AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
12. 'అరుణతార' పత్రిక: దోపిడీ కథల విశ్లేషణ
డా. వి. రామకృష్ణ
స్వతంత్రపరిశోధకులు
మచిలీపట్టణం
కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9949622251, Email: vrk1987vrk@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో కథానికకు విశిష్టస్థానం ఉంది. సమాజంలో ఉన్న అనేక విషయాలను ఎల్లప్పుడూ పాఠక లోకానికి అందిస్తూ సమసమాజ నిర్మాణాభివృద్ధి దిశగా కథానిక కొనసాగుతుంది. ప్రజల్లో మార్పును తీసుకువచ్చే ప్రధాన సాధనాల్లో పత్రిక ఒకటి. అందుకే సమాజపు నాల్గవ స్థంభంగా పత్రికలను చేర్చారు. అలా ఆవిర్భవించిన పత్రికల్లో ‘అరుణతార పత్రిక’ఒకటి. ఈ అరుణతార పత్రికలో ప్రచురించబడిన కొన్ని దోపిడీ కథలను విశ్లేషంచడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.
Keywords: అరుణతార, పత్రికలు, కథలు, సామాజికాంశాలు, దోపిడి.
1. ఉపోద్ఘాతం:
ఈ నా పరిశోధనా వ్యాసంలో అరుణతార పత్రికలో 2001-2010 సంవత్సరాల మధ్య ప్రచురించబడిన మూడు దోపిడీ ఇతివృత్తం కల్గిన కథలను స్వీకరించి విశ్లేషణ చేయడం జరిగింది. వాటిలో 1. అదృశ్యరూపాలు అనే కథను పెద్దింటి అశోక్ కుమార్ రచించారు. 2. బంగ్లాప్యూన్ అనే కథను ఉదయమిత్ర రాశారు. 3. సీతయ్య చెల్క అనే కథను ముదిగంటి సుజాతారెడ్డి రచించారు.
2. అదృశ్యరూపాలు:
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఈ కథలో రకరకాల విత్తనాలు తమవ్యధను నేలతల్లికి చెబుతున్నట్లు చిత్రించారు. వర్షంపడి నేలతల్లి పచ్చి బాలింతరాలిలా కన్పిస్తుంది. మొక్కలు నేలతల్లి గుండెల్లో వేళ్ళను దించి మొలకెత్తుతున్నాయి. కాని ఒక ఆముదపుగింజమాత్రం మొలకెత్తదు. నేలతల్లి ఆముదపుగింజను అడుగుతుంది. ఎందుకు మొలకెత్తట్లేదని? నేను ఎవరి కోసం మొలకెత్తాలి అని విరక్తిగా అడుగుతుంది ఆముదపుగింజ. నిన్ను నమ్ముకున్న రైతుకోసం అని అంటుంది నేలతల్లి. ఆముదపుగింజ చిన్నగా నవ్వింది. నేలతల్లితో ఇలా అంటుంది.
నా పుట్టుక మొదలయిననుండి నన్ను పుట్టిత్తనే ఉన్నవు. నేను గూడ నా ధర్మం ఎన్నడూ మరవలేదు. రైతు ఆకలి తీర్చిన ఇంట్లో దీపమై కాలిన కూరకు నారకు రుచిని తెచ్చిన కడుపునొస్తే, కాళ్ళు గుంజితే మందు చుక్కనై మంచిగ జేసిన. చిన్నపిల్లల మాడుకు రాస్తే రక్తంలో రక్తాన్నాయి పుర్రెకు బలాన్నిచ్చిన, వాళ్ళ నవ్వునూ, బతుకును చూసి మళ్ళీ మళ్ళీ మొలకై లేచిన, ఇప్పుడు నమ్ముకున్న వాడిని నడిమికి ముంచి అమ్ముకున్న వాడికోసం ఎందుకు మొలకెత్తాలని దళారుల దోపిడిని ప్రశ్నిస్తుంది ఆముదంగింజ.
నేను మొలకెత్తితే రైతు మరిన్ని అప్పులు జేసి కలుపుతీస్తాడు, మందులేస్తాడు. పండిన పంటను దళారుల చేతిలో పెడతాడు. నేను మొలవకపోతే కనీసం అప్పుల పాలవ్వకుండా ఉంటాడని వాపోతుంది.
ఆముదపుగింజ మాటలు విన్న నేలతల్లి పరిపరివిధాల ఆలోచించసాగింది. గిట్టుబాటు ధరలేక క్రాప్ హాలిడే రైతులు ప్రకటించడం వలన కన్నీటి వీడ్కోలు పలికిన పొగాకు గింజలు గుర్తుకు వచ్చాయి. వండుకు తినాల్సిన తనని అమ్ముకు తింటున్నారని ఆలుగడ్డ మాటలు మనసులో మెదిలాయి. బ్రెడ్ మీద జామ్ అయ్యానన్న టమాటా మాటలు జ్ఞప్తికి వచ్చాయి. గోధుమలు, బార్లీగింజలు బీరు, బ్రాందీలుగా మారుతున్నామని వెక్కి వెక్కి ఏడ్చాయి.
