headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. శ్రీకాకుళంజిల్లా కవిత్వం: ‘సుబ్బారావు పాణిగ్రాహి’, ‘ఛాయారాజ్’ల పాత్ర

శీలంకి గోవిందరావు

పరిశోధక విద్యార్థి,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8464034547, Email: govind.sjgc43@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

శ్రీకాకుళం జిల్లా పేరు వినగానే పోరాటాలకు పురిటి గడ్డ అని గుర్తొస్తుంది. ఈ జిల్లాలో విప్లవ నేపథ్యంతో వచ్చిన సాహిత్యం రాశిలో తక్కువే అయినప్పటికీ వాసిలో ప్రసిద్ది పొందింది. తమ ప్రాంతపు సమస్యలను పరిష్కరించుకోవాలంటే శాంతియుత పద్ధతులు సరిపోవని గ్రహించి అణగారిన వర్గాల ప్రజలసమస్యలు తీరాలంటే ఉద్యమ దారి పట్టాల్సిందేనని అప్పటి ప్రజల భావన.ప్రజలకు ఆ ఉద్యమ భావాన్ని తమ కవితల ద్వారా, పాటల ద్వారా తెలియజేసే వారిలో ఉత్తేజాన్ని నింపిన రచయితలు జిల్లాలో చాలామంది ఉన్నప్పటికీ సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయారాజ్ లు ఆకర్షించినంతగా ఇతర రచయితలు ప్రజల్ని ఆకర్షించలేకపోయారు. శ్రీకాకుళం జిల్లా కవిత్వం - ఒక పరిశీలన అనే నా పరిశోధన అంశంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిత్వంలో నూతన వరవడి తీసుకొచ్చిన గొప్ప మహనీయులు సుబ్బారావు పాణిగ్రహి, ఛాయరాజ్ లు వీరు తమ రచనలు ద్వారా ప్రజలకు అందించిన ఉద్యమస్పూర్తి,నాటి సామాజిక పరిస్థితులు వంటి అంశాలు ఈ వ్యాసం లో తెలుసుకొవచ్చు . ఈ ప్రభావం తర్వాత వచ్చిన ఉద్యమాలకు, రచనలపై తీవ్ర ప్రభావం చూపింది శ్రీకాకులo జిల్లా పోరాటం లో సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయారాజ్ లు కృషిని తెలియజేయడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ పోరాటం పై సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయరాజ్ రచనలు ప్రభావం ఎంతగానో ప్రభావితం చేసినప్పటికీ వారి రచనల్లో ఉన్న కమ్యూనిస్టు,విప్లవ భావజాలాలును తర్వాత రచయితలు అందిపుచ్చుకోకపోవటం వలన ప్రస్తుతం జిల్లాలో రచయితలు వివిధ రకాల నేపథ్యాలతో రచనలు వెలువరిస్తున్నప్పటికి కమ్యూనిస్టు,విప్లవ భావజాలాలతో రచనలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పవచ్చు. నా ఈ పరిశోధన వ్యాసానికి సంబంధించి సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయరాజ్ లు గిరిజన రైతాంగ పోరాటంపై రచించిన రచనలను వివరణాత్మకంగా అధ్యయనం చేసి వారు ప్రజల్లో తీసుకొచ్చిన మార్పులను, విప్లవం వైపు ప్రజలను తీసుకురావడానికి అనుసరించిన పద్ధతులను విశ్లేషించి ఈ వ్యాసాన్ని తీసుకురాగలిగాను.

Keywords: కవిత్వం, పురిటిగడ్డ, రాశిలో, వాసిలో, ప్రేరణ, ఆగడాలు, అవంతరాలు, అంతర్జాతీయ దృక్పథం

1. ఉపోద్ఘాతం:

