AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. తెలుగు ప్రాంతాలలో ఆధునిక విద్య: వికాసం
డా. జి. తిరుమల వాసుదేవరావు
ఉపన్యాసకుడు & చరిత్రశాఖ అధ్యక్షుడు
ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల (A),
నగరి, చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలలో విద్యావ్యవస్థది కీలక స్థానంగా గుర్తిస్తారు. ఆధునిక విద్యావ్యవస్థ తెలుగు ప్రాంతాలలో వివిధ రంగాలపై బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఆధునిక విద్య తెలుగు ప్రాంతాలలో విస్తృతమైన సామాజిక మార్పులకు కారకంగా నిలిచింది.ఈ ప్రభావాల గురించి విస్తృతమైన చర్చలు, రచనలు జరిగాయి. తెలుగు ప్రాంతాలలో ఆధునిక విద్య వ్యాప్తి యూరోపియన్ రాకతో ప్రారంభమైనది. ఈ కృషిలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు, క్రైస్తవ మిషనరీలు మరియు స్థానిక దాతలు కీలక పాత్ర పోషించారు.ఈ ఆధునిక విద్య వ్యాప్తిలో కొన్ని పరిమితులు ఉన్న, విస్తృతమైన సుగుణాలు ఉన్నాయి.ఈ పరిశోధన వ్యాసం కొరకు వివిధ ప్రామాణిక గ్రంథాలను మరియు పరిశోధన వ్యాసాలలో ని కీలక విషయాలను, అంశాలను క్రోడీకరించి రేఖామాత్రంగా సృజించటం జరిగింది.
Keywords: ఆధునిక విద్యా , బెంజిమన్ షుల్జ్, సర్ థామస్ మన్రో, లూథరన్ మిషన్, స్టానిస్లాస్ స్వామికన్నుపిళ్లై, మహారాజా విజయ రామ గజపతి, సామినేని ముద్దు నరసింహనాయుడు.
1.ఉపోద్ఘాతం:
మానవ సమాజాలలో ఒక తరం వారు తెలుసుకొని, సమపాదించుకున్న విషయ పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను భావితరాలకు అందించడానికి రూపొందించుకున్న శక్తివంతమైన సాధనమే విద్యావ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ ద్వారా మిగిలిన జంతు ప్రపంచం పై మానవులు తాము ఆర్జించుకున్న ఈ విషయ జ్ఞానం మరియు నైపుణ్యాల ద్వారా తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు.
అయితే వివిధ సమాజాల మధ్య ఈ విద్యలోని ప్రాధాన్యతా అంశాలు మారుతూ ఉంటాయి. ప్రాచీన, మధ్యయుగాలలో మతనమ్మకాలకు అనుగుణంగా విద్యా లక్ష్యాలను రూపొందించుకునే వాళ్లు. ఆధునిక యుగ ఆరంభంలో పాక్షత్య దేశాలలోని విద్యా విధానం శాస్త్రీయతను సంతరించుకుని ప్రామాణికంగా రూపొందింది. భారతదేశంలో వర్తకం కొరకు ఈ ప్రాంతాలలో ప్రవేశించిన ఇంగ్లీషు వలస పాలకులు తమ ఆధునిక విద్యా విధానాన్ని తెలుగు ప్రాంతాలకు పరిచయం చేశారు.
2. విద్యాభివృద్ధి – నేపథ్యం:
యూరప్ లో ఆధునిక యుగ ప్రారంభంలో మేధావి వర్గంలో బావాత్మకమైన విప్లవం ఏర్పడి శాస్త్రీయ ఆలోచనా ధోరణి వ్యాపించింది[1]. దీనితో క్రైస్తవ మత ఆచార వ్యవహారాలపై విమర్శ బయలుదేరి మత సంస్కరణోద్యమం ప్రారంభమైనది. క్రైస్తవ మతం వివిధ శాఖలుగా చీలి బలహీన పడటంతో, ఈ శాఖలు తమ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి పోటీపడి ప్రయత్నించాయి. వీటి ఫలితంగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో క్రైస్తవ మత ప్రచారం ప్రారంభమైనది. వివిధ యూరోపియన్ దేశాలకు మరియు అమెరికా దేశానికి చెందిన క్రైస్తవ మిషనరీలు ఈ కృషిలో భాగస్వాములయ్యారు[2]. సాహసవంతులైన యువకులు మతపరమైన భావాలతో ప్రేరేపించబడి సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో ఇబ్బందులు అధిగమించి తమ మత ప్రచార కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ కృషిలో భాగంగా వారు స్థానిక భాషలను అధ్యయనం చేయడం, ముద్రణ కొరకు లిపి సిద్ధపరచడం, బోధన సంస్థలను, వైద్యాలయాలను నిర్వహించడం తో పాటుగా స్థానిక బాషలలొని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం లాంటి అభ్యుదయ కార్యకలాపాలను కూడా వీరు తమ మత ప్రచారంతో పాటుగా నిర్వహించారు.
కల్నల్ కోలిన్ మెకెంజీ, అలెగ్జాండర్ డంకన్ కాంప్‌బెల్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మొదలగు ప్రభుత్వ ఉద్యోగులు మరియు మత ప్రచారకులు బెంజిమన్ షుల్జ్ ,ఎడ్వర్డ్ ప్రిట్చెట్, జాన్ గోర్డాన్ మొదలగువారు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలను తెలుగు ప్రజలు కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకొని వారి పనుల నుండి నిరంతరం స్ఫూర్తి పొందుతూ ఉంటారు[3].
ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభించక ముందు ఈ ప్రాంతంలో స్థానిక సంప్రదాయ విద్యా విధానం అమలులో ఉండేది. ఈ సంప్రదాయ భారతీయ విద్యా విధానంలో మత పరమైన సాహిత్యంతో పాటుగా చదవడం, రాయడం మరియు ప్రాథమిక గణితం బోధించేవాళ్లు[4]. బ్రాహ్మణులకు, వైశ్యులకు పరిమితమైన ఈ విద్య ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం కొనసాగేది. బ్రాహ్మణ బాలులకు మాత్రమే ఉన్నత విద్య అవకాశం లభించేది. కుల ప్రాతిపదికన ఏర్పడిన వృత్తి సంఘాలు వారి వృత్తులలోవారి కులం వారికి శిక్షణ ఇస్తుండేవి. మరొక వైపున మహమ్మదీయులు తమ దేవునిపై నమ్మకం ప్రాతిపదికన విద్యార్థులకు విద్యా అవకాశం కల్పించారు. వీరు మక్తబ్ లు, మదరసాలు అనే విద్యా సంస్థలలో వారి మత గ్రంథమైన ఖురాన్ ను అధ్యయనం చేయడంతో పాటుగా లౌకిక విద్యలు నేర్పేవాళ్లు. వీరి విద్యా బోధన అరబ్బీ భాషలో కొనసాగేది.
