AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. "లాంగ్ మార్చ్" నవల: తెలంగాణ ఉద్యమనేపథ్యంలో ప్రజాజీవనచిత్రణ
డా. బండారి ప్రేమ్ కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్,
హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9492788752. Email: bandari.premkumar2014@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ప్రజాజీవనాన్ని, ఉద్యమ పరిస్థితులతో మమేకం చేసి “లాంగ్ మార్చ్” నవలను పెద్దింటి అశోక్ కుమార్ రూపొందించారు. ఈ నవల అంతా తెలంగాణ యాస, నుడికారాలు, చక్కని పదబంధాలతో గ్రామీణ జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఉద్యమం అనగానే ఏదో ఒక వర్గం వారి పోరాటమే అని, వారి కోణంలో నుంచి మాత్రమే ఉద్యమాన్ని చూస్తాం. కానీ అసలైన ఉద్యమ పోరాటం శ్రామిక వర్గాల వారిదే అని, ఉద్యమ ఫలితాల్లో వారిని పరిగణలోకి తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని, శ్రామిక వర్గం నుంచి వచ్చిన రాయమల్లు, నవలా ముగింపులో నాయకుడిగా ఎదిగిన తీరు గమనిస్తే లాంగ్ మార్చి నవల ఉద్దేశం అర్థమవుతుంది. ఉద్యమసమయంలో ప్రజల ఆలోచన, ధోరణి వివరిస్తూ, గ్రామాల్లో వస్తున్న పెనుమార్పులకు సామాజిక స్పృహ కలిగి, బాధ్యతతో మెలిగే వారు కొందరైతే, ఆ మార్పుల్ని ఎలా స్వీకరించాలో తెలియక నిస్సహాయ స్థితిలో, తటస్థంగా ఉండి పోయేవారు మరికొందరు. అటువంటి ప్రజా జీవనాన్ని చిత్రించింది ఈ నవల. లాంగ్ మార్చ్ నవలా మూల గ్రంథాన్ని సేకరించి, రెండుసార్లు అధ్యయనం చేసి, రచయితతో చర్చించాను. ఉద్యమనేపథ్యానికి సంబంధించిన గ్రంథాలను సేకరించి, వాటిలోని అంశాలతో మూలగ్రంథంలోని అంశాలను సమన్వయించి, విశ్లేషణాత్మకపద్ధతిలో ఈ పరిశోధనవ్యాసాన్ని తీర్చిదిద్దడమైనది.
Keywords: నవల, ఉద్యమం, అస్తిత్వం, సామాజిక స్పృహ, సమాజం.
1. ఉపోద్ఘాతం:
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, మేధావి వర్గం మాత్రమే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించలేదు. ఏరోజుకారోజు కూలి పని చేసుకునే శ్రామికవర్గం కూడా ఆకలి, దప్పులను మరచి తమ సర్వస్వాన్ని త్యజించి, భవిష్యత్ తరాలకై ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరూ ఏ విధంగా ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు అనే విషయాన్ని ప్రారంభం నుంచి ఉద్యమం మలుపు తిరిగే వరకు వారిలో చైతన్యం వెల్లివిరిసిన క్రమాన్ని ఎంతో ఔచిత్యవంతంగా, పరిణతి చెందిన పరిస్థితుల్ని, ఒక వరుస క్రమంలో ప్రోది చేసుకుని సంఘటనల్ని ఆవిష్కరిస్తూ, ప్రజాఉద్యమనేపథ్యంలో లాంగ్ మార్చ్ నవల వెలువడింది.