వరదలో కొట్టుకుంటూ వేరుశనగ గింజ వచ్చి అక్కడికి చేరుతుంది. తన బాధను వెళ్లగక్కుతుంది. సబ్సీడీ ధరతో వచ్చిన తనని దళారులు మోసం చేసి రైతులకు అధిక ధరకు అమ్మారని చెప్పి ఏడుస్తుంది. పంట పండాక కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరకే అమ్ముడై రైతులకు అప్పును మిగిల్చానని చెబుతుంది.
మాటల మధ్యలో చెరకుగడ ఎదురవుతుంది. తన గురించి చెప్పి ఆముదపుగింజకు నచ్చ చెప్పాలని చూస్తుంది. తను పంటపండిన తర్వాత గానుగలో బెల్లంగా మారి మార్కెట్ లేక సారాబట్టీలకు అమ్ముడై పోలీసులకు పట్టుబడ్డ రైతు చావుదెబ్బలు తిన్నాడని చెబుతుంది. అప్పుల బాధ మరవడానికి సారాకు అలవాటు పడిన చెరుకు రైతు గురించి చెబుతుంది. తాను పండిరచిన చెరుకునుండి బెల్లం తీసి సారా బట్టీలకు అమ్మి ఆ సారాను తాగి పేగులకు చెల్లులు పడి చనిపోయిన రైతును చూసి తల్లడిల్లిపోయిన చెరుకు ఏడుస్తుంది.
అయినా ఆముదగింజ మనసు మారలేదు. చెరకు రైతు ఒక్కడే సారాకు అలవాటు పడి చనిపోయాడు. కానీ తన వల్ల కుటుంబాలకు, కుటుంబాలే నాశనమవుతున్నాయి అని అంటుంది. నూనెలను కల్తీ చేసిన సరఫరా చేయడం వలన ఆ కల్తీ నూనెల వినియోగం ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కాబట్టి తాను మోలకెత్తనని చెబుతుంది.
ఆముదపుగింజను ఎన్నో విధాల సముదాయిస్తుంది నేలతల్లి. మంచి రోజులు రాక మానవు. నష్టమొచ్చినా, కష్టమొచ్చినా రైతుకు ఆసరాగా నిలవాల్సింది మనమే అని అంటుంది. నిన్ను పండిరచిన వాడి ఆకలి ఏనాటికైనా తీరుస్తావు అని చెబుతుంది. నేలతల్లి మాటలు విన్న ఆముదపు గింజ తన బాధను వెళ్ళగక్కింది. తాను మొలకెత్తనన్నది అందుకు కాదని చెబుతుంది. తనను పండిరచిన రైతుకు నేడు చేతితో తాకడానికి కూడా హక్కు లేకుండా చేసి, పేటెంట్ హక్కును పొందిన పరాయి దేశం చేతిలో చిక్కకుండా ఉండడానికి అని చెబుతుంది.
ఆముదంలో ఔషధం లక్షణాలున్నాయని అమెరికా కంపెనీ పేటెంట్ హక్కులను స్వంతం చేసుకుంది. ఈ లక్షణాలున్నాయని మనవాడికి ఎప్పుడో తెలుసు. అయినా నోరు విప్పడు అంటుంది. నేలతల్లి ఆముదం గింజను ఆర్తిగా గుండెలకు హత్తుకుంటుంది.
పరాయి దేశాలు పేటెంట్ల పేరుతో భారత దేశ పంటలను చేజిక్కించుకుంటున్నాయి నల్లమిరియాలు, బాస్మతి బియ్యం, ఆముదం వంటివి భారత దేశ సహజ సిద్ధ సంపద అని అందరికి తెలుసు. కాని పరాయివాడి పెత్తనాన్ని ఆపలేకపోతున్న భారత దేశ అధికారాలు, రాజకీయ నాయకులను ఈ కథ ద్వారా ప్రశ్నిస్తున్నారు రచయిత. ఆముదపుగింజ ఆత్మవ్యధ రచయిత అంతరంగంలోనిదే. నేటి సమాజంలో రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని కళ్ళకు కట్టినట్లు కథలో చిత్రించారు. తాను పండిరచిన పంటను తాను అనుభవించకుండా విదేశి మార్కెట్లకు అతి తక్కువ ధరకు సరఫరా చేసి, తాను పండిరచిన ముడిసరుకుతో అక్కడి నూతన ఉత్పత్తులు అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి రావడం గమనించదగ్గ ప్రధానాంశం. రైతు పండిరచే టమాటా జామ్‌గా మారుతుంది. గోధుమలు, బార్లీ గింజలు బీర్లు, బ్రాందీలుగా మారుతున్నాయి. నూనె గింజలు కల్తీ జరిపి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న పెట్టుబడిదారుల దోపిడిని ఈ కథ ద్వారా సమాజానికి తెలియజేసారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
‘నాగటి సాళ్లల్ల ఓ ఆముదం గింజ ఉలుకూపలుకూ లేకుండా ఉంది. నీళ్ళు తాగతలేదు. గాలిపీలుత్తలేదు. బయటకు వత్తలేదు. కండ్లు తెరుత్తలేదు. ఈ హడావుడి తనకేం పట్టనట్లు జీవం లేని దానిలా పడివుంది.’1 ఒక్క ఆముదం గింజ ద్వారా సమాజం యొక్క స్థితిగతులు, రైతుల జీవన విధానం, మార్కెట్ వ్యవస్థ ఇవన్నీ చెప్పించడం రచయిత ఒక వినూత్న ఆలోచన చేశాడు.