ఈ సంప్రదాయ విద్య విధానంలో క్రింది కులాల వాళ్లకు, మహిళలకు విద్య నిరాకరించబడింది. వర్తమాన పరిస్థితుల మార్పులకు అనుకూలంగా లేకపోవడం, అంతర్గతమైన విమర్శ, దిద్దు బాటు లేకపోవడం, నూతన ఆలోచనలకు, సృజనాత్మకతకు చోటు లేకపోవడం మొదలగు కారణాల వలన సంప్రదాయ విద్యా విధానం ఆధునిక విద్యతో పోటీ పడలేక అంతరించిపోయింది.
3. ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక విద్యాభివృద్ధి:
ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక విద్యాభివృద్ధి మరియు విద్య వ్యాప్తికి ప్రధానంగా మూడు వర్గాలు కృషి చేశాయి. అవి (A) క్రైస్తవ మత ప్రచారకులు, (B) ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు (C) ఈ మార్పులకు సానుకూలంగానూ, ప్రతికూలంగానూ స్పందించిన కొంతమంది స్థానిక దాతలు.
3.1 ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగుల విద్యాభివృద్ధి కృషి:
ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాల మీద మాత్రమే శ్రద్ధ చూపడంతో విద్య విషయంలో క్రైస్తవ మత సంస్థల ప్రాధాన్యతను మనం గమనించగలం. అయితే కాలక్రమంలో విద్యా సంస్థల నిర్వహణ ప్రాధాన్యతను గుర్తించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసులోని జార్జికోటలో కంపెనీలో పని చేసే యురోపియన్, భారతీయ ఉద్యోగుల పిల్లల కొరకు 1673 ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇందులో భాషా మాధ్యమంగా ప్రోచ్ గ్రీసు భాష రూపాంతరమైన “పోర్చుగీసు పటోస్” ఉండేది[5]. ఈ పాఠశాల నిర్వహణ అధికారాన్ని కంపెనీ డైరెక్టర్లు జార్జ్ కోట మతాధికారికి అప్పగించడం జరిగింది.
'వైట్ ఫీల్డ్' అనే మతాధికారి 1661 ప్రాంతంలో జార్జ్ కోటలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పరిచారు. భారతదేశంలో పుస్తకపఠనాన్ని ప్రోత్సహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు పుస్తకాలపై ఓడ సుంకాన్ని తీసివేయడంతో పుస్తకాలు యూరప్ నుండి భారతదేశ నికి రావడం పెరిగింది[6].
మొదట యూరోపియన్లు భారతీయభాషలను రోమన్ లిపిలో ముద్రించేవాళ్ల. కాలక్రమంలో భారతీయ లిపులను రూపొందించి, ఉపయోగించడం ప్రారంభించారు.1618 లొ డెన్మార్క్ రాజు ప్రోత్సాహంతో హాలే నగరంలోని “ఆగస్టస్ హెర్మన్ ఫ్రాంకే” వద్ద వద్ద శిక్షణ పొందిన “బార్తోలోమస్ జీజెన్బాల్గ్”, “హెన్రీ ప్లూటార్క్” మొదలగు జర్మనీ మిషనరీలను భారతదేశంలోని తమ(హాలండ్) వర్తక స్థావరం అయిన ట్రాన్‌క్విబార్ (మైలాడుతురై జిల్లా, తమిళనాడు)కు వచ్చి, బైబిల్ ప్రచురణ కొరకు భారతీయ లిపులను అభివృద్ధి పరచమన్నాడు.
మరొకవైపున 1699లో లండన్ లో స్థాపించబడిన “సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్” అనే సంస్థ భారతీయ భాషలలో ప్రచురణకు అనుకూలంగా లిపులను రూపొందించడంలో విశేష కృషి జరిపింది. 1713 లో ట్రాన్‌క్విబార్ లోని మిషనరీలకు ముద్రణ యంత్రం, తమిళ అక్షరాలు క్రైస్తవ విజ్ఞాన సమితి అందించింది. వీరు వీటి సహాయంతో తమిళ పుస్తకాన్ని ముద్రించారు. అదేవిధంగా ఈ కేంద్రంలో శిక్షణ పొందిన “బెంజిమన్ షుల్జ్” మద్రాసు ప్రాంతానికి వచ్చి తెలుగు భాషను నేర్చుకొని జర్మనీకి తిరిగి వెళ్లి అక్కడ తెలుగు భాషలో మొదటి ప్రచురణ పుస్తకమైన బైబిల్ ను ముద్రించారు[7].
భారతదేశ పరిపాలన బాధ్యతలను చేపట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు ఈ దేశంలో విద్య నిర్వహణ బాధ్యతలు కూడా తాము నిర్వహించాలి అన్న విషయాన్ని1813 లో గుర్తించి చార్టర్ చట్టం ద్వారా కొంతడబ్బును కేటాయించారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రాంతాలలో అమలవుతున్న దేశీయవిద్యావ్యవస్థ గురించి వాస్తవ సమాచారాన్ని తెలుసుకొనడానికి మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో 1822 జూన్ 25వ తేదీన జిల్లా కలెక్టర్లకు వారి జిల్లాలో విద్యా పరిస్థితుల గురించి నివేదిక పంపమని అడిగాడు[8]. 1824లో కలెక్టర్లు ఈ నివేదికలు పంపారు. రిపోర్టులు ప్రకారం మద్రాసు రాష్ట్రంలో1,249 పాఠశాలలు ఉన్నాయని వాటిలో 1,88,650 మంది చదువుతున్నారని తెలిసింది. వీరిలో 1,84,110 మంది బాలులు, 4,540 మంది బాలికలు చదువుతున్నట్లు తెలుస్తున్నది.
విద్యా విషయాలపై ప్రత్యేక ఆసక్తి గల బళ్లారి కలెక్టర్ క్యాంపు బెల్ తన నివేదికను సవివరంగా రూపొందించి సమర్పిస్తూ, ఈ ప్రాంతంలోని పేదరికం కారణంగా విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, ప్రతి 1000 మంది లో ఏడు మంది మాత్రమే విద్యార్థులు గా ఉన్నారని, ఈ విద్యార్థులు కూడా పద్యాలను తప్పులు లేకుండా చదవగలరే గాని, ఆ పద్యాలకు అర్థం కూడా చెప్పలేరని పేర్కొన్నాడు [9].
కలెక్టర్ల నివేదికను పరిశీలించిన థామస్ మండ్రో ఈ విషయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ స్థానికులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలలో జోక్యం చేసుకోకూడదని, ఈ విద్యాసంస్థలకు గతంలో కేటాయించబడిన భూముల గ్రాంట్ లు కొనసాగించాలని పేర్కొంటూ, ఈ సంప్రదాయ విద్య సంస్థలకు సమాంతరంగా ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు. తీవ్రమైన చర్చల అనంతరం కలెక్టర్ల రిపోర్టులను పరిశీలించిన మన్రో ఒక విద్యా ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రణాళిక ప్రకారం మద్రాసులో ఒక ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని మరియు ప్రతి తహసిల్ పరిధిలోను (జిల్లా పరిధిలో ఉండే ఉప పరిపాలన విభాగం) ఒక స్కూలును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాడు. ఈ విద్యా పథకంలో భాగంగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ ఏర్పడింది. ఈ నూతన పాఠశాలలో మాతృభాష తో పాటు ఇంగ్లీష్ భాష కూడా నేర్పించబడింది. విద్యా విషయాలపై మెకాలే తన మినిట్స్ రూపొందించడం, వాటికి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అంగీకారం తెలపడంతో భారత దేశంలో విద్యాసంస్థల పురోగతిలో లో వేగం పెరిగింది.
