AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. కర్నూలు జిల్లా కథలు: ప్రాంతీయత
కె. వెంకట స్వామి
పరిశోధక విద్యార్థి,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9052961440, Email: swamy.ma82@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కర్నూలు జిల్లాలో స్వాతంత్ర్యాని కంటే ముందు నుండే కథ ఉంది.1972వ సంవత్సరములో “వైకుంఠ వాకిలి” పేరుతో కర్నూలు జిల్లా కథల సంకలనం పరిచయం అయింది. కర్నూలు జిల్లా ప్రాంతీయ కథల్లోని భిన్న సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ నిత్యం సంభవించే కరువులు, వాటి వలన నష్టపోయిన వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు, వలసలు, నీటి పారుదల సమస్యలు, ఫ్యాక్షన్ గొడవలు, వర్గ, కులకక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాంతీయ సంస్కృతులు, సాంప్రదాయాలు, స్త్రీల సమస్యలు, ప్రాంతీయ భాషకు సంబంధించినవి, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ దృక్పథంతో కథలు వెలువడ్డాయి. కర్నూలు జిల్లా ప్రాంత భౌగోళిక నైసర్గిక స్వరూప స్వభావాలను పరిశీలిస్తూ “ప్రాంతీయత”కు దోహదం చేసే అంశాలను వివేచించి, విశ్లేషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కర్నూలు జిల్లాలో ప్రాంతీయంగా అభివృద్దికి నోచుకోలేని అంశాలను విశ్లేషిస్తూ ఇక్కడ ఉండే సమస్యలను, వెనుకబాటు చర్యలను, రాజకీయ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండ కడుతూ, భవిష్యత్తులో కర్నూలు జిల్లా వలసలు, కరువులు, ఫ్యాక్షన్ తగాదాలు లేకుండా, అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి పారిశ్రామిక అభివృద్ది వైపు, సాంకేతికరంగాలకు పున్నాదులు వేసి భాషాప్రయుక్త రాష్ట్రంగా విభజన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాన్నికి, మోసానికి పరిహరంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం భవిష్యత్ అభివృద్దికి పయనించేలా చేయడమే వ్యాసాంశం యొక్క ముఖ్యోద్దేశం.
Keywords: ప్రాంతీయత, కథ, కర్నూలు జిల్లా కథలు, ప్రాంతీయ స్పృహ, సాంప్రదాయాలు, ప్రాజెక్టు-1960, వివక్షలు, ఫ్యాక్షన్లు, 2009 వరదలు.
1. ఉపోద్ఘాతం:
సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి హత్తుకునే సన్నిహిత సాహితీ ప్రక్రియే తెలుగు కథానిక వాస్తవికతకు పునాదిగా ఉంటూ వివరంగా, సౌందర్యవంతమైన లక్షణాలతో జీవద్భాషలో పాఠకునితో సంభాషించేదే కథానిక ప్రక్రియ. తెలుగు కథా ప్రక్రియ సంఘసంస్కరణోద్యమంలో ప్రారంభమై కాలాను గుణంగా మార్పులు చెందుతూ ఆధునిక జీవితంలోకి అడుగు పెట్టి శక్తివంతమైన వచన రూప ప్రక్రియగా మారింది. ఒక సమాజాన్ని, ఒక ప్రాంతాన్నీ, విభిన్న ప్రాంతాలను, ఒక దేశాన్ని,అందులోని వివిధ ప్రాంతాల జీవితాలను, పరిస్థితులను, వాస్తవాలను, వివక్షతలను, సమస్త అంశాలను తెలుసుకొని, అర్థం చేసుకొని సంస్కారవంతమైన మార్పులు తీసుకొని రావడానికి వీలుండే ప్రక్రియే కథ.
2. ప్రాంతీయత:
వచన రూప ప్రక్రియ, కళాత్మకమైన కథా ప్రక్రియలో విభిన్నమైన కథలు తెలుగు సాహిత్యంలోకి వచ్చాయి.చారిత్రాత్మకమైన కథలు,సామాజిక కథలు,రాజకీయ సంబందిత కథలు, మనోవైజ్ఞానిక కథలు వెలువడినా అందులో ప్రతి ప్రాంతానికి సంబంధించిన వస్తువు కనిపిస్తుంది. కానీ కేవలం ఒక నిర్దేశితమైన సరిహద్దులు కల్గిన భౌగోళిక స్వరూప ప్రాంతం నుండి మాత్రమే వెలువడిన కథా ప్రక్రియ ఎటువంటి విషయాలను, ఎటువంటి సమస్యలను, ప్రత్యేకతను పాఠకుడికి అందజేస్తుందనేది ప్రాంతీయ కథల లక్ష్యం. “ప్రాంతీయత” అనేది ఆయా ప్రాంతాల్లో మాట్లాడే భాషను ప్రాతిపదికగా చేసుకొని, అక్కడి వాస్తవాలను, పరిస్థితులను, భౌగోళిక పరమైన అంశాలను, సామాజిక జీవితాన్ని, రాజకీయాంశాలను, ఆర్థికాంశాలను, ఆ ప్రాంత ప్రజల జీవితానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రాంతీయ సమస్యలపైన కథలు రావడం ప్రాంతీయతకు అద్దం పడుతుంది.
