AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
13. మల్లాది వారి ‘అద్దెకిచ్చిన హృదయాలు’ నవలిక: ‘అచ్యుతం’ పాత్రచిత్రణ
జి. యమునారాణి
తెలుగు సహాయాచార్యులు,
శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ
అనంతపురము, అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8985556576, Email: gyamunarani@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునికనవలారచయితల్లో సుప్రసిద్ధులు మల్లాది వెంకటకృష్ణమూర్తి. వీరు రాసిన తొట్టతొలి నవలిక “అద్దెకిచ్చిన హృదయాలు”. ఈనాటి సమాజంలో అధికశాతం యువతీయువకుల్లో కనిపిస్తున్న ప్రేమానురాగాలు, ఆకర్షణలు, మాససిక సంఘర్షణలను ఆవిష్కరించే కథాకథనంతో ఈ నవలిక రూపుదిద్దుకుంది. మంచి-చెడ్డలకు, ప్రేమాభిమానాలు-మోసాలకు, ఉపకార-ఉద్దేశపూర్వక సహాయాలకు ఉండే వెంట్రుకవాసి వ్యత్యాసాలను ఈ నవలికలో వివిధ సన్నివేశాల ద్వారా రచయిత స్పష్టం చేసారు. తనని ఇష్టపడుతున్న ఆరుగురు అమ్మాయిలను సులభంగా మోసం చేసే అవకాశమున్నా, ఆత్మవిమర్శ చేసుకుని, తప్పటడుగులు పడకుండా తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న అచ్యుతం పాత్ర, అందుకు తగినట్టుగా హితవు పలికి, మార్గదర్శకంగా నిలిచిన మధుకర్ పాత్ర ఈ నవలికలో కీలకమైనవి. సగటు యువకుడిగా కనిపించే అచ్యుతం పాత్రను ఇతర పాత్రల పట్ల అతని మనోభావాలను గ్రహిస్తూ, అచ్యుతానికి ఎదురైన ఆసక్తికరసందర్భాలు, అతను ప్రతిస్పందించిన తీరును బట్టీ అతని మహోన్నతవ్యక్తిత్వాన్ని, ఈ తరానికి ఆదర్శనీయమైన గుణగణాలను విశ్లేషించి, ఈ పాత్రద్వారా రచయిత సమాజానికి అందించదలచుకున్న సందేశాన్ని తెలియజెప్పడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. రచయితతో ముఖాముఖి, నవలిక ఈ పరిశోధన వ్యాసరచనకు ప్రాథమిక ఆకరాలు. వివిధ పత్రికల్లో, బ్లాగుల్లో వచ్చిన పాఠకుల, విమర్శకుల అభిప్రాయాలు ఈ పరిశోధనకు ద్వితీయ విషయసామగ్రి.
Keywords: నవలిక, అద్దెకిచ్చిన హృదయాలు, సన్నివేశాలు, పాత్రచిత్రణ, వ్యక్తిత్వం, సందేశం.
1. రచయిత పరిచయం:
మల్లాది దక్షణామూర్తి, మల్లాది శారదాంబ దంపతులకు 1949, నవంబర్,13వ తేదీన మల్లాది వెంకట కృష్ణమూర్తి విజయవాడలో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం పూర్తిగా విజయవాడలోనే సాగింది. వీరి చిన్నతనం నుండి కుటుంబంలో అందరూ విద్యావంతులు కావడంతో అందరికీ పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది. అదే అలవాటు మల్లాది వెంకటకృష్ణమూర్తికి కూడా వచ్చింది. వీరు 1969లో డగ్రీ పూర్తి చేసుకొని 1970లో హైదరాబాదులోని "పెంగ్విన్ టెక్సటైల్స్"లో ఉద్యోగంలో చేరారు. వీరు వ్రాసిన తొలి కథ "ఉపాయశాలి", "చందమామ" పత్రిక ఆగస్టు సంచికలో అచ్చైంది. ఆ తర్వాత వరుసగా ఆంధ్రప్రభ, ఆంధ్ర, అపరాధ పరిశోధనల వంటి పత్రికల్లో కథలు రావడంతో మల్లాది రచనావ్యాసంగం ప్రారంభమయ్యింది.(1)
అప్పట్లో ఇతర భాషల్లోవచ్చే పత్రికల్లోని కథలను కూడా చదివే అలవాటు ఉండటంతో వీరు 2000 అనువాదకథలు, 3000 స్వతంత్రకథలు మొత్తం 5000కు పైగా కథలు వ్రాశారు. నాటి నుండి నేటి వరకు వీరు వ్రాసిన నవలలసంఖ్య 106. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. వీరి నవలల ఆధారంగా 22 చలనచిత్రాలు వచ్చాయి, 9 ధారావాహికలు టెలివిజన్లో ప్రసారం కాబడ్డాయి. 1,000 కి పైగా వ్యాసాలు వ్రాశారు. వివిధ పత్రికల్లో, వివిధ పేర్లతో 70 శీర్షికలను నిర్వహించారు. 34 దేశాలను సందర్శించి రచయితగా - 11యాత్రాచరిత్రలను పాఠకలోకానికి అందించారు.(2) "అద్దెకిచ్చిన హృదయాలు" - ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి 1972లో రాసిన మొదటి నవలిక. ఇందులోని కథావస్తువు ప్రేమ. “ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 11 అక్టోబర్ 1972 సంచిక మొదలు నవంబర్ 8 1972 దాకా వరుసగా 5 సంచికలలో సీరియల్ గా వెలువడింది.”(3)
2. అద్దెకిచ్చిన హృదయాలు నవలిక - కథాసంగ్రహం:
ఆరుగురు అందమైన అమ్మాయిలు ఉన్న అపార్ట్మెంట్లో హౌస్ సర్జిన్ చేస్తున్న ఒక యువకునికి ఇల్లు అద్దెకు దొరుకుతుంది. ఆ యువకునిపై ఆరుగురు అమ్మాయిలకు ఇష్టం, ప్రేమ ఏర్పడతాయి. ఒకరికి తెలియకుండా ఒకరు తమ ప్రేమ విషయాన్ని ఆ యువకునికి తెలియచేస్తారు. అప్పటికే ఆ ఆరుగురు అమ్మాయిల పట్ల అభిమానాన్ని పెంచుకున్న ఆయువకుడు వారి ప్రేమను కాదనలేక పోతాడు. చివరికి ఏఒక్కరిని అతను పెళ్లి చేసుకున్నా మిగిలిన ఐదుగురి మనస్సులు గాయపడుతాయని ఆలోచిస్తాడు. ఒక్కరిని కూడా బాధ పెట్టడం ఇష్టం లేని ఆ వ్యక్తి, తన సమస్యపరిష్కారానికి ఒక మనస్తత్త్వశాస్త్ర నిపుణుడి సలహాను తీసుకుంటాడు. అతని సలహా మేరకు తన సమస్యను కాలమే పరిష్కరిస్తుందని నమ్మి, ఆ ఆరుగురు అమ్మాయిల సమ్మతంతోనే వారి నుండి దూరంగా వెళ్ళిపోతాడు.