థామస్ మండ్రో మద్రాస్ గవర్నర్ గా ఉన్నప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో 300 తాసిల్దారి పాఠశాలలు, 40 కలెక్టరేట్ పాఠశాలలు ఏర్పాటు చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి నిధులు సమకూర్చాడు. సర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో 1820లో మెడ్రాస్ స్కూల్ బుక్స్ సొసైటీ ఏర్పడింది. తెలుగు ప్రాంతాల నుండి ఒంగోలుకు చెందిన వెన్నెలకంటి సుబ్బారావు ఇందులో సభ్యుడుగా ఉన్నాడు. కంపెనీ అధికారులు ఆంగ్ల భాషలోని ఉపయుక్త గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించాలి అని ప్రయత్నించినా ఈ దశగా పెద్దగా ఫలితాలు రాలేదు. అయితే 1839 లో ప్రభుత్వం ఈ తాసిల్దారి, కలెక్టరేట్ పాఠశాలలపై ఒక నివేదిక విడుదల చేస్తూ ఇవి అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలం అయ్యాయని ప్రకటించింది[10].
లార్డ్ మౌంట్ స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ రూపొందించిన విద్యా ప్రణాళికను అనుసరించి మద్రాస్ ప్రెసిడెంట్ లో భాషా ప్రాతిపదికన నాలుగు [తమిళం- తిరుచినాపల్లి, తెలుగు- మచిలీపట్నం, కన్నడ- బళ్ళారి, కేరళ – కాలికట్] పాఠశాలలను ఏర్పాటు చేశారు. మద్రాసులో జార్జ్ నార్తన్ (అడ్వకేట్ జనరల్) అధ్యక్షతన ఒక యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేయబడింది. 1841 ఏప్రిల్ 14వ తేదీన ఈ మద్రాస్ యూనివర్సిటీ అనే సంస్థ ఏర్పడింది. అయితే 1855లొ దీని పేరు “ప్రెసి డెన్సి కాలేజీ” గా మార్చబడింది.
రాజమండ్రి డివిజన్ కు సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన జార్జ్ నోబుల్ టేలర్ 1853లో ప్రయోగాత్మకంగా స్థానికుల నుండి విరాళాలు సేకరించి వాటితో రేట్ పాఠశాలలో నిర్వహించాడు[11]. నర్సాపూర్, పాలకొల్లు, మొదలైన ప్రాంతాలలో ఏర్పాటుచేసిన ఇంగ్లీషు పాఠశాలలు (రేట్ పాఠశాల)సమర్థవంతంగా పనిచేస్తూ పరిసర గ్రామాల ప్రజలను ఆకర్షించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పరిసర గ్రామాల వాళ్లు కూడా ఈ విధమైన విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రయత్నించారు. గోదావరి జిల్లా రేట్ పాఠశాలలను టైలర్ విద్యా విధానం అని కూడా పిలుస్తారు. పాఠశాల విద్యారంగంలో ఈ రేట్ పాఠశాలల ద్వారా గోదావరి ప్రాంతంలో గొప్ప మార్పు కనపడింది.
ప్రజలు తమంతకు తామే విరాళాలు ఫోగు చేసి గోదావరి ప్రాంతంలో రేటు పాఠశాల లను ఏర్పాటు చేసి నూతన ఒరవడికి కారకులైనారు. బ్రాహ్మణనేతర కులాలైన రెడ్డి, నాయుడు మొదలైన వ్యవసాయ కులాల వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రేట్ పాఠశాల కు తమ సహాయ సహకారాలు అందించారు. తమ కులాలలో బాల, బాలికలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలని, సామాజికంగా ఎదగాలన్న ఆకాంక్షను ఈ విధంగా వీరు వెల్లడి చేశారు.
1852లో గుంటూరు జిల్లా కలెక్టర్ పెండర్గాస్ట్ కృషి వలన కాకినాడలో ప్రారంభమైన మిడిల్ స్కూల్ అభివృద్ధి చెంది పిఠాపురం రాజువారి ప్రభుత్వ కళాశాల గా మారింది. అదేవిధంగా 1853 లో జిల్లా స్కూలుగా రాజమండ్రిలో ప్రారంభమైన విద్యా సంస్థ క్రమంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో బైబిల్ ను పాఠ్యాంశంగా చేర్చాలని మార్పిస్ ఆఫ్ ట్రిడిల్ చేసిన ప్రతిపాదనను ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరస్కరించి మతపరమైన తటస్థతను పాటించారు.
ధర్మశాస్త్రాల ప్రకారం మహిళలకు లలిత కళలు మాత్రమే అభ్యసించడానికి అనుమతులు ఉన్నాయి. ఉన్నత కుటుంబాలలోని మహిళలకు మాత్రమే పరిమిత స్థాయిలో విద్య లభ్యమయ్యేది. చార్లెస్ ఉడ్స్ డిస్పాచ్ భారతదేశంలో మహిళలలో విద్య వెనుకబాటు గుర్తించి, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో మహిళా విద్యలో నూతన అభ్యుదయం ప్రారంభమైనది[12]. మహిళలు మరియు వివక్షకు గురి అయ్యే వర్గాల విద్యాభివృద్ధి, మరియు పరిశోధనల లొ ప్రఖ్యాతిగాంచిన మేరీ కార్పెంటర్ అను మహిళా విద్యావేత్తను భారతదేశానికి ఆహ్వానించి, మహిళల విద్యాభివృద్ధి కొరకు ఆమె సూచనలను ప్రభుత్వం స్వీకరించింది[13]. 1868 నాటి కి మద్రాసు రాష్ట్రంలోని పాఠశాలల్లో బాలికల 3.17%గా ఉండడం మనం గమనించవచ్చును.
విద్యారంగంలో తక్కువ ప్రాతినిధ్యం గల పంచమ కులాలలొ విద్యను వ్యాపింప చేయడానికి 1880 ప్రాంతం నుండి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. ఇందులో భాగంగా ఉపకార వేతనాలను, పాఠశాల ఫీజులొ ప్రత్యేక తగ్గింపులు అమలులోకి వచ్చాయి[14]. అదేవిధంగా ఒక ప్రత్యేక కమిషనర్ ఇందు కొరకు నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడిన భారతీయ సివిల్ సర్వీస్ లోని సీనియర్ అధికారి అయిన జి. ఎఫ్. పాడిసన్ మద్రాసు ప్రొవెన్స్ లో పంచమ కులాల లో విద్యాభివృద్ధికి అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాడు.పంచమ కులాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇతను అణిచివేయబడిన కులాల సంరక్షకుడిగా కీర్తించబడ్డాడు[15].
