AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. రెడ్డికుల వృత్తిగాయకులు ‘భిక్షుక కుంట్లు’: ప్రదర్శనవిధానం
నర్రా లవేందర్ రెడ్డి
పరిశోధకులు, కాకతీయవిశ్వవిద్యాలయం.
తెలుగు సహాయాచార్యులు, నాగార్జున ప్రభుత్వ కళాశాల,
నల్గొండ, తెలంగాణ.
సెల్: +91 9849723772, Email: lavendarreddy@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భిక్షుకకుంట్ల గురించి ప్రత్యేకంగా పరిశోధనలు చేసిన దాఖలాలు కనిపించవు. కానీ మొదటిసారిగా 1986 సంవత్సరంలో ఎన్. యాదగిరి శర్మగారు ’జానపద భిక్షుకగాయకులు' అనే సిద్ధాంత వ్యాసంలో శైవభిక్షుక గాయకులుగా బిక్షుకకుంట్ల కళారూపాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇందులో పరిశోధకుడు కళారూపం ప్రదర్శించే మౌఖికసాహిత్యాన్ని ప్రధానంగా చర్చించారు. అలాగే 1985 సంవత్సరంలో డా. మూలే విజయలక్ష్మి గారు, 1994 సంవత్సరంలో డా. రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కళాకారులు చెప్పే రెడ్డి కులగాధను స్వీకరించి తమ గ్రంథాల్లో పొందుపరిచారు. కానీ కళారూపం ప్రదర్శన విధానాన్ని గాని, వారి కట్టడి నియమాలను గాని, రెడ్డి కులం దగ్గర వారికుండే హక్కులను గాని ప్రస్తుతం కళారూపం సామాజిక స్థితిగతులను గాని చర్చించలేదు. జానపద కళా రూపాల్లో వృత్తి గాయకులుగా పిలువబడుతున్న భిక్షుకకుంట్ల కళాకారులు తెలంగాణ ప్రాంతంలో అంతరించి పోయి కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే కనిపిస్తున్నారు. వీరి ఉనికి ఆంధ్రలో ఉన్నప్పటికీ తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న రెడ్డి వారి దగ్గర హక్కులు కలిగి ఉన్నారు. కళాకారులకు ఎవరికైతే తెలంగాణాలో వంశపారంపర్యంగా సంక్రమించిన మిరాశి గ్రామాలున్నాయో, ఆయా గ్రామాలకు నియమంగా వచ్చి ప్రదర్శనిస్తూ తమ సంస్కృతిని నిలుపుకుంటున్నారు. ఎంతో ప్రాచీనమైన చరిత్ర కలిగిన భిక్షుకకుంట్ల మౌఖిక సంపద, ప్రదర్శనా విధానం, కళారూపంలో వస్తున్న మార్పులను మరియు వారి యొక్క సంస్కృతీవైవిధ్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వ్యాసం రాయడం జరిగింది. క్షేత్రపర్యటన, ముఖాముఖిల ద్వారా విషయదాతల నుండి, పరిశోధనల నుండి విషయసేకరణ చేయడమైనది. వివరణాత్మకపద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: వృత్తిగాయకులు, భిక్షుకకుంట్ల , రెడ్ల పురాణం, ఆదిరెడ్డి, మిరాశి గ్రామాలు, గోత్రాలు
1. ఉపోద్ఘాతం:
రెడ్ల కులానికి ఆశ్రిత కళారూపం భిక్షుకకుంట్లు. ఇది ఆశ్రిత జానపద కళారూపాల్లో ప్రాచీనమైన కళారూపం. తరతరాలుగా రెడ్డికులానికి చెందిన పురాణాన్ని కథాగానం చేస్తూ, వారి యొక్క గోత్రాలను కీర్తిస్తూ వస్తున్న అరుదైన కళా రూపం. ఆది నుండి శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేసే కళారూపాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని రెడ్ల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తున్న వీరి సంస్కృతి విశిష్టమైనది. మారుతున్న కాలాన్ని బట్టి కళారూప ప్రదర్శనలో మార్పులు చేసుకుంటూ, నేటికీ తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. రోజుల తరబడి ప్రదర్శించే కుల పురాణాన్ని రెడ్ల వారి వీలును బట్టి తగ్గించుకొని, వారి మెప్పును పొందుతూ, వారిచ్చే ప్రతిఫలం స్వీకరించి జీవించడం విశేషం. ఆధునిక పోకడలు గతం తాలూకు కళా సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పటికీ అటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి జీవనం సాగిస్తూ మౌఖికంగా ప్రచారంలో ఉన్న రెడ్ల పురాణాన్ని కాపాడుతూ ప్రాచుర్యం కల్పిస్తున్న కళాకారులు బిక్షుకకుంట్ల కళాకారులు. వీరి కళా నైపుణ్యాన్ని, ఔన్నత్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని విభిన్న కోణాల్లో ఆవిష్కరించడమైనది.
