AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. ఇబ్రహీం కుతుబ్ షా కాలం: తెలుగు సాహిత్యవికాసం
డా. బొల్లేపల్లి సుదక్షణ
అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్రశాఖ,
ప్రభుత్వ సిటీ కళాశాల (స్వ.ప్ర),
హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 9849520572, Email: sudhakshanabollepally@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కుతుబ్షాహీలు గోల్కొండ రాజధానిగా కీ.శ. 1518 నుండి 1687 వరకు పరిపాలన చేశారు. వీరు పారశీకులు. పారశీకము వీరి రాజభాష, అయినా తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినందున తెలుగు భాషను గౌరవించారు. తెలుగుభాషకు ఎంతో సేవ చేశారు. ఈ వంశంలోని రాజులందరూ కవిపండితులను పోషించారు. అందులో పర్షియన్, అరబిక్, ఉర్దూ కవులతో బాటు తెలుగు కవులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో తెలుగు భాష ఒక వెలుగు వెలిగింది. మొదటగా తెలుగు సాహిత్యాన్ని కవులను పోషించిన రాజు ఇతనే. ఇబ్రహీం కుతుబ్ షా తన అన్న జంషీద్ వలన తనకు ఉన్న ప్రాణభయంతో విజయనగరంలో తలదాచుకున్నాడు. అప్పటి విజయనగర రాజు అళియ రామరాయలు ఇతనికి ఆశ్రయం ఇచ్చాడు. దాదాపు ఆరు సంవత్సరాల కాలంపాటు అక్కడే ఉన్నాడు. ఈ కాలంలో అతను తెలుగు భాషపై మంచి పట్టు సాధించాడు. సింహాసనం అధిష్ఠించి పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతని కాలంలో రాజశాసనాలు, ఫర్మానాలు తెలుగులోకూడా వెలువడ్డాయి. ఎందరో కవిపండితులు ఇతని ఆదరణకు నోచుకున్నారు. మరికొందరు ఇతని ఆస్థానాన్ని అధిష్టించారు. ఈ పరిశోధనాపత్రంలో ఇబ్రహీం కుతుబ్ షా కాలం లో జరిగిన తెలుగు భాషా, సాహిత్య అభివృద్ధి వివరింపబడింది.
Keywords: ప్రబంధము, ద్వర్ధి, త్వద్ధి, చతురర్థి, నిరోష్ఠ్య కావ్యము
1. ఉపోద్ఘాతం:
కుతుబ్ షాహీ వంశంలో ఇబ్రహీం కుతుబ్ షా కాలం అద్వితీయమైనది. ఇతను క్రీ.శ. 1550 నుండి 1580 వరకు పరిపాలించాడు. ఈ కాలంలో తెలుగు భాషాసాహిత్యాలు కెరటాలై ఎగిసాయి. తెలుగుభాషపై ఎంతోపట్టు కలిగిన ఇబ్రహీం స్వయంగా కవి. చిన్నతనం నుండే అతనికి తెలుగుభాష పరిచయం ఏర్పడింది. అదే సాహిత్యంపట్ల అతనికి మక్కువ పెంచింది. రాజుగా ఎందరో కవులను, పండితులను పోషించాడు. ఆస్థానంలో కవితాగోష్ఠులను, విద్వద్గోష్ఠులను నిర్వహించాడు. కవిపండితుల కృతులును స్వీకరించాడు. తెలుగు కవులచేత "మల్కీభరాముడు"గా ప్రశంసించబడ్డాడు. కవులను, పండితులను తన ఆస్థానానికి ఆహ్వానించి తెలుగులో ముషాయిరాలను చేసేవాడు. వారి పాండిత్యాన్ని ఆస్వాదించి, ఆనందించి వారిని సత్కరించేవాడు. అతనుకవులను ఏవిధంగా సత్కరించింది క్రింది పద్యం తెలుపుతుంది.
