headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. ఆముక్తమాల్యదలోని జీవనశైలి: నిశిత పరిశీలనాదృష్టి

డా. బత్తల అశోక్‌ కుమార్‌

అతిథి సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం,
అనంతపురము, ఆంధ్రప్రదేశ్‌.
సెల్: +91 9490194780, Email: ashokbathala.cuap@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

శ్రీకృష్ణదేవరాయలు అటు ప్రజలతోనూ, ఇటు కళాకారులతోనూ మమేకమైన జీవితాన్ని ఆస్వాదించాడు. వాళ్ళల్లో ఒకడుగా జీవించాడు. నాటి సమాజంలో అన్ని శ్రేణులనుండి సమాన గౌరవాభిమానాల్ని, మన్ననల్ని పొందగలిగిన ఏకైక కవిరాజ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. చనిపోయిన రాజులు రాతి విగ్రహాల్లో మాత్రం జీవిస్తారని కవులు ప్రజల నాల్కల్లో జీవిస్తారని మహాకవి గుర్రం జాషువా అన్నారు. ఇది వాస్తవం. కానీ శ్రీకృష్ణదేవరాయల విషయంలో ఇది వర్తించదు. ఎందుకంటె అయన సాధారణ ప్రజా జీవితాన్ని గడిపిన గొప్ప చక్రవర్తి. శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగతంగా వైష్ణవమతాన్ని అవలంభించినా, ప్రజాపాలకుడుగా అంతే స్థాయిలో శైవాన్ని, జైన మతాన్ని ఆదరించిన దాఖలాలున్నాయి. పరమతసహనం ఈయనకు వెన్నతోపెట్టిన విద్య. కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు ప్రజాజీవనంలో మమేకమైన సాధారణ మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఆ విషయాల్ని చర్చించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. శ్రీకృష్ణ దేవరాయలని మనం కేవలం రాజుగా యుద్దాలను చేసాడు, కవులను పోషించాడు అన్న కోణంలోనే చూస్తున్నాము. కానీ అయన అసలు సిసలైన ప్రజా పాలకుడు అని చెప్పడం, రాజుగా ఉంటూ సాధారణ ప్రజల జీవితాలను చాల నిశితంగా పరిశీలించిన వారు అరుదు. ఆ కోణంలో శ్రీకృష్ణదేవరాయలను మనం చూడాల్సిన ఆవశ్యకతను గుర్తుచేయడం, ఆయన ప్రజా పాలకుడుగా ఎలాంటి సంస్కరణలను తీసుకువచ్చారో నేటి పాలకులు గ్రహించాల్సిన అవసరం ఉందన్న కోణంలో ఈ వ్యాసం వెలుగు చూసింది. ప్రధానంగా ఈ పరిశోధన వ్యాసం విషయ సామాగ్రికి ప్రధాన ఆకారం ఆముక్త మాల్యద గ్రంథం, ఆ గ్రంథంపై వచ్చిన వ్యాఖ్యనాలు. ఆయనపై ఏదో ఒక కోణంలో కొత్త అంశాలను తెలుగు పరిశోధకులు వెలుగులోకి తీసుకువస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి డి. చంద్రశేఖర్ రెడ్డి గారు సంపాదకత్వంలో వెలువడిన “శ్రీకృష్ణదేవరాయ వైభవం” అనేక కోణాల్లో శ్రీకృష్ణదేవరాయలని మనం అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. శ్రీ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద కావ్యం ఆధారంగా అయన పరిపాలనను, సాధారణ ప్రజల గురించి మహా చక్రవర్తి అభిప్రాయాలను నమోదు చేయడం, నేటి ఆధునిక ప్రజా పరిపాలనలో సాధారణ ప్రజల ఇబ్బందులను పాలకులు ఎలా చూస్తున్నారో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది.

Keywords: శ్రీకృష్ణదేవరాయలు, రాయల సునిశితమైన పరిశీలనా దృష్టి, తిరుపతి శాసనం, కవిపండిత రసజ్ఞత, వేటగాండ్ర కిటుకులు, సామాన్యుని జీవిత చిత్రణ, వృత్తి శ్రామికుల అగచాట్లు, విజయనగర సామ్రాజ్యం.

1. ఉపోద్ఘాతం:

భారతీయ రాచరిక వ్యవస్థలో ఎన్నో సామ్రాజ్యాలు వెలశాయి. కూలాయి.  ఎందరో రాజులు తమ వైభవప్రాభవాలతో వెలిగారు. కాలగర్భంలో కలిసిపోయారు. భారతీయరాచరికచిత్రపటంలో ఎన్నో రాజవంశాలు పాఠకులకు సాక్షాత్కరిస్తాయి. కానీ కొన్ని రాజవంశాలు మాత్రమే ప్రజలమనసుల్ని దోచుకున్నాయి. అలాంటి సామ్రాజ్యాల్లో విజయనగరసామ్రాజ్యం ఒకటి. ఈ సామ్రాజ్యంలో పండితులు ఎరిగిన రాజులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పండితుడు - పామరుడు సూర్య చంద్రులున్నంతకాలం గుర్తుపెట్టుకోగల రాజు ఒక్కడే. ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. చనిపోయిన రాజులు రాతి విగ్రహాల్లో మాత్రం జీవిస్తారని కవులు ప్రజల నాల్కల్లో జీవిస్తారని ఓ మహాకవి అన్నారు. ఇది వాస్తవం. కానీ శ్రీకృష్ణదేవరాయల విషయంలో ఇది వర్తించదు. ఎందుకంటే రాజుగా, కవిగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజల హృదయాలలో నేటికీ జీవిస్తున్నారనడానికి మనం నిర్వహిస్తున్న సభలే ఉదాహరణ. ప్రజలకు ` కళలలకు స్వర్ణయుగపు రుచిని చూపించిన ఇలాంటి దీరోధ్ధతుడు విజయనగర సామ్రాజ్యపు చిత్రపటంలో మరొకడు కనపడడు. కాబట్టి ఆ శ్రీకృష్ణదేవరాయల జీవనశైలి ` సునిశిత పరిశీలనా దృష్టిని గురించి చర్చించడమే ఈ వ్యాసముఖ్యోద్ధేశ్యం.