శ్రీకాకుళం జిల్లాలో విప్లవం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం 1967లో జరిగిన శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం. తెలంగాణా రైతాంగ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాను కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ తెలంగాణ రైతాంగ ఉద్యమ పోరాట ప్రేరణను పునికి పుచ్చుకొని శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ పోరాటం ప్రారంభమయింది. ఇందుకు  ప్రధాన కారణం జిల్లాలోని  కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజన జాతులైన సవరలు, జాతపులు, గదబలు అను  గిరిజన తెగలు ఆర్థికంగా సామాజికంగా దోపిడీకి గురవటం  వాళ్ళను తీవ్ర నిరాశకు గురిచేసింది.  భూస్వాముల యొక్క ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడం వలన వారి యొక్క ఆగడాల నుండి అమాయకులైన గిరిజనులను రక్షించాలని భావించిన వారు ఆ ప్రాంతంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంపటాపు సత్యం,ఆదిభట్ల కైలాసంలు.వీరిరువురూ  భూస్వాముల దోపిడీ విధానాన్ని గురించి గిరిజనుల్లో అవగాహనను కలిగిస్తూ చివరకు వారిని ఉద్యమం వైపు  నడిపించారు. అదే చివరకు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటంగా ప్రసిద్ధి చెందింది. ఈ రైతాంగ పోరాటం నుంచే శ్రీకాకుళం జిల్లాలో విప్లవ కవిత్వం ప్రారంభంమైందని చెప్పవచ్చు.ఈ ఉద్యమం లో భాగంగా వెలువడిన కవిత్వం లో విప్లవ భావజాలంతో కవిత్వాలు రాసి గిరిజన రైతుల్లో కొంత అవగాహన కలిగించిన వారిలో ప్రముఖులు సుబ్బారావ్ పాణిగ్రాహి, ఛాయరాజ్ లు  శ్రీకాకుళం జిల్లా కవిత్వంలో సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయారాజ్ ల పాత్ర లను గురించి  ఇందులో వివరించబోతున్నాను

2. సుబ్బారావు పాణిగ్రాహి కమ్యూనిస్టు భావజాలం-భూస్వాములపై ప్రభావం:

1962లో ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి.ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ 116 స్థానాలకు పోటీ చేయగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది.  పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సుబ్బారావు పాణిగ్రహి మహిళా దళాన్ని నడుపుతూ కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయమని నినాదాలు ఇస్తూ గోడల మీద అభ్యర్థుల పేర్లు గుర్తులు రాస్తూ జండాలు తయారు చేసి కట్టేవారు పార్టీ అంటే గిట్టని గ్రామాల్లోప్రజల నివాసాలపైన  ఆయన ఎర్ర జెండాలు కట్టే అవకాశాలు లేని చోట్ల చెట్లు మీద కట్టేవారు. గోడల మీద నినాదాలు రాసేవారు. అక్కడున్న భూస్వాములు  చెట్ల మీద జెండాలు కూడా గుండాల చేత పీకించేవారు.  గోడల మీద నినాదాలకు పేడను  చల్లించేవారు.  ఇది చూసి సుబ్బారావు పాణిగ్రాహి తీవ్రంగా కదిలి పోయి..
                            “ఎరుపంటే కొందరికి భయం భయం
                            పసిపిల్లలు  వారి కన్నా నయం నయం
                            సూర్యునిలో తొలి కాంతి మెరుపుమయం
                            ఎరుపులో ఆనందం అతి రమ్యం
                            ప్రకృతిలో పూలు ఎరుపు మందారం
                            స్త్రీల నుదిటి తిలకం ఎర్రని సింధూరం
                         (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -75)

విప్లవానికి,కమ్యూనిజానికి సంకేతం “ఎరుపు” ప్రకృతిలోని సూర్యుడు, పూలు, మందారం, స్త్రీల నుదుటి తిలకం.  మొదలగునవి ఇన్ని ఎర్రన పదార్థాలు నిత్యం మనం చూస్తున్నవే. కానీ, ఎరుపుకు భయపడే వారి కన్నా పసి పిల్లలే నయమని విప్లవానికి భయపడే వారికి చురకలు అంటించాడు.
                                “ఎరుపు రంగు ఎన్నటికీ కాదు అపాయం
                                అపాయాన్ని తప్పించే ఒక సదుపాయం
                                మనలోనే ఎరుపన్నది మరచి పోకుమా
                                మన రక్తం ఎరుపు ఎరుపు తీసి చూడుమా
                                ఎరుపులోనే మెరుపుంది పోరాడే శక్తి ఉంది
                                శ్రమజీవన హక్కులకై ఎలుగెత్తే అరుపుoది.”
                              (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -76)

