AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మునికన్నడి సేద్యం' నవల: మానవసంబంధాలు
డా. మాధవీలత రామరాజు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఫైనాన్స్ డిపార్టుమెంట్, ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్,
వెలగపూడి, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8374810111, Email: ramarajumadhavilatha2@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
చిత్తూరు జిల్లాలోని గ్రామీణ పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు తన బాల్యంలో చుసిన పాత్రలను, వారి జీవన గమనాన్ని కథాంశంగా స్వీకరించి రాసిన చిన్న నవల ముని కన్నడి సేద్యం. రంగంపేట నుండి రచయిత సొంత ఊరైన మిట్టూరికి వలస వచ్చిన ఇలామంతు నాయుడు కుటుంబం కౌలుకు భూమిని తీసుకుని సేద్యం చేసే ప్రయత్నంలో కొత్త ఊరిలో ఎదుర్కున్న సమస్యలు, ఆ కుటుంబంలో మనుషుల మధ్య వెల్లివిరిసిన అనుబంధాలు, కౌలు రైతుగా యువకుడైన ముని కన్నడు చేసే పోరాటం, బంధువుల మధ్య జరిగే సంఘర్షణ, ఊరిలో వివిధ రకాలైన మనుషుల స్వభావాలను గురించి చర్చిస్తూ లోతైన సార్వజనీనమైన అంశాలను విశ్లేషించడం ఈ వ్యాస లక్ష్ష్యం.
Keywords: నవల, రాయలసీమ గ్రామీణ జీవిత చిత్రణ, మానవ సంబంధాల విశ్లేషణ, రైతు జీవనం
1. ఉపోద్ఘాతం:
ఈ నవలలో ప్రధాన నాయకుడు మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి వెరసి ఇదీ మునికన్నడి కుటుంబం.
ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వాలతో, బలాలతో, బలహీనతలతో, గుణాలతో ఒక్కో మనిషి సజీవంగా మన ముందు తిరుగాడినట్లే వుంటుంది.
మునికన్నడి కుటుంబమంతా కష్టించి పనిచెయ్యడానికి వెరపు లేని కుటుంబం. కాకపోతే, కష్టం చేసేందుకు ‘గోచిపాతంత’ కయ్య కూడా లేదు. సంసారం పెద్దదయేకొద్దీ గింజఖర్చు పెరిగిపోయి ఆ కాపురం జరుగుబాటు కష్టంగా మారిన తరుణంలో యెంగటమ్మ అన్న గుర్రప్పనాయుడు వీళ్లింటికొచ్చి, “ఈ వూరు మీకు అచ్చిరాలా. ఎంత కష్టం చేసినా బూడిదలో పోసిన వుచ్చ మాదిరి నిలకుండా పోతుండాది. ఈడ జేసే కష్టం ఆడ జేసుకోవచ్చులే వచ్చేయండి మా వూరికి. నన్ను జూపెట్టుకొని మీరు, మిమ్మల్ని జూపెట్టుకొని నేనూ బతికిపోదారి. మా వూళ్లో అద్దాలామె అని వుండలేదా, ఆమె అంపించింది నన్ను. ఆమె కయ్యను గుత్తకిస్తిందంట. మీరు చేస్తారో చెయ్యరో అడిగి కనుక్కొని రమ్మనింది” అంటాడు.[1]
అనుభవాలు చెప్పిన పాఠమో, వయసు తెచ్చిన భారమో గానీ మునికన్నడి తండ్రి వెనుకంజ వేస్తాడు. కీడెంచి మేలెంచమనే యితని ‘యెనక తొక్కుల’ తత్వానికి వెంకటమ్మ తత్వం సరిజోడు. “చేతి నిండికీ సేద్యం వుండాల్నేగాని మామా! మొగలాయి బతుకు బతకమా! అద్దాలామెకి ఎంత కయ్య వుండాది? నీటి సౌక్రిం ఎంత మటుకు? నేల మంచి నేలేనా?” అంటూ ‘మునాశపడిన’ మునికన్నడికి, అతని తల్లికీ ఆశల పల్లకీ ఒక పక్క ఆహ్వానిస్తోంది. ఆ విధంగా మునికన్నడూ, ధర్మడూ, “మిట్టూరుకు పోయి దీనికి మించిన బతుకు బతకదాం”[2] అని తల్లీదండ్రిని హడావిడి పెట్టి మిట్టూరు చేరతారు. ఆ తరువాతి రెండేళ్ల జీవితమే ఈ నూరు పుటల నవల.
