headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. అన్నమయ్య అధ్యాత్మసంకీర్తనలు: సంభాషణల వైచిత్రి

dr_k_raja.jpg
డా. కంకిపాటి రాజా

తెలుగు పరిశోధకులు
చోడవరం గ్రామం, కొండపి మండలం,
ఒంగోలు - 523279. ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9948075858, 9393044419. Email: dr.rajasinger@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తాళ్ళపాక అన్నమాచార్యులు 1408-1503 సం.ల మధ్య కాలానికి చెందిన సంకీర్తనాచార్యులు. అన్నమయ్య సంకీర్తనలలోని సంభాషణల వైచిత్రిని రేఖామాత్రంగా పట్టి చూపడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ఇందుకు ప్రధానాకరం- శ్రీ తాళ్ళపాక అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు- ఒకటవ సంపుటం. ఈ సంపుటాన్ని శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు పరిష్కరించారు (తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణ 1998). ఈ గ్రంథం ఆధారంగా ఎంపిక చేసిన అధ్యాత్మ కీర్తనల్లో సంభాషణల వైచిత్రిని 1. అంతర్యామి తత్వం, 2. పశ్చాత్తాపం, 3. నిందాత్మకం, 4. సేవ, 5. ప్రతాపంగా వింగడించి ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: విసంభాషణల వైచిత్రి, Dialogue, అన్నమయ్య సంకీర్తనావైభవం, భాషణ, పరిభాషణ, converse, conference.

1. పరిచయం:
తాళ్ళపాక అన్నమాచార్యులు క్రీ.శ. 1408లో తాళ్ళపాక గ్రామంలో లక్కమాంబ, నారాయణసూరి దంపతులకు జన్మించారు. తన 16వ ఏట సంకీర్తనా రచనకు శ్రీకారంచుట్టారు. చిన్నతనంలో ఆయన గురువులెవరో తెలుసుకొనేందుకు ఇదమిత్థమైన ఆధారాలు లేవు. యవ్వనంలో ఘనవిష్ణువు, శఠగోపయతి అన్నమయ్యకు సంకీర్తన రచనలోని మెళకువలు నేర్పారని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అన్నమయ్య సంకీర్తనలలోని సరళత, మాధుర్యత, భావగంభీర్యతలకు ముగ్ధులుకాని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. అందువల్లనే అవి, పదికాలాలపాటు మనగలుగుతూ మనల్ని అలరిస్తున్నాయి.

2. అన్నమయ్య సంకీర్తనల వైభవం:

తెలుగు నాట అన్నమయ్య కీర్తనలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆ సంకీర్తనల స్వరూప స్వభావాలను, వాటి వైభవాన్ని, ఆయన మనుమడైన చినతిరుమలయ్య ఇలా తెలియజేశారు.

శ్రుతులై, శాస్త్రములై, పురాణముఖులై, సుజ్ఞానసారంబులై
యతిలోకాదమవీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై
కృతులై, వేంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,
నుతులై, తాళులపాక యన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్” (సంకీర్తనా లక్షణసారము: 12వ పద్యం)

పై పద్యంలో అన్నమాచార్య కీర్తనలను మంత్రాలుగా, శాస్త్రాలుగా, నీతి, జ్ఞానసారాలుగా, పురాణ సారాంశాలుగా, యతులు సంచరించే పుణ్య స్థలాలుగా, వేదశాస్త్ర మంత్రాలకు అర్థం చెప్పేవిగా, వెంకటేశ్వరుని రతి క్రీడా రహస్యాలను తెలియజేసేవిగా... చినతిరుమలయ్య వర్ణించారు. ఇటువంటి సంకీర్తనలలో- అన్నమయ్య వివిధ రీతులుగా సాగించిన సంభాషణలలో కొన్నిటిని ఇక్కడ గమనిద్దాం.

3. సంభాషణ- అర్థ వివరణలు:

‘భాష్యతీతి భాష’ అని సంస్కృత వైయ్యాకరుణులు భాషను నిర్వచించారు. ‘భాషణ’ అనే పదానికి ‘సం’ అనే ఉపసర్గ చేరి సంభాషణ అయింది. క్రీస్తు పూర్వం 428 నుండి 347 మధ్య కాలంలో ప్లేటో, అరిస్టాటిల్ పండితులు ‘dialog’ అనే మాటను సంభాషణ అనే అర్థంలో వాడారు. తదనంతర కవులు, నాటకవేత్తలు తమ రచనల్లో ఒకరితో ఇంకొకరు జరిపే భాషణను, సంభాషణగా స్వీకరించారు.

