AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. ఎమ్. ఆర్. వి. సత్యనారాయణమూర్తి సందేశాత్మకకథలు: సామాజికత
యస్.జె. చంద్రకళ
పరిశోధకవిద్యార్థి, తెలుగుశాఖ
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
రాజమహేంద్రవరం - 533 296. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8500930676. Email: honeyrosegisi@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ఆంగ్ల సాహిత్య ప్రక్రియల ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియల్లో కథా ప్రక్రియ ఒకటి. తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, నాటిక, కథానికలకు పెద్దపీట వేసారునుటలో ఎలాంటి సందేహం లేదు. తొలి తెలుగు కథానిక రచయిత అయిన గురజాడ నుండి నేటి వరకూ తెలుగులో అనేక మంది రచయితలు వివిధ కోణాల్లో అనగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికపరంగా కథలను సృష్టించారు. అలాంటి వారిలో ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి ఒకరు. వీరు దాదాపుగా అన్ని కోణాల్లోనూ కథలు రాశారనేది అక్షర సత్యం. వీరు రచించిన రెండు సందేశాత్మక కథల్లోని సామాజికతను వెల్లడి చేయడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. కథలను, కథా ఇతివృత్తాన్ని సంక్షిప్తంగా వివరించి రచయిత తెలిపిన సామాజికాంశాలను ఈ వ్యాసం వెల్లడిస్తుంది.
Keywords: సాహిత్యం, ప్రక్రియలు, కథలు, విశ్లేషణ, సామాజికాంశాలు.
1. రచయిత పరిచయం :
రచయిత పూర్తి పేరు మలపాలక రామ వెంకట సత్యనారాయణ మూర్తి. వీరు శ్రీ మలపాక సుబ్రహ్మణ్యం, శ్రీమతి మలపాక యజ్ఞమ్మ పుణ్య దంపతులకు 30-9-1951న పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండలో జన్మించారు. వీరిది సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఎమ్.ఆర్.వి.గారు ప్రాథమిక విద్య శ్రీకన్యకాపరమేశ్వరి ప్రాథమిక పాఠశాల పెనుగొండలోనూ, హైస్కూల్ విద్య తమ పక్క గ్రామమైన మార్టేరులో గల యస్.వి.జి. హైస్కూల్ లోనే జరిగింది. ఎమ్మార్వి సత్యనారాయణమూర్తి ఉద్యోగ జీవితం 1971 నుండి ప్రారంభమైంది. పెనుగొండలోనే విద్యాశాఖలో జానియర్ అసిస్టెంట్‌గా 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత 2008లో పదవీ విరమణ చేశారు.
2. కథలు - సంగ్రహేతివృత్తాలు - సామాజికాంశాలు:
ఈ నా పరిశోధనా వ్యాసంలో ఎమ్.ఆర్.వి. సత్యనారాయణమూర్తి రాసిన 1. అమ్మ కోరిక, 2. అరుణోదయం అనే కథలలోని సామాజికాంశాలను వివరించదలచాను.
2.1 అమ్మ కోరిక :
సందేశాత్మక కథల్లో అమ్మ కోరిక ఒకటి. ‘తల్లిని మించిన దైవం’ లేదనేది భారతీయ సాంప్రదాయం. అలాంటి సమసమాజంలో నేటితరం ఎలాంటి దుర్భరస్థితికి తల్లిదండ్రుల్ని తీసుకెళ్తుందో తెలియజేసే కథే ‘అమ్మకోరిక’. తల్లిదండ్రులుగా బిడ్డ కడుపున పడిన నాటి నుండి పుట్టి పెరిగి పెద్దవారై వారిని గొప్ప ప్రయోజకులవ్వాలనేది కొందరి కోరికయితే, తమ బిడ్డలు ఉన్నత శిఖరాల్ని అధిరోహించి సమాజసేవకై ఎదగాలనేది మరికొందరి ఆకాంక్ష.
తల్లి కడుపున పడ్డప్పుడే తన సుఖం కన్నా తమ బిడ్డ క్షేమాన్నే పరితపిస్తూ నవమాసాలు మోసి, కని వారి బాల్యాన్ని అల్లారు ముద్దుగా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు పంచి పోషించి వారికి విద్యాబుద్ధుల్ని అందిస్తారు తల్లిదండ్రులు. అంతటి సేవ చేసి ప్రయోజకుల్ని చేసిన మాతృమూర్తుల్ని కన్నబిడ్డలే తాము ప్రయోజకులై ఏ విధంగా వారిని వదిలించుకోవాలనే దుష్టాలోచనతో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు తరలింపజేసి దౌర్భాగ్యమైన, నీచమైన ఆలోచనలకు నేటి యువతరం శ్రీకారం చుడుతుందని ఆవేదన చెందుతూ రాసిన కథే అమ్మ కోరిక.
2.1.1 కథాకథనం:
ఈ కథలో రాజారావు ప్రభావతి భార్యభర్తలు. రాజారావు స్కూల్ టీచర్ ప్రభావతి ఏడవతరగతి వరకూ మాత్రమే చదువుకుంటుంది. వీరికి ఒక కుమారుడు ఉదయ్. ఉదయ్ పుట్టగానే స్కూల్ అసిస్టెంట్‌గా వున్న రాజారావుకు ప్రమోషన్ వలన గెజిటెడ్ హెడ్ మాష్టారు హోదా వస్తుంది. దాంతో కుమారుడు పుట్టిన అదృష్టమేనని భావించి ఉదయ్‌ని ఎంతో అల్లారు ముద్దుగా సాకుతారు. తన కుమారుడు పెరిగి పెద్దై ఇంజనీరింగ్ చదివి దేశానికి సేవ చేయాలనేది రాజారావు చిరకాల కాంక్ష. ఆ కోణంలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో సీటు రానప్పటికీ ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో మేనేజ్‌మెంట్ కోటాలో ఇంజనీరింగ్ లో చేరుస్తాడు. తనకు వస్తున్న జీతంలో సగానికి పైగా కుమారుడి చదువుకి పంపిస్తూ మిగిలిన దానితో గుట్టుగా జీవనాన్ని సాగిస్తుంటారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికి కుమారుడి ఎదుగుదలే ముఖ్యమని భావించిన ఆదర్శవంతుడు రాజారావు.
