AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. కవిరాజు ‘నీరూపం’ కావ్యం: భారతీయ తాత్త్వికత
డా. మల్లిపూడి రవిచంద్ర
తెలుగు విషయ నిపుణులు
బ్రిడ్జ్ ఇంటెర్నేషనల్ అకాడమీస్
హైదరాబాదు, రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9573449282. Email: ravi.hcu32@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
కవిరాజుగారు రచించిన 10 కవితాసంపుటాలలో 9వ సంపుటం నీరూపం. అది అచ్చంగా భారతీయ తాత్త్వికతకు అద్దం పడుతూ, ఆధ్యాత్మిక విషయాలను కవిత్వరూపంలో అందించిన రచన. అందులో కనిపించే ఆధ్యాత్మికతగా పిలవబడుతున్న భారతీయ తత్త్వ స్వరూప స్వభావాలను వివరించడం, శ్రీకృష్ణుడు చెప్పిన తాత్త్వికత, ఆదిశంకరుల సిద్ధాంతం, రమణ మహర్షి తత్త్వం నీరూపం కావ్యంలో ఎలా ద్యోతకమవుతున్నదీ వివరించడం ఈ పత్రంలోని ప్రధానాంశం. నీరూపం కావ్యంపై ఇప్పటివరకూ ఎటువంటి పరిశోధన జరగపోవడం, భారతీయతాత్త్విక దృష్టితో రాయబడిన ఈ కావ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనేది ఈ వ్యాసరచనోద్దేశం. ఈవ్యాసంలో విశ్లేషణాత్మక పరిశోధన విధానాన్ని అనుసరించడమైనది. భారతీయతాత్త్విక విధానంతో పరిశోధన చేసేవారికి ఇందులో వివరించిన విషయాలు తోడ్పడతాయి. ఈ మార్గంలో అరవిందులు, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి వంటి భారతీయ తత్త్వవేత్తలు చెప్పిన తత్త్వం కోణంలో కూడా పరిశోధన చేసేందుకు ఇది ఒక మార్గదర్శనవ్యాసంగా ఉపకరిస్తుంది.
Keywords: భారతీయ తత్త్వం, కవిరాజు, నీరూపం, రవిచంద్ర, అద్వైతం, కవిత్వం.
1. ఉపోద్ఘాతం:
కవిరాజుగా పేరు పొందిన కవి పెన్మత్స సత్యనారాయణరాజుగారు. కవిరాజు అని తప్ప ఆయన పూర్తి పేరు పిలిస్తే ఎవరికోగాని తెలియదు. అంటే కవిరాజుగా అంత ప్రసిద్ధులు. ప్రచారానికి, అవార్డులకు, బిరుదులకు దూరంగా ఉండడం ఆయన జీవలక్షణం. అందుకే ప్రచారానికే పెద్ద పీట వేయబడుతున్న నేటి సమాజానికి ఆయన గురించి తెలియక పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ కవిరాజుగారి కవిత్వాన్ని ప్రేమించిన వారిలో సినారె, గుంటూరు శేషేంద్రశర్మ, వడలి మందేశ్వరరావు, వాకాటి పాండురంగారావు, నాగభైరవ కోటేశ్వరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జి. వి. సుబ్రహ్మణ్యం, ఆచార్య తిరుమల, ఎల్లోరా, కుందుర్తి, తిరునగరి, వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీమత్తిరుమల రాజగోపాలచార్యులు, సరసి, మౌనశ్రీ మల్లిక్... (చెప్పుకుంటూపొతే చాలా పెద్ద జాబితా అవుతుంది) మొదలైన లబ్ధప్రతిష్ఠులు ఉన్నారన్నా కూడా ఏమాత్రం ఆశ్చర్య పడనవసరం లేదు.
కవిరాజుగారు సూర్యరథం, సూర్యధ్వజం, సూర్యకఠారి...
వంటివి సూర్యుని పేరు మీద ఏడు కవితాసంపుటాలు వెలువరించారు. ఎనిమిదవ సంపుటంగా తనకూ, శ్రీకృష్ణునికి మధ్య
కలల్లో జరిగిన సంభాషణను నందనందనం పేర ప్రచురించారు. తొమ్మిదవ సంపుటం నీరూపం. పదవ సంపుటం కలల కల్హారం.
ప్రస్తుత వ్యాసం ఆయన రచించిన నీరూపం కవితాసంపుటిలోని భారతీయ తాత్త్వికతను వివిధకోణాల నుండి
వివరిస్తుంది.