ఆముదం గింజకు రైతుపై ఉన్న ప్రేమ మమకారం మరెవరికీ లేదు. అది తనకంటే ఎక్కువ రైతుపై ప్రేమ చూపిస్తుంది. అది నేలతల్లితో రైతు గురించి సవివరంగా వివరించింది.
‘నేలతల్లి మరోసారి నవ్వింది. క్రాప్ హలీడే ప్రకటించినాక కన్నీటితో వీడ్కోలు చెప్పిన పొగాకు గింజలు గుర్తొచ్చినాయి. అప్పడెప్పుడో ఆలుగడ్డ... తల్లి! వండుకు తినాల్సిన నన్న నంజుకు తింటున్నారని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. టమాటనైతే బ్రెడ్ మీద జామ్ నయ్యానని బెంగటిల్లింది. గోధుమలు బార్లీ గింజలైతే మళ్ళీ పుట్టినిల్లు ముఖమే చూడడం లేదని బీరు బ్రాందీలమై ఎక్కడికో పోతున్నమని వెక్కి వెక్కి ఏడ్చాయి’.2
నేటి కాలంలో కూరగాయలు, పండ్లు ఏ విధంగా మారుతున్నవో వివరించారు. రైతు ముఖంలో సంతోషం అదృశ్యం అవుతుందని అలాంటి పరిస్థితి నుండి బయట పడాలని రచయిత మంచి వస్తువును తీసుకొని వివరించారు.
3. బంగ్లాప్యూన్:
ఉదయమిత్ర రాసిన ఈ కథలో ప్రధాన పాత్ర రాము. రీటా మధూర్ అనే ఒక ఛండశాసనురాలి ఇంట్లో పనిచేస్తుంటాడు. ఆమె ఒక మాట అన్నదంటే దానిని ఖచ్చితంగా అమలు పరిచి తీరాల్సిందే. ఆమె ఇంట్లో ఎలుక దూరితే రామని తిడుతూ గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. వంటింట్లో పరధ్యానంగా ఉన్న రాము ఆమె కేకలకు ఈ లోకంలోకి వస్తాడు. రాము ఆలోచనలలో తన గురించి తాను ఊహిస్తుంటాడు. తన బతుకు మీద తనకే అసహ్యం కలుగుతుంది. కుక్క కంటే హీనంగా ఉంది పల్లెటూరిలో దొంగ సారా అమ్మినప్పుడు దర్జాగా ఉండేవాడినని భావిస్తాడు. కడుపునిండినా, నిండక పోయినా స్వేచ్ఛగా ఉండేవాడు. కంటినిండా నిద్ర ఉండేది. ఈ బంట్రోతు ఉద్యోగంలో చేరిన తర్వాత అన్నీ కరువయినాయి అని బాధపడతాడు.
పర్మినెంట్ ఉద్యోగమని తెలిసి మొదట ఎగిరి గంతేస్తాడు. కానీ తర్వాత అతనికి తెలిసి వస్తుంది. బంట్రోతు ఉద్యోగం అంటే ఆఫీసులో అనుకుంటాడు. కాని ఒక పెద్దాపీసురు ఇంట్లో పనిచెయ్యాలని తెలియదు. అతడు డ్యూటీలో చేరిన మొదటి రోజే ఓ పెద్ద మనిషి రాముని మేడమ్ జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఆమెకు ఎదురు తిరిగితే నరకం చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. రాము చాకిరీ పొద్దున ఆరుగంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది. దానితో పాటు యాజమానురాలి తిట్లు, దండకాలు కొనసాగింపుగా ఉంటాయి. ఐదుగురు చేయాల్సిన పని రాము ఒక్కడే చేస్తూ ఉంటాడు. బట్టలు ఉతకడం, ఇల్లంతా శుభ్రం చేయటం, వంటపని, అంతా తానొక్కడే చేస్తుంటాడు. బజారుకు వెళ్ళి కూరగాయలు కూడా తానే తీసుకువస్తుంటాడు. ఆ కూరలు తాజాగా, చౌకగా ఉండాలి అని మేడమ్ గారి ఆర్డర్. ఆమె పోరుపడలేక, తాను కొంత డబ్బు కలిపి కూరగాయలను తక్కువ ధరకే తెచ్చినట్టు చెప్పి ఆమెను తృప్తిపరుస్తుంటాడు. ప్రతి విషయంలోను రామును తప్పుబడుతుంది, తిడుతుంది అతని యాజమానురాలు రాముకి రోజు రోజుకి ఆ ఉద్యోగం విడిచిపెట్టాలనిపిస్తోంది.
