తెలియజెప్పే కథలను, విశ్వాసాలను వివరించి అందులో ఏ కారణం హేతుబద్ధంగా, సమంజసంగా ఉంటుందో దాన్ని సురవరం ఈ గ్రంథంలో విశదీకరించారు. ఈ విధంగా వీరి గ్రంథంలో వాస్తవికదృక్పథం, శాస్త్రీయ దృష్టి కనబడతాయి. ఇవి కె. కె. రంగనాథాచార్యులు చెప్పిన ఆధునిక దృక్పథాలే!
2. సురవరం దృష్టిలో హిందువుల పండుగలు - విభాగాలు:
సురవరం అభిప్రాయాన్ని అనుసరించి హిందువుల పండగలను నాలుగైదు భాగములుగా విభజించవచ్చు. అవి :
- పూర్వం లోకోత్తర పురుషులై, లోకహితము గురించి అవతరించిన మహానుభావుల జన్మదినోత్సవములు. ఉదాహరణకు శ్రీరామనవమి, శ్రీ కృష్ణాష్టమి.
- ఋతు సంబంధమైన ఉత్సవములు. ఉదాహరణకు ఉగాది, సంక్రాంతి, హోలీ మొదలైనవి. హిందువులు ప్రకృతి ఆరాధకులుగా ఒకానొక కాలమందు ఉండేవారు. వేద కాలంలో ఆర్యులు ప్రకృతిని, పంచభూతాలను పూజించిన విధానమే ఎందుకు సాక్ష్యం.
- శైవ వైష్ణవ సంబంధమైన వ్రతములు. వేద కాలంలో శైవ వైష్ణవ భేదములు ఉన్నట్లుగా కనబడదు. పురాణ కాలంలో ఇవి ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఈ వ్రతములలో భాగంగా వైష్ణవులు అనంత చతుర్దశి, ఏకాదశి మొదలైనవి జరుపుకోగా, శైవుల వినాయక చతుర్థి, మహాశివరాత్రి, నవరాత్రులు మొదలైనవి ముఖ్యంగా జరుపుకుంటారు.
- ఇక మిగిలినవి నాలుగవ వర్గంలో చేరుతాయి. విజయదశమి కేవలము రాజులకు సంబంధించినదిగా కనపడుతున్నా, జన సామాన్యము దీనిని భక్తితో ఆచరిస్తారు.
- మరికొన్ని పండుగలు సర్వజనులలో లేనప్పటికీ ద్విజులకు, స్త్రీలకు ముఖ్యమైనవి. ద్విజులకు రక్షికాపూర్ణిమ ముఖ్యమైనది. వార వ్రతములు, తులసి వ్రతములు, లక్ష్మీ వ్రతము మొదలైనవి స్త్రీలచే విశేషంగా ఆదరించబడుతున్నాయి.2
హిందువులు చేయు పండుగలన్నింటిలో శ్రీరామనవమి, శ్రీకృష్ణ జయంతి చాలా ముఖ్యమైనవి. కానీ ఏమి చిత్రమో! శూద్రులలో అనేకులనేక ప్రాంతములలో నాగపంచమి వంటి పండుగలకు ప్రాముఖ్యమిచ్చి ఈ పండగను స్మరించనైనా స్మరించరు. కొన్ని ప్రాంతములలో కృష్ణాష్టమి నాడు ఉట్ల పండుగ అని, ఉట్ల తిరునాళ్లు అని చేయుదురు. ఈ పద్ధతి ఆంధ్రదేశమంతటా విరివిగా కనిపిస్తుంది. ఇది కొందరు దక్షిణ భారతీయులు చేసే లొట్ల పండగ కన్నా మేలే!3 అట్లే నాగపంచమి గూర్చి విమర్శిస్తూ అనార్యులలో, ద్రావిడులలో ఈ పండగ విశేషమని అభివర్ణించారు. పాముల పట్ల ఉన్న భయము చేతనే వాటిని ఆరాధించే సంస్కృతి ప్రజలలో వ్యాపించినదని తెలియజేశారు. ఈ విశ్లేషణ సురవరం చారిత్రక దృక్పథాన్ని, యథార్థవాదాన్ని తెలియజేస్తుంది. పై అంశాలను పరిశీలిస్తే రాముడు, కృష్ణుడు అనేవారు ఆర్యులు అవడం చేత వారిని ఆర్యావర్తములో ఉన్న అనగా ఉత్తర భారత దేశంలో ఉన్నవారు విశేషంగా ఆరాధిస్తారని అర్థమవుతుంది.