2. కావ్య పరిచయం – నామౌచిత్యం:
నీరూపం వచన కవితాసంపుటం. ఇందులో 68 కవితలున్నాయి. వాటిలో వేటికీ శీర్షిక ఉండదు. అన్నీ నేటి ఆధ్యాత్మికతగా చెప్పుకుంటున్న భారతీయ తాత్త్విక అంశాకు సంబంధిచినవే. కాబట్టి దానిని ఏకవస్తు నిర్మాణ దృష్టితో ‘నీరూపం’ సంపుటాన్ని (వచన) కావ్యంగా చెప్పుకోవచ్చు.
నీరూపం అంటే ఆకాశం. దీనికి 108 పర్యాయ పదాలు ఉన్నాయి. (చూడు. పర్యాయపద నిఘంటువు). వాటిలో శూన్యం, సున్న అనే అర్థాలు కూడా ఉన్నాయి. అనంతమైనది, పరిపూర్ణమైనదీ అని నీరూపానికి పారమార్థిక అర్థాలు ఉన్నాయి.
నీరూపః అంటే వాయువు, పరమాత్మ అని సర్వశబ్ద సంబోధిని అనే నిఘంటువు అర్థాలను ఇచ్చింది. పరమాత్మ అంటే నిరాకార, నిర్గుణుడు. ఆదిమధ్యాంత రహితుడు. అంటే ఆది, మధ్య , అంతం లేనివాడు. ఎప్పుడైతే అంతం లేదో అప్పుడు ఆయన అనంతుడు అవుతాడు. అంతం లేనప్పుడు ఆది కూడా ఉండదు కదా! ఆది లేనప్పుడు అంతం కూడా లేనట్టే కదా! అదే పరమాత్మ తత్త్వం. అందుకే భాగవతంలో-
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూల
కారణం
బెవ్వఁడనాది మధ్య లయుఁడెవ్వడు సర్వముఁ దానయైన
వా
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేఁడెదన్ (భాగవతం. 8:
73)
అంటూ గజేంద్రుని చేత పరమాత్మ లక్షణాలను చెప్పిస్తాడు పోతన. సరిగ్గా ఆకాశానికి కూడా ఆది, మధ్య, అంతం అంటూ ఏదీ ఉండదు. అనంతమైన పరమాత్మ తత్త్వాన్ని, అనంతమైన ఆకాశ తత్త్వంతో ముడిపెట్టి చెప్పడం ఈ కావ్యంలోని ధ్వని.
మనకు 5 రకాల ఆకాశాలున్నాయని మన శాస్త్రాలు
చెబుతున్నాయి. అవి- 1. చిత్తాకాశం, 2. పరాకాశం, 3. మహదాకాశం, 4. తత్త్వాకాశం, 5. సూర్యాకాశం. ఇందులో మొదటి
నాలుగు భారతీయ ఆధ్యాత్మికతో అనుసంధానమైన పారిభాషిక పదాలు. వాటిలో నాల్గవది నేరుగా తత్త్వాన్ని తెలియజేసే
పదం. అంటే ఆకాశ పదానికి తాత్త్వికతకు ఈ రూపంలో కూడా సంబంధం ఉంది. కాబట్టే ఈ కావ్యానికి నీరూపం అని పేరు
పెట్టి ఔచిత్యాన్ని పాటించారు కవిరాజుగారు.
3. భారతీయ తత్త్వం స్వరూప స్వభావాలు:
‘తత్త్వశాస్త్ర మూలాలు అందునా పాశ్చాత్య తత్త్వశాస్త్ర మూలాలు గ్రీకులో ఉన్నాయని చెప్పడం పరిపాటి. ప్రపంచమంతటా సంభవించినట్టే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో ప్రాచీన గ్రీసులో కూడా జ్ఞానసంబంధమైన, నీతి సంబంధమైన వివేచనా విప్లవం సంభవించింది. సాధారణంగా పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి ప్లేటో, అరిస్టాటిల్ రచనలు మూలస్తంభాలుగా భావించబడుతుంటాయి’ (చినవీరభద్రుడు, వాడ్రేవు. 2002:13). ఇప్పటికీ అతిపురాతమైన తత్త్వ సంప్రదాయానికి గ్రీకునే ఉదాహరణగా చెప్పుకొంటారు. కానీ నిజానికి భారతీయతత్త్వం సోక్రటీస్ కాలానికి, పైథాగరస్ (క్రీ. పూ. 570 – 495) philosophy అనే పదాన్ని ప్రతిపాదించడానికి పూర్వమే చెప్పుకోదగ్గ స్థాయిని చేరుకొంది. భారతీయ యోగులు, ఋషులు, జ్ఞానులు, ద్రష్టలు... ఆ స్థాయిని ఏర్పరచారు. అప్పటికే భారతదేశంలో బుద్ధుడు, వర్ధమాన మహావీరుడులాంటి వారు కూడా తమదైన కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టడమూ జరిగింది. అలాంటి దశలో భారతదేశం గ్రీకులాంటి అతి ప్రాచీనమైన దేశాలకు కూడా గురుతరమైన దేశంగా రూపుదాల్చింది. అందుకే అరిస్టాటిల్ వంటివారు కూడా భారతీయ తత్త్వం గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి.
