AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
11. మృదంగవాదనం-పాలవరసలు: వివిధబాణీల విశ్లేషణ
ధన్వాడ అనంతరావు
సహాయాచార్యులు (మృదంగం), సంగీతవిభాగం,
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్,
ప్రశాంతినిలయం క్యాంపస్, పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9381166818, Email: danantharao@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
భారతీయ సంగీతంలో మృదంగవాదన ప్రాధాన్యం గురించి, వివిధబాణీలు, చిన్నపాలవరసలు, వివిధపద్దతుల గురించి, గురు-శిష్యపరంపరల గురించి, ప్రాంతాల వారీ అభ్యాసవిధానాల గురించి ఈ పరిశోధన వ్యాసం చర్చిస్తుంది. ఈ పరిశోధనకు వివిధ లక్షణ గ్రంథాలు, విద్వాంసులతో పరిపృచ్ఛలు ఆకరాలు. సంగీతంలో మృదంగవాదన ప్రాముఖ్యాన్ని అర్థంచేసుకోడానికి ఒక ముఖ్యసాధనంగా ఈ వ్యాసం ఉపయోగిస్తుంది. ప్రాథమికస్థాయి మృదంగాభ్యాసకులకు మెలకువలు బోధించడంలో ఈ వ్యాసం తోడ్పడుతుంది.
Keywords: మృదంగం, బాణీలు, పాలవరసలు, పద్ధతులు, అభ్యాసం, శాస్త్రీయసంగీతం
1. ఉపోద్ఘాతం:
మృదంగం మన దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళవాద్యము. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుంది. ఈ వాయిద్యము ఒక గొట్టపు ఆకారంలో ఇరువైపులా వాయించడానికి చదునుగా ఉంటుంది. భారతీయసంసృతిలో కచ్చేరీలలో ముఖ్యభాగముగా అన్ని కార్యక్రమాలలోనూ ఉపయోగించే ప్రధానమైన పరికరము మృదంగం.
2. మృదంగవాదనం – వివిధసందర్భాలు:
ఇది హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు, కచ్చేరీలలో ఉపయోగించు ప్రధానమైన పరికరము. ఉదా: 1. కర్ణాటక సంగీతం 2. భక్తి సంగీతం 3.నాట్యము 4. హరికథ 5. సాంప్రదాయ భజనలు. ఇప్పుడు వీటిని గురించి సంక్షిప్తంగా పరిశీలిద్దాం.
2.1 కర్ణాటక సంగీతం:
కర్ణాటక సంగీతంలో ఒక చిన్న సంగీత విద్వాంసులచే ప్రదర్శించబడుతుంది. ఇందులో ప్రధానంగా గాయకుడు, శ్రావ్యమైన సహ వాయిద్యం వయోలిన్, లయ వాయిద్యం మృదంగం మరియు తంబురా. ఈ ప్రదర్శనలో ఉపయోగించే ఇతర సాధారణ వాయిద్యం ఘటం కంజరా, మొర్సింగ్, వేణువు, వీణ.
2.2 భక్తి సంగీతం:
ఈ సంగీత సంప్రదాయం భక్తిరస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యాలు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి ఉంటాయి. ఈ భక్తి సంగీతంలో ముఖ్యంగా అన్నమాచార్యులు వ్రాసిన కీర్తనలు, నారాయణ తీర్థ తరంగం, క్షేత్రయ్య పదాలు, జావళీలు అన్నియు భక్తిరసమైనటువంటి కీర్తనలే. ఈ కీర్తనలు అన్నింటికీ కూడా మృదంగ సహకారం ఉంటుంది.
2.3. నాట్యము:
దక్షిణ భారతదేశమునందు ఖ్యాతి నొందిన శాస్త్రీయ నృత్యములగు భరతనాట్యము, కూచిపూడి మొదలగునవి. ఇందులో ప్రధానంగా గాయకుడు, నటువాంగము, సహ వాయిద్యం వయోలిన్ మరియు లయవాయిద్యం మృదంగం ఉంటాయి.