2. సాహిత్యంలో పిచ్చుకకుంట్ల ప్రస్తావన:
భిక్షుకకుంట్ల కళాకారులను పిచ్చుకకుంట్ల అని కూడా పిలుస్తారు. క్రీ.శ.12 శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు ద్విపదలో రచించిన పండితారాధ్య చరిత్రలో-
‘‘వీవంగజేతులు లేవయ్యా నడచి
పోవంగగాళ్లును లేవయ్యా యంధ
కులమయ్య పిచ్చుక గుంటలమయ్య
తలపోయ నభ్యాగతుల మయ్యా’’ (పర్వత ప్రకరణం, పుట-237)
అనే పద్యంలో చాచటానికి, వీచటానికి చేతులే లేవయ్యా, నడిచిపోవడానికి కాళ్లు కూడా లేవయ్యా, కబోదులమయ్యా, అందుళమయ్యా, పిచ్చుకగుంట్లమయ్యా, మేము అభ్యాగతుల మనుకోండి అయ్యలారా అంటూ శ్రీశైలం పర్వతం మీద పేరొందిన శివభక్తులను తలుచుకుంటూ పాడటం కనిపిస్తుంది. ఇందులో సోమనాథుడు పిచ్చుకకుంట్ల కులాన్ని ప్రస్తావించాడే గానీ, రెడ్డి కులానికి ఆశ్రితులనే విషయాన్ని ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆ కాలం నాటికే ‘పిచ్చుకకుంట్ల’ కులం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కళాకారులు ఈ పిచ్చుకకుంట్ల కులంలోనే గంట, కత్తి, తిత్తి, తురక అనే నాలుగు తెగలున్నాయి. ఇందులో కత్తి, తిత్తి అనే పిచ్చుకకుంట్ల వారు రెడ్లను, తురక పిచ్చుకకుంట్ల వారు గొల్లవారిని, గంట పిచ్చుకకుంట్ల వారు కమ్మవారిని ఆశ్రయిస్తారని చెప్తారు. అయితే ఇందులో రెడ్డి వారిని ఆశ్రయించే గంట, కత్తి వారు ప్రధానమైన కళాకారులు. వృత్తి గాయకులు లేదా ఆశ్రిత గాయకుల పుట్టుక వృత్తాంతానికి చెందిన కథల్లో దాదాపుగా ఒకే కుటంబంలో జన్మించి ఏదైనా కారణం చేత అన్నదమ్ముల్లో ఒకరు ఆ కులానికే ఆశ్రిత గాయకునిగా, అంటే వారి కులపురాణాన్ని కీర్తించే వ్యక్తులుగా మారుతారు. అట్లాగే బిక్షుకకుంట్లకళాకారుల వృత్తాంతం పుట్టుక కథను పరిశీలిస్తే కూడా అలాగే కనిపిస్తుంది.