కర్నూలు జిల్లాకు సంబంధించిన కథల్లో ఆంధ్రరాష్ట్ర ఉద్యమం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు సీమ ప్రజల్లోనూ, కర్నూలు ప్రాంతవాసుల సమస్యలు, పరిస్థితులు, వాస్తవాలపై ఎన్నో కథా సంకలనాలను కర్నూలు జిల్లా రచయితల సంఘం మరియు ఇతర కథా రచయితలు వెలువరించారు. కర్నూలు జిల్లా ప్రాంతవాసులకు తమ భవిష్యత్, తమ జీవితం, తమ అస్థిత్వం, ప్రాంతీయస్పృహ, ప్రాంతీయ పరిస్థితులను, వాస్తవాలను, మార్పులను పరిశీలిస్తూ కర్నూలు జిల్లా ప్రాంతీయ జీవిత చిత్రణకు పెద్దపీట వేసిన వారిలో శిష్టు కృష్ణమూర్తి, కె.ఎన్.ఎస్.రాజు, శ్రీనివాసమూర్తి, పినాక పాణి, మారుతి పౌరోహితం, ఉమామహేశ్వర్, వెంకటకృష్ణ, ఇనాయతుల్లా, కెంగారు మోహన్, హరికిషన్, నాగరాజు, వెంకటేష్, నాగప్పగారి సుందర్రాజు వంటి రచయితల కథల్లో కర్నూలు జిల్లా ప్రాంతీయ జీవిత చిత్రణ కనబడుతుంది.
కర్నూలు జిల్లా కథల సంకలనాలలో ప్రాంతీయతకు ప్రతిరూపంగా నిలిచిన వాటిలో "సిద్ధేశ్వరం అడుగు" (2020), పరామోళ్ళు (2011), గుర్నూలు పూలు (2016), దేవరగట్టు (2017), నిప్పులవాన (2020), శాపపుస్తులు (2005), బతుకుచిత్రం(2016), నేరేడు రంగు పిల్లవాడు (2020), వాన మెతుకులు (2012), ఊరుమర్లు (2022), పెట్టుడు రెక్కలు, హరికిషన్ కథలు, కర్నూలు కథ, ఉగ్రతుంగభద్ర, తుంగభద్ర తరంగాలు, మాదిగోడు, కథా సంపుటాల్లో రచయితలు తమ జీవితాన్ని ముడి సరుకుగా తీసుకొని, తమ సామాజిక జీవితాన్నే వస్తువుగా తీసుకొని ప్రాంతీయ కథలకు బలాన్ని చేకూర్చారు.
3. కర్నూలు జిల్లా కథలు:
ప్రాంతీయత అన్నప్పుడు, రచయితల బాల్యం, కుటుంబం, తన చుట్టూ ఉన్న మానవ సంబంధాలు, పరిస్థితులు, సమస్యలు ప్రభావితం చేసినంతగా ఇతర కొత్త విషయాలు ప్రభావితం చెయ్యలేవు. రాయలసీమ ప్రాంతమైనా, కోస్తా ప్రాంతమైనా, కళింగ ప్రాంతమైనా, తెలంగాణా ప్రాంతమైనా ఆయా మట్టిలోంచి పుట్టుకొచ్చిన రచయితల్లోని ఆ మట్టి వాసన, ఆ ప్రాంతం నీటి చల్లదనం, వెచ్చదనం, ఆ ప్రాంతం గాలి వీవనం, సుఖదుఃఖాలు, కన్నీళ్ళు, పగప్రతీకారాలు, పంతాలు, పట్టింపులూ, చైతన్యాలు, తిరుగుబాటు ధోరణులు, ప్రేమానుబంధాలు ఇలా ఎన్నో అంశాలు ఆ ప్రాంత రచయితల్లో ప్రాణం పోసుకుని ప్రాంతీయతకు బలాన్ని చేకూర్చాయి.కర్నూలు ప్రాంతంలో ఉండే ప్రజాజీవనం, సమస్యలు, అనుబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలు, ప్రభుత్వవిధానాలు, ప్రాంతీయ పరమైన మార్పులు, ప్రాంతీయ యాస, వాస్తవికమైన జీవితాలను రచయితలు తమ కథల్లో చిత్రించి కర్నూలు కథల్లో ప్రాంతీయతకు బలాన్ని కల్పించారు.
