headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. ‘మాదిరెడ్డి సులోచన’ నవలలు : స్త్రీ జనాభ్యుదయం

డా. పప్పల వెంకటరమణ

తెలుగు విభాగాధిపతి,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు),
శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9491811710, Email: ramanapappala1@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

స్త్రీల మనోధైర్యం, వరకట్న నిర్మూలన, ఆస్తికత్వంపై రచయిత్రి అభిప్రాయాలు ఆమె వ్యక్తిత్వాన్ని భాసింప చేస్తున్నాయి. ఇంతటి మహోన్నత ఆశయాలు గల శ్రీమతి మాదిరెడ్డి సులోచన నవలలలోని స్త్రీ జనాభ్యుదయ వివరాలను సమగ్ర పరిశోధన పద్ధతిలో విశ్లేషించాను. ఇందులో స్త్రీ స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం, స్వేచ్చా ప్రణయం, విమోచనోద్యమం, విద్య, సామాజిక సమస్యలు, ధార్మిక చింతన, వరకట్న సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, నేటి స్త్రీలకు ఇలాంటి సమస్యలపై అవగాహన కలిగించడమే వ్యాస రచయిత ప్రధాన ఉద్దేశం.

Keywords: కన్యాశుల్కం, వరకట్నం, యక్షగానం, సహజీవనం, సంప్రదాయం, విమోచనోద్యమం, నెరజాణ, వ్యక్తిత్వ వికాసం, మహిళాభ్యుదయం.

1. ఉపోద్ఘాతం:

సమకాలీన సాహిత్యంలో మిక్కిలి ప్రజాధరణ పొందిన రచయిత్రులలో శ్రీమతి మాదిరెడ్డి సులోచన అగ్రగణ్యులు. సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని విశేష పాఠకుల మన్ననలు చూరగొన్న రచయిత్రి. ఈమె మారుతున్న కాలంలో, మారని విలువల పరిరక్షణ కోసం అహర్నిశలు అకుంఠిత దీక్షతో పోరాటం జరిపి ఎన్నో నవలల్ని రాసి సమాజంలో స్త్రీ మార్పు కోసం కృషిచేసిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన.

ఆధునికసాహిత్యంలో విశేషప్రజాదరణ పొందిన ప్రక్రియ నవల అనేది నిస్సందేహమైన విషయం. ఈ నవల పాశ్చాత్య ప్రభావంతో అనుకరణగా, అనువాదంగా ప్రారంభమై, క్రమక్రమంగా తన ప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ వినూత్న ధోరణులతో పయనిస్తున్నది. రచయితలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రచనలు చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు విశ్వ శ్రేయస్సు దృష్టితో నవలలు రచింపబడ్డాయి. అందులో సమకాలీన సామాజిక, రాజకీయ భావాలను అభివ్యక్తం చేసేది, చేయించేది నవల అంటే అతిశయోక్తి కాదు.

మనదేశంలో వివాహవ్యవస్థ పటిష్టమైనది. స్త్రీ పురుషులు దాంపత్య జీవనాన్ని పరమ మాధుర్యంగా ఆస్వాదిస్తారు. కుటుంబవ్యవస్థలో భార్యాభర్తలు, పిల్లల మమకారాలు, అనుబంధాలు మహోదాత్తంగా మన్నింపబడుతున్నారు. మాతృమూర్తిగా స్త్రీ పవిత్ర స్థానం అలంకరింపబడుతోంది.

అనాదిగా స్త్రీ అబల అనే సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచింది. కానీ రాను రాను వివిధ కోణాలలో స్త్రీ సాధించిన పురోగతిని పరిశీలిస్తే, ఆమె సబల అని గర్వంగా చెప్పవచ్చు. మహిళాలోకంలో స్వాతంత్ర్యం, దాంపత్య ధర్మాలు, విద్యాభ్యాసం, స్వేచ్ఛ ప్రణయం వంటి పలు రంగాలలో స్త్రీలు పరిస్థితుల ప్రభావానికి అనుగుణంగా ఎన్నో మార్పులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

2. రచయిత్రి - మహిళాభ్యుదయదృక్పథం:

శ్రీమతి మాదిరెడ్డి సులోచన ఒక స్త్రీగా సమాజంలో వచ్చిన, వస్తున్న మార్పులను దర్శించి మహిళాభ్యుదయమే ప్రధానంగా వారి వ్యక్తిత్వ వికాసం కొరకు విశేష కృషి చేశారు. 'ప్రేమలు పెళ్లిళ్లు' నవలలో రచయిత్రి సరోజ కులాంతర వివాహాన్ని అభినందించి సమన్వయం చేసింది. ఆమె పెద్దల అనుమతి లేకపోయినా ఒక ముస్లిం యువకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆమె పెళ్లి చేసుకోక మునుపే భవిష్యత్తును నిర్ణయించుకుంది. ఇద్దరి పవిత్ర మనసులు కలుసుకోగా మధ్యలో మతం అడ్డు రాకూడదని భావించింది.

ప్రతిఫలంగా సరోజ రిజిస్టర్ ఆఫీసులో నిరాడంబరంగా దండలు మార్చుకుని ఆ ముస్లిం యువకుని భర్తగా స్వీకరించింది. ఒకవేళ భర్త తన మతంలో చేరమని అడిగినా, ఆమె అందుకు సిద్ధంగా ఆ మతంలో చేరగలిగే ధైర్యం సంపాదించుకుంది. అందువలన ఆమె తన అన్నతో "నేను అవసరమైతే ఆయన కనుగుణంగా మారతాను. చేతనైతే నాకు అనుగుణంగా మార్చుకుంటాను. కానీ అవివేకంతో బాంధవ్యాన్ని త్రెంచుకోనని"¹ వాదించడంలో ఆమె వివేకం, విశాల దృక్పథం కనిపిస్తున్నాయి. కావున మహిళాలోకం సరోజలాగా ధైర్యంగా తమ దృక్పథాన్ని బలపరచుకుంటే వారి వైవాహికజీవితం సుఖప్రదమవుతుందని రచయిత్రి ఈ నవల ద్వారా బోధిస్తున్నది.

3. స్త్రీ స్వాతంత్ర్యం నాడు - నేడు:

సంపూర్ణస్వాతంత్ర్యం సృష్టికే లేదు. సహజప్రేరణ నుండి స్వతంత్రించడమే మానవత్వానికి పటిష్టమైన బలం. మానవుడే సందర్భాన్ని బట్టి ఉచితానుచితాలు తర్కించుకొని తన మనోభావాలు పరిశీలన చేసుకుంటాడు. ఈ పరిశీలన వలననే అతని వ్యక్తిత్వం వికసిస్తుంది.