అని రాసి ఎరుపు నీ రక్తంలోనే ఉందని జండాలు పీకించినంత మాత్రాన ఎరుపు మాసిపోదన్నాడు. విప్లవం అపాయం కాదనీ, వచ్చే అపాయాలను చైతన్యం ద్వారా  తప్పిస్తుందన్నాడు. విప్లవం వర్గ సమాజంలో సర్వసంక్షోభాలను, సవాళ్లను లేకుండా చేస్తుంది అన్నాడు. విప్లవం పట్ల కొందరిలో గల భయాలను ప్రజల్లో కల్పించబడ్డ అపోహాలను పారదోలాడు.  ఇంకా మనలోనే ఎరుపున్నదనీ  జ్ఞాపకం చేసి, అమాయకంగానే తీసి చూడుమా అని సాహసానికి పురికొల్పాడు.  చివరిగా కమ్యూనిజం లో చైతన్యం, శక్తి, సామాజిక న్యాయాలు ఉన్నాయని ఉజ్జ్వలంగా గానం చేశాడు. తద్వారా శ్రోత దృష్టిని విప్లవానికి అనుకూలంగా మళ్ళించే కృషి చేశాడు. దాన్ని  విప్లవ విజయం సాధించడానికి మానసికంగా సంసిద్దుల్ని  చేశారు  సుబ్బారావు పాణిగ్రాహి. 

3. గిరిజనులపై భూస్వాముల చేసిన ఆగడాలు:

ఏజెన్సీలో గిరిజన ఉద్యమం పురోగమిస్తున్న దశలో భూస్వాములు అమాయకులైన గిరిజనులను, వారు పండించిన పంటలను, ధన, మానప్రాణాలను దోచుకోవటం, అనేక రకాల చిత్రహింసలకు గురిచేయటం వలన పాణిగ్రాహి  ఆగ్రహంతో  స్పందించి “పిశాచుల రాజ్యం” అనే కవిత రాశారు.   ఈ కవితలో సుబ్బారావు పాణిగ్రాహి.
                           “పట్టపగలు నట్ట నడివీధిలో
                             గుండాలు పెత్తందారులు
                             రక్షకభటుల ఎదుట కక్ష కట్టి కొడుతుంటే
                             రక్షణ ఏమీ లేకపోగా దెబ్బలు తిన్న వారికే ఖైదు
                              ఇది ప్రజారాజ్యమా? పిశాచులు రాజ్యమా?”

                                      (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -95)
అంటూ కోపంతో నిలదీసి ప్రజాస్వామ్యం లక్షణాన్ని గుర్తు చేశాడు. గిరిజనులపై సాగే దోపిడీ పీడనలను దానికి పాలకుల అండదండలను సుబ్బారావు నిరసించాడు. నిర్బంధాన్ని నిలదీస్తూ ఆటంకాలని అధిగమిస్తూ సంఘం శక్తి ఎలా అభివృద్ధి చెందుతున్నదో కళ్ళకు కట్టాడు.

చైనాతో యుద్ధం జరిగిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్లు తామే అసలు రాజకీయవాదులమని కమ్యూనిస్టులను చైనా ఏజెంట్లు అనేవాళ్ళు.  మేము కమ్యూనిస్టులమే కానీ ఏ దేశపు ఏజెంట్లను కాదని తమకు అంతర్జాతీయ దృక్పథం ఉందని ప్రజలకు చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టు పార్టీలకు ఆ మాటకొస్తే కమ్యూనిస్టులు అనబడే వాళ్ళందరి మీద ఉంది. తమ ముఖ్య ఉద్దేశాన్ని  తీర్చడానికి సుబ్బారావు పాణిగ్రాహి రాసిన పాట.

                         “ కష్టజీవులo  మేము – కమ్యూనిస్టులం
                         ఔనన్నా కాదన్నా -   అదేఇష్టులం
                         అన్యాయాన్ని ఎదిరిస్తాం -  న్యాయాన్ని పూజిస్తాం
                         అడ్డంకులు దాటేస్తాo  - మా కార్యం సాధిస్తాం
                         లంచాలకు తలవంచం- మా ఆత్మను వంచించ౦
                         అరెస్టులను సాగించి - ప్రజాశక్తిని అడ్డ లేరు
                         అరచేతిని అడ్డుపెట్టి - సూర్యకాంతి నాపలేరు
                         మా ప్రజలను నడిపిస్తా౦ - మా గమ్యం చేరుస్తాం
                         మా లక్ష్యం సాధిస్తాం -  సమాజాన్ని మారుస్తాం”

