headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. శ్రీమన్మహాభారత మహాప్రస్థాన-స్వర్గారోహణపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

dr_mbss_narayana.jpg
డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966108560. Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

వ్యాసభగవానుడు ప్రవచించిన పద్దెనిమిది పర్వాల ఈ మహాభారతేతి హాసంలో చివరి రెండు పర్వాలైన మహాప్రస్థాన-స్వర్గారోహణ పర్వాలలో ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం సంపూర్ణముగా ఆవిష్కృతమవుతుంది. ధర్మము తప్ప మరేదీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని నిరూపించినవాడు ధర్మజుడు. దివ్య శక్తులు, అస్త్రశస్త్రాలు, బలాలు, బలగాలు, రాజులు, రాజ్యాలు, బంధుత్వాలు, అన్నీ అశాశ్వతమే. చివరికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు కూడా వచ్చిన పని పూర్తి చేసుకుని తనువు చాలించాడు. స్వర్గారోహణపర్వంలో చివరి వరకూ పయనం సాగించినది కేవలం ధర్మదీక్షాపరుడైన ధర్మజుడే. అందుకే ఆ ధర్మనందనుడి పాదాలకి సాక్షాత్ ఆ పరమాత్ముడే ప్రణమిల్లాడు. పంచపాండవులలో ఒకరు మరణించినా మిగిలినవారు జీవించరు. అలాగే సోదరులు మరణించిన ఘట్టాలనుండీ ధర్మరాజే స్వయంగా సోదరులను సజీవులను గావించిన సందర్భాలు ఉన్నాయి. వారిలో వారు ఆవేశపడిన సంఘటనలూ ఉన్నాయి. అన్ని సందర్భాలలోనూ ధర్మమే వారికి ఆలంబనమైనది. అటువంటి సోదరులు ఒక్కక్కరూ పడిపోతుంటే, వెనుతిరగకుండా నడక ముందుకు సాగిస్తూ, భూకక్ష్యను దాటుకుని ధర్మజుని పయనం స్వర్గారోహణము వరకూ ఎలా సాగిందో ఈ వ్యాసంలో పరిశీలించబడినది.

Keywords: మహాప్రస్థానము – సారమేయము – నివృత్తి మార్గము – ధర్మేంద్రుల సంవాదము – ధర్మదేవత సాక్షాత్కారము – ధర్మజుని అసంతృప్తి – సర్వభూతదయ – కర్ణుడి పాదాల ప్రత్యేకత – ధర్మరాజు రాకతో నరకమే స్వర్గధామం – ధర్మజుడే అనుభవించిన శిక్ష – దివ్యదేహంతో ధర్మజుడు

1. ఉపోద్ఘాతము:

మహాభారతేతిహాసము సరమ అనే సారమేయ(కుక్క) వివాదముతో ప్రారంభించబడి  సారమేయ పయనముతోనే ముగిసినది. ఆదిపర్వములో జనమేజయుని సోదరుల వివాదముతోనూ, అనుకోని ఆపద కలిగేవిధంగా శాపముతోనూ సారమేయ వృత్తాంతమును తెలిపిన వ్యాస భగవానుడు, మహాప్రస్థాపర్వంలో పాండవులతోపాటు పయనించిన ధర్మస్వరూప సారమేయమును పరిచయం చేశారు. ఆదిపర్వం సారమేయము రాకతో ప్రారంభమైతే, మహాప్రస్థానంలో సారమేయము తిరుగు ప్రయాణముతో అంతమవుతుంది. ఆరంభంలోనే క్షమా, సర్వభూత దయాది గుణాలు పాలకులకు ఉండవలసిన ధర్మాలుగా సారమేయము ద్వారానే చెప్పించాడు వ్యాసుడు. ఆ ధర్మాలనే చివరిక్షణం వరకూ పాటించిన ధర్మరాజుకి మరలా సారమేయమే పరీక్షపెట్టింది.  ధర్మనందనుడికి పరీక్ష పెట్టిన సారమేయమే ధర్మదేవత.  ఈ రెండు సారమేయములు దైవ సంబంధమైనవే అని చెప్పబడ్డాయి.

రామకృష్ణుల అవతారసమాప్తితో, తమ జీవిత పయనానికి స్వస్తి పలికే మహాప్రస్థాన మార్గాన్ని ఎంచుకున్నారు ధర్మరాజాదులు.  దైవాంశ సంభూతులైనవారు ఎందరో అవతరించి, ధర్మస్థాపన చేసి తిరిగి వారి వారి దివ్యదేహాలను పొందిన పర్వాలలో యుద్ధపర్వాలు, మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాలు చెప్పుకోదగినవి. అందులోనూ చివరి వరకూ సశరీరంతో జీవించటమే కాక, స్వర్గలోకమునకు కూడా సశరీరముతో చేరిన వాడుగా ధర్మరాజు మహాభారతేతిహాసంలో అందరి మన్ననలు అందుకున్నాడు.

2. మహాప్రస్థానిక పర్వము:

అర్జునుడు చెప్పిన యాదవవంశవినాశనం, కృష్ణభగవానుని నిర్యాణమును విన్న కురునందనుడు యుధిష్ఠిరుడు, వ్యాసుడు చెప్పినట్టు మహాప్రస్థానం పైన మనసు నిలిపాడు. తన బాధ్యతలను వైశ్యసుతుడైన యుయుత్సునకు అప్పగించి తదనంతరం సుభద్ర మనుమడైన పరీక్షిత్తును రాజుగా అభిషేకించాడు.  కృపాచార్యుడిని అర్చించి పురజనులతో సహా పరీక్షిత్తును కూడా ఆయనకు శిష్యులుగా సమర్పించాడు యుధిష్ఠిరుడు. హస్తినాపురంలో పరీక్షిత్తును, ఇంద్రప్రస్థంలో యాదవరాజు వజ్రుడిని రాజులుగా ప్రకటించి వారి రక్షణ బాధ్యతను సుభద్రకు అప్పగించాడు. ఇరువంశాల వారికీ  అనుబంధము కలిగిన వ్యక్తిగా సుభద్రకి బాద్యతను అప్పగించాడు.

పరిక్షిద్ధాస్తినపురే శక్రప్రస్థే చ యాదవః।

వజ్రో రాజా త్వయా రక్ష్యో మా చాsధర్మే మనః కృథా।।    1.  9

2.1 మహాప్రస్థానము -

ఇక మహాప్రస్థానానికి సిద్ధమయ్యారు. ప్రస్థానము అంటే ప్రయాణము. మహాప్రస్థానమంటే శరీరాన్ని యోగనిష్టలో ఉంచి సాగించే ప్రయాణమే మహాప్రస్థానము. తాను చేయవలసిన కర్తవ్యాలనన్నీ నిర్వహించి తిరిగిరాని, తిరుగు లేని ప్రయాణానికి సిద్ధమయ్యాడు ధర్మదీక్షితుడు ద్రౌపదీ, సోదర సమేతంగా.

తరువాత బలరామకృష్ణులకు, మరియు మేనమామ వసుదేవునికి మిగిలిన పెద్దలకు శాస్త్రవిధిననుసరించి అందరికీ శ్రాద్ధకర్మలను ఆచరించి, శ్రీకృష్ణనామాన్ని జపిస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నరాసులను కానుకగా సమర్పించాడు. ప్రజలందరినీ సమావేశ పరచి, తమ ప్రస్ధాన విషయాన్ని తెలిపాడు. కానీ ప్రజలందరూ వారిని విడిచి వెళ్ళవద్దని ప్రాధేయ పడ్డారు. ధర్మ స్వరూపమూ, కాలనిర్ణయమూ తెలిసిన ధర్మరాజు మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడియుండి ప్రజలందరినీ సమాధాన పరిచాడు. పౌరులను, జానపదులను ఒప్పించాడు. వారి అనుమతిని పొందాడు.

తాను తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా, శరీరం పైన అలంకృతమైయున్న ఆభరణాలను తొలగించి వల్కలాలను ధరించాడు. తక్కిన సోదరులు నలుగురూ ధర్మరాజులాగానే వారూ వల్కలాలు ధరించారు. ద్రౌపదీదేవి కూడా వారిని అనుసరించింది. మహాప్రస్థాన సమయంలో చేయవలసిన ఇష్టిని జరిపించి, ఇన్నాళ్ళూ తాము నిర్వహించిన అగ్నిహోత్రాలను నీటిలో విడిచి పెట్టాడు. తరువాత వారు ఆరుగురూ ప్రస్థానానికి బయలుదేరారు. వారు వెళ్ళగానే నాగరాజకుమార్తె ఉలూపి(అర్జునుడి భార్య) గంగలో ప్రవేశించింది. చిత్రాంగద మణిపూర నగరానికి వెళ్ళిపోయింది. మిగిలినవారందరూ పరీక్షిత్తుతో వెనుతిరిగి రాజ్యానికి చేరుకున్నారు.

                                    వివేశ గఙ్గాం కౌరవ్య ఉలూపీ భుజగాత్మజా।

                                    చిత్రాఙ్గదా యయౌ చాపి మణిపూరపురం ప్రతి।।     1.   27

2.2 సారమేయము:

మహాప్రస్థానానికి బయలుదేరిన ఆరుగురితో పాటు ఒక కుక్క కూడా ఏడవదిగా వారిని అనుసరించింది.

                                    భ్రాతరః పఞ్చ కృష్ణా చ షష్టీ శ్వా చైవ సప్తమః।     1.  24

హస్తినాపురం నుండీ ఉపవాస దీక్షతో బయలుదేరిన వారిని చూసి ప్రజానీకం అందరూ రోదించారు. ధర్మాత్ముడైన ధర్మరాజు పాలనను ఇక పై పొందలేమే అని విలపించారు. తరువాత నగరం వెలుపల దాకా పురవాసులు వెంటరాగా ధర్మజుని ఆజ్ఞతో వారంతా తిరిగి నగరానికి వెనుతిరగాల్సివచ్చింది. తూర్పుదిక్కునుండీ ప్రారంభించి భూమికి ప్రదక్షిణగా వలయాకారంగా ప్రయాణించి ఉత్తరదిక్కుకు ప్రస్థానాన్ని కొనసాగించారు.

ముందుగా యుధిష్ఠిరుడు, ఆయన వెనుక భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది వరుసగా ఒకరి వెనుక ఒకరు నడవసాగారు. ఉత్తరాన హిమగిరికి చేరుకున్నారు. దానిని కూడా దాటి ఇసుక సముద్రాన్ని చూశారు. తదనంతరం మేరు పర్వతానికి చేరుకున్నారు.

2.3 నివృత్తిమార్గము:

                                    తేషాం తు గచ్ఛతాం శీఘ్రం సర్వేషాం యోగధర్మిణామ్।

                                    యాజ్ఞసేనీ భ్రష్టయోగా నిపపాత మహీతలే। ।     2.   3

ద్రౌపదీదేవి యోగభ్రష్టురాలై నేలమీద పడిపోయింది. పడిపోయిన ద్రౌపదిని చూపిస్తూ ఇంకా ప్రవృత్తమార్గంలోనే ఉన్న భీమసేనుడు, నివృత్తి మార్గంలో ప్రవేశించిన ధర్మరాజుతో, "ఈ రాకుమారి ఏ అధర్మమూ చేయలేదు కదా, అలాంటి ఈమె పడిపోవటానికి కారణమేమిటి" చెప్పమని అడిగాడు.