2.4. హరికథ:
హరికథ అన్నది తెలుగువారి సంప్రదాయక కళారూపం. సంగీత, సాహిత్య సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా విధ్వంసులు. ఈ హరికథకు సహాకార వాద్యముగా వయోలిన్ లేదా హార్మోనియం మరియు మృదంగం ఉంటుంది.
2.5. సంప్రదాయ భజనలు:
భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు అనేక సేవల రూపంలో ఈ భజనలు ఒకటి. దేవాలయంలోనూ, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపులుగా చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఈ భజనలో సహకార వాయిద్యాలుగా వయోలిన్, హార్మోనియం, తాళం, మృదంగం ఉంటుంది.
3. మృదంగ వాద్యాక్షరములగు “త.ది. తొం.నం” అక్షరాస్థానముల వివరణ:
షోడశ కళా పరిపూర్ణమైన మృదంగం కుడి మూత మీద “త” అనెడి అక్షరము, ఎడమున “ది” అనెడి అక్షరము. కుడిని ఉంగరం వ్రేలుతో అనిచి నాదం వచ్చేటట్టుగా వాయించి, ఎడమున ఏకకాలమందు కొట్టునది, “తోం” అనెడి అక్షరము. కుడిని ఉంగరం వ్రేలుతో అనిచి చూపుడు వ్రేలుతో రెప్ప మీద మీటునది “నం” ఇవియే అక్షర స్థానము ఒక బాణి.
3.1 వివరణము:
ప్రస్తారక్రమముతో “త” అనెడి అక్షరము ఎడమలో, కుడితో మీటు, నాటు, చాటు, అరచాటు, చెళ్ళు, నాదం మొదలగు స్థానములలో కూడా సమయస్ఫూర్తిగా వాడవలసి ఉండును.
3.2 వివిధ రకములైన బాణీలతో వరుసల ప్రస్తారలక్షణములు:
మృదంగం అభ్యసించినపుడు ముందుగా విద్యార్థికి పాలవరుసలు నేర్పుతాము. పాలవరుసలతో మొదటి పాఠము “త, ది, తొం, నం”. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఒక్కొక్క పాఠశాలలో పాలవరుసలు గురువు నేర్చుకున్న బాణీ ప్రకారం (బాణీ అనగా సంప్రదాయం) విద్యార్థికి నేర్పించడం జరుగుతుంది.
- ముందుగా ప్రస్తుత వ్యాసకర్త బాణీ ప్రకారం (అనగా వ్యాసకర్త నేర్చుకున్న గురువు విద్య) “త” అనే అక్షరము మృదంగం మీద ఎలా వాయించాలి అంటే.. మృదంగానికి ఎడమవైపు నాలుగు వేళ్ళతో పైన వాయించడంతో పాటు కలిపి, కుడి వైపున ఉన్నమూతకు క్రిందన ఉంగరం వేలు మరియు చూపుడు వేలుతో ఒకేసారి వాయించిన “త” అవుతుంది.
“త” మృదంగానికి కుడి వైపు
“త” మృదంగానికి ఎడమవైపు
- ఇక “ధి” అనేది కుడివైపు కుడి చేతితో చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుతో కలిపి ఒకేసారి వాయించవలెను.
"ధి" మృదంగానికి కుడి వైపు
- “తోం” ఎడమవైపున ఉన్న మూతకు ఎడమ చేతితో నాలుగు వేళ్ళు కలిపి (చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలుతో) వాయించవలెను.
“తోం” మృదంగానికి ఎడమవైపు
- ఇక చివరిది ఆఖరిది “నం”. అన్ని బాణీలతో ఒకే వేళ్ళు కలపడం అవుతుంది. అనగా కుడివైపు, కుడి చేతితో ఉంగరం వేలు నల్లగా ఉండే (కరిణి అంటారు) క్రిందన వేలు పెట్టి చూపుడువేలుతో వాయిస్తారు.