3. భిక్షుకకుంట్ల పుట్టుక వృత్తాంతం:
భిక్షుకకుంట్ల పుట్టుకకు సంబంధించిన వృత్తాంతం రెడ్ల పురాణంలోనే కనిపిస్తుంది. రెడ్డి కులానికి మూలపురుషుడు ఆదిరెడ్డి. పురాణాన్ని బట్టి బ్రహ్మ పెద్దకుమారుడు బ్రాహ్మణుడు, రెండవ వాడు క్షత్రియుడు, మూడవ వాడు వర్తకుడు (శెట్టి,వైశ్యుడు), నాలుగవ వాడు ఆదిరెడ్డి. అప్పుడు ‘త్రిమూర్తులను బ్రాహ్మణుడు మొదట నన్ను పుట్టించడానికి కారణమేమని అడుగగా, రానున్నది కలియుగమని, కలియుగం ఏర్పాటు చేసిన పిమ్మట భూమి మీదికి వెళ్ళి సేద్యం చేసి, దున్నరాని దుక్కిదున్ని పండరాని పంటలు పండిరచి, ఆదియోగి, సగిలి సన్యాసికి, రాశిలోని కప్పకు, ఆకాశంలో వెళ్లే పక్షికి, అందలంలో ఉన్న రాజుకు 84 లక్షల జీవరాశులకు ఆధారభూతుండవై జీవించాలని అడుగుతాడు. అందుకు బ్రాహ్మణుడు నా వల్ల కాదంటాడు. అయితే కలియుగంలో ఎట్లా జీవిస్తానని అంటాడు బ్రహ్మ. కలియుగం ఏర్పాటు అయిన తర్వాత రచ్చరుగు, రావరుగు నిర్మిస్తారు కదా! పౌరోహిత్యం చేస్తూ, వారిచ్చే కట్నకానుకలు తీసుకొని జీవనం సాగిస్తానంటాడు. ఆ తర్వాత క్షత్రియున్ని అడిగాడు బ్రహ్మ. అతను నేను వ్యవసాయం చేసి పంటలు పండియ్యలేను కానీ, కొన్ని ఊర్లకు రాజునయ్యి దుష్ట శిక్షణా, శిష్ట రక్షణ చేస్తానంటాడు. ఆ తర్వాత వర్తకుడైన శెట్టిని అడుగుతాడు. ఆయన తెలివైనవాడు. అతను ముందు చూపుగా ఇఫ్పుడే నేను చెప్పలేనని, నేను మొదట ఏరువాకకు పంటలు వేస్తాను. అవి పండిన దాన్ని బట్టి సంవత్సరం తర్వాత చెప్తానంటాడు.
చివరగా ఆదిరెడ్డిని అడుగగా! అతను ఒప్పుకొని నాకు పద్దెనిమిది మంది పని బాపనుగాళ్లు, పది మంది దేవతలు నాకు అదుపు ఆజ్ఞలో ఉండాలి. వర్షం కురవ మంటే కురవాలి. నిలువమంటే నిలువాలి, అప్పుడే చేస్తానంటాడు. అంతేగాక గోవులు ముప్పొద్దులు పాలియ్యాలని అనగా బ్రహ్మదేవుడు ఒప్పుకుంటాడు. అప్పుడు ఆదిరెడ్డికి ఆదిలక్ష్మిని సృష్టి చేసి గంధర్వ వివాహం చేసి కలియుగం పంపిస్తాడు బ్రహ్మ. ఆదిరెడ్డి బ్రహ్మకిచ్చిన మాట ప్రకారం సేద్యం చేస్తూ కీర్తి గడిరచడమే గాక, అతని రెడ్డి వంశం వృద్ధి చెందుతుంది.
ఆదిరెడ్డికి ఏకైక సంతానం పిల్లలమర్రి బేతిరెడ్డి, ఇతని కాలంలో సకాలంలో వర్షాలు పడటం, పంటలు విస్తారంగా పండటం, కామధేనువులు పాలు ఇవ్వడంతో భూ దేవతయే దేవతయని, కామదేనువే దేవుడని, సృష్టికి కాపుదేవుడే దేవుడని, దేవుడనే వాడు లేడని భావనకు వచ్చి దేవున్ని తిరస్కరిస్తాడు. ఇందుకు కోపగించిన పరమశివుడు అతని పన్నెండు మంది సంతానంలో ఉత్తమారెడ్డి, సత్తమారెడ్డి, అన్నవేమారెడ్డికి సంతానం లేకుండా చేస్తాడు. ఇందులో ఉత్తమారెడ్డి భార్య పెదమంగమ్మ, సత్తమారెడ్డి భార్య చిన మంగమ్మ, అన్నవేమారెడ్డి భార్య వన్నమాదేవి, వీరికి కలలో పరమశివుడు కనిపించి సంతానం లేకపోవడానికి కారణాన్ని తెలిపి, నేను శ్రీశైలం వెళుతున్నానని, నాకు గుళ్లు గోపురాలు లేవని, నాకు మీరంతా పన్నెండు వేల బండ్లు కట్టుకొని వచ్చి, నాకు గుళ్లు గోపురాలు కట్టిస్తేనే మీకు కులం ఉద్ధరించడానికి కుమారులను, గోత్రం ఎంచు కోవడానికి ఆడబిడ్డలను ఇస్తానంటాడు. ఇదే విషయాన్ని అక్కాచెల్లెల్లు వెళ్లి మామ బేతిరెడ్డికి చెప్పగా, శివుడు శ్రీశైలం వెళ్లడం ఏంటని మీకు సంతానమివ్వడానికి శివునికి సంబంధం ఏంటని తిరస్కరిస్తాడు. చివరికి ఆ పరమశివుడు బేతిరెడ్డికి కలలో వచ్చి చెప్పగా, అప్పుడు పశ్చాత్తాపం చెంది, ఆది దేవున్ని పూజించక తప్పుచేశానని, ఆ పరమశివుడు చెప్పినట్లుగా 10వేల బండ్లు కట్టించుకొని శ్రీశైలం వెళ్లి శివునికి గుళ్లు గోపురాలు కట్టించాడు.