3.2 క్రైస్తవ మత ప్రచారకుల విద్యాభివృద్ధి కృషి:
మొదటలో క్రైస్తవ మిషనరీల చేత నిర్వహించబడే విద్యాసంస్థల నిర్వహణకు క్రైస్తవ మత ఆచార్యులు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే కాలక్రమంలో క్రైస్తవ మత వ్యాప్తి కొరకు విద్యాసంస్థలు, వైద్య సంస్థలు అత్యవసరం అన్న విషయాన్ని వీరు గుర్తించారు[16]. దైవం గురించి సత్యం గ్రహించడానికి, క్రైస్తవ మత సిద్ధాంతాల ఆధిపత్యాన్ని సైద్ధాంతికంగా అంగీకరించడానికి ఆధునిక విద్యను ఒక ప్రభావశీల సాధనంగా ఈ మిషనరీలు ఉపయోగించడం జరిగింది[17].
1715 లో సెయింట్ మేరీ స్కూల్ ను మద్రాసులో ప్రొటెస్టెంట్ విద్యార్థుల కొరకు నెలకొల్పారు. అదేవిధంగా భారతీయ క్రైస్తవ విద్యార్థుల కొరకు 1715 లో ఒక పాఠశాలను ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ప్రాంతీయ భాషలలో పాఠశాలలను ఏర్పాటు చేసి మతాంతీకరణలో మంచి ఫలితాలను సాధించాయి. లూథరన్ మిషన్ గుంటూరు ప్రధాన కేంద్రంగా, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ఒంగోలు ప్రధాన కేంద్రంగా, చర్చ్ మిషన్ సొసైటీ హైదరాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించాయి.
ఉత్తరతీరాంతరంలో విశాఖపట్నం నుండి 1805లో లండన్ మిషన్ సొసైటీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ మిషన్ వాళ్లు ఇక్కడ విద్యా వ్యాప్తి కొరకు ఏడు పాఠశాలలను నెలకొల్పి నిర్వహించారు. వీటి పర్యవేక్షణకు జనరల్ సూపరిండెంట్ ఉండేవారు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం పై ఉన్న నిషేధం తొలగడంతో మిషనరీ కార్యకలాపాలు తెలుగు ప్రాంతాలలో ఉధృతమైనాయి[18]. 1835 లో పోస్టర్ గారి భార్య పర్యవేక్షణలో అనాధ బాలికల శరణాలయం 22 మంది బాలికలతో విశాఖపట్నం లో ప్రారంభమైనది. ఇక్కడి బాలల వసతి గృహ నిర్వహణను గార్డెన్ భార్య చూసుకునే వాళ్ళు. తెలుగు ప్రాంతాలలో 1842లో యునైటెడ్ లూథరన్ చర్చ్ మిషన్ చేత గుంటూరులొ స్థాపించబడిన ఆంగ్లో వర్ణ కూలర్ స్కూల్ కాలక్రమంలో మరింతగా అభివృద్ధి చెంది “ఆంధ్ర క్రైస్తవ కళాశాల” గా మారింది[19].
కృష్ణాజిల్లాలో చర్చి మిషన్ సొసైటీ 1841 లో మచిలీపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించి ఉంది కేంబ్రిడ్జి విద్యాలయానికి చెందిన నోబెల్ 1841 లో మచిలీపట్నం చేరుకుని 22 సంవత్సరాలు పాటు తన బోధన వృత్తిని కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1842లో నోబెల్ చేత స్థాపించబడిన పాఠశాల 1898 నాటికి నోబెల్ కళాశాలగా అభివృద్ధి చెందింది. ఏలూరు, విజయవాడ పట్టణాలలో బాలురు పాఠశాలల్లో నెలకొల్పబడ్డాయి.
అమెరికాకు చెందిన లూథరన్ క్రైస్తవ మిషనరీ, హాలండ్ కు చెందిన కేథలిక్ మిషనరీలు గుంటూరు ప్రాంతంలో 1842 నుండి తమ కార్యకలాపాలను ప్రారంభించారు[20]. జర్మనీ కి చెందిన జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ 1842లో బాపట్లకి చేరుకుని తన కృషిని ప్రారంభించాడు ఆపై గుంటూరు లో స్థిరపడి చేరుకుని పాఠశాలలను నిర్వహించాడు. అమెరికన్ సండే స్కూల్ విద్యార్థులు పంపిన విరాళాలతో ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఇక్కడే అభివృద్ధి చెందింది. బాలికల కొరకు కూడా ప్రత్యేక పాఠశాల ఏర్పడింది. యునైటెడ్ లూథరన్ మిషన్ గుంటూరు పరిసరాల్లో 15 ప్రాథమిక 20 ఉన్నత పాఠశాలలో నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేసింది [21].
సొసైటీ ఆఫ్ జీసస్ మేరీ జోసెఫ్ (జె. ఎం. జె) సంస్థ గుంటూరులో 1904లో ఒక వైద్యశాలను ప్రారంభించగా అది అభివృద్ధి చెంది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ గా మారింది. దీనికి అనుబంధంగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ స్కూల్ 1933లో ఏర్పడగా, నర్సింగ్ స్కూలు1947 లో ప్రారంభమయ్యాయి.
గుంటూరులో మహిళల విద్యాభివృద్ధి కొరకు1946లో స్థాపించబడిన సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ రెవరెండ్ సీనియర్ స్టానిస్లాస్ స్వామికన్నుపిళ్లై ఆధ్వర్యంలో బాలికల విద్య కొరకు విశేషంగా కృషి చేసింది[22]. 1840లో జర్మన్ మిషనరీ సొసైటీ రాజమండ్రి కేంతంగా చేసుకొని గోదావరి ప్రాంతంలో తన విద్యాభివృద్ధి కృషిని ప్రారంభించింది ఈ కృషిని లూధరన్ మిషనరీలు కొనసాగించాయి. 1874లో కాకినాడలో బాప్టిస్ట్ మిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించి క్రమంగా కోస్తా ప్రాంతం అంతటా తన కార్యకలాపాలు విస్తరించింది.
ఈ మిషనరీలు రాజమండ్రిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా సామర్లకోట పాలకొల్లు నరసాపూర్ లలో విద్యాసంస్థలను ప్రారంభించినాయి. 1876లో కాకినాడ వద్ద గల జగన్నాధపురం లో బాలికల బోర్డింగ్ పాఠశాల, 1883లో అంకివీడు, తూనీ లో బాలికల పాఠశాలలో ప్రారంభమైనయి.
బాల్య వివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహం మొదలగు మహిళా సమస్యలతో పోల్చితే మహిళాల విద్య పై తెలుగువారిలో అభిప్రాయ భేదాలు తక్కువగా ఉండటంతో ఈ దిశగా కొంత పురోగతి సాధ్యమైనది. మహిళల అభివృద్ధి, ఆ సమాజ అభివృద్ధికి సూచిక అనే ప్రజాభిప్రాయం బలపడింది. మహిళా విద్యలలో ఆర్థిక స్వలంబన అనే అంశం విడదీయరాని భాగంగా మారింది.
