headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. తాటికోల పద్మావతి "అంతర్ముఖం" కథ: మనస్తత్త్వచిత్రణ

n_vidyavati.JPG
నూతక్కి విద్యావతి

పరిశోధకవిద్యార్థిని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.
స్కూల్ అసిస్టెంట్, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
లక్కరాజు గార్లపాడు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9963637182. Email: vidyavathinutakki@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో ఎందరో కథకులు పాఠకులను రంజింప జేసేలా, సమాజ స్థితిగతులను మార్చేలా రచనలు చేశారు. కొందరు రచించిన కథలు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి చిన్నలైన, పెద్దలైన అందరూ ఇష్ట పడేది కథ. కథను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠకులు, శ్రోతలను అలరించేలా చెప్పడం కథకుడి ఉండాల్సిన ముఖ్యలక్షణం. అటువంటి లక్షణాలు మెండుగా కలిగిన ఆధునిక రచయిత్రులలో శ్రీమతి తాటికోల పద్మావతి ముఖ్యులు. వారు రచించిన కథా సంపుటిలోని ఒక కథలో కౌటుంబిక విలువలు, భిన్న మనస్తత్వాలను గురించి పరిశీలనాత్మకంగా వివరించిన వ్యాసం ఇది. పరిశీలన పద్దతులను అనుసరించి చేసిన ఈ పరిశోధనలో మనుషుల స్వభాలను గుర్తించి ప్రవర్తించడం, ఉత్తమ పౌరుడిగా మెలగడం వంటి విషయాలు చర్చించబడ్డాయి.

Keywords: ఆధునికసాహిత్యం, తాటికోల పద్మావతి, కథ, పాత్రలు, స్వభావాలు

1. ఉపోద్ఘాతం:

ఈ ఆధునిక కాలంలో కథలు గద్య రూపంలో ఉండడం వల్ల పాఠకులకు మరింత చేరువవ్వగలుగుతున్నాయి. అందులోనూ కథ చాల ప్రాచీనమైనది. మనిషి ఆది మానవుడిగా ఉన్న కాలంలో వేటగాడిగా, అరణ్య వాసిగా జీవిస్తున్న క్రమంలో వారికి ఉపాధి కేవలం వేటాడటమే. అదే వారికి వినోదం, ఉపాధి. ఈ క్రమంలో వారు పొందిన అనుభవాలు,  ఎదుర్కొంటున్న సమస్యలు తమ సమూహంలోని మిగతా వారితో పంచుకోవడం సహజం. ఇలా పంచుకునే సందర్భంలో దానికి మరింత రసాత్మకంగా, వర్ణనలు జోడించి చెప్పడం వల్ల కథలు ఏర్పడతాయి. పూర్తిగా కల్పించుకొని చెబితే వాటిని కట్టు కథలు అంటారు. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు రచయితలు సమాజంలోని వాస్తవిక సంఘటనలకే రసాత్మకంగా చిత్రించి, జన వాహినికి పరిచయం చేస్తుంటారు. అసలు కథ అంటేనే “కొంచెము నిజము గల్గి కల్పితమైన వృత్తాంతము”  (ఆంధ్ర శబ్ధ రత్నాకరము, బహుజనపల్లి సీతారామాచార్యులు. పుట:324) అని నిఘంటువు సూచిస్తుంది.

“అనాది నుండి మౌఖిక రూపంలో వస్తున్న కథ భాషకు లిపి ఏర్పడి, లిఖిత రూపం దాల్చాక ప్రాచీన సాహిత్యంలో పద్యం రూపంలో ఎన్నో కథలు వచ్చాయి. ఆధునిక కాలంలో సాహిత్యంలో వచ్చిన మార్పులు వల్ల కథ కూడా కొత్త పుంతలు తొక్కింది.”  (కథలెలా రాస్తారు? – శార్వరి – పుట: 32)