అనుకున్నట్లుగానే ఉదయ్ ఇంజనీరింగ్ యూనివర్శిటీ టాపర్ అవుతాడు. చదువు పూర్తిచేసుకున్న తన కొడుకు ఇంటికి వస్తున్నాడన్న ఆశతో వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు. కాని ఉదయ్ తన మిత్రులతో కలసి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి తన క్లాస్ మేట్ ప్రేమలతని పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. తన కొడుకు ప్రయోజకుడై వస్తాడనుకున్న ఆ తండ్రి ఆశ అడియాస అయిపోతుంది. మూడు రోజులు మాత్రమే ఉండి ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రయివేట్ ఉద్యోగం కన్నా తన మామాగారు చేస్తున్న కాంట్రాక్టు పనులే మంచివనుకుని భవన నిర్మాణల్లో ఆధునిక పద్ధతులపై పరిశోధన చేయడానికిగాను అమెరికాకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. కుమారుడు చేసిన పనికి హృదయవేదనకు గురైన రాజారావు హ్ట్‌ం ఎటాక్ వచ్చి మంచాన పడతాడు. కుమారిడిపై బెంగతోనే పరమపదిస్తాడు. చివరికి తండ్రి ఆఖరి చూపుకు కూడా నోచుకోకుండాపోతాడు. మరుసటి రోజుకి వచ్చి ఖర్మకాండలన్ని ఘనంగా జరిపిస్తాడు. తర్వాత తల్లిని తనతో పాటు తీసుకెళ్ళి తానుంటున్న బంగ్లాలోనే ఒక రూమ్‌లో ఉంచుతాడు. ఆమెకు సకల సౌకర్యాలు కల్పిస్తాడు. కోడలు కూడా తనకేమి అవసరమైన ఆర్డర్ వేయమంటుంది.
ఒక రోజు మంచి నీళ్ళు అవసరమై ఎంతకేక పెట్టిన నౌకరు పలకకపోవడంతో ఆమె మంచినీళ్ళకై బయటికి వచ్చి క్రిందికి చూసే సరికి కోడలు తన స్నేహితురాళ్ళతో మద్యం సేవిస్తూ పేకాటాడుతుంటుంది. తన భాగోతం అత్తగారు చూసినందుకు భర్తకు చెప్పి ఆమెను అక్కడి నుండి గెస్ట్ హౌస్ కి పంపిస్తుంది. తదుపరి గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చి ప్రజలు కష్టపడుతున్నారని, వరద బాధితులు సహాయార్ధం వచ్చిన వారికి ఆమె దగ్గరున్న బంగారు వుంగరం ఇస్తుంది. ఆ విషయాన్ని పేపర్లో వేయడం చూస్తారు కొడుకు కోడలు. దాంతో ఆమెను అక్కడి నుండి బయటకు వెళ్ళమని చెప్పి కస్తూరిబా వృద్ధజనాశ్రమానికి తీసుకెళ్ళి అతని తండ్రి పేరు మీద ఒక ఫ్లోరు నిర్మాణానికి, వృద్ధాశ్రమానికి డబ్బులిచ్చి తన తల్లి ఇక్కడ వుండి పనులన్ని చూసుకుంటుందనే సాకు చెబుతూ తల్లిని వృద్ధాశ్రమంలో చేరుస్తాడు. దాంతో తల్లడిల్లిన ఆ మాతృహృదయం ఆవేదనతో రాష్ట్రపతికి తన గోడుని విన్నవించుకుంటూ లేఖ రాస్తుంది.
గర్భందాల్చిన స్త్రీ తన కడుపున ఉన్న శిశువు ఎదుగుదలను తెలుసుకోడానికి స్కానింగ్ లు ఎలా అయితే వున్నాయో అలాగే, బిడ్డ కడుపున ఉన్నప్పుడే అతను తల్లిదండ్రుల్ని చూస్తాడో, చూడడో అన్న విషయాన్ని తెలుసుకునే స్కానింగ్ లను ఏర్పాటు చేయమని రాసిన ఆ లేఖ చదివి రాష్ట్రపతి హృదయం ఎంతో ద్రవించిపోతుంది.
నేటికాలంలో వృద్ధాప్యంలో వున్న ఎంతో మంది తల్లిదండ్రుల దీనస్థితిని అమ్మ కోరిక కథ ద్వారా తెలియజేశారు రచయిత.
2.1.2 సామాజికత:
‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు కలుగుర సుమతీ!’ అని సుమతీ! శతకకర్త బద్దెన చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు సమాజంలో అనువనువునా దర్శనమిస్తుంటుంది. అమ్మ కోరిక కథలో కూడా -
‘పెళ్ళయిన మరు ఉగాదికే నాకు మగబిడ్డ కలిగాడు. ఉగాది రోజు ఉదయం పుట్టిన వాడికి ‘ఉదయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఉగాదికి నాజీవితంలో చాలా ప్రాముఖ్యం వుంది. నేను ప్రభవ నామసంవత్సరం ఉగాదికి పుట్టానని మాతండ్రి నాకు ప్రభావతి అని పేరు పెట్టారు. నా జననం ఉగాది. నా పెళ్ళి చూపులు ఉగాది. నాకు పుత్రోదయం కూడా ఉగాదినాడే. ఉదయ్ పుట్టాకా మా వారికి హెడ్మాష్టరుగా ప్రమోషను వచ్చింది. అప్పట్నుంచీ ఆయనకు వాడి మీద వెర్రిమమకారం పెరిగింది. టౌను నుండి మంచి ఖరీదైన బట్టలు, బొమ్మలు తెచ్చేవారు. ఎదిగే వయసు ఎందుకండీ ఇంత ఖరీదైనవి అంటే వినేవారుకాదు. ‘ప్రభా! వాడు మన జీవితాలకు ఉదయ కిరణమే. మన మధ్యతరగతి జీవితాలలో వెలుగుపూలు పూయించి మన వంశానికే పేరు తెస్తాడే’1
అని తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మాంసపు ముద్దగా, గర్భస్థశిశువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో ఆశల్ని వారి హృదయంలో పొందుపరుచుకుంటారనే విషయాన్ని వెల్లడిరచారు రచయిత.
