headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. భారత స్త్రీపర్వం: స్త్రీహృదయం

డా. ఎన్. శిల్పారాణి

ఉపాధ్యాయురాలు
వేమాపురం, తిరుపతి.
తిరుపతి. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9502375155, Email: silparanimay26@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

భారతంలో స్త్రీ పర్వానికి ప్రత్యేకస్థానం ఉంది. యుద్ధషట్కంలో చివరిపర్వం స్త్రీపర్వం. యుద్ధంలో భర్తల్ని, అన్నదమ్ముల్ని, కొడుకుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోయి దుఃఖసాగరంలో మునిగివున్న స్త్రీ మానసికస్థితిని విశ్లేషించటం ఈ వ్యాసోద్దేశం. ఈ పరిశోధన స్త్రీపర్వం పై వచ్చిన వివిధ వ్యాసాలను చూచి ప్రేరణపొంది, ఇంకా ఈ పర్వంలో స్త్రీహృదయాన్ని ఎలా ఆవిష్కరించవచ్చు అన్న ఆలోచనలనుండి నిర్మించబడింది. స్త్రీపర్వం ఉపాఖ్యానం, స్త్రీపర్వవిలాపం వంటివి ఈ వ్యాసానికి ఆధారాలు.

Keywords: కుంతి, గాంధారి, ద్రౌపది, సుప్రియ, నూరుగురు కౌరవులస్త్రీల కొడుకులు, సామంతరాజులు, సైనికుల స్త్రీమూర్తుల దుఃఖం, యుద్ధవీరులు, మానసికస్థితి, హృదయావిష్కరణ.

1. ఉపోద్ఘాతం:

          సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ

        బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె

        వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని

        స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్” (ఉద్యో.3-273)

భారతం భారతీయ జీవనవిధానానికి అద్భుతమైన లిఖితాధారం. భారతమంటే భారతీయత. భారతమంటే తరతరాల ఈ దేశచరిత్ర, సంస్కృతి. భారతీయ సంప్రదాయం. భారతజాతి జీవనసంస్కారం. సత్యనిరూపన, ధర్మసంస్థాపన భారతానికి మూలాధారం. భారతాన్ని అధ్యయనం చేయటంవల్ల ధర్మవర్తనమైన మానవజీవితం అలవడుతుంది. ఆధునిక అత్యవసరజీవితంలో ఒత్తిడిని దూరంచేసే ప్రశాంతజీవనవిధానం లభిస్తుంది. జయకావ్యంగా ఈ దేశచరిత్రని వ్యాఖ్యానించిన కృష్ణద్వైపాయనుడు, భారతకావ్యంగా తెనుగించిన కవిత్రయం ఈ జాతినిర్మాతలు, వేలతరాల స్ఫూర్తిప్రదాతలు.

2. స్త్రీపర్వం:

        “పర్వుచు స్త్రీపర్వాదిక పర్వంబుల నే నిటం గృపాయుత మై స్త్రీ

        పర్వంబు పదునొకం డగు పర్వము నా వెలయు నుకవిపండితసభలన్” (భా.ఆది.1-56)

నన్నయగారు స్త్రీపర్వం మిగతా ఐదు ఉపపర్వాలతోపాటు, జాలితో కూడి ప్రధానపర్వమై పదకొండవ పర్వంగా ఉత్తమకవిపండితుల సభలలో ప్రసిద్ధమై ఉంటుందని కొనియాడారు. ఇది అయిదుపర్వాల సమాలోకనంతో మిగిలిన నిర్భరశోక స్వరూపం. ఇది యుద్ధషట్కంలోని చివరిది. కరుణరసభరితంగా సాగిన పర్వం. ఇది మొత్తం రెండు ఆశ్వాసాల పర్వం. నిజానికి బతికున్నవారికే కష్టాలన్నీ. భర్తను కోల్పోయిన భార్యలు, కొడుకును కోల్పోయిన తల్లులు, అన్నను కోల్పోయిన చెల్లెళ్లు, తండ్రిని కోల్పోయిన కూతుళ్లు మగదిక్కును కోల్పోయి, గుండెలవిసేలా ఏడ్చి, జీవచ్చవమైన ఎంతోమంది స్త్రీమూర్తుల రోదనలతో కూడినదే ఈ స్త్రీపర్వం. యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణుల సేన అంటే సుమారు ముప్ఫై లక్షలకు పైనే వీరమరణం పొందినట్లుగా తెలుస్తున్నది. అంటే ఎంతోమంది స్త్రీమూర్తులు వితంతువులుగా మారినట్లు తెలుస్తున్నది. ఈ పర్వం స్త్రీజీవితపతనావస్థని ఎత్తిచూపుతుంది. బహుశా ఈ యుద్ధం తర్వాతనే అందరూ ప్రతి ఇంటా ప్రతి కాన్పులో పురుషుణ్ణి కోరుకున్న సంప్రదాయం ఇక్కడి నుంచే మొదలైనట్లుగా భావించవచ్చు. స్త్రీపర్వంలోని వివిధ స్త్రీల మానసికస్థితిని, వారి హృదయావేదనను ఆవిష్కరించటం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

3. కథాసంగ్రహం:

తన నూరుగురు కుమారుల్ని కోల్పోయిన ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయినప్పుడు సంజయ విదురవ్యాసాదులు ఓదార్పు వచనాలు చేస్తారు. కౌరవవధూజన వర్ణనం, కురువృద్ధ వధూవర్గంతో సపరివారంగా ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి తరలిపోవటం, అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు ఉపపాండవుల్ని సంహరించిన విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేయటం, కృపాచార్యుడు గాంధారిని ఓదార్చటం, ధర్మరాజు సోదరసమేతంగా, ద్రౌపది, కృష్ణుడు, సాత్యకి, మత్స్యపాంచాలస్త్రీలు వెంటరాగా ధృతరాష్ట్రుని పరామర్శించటానికి రావటం, కురుకాంతలు, ఇతర స్త్రీలు ధర్మరాజుని నిందించటం, ధృతరాష్ట్ర కపటకౌగిలినుంచి శ్రీకృష్ణుడు భీముణ్ణి రక్షించటం, పాండవులు గాంధారిని దర్శించటం, గాంధారి భీముల సంభాషణం, ధర్మజుని శపిస్తున్న గాంధారిని వ్యాసుడు వారించటం, పాండవులు కుంతిని చూడటం, కుంతివాత్సల్యంతో ఓదార్చటం, కుంతి గాంధారి ద్రౌపది పరస్పరం అనునయించుకోవటం వంటివి ప్రథమాశ్వాసంలోని అంశాలు.

గాంధారి మృతవీరుల తీరుని చూపిస్తూ తన ఆవేదనని కృష్ణునితో చెప్పుకోవటం; గతవైభవాన్ని తలచుకుంటూ ప్రస్తుతస్థితికి బాధపడుతున్న రాచస్త్రీల సంతాపాన్ని దర్శింపజేయటం; గాంధారి శ్రీకృష్ణుడితోపాటు తన దాయాదుల్ని శపించటం, మృతవీరులందరికీ శాస్త్రోక్తంగా అన్ని సంస్కారక్రియల్ని నిర్వహించటం, కుంతి కర్ణుని జన్మవృత్తాంతాన్ని పాండవులకు తెలియజేయటం, ధర్మజుని మనోవేదన, వంశీకులతోపాటు కర్ణుడికీ తిలోదకాలు ఇవ్వటం, పుణ్యకర్మలు చేయటం వంటి విషయాలతో ఈ పర్వం ముగుస్తుంది. పై అంశాలతో కూడిన సమాహారమే స్త్రీపర్వానికి సంబంధించిన సంగ్రహకథ. స్థూలంగా చెప్పాలంటే ఈ పర్వంలో పుత్రుల మరణవార్త విని మూర్ఛిల్లిన ధృతరాష్ట్ర, గాంధారిల శోకవిలాపం ఇందులోని సమసన్నివేశాలు.

4. ధృతరాష్ట్రహృదయం:

ఈ వ్యాసం ప్రధానంగా స్త్రీహృదయాన్ని చర్చించటం లక్ష్యం అయినా ఒక మహాసామ్రాజ్యానికి రాజు, వేదాలు చదివిన జ్ఞాని, అసామాన్యప్రతిభాశాలి, ఇంద్రియాలపై సాధికారమున్న మగధీరుడైన ధృతరాష్ట్రుడే.. “చండపవన పతితంబగు పాదపంబు చందంబు దోఁప ధరణిం బడియెన్” అనటం వల్ల ధృతరాష్ట్రహృదయాన్ని చెప్పవలసిన సందర్భం వచ్చింది. అయితే తిక్కనగారు ఇక్కడ ఆ మహారాజు చిత్తవృత్తిని ఒక చక్కని వసంతతిలకం పద్యంలో వెల్లడించారు.

హా! పుత్రవర్గ మిటులాఱడిఁ బోవ దీప్తవ్యాపారమేది మది వందుచు దీన వృత్తిం

బ్రాపించి యన్యులు కృపం బరికింప నిం కేనోపన్ భవం బెదలి యుండఁగ జీవితోడన్” (స్త్రీ. 1-10)

ఎంతో వైభవంగా బతికిన కొడుకులంతా అతిదీనంగా చనిపోయారు. తలకొఱివి పెట్టవలసిన బిడ్డలకు తండ్రే కొఱివి పెట్టవలసిన అత్యంత దుర్భరస్థితి వచ్చిపడింది. నిత్యం ప్రాణసమానమైన నూరుగురు కొడుకుల్ని చూచి మురిసిపోయే మహారాజుని పుత్రవియోగవార్త ఎంతోగానో కృంగదీసింది. ఇక జీవితమే వ్యర్థమని భావించాడు. అభిమానవంతుడైన తననుచూచి ఇతరులు జాలిపడతారన్న ఆలోచన అతణ్ణి నిలువునా దహించివేస్తుంది. రెక్కలు తెగిన పక్షిలాగా, కాంతిని కోల్పోయిన సూర్యునిలాగా అయిపోయింది. బంధువులు పోయారు, ఆ వైభవం పోయింది, నా బతుకు మసకబారి వెలవెలపోతున్నది. చివరికి ఇదీ ఒక బ్రతుకేనా అన్న భావన ధృతరాష్ట్రుణ్ణి కాల్చివేస్తుంది. ఆ భావనలోనే తాను చేసిన తప్పును తలచుకుంటూ రాయబార సందర్భంలో కృష్ణుడు యుద్ధంవద్దని హెచ్చరించాడు. విదురుడు తొలుతనుండి వారిస్తున్నాడు. భీష్మద్రోణాదులు చెప్పారు. పరశురామాది మునులు హితవు చెప్పారు. ఎంతమంది ఎన్ని చెప్పినా పుత్రులమీద మమకారంతో వారిమాటలు పెడచెవిన పెట్టాను. అందుకు ఫలితంగా కొడూకుల్ని, చుట్టాల్ని, స్నేహితుల్ని, సహచరుల్ని పోగొట్టుకున్నానని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.