డైలాగ్ అనేది ఒక సాహిత్య లేక రంగస్థల రూపకం. ఇద్దరు, అంతకన్నా ఎక్కువమంది మధ్య లిఖిత రూపంలో గానీ, మాటల రూపంలోగానీ జరిగే సంభాషణే డైలాగ్. చారిత్రక మూలాలున్న ఇతివృత్తం, తత్వబోధ, లేక ఉపదేశం లాంటి వాటితో కూడిన గ్రీకు, భారతీయ సాహిత్యాలలోనూ, ప్రాచీన కళారూపాలలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వేదాలు, పురాణాది గ్రంథాల్లో సంభాషకు విస్తృతమైన స్థానం కల్పించడాన్నికూడా గమనించవచ్చు.

బహుజనపల్లి సీతారామయ్యగారు తాను కూర్చిన శబ్దరత్నాకరంలో ‘సంభాషణము’ అనే పదానికి “చక్కగా మాట్లాడడం” (సీతారామయ్య, బహుజనపల్లి.1912:151) అని అర్థం చెప్పారు. జి. ఎన్. రెడ్డిగారు తన పర్యాయ పద నిఘంటువులో ఉపసంభాషణము, గోష్ఠి, చాటుకము, జల్పము, పరిభాషణము, పురుటము, సంఘావము, సంగీతి, సంజల్పము, సంప్రదవనము అనే పర్యాయపదాలను ఇచ్చారు. బ్రౌణ్య నిఘంటువులో సి. పి. బ్రౌన్‌ converse అనే పదానికి సంభాషము, సంభాషణము సమలాపము, సల్లాపనము, సల్లాపము అనే అర్థాలను పేర్కొన్నారు. శంకరనారాయణగారు తన ఆంగ్ల తెలుగు నిఘంటువులో converse అనే పదానికి discourse, talk, conference అనే అర్థాలను ఇచ్చారు.

కొందరు కవులు, వాగ్గేయకారులు, ఈ అర్థాన్ని మరింత విస్తృతం చేశారు. ‘సంభాషణ’ అనే మాటకు సరస సల్లాపాలు, అంతరంగంలో తనకు తానుగా మాట్లాడుకోవడం, ప్రార్థించడం, దేవునికి తన గోడు వినిపించడం, తిట్టడం, పొగడడం, మెచ్చుకోవడం లాంటి అర్థాలనిచ్చారు. భగవంతుడిని భక్తుడు తన మనసులో ఆవిష్కరింపజేసుకొని విచారం, సంతోషం, దుఃఖం మొదలైన భావాలను వ్యక్తపరుస్తాడు లేదా నివేదించుకొంటాడు. గుడిలో దేవునికి దండం పెడుతూ తమ కోరికలను నివేదించుకోడం, చర్చిలలో ప్రార్థనలు, మసీదుల్లోచేసే నమాజులు ... ఇలా అనేక మతాల్లో ఉన్న ఆయావిధాల ఆరాధనలన్నీ సంభాషణలే. కొన్ని ‘సంభాషణలు’ పరస్పరం సాగేవి. మరికొన్ని ఊహాత్మకాలు. మరికొన్ని బహిరంగాలు. ఇంకొన్ని ఆంతరంగికాలు లేదా ఆంతరికాలు.

భక్తుడు దేవునితో ఆత్మగతంగా సంభాషిస్తాడు. భగవంతుడు నేరుగా తన భక్తులతో సంభాషించిన సందర్భాలను పురాణేతిహాసాదిగ్రంథాల్లో మనం గమనించగలం. ఈ సంభాషణలను ఆలంబనగా చేసుకొని కవులు వివిధ భాషల్లో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ‘ఆడిన మాటెల్ల అమృతకావ్యంగా, పాడిన పాటెల్ల పరమగానంగా సాగింద’ ని అన్నమయ్యను గురించి చినతిరుమలయ్య చెప్పినది ఇందువల్లనే. అన్నమయ్య ఎవరితో సంభాషించాడు? ఎలా సంభాషించాడు? ఎందుకు సంభాషించాడు? ఎప్పుడు సంభాషించాడు? ఎవరి గురించి సంభాషించాడు? ... మొదలైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. సంకీర్తనలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్నమయ్య స్వామితో, నీతో నాతో, మనతో, సమాజంతో, చెట్టుతో, పుట్టతో, లోకంలోని ప్రాణులతో... అందరితోనూ సంభాషిస్తుంటాడు. కవిత్వంలో ఇటువంటి సాధ్యతలకు అవకాశం ఎక్కువ. ఆ రకంగా - ప్రపంచ భాషల్లోని సాహిత్యమంతా సంభాషణామయమే!
పత్రరచనకు ఎంచుకొన్న ప్రథమసంపుటం ఆధారంగా అన్నమయ్య సంభాషణలను కిందపేర్కొన్న విధంగా విభజించవచ్చు.