పూర్తిగా వచన రూపంలో ఉంటూ సామాన్యులకు సైతo సులభంగా అర్థమయ్యేలా వ్యావహారిక భాషలో వెలువడుతూ వచ్చాయి. కథ విస్తృతి విషయంలో కూడా మార్పులు సంభవించాయి. దీర్ఘ కథలు, చిన్న కథలుగా భిన్న రూపాలలో విలసిల్లాయి. సగటు మనిషి ఎదుర్కునే సమస్యలనే ఇతివృత్తాలుగా స్వీకరించి ఎందరో కథా రచయితలు కథలను రచించారు. శ్రీమతి తాటికోల పద్మావతి కూడా ఈ విషయంలో ఏ మాత్రం తీసిపోనివారుగా చెప్పవచ్చు. వారు రచించిన కథలు రెండు సంపుటాల రూపంలో ప్రచురించబడ్డాయి. అవి: 1. గులాబీ రేకులు, 2. అంతర్ముఖం.

2. అంతర్ముఖం - కథల సంపుటి:

తాటికోల పద్మావతి రచించిన కథల సంపుటుల్లో రెండవది అంతర్ముఖం. ఇది 2016 లో మొదటి ముద్రణను పొందుకుంది. దీనిలో మొత్తం 27 కథలున్నాయి. అందులోని ఒక కథ అంతర్ముఖం. ఈ కథ పేరు మీదనే రచయిత్రి ఈ సంపుటికి శీర్షికను నిర్ణయించారంటే ఈ కథ ప్రాధాన్యతను మనం గుర్తించవచ్చు. 

3. అంతర్ముఖం:

సమాజంలో మనుషుల మధ్య కొరవడుతున్న మానవ సంబంధాల గురించి తెలియజేసే కథ. ముఖ్యంగా అత్తా కోడళ్ళ మధ్య ఉండే సమస్యలను ప్రతిఫలిస్తుంది. కోడలిని కూతురులా చూసుకునే అత్తలు, అత్తలను తల్లిలా చూసుకునే కోడళ్ళు సమాజంలో కొరవడుతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నట్లుగా, తమ అవసరాలకు పెద్దలను ఉపయోగించుకొని అవసరం తీరాక వారి పట్ల నిర్లక్ష్యాన్ని చూపించే వ్యక్తిత్వాలను గురించి తెలియజేసే కథ ఇది.

4. ఇతివృత్తం:

ఊరికి దూరంగా ఉన్న రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టారుగా పని చేస్తున్నాడు సుధీర్. ఆ స్టేషన్ లో తిరుపతి వెళ్ళే ప్యాసింజర్ రైలు తప్ప ఇంకా ఏది ఆగదు. అతను ఉంటున్నది పల్లెటూరు కావడం వల్ల పిల్లల్ని పట్నం పంపించి చదివిస్తున్నాడు. ఒక రోజున ఇతని స్నేహితుడు భాస్కరం అతనిని చూడటానికి వచ్చాడు. రాక రాక వచ్చిన స్నేహితుడిని చూసి సంతోషించాడు సుధీర్. కానీ అతని ముఖంలో విచారం గమనించి విషయమేమిటని అడిగాడు.  భాస్కరం తన బాధను స్నేహితుడితో పంచుకున్నాడు.

భాస్కరానికి పెళ్ళై ఆరు నెలలైంది. భార్య వేరే కాపురం పెట్టమని పోరు పెడుతుంది. కానీ పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఇంటి వాడిని చేసిన తల్లిదండ్రులను విడిచి వెళ్ళడం భాస్కరానికి ఇష్టం లేదు. అప్పటికే భార్యకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే ఉన్నాడు. కావలసినవన్ని అమరుస్తున్నాడు. ప్రతి రోజు షికారుకి తీసుకెళుతుంటాడు. ఇంట్లో పనులన్నీ తన తల్లే చేస్తుంది. అయినప్పటికీ వేరే కాపురం ఉండాల్సిందేనని తన భార్య అలిగి పుట్టింటికి పోయిందని బాధ పడ్డాడు. అంటే కాక అక్కా బావలు, వారి పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. వారు వచ్చినప్పుడు మర్యాదల కోసం సారెలు, చీరలు పెట్టడం కూడా ఆమెకు ఇష్టం లేదు. వేరు కాపురం ఉంటే ఆ ఖర్చంతా మిగులుతుంది, తన పిల్లలకు ఉపయోగపడుతుందని ఆమె భావన. ఏం చేస్తే తన భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందో చెప్పమని కోరాడు. తన భార్య వల్ల ప్రశాంతత కోల్పోయినట్లుగా బాధపడ్డాడు.

