AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. గురజాడ కథానికలు: సంఘసంస్కరణ దృక్పథం
డా. తంగి ఓగేశ్వరరావు
తెలుగు అధ్యాపకులు
వి.వి.గిరి ప్రభుత్వ కళాశాల
దుంపగడప, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
19వ శతాబ్దం ద్వితీయార్ధం, 20 శతాబ్దం ప్రారంభంలో తెలుగు సమాజం ఒక వైపు పరాయిపాలనతోపాటు బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, మూఢ నమ్మకాలు, వేశ్య వ్యవస్థ, కన్యాశుల్కం, అస్పృశ్యత వంటి సాంఘీక దురాచారాలతో సతమతమైంది. మరో వైపు యూరప్ లో మొదలైన పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచి విప్లవం యొక్క ఫలాలు భారతదేశంలో కూడా అడుగుపెట్టిన కాలమది. ఇంగ్లీష్ చదువులు మానవ సంబంధాలలో సరిక్రొత్త ఆలోచనలను రేకెత్తించి సంస్కరణ యుగానికి నాంది అయ్యాయి. ఇలాంటి సందర్భంలో గురజాడ వారు సామాజిక రుగ్మతలను పసిగట్టి వాటిని సంస్కరించేందుకై రచనలు చేసారు. అనేక నూతన సాహితీ ప్రక్రియలకు ఆధ్యుడుగా నిలిచాడు. అతను రాసిన కథానికల్లో ప్రతిఫలించిన సామాజిక వాస్తవికతను, స్థితిగతులను గూర్చి ప్రస్తావించడమే ఈ పత్ర ప్రధాన ఉద్దేశ్యం
Keywords: గురజాడ, దిద్దుబాటు, మతం, సంస్కరణ, స్త్రీలు, మెటిల్డా, మీ పేరేమిటి, కథానిక
1. ఉపోద్ఘాతం:
తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్ది ద్వారాలను తెరిచిన మహాస్రష్ట గురజాడ అప్పారావు. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన అసాధారణ ప్రతిభావంతుడు. "దేశమంటే మనుషులోయ్"1 అన్న గొప్ప మానవతావాది, మహా మనీషి. “నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వదులు కోలేను”2 అని ధైర్యంగా ప్రకటించిన ఘనుడు గురజాడ. నవ్య కవిత్వానికి అడుగుజాడ గురజాడ. క్రొత్త పాతల మేలు కలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు అప్పారావు. ఇక్కడ ఒకసారి ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి మాటలను గుర్తుచేసుకోవాలి.
"సాహిత్యము ఏ కొందరి సోత్తోయనుకొన్న కాలములో అది ప్రజల సొమ్మని ఉదారముగా పంచి పెట్టిన సామ్యశీలి ఆయన. కందుకూరి సాంఘిక విప్లవమును, గిడుగు భాషా విప్లవమును తనలో సమన్వయించుకొని సరిక్రొత్త సాహిత్య విప్లవము లేవనెత్తిన నవయుగ వైతాళికుడాయన. ఆయన చేతి చలువతో, అస్పృశ్యముగా పడియున్న వాడుక భాష అందలమెక్కినది. మెత్తని తెలుగు పలుకు కత్తివాదరవలె మెరసినది. వీధి మానిసికి వేదిక లభించినది. ఆంధ్రభారతి అంతకు ముందటి అలంకార భారములను డుల్చివేసి ముచ్చటగా ముత్యాలసరాల నలంకరించుకొన్నది. నాటకము, గేయము, వ్యాసము, కథానిక ఆయన వాఙ్మహిమతో ఎన్నడులేని జవమును, జీవమును పుంజుకొన్నవి"3.