3.2.1. స్వామితో సంభాషణలు:

ఈ సంభాషణలను మరలా 1. అంతర్యామి తత్వం 2. పశ్చాత్తాపం, 3. నిందాత్మకం 4. సేవ, 5. ప్రతాపంగా వింగడించవచ్చు.

3.2.1.1 అంతర్యామితత్వం:

అన్నమయ్య కీర్తనల్లో కొన్ని అంతర్యామి తత్వాన్ని ప్రబోధిస్తాయి. అంటే, లోకంలోని సచరాచర కోటిలోనూ కొలువైన స్వామిని ఆరాధించడం. ఆ పద్ధతిని ఇటువంటి సంకీర్తనల్లో మనం గమనించగలం.

ఉదా:

పల్లవి.   “ఎవ్వరిగాదన్ననిది నిన్నుగాదంట
            ఎవ్వరిగొలిచిన నిది నీ కొలువు
            చరణం అవయవములలో నదిగాదిదిగా
            దవిమేలివి మేలననేల
            భువియు బాతాళము దివియునందలి
            జంతు నివహమింతయును నీ దేహమే కాన” (సంపుటం 1-9 పుట. 6)

‘ఏ దేవుని ఆరాధించినా అది నీకే చెల్లుతుంది. శరీరావయవాలలో ఒకటి మేలైనదిగా, మరొకటి తక్కువగా ఎంచడం సాధ్యపడదు. భూమిలో, పాతాళాది లోకాలలోని సర్వ ప్రాణకోటిలో నీవే ఉన్నావు. కాబట్టి ప్రాణుల పట్ల భేదభావం చూపరా’దని అన్నమయ్య ఈ సంకీర్తనలో స్వామితో సంభాషించారు.

“ఏది చూచినా నీవే” అనే సంకీర్తనలో “ఇరువుకొని రూపమ్ములిన్నిటానుగలనిన్ను బరికింపవలెగాని భజియించరాదు”. (సంపుటం1-60. పుట.40.) 

‘ఇన్ని రూపాల్లో ఒదిగి ఉన్న నిన్ను పరిశీలించి చూడనవసరం లేదు. సూర్య కిరణాలు ప్రపంచమంతా వ్యాపించినట్లుగా దేవతలందరిలో నీవే కొలువై ఉన్నా’వని చెప్పారు.

“ఈ సురలీ మునులీ చరాచరములు” అనే కీర్తనలో “ఒకరూపై నీవు ఉండుచుండగ మరి తక్కినరూపములు తామెవ్వరు?” (సంపుటం1-93 పుట.64.) అని ప్రశ్నించారు. 

అన్నమయ్య పరమాత్మలోని అంతరార్థాన్ని, సృష్టిలోని ఏకాత్మవాదాన్ని సునిశితంగా విశ్లేషించారు. యెదుటివారిలో పరమాత్మను చూడగలిగిన వాడే నిజమైన మానవుడు అనే సారాంశాన్ని అనేక సందర్భాలలో, అనేక సంకీర్తనలలో అన్నమయ్య విపులీకరించారు.

3.2.1.2 పశ్చాత్తాపం:

జరిగిన లేదా చేసిన పొరపాట్లకు నన్ను క్షమించమని స్వామిని వేడుకోవడం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అన్నమయ్య చేసే ఇటువంటి సంభాషణల్లో పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరుకోటం కనిపిస్తుంది.


ఉదా:

పల్లవి    “ఎవ్వారు లేరు హితవు చెప్పగ వట్టి
            నవ్వులబడినేము నొగిలేమయ్యా
            చరణం అడవిబడినవాడు వెడలజోటులేక
            తొడరి కంపలకింద దూరినట్లు
            నడుమ దురిత కాననముల తరిబడి
            వెడలలైక నేము విసిగేమయ్యా”. (సంపుటం1.15. పుట.10.)

ఈ కీర్తనలో మంచి, చెడులను చెప్పేవారు లేకపోతే కలిగే దుష్పరిణామాలను పేర్కొన్నారు. అడవిలో దారి తప్పి, ముళ్ళకంపలో చిక్కుకున్నవాడితో, మాధుర్యానికి బదులు చేదు తిన్న అజ్ఞానితో, ఇతరులవెంట తిరిగే వెర్రివాడితో అన్నమయ్య తనను తాను పోల్చుకొన్నారు. 