5. స్త్రీహృదయం:

నిజానికి భారత, రామాయణాలకు మూలకారణం స్త్రీనే అన్నమాట లోకంలో ఉంది. భారతయుద్ధంలో స్త్రీ పాల్గొనకపోయిన అన్నిరకాలుగా నష్టపోయింది మాత్రం స్త్రీనే. అందుకు సాక్ష్యమే ఈ స్త్రీపర్వం. యుద్ధం ముగిసింది, యుద్ధంలో చనిపోయినవారికి ఏ చింతాలేదు, బతికున్నవారికే దాని తాలుకు జరిగిన నష్టం.

6. కురువంశ స్త్రీల శోకావస్థ:

గాంధారి, ఇతర కురువంశస్త్రీలు శోకభారంతో శరీరం తూలుపోతూ ఉన్నారు. గాంధారి ఇతరుల ఆసరాతో ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చింది. కుంతీదేవి మొదలైన కురువంశంలోని వయసురీత్యా పెద్దస్త్రీలు, వారికి పరిచర్యలు చేసే ఇతర స్త్రీలు క్రమంగా అక్కడికి చేరుకున్నారు. ఇలా అక్కడికి చేరుకుంటున్న కౌరవస్త్రీల దుఃఖావస్థను తిక్కనగారు ఇలా వర్ణించారు.

చేతులు నడుదల సేర్చు టుత్లకశోకమాకారములు దాల్చి నట్టులుండ

విరిసిన వేనలున్ వెన్నులఁ బ్రక్కలనెఱసి దృష్టి నీఱు సేయ

నందంద దొరఁగెడు నశ్రుజలంబుల పెంపున మోములు ముంపఁబడఁగ

నేమియుఁ దొడవులు లేమిఁ బాడఱియున్న యంగంబులందు దైన్యంబు నేఱయఁ

బతుల నన్నలఁ దమ్ముల సుతుల హితులఁ బేరుకొని వాతు లెండంగఁ బ్రేముడించి

పనపు పలుకులు వినువారి వనటఁ దేల్పఁ గురుకుమార నారీజనకోటి వచ్చె” (1-98)

ఈ వర్ణన ఎంత సహజంగా ఉందో చూడండి. తిక్కనగారి వర్ణనావిన్యాసానికి, సూక్ష్మపరిశీలనకు ఇది నిదర్శనమనిపిస్తోంది. అక్కడి స్త్రీలు నడినెత్తులపై చేతులుంచుకొని దుఃఖిస్తున్న తీరు రూపందాల్చిన శోకంలాగా కనిపిస్తున్నదట. ఇది ఎంతగొప్ప ఊహ చూడండి. సహజంగా లోకంలో ఎవరికైన దుఃఖం కలిగినప్పుడు పురుషునికంటే స్త్రీ అధికంగా శోకించటం కనబడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా శోకాలు పెట్టేది స్త్రీనే అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రాణసమానమైన భర్తో, కుమారుడో, స్నేహితుడో, మగతోడో కోల్పోయిన స్త్రీలు ఆ బాధని ఎంతకీ అణచుకోలేక పడుతున్న యాతనలో అప్రయత్నంగా కారే కన్నీటిని రూపం దాల్చిన శోకం అనటం సమంజసమే. సాధారణంగా స్త్రీలు అలంకార ప్రియులు. కానీ ఈ సందర్భంలో వారు విరబోసుకున్న జుట్టుతో తలలు చెరిగిపోగి అందవిహీనంగా ఉన్నారట. వారి కళ్ళలోనుంచి కారుతున్న నీరు వర్షంలాగా వారి ముఖాలను ఆక్రమించిందట. ఆభరణాలులేని వారి శరీరాలు పాడుబడి శిథలమైనట్లు తోస్తున్నవట. చనిపోయినవారిని పిలుస్తూ, వారితో కలిగిన ఉన్న కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ శోకించటమనేది మనం చనిపోయిన వారిళ్ళలో చూస్తూ ఉంటాం. అలాగే అక్కడి చేరుకుంటున్న కౌరవస్త్రీలు కూడా వారి భర్తల్ని, అన్నదమ్ముల్ని పిలుచుకుంటూ నోళ్ళారిపోయేలా ఆర్తనాదాలు చేస్తూ ఆ ప్రక్కల ఉన్నవాళ్ళను కూడా దుఃఖసాగరంలోకి నెట్టివేస్తున్నాయనటం అక్కడి హృదయవిదారక స్థితిని తెలియజేస్తుంది.