4. కర్నూలు ప్రాంతీయ జీవిత చిత్రణ:
ప్రాంతీయ ప్రజల జీవిత చిత్రణను జిల్లా భౌగోళికంగా కథకులు కథల్లో చిత్రించిన తీరును అధ్యయనం చేస్తే కర్నూలు కర్ణాటక, తెలంగాణా, అనంతపురం, ప్రకాశం జిల్లాలతో సరిహద్దులు కల్గి తూర్పున నల్లమల, ఉత్తరాన విభజిత తెలంగాణ పశ్చిమాన కర్ణాటక, దక్షిణాన అనంతపురంతో విభిన్నమైనటు వంటి ప్రత్యేకత సరిహద్దులును కల్గిన ప్రాంతం, ప్రత్యేకమైన సమస్యలు కల్గి ఉన్న ప్రాంతం. సాగునీరు, తాగునీరు, కరువులు, ముఠాకక్షలు, హత్యారాజకీయాలు,భూస్వామ్య పెత్తందారీ వర్గాలు, ఆత్మహత్యలు, వలసలు, సామాజిక వివక్షలు, భిన్నమైన కొండలూ, సంస్కృతి, విభిన్నమైన యాస, వీటితో పాటు అడవులు, గుట్టలూ, ప్రత్యేకించి జీవనదులు ప్రవహించే అవకాశం లేని ప్రాంతం, మైదానాలకు అవకాశం లేకుండా ఎత్తు పల్లాలు, వర్షాలు లేకపోవడం, గట్టి బండరాయితో కూడిన నేల అడుగు భూభాగం, పారిశ్రామీకకరణకు నోచుకోనిది, విద్యావ్యవస్థకు పూర్తి స్థాయిలో గుర్తింపు లేనిది, వేలకు వేలు అప్పులు, వెయ్యి అడుగులు లోతు బోర్లు వేసినా చుక్కనీరు కంటబడని ప్రాంతం, రెండు నదులు కృష్ణా, తుంగభద్ర పారుతున్నా వాటిలో నీటిని తాగడానికి, వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోలేని ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇక్కడి జీవితాలు, సమస్యలు, పరిస్థితులే కథలకు ముడిసరుకుగా తీసుకొని భయానకరమైన,బీభత్సకరమైన దృశ్యాలే కథకుల ఇతివృత్తాలుగా ఉన్నాయి.
5. కర్నూలు జిల్లా ప్రాంతీయ సాంప్రదాయాలు:
కర్నూలు జిల్లా ప్రాంతీయ సాంప్రదాయాలలో కొన్ని భిన్నంగా ఉన్న సంప్రదాయాలలో దేవరగట్టు బన్నీ ఉత్సవం,బసివిని ఆచారం. ఈ కాలంలో కూడా ఉందా? అని ప్రశ్నించేలా? ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నాయా? అనే విస్మయాన్ని కలిగించేలా ఉన్నాయి. “నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద” కథలో బసివిని ఆచారంలో “బోడెక్క వొగిటే తరాగా యెక్కుళ్ళు బట్టేతట్లు యేడుస్తుండాది వూరుకోమ్మే వూరుకుండు అమ్మ కార్యుమప్పుడు యేడుకూడదు. ఉలిగమ్మవ్వకి క్వాప్మొస్తే జీవితాంతం! ఇట్లే మేడుసుకుంటూ బతుకుమని సాప్ము పెడతాదంట మట్టసనంగా బసివిరాలు అయ్యినోళ్ళుని పచ్చ నాలుకులక్క సలుగ బతుకుమని వరుము ఇస్తాదంట, యేడద్దు లేమ్మే యెడొద్దు అయ్యిపోయ్యిడిసేద కదా”-1 (నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద - డా.నాగప్పగారి సుందర్రాజ్ పుట:26) అని కథలో ఆచారం పేరుతో భవిష్యత్ ఆశలు ఎన్నో ఊహలున్న ఒక యువతిని బసివిని సంప్రదాయంలోకి తీసుకువచ్చి ఆ యువతికి భవిష్యత్లో ఒక స్వేచ్ఛా పూరితమైన కుటుంబ జీవితం లేకుండా చేసిన వైనం ఆలూరు ప్రాంతంలోని బసివిని ఆచారానికి నిలువుటద్దం. మరొక సంప్రదాయంలో దేవరగట్టు కథలో “ఇదంతా సరేగానీ సారూ......మా ఆచారం సంగతేందో రోంత ఆలోచన సేయాల గదా....మామేమన్నా కావాల్సికి తలలు పగుల గొట్టుకుంటామా, ఆదొగ ఆట....మీరెట్లా మాకు విద్య చూపిస్తూ వుండారో మేమూ అట్లనే దేవుని ఆట ఆడతాం పూర్వకాలం నుంచీ యిది నడుస్తానే వుంది మా కండ్లు పెట్టుకొని చూస్తే మీకు తప్పు అన్పించేది వొప్పుగా అనిపిస్తుంది.”-2 అని (దేవరగట్టు- జి.వెంకటకృష్ణ:పుట:25) భక్తుడి చేత చెప్పించిన మాటలివి. బన్ని వుత్సవంలో మాళమల్లేశ్వరస్వామి ఉత్సవం చూడడానికి నడుచు కొని వచ్చేవాళ్ళు ఎద్దుల బండి మీద వచ్చేవాళ్ళు, విగ్రహ ఉత్సవమూర్తుల వెంట అడవిలో రక్షణ కోసం కర్రలను తీసుకొనివచ్చే వాళ్ళు, నాగరికత మారుతున్న కొద్దీ పరిస్థితులను కొంత మంది స్వార్థపరులు తమ పగప్రతీకారాలు నెరవేర్చుకోవడం కోసం కర్రల సమరంగా మార్చుకున్నారు, యిప్పుడూ కాలం మారింది. ట్రాక్టర్లు, వ్యాన్లూ, అబ్బో ఎంత మందో? బన్ని వత్సవం జరిగిన తరువాత ఎవరో ఒక్కరికి కర్రతగిలితే బండారు పూసేవారు. కానీ యిప్పుడు డాక్టర్లు, క్యాంపులు పెట్టినారు వాస్తవానికి ఈ ఉత్సవం రక్తపు నేలగా మారడానికి కారణం కూడా లేకపోలేదు కొంత మంది తమ రాజకీయ స్వార్థాలతో తమ కబంద హస్తాల ప్రమేయం ఉందనే వాదనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.ఈ ఉత్సవానికి పరోక్షంగా ఎన్నో రకాలైన రాజకీయ శక్తుల బలం ఉందనే వాస్తవానికి అద్దం పట్టేలా రచయిత తన అంతరార్థాన్ని వెళ్ళగక్కాడు.