ధర్మరాజు పయనము ఆపకుండానే సమాధానం చెప్తున్నాడు. ఈమెకు అర్జునుడిపై ఉన్న పక్షపాత దృష్టే ఈమె పడిపోవటానికి కారణంగా సూచించాడు ధర్మజుడు. ఐదురుగు భర్తలున్నా వారందరిలో అర్జునుడినే ఎక్కువగా ప్రేమించింది.

                                    పక్షపాతో మహానస్యా విశేషేణ ధనఞ్జయే।

                                    తస్యైతత్ ఫలమద్యైషా భుంక్తే పురుషసత్తమ।।   2.  6

 దానికి తగిన ఫలితమే ఇది అని ఆమె వైపు దృష్టి పెట్టకుండా  మనసును ఏకాగ్రతతో నిలుపుకుని ముందుకు సాగాడు యుధిష్ఠిరుడు.  ఐదుగురికీ భార్య అయిన ద్రౌపది పడిపోగానే మిగిలినవారు ఆగిపోయారు. కానీ ధర్మరాజు ఆగలేదు. పైగా సమాధానంలో కూడా “ఈమె పడిపోటానికి” అని ప్రయోగించాడే కానీ తన భార్య ద్రౌపది అని కూడా ప్రయోగించలేదు. భూలోక సంబంధమైన అనుబంధాలు ధర్మరాజుని బంధించే స్థాయి దాటిన సాధకుడిగా, నివృత్తిమార్గ ప్రవర్తకుడిగా ప్రవర్తించాడు. అలాగని ద్రౌపదిమీద చులకల లేదు, భీముడు అడిగిన సందేహానికి సమాధానం చెప్పటం తన బాధ్యత కాబట్టి చెప్పాడు.

ఇంకొంత దూరం ప్రయాణించాక సహదేవుడు పడిపోయాడు. అతడు పడిపోవటం చూసి భీముడు మరలా ప్రశ్నించాడు. బుద్దిమంతుడు, నిరంతరం మనలను సేవించేవాడు, అహంకార రహితుడు అయిన ఈ మాద్రి తనయుడు ఎందుకు పడిపోయాడు? అని ప్రశ్నించాడు.

ఇతడు ఇతరులనెవ్వరినీ కూడా తనంత మేధావిగా భావించలేదు. తానే మేధావి అని తలుస్తూండేవాడు.

                                    ఆత్మనః సదృశం ప్రాజ్ఞం నైషోsమన్యత కఞ్చన।

                                    తేన దోషేణ పతితస్తస్మాదేష నృపాత్మజః। ।    2.   10

- ఆ దోషం కారణంగా ఇతడు పడిపోయాడు అని సమాధానమిచ్చాడు ధర్మనందనుడు. పడిపోయిన సహదేవుడిని కూడా విడిచిపెట్టి సోదరులతో, వారిని కూడా అనుసరిస్తూ వస్తున్న కుక్కతోపాటు ముందుకు సాగాడు నిర్వికారుడైన యుధిష్ఠిరుడు.

తరువాత నకులుడు పడిపోయాడు. అతనెందుకు పడిపోయాడని భీముడు అడిగాడు. ఈ నకులుడు "రూపంలో నా అంతటి వాడు లేడు" అనే భావంతో ఉండేవాడు. తానే అందరినీ మించిన అందగాడనుకునేవాడు. అందుకే ఇతడు పడిపోయాడు అని యుధిష్ఠిరుడు చెప్పాడు.

                                    రూపేణ మత్సమో నాస్తి కఞ్చిదిత్యస్య దర్శనమ్।

                                    అధికశ్చాహమేవైక ఇత్యస్య మనసి స్థితమ్ ।।      2.  16

అతడిని కూడా వీడి ముందుకు సాగుతుండగా వారిని వీడిన శోకంలో అర్జునుడు పడిపోయాడు. భీముడు ఆశ్చర్యపోయి యుధిష్ఠిరుడిని అడుగుతున్నాడు. "ఈ మహాత్ముడు సరదాకి కూడా ఎన్నడూ అసత్యమాడనివాడు, ఇతడే కారణంగా పడిపోయాడు" అని ప్రశ్నించాడు. యుధిష్ఠిరుడన్నాడు – మహాభారత సంగ్రామంలో ఒక్క రోజులో శత్రువులందరినీ సంహరిస్తానని అర్జునుడన్నాడు. కానీ ఆ పని చేయలేదు. భీష్మాచార్యుడినే పడకొట్టటానికి పది రోజులు పట్టింది. అంటే ఆయన్ని అవమానించిన దోషం వచ్చినట్టే కదా. అంతేకాక ఇతడు ఇతర ధనుర్ధారులను కూడా అవమానించాడు.

                                    ఏకాహ్నా నిర్దహేయం వై శత్రూనిత్యర్జునోsబ్రవీత్।

                                    న చ తత్ కృతవానేష శూరమానీ తతోsపతత్।।    2.   21

- ఆ కారణంతోనే శూరుడనుకునే ఈ అర్జునుడు పడిపోయాడు అని సమాధానం చెప్పాడు. శ్రేయస్సును కోరేవారు అలా ప్రవర్తించకూడదు అని యుధిష్ఠిరుడు భీముడికి చెప్పి పడిపోయిన అర్జునుడిని వదిలి ముందుకు సాగారు. కాసేపటికే బీముడు కూడా నేలకూలాడు. పడిపోతున్నానని తెలుసుకుని తన సందేహాన్ని అడిగాడు భీముడు. రాజా! నీకు ప్రీతిపాత్రుడనైన నేను ఏ కారణంగా ఇలా పడిపోయానో దయచేసి చెప్పు అని కోరుకున్నాడు. దానికి యుధిష్ఠిరుడన్నాడు. నీవు అధికంగా తిండి తింటావు. ఇతరులను పట్టించుకోకుండా ప్రగల్భాలకు పోతావు.

                                    అతిభుక్తం చ భవతా ప్రాణేన చ వికత్థసే।

                                    అనవేక్ష్య పరం పార్థ తేనాసి పతితః క్షితౌ।।     2. 25

అందువలన నీవు పడిపోయావు భీమా అని సమాధానం చెప్పి భీముడిని విడిచి ముందుకు సాగాడు యుధిష్ఠిరుడు. కుక్క కూడా ఆయనను అనుసరించింది.

అనంతరం పెద్ద శబ్దంతో ఇంద్రుడు తన రథం పై వచ్చి యుధిష్ఠిరుడిని రధం పైకి ఆహ్వానించాడు. యుధిష్ఠిరుడు దేవేంద్రుడికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘మహాత్మా! నా సోదరులందరూ ద్రౌపదితో పాటు ఇక్కడ పడిపోయారు. నాతో పాటు వాళ్ళు కూడా స్వర్గానికి రావాలి, వారు లేకుండా నేను ఒక్కడినే స్వర్గానికి రావటానికి ఇష్టపడటం లేదు. అని యుధిష్ఠిరుడు అన్నాడు.

            (పయనంలో పడిపోయిన వారిని తిరిగి కూడా చూడకుండా నివృత్తి మార్గంలో పయనించిన ధర్మరాజు ఇక్కడ వారితో పాటు స్వర్గానికి రావాలని కోరుకుంటున్నాడు. అంటే అంతర్లీనంగా ఇంకా మమకారం ధర్మజుని లోపల ఉందేమో అని అనిపిస్తుంది. కానీ ఆ మమకారం చాటున దాగిన సమత్వము అనేది మరికొద్దిసేపట్లోనే స్వర్గారోహణపర్వంలో ధర్ముడి పరీక్షలో బయటపెట్టాడు మహారాజు. తనతో పాటు అనేక కష్టసుఖాలు కలిసి పంచుకున్న సోదరులను, ఇంద్రుడు వచ్చి స్వర్గానికి రమ్మని పిలవగానే ఒంటరిగా వెళితే ఇక ధర్మజుని ధర్మదీక్ష ఏమైపోతుంది?)

2.4 ధర్మజేంద్రుల సంవాదము:

 ఇంద్రుడు అన్నాడు! “వారు మానవ శరీరం వీడి స్వర్గానికి ఇప్పటికే చేరుకున్నారు. కానీ నీవు సశరీరంతోనే స్వర్గానికి రావచ్చు” అని ఆహ్వానించాడు. యుధిష్ఠిరుడు సోదరులను అక్కడే కలవవచ్చు అనుకుని, ఇంద్రుడితో ఈ విధంగా పలికాడు. ‘ఈ కుక్క నిత్యమూ భక్తితో నన్ను సేవించింది. ఇన్నాళ్ళూ ఈ కుక్క(భవ్య సారమేయము) కూడా మాతో కలిసి యాత్రలు చేసింది. నన్ను నమ్ముకుని వచ్చిన ఈ కుక్కను కూడా స్వర్గానికి అనుమతిస్తే నేను నీతో రాగలను అని పలికాడు ఇంద్రుడితో. కుక్కతో పాటు నివసించేవారికి స్వర్గంలో స్థానం లేదని ఇంద్రుడు దాన్ని విడిచి రమ్మన్నాడు. “భక్తులను విడనాడటం అనేది తీవ్రమైన పాపం, అది బ్రహ్మహత్యతో సమానమవుతుంది. నమ్ముకున్న భక్తుడిని గానీ, ఆపదలో వచ్చిన ఆర్తుడిని గానీ నేను ఎన్నడూ నా ప్రాణాలు పోయినా విడిచిపెట్టను. ఇది నా వ్రతం అని ధర్మరాజు పట్టుబట్టాడు.

ఇంద్రుడు మరలా వాదించాడు. “నీకు ప్రియమైన సోదరులను, భార్యను కూడా విడిచి ముందుకు వచ్చేశావు. అలాంటిది కుక్కును విడిచిపెట్టవచ్చు కదా! అంతా త్యజించివేసి తిరిగి మరలా మోహానికి గురి అవుతున్నావు కదా” అని వాదించాడు. దానికి యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. ఇంద్రా! "చనిపోయిన వారితో సంధి కానీ, యుద్ధం కానీ లేదన్నది లోకసత్యం. వారిని నేను బ్రతికించలేకపోయాను. అందుకే విడిచిపెట్టాను. కానీ బ్రతికి ఉన్నప్పుడు విడవలేదు కదా? శరణాగతుడిని (ఈ కుక్కని) విడిచి పెట్టటం అంటే స్త్రీ వధ చేసినట్టే, మిత్ర ద్రోహం చేసినట్టే, బ్రాహ్మణ ధనాన్ని అపహరించినట్టే, ఇంతెందుకు, బ్రహ్మహత్యాపాతకంతో సమానమే. అందుకే నన్ను నమ్ముకుని వెంట వచ్చిన ఈ కుక్కను వీడి నేను స్వర్గానికి రాలేను అని యుధిష్ఠిరుడు ఇంద్రుడి మాటలను ఖండించాడు.