సమాజంలో ప్రతీ తల్లిదండ్రి తమబిడ్డలు పెరిగి గొప్ప ప్రయోజకులుగా ఎదగాలని ఆశించిన తీరును మన కళ్ళముందుంచారు రచయిత.
అమ్మకోరిక కథలో రాజారావు ప్రభావతి దంపతులు తమకు కలిగిన ఏకైక సంతానం ఉదయ్ హైస్కూల్ చదువు పూర్తిచేసుకుని ఇంజనీరై తమకు, తమ వంశానికి గొప్ప పేరు తెస్తాడనే ఆకాంక్షతో బ్రతుకుతుంటారు. కానీ -
‘దురదృష్టవశాత్తు ప్రవేశపరీక్షలో వాడికి తగిన ర్యాంకు రాకపోవడంతో ఆంధ్రాలో ఇంజనీరింగ్ సీటు రావడం కష్టమని తేలిపోయింది. కాలేజీలో బి.ఎస్.సి.లో చేరతానన్నాడు ఉదయ్. కానీ ఆయన ఒప్పుకోలేదు. మా తాహతుకు మించినదే అయినా డొనేషన్ కట్టి కర్ణాటకలో బి.ఇ.లో చేర్పించారు. వాడు సుఖంగా ఉండాలని మా సుఖాల్ని వదులుకున్నాం. దూరంగా వుంటున్న వాడు యిబ్బంది పడకూడదని ఆయన జీతం డబ్బు సగానికిపైగా వాడికి పంపి మేం పొదుపుగా జీవించసాగాం. ఉదయ్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆరోగ్యం కొద్దికొద్దిగా దెబ్బతినసాగింది. డాక్టర్‌కి చూపించుకోమంటే అలాగే అనేవారు. కానీ ఎవరికీ చూపించుకునేవారు కాదు.
ఉదయ్ బి.ఇ. ఆఖరి సంవత్సరంలో వుండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. స్కూలుకి సెలవు కూడా పెట్టరు. అయినా ఈ విషయాలు ఉదయ్‌కి తెలియనివ్వలేదు. నేను ఎంత మొత్తుకున్న వినేవారు కాదు. ప్రభా! వాడు ఇంజనీర్ గా ఈ ఇంట్లో అడుగుపెట్టాలి. ఎన్నో మంచి పనులు చేసి దేశంలోనే ఉత్తమ ఇంజనీర్ గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అడుగుజాడల్లో పయనించి ఎంతో ఖ్యాతి పొందాలి. వాడు వస్తే నా ఆరోగ్యం అదే కుదుటపడుతుంది’2 అని సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు తాము తినకుండా తమ ఆరోగ్యాలు పాడైపోతున్నా దాచుకున్నదంతా పిల్లల చదువులకు ధారాదత్తం చేస్తుంటారు.
అంతేకాకుండా తమ పిల్లలు ఎదుగుదలనే మేడలుగా తమ హృదయాల్లో గూడు కట్టుకుంటారు. అవి పేకమేడల్లా కూలిపోతాయని తెలియని అమాయక తల్లిదండ్రులెందరో సమాజంలో ఉన్నారనే విషయాన్ని తెలియపరిచారు. తమ సుఖాల్ని సైతం పక్కన పెట్టి తాము దాచుకున్నదంతా ఖర్చుచేయకుండా తమ పిల్లల సంక్షేమానికే కేటాయించిన తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు రచయిత.
అలాగే సమాజంలో తమ బిడ్డలు పెరిగి పెద్దవారై ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తే -
‘ఉదయ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ప్రధముడిగా వచ్చాడని తెలిసిన రోజున మా ఆనందానికి అంతేలేదు ఆరోజు ఎంతో ఓపిక తెచ్చుకుని గ్రామంలోని ముఖ్యులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. మీ కృషి ఫలించింది మాష్టారు. ఉదయ్ మన గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చాడని, అందరూ అభినందిస్తుంటే ఆయన ఎంతో పొంగిపోయారు.
కొన్ని సంవత్సరాలు శ్రమించి అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషితో ఒక అద్భుతమైన శిల్పాన్ని సృష్టించిన శిల్పి. ఆ శిల్పానికి దేశమంతటా బహుమతులు వస్తే ఎంతటి ఆనందాన్ని, సంతృప్తి ఆయన కళ్ళల్లో తొణికిసలాడేవి’3.
దీన్నిబట్టి ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రయోజకులై సమజమంతా వారిని పొగడ్తలతో ముంచెత్తినప్పుడు వారి ఆనందానికి అవధులుండవనే విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంలో సమతీ శతకకర్త చెప్పిన మాటలు అక్షరాల నిజమే. తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చదువులో ప్రక్క రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో ప్రధముడిగా ఎదిగిన తమ కుమారుడి రాకకై ఎదురుచూస్తుంటారు రాజరావు దంపతులు.