3. అద్దెకిచ్చినహృదయాలు నవలిక- రచనా నేపథ్యం:
"నేపథ్యం కథకు రంగస్థలం. కథ జరిగే చోటు, నేపథ్య జీవితం కథలోని అంశాలకు ఆలంబనం. కాబట్టి వాస్తవికత మీద ఆధారపడ్డ నవల తగిన నేపథ్య చిత్రం లేకుండా స్వయంగా నిలబడలేదు. నేపథ్య చిత్రం వెనుక ఉన్న ప్రదేశాన్ని చిత్రించడం మాత్రమే కాదు. ఆ నేలలో ఆ గాలిలో ఆ కాలంలో ఉన్న భావాలను చిత్రించటం కూడా అంటే నేపథ్యం భౌతికమైనది మాత్రమే కాక భావజాల సంబంధమైనది కూడా"(4) అని రచనా నేపథ్యం గురించి నవలాశిల్పంలో వెంకట సుబ్బయ్య అన్నారు.
ప్రస్తుత నవలిక రచనానేపథ్యం రచయిత స్వీయ అనుభవంలోనిదిగా రచయితే ఈ క్రింది విధంగా వివరించారు.
"ఈ నవలికకు థీమ్ నా రొటీన్ జీవితంలోని అబ్జర్వేషన్ లోంచి దొరికింది. ప్రతిరోజు ఉప్పల్ వెళ్లే బస్సు నెంబర్ 6ఎఫ్ ఎక్కేవాడిని. బస్సులో కూర్చుంటే అక్కడ రోడ్డుకి ఎడమవైపున ఓ పసుపు పచ్చ భవంతి కనిపించేది. దాని కాంపౌండ్ వాల్ వెనక అరుగు ఉండి ఉండాలి. దాని మీదికి ఎక్కి బయటకు చూస్తూ నిలబడ్డ టీనేజీ అమ్మాయిలు ఐదు ఆరుగురు ఆ సమయంలో కనిపిస్తుండేవారు. బస్సులో వెళ్లేటప్పుడు తిరిగి వచ్చే టప్పుడు ఆ ఇంటిని కాస్త గమనించేవాడిని. కనీసం ఒకరిద్దరైన అమ్మాయిలు కాలక్షేపం కోసం కాంపౌండ్ గోడ వెనక నిలబడి కనిపించేవారు. వీరు ఆ పెద్ద లోగిల్లో అద్దెకు ఉన్న అనేక కుటుంబాలకు చెందినవారు. వాళ్లని నిత్యం చూస్తున్న బ్రహ్మచారి అయిన నాకు ఆ ఇంట్లో గది అద్దెకు దొరికితే బాగుండునని ఆలోచన వస్తుండేది. ఒకవేళ నిజంగా దొరికితే? దాదాపు ఏడాది సాగిన ఆలోచనల్లో నుంచి రూపుదిద్దుకున్న నవలిక అద్దెకిచ్చిన హృదయాలు."(5)
4. పాత్ర చిత్రణ:
“కథలేని నవలలు కథా వస్తువులేని నవలలు ఉండవచ్చు కానీ పాత్రలు లేని నవలలు మాత్రం ఉండడం సాధ్యం కాదు”(6) అని వెంకట సుబ్బయ్య నవలల్లో పాత్రచిత్రణ పాఠకుడిలో సానుభూతిని రేకెత్తించి రసానందాన్ని కలిగించేందుకు ప్రధానంగా తోడ్పడేవి పాత్రలే అని పాత్రల ప్రాధాన్యాన్ని తెలియజేశారు. "కథాకల్పనయందే, ఆయా పాత్రల రూపురేఖలను తీర్చిదిద్ది మన మనోనేత్రాల యందు అవి ఆవిష్కరించినట్లు చేయగల నేర్పు, ప్రతిభ నవలా రచయిత కుండ వలెను. అప్పుడే ఆ పాత్రలు సజీవ సంపన్నముగా నుండును. నాటకమునందలి పాత్రలవలే నవలయందలి పాత్రలు కూడా సజీవ సంపన్నముగా మనముందు ప్రత్యక్షమైనప్పుడే మనకు అది ఆనందమును చేకూర్చగలవు."(7) అని నాగభూషణశర్మ పాత్రచిత్రణలో నవలారచయితకు కావలసిన ప్రతిభను గురించి ప్రస్తావించారు.