రాము తన ఊరి అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు కాని ఓ ముద్దూ ముచ్చటాలేదు. ఎక్కడికైనా వెళ్ళాంటే సెలవు దొరకదు. రాను రాను ఆమె శాడిజానికి అంతులేకుండా పోతుంది. ఆమె తన అధికారం అనే అహంకారంతో రాము మనసు గాయపరచని రోజు లేదు. ఉక్కులాంటి మనిషి దూదిపింజలా మారిపోతాడు రాము. దేన్నయినా సాధించగలననే ఆత్మ విశ్వాసంతో ఉండే రాము దేన్ని కూడా సాధించలేనన్న దీన స్థితికి వస్తాడు. ఎదురు తిరిగి మాట్లాడితే జీతంలో కోతపడుతుంది. కార్మికసంఘాలకు చెబితే వాళ్ళు కూడా చేతులెత్తేస్తారు.
ఒక రోజు తన యాజమాని ఇంట్లో పుట్టిన రోజు పంక్షన్ జరుగుతుంది. ఇల్లంతా సందడిగా ఉంది. వంటింట్లో రాము యాంత్రికంగా పనిచేస్తున్నాడు. అతడి ధ్యాసంతా ఇంటిపై ఉంది తన కూతురు లలితకు ఆరోగ్యం బాగాలేదు. రాముకి ఈ లోకంలో బాధల నుండి ఉపశమన మిచ్చేది తన కూతురు లలిత మాత్రమే. తను పీల్చే ప్రతి గాలిలో, ప్రతి పనిలో తన కూతురినే చూసుకుంటాడు. అర్థరాత్రి దాటాక ఇంటికి చేరుకుంటాడు రాము. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇరుగు పొరుగు వారి నడిగితే హాస్పిటిల్ కు వెళ్ళినట్లు చెబుతారు. పరుగు పరుగున హాస్పిటిల్ కి పోతాడు. గంటసేపు మృత్యువుతో పోరాడిన కూతురు మరణిస్తుంది. కూతురిని తీసుకుని ఇంటికి చేరిన రామును నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. కూతురు చనిపోయేటప్పుడు కూడా తననే కలవరించిందని అంటారు. తన బిడ్డ చావుకు కారణం తన యజమానురాలే. తనకి ఫోన్ చేసినా చెప్పకుండా ఉండటం చేత తన కూతురు చనిపోయిందని బాధపడతాడు. ఆ చింతతో మంచం పడతాడు. తేరుకోవడానికి వారం రోజులు పడుతుంది.
వారం రోజుల తర్వాత బంగ్లాకి వెళ్ళి తలుపు తడతాడు. వచ్చింది రాము అని తెలిసి యజమానురాలు వస్తుంది. రావడమే తడవుగా రాముపై తిట్లతో విరుచుకు పడుతుంది. కూతురి చావుతో మేడమ్ పై కోపంగా ఉన్న రాము ఆమె చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్క సారిగా రాము ఎదురు తిరిగే సరికి పిచ్చి దయిపోతుంది. నానామాటలు అంటుంది. ఉద్యోగం నుండి తీసేస్తాను అనికేకలు వేస్తుంది. రాము ఆమె ముఖం మీద ఉమ్మేసి ఈ ఉద్యోగం కాకపోతే, అడుక్కు తిని బతుకుతాను అని చెప్పి అక్కడి నుండి తలెత్తుకొని నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్న రాము యుద్ధంలో సైనికుడిలా కన్పిస్తాడు.
ధనిక వర్గాలు, పేద వర్గాలును ఎంత హీనంగా చూస్తున్నారో ఈ కథలో తెలియజేసారు ఉదయమిత్ర. వర్గపోరు అనేది ధనిక వర్గాల నిర్లక్ష్య ధోరణి కారణంగానే వస్తుందని ఈ కథలో చెప్పబడిరది. శ్రామిక దోపిడికి అలవాటుపడి, వారితో నిత్య చాకిరి చేయించుకొని కనీస అవసరాలలో కూడా వారిని నిర్లక్ష్యం చేసే రీటా మాధుర్ లాంటి యాజమానులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఎందరో రాములాంటి పని వాళ్ళు తమ జీవితాలను వెట్టిచాకిరీ చేస్తూ త్యాగం చేస్తున్నారు. కథలో రాము పాత్రను కరుణరసాత్మకంగా తీర్చిదిద్దారు రచయిత్రి. కథను చదివిన సహృదయ పాఠకుడు కంటనీరు పెట్టకమానడు.