శ్రీకృష్ణదేవరాయలు అటు ప్రజలతోనూ, ఇటు కళాకారులతోనూ మమేకమైన జీవితాన్ని ఆస్వాదించాడు. వాళ్ళల్లో ఒకడుగా జీవించాడు. నాటి సమాజంలో అన్ని శ్రేణులనుండి సమాన గౌరవాభిమానాల్ని, మన్ననల్ని పొందగలిగిన ఏకైక కవిరాజ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే నందితిమ్మన తన పారాజాతాపహరణ కావ్యంలో (ఆ.4-1ప) రాయుడిని ‘‘కవితా ప్రావీణ్య ఫణీశుడు’’గా చెప్పాడు. అల్లసాని పెద్దన తన ‘‘మనుచరిత్ర’’ (ఆ. 1-45ప)లో  ‘‘కవితా స్త్రీలోలుడ’’ని అన్నారు. రాయలు తన కావ్యంలోనే (ఆ.1-44ప) సాహితీసమరాంగన సార్వభౌముడని పేర్కొన్నాడు. అంతేగాక అపరభోజుడని, కావ్యనాటకాలంకార మర్మజ్ఞుడని 13-07-1513వ తేదీన వెలసిన తిరుపతి శాసనం పేర్కోవడం విశేషం. ఏదిఏమైనా శ్రీకృష్ణదేవరాయలు మహాకవి పండిత పోషకుడు. కవి కూడా. ఈ రాయడిని గురించి అముద్రిత చాటుపద్యం ఏం చెబుతుందో చూడండి.

‘‘వీడు మనీషి వీడు రసజ్ఞుడు వీ డిటెన్న డున్‌

రా డని కృష్ణరాయలతో నవ్వుచు విన్నప మాచరించు తన్‌

వే డినచో నభీష్టములు వేమఱు నిచ్చుచు ముక్కు తిమ్మ డు

న్నా డి క ధాత్రిపై కవిజనంబులు బేదవడంగ నేటికిన్‌’’ (చాటుపద్యములు. తాళపత్ర గ్రంథము ఎం.ఎస్‌.టి. 181 సి 49-1 )

ఈ పద్యంలో ముక్కుతిమ్మన రాయలనుద్ధేశిస్తూ ` ఇతను పండితుడు, ఇతడు కవి. ఇతడు రసజ్ఞుడు అని నవ్వుచూ విన్నవించిన వాళ్ళకు రాయలు కోరికలు తప్పక తీరుస్తాడని అర్థం. అంతేకాదు ముక్కుతిమ్మన ఉండగా కవులు పేదలుగా బ్రతకాల్సిన అగత్యం రాదని, ముక్కుతిమ్మన మాటపై రాయలు కవిపండిత రసజ్ఞత పోషణకు పూనుకుంటాడని అర్థం. పై పద్యం ముక్కుతిమ్మన సహకారానికి శ్రీకృష్ణదేవరాయల మహాకవిపోషణకు సాక్ష్యం.

అల్లసాని పెద్దన గురించిన చాటుపద్యంలో “కవి ఎదురైనప్పుడు గజారూఢుడైన తాను ఏనుగును దించి, కేలూత ఇచ్చి ఎక్కించుకొనుట, కృతిని” కవిని ఊరేగించే పల్లకీని తాను మోయటం, బిరుదైన కవిగండపెండేరాన్ని కవి ఎడమకాలికి తానే స్వయంగా తొడగటం, కోకటం మొదలైన అగ్రహారాల్ని అడిగిన చోట వెంటనే అరణంగా ఇవ్వటం లాంటి సంఘటనలు రాయలును అపర భోజరాజును చేశాయి. కాబట్టే కుమార ధూర్జటి కుమారుడు  లింగరాజు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య పీఠికలో -

కృష్ణరాయ కిరీట కీలిత మణిగణా

ర్చిత పదాబ్జాద్వయ శ్రీ వహించి’’ అని చెప్పారు. (శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం పీఠిక - పుట 8)

అంటే శ్రీకృష్ణదేవరాయలు ధూర్జటికి పాదాభివందనం చేశాడని అర్థం. ఒక సామ్రాజ్యాధినేత దక్షిణదేశాధీశ బిరుదాంకితుడు ఒకానొక కవికి పాదాభివందనం చేయటం సాధారణ విషయం కాదు. అది ఆయన కవితా హృదయానికి సాక్ష్యం. కవుల పట్ల తనకుగల పూజ్య భావానికి నిదర్శనం.

శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగతంగా వైష్ణవమతావలంబి. ప్రజా పాలకుడుగా అంతే స్థాయిలో శైవాన్ని, జైన మతాన్ని ఆదరించిన దాఖలాలున్నాయి. పరమతసహనం ఈయనకు వెన్నతోపెట్టిన విద్య. కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు ప్రజాజీవనంల మమేకమైన సాధారణ మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. విజయనగర సామ్రాజ్య విశేషాల్ని నిశితంగా పరిశీలించిన చరిత్రకారులు న్యూనిజ్‌, ఫేయజ్‌, కెంట్‌లు.  వీరిలో విజయనగర రాజుల దినచర్యను ప్రత్యక్షంగా చూసిన చరిత్రకారుడు న్యూనిజ్‌. వీరి దినచర్య సామాన్య ప్రజానీకానికి అబ్బురంకాక మానదు.

2. శ్రీకృష్ణదేవరాయల దినచర్య :

న్యూనిజ్‌ చరిత్రకారుని ప్రకారం రాజు నిద్రలేచిన వెంటనే సోలెడు నువ్వుల నూనెను తాగడం, అంతే నూనెను శరీరానికి మైపూతగా పట్టించుకోవడం. తరువాత ఆ నూనె కరిగేంత వరకు ఒక మంచి యోధునితో కత్తిసాము చేయడం వీరికి అలవాటు. తరువాత ఒక బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకొని గుర్రానికి తనకు అలసట వచ్చేంత వరకు అటుఇటూ సుదీర్ఘంగా స్వారీ చేయటం, తరువాత బ్రాహ్మణుడి చేత ఏకాంతంగా అభ్యంగన స్నానం ఆచరించడం. స్నానాధికం తర్వాత అంత:పురంలోని దేవాలయంలో దైవదర్శనం చేసుకోవడం, దర్శనానంతరం 108 తిరుపతుల్లోని ఏదోఒక క్షేత్రం నుంచి వచ్చిన తీర్థాన్ని పుచ్చుకోవడం. న్యూనిజ్‌ చెప్పిన ప్రకారం అప్పటికి సమయం  తెలవారుజాము 5 గంటలు. దీని తర్వాత మొట్టమొదటగా రాజు మాట్లాడేది వంటవాడితో. అదికూడా దినాహార పట్టిక గురించే. తర్వాత నిన్నటి రోజున దేశాంతరం నుంచి  పర్యటించి వచ్చిన గూఢచారులు(వేగులు)తో  సమాచారార్థం సంప్రదింపులుంటాయి. తర్వాత ప్రత్యేకించి రాయల ఆస్థానపీట నిర్వహణ సన్నివేశం అబ్బురాన్ని కలిగిస్తుంది.

