AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. తెలుగు సాహిత్యవిమర్శ ప్రస్థానం: విమర్శకుని బాధ్యత
ఆచార్య అయ్యగారి సీతారత్నం
ప్రొఫెసర్ & ఛైర్పర్సన్, బోర్డు ఆఫ్ స్టడీస్
తెలుగు శాఖ, ఆంధ్ర యూనివర్సిటీ
వాల్తేరు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9885144879, Email: ayyagarisitaratnam@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా ఎదిగినది విమర్శ. అది ఆధునిక కాలంలో ఆంగ్లవిద్య వలన మొదలైంది. కానీ మనం స్పష్టమైన ప్రక్రియగా గుర్తించలేకున్నా మొదట్లో కావ్య అవతారికలు, ఆస్వాసాంత గద్యలు, చాటువుల్లో విమర్శ కనిపిస్తుంది. తర్వాత సంస్కృతలక్షణ గ్రంథాలని అనుసరించి సాగింది. వ్యాఖ్యగా ప్రారంభమై కవిత్వతత్వ, పరిశోధనా, సైద్ధాంతిక విమర్శగా, అస్తిత్వ విమర్శగా, ప్రభావశీల విమర్శగా, సౌందర్య కళాతత్వ విమర్శగా అనేక రకాలుగా ప్రయాణం సాగిస్తోంది. ఈ ప్రయాణాన్ని అందులోని ప్రత్యేకతల్ని గుర్తించి పెరిగిన విమర్శకుని బాధ్యతను అంచనా వేయడమే ఈ పత్ర ముఖ్యోద్దేశం.
Keywords: సద్విమర్శ, అవగాహన, సృజన, కావ్య కళా సౌందర్య తత్వం, అస్తిత్వం, అనువాదం, సానుకూల ధోరణి, ఆత్మా శ్రయ ధోరణి.
1. ఉపోద్ఘాతం:
నేడు రోజు వారి జీవితంలో విమర్శ అంటే దోషాలను ఎత్తిచూపడం గానే కనిపిస్తోంది. అయితే సాహితీ ప్రక్రియగా విమర్శ అంటే మంచి చెడులను విశ్లేషించి చెప్పడమే. నిజానికి రచయితకి తన రచనలు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడితే, పాఠకుడికి ఒక రచనలో విలువలని విలువలుగా తార్కికంగా అందిపుచ్చుకునేలా చేసేది, సౌందర్య కళని పాఠకుడు అనుభూతి చెందే టట్టు చేసేది విమర్శ.
ఆంగ్ల విద్యా ప్రభావంతో అనేక కొత్త సాహితీ ప్రక్రియలు తెలుగులో వచ్చాయి. 19 శతాబ్దంలో పద్యం స్థానంలో సరళమైన వచనం వచ్చింది. బహుశా అచ్చు యంత్రాల వలన శ్రోత బదులు పాఠకుడు రావడం కూడా ఒక ముఖ్య కారణంగా చెబుతారు. వచన సాహిత్యంలో పంచతంత్రం హిత సూచిని విక్రమార్క కథలు అనేక వ్యాస సంపుటాలు కనిపిస్తాయి. ఇలా వచన సాహిత్యం కొత్తగా వచ్చిన నవల, కథ, వ్యాసం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, మొదలైన వాటిల్లో విమర్శ ప్రక్రియ కూడా ఒకటి. ఈ పదం ఆంగ్ల పదం క్రిటిసిజమ్ కి సమానార్ధకంగా వచ్చింది. అలాగే సుస్థిర పడింది.
అయితే 11వ శతాబ్దం నుండి ఆరంభమైన సాహిత్యానికి విమర్శ లేదని అనలేము. నాడు కావ్యవతారికల్లో ఆస్వాసంత గద్యల్లో, చాటు పద్యాలలో కొంత విమర్శ కనిపించినా పూర్తిస్థాయి విమర్శ ప్రక్రియగా వాటిని చెప్పలేము.