నేడు తత్త్వశాస్త్రాన్ని ఆంగ్లంలో philosophy అని పిలుస్తున్నాం. philosophy అనే పదం philosophia అనే గ్రీకు పదం నుండి పుట్టింది. దానికి అర్థం Love of Wisdom. అంటే జ్ఞానం పట్ల ప్రేమ. భారతీయ తత్త్వం చెప్పేది కూడా ‘జ్ఞానం’, ‘సత్యం’ గురించే. జ్ఞానం అంటే మోక్షం విషయమైన బుద్ధి. అంటే మోక్షం కోసం చేసే సాధన తదితరాలు జ్ఞానం కిందకి వస్తాయి.
ఇక్కడ తత్త్వం అనే పదం కంటే కూడా జ్ఞానం అనే
పదానికి philosophy అనే పదం, అది ఇచ్చే అర్థం బాగా పొసగుతాయి. తత్త్వం అంటే ‘తత్’ అంటే అది అనీ,
త్వం అంటే నువ్వు అని అర్థం. ఇక్కడ అది అంటే ఎవరు? పరమాత్మ లేదా సాధకులు తెలుసుకున్న సత్యం. అది అనడం ఏంటి?
అంటే నిరాకారుడు, నిర్గుణుడైన పరమాత్మను చెప్పడం ఎలా? అందుకే అలా అన్నారు. మళ్ళీ వెంటనే త్వమేవాహం అన్నారు.
త్వం అంటే నువ్వు. ఆ నువ్వు ఎవరో కాదు అహం అంటే నేను. తత్త్వం చెప్పే అసలు విషయం ఏమంటే పరమాత్మ, జీవాత్మల
కలయిక గురించి చెప్పడం. జ్ఞానం అనేది మోక్షం గురించి చెబుతుంది. మోక్షం అంటే కైవల్యం అంటే కేవల భావం. అంటే
శూన్యం. అంటే ఆకాశం. అంటే నీరూపం. ఇదే కవి ఉద్దేశం. అందుకే భారతీయ తత్త్వశాస్త్రంలో జ్ఞాన సంబంధమైన విషయాలు
కూడా ఉంటాయి. అవే నేడు ఆధ్యాత్మిక విషయాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికత spiritualityగా,
తత్త్వం philosophy గా స్థిర పడిపోయాయి. కానీ భారతదేశంలో రెండిటికీ భేదం లేదు.
4. నీరూపంలో
కనిపించే పరమాత్మతత్త్వం:
జీవాత్మ
పరమాత్మతో అనుసంధానం కావడానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు. దానినే యమ నియమ ఆసనాది ఎనిమిది పేర్లతో కలిపి
అష్టాంగయోగంగా పిలుస్తారు. ఆ సాధన భారతీయ తత్త్వంలోనూ, ఆధ్యాత్మికలోనూ కనిపించే ఏక సూత్రం. సాధన ద్వారా
గ్రహించిన పరమాత్మ లక్షణాన్ని (జ్ఞానం/సత్యాన్ని) ఇదమిత్థంగా చెప్పడానికి వీలు కాక తత్ అన్నారు. ఇది ఒక
వంటకం రుచి లాంటిది. ఎవరికీ వారే ప్రయత్నం ద్వారా సాధనద్వారా తెలుసుకోవాలి తప్ప. ఒకరు చెబితే అనుభవంలోకి
రాదు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి తత్త్వాన్ని తెలపడానికి గురువు అవసరం లేదు. ఎవరికీ వారే అనుభవించి
తెలుసుకోవాలి అని చెప్పడంలోని అంతరార్థం.
పరమాత్మ ఒక్కడే అయినప్పడు ఇన్ని సాధన మార్గాలు ఏంటి? ఇంతమంది సాధకులు ఎందుకు? అనే ప్రశ్నలు చాలా ప్రాథమికమైనవి. ప్రతి ఒక్క తత్త్వవేత్త లేదా అధ్యాత్మవేత్త వారివారి సాధనను బట్టి మార్గాలను ఉపదేశించారు. అవి వారి అనుభవంలోనివి. ఏ మార్గం గుండా వెళ్ళినా చివరికి అక్కడికి చేరుకోవలసిందే. కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్నది సాధకుడి నిర్ణయం.
కవిరాజుగారు ప్రారంభంలోనే సాధనకు సంబంధించిన గొప్ప
సూత్రీకరణ లాంటి కవిత చెప్పారు.