శివుడు కోరిక తీర్చడంతో వారికి సంతామివ్వదలుస్తాడు శివుడు. అయితే అప్పుడు పరమేశ్వరుడు ఈ కాపులంతా ఒక్కటే పాకనాటి, పెడకంటి, కొడదకాపు, మోటాటి, గుటాటి అందరికీ ఇంటిపేరు, వేరువేరు గోత్రాలు ఉండాలని, కులగోత్రాలు లేకుంటే ఎట్లాయని, వావివరసలు ఉండాలని భావిస్తాడు. రెడ్డి వారికి ఆచారాలు కట్టుబాట్లు ఉండాలంటే, కులగోత్రాలు చెప్పడానికి, ఒకరుండాలనుకొని, రెడ్డి కులంలోనే ఒకరికి గర్భంలో కొద్దిగా లోపం చేసి పుట్టియ్యాలని, పరమేశ్వరుడు ఆలోచన చేసి, కుంటివాడిని పుట్టియ్యాలనుకుంటాడు. ఆ ప్రకారంగా ఉత్తమారెడ్డి, పెదమంగమ్మ దంపతులకు ఆరుగురి సంతానంతో పాటు తోబుట్టువు అమ్మోజమ్మను, సత్తమారెడ్డి, చిన్నమంగమ్మ దంపతులకు అంగవైకల్యంతో కూడిన మల్లారెడ్డిని, తోబుట్టువు తిమ్మోజమ్మను ప్రసాదిస్తాడు.
ఆ తరువాత పరమేశ్వరుడు వీరికి చదువులు నేర్పాలని తనే గురువై, పెదమంగమ్మ ఆరుమంది సంతానికి సకల శాస్త్రాలతో పాటు రామాయణం, భారతం, భాగవతం వంటి ఇతిహాసాలను నేర్పిస్తాడు. ఇక చిన్న మంగమ్మ కుమారుడు మల్లారెడ్డి పిల్లలు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పట్టణం చేరుకుంటారు. వీరి పాండిత్యాన్ని తెలుసుకోవడానికి పురజనులంతా కచేరికి వస్తారు. అక్కడ పెద మంగమ్మ ఆరుమంది పిల్లలు సకల శాస్త్రాలను ప్రదర్శించగా, మల్లారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా కులగోత్రాలను, రెడ్డి వంశ నియమాలను ప్రదర్శిస్తాడు. అక్కడికి వచ్చిన వారంతా కూడా అర్థంకాక ఆశ్చర్యపోతారు. అతని తల్లి కూడా ఇన్ని సంవత్సరాలు చదివింది ఇదేనా పిచ్చికుంటి మల్లారెడ్డి అని చింతిస్తుంది. రాజుమాత్రం ఇంతకు ముందులేని బిరుదులు, బిరుదాంకితాలు తీసుకొచ్చి కొత్తగా చెప్పిండని, నువ్వు బిరుదుగోత్రం చెప్ప ‘భిక్షకుంట మల్లారెడ్డి’వని పేరు చెప్తాడు. అలాగే అతని కాలు కుంటి భిక్షకుంటి మల్లారెడ్డియే రానురాను వ్యవహారంలో పిచ్చుకకుంట్ల మల్లారెడ్డిగా మారింది. ఆ పరమశివుడు రెడ్డికులానికి గుర్తులేని విషయాన్ని చెప్పినవాడే గురువని, నేటి నుండి రెడ్లకు గురువు భిక్షకుంటి మల్లారెడ్డి అని దీవిస్తాడు. అంతేగాక మల్లారెడ్డి పుట్టగానే ఆ పరమశివుని