2. గ్రామీణ జీవన చిత్రణ:
ప్రతి ఒక్కరికీ అన్వయించుకోకుండా స్థూలంగా చూచినా ఈ కథకు నేపథ్యం హృద్యమైన గ్రామీణ రైతు జీవితం. వసతులన్నీ సక్రమంగా కుదిరిన సేద్యగాని కష్టానికి ఆ సమాజంలో వుండే మర్యాద, స్వయం ప్రతిపత్తి, ఆ బ్రతుకులోని గౌరవం, జీవితం పట్ల అనురక్తి, ఆ సంఘజీవనంలోని ఔన్నత్యం, శ్రమలోని సుఖం ‘మునికన్నడి సేద్యం’ నవలకు మూల స్తంభాలు. “స్వయంపోషక గ్రామస్వరాజ్యం జిందాబాద్”, “రైతే రాజు’ అనే మాటలకు అసలైన అర్ధం ఈ కథలోని పాత్రలు సేద్యం మీద చూపే ప్రేమ ద్వారా రచయిత వెల్లడించారు. కష్టం చెయ్యగల శక్తి వున్నా తగిన వసతులు కుదరకపోతే, ప్రకృతి అనుకూలించకపోతే, అదే సేద్యగాడు పడే వేదనను కూడా మునికన్నడి సేద్యంలో రచయిత వాస్తవంగా చిత్రించటం జరిగింది. చదవడం పూర్తయ్యాక కూడా పాఠకుడి మదిలో ఒక భారాన్ని మోపి ఆలోచించేలా చేస్తుంది ఈ నవల.
భూస్వామ్య వ్యవస్థ - రైతు కూలీ ఆవేదన:
మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందో, రైతు ఎలా కొల్లగొట్టబడుతున్నాడో చాలా సందర్భాల్లో ఈ నవల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణకు కౌలుకు తన పొలాన్ని ఇస్తానని అద్దాలామె మొదట వొప్పుకొని మునికన్నడి మామకి మాట ఇచ్చాకే మొత్తం కుటుంబం రంగంపేట వదిలి మిట్టూరు చేరతారు. తీరా వాళ్ళు ఆమె గడప తొక్కేసరికి ఎక్కువ కౌలు వసూలు చేసుకోవాలని మాట మార్చేస్తుంది.
“గురప్ప నాయుడు ఇలామంతుని తోడుకొని అద్దాలమే దగ్గరికి పోయి మాట్లాడబోతే ఆమె నిమిషానికి ఒక మాట మాట్లాడింది. ఒక దఫా "గురప్ప ! సొంత కయ్యాను ఎరవలోళ్ళ చేతుల్లో బెట్టి గుత్తకిస్తే మల్ల అది రక్తికొస్తోందా. మనకయ్యను మనమే చేతల్లో బెట్టుకొని బతకాలి గాని" అనింది.
“అదేంది వొదినా! ఇప్పుడు ఈ వాటంతో మాట్లాడుతుండావు? నువ్వే గదా నన్ను ఉపద్ర బెట్టి రంగంపేట పంపించింది" అనడిగితే "ఇప్పుడు గూడా నేనేమి పొరబాటుగా మాట్లాడలేదే! నా కయ్యాను వాల్లనే చేసుకోమంట. నేనేమన్నా కాదన్నానా?" అని తిరుక్కోనింది.