‘పాపను ఒళ్లోకి దీసుకుని ఆటో ఎక్కాడు రాము. శరీరంలో నిస్సత్తువ ... చల్ల చెమటలొచ్చాయి .... అయిపోయింది.... తనపనే ఆఖరయ్యింది. బయట చీకటి, లోపల చీకటి. చిరునవ్వుల వెన్నెలలోలికించే తన చిన్నారి తన ఒడిలో ముద్దలా పడి వుంది. అదిప్పుడు ఉలకదు ... పలకదు ... ముద్దుమాటలాడదు గుండెల్ని పిండేసే అనుభవం.’3 ఆ దయ లేని కఠినాత్మురాలి వల్ల తన కంటిపాప ఆరిపోయింది. రచయిత బానిసలపై నిరంకుశ అధికారం మీద విరుచుకుపడ్డడు. యజమానులు తమ దగ్గర పనిచేసే నౌకర్లను ఏవిధంగా పీక్కుతింటున్నారో దీనిలో వివరించాడు. ఈ వ్యవస్థ వారి యొక్క శ్రమను దోపిడి చేస్తున్న వారిలో మార్పుకోసం దీనిని రాశారు.
‘ధూ.... అంటూ ఉమ్మేసి బాస్ కుగాకపోతే, ఆడి దేవుడికి జెప్పుకో నీబత్కుగాల... నీదొక బుతకేనావే... నువ్కొక మనిషిన్నావే? నా బొక్కలర్గదీసి. నీకు ఎట్టిజేసిన... లేసిన కాడ్నుంచి పండిరదాక మీకు శాకిరి జేస్తే ఆఖరికి నా పిల్ల సావు బత్కులల్ల ఉంటే... సంగతి చెప్పకపోతివి. నీకు నీ దావత్ ముఖ్యమయింది గాని. మేము కండ్లకిందకి కాన్రాలేదా? శాకిరి గావాలే....శాకిరి .... శాకిరి .... నియమ్మ.... పందులు మీరయి మమ్ముల పందులంటారే.... చీరేస్త.’4 పిల్లిని అయిన గదిలో బందించి కొడితే అది ఎదురు తిరుగుతుంది అంటారు. అలాంటిది మునుషులు తిరగబడరా? తిరగబడతారని ఈ కథలో మనం గమనించాం. పేదవాడి శక్తిని, శ్రమను, జీవితాన్ని దోచుకునే ఈ సమాజంలో మార్పు రావాలని రచయిత ఈ కథ ద్వారా పాఠక లోకానికి కనువిప్పు కల్గించారు.
రీటామాధుర్ లాంటి వారు సమాజంలో వున్నంతకాలం సమాజం మార్పురాలేదు అని తిరుగుబాటు చేసి వారిని అంతం చెయ్యాలని దీని ద్వారా వివరించారు.
3. సీతయ్య చెల్క:
ముదిగంటి సుజాత రెడ్డి రాసిన ఈ కథలో ప్రభుత్వం అమాయకరైతులను ఏ విధంగా మోసం చేస్తుందో చక్కగా చెప్పారు. కథలో ప్రధాన పాత్ర సీతయ్య. సీతయ్య తన నాలుగెకరాల పొలంలో జొన్న పంట వేస్తాడు. జొన్న చేను నెల రోజులు ఆగితే కోతకు వస్తుందన్న సమయంలో ముఖ్యమంత్రి బహిరంగ సభకు అతని పంటపొలం అనుకూలంగా ఉంటుందని భావించిన అధికారులు అతడిని కలిసి ఆ పంటకు పరిహారం ఇస్తాం అంటారు. అది విన్న సీతయ్య మెదడు పని చేయదు. కలెక్టర్ పోలీసులకు ఆ పంట పొలాన్ని ఏ విధంగా చదును చేయాలోనని ఆదేశాలు ఇస్తాడు. తెల్లవారే సరికి సీతయ్య జొన్న చేను గుర్తు పట్టకుండా తయారయ్యింది. పిల్లగాలులకు నాట్యం చేసే జొన్న చేను మాయమైంది.
ఎండల్లో దుక్కిదున్ని రోహిణి కార్తిలో జొన్న విత్తనాలు వేస్తాడు సీతయ్య. రోహిణిలో విత్తనం భూమిలో పడితే బలం అంటారు. పంట బాగా పండుతుందంటారు. విత్తనం వేసిన మొదట్లోనే రెండు వానలు పడటం చేత జొన్నచేను బాగా పెరిగింది. కొడుకు నాలుగు కంకులు కాల్చి తింటానంటే కసిరిన సీతయ్య అధికారులు నాశనం చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండిపోతాడు.
మరుసటి రోజు అక్కడంతా హడావిడి మొదలవుతుంది. మైకులో కార్యకర్తలు వినేవాళ్ళ చెవులు పగిలిపోయేటట్లు ‘ఇంకాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు రాబోతున్నారని’ గట్టిగా కేకలు వేస్తుంటారు. సీతయ్య ఉండే రాతిపాలెం చాలా చిన్న గ్రామం. ఆ ప్రాంతం నుండి ఎన్నికైన ఎమ్.ఎల్.ఎ. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉంటాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ అదే రావడం. ఆ గ్రామంలో ‘ప్రజ్వల’ అనే కవి పుట్టడం వలన ఆ గ్రామం గురించి అందరికి తెలిసింది. అట్టడుగు వర్గం వాళ్ళ, పేద రైతుల వెట్టి చాకిరిని చిత్రించిన కవి ప్రజ్వల మొదటి సారి దీనులు, ఆర్తుల పక్షంలో నిలిచి గొంతు విప్పినవాడు. ఆ కవి శతజయంతి ఉత్సవాలను జరపాలని హఠాత్తుగా ప్రభుత్వం తలపెట్టింది.