"నం" మృదంగానికి కుడి వైపు
విశ్లేషణ:
ఏ సంగీత పాఠశాలలో అయినా సరే గురువు పాలవరుసులతో మొదట పాఠం త ది తోం నం నేర్పిస్తున్నప్పుడు “త, ది, తోం” అనెడి మూడు అక్షరములు మృదంగం మీద వ్రేళ్ళతో వాయించినప్పుడు ఆయా గురువు నేర్చుకున్న బాణి (సంప్రదాయం) ప్రకారం విద్యార్థికి నేర్పించుదురు. కానీ “నం” మాత్రం మృదంగం మీద వేళ్ళతో వాయించే విధానం ఏ పాఠశాలలోనూ మార్చలేదు. ఎందుకంటే అరవంలో లేక శ్రీలంకన్ తమిళంలో ‘త’కి, ‘ద’కి ఒకటే పదం ఉంటుంది. (వాళ్ళ సాయిత్యంలో) ప, బ ఒకటే పదము. అలాగే చ, జ ఒకటే పదము. క, గ ఒకటే పదము ఉంటుంది.
ఉదా: “గిడదగ తరిగిడతొం” అని తమిళియన్స్ అంటారు. మనం “కిటతక తరికిటతొం” అని అంటాము. ఎందుకంటే మనకి అచ్చులు, హల్లులు ఉన్నాయి గనుక.
4. బాణీల యొక్క రకములు, పద్ధతులు మరియు ప్రయోజనాలు:
మృదంగం అనే తాళ వాయిద్యాన్ని మొదట వాయించినది తంజావూరులో రాజు సెర్బోజి దర్బార్లో ప్రముఖ సంగీతవిద్వాంసుడు ‘నారాయణస్వామి అప్ప’ అని మరాఠీ గ్రంథాలు చెబుతున్నాయి. అతను తన శిష్యుడైన దాస్ రావుకు నైపుణ్యాలను అందించాడు. తరువాత ఇది రెండు సంగీత పాఠశాలలో విడిపోయింది. 1. తంజావూరు బాణి, 2. పుతు కోట్టై బాణి.
4.1 తంజావూరు బాణి:
తంజావూరు శైలిలో గొప్ప బాణి తెచ్చింది తంజావూరు మహావైద్యనాథ అయ్యర్. నేడు ఆ బాణిని ముందుకు తీసుకు వెళుతున్నది టి.కే. మూర్తి, పాల్గాట్ మణి అయ్య. కానీ తంజావూరు బాణిని ధీటుగా వాయించగలిగిన వ్యక్తి టి.కే. మూర్తి. తంజావూరు బాణి చాలా గొప్ప మరియు సొగసైన ప్రవాహం. అంతేకాక మహా విద్వాంసులు ఈ తంజావూరు బాణిని నేర్చుకొని వారి ప్రతిభను చాటేవారు. ఈ బాణిలో గొప్పతనం ఏమిటంటే ఉదా: మణి అయ్యర్ మృదంగ లయ విన్యాసం వింటుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా సులభంగా ఉంటుంది.
4.2 పుతు కోట్టై బాణి:
పుతుకోట్టై శైలిలో గొప్ప బాణి తెచ్చినది పుతుకోట్టై మాన్పుండియా పిళ్ళై. ఈయన దగ్గర నుండి మృదంగ పాఠములు చాలామంది శిష్యులు నేర్చుకున్నారు. ఆ శిష్యులలో దక్షిణామూర్తి పిళ్ళై ఒకరు. ఈయన కర్ణాటక సంగీత కచేరీలలో సంగీతకారులతో పాటు ప్రముఖమృదంగ మరియు కంజర కళాకారుడు. ఇతని శిష్యులు 1. పళని సుబ్రమణ్య పిళ్ళై 2. తంజావూరు రామదాస్ 3. పాల్గాట్ మణి అయ్యర్ మొదలగువారు.