         (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -120 )
అని కమ్యూనిజ  ఆశయాలు పాట ద్వారా అభివ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం ఉద్యమ కవి తాను కమ్యూనిస్టులమని  బలంగా ప్రకటించాడు. తమ కంఠాన్ని ఎలుగెత్తి పార్టీ గొంతుకతో  ఏకం చేసి, ప్రజలతో ఏకమై తన రాజకీయ దృక్పథాన్ని ప్రకటించాడు.  ఇది ఈ ఉద్యమంలో పోరాట దృక్పథానికి ఉన్న ప్రాధాన్యత.  అందుకే కవి తన రాజకీయ దృక్పథాన్ని నిర్దిష్టంగా సమగ్రంగా సూటిగా సరళంగా అదే సమయంలో బలంగా ప్రకటించాడు. ఈ పాట లో తమ దృక్పథాన్ని ప్రకటించేంతగా స్పష్టంగా నినదించాడు.

1966లో 8వ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సభలు నల్గొండ జిల్లా కోదాడలో జరిగాయి.  వాటిలో పాల్గొనడానికి శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులైన సుబ్బారావు పాణిగ్రాహి, దుప్పల గోవిందరావు, పైలా వాసుదేవరావు తో పాటు 29 మంది బయలుదేరారు.  కోదాడ సమీపిస్తుండగా రోడ్డు పక్కన పడిపోతున్న స్థితిలో ఉన్న ఓ దొరను  చూసి సుబ్బారావు పాణిగ్రాహి ఆశువుగా
                            “ నైజాము రజా కారు-కాంగ్రెస్ పోలీసుల
                              నల్లగొండను  కదిలించిన-నల్లగొండ వచ్చేసాం
                              వచ్చేసాం విచ్చేశాం - నల్లగొండ కొచ్చేశాం”..
                                    (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -126)
 
అంటూ ఉత్తేజంగా పాట రాసారు. ఈ కార్మిక సభలకు రానివ్వకుండా ఆ సభల్లో పాల్గొనకుండా ఎన్ని అవాంతరాలు ఇబ్బందుల్ని కల్పించినా,వాటిని ఏమాత్రం లెక్క చేయక ప్రాంగణానికి చేరడం,ఆనాటి కవుల సంఘీభావంలోని దృఢమైన కోరిక అభివ్యక్తమవుతుంది.తెలంగాణ రైతులు వీరోచిత పోరాటం గుర్తుకొచ్చి ఆశువుగా సుబ్బారావు నోటి నుండి వెలువడ్డ కవితా పాదాలు  ఉద్వేగాన్ని ఉత్తేజాన్ని వ్యక్తం చేసే పంక్తులుగా భావించవచ్చు.

సుబ్బారావు పాణిగ్రాహి “మేలుకొలుపు” గేయంలో

కార్మిక,కర్షక మైత్రిని గురించి ప్రబోధిస్తూ గిరిజన రైతులైన  కోరన్న మంగన్నల మరణానికి  రెండు వారాలు ముందు నక్సల్బరి ఉద్యమాన్ని కీర్తిస్తూ నక్సల్బరీ పదాన్నే వ్యతిరేకిస్తున్న జనశక్తి పత్రికలో“మేలుకొలుపు” గేయం గురించి  ప్రచురితమవటం  గమనించదగ్గది. అంటే పత్రికలో నక్సల్బరీ  వ్యతిరేకంగా వార్తలో వస్తున్న ఆ పరిణామాన్ని 1967 నుంచి సానుకూల దృష్టితో సుబ్బారావు స్పందించాడు.  ఈ గేయంలో

              “తూర్పు తీసిన పొడమే అరుణ రేఖ, అది - మార్పు కొరకు వేసిన పొలికేక
                అణగారిన జనుల ఆర్తనాదం – మారె, ఈనాటికి  మనకు మంచి నినాదం అనీ,