శ్రీకృష్ణదేవరాయలు గులాబీలతో నిండిన తెల్లటి వస్త్రాల్ని ధరించి పర్షియన్‌ దేశంలో తయారైన పట్టు కుళ్ళాయిని శిరసుపై దాల్చి, సభ చేస్తారట. సభలో తనముందు రెండు వరుసల్లో కూర్చొని ఉన్న మంత్రులు, సామంతులు మొదలైన వాళ్ళ తలలు వంగే ఉండాలి. రాజు ఎవరిని ఉద్ధేశించి మాట్లాడతారో వాళ్ళుమాత్రం లేచి తల పైకెత్తి సమాధానమిచ్చి కూర్చుంటారు. సభానంతరం పన్నెండుగంటల తర్వాత భోజనాలుంటాయి. భోజనాలనంతరం దాదాపు మూడు గంటల వరకు సాహిత్యం లేదా వినోద కార్యక్రమాలు ఆస్థాన మంటపాన్ని అలరిస్తాయి. తర్వాత మరుసటి రోజున దేశాంతరాలకు వెళ్ళవలసిన గూఢచారులకు సలహాలు, ఆర్థిక సంబంధమైన లావాదేవీలు, చివరగా ఆత్మీయ మంత్రుల సమాలోచనలతో రాజు దినచర్యలు ముగుస్తాయి.

పొద్దుగుంకిన వెంటనే రాజు అంత:పురంలో ప్రత్యక్షమవుతాడు. ఇది న్యూనిజ్‌ తన చరిత్రలో పేర్కొన్న విజయనగరపు రాజుల దినచర్యలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ దినచర్యలకు ఏమాత్రం అతీతుడు కాడు. కాకపోతే గత విజయనగర రాజుల కన్నా భిన్నత్వమైన మనస్థత్వం శ్రీకృష్ణదేవరాయల్ని ముందుకు నడిపించినట్లుగా భావించవచ్చు. అదేమంటే సామాన్యప్రజల జనజీవనాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగా చూసిన లేక వినిన అనుభవం కలిగిన మహామనీషిగా ఆముక్తమాల్యద కావ్యంలో మనకు సాక్షాత్కరించడం.

3. శ్రీకృష్ణదేవరాయలు - సామాన్యుని జీవిత చిత్రణ:

రవిగాంచని చోటు కవిగాంచుననేది నానుడి. ఈ మాట కవికులంలో ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు తన కావ్యం ద్వారా చెప్పిన  సామాన్య ప్రజాజీవన గ్రాహ్యతకు అంతుండదు. రాయలను ఓ మహారాజుగా, నిబద్ధుడైన అంత:పుర చెలికాడుగా, అంకిత వైష్ణవ భక్తుడుగా, ప్రజల మన్ననల్ని ఆసాంతం చూరగొన్న నాయకుడిగా ఊహించవచ్చు. కానీ సామాన్య జన జీవితాల్ని ఇంత నిశితంగా పరిశీలించిన మరో గొప్ప రాజు లేడంటే అతిశయోక్తి కాదు.  ఆముక్త మాల్యద కావ్యం ద్వారా  రాయలు చిత్రించిన జన జీవితాల్ని పరిశీలిద్దాం.

రాయలు సునిశితంగా పరిశీలించిన అంశాల్లో “వారవనితల అలవాట్లు కాముకుల పాట్లు, ద్రావిడ స్త్రీల దినచర్యలు, బ్రాహ్మణుల స్నానాధికాలు, నీటికోళ్ళ విన్యాసాలు, వేటగాండ్ర కిటుకులు, బాటసారుల లోలత్వం, రైతుల జనజీవనం- పంటచేలల్లో ఇల్లాండ్రులతో సలిపిన సరసాలు, చేపల వేపుళ్ళు, అజీర్తి త్రేన్పులకు చేయవలసిన కిటుకులు, వాన ముసుర్ల సమయాల్లో స్త్రీల అగచాట్లు” మొదలైన విషయాల్ని రాయలు అక్షరీకరించిన వైనం అద్భుతం.

4. వారయువతుల అలవాట్ల గురించి వర్ణన:

విలిబుత్తూరు వర్ణన (ఆముక్తమాల్యద- ఆశ్వాసం 1-51 నుంచి 1-75 పద్యాల వరకు)  సందర్భంలో విలిబుత్తూరులోని వారయువతుల అలవాట్ల గురించి ఇలా చెప్పారు.

ఉ॥   వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్ప గా

        బూవుల గోట మీటుతఱి బోయెడు త్రేటుల మ్రోత కామి శం

        కావహమౌ గృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిర

        జేవడి వీణ మీటుటయు జిక్కెడలించుటయన్సరింబడన్‌  (ఆముక్తమాల్యద 1- 62)

విలిబుత్తూరులోని వారయువతులు తెల్లవారిన వెంటనే మేడపై కూర్చొని జడలు విప్పుకుంటూ, జడలనంటుకున్న పువ్వులను కొనగోళ్ళతో తొలగించుకుంటున్నారట. ఈ దృశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు వెంట్రుకల్ని వీణతోను, వెంట్రుకలనంటికొని ఉన్న పువ్వుల్ని దంతపు సరకట్లుగాను, ఆ పువ్వుల కోసం వచ్చిన తుమ్మెదల రొదను వీణానాదంతోనూ పోల్చారు. ఆ వార వనితలు వీణానాద నిపుణులు కాబట్టి వాళ్ళు వీణ వాయిస్తున్నారేమో అన్నట్లు కాముకులు భ్రమపడ్డారట.

ఇందులో తెల్లవారిన వెంటనే వారవనితలు కావించే దినచర్యల్ని కవి ఊహించాడా? లేక ప్రత్యక్షంగా అనుభవించాడా? పై రెండిటిలో ఏదైనా కవిరాజు ప్రతిభకు తార్కాణమే.