నీవేకానింక నేనన్యమెరుగ” (సంపుటం1.17.పుట.11.) అనే కీర్తనలో కోట్లకొలది అపరాధాలు, పాపాలు చేసిన నన్ను, నువ్వు తప్ప ఎవ్వరూ రక్షించలేరని ఆ స్వామిని వేడుకొంటున్నారు.

ఎన్నిలేవు నాకిటువంటివి!” అనే కీర్తనలో “కరచరణాదులు కలిగించిన నిన్ను పరికించి నీ సేవాపరుడ గాలేనైతి”. (సంపుటం1.31. పుట.20.) ‘మోక్షానికి దూరంగా తిరిగానని వాపోయారు. 

పరమపాతకుడ భవబంధుడ” అనే కీర్తనలో “కపట కలుష పరికర హృదయుడ నే నపవర్గమునకు నర్హుడనా?” (సంపుటం1.33. పుట.21) అంటూ ఆత్మ పరిశీలన చేసుకున్నారు. 

“అతిదుష్టుడ నేనలఘుడను” అనే కీర్తనలో “ఎక్కడనెన్నిట ఏమిసేసితినో నిక్కపుదప్పులు నేరములు” (సంపుటం1.78. పుట.54) అంటూ - తెలిసీతెలియక చేసిన తప్పులను క్షమించి, మరల అటువంటి తప్పులు చేయనవసరం కలగని వివేకాన్ని దయచేయ’ మని స్వామిని పశ్చాత్తాపంతో వేడుకున్నారు.

3.2.1.3 నిందాత్మక సంభాషణలు:

ఈ సంభాషణలను దైవనింద, స్వయం నింద సంభాషణలుగా వింగడించవచ్చు.

1) స్వయం నింద:

ఈ సంకీర్తనల్లో అన్నమయ్య తనను తాను నిందించుకోవడం కనిపిస్తుంది. ఈ నిందలు సహ భక్తులకు ఉపదేశాత్మకంగా ఉంటాయి.

ఉదా:

పల్లవి   “చిత్తములో నిన్ను జింతించనేరక
            మత్తుడనై పులుమానిశినైతి
చరణం  అరుతలింగముగట్టి అది నమ్మజాలక
            పరువతమేగిన బత్తుడనైతి
            సరుస మేకపిల్ల జంకబెట్టుక నూత
            నరయు గొల్లనిరీతి నజ్ఞానినైతి”. (సంపుటం 1.19. పుట.13)

కీర్తనలో తనను తాను శివభక్తునిగా భావిస్తూ చేసుకొన్న నింద కనిపిస్తుంది. లింగధారులను- ‘చంకలో మేకపిల్లను పెట్టుకొని ఊరంతా వెదికిన అజ్ఞాని’తో పోల్చారు. తీర్థయాత్రలు చేస్తూ, కొంగుముడుపులు కట్టేవారి భక్తిని ఖండించారు.

2) స్వామి నింద లేదా కరుణను చూపించడం:

స్వామితో పరాచకాలాడడం, ఆటపట్టించడం, అలగడం, వ్యాజ్యాలాడడంలాంటి చేష్టలద్వారా అన్నమయ్య తన నిందాత్మక భక్తిని ప్రదర్శించారు. ఆ విధంగా స్వామిపై తన భక్తి పరిపక్వతను కనబరిచారు.

ఉదా:

పల్లవి “నిన్నుదలచి నీపేరుదలచి
            నన్ను కరుణించితే నెన్నికగాక
చరణం అధికుని గాచుటే మరుదు నన్ను
            నధమునిగాచుట నరుదుగాక
            నీకు మధురమవుటేమరుదు చేదు
            మధురమవుటే మహిలోనరుదుగాక”. (సంపుటం1.27. పుట:18)

ఘనులను కాపాడితే నీ గొప్పదనం ఎలా బయటపడుతుంది?’ అని స్వామిని ప్రశ్నించారు. ‘ఇనుము బంగారమైనట్లుగా, చేదు తీపైనట్లుగా నన్ను ఉత్తముణ్ణి చేయడం నీ విధి’ అని స్వామికి విన్నవించారు. “ఏనిన్ను దూరక నెవ్వరి దూరుదు?” అనే సంకీర్తనలో “అపరాధిగనుక నన్నరసి కావుమని అపరిమిత ఉభయమంది నీకు శరణంటిగాక నెపములేక నన్ను నీకు గావగనేలా? (సంపుటం1.35. పుట:23.) ‘కారణం లేకుండా నన్ను కాపాడతావా!’ అని అన్నమయ్య స్వామిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, పాపినైన నన్ను నువ్వు తప్ప వేరెవ్వరూ రక్షించలేరనే ‘శరణాగత తత్వం’ ఈ సంభాషణలో మనం గమనించవలసిన అంశం.