“నువ్వు గుత్తకు చేసుకోమని చెప్పందే వాళ్ళు నీ కయ్యలో మడక ఎట్టా కడతారు వొదినా?” అంటే, “వాళ్ళ కష్టం నాకేమిటి? నా కష్టమే ఎవుడెవడో తినేసి పోతా వుంటే! వాళ్ళ రెక్కల కష్టానికి ఎర్ర నయాపైసాతో సహా కూలి ఇస్తాన్లే!” అంటూ తిరగదిప్పి మాట్లాడుతుంది.[3]
కౌలుకు వచ్చిన వాళ్ళను కూలీగా మార్చాలని చూసే భూస్వాముల స్వభావాన్ని, సహజంగా మానవునిలో ఉండే అవకాశవాదాన్ని, నిలకడలేని మాటతీరుని, తమకన్నా చిన్నవారిపై చూపే దాష్టీకాన్ని ఈ సందర్భంగా చిత్రించారు. సమాజంలో ఉన్న వర్గ సంఘర్షణలు, గ్రామీణ వ్యవస్థ విధ్వంసం, రైతుల కన్నీళ్లు, వెతలు, అసమానతలు, అణచివేతలు, అత్యాచారాలు, దాంపత్య సంఘర్షణలు, మూగ వేదనలు, ప్రేమలు, పెళ్లిళ్లు, వంటి అంశాలన్నీ వివిధ పాత్రలను ఆసరాగా చేసుకుని ఈ రచన ద్వారా గ్రామీణ సమాజాన్ని, నాటి సమకాలీన విషయాలను తెలియచేసేందుకు నామిని ప్రయత్నించారని గుర్తించవచ్చు.
3. రైతుల మధ్య పరస్పర సహకారం-విరోధం:
రైతులమధ్య పరస్పర సహకారం ఎలా వుంటుందో తెలియచేసే సందర్భంలో మునికన్నడి మడి దున్నకానికి కొన్నిదినాలు తన కాడెద్దులను యిచ్చిన చెంగమనాయుడు వయసులో సగానికి సగం వుండే మునికన్నడి మీద రెండు చేతులూ యేసి, “మళ్లా నీతో అక్కర బడింది రా రే” అన్నాడు. “నీ కాళ్లు, నా చేతులు – చెప్పు సామీ, చెప్పు” అన్నాడు మునికన్నడు నవ్వతా.” [4] నువ్వు కాలితో చెప్పిన పనిని నేను చేత్తో చేసేస్తాననే కృతజ్ఞతాపూర్వక స్నేహపూరిత భావన ఈ మాటల్లో వ్యక్తం అవుతుంది. చిత్తూరు గ్రామీణ యాసలో సహజంగా రచయిత చూపిన సంభాషణా వైశిష్ట్యం మానవ సంబంధాలను మరింత ప్రభావవంతంగా ప్రతిబింబించింది.
సేద్యగాళ్లను సర్కసులో జంతువులను ఆడించినట్లు ఆడించేది విద్యుత్ సరఫరా. సొంత మోటరు కల రైతులయినా సరే చాలీచాలని ఓల్టేజి ఒక్కసారి మోటరు కాయిల్ను కాల్చిందంటే ఆ పంటలో వచ్చే రాబడికీ, పెట్టుబడికీ, మోటరు రిపేరుకూ చెల్లు వేసుకోవచ్చు. మోటరును కాల్చక పోయినా సరే, చాలీచాలని నీళ్లున్న బావుల కింద ఆ ఆట నేటి కాలపు రైతుకు సైతం అనుభవైకవేద్యం. కరెంటు వచ్చి తమ రెక్కల కష్టాన్ని తగ్గించిందని సంతోషపడాలో, దానికి మించి బిల్లులతో తమ కష్టాన్ని తిరిగి తినేస్తుంన్నందుకు బాధపడాలో తెలీటంలేదని ఇలామంతునాయుడు ఆవేదన చెందుతాడు. ఈ సందర్భంలో ఒకరికొకరు అండగా ఉండాల్సిన పక్కపొలం రైతైన ‘సొసైటీ ఆయన’ ఈ కుటుంబపు ఎదుగుదల చూసి ఓర్వలేక నీళ్లు తీసుకోనివ్వకుండా అడ్డం పడతాడు. చివరికి అదే మునికన్నడి సేద్యాన్ని నాశనం చేసేస్తుంది. మంచి, చెడు ఒకే నాణానికి రెండు పార్శ్వాలని ఈ సందర్భంలో గ్రహించవచ్చు.