“ఆకాశమంతా శూన్యం
నీ మనసు
ఆకాశమంత చేసికో
అక్కడే వాల్తాడు అనంతుతుడు” (నీరూపం.
2022:15)
అయితే పై కవితలో ఆకాశమంతా శూన్యం అన్నారు కవి.
ఆకాశం అంటేనే శూన్యం అని చెప్పుకున్నాం కదా! ఎందుకు కవి అలా పునరుక్తి చేశారు అంటే- భౌతిక, తాత్త్విక
అర్థాలు రెండిటినీ సాధించడానికి చేసిన కవితాప్రయోగం అది. భౌతికార్థం మనసులో ఎలాంటి ఆలోచనలకు చోటివ్వకుండా
ఖాళీగా ఉంచుకో అని. తాత్త్వికార్థం ముందు చెప్పుకొన్నట్లు ఆకాశంలా విస్తారం చేసుకో అని. అది కవి
శిల్పచాతుర్యం. నేరుగా చెప్పకుండా చెప్పడం. నేరుగా చెబితే అది కవిత్వం కాదు కదా! ఇప్పుడు సాధకుడు మనసును
ఆకాశమంత చేసుకోవాలి. అప్పుడు అక్కడ వాల్తాడు. ఎవరు? అనంతుడు. అంటే పరమాత్మ. అతని లక్షణం ఏంటి? అనంతత్వం.
‘ఓ సాధకుడా! అనంతుడైన పరమాత్మను నువ్వు పొందాలి అంటే నీ మనస్సు కూడా అనంతమైనదిగా ఉండాలి’ అన్నది
పై కవితలోని ఉద్దేశం. అంటే ఆటకు తగిన క్రీడాస్థలంలాగా. ఇంతకన్నా సాధన మార్గాన్ని సులువుగా చెప్పడం ఏ
సాధకుడికీ సాధ్యం కాదేమో.
4. 1 శ్రీకృష్ణుని తత్త్వం:
భారతీయలందరూ జగద్గురువుగా చెప్పుకొనే మొట్టమొదటి వ్యక్తి శ్రీకృష్ణపరమాత్మ. ఆయన లోకానికి అందించిన తాత్త్విక గ్రంథం భగవద్గీత. అందులోని విషయాలు భారతీయ తత్త్వవేత్తలకు మార్గదర్శకాలు. నీరూపం కావ్యంలో కూడా గీతలోని విషయాలు తారసపడతాయి.
“పెద్దవాళ్లై అందరూ తనకు దూరమై
పోతున్నారని
నన్ను బాలుడిగానే
మిగుల్చుకొన్నాడు
తనతో ఆడుకోవడానికి” (నీరూపం. 2022: 24)
పై కవితలో “బాలుడు” అనేది కీలక పదం. ఆ ప్రయోగం శ్రీకృష్ణతత్త్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఆడిన ఆటలన్నీ, చేసిన పనులన్నీ యశోదకు కోపం తెప్పించినవే అయినా ప్రతి దాని వెనుక ఒక పరమ ప్రయోజనం దాగి ఉంది. అందుకే అవి అప్పటి శ్రీకృష్ణుని దృష్టిలో, ఇప్పుడు ప్రపంచానికి లీలలు అయ్యాయి. బాలుడైనప్పటికీ తానెవరో? తాను ఎందుకు జన్మించాడో? ఏం చేస్తున్నాడో? ఎందుకు చేస్తున్నాడో? తెలిసినవాడు ఆయనే కాబట్టి శ్రీకృష్ణుడిని మాత్రమే పరమాత్మ అన్నారు. మంచి- చెడు, పాపం- పుణ్యం లాంటి ద్వైధీభావనలకు (duality) ఆయన అతీతుడు. ఆయనే కాదు చిన్నపిల్లలందరూ అతీతులే. అందుకే కృష్ణుడు తనలా పరమాత్మ లక్షణం కలిగిన పిల్లలను తన వెంట బెట్టుకొని గోకులంలో పనులన్నీ చక్కబెట్టాడు. పెద్దవారైన కొద్దీ మనుషుల్లో పరమాత్మ లక్షణం పోతుంది. మళ్ళీ దానిని సాధన ద్వారా సాధించుకోవాలి. పిల్లలకు ఆ లక్షణం సహజంగా ఉంటుంది. అందుకే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని “శైశైవ గీతి” అనే గేయంలో ‘పాపం- పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం – సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా! ఐదారేడుల పాపల్లారా!’ అంటూ ద్వైధీ లక్షణాలకు అతీతమైనవారుగా పిల్లలను సంబోధించారు. పైగా అదే పిల్లలను ‘పరమాత్మలు ఓ చిరుతల్లారా!’ అని కూడా అన్నాడు. కాబట్టి చిన్నపిల్లలు పరమాత్మ స్వరూపులు అన్నది స్పష్టం. వారితో ఆడుకోవడమే పరమాత్మకు కూడా ఇష్టం. అదే పై కవితలో కవిరాజు చెప్పింది. అలాంటిదే-
“బాల్యాన్ని పదిల
పరుచుకో
భగవంతుడు నిన్నెత్తుకు తిప్పుతాడు” (నీరూపం. 2022:50) అనే కవిత కూడా.