సాధారణంగా అంతఃపుర స్త్రీలు వారి పైటలు తొలగిపోవటాన్ని కూడా ఇష్టపడరు. తమ తోటిస్త్రీలు, చివరికి చెలికత్తెలు చూస్తున్నా సిగ్గుపడతారు. కానీ ఇప్పుడు వారి అత్తలు చూస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆ సుకుమార వనితలు వికారాకారాలతో పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. కేవలం కురువనితలేకాక ఆ రాజ్యంలోని మృతవీరుల భార్యలు తమ ఇళ్ళనుండి వస్తున్న తీరు వేటగాల్లు తమ పోతుల్ని చంపివేయగా కోపంతో రగిలిపోతూ గుహలనుంచి పరుగెత్తుకుంటూ వస్తున్న ఆడ సింహాలలాగా ఉన్నారట. అందరూ ఒక్కసారిగా ధృతరాష్ట్రుడున్న చోటికి రావటం వల్ల ఆ ప్రాంతమంతా స్త్రీల ఆర్తనాదాలతో, ఏడ్పులు రోదనలతో దిక్కులు మారుమ్రోగాయి. ఆ సందర్భం ప్రళయకాలంలో మంటలలో చిక్కుకున్న జంతువుల్లా ఆ స్త్రీలు ఏడుస్తున్నట్లు తిక్కన వర్ణించాడు. ఆ స్త్రీలను ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు. ఆ సన్నివేశం విదురుడు, కృపాచార్యాది మహర్షులచేత కూడా కంటతడిపెట్టిస్తున్నది.

ఇంకొకపక్క ధర్మరాజు తన సోదరుల సమేతంగా ధృతరాష్ట్రుని దగ్గరకు బయలుదేరాడు. అయితే వారివెంట ద్రౌపది, ఆమె బంధుస్త్రీలు కూడా నడిచారు. కొడుకుల్ని పోగొట్టుకున్న ద్రౌపది కూడా కడుపుకోత వల్ల మిక్కిలి దుఃఖిస్తున్నది. ఆమెకి ముందు వెనుకలుగా మత్స్యపాంచాల స్త్రీలు నడుస్తున్నారు. ధర్మరాజు యుద్ధభూమికి చేరుతున్న సందర్భంలో కురుసేనలో ముందున్న కొంతమంది స్త్రీలు ధర్మరాజుని చూసి కోపం ఆపుకోలేక ఎదురుగా పరుగుతీసారు. ఆ సందర్భంలో వారు తమ కడుపుమంటను చల్లార్చుకోవటానికి ధర్మరాజుని నిందించిన తీరును తిక్కన వర్ణించటాన్ని గమనించవచ్చు.

ధర్మ వేదిత్వ మీ ధరణీశ్వరునకు నెక్కడి యది కృప యెందుఁగలదు? తలఁపఁ

దండ్రుల మామలఁ దాతలఁ గొడుకులఁ దోడఁబుట్టువులను ద్రుంచివైచెఁ

గ్రూరత మెఱయంగ గురుజనంబులఁ గూల్చె సఖుల సంబంధులఁ జంపె నదయుఁ

డని పల్కుదురు కొంద ర్చప్పార్థుఁ జేరి గాంగేయుని ద్రోణునిఁ గెడయుఁ బొదువఁ

బనుపనెట్లు నేర్చి తని పల్కుదురు గొందఱకట సింధురాజు ననుజమగనిఁ

దునుము తేటి రాజ్యమని పల్కుదురు గొందఱతఁడు మోము వాంచి యరుగుచుండ (1-121)

ధర్మానికి రాజువంటివాడు ధర్మరాజు. లోకంలో ధర్మాన్ని కాపాడేవాడు. అలాంటి ధర్మరాజుకు ధర్మం తెలియదని, తనకు జాలి, దయవంటి కనీస ధర్మాలు తెలియవని, ఒకవేళ తెలిసినట్లైతే తండ్రుల్ని, తాతల్ని, కొడుకుల్ని, తమ్ముళ్ళను చంపాడు. చివరికు విద్యనేర్పిన గురువుల్ని సైతం అతి ధారుణంగా చంపాడు. ఏ మాత్రం కనికరంలేని వాడు ఛీ ఛీ అని ఛీదరించుకున్నారు. ఇంకొందరు అర్జునుడు దగ్గరకు వెళ్ళి ‘కురువృద్ధుడు చంపటానికి, గురువైన ద్రోణాచార్యుణ్ణి నేలకూల్చటానికి నీవెలా సాహసించావు? అని అడిగారు. మరికొందరు అయ్యో నీ చెల్లెలు భర్త అని కూడా చూడకుండా సైంధవుణ్ణి ఎట్లా చంపావయ్యా అంటూ మీరు సంపాదించుకున్న ఈ రాజ్యమంతా ఎవరికోసం అని దుమ్మెత్తిపోశారు. ఇంతమందిని చంపారని గర్విస్తే ఎలా? ద్రౌపదికొడుకుల్ని, అభిమన్యుడిని చంపావు. మరదులందరినీ నీ పొట్టన పెట్టుకున్నావు. అయినా నీకు వైభవం ఎక్కడుంది అని అక్కడి స్త్రీలు ధర్మరాజు పై తమ అక్కసును వెళ్ళగ్రక్కారు.

గాంధారి శ్రీకృష్ణునితో కురుస్త్రీల అవస్థను ఈ విధంగా చెబుతుంది.