ఇంటిపేరు హేమాక్షి వారని, గోత్రం పాలాక్షి గోత్రమని చెప్పిండట, హేమాక్షి వారిని వెంటబెట్టుకొని రాగా, పాలాక్షి గోత్రంబు పట్టి చెప్ప, బిరుదుగోత్రం చెప్ప భిక్షకుంటి మాల్లారెడ్డిగా వర్ధిల్లుమని ఢక్కి, ఢమరుకం, త్రిశూలం, దానంగా ఇచ్చాడట శివుడు. అంతటి ప్రతిభావంతుడు కుంటిమల్లారెడ్డి. అటువంటి కుంటి మల్లారెడ్డి రెడ్డివారికి కులగురువని, రెడ్డి గోత్రాలు చెప్పినందుకు ఏమిస్తారని ఆరుమందిని అడుగుతాడు పరమశివుడు. వారంతా మా అందరికంటే అతనికే ఆస్తి ఎక్కువగా ఉందని, అతనికి మేమిచ్చేది ఏమీ లేదంటారు. అందుకు పరమశివుడు కుంటిమల్లారెడ్డి ఆస్తి కూడా మీరే తీసుకొమ్మంటాడు. కానీ అతనికి సంవత్సరానికి మేటైన ధర్మభాగంతో పాటు నందివాహనం మీద గంట వాయించి గోత్రాలు చెప్పినందుకు గోదానమివ్వాలని, గోవులేని వారు మాణిక్యం, మాణిక్యం లేని వారు ఇంటికి ఒక ‘వర’ ఇవ్వాలంటాడు. అంతేగాక పంచభక్ష పరమన్నంతో భోజనం పెట్టి, మీ ఇంటి ఆడపడచును సాగనంపినట్లు పంపాలని చెప్తాడు. అందుకు రెడ్డి వారంతా సమ్మతించగా, రాగి శాసనాలు తయారు చేయించి, వాటి మీద రెడ్డి వారిచ్చే గోదానాలు, భూ దానాలు అన్నీ రాయించి ఆ పరమశివుడు కుంటి మల్లారెడ్డికి అప్పజెప్పుతాడు. ఆ కుంటి మల్లారెడ్డి సంతతియే ప్రస్తుతం రెడ్డి కులానికి పురాణం చెప్పుతూ, గోత్రాలు చెప్పే భిక్షుకకుంట్ల కళాకారులు.1(కత్తి లక్ష్మీనారాయణ)
4. కథకులు ప్రదర్శనవిధానం:
భిక్షుకకుంట్ల కళాకారులకు వంశానుగతంగా సంక్రమించిన మిరాశి గ్రామాలు ఉంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కళా ప్రదర్శన నిమిత్తం వెళతారు. రెడ్డి వారికి పంట చేతికి వచ్చే కాలంలో అంటే జనవరి మాసంలో కుంటి మల్లారెడ్డికి ఇంటిదగ్గర పూజ చేసుకుని గ్రామాల మీదికి బయలుదేరుతారు. మిరాశి గ్రామంలో కళాకారులు మొదట నియమం ప్రకారం రెడ్డి కులానికి చెందిన పెదకాపు (పెద్ద రెడ్డి)ను కలుస్తారు. అతనితో పాటుగా ఇతర రెడ్డి కులస్తులను కలిసి కట్టడి ప్రకారం పురాణం చెప్పడానికి ఒప్పందం కుదుర్చుచుకుంటారు. ప్రదర్శన మాత్రం రెడ్డి కులం వారు ఉండే వీధిలో గాని లేదా పెదకాపు ఇంటి ముందు గానీ వేదిక నిర్మించుకొని ప్రదర్శిస్తారు.