4. కుటుంబ బాంధవ్యాలు–అనురాగాలు:
ఇక కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాలను అనురాగాలను అపురూపంగా వర్ణించారు రచయిత. తన బిడ్డలు సుఖపడతారనుకుంటే ఆత్మాభిమాన్ని కొంత చంపుకోవడానికైనా సాహసించే తల్లి యెంగటమ్మ. ఈ త్యాగానికి కూడా కుటుంబగౌరవానికి దెబ్బ తగలనీయని ఆమెదైన ఒక హద్దు వుంది. మునికన్నడి తెగింపుకి, శారీరక శ్రమకి, తమ్ముళ్ళమీద, చెల్లెలిమీద చూపే ఆప్యాయతకి, సేద్యం మీద కొడుక్కున్న శ్రర్ధకి ఓ పక్క పొంగిపోతూనే మరోపక్క "ఆసికి గూడా మితం ఉండలరా మునికన్నా! ఆసికి బోతే గోశి అడ్డమొస్తుందనే సామిత ఉండేది కదా. వూరికె పరుగులెత్తేది ఏమిటికి? ఈ కయ్యను బోటుగా సేద్యం జేసుకొని నెగ్గుకుంటే చాలు నాయనా!” [5]అని అంటూ కొడుకుని అత్యాశకు గురికావొద్దంటూ, ఉన్నదానితో తృప్తి పడాలనే సగటు రైతు తల్లి ధోరణిని ఈ పాత్ర ద్వారా వివరించటం చూడవచ్చు.
అన్న మునికన్నడి కన్నా ధర్మానాయుడు చాలా చిన్నవాడు కాకపోవడంతో ‘అన్నా, వొరే’ కలబోసిన పిలుపొకటి పిలుస్తాడు. అన్నంటే కొంచెం భయం కూడా వుంది. కానీ ఆ భయాన్నెప్పుడైనా పోగొట్టుకోడు. మంచి మాటకారి. కొంచెం పని దొంగ కూడా. వూపుమీదున్నప్పుడు ఎంత పనైనా కష్టమని తలచకుండా చేసెయ్యగలడు. పాలు పిండటం, చెట్లెక్కి ఆకు కొట్టడం వంటి కొన్ని పనుల్లో ప్రత్యేక నైపుణ్యం కలవాడు. కొత్త సావాసాలు, కొత్త విద్యలూ నేర్చుకుంటూ ఉంటాడు. ఎలాగైనా బతికేయగలననే నమ్మకం కలవాడు. ఈ నమ్మకాన్ని ఒకోసారి తన కుటుంబంలోనివారికి కూడా కలిగిస్తాడు. వీడు చెయ్యిదాటిపోతాడనే ఆందోళనను ఆ కుటుంబానికి కలిగిస్తూ వుంటాడు. ధర్మడికి తన మనుషులంటే మహా ప్రీతి. ఈ ప్రేమతో వారి నమ్మకాన్ని తిరిగి గెలుస్తూ వుంటాడు.