        “చూడుము ధృతరాష్ట్రు కోడండ్రఁ గన్నార వీరె కన్నీరు పై వెల్లి గొనఁగ

        దీనతఁ బొందెడు నాననంబుల విప్రలాపంబులైన సల్లాపములను

        నడలు చొండొరులకు నన్నలఁ దమ్ముల రూపించి వేర్వేఱఁ జూపుటయును

        బొరిమొగంబులు సూచి పురుపురఁ బొక్కుచుఁ దలలల్లం దూలంగ నిలుచుటలును

        గలిగి యలిగెడు వారి కన్నులకుఁ బండు వగుచునున్నారు కాకులు మగల తనువు

        లెక్కియున్నను చేష్టలు దక్కి కొందఱడువఁ జేయాడకున్నవా రంబుజాక్ష!” (2-11)

ముఖాలపై కన్నీరు వెల్లువలుగట్టగా అతిదీనమైన ముఖాలతో పొంతనలేని పలుకులతో, పుట్టెడు దుఃఖంతో, ఒకరికొకరు చనిపోయిన తమ అన్నదమ్ముల ముఖాలు చూచి ఇది ఫలానావారిది అని నిర్ణయిస్తూ చూపిస్తున్నారు. అలా చూపిస్తూ మళ్ళీ వారు చూస్తూ మళ్ళీ బోరున ఏడుస్తూ తలలు వాలిపోతుంటే ఎలాఘో నిలదొక్కుకుంటున్నారు. చివరికి తమ భర్తల శరీరాలపై కాకులు కూర్చున్నా వాటిని తోలటానికి చెయ్యికూడా ఎత్తలేనంతగా అలసిన ఆ స్త్రీలను చూస్తుంటే ఎంతోబాధగా ఉన్నదని గాంధారి తమ కోడళ్ళ దుస్థిని తెలియజేస్తున్నది.

7. గాంధారి శోకం:

నిజానికి భారతంలో అత్యంత కడుపుకోత గాంధారికే. ఒక తల్లిగా అత్యంత దురదృష్టవంతురాలు కూడా గాంధారియే. నూరుగురు కొడుకుల్ని కన్నా కూడా చివరికి ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. ఆ బాధలోనే ధర్మరాజుని శపించబోయింది. కులస్త్రీకి ఆ శక్తి ఉంది. ఆ సందర్భంలో వ్యాసుడు ఆమెను అనేక విధాల మాటలతో సముదాయించి మామూలు స్థితికి తీసుకువచ్చాడు. అయితే గాంధారి ఎంతో ధర్మనిష్ఠ కలది. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తల్లి ఆశీర్వాదాన్ని కోరినప్పుడు కూడా ఆమె ధర్మమే గెలుస్తుందన్నది కానీ తన కొడుకు గెలవాలని దీవించని నిస్వార్థ తల్లి. అందుకే ఆమె వ్యాసుణ్ణి ఒక్కటే ప్రశ్నిస్తుంది. నా కొడుకు దుర్యోధనుడు దుర్మార్గుడే కావచ్చు కానీ, యుద్ధనీతికి వ్యతిరేకంగా బొడ్డుకింద మోది చంపటం న్యాయమా? అని అడుగుతుంది. చివరికి తానే భీముడి సమాధానానికి శాంతించి, దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగటాన్ని మనుషులు చేసే కాదని చెబుతూ అది జంతువులైన తోడేళ్ళో లేక రాక్షసులో చేసే పని మనిషిగా నీవెలా చేయగలిగావని భీముణ్ణి ప్రశ్నిస్తుంది. చివరికి గాంధారి మనస్సులో ఉన్న బాధంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకోవటాన్ని ఇక్కడ గమనించవచ్చు.

అంధులకు నూఁతకోలగా నకట! యొకనినైన నిలుపక నూర్వుర నదయవృత్తి

మ్రింగి తందెవ్వఁ డేనియు మీకు నెగ్గులాచరింపని వాఁడు లేఁడయ్యెనయ్య? (1-170)

గాంధారి బాధంతా ఒక్కటే నూరుగురు కుమారుల్ని కన్నతల్లికి ఈ చివరిదశలో ఆసరాగా ఒక్కడిని కూడా మిగల్చకుండా చంపారు. అందులో ఒక్కడు కూడా మీకు అన్యాయం చేయనివాడు లేదా? అని సూటిగా ప్రశ్నిస్తూ గుండెలవిసెలా శోకిస్తుంది. యుద్ధక్షేత్రంలో పడివున్న తన బిడ్డలను, బంధువులను ఇతర ప్రజాకోటి చచ్చిన ఆ శవాలస్థితి ఏ విధంగావుందో చూస్తున్న గాంధారి చిత్తవృత్తిని తిక్కన ఏవిధంగా తెలియజేశాడో ఇక్కడ గమనించవచ్చు.

ప్రేవులు గండలు పెఱికి పేటాడి యంగదఁగొని మెదళుల గల్చికొనుచు

రాగిలి రక్తంబు ద్రావుచు లోచన గుళికల నొలిచి మ్రింగుచును గుండె

కాయ లాదట మెయిఁ గబళించుచును గ్రొవ్వు దెమలచి నమలుచు నెముక యూట

చవిగొని యానుచుఁ జావకయున్న రూపులు సచ్చుటకుఁ గాఁగఁ బెలుచఁ దన్ని

కొనిన దెఱఁబాయఁ బాఱుచుఁ జెనకి తొడరి కాటులాడుచు నున్న సృగాలములును

గాకములు రాపులుఁగులును గ్రద్దలును వృకంబులును మానసము వికలంబు సేయ” (2-9)