ఇక దక్షిణభారతదేశంలో గల శూద్రులు, జానపదులలో తాము ద్రావిడులమనే వాదము బలంగా నాటుకుని పోయింది. బహుశా ఈ వాదము తెలియకుండానే పెక్కు దాక్షిణాత్యులలో వీరిని ఆరాధించే విధానము లేకుండా ఉండి ఉండవచ్చు. నేటికి కూడా శ్రీరామనవమి నాడు సీతారామకళ్యాణంలో భాగంగా ప్రజలందరూ ఆ ఉత్సవంలో పాల్గొంటారే కానీ ప్రత్యేకించి శ్రీరామనవమిని ఇండ్లలో జరుపుకోరు. ఇక పెక్కు వర్ణాలలో నేటికీ కృష్ణాష్టమి అనేది తెలియకపోవడాన్ని గమనించవచ్చు. ఇక చారిత్రక దృక్పథాన్ని అనుసరించి ద్రావిడులు ప్రకృతి ఆరాధకులు. అందులో భాగంగానే వారు నాగులను ఆరాధించినట్లుగా తెలుస్తుంది. అలాంటి ద్రావిడుల మూలాలు కలిగిన దక్షిణ భారతీయులు నాగుల పంచమికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము సామాన్యమనే అనిపిస్తుంది.
హనుమజ్జయంతి గురించి వ్యాఖ్యానిస్తూ రామాయణ వానరులు కోతులు కారు. వారా కాలమునందు బళ్లారి ప్రాంతంలో నివసించిన అనార్య జాతి వారిని సురవరం అభిప్రాయపడ్డారు.4 ఈ అంశాన్ని గురించి వారు రామాయణ విశేషాలు అనే గ్రంథంలో విపులంగా చర్చిస్తూ వనములలో చరించువారు కావున వారు వనేచరులని/ వనచరులని, కాలక్రమమున ఆ శబ్దము వానరముగా మారిందని తెలియజేశారు. తోక వంటి కౌపీనాన్ని ధరించే ఒక అనార్య తెగవారు వానరులని సురవరం సిద్ధాంతీకరించారు.5
దీనికి ప్రమాణాన్ని చూపుతూ వానర స్త్రీలకు తోక ఉన్నట్టుగా వర్ణనలేదని వారు తెలియజేశారు. దీనిని బట్టి వానరుల తోక, తోక కాదని అదొక తోకలాంటి వేషధారణ అని స్పష్టంగా తెలియజేశారు. దీనిని బట్టి వానరులు అంటే కోతులు కాదని, వారొక అనార్యతెగ వారని/ ఆటవికులని గ్రహించాల్సిఉంది. ఇది సురవరం ప్రతాపరెడ్డి శాస్త్రీయదృష్టికి, వాస్తవికదృక్పథానికి నిదర్శనం.
తులసీవ్రతమును గూర్చి తెలియజేస్తూ తులసి చాలా ఉత్తమమైన ఔషధము. ఇది ప్రతి ఇంట్లో ఉన్నట్లయితే ఇంటిల్లిపాది ఆరోగ్యకరముగా ఉంటుందని పౌరాణికులు భావించి తులసి ప్రాధాన్యతను చెప్పడానికి తులసి విష్ణుపత్నని కల్పించి ఈ వ్రతమును ప్రచారంలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.6
దీనిని విశదీకరిస్తూ అది అనేక రోగములను హరించును. దాని వలన మీకు మేలు జరుగుతుందని చెబితే ఎవరు పట్టించుకోరనే ఉద్దేశ్యముతో తులసిని విష్ణుపత్నిగా అభివర్ణించినట్లు సురవరం అభిప్రాయపడ్డారు. ఈ విశ్లేషణలో వీరి శాస్త్రీయ దృష్టి, వాస్తవికవాదం కనిపిస్తుంది. తులసి మొక్కలో ఔషధ గుణాలు ఉన్నాయని వీరు నిగ్గు తేల్చారు. అయితే సాధారణంగానే ప్రజలు ఈ విషయాన్ని చెబితే అంత త్వరగా నమ్మరు. అందువల్ల ప్రజలు ప్రశ్నించకుండా నమ్మేటువంటి భావమైన భక్తిని అడ్డుపెట్టుకుని పౌరాణికులు తులసి మొక్కను ప్రతి ఇంట్లో ఉండేలా ఈ కథను అల్లినట్లుగా గ్రహించాల్సి ఉంది.