నవ్వేనా సంగీతనాద భేద విదిజ్ఞ ధీరాతులకు బదినూరులిచ్చు
రమ్మనెనా సభా ప్రౌఢ సత్కని పదజాలములకు బదివేలనిచ్చు
కూర్చుందు మనియెనా గురుతర శాస్త్రజ్ఞ లక్షణ విధులకు లక్షలిచ్చు
శభాసురా యన్న సకలాశ్రితానేక కోవిదులకు మెచ్చి కోటిఇచ్చు
భళిరా! చతురబ్ధి మేకలాకలిత ధాత్రి - చక్ర నిర్విక్రపాలనా చారుకీర్త
రమ్యముక్తాతి పత్ర రారాజితుండు చారుతరమూర్తి ఇభరామ చక్రవర్తి!1
2. సమకాలీన కవులు:
ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు. ఇబ్రహీం కుతుబ్ షాను ఎంతగానో స్తుతించాడు. "ఇబ్రహీం ప్రతివారస్తుత సారస్వత ధీర ప్రణుత విజయ చారిత్రుడు" అని "సారస్వత సారస్య విచారస్తుతమతి కవీంద్ర సన్నుతమూర్తి" అని పొగిడాడు. తనకు తాపత్య చరితం (తపతీ సంవరణోపాఖ్యానం) ఇవ్వమని అడిగాడని ఘనంగా చెప్పుకున్నాడు. ఈ గ్రంథంలో గంగాధరుడు మల్కీభ రాముని ప్రేమగాధను వర్ణించాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో 23 గద్యపద్యాలతో ఉన్న తపతీసంవరణుల కథ ఆధారంగా రాయబడిన గ్రంథం ఇది.
ఇబ్రహీం కాలంనాటి మరొక మేటి కవి మరగింటి సింగరాచార్యులు, ఈయన నిరోష్ఠ్యరామాయణం అనే పేరుతో దశరథరాజ నందన చరిత్రను రచించాడు. తొలి అచ్చ తెలుగు నిరోష్ఠ్య రచన సీతాకళ్యాణాన్ని రచించాడు. నలయాదవ రాఘవ పాండవీయం అనే చతురర్థి కావ్యాన్ని, రామకృష్ణ విజయం అనే ద్వర్థి కావ్యాన్ని రచించాడు. సాహిత్యంలో మొదటిసారిగా ద్వర్థి, చతురర్థి కావ్యాలను ఇతనే రచించాడు. ఇతని రచనలు శ్రీకృష్ణ శతవందనీయం, శ్రీకృష్ణతులాభారం, రతిమన్మదాభ్యుదయం, రామాభ్యుదయం మొదలైనవి. ఇతని రచనలకు సంతోషించిన ఇబ్రహీం వాడపల్లి అగ్రహారాన్ని, మదపుటేనుగులను, ముత్యాలహారాలను, వెల్లగొడుగులు, గుర్రాలు, అందలాలు మొదలైనవి బహుమతిగా ఇచ్చాడు. రాజుతోబాటు అశ్వపతులు, గజపతులు, నరపతులు ఆయనను సత్కరించారు.
కందుకూరు రుద్రకవి ఇబ్రహీం మెప్పు పొందిన మరొక కవీంద్రుడు. ఇబ్రహీం దేవరకొండ దుర్గ పాలకునిగా ఉన్నప్పుడే తన రచనల ద్వారా ఆయనను మెప్పించాడు. ఇబ్రహీం రాజైన తర్వాత రుద్రకవికి రెంటచింతల అగ్రహారాన్ని బహుమతిగా ఇచ్చాడు2. సుగ్రీవవిజయము, నిరంకుశోపాఖ్యానము, సీతాకళ్యాణం, జనార్ధనాష్టకం, బలవదరీశతకం, జనార్ధనాష్టకస్తోత్రం, గువ్వలచెన్నని శతకం, తారకబ్రహ్మ శతకం, సరసజన మనోరంజనం, రాష్ట్రౌడవంశం మహాకావ్యం ఇతని రచనలు.
రుద్రకవి శతఘంటావధాని, అష్టభాషా కవితా విశారదుడు, సీతాకళ్యాణం గ్రంథంలో ధనాభిరామం, ప్రేమాభిరామం అనే ద్విపద కావ్యాలను రాసినట్టు చెప్పుకున్నాడు. ఇతను నల్లగొండ జిల్లా దేవరకొండలోని కందుకూరుకు చెందినవారు. తన రచనల్లోని నిరంకుశోపాఖ్యానాన్ని కందుకూరులోని సోమేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. ఇది శృంగార రస ప్రధానమైన సాంఘిక కావ్యం. ఈ కథకు మూలం కథాసరిత్సాగరంలోని విక్రమాదిత్యుని కథకు ఉపకథ అయిన ఠింఠికరాళుని కథ.