ఇప్పటి వరకు అతని గురించి మరిచిన ప్రభుత్వం అతనిపై హఠాత్తుగా ప్రేమ రావడానికి కారణం రాబోతున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఏవో పనులు చేయాలి. అందుకే ఆ కవి పుట్టిన గ్రామంలో స్మారక భవనం కట్టాలని నిర్ణయిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆఘమేఘాల మీద కదిలింది. సభను సజావుగా సాగడానికి సన్నాహాలు జరిగిపోయాయి. ముఖ్యమంత్రి రావడం ప్రజలకు ప్రజ్వల స్మారక భవనం సభాప్రాంగణంలోనే నిర్మిస్తామని మాటివ్వడం జరిగిపోయింది. ముఖ్యమంత్రి మాటలు విని సీతయ్య గుండెలో రాయిపడినట్లవుతుంది. అతడి శరీరమంతా చెమటలు పడతాయి. తన నాలుగెకరాల పొలం తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్చిన తనకున్న ఒకే ఒక్క ఆస్తి. తన వ్యవసాయం ఎలా నడుస్తుంది. తన భార్యా పిల్లలు ఏం తిని బతుకుతారు అని సీతయ్యలో లోపల కుంగిపోతాడు. తన బతుకు తెరువు ఏమౌతుందోనని భయపడతాడు. సభ పూర్తవుతుంది. సీతయ్య పొలం ఖాళీ అవుతుంది. సీతయ్య ఒక్కడే తన పొలాన్ని కలియచూస్తాడు. అతడి కళ్ళ నుండి కన్నీళ్ళుధారలు కడతాయి. సీతయ్యకు నష్టపరిహారం ఇస్తానన్న అధికారి కాగితం ఇచ్చి పట్నం రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు ఉదయాన్నే రెండొందల రూపాయలు కష్టంగా అప్పు సంపాదించి పట్నం బయలు దేరతాడు సీతయ్య. కలెక్టర్ కార్యాలయం గేటు దగ్గర జవాను చేతిలో పది రూపాయలు లంచంగా ఇస్తే కలెక్టర్ పి.ఏ. దర్శనమవుతుంది సీతయ్యకు. పి.ఏ. ఆలస్యం చేయకుండా సీతయ్యను కలెక్టరు గదిలోకి తీసుకొనిపోతాడు. సీతయ్య తెచ్చిన కాగితాన్ని చేతి కందించి పరిచయం చేస్తాడు. సీతయ్య పేర తయారైన చెక్కును తీసుకురండి అని పి.ఏ.ను ఆదేశిస్తాడు. కలెక్టర్ పి.ఏ. వెంట వెళ్ళమని సీతయ్యతో చెబుతాడు. సీతయ్యను పి.ఏ. తన టేబుల్ దగ్గరకు తీసుకొని పోయి ఓ పదికాగితాల మీద ఇరవై చోట్ల వేలిముద్రలు వేయించుకుని చెక్కును సీతయ్య చేతిలో పెడతాడు. సీతయ్య తెల్లబోయి ఆ చిన్న కాగితం వైపు చూస్తాడు. అది మీకు రావల్సిన వెయ్యి నూట పదహారు రూపాయల చెక్కు. దీన్ని బ్యాంకుకు పోయి డబ్బు తీసుకోవాలి అని వివరించి చెబుతాడు పి.ఏ సీతయ్యకేమీ తోచదు. తన చేనుకు నష్టంగా వచ్చేది వెయ్యి నూట పదహార్లేనా అని ఆశ్చర్యపోతాడు.
సంవత్సరమంతా సీతయ్య కుటుంబం తినే జొన్న పంటకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎన్ని రోజులు వస్తుంది. సీతయ్య గొంతు తడారిపోతుంది. నోట మాట సరిగా రాదు. దుఃఖంతో అంత పంటకు ఇంతేనా? అని పి.ఏ.ను ప్రశ్నిస్తాడు. పి.ఏ. అసహనంగా సమాధానమిస్తాడు. నీ జొన్న పంటకు అంత కంటే ఎక్కువ నష్ట పరిహారం రాదు. లెక్కకట్టే ఇచ్చేం అంటాడు. నీ భూమిలో నువ్వు ఇక ముందు నాగలి పెట్టి దున్నకూడదంటాడు. ఆ భూమిలో వ్యవసాయం చేయకూడదంటాడు. ఆ భూమిని ప్రభుత్వం స్మారక భవనం కోసం తీసుకుంది అని అంటాడు. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వానిది అంటాడు. ఆ భూమికి రావలసిన పరిహారం ప్రభుత్వం తొందర్లోనే నీకు మంజూరు చేస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న సీతయ్య చలిజ్వరం వచ్చిన వాడిలా అయిపోతాడు. అతడి శరీరమంతా ఒక్కసారిగా వణికిపోతుంది. అతని ఛాతి పగిలిపోయేటట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దం.. కదులుతాడు.