ఉద్యమ సంఘటనలను ఒక వరుస క్రమంలో చూస్తే, రెండు వర్గాల వారీగా అంటే ఉద్యమాన్ని ఉదృతం చేసేవారు ఒక వర్గం అయితే, దాన్ని ముందుకు సాగనివ్వకుండా ఆపేసే ప్రయత్నాలు చేసే వర్గం మరోవైపు కనిపిస్తాయి. ఈ రెండు వర్గాల ఘర్షణే నవలాసారం అని మనకు అనిపిస్తుంది. కానీ ముగింపు వచ్చేసరికి ఒక కొత్త కోణాన్ని మనం చూడగలుగుతాం. అస్తిత్వానికై పోరాటం తప్పదు అని తెలిసినా తమకు ఉన్న ఆర్థిక కుటుంబ బాధ్యతలకు జడిసి అచేతనంగా ఉన్నవారు మరికొందరు. ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి, వస్తున్న పరిణామాల్ని విశ్లేషించుకుని, కుటుంబ బాధ్యతల కంటే రేపటి భవితకై ఆలోచించి తమని తాము ఉద్యమంలో సమిధలుగా అర్పించుకుంటూ ప్రజా నాయకులుగా ఎదిగిన తీరు... “నాయకుడు” అనే పదానికి అసలైన సిసలైన అర్ధాన్నిస్తుంది ఈ నవల.
2. రచయిత పరిచయం:
పెద్దింటి అశోక్ కుమార్ కరీంనగర్ జిల్లా గంభీరావు పేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన "లాంగ్ మార్చ్" అనే నవలలో "కాలం చరిత్రలోని కొన్ని పేజీలను శిలాక్షరాలతో రాసుకుంటుంది. కొన్ని సంఘటనలను మైలురాళ్ళుగా వేసుకుంటుంది. అవసరాలకనుగుణంగా తనకు తానే ఉద్యమాలను నిర్మించుకుంటుంది. దానికి తగిన నాయకులను తానే తయారు చేసుకుంటుంది. గతంలోని గాయాల సలపరింత వర్తమానాన్ని దిశా నిర్దేశం చేస్తే, భవిష్యత్తుకు కాలమే వర్తమానంమీద పునాదులను వేసుకుంటుంది. అవి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. అలా కాలం రాసుకున్న రాతలే తెలంగాణ ఉద్యమం. వేసుకున్న మైలురాయే మిలియన్ మార్చ్. తెలంగాణ ఉద్యమంలో ఇదొక కీలక మలుపు. యావత్ తెలంగాణను ఉత్తేజం చేసిన ఒక భాస్వరం" అని పెద్దింటి అశోక్ కుమార్ ఈ నవలలో తన మాటల ద్వారా ఈ రచన యొక్క వైశిష్ట్యాన్ని చెప్పుకున్నారు.
ఆయన చెప్పుకున్నట్లుగానే ఈ లాంగ్ మార్చ్ నవలలో
మిలియన్ మార్చ్ పిలుపుతో టాంక్ బండ్ చేరుకోవాలనే పల్లె జనం బలమైన కోరికను ప్రతిబింబిస్తూ, పల్లె రైతు
జీవితాన్ని నేపథ్యంగా తీసుకుని మిలియన్ మార్చ్ కి ముందు, తర్వాత ఉద్యమపరిణామాలను విశ్లేషించారు. ఈ లాంగ్
మార్చ్ నవలకు నవతెలంగాణ దినపత్రిక వారి దాశరథి రంగాచార్య స్మారకనవలల పోటీ (2016)లో ప్రథమ బహుమతి
వచ్చింది.
3. రచనా శైలి:
అశోక్ కుమార్ కథావస్తువుల ఎంపికలో వైవిధ్యాన్ని కనబరుస్తారు. తన కళ్ళ ముందు జరిగే పరిస్తితుల నుంచి కథా వస్తువును వెతికి పట్టుకోగల నైపుణ్యం గల వ్యక్తి. "ఆధునికీకరణ సంక్షోభాన్ని చూసి తట్టుకున్నవాడు క్షేమంగా నిలబడతాడు. తట్టుకోనివాడు పిచ్చివాడన్నా అవుతాడు, లేదా రచయితైనా అవుతాడు. అందుకే నే రచయిత అయిన" అని పెద్దింటి అశోక్ కుమార్ చెప్పుకున్నారు. దీనిని బట్టి వీరి రచనాశైలి అర్థమౌతోంది.