నూటయాభై సంవత్సరాల క్రితం పుట్టి, దాదాపు వంద సంవత్సరాల క్రితం మరణించిన గురజాడ అప్పారావు గూర్చి మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే వారు తెలుగు సాహితీ సమాజానికి చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. సాహిత్యాన్ని ఆధిపత్య భావజాల బంధాల నుండి, అభౌతిక కల్పనలనుండి దారి మళ్ళించి ఆధునికతకు అంకురార్పన చేసిన మహా దార్శనికులు, వాస్తవికులు గురజాడ వారు. ఒక రచయితకు సామాజిక బాధ్యత అవశ్యమని నమ్మి సాహిత్యాన్ని సంకుచితత్వం నుండి విశాల ప్రపంచానికి తీసుకెళ్ళి సమాజ శ్రేయస్సుకోసం రచనలు చేశారు. తెలుగు సాహిత్యం పై చెరగని ముద్ర వేశాడు. అందుకే గురజాడ వారి అడుగుజాడ నేటికీ ఆదర్శ ప్రాయమైంది, ఆచరణీయమైంది.
ఆధునిక తెలుగు కథా సాహిత్యం ఎప్పుడు? ఎవరితో ప్రారంభమైంది? అనే విషయాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది సాహితీవేత్తలు మాత్రం ఆధునిక తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారేనని భావిస్తున్నారు. తొలి తెలుగు కథానిక గురజాడ అప్పారావు రచించిన ‘దిద్దుబాటు’ అని ఎక్కువ మంది సాహితీవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ‘దిద్దుబాటు' కథానిక 1910లో 'ఆంధ్ర భారతి' పత్రికలో ప్రచురింపబడింది. వల్లంపాటి వారు మంచి కథకి చెప్పిన లక్షణాలైన క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం వంటివి చక్కగా కుదిరిన కథ ‘దిద్దుబాటు'. ఇతివృత్తం, సంఘటనలూ, సంభాషణలూ అన్నీ సంగ్రహమైనవే. అనవసరమైన వర్ణనలు ఉండవు. “కథానిక లక్షణాలు గురజాడ చెప్పలేదు గాని లక్షణాలన్ని తెలిసేట్టు ‘దిద్దుబాటు'ని రాశారు”4 అని మధురాంతకం రాజారం పేర్కొన్నారు. “తెలుగు కథానిక గురజాడ చేతుల్లో యవ్వనంతో పుట్టింది”5 అని పాలగుమ్మి పద్మరాజు గారు ప్రశంశించారు.
‘దిద్దుబాటు’తో పాటు గురజాడ ‘మీ పేరేమిటి’, ‘మతము:విమతము’, ‘మెటిల్డా’, ‘పెద్దమసీదు’, ‘సంస్కర్త హృదయం’ అనే కథలు కూడా రాశారు. గురజాడ ‘stooping to Raise’ అనే ఇంగ్లీషు కథని అవసరాల సూర్యారావు ‘సంస్కర్త హృదయం’గా అనువదించారు.
2. గురజాడ కథానికలు - సంఘసంస్కరణ దృక్పథం:-
స్థూలంగా గురజాడ అప్పారావు గారి అన్ని కథలను పరిశీలించినపుడు మనకు రెండు విషయాలు స్పష్టమౌతాయి. మొదటిది ఆనాటి సమాజంలో ఉన్న సాంఘీక దురాచారాలను కథావస్తువుగా చేసుకొని సంస్కరణోద్దేశ్యంతో రచనలు చేయడం, రెండవది సంఘసంస్కర్తలుగా ముసుగులు వేసుకొని సమాజంలో పెద్ద మనుష్యులుగా చెలామణి అవుతున్న వారి నిజ స్వరూపాన్ని తన రచనలల్లో బాహాటంగా ఎండగట్టడం కనిపిస్తుంది. ‘దిద్దుబాటు’, ‘మెటిల్డా’, ‘సంస్కర్త హృదయం’ వంటి కథలు స్త్రీ సమస్యను ప్రధానంగా చేసుకొని రాశారు. వివాహ వ్యవస్థ మరియు వివాహేతర వ్యవస్థ అయిన వేశ్యా వృత్తికి మధ్య ఉన్న వైరుధ్యాలను ఈ కథల్లో చిత్రీకరించారు. 'మీ పీరెమిటి', ‘మతము: విమతము’ కథలు మతం పట్ల ప్రజలలో ఉన్న మూఢ విశ్వాసాలను, మత మార్పిడులను కేంద్రంగా చేసుకుని చిత్రించినవి.