1822 లో లండన్ మిషన్ సొసైటీ కడప పట్టణంలో కార్యాలయాన్ని స్థాపించి పరిసర ప్రాంతాలలో విద్యావ్యక్తికి కృషి చేసింది 1836 నాటికి మిషనరీ ఆధ్వర్యంలో కడపలో ఆరు పాఠశాలలు నడపబడేవి ఈ పాఠశాలల్లో 176 మంది విద్యార్థులు చదువుకునేవారు కాలక్రమంలో ఇది మూడు పాఠశాలలుగా కుదిరించబడింది. 1860లో కడపలో ఒక బాలికల పాఠశాల కూడా ప్రారంభించబడింది. చార్లెస్ ఉడ్స్ నివేదిక తర్వాత విద్యాసంస్థలకు ప్రభుత్వ సహకారం పెరగడంతో లండన్ మిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో 25 పాఠశాలలు ఏర్పడ్డాయి. 1913లో జమ్మలమడుగులో క్యాంప్ బెల్ స్మారక పాఠశాల ప్రారంభమైనది.
నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఫ్రీ చర్చి మిషన్, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్లు విద్యాభివృద్ధికి కృషి చేశాయి. మదనపల్లిలో జాకబ్ చాంబర్లీన్ భార్య 1880లో ఒక పాఠశాలను ప్రారంభించారు. ఏడవ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులకు పాఠాలు జరిగేవి. మెట్రిక్ లెసన్ పరీక్ష కొరకు విద్యార్థులను సిద్ధపరిచి మద్రాసు కు పంపే వాళ్లు. విదేశీ మిషనరీ మహిళల బోర్డు అందించిన విరాళంతో చిత్తూరులో ఒక విద్యాలయం నెలకొల్పబడింది పుంగనూరులో ప్రభుత్వ పాఠశాలను మిషనరీ సంస్థలకు బదిలీ చేయబడింది. ఆర్కాట్ మిషనరీ వారు పలమనేరులో విద్యాసంస్థలను ఏర్పరిచారు.
క్రైస్తవ మిషనరీలు అందించే విద్య విధానంలో ప్రధాన లక్ష్యంగా క్రైస్తవ మత ప్రచారం ఉన్న దానితో పాటుగా నిత్య జీవితానికి ఉపయోగపడు ఆధునిక విషయ జ్ఞానం బోధించబడింది. ఈ నూతన విద్యా విధానం దేశీయ విద్యా విధానం కంటే నాణ్యత లోనే కాక ఉపాధి అవకాశాల కల్పన లోను స్పష్టమైన ఆధిపత్యం కనపరిచింది[23]. అయితే ఈ నూతన విద్యావకాశాలు కూడా పరిమితం గా కొన్ని వర్గాలకే లభ్యమయ్యాయి.
వ్యవసాయ వసతి తక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాలలో స్థానిక ప్రజల మద్దతు విద్యాసంస్థలకు పెద్దగా లభించలేదు. ఈ కారణం తోనే తీరాంద్ర ప్రాంతంతో పోల్చుకుంటే సంఖ్యాపరంగా విద్యాభివృద్ధి రాయలసీమ ప్రాంతంలో తక్కువగా జరిగినట్లు తెలుస్తున్నది[24].
ఆర్థిక స్వాలంబనకు వృత్తి విద్యల ను కూడా మిషనరీ సంస్థలు ప్రారంభించాయి ఇందులో పని సంస్కృతిని గౌరవించడం అనే అంశం కూడా ఇమిడి ఉండటంతో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1910 నాటికి అమెరికన్ ప్రొటెస్టెంట్ మిషన్ సంస్థలు తెలుగు ప్రాంతాలలో 29 పారిశ్రామిక పాఠశాలలు నిర్వహిస్తూ ఉండేవి యునైటెడ్ లూథరన్ చర్చి సంస్థ ల్యాం (గుంటూరు) క్షేత్రంలో కోళ్ల పెంపకం వ్యవసాయ పని మొదలైన అంశాలపై శాస్త్రీయ శిక్షణలను శాస్త్రీయ శిక్షణాలయాలను నెలకొల్పి నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీలు నిర్వహించిన అల్లిక పని తో కూడిన లేస్ పరిశ్రమ కరువు కాలాలలొ పంచమ కుల మహిళలకు జీవనోపాధి కలిగించింది[25]. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ 1931 లో కంభం వద్ద గ్రామీణ సామాజిక శిక్షణ సంస్థను ప్రారంభించింది. నేతపని పట్టు పరిశ్రమ కుట్టుపని చాపల అల్లిక లు మొదలైన పనుల లో కూడా మిషనరీలు శిక్షణ ఇచ్చాయి. 1852లో శ్రీమతి కట్టర్ మార్క్ రేట్ రాజమండ్రిలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. అమెరికన్ ఈయవలంజికల్ లూథరన్ చర్చికి చెందిన మిస్ ఆగ్నెస్ ఇడా స్కేడ్ 1894లో రాజమండ్రిలో హాస్టల్ తో కూడిన బాలికల పాఠశాలను ప్రారంభించారు.
క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థలు తెలుగు ప్రాంతాల్లో నిర్వహించిన పాత్ర బహుముఖమైనది మరియు సంక్లిష్టమైనది[26]. ఒక వైపున ఆధునిక విషయ జ్ఞానాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసి ఈ ప్రాంత విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తించి భావనాపరమైన విప్లవానికి భావాత్మకమైన విప్లవానికి బాటలు వేసింది [27]. మరొకవైపున మిషనరీ విద్యా సంస్థలు విద్యారంగంలోకి దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న, నిషేధించబడిన మహిళలను, క్రింది కులాలను, పంచములను ఆహ్వానించింది[28]. దీని ద్వారా విద్యకు దూరంగా ఉన్నా వీరి జీవితాలలో నూతన ఉషోదయానికి క్రైస్తవ మిషనరీల విద్యా సంస్థలు అవకాశాలు ఏర్పరిచినాయు[29].
శతాబ్దాల తరబడి విద్యకు, గౌరవప్రదమైన వృత్తులకు దూరంగా బ్రతుకుతున్న క్రింది కులాల వాళ్లు క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థల విధానాల వల్ల లాభపడ్డారు. క్రైస్తవ మతాంతీకరణ ద్వారా విద్య తో పాటు పంచములు ఆత్మగౌరవాన్ని పొందడంతో పాటుగా సామాజిక బానిసత్వం నుండి విముక్తికరణ సాధించారు[30]. వ్యక్తిగతంగాను, సమూహ పరంగాను క్రైస్తవ మిషనరీలు ఈ వర్గాలలొ ఉన్నత స్థాయి నైతిక మరియు ఆధ్యాత్మిక వాస్తవ అభివృద్ధిని సాధించాయి[31]. ఆధునిక సమాజంలో తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ నూతన జీవితాన్ని ప్రారంభించారు[32].