ఇక ఇంట్లో అందరికి కష్టజీవి ఆయన ఆడబిడ్డ నాగరాణి అంటే అమితమైన ప్రేమ. ఆ బిడ్డ పెద్దమనిషి అయినప్పుడు మగపిల్లాడైన మునికన్నడు ఓపక్క సంబర పడుతూనే మరోపక్క ఆమెకు అడిగినవన్నీ తినిపించమని, జాగ్రత్తగా చూసుకోమని తల్లికి సలహా ఇస్తే ఆమె విస్తుపోతూనే "మన కుటుంబరంలో ఒకరి మింద ఒకరికి ఎంత కలవరం ఉండదిరా, ఎర్రి నా కొడకా! లోకాన మనంత ఒద్దికగా ఎవురన్నా ఉందురా?" అంటూ సంబరపడిపోతుంది[6].
చివరి ఆఖరిసారి సేద్యం చేయగా వచ్చిన డబ్బులను నాగరాణి పెళ్ళికి కేటాయించిన కుటుంబం సంబంధం కుదుర్చుకునే ముందు కన్నీరు మున్నీరవుతారు. "ఎంగటమ్మ దుఃఖంతో పెద్దకొడుకు చేతులు బట్టుకుని "వొద్దనుకుంటే వొద్దులే, నిన్ను ఎగటాయించి పోతామా" అనింది.
మునికన్నాడు పైకి లేచి అమ్మను పట్టుకుని, "వొద్దని నేను అనలేదమా! మన నాగరాణి యెంత కష్టం జేసే బిడ్డి! పదిగుంటలో, పదైదు గుంటలో చేతిలో పెట్టుకోనుండే సేద్యగోడికి పెళ్ళాంగా బోతే మన అమ్మి కష్టం చేసుకుని అందరికన్నా ఎక్కువగా బతకదా! ఆ బోగం మనమ్మికి లేకపాయ గదమా! అని బోరోమని ఏడ్చేసినాడు" అంటారు రచయిత.[7]
తనకు ఎలాగూ గుంటెడు భూమి లేకపోబట్టే కౌలు రైతుగా సైతం మిగలలేకపోయిన మునికన్నడు కనీసం తన చెల్లలికైనా సేద్యగాడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ వాస్తవానికి తలొంచి బెలుదారీ పని చేసుకునే కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాడు. రైతు కుటుంబాలలో ఆత్మీయ సంబంధాలను ఈ సన్నివేశం తెలియచేస్తుంది.
5. ముగింపు:
రైతులు సేద్యం మానేసి ఇతర వృత్తులను చేపట్టటం, పొట్టకూటికోసం పట్టణాలకు వలస వెళుతూ అన్నదాత ముఖచిత్రం వలస కార్మికుడిలా నెమ్మదిగా మారిపోవటం నేడు మనం చూస్తున్న చేదు వాస్తవం. సేద్యగాడుగా బ్రతకడంలోని గౌరవాన్ని రుచి చూసినవాడు మరియు రైతుగా జీవితాన్ని ప్రేమించినవాడు కూలీగానో మరో వృత్తిలోనికో మారవలసి వస్తే కలిగే సంఘర్షణను గొప్ప సహానుభూతితో చిత్రించడం ముగింపుకు ఒక ఔన్నత్యాన్ని ఇచ్చింది. వ్యవసాయానికి కాలం కాదిది, అంతకంటే సులభమైనది యేదో వొక బ్రతుకుదెరువును చూసుకోవడమే సరైన దారి అనే చేదు నిజాన్ని రచయిత వెల్లడించారు.
ఈ కథలో ప్రకృతి చేసే నష్టాలకు, కష్టాలకు ఎదురొడ్డిన మునికన్నడు రాళ్ళుమోసే పనికి వెళ్లడం వెనక కరిగిపోతున్న మానవ సంబంధాలే అసలైన కారణమని రచయిత తెలియచేసే ప్రయత్నం సవివరంగా పరిశీలిస్తే, అన్నదాత కంటనీరు తుడిచేప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా చేపట్టవచ్చు.