మిత్రుడి అవస్థ తెలుసుకొని సుధీర్ విచారం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులను వదులుకోమని చెప్పలేక భార్యను దూరంగా పెట్టమని చెప్పలేక ఎవరికి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాడు. కొత్తగా వచ్చిన కోడళ్ళు అత్తలను సరిగా అర్థం చేసుకోకపోతే తమ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నట్లుగా భావిస్తారని అభిప్రాయ పడ్డారు. కొన్నాళ్ళ పాటు ట్రాన్స్ఫర్ పేరుతో వేరే ఊరిలో కాపురం పెట్టమని సలహా ఇచ్చాడు. దూరంగా ఉంటేనైనా అభిమానాలు పెరుగుతాయని సలహా ఇచ్చాడు.
భాస్కరం ఇంటికి వెళ్ళగానే తల్లి కోడలి గురించి ఆరాలు తీసింది. కోడాలితో వేరుగా ఉండమని సలహా ఇచ్చింది. ఫోన్ చేసి పిలిపించమని చెప్పింది. భాస్కరం వేరే ఊరుకి  ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం వల్ల అక్కడే ఇల్లు చూసుకొని, భార్యకు రమ్మని ఫోన్ చేశాడు. భార్య ధరణి అనుకున్నది సాధించాననే భావనతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. భాస్కరం ప్రొద్దున డ్యూటీకి వెళితే మరలా సాయంత్రం గాని రాడు. అప్పటి వరకూ ఇంట్లో ఒక్కత్తే ఉండటం వల్ల విసుగు అనిపించింది. తాను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని చెప్పింది. భాస్కరం కూడా అంగీకరించడంతో స్కూల్లో టీచరుగా చేరింది. అప్పుడప్పుడు అత్తగారు ఫోన్ చేసి యోగా క్షేమాలు అడిగేది. ధరణి స్కూల్లో చేరిన కొద్ది రోజులకే గర్భవతి అని తెలియడం వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. డాక్టరు గారు కూడా పూర్తిగా విశ్రాంతి అవసరం అని చెప్పడం వల్ల తనకు సహాయంగా ఉండటానికి తన తల్లికి ఫోన్ చేసింది. కానీ ఆమె రాలేనని చెప్పింది. కోడలు చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతుందని, పెద్ద ఆపరేషన్ చేయించుకున్న మనిషికి తోడు అవసరం అని రాలేనని చెప్పింది. కూతురు కన్న కోడలే తన తల్లికి ఎక్కువైనందుకు కోపగించుకుంది. కానీ గర్భవతి అయ్యాక భాస్కరం తల్లి సేవలు చేయడం తప్పని సరి అయింది.  గత్యంతరం లేక భాస్కరం తన తల్లిని పిలిపించాడు.

వసుంధర వచ్చీ రావడంతోనే కోడలిని మంచం దిగనివ్వకుండా అన్ని రకాల పనులు చేసింది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలో అన్ని రకాల వంటలు చేసి పెట్టింది. తన అత్తగారు వచ్చాక ధరణికి కొంచం విశ్రాంతి అనిపించింది. మొదటిసారి ధరణి తన అత్తలో అమ్మను చూసింది. ఆమె వచ్చాక తనకు కొంచం విశ్రాంతి దొరికింది. అన్నీ సకాలంలో అమర్చడం వల్ల తనాకు ఇబ్బందులు అనిపించలేదు. నెలలు గడిచాక  మొదటి కాన్పుకి పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. అమ్మ లాంటి అత్తగారుండగా పుట్టింటికి రానని చెప్పింది. కానీ అందరూ సర్థి చెప్పే సరికి వెళ్ళింది. బిడ్డ పుట్టిన నెల రోజులకే తిరిగి వచ్చేసింది. ధరణి పసి పిల్లవాడితో ఇంటి పనులు చేసుకోవడం కష్టమని భావించి వసుంధర కొన్నాళ్ళు కొడుకు దగ్గరే ఉంది. పుట్టిన బిడ్డకు చేయాల్సిన ఉపచారములన్నీ వసుంధరే చేసేది. బాబుకి మూడో నెల వచ్చాక వసుంధర వెళ్లిపోతానని కొడుకుతో చెప్పింది. ధరణికి కూడా ఆమె వెళ్ళడం ఇష్టం లేదు. వేరు కాపురంలో స్వేచ్ఛ ఉంటుందనుకొంది. కానీ ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని గ్రహించలేకపోయానని ఒప్పుకుంది. మామ గారిని కూడా తమ దగ్గరకే పిలిపించమని బ్రతిమాలుకుంది.