(రెడ్డికుల వృత్తిగాయకులు: భిక్షుక కుంట్లు - ప్రదర్శన)
‘ప్రదర్శనలో కళాకారులు ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. ఇందులో ప్రధాన కథకుడు దోతి లేదా లుంగి కట్టుకుని,అంగీ ధరించి, తలపాగా చుట్టుకుని, నుదుట విభూది తో శైవ నామాలు ధరించి, నడుముకు ఎర్రని పంచె కట్టుకుంటాడు. ఒక చేతిలో కత్తి,మరొక చేతిలో డాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని కథాగానం చేస్తాడు. అతనికి ఇరువైపులా ఇద్దరు గుమ్మెటలు వాయిస్తూ వంత పాడుతారు. మరొకరు హార్మోనియం వాయిస్తారు.’2 (కత్తి రమణయ్య)
కళాకారులు చెప్పే రెడ్డి కుల పురాణాన్ని ఘట్టాలుగా విభజించుకుని ఆరు రోజులు చెప్తారు. రెడ్డి వారికి రాత్రి సమయంలోనే తీరిక ఉంటుందని రాత్రి సమయంలో పురాణాన్ని కథాగానం చేస్తారు.
మొదటి రోజు రెడ్డివారి పుట్టుక వృత్తాంతం మరియు కుంటి మల్లారెడ్డి జననం. రెండవ రోజు దేవగిరి పట్టణానికి ఢిల్లీ నవాబ్ పాశ్చార్ రావడం, ఆమ్మోజమ్మలను, తిమ్మోజమ్మలను వివాహం చేసుకుంటాననడం, కుంటి మల్లారెడ్డి నవాబును ఒప్పించి, పెళ్లికి సిద్ధమై రమ్మని పంపడం., మూడవరోజు నవాబు భారీ నుండి రెడ్డి ఇంటి ఆడపడుచులను కాపాడటం, రెడ్డి వారంతా దక్షిణాదికి బయల్దేరి కాసేరు నది దాటడం, వీరిని వెంబడిరచిన నవాబు కాసేరు నదిని దాటలేక మరణించడం. నాలుగవ రోజు రెడ్డి కుల గోత్రాల విభజన, అమ్మో జమ్మ తిమ్మోజమ్మ ఆత్మాహుతి. ఐదవ రోజు వీర్లకు వెళ్లడం, పెడకంటి వారికి తాళిబొట్టు లేకపోవడం, రాయలవారి పట్టణం అనే గ్రామం చేరి అక్కడ భూములను పొందడం. ఆరో రోజు రాయలవారి అనుజ్ఞత పట్టణం నిర్మించుకొని అక్కడ భూముల్లో బంగారం పండిరచడం కుంటి మల్లారెడ్డి తపస్సుకై శ్రీశైలం వెళ్లడంతో ముగుస్తుంది. పురాణం మధ్యలో చిత్ర కథలు, పిట్టకథలు చెప్పుతూ కథాగానం చేస్తారు.
ప్రదర్శనలో కళాకారులు ప్రేక్షకులను పురాణం పట్ల ఆసక్తిని పెంచడానికి కథలోవచ్చే కరుణం, భీభత్సం, భయానకం, రౌద్రం, హాస్యం వంటి సన్నివేశాల్లో తమ కళానైపుణ్యాలతో ప్రదర్శిస్తారు.
కళాకారులు పురాణ ప్రదర్శన కాకుండా గోత్రాలు మాత్రమే చెప్పమంటే శివగంట దీన్నే నందిగంట అని పిలుస్తారు. ఎవరైతే గోత్రాలు చెప్పుమని రెడ్డివారు పిలుస్తారో వారింటిలో శివగంట వాయిస్తూ గోత్రం చెప్పి దీవిస్తారు. కళాకారులు పెట్టే దీవెనలో వారి ఇంటిపేరు, గోత్రం పేరు చెప్పి-
“మీ ఇంట ధనలక్ష్మి కలిగి, సంసార సౌభాగ్యలక్ష్మి కలిగి, ఆర్థి దీవెన కలిగి, బ్రహ్మదేవుని దీవెన కలిగి, దనకనక వస్తు వాహనాలు కలిగి వెలయు మీ ఇల్లు వైకుంటపురం కలిగి,.. మాకిచ్చిన గోత్ర సంభావన, శ్రీవెంకటేశ్వర స్వామి పేరు చెప్పి, ఒక్కంటి పట్టు వెయ్యిండ్లు సంపద కలిగి, చల్లగా వర్ధిల్లుగలరని” 3 (కత్తి నాగులు) పొడిగింపు చేస్తారు.