తెలుగు ప్రాంతాలలో పంచమ కులాలైన మాల, మాదిగల లొ అర్థ బానిసత్వం అమలులో ఉండేది [33]. ఎటువంటి జీవనోపాధి లేని వీళ్లు స్థానిక భూస్వామి క్రింద నిర్దేశించిన పనులు చేస్తూ, అతనికి చెందిన బానిసలుగా వ్యవహరించబడే వాళ్ళు. వీళ్లు క్రైస్తవులుగా మారడాన్ని వీరి యజమానులైన భూస్వాములు అంగీకరించే వాళ్ళు కాదు. సంప్రదాయ వాద ఆలోచన ధోరణులపై పాశ్చాత్య భావజాలం ఆదిపత్యం సాధించింది. అయితే వివిధ వర్గాలలోను, ప్రాంతాలలోనూ ప్రభావంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి.
మరొకవైపున క్రైస్తవ మిషనరీల దూకుడు స్వభావం సంప్రదాయవాద భారతీయులలో తమ మత సంప్రదాయ మనుగడపై, భద్రతపై అనుమానాలను కలిగించింది. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం, క్రింది కులాలను ప్రభావితం చేసి క్రైస్తవులుగా మార్చడం హైదరాబాదు నిజాం సంస్థానంలోని ముస్లిం మత పెద్దలకు ప్రేరణ కలిగించి హిందూమతంలోని క్రింది కులాలలొ ఇస్లామీకరణకు “తబ్లిక్” లాంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రోత్సాహం ఇచ్చింది.
క్రైస్తవ మిషనరీల మత ప్రచారం పై ఏర్పడిన వ్యతిరేకత వలస పాలకులపై వ్యతిరేకతగా పరిణామం చెందింది. మిషనరీల దూకుడు దాడులు కొంతకాలం స్తంభించిపోయిన సంప్రదాయవాదులు త్వరగానే మేలుకొని ఎదురు దాడులకు దిగారు. సంప్రదాయవాదులు మిషనరీల విద్యాసంస్థలకు పోటీగా విద్యాలయాలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించడంతో పాటుగా కొన్ని సందర్భాలలో ప్రభుత్వం నుండి గ్రాంట్ లను కూడా పొందారు. 1870 తర్వాత మిషనరీల విద్యా వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. విద్యాసంస్థలపై క్రైస్తవ మిషనరీల గుప్తాధిపత్యం అంతరించింది.
3.3 స్థానిక దాతలు విద్యాభివృద్ధి కృషి:
1856 లో శేషయ్య శాస్త్రి గారిచే మచిలీపట్నంలో ప్రారంభించబడిన వర్నేకూలర్ స్కూల్ కాలంతో పాటుగా అభివృద్ధి చెంది హిందూ కాలేజీ గా మారింది. 1857లో విజయరామ గజపతి దేవ్ చేత ప్రారంభించబడిన మిడిల్ స్కూల్ కాలక్రమంగా అభివృద్ధి చెంది విజయనగర మహారాజా కాలేజీ గా మారింది. విద్యాసంస్థలు తెలుగు ప్రాంతాల్లో ఆధునిక విజ్ఞానం వ్యాప్తి చేయడంలో తమ వంతు పాత్రను విజయవంతంగా పోషించాయి.
1870లో విజయనగరం జమిందార్ రాజమండ్రిలో బాలికల పాఠశాల స్థాపించారు మహారాజా విజయ రామ గజపతి 1886లో విజయనగరంలో ఒక పాఠశాల ప్రారంభించారు పిట్టాపురం రాజా 1868 లో కాకినాడలో ఒక బాలికల పాఠశాల ప్రారంభించారు బాలికల పాఠశాలను ప్రారంభించాడు తర్వాత రాజమండ్రిలో బాలికల పాఠశాల ప్రారంభించారు.
దక్షిణ భారతదేశ విద్యాసాగర్ అని కీర్తించబడిన ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 1874లో ధవలేశ్వరం వద్ద, 1881లో రాజమండ్రి వద్ద బాలికల కొరకు పాఠశాలలు ఏర్పరిచారు. వీరేశలింగం గారు శ్రీవిద్యను వ్యవస్థీకరిస్తూ సతీహిత బోధిని అనే ఒక మహిళల కొరకు నిర్దేశించబడిన పత్రికను నడిపేవారు.
స్వాతంత్రోద్యమ భావాల చేత ప్రేరేపించబడిన ఆంధ్ర ప్రాంత జాతీయ నాయకులు ఎక్కడికక్కడ జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పి విద్యావ్యవస్థను విస్తృత పరిచారు.
4. ఆధునిక విద్య- తెలుగు ప్రాంతాలలో సామాజిక మార్పు:
ఆంధ్ర ప్రాంతం తన దీర్ఘ నిద్రను వదిలించుకుని చైతన్యంతో జాగృతం చెందింది ప్రభుత్వ వ్యవహారాలు వ్యాపార అవకాశాలు విస్తరించడంతో పెద్ద చిన్న పట్టణాలు ఏర్పడ్డాయి విద్యాసంస్థలు విస్తరించడంతోపాటుగా దీనికి అనుసంఘికంగా రీడింగ్ రూములు, లిటరసీ క్లబ్బులు, గ్రంథాలయాలు పత్రికలు మరియు ప్రచురణ సంస్థలు రూపొందించబడ్డాయి. ఆంధ్ర ప్రాంతంలో అధికారం పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను స్థిరీకరించుకునే క్రమంలో కొన్ని ఒడిదుడుకులకు గురి అయింది అయితే కాలక్రమంగా తన రాజ్యాధికారాన్ని స్థిరీకరించుకున్నది. ఈ ప్రక్రియలో సమాజంలోని కొన్ని వర్గాలను దగ్గరకు తీసుకోవాల్సి వచ్చింది.
గ్రామాలలో ప్రాథమిక విద్య సంస్థలు మాత్రమే ఏర్పడగా, పట్టణాలలో ఉన్నతవిద్యాసంస్థలు నెలకొన్నాయి. విద్యా వ్యాప్తి ప్రధానంగా ఉన్నత మధ్యతరగతుల వారిలో వ్యాపించింది. నూతన విద్యా విధానం వలన ఏర్పడిన ఉద్యోగ అవకాశాలు సంప్రదాయ విద్యలను, వృత్తులను దూరం చేశాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న అశ తో ఆంగ్ల విద్య అభ్యసనం బహుళ ప్రాచుర్యం పొందింది.
బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం తెలుగు ప్రాంతాలను విద్య వ్యవస్థ పై గుత్తాధిపత్యం వహిస్తున్న సంప్రదాయ బ్రాహ్మణ వర్గాలకు ఎంత మాత్రం పరిచయం లేకపోవడంతో ఈ వర్గాలు మొదట కొంత ఇబ్బంది పడినా కొద్ది కాలంలోనే అన్ని ప్రధాన విద్యా రంగాలపై ఈ వర్గాలు తిరిగి తమ ఆధిపత్యాన్ని సాధించుకున్నారు. అయితే అప్పటికే నాటి సమాజంలో ఆర్థికంగా పరిపుష్టి గల కొన్ని వ్యవసాయ కుల వర్గాలు కూడా ఈ నూతన విద్యా విధానంలోకి ప్రవేశించడంతో ఈ విద్యారంగం పై బ్రాహ్మణుల గుప్త ఆధిపత్యం అంతరించింది [34].