ఉదా: 

పల్లవి   “తలపు కామాతురత్వముమీద నలవడిన
            నిలనెట్టివారైన నేలాగుగారు!
చరణం పోలి నిరువురు సతుల నాలింగనముసేయ
            లోలుడటుగాన నాలుగు చేతులాయ
            వేలసంఖ్యలు సతుల వేడుకిల రమియింప
            బాలుపడెగాన రూపములు పెక్కాయ”. (సంపుటం1.105. పుట:72.)

స్వామి, అమ్మవారి ఎడబాటులో ఉండగా అన్నమయ్య ఆటపట్టించాడు. లోకంలోని బాధలన్నీ స్వామికి ఆపాదిస్తూ, దాని ఖర్మఫలం అనుభవించమని దెప్పిపొడుస్తూ, ఇవన్నీ నీకు తెలియనివి కాదని ఓదార్చాడు. ఇద్దరు సతులలో- ఒకరు సంపదకు, ఇంకొకరు భూమికి ప్రతీక. ఈ సృష్టిలో ఎవరైనా ఆయన దివ్యమంగళ విగ్రహం చూసి మోహితులు కావాల్సిందే. ఈ సంభాషణలో ఒకవైపు స్వామి కష్టాలను, మరొకవైపు స్వామి తత్వాన్ని, స్వరూపాన్ని విశ్లేషించడం విశేషం.

“ఎన్నగలుగు భూతకోటికి” అనే సంకీర్తనలో ‘లోకాన్ని సంసారంతో కట్టినందుకు నిన్ను యశోద రోటికి కట్టివేసింది. “పట్టి తెచ్చి నిన్ను రోలగట్టివేసి లోకమెరగ” (సంపుటం1.75. పుట:71) గోపసతుల వెంట తిరిగే నిన్ను విభుడు అనవచ్చా? పరుల ఇళ్ళలో దొంగతనం చేశావు కనుక ఆ ఆశ నిన్ను వడ్డికాసులవాణ్ణి చేసిం’దని స్వామిని ఎగతాళి చేశారు. ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే సామెతని స్వామికి అనువర్తింపజేశారు. 

“సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము” అనే కీర్తనలో నిర్దాక్షిణ్యంగా నీకు సంసారంతో ముడివేశారని “మగుడ మారుకుమారు మగువ నీ ఉరముపై తెగికట్టిరెవ్వరో దేవుండవనక”. (సంపుటం1.200. పుట:133.) 

బ్రతుకుదెరువుకోసం మనుషులను కొండలు, గుట్టలు తిప్పిన నేరానికి నీవు ఏడుకొండలు ఎక్కాల్సివచ్చిందని స్వామిని ఎగతాళి చేశారు.

ఉదా:

పల్లవి: “పెక్కు లంపటాల మనసు పేదవైతివి నీకు
నెక్కడా నెవ్వరు లేరు ఏమిసేతువయ్యా
చరణం కన్ను మూయబొద్దులేదు కాలుచాచ నిమ్ములేదు
మన్నుదవ్వి కిందనైన మనికి లేదు
మున్నిటివలెనే గోరు మోపనైన చోటులేదు
ఇన్నిటా నిట్లానైతి వేమిసేతువయ్యా!” (సంపుటం1.125. పుట:86)
‘వైకుంఠంలో ఇన్ని పాట్లుపడి తిరుమలకు వస్తే ఇక్కడ కూడా స్వామికి విశ్రాంతి లేదు. అపార భక్తకోటిని ఆదరించడంలో నిమగ్నమై, నిద్రపోవడం మరచిపోయారని స్వామిపై కరుణను ప్రకటిస్తాడు అన్నమయ్య. ఒక్కొక్కప్పుడు ‘ఏమిసేతువయ్యా’ అంటూ స్వామిపై జాలిపడతాడు అన్నమయ్య.