ఈ రచయిత ఆరు నవలలు ఇదే శైలిలో కనిపిస్తాయి. అవి: (1) జిగిరి (2) దాడి (3) సంచారి (4) ఎడారి మంటలు (5) లాంగ్ మార్చ్ (6) ఊరికి ఉప్పలం.
4. "లాంగ్ మార్చ్" నవల - తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజాజీవన చిత్రణ:
గ్రామీణ వాతావరణంలోని వ్యక్తుల మనస్తత్వాలను ఒడిసి పట్టుకుని ఆ పాత్రలే మన కళ్ళ ముందు కదలాడుతున్నాయా అనిపించేలా పాత్రల్ని సహజంగా చిత్రీకరించాడు.
"చూసినవా చిన్నగా ఒకలమీద రెండు దెబ్బలు పడితేనే ఏదో కొంపలు అంటుకుపోయినట్లు అన్ని పార్టీలు ఒక్కటైనాయి మరి మన పోరగండ్లు అంతమంది సచ్చినా, అన్ని దెబ్బలు తిన్నా మన పార్టీల వాళ్ళు ఒక్కటి కాకపోయిరి. వాళ్ళయే ప్రాణాలు కానీ మనయి కావా" (అశోక్ కుమార్. పెద్దింటి , ‘లాంగ్ మార్చ్ నవల’. పుట.సం.43) అని ఛానల్ మార్చాడు.
సామాన్య ప్రజానీకం ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి తమ శాయశక్తుల్ని ఒడ్డి, సమర్థవంతంగా పనిచేస్తుంటే, మరోవైపు కొన్ని రాజకీయ శక్తులు ఉద్యమాన్ని ఆవిరిగార్చే ప్రయత్నం చేస్తాయి. అందులో ఏ రాజకీయ వర్గానికి నష్టం వాటిల్లినా రాజకీయ శక్తులన్నీ ఒక్కతాటిపై నిలిచి తమ ఐక్యతను తెలియజేస్తాయి. కానీ అదే సామాన్య ప్రజల విషయంలో నిర్లక్ష్యపు ధోరణి కనిపిస్తుంది. ఉద్యమంలో సమిధలుగా మారిన సాధారణ పేద, బడుగు, బలహీనవర్గాల పట్ల ఎవరికి పట్టింపు ఉండదు, వాళ్ల త్యాగాలకు గుర్తింపు ఉండదు. ఇటువంటి సంఘటనలు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జరిగాయి. ఆ సంఘటనలను కళ్ళారా చూసిన వారు కావటం వల్ల రచయిత, పెద్దింటి అశోక్ కుమార్ ఈ నవలలో ఎంతో వాస్తవిక దృష్టి కోణంతో ఆవిష్కరించారు. ఈ నవలలోని సంఘటనల్ని, ఉద్యమ పరిస్థితుల్ని, ఉద్యమ పరిణామాల్ని విశ్లేషించుకుంటే ఈ నవల ప్రజా పక్షం వహించి, ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన నవల అని చెప్పవచ్చు.
4.1 ఉద్యమపరిణామాలు:
రాయమల్లు ఉద్యమనాయకుడుగా ఎదిగే క్రమంలో జరిగినటువంటి పరిణామాలను విశ్లేషించుకుంటే, సామాన్య రైతు అయిన రాయమల్లు, ఆ ఊరి జె.ఎ.సి నాయకులకు పరిచయమే లేని అతడు ఆ ఉద్యమానికి ఆధారం అయ్యాడు. ఉద్యమంపై అభిమానం ఉన్నా ఒక సగటు గ్రామీణ కూలీ రైతుకు ఉండే భయంచేత, ఆ సమాజంలోని పరిస్థితుల దృష్ట్యా ఆరంభంలో ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు కాదు. ఉద్యమానికి అవసరమైన సమయంలో తానే ముందుండి ఉద్యమాన్ని నడిపే స్థాయికి చేరుకుంటాడు.