గీతలో చెప్పిన ఒక శ్లోకానికి తార్కాణమైన కవిత ఒకటి నీరూపంలో ఉంది.
“ప్రశ్నపత్రం కఠినంగా ఉంది.
అంతా తలలు పట్టుక్కూర్చున్నారు, బిక్క
ముఖాలతో
శ్రద్ధ లోపిస్తే అంతే, అక్షరం దరి చేరదు” (నీరూపం. 2022: 22)
పై కవిత లౌకికమైన విద్యార్థులు రాసే పరీక్షకు సంబంధిచినదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే ‘ప్రశ్నపత్రం’, ‘శ్రద్ధ’, ‘అక్షరం’ కీలక పదాలు. ప్రశ్నపత్రం అంటే సాధన. శ్రద్ధ అంటే సాధనకు చేసే ప్రయత్నం (Preparation). అక్షరం అంటే క్షరం కానిది. నాశం కానిది/అంతం లేనిది (పరమాత్మ). శ్రద్ధ వల్ల సాధనలో సౌకర్యం ఉంటుంది. అది లోపిస్తే మనస్సును కట్టడి చేయడం చాలా కష్టం. కఠినంగానే ఉంటుంది. ఎప్పుడైతే సాధన లేదో పరమాత్మ దరిచేరడం కష్టం. అదే కృష్ణ పరమాత్మ-
“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరామ్
శాంతిమచిరేణాధిగచ్ఛతి” (భగవద్గీత.
4:39)
‘జితేంద్రియుడు, సాధనపరుడు, శ్రద్ధాళువైన
మనిషికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం కలిగిన వెంటనే పరమాత్మ స్వరూపమైన పరమ శాంతిని పొందుతాడు’. అని
చెప్పాడు. పై శ్లోకంలో ‘శ్రద్ధావాన్’, ‘జ్ఞానం’, కీలకపదాలు. శ్రద్ధ కలిగిన వాడు
జ్ఞానాన్ని పొందగలుగుతాడు. శ్రద్ధ కనుక లోపిస్తే సాధన కుదరదు. సాధన కుదరకపోతే జ్ఞానమూ, పరమాత్మ స్వరూపమైన
పరమ శాంతి లభించవు అని గ్రహిస్తే పై కవితలో కవిరాజుగారు ప్రతిపాదించిన విషయంతో అనుసంధానం చేసుకోవడం
సులభమవుతుంది.
4. 2 కర్మ సిద్ధాంతం:
మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు అనేది భారతీయుల సిద్ధాంతం. అంటే జీవుడు జన్మ తీసుకొనేటపుడు ఒక శరీరాన్ని ఎంచుకొని అందులో ఉండి, తాను చేయవలసిన పనులను చేసి మళ్ళీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. తాను భూమి మీద చేసిన పనులను బట్టి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు అనేది కర్మసిద్ధాంతం. అలా కాకుండా సాధన ద్వారా మోక్షం కోసం గానీ పరమాత్మలో ఏకం కావడం కోసం గానీ ప్రయత్నం చేసి సాధిస్తే జన్మ రాహిత్యం సిద్ధిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ చెప్పే విషయమే. అదే విషయాన్ని కింది కవితద్వారా వివరించారు కవిరాజుగారు.
“ఓ పంతంగమా!
పంజరంలోంచి
ఎగిరిపోవాలని ఉంది
నాకు రెండు రెక్కలు
బహూకరిస్తావా?
నువ్వు
అనుభవించవలసిన
ఫలాలు ఇంకా మిగిలే
ఉన్నాయి
అవి పూర్తయ్యాక రెక్కలతో నీకు పనే లేదు!! (నీరూపం
2022:16)
ఇక్కడ పంజరం శరీరం. పక్షి జీవుడు. ఎగిరిపోవాలనుకోవడం ముక్తికోసం పడే ఆరాటం. అనుభవించవలసిన ఫలాలు కర్మ ఫలాలు. అవి అనుభవించాక రెక్కలతో పనిలేకపోవడం. పరమాత్మలో లీనం కావడం. నీరూపం కావ్యంలో కర్మసిద్ధాంతపు పోకడలు కనిపించినా జీవాత్మ, పరమాత్మల కోణం తప్ప వేరే లౌకిక విషయాల ప్రస్తావన ఉండదు. పైగా
“కొందరు భక్తిని ముఖానికి పూసుకొని తిరుగుతారు.