ధరణిలో మార్పు వచ్చినందుకు భాస్కరం చాలా సంతోషించాడు. తన తల్లిని భాస్కరం కూడా ఉండమని అడిగాడు. కానీ వసుంధరకు బాగా తెలుసు –“అమ్మ అమ్మే! అత్త అత్తే! అత్తలో అమ్మని చూడలేరు. కోడలిని కూతురుగా భావించినా, ఒకప్పుడు కాకపోయినా ఇంకోకప్పుడైనా కోడలు కోడలుగానే ప్రవర్తిస్తుంది. అవసరాలు తీరిపోయాక బరువుగానే కనిపిస్తారు”  (అంతర్ముఖం – అంతర్ముఖం – తాటికోల పద్మావతి – పుట:45)

తనలో ఓపిక ఉన్నన్నాళ్ళు తాను తన భర్త వారికి విడిగా ఉండటమే మంచిదని భావించింది. కొన్నాళ్ళు ఉండి మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు ఆమె మంచాన పడి మరణించింది. ధరణి మాత్రం తన అత్త తన దగ్గరున్నప్పుడు చనిపోనందుకు సంతోషించింది. తన మనసులో దాగిన అంతర్ముఖాన్ని బయటపెట్టింది. భార్య మాటలకు భాస్కరం ఆశ్చర్యపోయాడు. భాస్కరం తన భార్య వ్యక్తిత్వం తేలిసి తన బాధ్యతలను నెరవేర్చి తప్పుకున్న తల్లి వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ మరచిపోలేదు. 

5. పాత్ర చిత్రణ:

నిత్య జీవితంలో పాత్ర అనే పదాన్ని మనం ఎక్కువగా వంట పాత్రల విషయంలో, బోజనాదులను వండి వార్చడానికి ఆధారమైన వస్తువుగా చూస్తుంటాం. అదేవిధంగా రచనా వ్యాసంగంలో కూడా సాహిత్యాన్ని సృష్టించే విషయంలో కూడా కథ చెప్పేటప్పుడు పాత్ర అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. సాహిత్యంలో పాత్ర అంటే కథలోనూ, నవలల్లోనూ ఉండే వ్యక్తులను పాత్రలుగా పిలుస్తాము. ఈ పాత్రలు ఒక్కొక్క కథను బట్టి భిన్నమైనవి కనిపిస్తాయి. ప్రాచీన వాఙ్మయంలో దేవతామూర్తులు, రాక్షసులు, బ్రాహ్మణులు, రాజులు వంటి వారు పాత్రలుగా కనిపిస్తాయి. నేటి ఆధునిక కాలంలో సామాన్య జనులే పాత్రలుగా కనిపిస్తుంటారు. నేటి కాలంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ఈతిబాధలు, అతని మానసిక సంఘర్షణలు వస్తువులుగా స్వీకరించబడుతున్న తరుణంలో సామాన్య మానవులే పాత్రలుగా కనిపిస్తుంటారు.

“వ్యక్తులు లేకుండా జీవితం లేదు. సమాజం లేదు. సమాజాన్ని, సమాజంలోని వ్యక్తుల జీవితాలను చిత్రించేది కథ. కాబట్టి కథకు పాత్రలు ప్రధాన తత్వం. కథ సమయాన్ని మాత్రమే చిత్రించేది కాదు. వ్యక్తిని, వ్యక్తి సమస్యలను కూడా చిత్రిస్తుంది.”  (కథా శిల్పం – వల్లంపాటి వెంకట సుబ్బయ్య – పుట: 64) 

సాధారణ మనిషి జీవితంలో కనిపించే సుఖదు:ఖాలు కథలోని పాత్రల్లో రచయితలు చూపిస్తారు. ఆయా పాత్రల సంభాషణను బట్టి వారి వ్యక్తిత్వాలు, మనం తెలుసుకోగలం. తాటికోల పద్మావతి కూడా వారి కథలలో భిన్నమైన వ్యక్తుల పాత్రలను చిత్రించారు. పాత్రోచితమైన సంభాషణతో, నిత్య వ్యవహారంలో మన చుట్టూ కనిపించే వ్యక్తుల స్వభావాలే కనిపిస్తాయి.