ప్రారంభంలో స్వల్పసంఖ్యలో ఉన్న ఈ వ్యవసాయ కులవర్గాల (శూద్రకులాలు) విద్యార్థులు కాలక్రమంలో సంఖ్యాపరంగా బ్రాహ్మణులపై ఆదిపత్యం సంపాదించారు[35]. విద్యారంగంపై ఆధిపత్యం సాధించిన రైతు కులాలు రాజకీయ రంగంపై కూడా సులభంగానే తమ ప్రభావాన్ని చూపారు. ప్రాథమిక విద్యా స్థాయిలో క్రింది కుల, ఉన్నత కుల విద్యార్థుల శాతాలలో పెద్దగా తేడా లేకున్నా, ఉన్నత విద్యలో మాత్రం బ్రాహ్మణులు ఆధిపత్యం కనపడుతుంది.
ఈ నూతన విద్యా విధానం దేశీయ విద్యా విధానం కంటే నాణ్యత లోను ఉపాధి అవకాశాల కల్పన లోను స్పష్టమైన పై చేయిలో ఉంది అయితే ఈ నూతన విద్యావకాశాలు పరిమితంగా కొన్ని వర్గాలకే లభ్యమయ్యాయి. నూతనంగా ఆవిర్భవించిన ఈ వర్గాలు తమ స్థితిగతులపై ఆత్మ విమర్శ చేసుకోగలిగాయి. దీని ఫలితంగానే సంఘసంస్కరణోద్యమం ఆంధ్ర ప్రాంతంలో వ్యాపించింది. నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ మార్పులకు పూర్వపు ప్రాబల్య కులమైన బ్రాహ్మణులు ముందు వరుసలో ఉన్నారు. ఈ నూతన అవకాశాలు ఈ కులాన్ని మరింతగా సంఘటిత పరిచాయి. ఈ విధమైన ప్రక్రియ మిగిలిన కులాల వారిలో వారి అస్తిత్వంపై భయాందోళనలకు కారణమయ్యింది.
ఆర్థికంగా బలపడిన వ్యవసాయ కులాల వాళ్ళు ఈ ఆధునిక విద్య ద్వారా మానసికంగా బ్రాహ్మణుల ఆధిపత్య సిద్ధాంతాన్ని తిరస్కరించారు. అందుకు కావలసిన సైదాంతికభావజాలాన్ని రూపొందించుకున్నారు[36].
తొలితరం ఆంధ్ర విద్యావంతులు తమ అంతర్ మదనాన్ని తమ రచనల రూపంలో వివిధ పత్రికలలో వెల్లడించారు. సామినేని ముద్దు నరసింహనాయుడు 1853 లో రచించిన “హిత సూచని” దీనికి మంచి ఉదాహరణ. ఇది 1862 లో పుస్తక రూపంలో ప్రచురించబడింది. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారి రచనలలో సనాతన సంప్రదాయ సమాజంపై బలమైన అంతర్గత విమర్శను మనం పరిశీలించవచ్చును.
1800 దశకంలో తెలుగు ప్రాంతాల్లో ఆధునిక విద్యావ్యక్తి ప్రారంభమైనది. ఇది క్రమంగా విస్తరిస్తూ సమాజంలోని అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే ఈ ఆధునిక విద్య వ్యాప్తి ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు మతపరమైన అంశాల ఆధారంగా ప్రభావితమై వివిధ స్థాయిలలో తన ప్రభావాన్ని ప్రసరించింది.
5. ముగింపు:
ఆధునిక విద్య 19వ శతాబ్దం నుండి తెలుగు ప్రాంతాలపై విస్తృతమైన ప్రభావాన్ని చూపి సమాజంలోని వివిధ అంశాలను సమూలమైన మార్పులకు గురిచేసింది. అయితే ఈ మార్పులు ప్రాంతాలవారీగా, సమూహాల వారీగా వివిధ మోతాదులలో ఉన్నాయి. మరొకవైపున ఈ మార్పులకు ప్రతిక్రియగా సంప్రదాయవాదులు తమదైన శైలిలో ప్రతిస్పందించారు. తెలుగు ప్రాంత సమాజంపై ఆధునిక విద్య కలిగించిన ప్రభావాలను, దానికి అనుబంధంగా జరిగిన వివిధ మార్పులను మరింత లోతుగా అధ్యయనం, విశ్లేషణ చేయవలసి ఉంది. వివిధ వర్గాలపై ఆధునిక విద్య ప్రభావము, వ్యాప్తి గురించి మరింత విస్తృతమైన పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది.విస్తృతమైన పరిశోధనల ఫలితంగా సామాజిక మార్పులపై లోతైన అవగాహన ఏర్పరచుకోవచ్చు.
6. పాదసూచికలు & ఉపయుక్తగ్రంథసూచిక:
- మెర్రిమాన్, జె ., (2009), “ఆధునిక ఐరోపా చరిత్ర: పునరుజ్జీవనం నుండి ఇప్పటి వరకు”, (వాల్యూం. 1), డబ్ల్యు. డబ్ల్యు నార్టన్ & కంపెనీ, పేజీలు.
- మెర్రిమాన్, జె ., (2009), “ఆధునిక ఐరోపా చరిత్ర: పునరుజ్జీవనం నుండి ఇప్పటి వరకు” (వాల్యూం. 1), డబ్ల్యు. డబ్ల్యు నార్టన్ & కంపెనీ, పేజీలు .
- వీరభద్ర రావు. కొత్తపల్లి., (1986), “తెలుగు సాహిత్యం పై ఇంగ్లీషు ప్రభావము”, శివాజీ ప్రెస్, సికింద్రాబాద్, పేజీలు. 116-117.
- ప్రియాంక దీక్షిత్.,( 2023) “బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో విద్య యొక్క పరిణామం”, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హిస్టరీ, వాల్యూమ్. 5(1): పేజీలు. 100-105.
- రెవ. ఫ్రాంక్ పెన్నీస్.,(1904), “చర్చి ఇన్ మద్రాస్”, వాల్యూమ్ .1, స్మిత్ ఎల్డర్ & కో , లండన్, పేజీలు. 187-190.
- రెవ. ఫ్రాంక్ పెన్నీస్., (1904), “చర్చి ఇన్ మద్రాస్”, వాల్యూమ్ .1, స్మిత్ ఎల్డర్ & కో , లండన్, పేజీలు.187-190.
- మంగమ్మ, జె., (1975)“బుక్ పబ్లికేషన్ ఇన్ ఇండియా”, , నెల్లూరు, , పేజీ నెం.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు. 1-2.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు 9-10.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు.41-42.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు .110-111.
- సత్యనాధన్. ఎస్., (1894) “మద్రాసు ప్రెసిడెన్సీలో విద్యా చరిత్ర”, శ్రీనివాస వరదాచారి &కో, బొంబాయి, పేజీలు .
- బాబు. జి.,( 2023), “బ్రిటీష్ రాజ్ కాలంలో ఆంధ్రాలో నిర్వాసితులైన తరగతులు : 1892 – 1947”, నలభై ఐదవ సెషన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, పేజి.