                        అదిగదిగో ఎర్ర పుంజు -  ఎలుగెత్తి కూసింది
                        ఆదమరచి నిద్ర పోక - మేల్కొనమని చెప్పింది
                        తరతరాల దాస్యాన్ని -  తెగదింపులు చేయమంది
                        యుగయుగాల ఆచారం - సాగదని చెప్పింది
                        తెల్లవారిపోయే ఎర్ర - మందారం వికసించే
                        మేనిలోని రక్తమంతా- ఉప్పొంగీ  ప్రవహించే.”
                                  (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -136)

దేశం లో మొదలైన విప్లవ పరిణామాలను ప్రతీకాత్మకంగా వర్ణించాడు సుబ్బారావు పాణిగ్రాహి ఈ పరిణామాల పట్ల ఉత్సాహాన్ని ప్రకటించి అది తీసుకువస్తున్న  మార్పుల పట్ల మేనిలోని రక్తమంతా ఉప్పొంగి ప్రవహించేటoతటి విద్యుత్ ప్రవాహపు తీరును ఈ గేయంలో చూడగలం.

సుబ్బారావు పాణిగ్రాహి కళాకృషికి కేంద్ర బిందువు, సృజనశీలి, నిత్య కార్యకర్త, అలుపు లేని ఆందోళనకారుడు. 1966 నుండి నేటి వరకు ఏ వర్గ సంఘ సభ అయినా, సమావేశమైన సుబ్బారావు హరికథ, జముకులకథ ప్రదర్శన ఉండి తీరాల్సిందే.  ఆ ప్రదర్శనల ద్వారా అతను కమ్యూనిజ భావజాలాన్ని, ప్రయోజనాన్ని ప్రచారం చేయాల్సిందే ఇలా సభలు కళా ప్రదర్శనలు కలిసిపోయి ఒక నూతన ఉత్తేజాన్ని ప్రజలకు అందించటం శ్రీకాకుళ ఉద్యమంలో కొనసాగింది.  
సుబ్బారావు దేశాన్ని తల్లిగా భావించి “జయభారత జనని” అనే గీతం రాశారు.  ఈ దేశ భౌగోళికతను కీర్తించాడు. ప్రజల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వతంత్రం నేడెలా తయారయ్యిందో వివరించాడు
                      “దేశమంతా ధన సంపద -  వీసమంత మాకoదదు
                      ఆసపోతులంతా జేరి - మోసుకుపోతున్నారు
                      నీవే తన సొంతమని -  నీ పాలన హక్కుగొని
                      నీ బిడ్డలు నిన్నుపట్టి - బంధించగా నున్నారే
                      పరుల కమ్మ చూస్తుంటే -  పరువు తగలవేస్తుంటే
                      సహించమూ  సహించమూ -  ప్రతిఘటించి  తీరుతాం”…
                             (సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo - కె. ముత్యం  - పుట సంఖ్య -137)
అని కవి ప్రజల్లో భాగమై దేశంలోని సంపదంతా  కొద్దిమంది పాలు అవుతుందని వాళ్లే పాలకులవుతున్నారన్నాడు.  దేశాన్ని పాలకులు అమ్మడానికి సిద్ధమైతే సహించమని ప్రతిఘటిస్తామని భారతమాతకు విన్నవించుకుంటాడు.  ఇలా ఆ ప్రార్థన గీతం ను సంప్రదాయకంగా ప్రతిజ్ఞతో ముగిస్తాడు పాలన హక్కు కొనటం దేశాన్ని పరులకు అమ్మ చూడడం ప్రతిఘటించి  తీరుతాం అంటాడు.

ఇలా తన దృక్పథాన్ని కవిత్వీకరించడంలోనే పాణిగ్రాహికి విశిష్టత ఉంది. విప్లవం ద్వార తమ హక్కులను సాధించుకోవాలని,కమ్యూనిజం పట్ల బెరుకును,భయాన్నినిర్వీర్యo చేశాడు. ఇది తెలంగాణ విమోచన ఉద్యమ కవుల్లో కానరాని  ప్రత్యేక లక్షణం. కొన్నిసార్లు ఈ కవిత్వీకరణ పాఠంతో కొనసాగితే మరికొన్నిసార్లు పాటల్లోని కొన్ని చరణాల్లో ఉంటుంది.  ఈ కవిత్వీకరణకు తోడు కవి తన  దృక్పథాన్ని ప్రజాజీవన సంఘర్షణ నుండే గ్రహించాడు.