6. కర్నూలు జిల్లా చారిత్రక జీవన రూపాలు:
కర్నూలు జిల్లా కథల్లో ప్రాంతీయతను విశ్లేషించుకుంటున్నప్పుడు తప్పకుండగా మననం చేసుకోవాల్సిన కథలు “సిద్ధేశ్వరం అడుగు” “అస్పస్టరూపాలు” “ప్రాజెక్టు-1960” కథకులే స్వయంగా తన అనుభవాలను కథలుగా చిత్రించి ప్రాంతీయతకు బలాన్ని చేకూర్చారు.“కాస్తా ముందుగా కె.సి. కెనాల్ వైపుకు అడుగులు వేశాడు. డచివారు క్రీ.శ.1872 లో కర్నూలు జిల్లా సుంకేసుల నుండి కడప వరకూ తవ్వారు ప్రజలను, వ్యవసాయాన్ని ఉద్దరించడానికి కాదు తమను ఉద్దరించుకోవడానికి”-3 (నీళ్ళింకని నేల - యస్.డి.వి. అజీజ్: పుట:133) కారణం చిన్నపాటి పడవల ద్వారా డచివారు తమ వ్యాపారం కొనసాగించేవారు.ఈ కాల్వకి అనేక మార్లు గండ్లు పడటం,దాని మరమ్మతుల ఖర్చు,వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో రెండు కోట్లకు బ్రిటీష్ వారికి అమ్మేశారు. ఆ కాల్వ నీరుని బ్రిటిష్ వారు తాగునీరుగా, వ్యవసాయ భూములు సాగు చేసుకోవడానికి అనువుగా మార్చారు.దాని ఫలితంగా ఆ కాలంలోనే కాల్వ పరిసర భూములన్నీ పచ్చదనంతో కళ కళలాడాయి.జిల్లాలోని వేల ఎకరాలు సాగులో ఉండేవి.కానీ పరిస్థితులు మారి నేడు కె.సి. కెనాల్ పేరుకు మాత్రమే కాలువ దానిలో నీళ్ళుండవు, దాహం తీర్చదు, వ్యవసాయం జరగదు. కర్నూలు జిల్లాలోనే ఉండే ప్రాజెక్టు నుండే ఆ కాలువకు నీళ్ళు రావడం లేదంటే రాజకీయంగా, ప్రభుత్వపరంగా కర్నూలుపై ఎంత వివక్షతను చూపిస్తున్నారనే వాస్తవం కనిపిస్తుంది.ఎందుకంటే తమ కళ్ళెదుటనే నిండు కుండాలా వున్న కెసి కెనాల్ వట్టిపోయి కనిపిస్తుంటే ఇదేనా....? ఒకప్పటి కెసి కెనాలు, ఇప్పటి కెసి కెనాల్ కు ఎక్కడా పొంతన లేకుండా పోయింది అనే విషయాన్ని, వాస్తవికతను, కళ్ళెదుట కనిపించినది, కళ్ళెదుటనే మాయమై పోయిందనే బాధను తెలుస్తుంది.“పేరుకు రయితు! బతికి సెడినోన్నే రయితులంటారు రయితుకన్నా పట్టంలో గుగ్గుళ్ళమ్ముకునేటోడే నయం! యవసాయంలో ఇత్తనం ఏసినప్పట్నుంచి పంట చేతి కోత వరకు పసికందుని చూసుకొంటున్నటు సూస్కోవాలా!” -4 (ప్రాజెక్టు- 1960: కె.ఎస్.ఎన్. రాజు: కర్నూలు కథ: పుట: 154) ఇలా ఆలోచిస్తున్న ధర్మయ్యకు లొట్టిగాడు సేను అమ్మిన విషయం గుర్తుకు వచ్చింది.ప్రభుత్వాలు పాలకులు ఎందరు మారినా మునిమడుగు ఏరుపై 1960 ప్రాజెక్టు నిర్మాణం చేప్పటితే నలభై సంవత్సరాలకి కూడా పూర్తి కాలేకపోవడం ప్రాజెక్టు నిర్మాణం నాలుగేళ్ళలో ముగించాల్సింది నలభై ఏళ్ళు పట్టిందంటే ప్రభుత్వానికి గానీ పాలకులకు గానీ ఈ ప్రాంతంపై మమకారం లేదు,వివక్షతను చూపడమే వారి ద్యేయం దీనితో ఎంత మంది రైతులు భూములమ్ముకున్నారు, ఎంత మంది ఆశలు తీరక ప్రాణాలు వదిలారో, ఎన్ని అప్పులు మిగిలాయనేది కర్నూలు ప్రాంతం వివక్షతకు గురైందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేటికీ సాగునీరు విషయాలలో కర్నూలు జిల్లాకు,రాయలసీమకు అటు కోస్తా ప్రాంతం నుండి, తెలంగాణా నుండి, కర్ణాటక ప్రాంతాల నుండి మొండి చేయి చూపిస్తూనే ఉన్నారు.