సమాజంలో ప్రతి మనిషి రోజురోజుకీ అభివృద్ధి సాధిస్తూ భద్రమైన సుఖప్రదమైన జీవితాన్ని సమకూర్చుకోవాలనే ఆశతో . ఈ జీవితేచ్ఛను యీడేర్చుకోవడానికి పడే శ్రమలో ప్రతి మనిషికీ తారసపడే ఆశలు, నిరాశలు, సంతోషాన్ని కలిగించే ఘట్టాలు, ప్రలోభపెట్టే పరిస్థితులు, ఎదురయే అవమానాలు, అడ్డొచ్చే అహం, దెబ్బలుతినే ఆత్మాభిమానం, చంపుకోవలసి వచ్చే మనసు, హాయిని కూర్చే కుటుంబజీవితం, తెగిపోతామని బెదిరించే బంధుసంబంధాలు, కష్టకాలంలో ఆత్మీయతను పొంగించే రక్తసంబంధాలు, అంతలోనే వోటికుండలా కనిపించే కుటుంబ ఐక్యత, నెరవేరని ప్రణాళికలు, దైవికమనిపించే ఘటనలు, మంచికాలం గానూ చెడ్డకాలం గానూ దర్శనమిచ్చే ప్రకృతి, నెనరును కురిపించే ఆత్మీయులు, వారిని ఆనుకొని వుండే అసూయాపరులు, మనవాడే అనుకున్న వాడు కాస్తా క్షణంలో విరోధిగా మారే విచిత్ర పరిస్థితులు, మానవ సంబంధాలను నిర్దేశించే ఆర్ధిక స్థితిగతులు ఇవన్నీ మునికన్నడి సేద్యంలో నామిని విలక్షణంగా చిత్రించగలిగారు. ప్రత్యేకించి గ్రామీణ రైతు సేద్యం చేస్తూ ఒక యోధుడిలాగా ప్రకృతిని ఎదిరించగలడేమో కానీ, చుట్టూ ఉన్న మనుషులతో, సమాజంతో, వారి అత్యాశతో పోరాడలేక సేద్యాన్ని వదిలి రాళ్ళూ కొట్టే పనిలోకి వెళ్ళటం రైతు జీవిత ఆవేదనకు ఒక నిదర్శనంగా నిలిచిందని చెప్పవచ్చు.
6. పాదసూచికలు:
- మునికన్నడి సేద్యం, మిట్టూరోడి పుస్తకం, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, పుట.333
- పైదే. పుట. 335
- పైదే. పుట. 337
- పైదే. పుట. 361
- పైదే. పుట. 338
- పైదే. పుట. 382
- పైదే. పుట. 464
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఉమామహేశ్వరరావు, ఆర్. ఎం., తల తిమురుబట్టిన నామిని కత, మా ఊరు బ్లాగ్, అంతర్జాల వేదిక, డిసెంబర్, 2009.
- నవీన్, వాసిరెడ్డి, శివశంకర్, పాపినేని, పాతికేళ్ల తెలుగు కథ (1990-2014), వివిధ రచయితల 336 కథలు, మనసు ఫౌండేషన్, 2016.
- రమేష్, స.వెం., స.వెం.,రమేష్ కథలు, మల్లవరపు వెలువరింతలు, బోధన్, నవంబర్, 2014
- రానారే, రామనాథ రెడ్డి , ఎర్రపు రెడ్డి , మునికన్నడి సేద్యం సమీక్ష . పొద్దు, అంతర్జాల పత్రిక , జూన్, 2008.
- శంకర్రావు, ఏలికట్టె, పరిగె చేను కథలు, హైదరాబాద్, నవ చేతన పబ్లిషింగ్ హౌస్, 2015.
- సుబ్రహ్మణ్యం నాయుడు, నామిని, మిట్టూరోడి పుస్తకం, మునికన్నడి సేద్యం. టాం సాయర్ పబ్లికేషన్స్, తిరుపతి, 2013.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.