కథా నిర్వహణకు అవసరమైన సంఖ్యలో పాత్రలను రచయిత ఎన్నుకుంటాడు. అవి ఒకటి కావచ్చు పది.. ఇరవై ఎన్నైనా కావచ్చు. ఈ నవలికలో ప్రధానంగా ఎనిమిది పాత్రలున్నాయి. అవి: అచ్యుతం, బెట్టి, స్వాతి, సులోచన, చిత్ర, ఆషా, వసంత, ప్రొఫెసర్ మధుకర్. రచయిత నవలికలోని ఆరుగురు అమ్మాయిలను వారి వయస్సు, ప్రాంతాల నేపథ్యాల ఆధారంగా వారి వస్త్రధారణ, రూపురేఖలను వర్ణిస్తూ ఆ పాత్రలను ఎంతో అందంగా, సహజంగా మన కళ్ళముందు ఆవిష్కరింపచేశాడు రచయిత.
5. అద్దెకిచ్చిన హృదయాలు - అచ్యుతం పాత్ర:
ఈ నవలికలో ఉన్నతవ్యక్తిత్వం గల యువతకు ప్రతినిధి - "అచ్యుతం" పాత్ర. ఈ నవలికలోని వివిధ సన్నివేశాలలో అచ్యుతం పాత్ర ఔన్నత్యాన్ని రచయిత చిత్రీకరించిన తీరును ఈ వ్యాసంలో పరిశీలించడమైనది.
5.1 వివిధ సన్నివేశాలలో అచ్యుతం పాత్రచిత్రణ:
ఈ నవలికకు ఆయువు పట్టు అచ్యుతం పాత్ర. రచయిత అచ్యుతం పాత్రను హౌస్ సర్జన్ చేస్తున్న సగటు యువకుడిగానే చూపించినా, ఆ తర్వాత కథలోని కొన్ని సన్నివేశాల ద్వారా అతనిలోని ఉన్నతవ్యక్తిత్వాన్ని చిత్రీకరించారు. ఆరుగురు అందమైన అమ్మాయిలుండే భవనంలో ఒక గదిలో కొత్తగా అద్దెకు దిగి, సర్దుకుని "బయటకు నడుస్తూ కట్టి ఉన్న సిమెంట్ బెంచీల వంక చూసిన అచ్యుతం - గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ మామూలుగా కొట్టుకోసాగింది”.అంటూ ఎంతో సహజమైన స్పందనలను రచయిత ఈ నవలికలో చిత్రీకరించారు.
5.2 తొలిచూపులో అచ్యుతం హృదయస్పందనలు:
"ఆరుగురు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందరూ 20 ఏళ్ల లోపు వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. గదిలోంచి బయటికి వచ్చిన అచ్యుతాన్ని చూడగానే వాళ్లు మాటలాపేశారు. వాళ్ళ వంక చూడకుండా తలవంచుకొని అచ్యుతం రోడ్డుమీదికి వెళ్ళిపోయాడు. అచ్యుతం వెళ్ళిపోగానే వాళ్లు మళ్లీ మాట్లాడుకోసారు. ఇంటి గేట్ బయట నిలబడి ఆ ఆరుగురు ఆడపిల్లలని దూరం నుంచే గమనించాడు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ కనిపించారు. అతను నడుస్తూ వాళ్ల వంక ఆసక్తిగా చూశాడు. అచ్యుతం మనసులో అందరూ అందంగా ఉన్నారు అనుకున్నాడు. దగ్గరగా వచ్చిన అచ్యుతాన్ని గుర్తించగానే వాళ్ళు వెంటనే మాటలు, నవ్వులు ఆపేశారు. అచ్యుతం మనసు రోజు రాత్రి పడుకోబోయే ముందు గతంలో లాగా చదివే పుస్తకాల మీద నిలబడటం లేదు. వద్దనుకున్నా ఆ ఆరుగురు చుట్టూనే తిరుగుతోంది".(8)
విశ్లేషణ:
ఇక్కడ ఈ పాత్రల ప్రవర్తనను చిత్రించిన తీరును బట్టి రచయితకు సమాజంలోని యువతీయువకుల మనస్తత్వ ప్రవర్తనలపై ఉన్న అవగాహన స్పష్టమవుతుంది. అందమైన అమ్మాయిలను చూడగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయి మళ్లీ కొట్టుకోసాగడం, అందరూ అందంగానే ఉన్నారు అనుకోవడం, ఆడపిల్లలను ఆసక్తిగా చూడటం. తన ఆలోచనలన్నీ అమ్మాయిల చుట్టూనే తిరగడం, యువకులలో సహజంగా కనబడే లక్షణాలన్నీ అచ్యుతం పాత్రకు ఆపాదించి, పాఠకుల హృదయాలలో అచ్యుతాన్ని సగటు యువకుడిగా చిత్రీకరించే రచయిత ఈ ఎత్తుగడ సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.
5.3 అచ్యుతానికి వృత్తిపట్ల గల నిబద్ధత:
రచయిత అచ్యుతం పాత్రను సగటు యువకుడికి ప్రతీకగా ప్రారంభించి, ఆ తర్వాత కథాగమనంలో అతనిలోని ఉన్నత గుణాలను ఆయా సన్నివేశాల ద్వారా బహిర్గత పరిచాడు. అందుకు సంబంధించి రచయిత చిత్రించిన ఒక సన్నివేశం పరిశీలించతగ్గది.