(ఇక్కడ మనం ఆలోచిస్తే మరొక విషయం గమనించవచ్చు. వీరులైన భీమార్జులుసైతం  ప్రయాణంలో పడిపోయారు కదా. మరి వీరితో పాటే ప్రయాణం సాగించిన ఈ కుక్క ఎలా బ్రతికి ఉన్నది? అసలు ఇదే ప్రశ్న భీమసేనుడు కూడా ప్రశ్నించి ఉండవచ్చు. వీరి కంటే అల్పప్రాణి కదా. మరి యుధిష్టిరుడు జీవించినట్టే ఇంకా ప్రాణాలతో ఉందంటే, ఆ కుక్క సామాన్యమైనది కానేకాదు కదా. ఇదే ఆలోచనా ధోరణి ధర్మరాజుది. ఇలాంటి ఆలోచనా ధోరణితోనే యక్షప్రశ్నల సమయంలో నలుగురు సోదరులు సరోవరం వద్ద విగతజీవులై పడి ఉన్నప్పుడు వారి వద్ద ఏడుస్తూ కూర్చోకుండా ఆలోచించాడు. బకరూపంలో ఉన్నది మహానుభావుడని గుర్తించాడు. ఎందుకంటే వీరులైన తన తమ్ముళ్ళని ఇంద్రాదులు కూడా సంహరించలేరు. అలాంటిది మహారణ్యంలో జంతువులు కూడా సంహరించవు. ఒక వేళ సంహరిస్తే తన మీద కూడా ఆ ప్రయోగం జరిగేదే కదా. పోనీ సరోవరం విషపూరితమైనదేమో అని గమనించాడు. విషపూరితమైతే సోదరుల శరీరాలు రంగు మారలేదు. కాబట్టి బకరూపంలో ఉన్నది దివ్యశక్తి అని గుర్తించి వెంటనే ఆయన ప్రశ్నలుకు తగిన సమాధానం చెప్పి సోదరులకు తిరిగి ప్రాణం పోసిన ఆపద్భాంధవుడు ధర్మరాజు. కుక్క విషయంలో కూడా ఈ విధంగానే ఆలోచించి ఉండవచ్చు. అందుకే భవ్య సారమేయము అని ప్రయోగించాడు ధర్మజుడు. ఇంద్రుడు పదేపదే కుక్కకి స్ధానం లేదు అన్నా కూడా ధర్మరాజు ఒక్క అడుగు కూడా మరలలేదు, సరికదా కావాలంటే, నేను రావాలంటే సారమేయము(కుక్క) కూడా రావాల్సిందే, అని పట్టు బట్టి మరణించిన సోదరులకంటే జీవించి ఉన్న కుక్కకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదీ ధర్మజుడిలోఉన్న సర్వప్రాణికోటిసమత్వమనే గుణానికి నిదర్శనం. పండితాః సమదర్శినః అనే భగవంతుని వాక్కులలో ధర్మజుడే సరైన పండితుడు అని అర్థమైపోతుంది. అదే ధర్మజునికి మరో మెట్టు అధిగమించేట్టు చేసింది.)

2.5 ధర్ముని సాక్షాత్కారము:

ధర్మస్వరూపుడైన ఆ ధర్మరాజు మాటలు విని, కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత తన స్వరూపాన్ని ప్రదర్శించి, యుధిష్ఠిరుడితో ప్రశంసా వచనాలతో మెచ్చుకున్నాడు.

                           తద్ ధర్మరాజస్య వచో నిశమ్య  ధర్మస్వరూపీ భగవానువాచ।

 “రాజా! నీ నడవడితో, ప్రజ్ఞతో, సర్వభూత దయతో నీ జన్మను సార్థకం చేసుకున్నావు ధర్మరాజా. గతంలో కూడా దాహం వేసి, నీటికోసం ప్రయత్నించి నీ సోదరులు మరణించినప్పుడు, ద్వైతవనంలో నిన్ను నేను పరీక్షించాను. అది నీకు పెట్టిన మొదటి పరీక్ష. ఆ సమయంలో వీరులైన భీమార్జునులను కాదని తల్లులైన కుంతీ, మాద్రీలకు సమానత్వాన్ని ఆశించి, మాద్రి తనయుడైన నకులుడిని బ్రతికించమన్నావు. ఇప్పుడు నీ వెంట వచ్చిన కుక్కను భక్తుడు అని పలికి మరీ స్వర్గాన్ని, దేవ రథాన్ని కూడా పరిత్యజించగిలిగావు.

అయం శ్వా భక్త ఇత్యేవం త్యక్తో దేవరథస్త్వయా।     3.  21

ఇది రెండవ పరీక్ష. రెండిటిలో నీవు విజయం సాధించి ధర్మాత్ముడవని నిరూపించుకున్నావు నాయనా” అని యమధర్మరాజు ప్రశంసించాడు. (మూడవ పరీక్ష ముందుంది)

“నాయనా స్వర్గలోకంలో కూడా నీ లాంటి ధర్మాత్ముడు లేడు ధర్మరాజా.  అందువలననే నీకు నీ శరీరంతోనే అక్షయలోక ప్రాప్తి, దివ్యమైన ఉత్తమ గతి నీకు ప్రాప్తించింది” అని కుక్క రూపంలో ఉన్న ధర్ముడు ధర్మరాజును ప్రశంసించి ఇంద్ర, మరుద్గణాలతో పాటు యుధిష్ఠిరుడిని తమ రథం పైకి ఎక్కించుకుని స్వర్గానికి పయనించారు. స్వర్గంలో ఎందరో తేజోసంపన్నులు, మహర్షులు, రాజర్షులు దేవతలు విరాజిల్లుతున్నారు. కానీ ధర్మజుడు వారందరినీ అధిగమించిన తేజస్సుతో ప్రకాశించాడు. నారదుడు స్వయంగా ధర్మరాజుకి దేవలోకాలను చూపించాడు. అన్నీ చూశాక ధర్మరాజు తన సోదరులు ద్రౌపది ఉన్న ప్రదేశాన్ని చూపించమని అడిగాడు. నాకు ఏ ఇతర లోకాలూ అక్కరలేదు. నా సోదరులున్న చోటే నాకు స్వర్గం అని పలికాడు. ఇంద్రుడన్నాడు, “రాజేంద్రా! నీవు మానవ శరీరంతో రావటం వలన ఇంకా నీవు మానవ సంబంధాలను తెంచుకోలేకపోతున్నావు, ఈ స్వర్గలోకానికి వచ్చి ఆ సంబంధాలను లాగుతావెందుకయ్యా. ఇతరులకెవ్వరికీ సాధ్యపడని పరమగతిని నీవు పొందావు. ఇక్కడున్న సిద్దులను, మహర్షులను, పుణ్యాత్ములను గమనించు. వారిలాగా స్వర్గసుఖాలు అనుభవించు యుధిష్ఠిరా” అని పలికాడు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా “నా సోదరులు ద్రౌపది నివసించే చోటే నేను నివసించాలనుకుంటున్నాను మహాత్మా” అని ధర్మరాజు తన తుది నిర్ణయాన్ని పలికాడు. (మహాప్రస్థానిక పర్వం సమాప్తం)

3. స్వర్గారోహణ పర్వం:

పాండవులది ఐదుగురిదీ ఒకటే శరీరమని చెప్పాలి. పాండవులు ఐదుగురినీ ఒకే శరీరంగా ఊహించుకుని 'పాండవుడు' అని చెబితే ఆ శరీరానికి ముఖభాగం యుధిష్ఠిరుడు. ముఖం అంటే నోరు అని సంస్కృతార్థం. సత్య ధర్మాలను ముఖముగా కలిగినవాడు ధర్మరాజు. “ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి” అన్నట్టు ఆయన పలికినదే సత్యము, అదే ధర్మసమ్మతము. అలాగే భీముడు ఆ శరీరానికి బాహువులు. ఎందుకంటే శరీరాన్ని రక్షించే భాధ్యతను బాహువులు నిర్వహిస్తాయి. అలా సోదరుల రక్షణభాధ్యతను చివరివరకూ నిర్వహించినవాడు పంచపాండవులలో భీమసేనుడు. లక్కయిల్లు దగ్ధమైపోతుంటే సోదరులను, తల్లిని తన బాహువుల మీద, నడుంమీద వారిని మోస్తూ రక్షించినవాడు. అలాగే అర్జునుడు ఆ పాండవుడు అనే శరీరానికి హృదయం వంటివాడు. మధ్యలో ఉండే మధ్యముడు. అందుకే జనార్థనుడు హృదయస్థానమైన అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడని చెప్పాలి. ఆ హృదయస్థానం కలిగిన క్షేత్రమే కురుక్షేత్రం. నకులసహదేవులు ధర్ముడు ఆదేశించినట్లు నడుచుకునే పాదములవంటివారు. కవలలు. ఈ మొత్తం శరీరాన్ని నడిపించగల అంతఃకరణ శక్తి ఎవరయ్యా అంటే, ఆవిడే ద్రౌపది. భారతం మొత్తంలో పంచపాండవులు ద్రౌపదికి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. మనసు చెప్పినట్టే నోరు పనిచేస్తుంది, బాహువులు పనిచేస్తాయి. పాదాలు పనిచేస్తాయి, హృదయం పనిచేస్తుంది. ఇలా శక్తి స్వరూపిణి అయిన ద్రౌపది మాటనే ఒకే పాండవుడు ఐదురూపాలుగా పాటించారని చెప్పుకోవచ్చు.

3.1 ధర్మజుని అసంతృప్తి:

స్వర్గానికి చేరుకున్న యుధిష్ఠిరుడు, ముందుగా చూసింది ఎవరినయ్యా అంటే, సింహాసనం పై కూర్చుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, దేవలోకవాసులచేత గౌరవించబడుతున్న దుర్యోధనుణ్ణి చూశాడు.

                          స్వర్గే త్రివిష్టపం ప్రాప్య ధర్మరాజో యుధిష్ఠిరః।

                          దుర్యోధనం శ్రియా జుష్టం  దదర్శాసీనమాసనే।।   1. 4

సోదరులు ఉంటారు కదా వారితో సుఖంగా ఉండచ్చు అనుకుని స్వర్గానికి వస్తే, జీవితాంతం సుఖం లేకుండా చేసిన వ్యక్తి, దుర్యోధనుడు ముందుగా ఎదురుపడ్డాడు. దాంతో యుధిష్ఠిరుడు వెంటనే అసహనంతో వెనుతిరిగి, ఎవరి కారణంగా మేము యుద్ధంలో బంధుమిత్రులను చంపవలసివచ్చిందో, ఆత్మీయులను దూరం చేసుకోవలసి వచ్చిందో అటువంటి దుర్యోధనుడు ఉన్న ఈ పుణ్యలోకాలు నాకు అక్కరలేదు. నాకు ఇతనిని చూడాలని కూడా అనిపించటం లేదు అన్నాడు.  పైగా దుర్యోధనుడు ఎలా ఉన్నాడంటే

                           భ్రాజమానమివాదిత్యం వీరలక్ష్మ్యాభిసంవృతమ్।

                            దేవైర్భ్రాజిష్ణుభిః సాధ్యైః సహితం పుణ్యకర్మభిః।।     1. 5

దేదీప్యమానంగా సూర్యకాంతివలే వెలిగిపోతున్నాడు దుర్యోధనుడు. దేవతలు, పుణ్యకర్మలను చేసి స్వర్గమునందు వసించే సిద్ధులు, సాధ్యులు మొదలైన వారితో ఆశీనుడై, సూర్య సమాన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆ దుర్యోధనుడు.