'దిద్దుబాటు' కథలో కమలిని, గోపాల్రావులు చదువుకున్న భార్యాభర్తలు. గోపాల్రావు వేశ్యా సంస్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి, వేశ్యాగృహాలకు వెళ్ళి వస్తుంటాడు. వేశ్య వ్యవస్థను నిర్మూలించాలని వెళ్లి వారి పాటలకే ఆకర్షితుడై, అర్ధరాత్రులు ఇంటికి రావడం, కట్టుకున్న భార్యను పట్టించుకోపోవడం నిత్యం జరుగుతుంటుంది. ఇది సహించలేని బార్య కమలిని ఎలాగైనా తన భర్తను చెడు తిరుగుళ్లనుండి మార్చాలని అనుకుంటుంది. నౌకరు రాముడు సహకారం తీసుకుని తన పథక రచనను అత్యంత నాటకీయంగా అమలు పరుస్తుంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన గోపాల్రావుకు ఇంట్లో భార్య కనిపించక పోవడంతో నౌకరును అడుగుతాడు. తను చేసిన తప్పుకు ప్రాయాశ్చిత్తంతో కుమలిపోతాడు. మరెప్పుడు వేశ్యా వాటికల వైపు వెళ్లకూడదని అనుకుంటాడు. ఇంతలో కమలిని రాసి ఉంచిన ఉత్తరం ద్వారా ఆమె తన పుట్టింటికి వెళ్ళిందని తెలుసుకొని బాధ పడతాడు. తన బుద్ధి మారిందని, ఇంకెప్పుడు తాను సాని కొంపలకు వెళ్ళనని తన నౌకరు ద్వారా రాయబారం పంపేందుకు సిద్ధమౌతుండగా, భర్తకు బుద్ది చెప్పేందుకు అంత సేపు నాటకమాడిన కమలిని, మంచం క్రింది నుండి కిలకిలా నవ్వుకుంటూ బయటకు వస్తుంది.
ఈ కథలోని కమలిని పాత్ర ద్వారా చదువుకున్న స్త్రీ అడ్డదారులు, దొడ్డి దారులు తొక్కె మగవాళ్లను సంస్కరించుకోగలదని గురజాడ నిరూపించారు. ఈ కథలో స్త్రీ విద్య ఆవశ్యకత గూర్చి గురజాడ వారికి ఉన్న స్పష్టమైన అభిప్రాయాలు కనిపిస్తాయి. కమలిని పుట్టింటికి వెళ్ళిందని తెలిసిన గోపాల్రావుతో నౌకరు రాముడు “ఆడారు చదువు నేరిస్తే యేటౌతది?" అన్నప్పుడు దానికి బదులుగా గోపాల్రావు-
"ఓరి మూర్ఖుఁడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుఁడు పార్వతికి సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు వాఁడు భార్యను బెటర్ ఆఫ్ అన్నాఁడు. అనగా పెళ్ళాము మొగునికన్న దొడ్డది అన్నమాట”6 అంటాడు. ఈ మాటల్లో గురజాడ వారి భావాలు స్పష్టంగా బయట పడతాయి.
‘సంస్కర్త హృదయం' కథలో జ్ఞానం అనేది అనుభవం నుండి, జీవిత సంఘర్షణ నుండి పుట్టుకు రావాలే తప్ప ఉపన్యాసాల నుండి, పుస్తకాల నుండి, రేడీమేడ్ భావజాలల నుండి కాదని గురజాడ వారి అభిప్రాయం. ఈ కథలో ప్రొఫెసర్ రంగనాథయ్యర్, వేశ్యావ్యవస్థను నిర్మూలించాలనే ఆశయంతో పాఠకులకు పరిచయం అవుతాడు. కాని ఆచరణలో మాత్రం సరళ అనే అందమైన వేశ్యను చూసి ఆకర్షితుడై ఆత్మ వంచనకు గురౌతాడు. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాలను ఈ కథ ఎత్తి చూపుతుంది.