‘ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు ఇంటిముందు కారు ఆగిన చప్పుడైతే ఎవరా అని వాకిట్లోకి వచ్చాను. నా ఆశల రూపం ఆ బంగారు తండ్రి ఉదయ్ కార్లోంచి దిగాడు. అమ్మా అంటూ వచ్చి చేతుల్లో వాలిపోయాడు. శ్రావణమాసం గోదావరిలా నా మనసు ఆనందంతో ఎగిసిపడిరది. మనిషి బాగా ఎదిగాడు. వయసులో వున్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా వుండేవారో అచ్చు అలాగే వున్నాడు. ఏవండీ! అబ్బాయి వచ్చాడండీ. లోపలిగదిలో నుండి హాల్లోకి వచ్చిన తండ్రికి పాదాభివందనం చేసాడు ఉదయ్. ఎవర్రా ఆ అమ్మాయ్ అన్నారాయన. అంత వరకూ నేనూ చూడలేదు గడపదగ్గరే నిలబడి వుంది ఆ అమ్మాయి.
నాన్నా ఈ అమ్మాయి పేరు ప్రేమలత. నాతో ఇంజనీరింగ్ చేసింది. మేము ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. వాళ్ళ నాన్నగారు ప్రేమకు వేరే సంబంధం చూస్తుంటే అనుకోని పరిస్థితుల్లో రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకున్నాం. అంతా చాలా స్పీడుగా జరిగిపోయింది. మా ఫ్రెండ్సే పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి రాలేకపోయిన ప్రేమ నాన్నగారు నిన్న వచ్చి దీవించి వెళ్ళారు. మీ ఆశీస్సులు తీసుకోమని వాళ్ళ కారిచ్చి పంపారు.’ 4
కుమారుడు ప్రయోజకుడై తిరిగి వచ్చాడన్న ఆనందాన్ని వారికి మిగల్చకుండా తాను ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుని ఈమె మీ కోడలు అని పరిచయం చేస్తే ఎన్నో ఆలోచనలతో ఆశల పల్లకిలో ఊరేగుతున్న ఆ తల్లిదండ్రుల ఆశ అడియాసలు చేస్తున్న నేటి యువకుల అనాలోచితమైన నిర్ణయాన్ని ఆవేశపూరితమైన ఆలోచనల్ని తప్పుబట్టారు రచయిత. చదువుకోమని కళాశాలకు పంపితే ‘ప్రేమ’ అనే మత్తులో యువత తొనికిసలాడుతున్నారని అది వారిని కన్న తల్లిదండ్రులకు మానసిక క్షోభను మాత్రమే మిగులుస్తుందనే సంగతిని గుర్తుచేశారు.
తమకిష్టమొచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చిన ఉదయ్ తనకున్నది వృద్ధతల్లిదండ్రులని కూడా చూడకుండా తన దారిని తాను వెతుక్కుంటూ తన మామగారి వ్యాపారం చూసుకుంటానని లేఖరూపంలో చెప్పి విదేశాలకు వెళ్ళిపోయిన తీరుని కళ్ళముందుంచారు. ఎంతో ప్రేమతో పెంచిన బిడ్డ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని ఆదరించి అక్కున చేర్చుకోవడం మాని వారిని ఒంటరివాళ్ళను చేసి వాళ్ళ సుఖాల్ని వెతుక్కుంటున్నారు నేటి యువత అనే సందేశాన్నిచ్చారు రచయిత.
అమెరికాకు వెళ్ళిన ఉదయ్ పై బెంగతో తండ్రి మరణిస్తాడు. చివరికి తండ్రి ఆఖరి చూపు చూసుకోని దురదృష్టవంతుడిగా ఉదయ్ పాత్ర మనకు దర్శనమిస్తుంది. ఖర్మఖాండల్ని జరిపి తన తల్లిని తనతో పాటు హైదరాబాద్ కి తీసుకెళ్ళి తన భార్యమాటలు నమ్మి -
‘అమ్మా మనం ఒక ఫంక్షన్ కు వెళ్దాం రెడీగా వుండమని చెప్పాడు. భర్తపోయి హైదరాబాద్ వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు గడపదాటని నేను అన్యమనస్కంగానే ఉదయ్ కారులో బయటకెళ్ళాను. నగరానికి చివరగా వున్న కస్తూరిబా వృద్ధజనాశ్రమంకు వెళ్ళాము.
కార్యక్రమ నిర్వాహకలు మా కోసమే వేచియుండటంతో నన్ను ఉదయ్ ని వేదికపైకి తీసుకెళ్ళారు కార్యదర్శి ఉమాప్రసాదావు. ఉదయ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. తండ్రి పేరు మీద నిర్మించే అదనపు బ్లాకుకు అయిదు లక్షల రూపాయలు విరాళం యిచ్చినందుకు వక్తలందరూ వాడిని ఆకాశానికెత్తేసారు.
కార్యక్రమం పూర్తయ్యాకా ఆఫీసులో కూర్చున్నాం నేనూ, ఉదయ్, ఉమాప్రసాదరావు. చూడండీ ఉమగారూ! మా అమ్మ గారు ఇక్కడే వుండి మా నాన్న గారి పేరు మీద నిర్మించే భవన నిర్మాణం పనులు చూస్తుంటారు. మీ సంస్థకు నా ప్రత్యేక విరాళం రెండు లక్షల చెక్కు అంటూ ఆమె కొక చెక్కు అందించాడు. అమ్మా నీ బట్టలూ, సామాన్లు రంగయ్య తీసుకువస్తాడు. నేను అప్పుడప్పుడు వస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు’5.
మాంసపు ముద్దగా ఉన్నప్పుడు మొదలుకుని మనిషిగా సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగేవరకు తమ సుఖాన్ని పక్కనపెట్టి పిల్లల ఆనందాలకే పెద్దపీటలేసే తల్లిదండ్రులకు ఉదయ్ లాంటి కుమారులిచ్చే గొప్పగౌరవం వారికి గుప్పెడు ముద్ద అన్నం పెట్టి సాకలేక వృద్ధాశ్రమాల్లో వదిలిపోవడం అనే విషయాన్ని గుర్తుచేశారు.