యుధిష్ఠిరుడికి కడుపు రగిలిపోదాండీ? భరించలేకపోయాడు, అసహనంతో వెనుతిరిగాడు. (ఇక్కడ మనం యుధిష్ఠిరుడి ప్రవర్తనను గమనిస్తే - స్వర్గలోకంలో ఎలా ఉండాలి, ఎలా నడచుకోవాలి, వేటిని వదిలివేయాలి, అనే అంశాలను యుధిష్ఠిరుడు తెలుసుకోలేదా? అనే సందేహం కలుగుతుంది. ధర్మాలు అన్నీ తెలిసినవాడు కదా, శాంతి-ఆనుశాసన పర్వాలలో పితామహుడి వద్ద స్వయంగా అన్ని ధర్మాలు విన్నాడు కదా, మరి అటువంటి యుధిష్ఠిరుడికి స్వర్గంలో ప్రవేశించినా కూడా తన శత్రువును చూడగానే ఇంతగా ఆవేశ పడ్డాడంటే, భూలోక కక్ష్యను దాటి నివృత్తి మార్గంలో సశరీరంతో స్వర్గంలోకి ప్రవేశించినా, క్రోధాన్ని ఇక్కడ కూడా చూపించినట్టే కదా! యుద్ధంలో మరణించినవానికి వీర స్వర్గం లభిస్తుందని, అందుకే దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నాడని  తెలుసుకోవచ్చు కదా? అంతే కాక మరణించినవానితో శత్రుత్వమనేది ఉండనే ఉండకూడదు కూడా! ఈ విషయాన్ని తానే స్వయంగా ఇంద్రునితో మహాప్రస్థానపర్వంలో కూడా చెప్పటం జరిగింది. ఇలా యుధిష్ఠిరుడు స్వర్గానికి వచ్చినా కూడా, తన సోదరులను చూపించమని, వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గమని చెప్పటం, అలాగే దుర్యోధనుడిని చూసి ఓర్వలేక పోవటం అనే అంశాలు ఈ స్వర్గారోహణ పర్వంలో ముందుగా మనకు గోచరించేవి. ధర్మదేవత పెట్టే మూడవ పరీక్ష ధర్మజుని ఈ అసంతృప్తితోనే ప్రారంభమైంది.

3.2 ధర్మజుని సర్వభూతదయ:

స్వతహాగా యుధిష్ఠిరుడిది చాలా మంచి మనసు. ఇదే దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేతిలో ఓటిమి పాలైనప్పుడు, ఘోషయాత్రకు రెచ్చగొట్టిన ప్రాణస్నేహితుడు కర్ణుడుకూడా దుర్యోధనుడిని పట్టించుకోకుండా పారిపోయిన సమయంలో ఈ యుధిష్ఠిరుడే దుర్యోధనుడిని  కాపాడాడు. గంధర్వుల చేతికి దుర్యోధనుడు చిక్కిన సందర్భంలో  భీమసేనుడు చాలా సంతోషించాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనుకున్నాడు. భీముడితో పాటు చాలా మంది సంతోషించారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ఘోషయాత్రలో దుర్యధనుడిని రక్షించమని తమ్ముళ్ళకు ఏ విధంగా చెబితే ఒప్పుకుంటారో అలా అన్నివిధాల చెప్పి ఒప్పించాడు. తన సోదరులైన భీమార్జునలతోనే దుర్యోధనుడిని గంధర్వుల చెరనుండి విడిపించి, ఊరడించి హస్తినాపురానికి పంపించాడు.  దుర్యోధనుడికి ఏమన్నా అయితే గాంధారీధృతరాష్ట్రులు చాలా బాధపడతారు. వారిని కూడా తన తల్లిదండ్రుల వలనే భావించి వారి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆనాడు దుర్యోధనుడిని కాపాడాడు యుధిష్ఠిరుడు. అదే జరగకపోయి ఉంటే ఘోషయాత్రలోనే దుర్యోధనుడు మరణించేవాడు, వాడికి స్వర్గ లోక ప్రాప్తి అనేదే ఉండేది కాదు. ఆనాడు యుధిష్ఠిరుడిలో కోపం లేదు. కానీ తరువాత అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయినాక వారికి రావలసిన రాజ్యాన్ని కాజేయటమే కాకుండా పాండవులకు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఎన్నో విధాలుగా రాయబారాలతో యుద్ధం వద్దని నచ్చచెప్పి  చూశాడు యుధిష్ఠిరుడు. కానీ దుర్యోధనుడు పెడచెవిన పెట్టాడు దాంతో యుద్ధం తప్పలేదు. యుధిష్ఠిరుడు తన క్షత్రియధర్మాన్ని తాను పాటించాడు. జరిగిన యుద్ధంలో సర్వరాజలోక వినాశనం ఈ దుర్యోధనుడి వలనే జరిగింది. యుద్దంలో చివరికి దుర్యోధనుడు వీరమరణం పొందాడు. ఇదిగో ఇలా యుధిష్ఠిరుడికి ఇక్కడ మరలా ప్రత్యక్షమయ్యాడు.

నిజానికి ధర్మరాజుకి ఎంతో భూతదయ ఉంది. యుధిష్ఠిరుడికి సర్వభూత దయ ఉందన్న విషయాన్ని ధర్ముడే స్వయంగా చెప్పాడు. మహాప్రస్థాన పర్వంలో ధర్ముడు మూడు గుణాలు ధర్మరాజులో ఉన్నాయని ప్రశంసించాడు. అవేంటంటే పుణ్యవృత్తము, నిర్మల మేథస్సు, సర్వభూత దయ.  ఎదుటివారు బాధపడితే తాను బాధపడుతూ, ఆ బాధనుండీ ఇతరులను రక్షించటమే పుణ్యవృత్తము. ఆ పుణ్యవృత్తము, అటువంటి ప్రవర్తన యుధిష్ఠిరుడిలో ఉన్నది.  ఎదుటివాడు కష్టపడకుండా ఉండాలనుకోవటమే పుణ్యవృత్తము. ఆ పుణ్యవృత్తము వలన చక్కటి మేధస్సు వస్తుంది. పుణ్యవృత్తము వలన కలిగిన మేధస్సుతోనే యక్షప్రశ్నలు లాంటి సందర్భాలలో అత్యంత కఠినమైన ప్రశ్నలకు కూడా విశేషమైన సమాధానాలను చెప్పాడు. ఆ మేధస్సు వలన క్రమంగా సర్వభూతదయ పెరుగుతుంది. 

ధర్ముడు పెట్టిన పరీక్షలలో యుధిష్ఠిరుడు కేవలం ధర్మాలు చెప్పేవాడు కాదు ఆచరించేవాడని నిరూపించుకున్నాడు. అటువంటి ధర్మాచరణ వలన కలిగేదేమిటి అంటే సర్వభూత దయ కలుగుతుంది. ఆ దయా గుణం వలనే మహాప్రస్థాన పర్వంలో తనతో పాటు వచ్చిన కుక్కను కూడా స్వర్గానికి అనుమతిస్తేనే నేనూ స్వర్గానికి వస్తాను లేకపోతే రాను. కావాలంటే నీవే ఇంద్రలోకానికి అధిపతివి కాబట్టి నీవే నీ స్వర్గలోక నియమాలను దానికి అనుగుణంగా మార్చుకోమని అనేక విధాలుగా ప్రయత్నించి ఇంద్రుడిని కూడా ధర్మదీక్షతో సంతోషపెట్టాడు యుధిష్ఠిరుడు. అటు ధర్ముడు పెట్టిన పరీక్షలోనూ నెగ్గాడు. ఇటు ఇంద్రుడు పెట్టిన పరీక్షలోనూ నిరూపించుకున్నాడు యుధిష్ఠిరుడు. అసలు మహాభారతంలో పరీక్షలన్నీ యుధిష్ఠిరుడికే వచ్చాయి. దుర్యోధనుడికి ఏ పరీక్షా లేదు. మంచివాడికే పరీక్షలన్నీ, దుర్మార్గులకు  పరీక్షలెందుకు. మంచిపని చేయాలనుకున్నప్పుడో, తపస్సు చేయాలనుకుంటున్నప్పుడో ఈ పరీక్షలను మహానుభావులు ఎదుర్కొనవలసి వస్తుంది.

(ఇక్కడ మనం గమనిస్తే కుక్కమీద కూడా అంత దయ చూపించి స్వర్గానికి తెమ్మన్న యుధిష్ఠిరుడు, ఇక్కడ దుర్యోధనుడిని మాత్రం స్వర్గంలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ కుక్క యుధిష్ఠిరుడిని ఆశ్రయించింది, అనుసరించింది, శరణు పొందింది, కానీ దుర్యోధనుడు అలా చేయలేదు. పైగా హాని చేసినవాడు దుర్యోధనుడు, అప్పటికీ ఘోషయాత్రలో అతని ప్రాణాలను కాపాడినవాడే, కానీ తమ్ముళ్ళకంటే ముందు యుధిష్ఠిరుడు దుర్యోధనుడిని చూడగానే అసలు భరించలేకపోయాడు. ఈ భావన దుర్యోధనుడి మీద ఉన్న ద్వేషం అనకుండా సోదరులమీద ఉన్న ప్రేమ అనుకుంటే సరిపోతుంది. అసలు స్వర్గంలో ఎందరో పుణ్యాత్ములు ఉన్నారు కదా, పోనీ తన సోదరులు కనపడకపోతే ఏ భీష్ముడో, శ్రీకృష్ణుడో కనిపించినా ఇంత బాధ పడేవాడు కాదు కదా, అంటే ఇదంతా ఇంద్రాదుల ఆజ్ఞతో జరుగుతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనే విషయం సోదరులు కలిసిన తరువాత మనకే తెలుస్తుంది. )

దుర్మార్గాలు చేసిన దుర్యోధనుడే స్వర్గంలో సుఖాలను అనుభవిస్తుంటే, ఎంతో పుణ్యాలు చేసుకుని, ఏ పాపమూ ఎరుగని తన సోదరులు ఇంకెంత స్వర్గసుఖాలలో ఉంటారో అనుకుంటూ తన వెంట వచ్చిన దేవదూతలను ప్రశ్నించాడు, సోదరులు ఎక్కడ ఉన్నారో అక్కడికే తనను తీసుకెళ్ళమని కోరుకున్నాడు.

నారదుడు కూడా యుధిష్ఠిరునికి నచ్చచెప్పిచూశాడు. స్వర్గంలో శత్రుత్వం అనేది వుండదు నాయనా! పైగా ఇతడు యుద్ధంలో వీరమరణం పొందినవాడు. దేవతలు కూడా ఎదిరించలేని మిమ్మల్ని, క్షాత్రధర్మంగా ఎదిరించి నిలబడ్డాడు. ఇక ద్రౌపదికి జరిగిన అవమానం అంటావా! ఆ జూదం సమయంలో జరిగిన అవమానాలను తలచుకోమాకు. ఇక్కడ శత్రుత్వాలు ఉండకూడదు అంటూ నారదుడు చెప్పిచూశాడు. ఎంత చెప్పినా యుధిష్ఠిరుడికి దుర్యోధనుడి పైన కోపం పోలేదు. అతడిని చూడటానికి కూడా ఇష్టపడలేదు.