          తే॥    ఉదుటుగుబ్బలు గల తల్పుటురము సూచి

                   గండ పట్టెలు సూచి బంగారు సూచి

                   వీటి వాకిట చోటనే విడువ కెపుడు

                   నుట్లు వెట్టుచు నుందురు సోమరవులు (2-10)

అందమైన వన్నెలాడి గడపలముందే కాముకులు ఎల్లప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారట. ప్రతిసారీ ఆ అందగత్తెల సౌందర్యదర్శనం కలగాలనే కాంక్షకూడా ఎక్కువగా ఉంటుందట. ఈ కాముకులేగాదు సూర్యచంద్రులపై సైతం వీళ్ళకోసం రోజూ వస్తారని కవి ఉత్ప్రేక్షించాడు.

రాజు సామాన్య గృహస్థులుండే వీధుల్లోని కాముకుల అనుభవాల్ని వారి ఆకాంక్షల్ని ఎలా పసిగట్టారో? విన్నారా? లేక కన్నారా? మనోనేత్రంతో చూశారనే మాట కవిసమయం కోసం వాడుకే కానీ భౌతికం కాదు. ఇది రాయల అనుభవమా?

5. శ్రీకృష్ణదేవరాయలు - ద్రావిడ స్త్రీల దైనందిన జీవనచిత్రణ :

చ॥ ద్రవిడ కుటుంబిను ల్పసుపు రాచిన రత్నపు దాపక్రింద నం

    బువు దెర వాఱగా నిదురవోయి గరుత్తతి పచ్చబాఱినన్‌

    భవన సరోమరాళములు భర్మమయచ్ఛద గుచ్ఛవిస్ఫుర

    ద్ధివిజధునీ మరాళ వితతి భ్రమ  బూన్చు  పురి న్భ్రమించుచున్‌ (1-64)

ద్రావిడ స్త్రీలు స్నానంకోసం మెట్లమీద పసుపుకొమ్మల్ని అరగదీశారు. ఆ పసుపు ఆ మెట్లక్రిందికి జారింది. మెట్లకింద నిద్రిస్తున్న హంస రెక్కలపై పడిరది. హంసల రెక్కలు పచ్చగా(బంగారురంగు) మారాయి. అవి చూపరులకు స్వర్గంలోని గంగలో నివసించే బంగారు రెక్కల హంసల్లాగా భ్రాంతిగొలుపాయని అర్థం. ఇందులో కవి భ్రాంతిని ప్రశ్నించలేం. కవిసమయాన్నీ కాదనలేం. కానీ ద్రావిడ స్త్రీలు గృహకొలంకుల్లో చేసే స్నానపు దృశ్యాలు రాజు ఊహకు అందడమే అద్భుతం. ఈ ఊహ ఒక మహారాజుకు ఎలా సాధ్యమైంది?

తర్వాతి పద్యం(1-65)లో అద్భుతదృశ్యాల్ని రాయలు పాఠకుల కళ్ళముందు కదిలించాడు.

చ॥     తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర

        స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్స్నాత ప్రయాతద్విజా

        వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబు జేర్పంగ రే

        వుల డిగ్గ న్వెస బాఱువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్‌. (1- 65)

పంటకాలువ మధ్యలో బాతులు తలల్ని రెక్కలో ఆసాంతం దూర్చి నిద్రిస్తున్నాయి. వాటిని కాపరులు చూశారు. బ్రాహ్మణులు స్నానానంతరం మరచిన తడి వస్త్రపు పిడుచులని భ్రమించి వాటి దగ్గరకు వెళ్ళారు. వాటిని ముట్టుకొనేలోపే అలికిడికి బాతులు ఈదుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన పైరు కాపరిస్త్రీలు కాపరుల అమాయకత్వానికి నవ్వుకున్నారని అర్థం.

పై దృశ్యం సస్యశ్యామలమైన ప్రతి పల్లెపట్టుల్లో సూర్యోదయ సమయంలో జరిగే తంతులాఉంది. కాబట్టి ఈదృశ్యం సామాన్య జనానికి, స్థానిక పంట కాపరులకు మాత్రమే అనుభవయోగ్యమవడం వాస్తవం. కానీ ఒకరాజుకు ఈ అద్భుత హాస్యదృశ్యం ఎలా అనుభవమైంది? కావలివాండ్రతో తీరికగా ఇలాంటి విషయాల్ని చర్చించే చనువూ, అవకాశం, అవసరం రాయలకు ఉండేదా? పైగా రాయల ఆస్థానంలో తనముందు మంత్రులు, సామంతులు తలదించుకునే కూర్చోవాళ్ళు. రాజు కోరితేకానీ వాళ్ళు తలలు పైకెత్తి మాట్లాడే అవకాశం లేదుకదా? కాబట్టి ఈ ఊహ రాయలకు ఎలా సాధ్యమైంది?

6. చేపలను వేటాడే నీటికోళ్ళ విన్యాసాల చిత్రణ :

చేపలను వేటాడే నీటికోళ్ళ కలకలల్ని కవిత్వీకరించిన తీరు గమనించండి.

చ॥     అలరు బురంబునం దొగల నంతర దామర బ్రాచి గప్రపున్‌

        వలపులు మీఱ, లో వలుద వాలుగ మొత్తము వోర, నీరుకో

        ళ్కొల కొలమంచు గ్రుంకు మెడ గుంపుల వంపులు దోప మామితో

        పుల విరుల న్బయి న్నడువ బొల్చు పురాతనతీర్థకుండముల్‌. (1-71)

మామిడితోపుల్లో పాడుబడ్డ నీటిగుంటలున్నాయి. ఆగుంటల్లో వాలుగుచేపలు కొట్లాడుతున్నాయి. ఆ చేపల కోసం నీటి కోళ్ళు కలకల ధ్వనితో నీటిలో మునుగుతున్నాయి. శరీరాలు మునిగాయి. మెడలు మాత్రం ఒంపుగా పైకి కనిపిస్తున్నాయి. అవి చూపరులకు వినోదాన్ని కలిగిస్తున్నాయి. అంతేగాక నీటిగుంటలపైన దట్టంగా తేలిన మామిడిపూతపై ధారళంగా నడచిపోవచ్చని అర్థం. ఇందులో చేపల్ని వేటాడుతున్న నీటికోళ్ళు, వంగిన మెడలు మాత్రం చూపరులకు కనువిందు చేసే దృశ్యం, మరియు నీటిపై రాలిన మామిడిపూతపైన ధారాళంగా నడచిపోవచ్చనే రెండు ఊహలు ప్రత్యక్ష అనుభవమేకానీ, పరోక్ష అనుభవం కాదు. ఊహాజనితం కూడా కాదు.