7. కర్నూలు జిల్లా ప్రాంతీయ వివక్షలు:
ఒకే ప్రాంతం ప్రజలు అయివుండి కూడా తమ స్వలాభం కోసం ఒక ప్రాంతం ప్రజలు మోసం చేయడం, మరొక ప్రాంతం ప్రజలు మోసపోయిన వైనం సాగునీటి పంపకంలో, రాష్ట్రవిభజనతో తేటతెల్లమైంది.“స్వామీ....వచ్చే జన్మలోనన్నా ఈ సీమలో రైతుగా పుట్టించమాకు”-5 (తరతరాల దుఃఖం-ఎం.హరికిషన్ కథలు: పుట :81) అంటూ నారాయణ అనే రైతు రెండు చేతులెత్తి మొక్కుకుంటూ,గుండె నిండా ఉన్నటు వంటి భాదతో, దుఃఖంతో పరిస్థితిని తెలియజేశాడు. శ్రీశైలం జలవిద్యుత్ డ్యాం నిర్మాణం కొరకు భూములు,గ్రామాలు త్యాగం చేసి కట్టు బట్టలతో పడిన కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం ఎగువ గ్రామీణ ప్రాంతాల వారిపై ప్రభుత్వాలు, పరిపాలకులు, కోస్తాంధ్రా పాలకులు చూపిన నిర్లక్ష్య వైఖరి మరే ప్రాంతాల్లోనూ కన్పించదు.ఆ వివక్షత ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చినా అలాగే కొనసాగుతూనే ఉంది.ఈ వివక్షత వలన కర్నూలు ప్రాంతానికి కోలుకోలేని దెబ్బతో రైతుల కళ్ళలోంచి కారుతున్న కన్నీళ్ళ ప్రవాహంతోనైనా బతుకుదామంటే అవీ కూడా ప్రవాహమై కృష్ణానదిలో కలిసి శ్రీశైలం వైపు పయనించి పరాయి ప్రాంతం వాళ్ళ చెంతకు చేరాయని శ్రీశైలం డ్యాం నిర్మాణం తరువాత కర్నూలు జిల్లా ప్రాంతం పరిస్థితులపై ఉద్వేగ భావాలు కనిపిస్తాయి.“మనకు దక్కనిది ఎవరికీ దక్కగూడదనే యాసిడ్ సంస్కృతి వదిలేద్దాం మిత్రమా....లూటీ చేసిన డబ్బులు కాపాడు కోవడానికే యూటి హైదరాబాదు ఇప్పుడు కోస్తా దారుల,రాయలసీమ ఫ్యాక్షనిస్టుల స్విస్ బ్యాంక్. వాళ్ళకి కాపలా కాయాల్సిన అవసరం మనకెందుకూ....ఈ 60 ఏళ్ళల్లో బాగుపడింది నాలుగు జిల్లాలే, రెండు కులాతే, ఎవరి కుట్రలో కూరుకు పోతూ కాళ్ళక్రింద కదిలిపోతున్న నేలను మరిస్తే ఏట్లా”-6 అంటూ! ప్రకాశ్ పాత్ర ద్వారా (కొత్తకల: హరికిషన్ కథలు: పుట:127) కర్నూలు ప్రాంతవాసులను కృష్ణాజలాలు, నాగార్జున సాగర్,శ్రీశైలం డ్యాం,రాజధానిని కర్నూలు నుండి హైదరాబాదు తరలివెళ్ళుట వంటి విషయాల్లో రాయలసీమ వాసులను ఎవరు ఎలా మోసం చేశారు?సమైకాంధ్ర ఉద్యమంలో కూడా మోసపోయిందీ రాయలసీమ ప్రాంత వాసులే.. జాగ్రత్త అని విభజన వాదులు పాల్పడిన దుశ్చర్యల నుండి గుణపాఠం నేర్చుకోవాలని, ఇప్పటికై నా మించి పోయినది ఏమీ లేదు... తరతరాలుగా సీమ ప్రజలు కలగంటున్న ప్రాంతీయ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి, పారిశ్రామిక రంగాల నిర్మాణం, సాంకేతిక రంగాల నిర్మాణాలుకు స్థానం కల్పించి కర్నూలు జిల్లా వాసుల కొత్తకలను ఈ విధంగానైనా నెరవేర్చాలనే సంకేతాన్ని సూచిస్తుంది.