ఇక కందుకూరు జనార్ధనస్వామిని శృంగార రసప్రధానంగా స్తుతించే కృతే జనార్థనాష్టకం. ఇటువంటి రచనను మొదటగా ప్రారంభించినది ఇతనే. నిరంకుశోపాఖ్యానము ప్రబంధముకాగా సుగ్రీవవిజయం అచ్చతెలుగులో రాయబడిన తొలియక్షగాన నాటకం, ఏల, దరువు, ద్విపద, సంగీతపరమైన అంశాలు ఇందులో వివరించబడ్డాయి. ఇది ఒక కవితారూపము. ఒక సంఘటన లేదా అనేక సంఘటనల కూర్పు, చెప్పాలంటే ఇది ఒకరకమైన దేశీ నాటకీయ కూర్పు, సంస్కృత నాటకానికి ఇది విభిన్నమైనది. ఇందులో దేశీకథలు ఉంటాయి. దీని కథావస్తువు రామాయణం నుండి తీసుకోబడినది.
యాయాతి చరిత్ర రచించిన కవి పొన్నగంటి తెలగనార్యుడు. ఇతను పొట్ల చెరువు (పటాన్ చెరువు) నివాసి. యయాతి చరిత్ర పూర్తిగా తెలుగులో రాసిన గ్రంథం. ఇతనికి రచనా ప్రాశ్యస్త్యం విన్న పొట్ల చెరువు అమీరు, అమీన్ ఖాన్ ఇతని గ్రంథం అంకితం తీసుకోవలనే తన ఉద్దేశ్యాన్ని పొన్నగంటికి, మరిగంటి అప్పన్న ద్వారా తెలియజేయగా దానికి పొన్నగంటి ఎంతో ఆనందపడి తన రచనను అమీన్ ఖాన్ కు అంకితమిచ్చాడు. ఈ గ్రంథంలో, మహాభారతంలోని యాయాతి పూర్తి చరిత్రను కాకుండా దేవయాని, శర్మిష్టలను యాయాతి వివాహం చేసుకోవడం వరకే తీసుకొని దానిని కావ్యబద్ధం చేశాడు3. ఇది ఐదు ఆశ్వాసాలతో రాయబడిన మొదటి అచ్చ తెలుగు కావ్యం.
సిద్ధరామకవి అద్దంకి గంగాధర కవి సమకాలికుడు. ప్రభుదేవర వాక్యం, వేదాంత రచన గ్రంథం (వేదాంత గ్రంథాలలో ఇదొక ముఖ్యమైన గ్రంథం) కృష్ణమాచార్యస్తుతి (ఇది కూడా వచన ప్రక్రియ) ఇవి ఇతని రచనలు. వచన ప్రక్రియకు ఇతనే ఆద్యుడు. సిద్ధ రామశతకాన్ని రచించినది ఇతనే. ఈ శతకంలోని పదాలు చిత్కళోద్ధామ, శ్రీగురుసిద్ధిరామ అనే మకుటాన్ని కలిగి ఉంటాయి. ఇదిగాక ప్రభుదేవర వాక్యం వచన గ్రంథాన్ని రచించాడు. దీనికే పిండ చక్ర నిర్ణయం అనే మరొక పేరు ఉంది. ఇది వేదాంతపరమైన గ్రంథం. ఇటువంటి గ్రంథాన్ని వచనంలో రాయడమే విశేషమంటే దాన్ని తెలంగాణ వ్యవహారిక భాషలో రాయడం మరొక విశేషం.