పాశ్చాత్య సంప్రదాయపు ముసుగులో చిక్కుకున్న ఆధునిక స్త్రీని కాపాడటంలో రచయిత్రితనకు గల విదేశీ సంప్రదాయాల పరిచయంతో స్త్రీ స్వాతంత్ర్యాన్ని పోల్చి చూపించి, ఆ దేశపు స్త్రీలు విచ్చలవిడి స్వాతంత్ర్యాన్ని అనుభవించి ఏమి సాధించారో 'అద్దాలమేడ' నవలలో ప్రతిఫలించింది.

స్త్రీ జీవితం అరటాకు లాంటిది. ఏమైనా నష్టపోయేది స్త్రీయే. ఈ భావనను లోకంలో చాటేటందుకు ఇద్దరు స్త్రీల మనస్తత్వంతో విచక్షణ జ్ఞానాన్ని అన్వేషింప చేసింది. పద్మిని, రమణి వదిన మరదళ్లు. రమణి తండ్రి తన తల్లిని వదిలి మరో పెళ్లి చేసుకుంటే, ఆ మచ్చ ఆమెపై బడి పెళ్లి కావడం సమస్య అయింది. మగవారు తప్పు చేస్తే, ఆ కష్టాన్ని భార్యే భరించవలసి వస్తున్నది. ఈ వ్యవస్థ తీరులో పద్మిని లేత హృదయం పగిలిపోయి తన భర్త బలరామ్ లోని పురుషాధిక్యతను ప్రతిఘటించి ఇథియోపియాకు పోతుంది.

స్త్రీ స్వేచ్ఛ విషయంలో రచయిత్రి ప్రాచ్య, పాశ్చాత్య సాంఘిక స్థితిగతులను తులనాత్మక దృష్టితో వివరించింది. విదేశాలలో బడికి వచ్చే పిల్లలు నూటికి ఐదారు మందికి మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు. మిగిలిన వారికి సవతి తండ్రో, సవతితల్లో గతి. వారి ప్రేమలో మృదుత్వం, ఉత్సాహం శూన్యం. అందువలన ఆ బిడ్డలకు ప్రపంచమంతా శత్రువులే. మనదేశ వైవాహిక జీవనంలో శారీరకంగా విచ్చలవిడితనం లేకపోవచ్చును గాని, బిడ్డలను మాత్రం భిక్షగాళ్లను చేయం.

పద్మిని పాశ్చాత్య నాగరికతా భ్రమలో భర్తను వ్యతిరేకించినప్పుడు రమణి నచ్చ చెప్పడంలో కవయిత్రి వ్యక్తిత్వం ఆమె ద్వారా నారీ లోకానికి అందించి వారి అభ్యుదయాన్ని ఆకాంక్షించినది. నీకు ఉద్యోగం ముఖ్యం కాదు. ఎక్కువదో, తక్కువదో నీ భర్త ఊరిలోనే సంపాదించుకోవచ్చు. కానీ పోగొట్టుకున్న సౌభాగ్యం తరువాత విలపించినా సంపాదించుకోలేవని చెప్పి భారతీయ మహిళలకు భర్త సౌభాగ్యపు విలువను గుర్తుచేసింది.

రమణి పద్మినులు విద్యావంతులు. తమ భర్తలతో సర్దుకుపోయే స్వభావం చదువుకున్న స్త్రీలలో ఏ రూపంలో ఉన్నదో ఈ పాత్రలలో రచయిత్రి దర్శించింది. పద్మిని పాశ్చాత్య సంప్రదాయాలతో విలాసవంతమైన స్త్రీ స్వాతంత్ర్యాన్ని కోరే మనిషి, రమణి భారతీయ వైవాహిక వ్యవస్థలో భర్త ఆజ్ఞానసారము ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన సహచర్యంతో మధుర జీవితాన్ని అందించే సున్నిత హృదయురాలు. భార్యభర్తలు పంతాలు, పట్టింపులతో, మొండి పట్టుదలతో భీష్మంచి కూర్చుంటే, అసూయ ద్వేషాలు పెరగడమే గాని అన్యోన్యత పెరగదని ఆత్మవిశ్వాసం గల స్త్రీ రమణి. ఈమె పద్మనీతో "నీవన్నట్లు మాట్లాడుకుంటే దాంపత్య జీవితంలో ఉండే మాధుర్యం, సున్నితతత్వం నశిస్తాయి. భర్త ముందు భార్య తగ్గి ఉండటంలో లభించే ఆనందం, ఆయనను ఎదిరించడంలో లభించదు. కావున మనిషికి వివాహ దశ ఒక అందమైన మలుపు. అది బాధ్యతలతో కూడుకున్నది. అందువలన భర్త దగ్గర భార్య ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలని"² మందలించడంలో ఆమె జీవితానుభూతుల్ని స్త్రీ జాతికి అందించింది.

4. స్త్రీ వ్యక్తిత్వం - ఆత్మవిశ్వాసం:

సమాజంలో స్త్రీ పురుషునితో పాటుగా సమాన స్థాయిలో నిలబడేటందుకు విద్యాసంస్కారాలను పెంపొందించుకోవలెను. ఆనాడే దేశాభ్యుదయంలో పురుషునితో పాటుగా స్త్రీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి తన ప్రత్యేకతను నిలుపుకునే అవకాశం ఉంది.

'పంతులమ్మ' నవలలో సుచరిత బాల్య వితంతువు. ఉత్తమ బ్రాహ్మణ కులంలో పుట్టి సంప్రదాయ బద్ధంగా జీవితాన్ని సాగించే ఈమె పునర్వివాహానికి నోచుకోలేక ఒక టీచర్ ఉద్యోగం సంపాదించి జరిగిన దుష్సంఘటనలను మరిచిపోయేటందుకు ప్రయత్నిస్తుంది. పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తన, విద్యార్థుల నడవడిక రకరకాలుగా ఉంటుంది. అందులో ఒక విధవరాలు అయిన స్త్రీ పలువురు ఉపాధ్యాయుల మధ్యలో నిలబడి ఉద్యోగ వృత్తిలో కృతకృత్యురాలు కావాలంటే బహు కష్టం. పాఠశాలలో కాలయాపన చేస్తూ పిల్లలను వెనక వేసుకుని వృధాగా జీతం తీసుకుని జీవించేవారు ఎక్కువ. కష్టపడి పని చేసే సుచరిత లాంటి వారిని ప్రోత్సహించరు. సరికదా! హేళన చేసి అవమాన పరుస్తారు. అయినా ఈమె నిర్భయంగా పలు సమస్యలు ఎదురొడ్డి అటు పిల్లలనుండి, ఇటు ప్రధాన ఉపాధ్యాయుల నుండి మన్ననలు పొంది విశిష్ట వ్యక్తిత్వంతో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కీర్తి శిఖరాన్ని అధిరోహించి మహిళా లోకానికి మార్గదర్శకురాలయింది. ఇక్కడ రచయిత్రి ఉపాధ్యాయ వృత్తిలో జీవించింది కావున, అందులోని సాధకబాధకాలను అనుభూతి పూర్వకంగా సుచరిత్ర పాత్రను వివేచించి ఆదర్శప్రాయమైంది.