కాలం గడిచింది. తర్వాతి ఎలక్షన్లలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. కాని అక్కడ స్మారక భవనం కట్టబడదు. సంవత్సరాలు గడిచిపోయాయి. పార్టీలు, ప్రభుత్వాలు మారిపోతాయి. సీతయ్య భూమిని మాత్రం అధికారులు దున్ననియ్యలేదు. పరిహారం ఇవ్వనూలేదు. అది ప్రభుత్వం తీసుకున్న భూమి అని బోర్డు పెట్టబడి ఉంది.
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం అమాయకులను ఏ విధంగా హింసించి దోపిడికి గురిచేస్తుందో ఈ కథలో చక్కగా తెలియజేయబడిరది. రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డి ఈ కథను ఎంతో పరిణతితో రాసినట్లు తెలుస్తుంది. మార్కెట్ ధరలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం వలన సామాన్య రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో సీతయ్య జొన్న చేనుకు ఇచ్చిన నష్టపరిహారం ద్వారా తెలుస్తుంది. సంవత్సరం పాటు సీతయ్య కుటుంబం తినే పంటకు కేవలం వెయ్యి నూట పదహారులు నష్ట పరిహారంగా ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో పేదల నుండి విలువైన భూములను తక్కువ ధరకు తీసుకుని వారిని కూలీలుగా మారుస్తున్నాయి అని తెలియజేసే ఉద్దేశంలో ఈ కథ రాయబడిరది. ప్రభుత్వ విధానాలు ప్రజలుకు మేలు చేసేవిగా ఉండాలికాని సామాన్యులను ఇబ్బందులకు గురి చేసేలా ఉండకూడదని ఈ కథ ద్వారా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసారు రచయిత్రి ముదిగంటి సుజాతరెడ్డి.
‘సార్! నాపంట.... చేతికొస్తున్న గింజలు?... అని పైకి గులిగాడు. నీ పంటకేం డోకాలేదు సీతయ్యా! నీచేను చెడిపోయినా నీ పంటకు వచ్చే డబ్బు కన్నా ఎక్కువ డబ్బే నీకు పరిహారంగా ప్రభుత్వం ఇస్తుంది. ఏం భయం లేదు! బాధపడకు! ఆ డబ్బుతో ఏడాదంతా నువ్వు నీ కుటుంబం హాయిగా తింటూ కూర్చోవచ్చులే అన్నాడు కలెక్టర్’.5 ఈ కథ ప్రభుత్వపు దోపిడీ గురించి కళ్ళకు కట్టినట్లు చూపారు రచయిత్రి, ప్రభుత్వపు అవసరం కోసం పేద రైతు భూమిని స్వాధీనం చేసుకుని కనీస కిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా ఇబ్బందులలో తోసేసిన ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ రచయిత్రి చేసిన కనువిప్పు మనం గమనించవచ్చును.
పంటే లేకుండా కనుమరుగైపోతూ ఉంటే నీ పంటకేం ఢోకా లేదు అని చెప్పడం చూస్తే ఎలాంటి విధానంలో సాగిందో ఈ కథ అర్థం అవుతుంది. ‘నీ పంటకు వచ్చే నష్టపరిహారమంతే! అన్నాడు. పి.ఏ. సంవత్సరమంతా నేను, నా పిల్లలు, పెండ్లాం తినే జొన్నలు అంత పంటకు గింతేనా? పైసలు మాతిండికి ఎన్నిరోజులైతయి? అది పోంగ గీకాగితం నా చేతిల పెట్టిండ్రు! ’.6 ప్రభుత్వం పేదల భూముల్ని ఏదో ఒక విధంగా లాక్కుని, వాటికి కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా, వారు ఏ పనికోసం తీసుకున్నారో ఆ పనీ పూర్తిచేయక ఆ భూముల్ని రైతులకి ఇవ్వక ప్రభుత్వ స్వాధీన భూములు అని ఒక ముద్ర వేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రోడ్లు, భవనాలు, డ్యాంలు, విమానాశ్రయాలు అంటూ రైతుల భూములు తీసుకుంటున్నారు. ఆ భూములకు బయటి మార్కెట్‌లో ఉన్న ఖరీదు/రేటును గిట్టుబాటు ధరగా ఇవ్వకుండా మరీ తక్కువ మొత్తాన్ని ఇచ్చి రైతుల్ని రోడ్డున పడేస్తున్న విధానాన్ని రచయిత్రి తూర్పారబట్టారు.
