headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. గురజాడ ‘గిరీశం’- షేక్ స్పియర్ ‘ఫాల్ స్టాఫ్’ పాత్రల వ్యక్తిత్వాలు: పరిశీలన

dr_kvndvaraprasad.jpg
డా. కె.వి.యన్.డి. వరప్రసాద్

తెలుగు శాఖాధ్యక్షులు,
సహాయాచార్యులు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490921345. Email: prasad.tel@aknu.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

గురజాడ సృష్టించిన గిరీశం పాత్రకు ఆధారం ఉందా? ఇది గురజాడ స్వయంసృష్టి కాదా? ఆధారం ఉంటే ఎక్కడ ఉంది? అలా గురజాడకు మార్గదర్శకుడైన రచయిత ఎవరు? అనే విషయాల గురించి శ్రీ ఆర్.యస్. సుదర్శనం రాసిన “సాహిత్యంలో దృక్పథాలు” అనే గ్రంథంలో రేఖామాత్రంగా ఈ పాత్రల గురించి పేర్కొన్నారు ఈ విషయాల ఆధారంగా ఈ అంశాలను మరింత విస్తృతంగా చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. గురజాడ కలం నుంచి జాలువారిన “గిరీశం” పాత్ర, షేక్ స్పియర్ కలం నుంచి రూపుదిద్దుకున్న “ఫాల్ స్టాఫ్” పాత్రల చిత్రణలు, విభిన్నభాషల్లో శతాబ్దాల అంతరంలో వచ్చిన సందర్భాల దృష్ట్యా ఈ పాత్రల వ్యక్తిత్వాలను పరిశీలనాత్మకంగా ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: గురజాడ, గిరీశం, షేక్ స్పియర్, ఫాల్ స్టాఫ్, కన్యాశుల్కం, హెన్రీ ది ఫోర్త్, నాటకాలు

1.ఉపోద్ఘాతం:

ఆంగ్లేయుల పాలనాఫలితంగా భారతదేశంలోకి ప్రవేశించిన ఆంగ్ల భాషా ప్రభావం, వారు పాలిస్తున్న ప్రాంతాలపై ప్రత్యక్షంగా పడింది. ఫలితంగా ఆంధ్రదేశంలోని సాహితీవేత్తలపై, వారి రచనలపై మనకు ఈ ఆంగ్ల ప్రభావం కనిపిస్తుంది. దీని ప్రభావంతోనే కొంతమంది తెలుగుకవులను ఆంధ్రాషెల్లీ, ఆంధ్రా షేక్ స్పియర్ వంటి పేర్లతో పిలిచేవారు. అంటే ఆ స్థాయిలో నాటి కవులు ఆంగ్ల భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి అందులో పండితులయ్యారు. అయితే మాతృభాషాభిమానంతో తెలుగులోనే స్వతంత్ర రచనలు చేసినా ఆయా రచయితలకి ఉన్న ఆంగ్లభాషా ప్రావీణ్యంతో ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగులో వారు సృష్టించిన సాహితీ ప్రక్రియలపై పడింది. ఆ రకంగా వారికి తెలియకుండానే ఆంగ్ల సాహిత్యంలోని పాత్రలు తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగితే ఆ పాత్ర ఉన్నదున్నట్లుగా ఉంటే అనువాదమనబడుతుంది. కానీ ఇది అనుకోకుండా జరగడంవల్ల కేవలం ఆయా పాత్రల స్వరూపస్వభావాలు రేఖామాత్రంగా మనకు మన సాహిత్యంలో కనిపిస్తుంటాయి. అందులో భాగంగానే 16వ శతాబ్దం నాటి షేక్స్పియర్ పాత్రలలో ఒక అపూర్వ సృష్టిగా విమర్శకులతో ప్రశంసలు పొందిన 'హెన్రీ ది ఫోర్త్'లోని ఫాల్ స్టాఫ్ పాత్ర 19వ శతాబ్ది చివరలో గురజాడ రచించిన 'కన్యాశుల్కం'లోని గిరీశం పాత్రకు ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఈ రెండు పాత్రల మధ్య ఎన్ని సామ్యాలున్నాయో అన్ని బేధాలను మన గమనించవచ్చు. ఆ రెండు పాత్రలను ఆయా రచయితలు రూపొందించిన తీరును పరిశీలిద్దాం.

2. గురజాడ సృష్టించిన గిరీశం పాత్ర ప్రత్యేకత :

ఆధునిక తెలుగు సాహిత్యంలో విమర్శకులతో విభిన్నరకాలుగా విమర్శించబడిన పాత్ర గిరీశం. తెలుగు సాహిత్యంలో గిరీశం పాత్ర ఎంతో ప్రఖ్యాతి గాంచింది.

గురజాడ సాహిత్య సృష్టిలోనే కాకుండా భారతీయ సాహిత్య సృష్టిలోనే ఈ పాత్ర ఒక అపూర్వమైందని చెప్పవచ్చు. ఎందుకంటే కన్యాశుల్కం సమస్య, బాలికలకు అతిబాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు లేకపోవడం, వేశ్యాసమస్యల నిర్మూలనే ధ్యేయంగా ఈ నాటకం రచించబడినా ఈ సమస్యల్లో నేడు కన్యాశుల్కం, అతి బాల్యవివాహాలు దాదాపు తగ్గిపోయి, వితంతు పునర్వివాహాలు జరిగేలా సమాజం అభివృద్ధిచెందినా గిరీశం పాత్రను ఆనందించడం కోసమే నేటికీ కన్యాశుల్కాన్ని చదివేవారున్నారంటే అతిశయోక్తి లేదు. చదివిన ప్రతిసారీ సరికొత్త కోణాన్ని పాఠకుడికి చూపించడం ఈ నాటకం ప్రత్యేకత. అందుకే నేటికీ సజీవంగా ఉందని చెప్పుకోవచ్చు.