3.3 ధర్మరాజు చూసిన కర్ణుడి పాదాలు:

యుధిష్ఠిరుడికి మాత్రం మనసు సోదరుల పైనే నిలిచింది. మహాత్ములు, సత్య ప్రతిజ్ఞులయిన నా సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికే నన్ను చేర్చండి అని కోరుకున్నాడు. విశేషంగా ఆ సమయంలో యుధిష్ఠిరుడు కర్ణుడిని చాలా తలుచుకున్నాడు. ఎందుకంటే యుద్ధం జరిగినన్నాళ్ళూ కర్ణుడు తన సోదరుడే అని తెలియలేదు. తీరా కర్ణుడు మరణించగానే కుంతీదేవి ద్వారా విషయం తెలుసుకుని, ఆ అగ్రజుని తలుచుకుని, చాలా సార్లు విలపించాడు యుధిష్ఠిరుడు. ఎందుకంటే కర్ణుడి పాదాలు చూసినప్పుడల్లా కుంతీదేవి పాదాలు చూసిన అనుభూతిని పొందాడు యుధిష్ఠిరుడు.  ఆ అనుభూతిని పొందికూడా అతడు శత్రుపక్షంలో ఉండేటప్పటికీ  సరిగా గుర్తించలేకపోయాడు. గుర్తించలేకపోవటం కాదు, అసలు కర్ణుడి పరాక్రమాన్ని తలుచుకుని సరిగ్గా నిద్ర కూడా పోలేదు యుధిష్ఠిరుడు. పరాక్రమంలో అర్జునుడికి ఏ మాత్రం తీసిపోనివాడు కర్ణుడు. ఇంకా చెప్పాలంటే అర్జునుడి కన్నా పరాక్రమవంతుడే. ఈ మాట మనం అనక్కర్లేదు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడితో అన్నాడు. కానీ ఆ కర్ణుడే తన సోదరుడని తెలిసినప్పటినుండీ యుధిష్ఠిరుడు ఎంతో బాధ పడ్డాడు. అలాంటి కర్ణుడిని, తక్కిన నలుగురు సోదరులను, ద్రౌపదిని,  చూడాలని తపించిపోయాడు యుధిష్ఠిరుడు.

నరకాన్ని కూడా స్వర్గాన్ని చేయగలవాడు ధర్మరాజు -

 యుధిష్ఠిరుడి కోరికను అంగీకరించి ఇంద్రుడు దేవదూతను పిలిపించి ఆయనకు ఇష్టమైన చోటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు.

                                    యది వై తత్ర తే శ్రద్ధా గమ్యతాం పుత్ర మా చిరమ్।

                                    ప్రియే హి తవ వర్తామో దేవరాజస్య శాసనాత్।।     2. 13

            దేవదూత ముందు నడుస్తూ యుధిష్ఠిరుడు కోరినట్టు సోదరులందరూ ఉన్న ప్రదేశం వైపు తీసుకువెళ్లాడు. వెళుతున్న కొద్దీ దారి దుర్గంధంతో నిండిపోయింది. గాడాంధకారంగా ఉంది. వెంట్రుకలు, గోళ్ళు, నాచు, గడ్డి, రక్తమాంసాలు మొదలైన వాటితో దారంతా అశుభంగా ఉంది.

                                       తమసా సంవృతం ఘోరం కేశశైవలశాద్వలమ్।

                                        యుక్తం పాపకృతాం గన్ధైర్మాంసశోణితకర్దమమ్।।     1. 17

అన్ని వైపులా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉన్నాయి. క్రిమికీటకాలతో నిండి ఉంది ఆ ప్రాంతం. మండుతున్న అగ్ని ఆ మార్గాని చుట్టుముట్టి ఉంది.  వింధ్య పర్వతం వంటి ఆకారాలతో ప్రేతాలు తిరుగుతున్నాయి. దుర్గంధాన్ని భరిస్తూ ఆ దారిలో నడిచాడు ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు. అక్కడే ఒక వనాన్ని చూశాడు. అశిపత్రవనం అది. ఆ వనంలోని చెట్ల ఆకులన్నీ కత్తులవలే ఉన్నాయి. కొందరు ఇనుప బాణళ్ళలో నూనె కాల్చుతున్నారు. అనేక పాపాలు చేసినవారు అక్కడ యాతనా శరీరంతో నరకలోకపు శిక్షలు అనుభవిస్తున్నారు.

యుధిష్ఠిరుడికి వెళుతున్న కొద్దీ సందేహం పెరుగుతుంది. పుణ్యాత్ములున్న నా సోదరుల వద్దకు తీసుకువెళ్ళమంటే ఈ దేవదూత ఈ మార్గంలో తెస్తున్నాడేమిటి? అని అతని సందేహం. ఆ దృశ్యాలను, దుర్గంధాన్ని భరించలేక ‘ఇంకా ఈ దారిలో ఎంత దూరం వెళ్ళాలి.

                        కియదధ్వానమస్మాభిర్గన్తవ్యమితిమీదృశమ్।    2.  26

 నా సోదరులు ఎక్కడ? ఈ మార్గం భరించలేనిదిగా ఉంది. నాకు మూర్ఛ వచ్చేట్టున్నది.’ అని యుధిష్ఠిరుడు అనగానే దేవదూత ఈ విధంగా అన్నాడు. ‘నీవు అలసిపోయినట్లయితే వెనక్కి వెళదాం మహానుభావా! నీవు అలసిపోగానే తిరిగి వెనుకకు తీసుకురమ్మని దేవతల ఆదేశం’

                        నివర్తితవ్యో హి మయా తథాస్మ్యుక్తో(తథాస్మి ఉక్తో) దివౌకసైః।

                        యది శ్రాన్తోsసి రాజేన్ద్ర త్వమథాగన్తుమర్హసి।।       2.   21

అని ఇద్దరూ వెనుతిరిగారు. యుధిష్ఠిరుడు తిరిగి వెళ్ళిపోతుంటే ఆ ప్రాంతంలో అన్ని వైపుల నుండీ ఆక్రందనలు వినిపించాయి. "ధర్మజా! పాండునందనా! మమ్మల్ని అనుగ్రహించు, ఇంకాసేపు ఇక్కడే ఉండు. ధర్మాత్ముడవైన నీవు రాగానే మాకు పవిత్రమైన గాలి వీస్తుంది. దుర్గంధభరితమైన ఈ ప్రదేశంలోకి నీవు రాగానే, నీ శరీరాన్ని తాకుతూ ప్రసరిస్తున్న గాలి మాకు సుగంధభరితంగా మారి వస్తున్నది. నీ దర్శనంతోనే మాకు సుఖం కలుగుతుంది.

                        ఆయాతి త్వయి దుర్ధర్షే వాతి పుణ్యః సమీరణః।

                        తవ గన్ధానుగస్తాత యేనాస్మాన్ సుఖమాగమత్।।    1.  33

నీ ప్రవేశంతో ఈ కింకరులు మమ్ము బాధించటం ఆపేశారు. కాబట్టి యాతనాదేహంతో బాధలు అనుభవిస్తున్న మాకు ఊరట కలుగుతుంది. ధర్మజా! వెళ్ళమాకు ఇక్కడే ఉండు" అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.

                        సంతిష్ఠస్వ మహాబాహో ముహూర్తమపి భారత।

                        త్వయి తిష్ఠతి కౌరవ్య యాతనాస్మాన్ న బాధతే।।    2.  35

ధర్మరాజు నరకలోకంలోకి ప్రవేశించగానే అక్కడివారికి కష్టాలు పోయి సుఖాలు అనుభవిస్తున్నారంటే, ధర్మాత్ముడైనవాడు నరకాన్ని కూడా స్వర్గాన్ని చేయగలడు అని మనం అర్థం చేసుకోవలసిన అంశం. ధర్మానికి ఉన్న శక్తి అలాంటిది.

ధర్మరాజుకి ఆ శబ్దాలు చాలా పరిచతమైన వ్యక్తుల వచనాలుగా అనిపించాయి. ధ్వని మాత్రం వినిపిస్తుంది. కానీ ఆకారాలు కనిపించటంలేదు. ఆ దీన వచనాలు వినగానే యుధిష్ఠిరుడు మనసులో చాలా కష్టాన్ని అనుభవించాడు. భరించలేని దృశ్యాలతో, దుర్గంధంతో అక్కడ నిలవలేకపోతున్నాడు, ఆర్తులను కాపాడాలనే ధర్మంతో ఆ ప్రదేశాన్ని విడవలేకపోతున్నాడు. చివరికి ఆ బాధలో వారి స్వరాలను గుర్తుపట్టలేక పెద్దగా వారినే అడిగాడు.  'మీరెవరు? ఇక్కడెందుకున్నారు?’ అని అడగగానే ఒక్కొక్కరూ వారి నామాలను చెప్పుకున్నారు.

                        ఉవాచ కే భవన్తో వై కిమర్థమిహ తిష్ఠథ।    2. 39

రాజా! నేను కర్ణుడిని, నేను, భీమసేనుడిని, నేను అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని, నేను ద్రౌపదిని, మేము ఉపపాండవులం, అంటూ వారందరూ పేర్లు చెప్పుకుని దీనంగా విలపించారు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు. దైవసమానులైన నా సోదరులేంటి, ఇలాంటి నరకంలో శిక్షలు అనుభవించటం ఏంటి? అని విలపించాడు. పోనీ ఇదేమన్నా దైవ కృత్యమా, లేక కాల వైపరీత్యమా అని ఆలోచించాడు. సుయోధనుడు స్వర్గంలో ఉండటానికి చేసిన పుణ్యమేమిటి? నా సోదరులు, భార్యా పుత్రులు నరకంలో ఉండటానికి వారు చేసిన పాపమేమిటి? తన సోదరులలో ఏ దోషం ఉన్నదో అతినికి తెలుసు, మహాప్రస్థాన పర్వంలో భీముడు అడిగినప్పుడు ఒక్కొక్కరూ ఏ కారణంగా పడిపోయారో చెప్పాడు. పోనీ ఈ ఒక్క దోషం వలన సోదరులు ఇన్ని కష్ఠాలు పడవలసి వస్తుందా అనుకుంటే, మరి వాళ్ళు చేసిన పుణ్యాలతో పోల్చి చూసుకుంటే పుణ్యాలే అధికమైనవి కదా. వారు ఎన్నో యాగాలు చేసినవారు. దైవఋణం, పితృఋణం, ఋషిఋణం మానుషఋణాలనన్నీ తీర్చుకుని, ధర్మాత్ముడైన ధర్మజుని మాటకు కట్టుబడి మెలిగినవారు. దైవాంశసంభూతులు. అటువంటి వారు నరకయాతనలు అనుభవించటమేమిటి?     

                        కిం ను సుప్తోsస్మి జాగర్మి చేతయామి న చేతయే।

                        అహో చిత్తవికాసోsయం స్యాద్ వా మే చిత్తవిభ్రమః।।   2. 48

 అసలు నేనేమన్నా కల కంటున్నానా, లేక మేల్కొనే ఉన్నానా? అని అనేక విధాలుగా చింతించాడు యుధిష్ఠిరుడు. ఆ పరితాపంతో యుధిష్ఠిరుడు తట్టుకోలేక దేవతలను కూడా దూషించాడు.