2. తొలిదశలో విమర్శ
తెలుగు విమర్శ ఆరంభంలో కవి గురించి, కావ్యలక్షణాలు, హేతువులు ప్రయోజనాలు, కావ్యాత్మ, ధ్వని, రసం అలంకారాలు, వ్యాకరణం, మొదలగు వాటిని పరిగణనలోకి తీసుకొని అంటే సంస్కృత లక్షణ గ్రంథాలను అనుసరిస్తూ సాగింది.అలాగే సోమన్న రాసిన 'విద్వర్జనరంజని, ఇలాంటి వ్యాఖ్యలు విమర్శగా కనిపిస్తాయి. తర్వాత సి.పి. బ్రౌన్ మొదలెట్టిన పాఠపరిష్కారం, వీరేశలింగం మొదలెట్టిన చారిత్రక విమర్శ, కవులు చరిత్ర, తులనాత్మక విమర్శ వీనిలో ఏ కవి ముందు, ఏ కవి వెనుక, పాఠాంతరాలు, జన్మస్థలాలు, అనుకరణలు నన్నయనియోగా, వైదికా మొదలైన విధంగా తెలుగు విమర్శ కనపడుతుంది.
1782లో భారతదేశానికి సర్వేయర్ జనరల్ గా వచ్చిన కల్నల్ మెకంజీ భారత చరిత్ర గ్రంథాలు శాసనాలు సేకరించి భద్రపరిచారు. ఇతనికి సహకరించిన వారు కావలి సోదరులు కావలి వెంకటరమణయ్య, వెంకట లక్ష్మయ్య, వెంకట రామస్వామి మొదటగా దక్కన్ కవుల చరిత్ర రచించి మొదటి విమర్శకుడిగా విమ ర్శ చరిత్రలో నిలిచాడు.
కవులు చరిత్రతోనే ఆధునిక యుగంలో తెలుగు విమర్శ మొదలైంది .కందుకూరి వీరేశలింగం గురజాడ శ్రీరామ్ మూర్తి, కవుల చరిత్ర రచించారు.
తర్వాత సిపి బ్రౌన్ తాళపత్రపతులను సేకరించి పాఠాంతరాలను గుర్తించి ముద్రణకు సిద్ధం చేసారు. మొదటిసారి బ్రౌన్ నియమించిన జూలూరి అప్పయ్య శాస్త్రి, మనుచరిత్ర, వసు చరిత్ర, విజయ విలాసం, మొదలు వాటికి ప్రతిపద టీకలు తాత్పర్యాలు రాసి అనంతర వ్యాఖ్యలకు దారి చూపారు. బ్రౌన్ స్వయంగా వ్యాసాలు రాయడం నిఘంటువులకు పీటఠికలు రాయడం చేసారు. అదే సమయంలో కాల్డ్వెల్ ద్రావిడ భాషల మీద పరిశోధన చేసి ఏ కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్' అనే గ్రంథం రాశారు తర్వాత అనేక భాషా శాస్త్ర గ్రంథాలు వచ్చాయి.
విమర్శ మొట్టమొదట కవులు చరిత్ర, పాఠ పరిష్కారం, టీకలు, పీఠికలు, పత్రిక వ్యాసాలు, భాషా శాస్త్రాలుగా ప్రస్థానం ఆరంభించింది.
3. రెండవ దశ- కవిత్వ తత్వ విమర్శ:
కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ తత్వ విచారణ వచ్చాక విమర్శలు కావ్య తత్వాన్ని వెలికి తీసే స్వేచ్ఛ వచ్చింది. దీనిలో ఆత్మ శ్రయ ధోరణి, పాశ్చాత్య ప్రభావం కనిపిస్తుంది. తర్వాత విశ్వనాధ సత్యనారాయణ శిల్ప మార్గాన్ని అనుసరించారు .రాళ్లపల్లి, దువ్వూరి, కావ్య కళా సౌందర్య తత్వాన్ని అంచనా వేశారు. పింగళి లక్ష్మీకాంతం సమన్వయ విమర్శ మొదలు పెట్టారు.