5.1 వసుంధర:

‘అంతర్ముఖం’ కథలో పాత్రధారి. ఈమె భాస్కరానికి తల్లి. తన కొడుక్కి పెళ్ళయిన తరువాత ఇంటికి వచ్చిన కోడలు ధరణి తమతో ముభావంగా ఉండటం గమనిస్తుండేది. ఆమెకు తాము ఉండటం ఇష్టం లేదని అర్థం చేసుకొనేది. కోడలు తన కొడుకుతో గోడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలుసుకొంది. కొడుకు కూడా దిగులుగా ఉండటం గమనించింది. పరిస్థితిని అర్థం చేసుకొని తమ గురించి ఆలోచించడం మానేసి కోడలిని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. కొడుక్కి తమను దూరం చేసుకోవడం ఇష్టం లేదని తెలిసి కొడుక్కి బుద్దులు చెప్పింది. “పిచ్చి సన్యాసి, నువ్వు ఎలాంటివాడవో నాకు తెలియదా! కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. రేపే అమ్మాయిని రమ్మని ఫోన్ చేయి” (అంతర్ముఖం – అంతర్ముఖం – తాటికోల పద్మావతి – పుట:45) అంటూ హితవు పలికింది. తరువాత కొడుకు ట్రాన్స్ఫర్ పేరుతో వేరుగా ఉంటూ ఎవరినీ నొప్పించకుండా కాపురం పెట్టాడు.

కాలం గడిచేకొద్దీ తమ కోడలు గర్భవతి అని తెలిసి సంతోషించింది. కోడలికి ఆరోగ్యం సరిగా లేనందున తోడుగా ఉండేందుకు రమ్మని కొడుకు ఫోన్ చేయగానే కోడలికి తాను ఈ సమయంలో సహాయంగా ఉండటం తన బాధ్యతగా భావించింది. సాయంత్రానికే కొడుకు దగ్గరకు వచ్చి వాలిపోయింది. వాచీ రావడంతోనే కోడలిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంది. సమయానికి అన్నీ అమర్చేది. కోడలు సీమంతానికి పుట్టింటికి వెళ్ళనని మారాం చేస్తుంటే అది పుట్టింటి వారి ధర్మమనీ నచ్చ చెప్పి పంపించింది. కోడలికి బాబు పుట్టాక  పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండలేదు. నెల రోజులకే వచ్చేసింది. పిల్లాడికి మూడు నెలలు వచ్చే వరకు ఉండి, బాబుకి సంబంధించిన పనులన్నీ చేసేది. పిల్లవాడికి స్నానం చేయించడం, సాంబ్రాణి వేయడం, పొగ వేయడం, పిల్ల వాడు  ఏడిస్తే దిష్టి తీయించడం, మనవడి కోసం శ్రమ పడేది. మూడు నెలలు వయసు వచ్చాక వెళ్లిపోతానని కొడుకుతో చెప్పింది. కానీ కోడకు, కోడలు బ్రతిమాలడంతో ఆరు నెలలు వరకు ఉంది అన్నపాసన తరువాత వెళ్ళిపోయింది. తాను వెళ్ళిపోయిన తరువాత కొడలి ప్రవర్తనలో మార్పు వచ్చిందని కోడకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే ఉండేందుకు రమ్మని ఫోన్ చేసినా వెళ్లలేదు.