- సెల్వమణి. ఇ., (2018), “హోమ్ రూల్ లీగ్ మరియు బ్రాహ్మణేతర ఉద్యమం మధ్య సంఘర్షణ”, షాన్లాక్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్, వాల్యూమ్. 5 నం. 3 జనవరి. పేజీలు.60-64.
- బెల్లెనోయిట్, హెచ్.జె., (2007). “భారతదేశంలో మిషనరీ విద్య, మతం మరియు జ్ఞానం, 1880–1915”. మోడరన్ ఏషియన్ స్టడీస్, వాల్యూమ్.41(2), 369-394.
- లైర్డ్, ఎం. ఎ., (1968). “బెంగాల్‌లో విద్యకు క్రిస్టియన్ మిషనరీల సహకారం, 1793-1837”. యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యునైటెడ్ కింగ్‌డమ్. పేజీలు .66-69.
- పోర్టర్, ఎ ., (1988). “పందొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలో స్కాటిష్ మిషన్లు మరియు విద్య: 'ట్రస్టీషిప్' యొక్క మారుతున్న ముఖం”. ది జర్నల్ ఆఫ్ ఇంపీరియల్ అండ్ కామన్వెల్త్ హిస్టరీ, వాల్యూమ్.16(3), పేజీలు .35-57.
- రామా దేవి, ఎం.,( 2017), “క్రీ.శ 1854 వరకు ఆంధ్రాలో విద్య ప్రారంభం-ది రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్”, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్, వాల్యూమ్.06,సంచిక.18, మే, పేజీలు:3514-3517.
- బిషప్, ఎస్ ., (1997). “బ్రిటిష్ ఇండియాలో ప్రొటెస్టంట్ మిషనరీ విద్య”, ఎవాంజెలికల్ క్వార్టర్లీ: బైబిల్ మరియు థియాలజీ యొక్క అంతర్జాతీయ సమీక్ష, వాల్యూమ్ .69(3), పేజీలు.245-266.
- ధనరాజు, వుల్లి., (2015), “కలోనియల్ ఆంధ్రలో మిషనరీ విద్య సహకారం: అణగారిన తరగతులలో సామాజిక మార్పు”, రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైన్సెస్, వాల్యూమ్. 3(7), సెప్టెంబర్,పేజీలు:7-15.
- సావేజ్, డి.డబ్ల్యు., (1997). “మిషనరీలు మరియు భారతదేశంలో స్త్రీ విద్య యొక్క వలసవాద భావజాలం అభివృద్ధి”, లింగం & చరిత్ర, వాల్యూమ్ .9(2), పేజీలు.201-221.
- వైట్‌హెడ్, సి . (1999). “బ్రిటిష్ వలసవాద విద్యకు క్రైస్తవ మిషన్ల సహకారం”, పెడగోగికా హిస్టోరికా, వాల్యూమ్ .35(అదనపు.1), పేజీలు .321-337.
- గంగయ్య, కె ., (2023)“వెస్ట్రన్ క్రిస్టియన్ మిషనరీలు మరియు ఆంధ్రలోని వారి సేవ: రాయలసీమకు ప్రత్యేక సూచనతో”, నలభై ఐదవ సెషన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, పేజీలు . 337-346.
- హరి ప్రసాద్. ఎం., (2019),ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ ప్రాంతంలోని లేస్ ఇండస్ట్రీ ద్వారా అణగారిన వర్గాల మహిళల సాధికారత కోసం మిషనరీల పాత్ర, ఐజెఆర్డిఓ - జర్నల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, వాల్యూమ్ -20 సెప్టెంబర్, 1వ సంపుటం-9,. పేజీలు.481-490
- మాథ్యూ, ఎ., (1988). “క్రిస్టియన్ మిషన్స్, ఎడ్యుకేషన్ అండ్ నేషనలిజం: ఫ్రమ్ డామినెన్స్ టు కాంప్రమైజ్”, 1870-1930, అనామికా పబ్ & డిస్ట్రిబ్యూటర్స్. పేజీలు.
- సేన్‌గుప్తా, పి., (2020). “భారతదేశంలో ప్రొటెస్టంట్ మిషనరీ విద్య యొక్క చరిత్ర: మైనారిటీ పాఠాలు”. హ్యాండ్‌బుక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ సౌత్ ఏషియా, పేజీలు. 1-16.
- వెన్నిలా, జి., (2018). “భారతీయ విద్యలో మిషనరీల పాత్ర”. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, వాల్యూమ్ .3(4), పేజీలు .313-318.
- శ్రీవాస్తవ, జి., (1991), “ది క్రిస్టియన్ మిషనరీస్: ది ఎవల్యూషన్ ఆఫ్ ఫిమేల్ ఎడ్యుకేషన్ ఇన్ వెస్ట్రన్ ఇండియా 1857-1921”, ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, వాల్యూమ్ . 52, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్.పేజీలు. 737-743.
- వెబ్‌స్టర్., 'ఫ్రమ్ ఇండియన్ చర్చ్ టు ఇండియన్ థియాలజీ: యాన్ అటెంప్ట్ ఎట్ థియోలాజికల్ నిర్మాణం’, A.P. నిర్మల్ (), దళిత థియాలజీలో ఒక రీడర్ (మద్రాస్: గురుకుల్) లూథరన్ థియోలాజికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పేజీలు.93-127.
- గాంధీ, ఎం.కే.,(1941), “క్రిస్టియన్ మిషనరీ”, నవజీవం ప్రెస్, అహమ్మదాబాద్., పేజీలు .
- సెబాస్టిమ్మల్, S., & తివారీ, ఎం., (2023), “బీహార్‌లోని దళితులకు విద్యా సేవలను అందించడంలో క్రిస్టియన్ మిషనరీల పాత్ర”, జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్, వాల్యూమ్. 5(2), పేజీలు. 10536-10542.
- జియోఫ్రీ ఎ. ఒడ్డీ., (2014), “మాలాస్ అండ్ మాదిగస్: దేర్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్ (1860-1932)”, రాజ్‌కుమార్, దయం, జోసెఫ్ ప్రభాకర్; మరియు ఆశీర్వాదం, I. P., (Ed.) "మిషన్ ఎట్ అండ్ ఫ్రమ్ ది మార్జిన్స్ ప్యాటర్న్స్, ప్రొటగానిస్ట్‌లు మరియు దృక్కోణాలు". ఎడిన్‌బర్గ్ సెంటెనరీ సిరీస్. వాల్యూమ్. ఆక్స్‌ఫర్డ్, UK. 2014. పేజీలు.23.
- హెచ్.ఎస్. ఎస్. సుందర్, కొంపల్లి., (2021), “19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం”,ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ. పేజీలు. 69-71.
- ఇన్నారెడ్డి, సింగారెడ్డి.,(2019), “ఆంధ్రప్రదేశ్ లో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు”, ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ. పేజీలు.
- హెచ్.ఎస్. ఎస్. సుందర్, కొంపల్లి.,( 2021) “19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం” ,ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ. పేజీలు.23-24.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.