ప్రక్రియలకి కూడా స్థానం కల్పించిన ది విశ్వనాథ సత్యనారాయణ అని ప్రముఖ విమర్శకులు మృణాళిని గారు పేర్కొన్నారు."ఇతిహాసాలను, పురాణాల ను, ప్రబంధాలను ఒకే కొలమానాలతో తూచకూడదని చెప్పినా ఆయన పాశ్చాత్యులు ఎంతో విలువైంది గా భావించే 'జానర్ క్రిటిసిజమ్ 'ని తెలుగువారికి అలవర్చారు" (తెలుగు సాహిత్య విమర్శ-ఒక చూపు– తెలుగు సాహిత్యవిమర్శ-కొన్ని ఆలోచనలు, పేజీ-85)" సి.నారాయణరెడ్డి ప్రక్రియలకి పరిశోధనకి తెలుగు విమర్శలో చోటు కల్పించారు. "సంప్రదాయాలు -ప్రయోగాలు" అనే తన సిద్ధాంత గ్రంథంలో నవ్య ప్రక్రియల పద్ధతిని కూలంకషంగా అందించారు. వెల్చేరు నారాయణరావు తెలుగులో "కవితావిప్లవాల స్వరూపం" అనే సిద్ధాంత గ్రంథంలో ప్రక్రియ విశ్లేషణ కనిపిస్తుంది .ఆర్ఎస్ సుదర్శన సాహిత్యం దృక్పథాలని తత్వ దృష్టిని ఆవిష్కరించడం ఆరంభించారు.
4. మూడవదశ - సైద్ధాంతిక విమర్శ, మనోవైజ్ఞానిక విమర్శ:
ఈ దశలో తెలుగు సాహిత్యం పై సిద్ధాంతాల ప్రభావం ఎక్కువయింది. అభ్యుదయసాహిత్యాన్ని మొదలెట్టినట్లే మార్క్సిస్టు విమర్శ కూడా శ్రీశ్రీ మొదలు పెట్టారు. మార్క్సిస్ట్ విమర్శలో వర్గ స్పృహ సామాజిక స్పృహ అనే రెండు అంశాలతో సాహిత్యాన్ని సమీక్షించడం చేసి విమర్శలో సమీక్షను భాగం చేశారు. ముఖ్యంగా చేకూరి రామారావు గారు కొంత దృక్పథంతో ప్రామాణిక సమీక్షలు చేశారు.
ఈ దశలోనే తెలుగులోనే ఇతర భాషనుండి వచ్చిన అనువాదాలు పై కూడా విమర్శకొంత వచ్చింది. రారా 'అనువాద సమస్యలు 'అనే పుస్తకం ద్వారా కొంత విశ్లేషణ చేశారు. రామతీర్థ, చందు సుబ్బారావు, వ్యాస రూపంలో విమర్శించడం కనిపిస్తుంది.అంతేకాదు. అభ్యుదయ రచయితల సంఘం తరఫున చందు సుబ్బారావు గారు సంపాదకులుగా 'అభ్యుదయ సాహిత్య విమర్శ 'అనే శిర్షికతో ఇప్పటివరకు వచ్చిన అభ్యుదయ సాహిత్య వ్యాసాలు అన్నింటిని ఒక సంకలనంగా తీసుకొని వచ్చారు.
తర్వాత విప్లవరచయతులు విప్లదృక్పథాన్ని వివేచించే ప్రయత్నం కనిపిస్తుంది. కేవీ రమణారెడ్డి ఇందులో ముఖ్యులు. పీఠికలు, తన పుస్తకాలకి ఇతరుల పుస్తకాలకి రాసినవి విమర్శగా గుర్తింపబడి తెలుగు విమర్శలోభాగం కూడా అయ్యాయి. వీటినే తర్వాత ముందుమాటగా చెబుతున్నాం. గోపి, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ గుడిపాటి, జంపాల చౌదరి, వేదగిరి రాంబాబు, మృణాలిని, సాకాని నాగరాజు, మొదలగు వారు రాసిన ముందు మాటలని కూడా నేడు విమర్శలో భాగంగానే గుర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆచార్య వెలిదండ నిత్యానంద రావు సమగ్ర సాహిత్యం- అక్షరమాలకి ఆచార్యమలయవాసినిగారు'వ్యాస నిర్మాణ కళా సంరంభకుడు'అనే పేరుతో రాసిన ముందు మాటమంచి విమర్శ. వ్యాసం యొక్క నిర్వచనం కూడా స్పష్టంగా ఇచ్చారు.
