AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. 'సలీం' కథలు: వేశ్యపాత్రలు
వి. పద్మ
తెలుగు ఉపాధ్యాయురాలు
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, వినుకొండ
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9866623380, Email: vodithepadma@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
1980 - 95 మధ్య కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం 24 కథలు రచించారు. ఈ కథలన్నీ వివిధ వారపత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈ 24 కథల్లో ఐదు కథలు వేశ్యా జీవితాలను నేపథ్యంగా తీసుకొని రాసిన కథలే. తెలుగు సాహిత్యంలో చలం తరువాత వేశ్య జీవితాలను లోతుగా పరిశీలించిన రచయితల్లో సలీం ముందు వరుసలో ఉంటారు. సలీం కథల్లోని వేశ్యల జీవితాలను పరిశీలించినప్పుడు వారిలోని ఔన్నత్యం, నిబద్దత కనిపిస్తుంది. వారి జీవితాలు పట్ల సానుభూతి కలుగుతుంది. సలీం కథల్లోని వేశ్య పాత్రలు, చిత్రణ, వారి జీవితాలను పరిశీలించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
Keywords: వేశ్యా జీవితాలు, సామజిక అంశాలు, మనస్తత్వం, పాత్రలు, చిత్రణ
1. ఉపోద్ఘాతం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో వేశ్య పాత్రలను పరిశీలించినప్పుడు మొదటిగా "మధురవాణి" కనిపిస్తుంది. సంఘ సంస్కరణాభిలాషతో మహాకవి గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలో మధురవాణి వేశ్య. అయినప్పటికీ, మధురవాణి వ్యక్తిత్వంలో ఉన్నతమైన విలువలు కనిపిస్తాయి. మహాకవి గురజాడ తరువాత చలం రచించిన "ఆమె త్యాగం" కథలోని వేశ్య పాత్ర గొప్పగా ఉంటుంది. ఆమెలోని ఔన్నత్యం, నిజమైన త్యాగం, స్వచ్ఛమైన ప్రేమ, వేశ్యల జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. స్త్రీ శరీరం మలిన పడవచ్చునేమో కానీ మనసు ఎప్పటికీ మలిన పడదని "ఆమె త్యాగం " కథ ద్వారా తెలుస్తుంది. సలీం కూడా "అమె వ్యభిచారి అయితేనేం - మనసున్న మనిషి"1 అని తన కథల్లోని పాత్రల ద్వారా చెబుతారు.
సమాజంలోని వేశ్యావ్యవస్థ ఈనాటిది కాదు. అతి ప్రాచీన కాలం నుంచి సమాజంలో ఉన్నదే. దేవదాసి వ్యవస్థ పునాదిగా వేశ్యావ్యవస్థ రూపు దిద్దుకున్నది. ప్రాచీన కాలంలో దేవదాసి వ్యవస్థ దేవాలయాలకు మాత్రమే పరిమితమైంది. క్రమంగా దేవాలయాలను దాటి ఈ ఆచారం సమాజంలో ప్రవేశించి అది వేశ్యావ్యవస్థగా మారింది.