"నీలాంటి వాళ్ళు ఊరికి పదిమంది ఉన్నా చాలు, ఇంతదాకా మేము లేకుంటే ఉద్యమం లేదని బాధపడేవాళ్ళం, ఇప్పుడు నువ్వున్నావన్న ధైర్యం ఉంది." (అశోక్ కుమార్. పెద్దింటి , ‘లాంగ్ మార్చ్ నవల’ పుట.సం.73) ఉద్వేగంగా అంటూ రాయమల్లును దగ్గరగా గుండెకు హత్తుకున్నాడు దశరథం.
నాయకుడే ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాడని, అతడి పోరాటం ఫలితంగానే ఉద్యమం ఉదృతంగా మారి తన లక్ష్యాన్ని సఫలీకృతం చేసుకుంటుందని, మనకు బాహాటంగా అనిపించినా అంతర్లీనంగా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే వాస్తవంగా అవసరం, సామాజిక ఘర్షణ, అస్తిత్వం అనేవి ఉద్యమానికి కావలసిన నాయకుడిని ఎన్నుకుంటాయి. నాయకుడంటే ఒక్కసారిగా ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తి రూపుదిద్దుకోవు. ఆయా సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎవరిలో అయితే ఒక సంవేదన, ఒక సంఘర్షణ, తమ ఉనికి విషయంలో ఒక సుస్పష్టమైన అవగాహన ఉంటుందో? తమకు ఏం కావాలో ఆలోచించుకునే ఎరుక ఉంటుందో? అటువంటి ప్రజల్లో నుంచి నాయకుడు పుట్టుకొస్తాడు. అంటే ఉద్యమమే నాయకుడిని తయారు చేస్తుంది.
ఈ నవలలో ప్రజల్లో ఒక్కడిగా మెలిగిన, ఏ మాత్రం తెగువలేని ఒక సాధారణ రైతు అయిన రాయమల్లు ఉద్యమంలో పాలుపంచుకోవడంలో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని చూపించిన తీరు, రాయమల్లు వ్యక్తిత్వంలో కలిగిన మార్పును గమనిస్తే నాయకుడు ఏర్పాటు చేసుకున్న ఉద్యమం కంటే ఉద్యమం ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా రాయమల్లు సఫలీకృతం అయ్యాడు.
రాయమల్లు ఇంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికి స్వేచ్ఛగా, బాహాటంగా ఉద్యమంలో తిరగకపోవటానికి గల కారణం, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితగతులే. ఆ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే వ్యక్తులు, వారి బాధ్యతలు, సమాజం వారిని చూసే విధానం వంటి అనేక అంశాలు రాయమల్లుని ప్రభావితం చేసాయి.
4.2 ఉద్యమనేపథ్యం - స్త్రీలు:
గ్రామీణ ప్రాంతంలోని రైతు కుటుంబాలలోని స్త్రీలు కుటుంబ భారాన్నంతా ఒక వైపు మోస్తూ, మరోవైపు వ్యవసాయ పనుల్లో తమ వంతు పనులను సమర్థవంతంగా పూర్తిచేస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుతారు. అలా కుటుంబాన్ని తీర్చిదిద్దుకునే గ్రామీణ స్ర్తీ పాత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ లలిత పాత్ర.
గ్రామీణ సమాజంలోని కుటుంబాలు తమకోసం కంటే, సమాజం కోసమే ఎక్కువగా జీవిస్తారు. అలాంటి సమాజంలోని లలిత, ఆ సమాజానికి భయపడే, రాయమల్లు ఉద్యమాల్లో తిరగడం ఇష్టం లేదని ఎప్పుడూ గొడవ చేస్తుండేది. లలితకి ఉద్యమం అంటే ఇష్టమే. కాని దానివల్ల భర్త రాయమల్లుకి ఏం జరుగుతుందో అని భయపడుతుంది.