సైన్స్ పాఠాలు చెప్తూ, సమయం దొరికినపుడల్లా వేశ్యావృత్తినంత నిర్మూలించాలని ఉపన్యాసాలు ఇచ్చే ప్రొఫెసర్ రంగనాథయ్యర్ ఒక రోజు సరళను చూసి "ఓహో! ఏమా సౌందర్య రాశి"7 అని ఆశ్చర్య పోతాడు. ఆనాటి నుండి అతను ఆశయం క్రమంగా పతనమవడం చూస్తాము. "అదా! వట్టి వ్యభిచారిని, పేరు సరళ”8 అని తన మిత్రుడు చెప్పినప్పుడు అతని హృదయం నీరసిస్తుంది. సరళ తనకు సునాయసంగా లభిస్తే బావుంటుందనే భావనలోకి వెళ్తాడు. చివరకు ఆమెను సంస్కరించాలనే నెపంతో ఆమెను కలుస్తాడు. ఇక్కడ వారిద్దరి మధ్య చోటు చేసుకున్న సంభాషణ అత్యంత ఆసక్తి గాను, తాత్వికంగాను ఉంటుంది.
ఒక వైపు సరళను ఇష్టపడుతూనే, తనుకు తాను నీతి నియమాలు, విలువలు కలవాడిగా ప్రదర్శంచుకునే ప్రయత్నాలు చేసుకుంటాడు ప్రొఫెసర్. సరళ శ్రేయస్సును కోరుకున్న వాడిలా ఆమె ఎవర్నైనా వివాహం చేసుకుంటే బావుండునని అంటాడు. దీనికి సమాధానంగా సరళ “ఎవడో ఒక చండాలుడికి నేను కలకాలం పూర్తిగా బానిసనై పడుండాలనేనా మీ తాత్పర్యం”9 అంటూ నవ్వుతుంది. పురుషుడు ఎలాంటి వాడైనా, తనకు ఇష్టం లేకపోయినా, ఎవరికో ఒకరికి బలవంతంగా కట్టి పెట్టే వివాహ వ్యవస్థను ప్రశ్నిస్తుంది. “నా బోటి భోగం పిల్లను ఏ మర్యాదస్థుడు పెళ్ళాడతాడో చెప్పండి మీరే”10 అని అడుగుతుంది. దానికి ప్రొఫెసర్ రంగనాథయ్యర్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు.
తాను చదివిన పుస్తకాలలోని సిద్ధాంతాలు గాని, భావాలు గాని, భావజాలాలు గాని సరళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోయాయి. పైగా పాట పాడుతున్న సరళను ముద్దు పెట్టుకోవడంతో అతని పతన స్థాయి తీవ్రరూపం దాల్చుతుంది. పురుషుల్లో ఉండే సహజ దౌర్బల్యాలు వేశ్యా వ్యవస్థకు ఎంత అండగా ఉంటున్నాయో ఈ కథ వివరిస్తుంది. ఈ కథానికలో తమను తాము సంస్కరించుకోకుండా ఎదుటి వారిని సంస్కరించాలనే కుహనా సంస్కర్తల హృదయాలను ఆవిష్కరింప చేశారు గురజాడ వారు. నీతులు చెప్పటం తప్ప ఆచరణలో చూపించని వారిని గురించి రాసిన కథ ‘సంస్కర్త హృదయం’. సంస్కర్తల్లో కూడా నీతి నిజాయితీలు, చిత్తశుద్ధి లోపించటం సహించలేని గురజాడ ఈ కథ ద్వారా సంస్కరణోద్యమంలోని బలహీనతల్ని వివరించాడు.