'మోహన రూప' నవలలలో మోహన రూప ఒక లేడీ డాక్టర్ గా పల్లెలో ప్రాక్టీసు పెట్టి, వైద్య సౌకర్యాల ప్రాముఖ్యత చాటి తన నిజాయితీని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. సామాన్యంగా డాక్టర్లు పట్టా పుచ్చుకోగానే పట్టణాలలో నర్సింగ్ హోమ్ పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవించే ఈ కాలంలో, మోహన రూప ధైర్యంతో పల్లెల్లో వైద్య సేవలు అందించి గ్రామ జీవుల సగటు జీవన విధానాన్ని పెంపొందించి పురుషునితో సమానంగా వ్యక్తిత్వ ప్రదర్శన చేసింది. అటువంటప్పుడు స్త్రీ నిరుత్సాహపడక ధైర్యంతో తల్లిదండ్రులను ఒప్పించి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి, ఒంటరిగానున్న ఆడదానికి ఏమీ భయం లేదని నిరూపించాలి. అప్పుడే సాటి స్త్రీకి లోకంలో ఆత్మబలం పెరుగుతుంది. 

రచయిత్రి 'నెరజాణలు - మగధీరులు' నవలలో అవివాహిత 'విజయ' ఉద్యోగధర్మంతో మారుమూల గ్రామాలకు వెళ్తుంటే, ఆమె తల్లిదండ్రులు పిరికితనంతో నివారిస్తారు. అందుకామె కారణం అడిగితే దేశంలో ఒంటరిగానున్న స్త్రీ రక్షణ గూర్చి ఆందోళన వెలిబుచ్చుతారు. అప్పుడు విజయ తల్లిదండ్రులతో "మా మేలుకోరే మగ పిల్లలకు చెప్పించినట్లు చదువు చెప్పించారు. అలాగే స్వతంత్రంగా బ్రతుకగలిగే శక్తి ఉందా లేదా పరీక్షించుకోనివ్వమని, మీరు ఆడపిల్ల అంటూ మమ్ము అనగద్రొక్కకూడదు. ఇలా భయపెట్టి ఒక మూలకు నెట్టేస్తున్నారు"3 రక్షణ లేని మాట వాస్తవమే కానీ, కొందరైనా ఎదిరించి రక్షణ ఉన్నదని నిరూపించాలి. ఆత్మబలమే స్త్రీకి రక్షణ అని తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఉద్యోగంలో చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకుని సఫలీకృతురాలయింది. ఇక్కడ రచయిత్రి స్త్రీకి ఆత్మబలం, మనోవిశ్వాసం శ్రీరామరక్ష అని ప్రబోధించి చైతన్యవంతులను చేసింది.

5. స్త్రీ - స్వేచ్ఛా ప్రణయం:

ప్రేమ స్వరూపం స్థూలంగా ఒకటేనైన అది పలు రూపాలలో ప్రదర్శింపబడుతుంది. దైవ ప్రేమ, భక్తి ప్రేమ, మాతృ ప్రేమ, విశ్వ మానవ ప్రేమ ఇత్యాదులు. ప్రేమలో ద్వేషం కూడా రాగంగా మారుతుంది. ప్రేమ ఎప్పుడూ అభిమానం, అనురాగం, ఆప్యాయత వంటి సున్నిత భావాల రూపంలో వ్యక్తం అవుతుంది. అందువలన ప్రేమ హృదయాన్ని ద్రవింప చేస్తుంది.

"ప్రేమకు మూలం పరిపూర్ణత సిద్ధించుకోవాలనే ఆశయం. పవిత్ర మార్గంలో పరమాత్మునందుకోవడమే పరిపూర్ణత. అదే ప్రేమ"⁴ అంటున్నాడు ప్లేటో.

"మరో రకం ఆనందం ఇవ్వటంలోని ఆనందాన్ని అనుభవించగలిగింది ఆదర్శ ప్రేమ"⁵- చలం.

స్వేచ్ఛ ప్రణయంలో "కృతజ్ఞతా భావం ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం. శారీరక ఆకర్షణ, వివాహ బంధం మొదలైన నిర్బంధాలేమీ లేకుండా స్వచ్ఛందంగా ప్రేమించడం, ప్రేమించకుండా బ్రతకలేని ఒక మహోద్రేకంతో ప్రేమించటం, ప్రేమించిన వారి కోసం సర్వాన్ని త్యాగం చేయగలిగే ఉదార ఆశయంతో ప్రేమించటం, ప్రేమలో విశ్వ సౌందర్యాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని అందుకోగలిగే మహత్తరానుభూతుల కోసం ప్రేమించడం ఇలాంటిది స్వేచ్ఛ ప్రణయమని"⁶ డాక్టర్ సి. ఆనందరామం  అభిప్రాయం.

ప్రగాఢ ప్రణయమే స్వేచ్ఛా ప్రణయం. అందులో చాంచల్యానికి అవకాశం ఉండదు. ప్రధానం ఏకాగ్రత. 'మరో ప్రేమ కథ' నవలలో శివకామేశ్వరి మహిళా కళాశాలలో చదివి, పురుషుల ఉనికి గ్రహించలేక, పాశ్చాత్య పద్ధతుల భ్రమలో పడి కామోద్రేకంతో స్వేచ్చా ప్రణయం వాంచించింది. తన ఊరిలోని సుందర మూర్తి అనే కాన్వెంట్ స్కూల్ టీచర్ బోధనలకు లోనై మన వివాహ వ్యవస్థను చీదరించుకొని, పాశ్చాత్య స్వేచ్ఛ లైంగిక విధానానికి ఆకర్షితురాలై, తన మేనమామ కృష్ణను వదిలి, సిద్ధి లింగయ్య అనే ముదుసలి ధనవంతునితో గుడిలో పెళ్లి చేసుకుని తన బంధు వర్గానికి దూరమైంది.

భర్త ముసలివాడు, తన కామ వాంఛలను తీర్చ లేడని గ్రహించినా, కార్లు, మేడల కాశపడి సిద్ధి లింగయ్యను కట్టుకున్నది కామేశ్వరి. చేసేదిలేక కామోద్రేకాన్ని అనుచుకోలేక పనిమనిషి 'ఆబూ' తో అక్రమ సంబంధం పెట్టుకుని పబ్బం గడుపుకుంటుంది. ఇది అన్యాయమని, అక్రమమని, తన పరువు ప్రతిష్టలు మట్టిపాలవుతాయని మేనమామ కృష్ణ మందలించిననూ ఆమె వినలేదు.