“వసుంధరకి బాగా తెలుసు అమ్మ అమ్మే! అత్త అత్తే! అత్తలో అమ్మని చూడలేరు. కోడలిని కూతురుగా చూడలేరు. ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా కోడలు కోడలుగానే ప్రవర్తిస్తుంది. అవసరం తీరిపోయాక బరువుగానే కనిపిస్తారు”  (అంతర్ముఖం -అంతర్ముఖం – తాటికోల పద్మావతి - పుట:45) అని భావించి, వెళ్లాలా వద్దా  అని అయోమయ స్థితిలో పడింది. కొడుకు దగ్గరకి వెళ్లకుండానే చనిపోయింది.

5.2. ధరణి:

‘అంతర్ముఖం’ కథలో పాత్రధారి. ధరణి భాస్కరానికి భార్య. పెళ్ళైన నాటి నుండి అత్తమామలతో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. వేరు కాపురం పెట్టమని భర్తను పోరు పెట్టేది. భర్తలో ఉన్న మంచితనం ఈమెకు వెర్రితనంలా అనిపించేది. వచ్చే జీతమంతా అతని తల్లిదండ్రులకు, అక్కా, బావలకు, వారి పిల్లలకు ఖర్చు పెట్టడం ఆమెకు ఇష్టం లేదు. ఇంట్లో తనకు స్వేచ్ఛలేదని బాధపడుతుండేది. అప్పటికీ భర్త రోజు ఆమెను బయటకు తీసుకెళ్లడం, ఆమెకు కావాల్సిన వన్నీ కొనిస్తున్నా అసంతృప్తిగా ఉండేది. వేరు కాపురం పెట్టె విషయంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళింది. ఈమె భర్త తనకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని, అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నానని, రమ్మని చెప్పగానే సంతోషంలో తిరిగి వచ్చింది. కొత్త ఇల్లు, కొత్త కాపురం తనకు బాగా నచ్చింది. భర్తతో కలిసి రోజూ ఎక్కడకి వెళ్ళినా అడిగే వాళ్ళు లేరు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తన భర్త ప్రొద్దున వెళితే సాయంత్రం వరకు రాడు. ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల తనకు విసుగుగా ఉండేది. భర్త అనుమతితో స్కూల్లో టీచర్ గా చేరింది. చేరిన కొద్ది రోజులకే తను గర్భవతి అవడం వల్ల ఉద్యోగం మానేసింది. తాను బలహీనంగా ఉండటం వల్ల డాక్టరు గారు విశ్రాంతి తీసుకోమన్నారు. భర్త సూచన మేరకు తనకు సహాయంగా ఉండటానికి తన తల్లిని పిలిపించుకోవాలనుకుంది. ఫోన్ చేసి విషయం చెప్పింది. కాని ఆమె తల్లి తన కోడలు పెద్ద ఆపరేషన్ చేయించుకొని ఉండటం వల్ల ఆమెకు తన సహాయం అవసరమున్న కారణం చేత రాలేనని చెప్పింది. చేసేది లేక భర్త కోరిక మేరకు తన అత్తగారినే పిలిపించుకుంది. తన అత్తమామలను కాదనుకొని వేరు కాపురం వచ్చేసింది. ఇప్పుడు అత్తగారు తనను ప్రేమగా చూసుకుంటుందో, లేదోనని అనుమానపడింది. కాని అత్తగారు వచ్చీరావడంతోనే అన్ని పనులు ఆమె చేసుకుంటూ వెళ్ళేది. సమయానికి అన్నీ అమర్చి పెట్టడం, రకరకాల వంటలు చేసిపెట్టడం వల్ల తనకు బాగా విశ్రాంతిగా అనిపించేది.

మొదటి కాన్పుకి పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చిన తల్లితో రానని చెప్పింది. తన అత్తగారుండగా పుట్టింటి అవసరంలేదని మొండికేసింది. అందరూ నచ్చ చెప్తే తొమ్మిదో నెలలో వెళ్ళి, పండంటి బిడ్డను కని, నెల రోజులకే తిరిగి వచ్చేసింది. తన అత్తగారే బిడ్డకు సంబంధించిన అన్ని పనులు చేయడం వల్ల పాలు ఇవ్వడం తప్ప వేరొక పని ఉండేది కాదు. బాబుకి మూడు నెలలు వచ్చాక అత్తగారు వెళ్లిపోతుందని భర్త ద్వారా తెలుసుకొని బాధపడింది.