గిరీశం పాత్ర పై వచ్చిన విమర్శ :

'గిరీశం పాత్ర నాటక గమనానికి ఏ మాత్రం సహకరించట్లేదు, ఈ పాత్ర లేకపోయినా నాటకానికి, దాని గమనానికి లోపం రాదనేది' కొందరు విమర్శకుల అభిప్రాయమే అయినా గిరీశం లేని కన్యాశుల్కాన్ని ఊహించడమంటే ఊహకే అందని విషయం. కన్యాశుల్కంలోని పాత్రలన్నీ సజీవాలే. అందునా గిరీశం పాత్ర విభిన్న ధృక్పథాల, వ్యక్తిత్వాల సమాహారంగా కనిపిస్తుంది. మానవునిలోని విభిన్న కోణాలను గిరీశంలో దర్శించవచ్చు. ఈ నాటక రచన జరిగి సుమారు 12 దశాబ్దాలు పూర్తయినా నేటికీ ఇందులోని పాత్రలు అజరామరంగా కనిపిస్తూ, ప్రేక్షకునికి నేటి సమాజంలో తమ చుట్టు పక్కల జనాన్ని గమనిస్తున్నట్లుగా ఉండడమే ఈ నాటకంలోని పాత్రల ప్రత్యేకత. అందులోనూ గిరీశం పాత్ర, ప్రత్యేకంగా ఎన్నదగింది.

'కన్యాశుల్కం' నాటకంలో స్వగతంతో ఇతను ప్రవేశిస్తాడు. నాటక గమనానికి, లక్ష్యానికి ఎంతవరకు ఉపయోగపడ్డాడనే విషయాన్ని చర్చ నుంచి తప్పిస్తేనే గిరీశం పాత్రను చదువుతూగానీ, చూస్తూగానీ ఆనందించగలం. “ఈ నాటకంలోని అసలు కథ కన్యాశుల్కానికి సంబంధించింది. ఈ సమస్యతో గిరీశానికి ఏమీ సంబంధం లేదు. ఇంకా నాచిక్వొశ్చిన్, విడో మారేజి ఇందులోని ఉపకథలు. ఉపకథలకు సంబంధించినవాడు కావడంచేత గిరీశం ఉపనాయకుడే అవుతున్నాడు. కానీ ఇతడు వేశ్యా సంపర్కం వదలడానికిగాని, ఇటు విధవా వివాహం సమంజసమనడానికి గాని ఎంత మాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి. 

2.1 గిరీశం వల్లే కన్యాశుల్కం నాటకం నేటికీ సజీవంగా ఉందా?

ఈ పాత్ర వలన రూపక ప్రయోజనం ఎంతవరకు సిద్ధించిందన్న అంశం చర్చనీయాంశం అయినప్పటికీ ఆంధ్రసాహిత్యంలో గిరీశం ఒక అపూర్వమైన పాత్ర. నభూతో నభవిష్యతి. “పండిత పామరులను సమానంగా ఆకర్షించిన ఇట్టి పాత్రను సృష్టించడంలోనే ఉంది అప్పారావుగారి ప్రతిభ అంతా"(1) విమర్శనా దృష్టితో పరిశీలిస్తూ గిరీశంపై విమర్శలెక్కుపెట్టడం వల్ల మనం ఆనందాన్ని, సందేశాన్ని పూర్తిగా పొందలేం.

గిరీశం నైతికత గురించి చర్చిస్తూ, నాటక గమనానికి ఉపయోగపడని పాత్ర ఇంత విస్తృతంగా నాటకంలో స్థానం కలిగి ఉందని, ఇది వ్యర్ధమని భావించేవారికి గత 12 దశాబ్దాలుగా ఈ నాటకాన్ని ప్రత్యేకంగా గిరీశం పాత్ర కోసమే చదివి ఆదరించేవారున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాటకంలోని పాత్రల్లో ఉన్న నైతికత గురించి చర్చిస్తూ, ఆ నైతికత పాఠకుల్లో కూడా ఉండాలని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఒక పాత్ర లేదా నాటకం సమాజంలో మార్పునుద్దేశించి రాసేవైతే ఆ నాటకం చదివిన వెంటనే ఆ పాఠకుడు లేదా సమాజం వెంటనే పరివర్తన చెందాలి. కానీ అలా జరిగినట్లు మనకు సాహిత్యచరిత్రలో సామాన్యంగా కనపడదు. ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని రచనలు విప్లవాత్మకమైన ఉద్యమాన్ని, మార్పుల్ని తెచ్చి ఉండవచ్చు. కానీ అన్నిచోట్లా అది సాధ్యం కాదు. అంతమాత్రం చేత ఆయా రచనల్ని, ప్రస్తుతం కన్యాశుల్కాన్ని మంచి రచన కాదనలేం కదా. పైగా కన్యాశుల్కం సాంప్రదాయంతో ముడిపడిన సమస్య. 'పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదన్నట్లు'గా ఆ తరం మారితేగాని ఆ ఆచారం మారదు. బహుశా అందువల్లే ప్రస్తుతం ఈ సమస్య కనిపించడం లేదు కూడా. ఆయా పాత్రలు లేదా నాటకం ద్వారా నాటి సామాజిక పరిస్థితుల్ని తెలపడమే లక్ష్యంగా రచయిత తన రచననుద్దేశిస్తాడు. అందులో భాగంగా సమాజంలో పరివర్తన అప్పుడే రావచ్చు. తరవాత రావచ్చు. అలాగే రాకపోవచ్చు కూడా. అయితే రచన విజయవంతమైందా? లేదా? అనేదానికి ఇది మాత్రం కొలబద్ద కాదు, కాకూడదు కూడా. ఒకవేళ ఇదే కొలబద్ద అయితే 'కన్యాశుల్కం' అనే నాటకం ఎప్పుడో మన కళ్ళ ముందు నుంచి కనుమరుగైపోయుండేది.