నేటి యువత సుఖాలకి లోనై, వారి ఆగడాలకు అడ్డుగా ఉంటున్న తల్లిదండ్రుల్ని ఎలా వదిలించుకుంటున్నారో ఈ అమ్మ కోరిక కథ ద్వారా వెలిబుచ్చారు రచయిత.
ఈ కథ ద్వారా మన సుఖాలు, సంతోషాలు, ఆనందాలకన్నా అమ్మ మనసే మిన్న అని అలాంటి వారిని వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోకుండా, వీధుల పాలు చేస్తున్నారని ఆవేదనని వ్యక్తం చేసిన తీరు ద్యోతకమౌతుంది.
నేటి యువతకి ఈ కథ ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే మనం భూమ్మీద మనుషులుగా అవతరించామంటే అది కేవలం అమ్మతనం వల్లనేనని, అలాంటి అమ్మతనానికి విలువిచ్చి వారిని ఆదరించాలే తప్ప అనాధలుగా వదిలేయరాదనే సందేశాన్ని నేటి యువతరానికిచ్చారు రచయిత.
2.2 అరుణోదయం:
విద్య విశిష్టదైవతము, విద్యయే యశస్సు, విద్యయే భోగకరి అని శతకకవి చెప్పిన మాటలు అక్షరసత్యం. ఎందుకంటే అజ్ఞానం కన్నా విజ్ఞానం మేలు కాబట్టి విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. యశస్సునిస్తుంది. సంఘంలో గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి చదువుకున్న వ్యక్తి దేశానికో శక్తి అంటారు. అలాంటి విద్య యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ, విద్యవల్ల వ్యక్తి జీవితం ఎలా సుఖమయమవుతుందో సమాజానికి ఉపయోగకరంగా వుంటుందో తెలియజెప్పే కథే అరుణోదయం.
2.2.1 కథాకథనం:
వెంకట్రావు, చంద్రమ్మల కుమార్తె ‘అరుణ’. ఆమె వారి ఊరిలో ఉండే పాఠశాలలో పదవతరగతి చదువుకుంటుంది. వీరిది బీద చేనేత కార్మికుల కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. అలాంటి పరిస్థితుల్లో చదువు పై మక్కువతో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మందులిచ్చి చిన్న వాడైన తమ్ముడ్ని స్కూలుకి పంపి, తెలుగు మాష్టారు కోదండరామయ్య గారి క్లాసు మిస్సవ్వకూడదనే తపనతో ఆదరబాదరాగా స్కూలుకెళ్ళి పాఠశాలలో అందరికంటే బాగా చదువుతుంది. అందుకే కోదండరామయ్య మాష్టారికి అరుణంటే అమితమైన అభిమానం. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న లెక్కల మాష్టారు చక్రవర్తి. ఈయనకు బడుగు బలహీన వర్గాల పిల్లలంటే అసహ్యం. అంతేకాకుండ అతని దగ్గరికి వెళ్ళనివారంటే మరీనూ. అందులోనూ అరుణంటే ఇంకా చీదరింపుగా చూస్తుంటారు. ఎందుకంటే అతని ట్యూషన్ కి వెళ్ళకపోయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటున్నందుకు. ఒక రోజు అరుణ దగ్గర కాంపస్ బాక్స్ లేనందుకు ఆమెను, ఆమె తల్లిదండ్రులిన నిందుస్తూ మాటలంటాడు. దాంతో తన తండ్రి వెంకట్రావును కాంపస్ బాక్స్ కొనమని బతిమాలుతుంది. తాను నేసే చేనేత వస్త్రాలు అమ్ముడవ్వక, అందులోనూ 25 రూపాయలుంటే ఆ డబ్బుతో కుటుంబాన్ని 4 పూటలు గడపుకోవచ్చనే పరిస్థితి. అయినప్పటికీ రెండు రోజుల్లో కొంటానంటాడు.
అరుణ తండ్రికి నేత పని తప్ప మరే పనిరాదు. తాను నేసిన చీరలు, పంచెలు, తువాళ్ళు పట్టుకెళ్ళి పట్టణంలో అమ్మి ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తుంటాడు. లెక్కల మాష్టారు అన్న మాటల్ని తన క్లాస్ మేట్ కాత్యాయని ద్వారా తెలుసుకున్న కోదండ రామయ్య గారు మరుసటి రోజే కాంపస్ బాక్స్ కొని ఇస్తాడు. ఎలాగైన అరుణ ఉన్నత చదువుల్ని అభ్యసించి సమాజానికి సేవ చేసే వ్యక్తిగా ఎదగాలన్నది ఆయన ఆకాంక్ష.