                        దేవాంశ్చ గర్హయామాస ధర్మం చైవ యుధిష్ఠిరః।    2. 50

 దేవదూతతో, నాయనా! నేను నా సోదరులను విడిచి రాలేను. ఇక ఇక్కడే ఉంటాను. నీవు తిరిగి ఇంద్రుడి వద్దకు వెళ్ళవచ్చు అని దేవదూతను పంపించేశాడు.

దేవదూత ద్వారా యుధిష్ఠిరుడి వచనాలను విని ఇంద్రుడు- ధర్ముడు, వసువులు, అశ్వినులు, సిద్ధులు, సాధ్యలు, రుద్రులు, ఆదిత్యులు, పరమఋషులు, సర్వదేవగణాలతో పాటు అక్కడికి వచ్చాడు. పుణ్యకర్మలతో దేదీప్యమానమైన దేహములతో ప్రకాశించేవారు దేవతలు. దేవతల రాకతో అప్పటివరకూ దుర్గంధభరితమైన ఆ ప్రదేశమంతా పుణ్యగంధాలతో నిండిపోయింది. చీకటి అంతరించింది. గాలి సుఖంగా వీచింది. పాపాత్ములు అనుభవిస్తున్న యాతనలు, వైతరిణీ నది, లోహకుంభాలు, కాలుతున్న లోహశిలలు, అన్నీ అదృశ్యమయ్యాయి.

(అంటే ఒక ప్రదేశం మనకు ఇంతకుముందు నరకంగా కనబడి మరలా అదే ప్రదేశం స్వర్గంలాగా కనబడిందంటే కలిగిన మార్పు ప్రదేశంలో కాదు, మన భావనలో మార్పు అని అర్థం అవుతుంది. రాగద్వేషాలు మొదలైన అరిషడ్వర్గాలకు లొంగి ఉన్నంతకాలమూ, అన్నీ మనకు నరకప్రాయంగానే కనిపిస్తాయి. ఎవరిని చూసినా శత్రువులుగానే కనిపిస్తారు. అదే ఇంద్రియ నిగ్రహంతో వాటిని జయించిన సాధకుడికి  అంతా తనకు అనుకూలంగానే, స్వర్గంగానే, కనిపిస్తుంది. వారికి ఎవరిని చూసినా మిత్రులుగానే కనిపిస్తారు.)

                                    వికృతాని శరీరాణి యాని తత్ర సమన్తతః।।   3.5

                                    దదర్శ రాజా కౌరవ్యస్తాన్యదృశ్యాని చాభవన్।।   3.6

3.4 ధర్మజుడు అనుభవించిన శిక్ష:

 దేవతల మధ్యలోనున్న దేవేంద్రుడు యుధిష్ఠిరుడిని అనునయిస్తూ ఇలా అన్నాడు. "ధర్మజా! నీవు సిద్ధిని పొందావయ్యా, అక్షయమైన లోకాలను పొందావు. జరిగినదానికి విచారించకు, కోపగించుకోకు. నీకు ఈ నరకలోకపు కష్టం ఎందుకు కలిగిందంటే, రాజులైనవారెవరైనా సరే, తప్పకుండా నరకాన్ని చూడవలసిందే మహారాజా!

                        అవశ్యం నరకస్తాత ద్రష్టవ్యః సర్వరాజభిః।    3. 12

ఎందుకంటే వారు తెలిసో తెలీకో ఏదో రకంగా తప్పులు చేస్తూ ఉంటారు. మహాత్ములైన రాజుల పరిపాలనలో కూడా ఒక్కోసారి ఇతరులు బాధలను అనుభవించవలసి వస్తుంది.

 నరుడు అనుభవించే కర్మ ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ పాపాలు చేసి, స్వల్పమైన పుణ్యాన్ని చేసినవాడు ముందు పుణ్యఫలాన్ని అనుభవించటానికి స్వర్గానికి చేరుకుంటాడు.  ముందు సుకృత ఫలాలను(అంటే స్వర్గసుఖాలను) అనుభవించి, తరువాత నరకలోకంలో శిక్షలు అనుభవిస్తారు. నీవు చూసిన దుర్యోధనుడు కూడా అలాగే ఇక్కడ ముందు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. ఎక్కువ పుణ్యకర్మలు ఆచరించిన మహానుభావులు ముందు వారు చేసిన చిన్న చిన్న దోషాలకు నరకాన్ని అనుభవించి, తరువాత స్వర్గానికి చేరుకుంటారు.  నీ విషయంలో ఇదే జరిగింది. ఏది ఏమైనా మనం చేసిన పుణ్యపాప కర్మలకు రెండిటికీ మనం స్వర్గనరకాలను అనుభవించవలసిందే.

                           పూర్వం నరకభాగ్ యస్తు పశ్చాత్ స్వర్గముపైతి సః।

                            భూయిష్టం  పాపకర్మా యః  స పూర్వం స్వర్గమశ్నుతే।।    3.  14

అందుకే నీ శ్రేయస్సును కోరే, మేము ముందుగా నిన్ను ఇక్కడికి పంపాము. దీంతో నీవు అనుభవించవలసిన శిక్ష పూర్తయిపోయింది అన్నాడు ఇంద్రుడు. ఇక్కడ మనకో సందేహం రావచ్చు. అదేమిటంటే ధర్మరాజుకి ఇంకా ఏ శిక్షా పడలేదు కదా? అక్కడ అనేక శిక్షలుఅమలు చేస్తూ ఉంటారు. మరిగిన నూనె బాండీలలో దేహాలను యాతన పెట్టటం, క్రిమి కీటకాదులచే కరిపించటం, ఇలాంటి శిక్షలు ఏవీ ధర్మరాజుకి వేయకుండా కేవలం నరకంలో సోదరులను చూపించారు అంతే. వారి సోదరులు మాత్రం అనేక బాధలు అనుభవిస్తున్నట్టు చూపించారు. చూడటంతోనే శిక్ష అయిపోతుందా? అలా ఇంద్రుడు ఎందుకు చేయించాడంటే, ధర్మరాజుకి వేరే శిక్షలేమీ అక్కర్లేదు. తన సోదరులు, ద్రౌపదీ బాధ పడటం చూశాడు అంటే, అది చాలు ధర్మరాజుకి, అదే అతనికి నరక వేదన. తన సోదరులకు ఏమన్నా జరిగితే తల్లడిల్లిపోతాడు. క్రుంగిపోతాడు. భారత సంగ్రామంలో తన సోదరులలో ఏ ఒక్కరికైనా ప్రమాదం జరిగివుంటే ధర్మజుడు కూడా ప్రాణాలు వదిలేసేవాడు. అటువంటి అనుబంధం వారిది. కాబట్టి అతనికి సోదరులుకు బాధ కలగటం వలన కలిగిన బాధ కంటే మించిన నరకం ఇంకొకటి లేదు.  

ఇంతటి శిక్ష ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడికి అవసరమా? ఇక ఇంతటి ధర్మాత్ముడికే నరకలోకపు శిక్ష అమలు అయిందంటే మనబోటి వారి సంగతి ఇంక చెప్పేదేముంది? అయితే రాజనేవాడు తప్పని సరిగా ఇతరులకు తెలిసో తెలీకో బాధ కలిగించి ఉంటాడు అందుకే ఈ శిక్ష పడింది అన్నాడు ఇంద్రుడు. అంతేకాక సోదరుల వంకతో ఇలాంటి శిక్ష వేయటాకి మరో విషయం కూడా చెబుతున్నాడు ఇంద్రుడు ఇక్కడ. “ధర్మనందనా! మహాభారత సంగ్రామంలో నీవు అశ్వత్థామ విషయంలో ఏదో నెపం పెట్టి ద్రోణాచార్యుడిని నమ్మించావు. అందుకే మేము కూడా సోదరుల నెపంతోనే నీకు నరకాన్ని చూపించాము. నీలాగే నీ సోదరులు కూడా ఒక్కొక్కరూ ఒక్కో నెపంతో నరకాన్ని చూశారు. వారిలోని దోషాలు నీకు తెలిసినవే కదా! ఇప్పుడు వారందరూ పాప విముక్తులయ్యారు. వారే కాదు మహారాజా! కర్ణుడు కూడా ఉత్తమసిద్ధిని పొందాడు. యుద్ధంలో నీ పక్షాన నిలిచిన వారందరూ స్వర్గంలోనే సుఖిస్తున్నారు. రా, వెళదాం” అంటూ ఇంద్రుడు యుధిష్ఠిరుడిని పవిత్రమైన ఆకాశగంగ దగ్గరకి తీసుకువెళ్ళాడు. “దీనిలో స్నానం చేయి, నీ మానుషభావం పోయి, శోకమోహాలు దూరమవుతాయి. శత్రుత్వం అనే భావన నశిస్తుంది అన్నాడు ఇంద్రుడు. ఇక నుండీ శోకరహితంగా నాతో కలిసి విహరిస్తూ ఈ స్వర్గ సుఖాలను అనుభవిస్తావు. నీవు చేసిన లెక్కలేనన్ని దానాలతోనూ, తపస్సుతోనూ, రాజసూయ అశ్వమేధయాగాలతోనూ, నీవు ఆచరించిన పుణ్యకర్మలతోనూ వచ్చిన పుణ్యఫలితాన్ని ఇక్కడ అనుభవిస్తావు. ఇక ఇప్పటినుండీ నిన్ను సమస్త దేవతలు, గంధర్వులు, అప్సరసలు, సేవిస్తూ ఉంటారు. నీవు సంపాదించిన పుణ్యం సత్యహరిశ్చంద్రుడు పొందిన పుణ్యంతో సమానం. (పాండురాజు ఈ మాటే నారదుని ద్వారా ధర్మరాజుకి సభాపర్వంలో చెప్పాడు. సత్యహరిశ్చంద్రుడి లాగా పుణ్యఫలాన్ని పొందాలి, అందుకొరకు రాజసూయం చేయమని సూచించాడు) అందుకే మీ ఇద్దరి పుణ్యలోకాలు సమస్తరాజన్యుల లోకాలకంటే పైన ఉంటాయి యుధిష్ఠిరా! రాజర్షులైన మాంధాత, భగీరథుడు, నలుడు, భరతుడు, మొదలైన వారు విహరించే లోకాలలో నీవు స్వేచ్ఛగా సంచరించవచ్చు. అంటూ షట్చక్రవర్తుల పుణ్యాన్ని, యుధిష్ఠిరుడు సంపాదించిన పుణ్యంతో సమానంగా కీర్తించాడు ఇంద్రుడు.

3.5 ధర్ముడు పెట్టిన మూడు పరీక్షలు:

ఇంతలో యుధిష్ఠిరుడి ధర్మనిరతికి ధర్ముడు ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. నాయనా! ఇప్పటి వరకూ నేను నిన్ను మూడు సార్లు పరీక్షించాను. అయినా నీవు నీ ధర్మస్వభావం నుండీ మరలలేదు.