8. కర్నూలు జిల్లా సామాజిక వివక్షలు:
“ఎద్దులు బెదిరాయి రెడ్డి! బండ్ల నా కొడుకు,మా ముసల్దిదుంది దానికదేం జరమ్మో మూసిన కళ్ళు తెరవకుండా పడింది. గవర్నమెంటాస్పత్రికి తోలుక పోతుండా! ఈ గత్కుల రోడ్డుమీద సానా ఆయాసపడుండాది రెడ్డి సమయానికి దేవులా వొచ్చినావు ఎట్టన్నా ఆస్పత్రిలో సేర్సి పున్నెం కట్టుకో రెడ్డి”-7 అంటూ మారెప్ప ఆవేదనతో వేడుకున్నాడు.(సూరిగాడు-కె.ఎన్.ఎస్. రాజు కథలు: పుట:18). ఊరి పంచాయితీ పుట్టినప్పటి నుంచి ఏకచక్రాధిపత్యంతో పాలించే సర్పంచ్ రామిరెడ్డి, గ్రామ పంచాయితీ పెద్ద అయివుండి కూడా ఒక పేదవాడు, కులం తక్కువ వాడు అనే వివక్షతో జ్వరంతో ఉన్న మహిళా అని చూడకుండా, సూటి పోటి మాటలతో దూషిస్తూ,కించపరుస్తూ వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసిన వైనం రామిరెడ్డి పాత్ర ద్వారా రచయిత చిత్రించిన తీరు అద్భుతం.వర్ణవివక్షతతో ఆగ్రవర్ణాలకు చెందిన నాయకులు కర్నూలు జిల్లా గ్రామీణ ప్రజలను తమ చెప్పుల కింద నలిగేలా చేసి నేటికీ బడుగు,బలహీన వర్గాల అణిచివేత,వివక్షత కర్నూలు ప్రాంతంలో కనిపిస్తుంది.“సమాజంలో మార్పులు తీసుకురావాల్నంటే రాజకీయ నాయకుల కంటే ముందుగా ఉద్యోగ వర్గాల్లో మార్పు రావాలి. అప్పుడే అట్టడుగు ప్రజానీకానికి సేవాఫలాలు అందుతాయి”-8 అని రవి పాత్ర చేత (తపన: కె.ఎన్.ఎస్. రాజుకథలు: పుట: 55) ప్రశ్నించిన తీరుతో రచయిత అంతరంగిక నిగూఢ అర్థం అవగతమవుతుంది. కర్నూలు ఉస్మానియా కళాశాలో చదివిన ఇద్దరు మిత్రులల్లో ప్రభుత్వ డాక్టర్ అయిన సుధాకర్ని గ్రామ ప్రజల వైద్య సేవకోసం అడిగితే నాకు డబ్బుపై వ్యామోహం ఎక్కువ నీ కోరిక నెరవేర్చలేను అని హోదా మారిన తరువాత పుట్టిన జన్మస్థలం కంటే డబ్బును కూడబెట్టి హైదరాబాదు లాంటి ప్రదేశాలకు వలస వెళ్ళడం అనేది పుట్టిన స్థలంపై వివక్ష చూపుట, మరోవైపు రవి వంటి పాత్రతో ప్రాంతీయ మమకారం వ్యక్తికి డబ్బును ఇవ్వక పోవచ్చు కానీ నిండైన మనసును కల్పిస్తుంది. అదే ప్రాంతీయంగా ఉండే ప్రజల్లో ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయతా దృక్పధం కల్గిన ఆలోచనలతో ఉండేలా చేస్తుంది. ప్రాంతీయతా భావం బలంగా నాటుకుని పోతుందో ఆ ప్రాంతం ఎన్ని అడ్డంకులు, ఎన్ని సమస్యలు ఎదురైనా అభివృద్ధికి, చైతన్యానికి దిశానిర్దేశంగా ఉంటుందని కథకుడు తన తపనోద్దేశాన్ని తెలియజేశాడు.