నిజంగా ఒక తల్లిగా, స్త్రీగా ఆ సన్నివేశాన్ని చూస్తున్న గాంధారి ఎంతటి నరకయాతన అనుభవించి ఉంటుందో ఈ పద్యం తెలియజేస్తుంది. ఆ సందర్భం చదువుతూ తిక్కన నాటకీయ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనకే ఆ ఊహలు అంతటి జుగుప్సను కలిగిస్తుంటే, ఎదురుగా కళ్ళముందు కదలాడుతున్న ఆ దృశ్యాన్ని చూస్తున్న కన్నతల్లి మానసికస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆకలితో నకనకలాడుతున్న తోడేళ్ళు, కాకులు, రాబందులు, గద్దలు, నక్కలు ఒకదానిపై ఒకటి కొట్లాడుతూ పేగుల్ని, కండల్ని ఊడపీకి ముక్కలుగా చేసుకుని తింటూ, పుర్రెలు పగలగొట్టి మెదళ్ళను పీక్కొని ఆసక్తితో రక్తం తాగుతూ, కనుగుడ్లని పొడుచుకుంటూ మింగుతూ, గుండెకాయల్ని ఎంతో ఆసక్తిగా పీక్కు తింటూ, ఎముకల్లోని మూలుగును త్వరత్వరగా జుర్రుతూ, ఇంకా కొన ఊపిరితో తన్నుకుంటున్న శవాలపై ఎక్కి ప్రాణంపోయేలా తొక్కుతూ కలబడుతున్న ఆ జంతువుల్ని చూస్తూ గాంధారి మనస్సు ఎంతగానో కలచివేస్తుంది. బతికివున్న అంతఃపురంలో సరదాగా ప్రియురాళ్ళు ధరించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసివేస్తున్నపుడు ప్రకాశించే రాజులు ఆ నగలునే గద్దలు ఎంతో క్రూరంగా లాగేస్తుంటే చలనంలేకుండా పడివున్నారు. వారు ప్రాణాలు వదిలినా కూడా వారి చేతులు కత్తులు కటారుల్ని వదలకపోవటం చూస్తుంటే వీరంతా నిజంగా బతికివున్న వారిలాగే ఉన్నారని చెప్పటం ఆమె బాధని వెళ్లడిస్తోంది. కొంతమంది భార్యలు, బిడ్దలు, తల్లులు వచ్చి తమ వారి తలలు మొండేలు వేరైపోవటాన్ని చూచి, వాటిని వెతుకుతూ, దొరికిన తలల్ని మొండేలతో చేర్చి తమవారిని పోల్చుకుంటూ శోకించటాన్ని చూచి గాంధారి ఎంతగానో కృంగిపోయింది.

ఇలా ఒక్కొక్క శవాల గుట్టల్ని దాటుకుంటూ వస్తున్న గాంధారికి దుర్యోధనుని శవం కనిపించగానే ఒక్కసారిగా ఆమె మూర్ఛపోయి, మొదలు నరికిన చెట్టులాగా కిందపడిపోయింది. మళ్ళీ తేరుకొని విశాలమైన కుమారుడి రొమ్ముమీద ఆగకుండా కన్నీరు కారుస్తూ వాలిపోయింది. ఆమె దీనావస్థ ఎలావుందంటే దుర్యోధనుడితో ‘నాయనా రాజులలో గొప్పవాడిగా పేరుపొందావు. కౌరవులందరికన్నా మిన్నా అనిపించుకున్నావు. నాయనా ఎంతో గొప్పదైన నీ శరీరం ఇలా నికృష్టమైన స్థితిలో ఎక్కడొ నేలమీద పడివుండటం ఎంత అనుఆయమయ్యా? నీ తల్లి దగ్గరికి వస్తే లేచి నమస్కరించి తగిన ఉపచారాలు చేయకుండా ఎవరో తెలియనట్లు కదలకుండా మౌనంగా ఉన్నావే నీకిది న్యాయమా? అని రోధిస్తూ దుర్యోధనుడి వైభవాన్ని గుర్తుచేసుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కృష్ణుడితో చూడవయ్యా నా కొడుకుని అని చూపుతూ యుద్ధానికి బయలుదేరే సందర్భంలో ఆశీర్వదించమన్న నా కొడుకుతో నువ్వే గెలుస్తావు నాయనా అనలేదు, ధర్మం గెలుస్తుందని అన్నాను. అప్పుడు కూడా నా కొడుకు మారుపలుకకుండా ఉన్నాడు. పదకొండక్షౌహిణుల బలమున్న ఈ రారాజు చివరికి ఒంటరిగా పోరాడి ఇలా వీరమరణం పొంది స్వర్గానికి వెళ్ళాడయ్యా అంటుంది. దుర్యోధనుడి భార్య అయిన భానుమతి శోకాన్ని చూచి ఆమె భవిష్యత్తును తలచుకొని విలపించింది. తన నూరుగురు కొడుకుల శవాలపై పడివున్న కోడళ్ళవైపు చూచి ఈ లేత ఇల్లాళ్ళ పరిస్థితి ఏమిటి? అని ఆమె శోకం రెట్టింపయింది. తన గర్భశోకాన్ని ప్రకటించింది.

గాంధారి ఇంకా వికర్ణుడు దురావస్థను చూచి దుఃఖించింది. లేతవయసులో ఘోరమరణాన్ని పొందిన ముక్కుపచ్చలారని అభిమన్యుడిని చూచి దుఃఖించింది. నిత్యం రారాజుకు వెన్నంటి ఉంటూ, కొండంత ధైర్యాన్నిచ్చినవాడు, డైర్యమే సంపదగా కలిగినవాడు, దానవీరంలో సుప్రసిద్ధుడు, సహజ కుండలుడైన కర్ణుడి శవాన్ని చూచి గాంధారి మిక్కిలి విలపించింది. భీష్మ, ద్రోణ, సైంధవాది ప్రముఖుల దేహాలను చూచి వారి రాజసాన్ని తలచుకొని రోధించింది. ఈ దుస్థితికి కారకులైన భీమ, అర్జున, సాత్యక, శకుని మొదలైన వారిని నిందించింది. ప్రధాన కారకుడైన శ్రీకృష్ణున్ని శపించింది.