2.2 గిరీశంలోని నైతికత:

గిరీశంలోని నైతికత గురించి ఇప్పటికే్ కొంత చర్చించాం. అయినా కూడా గిరీశం పూర్తిగా అనైతికుడని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇతనిలోనూ మానవత్వం ఉంది. అతను అనైతికంగా కనిపించిన సందర్భాలు కూడా అతను పొట్టకూటి కోసం పబ్బం గడుపుకోవడానికేనని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇవి కూడా అతనికి ఉన్న సిగార్లు, డాన్సింగర్లు వంటి అలవాట్లకే తప్ప, జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని మాత్రం కాదు. ఆ ఆలోచన ఉన్నట్లు కూడా కనిపించదు.. సంతలో సామాను కొనిపెడతానని పూటకూళ్ళమ్మ దగ్గర తీసుకున్న 20 రూపాయలు డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టి ఆవిషయం ఆమెకు తెలియడంతో తగాదా పడ్డాడు. "ఇంచుమించుగా యుద్ధమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ ఎన్ని పర్యాయాలు తాను ఇలా చేస్తే ఊరుకొంది కాదు అని ఆలోచించి, పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషన్సు ఉంటేగాని లోకంలో నెగ్గలేమని భావించి"(2) ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

2.3 గిరీశం సమయస్ఫూర్తి:

ఇంతవరకూ తననుంచుకొని తిండి పెట్టిన పూటకూళ్ళమ్మ ఈ గొడవతో ఇక తిండి పెట్టదు, అలాగే వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు దేహశుద్ధి తప్పదు, ఊర్లో ఎటు చూసినా అప్పులే. అందుకే షేక్ స్పియర్ వంటి శిష్యుడైన వెంకటేశంతో అతని ఊరు కృష్ణరాయపురం అగ్రహారం చేరుకోవాలనుకుంటాడు. దానికి పక్కాగా ప్రణాళిక వేసుకొని అతనితో మాట్లాడి ముందు జాగ్రత్తలు - ఇంగ్లీషు ఎలా మాట్లాడాలి వంటివన్నీ చెప్పి, అతను సమకూర్చవలసిన అవసరాలు - కాశీమిఠాయి, బండి వంటివన్నీ చెప్పి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వడానికి వెళ్తుంటే పొటిగరాప్పంతులుగారి నౌఖరు వస్తాడు.

అతనితో సంభాషణలో ముందు విననట్లు నటించడం, తరవాత చెవిటివానిగా నటించటం, ఆ బంట్రోతు గట్టిగా అసలు విషయం అరచి చెప్పేటప్పటికి అప్పుడు వినపడినట్లు నటిస్తూ ఉదయం ఎనిమిది గంటలకు పూటకూళ్లమ్మ ఇంటికి రమ్మనడం, మీ పంతులుకి మంచీ చెడ్డా అక్కర్లేదా అని ఎదురు దబాయించడం, అయినా ఆ నౌఖరు కుదరదంటే ఆ వచ్చిన నౌకరును, అతని వంశాన్ని పొగడడం, లంచంగా చుట్టలు ఆశపెట్టడం, రేపొద్దున్న ఇవ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడనడం, కాకపోతే మరేటని బంట్రోతు అడిగితే గాయత్రీ పట్టుకు ప్రమాణమనడం' (3) లో అతని సమయస్ఫూర్తి, మాటల చాతుర్యం, అబద్ధాలు ఎంత నేర్పుగా ఆడగలడో తెలుసుకోవడంతోపాటు, పాత సాంప్రదాయాలపై అతనికి ఉన్న నమ్మకాన్ని, నమ్మకంలోని ఎగతాళిని గమనించవచ్చు.

మధురవాణి ఇంట్లో రామప్పంతుల్ని మంచం కింద ఇవతలి పక్కకు రప్పించి, పూటకూళ్లమ్మ చీపురుదెబ్బలు అతనికి తగిలేలా చేయడాన్ని కూడా అతనికి ఉన్న సమయస్ఫూర్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అగ్నిహోత్రావధాన్లు ఇంటికి, అతని కుమారుడు వెంకటేశానికి మాష్టారి రూపంలో ప్రవేశించడంతో అసలు కథ ఆరంభమవుతుంది. ఇక్కడ కన్యాశుల్కం గురించి విన్న గిరీశం 'సెల్లింగర్ల్స్... డామిట్’ (4) అంటాడు. అంటే ఇతను ప్రాథమికంగా ఇన్ఫెంటు మారేజీ అంటే చిన్న వయస్సు అమ్మాయిలను అమ్మడానికి వ్యతిరేకమని గుర్తించవచ్చు. అయితే ఇతని అభిప్రాయాలు పరస్పరం మారిపోతుంటాయి. అగ్నిహోత్రావధాన్లతో బాల్యవివాహాలు కూడదని ఒప్పించే చర్చ సందర్భంలో గిరీశమే అగ్నిహోత్రావధాన్ల అభిప్రాయాన్ని ఒప్పేసుకుంటాడు. దీనిని వెంకటేశం ఆక్షేపించగా, గిరీశం చెప్పిన సూత్రం 'కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనపుడు, తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి', ‘ఒపీనియన్సు ఛేంజ్ చేస్తుంటేనే కాని పొలిటీషియన్ కానేరడు' (5) అని. దీన్ని బట్టి ఇతనికి రాజకీయ నాయకుడికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తనను తాను కాబోయే పొలిటీషియన్ గా భావించుకుంటున్నాడని మనం భావించవచ్చు.

తమ కుమారుడు వెంకటేశం ఇంగ్లీషు చదువు చదివి మునసబీ అయినా, పోలీసు పనైనా ఐతే ఈ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడనే ఆశతో ఉన్న వెంకమ్మ, ఒక పర్యాయం మా అబ్బాయి మీరు యింగిలీషు మాట్లాడండి బాబూ, అంటే చూడాలి ఒకదానికొకటి సంబంధంలేని వాళ్ళ ఆంగ్ల భాషా సంభాషణ:

గిరీశం : "My dear Venkatesam....
వెంకటేశం : ....... into ves"(6)

ఈ సంభాషణకు అర్థం సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో మాట్లాడుతున్నామని గిరీశం చెప్తుంటే మనకు ఈ గురుశిష్యుల ఆంగ్లభాషా ప్రావీణ్యం అర్ధంకాక మానదు. గిరీశం ముందే ఊహించి చెప్పిన జాగ్రత్త ఇక్కడ పనిచేసింది అంటే ఏదైనా పనిచేసేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను ముందే పసిగట్టి, జాగ్రత్తలు తీసుకోగల తెలివితేటలు, బుద్ధి చాతుర్యం ఇతనికి ఉన్నాయి.