“అత్తగారు లేకపోతే వీడిని పెంచడం నావల్ల కాదు. ఇన్నాళ్ళు నా మీద చూపించిన ఆప్యాయత, ప్రేమ తెలుసుకోలేకపోయాను. వేరు కాపురంలో స్వేచ్ఛ ఉంటుందనుకున్నారు. పెద్దవాళ్ల అవసరం ఇప్పుడు తెలిసొచ్చింది. మీరే నన్ను క్షమించాలి. అత్తగారిలో అమ్మను చూశాను. మీ నాన్న గారిని కూడా ఇక్కడికే పిలిపించండి. వారూ మనవడితో ఆడుకుంటారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారు” (అంతర్ముఖం – అంతర్ముఖం – తాటికోల పద్మావతి – పుట:38) అని అంది.

తన భర్త అడిగే సరికి అత్తగారు మరో మూడు నెలలు ఉండిపోయారు. ఆరు నెలలు వచ్చాక మరలా వచ్చి చూసిపోతానని అత్తగారు వెళ్లిపోయారు. ఆ తర్వాత తన అత్తగారు అనారోగ్యంతో మరణించింది. మరణించిన అత్తగారు విషయంలో ధరణి తమ ఇంట్లో చనిపోనందుకు సంతోషించింది. తమ దగ్గర ఉండగా అనారోగ్యానికి గురైతే తాను సేవలు చేయలేకపోయేదాన్నని వాపోయింది. ఇలా తనలోని అంతర్ముఖాన్ని బయటపెట్టింది.

5.3. భాస్కరం:

‘అంతుర్ముఖం’ కథలో ప్రధాన పాత్రధారి. చిరు  ఉద్యోగస్థుడు  ఇతని భార్య ధరణి. భార్య ప్రవర్తనవల్ల విసిగి, వేసారిపోయాడు. తమకు పెళ్ళయిన నాటి నుండి తన భార్య వేరు కాపురం పెట్టమని పోరు పెడుతుండేది. కాని భాస్కరానికి మాత్రం తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ విషయంలో తన మిత్రుడు సుధీర్ ను సలహా అడుగుదామని వెళ్ళాడు. ఇంట్లో తన భార్య తీరును గురించి మిత్రుడికి వివరించాడు.

"ఇంట్లో ఫ్రీడం లేదంటుంది. రోజు బయటకు తీసుకెళ్లాలి. అక్కడకీ తనకి కావలసినవన్నీ కొనిస్తాను. అక్కలిద్దరు, బావలు, పిల్లలు అప్పుడప్పుడు వస్తూ పోతుంటారు. వాళ్ళని ఉత్త చేతులుతో ఎలా పంపుతాం. చీర, సారె ఏదో కొనివ్వాలి గదా! నా వాళ్ల కోసం నేను డబ్బు పెట్టడం అసలు ఇష్టంలేదు” (అంతర్ముఖం – అంతర్ముఖం – తాటికోల పద్మావతి – పుట:32)

పరిస్థితిని అర్దం చేసుకున్న మిత్రుడు సుధీర్ కొన్నాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే ఊరిలో ఉండమని సలహా ఇచ్చాడు. గత్యంతరం లేక స్నేహితుడు చెప్పినట్లు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులను విడిచి వెళ్ళడం ఇష్టం లేకపోయిన తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాడు.

భాస్కరం పొద్దున వెళితే సాయంత్రం కాని తిరిగిరాదు. అతని భార్య ఒంటరితనంతో ఉండడం కన్నా ఏదైనా ఉద్యోగం చేస్తానంటే కాదనలేదు. ఆమె ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే గర్భవతి అని తెలియడంవల్ల, విశ్రాంతి తెలుసుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల ఉద్యోగం మాన్పించాడు. నాలుగు రోజులు తను సెలవు పెట్టి భార్య దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు. తన భార్యకు సహాయంగా ఉండడం కోసం అత్తగారిని పిలిచినా ఆమె రాకపోవడంవల్ల గత్యంతరం లేక తన తల్లిని పిలిపించాడు. అత్త గారు  వచ్చిన తరువాత ఆమెకు అన్ని పనుల్లో ఆమే చేసిన సాయం చూసి ఆమె పట్ల చేసిన తప్పుకు సిగ్గుపడింది. భాస్కరం తన భార్యలో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు. తన తల్లికి తండ్రికి ఫోన్ చేసి తమ దగ్గరే ఉండమని, కోడలు ప్రవర్తన మారిపోయిందని సంతోషంగా తెలియజేశాడు. కాని అతని తల్లి తమ బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చేంత వరకు ఉండి, మరలా వస్తానని వెళ్ళిపోయింది. కాని అంతలోనే అతనికి మాతృ వియోగం కలిగింది. 