ద్రౌపది దుఃఖం: గాంధారిలాగే ఒక తల్లిగా తన బిడ్డల్ని కోల్పోయిన ధీనురాలు ద్రౌపది. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధమంతా జరిగింది ద్రౌపదివల్లనే. తనకు జరిగిన అవమానానికి ప్రతిగా కౌరవవంశం నాశనమవటానికి కారణమయింది. అలాంటి ద్రౌపది కూడా తన కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత అనుభవిస్తుంది.

   ఆ సమయంబున నప్పాండుభూపాలాపత్నికి శోకాగ్ని ప్రజ్వరిల్లఁ

  దత్సమీపమునకు ద్రౌపది విన్ననిమోముపైఁ గన్నీరు ముసుఁగువడఁగఁ

  బదముల నట దొట్రుపాటు వాటిల్లంగ దైన్య మాకారంబు దాల్చినట్టి

  తెఱఁగునఁ జనుదెంచి ‘దేవి! సౌభద్రాదులైన నీ మనుమ లెం దరిగి? రెంత

  యేనిఁ గాలంబు నినుఁ జూడ రిప్పు డిచటికేలరా?’ రంచు నడుగుల మ్రోల నేల

  వ్రాలె వికలాంగియై తెంచివైవ నెండ దాఁకి వందిత తీఁగ చందంబు దోఁప” (1-181)

శోకాగ్నిలో మునిగివున్న కుంతీదేవి దగ్గరకు వచ్చిన ద్రౌపది పాలిపోయిన ముఖంమీద కన్నీరు తెరలుకట్టగా, తడబడుతున్న నడకతో జీవచ్ఛవంలాగా దైన్యం ఆకారం దాల్చిన విధంగా వచ్చి ‘అమ్మా! అభిమన్యుడు మొదలైన నీ మనవళ్ళు ఎక్కడా కవిపించరే. ఎక్కడికి వెళ్ళారు? ఇన్ని రోజులైనా నిన్ను చూడటానికి రా రెందుకు? అని పిచ్చిదానిలాగే మాట్లాడుతూ కుంతి పాదాల సమీపంలో కుప్పకూలుపోయింది. కొమ్మనుండి తెంచివేయగా పైగా ఎండ తాకి వాడిపోయి నిర్జీవమైపోయిన తీగలాగే ఆ ద్రౌపది కనిపించింది1. ఇలా నేలమీద పడి మరీ ద్రౌపది ఏడుస్తుంది.

8. కర్ణుని భార్య సుప్రియ రోదన:

భారతంలో ఏ స్త్రీకిలేని నరకయాతన ఈమెకి కలిగింది. ఈమె కర్ణుని రెండవభార్య. దుర్యోధనుని భార్యయైన భానుమతికి స్నేహితురాలు. కర్ణునికి ఈమెకి పుట్టినవారే వృషశేనుడు, సుశేనుడు. ఈమె శోకాన్ని ప్రత్యేకంగా ఎందుకు పేర్కొన్నానంటే ఏకకాలంలో అటు భర్తయైన కర్ణుణ్ణి, ఇటు కొడుకైన వృషసేనుణ్ణి పోగొట్టుకుని రోదిస్తున్న స్త్రీ. ఈమెను తిక్కనగారు దుఃఖమే ఆకారం పొందినట్లుగా ఉన్నదని వర్ణించాడు. కర్ణుని శవం దగ్గర నేలమీదపడి బొర్లాడుతూ రోదిస్తున్నది. పరశురాముడి శాపం, బ్రాహ్మణుని శాపం నీ ప్రాణాలను తీసిందని విలపిస్తుంది.

కాకులును గ్రద్దలును దిన్నఁ గడును ద్రెస్సి యపరపక్షచతుర్దశి యమృతకరుని

కరణి నొప్పెడు కర్ణుమొగంబుమీఁద వనిత యందంద మోపెడుఁ దన మొగంబు” (2-93)

కర్ణుని ముఖం కాకులు, గద్దలు తినివేయగా తెగి చివికిపోయిన కృష్ణపక్షంలోని చతుర్దశినాటి చంద్రుడిలా కాంతివిహీనంగా ఉన్నదట. అలాంటి ముఖంమీద తన ముఖాన్ని పదేపదే ఉంచుతూ ఏడుస్తున్నదట కర్ణుని భార్య.

9. కుంతీశోకం:

కుంతీశోకం కూడా ప్రత్యేకంగా పేర్కొనదగినది. ఎందుకంటే కర్ణుడికి తల్లియైన సంగతి తనలోనే దాచుకొని బయటకు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉండి, కర్ణుడికి జరిగిన అవమానాలను చూచి కూడా తన కన్నకొడుకని చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయింది. అన్నదములైన తన కొడుకులే కలహించుకొని చనిపోతున్నపుడు కూడా ఏమి మాట్లాడలేకపోయిన నిర్భాగ్యురాలు. చివరికి కర్ణుడి శవం వద్దగానీ కర్ణుడు తన కొడుకేనని మిగిలిన కొడుకులైన పాండవులకు చెప్పలేకపోయింది. ఆదీనురాలి శోకాన్ని ఇక్కడ గమనించవచ్చు.