7. రైతు - ప్రకృతి వర్ణన :

రాయలు సాహిత్య కళారంగాల్ని ఎంత ప్రేమించాడో, అంతే స్థాయిలో శ్రామికుల్ని గౌరవించాడు. ఆముక్తమాల్యద కావ్యంలో పంటకాలువలు రచించి రైతులకు సాయపడాలనేమాట శ్రామిక పక్షపాతానికి సాక్ష్యం. అంతేగాక రాయల కాలంలో వ్యవసాయం ఇబ్బడిముబ్బడిగా జరిగేదట. యమునిదున్న, శివుని నంది (ఆముక్తమాల్యద - ఆశ్వాసం 4- పద్యం -124) రైతులు తమను కూడా తీసుకెళ్ళి నాగలికి కడతారోనని భయపడ్డాయని  రాయలు రాశాడంటే ఎంత పెద్దఎత్తున వ్యవసాయం జరిగేదో ఊహించుకోవచ్చు. అంతేగాక -

          కం॥   వరజుబడి రొంపి ద్రొక్కం,

                   చరణంబుల జుట్టి పసిడి ఛాయక కడుపులం

                   పొరి నీరుకట్టెలమరెను

                   బిరుదులు హాలికులు దున్నబెట్టిరోయనగన్‌ (4-125)

బురద మడిదుక్కిదున్నుతున్న రైతు పాదాలకు నీటి పాములు చుట్టుకున్నాయట. ఆ పాముల కడుపుభాగాలు ఎర్రగా ఉన్నాయి. అవి రైతు పాదాలకు ప్రకృతిమాత తొడిగిన గండపెండేరములాగా ఉన్నాయని రాయలు ఉత్ప్రేక్షించాడు. ఇది రాయల ప్రత్యక్ష అనుభవమా? పరోక్ష అనుభవమా? లేక శ్రామిక పక్షానికి పక్షపాతమా?

పల్లెపట్టుల్లో సాధారణంగా కనిపించే దృశ్యాల్ని అసాధారణంగా ఉత్ప్రేక్షించడంలో రాయలు దిట్ట.

          తే॥    తోట పగలుండి, మల్లెలు దురిమి, కావు

                   లమర మాపైన నిక్షు యంత్రముల కొయ్యన్‌

                   చేరు ప్రజ వొల్చె భావి వృష్టికిని గ్రుడ్డు

                   తో మధురిమేచ్ఛ డిగు నెఱ్ఱచీమలనగన్‌ (2- 70)

పగలంతా తోటల్లో గడిపి చల్లదనం కోసం తలకు మల్లెలు చుట్టుకొని కావి వస్త్రాలను ధరించిన ప్రజలు చెరుకుగానుగల దగ్గరకి చేరారట. ఆ దృశ్యం రాబోవు వర్షానికి సూచనగా గ్రుడ్లు మోసుకుంటూ మాధుర్యం కోసం గానుగ దగ్గరకు చేరిన ఎర్రచీమల్లాగా ఉన్నారని రాయలు పోల్చడం అసాధారణం. వర్షాకాలంలో  చీమలు భూమిలోపలకి చొచ్చుకొని వెళతాయి. వర్షాలు వెలసిన వెంటనే బిలబిలమంటూ బైటకు వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని ఇక్కడ రాయలు చెప్పాడు. కాబట్టే జానపదులు కుక్క కాలజ్ఞాని, పిల్లి బ్రహ్మజ్ఞాని, చీమ పూర్వజ్ఞాని అన్న మాటలు ఇక్కడ గమనార్హాలు.

రాయలు మిక్కిలి సౌందర్యోపాసకులు. కానీ  మహాభారతంలో నన్నయ చెప్పిన నవప్రియులు కారు. స్త్రీ సమాజం పట్ల రాయలకు గౌరవాభిమానాలున్నాయనడానికి క్రింది మాట సాక్ష్యం.

          ‘‘రాష్ట్రమెరియింపు, కొనుము దుర్గములు, త దవ

             రోధమగవడ్డ  పుట్టింటి రూఢ నెఱపు’’   ( 4-267)

రాయలు రాజనీతి విషయంలో చెప్పిన మాట ఇది. శత్రుదేశాల్ని ప్రజల్ని కష్టపెట్టు. దుర్గాలను వశపర్చుకో. కానీ వారి అంత:పుర కాంతలు పట్టుబడితే మాత్రం వాళ్ళకు పుట్టింటి మర్యాదల్ని చేయాలంటాడు. ఈ మాట నవప్రియులైన రాజులు చెప్పడం అసాధ్యం. మానవత్వమున్న రాజుకే ఇది సాధ్యం.

8. బాటసారులు- పడుచుల శృంగారవర్ణనలు :

బాటసారుల కొంటెతనాల్ని, జవరాండ్ర హాస్యపుకవ్వింపుల్ని కూడా రాయలు క్రింది పద్యంలో చెప్పిన తీరును గమనించండి.

చ॥   తొడి బడ నమ్మలక్క లని తూలుచు దీనత దోయి లొగ్గుచున్‌

        పడ మఱి తేర దేర, నలవాక్యము లెన్నక, మోము గుబ్బలున్‌

        గడుకొనుకక్షదీప్తులు నెగాదిగ గన్గొనుచిట్టకంపు ద్రా

        గుడు గని సన్నల న్నగిరి క్రోల్పక పాంథు బ్రపాప్రపాలికల్‌. (2-59)

తుంటరి బాటసారికి దప్పికైంది. తూలుతూలి పడుతూ లేచి అమ్మా, అక్కా రవ్వంత నీరుపోయండన్నాడు. అతి వినయంతో దోసిలి పట్టాడు. వారు నీరు పోశారు. అతని దప్పిక తీరింది. ముందు అమ్మా అక్కా అన్న బాంధవ్యానికి విరుద్ధంగా వారి మొఖాన్ని, చనుకట్టుల్ని, చంకలోని కాంతుల్ని అట్లే చూస్తున్నాడు. దప్పిక తీరిననూ దోసిలి తీయక నీరు తాగుతున్నట్లు నటిస్తున్నాడు. ఆస్త్రీలు అతని కొంటతనాన్ని గుర్తించి బైటపడనీక నీటి ధారను సన్నగించి అలానే పోస్తూ కనుసన్నలతో ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారని అర్థం.