పనిమనిషి ఆబూతో తిరిగిన శివాని గర్భవతి అయింది. కొడుకు పుట్టిన తర్వాత అతను అక్రమ సంతానమని అబూ గేలి చేస్తాడు. అయినా ఆమె సహిస్తోంది. చివరి కతను స్వంత భర్త సమక్షంలో తన కొడుకును కాలితో తన్నితే సహించలేక ఆమె దగ్గరిలోని చేతి కొడవలితో ఆబూ తల నరికేసి జైలు పాలయ్యింది.

శివాని పాశ్చాత్య సంప్రదాయాల ప్రతీకగా నిలిచి, సంఘంలో నీచురాలిగా బ్రతికి, కట్టుకున్న వాడిని దూరం చేసుకుని, పెట్టుకున్న వాడిని హత్య చేసి దుర్భర జీవితం గడిపింది. రచయిత్రి మన దేశ ప్రణయ సిద్ధాంతం గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ, పాశ్చ్యాత్యుల స్వేచ్చా ప్రణయాన్ని ఆచరించిన వారు అధోగతి పాలై, జీవితంలో అపజయం పొందవలసిందేనని శివాని పాత్ర ద్వారా ప్రతిబింబించి, మహిళలోకానికి కనువిప్పు కలిగించింది. విద్య విజ్ఞానాన్ని పెంపొందించి మన దేశ పరిస్థితులు ఏమిటి? విదేశీ పరిస్థితులు ఏమిటి? అనే విచక్షణ జ్ఞానంతో విశ్లేషించినప్పుడు విద్యనార్జించిన వారికి సార్థక్యం కలిగి హైందవ ప్రణయ సిద్ధాంతానికి రక్షణ కల్పించబడుతుంది.

ఏ దేశపు సిద్ధాంతాలు, ఆచారాలు ఆ దేశానికి విపరీత ఫలాలు ఇవ్వవు. పాశ్చాత్య మనినంతనే చెడు అనుకోనక్కరలేదు. అయితే ఆ ఆచారం ఆదేశానికి నప్పినట్లుగా అన్ని దేశాలకు నప్పకపోవచ్చు. అట్టివానిని మాత్రమే వివేకంతో పరిశీలించి నిర్ణయించుకోవాలి. గుడ్డిగా అనుసరించినా, అవివేకంతో పరిత్యదించినా విపరీత ఫలితాలు కలుగుతాయి అనేది ఈ నవల ద్వారా మనం గ్రహించవలసిన సత్యం.

6. స్త్రీ- విమోచనోద్యమం:

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు పాశ్చాత్య పద్ధతుల భ్రమలో కొందరు స్త్రీలు తమకు అన్యాయం జరిగిందంటూ విమోచనోద్యమం పేరుతో ఆచరణ శూన్యంగా పోరాడి ఓడిపోవడం సహజంగా చూస్తున్నాం.

'కల కాదు సుమా' నవలలో విమల, శశిలు స్త్రీజన విమోచనోద్యమం పేరుతో 'ఉమెన్ లిబ్' పెట్టి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి విదేశీ పద్ధతులు ననుకరించడం జరుగుతుంది. విమల తన భర్తను వదిలేసి రెండవ పెళ్లి చేసుకున్నది. శశి తన అత్త ఆడబిడ్డలు వస్తే ఆదరించక అత్త దుత్తలను పారద్రోలాలని పిలుపునిచ్చింది. కానీ తన రక్తసంబంధీకులు వస్తే అమితోత్సాహంతో ఆహ్వానించి గౌరవిస్తుంది. ఇది గమనించిన భర్త తన భార్యకు కళ్ళు తెరిపించాలని సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు.

విదేశాలలో స్త్రీ స్వాతంత్రం విచ్చలవిడిగా ఉన్నందున తల్లిదండ్రుల పరిష్వంగంలో అనురాగ, ఆప్యాయతలతో పెరగవలసిన పిల్లలు, ఎక్కడో అనాధాశ్రమంలో బ్రతుకుతూ సినిమాహాళ్లు దగ్గర బజార్లలో పోకిరిగా తిరుగుతున్నారు. కన్యలుగా తల్లులై, ఇంకొకరితో కాపురం చేస్తుంటే వారి పిల్లలు దొంగలు, దోపిడీదారులుగా తయారై ఎదుటివారిపై పగ, ద్వేషం పెంచుకుంటున్నారు. అందుకొరకే ఆ దేశాలలో మితము లేని హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయి.

సంఘంలో జనం యొక్క ఆలోచన విలువలు మారుతుంటాయి. ఈ మార్పు సహజం. కొన్ని సున్నితమైన భావాలు శాశ్వతంగా మారవు. తల్లి కొడుకుల మధ్య బంధం పవిత్రమైన అనుబంధం. ఈ బంధాన్ని విడగొట్టి తామె ఎక్కడో అమెరికా, ఇంగ్లాండ్ లో ఉన్నామనుకుంటే పొరపాటు.

విదేశాలలో లైంగిక స్వేచ్ఛ విచ్చలవిడిగా ఉంటుంది. ఇది మన దేశంలో చాలా పవిత్రమైంది, సున్నితమైనది. ఏ కారణం చేతనైనా భార్య భర్తలకు విభేదాలు వస్తే ఎవరికి వారు విడిపోయి కొత్త కాపురం చేసుకోవచ్చు. కానీ మన స్త్రీ, భర్త ఎటువంటి వాడైనా తాళి కట్టగానే దైవంతో సమానంగా అతని పర్యంకమునే కష్టసుఖాలు పంచుకొని దాంపత్య జీవితానికి కట్టుబడి జీవితాన్ని సాగిస్తుంది.

శశి తన భర్తతో నీ బాంధవ్య మమకారాలను విడనాడాలని ఆజ్ఞాపించింది. అప్పుడు భర్త రవి ఇంగ్లాండ్, అమెరికాలో లాగా రొద. వారి సాంఘిక జీవనం, మన సాంఘిక జీవనం వేరు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలవి. అక్కడ ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. అందువలన వారు అనుబంధాల గూర్చి ఆలోచించే సమయం లేదు. మనది పారిశ్రామికంగా వెనుకబడిన దేశం. పురుషులకే ఉద్యోగాలు లేవు. విద్యావంతులైన స్త్రీలకే ఉద్యోగాలు దొరుకుతాయి. విద్యావంతులు నలుగురిలో తిరగవలసిన యువతులు జీవితాన్ని అర్థం చేసుకునేందుకు, విదేశీయులను అనుకరిస్తాం అంటారే తప్ప మంచి చెడు నిర్ణయించుకోలేరని తన భార్యను మందలించడంతో రచయిత్రి స్వదేశ, పరదేశ మహిళల ఉనికిని అనుభూతితో, తులనాత్మక దృష్టితో పరిశీలించడం జరిగింది.