"వ్యాసరచన ఒక కళ. ఎత్తుగడ, వివరణ, ముగింపు అనే త్రిభంగి సమన్వితం వ్యాసం. ఎత్తుగడలో వైవిధ్యం మధ్యలో విషయ వివరణ ముగింపులో వ్యాసకర్త దృక్పథంతో పాటు ఆశించే ఫలితాలు కూడా ప్రతిఫలిస్తాయి". (వ్యాసకళాసంరంభకుడు-ఆచార్యమలయవాసిని-అక్షరమాల -పేజీ xiv)
తర్వాత విప్లవ రచయితలు విప్లవదృక్పథాన్ని వివేచించే ప్రయత్నం కనిపిస్తుంది. కేవీ రమణారెడ్డి ఇందులో ముఖ్యులు. తన పుస్తకాలకి ఇతరుల పుస్తకాలకు రాసినవి విమర్శగా గుర్తింపబడి తెలుగు విమర్శలో పీఠికలు కూడా భాగమయ్యాయి.తొలి దశలో కావ్య పరిచయం కోసం మొదలెట్టిన పీఠికలూ నేడు విమర్శ స్థాయికి ఎదిగాయి. ఎన్ గోపి, పాపినేని శివశంకర్ మృణాలిని, వాసిరెడ్డి నవీన్ గుడిపాటి, జంపాల చౌదరి, యాదగిరి రాంబాబు, నాగరాజు మొదలగువారు రాసిన ముందు మాటలను కూడా నేడు విమర్శలో భాగంగానే గుర్తిస్తున్నారు.
విప్లవ దృక్పథంతో వస్తు దృష్టి మొదలైంది. దీన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు శేషేంద్ర 'కవి సేన 'మేనిఫెస్టోలో అనుభూతివాదాన్ని తెలుగు విమర్శలో ప్రవేశపెట్టారు. భారతీయ ఆలంకారక ప్రభావం పాశ్చాత్త్యుల ప్రత్యేక వాద ప్రభావంతో వచ్చింది అనుభూతివాదం. వస్తు దృష్టితో రూపానికి విలువనివ్వక పోవడాన్ని గుర్తించిన వల్లపాటి వెంకటసుబ్బయ్య శిల్ప ప్రాధాన్యాన్ని చెబుతూ దానిలో భాగంగా పాత్ర చిత్రీకరణ, సన్నివేశ కల్పన, శీర్షకల ప్రాధాన్యత, మొదలగు అనేక అంశాలకు విలువని ఇచ్చారు.
4.1 ప్రభావశీల విమర్శ
తర్వాత తెలుగు సాహిత్యం ఏ యే ప్రభావాలతో సృజించబడుతుంది అనే విషయంపై దృష్టి పెట్టారు. వీరభద్రరావు, జీవీ సుబ్రహ్మణ్యం, 'తెలుగు విమర్శ పై ఆంగ్ల ప్రభావం' కోవెల సంపత్ కుమారాచార్య' భారతీయ విమర్శ ప్రభావం, అనే పుస్తకం ద్వారా పరిశీలన చేసి విమర్శలో ప్రభావ పరిశీలన కూడా భాగం చేసారు.