2.4 గిరీశంలో కనిపించే మానవత్వం:

గిరీశం బుచ్చమ్మపై కన్నేసిన తరువాత ఆమెను మోసం చేయకూడదని నిర్ణయించుకొని, ఆమెకు వితంతు వివాహాలపై అవగాహన కల్గించడానికి వెంకటేశానికి చదువు చెబుతూ పనిలోపనిగా చదువులో భాగంగానే బుచ్చమ్మకు వితంతు వివాహాలు తప్పుకాదని చెప్పడంతోపాటు, అందులో ఉన్న లాభాలు చెప్పి, ఆమె సందేహాలు నివృత్తి చేస్తాడు. లోకోపకారం కోసం, వేశ్యా సమస్యలతోపాటు అనేక సమస్యల గురించి తన పోరాటాన్ని వివరిస్తూ నెమ్మదిగా ఆమెకు వితంతు వివాహం సబబనే అభిప్రాయం కలగడానికి బీజాలు వేస్తాడు. అయితే దీనికి కారణం మొదటిసారిగా ఆమెను చూసి మనసుపడ్డప్పుడు గిరీశానికి పట్నంలోని డాన్సింగర్లు, మధురవాణి, పూటకూళ్ళమ్మ మొదలైన వాళ్ళంతా చాలా అసహ్యంగా తోచారు. “అనాఘ్రాణిత పుష్పమైన బుచ్చమ్మను చేసుకుంటే కీర్తి, సుఖం రెండూ దక్కుతాయని"(7) లాభనష్టాలు బేరీజు వేసుకొని పెళ్ళి చేసుకోవడానికే నిర్ణయించుకుంటాడు. ఈ నిర్ణయం స్వగతం కావడంతో గిరీశం మరీ అంత మోసగాడు కాదనీ, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి నడచుకునే వాడనీ అర్ధమవుతుంది.
వెంకటేశం, తన తండ్రి అగ్నిహోత్రావధాన్లు సమక్షంలో తన గురువు గిరీశంతో మాట్లాడుతున్నప్పుడు 'వెధవలు' అని ఉచ్ఛరించిన పదానికి 'వెధ్వల్' అంటే లాటిన్ పదమని చెప్పి, ఆ పదానికి అర్థం అగ్నిహోత్రావధాన్లకు ఇష్టమైన 'కోర్టులు' అని చెప్పగల ధైర్యం, సమయస్ఫూర్తి, చాతుర్యం గిరీశానికున్నాయి. బుచ్చమ్మతో మాట్లాడుతూ తామిద్దరికి పెళ్ళయితే తమ జీవితం ఏవిధంగా ఉంటుందో వివరిస్తున్నప్పుడు బుచ్చమ్మ నిజంగానే అవి జరుగుతున్నట్లు, తన ఆమోదం వాటి కున్నట్లు ప్రవర్తించడానికి కారణం అతనిలోని కల్పనాచాతుర్యంతోపాటు, ఊహాశక్తులను చెప్పుకోవచ్చు. చెయ్యని దానిని చేసినట్లు చూపించడంలో కూడా గిరీశం అఖండుడు 'బావా, మనం ఏదైనా వేషం వేశామంటే ఒకడు చూస్తున్నాడని అనుకున్నప్పుడూ ఒకడు చూస్తూ ఉండలేదనుకున్నప్పుడూ కూడా వొక్క మోస్తారుగా వేషం నడిపిస్తే సేఫ్ సైడ్" (8) అనే విషయాన్ని తానే స్వయంగా చెప్తాడు. అందుకే గిరీశం నాటకాల విషయంలో అంతగా రాణించాడు.

పొగాకు దొంగతనాన్ని సమర్ధించుకుంటూ టుబాకోపనిషత్తుకు తాము కర్తలం కాగలమని చెప్తాడు గిరీశం. పొగాకును పొడుం చేసి పీల్చే వాళ్ళ దగ్గర దొబ్బుకొచ్చి చుట్టలు చేసి కాల్చి తగలెట్టడంలో తప్పులేదని సిద్ధాంతీకరిస్తాడు. ఒకవేళ దేవుడు ఇది తప్పు అని నిర్ధారిస్తే దేవుణ్ణి తాను డిపెండెంటునా? ఇండిపెండెంటునా అని అడిగి దేవుడి సమాధానాన్ని బట్టి, సమాధానమేదైనా తప్పును దేవుడి మీదకు నెట్టివేస్తాడు. అంతేకాకుండా స్వర్గంలో తనకు ఆరు ఘడియల అధికారమిస్తే సృష్టిలో లోపాలను సరిచేయగల, సృష్టికర్త కాగల గొప్ప మేధావి గిరీశం.