చదువలు పట్ల మక్కువ ఎక్కువైన అరుణ పట్టుదలతో చదివి, పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్టు వస్తుంది. అంతేకాకుండా తన సొంత గ్రామమైన రామాపురానికి మంచి పేరు తెస్తుంది. దాంతో జిల్లాలోని ఉన్నతాధికారులు, గ్రామస్తులు అరుణను అభినందిస్తారు. కోదండరామయ్యగారి ప్రయత్నంతో ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ డా॥ రామచంద్రగారు అరుణ ఇంటర్, డిగ్రీ చదువులకయ్యే మొత్తం ఖర్చు తానే ఇస్తానని అనడంతో, 5 సం॥రాల చదువును ఫస్టుక్లాసుతో పూర్తి చేసుకుని వచ్చి కోదండ రామయ్య మాష్టారికి తన భవిష్యత్ ప్రణాళికను చెబుతుంది. దానికి ఆయన సముఖత తెల్పడంతో హైదరాబాద్ లో చిన్న ఉద్యోగంలో చేరి ప్రయివేటుగా పి.జి. చేస్తూ సివిల్ కు అవసరమైన మెటీరియల్ ను సంపాదించుకుంటుంది. ఈ విషయంలో కోదండరామయ్య మాష్టారి పుత్రుడు రాధాకృష్ణ ఆమెకు ఎంతగానో ఉపకరిస్తాడు. పగలు, రేయి అనేక కష్టాలు పడి చదివి సివిల్స్ పరీక్షలో విజయం సాధిస్తుంది. ఆ విజయం ఆ వూరికీ మరీ ముఖ్యంగా కోదండ రామయ్య గారి ఆనందానికి అంతులేకుండా పోతుంది. తన శిష్యుడు ప్రయోజకుడైతే మొట్ట మొదటగా సంతోషించేది ఉపాధ్యాయుడే అనేది మనందరికి తెలిసిన విషయమే. అరుణ కలెక్టర్ అయినందుకు ఊరి వారు అభినందసభ ఏర్పాటు చేస్తారు. తన విజయానికి సహాకరించిన కోదండరామయ్యగారికి, చక్రవర్తిగారికి కూడా కృతజ్ఞతలు తెల్పుకుంటుంది. అరుణ కలెక్టర్ అవ్వడంతో తనతో పాటు కలెక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సునీల్ ను వివాహం చేసుకుంటుంది. ఇద్దరూ కలెక్టర్లు అవ్వడం, అరుణ వాళ్ళ జిల్లా కలెక్టర్ అవ్వడంతో మరుగున పడుతున్నన చేనేత కార్మిక వ్యవస్థను అణగారిపోతున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృక్పథంతో, ఆవూరిని, ఊరి ప్రజల్ని ఒక స్థితికి చేర్చిన ఘనత అరుణకే చెందుతుంది.
అందుకే రాయప్రోలు వారు అన్నట్లు ‘ఏదేశమేగినా ఎందుకాలిడిన - పొగడరా నీ తల్లి భూమిభారతిని - నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’ అన్న మాట అక్షర సత్యమనేది అరుణ పాత్ర ద్వారా తెలియపరిచారు రచయిత.
2.2.2 సామాజికత:
విద్య యొక్క ప్రాముఖ్యతను తెల్పుతూ, కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది అరుణ పాత్ర. తన జీవితంలో జరిపిన కృషిని తెల్పుతూ -
‘కానీ మన కళ్ళముందు అరుణ సాధించిన విజయం చూసాకా ఆ మహాపురుఫులు విజయగాధలూ సత్యాలే అని మనం ఇప్పుడు విశ్వసిస్తున్నాం. ఎంతో పేదరికంలో వుంటూ అస్తవ్యస్తంగా వున్న కుటుంబ పరిస్థితులకు కృంగిపోకుండ జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో జీవన పోరాటం జరిపి గెలుపు సాధించింది. చాలా మంది ఏదో సాధించాలని కలలు కంటారు. కానీ ఆ కలలు సాకారమయ్యేందుకు అంకిత భావంతో ప్రయత్నించరు. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. చదువు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఉపాధి కల్పిస్తుంది. వీటితో పాటు దేశానికి ఒక కొత్తరూపాన్ని ఇచ్చే యువ మేధావులను కూడా చదువే అందిస్తుంది.’ 6
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని చెప్పే కథగా అరుణోదయం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కష్టే ఫలి అని కష్టపడితే ఫలితం పొందవచ్చనే గొప్ప సందేశాన్ని అరుణ పాత్ర ద్వారా యువలోకానికి అందించారు ఎమ్మార్వి సత్యనారాయణమూర్తి.
ఈ కథ ద్వారా సమాజంలో నిద్రాణంలో మునిగిపోతున్న యువతను మేల్కొల్పారు. చదువు ద్వారా ఎంతటి స్థితినైనా మార్చవచ్చని, కాబట్టి నేటి సమాజంలో వ్యక్తులు సమయాన్ని ఉపయోగించుకుని చదువుపై దృష్టిసారిస్తే ఉన్నత శిఖరాల్ని అధిరోహించి జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారనే గొప్ప సందేశాన్నిచ్చారనడంలో అతిశయోక్తి లేదు.
అలాగే ప్రతీ వ్యక్తి జీవితంలో కూడా తమ విజయాలకి అంతర్గతంగా బహిర్గతంగా సహకరించే వ్యక్తులుంటారంటూ -
‘నా విజయానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన కారకులు. ఒకరు కోదండ రామయ్య మాష్టారు. ఇంకొకరు చక్రవర్తి మాష్టారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ చక్రవర్తిగారి గురించి చెప్పినందుకు కానీ ఇది నిజం. కోదండరామయ్య మాష్టారు నాకు ఎంతో అండగా నిలిచారు. ఎంతో మందిని కలిసి నాకు ఆర్ధిక సహాయం అందిచారు. ఒక్కోసారి ఆయన హైదరాబాద్ వచ్చి నువ్వు తప్పక విజయం సాధిస్తావు. మన గ్రామం నుండి మొట్టమొదటి కలెక్టర్ పరీక్ష విజేతగా చరిత్ర సృష్టిస్తావు అని ధైర్యం చెప్పేవారు. ఆయన నా కోసం పడుతున్న కష్టాల్ని చూసి బాధపడేదాన్ని. ఈ సివిల్స్ పరీక్ష కాకుండా ఏదైనా ఉద్యోగం చేసుకుందామా ఎందుకు ఇంతమందిని శ్రమ పెట్టాలి అనిపించేది. అప్పుడే చక్రవర్తి మాష్టారు మాటలు గుర్తుకు వచ్చేది. అప్పుడే ఏమయ్యింది. ‘ముందుంది ముసళ్ళ పండగ’ అనే మాటలు కొరడాదెబ్బల్లా చురుక్కుమనేవి’7.