                                    ఏషా తృతీయా జిజ్ఞాసా తవ రాజన్ కృతా మయా

                                    న శక్యసే చాలయితుం స్వభావాత్ పార్థ హేతుతః. 3.32

మొదటిసారి గతంలో నేను ద్వైతవనంలో బ్రాహ్మణుడి అరణి కాష్ఠాలను అపహరించి, నీ సోదరులందరినీ మరణించేట్టు చేసి నిన్ను పరీక్షించాను. రెండవసారి మహాప్రస్థాన సమయంలో శునక రూపంలో నీ వెంట వచ్చి నిన్ను  పరీక్షించాను. మూడవసారి ఇప్పుడు కూడా పరీక్షించాను. నీకోసం నీ సోదరులు ఎంతో త్యాగం చేశారు. నీ ఆజ్ఞ పాటించటం కోసం వారు ఎన్నో సుఖాలను వదులుకున్నారు. అమితమైన పరాక్రమం కలిగి వుండి కూడా వారు నీ ఆజ్ఞకు బద్దులై నీకు కీర్తిప్రతిష్ఠలును కలిగించటానికి కూడా కారణమయ్యారు. మానాభిమనాలను, క్రోధద్వేషాలను వారు నీ సుఖం కోసం వారి మనసులలోనే నిగ్రహించుకున్నారు. వారి జీవితకాలంలో మొదటి మూడు వంతుల జీవితకాలం కష్టాలతోనే సాగింది. చివరి కాలంలోనే, అంటే రాజ్యపాలన చేసిన ముప్పది ఆరు సంవత్సరాలు మాత్రమే వారు రాజ్యసుఖాలను సంపూర్తిగా అనుభవించారు. కానీ అప్పటికే వారి వయస్సు దాదాపు వందసంవత్సాలు దాటింది. (యుద్ధసమయానికి యుధిష్ఠిరుడి వయస్సు దాదాపు 90 సంవత్సరాలు ఉంటాయి) నీకోసం అంతటి త్యాగం చేసిన నీ సోదరులమీద స్వర్గానికి రాగానే నీ స్వభావం ఎలా ఉంటుందా అనే పరీక్ష పెట్టాను.

                                    ఇదం తృతీయం భ్రాత్రూణామర్థే యత్ స్థాతుమిచ్ఛసి

                                    విశుద్ధోsసి మహాభాగ సుఖీ విగతకల్మషః. 3. 35

 అంతే కాక ఏ స్త్రీ పడనటువంటి అవమానాన్ని పడింది ద్రౌపది. నిండుసభలో ఆవిడకి జరిగిన పరాభవం ఘోరమైనది. అయినా ఆనాడు ఆవిడ క్షత్రియధర్మాన్నే పాటించి నీ గౌరవాన్ని కాపాడిన సంఘటన జరిగింది. ఆనాడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని వరాలు కోరుకోమన్నాడు. ఆవిడ క్షత్రియకాంత రెండు వరాలు కోరుకోటానికి  మాత్రమే అర్హత ఉంటుంది అని చెప్పి రెండు వరాలే కోరుకుంది. వైశ్యకాంత ఒక వరము, క్షత్రియ కాంత రెండు వరాలు, శూద్రకాంత మూడు వరాలు, బ్రాహ్మణ కాంత నూరు వరాలు కోరవచ్చు. ఈ ధర్మం తెలిసిన ద్రౌపది రెండే కోరుకున్నది. ఆవిడ మూడు వరాలు కోరివుంటే ఆనాడు దుర్యోధనాదులు అవమానించినట్లు దాసిగా తనకు తాను ఒప్పుకున్నట్లయ్యేది. ఈ ధర్మసూక్ష్మాన్ని  మనసులో ఆలోచించి రెండే వరాలు కోరుకుంది. అందులో మొదటిది ధర్మరాజుని విముక్తిని గావించమని కోరుకున్నది. తరువాత ఆయుధాల సహితంగా నీ సోదరులను కూడా బంధ విముక్తులను గావించి మీకు మార్గాన్ని చూపింది. ఆనాడు ధృతరాష్ట్రుడు వరాలు కోరుకోమనగానే ఈ రాజ్యం అంతా ధర్మరాజుకి అతని సోదరులకి అప్పగించండి, మీరందరూ శాశ్వతంగా అడవులకి వెళ్ళి జీవించండి అని  ద్రౌపది కోరుకుని ఉంటే ఎలా ఉండేది. కానీ ఆవిడ అలా కోరుకోకుండా ఒక క్షత్రియకాంత ఆలోచించవలసిన రీతిలో అంతకష్టంలో కూడా ఆలోచించింది. అదీ ఆవిడ గొప్పస్వభావం. తన భర్తలు క్షత్రియులు కాబట్టి, వారి ఆయుధాల సహాయంతో భుజపరాక్రమాలతో వారు ఈ జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తప్పక తీర్చుకుంటారు, అందుకోసం జరిగే సంగ్రామంలో  విజయం సాధించి క్షత్రియోచితంగా వారి రాజ్యాన్ని వారే సమకూర్చుకోగలరు. అదే వారికి గౌరవప్రదమైనది. అంతే కానీ, తాను ధృతరాష్ట్రుడిని ఈ రాజ్యమంతా వరంగా అడిగితే అది భిక్షతీసుకున్నట్టు భావించవలసి వస్తుంది. అది వీరులైనవారికి  భరించలేని అవమానం. ఇందులోనే ఇంకొక అంశం  ఏమిటంటే ఒకవేళ ద్రౌపది రాజ్యాన్ని వరంగా  అడిగినా ధృతరాష్ట్రుడు మరలా ధర్మరాజుతో జూదం ఆడించి ఆ రాజ్యాన్ని సంగ్రహించే అవకాశమూ ఉంది. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు అంతటి దుర్మార్గులే. ఆ సమయంలో ద్రౌపది ముందుచూపుతోనే ఆయుధసహితంగా భర్తలను విముక్తులును గావించమని కోరుకున్నది.

అటువంటి ధర్మపత్ని, పతివ్రత అయిన ద్రౌపదిని స్వర్గంలోనికి ప్రవేశించగానే యుధిష్ఠిరుడు ఏమన్నా మరచిపోతాడేమో చూద్దాం అని ధర్ముడు పరీక్ష పెట్టాడు. కానీ యుధిష్ఠిరుడు రాగానే తన సోదరులను, ద్రౌపదిని  చూపించమని, వారు ఎక్కడ ఉంటే అక్కడే తనకు స్వర్గమని చెప్పటంతో ధర్ముడు సంతోషించాడు. వీరినేకాకుండా తనకుయుద్ధంలో సహాయపడిన వారందినీ చూడాలనివుంది, కాబట్టి వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు యుధిష్ఠిరుడు. దీనిని బట్టి యుధిష్ఠిరుడు చేసిన ఉపకారాన్ని మరచిపోయే వాడు కాదు అని తెలుస్తుంది. యుధిష్ఠిరుడు అలా అడిగాడేమిటి, స్వర్గంలోకి వచ్చినా మమకారాలను, బంధువులును వదలటంలేదు అని మనం అనుకుంటాము. కానీ అలా కోరుకోకపోయి ఉంటే ధర్ముడు పెట్టిన పరీక్షలో యుధిష్ఠిరుడు విజయం సాధించే వాడు కాదు.

ఇక్కడ సోదరులకోసం నీవు స్వర్గాన్నే పరిత్యజించి వారితోనే ఉండాలనుకోవటం చేత, నేను పెట్టిన ఈ మూడవ పరీక్షలో కూడా నీ ధర్మం నీవు సదా నిర్వర్తించినట్లయినది అన్నాడు ధర్ముడు. రాజులందరూ నరకాన్ని చూడవలసిందే మహారాజా!

                                    అవశ్యం నరకాస్తాత ద్రష్టవ్యాః సర్వరాజభిః।

                                    తతస్త్వయా ప్రాప్తమిదం ముహూర్తం దుఃఖముత్తమమ్।।   3.  37

అందుకే దేవేంద్రునితో ఆలోచించి నీకు ఈ శిక్ష పడేట్టు చేశాను. నీ సోదరులు బాధపడటం వలన నీకు కలిగిన బాధను మించిన శిక్ష నీకు ఇంకేమీ లేదు. అందువలన ఒక ముహూర్తకాలం పాటు నీకు ఈ దుఃఖాన్ని పొందవలసి వచ్చింది అన్నాడు ధర్ముడు.

 రాజా! ఇది పరమ పవిత్రమైన ఆకాశగంగ. ఇందులో స్నానమాచరించు. శ్రీమహావిష్ణువు పాదాల నుండీ పుట్టిన మందాకినీ అది.  బ్రహ్మ కమండలంనుండీ జాలువారి, శ్రీమహావిష్ణువు పాద స్పర్శతో పునీతమై, మందగమనంతో, స్వర్గలోకంలో ప్రవహించటంవలన గంగకు మందాకినీ అనే పేరు వచ్చింది.

 అటువంటి ఆకాశ గంగ ముల్లోకాలలోని ప్రాణులను పావనం చేస్తుంది. అందుకే ఆ నదిని త్రిలోకగామి, త్రిపథగ అంటారు. అందులో నీవు స్నానం చేయి, నీ మానుషభావం తొలగిపోతుంది. అని ఇంద్రుడు పలికాడు.

                        గఙ్గాం దేవనదీం పుణ్యాం పావనీమృషిసంస్తుతామ్।

                        అవగాహ్య తతో రాజా తనుం తత్యాజ మానుషీమ్।।   3.  41

3.6 దివ్యదేహంతో ధర్మజుడు -

వారు చెప్పినట్టుగా యుధిష్ఠిరుడు ఆ దేవనదియైన ఆకాశగంగలో మునిగి తన మానుషదేహాన్ని, మానుష భావాలను విడిచి దివ్య శరీరాన్ని ధరించాడు. వెంటనే ఆయనలో శత్రుత్వ భావనల నశించిపోయాయి.

ఆ తరువాత యుధిష్ఠిరుడు సకల దేవతా శ్రేష్ఠుల చేత గౌరవించబడుతూ ముందుగా గోవిందుని చూశాడు. అంతకు ముందు చూసిన రూపంతో సమానమైన రూపంతో, స్వామి వెలిగిపోతున్నారు. సుదర్శన చక్రం మొదలైన సమస్త అస్త్రాలు కూడా ఆయనను పురుషరూపాలను ధరించి సేవిస్తున్నాయి.

ఆయనకు ప్రక్కనే ఉండి అర్జునుడు తదేకంగా, అత్యంత శ్రద్ధగా ఆ పరమాత్ముడిని సేవిస్తున్నాడు. నరనారాయణులైన ఆ పురుషోత్తములిద్దరూ యుధిష్ఠిరుడిని యథోచితంగా సన్మానించారు. ధర్మరాజు కొంచెం ముందుకు వెళ్ళగానే ద్వాదశాదిత్యులతో కూడి ఆసీనుడైయున్న కర్ణుడిని చూశాడు. ఇంకొంత ముందు వెళ్ళగా మరద్గణాలతో పరివేష్టితుడై, పూర్వశరీరం వంటి ఆకృతిలోనే దివ్యశరీరాన్ని ధరించిన భీమసేనుణ్ణి వాయుదేవుడి పక్కనే కూర్చిని ఉండటం చూశాడు. అద్వితీయమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు ఆ భీమసేనుడు. క్రమంగా అశ్వినుల స్థానంలో నకుల సహదేవులను చూశాడు. తరువాత తన శరీరశోభతో స్వర్గాన్నే అతిక్రమిస్తున్న పాంచాలిని చూశాడు. పాంచాలిని చూపిస్తూ దేవేంద్రుడు ఈమె స్వర్గలక్ష్మి. ఒక్కరే ఐదురూపాలలో ఉన్న మీ కోసం స్వయంగా మహేశ్వరుడే సృష్టించాడు ఈమెను అని ద్రౌపది జన్మరహస్యం చెప్పాడు.