రక్షికాపూర్ణిమను గురించి తెలియజేస్తూ, యథార్థమున ద్విజులు యజ్ఞోపవీతధారణ చేయు దివసము రక్షకాపూర్ణిమ అని నిర్ధారించారు.7
అయితే నేటి కాలంలో రక్షికాపూర్ణిమ రోజు రక్ష కట్టు ఆచారము కనబడుతున్నదని తెలియజేస్తూ, ఇందుకు గల కారణాలను విశ్లేషించి మహమ్మదీయులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకుంటున్న సందర్భంలో రాజపుత్రులు ఐక్యత కొరకు, ఆత్మగౌరవము కొరకు, తమ స్త్రీల మాన సంరక్షణ కొరకు ఈ ఆచారాన్ని ప్రచారంలోకి తెచ్చారనీ చారిత్రాక ఘటనల ద్వారా వివరించారు. ఇది వీరి చారిత్రక దృక్పథానికి అద్దం పట్టే విశ్లేషణ. వేదబద్ధమైన పర్వదినము కాలక్రమంలో రూపాంతరం చెందిన విధానాన్ని చక్కగా విశ్లేషించి తెలియచెప్పారు.
3. ముగింపు:
బహుముఖ కోణాలలో విశ్లేషిస్తూ సాగిన ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలోని సురవరం ఆధునికదృక్పథాలను ఈ వ్యాసంలో పరిచయం చేసే ప్రయత్నం చేశాను.
సురవరం ఆధునికదృక్పథాలను పరిశీలిస్తే వీరు “యదార్థవాది” అని అర్థమవుతుంది. ఒక పండగను ఏఏ ప్రాంతాలలో ఏ విధంగా జరుపుకుంటున్నారు, అందుకు గల కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తూ వాటిని ఆధునికదృక్పథంతో అనగా కె. కె. రంగనాథాచార్యులు చెప్పినట్లు హేతుబద్ధమైన శాస్త్రీయదృష్టి, వాస్తవికతల ఆధారంగా విశ్లేషించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. పరిశోధకులు సురవరం ఆధునిక దృక్పథాలను పరిశీలిస్తే శాస్త్రీయదృష్టి, వాస్తవికతలే ఆధునికతలో దాగున్న అంశాలని అర్థమవుతుంది.
ప్రతాపరెడ్డి ఒక్కొక్క పర్వదినాన్ని భిన్నమైన దృక్పథాలలో విశ్లేషిస్తూ ఈ గ్రంథాన్ని కూర్చినట్లుగా అర్థమవుతుంది. ఈ గ్రంథంలో వీరు ఎన్నో పుస్తకాలను ఉదాహరించారు. అలాగే మరెందరో పండితుల అభిప్రాయాలను స్వీకరించారు. వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి యథార్థము అనిపించిన వాదాన్ని వారు బలపరుస్తూ తగిన ప్రమాణాలతో చెప్పే ప్రయత్నం చేశారు.
ఇది సురవరం పరిశోధన జిజ్ఞాసకు, వాస్తవిక చింతనకు తార్కాణం. పండుగల గురించి వేదాలలో, పురాణేతిహాసాలలో ఉన్న పరస్పర విరుద్ధమైన ఐతిహ్యాలను వారు విశ్లేషించి వాటిలో సరైన దానిని ఎంపిక చేసిన విధానములో సురవరం విమర్శనాత్మక వైఖరి అర్థమవుతుంది.
ఈ గ్రంథములో సురవరంలో దాగున్న అనేకానేక దృక్పథాలు కనబడుతున్నా, వీరు అటు సాంప్రదాయదృక్పథాన్ని, ఇటు ఆధునిక దృక్పథాన్ని సమన్వయపరిచి వాస్తవికకారణాలను విశ్లేషించిన తీరులో వీరి నిష్పక్షపాత వైఖరి కనబడుతుంది.
4. పాదసూచికలు:
- ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు- కె. కె. రంగనాథాచార్యులు (సంపా) - పుట vii
- హిందువుల పండుగలు - సురవరం ప్రతాపరెడ్డి- పుట x
- హిందువుల పండుగలు - పుట 37
- హిందువుల పండుగలు - పుట 45
- రామాయణ విశేషము - పుట 296-307
- హిందువుల పండుగలు - పుట 64
- హిందువుల పండుగలు - పుట 76
5. ఉపయుక్తగ్రంథసూచి:
- ప్రతాపరెడ్డి, సురవరం. రామాయణవిశేషము. ఆంధ్రరచయితలసంఘం, హైదరాబాద్, 1957.
- ప్రతాపరెడ్డి, సురవరం. హిందువుల పండుగలు. తెలంగాణ సాహిత్యఅకాడమీ, హైదరాబాద్, 2019,
- రామిరెడ్డి, ముద్దసాని. సురవరం ప్రతాపరెడ్డి జీవితం, రచనలు - తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్, 2019.
- రంగనాథాచార్యులు, కె. కె. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు. ఆంధ్రసారస్వత పరిషత్తు, సికింద్రాబాద్, 2005.
- సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్, హైదరాబాద్. 03.2024 https://suravaramprathapreddy.com/https://suravaramprathapreddy.com/
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.