ప్రకృతి గతంగా స్త్రీకి మాతృమూర్తి అయ్యే వరమో, శాపమో ఉంది కదా! అందుకే మనదేశంలో లైంగిక స్వేచ్ఛను స్త్రీ విషయంలో ఒక పరిధిలో బిగించారు. ఈ వాస్తవాన్ని ఆవేశంలోని మహిళలు విస్మృతి చెందారు. తీయని కలలు కనడం సరదాగా భావించారు. అవసరమైన మార్పులను అన్నివేళలా ఆహ్వానించాలి. కానీ ఏదో చేశామని నలుగురి మధ్య గుర్తింపు కోసం అర్రులు చాచడం ప్రమాదం. మౌలిక అవసరాలు తీరేక స్త్రీ స్వేచ్ఛను గూర్చి ఆలోచించాలి.

విమలా, శశీలు వేదికలెక్కి శుష్క ఉపన్యాసాలు ఇవ్వడం నిష్ప్రయోజనం. స్త్రీకి అన్యాయం జరుగుతుందని గొంతు చించుకోవడం అనవసరం. పది మాటలు చెప్పే కంటే ఒక మాట చెప్పి ఆచరణలో పెట్టితే ఆమె మార్గదర్శకురాలవుతుంది. శశి ఆడబిడ్డ మీనాక్షి తన కుమారుడికి ఒక అనాధ స్త్రీతో పెళ్లి జరిపించి వరకట్న సమస్యను దూరం చేయటానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఈ త్యాగాన్ని కనులారాగాంచిన శశి, విమలలు వేసిన తప్పటడుగుకు చింతించి, మన దేశ స్త్రీ పరిమిత స్వేచ్ఛ విధానమే, వారి జీవితాలకి రక్షణ కల్పిస్తున్నదను సత్యాన్ని గ్రహిస్తారు.

7. స్త్రీ- విద్య:

అనాదిగా స్త్రీని వంటింటి మనిషిగా నాలుగు గోడల మధ్యనే బిగించారు. ఆమె సంసార రథాన్ని నడపడంలో సారధ్యం వహిస్తుంది. ఫలితంగా ఆమె విద్యా సంస్కారాలు నోచుకోక లౌకిక జ్ఞానం పొందలేక పోతుంది. కానీ ఆధునిక స్త్రీ కళాశాల చదువులతో ముందంజ వేసి, పురుషులతో పోటుగా విద్యాభివృద్ధిని పొందుతున్నది. కానీ నేటి సమాజంలో ఒక స్త్రీ ఉన్నత విద్య చదివి పైకి వస్తుంటే సాటి స్త్రీలే అవహేళన చేస్తూ, అసూయా ద్వేషాలతో ఆమె అభివృద్ధిని నిరసిస్తున్నారు. ఇట్టి కుత్సిత స్వభావం గల మహిళలతో స్త్రీ జాతి విద్యా రంగంలో ముందడుగు వేయలేక పోతుంది.

'అమృత కలశం' లో విజయ తన వదిన ఆరడింపులకు తట్టుకోలేక చదువులకు స్వస్తి చెప్పి, తన అన్న నిర్ణయించిన వివాహం చేసుకొని అత్తింటిలో అడుగు పెట్టింది. ఆమె పుట్టింట్లో అమిత కష్టాలు కోర్చి లోయర్ గ్రేడ్ టీచర్ కోర్స్ పూర్తిచేసింది. పెళ్లయిన తదుపరి భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్య గరచి బి. ఇడి., పూర్తి చేసింది. తర్వాత ఉపాధ్యాయురాలిగా క్రమశిక్షణతో కూడిన ఆదర్శ పాఠశాలను స్థాపించి, తన బంధువులతో తప్ప సమాజమంతా మన్ననలు పొందింది. ఇక్కడ రచయిత్రి స్త్రీకి విద్యావశ్యకతను గుర్తు చేసింది.

సభ్యసమాజంలో స్త్రీ, తన భర్త గాడిదలా చాకిరీ చేస్తుంటే, పని లేక ఇంట్లో కూర్చుని ఇచ్చకాలాడుతూ తమకు అన్యాయం జరిగిందని వాపోడం వ్యర్థమని, తన కాళ్ళపై తన నిలబడే శక్తిని సంపాదించాలని రచయిత్రి మహిళా లోకానికి పిలుపునిచ్చి కళ్ళు తెరిపించింది.

'గెలుపు నాదే' నవలలో రచియిత్రిఅమూల్య పాత్ర ద్వారా స్త్రీకి విద్యా ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పింది. తనకు పెళ్లి చూపులకు వచ్చిన శ్రీధర్ చదువు లేదని హేళన చేస్తే, పట్టుదలతో అమూల్య పెద్దల అనుమతితో మెట్రిక్ పూర్తి చేసి, పట్నంలోని తన అన్న దగ్గర కళాశాల చదువును ముగించి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నది.

 తను చదివిన కళాశాలలోకి లెక్చరర్ గా వచ్చిన శ్రీధర్ ను చూసిన అమూల్య, తనకు జరిగిన పరాభవాన్ని స్మృతి పథంలోకి తెచ్చుకొని ప్రతీకారం కాంక్షించింది. అతనిని ప్రేమిస్తున్నట్లు నటించి తర్వాత తిరస్కరించి అతని మనసును గాయపరిచి అశాంతికి గురిచేసి నాగరికతకు నిర్వచనం చెప్పింది. ప్యాంటు, షర్టు వేసుకుని రాగానే నాగరికుడు కాజాలడు. డిగ్రీ తెచ్చుకోవటం నీకే కాదు నాకు కూడా తెచ్చుకునే జ్ఞానం ఉందని బుద్ధి చెప్పింది.
ఆమె తల్లిదండ్రులు అమ్మ! నీ పెళ్లి శ్రీధర్ తో జరగకపోవడం కారణమేమిటిని అడగ్గా అమూల్య వారితో "తరతరాలుగా మగవారు స్త్రీని ఆట బొమ్మగా చేసి ఆడిస్తున్నారు నేను మీ ఆట బొమ్మను కానంటే వారు సహించడం లేదు అంతేనమ్మా"⁷ అని ఆక్రోషంగా అనడంలో పూర్వకాలపు స్త్రీ అధోస్థితిగతులకు కారణం అజ్ఞానమేనని తెలియుచున్నది.

అమూల్య చిన్నాన్న తన తండ్రితో స్త్రీ విద్యను గూర్చి చర్చించినప్పుడు "మనమంతా కలసి స్త్రీలను వంటింటికే అంకితం అనుకున్నాం. ఆమెకు సమానమైన అవకాశం ఇస్తే ఏమైనా సాధించగలరు. సమానత్వం రావాలంటే చదువు ముందు అవసరం. మన స్త్రీలను మనం ఎలా తయారు చేశామంటే మగవాడన్న ప్రతి మాటను గంగిరెద్దులా తల ఊపుతూ తనను తాను ఒక నాజుకు బొమ్మ అనుకోని ఒక పరిధిలో బిగించుకొని, దానిని ఛేదించి స్వతంత్రంగా ఆలోచించే స్త్రీలను చూసి నవ్వే స్థితిలో ఉన్నాం. అది పోవాలంటే వారికి ఆలోచన పరిధి పెరగాలని"⁸ వాదించడంలో వనితలకు విద్యాసముపార్జన అత్యంత ఆవశ్యకమని విధితమగుచున్నది.