                     శ్రీరేషా ద్రౌపదీరూపా త్వదర్థే మానుషం గతా

                     అయోనిజా లోకకాన్తా పుణ్యగన్ధా యుధిష్ఠిర।। 4.  12

                     రత్యర్థం భవతాం  హ్యేషా నిర్మితా శూలపాణినా

                     ద్రుపదస్య కులే జాతా భవద్భిశ్చోపజీవితా।।   4.  13

తరువాత ఐదుగురు గంధర్వుల రూపాలలో తమకు పుట్టిన ఉపపాండవులను చూశాడు. ఇంద్రుడు పక్కనే ఉండి పాండురాజు దగ్గర ఉన్న కుంతీ, మాద్రీ మాతలతో పాటు అందరినీ పేరు పేరునా ప్రశంసిస్తూ చూపించాడు యుధిష్ఠిరుడికి. వసువులతో కలిసి భీష్ముడున్నాడు. దేవగురువైన బృహస్పతితో కలిసి ద్రోణాచార్యుడున్నాడు. ఇలా ఇతర రాజులంతా గంధర్వులతో, యక్షులతో దేవతా సంఘాలతో కలిసి ఉండటం చూసి చాలా సంతోషించాడు యుధిష్ఠిరుడు. స్వర్గమంటే ఇది అనుకున్నాడు అప్పుడు.

అంతే కాక ఇక్కడ వ్యాసులవారు ఇంకొక దేవరహస్యం కూడా చెప్పారు. వసువులు ఎనిమిది మందే కదా. మరి భీష్ముడు వసువులతో ఉంటే తొమ్మిది మంది అవుతారు కదా, ఆదిత్యులు పన్నెండు మంది. కర్ణుడు వారితో కలిస్తే సంఖ్య పదమూడు అవ్వాలి కదా, ఇలాగే మిగిలిన వారి వలన కూడా వారి వారి సంఖ్యలలో తేడాలు వస్తాయి.

వారు ఆయా దేహాలతో వారి కర్మలకు తగిన స్వర్గసుఖాలను అనుభవించి, తరువాత అందరూ కూడా పూర్వం వారు ఎవరి అంశలతో దేహాలను ధరించారో ఆ అంశలలో లీనమైపోయారని వ్యాసులవారు స్వర్గారోహణ పర్వంలోని చివరి అధ్యాయంలో ప్రస్తావించారు. వాసుదేవుడు శ్రీమన్నారాయణుడిలో కలిసిపోయాడు. బలరాముడు రసాతలంతో శేషుడిలో కలిసిపోయాడు. వాసుదేవుడి పదహారువేల మంది భార్యలూ సరస్వతీనదిలో మునిగిపోయారు. అక్కడ వారంతా శరీరాలు విడిచి అప్సరసలై వాసుదేవుడి సేవకై నిలిచారు. కర్ణుడు సూర్యుడిలో కలిసిపోయాడు.

4. ముగింపు:

ఆదిపర్వంలో యుధిష్ఠిరుని జన్మారంభంలోనూ, వివాహ సందర్భంలో వ్యాసభగవానుడు చెప్పిన పాండవుల పూర్వస్వరూపాలలో ఇంద్రనిగానూ, ధర్ముడి అంశతోనూ ధర్మజుని దివ్యత్వము తెలుపబడింది.  రాజసూయ యాగమును నిర్విఘ్నంగా నిర్వహించిన వాడు ధర్మజుడు. ఎర్రబడిన తన దృష్టి సోకి పురప్రజలు భస్మమైపోతారని వస్త్రమును అడ్డుపెట్టుకుని వెళ్ళిన ధర్మజుని మహిమను  విదురుడి ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపడిన ఘటన మనకు సభాపర్వంలో కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనే విరాటపర్వంలో విరాటుడు పాచికలు ధర్మరాజు పై విసిరిన సంధర్భంలో వ్యాసభగవానుడు ఈ మహత్వాన్ని మరలా బయటపెట్టాడు.(12 సంవత్సరములు ఆ రాజ్యమునందు వర్షము కురవదు).  ధర్మజుని ఔన్నత్యం, ఔచిత్యపాలనము, ఆత్మీయ రక్షణము మనకు నహుషప్రశ్న, యక్షప్రశ్నల రూపంలో వనపర్వంలో  నిరూపించబడింది. న్యాయవ్యవస్థకు, సమాజవృద్ధికి ఈ సమాధానాలు మార్గోపదేశాలు. ధర్మజుడు ఉన్న ప్రాంతములో పంచభూతములు గానీ, ప్రకృతి గానీ, పశుపక్ష్యాదులు గానీ ఎటువంటి వృద్ధిని, సామరస్యాన్ని కలిగిఉంటాయో భీష్ముడే స్వయంగా విరాటపర్వంలో ప్రశంసించటం జరిగింది.

ఉద్యోగపర్వంలో  కర్ణుడి మాటల్లో  స ఏవరాజా ధర్మాత్మా శాశ్వతోsస్తు యుధిష్ఠిరః  అని కృష్ణపరమాత్మతో పలికిన వచననాలు దుర్యోధనుడి అధర్మవర్తనమును, ధర్మజుని మహిమను తెలియజేస్తున్నాయి.  శల్యుడిని ససైన్యముగా తన వశముగావించుకున్న దుర్యోధనుడి రాజకీయనైపుణ్యాన్ని, కేవలం “మాటసాయం” అనే మహాస్త్రముతో చిత్తుచేసిన రాజకీయమేధావిగా యుధిష్ఠిరుడు ఈ ఉద్యోగపర్వంలో మనకు గోచరిస్తాడు. యుద్ధపర్వాలలో జరిగిన అర్జునధర్మజ నిందావచనములయందు అనేక ధర్మములు తెలుపబడ్డాయి. సాక్షాత్ శ్రీకృష్ణపరమాత్ముడే యుధిష్ఠిరుని పాదాలు పట్టుకుని వేడుకున్న ఘట్టములో ధర్మముకు, ధర్మరాజుకు ఉన్న ప్రాధాన్యత సాక్షాత్కారమవుతుంది. శాంతి ఆనుశాసన పర్వాలలో భీష్ముడు చేసిన ఉపదేశామృతాలతో ధర్మజుడు ధర్మమార్గవిజ్ఞాన ప్రభావాన్వితుడయ్యాడు. శాంతచిత్తుడయ్యాడు. అశ్వమేధయాగమును సంపూర్తి గావించి మానసికతుష్ఠిని పొందగలిగాడు. ఆశ్రమవాసాంతమునందు విదురుడు తన ధర్మాంశను ధర్మరాజులో ప్రవేశపెట్టటం ధర్మరాజుకే విస్మయం కలిగించిన సత్యము. వివేశ విదురో ధీమాన్ గాత్రైర్గాత్రాణి చైవ హ....(28.26). ధర్మజవిదురైక్యము మహాభారతంలోని ధర్మజుని వైశిష్ట్యాన్ని ద్విగుణీకృతం చేసినట్టయినది. మౌసలపర్వంలో శ్రీకృష్ణనిర్యాణానంతరం  సర్వం కాలాధీనము అనే ధర్మసూక్ష్మాన్ని స్మరించి తమ మహాప్రస్ధాన సమయముగా భావంచిన కర్మజ్ఞుడిగా ధర్మజుని పాత్ర తెలుస్తుంది.

భార్యను, సోదరులను వారు బ్రతికుండగా నేను విడవలేదు, వారు మరణించిన తరువాత వారితో సంధికానీ, శత్రుత్వము కానీ ఉండదు. అందుకే వారు మహాప్రస్థానంలో పడిపోయినప్పుడు బ్రతికించుకోలేక వదిలేశాను. కానీ సారమేయము నన్ను శరణువేడినది, నాతోనే వచ్చినది, దానితోనే స్వర్గానికి వస్తాను, అని ధర్మపరీక్షలో మరోసారి తన దీక్షను నిరూపించుకున్నవాడు ధర్మరాజు. నరకమును కూడా స్వర్గమయం చేసిన పుణ్యమూర్తిగా స్వర్గారోహణపర్వంలో ధర్మరాజు మనకు దర్శనమిస్తాడు. “ఆజీవితాంతం తనతో కలిసి జీవించిన సోదరులను విడిచి స్వర్గాన్ని కోరుకుంటాడేమో” అనే ధర్మడు పెట్టిన చివరిపరీక్షలో సోదరులున్న నరకాన్ని కూడా స్వర్గాంగానే స్వీకరించిన స్థితప్రజ్ఞుడు ధర్మరాజు. అట్టి మహనీయుడు అనుసరించిన ధర్మమే నిత్యమైనది, సత్యమైనది.

న జాతు కామాన్న భయాన్న లోభాద్

ధర్మం త్యజేజ్జీవితస్యాపి హేతోః।

నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే

జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః।।       5. 63

మోక్షాన్ని కోరుకునేవారు ఈ జయమనే పేరుకలిగిన భారతేతిహాసాన్ని తప్పక వినాలి. కామం వలన కానీ, భయం వలన కానీ, లోభం వలన కానీ, ఆత్మరక్షణ కోసమైనా కానీ, ఎట్టి కారణాల చేతనైనా సరే ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టరాదు. అన్నిటికంటే నిత్యమైనది ధర్మమే.

              ఇంతటితో స్వర్గారోహణ పర్వం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతిః

     శ్రీమన్మహాభారతం సంపూర్ణం

5. కృతజ్ఞతలు:

(చందోలు దైవము, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు మా తండ్రిగారైన శ్రీ ముళ్ళపూడి జయసీతారామశాస్త్రిగారికి గురుదేవులు. పూజ్య గురుదేవుల సంకల్పాన్ని మా నాన్నగారిచ్చిన సంస్కృతవారసత్వవిద్యాప్రవేశముతో ఈ శీర్షికను సమకూర్చటం జరిగినది. మహాసముద్రముల వంటి మహాభారతాన్ని నా అల్పబుద్ధివంటి చిన్న పాత్రతో నింపటానికి సాహసించాను. ఈ సాహసాన్ని విజ్ఞులు సహృదయముతో ఆశీర్వదించెదరని, మరెన్నో ఇందలి ధర్మసూక్ష్మములు మున్ముందు సమయానుకూలముగా మీ సమక్షమునకు చేరవేయు శక్తిని  నాకు ప్రసాదించమని ఆ వ్యాసగణపతులను వేడుకుంటూ, పాఠక ప్రపంచమునకు, “ఔచిత్యము”  పత్రికా నిర్వాహకులకు నా నమస్కారములు తెలియచేసుకుంటున్నాను.)

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే. 1906.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 30. 2023.
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత. 2003.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్. 1931.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]