ఈ దృశ్యం కోడెవయసు కొంటెగాళ్ళకు సర్వసాధారణం. సాధారణ ప్రజానీకానికి అనుభవం. రాజుకు ఇలాంటి దృశ్యాలు అనుభవ మృగ్యాలు. ఈ వర్ణన రాయలకు ఎలా సాధ్యమైందో?

జానపదుల్లో (శ్రామికులు) విరసం ఏ స్థాయిలో ఉంటుందో, సరసం కూడా అంతే ఉంటుంది. కానీ పనికాలాల్లో వారి మెదళ్ళకు ఏమీ దరిచేరదు. కానీ తీరిక సమయాలలో మాత్రం శ్రామికుల సరసానికి ఇంటికీ, పంటచేలకు తేడా ఉండదు.వాళ్ళు స్వేచ్ఛగా విహరిస్తారనడానికి క్రింది రాయని పద్యం సాక్షం.

మ॥    వసతు ల్వెల్వడి, వానకై గుడిసె మోవన్‌ రాక తానాని యే

        పసగా నిల్చిన జమ్ముగూడ పొలమంబళ్ల్మోచుచుం బట్టి పె

        న్ముసురు న్నీ గెడు కాపు గుబ్బెతల పెన్గుబ్బల్పునాస ల్వెలిం

        బిసికిళ్ళుం బిసికిళ్ళు హాలికుల కర్పించె న్నభస్యంబునన్‌.  (4- 133)

9. ప్రకృతి ప్రణయత్వం :

భాధ్రమాసపు ముసురులో కాపు స్త్రీలు పంట చేల వద్ద కావలి ఉన్న భర్తల కోసం గూడ నెత్తినేసుకొని అంబలి తీసుకొని పోయారు. గుడిసెలోనికి దూరినపుడు గుడిసె ద్వారం తగిలి స్త్రీలు గుడిసె ముందే నిలబడి పోయారట. లోపల భర్తలు కుంపటిలో సజ్జల్ని కంకుల నుండి వేరుచేస్తుంటారట. భార్యలు తెచ్చిన అంబలి తాగి తమ వెచ్చటి చేతులతో వారి కుచాల్ని మర్ధించి పంపుతారని అర్థం.

గుడిసె ఎత్తు, గూడ పొడవు రాయలకు అనుభవమైనా, కాపు భర్తల కొంటె చేష్టలు ఊహకందనివి కదా? రాజుగా ఈ అనుభవం పరోక్షమే అయినా వర్ణన ఎలా సాధ్యమైంది?.

తెల్లవారుజామున వినిపించే కోడి కూతను పాల్కురికి సోమన చెప్పిన తీరు, కోడిపుంజు ఆకృతి, ధ్వనితమైన కోడికూత, (పండితారాధ్య చరిత్ర` పండిత ప్రకరణం- పుట 63) పాఠకులకు కలకాలం గుర్తుండి పోతుంది. పాల్కురుకి సోమన అతి సామాన్యమైన అనుభవాన్ని ఎలా వ్యక్తీకరించాడో అంతే స్థాయిలో రాయలు ఎద్దురంకెను స్వభావోక్తిగా చెప్పిన తీరును తిలకించండి.

        తే॥       వెద ముదవు కూడ పోలేని వెచ్చ క్రొవ్వు

                   కల్ప మెడచాప వెడలెనో యనగ, నెట్ట

                   కేలకును గుంగి తెచ్చు ఱంకెలు నిగుడగ

                   మందగతి గున్కె వృషభముల్మంద పిఱుద (4-169)

మందలోని ఆబోతు దళసరిది. ఋతుమతి అయిన పాడి ఆవుతో కూడి నడవలేనందున కలిగిన తాపాన్ని మెడవరకు లోపల పేరుకున్న కొవ్వు కరిగే విధంగా మెడసాచి నేల తలపై ఉంచి రంకె వేసుకుంటూ మందవెనుక మెల్లగా నడిచిందట. ఇందులో ఎద్దురంకె స్వాభావికం. సమయం గోధూళివేళ. అప్పటికి రాజు దినసరి కార్యక్రమాల్లో చివరి దశలో ఉంటాడు. మందను పరిశీలించే సమయం కాదు. కానీ జనసంద్రంలో నిత్యం అనుభవేకమైన ఈ దృశ్యం రాజుకు ఎలా సాధ్యమైంది? ఆబోతు చేష్ట రాయల నిశిత పరిశీలనకు సాక్ష్యం కదా?

10. శాక-అశాకాహారాల వర్ణనలు:

రాయల కాలంలో శాఖ-అశాఖాహారాలు సరిసమానంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాయలు గురుగు, చెంచెలి మొదలైన ఆకుకూరల్ని, వివిధ రకాలైన మాంసాహారాల్ని తన కావ్యంలో వర్ణించాడు. ఇందులో భాగంగా ఎఱుకల వేటలో ఉపయోగించే కిటుకుల్ని చెప్పడం రాయల సునిశిత పరిశీలనకు ప్రబల సాక్ష్యం. 

       ‘‘ఎఱుకులు పడియ నీరివుర గువ్వల బట్ట

        పోయు నీరాడాడ పొలము నెరసె’’ (2- 46)

వాననీటితో నిండిన గుంటలు ఇంకిపోవడం, చట్రాతి బండలపై పేరుకొన్న పాచి పెద్దపెద్ద బీటలు పడటం, పడిన నీరు ఆవిరైపోగా ఎరుకలు అడివి పావురాల్ని పట్టుకోవడానికి పోసిన నీరు అక్కడక్కడ నేలమీద కనబడుతున్నదని అర్థం. ఈ మాట మాంసాహారులు ఎక్కువగా వేటపై ఆధారపడతారనడానికి సాక్ష్యం.

అంతేగాక మలుగుచేపల్ని, ఉలసల్ని, బురదమట్టెల్ని కూడా ప్రస్తావించాడు. ఇది సాధారణం. కానీ చేపల్ని పట్టే క్రమాన్ని, గాలపు వేటగాని నైపుణ్యాన్ని, మెళకువని చెప్పిన తీరే ఆశ్చర్యం. చూడండి.