అమూల్య, శ్రీదర్ ను నిర్మలమైన మనస్సు చే ఆరాధించింది. కానీ చదువురాని మొద్దువు అని హేళన చేయగానే ప్రతీకారం కాంక్షించి పట్టుదలతో కళాశాల చదువు పూర్తి చేసి ఆయన సమక్షంలో విశ్వవిద్యాలయ చదువు ముగించి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. కాలేజీలో ప్రేమించిన శ్రీధర్ ను అవమానపరచి గతాన్ని జ్ఞాపకం చేసుకొని అతని కుసంస్కారాన్ని తూలనాడింది.

అప్పుడు శ్రీధర్ "అమూల్యా ఒక విషయం. నాపై పంతానికైతేనేమి, పట్టుదలకైతేనేమి చక్కగా చదువుకున్నావు. చదువుకున్నవారు ప్రతివారు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తమ కాళ్ళ మీద తాము నిలబడగలమన్న నమ్మకం కలగాలి. నీ భావం నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం ఏమంటే స్త్రీ అణగి మనగి ఉండటానికి కారణం ఆర్థికంగా పురుషుడిపై ఆధారపడి ఉండటమే. కావున నీ చదువుకు ప్రతిఫలంగా ఉద్యోగం సంపాదించి నీ కాళ్లపై నీవు నిలబడే గలిగే ధర్యాన్ని సంపాదించుకోమని సలహా ఇవ్వడంలో"⁹ స్త్రీకి వ్యక్తిత్వ ఆవశ్యకత ధ్వనిస్తుంది. తర్వాత ఆమె తిరస్కార భావాల్ని సహించలేక అతడు విదేశాలకు వెళ్ళిపోతాడు. అక్కడ అమూల్య వ్యక్తిత్వాన్ని హర్షించే మనసుతో శ్రీధర్ ఆమె అన్న సారధికి ఉత్తరం ద్వారా క్షమాపణలు వేడుకుంటాడు. అప్పుడు సారథి అమూల్య అనుమతితో విదేశాల నుండి శ్రీధర్ ని రప్పించి వారిద్దరినీ జతపరిచి అన్యోన్య దాంపత్య జీవనానికి బాటలు వేశాడు.

అమూల్య, నిర్మలలు విద్యావంతులై తమ కాళ్లపై తాము నిలబడగలిగే ఉద్యోగాల్ని సంపాదించి, భర్త గౌరవాన్ని పెంచి కుటుంబ బాధ్యతల్ని మోస్తూ సహజీవనం సాగిస్తున్న తీరుతో రచయిత్రి ఆధునిక సమాజంలో స్త్రీకి విద్య ఆవశ్యకతను గుర్తుచేసింది.

8. స్త్రీ- సామాజిక సమస్యలు:

సమాజంలో స్త్రీ జీవితం ముళ్ళ మీద నడక లాంటిది. పుట్టుకతో నుండి పెళ్లి, పిల్లల సంరక్షణ వరకు అన్నీ గడ్డు సమస్యలే.

'నాగమల్లికలు' నవలలో శివరాం- రత్న, చక్రపాణి- సాధన, రంగారావు- రజినిల దాంపత్య జీవితంలో మహిళలు ఎదుర్కొనే విభిన్న సమస్యలను రచయిత్రి వాస్తవిక దృక్పథంతో పరిశీలించింది. రత్న కాలేజీ జీవితంలో శివరాం అనే పచ్చి తాగుబోతును ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకున్నది. దీనికి కారణం ఆమె తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులే. శివరాం తాత్కాలికంగా ఆమె శీలాన్ని దోచుకుని, పుట్టింటికి పంపేయవచ్చునననే దురుద్దేశంతో ఈ వివాహానికి అంగీకరించాడు. కానీ రత్న ఓర్పుతో, నేర్పుతో అత్తమామల హృదయాలని ఆకట్టుకుని భర్తకు ప్రియురాలై అనురాగాన్ని పంచి ఉత్తమ భార్యగా పొగడ్తలను అందుకున్నది. కాలచక్రంలో శివరాం తన తప్పిదాన్ని భార్యకు చెప్పి దురలవాట్లకు స్వస్తి చెప్పి అన్యోన్య దాంపత్య జీవనం సాగిస్తాడు. ఇదంతా రత్న నేర్పరితనమే. కావున ఏ స్త్రీ అయినా తన మంచితనంతో భర్త దుర్గుణాలను దూరం చేసి, సన్మార్గాల వైపు మనసును మళ్లించి సంసారాన్ని సరిదిద్దుకునే శక్తి సంపాదించాలని రచయిత్రి మహిళా లోకానికి ఉపదేశం చేసింది.

సాధన- చక్రపాణిలు ప్రేమికుల జంట. ఆమె పతియే దైవమనే ఉద్దేశంతో పూజించే సాద్వీమణి. కానీ చక్రపాణి డబ్బు ఉంటే సర్వము ఉన్నట్లే అనే భ్రమతో తన భార్య శీలాన్ని ఎరగా పెట్టి డబ్బు, హోదా సంపాదించగలిగాడు. తన స్నేహితుల దగ్గర భార్యను ఒంటరిగా వదిలిపెట్టి డబ్బు సంపాదించాడు. ఎమ్మెల్యే  ఇంట్లో భార్యను వదిలి సెంట్రల్ స్కూల్ టీచర్ ఉద్యోగం పొందాడు. స్కూల్ కమిటీ మేనేజర్ దగ్గరకు భార్యను పంపించి ప్రిన్సిపాల్ పదవి పొందాడు.

ఇది గమనించిన భార్య, భర్తకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతను ఎదుటనే పరపురుషులతో స్వేచ్ఛగా తిరగటం, క్లబ్బులు, డ్యాన్స్ ప్రోగ్రాములకు వెళ్లడం నేర్చుకుంటుంది. ఇది చూసిన భర్త మందలిస్తే నీకో సిద్ధాంతం, నాకో సిద్ధాంతమా! నీ పదవి డబ్బు కోసమైతే నేను ఏ పని చేసినా అభ్యంతరం లేదు. స్వయంగా నా కోరికలను తీర్చుకుంటే తప్పా. దీని కన్నా మరణమే మేలని భర్తకు విడాకులు ఇచ్చి పట్టుదలతో బి.ఈడి. పూర్తి చేసి స్వయంగా పాఠశాలలను స్థాపించి, విద్యా సేవ చేస్తూ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది.
భార్య, భర్తను దైవంగా పూజించడం పరమోదాత్తమే. కానీ ఆ మంచితనాన్ని అతని స్వార్థానికి ఉపయోగిస్తే పరమ నీచం. అలాంటి స్థితిలో భర్తను ఎదిరించి, తన వ్యక్తిత్వంతో సమాజంలో ధైర్యంతో నిలబడగలిగే శక్తిని సంపాదించాలని సాధన పాత్ర ద్వారా కవయిత్రి స్త్రీ లోకానికి బోధిస్తుంది.