చిత్ర-అచ్యుతంల మధ్య సన్నివేశం:
అచ్యుతం అద్దెకు దిగిన భవనంలో నివాసముంటున్న ఆరుగురు అమ్మాయిలలో వయస్సులో పెద్దది చిత్ర. చూడటానికి అందంగా ఉంటుంది. భయంతో కూడిన సిగ్గు, చీరకట్టులో తన చెల్లి స్వాతితో కలిసి వచ్చి అచ్యుతాన్ని పరిచయం చేసుకుంది. మిగిలిన వారి లాగే తాను కూడా అచ్చుతాన్ని ఆరాధించడం ప్రారంభించింది. తన తల్లిదండ్రులు దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో చిత్రకు విషజ్వరం వచ్చింది.
అప్పుడు వారం రోజులు అచ్యుతమే మందులు కొనుక్కొని వచ్చి వైద్యం చేశాడు. పది రోజులకు జ్వరం బాగా ఎక్కువైంది. అరగంటకోసారి మందులు ఇచ్చి దగ్గరే ఉండి చూసుకున్నాడు. ఆ సమయంలో చిత్ర తనను పక్కకు వెళ్ళనిచ్చేది కాదు. చిత్ర కొద్దిగా కొనుకుతీస్తే బయటికి వెళ్లేవాడు. స్వాతి వచ్చి అక్కకు మెలుకువ వచ్చింది. పిలుస్తోంది. అని చెప్పేది. జ్వరంలోనే చిత్ర అచ్యుతం చేతులు పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ "నేను మళ్లీ కోలుకుంటానా, చచ్చిపోతానేమో అనిపిస్తోంది. చచ్చిపోతానని తెలిస్తే చెప్పేయండి. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. తర్వాత నేను చచ్చిపోయిన పర్వాలేదు." ఆమె కోరిక అచ్యుతానికి ఆశ్చర్యం కలిగించింది. చిత్ర కళ్ళలోకి చూస్తుండిపోయాడు. చిత్ర తనను ప్రేమిస్తోందని అచ్యుతం ఎప్పుడో గ్రహించాడు. సిగ్గు అడ్డు రావడం వల్ల అతనికి చెప్పలేకపోయిందని అనుకున్నాడు. జ్వరం తీవ్రత వల్ల చెప్పింది అనుకున్నాడు. "నేను చచ్చిపోనుగా" అని మళ్ళీ అడిగింది. "చచ్చిపోనివ్వను" అంటూ తల అడ్డంగా ఊపి చెప్పాడు. "నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటారుగా" అని అడగ్గానే మళ్ళీ తల ఊపాడు. "ఐ.లవ్.యు" అని అచ్యుతం చెప్పగానే చిత్ర కళ్ళు మూసుకుంది. (9)
సరిగ్గా వారం రోజులకు చిత్ర పూర్తిగా కోలుకుంది. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన చిత్ర తల్లిదండ్రులు అచ్యుతంతో చెప్పిన మాటలు - "ముందు నీ సంగతి మాకు సరిగా తెలియదు గది నీకు గది అద్దెకు ఇచ్చారని తెలియగానే మేమంతా కలిసి ఈ ఇంటి యజమానికి ఉత్తరం రాసాం. నిన్ను ఖాళీ చేయిస్తే కానీ ఈ ఇంట్లో ఉండలేమని. మా ఉత్తరానికి సమాధానం లేదు. నీ నడవడి మంచితనం చూశాక మా ప్రయత్నం విరమించుకున్నాం."(10)
పై సన్నివేశంలో అచ్యుతం చిత్రకు వైద్యం చేసిన విధానంలోను, చిత్రమానసిక ఆరోగ్యపరిస్థితికి అనుగుణంగా వ్యవహరించడంలోను, ఆమెను పూర్తిగా కోలుకునే వరకు దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవడంలోనూ అచ్యుతానికి వృత్తిపట్ల ఉన్న నిబద్ధత వ్యక్తం అవుతుంది. అదేవిధంగా చిత్ర తల్లిదండ్రులకు అచ్యుతం పట్ల కలిగిన అభిప్రాయం, అతని ప్రవర్తనతో వారికి కలిగిన నమ్మకం, వారిమాటలు, వారి మధ్య నడిచిన సంభాషణలు అచ్యుతం వ్యక్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి.
5.4 అచ్యుతంలోని మానవత్వాన్ని చిత్రించిన సన్నివేశం:
గదిలోకి అద్దెకు దిగగానే అచ్యుతాన్ని పరిచయం చేసుకున్న మొదటి అమ్మాయి (బియాట్రైస్) బెట్టి. ఒక ఆంగ్లో ఇండియన్. చూడగానే ఆకర్షించే తేనె రంగు కళ్ళు, గులాబీ రంగు గౌను, కలుపుగోలుతనంగా మాట్లాడే తీరు. బెట్టీకి అచ్యుతం పట్ల ఎనలేని అభిమానం. వీటన్నింటికి తోడు అచ్యుతం చేత బలవంతంగా సిగరెట్ మాన్పించిన మొండితనం ఇది బెట్టీ వ్యక్తిత్వం.