4. ఛాయ రాజ్ రచనలలో విప్లవ భావజాలం :

శ్రీకాకుళం జిల్లాలో విప్లవ నేపథ్యంతో రాసిన కావ్యాలలో ఛాయ రాజ్ రచించినరచించిన శ్రీకాకుళం కావ్యం ఒకటి. విప్లవ నేపథ్యంతో రాసిన ఈ కావ్యం రాజకీయాలను గురించి చర్చించడం విశేషం. జీవితం మొత్తం రాజకీయమైనప్పుడు సాహిత్యం లోతైన రాజకీయం ఎందుకు కాకూడదని రచయిత భావించడం వలన ఈ కావ్యానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థం అవుతుంది.  ఈ కావ్యం లో విప్లవ దృక్పథం ఎలా ఉందో పరిశీలిస్తే కావ్యం ప్రారంభంలోనే
                    “ఆకుమాటున అడవి నిశ్శబ్దంగా ఉంది
                    అక్కడ ఈనెల నుండి ఈటెలనందుకొనే ఆందోళన ఉంది
                   బయట ఉన్న బతుకు అడవి బాంబును అందుకునే రాయబారంలో ఉంది       
                  ఆకు అద్దం రేపటి యుద్ధబింబాన్ని పట్టుకుంది.
                            (శ్రీకాకుళం జిల్లా ఉద్యమ కావ్యం  - ఛాయరాజ్   - పుట సంఖ్య- 17)
అని చెప్పడంలో కవిత్వ వస్తువులు ముందుగా పరిచయం చేసిట్లయింది ఆకుల ఈనెలందున్న ఈటలను పట్టుకోవాలని ఆందోళన కనిపిస్తుంది. అడవి బాంబును అందుకునే రాయబారంలో బయట ఉన్న బతుకంత దర్శనమిస్తుందని కవి భావన. ఇలా మొదలయ్యి గిరిజనులపై జరిగిన సాంస్కృతిక సామాజిక దాడిని, పీడనని చెబుతాడు. భయంకరమైన పీడన నుంచి బయటపడాల్సిన అనివార్యత ఎందుకొచ్చిందో, ఎవరు దన్నుగా నిలబడ్డారు, అది ఎలా అమలులోకి వచ్చి సాధ్యపడిందో, ఇవన్నీ చెబుతూ ప్రజా యుద్ధం మొదలవడం వలన గిరిజనుల్లో వచ్చిన చైతన్యాన్ని, చైతన్య సమరశీలత్వాన్ని చెప్పి విజయ మార్గoలో  పయనించాల్సిన పోరాటం అనివార్యంగా  ఆగిపోవటానికి కారణాలు గురించి చెప్పి అందులోని విషాద స్థితిని చెప్తాడు.

ఒక నిజం మీద నిలబడి భావోద్వేగంతో ఒక కావ్యం రాయటం మామూలు విషయం కాదు ఒక ప్రాంత నిర్దిష్ట భౌగోళిక వాస్తవం ఈ కావ్యం నిండా పరుచుకుని ఉంది.  ఉద్యమ ప్రాంతాల్లోని వినిపించే నిర్దిష్టమైన భాష కావ్యంలో సహజంగా ఒదిగిపోయింది.  నిర్దిష్ట ప్రాంత ప్రజల పలుకుబడులు కావ్యంలో అమరి పోయాయి. గిరిజన ప్రాంతాల్లో సారా వ్యాపారం, అక్రమ సంపాదన ప్రవేశించింది.అవసరానికి అనుకునే మోసకారి సావుకారులు గిరిజనులకు ఆత్మబంధువులైనారు దానివలన భూస్వామ్య దౌర్జన్యం చాలా విపరీతంగా పెరిగింది భూములన్ని వర్తకులకు ధారాధత్తమై ఫారెస్ట్ వారి పాలక వర్గంవారి పెత్తనం పక్కలో బల్లెంలా మారిందని చివరికి పోలీసుల, కరణాల కాళ్ళు మొక్కి జీవించే పరిస్థితి గిరిజనులకు వచ్చింది.
                         