"మతవ్యవస్థలోని దేవదాసి రాజరికపు వ్యవస్థలోకి రాజనర్తకిగా, నట్టువాంగనగా, గణికగా, జమీందారీ వ్యవస్థలో వారాంగనగా, వేశ్యగా, సానిగా నెట్టబడి ప్రత్యేక కులంగా రూపొందింది. వీరు కువిద్యలైనా సంగీతనృత్యాది కళల్ని వీడనందువల్ల నైతికంగా బలహీనపడినా సాంఘిక మర్యాదను కోల్పోలేదు. సంఘంలో వీళ్లు కళావంతులుగా, భోగం వాళ్లుగా పేరుపడ్డారు. వీళ్ల నాట్యం భోగంమేళం, మేజువాణి, దాసి ఆట, భోగం ఆట, దర్బారు ఆట, కచ్చేరి ఆట అయింది. కులస్త్రీలకన్నా విద్యలో మిన్నలైన ఈ సానుల్ని సంపన్నులు, పండితులు, ప్రభుత్వోద్యోగులు ఆదరించేవారు. దేవుని ఉత్సవాల్లో ఊరేగింపుల్లో, గృహప్రవేశాల్లో పెళ్లి సంబరాల్లో వీరి మేళం పెట్టడం ఆచారం అయింది. సానుల్ని ఉంచుకోవడం, భోగం మేళాలు చూడడం ఆనాడు ఒక సాంఘిక హోదా అయింది. వీళ్ళ వల్ల ఇల్లు ఒళ్ళు గుల్లయి పచ్చని సంసారాలు నేలమట్టం కాజొచ్చాయి." 2
ఇలాంటి వ్యవస్థలో ఉన్న వ్యేశ్యలు క్రమక్రమంగా 19వ శతాబ్దం ప్రధమార్ధానికి వ్యాపార వస్తువులుగా మారిపోయారు. పరిస్థితుల కారణంగా వయసు, కుల బేధం లేకుండా ఎందరో అభాగ్య స్త్రీలు వేశ్యా వృత్తిలో నెట్టివేయబడ్డారు. కటిక దారిద్య్రం, అనాగరికత, నిరక్షరాస్యత, అమాయకత్వం, పేదరికం, ఆకలి వంటి కారణాలతో ఎందరో యువతులు తెలిసీ తెలియక వేశ్యావృత్తిలోకి అడుగుపెట్టి జీవితాలను అర్ధాంతరంగా, దుర్భరంగా ముగించేవారు. 1980 ప్రాంతానికి వేశ్యల జీవితాలను సమాజం చిత్కరించుకొంది. ఇలాంటి నేపథ్యంలో సమాజం దూరంగా పెట్టిన వేశ్యల జీవితాలను మరో కోణంలోంచి చూసిన తెలుగు రచయితలు.. వారూ మనుషులేనని, వారికీ మనసుందని తమ కథల ద్వారా చెప్పారు. వారి వృత్తికి గల కారణాలు ఏమైనా వారి జీవితాల్లోనూ ఔన్నత్యం, ప్రేమ, విలువలు ఉన్నాయని రాశారు. ఇలాంటి కథలే సలీం రచించారు. సలీం రచించిన మనిషి (1980), కుక్కలు (1991), అమ్మ (1995), స్వాతి చినుకు (1995), కథలను పరిశీలించినప్పుడు అందులోని వేశ్య పాత్రల పట్ల సానుభూతి కలుగుతుంది.
2. సలీం కథల్లో వేశ్యపాత్రలు :
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉత్తమ కథా రచయిత సయ్యద్ సలీం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలోని త్రోవగుంటలో జన్మించిన సలీం, కటిక పేదరికాన్ని జయించి కేంద్ర సర్వీసులో ఉన్నతోద్యోగిగా పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యార్ధిగా ఉన్నప్పుడే కథలు రాయడం ప్రారంభించిన సలీం ఇప్పటివరకూ 300 కథలు, 30 నవలలు రచించారు. ఆయన కథల్లోని వేశ్యపాత్రలను పరిశీలించినప్పుడు వేశ్యా జీవితాల పట్ల సానుభూతి కలుగుతుంది. అభాగ్యులు పట్ల సలీం రచనా దృక్పథం అర్థమవుతుంది.
2.1. అమ్మ కథలో నాగమణి పాత్ర :