దీన్ని బట్టి సమాజంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఒకరు కుల, మత, వర్గ, వర్ణ బేధాలు చూడకుండా తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, సమాజానికి ఉపయోగపడే పనులు చేసేవారు. వారు ఎదుటివారి శ్రేయస్సునే తమ శ్రేయస్సుగా భావిస్తుంటారు. అలాంటి పాత్రకు నిదర్శనం కోదండరామయ్య మాష్టారు లాంటివారు. ఇలాంటి వారు చేసేది బహిర్గత సేవ అయితే ఎదుటివారి ఎదుగుదలని ఓర్వలేక అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తు అట్టడుగు వర్గాల్ని చీదరించుకునే చక్రవర్తి మాష్టారు లాంటి వారు అంతర్గంగా, మానసికంగా మన ఎదుగుదలకు కొంత కారణమౌతారు అనే దానికి అరుణ సాధించిన విజయాలే నిదర్శనం. కాబట్టి సమాజంలో ప్రతీ ఒక్కరూ ఒక కోదండరామయ్య మాష్టారులాగా పరులకే సేవ చేయాలని, అలాగే ఎన్ని అడ్డంకలు ఎదురైనా జీవితంలో పైకి రావాలనే పట్టుదలతో యువత నడుం బిగించాలని, నిరంతరం శ్రమించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలనే సందేశాన్నిచ్చిన గొప్ప కథగా అరుణోదయం కథను నిర్మించారు రచయిత.
అలాగే నేటి సమాజంలో నేతకార్మికుల దుస్థితిని తెల్పుతూ -
‘నేత వృత్తికి గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది వేరే పనుల్లోకి మారిపోయారు. కొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా తమ జీవన విధానాన్ని మార్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చాలీచాలని సంపాదన పట్ల అసంతృప్తి చెందిన కొందరు సారా కాంట్రాక్టులు కూడా చేపట్టి లక్షాధికారులయ్యారు. అయినా తన తండ్రి లాంటి ఇరవై కుటంబాల వారు కులవృత్తే ఆరాధ్యదైవమని నమ్మి భగవంతుడే తమని ఏనాడైన ఆదుకొని ఉన్నత స్థితికి తీసుకువెళతాడన్న అచంచల విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించడం అరుణకు ఆశ్చర్యంగా వుండేది. మనం తగినంత కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. కానీ దేవుడా! నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను పైకి తీసుకురా అంటే ఎలా సాధ్యమవుతుందన్నది’8
నేటికాలంలో వస్త్ర తయారీలో నూతన ఆవిష్కరణలు రావడంతో చేనేత, నేత పనివారి వృత్తి కుంటుపడిపోయిందంటారు రచయిత. ప్రపంచీకరణ నేపధ్యంలో జరుగుతున్న ఈ క్రొత్త క్రొత్త ధోరణుల వల్ల సామాన్యుల జీవన విధానం కష్టతరమై పోయిందనే విషయాన్ని వెల్లడిచేశారు. అలాగే గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే దేవుడు మాత్రం ఏం చేయగలడంటారు. కాబట్టి ప్రభుత్వాలు మరుగున పడుతున్న చేనేత కార్మిక వ్యవస్థను ఆదుకొని వారికి పూర్వవైభవం తీసుకురావలనే నినాదాన్ని ఈ కథ ద్వారా అందించారు రచయిత.
అలాగే మనం చదువుకున్న చదువు తెలివితేటలు మనం పుట్టిన గ్రామానికి, దేశానికి, సమాజానికి ఉపయోగపడాలంటూ అరుణ లాంటి చదువుకున్న వార్ని ఆదర్శంగా చెబుతూ -
‘నేత కార్మికుల అభ్యున్నతికి ప్రత్యేక ప్యాకేజీని తయారు చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తుంది. అరుణ. ఇరవై ఐదు పైసల వడ్డీకే బ్యాంకు ఋణ సదుపాయం స్వంత పూచికత్తుపై వ్యానులు కొనుగోళ్ళకు ఋణసదుపాయం కల్పిస్తుంది ప్రభుత్వం.
ఈ లోగా ప్రభుత్వం తరుపున చేనేత కార్మికుల సంక్షేమానికి చేనేత వస్త్రాల ఎగుమతి అవకాశాల పెంపుకు అరుణ విదేశాలకు వెళ్ళి వస్తుంది. కేంద్ర జౌళి మరియు చేనేత రంగాల మంత్రితో విదేశాలకు వెళ్ళిన అరుణ తమ రామాపురం వెంకటాపురం వాసులు నాణ్యమైన చేనేత వస్త్రాల గురించి వివరించి చెబుతుంది. ఆరు నెలలు గడిచేసరికి విదేశాల నుండి భారీమొత్తంలో నేత వస్త్రాలకు ఆర్డర్ సంపాదిస్తుంది అరుణ.
చిన్న చిన్న తాటాకు ఇళ్ళల్లో వుండే రామాపురం నేత పనివారు ఇప్పుడు ఢాబాలు నిర్మించుకున్నారు. వారి పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నారు. గ్రామానికి ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటయ్యింది. హైస్కూలు జూనియర్ కళాశాలగా ఎదిగింది’9.
దీన్ని బట్టి చదువుకున్న ప్రతీ వ్యక్తి తమ స్వలాభాలకు పాటు పడకుండా తమతోటి వారికి సాయం చేయాలంటారు. అలాగే తాము పుట్టి పెరిగిన గ్రామాలకు మేలు చేకూర్చే వారిగా ఎదగాలని హితవు పలికారు. ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి అరుణోదయం కథ ద్వారా ఉపాధ్యాయులు బాధ్యతల్ని, చదువుకున్న విద్యార్ధి లక్ష్య సాధనవైపు పయనించే మార్గాల్ని, అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరు సమాజ పురోగతికి పాటుపడాలని సందేశమిచ్చారు.