గణేశ్వర కవి ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. అయితే ఇతని రచనలు ఏవి లభ్యం కావడం లేదు. ఇబ్రహీం చేత ఆదరించబడిన మరొక కవి మరిగింటి జగన్నాథాచార్యులు, కవులైన ఇతని సోదరులు అప్పలాచార్యుడు, సింగరాచార్యులు కూడా ఇబ్రహీం చేత ఆదరింపబడ్డారు. శ్రీరంగనాథ విలాసం ఇతని రచన. ఈ రచనలో శ్రీరంగనాథక్షేత్ర మహిమను ఆరు ఆశ్వాసాలలో వర్ణించాడు. మహబూబ్ నగర్ లోని చరిగొండ ప్రాంతానికి చెందిన నరసింహ కవి శశిబిందు చరితం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఈ రచన లభించడం లేదు. రాజనీతి రత్నాకరం పేరుతో వైష్ణవ ప్రబంధంగా పంచతంత్రం రచించిన కృష్ణయామాత్యుడు ఈ కాలానికి చెందిన వాడే.
పోశెట్టి లింగకవి ఈ కాలానికే చెందిన మరొక గొప్పకవి. ఇతను నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, వీరసంగమయదేవరచరిత్ర, శిష్యప్రలోభం మొదలైన గ్రంథాలను రచించాడు.
కుతుబ్ షా గోల్కొండ సమీపంలోని సిద్దలూరుకు చెందిన నేబతి కృష్ణుని మంత్రిగా, ఆస్థానకవిగా నియమించాడు. రాజనీతి రత్నాకరం ఇతని రచన. ఇది ఆనాటి రాజకీయ సాహిత్య చరిత్రకు అద్దం పడుతుంది.
3. కవితాశైలి:
గోల్కొండ రాజ్యంలోని కవులు అచ్చ తెలుగులో కావ్యాలు రాశారు. ఈ విధంగా అచ్చ తెలుగులో పూర్తి కావ్యాన్ని రచించడం ఈ కాలం నుండే మొదలైయ్యింది. పొన్నగంటి తెలగనార్యుడు ఇటువంటి కావ్యానికి ఆద్యుడని చెప్పవచ్చు. తెలుగుభాషా పదజాలం మూడు రకాలైన పదాలను కలిగి ఉంది. అవి తత్సమ, తద్భవ, దేశ్య. తత్సమ పదాలు అనగా సంస్కృత భాషనుండి అదేవిధంగా లేక కొద్ది మార్పులతో తెలుగులో లేదా తెలుగుభాషతో బాటు ఉపయోగించబడేవి. తద్భవ పదాలు సంస్కృతభాష నుండి గ్రహించినవే గానీ తెలుగుభాషకు, భావానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయబడినవి. దేశ్యపదాలు పూర్తిగా స్థానిక భాషాపదాలు. వీటిపై సంస్కృత, ప్రాకృత ప్రభావం ఉండదు. పొన్నగంటి ఈ పదాలను ఉపయోగించి యాయాతి చరితాన్ని రాయడం వలననే దానికి అచ్చతెనుగు కావ్యమని పేరు వచ్చింది4. ఇందులో తత్సమ, తద్భవ పదాలేగాక అన్యదేశ పదాలు కూడా ఏవిలేవు. ఇతనికి ముందు రాసిన గ్రంథాలు కావ్యాలు ఇతర రచనలపైన సంస్కృత, ప్రాకృత ప్రభావం కన్పిస్తుంది. దీనిని దాటుకొని కవితా రచన చేసిన వాడు పొన్నగంటి తెలగనార్యుడు. ఇతని రచనలు ఓష్ఠ్య, నిరోష్ఠ్య, చతురర్థి, జుహ్యకాది గారడీ కవిత్వానికి మొదటి ఉదాహరణ.