కొందరు నాలుక్కి రాసుకొని
తిరుగుతారు
ఎవరో...?!
తనలోని
పురవీథుల్లో
ఊరేగే చైతన్య రథంలో
విహరస్తిస్తున్న
దివ్య నాదానందాన్ని పొందుతారు” (నీరూపం.
2022: 49)
అంటూ శరీరంలోపల విహరించే పరమాత్మ స్వరూపమైన దివ్యానందాన్ని, చైతన్యాన్ని ప్రస్తావిస్తూ లౌకికమైన ఆరాధనలను కవి ఆక్షేపిస్తారు. ఎవరి సిద్ధాంతానికి సంబంధిచినదైనా కావచ్చు కాగ ఆత్మ సంబంధ విషయాలను ఎక్కడా కవి విడిచి పెట్టలేదు.
జీవుడి గురించి చెబుతూ ‘శరీరం ఒక అద్దె
ఇల్లులాంటిది. జీవుడు దానిలో అద్దెకు ఉంటాడు. అవసరం తీరాక ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అనీ, శరీరం ఒక వాహనం
లాంటిది. జీవుడు చోదకుడు. గమ్యం చేరుకున్నాక వాహనం వదిలి వెళ్ళిపోతాడు’ అనీ భారతీయ అధ్యాత్మవేత్తలు
ప్రబోధించారు. అదే విషయాన్ని కవి ముందు కవితలో పంజరం, చిలుకలతో పోల్చారు. ఇంకా సులభతరం చేస్తూ కవితాత్మకంగా,
కొత్తగా చెప్పారు కింది కవితలో చెప్పారు.
“ముద్దుగా ముస్తాబు చేసి
సిరా నింపి ఉంచిన కలాన్ని
ఎవరో
పలికే పదాలను
అక్షరాలా లిఖించే
పరికరాన్ని
సిరా
నిండుకొంటే
ఊరవతల మట్టిలో కలిసిపోయే బడుగును”. (నీరూపం. 2022:
65)
పై కవితలో వ్యక్తిని కలంతో పోల్చి చెబుతున్నారు.
‘కలం’ ఇక్కడ శరీరం. ‘సిరా’ ప్రాణం లేదా జీవుడు. ప్రాణం లేని శరీరానికి విలువ
లేనట్టు. సిరా లేని కలానికి కూడా విలువ ఉండదు.
4. 3 ఆదిశంకరాచార్యుల తత్త్వం:
కృష్ణుని తరువాత భారతీయలంతా జగద్గురువుగా పిలిచుకొనే మరో వ్యక్తి ఆదిశంకరాచార్యులు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. అంటే రెండు కానిది. పరమాత్మ, జీవాత్మ వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే అని చెప్పే సిద్ధాంతం. అప్పటి వరకూ జీవుడు వేరు, దేవుడు వేరు అని చెలామణిలో ఉన్న ఆలోచనలను పటాపంచలు చేసిన సిద్ధాంతం. ‘అహం బ్రహ్మాస్మి’ అనే మాటను సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి శంకరాచార్యులు. అదొక విప్లవాత్మక నినాదం. మనుషులే కాదు భూమి మీద ప్రతి జీవీ ఎవరికి వారుగా “అహం బ్రహ్మాస్మి” అనుకొంటే వారు పరమాత్మలే అయిపోతారు. అలా అందరూ పరమాత్మలే అయినపుడు ఎటువంటి భేదాలు ఉండవు కదా! లేనప్పుడు అందరూ సమానమే అవుతారు కదా! అనేది ఆయన ఉద్దేశం. నిజానికి మనిషి కనుక అలా అనుకొని అందరిలోనూ పరమాత్మను చూడగలిగి, తననీ ఒక పరమాత్మగా భావించగలిగితే సమానత్వం ఏర్పడి కుల, మత, వర్గ భేదాలు కచ్చితంగా పోతాయి. అలాంటి భావనను బలపరిచేది కింది కవిత.
“నువ్వు ఎవరో,
ఎక్కడో
అనుకొన్నంత
కాలం
నమ్మలేదు
గౌరవించలేదు.
నువ్వు నేనని జ్ఞప్తికి
వచ్చాక
నన్ను
ప్రేమించుకొంటున్నంతగా
నిన్ను ప్రేమిస్తున్నాను!” (నీరూపం.