బెట్టి తండ్రి చాలాకాలంగా టీ.బీ.తో బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన అనారోగ్యం తీవ్రమవడంతో అర్ధరాత్రి పరిగెత్తుకుని వచ్చి అచ్యుతం తలుపు తడుతుంది. ఆ రాత్రి అచ్యుతం తనకు తెలిసిన వైద్యంతో పాటు సీనియర్ డాక్టర్ల సలహాలుతీసుకుని బెట్టి తండ్రికి వైద్యం చేస్తాడు. అయినా అప్పటికే వ్యాధి విషమించడంతో బెట్టి తండ్రి మరణించాడు. అందరూ ఏడుస్తూ ఉంటారు. "ఆ సమయంలో అచ్యుతం ఏడ్చింది బెట్టి నాన్న కోసం కాదు బియాట్రైస్ భవిష్యత్తును తలుచుకొని. అచ్యుతం బెట్టి కుటుంబానికి చాలా సహాయపడ్డాడు. ఆయన శవాన్ని గ్రేవి యార్డుకి చేర్చడం నుంచి ఇన్సూరెన్స్ వచ్చి చెక్ బ్యాంకులో జమ కట్టేదాకా సహాయపడ్డాడు. వారం రోజులు హాస్పిటల్ కి వెళ్లడం మానేసి బెట్టి నాన్న ఇన్సూరెన్స్ విషయంలో ప్రావిడెంట్ ఫండ్ విషయంలో పెన్షన్ విషయంలో ఆఫీసుకు తిరుగుతాడు."(11)
విశ్లేషణ:
సాధారణంగా బెట్టి పై అచ్యుతానికి ఉన్నది ఆకర్షణ అయితే ఆ సమయంలో బెట్టి భవిష్యత్తును గురించి ఆలోచించి వాళ్ల కుటుంబానికి అంత సహాయం చేసేవాడు కాదు. ఆమె కోసం వారం రోజుల సమయాన్ని వెచ్చించేవాడు కాదు. అచ్యుతం మొదట బెట్టిలోని అందాన్ని, చిలిపితనాన్ని చూసినా ఆ తర్వాత బెట్టి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం, దిగులు ఏర్పడ్డాయి. బెట్టి బాగుండాలని ఆలోచించాడు. కాబట్టే అంత సమయాన్ని ఆమెకోసం వెచ్చించి పనులన్నీ చక్కబెట్టాడు. అప్పటివరకు సరదాగా వ్యవహరించిన అచ్యుతం తీరు, తండ్రి మరణం తర్వాత బెట్టి విషయంలో వ్యవహరించిన విధానం పాఠకుడి మనసులో అచ్యుతం ఒక బాధ్యతాయుత ప్రేమికుడిగా ముద్రపడేట్లు చేశాయి.
5.5 అచ్యుతంలోని మానసిక సంఘర్షణ:
ప్రతి వ్యక్తిజీవితం సంఘర్షణామయం. అనేక సందర్భాల్లో మనిషి అంతర్బహిర్గత సమన్వయం కోసం పోరాడుతూనే ఉంటాడు. ఆ మానసిక రాపిడిలో నుంచి జీవితాన్ని మలుపు తిప్పే మార్గాన్ని ఎన్నుకుంటాడు. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు. అది ఆ మనిషి వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది.
రచయిత అచ్యుతం పాత్రను మానసిక సంఘర్షణకు గురిచేసి, అందులో నుంచి తాను తీసుకునే నిర్ణయాల ద్వారా కథాగమనాన్ని మలుపు తిప్పుతాడు. అదే కథకు ప్రధాన సంఘటనగా మారింది.
అచ్యుతానికి అందరితో కలిసి రోజూ సాయంత్రం సరదాగా మాట్లాడుకోవడం అలవాటుగా మారిపోయింది. అలా మాట్లాడుకుంటూ ఉంటే అచ్యుతం వాళ్ళని చూస్తూ ఉండిపోయేవాడు. అలా చూస్తూ ఉండగా అచ్యుతంలో ఒక ఆలోచన మొదలైంది. "తను వెళ్ళిపోతే ఈ ఆరుగురు ఏమైపోతారు?" అన్న ఆలోచనతోనే అచ్యుతంలో మానసిక సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఆ సంఘర్షణలోనుంచి ఒక నిర్ణయం పుట్టుకొచ్చింది. అదే సైకాలజీ ప్రొఫెసర్ "మధుకర్" ను కలుసుకుని సలహా తీసుకోవడం. మధుకర్ కు తన సమస్యను వివరించే సన్నివేశంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషల ద్వారా అచ్యుతంలో చెలరేగిన మానసిక సంఘర్షణను రచయిత పాఠకుడి ముందు ఆవిష్కరింప చేశాడు.
అచ్యుతం మధుకర్ కు తన సమస్యనంతా వివరించాడు. "దాదాపు సంవత్సరం క్రితం ఆ గది అద్దెకి తీసుకున్నాను. చేరిన నెలలో ఆరుగురు అమ్మాయిలకి నేనంటే ఇష్టం ఏర్పడింది అని గ్రహించాను. వీలైనంతవరకు నా మీద వాళ్లకు ఇష్టం పెరిగేలా అనేక విధాలుగా ప్రయత్నించాను. వాళ్ల ఆనందం కోసం నా సరదాలు ఎన్నో వదిలేసాను. సాయంత్రం వాకింగ్ స్మోకింగ్ మొదలైన అలవాట్లన్నీ పూర్తిగా మానేశాను. వాళ్లకి నామీద ఇష్టం క్రమంగా ప్రేమగా మారింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తమ ప్రేమను వ్యక్తం చేశారు. నేను వాళ్ళని ప్రేమించాను. ప్రేమిస్తున్నానని కూడా చెప్పాను."(12)
"అది నీకు నిజంగా సాధ్యమైందా" అని నవ్వుతూ ప్రశ్నించాడు ప్రొఫెసర్.
"ఎవరిని మభ్యపెట్టడం కాదు నేను నిజంగానే వాళ్ళని ప్రేమిస్తున్నాను". అని ఆవేశంగా చెప్పాడు అచ్యుతం.