దశరథ రాజనందన చరిత్ర మరిగంటి సింగరాచార్యుల కృతి ఇది నిరోష్ఠ్య కావ్యం. నిరోష్ఠ్య కావ్యంగా అధర శబ్దాలు (పెదవులతో పలుకునట్టి శబ్దాలు, ప,ఫ,బ,భ,మ) లేకుండా రాయబడిన కావ్యం, ఇట్టి పదాలను తప్పిస్తూ రాసిన ఈ కావ్య రచన ఒక రకంగా సాహిత్యంలో ఒక విన్యాసమని చెప్పవచ్చు.5
తెలుగు సాహిత్యంలో మరొక ప్రక్రియ శతకం. శతకము అనగా వంద పద్యాలతో అల్లిన దండ అని చెప్పవచ్చును. ఒక్కోసారి ఇందులో 108 పద్యాలు కూడా ఉండేవి. వీటిల్లో మొదటి నుండి చివరి వరకు ఒకే కథావస్తువు ఉండదు. ఇవి ముఖ్యంగా నాలుగు పాదాలలో రాయబడుతాయి. వీటిలోని చివరిపాదం ఒక మకుటంతో(సంబోధకా నినాదంతో) అంతమవుతుంది. ప్రతిపద్యం ఏదో ఒక సూక్తిని, నీతిని బోధిస్తుంది. ఇటువంటి రచనల్లో అంతర్లీనంగా సమాజం, ప్రజల జీవన విధానం, నైతిక విలువల బోధన మొదలైన అంశాలు ఉంటాయి. కొన్ని శతకాలు భక్తిరస ప్రధానంగా ఉంటే మరికొన్ని సమాజ జీవనానికి ప్రాధాన్యతనిస్తాయి. ఇట్టి శతకాలు ఈ కాలంలో విరివిగా కనిపిస్తాయి. కందుకూరు రుద్రకవి రచించిన బలవదరీ శతకం, గువ్వలచెన్న శతకం, తారకబ్రహ్మ రామశతకం, సిద్ధరామకవి రచించిన సిద్ధరామ శతకం, అబుల్ హాసన్ తానీషా కాలంలో రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న రచించిన దాశరధీ శతకం. ఇతను తొలి సంకీర్తనాచార్యులలో ఒకరిగా ప్రసిద్ధిపొందాడు. శతక పద్యాలు పామరులకు కూడా అర్థమయ్యే తేలిక పదాలతో సరళమైన భాషలో ఉంటాయి. అద్దంకి గంగాధరుని రచన శివస్తుతి వచనమాల, తెలుగు సాహిత్యంలో ఇదొక నూతన ప్రక్రియ. వచనమాల ప్రక్రియకు ఆద్యుడు ఇతనే. పద్య గద్య వచన శైలులలో ఈ కాలం నాటి రచనలు చేయబడ్డాయి. ఈ శైలిలో రాయబడిన అచ్చ తెలుగుభాష, వాడబడిన నూతన శైలులు, ప్రక్రియలు ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో జరిగిన తెలుగు సాహిత్య అభివృద్ధిని అజరామరం చేశాయి.
4. కుతుబ్ షా సాహిత్యాభిలాష:
గోల్కొండ రాజ్యాన్ని 1550 నుండి 1580 వరకు పరిపాలించి సుల్తాన్ అనే బిరుదును వహించిన మొదటి రాజు ఇబ్రహీం కుతుబ్ షా . ఈ వంశ స్థాపకుడైన కులీ కుతుబ్ ఉల్ ముల్క్ కుమారుడు. కులీ తన కుమారుడు జంషీద్ చేతిలో మరణించాడు. రాజ్యకాంక్షతో సోదరులను వధించే ప్రయత్నం చేశాడు. ఇబ్రహీం అతని ప్రయత్నాల నుండి తప్పించుకొని పారిపోయి విజయనగరరాజు అళియరామరాయలు ఆశ్రయం పొందాడు. అక్కడ రాయలు గౌరవ అతిధిగా దాదాపు ఏడు సంవత్సరాలు గడిపాడు. ఈ కాలంలో రాయలు కుటుంబంతో సన్నిహిత ప్రేమపూర్వక సంబంధాలను పెంచుకోవడంతోబాటు తెలుగు, సంస్కృత భాష, ఆచారవ్యవహారాలు, మర్యాదలు అన్నింటితో ప్రభావితమైనాడు. ముఖ్యంగా తెలుగుభాషపైన అమితమైన ప్రేమను పెంచుకున్నాడు. సింహాసనం అధిష్టించిన తర్వాత తెలుగుభాషపై తనకున్న ప్రేమాభిమానాన్ని చేతల ద్వారా చూపించుకున్నాడు. తెలుగుకవులను ఆస్థాన పండితులుగా నియమించుకున్నాడు. ఆస్థానంలో వేదాలు, శాస్త్రాలు, పురాణాలలో దిట్టలైన పండితులు ఉండేవారు. ఖాళీ సమయాలలో వారి ద్వారా రామాయణ, మహాభారతాలను తెలుగులో విని ఆనందించేవాడు.