        తే॥       బెదరి చేరని బలియుని బిగియబట్ట

                   కతని మైవడినే వచ్చి హత్త చేత

                   క్రమము, పెనగెడు బలుమీను త్రాట చేదు

                   నొడ్డు గాలంపు వేటగాడుపమ గాదె     (4-252)

గాలపు వేటగానికి పెద్దచేప గాలంలో పడి వెనుకకు లాగితే దానిని అట్లే పోనిచ్చి, గాలం బిగిసిన తర్వాత ఒడుపుగా ఒడ్డుకు ఎలా చేరుస్తాడో అదే రీతిగా బలవంతమైన శత్రువును ఆసాంతం పెరగనిచ్చి తరువాత వాడే తన వద్దకు వచ్చునట్టు చేయాలని రాయల నీతిబోధ. గాలంతాడు బిగిసిన కొద్దీ గాలం చేప గొంతులో లోతుగా నాటుకుంటుంది. ఇక చేపకు తప్పించుకునే వీలుండదు. అపుడు వేటగాని పని సులభమవుతుంది. ఇందులో వేటగాని పనితనాన్ని ఎలా చెప్పాడో అంతే స్థాయిలో చేప వంటకాన్ని రాయలు ఇలా చెప్పాడు.

          శా॥      తారుణ్యాతిగ చూత నూత్న ఫలము కైలాభిఘార స్వన

                   ద్ధారా ధూపిత శుష్యదంబుహృత మాత్స్య చ్ఛేద పాకోద్గతో

                   ద్దారంపుంగన రార్చు భోగులకు సంధ్యా వేళలం గేళికాం

                   తారాభ్యంతర వాలుకా స్థిత హిమాంత ర్నారికే ళాంబువుల్‌ (4-68)

వేసవికాలంలో భోగులు మధ్యాహ్నం దోరమామిడికాయ ముక్కలతో చుయ్యని శబ్దం వచ్చే విధంగా నూనెతో తాళింపు వేస్తారట. వాటికి చేపముక్కల్ని జతచేరుస్తారు. తర్వాత తాళింపులో నీరుతడి ఇగురగానే ఆ చేపముక్కల యిగురుతో భుజించారట. సాయంకాలానికి అజీర్ణంతో చేప కసరు త్రేన్పులు వస్తే, అపుడు సలవ కోసం ఇసుకలో పూడ్చిపెట్టిన కొబ్బరి నీళ్ళు తాగినారని అర్థం. ఈ పద్యానికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రిగారు రాయలు రాజేనా? లేక వంటవాడా? అన్న అనుమానాన్ని వ్యక్తీకరించడం గమనార్హం. ఈ అనుమానం రాయల ప్రతిభకు తార్కాణం.

రాయలు వంటశాలను, పలురకాల వంట క్రమాల్ని ప్రత్యక్షంగా చూశారనడానికి క్రింది పద్యం నిదర్శనం.

          కం॥      పరుషాత పత ప్తంబగు

                   ధరణీపాత్రమున పడుట దళమయ్యె సుమీ

                   పరపక్వంబై, యనగా

                   శరదిందు జ్యోత్స్న రేల సాంద్రత గాసెన్‌. (4- 176)

బాగా కాగిన పెనంమీద పోసిన అట్లపిండి పక్వమై చిక్కబడిన(అట్టుగా) విధంగా పగలంతా కాగిన భూమిపై పడిన వెన్నెల దట్టంగా కాసిందని భావం. అంటే శరత్కాలపు వెన్నెల పెనంపైన కాగిన అట్టులాగా తెల్లగా ఉందని రాయలు ఉత్ప్రేక్షించాడు.

రాయలు రాజనీతిని చెప్పాలన్నా, శీతోష్ణస్థితుల్ని ఉపమించాలన్నా ప్రజల సాధక బాధకాల్ని వ్యక్తీకరించాలన్నా వంటశాలల చుట్టూ ప్రకృతి వాతావరణం చుట్టూ పాఠకుల్ని పరుగెత్తించడం ఇక్కడ గమనించవచ్చు.

11. వర్షాకాలంలో సామాన్యుల కష్ఠాలు:

రాయలకాలం స్వర్ణయుగం. ఆయన రాజ్యంలో నెలకు మూడు వానలు పరిపాటి. ప్రస్తుతం మనం నివసించే ఎండిన రాళ్ళసీమ, రాయలకాలంలో పండిన రాయలసీమ. కాబట్టి వర్షాకాలంలోని వింత అనుభవాల్ని అంతే స్థాయిలో రాయలు గ్రంథస్థం చేశాడు.

          తే॥    దవుల జల్లని తూఱ నంతక మునుపటి

                   జల్లునీ రూని వచ్చునా జల్లు, మొదలి

                   గాలి యెలగోలుచే గొమ్మగదలి జల్లు

                   దలపడక మున్న వంగుళ్ళ దడిపె దరులు. (4-130)

బాటసారులు కనుచూపుమేరలో వాన జల్లు దిగుతుందని గమనించారు. అక్కడ చెట్లు లేనందున తామున్నచోటనే చెట్టు చాటుకు చేరారట. అయినా వాళ్ళు వాన నీటికి తడిశారట. ఎందుకంటే దూరపు జల్లుకు సూచనగా గాలి రావడం, అంతకు ముందే కురిసిన జల్లు తాలూకు నీరు చెట్ల ఆకులపై నిలిచి ఉండటం, ఆగాలికి నీరుజారి బాటసారుల్ని తడిపిందని అర్థం. సామాన్య బాటసారులకు ఎదురయ్యే సంఘటనల్ని స్వాభావికంగా రాయలు అక్షరీకరించినా, ఇది రాయల సునిశిత పరిశీలనకు నిదర్శనంగా చెప్పవచ్చును. ఇలాంటి వర్షాకాలంలోనే స్త్రీలు పడే అవస్థల్ని సజీవంగా చిత్రించిన తీరును గమనించండి.