అందరినీనా అని మధుర్ అడగగానే "అవును. అందరినీ. నేనంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. చిత్ర నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతోంది. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే అడుగుతారు. వాళ్లు నేనంటే చూపించే ఆప్యాయత చూస్తే ఆ ఆరుగురు నాకోసం ప్రాణమిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని నాకు అనిపిస్తోంది." అని సమాధానమిచ్చాడు.
"ఇందులో సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అందరిలో మీకు ఎవరు బాగా నచ్చారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు." అని మధుకర్ అనగానే- అచ్యుతం "అక్కడే అసలు సమస్య ప్రారంభం అయ్యేది. ఇన్నాళ్లు నేను ఆ ఆరుగురుని నువ్వు లేకపోతే బతకలేను అని నమ్మించాను. నిజం కూడా అంతే. నాకు అందరూ సమానమే వాళ్లలో ఎవరిని పెళ్లి చేసుకున్న మిగతా ఐదుగురు బాధపడతారు. బాధపడటమే కాదు నమ్మించి మోసం చేశారని అనుకుంటారు నాకు ఎవరి మనసు నొప్పించడం ఇష్టం లేదు".(13) అన్నాడు.
"క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. వాళ్లలో ఎవరితోనైనా... మీకు శారీరక సంబంధం... అని మధుకర్ ప్రశ్న పూర్తి చేయకముందే అచ్యుతం "ఛీ ఛీ! ఎవరితోను లేదు. నేను అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పుకోను. కానీ వాళ్ళని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు." (14) అని చెప్పాడు.
"గుడ్. ఐతే, ఎవరిని పెళ్లి చేసుకోకుండా మీ దారిన మీరు వెళ్లిపోవడం మంచిది ఏ సమస్య ఉండదు."(15) అని మధుకర్ అనగానే "వెళ్ళనివ్వరు అలా వెళ్లలేను కూడా వాళ్ళు ఆరుగురు నా జీవితంలో ఓ భాగం అయిపోయారు. వాళ్ళు అంటే నాకు ఇంత వ్యామోహం ఉందని నేను ఎప్పుడూ ఊహించనైనా లేదు. వాళ్ల నుంచి విడిపోవలసి వచ్చినప్పుడు ఇప్పుడు అది అర్థం అవుతోంది. వాళ్ళని విడిచి దూరంగా బతకగలను కానీ ఆ బతుకు దుర్భరంగా ఉంటుంది."(16) అని సమాధానమిచ్చాడు.
"మీరు వెళ్లిపోతున్నట్లు వాళ్లకు తెలుసా" అని ప్రొఫెసర్ అడగగానే అచ్యుతం "ఇంతవరకు చెప్పలేదు ఓ స్నేహితుడు మిమ్మల్ని కలుసుకొని, సలహా తీసుకోమని మీ అడ్రస్ ఇచ్చాడు. మీ సలహా తీసుకున్న తర్వాత చెబుదామనుకున్నాను అని చెప్పాడు." అన్న సమాధానం అచ్యుతం ఎంత మానసిక సంఘర్షణకు గురయ్యాడో రచయిత సంభాషణల ద్వారా వ్యక్తపరిచారు.
విశ్లేషణ:
సాధారణంగా మనిషిలో మొదలయ్యే సంఘర్షణకు కారణాలు అంతర్గతమైన ఆలోచనలు, బాహ్య సంబంధమైన సన్నివేశాలు ఏవైనా కావచ్చు. ఈ నవలికలో రచయిత చిత్రించిన సన్నివేశాల ఆధారంగా రోజూ ఆరుగురు అమ్మాయిల లోనే ఆనందాన్ని చూస్తూ ఉండే అచ్యుతం మనస్సులో ఒక్కసారిగా మెదిలిన ఆలోచనే అతనిని సంఘర్షణలో పడే విధంగా చేస్తుంది. ఆ సంఘర్షణలోంచి అచ్యుతం ఎంచుకున్న మార్గమే పాఠకులు ఊహించని మలుపు తిప్పగలిగింది.
పై సన్నివేశాలలో అచ్యుతం, మధుకర్ల మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా అచ్యుతం ఆ ఆరుగురు అమ్మాయిలలో పెళ్లి చేసుకుంటానని ఆలోచన తనే రేకెత్తించినట్టు, వాళ్ల ఆశలకు తనే కారణమైనట్టు చాలా నిజాయితీగా ఒప్పుకోవడం, మధుకర్ వారి పట్ల తప్పుగా వ్యవహరించమని సలహా ఇవ్వగానే అచ్యుతం చాలా ఆవేశపూరితంగా అటువంటి పని నేను జన్మలో చెయ్యను. అని చెప్పడం అచ్యుతంలోని నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తాయి.
6. అచ్యుతం సమస్యకు మధుకర్ పాత్ర ద్వారా రచయిత చూపిన పరిష్కారం:
రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని, తన ఆదర్శాలను పాత్రల నోటనే సంభాషణల రూపంలోనో, ఆ పాత్ర చేష్టలలోనో చెప్పించగలడు. అచ్యుతం సమస్యకు పరిష్కారాన్ని రచయిత మధుకర్ పాత్ర ద్వారా చెప్పించాడు. అచ్యుతంలోని నిస్సహాయతకు మధుకర్ సలహా అందించడం అతని వ్యక్తిత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా మార్గ నిర్దేశం చేయడం ద్వారా రచయిత మధుకర్ ఔన్నత్యాన్ని చిత్రించాడు.