పర్షియన్ రాజభాష అయినప్పటికీ ఇతని కాలంలో రాజఫర్మానాలు, పారశీక మరియు తెలుగు భాషలలో లిఖింపబడేవి. ఎందరో కవి పండితులు ఇతని ఆదరణకు నోచుకున్నారు. ఇబ్రహీంను ఎంతగానో స్తుతించారు. కవి పండితులను తన ఆస్థానానికి ఆహ్వానించి తెలుగు ముషాయిరీలను నిర్వహించేవారు. కవి పండితులు ఇతనిని పొగడ్తతో ఆకాశానికి ఎత్తారు. అద్దంకి గంగాధరుడు ఇబ్రహీంను ఎంతగానో స్తుతించాడు. ఇబ్రహీం "ప్రతివారస్తుత సారస్వత ధీర ప్రణుత విజయ చారిత్రుడుని, సారస్వత, సారస్వ విచార స్తిరమతి కవీంద్రసన్నుత మూర్తే" అని పొగిడాడు. అంతేగాక "భరతక్షీరమందు సింధు బంధు మధ్య లలితా పుణ్య కథసుర" లహరి (భారత పాలసముద్రపు సద్గుణ కథల తరంగాలలో మునిగి పోయేవాడు) అని వర్ణించాడు. కవులు అతనిని ఇప్పటి వరకు భూమిపై ఉన్న గొప్ప రాముడని, పురాణాలలోని ఏ రాముడు మల్కీభరామునికి సరిరారని ప్రశంసించారు. పైన వివరించిన కవులేగాక పొమ్మసాని చిన్న తిమ్మనాయుడు, అనంతపురపు హండెప్ప, మట్ల అనంతరాజు, బంగారు రేచమ నాయుడు, పేర మల్లారెడ్డి ఇబ్రహీం సత్కారాలకు నోచుకున్నారు. కవులచేత మల్కీభరాముడు ఈ విధంగా వర్ణింపబడ్డాడు.
“రాజన రాజుగాడతను బాహుముఖంబున జిక్కే
వాహినీ, రాజన రాజుగాడతను రామశరాహుతిదూలె
దేవతా, రాజన రాజుగాడతను రావణ సూతికి నోడి నాజిలో
రాజన రాజు మల్కీభరాముడే ధరాతలంబునన్”
ఇబ్రహీం 'అషిఖానా'లో కవితాగోష్టులు నిర్వహించేవాడు. ఒకసారి జరిగిన కవితాగోష్ఠిలో ఓ పేద బ్రాహ్మణుడు వచ్చి మల్కీభరాముణ్ణి మెప్పిస్తానని చెప్పడంతో ఇబ్రహీం ఆ కవికి “ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే” ఈ నాలుగు పదాలతో కవిత్వం చెప్పమని అన్నాడు. దానికి ఆ కవి-
ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభిఔను, హీనాత్ముండౌ
మీకుంటే మాకిమ్మా
మాకుంటే మేము రాము మల్కీభరామ!
అని కవిత్వం వినిపించాడు. దానికి సంతసించి ఇబ్రహీం అతనికి లక్షరూపాయలు బహుమానంగా ఇచ్చాడు. తెలుగుభాషను అభివృద్ధి చేసినందున మల్కీభరాముడని పేరొందితే, ఉర్దూను అభివృద్ధి చేసి ఉర్దూ రాజర్ (ఉర్దూ పితామహునిగా) పేరుపొందారు. ఇబ్రహీం మరణించినవుడు యావత్ తెలుగుజాతి ముఖ్యంగా కవి పండిత లోకం దుఃఖపీడితులయ్యారు.
“రారా! విధాత యోరీ! వినరా తగురా తలకొట్లమారి
స్సారపులోభి రాజులను జంపక మల్కీభరామ భూవరునిన్
చారు యశోధనున్ సుగుణిజంపితి వర్థులకేమి దిక్కురా
చేరిక నింత రాజులు సృజింపగ నీ తరమా వసుంధరన్!”