రాయమల్లుతో ఇంతలా గొడవపడే లలిత, పోలీసులు రాయమల్లును అరెస్ట్ చేయడానికి వచ్చినపుడు "ఇద్దరు పోలీసులు రాయమల్లు చేతులు అందుకున్నారు. వారి మద్యలోకి వచ్చి ధైర్యంగా చూస్తూ మీరెవలు.. అయినను ఎందుకు పట్టుక పోతున్నారు." (అశోక్ కుమార్ .పెద్దింటి, ‘లాంగ్ మార్చ్ నవల’ పుట.సం.79) అడిగింది లలిత. అడ్డుగా వెళ్ళిన లలితను పక్కకునెట్టి రాయమల్లును జీపులో వేయగా దిగడానికి చూసిన రాయమల్లు పై కట్టెతో పోలీస్ ఒక్క దెబ్బ వేసాడు. ఆ దెబ్బ తనమీదనే పడ్డట్టు లలిత విలవిలలాడింది.
ఈ సంఘటనను బట్టి చూస్తే లలితకు భర్తపై ఉన్న ప్రేమ,
అభిమానాన్ని రచయిత పాఠకుల మనసుకు హత్తకునేలా ఆవిష్కరించారు.
5. ముగింపు:
1) గ్రామీణ పల్లెలు కల్మషం లేకుండా బంధాలకు, అనుబంధాలకు విలువనిస్తూ మానవీయతకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటాయి. అలాంటి పల్లెల్లో రాజకీయశక్తుల జోక్యం ఎలా ఉంటుంది? కనిపించకుండా అవి పల్లె ప్రజల జీవితాన్ని ఎలా చిద్రం చేస్తున్నాయి? గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్ని ఏ విధంగా అసందిగ్ధ పరిస్థితుల్లో నెట్టివేస్తున్నాయి? అనే అంశాలు ఈ నవలలు ప్రస్తావించారు.
2) పల్లె ప్రజల సామాజిక, ఆర్థిక, మానవీయ సంబంధాలను రాజకీయ శక్తులు విచ్చినం చేసిన సంఘటనలు చిత్రించబడ్డాయి. ఉద్యమ సమయంలో ప్రజల ఆలోచన ధోరణి వివరిస్తూ, గ్రామాల్లో వస్తున్న పెను మార్పులకు సామాజిక స్పృహ కలిగి, బాధ్యతతో మెలిగే వారు కొందరైతే, ఆ మార్పుల్ని ఎలా స్వీకరించాలో తెలియక నిస్సహాయ స్థితిలో, తటస్థంగా ఉండి పోయేవారు మరికొందరు. అటువంటి ప్రజా జీవనాన్ని చిత్రించింది ఈ నవల.
3) అస్తిత్వానికై పోరాటం తప్పదు అని తెలిసినా తమకు ఉన్న ఆర్థిక కుటుంబ బాధ్యతలకు జడిసి అచేతనంగా ఉన్నవారు మరికొందరు. ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి, వస్తున్న పరిణామాల్ని విశ్లేషించుకుని, కుటుంబ బాధ్యతల కంటే రేపటి భవితకై ఆలోచించి తమని తాము ఉద్యమంలో సమిధలుగా అర్పించుకుంటూ ప్రజా నాయకులుగా ఎదిగిన తీరు... “నాయకుడు” అనే పదానికి అసలైన సిసలైన అర్ధాన్నిస్తుంది ఈ నవల.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అశోక్ కుమార్, పెద్దింటి. (2019) లాంగ్ మార్చ్. ఆన్విక్షికి ప్రచురణ, హైదారాబాద్.
- నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి. అక్టోబర్ (2011), తెలంగాణ చరిత్ర. తెలంగాణ పుస్తకాలుప్రచురణ సంస్థ, హైదరాబాద్.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. (1996) నవలాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి.(1994) కథాశిల్పం. ప్రథమ ముద్రణ, జనవరి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- స్వరాజ్యం, కాపర్తి. (2021) ‘లాంగ్ మార్చ్’ నవల తెలంగాణ మలిదశ ఉద్యమచిత్రణ (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం). కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.