2.5 గిరీశం మాటల గారడీ:

తన చెల్లి సుబ్బి పెళ్ళి తప్పించమని గిరీశాన్ని బుచ్చమ్మ ప్రాధేయపడి అడిగినపుడు, అది తన వల్ల అయ్యేపని కాదని చెప్తూ, అతను చేసే మాటలగారడీ - పట్నానికి వెళ్ళిపోతాననడం, ఈ పెళ్ళి జరిగితే సుబ్బికి ఎదురయ్యే కష్టాలు, జరగబోయే సంఘటనలుగా ఏవో కల్పించి చెప్పడం, తరువాత బుచ్చమ్మ గిరీశం గురించి బాధపడినట్లు కల్పన, అప్పటికే గిరీశం బుచ్చమ్మపై బెంగతో చనిపోవడం, స్వర్గానికి వెళ్ళిన గిరీశం దగ్గరకి రంభ తక్కుతూ తారుతూ రావడం వంటి వర్ణనలు మనకు గిరీశంలోని వర్ణనా చాతుర్యాన్ని, హాస్యదృష్టిని తెలియచేస్తాయి. ఈవిధంగా ఎన్నో కథలు, వర్ణనలు చెప్పి చివరకు చెల్లి పెళ్ళి తప్పిపోయే సాధనం నీ చేతుల్లోనే - ఉందని చెప్పి, దానికి మనం లేచిపోవడమే మార్గమని చెప్పి బలవంతంగా బుచ్చమ్మను ఒప్పిస్తాడు. అయితే ఇక్కడ గిరీశం బలవంతం కన్నా బుచ్చమ్మకు చెల్లిపై గల ప్రేమే ఆమెను గిరీశంతో లేచిపోవడానికి ప్రేరేపించిందని చెప్పవచ్చు.

సౌజన్యారావు పంతులు దగ్గరికి వెళ్లినపుడు గిరీశం నటించే అమాయకత్వం చూసి ఏం సత్యకాలం వాడివి అంటాడు. అంతగా ఆ పెద్దాయన్ని నమ్మిస్తాడు. అలా కోతలు కోస్తున్న సమయంలోనే మధురవాణి మారువేషంలో ప్రవేశించినా గుర్తుపడతాడు. ఫలితంగా నోటి నుంచి మాట రాదు. రకరకాల తన మాటల విన్యాసాలతో మధురవాణిని, తన గురించి సౌజన్యారావు పంతులుగారికి చెప్పొద్దని బ్రతిమాలుకుంటాడు. సౌజన్యారావు బలవంతంతో మధురవాణి, గిరీశం గుట్టు విప్పాక తనను తాను సమర్థించుకుంది డ్యాంలో కూడా అతని మాటల్లో చాతుర్యం, సమయస్ఫూర్తి కనిపిస్తాయి. చివరికి సౌజన్యారావు అతనికి చివాట్లు పెడతాడు. బుచ్చమ్మను అతని చెర నుంచి రక్షిస్తాడు.

మొత్తం మీద గిరీశం పాత్రను పరిశీలిస్తే ఇతను గొప్ప ఆదర్శవాదినని చెప్పుకొనే కోతలరాయుడు. ఎన్నో ఆదర్శాలను ప్రవచించినా ఒక్కదాన్నీ ఆచరణలో పెట్టనివాడు. మధురవాణి, పూటకూళ్ళమ్మ విషయంతోపాటు బుచ్చమ్మ విషయంలో కూడా ఇతని ప్రవర్తన అక్కడక్కడా అనుమానాస్పదంగానే ఉంటుంది. ఇతను తన జీవనయానాన్ని సమయస్ఫూర్తి, మాట చాతుర్యం, దేహగాంభీర్యాలతో నెట్టుకొస్తుంటాడు. ఇతను వయస్సులో ఉన్నవాడు కనుక మధురవాణి, పూటకూళ్ళమ్మ, డాన్సింగర్లతో సంబంధాలతోపాటు సిగార్సు, గడ్డ పెరుగు, కాశీ మిఠాయి, నెయ్యి మొదలైనవి ఇతనికి ఇష్టమైనవైనా చివరకు బుచ్చమ్మలోని అమాయకత్వానికి, ఆకర్షణకు లొంగినా ఆమెతో తన పెళ్ళి వల్ల వచ్చే లాభనష్టాల బేరీజు అనంతరమే ఆమెను లేవదీసుకుపోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

అయితే గిరిశంలోని మానవత్వానికి ఉదాహరణగా బుచ్చమ్మ నెత్తిపై ఆమె తండ్రి పెరుగు విస్తరి రుద్దినపుడు అతను వ్యవహరించిన తీరును చెప్పుకోవచ్చు. "నీళ్ల పొయ్యిలో నిప్పేసి, నీళ్లు తోడి నీ సిస్టర్ని స్తానం చెయ్యమన్నాను"(9) అంతేకాకుండా వెంకటేశంతో 'నేను దాని హజ్బెండ్నై ఉంటే మీ నాన్నను రివాల్వర్తో షూట్ చేసి ఉందునని' అనడాన్ని చెప్పుకోవచ్చు. 'పల్లెటూరి పీపుల్స్ లెక్చర్లకి అన్ఫిట్' అని తేల్చిపారేస్తాడు. తాను మంచి కవినని కూడా గిరీశం చెప్పుకున్నాడు. 'ది విడో' కవితను 'రిఫార్మర్'లో అచ్చు వేసేటప్పటికి 'టెన్నిసన్' గుండె కొట్టుకున్నాడట మరి. అంత గొప్ప కవి గిరీశం.

2.6 గిరీశంలో కనిపించే ఆధునిక భావజాలం:

పరలోకంలో దేవునితో వాగ్వివాదం చేయడానికే కాకుండా ఇహంలో కొత్త మతాన్ని ప్రజ్వలింప చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించుకున్న గొప్ప ప్రవక్త గిరీశం. వెంకటేశంతో మాట్లాడుతూ "ఇగ్నోరెన్స్! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. ఈ పెళ్ళి అయిపోయిన తరువాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్ని మతాలు పరిశీలించి, వాటి తాలూకూ యసెన్స్ నిగ్గు తీసి ఒక కొత్త మతం యేర్పరచాను" (10) అంటాడు. దాన్ని అమెరికా వెళ్ళి ప్రజ్వలింపచేయాలనేది అతని అభిమతం. అయితే గిరీశం మతమౌఢ్యం ఉన్న వ్యక్తేమీ కాదు. ఇతను 'అంజనం' మొదలైనవాటిని నమ్మకపోవడం వంటి వాటి ఆధారంగా ఆధునికుడేనని చెప్పవచ్చు. అట్లే కాళిదాసుకు హిమాలయాలు ఎలా ఉంటాయో తెలియదని జాగ్రఫీ ద్వారా మ్యాపు చూపించి కరటక శాస్త్రులు శిష్యుడికి చెప్తాడు. గిరీశం దృష్టిలో ఆధునికుడంటే పాశ్చాత్యుడే. మైలా గీలా పట్టింపు లేని ఇంగ్లీషువాడనని తనను తాను వర్ణించుకుంటాడు.