మధుకర్ అచ్యుతం మనసులో ఆరుగురు అమ్మాయిలపై ఏర్పరుచుకున్న అభిప్రాయం పూర్తిగా తప్పు అంటూ, తన అనుభవంలో ఇలాంటివి చాలా చూశానని,అతినిది సమస్యనే కాదు అని సమాజంలోని వ్యక్తుల మానసిక ప్రవర్తనను సామాన్యం చేసి చెబుతాడు. అచ్యుతం పెద్దదిగా భావించిన సమస్యను సాధారణమైనదిగా వివరిస్తాడు.
"మీరు ఒప్పుకోరు అని నాకు తెలుసు కానీ వాళ్లందరికీ మీ మీద ఇప్పుడు ఉన్న ఇష్టం, ప్రేమ, ఆరాధన, ఆప్యాయత ఎక్కువ కాలం ఉండవు. యూస్ రేషనల్ థింకింగ్. సింపుల్ వెరీ సింపుల్. అందరూ ఎర్లీ టీన్స్ లోఉన్నారు. టీన్స్ లో ఉన్నప్పుడు ప్రేమించాలని ప్రేమించబడాలని అందరికీ కోరిక కలగడం సహజం. అలా ప్రేమించబడాలని, ప్రేమించాలని కలలుగనే వయస్సే టీన్స్ అంటే. ప్రేమించడానికి అందుబాటులో ఉన్న ఎవరినైనా ప్రేమిస్తారు. వాళ్ళకి బహుశా మీరు తప్ప ఇంకెవరు అందుబాటులో లేరు, దొరకలేదు అనాలి. మీలో ప్రత్యేకత ఏమీ లేదు స్మార్ట్ పర్సనాలిటీ, పెద్ద చదువు తప్ప. ఏమీ అనుకోకండి ఉన్న మాట కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పినందుకు."(17) అంటూ "వయసు పెరిగి లోకం అంటే ఏమిటో తెలిసే కొద్దీ, కొత్త పరిచయాలు అభివృద్ధి అయిన కొద్దీ, మీ మీద ఉన్న ప్రేమ, ఆకర్షణ క్రమంగా వాళ్ళకి తగ్గిపోతాయి. మీరు ఇప్పుడే విడిపోతే మీ మీద ప్రస్తుతం హృదయాలలో ఉన్న భావన ఎల్లకాలం నిలిచేందుకు ఆస్కారం ఉంది. టీన్స్ దాటగానే ఇప్పుడు మీరు కనబడుతున్నంత ఆకర్షణగా కనబడరు. ఉదాహరణకి రోమియో అండ్ జూలియట్ ఎర్లీ టీన్స్ లోని ప్రేమికులు వాళ్ళ వయస్సు ఇంకా ఎక్కువ ఉంటే మామూలుగా ప్రవర్తించగలిగే వాళ్ళు. మరణించే వాళ్లు కాదు. హార్మోన్స్ ఆ తర్వాత అంత బలంగా అలజడి చేయవు."
విశ్లేషణ:
ఈ నవలికలో మధుకర్ అచ్యుతానికి సలహాలు ఇవ్వడంతోనే తన పని అయిపోయినట్లుగా భావించకుండా ఆరుగురికి అచ్యుతం దూరం అయిన వారం రోజులతర్వాత ఆ అమ్మాయిలు ఉన్న చోటికి వెళ్లడం వారి పరిస్థితులను తెలుసుకోవడం, అచ్యుతం రాక కోసం ఎదురు చూస్తున్న ఆ యువతులకు ఇంక అతడు ఎప్పటికీ తిరిగి రాలేడని, రోడ్ యాక్సిడెంట్లో ఊరికి వెళ్లే సమయంలోనే మరణించాడని చెప్పి వారి మనసుల్లో అచ్యుతం పట్ల ఉన్న ఆరాధనను తగ్గకుండా చెప్పాడు. తిరిగి వస్తాడు అన్న ఆశను మాత్రమే చంపేస్తాడు. దీనివల్ల అచ్యుతంపై ఆశలు పెట్టుకొని ఎదురు చూడటం మాని ఆ ఆరుగురు వాళ్ళ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్నదే మధుకర్ ఉద్దేశం.
పై సన్నివేశ ఆధారంగా మధుకర్ ఆ ఆరుగురి భవిష్యత్తును ఆలోచించి వ్యవహరించిన తీరు అతనికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు అద్దం పడుతుంది. ఇక్కడ మధుకర్ పాత్రచేత చెప్పించిన విషయాలు రచయిత ఈ సమాజానికి చెప్పదలచినవి. రచయిత తాను చెప్పదలుచు కున్న విషయం తగిన సన్నివేశకల్పన తో తగిన సంభాషణల చేత పాఠకుల మనస్సులోని చొప్పించారు.
7. ముగింపు:
- ఈనాడు సమాజంలో ప్రేమ పేరుతో అమ్మాయిలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలను రోజు చూస్తున్నాం, వింటున్నాం. ప్రేమిస్తే ఎలాగైనా దక్కించుకోవాలి. ప్రేమంటేనే స్వార్థం అని ప్రేమ ఉన్నచోటే అసూయ ఉంటుందనే కొత్త కొత్త నిర్వచనాలు, తప్పుడు సందేశాలు యువత ఆలోచనలను తప్పు మార్గం పట్టిస్తున్నాయి. వాస్తవానికి ప్రేమ దైవత్వంతో కూడినది. ప్రేమ జాలి దయ, కరుణ, మానవత్వం, భక్తి బాధ్యతలతో కూడినది.
- అద్దెకిచ్చిన హృదయాలు నవలికలో మల్లాది వెంకటకృష్ణమూర్తి అచ్యుతం పాత్ర ద్వారా నిజమైన ప్రేమికుడిలో ఉండాల్సిన ఉన్నత లక్షణాలను చక్కని సన్నివేశాలు, సంభాషణలతో పాఠకుల హృదయాలకు హత్తుకునే విధంగా చిత్రీకరించాడు.