                        “ శ్రీకాకుళం అడవి చరిత్రలో
                         సాయుధ గర్భ క్షేత్రం వెలయించి పోరాటాన్ని ఎత్తుకొని
                          ప్రళయ సుఖాన్ని ముద్దాడటం కోసం ఆరాటపడుతున్న అడవి తల్లి
                                    (శ్రీకాకుళం జిల్లా ఉద్యమ కావ్యం  - ఛాయరాజ్   - పుట సంఖ్య- 21)
ఉద్యమ స్ఫూర్తి నిండిన ఆ ప్రాంతంలో ప్రళయ సుఖాన్ని ఆనందించడం కోసం ఎదురుచూస్తున్నట్లు అడవి ఉంది.  అంటే సాయుధ తిరుగుబాటుకు సమయమైందని ఇటువంటి విపత్కర పరిస్థితులను ఉద్యమంతోనే ఎదుర్కోవాలనే  విషయం స్పష్టంగా అర్దమవుతుంది.
“విప్లవం” అనే కవితలో విప్లవం గురించి చాయ్ రాజ్ ఇలా వివరించారు
                              “నిత్య నూతనమైనది
                               సనాతనంగా పీడితులు ఉచ్చరిస్తున్నది
                               హంతకులని భయకంపతులను చేసేది
                               కార్మికులకు మహా ఆనందభరితమైన మాట విప్లవం”.
                                      (శ్రీకాకుళం జిల్లా ఉద్యమ కావ్యం- ఛాయరాజ్ - పుట సంఖ్య- 22)
అని విప్లవం గురించి వివరిస్తూ విప్లమనే పదం ఎప్పటినుంచో వాడపడుతుందని కార్మికులు ఉద్యమాలు చేయడంలో ఎంతో గాను ఉపయోగపడి వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ హంతకులకు విప్లవం అనే మాట వింటేనే గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తుందని రచయిత చెప్పటంలో విప్లవం అనేది ఎప్పటికీ కనుమరుగు కాదని అది ఎల్లప్పుడూ కొత్త కొత్తగా రూపును మార్చుకుంటూ ఉంటుందని అర్థమవుతుంది.
“సూర్యుడెప్పుడూ వధిస్తూనే ఉంటాడు” అనే కవిత ఖండికలో కవి ఛాయారాజ్ విప్లవ సన్నివేశం గురించి
                            “ఒక నినాదం వచ్చి మన రక్తంలో దూకుతుంది
                          అంతలోనే పరుగెత్తి ఊరేగింపులో కలిసిపోతాం
                          ఎత్తిన పిడికిల్లన నడి నెత్తిన సూర్యుడు అందుకుంటాడు
                          గుండెల్లోకి మంటలు దిగుతాయి....
                          బహిరంగ సభ వేదిక మీద సూర్యుడు ఆసీనుడౌతాడు”

                                  (శ్రీకాకుళం జిల్లా ఉద్యమ కావ్యం - ఛాయరాజ్ - పుట సంఖ్య- 32)
సాధారణంగా ఎవరికైనా ఒక ఉద్యమం గురించి అయినా ఒక పోరాటం గురించి అయినా అర్థం కావాలంటే ఆ సమయంలో వారు చేస్తున్న నినాదాలు వల్ల అది సాధ్యమవుతుంది అట్లాంటి నినాదం అనేది మన మనసులో వచ్చి పడితే కోపోద్రిక్తలతో పాటు, అగ్రహావేశాలు రావడం సహజం.  అప్పటి వరకు ఉద్యమం గురించి తెలియక ప్రశాంతంగా ఉన్నవాళ్లు ఆ నినాదంతో పోరాటం లో దిగి దానికి ఒక కొత్త రూపం కలిగిoచ్చారు.   విప్లవానికి సంకేతంగా తీసుకున్న సూర్యుడు నిత్యం ఉదయిస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడో ఒకరోజు ఉదయించి ఆగిపోడు అలానే ఉద్యమం కూడా ఒక రోజుకు ఒక గడియకు పరిమితం కాదు అది ఎల్లప్పుడూ సూర్యుడు ఉదయిస్తున్నట్లు పోరాడుతూ ఉండాలని కవి భావన.