ఆనాటి సంస్కర్తలందరిలో వేశ్యలంటే జీవితంలో ఓడిపోయిన స్త్రీలనే అభిప్రాయం బలంగా ఉండేది. అందువల్ల వీరు ఈ సమస్యను వ్యక్తిగతంగానే ఆలోచించేవారు. నిజానికి వేశ్యలు జీవితంలో ఓడిపోయినవారు కాదు. మత సంప్రదాయాల మూలంగా రాజరిక, భూస్వామ్య వ్యవస్థకు పుట్టిన వికృత ఫలమే ఈ వ్యవస్థ. ఇలాంటి సామాజిక కోణాలను గురజాడ రచనలలో చూడవచ్చు.
'మెటిల్డా' కథలో సామాజిక జీవనానికి వివాహ వ్యవస్థ యొక్క ఆవశ్యకతను పరోక్షంగా తెలియజేసారు. ముసలి భర్తతో జీవించే దీనురాలి కథ ‘మెటిల్డా’. ఈ కథ ఒక విద్యార్థి దృష్టి కోణం నుంచి ఉత్తమ పురుషలో చెప్పబడింది. ఆ కాలంలో సాధారణంగా కనిపించే అసమ వయస్కుల వివాహాలని కథావస్తువుగా తీసుకొని గురజాడ ఈ కథానికను రాశారు. మెటిల్డా యవ్వనంలో ఉన్న అందమైన యువతి. 55 సంవత్సరాలు దాటిన వృద్ధుడితో వివాహమౌతుంది. భర్త కొట్టినా, తిట్టినా చివరకు అనుమానించినా భర్తతోనే తన జీవితమనుకుని జీవనం సాగించే ఎంతో మంది స్త్రీలకు ప్రతినిధిగా మెటిల్డా కనిపిస్తుంది. వీరింటికి సమీపంలోనే ఉంటున్న కాలేజీ యువకులతోనే సమస్య మొదలవుతుంది. వీరు ఆ ముసలి భర్తకు 'ముసలి పులి' అనే పేరు పెడతారు. ముసలి పులి ఇంటికి ఎవరు వెళ్ళరు. వారి గూర్చి ఎవరికి ఏమీ తెలియదు. ఒక కాలేజీ యువకుడు ప్రతి రోజు గుమ్మం ముందుగా వెళ్తూ మెటిల్డాను చూడటం సహించలేని ముసలి భర్త, అతన్ని అక్కడే ఆపి "ఈ ముండని తీసుకుపో- నీకు దానం చేశాను తీసుకో, నాకు శని విరగడైపోతుంది”11 అని ఘీంకరిస్తాడు.
ఆ తరువాత మెటిల్డా "మీరూ, మీ నేస్తులు నా కాపురం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తలవంచుకు మీ తోవను మీరు పొతే నే బతుకుతాను. లేకపోతే నా ప్రారబ్ధం"12 అంటూ ఆ యువకునికి ఉత్తరం పంపుతుంది. మెటిల్డాను ఏవరైనా చూస్తేనే అనుమానించే ముసలి భర్త కొన్ని రోజుల తరువాత ఆమె యోగ్యురాలని, నిజాయితీపరురాలని తెలుసుకుంటాడు. కాలేజీ యువకులను తన ఇంటికే పిలిపించి, కూర్చోబెట్టి మెటిల్డాతోనే కాఫీ ఇప్పించి “మీ మాటలవల్లా, చేష్టల వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్ళెం వదిలేశాను”13 అని వారితో చెప్తాడు. ఆనాటి నుండి భార్య స్వేచ్ఛకు వేసిన కళ్లెంను తీసివేస్తాడు. భార్యా భర్తలు స్వేచ్ఛగా కుటుంబ జీవనం సాగిస్తూ ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవించుకోవడం మూలంగానే కుటుంబ జీవితం అర్ధవంతమౌతుందని ఈ కథలో చూడవచ్చు.