3. ముగింపు:
- ‘అమ్మ కోరిక’ అనే కథలో ప్రభావతి, రాజారావుల పాత్రల ద్వారా పిల్లలపై తల్లిదండ్రుల మమకారం ఏ విధంగా ఉంటుందో విశదీకరించారు రచయిత. తల్లిదండ్రులు పిల్లలపై చూపే ప్రేమకు కొలమానం ఉండదని ఈ కథ ద్వారా తేటతెల్లం చేసారు. బిడ్డలు పుట్టినప్పుడు, ఎదుగుతున్నప్పుడు, విద్యాబుద్ధులు నేర్చుకునేటప్పుడు, ప్రయోజకులయ్యేప్పుడు కన్నవారు ఎంతలా మురిసిపోతారో సోదాహరణగా వివరించారు రచయిత. అంత ప్రేమాభిమానాలు పంచిన కన్నవారికి ఒక్కమాటైనా చెప్పుకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటే వాళ్ళు ఎంత కృంగిపోతారో రాజారావు, ప్రభావతి పాత్రల ద్వారా తెలిపారు.
- భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించిన ఉదయ్ లాంటి సుపుత్రులు ఈ సమాజంలో మనకు ఎక్కడో ఒక చోట తారసపడుతూనే ఉంటారని రచయిత ఈ కథ ద్వారా తెలిపిన విధానం ప్రశంసనీయం. ఒక తల్లి తన కొడుకు ప్రేమకు దూరమై ఎంత మనోవేదనకు గురౌతుందో అమ్మకోరిక కథ ద్వారా వివరించారు. గర్భస్థ శిశువు ఎలా ఉందో, శారీరక పెరుగుదల ఎలా ఉందో తెలుసుకునేందుకు వాడే అధునాతన పరికరాలు గర్భంలో ఉన్న శిశువు జన్మించాక, తల్లిదండ్రుల్ని ఉద్దరిస్తాడో లేదో అనే విషయం ముందే తెలిస్తే బాగుండు కదా అని ప్రభావతి పాత్రతో పలికించడం వెనుక రచయిత సమాజానికి ఇచ్చే సందేశం విదితమౌతుంది.
- ‘అరుణోదయం’ అనే కథలో విద్య అనేది మనిషిని ఏవిధంగా మహర్షిగా మారుస్తుందో రచయిత తెలిపారు. విద్యకి, విజ్ఞానానికి పేదరికం అనేది ఒక అడ్డంకి మాత్రమేనని, దానిని అధిగమించి ముందుకెలా వెళతామో, అందుకు సమాజంలోని వివిధ రకాల మనస్థత్వాలు గల వ్యక్తులు ఎలా కారణమౌతారో ఈ కథలో రచయిత తేటతెల్లం చేశారు. ఒక వ్యక్తి విజయానికి పొగడ్తలు, అభినందనలు, ప్రోత్సాహకాలే కాకుండా తిట్లు, తిరస్కారాలు కూడా ఎలా దోహదం అవుతాయో అరుణోదయం కథలో వివరించారు. అరుణ లాంటి పాత్ర ద్వారా సరైన సందేశం ఇవ్వాలనుకున్నారు రచయిత. చేనేత కార్మికుల కష్టాలను ఈ కథలో వివరిస్తూ వారిని ఎలా అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించాలో వివరించారు.
- ఈ కథ ద్వారా ఉపాధ్యాయులకు ఇచ్చిన సందేశమేమంటే కుల, మత, వర్గ, వర్ణ భేదాలు చూపకుండా తమ వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు.వ్యక్తి చేతిలో వ్యవస్థ తీర్చిదిద్దబడుతుందనడానికి నిదర్శనం గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి అని ఈ కథలో సోదాహరించారు రచయిత.
4. పాదసూచికలు:
- అమ్మ కోరిక కథా సంపుటి - అమ్మ కోరిక కథ - పుట. 49, 50.
- అమ్మ కోరిక కథా సంపుటి - అమ్మ కోరిక కథ - పుట. 50.
- అమ్మ కోరిక కథా సంపుటి - అమ్మ కోరిక కథ - పుట. 51.
- అమ్మ కోరిక కథా సంపుటి - అమ్మ కోరిక కథ - పుట. 51, 52.
- అమ్మ కోరిక కథా సంపుటి - అమ్మ కోరిక కథ - పుట. 55, 56.
- ఆమే గెలిచింది కథా సంపుటి - అరుణోదయం - పుట. 44.
- ఆమే గెలిచింది కథా సంపుటి - అరుణోదయం - పుట. 45.
- ఆమే గెలిచింది కథా సంపుటి - అరుణోదయం - పుట. 41.
- ఆమే గెలిచింది కథా సంపుటి - అరుణోదయం - పుట. 47.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణమూర్తి, ఇరివెంటి. తెలుగు కథా రచయితలు. ఆంధ్ర ప్రదేశ్ సాహితీ అకాడమీ. హైదరాబాద్. 1982.
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాలెం. కథాంశం. తారక్‌నాథ్ కాలనీ, అనంతపురం. 2006.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. 1988.
- నాగభూషణ శర్మ, మొదలి. తెలుగు నవలావికాసం. ---, హైదరాబాద్. 1974.
- రామారావు, కాళీపట్నం. కథాకథనం. స్వేచ్ఛాసాహితీప్రచురణలు, విజయవాడ. 1990.
- లక్ష్మీరంజనం, ఖండవల్లి. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి. బాలసరస్వతి బుక్ డిపో, కర్నూల్. 1957.
- వల్లంపాటి, వెంకట సుబ్బయ్య. నవలాశిల్పం. విశాలాంద్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. 1989.
- సత్యనారాయణమూర్తి, ఎమ్.ఆర్.వి. అమ్మకోరిక. కథాసంపుటి. రమ్య గాయత్రి పబ్లికేషన్స్, పెనుగొండ. 2002.
- సత్యనారాయణమూర్తి, ఎమ్.ఆర్.వి. ఆమే గెలిచింది కథా సంపుటి. రమ్య గాయత్రి పబ్లికేషన్స్, పెనుగొండ. 2010.
- సుజాతారెడ్డి, ముదిగంటి. తెలుగు నవలానుశీలనం. ---, హైదరాబాద్. 1990.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.