గిరిజన ప్రాంతాల్లో, ఆ ప్రాంతపు ప్రజల్లో విప్లవ జ్వాలలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తాము అన్నింటా  వెనకబడి ఉండటంతో వారిపై దోపిడీలు, దందాలు పెరగడంతో చేసేది ఏమి లేక వారు  విప్లవం వైపు పయనిస్తారు.  అంతేకాకుండా విప్లవం అన్న మాట కూడా ఈ గిరిజన ప్రాంతాల నుంచే పుట్టిందనటంలో సందేహం లేదు.  విప్లవం అనేది గిరిజన ప్రాంతాల్లో పుట్టింది కాబట్టే సాయుధ పోరాటాలు కూడా ఇక్కడే సాగుతాయి, గిరిజనుల ఆక్రందనలు ఆవేదనలు వీటికి కారణం అవుతాయి.  ఇటువంటి సందర్భంలో వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి చైతన్యపరిచే ఆయుధం అవసరం అవుతుంది.  ఆ ఆయుధం కవిత్వం,పాట,గేయం. ఏ ప్రక్రియ అయినా కావచ్చు,కానీ పాటకు ఉన్నశక్తి, అది కలిగించే చైతన్యం మిగిలిన ఏ ప్రక్రియకు లేదు.

5. ముగింపు:

శ్రీకాకుళం జిల్ల కవిత్వం లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన సుబ్బారావు పాణిగ్రాహి,ఛాయారాజ్ లు తమ కవితల ద్వార అమాయకపు గిరిజనుల్లో ఒక మార్పును తెచ్చి, ఆప్రాంతపు సమస్యలను, వారు వ్యాపారుల చేతుల్లో ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేశారు.ఆ ప్రాంతపు సమస్యలను,మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న అమాయకపు ప్రజలైన గిరిజనుల యొక్క సమస్యలను తమ విప్లవ కవిత్వం, ద్వారా పాటల ద్వారా, గేయాలు ద్వారా, సమాజానికి తెలియజేసి గిరిజనులను వివిధ రకాల దోపిడీలు నుండి విముక్తులను చేయడంలో ఈ జిల్లా కవులు, వారి కవిత్వం పోషించినటువంటి పాత్ర విలువైనదని నిక్కచ్చిగా చెప్పవచ్చు.  

సుబ్బారావు పాణిగ్రాహి కమ్యూనిజ భావజాలంతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తే ఛాయారాజ్ విప్లవ     భావజాలoతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిoచ్చారు. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన గిరిజన రైతాంగ పోరాటం గురించి, దీనికి కారకులైన సుబ్బారావు పాణిగ్రాహి, ఛాయారాజ్,లు గిరిజన రైతాంగ పోరాట లక్ష్యం గురుంచి, విప్లవం ద్వారా తమ సమస్యలను ఏ విధంగా తీర్చుకోగలమో  చక్కగా వివరించారు. వీరి యొక్క ప్రభావం తరువాత రచయతలను విప్లవాలవైపు తీసుకురాలేకపోయిన వారు నింపిన స్పూర్తి మాత్రం ఎంతోకొంత నేటి రచయితలపై  ప్రభావాన్ని చూపింది అనటం లో మొహమాటం లేదు.  అదే స్పూర్తి ని భవిష్యత్ లో కూడా రచనలు చేస్తున్న రచయతులు కూడా పొంది కమ్యూనిస్ట్, విప్లవ భావజలాలతో రచనలు వెలువరించి సమాజానికి అందించగలరాని ఆశిద్దాం.  

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగాధర్, మంచాల. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణలు-ఒక విశ్లేషణ.
  2. ఛాయరాజ్, కొoక్యాన. (1989). శ్రీకాకుళం జిల్లా (ఉద్యమ కావ్యం) జనసాహితి. మైత్రి బుక్ హౌస్, విజయవాడ. 
  3. ఛాయరాజ్, కొoక్యాన. (2010) అనుపమాన (కథ రూపకాలు). నడుస్తున్న చరిత్ర -  జనసాహితి. మైత్రిబుక్ హౌస్, విజయవాడ. 
  4. జనార్దన్ రావు, వై. (2019). చాయ్ రాజ్ కవిత్వం- ఒక పరిశీలన 
  5. ముత్యం, కె. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం- శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ.
  6. ముత్యం, కె. (2018). సుబ్బారావు పాణిగ్రాహి-జీవితo  శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ.
  7. వెంకట్. (2007). శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ ఉద్యమం  మైత్రి బుక్ హౌస్, విజయవాడ. 
  8. సత్యనారాయణ, మానేపల్లి. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, జనసాహితి. మైత్రిబుక్ హౌస్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]