2022: 68)
పరమాత్మను వేరుగా అనుకున్నాడు జీవుడు. ఎక్కడో ఉంటాడులే అనుకున్నాడు. కనబడలేదు కాబట్టి నమ్మలేదు. గౌరవించలేదు. కానీ అహం బ్రహ్మాస్మి అనుకొన్నాక. జీవాత్మ పరమాత్మ అయ్యాక. తనలోని పరమాత్మను గుర్తించక పూర్వం తనను తాను ఎలా ప్రేమించేవాడో ఇప్పుడు గుర్తించాక పరమాత్మ స్వరూపాన్ని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇలాగే ప్రతి జీవిలో ఉన్న పరమాత్మను కనుక ప్రేమించ గలిగితే కచ్చింగా సమభావం ఏర్పడుతుంది. భేదాలు పోతాయి. ఇదే కవిరాజుగారి తాత్త్విక సామాజిక సిద్ధాంతం కూడా.
నువ్వు నేనైనా
నేను
నువ్వైనా
సాధించేదేవిటి?
శూన్యమే
కదా!! (నీరూపం. 2022: 62)
ఒక ఇనుపముక్కను అయస్కాంతంతో రుద్దుతూ ఉంటే కొంత సమయానికి ఇనుప ముక్కకు కూడా అయస్కాంత లక్షణం అబ్బినట్లు, నిరంతర సాధన జీవుడిని పరమాత్మతో ఏకం చేయగలిగితే జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ ఒక్కటే అయిపోతారు. అప్పడు అద్వైతం సిద్ధిస్తుంది. జీవుని అంతిమ లక్ష్యం నెరవేరుతుంది. అదే పై కవితలోని ఆయువు. అలాంటి కవితలు చాలా ఉన్నాయి ఇందులో.
“వేల పేర్లతో, వేవేల నోళ్ళు
శ్లాఘిస్తుంటే
ప్రసన్నుడవై నువ్వెంత ఉప్పొంగి
పోతున్నావోగాని
అంతవాడు నాలో ఒదిగి
ఉన్నాడని
పొంగుతో విశ్వమంతై, నేను చిందాడుతున్నాను”
(నీరూపం. 2022: 60)
వంటి కవితలు శంకరుల అద్వైత సిద్ధాంతానికి
ప్రతిబింబంగా నిలుస్తాయి.
4. 4 రమణ మహర్షి తత్త్వం:
భారతీయ తాత్త్వికులలో రమణమహర్షిది ఒక ప్రత్యేకమైన స్థానం. జీవితాంతం సాధనలోనే గడిపిన వ్యక్తి. మోక్షం సిద్ధించాలంటే ప్రతిజీవుడు ‘నేనెవరు?’ అనే ప్రశ్నతో సాధన మొదలు పెట్టాలని ఉపదేశించారు. అలా ‘నేను’ను తెలుసుకోవాలంటే ప్రతివ్యక్తి తనలోనికి తాను తొంగి చూడాలి. అదే సాధన. దాని ద్వారా వాగతీతమైన సత్యాన్ని తెలుసుకోవచ్చు అంటారు. అలాంటి రమణుల సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచే కవిత్వమే నీరూపంలో ఎక్కువగా ఉంది.
“నేను నేనుగా
ఉన్నప్పుడు
నిన్ను
కానలేకపోయాను
‘నేను’
తప్పుకొన్నాను
ఇప్పుడు
నీరుపమంతా,
నీలితరగల
నురుగులా
నిసర్గసుందరంగా నీ రూపం
తప్ప
వేరు కనిపించడం లేదు!!” (నీరూపం. 2022: 40)
పై కవిత అచ్చంగా రమణమహర్షి సిద్దాంతానికి కవితారూపం. ఇక్కడ ఒకేఒక కీలకపదం ‘నేను’. దానిని కవి తానే సింగిల్ కోట్స్ లో పెట్టి సులభం చేశారు. మనిషిలో లౌకికమైన ‘నేను’ ‘నాది’ అనే భావన అంటే స్వార్థం ఉన్నపుడు ఏమీ కనిపించవు. ఎప్పుడైతే ‘నేను’ అనే స్వార్థం పోతుందో అంతా పరమాత్మ స్వరూపంగా కనిపిస్తుంది. పరమాత్మలో లీనం కావడం కూడా సాధ్యపడుతుంది. దానికి బలాన్నిచ్చే ఒక చిన్న దృష్టాంతాన్ని ప్రస్తావన చేస్తాను. ఒకసారి రమణమహర్షి ఒక భక్తుడు ‘అయ్యా ఎలాంటివారు మోక్షానికి పోతారు?’ అని అడిగితే అందుకు ఆయన ‘నేను పోతే పోవచ్చు’ అన్నారట. భక్తుడు ఓహో రమణమహర్షి మాత్రమే పోతారేమో అనుకున్నాడట. కానీ ఆయన చెప్పింది అది కాదు. ‘నేను’ అనే ‘స్వార్థం’ పోతే ఎవ్వరైనా పోవచ్చు అనేది. అది ఒక కచ్చితమైన స్టేట్మెంట్. దానికోసమే ‘నేను’ ఎవరో పట్టుకోమన్నారు మహర్షి. పట్టుకోవడం కోసం సాధన చెయ్యమన్నారు. రమణులు చెప్పిన సాధన గురించి కూడా కవిరాజుగారు కవిత్వం చెప్పారు.