5. ప్రదర్శన మార్పులు:
ప్రదర్శనలో కాలాన్ని బట్టి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రధాన కథకుడు చేతిలోకత్తి, డాలు పట్టుకొని కథాగానం చేసేవాడు. ప్రస్తుతం ప్రధాన కథకుడు చేతిలో చిరతలు పట్టుకొని వాయిస్తూ ప్రదర్శిస్తున్నాడు. అలాగే ఏ కళారూపానికైనా వాద్యాలు ప్రధానమైనవి. వీరు ఉపయోగించే వాద్యాల్లో పూర్వం శృతికోసం వంతలిద్దరిలో ఒకరు తోలు తిత్తిని చంకకు తగిలించుకొని, గుక్క విడివని శృతిపోస్తూ, శ్రావ్యమైన శృతిని పలికించేవారు. ప్రస్తుతం దాని స్థానంలో హార్మోనియం ‘పెట్టె’ను ఉపయోగిస్తున్నారు. అట్లాగే పూర్వం కళాకారులు ఉపయోగించే గుమ్మెటలు మట్టితో తయారు చేయించుకుని వాటికి చర్మాన్ని ముడుసుకొనేవారు. ప్రస్తుతం మట్టికి బదులుగా ఇత్తడితో గుమ్మెటను తయారు చేయించుకొని, దానికి చర్మాన్ని ముడుసుకుంటున్నారు. అయితే మట్టి గుమ్మెట చేసే శబ్దానికి, ఇత్తడితో చేసిన గుమ్మెట చేసే శబ్దంలో తేడా ఉంటుందని, కళాకారులు చెప్తారు. అయితే ఈ రెండిరటిలో మట్టి గుమ్మెట చేసే శబ్దం వింటున్నకొద్దీ శ్రావ్యంగా ఉంటుందంటారు కళాకారులు.
పూర్వం పురాణాన్ని ఆరురోజులు చెప్పినా ఆసక్తిగా ప్రేక్షకులు వినేవారు. కానీ సమాజంలో వచ్చిన విభిన్న రకాల మార్పుల వల్ల ఒక్కరోజు లేదా గంటన్నరలో పురాణాన్ని పూర్తి చేసే రోజులకు ప్రదర్శన వచ్చిందంటే, కళారూపం స్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పురాణంలో వచ్చే పద్యాలు, వచనంతో పాటు, చిత్రకథలు చేర్చుకొని కళాకారులు ప్రేక్షకుని అభిరుచిని బట్టి ప్రదర్శించే స్థితి ఉండేది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. కళాకారులు బుర్రకథ రూపంలో సంభాషణలతోనే పురాణాన్ని చెప్తున్నారు.
6. ముగింపు:
కళాకారులు తమకు తరతరాల నుండి సంక్రమించిన సంస్కృతిని అనుసరిస్తూ, ఆధునిక కాలంలో కూడా కళా రూపంలో అనేక మార్పులు చేసుకుంటూ, రెడ్ల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తూనే తమ యొక్క సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటున్నారు. ప్రస్తుత తరంలో కూడా తమ కళను ప్రదర్శిస్తూ, శైవ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ, తమ మూల సంస్కృతిని ఆచరించడం విశేషం.
కళాకారులు రెడ్డి పురాణం ప్రకారం అన్నదమ్ముల వరస అయినప్పటికీ కంచం పొత్తు ఉంది కానీ మంచం పొత్తు లేదు. అయినప్పటికీ ఒకరికొకరు వరసలు పెట్టి పిలుచుకుంటారు. కళాకారులను కూడా రెడ్డి వారు ఇంటి ఆడపడుచుకు చీరసారె పెట్టి సాగనంపినట్లు నేటికీ అదే గౌరవాన్ని అనుసరిస్తున్నారు. అంతేగాక కళాకారులకు హక్కుగా ఇచ్చే దానాలను ఇస్తూ, వారిని ఆదరిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇతర దేశాల్లో స్థిరపడిన రెడ్డివారికి ఫోన్లో కూడా కులగోత్రాలు కళాకారులు చెపుతున్నారు. కళాకారులకు రెడ్డి వారి దగ్గర ఆదరణ ఉన్నప్పటికీ ప్రదర్శించే కళాకారుల సంఖ్య తగ్గుతున్నది. పూర్వం నుండి తండ్రి చేసిన వృత్తిని కొడుకులు అనుసరిస్తూ వచ్చిన తరం మాత్రమే ప్రస్తుతం కళారూపాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. కానీ ఇప్పటి తరం కళా రూపాన్ని ప్రదర్శించడానికి, నేర్చుకోవడానికి ఆసక్తిని చూపడం లేదని, సిగ్గు పడుతున్నారని కళాకారుడు కత్తి లక్ష్మీ నారాయణ మాటల్లో తెలుస్తున్నది. కళాకారులు తమకు వంశ పారంపర్యంగా సంక్రమించిన మిరాశి గ్రామాలను వదలకుండా కళారూపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కళారూపాన్ని ప్రదర్శించే బృందాలు రాయలసీమ ప్రాంతంలో బద్వేలు, పెదరాసిపల్లి, పాయలకుంట్ల, ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, పుల్లంపేట, ఉత్సలవరంలో ఉన్నారు. మైదకూరు దగ్గర ఉత్సలవరంలోనే పదిహేను బృందాల వరకు ఉన్నాయి. వీరందరికీ తెలంగాణాలో మిరాశి గ్రామాలున్నాయి.