(ఓయీ బ్రహ్మ ఇటురా నేను చెప్పేది విను నువ్వొక తగువులు మారివి. నిస్సారవంతులైన, లోభులైన రాజులను చంపాలిగాని, రాజ శ్రేష్ఠుడు, కీర్తి సంపదగా గల్గినవాడు, సుగుణవంతుడైన మల్కీభరాముణ్ణి చంపావేమిటయ్యా ఇక యాచకులకు దిక్కెవరు? మళ్ళీ వసుధలో ఇంతటి గొప్పవాణ్ణి సృష్టించడం నీకు తరమవుతుందా?) అని వేదన చెందారట.
ఈ పద్యం తెలుగు భాషకు ఆయన చేసిన సేవను, తెలుగుభాషా కవుల హృదయాలలో ఆయనకున్న స్థానాన్ని తెలియజేస్తుంది.
5. ముగింపు:
తెలుగు భాషా సాహిత్యానికి ఇబ్రహీం కుతుబ్ షా చేసిన సేవ అమూల్యం. తెలుగు సాహిత్యంలో ఆయన కీర్తి అజరామరం. ఈ పంథాని అతని వారసులు కూడా కొనసాగించారు. ఇబ్రహీం కుతుబ్ షా వారసుడైన మహమ్మద్ కుతుబ్ షా కాలంలో తెలుగు భాష బాగా అభివృద్ధి చెందింది. గణేష పండితుడు ఇతని ఆస్థాన కవి. ఇతను కాలంలోనే గోల్కొండ రెవెన్యూ అధికారిగా పనిచేసిన సారంగ తమ్మయ సుప్రసిద్ధకవి. ఇతను వైజయంతి విలాసయతే గ్రంధాన్ని రచించాడు. ఈ కాలానికే చెందిన మరొక అద్భుతమైన కవి క్షేత్రయ్య. ఇతను అబ్దుల్లా కుతుబ్ షా సమకాలీకుడు. ఇతను 1500కు పైగా పదకీర్తనలు రచించాడు. అబుల్ హాసన్ తానీషా కాలానికి చెందిన కంచర్ల గోపన్న దాశరధి శతకాన్ని రాముని పై కీర్తనలను రచించాడు. విజయనగర రాజుల అనంతరం తెలుగు భాషాభివృద్ధికి అంతటి కృషి చేసిన వారు కుతుబ్ షాహీలే. తెలుగు సాహిత్య అభివృద్ధికి తెర తీసినవాడు ఇబ్రహీం కుతుబ్ షానే. అయితే భువన విజయ కవులకు వచ్చిన స్థాయిలో వీరెవరికి గుర్తింపు రాలేదు. గోల్కొండ సుల్తానుల తెలుగు భాషా సాహిత్య పోషణ వారి కాలంలో వర్ధిల్లిన కవులు, వారి రచనలు, వాటి ప్రాశస్త్యం, కవితాశైలి వెలుగులోనికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కాలంనాటి రచనలపై ఇంకా లోతుగా పరిశోధనలు కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
6. పాదసూచికలు:
- చాటు పద్యమంజరి - పుట - 43
- కుతుబ్ షాహీలు – పుట - 389
- ఆంధ్రదేశ చరిత్ర – సంస్కృతి - పుట – 248
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం – సంపుటి – 7
- హిస్టరీ ఆఫ్ మిడీనియల్ దక్కన్ - పుట - 162
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆరుద్ర సమగ్ర సాహిత్య సంపుటి - 7 - తెలుగు అకాడమీ – హైదరాబాద్ - 2007
- అంజయ్య. టి. సుదక్షణ బొల్లేపల్లి తదితరులు. తెలంగాణ చరిత్ర సంస్కృతి. తెలుగు అకాడమీ. హైదరాబాద్ – 2017
- చక్రపాణి. కాకాని - హైదరాబాద్ నగర నిర్మాతలు కుతుబ్ షాహీలు - ఎమెస్కో బుక్స్ - హైదరాబాద్ - 2011
- శాస్త్రి. బి.ఎన్.- ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి - మూసి పబ్లికేషన్స్ - హైదరాబాద్ – 1992
- షేర్వాని. హెచ్.కె. - హిస్టరీ ఆఫ్ మిడీవియల్ దక్కన్ - 1295 1724 సంపుటి-2 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - హైదరాబాద్ - 1974
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.