        “వినుము! కౌరవ కోటికిం దన విల్లు పెట్టనికోటగా

        నని యొనర్చి, భవద్బలంబుల నన్నిటిన్ మిము నేవురం

        దనిపి, యంబరచాఋలెల్లను దన్ను మెచ్చి నుతింపఁ బా

        ర్థునిమహాస్త్రము బల్విడిం దలఁ ద్రుంపఁ గూలిన కర్ణునిన్” (2-175)

ఇక్కడ కుంతి కన్నకొడుకుని పోగొట్టుకొని ఎంతో దుఃఖంతో తన మిగిలిన కొడుకులకులైన పాండవులకు కర్ణుడు తనకు పుట్టిన మొదటి కొడుకు మీ అందరకు అన్నని పరిచయం చేస్తున్న సందర్భం. ఈ కర్ణుడూ కౌరవ సమూహానికంతటికీ పెట్తనికోటవంటివాడు. మీ సైన్యానికీ, మీ అయిదుగురికి యుద్ధంలో తృప్తిని కలిగించినవాడు. తన పరాక్రమంతో దేవతల ప్రశంసలు సైతం అందుకున్నవాడు. చివరికి తన తమ్ముడైన అర్జునుడి వాడి బాణాలకు బలయ్యాడని శోకిస్తూ ఆతని చరిత్రని తెలియజేస్తుంది.

10. ముగింపు:

మరణం అందరికీ సమానమే. బతికున్నప్పుడు మాత్రమే ఆ దేహాలకు గౌరవవంతమైన, సౌకర్యవంతమైన జీవితం. అయితే ఇక్కడ గమనించవలసిన సత్యం చనిపోయినవారికే స్వర్గసౌఖ్యాలు, బతికున్న వారికి వారి తాలూకు మిగిలిన జ్ఞాపకాల యాతనలు. పురుషుడు యుద్ధం చేసి వీరమరణం పొందితే ఆతని జీవితంతో ముడిపడివున్న బంధాలు మాత్రం ఒంటరిగా బతుకును వెళ్లదీయవలసిన పరిస్థితి. ఇక్కడ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన ప్రతి పురుషుని వెనుకున్న స్త్రీకి యుద్ధం మిగిల్చింది శోకమే.

అయితే పైన పేర్కొన్న స్త్రీలలో ఒక్కొక్కరి శోకం వెనుక ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది. ఈ యుద్ధంలో కౌరవుల భార్యలు తమ చిన్నవయసులో భర్తల్ని పోగొట్టుకొని దిక్కులేనివారిగా రోదిస్తున్నారు. గాంధారి తన నూరుగురు కొడుకుల్ని కోల్పోయి ఆసరాని కోల్పోయింది. ద్రౌపది యుద్ధానికి కారణమై యుద్ధంలో తన భర్తలు విజయం సాధించినా కొడుకుల్ని పోగొట్టుకొని కడుపుకోతకు గురికాకతప్పలేదు. కర్ణుడి భార్యయైన సుప్రియ భర్తని, కొడుకుని ఇద్దరినీ ఒకేసారి కోల్పోయి శోకంతో నేలకూలింది. కుంతి తన కన్నకొడుకులే యుద్ధంలో తలపడి కర్ణుడు మరణించటాన్ని చూచి దుఃఖం ఆపుకోలేకపోయింది. చివరికి ఈ యుద్ధం లక్షలాదిమంది స్త్రీలకి మిగిల్చిన నష్టం జీవితకాలశోకం.

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కోదండరామరెడ్డి, మరుపూరు. తిక్కన సారస్వతమూర్తి. వెల్ డన్ ప్రెస్, మద్రాస్, 1979
  2. గోదావరిబాయి, సంధ్యావందనం. భారతము-రాజనీతివిశేషాలు. శ్రీతిరుమల ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, అనంతపురం, 1988
  3. దామోదర నాయుడు, కోసూరి(సం.). కవిత్రయ భారతం - ప్రతిపర్వ వివేచనం (ఆచార్య గల్లా చలపతి అభినందన గ్రంథం), సి.ఎన్.ప్రింటర్స్, తిరుపతి, 2011
  4. రఘునాథశర్మ, శలాక. భారతం- ధ్వని దర్శనము, ఆనందవల్లీ గ్రంథమాల, అనంతపురం, 2000
  5. రామచంద్రరాజు, కామరాజుగడ్డ. మహాభారతకథలు (సం-౩), సునీత ఆర్ట్ ప్రింటర్స్, హైద్రాబాద్, 1991
  6. లక్ష్మీకాంతం, పింగళి. ఆంధ్ర సాహిత్యచరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైద్రాబాద్, 1991
  7. లక్ష్మీనారాయణరావు, భూపతి. భారతము తిక్కన రచన. అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి, 1949
  8. వేంకట రామకోటిశాస్త్రి, కేతవరపు. తిక్కన కావ్యశిల్పము. విద్యారణ్యపురి, వరంగల్, 1973
  9. వేంకటేశ్వర్లు, బూదాటి. తెలుగుసాహిత్యచరిత్ర. హిమకర్ పబ్లికేషన్స్, హైద్రాబాద్, 2014
  10. సుబ్రహ్మణ్యం, జి.వి. (సంపా.). కవిత్రయవిరచిత శ్రీమదాంధ్రమహాభారతం, తితిదే, తిరుపతి, 2013

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]