3.2.1.4 సేవా సంబంధ సంభాషణలు
స్వామిని ఏ విధంగా సేవించాలి? ఆయన కృపా కటాక్షాలకు ఎలా పాత్రం కావాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలి? మోక్షాన్ని ఎలా పొందాలి? అనే ప్రశ్నలను వేసుకొని, ఆ సమాధానాలను స్వామికే తెలియజేస్తున్నట్టుగా సంకీర్తనలు రచించారు అన్నమయ్య.
ఉదా:

పల్లవి “నీకథామృతము నిరతసేవననాకు
            చేకొనుట సకల సంసేవనంబటుగాన
చరణం ఇదియె మంత్రరాజము నేప్రొద్దు
            నిదియె వేదసంహిత పాఠము
            ఇదియె బహుశాస్త్రమెల్ల జదువుట నాకు
            నిదియె సంధ్య నాకిదియె జపమవుటగాన”. (సంపుటం1.54. పుట:36)

లోకబాధలన్నింటికి విరుగుడు స్వామి నామమేనని అన్నమయ్య కనిపెట్టారు. ఇదే మంత్రరాజం, వేదపాఠం, జపం, సంధ్యావందనం, బ్రహ్మోపదేశం, దుఃఖనివారిణి, రోగనివారిణి, దాన, తపఫ్ఫలం అంటూ ఆ నామాన్నే నిరతం సేవించాలని అన్నమయ్య బోధించారు. 

అప్పుడువో నిను గొలువుట ప్రాణికి” అనే సంకీర్తనలో తనలోని స్వామిని కనుగొనగలిగిన రోజు “లోపల వెలుపల తన మతిలో దెలిసిననాడు” అని చెబుతూ, (సంపుటం 1.43. పుట:28) 

తర తమ భేదాలు లేనిరోజు, చైతన్యాత్ముడై వెలిగే రోజుకోసం అన్నమయ్య ఉత్సుకతతో ఎదురు చూశారు.
ఉదా:

పల్లవి    “చాలదా మా జన్మము నీ
            పాలింటివారమై బ్రదుకగగల్గె
చరణం కమలాసనాథులు గానని నీపై
            మమకారముసేయ మార్గము గల్గె
            అమరేంద్రాదుల కందరాని నీ
            కొమరైన నామము కొనియాడగల్గె”. (సంపుటం1.110. పుట:76)

అంటూ, ‘నీ దర్శనభాగ్యం కన్నా ఇంకేం కావాలి!’ అని మానవుల అదృష్టానికి పొంగిపోయారు. ఇలా అన్నమయ్య తన సేవా తత్పరతను ఈ కీర్తనల్లో స్వామికి నివేదించుకొన్నారు.

3.2.1.5 స్వామి శౌర్య ప్రతాపాలు:

ఈ కీర్తనల్లో నరసింహుడు, హనుమంతుడు, విష్ణుమూర్తి రూపాలలో స్వామి చూపిన శౌర్యప్రతాపాలను గురించి ఆయనకే నివేదించడం కనిపిస్తుంది.

ఉదా: 

పల్లవి   “ఘోరవిదారణా నారసింహా నీ
            వీరూపముతో ఎట్లుండితివో!
చరణం ఉడికెడి కోపపు టూర్పుల గొండలు
            పొడివొడియై నభమునకెగయ
            పెడిదపు రవమున పిడుగు లొదొరుగగ
            యడనెడ నీవపుడెట్లుండితివో!” (సంపుటం1.68. పుట:46)

ఈ కీర్తనలో పొడిపొడి, గుటగుట, గిటగిట, తటతట, పెదపెద లాంటి ధ్వన్యనుకరణ శబ్దాలను వాడి, నఖశిఖ పర్యంతం నరసింహ స్వామి భయంకర రూపాన్ని వర్ణించారు.
“ఇలయును నభమును నేకరూపమై” అనే సంకీర్తనలో హిరణ్యకశపుణ్ణి తన ఒంటికేసి అదుముకొని, గోళ్ళతో చీల్చి భయంకరంగా చంపాడని వర్ణించారు. 

“కడుపు చించి కహకహ నవ్వితివి” (సంపుటం 1.85. పుట:58) అంటూ నరసింహుని ఆకారం, అరుపు, చూపు, కోపతీవ్రత, వికటాట్టహాసం... ఇలా అనేక అంశాలను ఈ సంకీర్తనలో పేర్కొన్నారు.
విష్ణువు యుద్ధానికి వచ్చే సందర్భాన్ని గుర్తుచేస్తూ, జగాలన్నిటినీ కాపాడమని చేసిన వేడుకోలు కింది సంకీర్తనలో మనోహరంగా వర్ణించారు.
ఉదా:

పల్లవి ఇటు గరుడని నీవెక్కినను
            పటపట దిక్కులు బగ్గన బగిలే
చరణం ఎగసిన గరుడని ఏపున దాయని
            జిగిదొలక చబుకు జేసినను
            నిగమాంతంబులు నిగమసంఘములు
            గగనము జగములు గడగడవడకే”. (సంపుటం1.93. పుట:63)
విష్ణుమూర్తి గరుడవాహనారూఢుడై, అతివేగంగా పొమ్మంటూ గరుడుని ‘తాయ్’ అని కొట్టాడట. ఆ వేగానికి గగనం, లోకాలన్నీ గడగడా వణికాయి. ఆ కోపానికి అఖిలలోకాలు తిరిగాయి. ఆయన గరుడునిపై ఆసీనుడవడం చూసిన రాక్షసుల గుండెలు ఝల్లుమని ఆ మహిమలో మునిగి, సంహరింపబడతారని వివరించారు. ఇలా ఈ సంభాషణల్లో అన్నమయ్య స్వామి ప్రతాపాన్ని ఆయనకే గుర్తు చేసి, ఈ జగాలన్నింటినీ కాపాడమని వేడుకున్నారు.