ప్రధానంగా ఈ రెండు బాణీలే మృదంగ వాదన సంప్రదాయాలలో గురు-శిష్యపరంపరగా వ్యాప్తి చెందాయి. ఈ రెండు బాణీలే దక్షిణభారతంలో వ్యాప్తిలో ఉండటానికి కారణం ఈ గురువుల శిష్యరికంలో క్రమంతప్పకుండా, నిరాఘాటంగా కళాకారులు చేరడం, ఆదరించడం, నేర్చుకోవడం ప్రదర్శనలివ్వడం, మరొకరికి నేర్పడం అని చెప్పవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని బాణీలు పరిమితమైన శిష్యపరంపరతో వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో ముళ్ళపూడి వారి బాణీ, శ్రీపాదసన్యాసిరావు వారి బాణీ మొదలైనవి పరిగణింపదగ్గవి.
4.3 ముళ్ళపూడి బాణి:
ముళ్ళపూడి వారి శైలితో బాణి తీసుకువచ్చినది శ్రీ ముళ్ళపూడి లక్ష్మణరావు. ఇతని బాణీలో పాలవరసలు వాయించు విధానం చూద్దాం.
- కుడి మధ్యలో వాయించేది "త" (వ్రేళ్ళతో)
- ఎడమపైన నాలుగు వ్రేళ్ళతో వాయించేది “ది”
- కుడి, ఎడమలు కలిపి వ్రేళ్ళతో వాయించేది “తొం”
- కుడి వైపున క్రిందన వాయించేది “నం”
ముళ్ళపూడి లక్ష్మణరావు వారికి ముగ్గురు ప్రియశిష్యులు కలరు. వంకాయల నరసింహం, శ్రీ కాట్రావులపల్లి వీరభద్ర రావు, శ్రీ ముళ్ళపూడి శ్రీ రామ్మూర్తి.
4.3.1 శ్రీ వంకాయల నరసింహం :
ఈ ముగ్గురు శిష్యులలో మా గురువు శ్రీ వంకాయల నరసింహం మొల్లపూడి లక్ష్మన్న రావు వారి వద్ద శిష్యుడిగా చేరకముందు మా గురువు శ్రీపాద సన్యాసిరావువద్ద ముందు మృదంగం అభ్యసించారు. అందువలన మా గురువు మాకు పాలవరుసలు నేర్పించినప్పుడు కొంత వ్యత్యాసం “త ది తొం నం” లు ఉండును.
4.3.2 శ్రీ కాట్రావులపల్లి వీరభద్రరావు:
ఇతనిది సంపూర్ణమైన, ఖచ్చితమైన ముళ్ళపూడి బాణి. వీరభద్ర రావుచే, శ్రీరామమూర్తి వారికి ఎక్కువగా ఆ బాణి మనకు వినిపిస్తుంది. అంతేకాక వీరభద్ర రావు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో మృదంగ అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన ఒక పద్ధతిగా మృదంగం లో ఉండే పాఠములు అన్ని ఒక క్రమ పద్ధతిలో చేర్చారు. అనగా 1. పాలవరుసలు 2. పెద్ద పాలవరుసలు 3. దాటు వరుసలు 4. తగ్గింపు వరుసలు 5. జంట వరుసలు 6. జాతి పాఠములు.
4.3.3 శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి:
ఆయన తండ్రి వద్ద విద్యను అభ్యసించారు. (ముళ్ళపూడి లక్ష్మణరావు ) శ్రీరామ మూర్తి , మృదంగమే కాకుండా విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత కళాశాలలో కోటిపల్లి గున్నయ్య వద్ద వయోలిన్ నేర్చుకున్నారు. శ్రీ ముళ్ళపూడి శ్రీ రామ్మూర్తి , శ్రీ వంకాయ నరసింహం ఇద్దరూ కూడా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నిలయ విద్వాంసులుగా ఉద్యోగం చేశారు.