4.2 అస్తిత్వ ధోరణులు:
విప్లవదధోరణి తర్వాత తెలుగు సాహిత్యంలో అస్తిత్వ వాదాలు వచ్చాయి. స్త్రీవాదం దళితవాదం ముస్లిం మైనారిటీ వాదం ప్రాంతీయవాదం మూడవ జెండర్ వాదం. ఈ ధోరణులతో విమర్శకూడా రూపు దిద్దుకుంది. అనేకమైన సామాజిక వర్గాలు తెలుగు సాహితీ సృష్టి చేయడంతో విమర్శలో కూడా అనేక సామాజిక కోణాలు కొత్తగా వచ్చాయి. ఆయా అస్తిత్వాల ఆలోచనలు రచనల్లో ఎంతవరకు ప్రతిపాదించాయని దానివల్ల రూపుదిద్దుకున్న విలువలు వారి అభివ్యక్తి కూడా విశ్లేషించటం శేఖర్ రెడ్డి వోల్గా, కాత్యాయని, మృణాళిని, శ్రీదేవి సింగమనేని కాలువ మల్లయ్య, మల్లీశ్వరి, సీతారత్నం మొదలగువారి వ్యవస్థల్లో మనకు స్పష్టమవుతుంది.
4.3 కళాతత్వశాస్త్రవిమర్శ:
పురాణం సూరి శాస్త్రి ఈస్తటిక్స్ అనే పేరుతో 1926లోఒక వ్యాసం రాసారు. అనంతర కాలంలో దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు, రాళ్లపల్లి, బుచ్చిబాబు, సంజీవ్ దేవ్, చలం, మొదలైన వారు దీనిపై అనేక ఆలోచన లుచేశారు. 1993నాటికి తెలుగులో ఈ శాస్త్రానికి కళాతత్వశాస్త్రం అనే పేరు పెట్టారు. ముదిగొండ వీరభద్రయ్య 1993లో కళాతత్వశాస్త్రం రచించారు. తుమ్మపూడి కోటేశ్వరరావు "వేయి పడగల మణిప్రభలు, సాలభంజిక, పురాణ విద్య, మొదలగునవి ఈవిధమైన విమర్శలో కి వస్తాయి.
5. నాలుగో దశ - పునర్మూల్యాంకన విమర్శ:
ప్రాచీన సాహిత్యాన్ని ప్రాచీన విమర్శనా పద్ధతుల్లోనే విమర్శించాలని అనుకోకూడదు. ఏ సాహిత్యమైన కొన్ని విలువల్ని సమాజానికి అందిస్తుంది. అనంతర కాలంలో ఆ విలువలు ధర్మాలు, మారొచ్చు. సంప్రదాయ సాహిత్యాన్ని కాత్యాయని విద్మహే స్త్రీవాద దృక్కోణంలో విమర్శించారు. దీనివల్ల ఏ విలువలు మారాయి అనేది తెలుస్తుంది. రామాయణం స్త్రీ పాత్రలపై వోల్గా విముక్తి కథలు రాస్తే దానిపై ఏచూరి సీతారాం చేసిన విశ్లేషణ వ్యాసం పాఠకుడికి రచయితకి మధ్య వారధిలా ఉందంటారు. స్త్రీ వాద దృక్కోణం తెలియని వారికి, సందిగ్ధతలు ఉన్నవారికి ఒక స్పష్టమైన అవగాహన కలుగజేస్తుంది. అలాగే అయ్యగారి సీతారత్నం రాసిన గంగాశంతనుల కథ, 'సుగాత్రిశాలీనుల కథ' వ్యాసాలు పునర్మూల్యాంకన వ్యాసాలు. నిజానికి ఏ సిద్ధాంతం దృక్కోణం కొత్తగా వచ్చిన మొత్తం సాహిత్యాన్ని మరలా ఆ కొత్త విమర్శలతో నిగ్గు తేల్చాలి. లేకుంటే మారిన ఆదర్శాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. అందువల్లే నూతన ధోరణులు తో సాహిత్య సృష్టి చేయడమే కాదు. దానిని స్పష్టమైన అవగాహనతో ఆచఐతన్యం ప్రజలకి అందించే విమర్శకూడా అత్యవసరం.