“రెండు సంధ్యల మధ్య
పరుగులు
తీస్తున్నాను
నా చిరునామా
వెతుక్కుంటూ.
ఎక్కడ నుంచో ఓ వెలుగు
చుక్క
నన్ను చూసి వినోదంగా నవ్వుకొంటూంది” (నీరూపం.
2022:26)
పై కవితలో ‘రెండు సంధ్యలు’ పుట్టుక చావులు. ‘నా చిరునామా వెతుక్కుంటూ పరుగులు తీయడం’ మహర్షి చెప్పిన ‘నేను’ అనేవాడి కోసం చేసే అన్వేషణ. పెద్దలందరూ చెప్పిన సాధన. ‘వెలుగుచుక్క’ పరంజ్యోతి. అదే పరమాత్మ. రమణులు చెప్పిన మౌనసాధన గురించిన విషయాలు కూడా కనిపిస్తాయి నీరూపం కావ్యంలో. మొత్తానికి జీవాత్మ, పరమాత్మల గురించిన అనేక విషయాలు కవితాత్మకంగా చెప్పిన కావ్యంగా నీరూపం నిలుస్తుంది.
5. ముగింపు:
- కవిరాజుగారు రాసిన నీరూపం కావ్యంలో కనిపించే భారతీయ తత్త్వంపై ఇదొక విహంగవీక్షణం. స్థల పరిమితి దృష్టితో అన్నిటినీ చెప్పడం ఇక్కడ సాధ్యం కాలేదు. కాగా అరవిందులు, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి వంటి భారతీయ తత్త్వవేత్తలు చెప్పిన తత్త్వం కూడా ఇందులో కవిత్వ రూపంలో కనిపిస్తుంది.
- సాధనకు సంబంధించిన విషయాలు, స్వయం సాధన ద్వారా కవిరాజుగారు గ్రహించిన సత్యాన్ని కూడా కవిత్వంగా ప్రకటించటాన్ని మనం గ్రహించవచ్చు. అయితే, కావ్యంలో మొత్తంగా కనిపించే తత్త్వంలో ఒక్కొక్క తత్త్వవేత్త చెప్పిన సిద్ధాంతంపై ఒక్కో పరిశోధన పత్రం రాయవచ్చు.
- కావ్యంపై విశ్వవిద్యాలయాలో ఎం. ఫిల్. పరిశోధన, కవిరాజుగారి మొత్తం రచనలపై ఒక పిహెచ్. డి. పరిశోధన చెయ్యవచ్చు. అలాంటి ప్రయత్నాలకు ఈ పత్రం సహకరిస్తుంది.
- అలాగే నీరూపం కావ్యాన్ని, అందులో ఉన్న విషయాన్ని సమాజానికి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. పత్ర ఉద్దేశ్యం నెరవేరాలని, కవిరాజుగారి నుండి మరిన్ని రచనలు రావాలని ఆశిద్దాం.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆశాజ్యోతి, ఎ. 2019. కవిరాజు
‘సూర్యకఠారి’ కవితాసంపుటి: అనుశీలన. (మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలకు సమర్పించిన ఎం. ఫిల్.
పరిశోధన వ్యాసం- అముద్రితం).
- కవిరాజు. 2022. నీరూపం. హైదరాబాదు: సాధన ప్రచురణలు.
- కృష్ణమాచార్యులు, ఎం. & వేంకటరామయ్య, గోలి (అనువాదకులు) 2014. శ్రీమద్భగవద్గీత. గోరఖ్ పూర్: గీతాప్రెస్.
- కృష్ణమూర్తి, కె. 2006. స్వీయజ్ఞానం. చెన్నై:
కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.
- చినవీరభద్రుడు, వాడ్రేవు. 2013. సత్యాన్వేషణ.
హైదరాబాదు: ఎమెస్కో ప్రచురణలు.
- పోతన, బమ్మెర. 2015. పోతన భాగవతము. తిరుపతి:
తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణ.
- వీరభద్రయ్య, ముదిగొండ. 2012. నేనెవ్వరు? – శ్రీరమణీయం. హైదరాబాదు: దుర్గా పబ్లికేషన్స్.
- శ్రీశ్రీ. 2004. మహాప్రస్థానం. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.