          సీ॥    ‘‘ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖియబ్బె

                                       నే నింటిలో బూరి యిడి విసరక

                   రా జదు రాజిన రవులు కొల్పాసలె

                                       గాని కల్గదు గూడు దాన  గలిగె

                   నేని కూరగుట మందైన బెన్బొగ సుఖ

                                       భుక్తి సేకూర దా భుక్తి యిడిన

                   బ్రాగ్భోక్తలకె తీఱు బహుజనాన్నము దీఱ

                                       నారుల కొదవు బున:ప్రయత్న

        తే॥       మాజ్య పటముఖ్యలయ మెన్న రాలయాంగ

                   దారులయ మెన్న రంతిక కారజనిక

                   పచన నాంధోగృహిణి రామి బడక మరుడు

                   వెడవెడనె యార్వ నొగిలి రజ్జడినిఇ గృహులు (4-127)

పై పద్యం వర్షాకాలంలోని గృహస్థుల అవస్థలకు పరమ నిదర్శనం. ఇంటింటికి తిరిగిననూ ఇసుమంత నిప్పూ పుట్టదు. ఒకవేళ దొరికినా ఇంటిలోని పూరిగడ్డిలో పెట్టి విసిరినా రాజుకొనదు. రాజుకున్నా రవులుకొనదు. రవులుకొన్నా కూడు ఉడకదు. కూడు ఉడికినా కూర ఉడకదు. రెండూ ఉడికినా దట్టమైన పొగవలన దిట్టమైన భోజనం సమకూరదు. ఆ భోజనం ముందువరుసలో కూర్చున్న పురుషులకే సరిపోతుంది. స్త్రీలకు మళ్ళీ వంట ప్రయత్నం తప్పదు. స్త్రీలు నేతితో తడిపిన గుడ్డల్ని, ఇంటి వాసాల్ని సైతం తృణంగా భావించి అర్ధరాత్రి వరకు వంట చేయడం, తినడం, పాత్రలను శుభ్రం చేయడం లాంటి పనులతో ఆలస్యంగా పడక చేరేసరికి భర్తలు మన్మధతాపంతో వేగిపోతారని అర్థం. సామాన్య గృహాల్లో కనిపించే జీవనదృశ్యాల్ని అంత:పుర కన్నుల నుంచి కాంచిన రాయలు సజీవదృశ్యంగా మలచడం అద్భుతం.

 12. ముగింపు:

వారకాంతల దినసరి అలవాట్లు, ఈ వన్నెలాడి చూపులకు చిక్కిన కాముకుల ఈతిబాధలు, ద్రావిడ స్త్రీ దినచర్యలు, భాగవతుల స్నానదృశ్యంలో వీళ్ళు పిండిన మడిబట్టల పిడుచల్ని తెల్లటి బాతులుగా చెప్పడం, నీటి కోళ్ళ మెడ వంపుల వయ్యారాలు చూపరులకు ఆశ్చర్యాల్ని కలిగించడం, వేటగాండ్ర కిటుకులు, దొంగకొంగల వేట, ఏదో ఒక నెపంతో కాంతల అందాల్ని కాంచాలనుకునే కొంటెగాళ్ళ చేష్టలు, రైతుల మనస్తత్వాలు, ప్రకృతిలో జరిగే మార్పులు మొదలైన అంశాల జోలికి రాయలు వెళ్ళడం, సునిశితంగా ఆ దృశ్యాల్ని మలచి ప్రాణం పోయటం నిజంగా సునిశితమైన రాయల పరిశీలనా దృష్టికి నిదర్శనమే. నేటి మన ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి పాలకుల్ని మనం చూడలేము. నిత్యం యుద్దాలతో, రాజ్య పాలనతో సతమతమవుతూనే ప్రజలను గురించి ఇంత దగ్గరగా పరిశీలించిన మహా చక్రవర్తిని ఆదర్శంగా తీసుకుంటే నేటి పాలకులు కూడా అద్భుతంగా ప్రజా పరిపాలనను అందించగలరు. శ్రీ కృష్ణదేవరాయలు గురించి సామాజిక కోణంలో అధ్యయనం చేయడం ద్వారా కొత్త అంశాలను పాలనలో చొప్పించడానికి వీలు కలుగుతుంది.

ఇక్కడ చర్చించబడిన దృశ్యాల్ని రాయలు మలచిన తీరు పండిత, పామర లోకాల్ని అబ్బుర పరుస్తున్నాయి. ఎందుకంటే రాజుగా రాయలుకు రాజధర్మం శాస్త్రోక్తంగా అబ్బవచ్చు. రాజుగా స్వానుభవం కావచ్చు. కానీ రాజుకు తెలియని జానపదులకు మాత్రం అనుభవమైన జీవనశైలి, మనస్థత్త్వాలు, వాళ్ళ కోరికలు, ఆయా ఋతువుల్లో ఎదురయ్యే కష్టనష్టాలు, వృత్తి శ్రామికుల అగచాట్లు, అనుభవాలు రాయలు గుర్తెరగడం, సజీవంగా చిత్రించడం ఏరాజుకైనా  సాధ్యంకాని కార్యం. ఈ అసాధ్యాలని సుసాధ్యాలుగా మలచిన రాయల హృదయాన్ని పట్టాభిషేకానికి ముందు రాయల లోకానుభవాన్ని, రాజైన తర్వాత గడించిన  అనుభవాన్ని చరిత్రకారులు చెప్పిన వాస్తవాల్ని అధ్యయనం చేస్తేకానీ రాయలు సమాజానికి సమగ్రంగా అర్థంకాడు. ఆ దిశగా పరిశోధకులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కోటేశ్వరరావు, తుమ్మపూడి (2001) ఆముక్తమాల్యద సౌందర్యలహరీవ్యాఖ్యానం, ప్రథమద్వితీయభాగాలు, మలయకూటపబ్లికేషన్స్, హైదరాబాద్.
  2. చంద్రశేఖర్ రెడ్డి, డి. (2007) (సంపాదకత్వం), శ్రీ కృష్ణదేవరాయ వైభవం, ఎమెస్కో బుక్స్, విజయవాడ.
  3. చాటుపద్యములు. ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ గ్రంథాలయతాళపత్రగ్రంథము. ఎం.ఎస్‌.టి. 181 సి 49-1
  4. రామస్వామి శాస్త్రులు, వావిళ్ళ (సంపా.), (1907), ఆముక్తమాల్యద ఆంధ్రవ్యాఖ్యాన సహితము, సరస్వతీనిలయ ముద్రాక్షర శాల, చెన్నపట్నం.
  5. విశ్వనాథ నాయని వారి స్థానాపతి, రవికృష్ణ,  మోదుగుల (2013), (సంపాదకులు), రాయవాచకం, మిత్రమండలి పబ్లికేషన్స్
  6. వెంకట నరసింహాచార్యులు, పరాంకుశం. (1967). ఆంధ్రభోజుడు (నాటకం), జూపీటర్ ప్రింటింగ్ ప్రెస్, గుంటూరు.
  7. వెంకటరాయ శాస్త్రి, వేదము (1964), సంజీవని వ్యాఖ్య, పమ్మి పొన్నయ్య శెట్టిగారి చంద్రికాముద్రాక్షర శాల, మదరాసు

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]