అలాగే ప్రాచీన విమర్శనా పద్ధతులు కూడా ఆధునిక సాహిత్య విమర్శకి విమర్శకుడు శక్తి మేరకు వినియోగించవచ్చు. రవి శాస్త్రి సాహిత్యంలో ఉపమాలంకారాన్ని పరిశీలించి విశ్లేషిస్తే నిజంగా సామాజిక స్థితి పాఠకుడి మనసులో ముద్రింపబడడానికి ఎంతో సహజమైన సామ్యాలు వాడడం కనిపిస్తుంది. కేవలం సౌందర్య కళా తత్వాలు కోసమే అలంకారాలు ఉపయోగించడం కాకుండా ఒక నిజస్థితిని సామ్యం ద్వారా హాస్యపూరితంగా చెప్పొచ్చు అని నిరూపించారని తెలుస్తుంది.
6. పెరిగిన విమర్శకుని బాధ్యత:
ఒకప్పుడు విమర్శకులకు గ్రంథాలపై పట్టు ఉంటే సరిపోయేది. నాడు ఆ పరిధిలోనే విమర్శించేవారు. కానీ నేడు సాహిత్యంలో అనేక ధారణలు ప్రక్రియలు అభివృద్ధి చెందటమే గాక అనేక సామాజిక శాస్త్ర రంగాల ప్రభావం సాహిత్యం పై చాలా ఉంటుంది పురాణం ఇతిహాసం ప్రబంధం ఉదాహరణ కావ్యం శతకం దండకం, గద్య వచన కవిత్వంలో మినీ కవిత నాని హైకోర్ రెక్క నానో సలూన్ ప్రాసనం నవల గర్బిక కథా లేఖ మ్యూజియం కాలం మొదలైన అనేక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విమర్శకుడికి కూడా వాటన్నిటిపై సమగ్రమైన అవగాహన ఉండవలసి వస్తోంది.
ముఖ్యంగా అస్తిత్వవాదాలు ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు ఆయా అస్తిత్వాలపై ప్రపంచీకరణ పై పూర్తి అవగాహన ఉండాలి. లేకుంటే విమర్శ ప్రయోజనం ఉండదు ఉదాహరణకు వంటిల్లు కవితలు స్త్రీవాదం తెలియని వాళ్ళు దానిపై సానుకూల ధోరణి లేని వాళ్ళు విమర్శిస్తే స్త్రీలకు బద్ధకం పెరిగిందని అందుకే ఒంటరి వంటిల్లు వద్దంటున్నారని వాళ్ళు దయ్యాలని అనే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ విమర్శ తన ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోతుంది నిజానికి స్త్రీవాదం తెలియని పాఠకులకు స్త్రీవాద దృక్పథం తెలియజెప్పి వారికి వాస్తవికతను అందించి చైతన్యవంతులు చేయగలుగుతాడు విమర్శకుడు. అలాగే దళిత చైతన్యం లేని వారు ఆ కవిత్వాన్ని విమర్శిస్తే దానికి న్యాయం జరిగే అవకాశంలేదు.
7. ముగింపు:
విమర్శప్రస్థానాన్ని పరిశీలిస్తే విమర్శకుని బాధ్యతలుగా కొన్ని విషయాలు తేటతెల్లమౌతున్నాయి.
- ఒకప్పుడు భాష అంటే ప్రామాణిక భాష మాత్రమే, సాహిత్యంలో ఎక్కువ మంది వాడేవారు. ఇప్పుడు అన్ని మాండలికాలనీ ఆదానప్రదానాలు వలన వచ్చి చేరిన భాషాపదాలని సాహితీవేత్తలు యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. విమర్శకులకు భాష మీద పూర్తి పట్టు ఉండాలి. లేకుంటే పాత్ర సహజత్వాన్ని, భాషా సౌందర్యాలని విప్పి చెప్పలేరు. అలాగే విమర్శకులకు ఉదాహరణకి నామిని సుబ్రహ్మణ్యం సాహిత్యాన్ని విమర్శించాలంటే కులమాండలికం, ప్రాంతీయ మాడలికం, కూడా తెలియాలి.