4. ముగింపు:
‘ఆదుశ్య రూపాలు’ అనే కథలో ఒక ఆముదపు గింజ ద్వారా రచయిత రైతుల యొక్క దీన స్థితిని వివరించారు. అను నిత్యం కష్టపడి రాత్రి పగలు పంట పొలాల దగ్గర ఉండి ఎంతో జాగ్రత్తగా పంటను కాపాడి పండిరచిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును అప్పుల ఊబిలోకి దళారీలు తోస్తున్నారు. దళారీలు, మద్యవర్తులు, కార్పోరేట్ సంస్థలు రైతుల నుండి పంటను అతి తక్కువ ధరకు కొని, గిడ్డంగుల్లో నిల్వచేసి, మార్కేట్లులో తాత్కాలిక కొరత సృష్టించి వాటిని తీసి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రైతుల శ్రమదోపిడీ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి దోపిడీ నుండి రైతులు, ప్రజలు బయట పడాలని ఈ కథ ద్వారా రచయిత తెలియజేసారు.
‘బంగ్లాప్యూన్’ అనే కథలో క్రింది స్థాయి గుమాస్తాలు, ప్యూన్‌లు వాచ్‌మెన్‌ల జీవనం ఎంత దయనీయంగా ఉంటుందో వివరించారు. రీటామాధుర్ లాంటి కొంతమంది యజమానుల దగ్గర రాము లాంటి ఎంతో మంది చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కుటుంబ సభ్యులు చావు బతుకులో ఉన్నా సరే వెళ్ళి చూసి రావడానికి కూడా అనుమతించని ఆ యజమానుల ప్రవర్తనలో మార్పురావాలని రచయిత కోరారు.
‘సీతయ్య చెల్క’ అనే కథలో సామాన్య ప్రజల సమస్య పరిష్కారానికై ఏర్పడిన ప్రభుత్వాలు తమ పార్టీ స్వలాభం, ప్రచారం కోసమై గ్రామీణ ప్రాంత అమాయక ప్రజల, రైతుల భూములు, పంట పాలాలును ఏవిధంగా ప్రభుత్వ పరం చేసుకుంటున్నారో రచయిత కళ్ళకు కట్టినట్లు చూపారు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ విధమైన శ్రమ దోపిడీ విధానాన్నుంచి బయటపడాలని రచయిత ఆకాంక్షించారు.
4. పాదసూచికలు:
- అరుణతార పత్రిక -2003 - డిశంబరు - పెద్దింటి అశోక్ కుమార్-పుట.4.
- అరుణతార పత్రిక -2003 - డిశంబరు - పెద్దింటి అశోక్ కుమార్-పుట.3.
- అరుణతార పత్రిక -2008 - ఫిబ్రవరి - ఉదయమిత్ర - పుట.12.
- అరుణతార పత్రిక -2008 - ఫిబ్రవరి - ఉదయమిత్ర - పుట.13.
- అరుణతార పత్రిక -2006 - మే - ముదిగంటి సుజాతారెడ్డి - పుట.21.
- అరుణతార పత్రిక -2006 - మే - ముదిగంటి సుజాతారెడ్డి - పుట.24.
5. ఉపయుక్త గ్రంథసూచి:
- దక్షిణామూర్తి ఫోరంకి - కథానికా వాఙ్మయం, ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీ, హైదరాబాద్
- నరసింహారావు ఎ. (సంపాదకుడు)- నేనందుకు రాస్తున్నాను (వ్యాస సంకలనం)
- నాగయ్య జి - తెలుగు సాహిత్య సమీక్ష (2వ సంపుటం), నవ్య పరిశోధక ప్రచురణలు, 18-1-699, భవానీ నగర్, తిరుపతి-1, 1985.
- నారాయణ సింగమనేని - సమయమూ-సందర్భమూ (సాహిత్యవ్యాసాలు), విశాలాంధ్ర, హైదరాబాదు, 2002.
- నారాయణ సింగమనేని - తెలుగు కథలు, కథనరీతులు 1,2 సంపుటాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- ప్రభాకర్ ఏ.కె - తెలుగులో మాండలిక కథా సాహిత్యం, సాహితీ సర్కిల్, హైదరాబాద్, 2002.
- బీనాదేవి - తెలుగు కథ (విమర్శనాత్మక వ్యాససంపుటి), ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్టణం, 1974.
- మా కథ - తెలుగు రచయితల వేదిక, హైదరాబాద్, 2015.
- రమాపతిరావు అక్కిరాజు - తొలి తెలుగు కథానిక అందచందాలు, సాహితీ సంపద, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, షష్టిపూర్తి గ్రంథం, వరంగల్లు, 1993.
- రమాపతిరావు అక్కిరాజు - తెలుగు కథా వాస్తవికత సాహితీ వ్యాసంగం (వ్యాస సంకలనం), నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ - 1994.
- రాంబాబు వేదగిరి - తెలుగు కథా సమీక్ష, 1995, చిక్కడపల్లి, హైదరాబాద్.
- రామచంద్రారెడ్డి, ఆర్ - సారస్వత వివేచన, విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ, 1970.
- విహారి - ఆధునిక తెలుగు కథానిక - దాని అందచందాలు, భారతి, జనవరి, 1971.
- విశ్వామిత్ర జె - నవలయందలి సంవాదములు, స్రవంతి, జూలై, 1990.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.