శైవ వైష్ణవ భేదాలు, అధిక్యాల కోసం జరిగే పోరాటం చిత్రిస్తూ మత మౌఢ్యాన్ని వివరించే కథ ‘మీ పేరేమిటి?’. దేవుడు చేసిన మనుషుల్నీ, మనుషులు చేసిన దేవుళ్ళనీ ‘మీపేరేమిటీ?’ అని మతాల అస్తిత్వాన్ని ప్రశ్నించే కథ ఇది. ఆద్యంతాల సమన్వయంతో, కథన చాతుర్యంతో మత సహనాన్ని బోధించే కథ ‘మీ పేరేమిటి?’ అని వల్లంపాటివారు వివరించారు. 'మీ పేరేమిటి' కథలో మతానికి సంబంధించిన సాంఘిక స్వరూపం సమగ్రంగా చిత్రీకరించబడింది. ఈ సమస్య మీద మరొకరు కొత్త విషయం చెప్పటానికి తావే లేకుండా గురజాడ వారు ఈ కథను రాశారని కొడవటిగంటి కుటుంబారావుగారి అభిప్రాయం. మతం, దేవుడు ఈ రెండింటిపై మనిషికి ఉండే భక్తి, విశ్వాసాలను కేంద్రంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. మతాన్ని అన్ని కాలాల్లోను అధిపత్య వర్గాలు తమకనుగుణంగా మలచుకోవడం ఈ కథలో చూస్తాం.
హిందూ మతంపై తిరుగుబాటుగా వచ్చిన బౌద్ధతత్వాన్ని మతంగా చేసి బుద్ధుడిని విష్ణు యొక్క దశమ అవతారంగా మార్చి ఆమోదించిందని తెలుసుకున్న శాస్త్రులు, తమ శిష్యులను "మీరు వొట్టి బౌద్ధులు"14 అని దూషించడం మానేయడం ఈ కథలో చూస్తాం. శైవ, వైష్ణవ మతాల్లో జరుగుచున్న మతమార్పిడుల సమస్యను ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని ఈ కథ నడుస్తుంది. శైవానికి శరభయ్య, వైష్ణవానికి సాతాని మనవాళ్ళయ్య సారథ్యం వహిస్తారు. గ్రామ రాజకీయ, ఆర్థిక వ్యవస్థకు ప్రతినిధిగా సారథినాయుడు కనిపిస్తాడు. గురజాడ మతమౌఢ్యం పట్ల ఎప్పుడూ కూడా అంటీ ముట్టనట్లు ఉండలేదు. మనిషిని మనిషిగా చూడలేని మతం, మానవజాతికి సమ్మతమైంది కాదని వీరి అభిప్రాయం. ‘మనుషులు చేసిన దేవుళ్లారా! దేవుడు చేసిన మనుషుల్లారా! మీ పేరేమిటి’ కథలో గురజాడ వారు హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడు పూనడం, దేవుని పేరుతో అగ్ని గుండాలు తొక్కడం వంటి మతవిశ్వాసాలను తీవ్రంగా నిరసించారు. కలికాలంలో మనుషులే కాదు, దేవుళ్లు కూడా సంకరమౌతున్నారంటూ ఈ కథలో ధైర్యంగా ప్రకటిస్తూనే మతాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేసే ఇలాంటి మనుషుల మాయలో పడి సాటి మనుషులతో విరోధం తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవిగా, అభివృద్ధి నిరోధకాలుగా ఉండకూడదంటారు గురజాడ. రోగికి డాక్టరు శస్త్ర చికిత్స చేసినట్లు, సమాజంలో గల రుగ్మతలను కత్తి తీసుకొని దేనికది విడదీసి అన్ని భాగాలను పరిక్షించి చూడాలంటాడు గురజాడ.