ఈ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారులు ప్రస్తుతం యాభై సంవత్సరాలు పైబడిన వారే ఉండటం చేత, ఈ తరం అంతరిస్తే, కళారూపం సంస్కృతి కూడా అంతరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కళారూపం అంతరించిపోకుండా ఉండాలంటే కళారూపం పట్ల యువకులు కూడా ఆకర్షితులయ్యే విధంగా ప్రదర్శనావకాశాలు కల్పించే కృషి జరగాలి. దీనికోసం ప్రభుత్వాలు కళాకారులకు శాశ్వత ఉద్యోగ భద్రతలాంటి చర్యలు తీసుకోవాలి. దీనితో కళారూపం మనుగడ సాగించడానికి దోహదం చేస్తుంది. దీనిచేత భిక్షుకకుంట్ల కళానైపుణ్యం, మౌఖిక సంపద భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుంది.
7. విషయ దాతలు:
- కత్తి లక్ష్మీనారాయణ, వయస్సు 55, ఉచ్చలవరం గ్రామం, మైదుకూరు మండలం, కడప జిల్లా- ఇంటర్వ్యూ.
- కత్తి రమణయ్య, వయస్సు 50, ఉచ్చలవరం గ్రామం,మైదకూరు మండలం,కడప జిల్లా -ఇంటర్వ్యూ. ఉచ్చలవరం గ్రామం, మైదకూరు మండలం కడప జిల్లా ఇంటర్వ్యూ.
- కత్తి నాగులు, వయస్సు 70, ఉచ్చలవరం, గ్రామం, మైదకూరు మండలం, కడప జిల్లా-ఇంటర్వ్యూ.
8. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, వడ్డాది. రెడ్డి సంచిక. ఆంధ్రేతిహాసన పరిశోధకమండలి, రాజమహేంద్రవరం, 1947
- చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి. భక్తమల్లారెడ్డి కథ (రెడ్ల చరిత్ర). అఖిల భారత రెడ్ల సంఘం, శ్రీశైలం, 1994
- రమాపతిరావు, అక్కిరాజు. పాల్కురికి. పండితారాధ్యచరిత్ర. సుపథాప్రచురణలు,హైదరాబాద్, 2004
- రాధాకృష్ణమూర్తి, మిక్కిలినేని. తెలుగువారి జానపదకళారూపాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1992
- రామిరెడ్డి, నల్లమిడి. "రెడ్లు" రెడ్డి రాణి. అక్టోబర్ 1933.
- సీతారామాచార్యులు, బహుజనపల్లి. శబ్దరత్నాకరం. మద్రాస్ స్కూల్ బుక్ అండ్ లిటరేచర్ సొసైటీ, మద్రాస్, 1947
- సురేష్, బాసని. హరికృష్ణ, మామిడి. (సంపా.) తెలంగాణ జానపదకళాసౌరభాలు. భాషాసాంస్కృతికశాఖ, హైదరాబాద్, 2023
- సోమశేఖరశర్మ, మల్లంపల్లి. రెడ్డిరాజ్యాల చరిత్ర, త్రినేత్ర పబ్లికేషన్స్, శ్రీశైలం, 1998
- హనుమారెడ్డి. బి. రెడ్డి వైభవం. రెడ్డి జనాభ్యుదయ సంఘం, ప్రకాశంజిల్లా, 2017
- హరికృష్ణ మామిడి. కళాతెలంగాణ. భాషాసాంస్కృతికశాఖ, కళాభవన్, హైదరాబాద్, 2017
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.