‘మనుషుల్లో మాయమైపోతున్న మానవత్వం "అమ్మ" కథలో వేశ్యగా బ్రతికే నాగమణి పాత్రలో కనిపిస్తుంది. "ఇంకా మానవత్వం చావలేదు, ఎక్కడో ఏ పతిత గుండెల్లోనో మైలపడకుండా బ్రతికే ఉంది"3 అంటారు రచయిత సలీం. అమ్మ కథలో నాగమణి ఓ వ్యభిచారి. ఇరవై ఐదేళ్ల వయసు ఉండే నాగమణికి నా అనే వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రేమ, ఆప్యాయతలు అంటే తెలియదు. పేదలు నివసించే ఓ ప్రాంతంలో గుడిసెలో ఉంటూ నాలుగు మెతుకులు కడుపులోకి పోవడానికి శరీరాన్ని అమ్ముకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆ మురికి కూపంలోనే ఆమె బ్రతుకు గడిచిపోతూ ఉంటుంది. నాగమణి గుడిసెకు కాస్త దూరంలో స్వరాజ్యం, కొండడి గుడిసె ఉంటుంది. రిక్షా తొక్కే కొండడు ఏరోజుకారోజు రెండు రూపాయలు తెచ్చి స్వరాజ్యాన్ని మహారాణిలా చూసుకుంటూ వుంటాడు. కొండడికి ఓ రోజు విష జ్వరం వస్తుంది. వారి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నాలుగు రోజులు గడిచాక జ్వరం తగ్గుతుంది. కానీ శవంలా మారిన కొండడు ఆకలితో మెలి తిరిగిపోతూ ఉంటాడు. లోకం తెలియని స్వరాజ్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరి ముందు చేయి చాచాలో తెలియదు. ఆప్యాయంగా పలకరించే నాగమణి గుర్తొస్తుంది. నాగమణి అంటే కొండడికి చెడ్డ కోపం. ఆమె నీడ కూడా పడడం ఇష్టం ఉండదు. కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు. స్వరాజ్యం వెళ్లి నాగమణితో ఓ రెండు రూపాయలు ఇవ్వమని ఆకలి తీర్చమని అడుగుతుంది. సమయానికి నాగమణి దగ్గర డబ్బు ఉండదు. ఏం చేయాలో తోచదు. ఆకలి తీర్చాలి. లేదంటే కొండడు చస్తాడు. నాగమణి ఓ కుష్టి రోగి దగ్గరికి వెళ్లి తన శరీరాన్ని రెండు రూపాయలుకు అమ్ముతుంది. ఆ రెండు రూపాయలు తెచ్చి స్వరాజ్యానికి ఇస్తుంది. కొండడి ఆకలి తీర్చమని చెప్తుంది. కథ ఇంతే.
నాగమణి పాత్రను పరిశీలించినప్పుడు ఆమెలోని మానవత్వం గొప్పగా కనిపిస్తుంది. నాగమణి అంటేనే జనం చీదరించుకుని దూరంగా జరిగిపోయే పరిస్థితి. కానీ, ఆ జనం ఎవరూ కొండడి ఆకలి తీర్చడానికి ముందుకురారు. ఆకలి తీర్చి తన భర్తను బ్రతికించమని స్వరాజ్యం అడిగినప్పుడు నాగమణి గుండె కరిగిపోతుంది. తన జీవితాన్ని తృణప్రాయంగా భావించి ఓ కుష్టి రోగికి తన శరీరాన్ని అమ్ముతుంది. ఆ సమయంలో నాగమణి పడిన బాధ కన్నా, ఎన్నడూ తనని సాయం అడగని వ్యక్తికి మేలు చేస్తున్నానన్న ఆనందం వందరెట్లు ఎక్కువగా నాగమణి పాత్రలో కనిపిస్తుంది. అందుకే "ఏ తృప్తి లేని నా జీవితంలో కనీసం ఈ తృప్తి అయినా మిగలరని"4 అంటూ కమ్మని ప్రేమను పంచే అమ్మలా, ఆకలి తీర్చే మాతృమూర్తిలా నాగమణి కనిపిస్తుంది. అమ్ము కథ చదివినప్పుడు దుర్భరమైన జీవితాన్ని గడిపే వ్యభిచారుల్లోనూ మానవత్వం కనిపిస్తుంది.
2.2. కుక్కలు కథలో సీత పాత్ర :
కుక్కలు కథలో సీత ఓ వ్యభిచారి. అయితేనేం, మనసున్న మంచి మనిషి. అలాంటి బ్రతుకులో ఎందుకు పడిందో కూడా తెలియని వయసులో సీత వ్యభిచార జీవితంలోకి అడుగు పెడుతోంది. సీత తన గురించి చెబుతూ.. "ఏం చేయను చెప్పండి. నా చిన్నప్పుడే నన్ను ఎత్తుకొచ్చి ఎవరికో అమ్మేశాడో దుర్మార్గుడు. నా జీవితం ఎంత హేయమైనదో, నికృష్టమైనదో అవగాహనకు వచ్చేలోపలే ఏ పాపాత్ముడి వల్లనో నాకో కొడుకు పుట్టాడు. చూస్తూ చూస్తూ ఆ పసి కందును చంపుకోనూ లేను. వాణ్ణి అనాథను చేసి చావనూ లేను. అందుకే జీవచ్ఛవంలా అయినా ఇలాగే బ్రతుకుతున్నాను."5 అని చెబుతుంది సీత.