- సాధారణంగా ఒక రచన మీద ఆ రచయిత వయస్సు, పరిసరాల ప్రభావం, ఆలోచనల ప్రభావం తప్పనిసరిగా ఉంటాయి. వాటి ప్రభావంతో వచ్చిన నవలలు, కవితలు సాహిత్య ప్రపంచంలో ఎంతటి ప్రాచూర్యం పొందాయో మనం వేరే చెప్పనక్కరలేదు. ఉదాహరణకు మహాప్రస్థానంలో శ్రీశ్రీ తన జీవితంలోని అనేక దుఃఖపూరిత సన్నివేశాలను చూసినప్పుడు తన హృదయస్పందన లోంచి వచ్చిన కవిత్వం. అదేవిధంగా గురజాడ వారి కన్యాశుల్కం నాటకం. ఇది కూడా ఆనాటి పరిస్థితులను తెలియజేస్తూ గురజాడ వారి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది. ఒక రచయిత వాస్తవిక ఆలోచనల నుండి జీవితఅనుభవంలో నుండి పుట్టిన రచన కాబట్టే సమాజంలో అంత ఆదరణను పొందింది.
- అద్దెకిచ్చిన హృదయాలు నవలిక రచయిత మల్లాది సొంత ఆలోచనలో నుంచి పుట్టినది అని తానే స్వయంగా చెప్పుకున్నారు. వ్యాపారనవలారచయితగా పిలవబడుతున్న మల్లాది ఈ నవలిక కేవలం వినోదం కోసం వ్యాపార దృష్టితో మాత్రమే రాసినట్లయితే ఆ తరం యువతకు ప్రతినిధిగా చిత్రించిన అచ్యుతం పాత్రను ఒక స్వార్థపూరితుడిగానో, మోసగాడిగానో చిత్రించి ఉండవచ్చు అలా కాకుండా ఆ పాత్రను ఒక బాధ్యతాయుతమైన యువకుడిగా, వృత్తిపట్ల నిబద్ధత, ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తిగా చిత్రించడం అనేది రచయితకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియపరుస్తుంది.
- ప్రేమంటే అందం ఆకర్షించడమే కాదు. అభిమానించడం, ఆరాధించడం, ఆదరించడం, ఆపదలో ఆదుకోవడం. ఇలాంటివన్నీ కలిసినపుడే నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది. అవసరమైతే ఆ ప్రేమ త్యాగానికి కూడా వెనకాడదని రచయిత ఈ నవలిక ద్వారా స్పష్టం చేశారు.
- అచ్యుతం పాత్రను ఆనాటి యువతకే కాదు,ఈ తరం యువతకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.
- రచయిత "వ్యక్తుల వయస్సును బట్టి మానసిక పరిణితి ఉంటుందనీ, ఆ మానసికపరిణితిని బట్టే ఆ వ్యక్తుల ప్రవర్తన ఉంటుందనీ, ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టే ప్రేమలో స్థిరత్వం ఉంటుందని" గొప్పగా వ్యాఖ్యానించారు.
8. పాదసూచికలు:
- మల్లాదితో వ్యాసకర్త ముఖాముఖి (ఇంటర్వ్యూ)
- నవల వెనుక కథ మల్లాది వెంకట కృష్ణమూర్తి పుట 10
- నవల వెనుక కథ. వెంకట కృష్ణమూర్తి. మల్లాది. పుట సంఖ్య 18
- నవలా శిల్పం. వెంకటసుబ్బయ్య. వల్లంపాటి. పుట. 44
- నవల వెనుక కథ. వెంకట కృష్ణమూర్తి. మల్లాది. పుట.18
- నవలాశిల్పం. వెంకటసుబ్బయ్య. వల్లంపాటి. పుట. 33
- తెలుగు నవలా వికాసము. నాగభూషణ శర్మ. మొదలి. పుట.37
- అద్దెకిచ్చిన హృదయాలు నవలిక. వెంకట కృష్ణమూర్తి. మల్లాది. పుట.162
- పైదే. పుట.190
- పైదే. పుట.191
- పైదే. పుట.193
- పైదే. పుట.204
- పైదే. పుట.204
- పైదే. పుట. 204
- పైదే. పుట.205
- పైదే. పుట. 205
- పైదే. పుట. 207
9. ఉపయుక్తగ్రంథసూచి:
- నాగభూషణశర్మ, మొదలి. తెలుగు నవలావికాసము. నాట్యకళాప్రెస్, హైదరాబాదు, తెలంగాణ, 1971.
- యమునారాణి, జి. మల్లాదితో ముఖాముఖి (ఇంటర్వ్యూ - ఆడియో ఫైల్). హైదరాబాద్. మార్చి 8, 2023.
- వీరభద్రయ్య, ముదిగొండ. నవల- నవలా విమర్శకులు. మూసీ. హైదరాబాదు. 2000.
- వెంకట కృష్ణమూర్తి, మల్లాది. అద్దెకిచ్చిన హృదయాలు. ప్రిజమ్ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్,హైదరాబాదు, 2018.
- వెంకట కృష్ణమూర్తి, మల్లాది. నవల వెనుక కథ. గోదావరి ప్రచురణలు, కరపమండలం, ఆంధ్రప్రదేశ్. 2020.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. నవచేతనాపబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, తెలంగాణ. 2021.
- వెంకటేశ్వర్లు, పుల్లాబొట్ల. తెలుగు నవలాసాహిత్యవికాసము. కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాదు, 1994.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.