ఈ విషయంలో అతని భార్య వ్యక్తిత్వం అతనిని ఆశ్చర్యపరిచింది. మారిందనుకున్న అతని భార్య ధరణి తన వాస్తవ చిత్రాన్ని ప్రదర్శించింది. ఆమెలోని అంతర్ముఖం, స్వభావం విస్తుపోయేలా చేసింది.

6. ముగింపు:

  1. ఆద్యంతం కుటుంబంలోని వ్యక్తుల పరస్పర భావజాలాలు, ఆలోచనల తీరు తెన్నులను గురించి చర్చించిన కథల్లో ఈ కథ చాలా ముఖ్యమైనది. ప్రతీ మనిషిలో బహిర్గతంగా కనిపించని అంతర్ముఖం గురించి చర్చించింది. మన చుట్టూ ఉండే వాళ్ళలో చాలా మంది పైకి మంచి వాళ్ళలానే కనిపించినా, లోపల మాత్రం అంతర్ముఖం వేరేలా ఉంటుందనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలియజేశారు రచయిత్రి. ముఖ్యంగా కోడలు పాత్రధారి ధరణి పాత్రలో ఈ విషయం గమనించవచ్చు.
  2. అవసరం లేనప్పుడు వ్యక్తులతో ఒకలా ప్రవర్తించి, అవసరం ఉన్నప్పుడు ప్రేమను కురిపిస్తూ చరించే వ్యక్తులు తమ అవసరం తీరిపోయాక మరలా తమలోని స్వభావాన్ని ఎలా బయట పెడతారో చూపించారు.
  3. తమ అత్త మాంమలు తనకు బరువుగా భావించి, భర్తతో వేరు కాపురం పెట్టించింది. కాని తాను గర్భవతి అయ్యాక తనకు సపర్యలు చేయాల్సి వచ్చినప్పుడు అత్త గారే దిక్కవ్వడంతో ఆమెపై ఎనలేని ప్రేమను కురిపించింది. కాని తన అత్త గారు మరణించాక తమ దగ్గర ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉండి చనిపోయుంటే ఆమెకు సపర్యలు చేయలేక, శవం దహన ఖర్చులన్నీ తమ మీదనే పడేవని, ఇప్పుడు ఆ కష్టం తీరిందని అనుకుంటూ  తన మనసులోని అసలు వ్యక్తిత్వాన్ని చూపించింది.

ఇలాంటి స్వభావాలు మన జీవితంలో ఎన్నో మనకు ఎదురయ్యే ఉంటాయి. ఇలాంటి వాళ్ళతో మనం ఎలా మసలుకోవాలో తెలియజేశారు రచయిత్రి. అంతే కాదు. వృద్ధులంటే జీతం లేని పనివాళ్ళుగా భావించే కొందరి మనస్తత్వాలను తెలియజేశారు.

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక స్వరూపస్వభావాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
  2. పద్మావతి, తాటికోల (2016). అంతరముఖం. మల్లె తీగ ప్రచురణలు, విజయవాడ.
  3. పూజారి, ప్రసాద్. (2005). మధురాంతకం రాజారాం కథలు – రాయలసీమ జీవన శైలి - పిహెచ్. డి సిద్ధాంత వ్యాసం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
  4. లక్ష్మీకాంతం, పింగళి. (1976). ఆంధ్ర సాహిత్యచరిత్ర. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
  5. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. (2012). కథా శిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
  6. వేంకటావధాని, దివాకర్ల. (1961). ఆంధ్ర సాహిత్య చరిత్ర. సాహిత్య పరిషత్తు, హైదరాబాద్.
  7. శార్వరి (1992). కథలేలా రాస్తారు?. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]