సీతను సమాజం చిత్కరించుకుంటుంది. ప్రేమంటే తెలియని బ్రతుకు బ్రతుకుతున్నా ఎవరిని మోసం చేయని మనస్తత్వం సీతది. సీతను నిరుద్యోగి వదినతో పోలుస్తాడు రచయిత సలీం. నిరుద్యోగి వదిన సమాజం మెచ్చిన సంసార జీవితంలో ఉంటుంది. చెడు అంటేనే తెలియని మనిషిగా సమాజం దృష్టిలో పడుతుంది. కానీ ఆమె మంచి మనసు వెనక ఎంతో దుర్బుద్ధి ఉంటుంది. భర్తనే మోసం చేయాలనుకుంటుంది. తన సొంత మరిదితో, కుమారుడు లాంటి వ్యక్తితో పొందు కోరుతుంది. పైకి మంచిగా ప్రవర్తించే ఆమె మనసులో ఎంత దుర్బుద్ధి ఉందో సీతలోని స్వచ్ఛత , మంచితనం, ఔన్నత్యాన్ని గ్రహించినప్పుడు అర్థమవుతుంది. సీత తన శరీరం అమ్ముకుంటుందే కానీ, మనసు పవిత్రంగానే ఉంటుంది. సీత మనసు మలిన పడదు. అది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇది గమనించిన నిరుద్యోగి సీతను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదించాలనుకుంటాడు. సంసార జీవితంలో ఉండీ దుర్బుద్ధి కలిగిన కొందరి మనస్తత్వాలను ప్రస్తావిస్తూ నిరుద్యోగి పాత్ర ద్వారా సలీం ఇలా చెబుతారు... "వీళ్ళ కన్నా వేశ్యలే నయం. నిజాయితీగా శరీరాన్ని అమ్ముకొని పొట్ట పోసుకుంటారు."6 ఆనాటి సమాజంలో సీతలాంటి స్త్రీలు కొందరు ఉండవచ్చు. సమాజం చూడని స్త్రీల హృదయాలను సలీం చూశారు. అందుకే సీతలాంటి పాత్రను సృష్టించి తన కథల్లో పొందుపరిచారు.
2.3. స్వాతిచినుకు కథలో వేశ్య పాత్ర :
స్వాతి చినుకు కథలోని వేశ్య పాత్రకు పేరు లేదు. ఆమె వయసు ఇరవై సంవత్సరాలు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ దగ్గరలో వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్న గుడిసెలో నివాసం ఉంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరూ లేని ఒంటరితనం వారిది. ప్రేమ, ఆప్యాయతలూ ఎరుగని వ్యక్తిత్వం ఆమెది. వృద్ధులైన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఆమెకు తెలిసిన మార్గాలు.. రోజు కూలి, కూలి దొరకనప్పుడు కడుపు నింపుకోవడానికి పడుపువృత్తి. ఆమె జీవితం సర్వస్వం బాధలమయమే. ప్రేమతో కూడిన పిలుపు కోసం ఆమె పరితపించేది. స్వాతి చినుకు కథలో కథానాయక పాత్ర గురించి క్లుప్తంగా పరిచయ వాక్యాలు ఇవి. వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ ఆమె ఆలోచనలు, వ్యక్తిత్వం ఉన్నతమైనవిగా కనిపిస్తాయి.
ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివే ఓ విద్యార్థి ఆమెకు పరిచయమవుతాడు. రెండేళ్ల వీరి పరిచయం స్నేహంగా, ప్రేమగా మారిపోతుంది. ఆ విద్యార్థికి ఆమె ఓ వేశ్య అని తెలుస్తుంది. రెండేళ్ల వీరి స్నేహంలో, ప్రేమలో తెలిసిన ఆమె వ్యక్తిత్వం ముందు వేశ్య అనే పదాన్ని ఆ విద్యార్థి పెద్దగా పట్టించుకోడు. వేశ్య అయినప్పటికీ ఆమె స్నేహాన్ని అంగీకరిస్తాడు. అతని గొప్ప మనస్తత్వం ముందు ఆమె కరిగిపోతుంది. ఆనాటి నుంచి పాత జీవితాన్ని వదిలేసి మంచి మనిషిగా మారిపోతుంది. వీరి మధ్య ప్రేమ కన్నా, మోహానికన్నా, కామానికన్నా అతీతమైన బాంధవ్యం నెలకొంటుంది. అందుకే ఆ యువకుడు సమాజం గురించి ఆలోచించడు. సమాజం ఏమనుకున్నా పట్టించుకోడు. ఆమె కూడా అతని స్నేహమాధుర్యంలో అన్నీ మర్చిపోతుంది. ఎన్నో విలువలను అతని నుంచి నేర్చుకుంటుంది. అప్పటీకే ఎవరి ద్వారానో ఆమె గర్భవతి. ఎమ్మెస్సీ విద్య పూర్తవడంతో ఆ విద్యార్థి పరిశోధన కోసం రుర్కి వెళ్ళిపోతాడు. వీరి మధ్య స్నేహ సంబంధాలు తెగిపోతాయి. అయినప్పటికీ అతని నుంచి నేర్చుకున్న గొప్ప ఔన్నత్యాన్ని, క్రమశిక్షణను తన బిడ్డకు నేర్పుతుంది. ఎంతో ఉన్నతంగా పెంచి కేంద్ర సర్వీసులో అధికారిగా మారుస్తుంది. మంచి వ్యక్తి పరిచయం ఆమె జీవితాన్నే మార్చి వేస్తుంది. మనిషి మారాలన్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. తెలిసి తెలియని పరిస్థితుల్లో, ఆర్థిక కారణాలవల్ల కొందరు తప్పుదారి పడుతుంటారు. కానీ వారిలోని మంచితనం అలాగే ఉంటుంది. ఆ మంచితనాన్ని మేల్కొల్పినప్పుడు వారి జీవితమే కాదు, తదనంతర వారసత్వం కూడా ఉన్నతమైన మార్గంలో పయనిస్తారని స్వాతి చినుకు కథలో వేశ్య పాత్ర ద్వారా అర్థమవుతుంది.
2.4. మనిషి కథలో కమల పాత్ర :
మనిషి కథలో కమల పాత్ర చాలా దయనీయంగా కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో వ్యభిచార వృత్తిలో ఉండే వారి జీవితాలు ఎలా చిత్రమైపోతాయో కమల పాత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. దారుణమైన పరిస్థితుల్లో పుట్టి, దారుణమైన పరిస్థితుల్లోనే చనిపోతుంది కమల. కానీ, ఆమెలోని మంచితనం, త్యాగం, మాట కోసం కట్టుబడిన మనస్తత్వం, ఆమెను గొప్ప స్త్రీ మూర్తిగా చూపిస్తాయి. కమల తల్లి ఓ వ్యభిచారి. కానీ, తన కూతురు కమల తనలా జీవించాలని కోరుకోదు. ఎందుకే చిన్నప్పటి నుంచీ కమలకు ఒకటే చెబుతుంది.. తనలా వ్యభిచార వృత్తిలో ఉండకూడదని, ఒకరితోనే జీవితం పంచుకోవాలని, ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని. ఈ మాటలు కమల మనసులో బలంగా నాటుకు పోతాయి.
కమల యుక్త వయసులో ఉండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. కమల ఒంటరిగా అయిపోతుంది. ఆమె పుట్టి పెరిగింది అత్యంత దారుణమైన వాతావరణం. బయటపడే మార్గం ఉండదు. కమలని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించాలని ప్రయత్నిస్తారు. కానీ కమల ఒప్పుకోదు. ఓసారి ఓ పెద్దమనిషిలా కనిపించే వ్యక్తి కమలని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబరచుకుంటాడు. అతని కోరిక తీర్చుకొని సంతోషపడతాడు. కానీ కమల మాత్రం మానసికంగా అతన్ని భర్తగానే ఊహించుకుంటూ ఉంటుంది. అతను తరచూ వచ్చి వెళ్తూ ఉంటాడు. మరొకరి దగ్గరికి వెళ్ళమని కమలను ఎంత హింసించినా, కొట్టినా, కడుపు మాడ్చినా, చంపేస్తామని బెదిరించినా ఎవరి దగ్గరకు వెళ్ళదు కమల. " నన్నీ నరకం నుంచి బయటకు తీసుకెళ్లండి సారు.." అంటూ అతన్ని ఎన్నోసార్లు కమల బ్రతిమాలుతుంది. కానీ, కేవలం సుఖం కోసమే కమల దగ్గరకు వచ్చే అతను ఈ విషయం పట్టించుకోడు. రోజులు గడిచిపోతాయి. కమలకు ఆడపిల్ల పుడుతుంది. కొంత కాలానికి ఆ వ్యక్తి దూరమైపోతాడు. దిక్కుతోచని కమల, మరొకరికి తన శరీరాన్ని అప్పగించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. "వాళ్ళ అమ్మ కోరిక తీర్చింది సారూ.. జీవితంలో ఒకరినే నమ్ముకుంది".7 కథలోని ఈ చివరి వాక్యం కంటనీరు తెప్పిస్తుంది. కమల తల్లి వ్యభిచారి అయినప్పటికీ, అలాంటి వాతావరణంలో పుట్టినప్పటికీ, ఒక్కరితోనే జీవితం పంచుకోవాలని తల్లి చెప్పిన మాటలను కమల పాటించింది. ఆమెను హింసించినా, కడుపు కాల్చినా, చంపేస్తామని బెదిరించినా, కమల భయపడలేదు. ఒక్కరితోనే ఉండాలని నిర్ణయించుకుంది. వేశ్యావృత్తిలో ఉండే వారిలో కమల పాత్ర ద్వారా వారిలోని మరో కోణం కనిపిస్తుంది. కమల పాత్రలో నిజమైన ప్రేమ, త్యాగం కనిపిస్తుంది.