9. కర్నూలు జిల్లా 2009 వరదలు:
కర్నూలు జిల్లాకు నీరు లేకపోతే వట్టికరువు నీరు ఎక్కువైతే పచ్చికరువు అన్నే వాస్తవికతను బహిర్గతం చేసిన పరిస్థితులు 2009 వరదలు. “అయిపోయింది అంతా అయి పోయింది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. కొండారెడ్డి బురుజు మీద కాకి కూచోని నీళ్లు తాగే రోజొస్తుందని, ఏం చేయలేం, కలియుగం అంతమయిపోయే రోజుచ్చేసింది”-9 అని ఒక ముసిలోని పాత్ర ద్వారా కర్నూలు వరద వైపరిత్యాన్ని 'వరద' కథలో వివరించాడు (కథా స్రవంతి: డా.ఎం. హరికిషన్: పుట: 43) 2009లో తుంగభద్ర, హంద్రీ నదీ జలాలకు తోడుగా అధిక వర్షాలు కురవడంతో కర్నూలు నగర మొత్తాన్ని వరద నీరు ముంచివేసింది. ఎప్పుడు వరదలు ఎరుగని కర్నూలు పట్టణ ప్రాంతవాసులకు ఊహించని రీతిలో వచ్చిన వరదలు దిక్కుతోచని పరిస్థితులోకి నెట్టాయి. దీనికి కారణం లేక పోలేదు సుదీర్ఘకాలంగా వర్షాలు లేక పోవడంతో నీరు పారే మార్గాలను రాజకీయ పలుకుబడులు కల్గిన బడానేతలు, ఆధిపత్యవర్గాలు కబ్జాలు చెయ్యడం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం కానీ, పాలకులు కానీ నగరీకరణ అభివృద్ధి పనులను విస్మరించడం,బడాబాబులకు అధికారాన్ని తాకట్టు పెట్టడం వంటి కారణాల వల్ల కర్నూలు నగరానికి తాగడానికి,వ్యవసాయానికి నీళ్ళు లేక పోయినా ముంచడానికి నీళ్ళున్నాయి అనే విస్మయానికి గురిచేసింది "వరద" అనే కథ.
యుద్ధం వస్తుందంటే మూటా ముల్లు ,తల్లి, పిల్లాజల్లా ఎట్లా తరలివెళ్తారో అలాగే తరలి వెళ్ళే పరిస్థితులు కర్నూలు జిల్లా ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి.కారణం పల్లె బడుగు జీవితాలపై ప్లాట్లు, స్లెజులు యుద్ధాన్ని ప్రకటించాయి.“భూమిలేనోనికి ఎవడప్పిస్తాడు పుట్టినూళ్ళో గంజి నీళ్ళు గూడా పుట్టలా.... పూలమ్మిన చోటే కట్టెలమ్మలేకకి తటా, బుట్టా తీసుకొని పెండ్లాం పిల్లలతో టౌనికి ఎల్లిపాయ అంతే…”-10 (కథాస్రవంతి: డా.ఎం.హరికిషన్: పుట:61) అనే విషయాన్ని సుంకన్న పాత్రచేత పల్లెలోని మధ్యతరగతి పేదవాని బతుకు జీవితాలతో చేస్తున్న యుద్ధంగా వివరించాడు రచయిత బతుకు యుద్ధం కథలో పల్లె జీవితాలన అస్తవ్యస్థం చేసిన పరిస్థితులు కనిపిస్తాయి.కర్నూలు జిల్లా వాతావరణ పరిస్థితులు అనుకూలం వలన పంటలు పండితే రైతాంగం అంతా నడుము బిగించి ఏకదాటిగా పనులు చేసేవారు ఇటువంటి సాంప్రదాయం కనుమరుగయింది. ప్రస్తుతం గ్రామీణ జీవితంలోకి ప్రపంచీకరణం, పెత్తందారులు, రాజకీయ శక్తులు, ప్రభుత్వాధికారులు దిగజారుడు తనం పాగా వేశాయి కనుక పల్లెల్లో వ్యవసాయంపై స్లెజులు యుద్ధం ప్రకటించడంతో సాలుసక్కగా వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొగాళ్ళు గానీ, వంచిన నడుం ఎత్తకుండా చకచక నాట్లు వేసే పనిగత్తెలు గానీ, కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలు ఎకరాలు పంట కోసే పాలెగాళ్ళు గానీ,గడ్డివాముల్ని ఎంతటి గాలికైనా, వానకైనా చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు కానీ కనిపించడం లేదు. వీళ్ళనంతా భవన నిర్మాణ కార్మికుల్లా మారేలా చేశాయి రియల్ ఎస్టేట్ రంగం.పల్లెలో నల్లమల్ల అడవి నుండి బళ్ళారి సరిహద్దుల వరకు, కృష్ణానది తీరం నుండి అనంతపురం సరిహద్దుల వరకు వ్యవసాయ పరిశ్రమలు పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఇది భవిష్యత్ తరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పల్లెలంటే ఏమిటి అనీ? వ్యవసాయం అంటే ఏమిటీ? అని ప్రశ్నించే స్థాయిలో ముందు తరం రైతు ఇంట పుట్టి పెరిగిన పిల్లలకే కన్పించకపోవచ్చు.ఇప్పటికైనా పాలకులు పల్లెలకు వ్యవసాయమనే నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టితే మంచిది లేకపోతే బతుకు అనేది ఒక్క యుద్ధం లాగా మిగిలి పోతుందనే సత్యాన్ని రచయిత వ్యక్తం చేశాడు.