ఈవిధంగా మధురవాణిని, పూటకూళ్లమ్మని, వెంకటేశాన్ని, అగ్నిహోత్రావధాన్లని, బుచ్చమ్మను, వెంకమ్మను, సౌజన్యారావు పంతులు మొదలైనవారిని మోసం చేసిన గిరీశం తన అన్న అయిన లుబ్ధావధాన్లను మాత్రం తనను దత్తత తీసుకోవడానికి ఒప్పించలేకపోయాడు. అంటే ప్రతీ మనిషికి కొన్ని పరిమితులుంటాయని, మోసానికి, ఆగడాలకు కూడా హద్దు ఉంటుందని సూచితమైంది. అయినా గిరీశం నాటకం చివరిలో “డామిట్! కథ అడ్డం తిరిగింది. అవును అడ్డం తిరిగింది. జీవితంలో కూడా ఇంత కవిత్వం చెప్పే నేర్పరికి అలా తిరక్క తప్పదు. ఆ తర్వాత? గిరీశం గుడ్బాయిగా మారి కాలేజీలో చేరి చదివి బుచ్చమ్మను పెళ్లాడగల యోగ్యతను సంపాయించుకుంటాడా? అలా అనిపించదు. ఎక్కడ నుంచి వచ్చాడో ఆ జీవితం చీకటి కోణాలలోకే నీడగా మళ్ళిపోయి ఉంటాడు. ఇంకోచోట మరో మానవ మహానాటకంలో తలదూర్చి చివరకు తలబొప్పి కట్టించుకోవడానికి వేషధారణకు ఉపక్రమించి ఉంటాడు. అతను బహురూపి మాత్రమే కాదు చిరాయువు కూడా"(11) అన్న కె.వి. రమణారెడ్డిగారి అభిప్రాయం అక్షరసత్యం.

3. షేక్ స్పియర్ సృష్టించిన ఫాల్ స్టాఫ్ పాత్ర గొప్పదనం :

ఇక ఆంగ్ల మహానాటక కర్త షేక్ స్పియర్ రాసిన హెన్రీ ది ఫోర్త్ నాటకంలో సృష్టించిన అద్భతపాత్ర ఫాల్ స్టాఫ్ “వినోదానికి సంబంధించి షేక్ స్పియర్ సృష్టించిన పాత్రల్లో అమరపాత్ర -ఫాల్‌స్టాఫ్. ఇది షేక్స్‌పియర్ యొక్క  అద్వితీయ సృష్టి. ఫాల్‌స్టాఫ్ అనే పాత్ర షేక్స్‌పియర్‌ సాహిత్యంలోనే కాదు, మొత్తం ఆంగ్ల సాహిత్యంలోనే గొప్ప హాస్య పాత్ర" (12) అన్న ఆచార్య రఘుకుల తిలక్ గారి మాటల ద్వారా ఈ పాత్ర గొప్పదనాన్ని మనం గమనించవచ్చు. షేక్ స్పియర్ రచించిన 'హెన్రీ ది ఫోర్త్' నాటకంలోని రెండు భాగాలలో ప్రధానంగా హెన్రీ ది ఫిఫ్త్ నాటకం ఆరంభంలో ఉన్న పాత్రగా రూపొందిన ఫాల్ స్టాఫ్ పాత్ర ప్రపంచ సాహిత్యంలోనే ఒక అజరామరమైన పాత్ర. కేవలం షేక్ స్పియర్ నాటకాలలోనే కాకుండా ఆంగ్ల సాహిత్యంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన హాస్య పాత్రగా ఫాల్ స్టాఫ్ గా చెప్పుకోవచ్చు. ఆంగ్ల సాహిత్యంలో ఈ పాత్రపై ఎంతో చర్చ జరిగి ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. షేక్ స్పియర్ అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఎంతోమంది విమర్శకుల (డా॥ జాన్సన్, మారిస్ మోర్గాన్) ప్రశంసలు పొందిన ఈ పాత్రను బ్రిటీష్ రాణి ఎలిజబెత్ కూడా ఎంతో ఇష్టపడి, దీనిని కొనసాగించమని షేక్ స్పియర్ను కోరినట్లు కూడా తెలుస్తుంది. ఆంగ్ల సాహిత్యంలో అందరికీ ఇంత ప్రీతిపాత్రమైన పాత్రను పరిశీలిస్తే పరస్పర విరుద్ధ లక్షణాల కలయికగా మనం ఈ పాత్ర మనకు కనపడుతుంది…

"ప్రొఫెసర్ డౌడెన్  ఫాల్ స్టాఫ్ పాత్రను షేక్ స్పియర్ సృష్టించిన హామ్లెట్ వలె సంక్లిష్టమైన మరియు అద్భుతమైన సృష్టిగా పరిగణిస్తారు. ఫాల్ స్టాఫ్ విరుద్ధమైన, అంటే వ్యతిరేక లక్షణాల యొక్క విచిత్రమైన సమ్మేళనం. మారిస్ మోర్గాన్ రాసినట్లుగా " అతను ఒకేసారి యువకుడు మరియు ముసలివాడు, యువకునివలే ఉత్సాహం కలిగిఉన్నా లావుగా ఉంటాడు. మోసగాడు మరియు తెలివిగలవాడు, చెడ్డవాడు గానే కనిపిస్తాడు కానీ ఎవరికీ హానిచేయడు. మరియు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా రాజ్యాంగ సూత్రాలను పాటించడంలో బలహీనుడు. ధైర్యవంతుడుగా నటించే పిరికివాడు. ద్వేషం లేని కత్తి, మోసం లేని అబద్ధాలకోరు. వృత్తిపట్ల గౌరవం, మర్యాద లేని సైనికుడు. విభిన్న లక్షణాల సమ్మిళితంగా పాత్రలను రూపొందించడంలో షేక్ స్పియర్ సిద్ధహస్తుడు.ఇలాంటి విభిన్న లక్షణాల సమాహారంగా, సరైన పదార్థాలు మిళితం కానట్లుగా ఈ పాత్రను రూపొందించడంలో షేక్ స్పియర్ నైపుణ్యం తెలుస్తుంది “ (13).