- సౌందర్య కళాతత్వం అస్తిత్వాల మీద సిద్ధాంతాల మీద ప్రాచీన ఆధునిక ఉత్తరాధునికతలపై ప్రపంచీకరణ పై అవగాహన ఉందా లేదా అని మమేకం అయిపోకూడదు. ఏ సాహితీ ప్రక్రియైన ఏదో ఒక అస్తిత్వ సిద్ధాంత విమర్శనా పద్ధతుల చట్టంలో ఉండకపోవచ్చు. సంక్లిష్టమైన మానవ జీవితాన్ని ఏ ఒక్క సిద్ధాంతము అన్నివేళలా అన్ని కోణాలలో స్పృశిస్తూ ఉందనడానికి అవకాశం లేదు. అయితే సంక్లిష్ట జీవితాన్ని సరళీకృతం చేసి శాంతియుతంగా మలచడానికే సాహిత్యం కృషి చేస్తుంది. ఇటువంటి సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు ఏ ఒక్క సిద్ధాంత, అస్తిత్వ పరిధిలో మాత్రమే ఇమిడిపోతే ఆ విమర్శ పాక్షికమే అవుతుంది. అయితే రచయిత కైనా, విమర్శకుడికైనా ప్రధాన స్రవంతి ఒకటి కచ్చితంగా ఉంటుంది. ఆ స్రవంతి ఒక్కటే సత్యం అనుకుని ఆచట్రంలోనే ఇమిడి విమర్శిస్తే సత్యం బయటికి రాదు. తను నమ్మిన కులాస్తిత్వాన్ని బట్టి తన కులాన్ని పైకి ఎత్తడం, స్త్రీల అస్తిత్వాన్ని బట్టి స్త్రీల రచయతలని పైకి ఎత్తడం ప్రాంతీయ అస్థిత్వం బట్టి ప్రాంతీయులుని పైకి ఎత్తడానికి తను నమ్మిన సిద్ధాంత వాదులని, పైకెత్తడానికి చేసే విమర్శ విమర్శకుల స్థాయిని తగ్గిస్తుంది. ఇదేగాక నేడు గుంపు తత్వం కూడా బయలుదేరింది. వీరు నా గుంపులోని మనిషి కాబట్టి వారి రచనలు పైకి ఎత్తడం ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు.
- విమర్శకుడు నిస్వార్ధంగా నిర్మొహమాటంగా అసూయ రహితంగా ఉండాలి. సృజనాత్మకత, భావగాంభీర్యతనే రచనలో ప్రధానంగా చూడాలి. ప్రతి దాన్ని వ్యతిరేక ధోరణిలో చూడకూడదు. రసానందం పొందే సామాజికుడికి సహృదయత ఎంత అవసరమో విమర్శకునికి కూడా సహృదయత అంతే అవసరం. సానుభూతి, సానుకూల ధోరణి, నిజాయితీ, ఆవేశరహిత ఆలోచన, అవగాహన ఉన్న విమర్శకులు సాహిత్యం ఏ విధంగా తెలుగు జీవన చైతన్యంలో అంతర్భాగమవుతుందో సుస్పష్టంగా చూపించగలరు
8. ఉపయుక్తగ్రంథసూచిక:
- --, --. తెలుగు సాహిత్య విమర్శ కొన్ని ఆలోచనలు. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్, --, 2017.
- నారాయణరెడ్డి, సి.ఆధునిక ఆంధ్ర కవిత్వం-సంప్రదాయం:ప్రయోగం. విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ, 1977.
- నిత్యానందరావు, వెలుదండ.అక్షరమాల. ప్రణవమ్ పబ్లికేషన్స్, --, 2021.
- యాకూబ్, --. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ. నవతెలంగాణా, హైదరాబాద్, 2018.
- లక్ష్మణ చక్రవర్తి, సిహెచ్. (సంపా.).తెలుగు సాహిత్య విమర్శ దర్శనం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2016.
- లక్ష్మీకాంతం, పింగళి.సాహిత్య శిల్ప సమీక్ష. విశాలాంధ్ర, హైదరాబాద్, 1991.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి.కథాశిల్పం. --, --, 2000.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి.విమర్శాశిల్పం. --, --, 2002.
- శ్రీదేవి, కె.స్త్రీవాద తాత్వికత-వోల్గా సాహిత్యం. సంహిత పబ్లికేషన్స్, --, 2011.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.