ఈ కథకు కొనసాగింపే గురజాడ రాసిన మరొక కథ ‘మతము: విమతము'. శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి దేవాలయాన్ని కూల్చి ఆ స్థానంలో మసీదు నిర్మిస్తారు. ఎప్పుడో కాశీకి వెళ్ళిపోయినా నారాయణభట్టు శ్రీకాకుళేశ్వరస్వామిని దర్శించుకోవడానికి శ్రీకాకుళం వస్తాడు. అక్కడ పూర్వపు శివాలయం స్థానంలో మసీదు ఉండటం చూసి, తురకల విధ్వంసాన్ని తలచుకొని దుఃఖిస్తాడు. అతను మసీదు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సాయిబుతో "సాయీబు గారూ! యీ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; వున్నారా? ఈ దేవాలయం దగ్గిరే వారి బస వుండేది. అనగా యిప్పుడు మీ మసీద్దగ్గరే!"15 అని అడగగా ఆ సాయిబు లేరని చెబుతాడు. "అయ్యో! మా పెద మావఁ రామావధానులు చిన్నమామ లక్ష్మణ భట్టు దేశాంతరగతులై నారా? మృతులైనారా?” 16 అని నారయణభట్టు విచారిస్తూ ఉంటే “సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలు దెసలా చెదర, 'నారాయణా' అని సమ్మోదముగా పిలిచెను”17. ఒకప్పుడు అక్కడ శివాలయం నిర్మించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించినవారే తరవాత కాలంలో ఆ శివాలయాన్ని పడగొట్టి దాని స్థానంలో మసీదును నిర్మించి, అక్కడ మౌల్విలుగా మారినవైనం ఇక్కడ గమనించవచ్చు. గురజాడ ఈ కథలో మనుష్యులు తమ అవసరం, స్వార్ధం కోసం మతాన్ని ఉపయోగించుకోవడం పూర్వం నుండి జరుగుతుందని వివరిస్తూనే మతం పేరుతో వివాదాలు వద్దని హితబోధ చేశారు.’మతము:విమతము’ అనే కథ మతం కన్న ప్రేమ మిన్న అని బోధిస్తుంది. నేటి సామాజిక వ్యవస్థకి బాగా అన్వయించే కథ ఇది.
ఈ కథలో మతస్పర్థలు, ఆవేశాలు ఏవీ లేకున్నా, మతాన్ని స్థాపించేది, గోపురాలు నిర్మించేది, చివరకు వాటిని నాశనం చేసేది కూడా మనుష్యులే అన్న సత్యాన్ని మన కళ్ళ ముందుంచుతుంది.
“మతములన్న్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటె నిలచివెలుగును”18
అని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు గురజాడ అప్పారావు ప్రకటించాడు.
గురజాడ కథలో హాస్యం అంతర్లీనంగా ఉంటుంది. ఆ హాస్యం జీవిత వాస్తవాల్ని తెలియజేయడానికి అతను ఎన్నుకున్న ఎత్తుగడ మాత్రమే. పాఠకులను కేవలం నవ్వించడం కోసమో, కాలక్షేపం కోసమో రచనలు చేయలేదు. ఒక సీరియస్ సమస్య చుట్టూ ఉన్న వివిధ కోణాలను సున్నిత హాస్యంతో వెలికి తీస్తాడు. గురజాడ కథల్లో స్వచ్ఛమైన తెలుగు భాష కనిపిస్తుంది. ఈ కథల్లోని పాత్రలు మొదలు నుండి చివరి వరకూ సహజమైన వాడుక భాషను ఉపయోగించడం అనేది అతని కాలానికి పెద్ద సాహసోపేతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
“భవిష్యత్తులో ఒక్కొక్క ఏదాది పైబడుతున్న కొద్దీ, గడిచిపోయిన రోజులను వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు, తెలుగు సమాజం గురజాడ అప్పారావుకు నమ్రత, గౌరవంతో జోహారులర్పిస్తుంది"19 అని ప్రముఖ ఆంగ్ల సాహితీవేత్త G.A. ఏట్స్ అన్న మాటల అక్షర సత్యం.
ఇలా గురజాడ అప్పారావుతో ప్రారంభమైన తెలుగు కథానిక సమాజ ప్రక్షాలనే ధ్యేయంగా అక్షరంతో సమాజాన్ని చక్కదిద్దే ప్రయత్నం మొదటి నుంచీ చేస్తుంది. “ఈ సమాజంలోని స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసును. తిరిగి వివాహమాడకూడదనే నియమం, విడాకుల హక్కులేని కారణం, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం, స్త్రీల కన్నీటి గాథలకు హేతువులు… ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రని తిరిగి రాస్తారు”20 అన్న ఆశాభావంతో ఆయన చిన్నకథని తీర్చిదిద్ది, పరిపూర్ణ ఆధునిక కథని రూపొందించారు.