4. విశ్లేషణలు:

4. 1 పల్లవి ఎవ్వరిగాదన్ననిది నిన్నుగాదంట:

ఈ కీర్తనలోని సంభాషణలో అన్నమయ్య విశ్వంలోని అసమానతలను శరీరావయవాలతో పోల్చి చెప్పారు. ఆ కాలంలోని వివిధ మతాలమధ్య వైషమ్యాలను, హిందూమతంలోని శైవ వైష్ణవ భేదాలను ఖండించిన పండితుల్లో అన్నమాచార్యులు ఒకరు. సృష్టిలోని అన్ని భేదాలు అసమానతలు కావు. ఏ రూపంలో ఆరాధించినా దేవుడొక్కడే. కులం, మతం, ప్రాంతం, జాతి, వృత్తులమధ్య వైషమ్యాలను ఆయన ఆక్షేపించారు. భగవంతుని దృష్టిలో అంతా సమానమేనని ఈ సంభాషణ అంతరార్థం. కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన ‘అంతా నేనే, అన్నింటా నేనే’ అనే గీతాసారాన్ని స్వామికి గుర్తు చేస్తూ సాగిన ఈ సంభాషణలో వైచిత్రి ప్రదర్శింపబడింది. (అలాగే తక్కిన కీర్తనలు).

4.2 ఎవ్వారు లేరు హితవు చెప్పక:

ఈ కీర్తనలోని సంభాషణలో ఏదైనా ఒక పని తలపెట్టేటప్పుడు మంచి, చెడులు ఎరిగి చేయాలని స్వామితో చెప్పుకున్నారు. మానవాళి లోకం అనే అరణ్యంలో, సంసారాది బంధాలు అనే ముళ్ళలో చిక్కుబడుతున్నారు. పరమామృతానికి బదులుగా చేదు తింటున్నారు. తమలోని దేవుణ్ణి పక్కనపెట్టి పుణ్యంకోసం నానా పాట్లు పడుతున్నారు. ‘నీవైనా హితబోధ చేయమ’‌ని అన్నమయ్య స్వామిని వేడుకున్నారు. ఈ సంభాషణలో చేయాల్సింది చేయకుండా ఇతరాల వెంట పడుతున్నారని, ఏ పని తలపెట్టినా త్రికరణశుద్ధిగా చేయాలని అంతరార్థం. (తక్కిన కీర్తనలు).

4.3 నిన్ను దలచి:

ఈ సంభాషణలో ‘నాలో ఏర్పడ్డ భయంవల్ల నిన్ను చెణికాను’. అన్నారు. ఇది అచ్చ తెలుగు పదం. ఇనుము బంగారంగా మారడం అసాధ్యం. కానీ  నాస్తికులు స్వామి భక్తులుగా మారితే మిరుమిట్లుగొలుపుతూ ప్రకాశిస్తారని అంతర్భావం. (తక్కిన కీర్తనలు)

4.4 పెక్కు లంపటాల:

ఈ సంభాషణలో వేదం చదవలేదు. మొండితనం విడువలేదు. అని శ్రీ కృష్ణుని బాల్యాన్ని ఏకరువు పెట్టారు. వామనావతారంలో మూడో అడుగు కూడా పెట్టలేదని ‘యడపదడప నెట్ల నీకు నేమిసేతువయ్యా’ అని జాలిపడ్డారు. ఈ సంభాషణలో స్వామి దశావతారాలను సమన్వయించి, ఆయన విరాఠ్ స్వరూపాన్ని అచ్చతెలుగు మాటల్లో ఆవిష్కరించారు.

5. ముగింపు:

ఈ పత్రంలో నేను కేవలం అన్నమాచార్యులు స్వామితో జరిపిన సంభాషణల్లో కొన్నింటికి మాత్రమే పరిమితమవడం జరిగింది.