అని ప్రముఖ ఆంగ్లవిమర్శకులతో ప్రశంసలు పొందిన విషయం ఈ విషయాన్ని ప్రధానంగా పరిశోధన చేసిన రఘుకులతిలక్ గారి పై వ్యాఖ్యద్వారా తెలుసుకోవచ్చు. ఈవిధంగా ఎన్నో విభిన్న లక్షణాలు ఏకకాలంలో కనిపించడం ఈ పాత్ర ప్రత్యేకత.

3.1 ఫాల్ స్టాఫ్ వ్యక్తిత్వం:

ఈ నాటకాన్ని బట్టి ఫాల్ స్టాఫ్ వయస్సు సుమారు 60 సంవత్సరాలుగా తెలుస్తుంది. ఆ వయస్సులో కూడా అతను తనను తాను యువకునిగానే భావించుకుంటాడు. చూడగానే నవ్వు పుట్టించే భారీకాయంతో తనను తాను మోసుకోవడమే గగనంగా కనిపించే మనిషి. గుర్రం లేకుండా నాలుగడుగులు వేయలేనివాడు. కనీసం తన మోకాళ్ళను కిందికి వంచలేనివాడు అయిన ఫాల్ స్టాఫ్, జీవితాన్ని యువకునిగానే గడపడానికి ప్రాధాన్యమిస్తాడు. ఇతని మిత్రులు ఐదవ హెన్రీ వంటి యువకులు కావడాన్నే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇతని ప్రతిచర్యలోను సుఖసంతోషాలే ప్రధానాంశాలుగా ఉంటాయి. ఆ సుఖసంతోషాలు కూడా కేవలం తాత్కాలికమైనవి. అవి తినడం, తాగడం వంటివే కాని అంతకుమించి ఏమీ కోరుకోడు. అతడు ఎన్ని అబద్ధాలాడినా వీటి కోసమే తప్ప అవి ఎవరికీ హాని కలిగించడానికి కాదు. ఫాల్ స్టాఫ్ అబద్ధాలవల్ల పెద్దగా నష్టపోయేవారెవరూ ఉండరు. ఇతని మాటలు, చేతలు ఆహ్లాదం కలిగిస్తాయి కనుకే ప్రిన్స్ హాల్ ఇతనిని తన మిత్రబృందంలో చేర్చుకుంటాడు. అతనితో కలసి తిరుగుతాడు. తాగుతాడు, ప్రపంచాన్ని పరిశీలిస్తాడు. అంటే ఒక రకంగా కాబోయే రాజుకు ప్రపంచాన్ని గురించి అవగాహన కలిగించిన వ్యక్తిగా ఫాల్ స్టాఫ్ ను చెప్పుకోవచ్చు.

3.2 ఫాల్ స్టాఫ్ - హాస్యం:

ఇతను అబద్ధాలు ఎంత తరచుగా ఆడినా, అవి ఎవరూ నమ్మాలని తాను కోరుకోడు. ఉదాహరణకు యువరాజుతో కలసి వీరందరూ దొంగతనం చేసినతరువాత జరిగిన సంఘటన సందర్భంలో యువరాజుతోనే ఒకే సీన్లో ఒకే సంభాషణలో ఎన్నో అబద్ధాలు ఆడతాడు. వాటిని యువరాజు ఎత్తిచూపగా వాళ్ళ మిత్రబృందంలో ఒకడైన పాయిన్స్ వాటిని సమర్థించి ఆ హాస్య ప్రసంగం కొనసాగేటట్లు చేస్తాడు.

ఇదే సన్నివేశంలో తనపై పడి బెదరగొట్టింది యువరాజేనని తెలుసుకున్న తరవాత 'సింహం నిజమైన యువరాజునెలా గుర్తిస్తుందో నేనూ అలాగే నిన్నుగుర్తించి ఏమీ చేయకుండా వదిలేశానని' కోతలు కోసి, తన అబద్ధాలకు సమయస్పూర్తిని జోడించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తాడు. అలాగే ఒకవైపు హాట్ స్పర్ 'హానర్' (Honour) తనకు ప్రాణమని, దానికోసం ప్రాణత్యాగానికి కూడా సిద్దమవుతుంటే ఫాల్ స్టాఫ్ తనలో "హానర్లో ఏముంది? ఆ పదం ఉచ్చరించేటప్పుడు వచ్చేగాలి తప్ప! అది కనీసం గాయాలను మాన్పగలదా?(14) అనుకుంటాడు మరొకవైపు.

ఐదవ హెన్రీ రాజయ్యాక దొంగలను థీవ్స్, రాబర్స్ అని పిలవడం మానేసి డయానాస్ ఫారెస్టర్స్, జంటిల్మన్ ఆఫ్ ది షేడ్ లేదా మినియన్స్ ఆఫ్ ది మూన్ అని వాళ్ళ పేర్లు మార్చాలని సూచిస్తాడు. పాయిన్స్ దొంగతనం చేయాల్సిన ఆవశ్యకతను యువరాజుకు వివరిస్తానని చెప్పినపుడు 'నువ్వు చెప్పిన మాటలు నమ్మే శక్తి అతనికి, మాటలు చెప్పి నమ్మించే శక్తి నీకు ఆ భగవంతుడు ఇవ్వాలని అనడంలో అతని చమత్కారపు సంభాషణను అర్ధం చేసుకోవచ్చు. తన శరీరాకృతి పూర్వాశ్రమంలో ఉండే విధం గురించి అతిశయోక్తులతో యువరాజు హాల్ వయస్సులో నేను ఎంత ఉత్సాహవంతునిగా, ఆరోగ్యవంతునిగా ఉండేవాడినో మీరు అంచనా వేయడం కష్టం. నేను వయస్సులో ఉన్నప్పడు పెద్దవారి ఉంగంరంలోంచి దూరగలిగేలా ఉండేవాడిని' (15) అంటూ వివరిస్తాడు.