3. ముగింపు:
- దిద్దుబాటు, సంస్కర్త హృదయం కథలలో కుటుంబ వ్యవస్థకు, వేశ్యా వ్యవస్థకు మధ్య ఉన్న వైవిధ్యాలను చూపిస్తే, మెటిల్డా కథలో దాంపత్యంలోని అంతర్గత వైరుధ్యాలను కథా వస్తువుగా చేసుకున్నాడు. పురుషుడికి స్త్రీ పూర్తిగా లోబడి ఉండేటట్లు చేసే పురుషనైజంపై కట్టుబాట్ల పేరుతో స్వేచ్ఛగా మాట్లాడలేని స్త్రీల పరిస్థితులపై, స్త్రీలను అకారణంగా హింసించే భర్తలపై వ్యంగ్యంగా వేసిన విసుర్లే ఈ కథా చిత్రనలు.
- సంఘంలో వున్న దురచారాల్ని ఎండగట్టి, వాటిబారి నుండి ప్రజల్ని కాపాడడానికి ఉద్యమిస్తున్నట్లు కనిపించే సంస్కర్తలకు, సంస్కారాన్ని చెప్పే కథ ‘సంస్కర్త హృదయం’. ఈ కథానికలో సంస్కర్త హృదయం ఎలా ఉండకూడదో చెబుతూనే ఎలా ఉండాలో చెప్పారు.
- ఒకే మతంలోని భిన్న శాఖల దగాకోరు బుద్ధుల్ని ఎండగడుతూ స్త్రీకి పెద్ద పీటవేసి దేవుడి పేరుతో గొడవలెందుకని చెప్పిన ఆధునిక కథ ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?’
- ‘మతము విమతము'లో మతం పేరుతో మనిషి ఊసరవెల్లిలా ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పారు.
- మొదటి నుంచి సమాజంలోని అణగారినవారి శ్రేయస్సే కోరుతోంది తెలుగు కథానిక. స్త్రీలు, దళితుల మేలు కోరడంతో బాటు అన్యాయాలమీద దండయాత్ర చేస్తోంది.
4. పాదసూచికలు:
- గురుజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం). పుట.77
- ఇదే.పీఠిక పుట. 14
- ఆధునికాంధ్ర కవిత్వము: సాంప్రదాయములు ప్రయోగములు. పుట.195
- తెలుగు కథానిక. పుట.5
- ఇదే.పుట.5
- గురుజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం). పుట.527
- వసివాడని సాహిత్యం గురజాడ కథా మంజరి.పుట. 48
- ఇదే.పుట.50
- ఇదే.పుట.50
- ఇదే.పుట.51
- గురుజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం). పుట.550
- ఇదే.పుట.550
- ఇదే.పుట.552
- ఇదే.పుట.529
- ఇదే.పుట.546
- ఇదే.పుట.546
- ఇదే.పుట.546
- ఇదే.పీఠిక పుట.37
- గురుజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం). పీఠిక పుట.8
- తెలుగు కథానిక. పుట. 7
5. ఉపయుక్తగ్రంథసూచి:
- గోపాలకృష్ణ, కొవ్వలి. (2022). వసివాడని సాహిత్యం గురజాడ కథామంజరి, ఎమెస్కో ప్రచురణ, హైదరాబాద్.
- గోపాలకృష్ణ, పెన్నేపల్లి. (2012). గురుజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం), మనసు ఫౌండేషన్, హైదరాబాద్.
- నారాయనరెడ్డి, సి. (1999). ఆధునికాంధ్ర కవిత్వము: సాంప్రదాయములు ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- రాంబాబు, వేదగిరి. (2012). తెలుగు కథానిక, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాద్.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. (2009).కథాశిల్పం,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- శాస్త్రి, ద్వా.నా. (2013). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.