  1. ఈ సంకీర్తనల్లోని సంభాషణల్లో తేలికపాటి మాటలను వాడడంవల్ల అన్నమయ్య పదకవితా పితామహుడు అనే బిరుదును సార్థకం చేసుకున్నారు.
  2. ఈ సంకీర్తనల్లో అన్నమయ్య వాడిన అచ్చతెలుగు పదాల అర్థాలకోసం నిఘంటువుల్ని ఆశ్రయించాల్సిన అగత్యం పరిశోధకులకు ఏర్పడుతుంది.
  3. ఆ కాలంలోని పలుకుబళ్ళు అన్నమయ్య కీర్తనల్లో ఇంకా సజీవంగా ఉన్నాయి.
  4. అన్నమయ్య స్వామితో నెరపిన సంభాషణలు సహజాలంకారాలతో నిందా రూపంలో ఉన్నాయి.
  5. కొన్ని సంభాషణలు మానవాళి ఖచ్చితంగా చేయాల్సిన పనులను నిర్దేశించగా, ఇంకొన్ని తనపై ఆపాదించుకున్నారు. మరికొన్ని స్వామిని నిందిస్తూ సాగాయి.
  6. సమాజంతో జరిపిన సంభాషణలు, పూజాలంకారాల సంభాషణలు, తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, చక్ర స్నానం, ఊరేగింపు, సేవాపూర్వకమైన సంభాషణలు ఇలా అనేక విధాలుగా వింగడించి పరిశోధించవచ్చు.
  7. అన్నమయ్య వాడిన భాష సరళసుందరంగా ఉండి, పాఠకులచేత చదివింపజేస్తుంది. గాయకులకు మహదానందం కలిగిస్తుంది.
  8. భాషకు తగిన భావాన్ని, భావానికి తగిన స్వరాన్ని, స్వరానికి తగిన సంగీతాన్ని కూర్చి కృతి చేయడంలో ఆయన దిట్ట.
  9. కొందరు విమర్శకులు అన్నమయ్య సంకీర్తనల్లో సంగీతం లేదని విమర్శించారు. కానీ సంగీతంలో రకాలు (జానపద, కర్నాటక, హిందుస్థానీ, పాశ్చాత్య) ఉన్నాయి గానీ సంగీతం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సరైన సమాధానం వెదకడం కష్టం. బావ, రాగ, తాళబరితం సంగీతం అనే పండితుల నిర్వచనాన్ని అన్నమయ్య సంకీర్తనలు ఎప్పుడో దాటిపోయాయి.
  10. ఇలాంటి సంకీర్తనల్లోని అనేక రకాలైన సంభాషణలను వెలికితీసి, వాటిలోని నాద, స్వర, భావ, రాగ, తాళ, భాష గంభీరతలను నిరూపించాల్సిన అవసరం భావి పరిశోధకులపై ఉన్నది.

ఈ వ్యాసంలో అన్నమయ్య స్వామితో జరిపిన కొన్ని సంభాషణలను మాత్రమే పేర్కొనడం జరిగింది. ఈ సంకీర్తనల్లో ఇంకా చాలా రకాల సంభాషణలు ఉన్నాయి. భావి పరిశోధకులు వాటన్నింటినీ తరచి చూసి, వాటిలోని సంభాషణల రకాలను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అన్నమయ్య, తాళ్ళపాక. 1998. శ్రీ తాళ్ళపాక అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు (1-2 సంపుటాలు). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలు.
  2. చినతిరుమలయ్య, తాళ్ళపాక. సంకీర్తనా లక్షణసారము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలు.
  3. బ్రౌన్, సి. పి. 1987. బ్రౌన్య నిఘంటువు. న్యూఢిల్లీ: ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్.
    రామారావు, చేకూరి. 2014. తెలుగు వాక్యం. హైదరాబాదు: నిర్మలా గ్రాఫిక్స్.
  4. రెడ్డి, జి. ఎన్. 1995. పర్యాయపద నిఘంటువు. హైదరాబాదు: ప్రగతి పబ్లిషర్స్ ఎల్. బి. నగర్హైదరాబాదు.
  5. శంకరనారాయణ, పి. 2014. తెలుగు ఇంగ్లీషు నిఘంటువు. హైదరాబాదు: విక్రంస్ లెక్సికోగ్రఫి టీమ్ వారి ప్రచురణ. 
  6. శ్రీహరి, రవ్వా. 2015. అన్నమయ్య పదకోశం. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలు.
  7. సీతారామయ్య, బహుజనపల్లి. 2016. శబ్దరత్నాకరము. హైదరాబాదు: ఎమెస్కో బుక్ హౌస్.
  8. సంభాషణా, వికిపీడియా (WIKI Link) 20.08.2023

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]