3. ముగింపు:
ప్రముఖ భారతీయ రచయిత ప్రేమ్ చంద్ కథానిక గురించి చెబుతూ.. "ఏదో ఒక సమస్యను ప్రతిబింభించడమే కథను ఆకర్షవంతం చేయడానికి ఉత్తమ సాధనం. జీవితంలో నిత్యం ఇలాంటి సమస్యలు ఎన్నో తలెత్తుతుంటాయి. వాటి మూలంగా జనించే సంఘర్షణ కథానికను రసవంతం చేస్తుంది."8 అంటారు.
కొన్ని సంవత్సరాల క్రితం సమాజంలో నెలకొన్న వ్యభిచారవృత్తిలో, వేశ్యల జీవితాల్లో ఇలాంటి సంఘర్షనే నెలకొంది. కొందరు రచయితలు మాత్రమే వారి జీవితాలను లోతుగా పరిశీలించారు. వారి మనస్తత్వం వెనుకున్న మరో కోణాన్ని ఆవిష్కరించారు.
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం వేశ్య జీవితాలను, వారి మనసు లోతులను దర్శించారు. వ్యభిచార పాత్రలను సృష్టించి వారి మనస్తత్వం వెనుక ఉన్న గొప్పతనం, వ్యక్తిత్వం, స్వచ్ఛమైన ప్రేమ, నిబద్దతని తన కథల రూపంలో అందించారు.
ఆలోచింపజేసే కథలు ఎప్పటికీ నిలిచిపోతాయి. సలీం రచించిన వేశ్యా జీవితాలు, అందలి పాత్రలూ, వ్యక్తిత్వాలను అర్థం చేసుకున్నప్పుడు వారి మనసుల్లోని గొప్పతనం అర్థమవుతుంది.
4. పాదసూచికలు:
- స్వాతి చినుకులు, కథల సంపుటి, పుట - 194
- నూరేళ్ల కన్యాశుల్కం, పుట - 24
- స్వాతి చినుకులు, కథల సంపుటి, పుట - 194
- పైదే, పుట - 194
- పైదే, పుట - 44
- పైదే, పుట - 47
- పైదే, పుట - 204
- ప్రేమ్ చంద్ కథలు, పుట - 5
5. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు , గురజాడ. కన్యాశుల్కం, ముద్రణ, ఎమెస్కో ప్రచురణలు, విజయవాడ, 2007.
- ప్రేమ్ చంద్, ప్రేమ్ చంద్ కథలు, అనువాదం: రామచంద్రరావు చావలి, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2018.
- రమణయ్య రాజా, పి. వి. ప్రత్యేక సంచిక అధ్యక్షులు: నూరేళ్ల కన్యాశుల్కం, వెలుగు పబ్లికేషన్స్, విజయనగరం
- వెంకట చలం, గుడిపాటి. ఆమె త్యాగం, ఆహ్వానం మాసపత్రిక, 1995 అక్టోబర్ సంచిక.
- సలీం. స్వాతి చినుకులు. కథలసంపుటి, శ్రీ విజయ పబ్లికేషన్స్, విజయవాడ, 1996.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.