4.4 దక్షిణ భారతసంగీతపాఠశాలల బాణీలు - మృదంగాభ్యాసనంలో విద్యార్థులకు మెలకువలు:
భారతదేశంలో సంగీతవిద్యలో ఒక భాగం. మన దక్షిణభారతదేశంలో అన్ని చోట్ల సంగీత పాఠశాలలో మరియు సంగీత కళాశాలలో సంగీత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఉదా: ఒక విద్యార్థి సంగీతపాఠశాలలో చేరిన తర్వాత గురువు, అతడి అభ్యాసం సౌకర్యంగా సాగడానికి, అవగాహనకు పాలవరుసలను ఏ విధంగా బోధిస్తారనేది ఈ క్రింది విధంగా అంచనా వేయవచ్చు.
- గురువుకు ఒక బాణీ ఉంటుంది. గురువు ఆ విద్యార్థికి పాలవరుసలు బోధించేటప్పుడు అవి విద్యార్థి అంతకుముందు ఏ గురువు దగ్గరైనా మృదంగాభ్యసనంలో నేర్చుకున్నాడా అని ఆ గురువు ముందుగా అడిగి తెలుసుకోవాలి.
- ఒకవేళ ఆ విద్యార్థి అంతకు ముందే వేరే గురువు దగ్గర మృదంగం నేర్చుకుంటే, అది ఏ బాణితో నేర్చుకున్నాడనేది తెలుసుకోవాలి. ఆ బాణీ గురించిన అవగాహన గురువుకు తప్పనిసరిగా ఉండాలి.
- ఆ విద్యార్థి అంతకుముందు గురువు వద్ద మృదంగం నేర్చుకున్న బాణీనే ప్రస్తుత గురువు కూడా నేర్పించడం వల్ల విద్యార్థికి సులువుగా మృదంగపాఠాలు అర్థమవుతాయి.
- ఈ పద్ధతిలో విద్యార్థి తొందరగా నేర్చుకోగలుగుతాడు. తద్వారా అంతకు ముందు ప్రాథమిక స్థాయిలో పూర్వబాణీలో తాను చేసిన అభ్యాసం, తరువాత కూడా మారకుండా కొనసాగించగలుగుతాడు.
- ఒకవేళ ఇతరుల దగ్గర ఆ విద్యార్థి మృదంగశిక్షణ తీసుకోకుండా ఒకే గురువు దగ్గర నేర్చుకుంటే, అప్పుడా గురువు తన బాణీలోనే పాలవరసలను విద్యార్థికి బోధించవచ్చు.
ఏ పాఠశాలలో అయినా అన్నింటికీ పరమార్థం ఏమిటంటే భాషాభివృద్ధి. ఇందులో ఏది సరైనది ఏది సరైనది కాదు అనే మీమాంసకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళామో మా వాదన సరైనది అంటారు.
5. ముగింపు:
- మృదంగం అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో సహవాయుద్యంగా ఉపకరిస్తున్నది. ఏ సంగీత కచేరీలలో అయినా మృదంగ సహకారం లేనిచో పరిపూర్ణత ఉండదు.
- నాట్యము ప్రదర్శిస్తున్నప్పుడు ప్రధానంగా గాయకుడు, నటువాంగం అనగా (మృదంగ జతులు పలకడం) వయోలిన్, మృదంగం ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మృదంగానికి ప్రాముఖ్యత ఉంది. ఎందువలనంటే మృదంగ జతులు పలుకుతున్నప్పుడు దీనికి అనుగుణంగానే మృదంగం వాయించాలి. అంటే ప్రదర్శనకు ముందు ఎంతో సాధన చేయాలి.
- “త ది తొం నం” పాలవరుసులలో మొదటి పాఠము. ఈ పాఠము వాయించే బాణీలు అనేక విధాలుగా ఉన్న వాయించే వరసలు ఒకటే. నాదము ఒకేలా ఉంటుంది.
- ప్రాచుర్యం చెందిన బాణీలు తమిళనాడు నుండి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందాయి.