10. కర్నూలు జిల్లా కథల్లోని ఫ్యాక్షన్లు:
కర్నూలు జిల్లా కథల్లోని, రచయితల కథల నిండా ప్రాంతీయ జీవన సమస్యలే కనిపిస్తాయి."ఈ స్వామిదన్నా మేలు....శాంతిరెడ్డి నయితే కొడుకు చిన్న వోని కండ్ల ముందే చంపినారు. సందు దిరిగిన మనుషుల్ని చూసి నాయినా నాయినా! అని ఎచ్చరించే లోపలే మంచం మీద పడుకున్నోన్ని పడుకున్నటి నరికినారు." (దేవుడి మాన్యం కథ - శ్రీనివాసమూర్తి) పాత్రలతో చెప్పించిన తీరు కర్నూలు ప్రాంతంలోని ఫ్యాక్షన్ ఎంత భయం కరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందో, అది భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, దీని వల్ల ఆ ప్రాంతం అభివృద్దికి చేరుకోవడానికి అవకాశం కనబడదు అనే వాస్తవిక, భవిష్యత్ పరిణామాలను కర్నూలు జిల్లా ప్రజాజీవితాల భయాన్ని తెలియజేస్తుంది.
11. ముగింపు:
కర్నూలు జిల్లా కథల్లోని ప్రాంతీయ స్పృహతో వచ్చిన కథల్లో ప్రత్యేకమైన సంప్రదాయ ఆచారాలను, కనుమరుగవుతున్న చారిత్రక అంశాలను, సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలు, వివక్షలు, రాజకీయంగా పాలకులు నిర్లక్షంతో ప్రాంతంపై చిన్న చూపు చూడటం, భూస్వామ్యదారులు సామాన్య ప్రజానికం పై చూసే ఆరాచకత్వంపై మార్పు సంకేతం,సామాజికంగా ప్రజానిక ఆలోచనలలో మార్పు తెచ్చే ఉద్దేశ్యంతో కథలు వెలువరించి ప్రాంతీయ అభివృద్ధికి, మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ కథలో యాసకు స్థానం కల్పించడంతో రచయితల ఆలోచనలు తమ ప్రాంత వాస్తవికత కోసం అభివృద్ది కోసం ఎంత బలాన్ని చేకూరుస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది.
12. పాదసూచికలు:
- నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద-డా.నాగప్పగారి సుందర్రాజ్ పుట:26
- దేవరగట్టు- జి.వెంకటకృష్ణా, పుట:25
- నీళ్ళింకని నేల-యస్.డి.వి.అజీజ్:పుట:133
- ప్రాజెక్టు-1960 : కె.ఎస్.ఎన్.రాజు : కర్నూలు కథ: పుట: 154
- తరతరాల దుఃఖం-ఎం.హరికిషన్ కథలు:పుట:81
- కొత్తకల:హరికిషన్ కథలు:పుట:127
- సూరిగాడు-కె.ఎన్.ఎస్.రాజు కథలు:పుట:18
- తపన:కె.ఎన్.ఎస్.రాజుకథలు:పుట:55
- కథా స్రవంతి: డా.ఎం.హరికిషన్:పుట:43
- కథాస్రవంతి: డా.ఎం.హరికిషన్:పుట:61
13. ఉపయుక్తగ్రంథసూచి:
- ఇనాయతుల్లా, ఎస్.యం.డి. & కెంగారు మోహన్. నీళ్ళింకనినేల కథలు.రాయలసీమ ప్రచురణలు, కర్నూలు, 2019.
- ఉమామహేశ్వర్, జి. పరాయోళ్ళు. పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. మన నవలలు మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2013.
- నారాయణస్వామి, బండి. రాయలసీమ సమాజం సాహిత్యం. పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2019.
- పాణి. నేరేడు రంగు పిల్లవాడు కథలు. విప్లవ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్, 2020.
- రాజు, కె.ఎన్.ఎస్. ఉగ్రతుంగభద్ర. కర్నూలుజిల్లా రచయితల సహాకారప్రచురణ సంఘం, కర్నూలు, 2010.
- రాజు, కె.ఎన్.ఎస్. కె.ఎన్.ఎస్.రాజు కథలు. జి.ఎ.ఆర్.గ్రాఫిక్స్ & ప్రింటర్స్, హైదరాబాద్, 2002.
- విరసం వర్క్ షాప్ కథలు, కథలపంట. విప్లవ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్, 2008.
- వెంకటకృష్ణ, జి. దేవరగట్టు. జి వెంకటకృష్ణ కథలు. లిఖిత ప్రెస్, హైదరాబాద్, 2017.
- శ్రీదేవి, కె. సీమకథ అస్థిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2016.
- హరికిషన్, ఎం. కర్నూలు కథ . దీప్తి ప్రచురణలు, విజయవాడ, 2020.
- హరికిషన్, ఎం. హరికిషన్ కథలు. దీప్తి ప్రచురణలు , విజయవాడ, 2021.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.