9. స్త్రీ- ధార్మిక సిద్ధాంతాలు:

స్త్రీ పురుషులు దైవ సాక్షిగా భార్యాభర్తలు కాగానే అన్యోన్యంగా సహజీవనం చేయాలనే ధర్మ భావనతో భార్య, భర్తకు ధర్మపత్ని అయింది. కానీ ప్రాపంచిక విషయాలలో స్త్రీకో న్యాయం, పురుషునికో న్యాయం కొన్నిచోట్ల అనివార్యంగా ఆచరించాల్సి వస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా? అని ఆధునిక స్త్రీ ప్రశ్న.
'సుప్రియ' నవలలో సంసారిక పవిత్ర ధర్మాన్ని గౌతమి పాత్ర ద్వారా కవయిత్రి చాటింది. 'సంసారం మహాసాగరం' అన్నారు పెద్దలు. ఆ సంసారాన్ని ఈదటానికి ఇద్దరూ కృషి చేయాలి. ఇద్దరూ ఒకే త్రాటిపై ఉన్నప్పుడే బిడ్డలు బుద్ధిమంతులుగా పెరగగలరు. నేటి సమాజంలో సంపాదించి తెచ్చుట పురుష ధర్మం. దానిని సక్రమంగా వినియోగించుట స్త్రీ ధర్మం. స్త్రీ పురుషులు తమ ధర్మాలను త్రికరణ శుద్ధిగా నిర్వహించిన నాడు పిల్లలు సత్ప్రవర్తనులై బుద్ధిమంతులవుతారు. తన ప్రవర్తనలో భార్యను బాధించి, పీడించి సంపాదిస్తున్నామనే గర్వంతో బయట తిరిగి భార్యను హింసించటం అధర్మం. భర్తను పిల్లలను నిర్లక్ష్యం చేసి నేను, నా వారంటూ తిరిగే స్త్రీల ప్రవర్తన అన్యాయం. అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం మహోన్నతమైనది. సంసారం చేయటం పాపమనుకుంటే వారు నిజంగా పాపులని భారతీయ వైవాహిక వ్యవస్థ పారామార్థిక ధర్మాన్ని సూక్ష్మంగా చెప్పింది రచయిత్రి.

'యక్షగానం' నవలలో ముకుందాదేవి తన భర్తలోని అధర్మాన్ని నిరసించి, దాంపత్య జీవనంలో భార్యాభర్తల అన్యోన్య ధార్మికతా జీవితాన్ని విడమరచి విశ్లేషించింది. తన భర్త ముసలివాడు. కామ వాంఛలు నశించినవాడు. ఆకారణంగా వీరి దాంపత్య జీవితం అశాంతి పాలై బిడ్డలకు నోచుకోలేదు. ఈ బలహీనతను భర్త తన భార్యపై వేసి రెండవ పెళ్లి చేసుకోదలచాడు. ఇది గమనించిన ఆమె తన స్నేహితురాలు సావిత్రి సలహా మేరకు భారతంలో కుంతీ సాహసానికి ఒడిగట్టి అక్రమ సంబంధంతో గర్భం ధరించి తన భర్తకు తృప్తినిచ్చింది.

ఇక్కడ ముకుందాదేవి చేసిన సాహసం హర్షదాయకమే. ఆమె డబ్బుకాశించి, ఒళ్ళు బలిసి అధర్మానికి పాల్పడలేదు. తన భర్త పరాధీనుడు కాకూడదనే తపనే ఈ దుశ్చేష్టకు దారితీసింది. ఈ విషయం చివరకు తన కూతురుకు ఉత్తరం రాసి దేశాంతరం వెళ్ళిపోయింది. ఈ అధర్మ సంతానానికి నీ తండ్రి బలహీనతే కారణమని వాస్తవాన్ని బహిర్గతం చేసింది. అందులో తనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ, దానిని అంతమొందించాలని కూతురును ప్రార్థించింది. ఒక గడ్డు పరిస్థితిలో తన మాంగల్య సంరక్షణకు, అక్రమ సంతానానికి ఒడిగడితే అందుకు ప్రతిఫలం సాంఘిక బహిష్కరణ. అదే పురుషుడు అయితే రాజాగా బ్రతకవచ్చు. ఏమిటీ వివక్ష? కనీసం ఈనాటి యువతరం స్త్రీలైనా ముందుకు వచ్చి అనాదిగా యువతులు ఎదుర్కొనే కష్టాల్ని నివృత్తి చేయాలని పిలుపునిచ్చింది. ఆర్తి, ఆకలి, అనుభూతి, ఆవేదన, కోరికలు, స్పందన అందరికీ సమానమేనని చాటి స్త్రీ జాతికి విముక్తి కలగాలని ఆవేదన పడింది.

వాస్తవంగా ముకుందాదేవి సంసారిక జీవనం మానవత్వం గల మనిషికైతే సానుభూతి కలగాలి. మన సమాజంలో స్త్రీకి పుట్టుకతోనే అనివార్యమైన ఆచారాలు, నియమాలు ఆవరించుకున్నాయి. ఇవి చాలా సున్నితమైనవి. అవి వద్దన్నా వదిలించుకోదగినవి కావు. కానీ సమయానుకూలంగా భావ విప్లవంతో వాటిని మన శ్రేయస్సు కొరకు మలచుకుంటే నారీమణుల నైతిక స్థితిగతులు మెరుగు పడవచ్చునని రచయిత్రి  అభిలాష.

10. స్త్రీ- వరకట్న సమస్య పరిష్కార మార్గాలు:

నాడు కన్యాశుల్కం పేరుతో స్త్రీ పురుషునికి అమ్ముడుపోయింది. ఫలితంగా బాల్యవివాహాలు చోటుచేసుకుని స్త్రీ జీవితం దుర్భరమైంది. నేడు వరకట్న సమస్య ప్రబలమై యువతుల జీవితాలతో ఆడుకుంటుంది. ఈ పెను సమస్యలతో మధ్యతరగతి కుటుంబీకులు ఆడపిల్ల పుట్టగానే నిరుత్సాహంతో విషాద జీవితం సాగించాల్సి వస్తుంది. రచయిత్రి ఒక సభలో "మనదేశంలో అలుముకున్న ఈ వరకట్ట దురాచారాన్ని రూపుమాపుటకు యువతకు స్ఫూర్తి వచ్చే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి, భవిష్యత్తులో తన కొడుకు ఎలాంటి కట్నం కానుకలు లేకుండా పెళ్లి జరిపిస్తానని సభాముఖంగా శపథం చేసింది"¹⁰. కానీ విధివశాత్తు తన గర్జన కార్యరూపం ధరించక మునిపే ప్రమాదవశాత్తు మరణించిన దురదృష్టవంతురాలు శ్రీమతి మాదిరెడ్డి సులోచన .
'నెరజాణలు - మగధీరులు' నవలలో విజయ, ప్రమీలలు ఆత్మస్థైర్యంతో కట్న కానుకలు లేకుండా రాజమల్లారెడ్డి, రాజేష్ వంటి మగధీరులను పెళ్లిళ్లు చేసుకొని తల్లిదండ్రులకు ఊరట కలిగించారు. ఈ సమస్యను నివృత్తి చేయవలెనన్న పెద్దల పాత్ర కన్నా యువకుల పాత్ర ప్రధానమని ఈ పాత్రల చిత్రణలో రచయిత్రి నొక్కి చెప్పింది.
విజయ స్కూల్ టీచర్ గా చేరి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ దురాచారాన్ని పారద్రోలుటకు పాఠశాలలో 'అమ్మకానికో అబ్బాయి - కొనటానికో కోమలి' అను గేయ నాటికాన్ని రాసి విద్యార్థుల ద్వారా ప్రదర్శనలు చేయించింది. మన వివాహ వ్యవస్థ వ్యాపారంగా మారిన స్థితిగతుల్ని రచయిత్రి ఈ నాటకంలో వాస్తవికంగా చిత్రీకరించారు. ఈ వివాహము అందమైన అనురాగ బంధంగా మారవలెనన్న అబ్బాయిలు అమ్ముడుపోరాదు. అమ్మాయిలు గొంతెమ్మ కోరికలు కోరగూడదు. అప్పుడే దేశం బాగుంటుంది. ఇది పెద్దవారితో అయ్యే పని కాదు. ప్రతి యువతీ యువకులు బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే ఈ వరకట్న సమస్యను సమాజం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టవచ్చునని రచయిత్రి మాదిరెడ్డి సులోచనపరిష్కార మార్గాన్ని సూచించి యువతను కార్యోన్ముఖులను చేసింది.

11. ముగింపు:

  • ఈ విధంగా శ్రీమతి మాదిరెడ్డి సులోచన స్త్రీ జనాభ్యుదయ సమస్యలను బహు కోణాల నుండి లోకమందు ప్రదర్శించి తనకు తోచిన పరిష్కార మార్గాలను సూచించింది. ఒక విధంగా ఆమె నవలా సాహిత్యం ద్వారా సాధించదలచిన మహోన్నతమైన ఆదర్శం ఇదే అనిపిస్తుంది. నవల అంటే ఏదో ఉబుసుపోకకు చదివి అవతల పారవేసే రచన అనే అభిప్రాయాన్ని నిరసిస్తూ ఈమె నవలలు పది కాలాలపాటు మంచిని పెంచటానికి తగిన కృషి చేసే ఉత్తమ గ్రంథాలుగా నిలబడుతున్నాయనుట సత్యం.
  • సాహిత్యం సంఘంలో మార్పు తెస్తుందన్న నమ్మకంతో మాదిరెడ్డి సులోచన సామాన్య మానవుడికి కూడా అవగాహనమయ్యే నవలాసాహిత్యాన్ని ఎన్నుకొని వైవిధ్యంతో కూడిన ఇతివృత్తాలతో, సమకాలీన సమాజాన్ని దర్పణం పట్టించి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించింది.
  • సమాజాన్ని పట్టిపీడిస్తున్న వరకట్న సమస్య, సాంఘిక దురాచారాలు, మూఢాచారాలను నివృత్తి చేయాలనే సంకల్పంతో కంకణం కట్టుకున్నట్లుగా శ్రీమతి సులోచన తమ రచనల్లో కనిపిస్తారు. మరియు మధ్యతరగతి జీవన సరళిని గ్రామీణసంస్కృతిని పునరుద్ధరించడానికి అహర్నిశలు పోరాటం సల్పినట్టుగా ఈమె నవలలు ద్వారా మనకు విధితమవుతుంది.
  • దురదృష్టవశాత్తు వంటింట్లో సిలిండర్ పేలి ఆ మంటల్లో ఇరుక్కుపోయిన శ్రీమతి సులోచనని రక్షించే ప్రయత్నంలో వారి భర్త రామచంద్రారెడ్డి కూడా పరమపదించారు. ప్రమాదాల గురించి ఎన్నో హెచ్చరికలు చేసిన ఆ మాతృమూర్తి ప్రమాదంలోనే మరణించడం మిక్కిలి విషాదకరం.

12. పాదసూచికలు:

  1. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, ప్రేమలు- పెళ్లిళ్లు నవల, పుట - 48.
  2. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, అద్దాలమేడ నవల, పుట - 126.
  3. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, నెరజాణ - మగధీరులు నవల, పుట - 165.
  4. Plato's complete works - by Henry. L. Drake, Page - 388.
  5. చలం వ్యాసములు, చలం, పుట-9.
  6. డాక్టర్ సి. ఆనందరామం, తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ, పుట-225.
  7. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, గెలుపు నాదే నవల, పుట - 78.
  8. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, గెలుపు నాదే నవల, పుట - 108.
  9. శ్రీమతి మాదిరెడ్డి సులోచన, గెలుపు నాదే నవల, పుట - 113.
  10. జాగృతి - జాతీయ పునర్నిర్మాణంలో రచయిత్రుల పాత్ర, 1982 జనవరి 9,10.

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆనందరామం, సి. (1979). తెలుగు నవలలు కుటుంబ జీవన చిత్రణ, నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ.
  2. కుటుంబరావు, కొడవగంటి. (1969), సాహిత్య ప్రయోజనం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
  3. నాగభూషణ శర్మ, మొదలి. (1971), తెలుగు నవలా వికాసం, ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, సికింద్రాబాద్.
  4. రంగారావు, మాదిరాజు. (1984), నవల- స్వరూప సమాలోచనం, రసధుని ప్రచురణ.
  5. సులోచన, మాదిరెడ్డి. (1972), ప్రేమలు- పెళ్లిళ్లు నవల, నవభారత్ బుక్ హౌస్, విజయవాడ.
  6. పైదే, (1975), అద్దాలమేడ నవల, నవభారత్ బుక్ హౌస్, విజయవాడ.
  7. పైదే, (1975), తరం మారింది నవల, నవభారత్ బుక్ హౌస్, విజయవాడ.
  8. పైదే, (1975), నెరజానలు మగధీరులు నవభారత్ బుక్ హౌస్, విజయవాడ.
  9. పైదే, (1974), గాజు బొమ్మలు నవల, దేశి బుక్ డిస్ట్రిబ్యూటర్స్, విజయవాడ.
  10. పైదే, (1972), సంసార నౌక నవల, నవభారత్ బుక్ హౌస్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]