- ఆంధ్రప్రదేశ్ లో కూడా మృదంగంలో బాణీలు అభివృద్ధి చెందాయి. ఈ బాణీలు గురించి తెలుసుకోవడం మృదంగం అభ్యసించాలి అనుకున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
- ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన బాణీలలో మనీ అయ్యర్ బాణీ, పళని బాణీ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
- ముళ్ళపూడి బాణీ0లో అపారమైనటువంటి లెక్కల పరిజ్ఞానం మరియు పాటకు వాయించే ప్రక్రియ అనేది ముళ్ళపూడి బాణికి ఎంతో ప్రసిద్ధి.
- ప్రతి సంగీతకళాకారుడు, విద్యార్థులు అన్ని రకములైన బాణీలు విని, వాటి గురించి తెలుసుకోవాలి. ఆ బాణీని మన పద్ధతిలో అనుసరించుకోవాలి.
- ప్రతీవిద్యార్థి తన పాఠమును నోటితో ఎంత సాధన చేస్తే ఆ విధ్యార్థికి మృదంగం వాయించడంలో స్పష్టత ఉంటుంది. సులభంగా వాయించడానికి వీలవుతుంది.
- ఈ పరిశోధనలో పరిశీలించిన అంశాల ప్రకారం ఎన్ని బాణీలు ఉన్నా అన్ని బాణీలని సమానం చేసుకుంటూ మృదంగ విద్వాంసుడు తనకంటూ ఒక ప్రత్యేకతని తీసుకొచ్చి కచేరిలో ప్రక్క వాయిద్యంగాని, లయ విన్యాసంగాని తన సొంత శైలిలో అభివృద్ధి చేసుకొని భావితరాలకు తమకంటూ ఒక ప్రత్యేకతని సృష్టించుకోవాలి అని నిర్ధారించవచ్చు.
6. ఉపయుక్త గ్రంథ – విషయ సూచిక:
- కృష్ణమూర్తి, ఆర్... Laya Vinyasam (A Mathematical Approach) Volume, 1. గానరసికమండలి, బెంగుళూరు, 2008.
- కృష్ణమూర్తి, ఆర్... Laya Vinyasam (A Mathematical Approach) Volume, 2. గానరసికమండలి, బెంగుళూరు, 2010.
- దొరై రాజ అయ్యర్, మాన్గుడి.. మృదంగస్వబోధిని. ది కర్ణాటిక్ మ్యూజిక్ బుక్ సెంటర్, మద్రాస్, 1991.
- మల్లికార్జునశర్మ, ఆకెళ్ల.. తాళప్రస్తారసాగరము. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ప్రచురణ, హైదరాబాద్, 1985.
- రాఘవ అయ్యర్ ఎస్., తిరుచ్చి.. బేసిక్ లెసన్స్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ మృదంగం. ది కర్ణాటిక్ మ్యూజిక్ బుక్ సెంటర్, మద్రాస్, 1987.
- రాథాకృష్ణరాజు, మహాదేవ్.. మృదంగబోధిని. త్రివేణీ ప్రెస్, మచిలీపట్నం, 1976.
- రామ్మూర్తి, ధర్మాల. & వేంకటేశ్వరరావు, ధర్మాల. మృదంగతత్త్వము. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణ, తిరుపతి, 2003.
- రామ్మూర్తి, ధర్మాల.. ముక్తాయి సూత్రభాష్యం. సరస్వతీ పవర్ ప్రెస్, రాజమండ్రి, 1973.
- రామ్మూర్తి, ధర్మాల.. మృదంగతత్త్వము (ప్రథమభాగము). తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణ, తిరుపతి, 1966.
- సోమయాజులు, నేమాని.. మృదంగసౌరభము. నాదతరంగట్రస్ట్ ప్రచురణ, హైదరాబాద్, 2013.
- Rhythm king from Pudukottai
- శ్రీ పత్రి సతీష్ కుమార్ - ఆడియో - 09/09/23
- శ్రీ డా. మండపాక రవి - ఆడియో - 10/09/2023
- గురువు బాణీ గురించి వివరణ - Video- 01/10/ 2021 విద్వాన్ (శ్రీ వంకాయ నరసింహం) (https:\\youtube/mwqLPFGXqRs)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.