ఫాల్ స్టాప్ జరగబోయే యుద్ధం గురించి చెప్తూ రాజు (నాలుగవ హెన్రీ) యువరాజు (ప్రిన్స్ హాల్)ను పిలిచినపుడు అక్కడ జరగబోయే సంభాషణను ప్రాక్టీస్ చేద్దాం అంటాడు. అందుకు సరేనన్న యువరాజు ఫాల్ స్టాఫ్ ను తన తండ్రిగా నటిస్తూ, తన జీవితం గురించి ప్రశ్నించమంటాడు. ఈ సంభాషణ చాలా చమత్కారంగా నడుస్తుంది. ఇదే సంభాషణలో వాళ్ళ పాత్రలు మారతాయి. (యువరాజు హాల్ సూచనలమేరకు) అపుడు ఫాల్ సంభాషణలోని చాతుర్యం పరాకాష్టనందుకొంటుంది.

3.3 ఫాల్ స్టాఫ్ అలవాట్లు:

అయితే యుద్ధరంగంలో కూడా యువరాజుకు Sack బాటిల్ (ఒక రకమైన మద్యం) చూపించడం తాగుడుకు అతని బానిసత్వాన్ని తెలుపుతుంది. దేశం కోసం ఫాల్ స్టాఫ్ నాయకత్వంలో కొంత సైన్యాన్ని నియమించమని యువరాజు ఆదేశించినప్పుడు సాధారణంగా యుద్ధానికి అర్హులైన, మంచి శారీరక ధారుఢ్యంగల, పోరాటపటిమగల యువకులతో సైన్యాన్ని నిర్మించాలి. కాని ఫాల్ స్టాఫ్ తాగుడు, తిండి మొదలైన తన వ్యక్తిగత అవసరాల కోసం యువరాజు ఇచ్చిన ధనాన్ని దుర్వ్యయం చేయడమే కాకుండా, ప్రాణభయంతో లంచాలు ఇస్తున్న అర్హులైన యువకుల నుంచి లంచాలు స్వీకరించి, వారిని సైన్యంలోకి ఎంపిక చేయడు. కానీ యువరాజుకు సైన్యాన్ని చూపించాలి కనుక రోడ్డునపోయే పేదవారిని, అనర్హులైన కనీసం సరియైన దుస్తులుకూడా ధరించని వారిని ఎంపికచేయడంవంటివి అతనిలోని వ్యసనపరుణ్ణి మనముందు నిలబెడతాయి.
ఫాల్ స్టాఫ్ బట్టలు కుట్టడానికి కూడా టైలర్ ఆ కుట్టుకూలి డబ్బులకు హామీ కావాలన్నాడంటే ఫాల్ స్టాఫ్ వ్యక్తిత్వం లండన్లో ఎంత ప్రఖ్యాతి చెందిందో గమనించవచ్చు.

3.4 ఫాల్ స్టాఫ్ సమయస్ఫూర్తి:

క్విక్లీతో ఉంగరం పోయిందని దబాయించినపుడు యువరాజు వచ్చి, అది రాగిదేనని చెప్పేదాకా అతని సంభాషణాతీరు, చెప్పిన తరవాత క్విక్లీని అనునయిస్తూ, కొన్ని సూచనలు చేస్తూ బ్రేక్ ఫాస్ట్ తయారుచేయాలని ఆదేశించడం వంటి వాటితోపాటు, ఫాల్ స్టాఫ్ నియమించిన సైన్యాన్ని చూసి యువరాజు ఆక్షేపణ వ్యక్తం చేసినపుడు యుద్ధరంగంలో ఫిరంగులకు ఆహారం కావడానికి ఎటువంటి వారైనా ఒకటేనని చెప్పే సమాధానం, యుద్ధం పట్ల అతనికి గల వ్యతిరేకతతోపాటు నైపుణ్యం, తెలివి, ఆయుష్షు కలిగి దేశాభివృద్దికి ఉపయోగపడాల్సిన యువత అనవసరంగా యుద్ధరంగంలో మరణిస్తున్నారనే అతని భావాన్ని మనకు వ్యక్తం చేస్తాయి. ఈ రకంగా అతనిని శాంతికి ప్రతినిధిగా, శాంతిప్రియునిగా, శాంతికాముకునిగా చెప్పుకోవచ్చు. దొంగతనాల సమయంలో అంతమందిని చంపాను, ఇంతమందిని చంపాను అని చెప్పిన విషయాలు కేవలం అతను కోసిన కోతలే తప్ప అతను ఎవరికీ శారీరకంగా హాని కలిగించే రకం కాదని చెప్పవచ్చు.

న్యాయమూర్తితో సంభాషణా సమయంలో కూడా అతని మాటల చాతుర్యాన్ని గమనించవచ్చు. యువరాజును పెడదారి పట్టిస్తున్నావనే న్యాయమూర్తి మాటకు యువరాజే నన్ను పెడదారి పట్టిస్తున్నాడని సమాధానం చెప్తాడు. అంతేకాకుండా ఎప్పటిలాగే తనను తాను యువకునిగా భావించుకుంటూ తన వీరత్వానికి గుర్తింపు లేకుండా పోయిందని, యువతరం శక్తిసామర్ధ్యాలను ప్రజలు సరిగా అంచనా వేయట్లేదని వాదిస్తాడు. అంతేకాకుండా న్యాయమూర్తి “యువరాజుకు దేవుడు మంచి స్నేహితుణ్ణి పంపాలని ప్రార్థించగా” ఫాల్ స్టాఫ్ వెంటనే ‘నా స్నేహానికి దేవుడు మంచి యువరాజును పంపాలని' ప్రార్థిస్తాడు. అంతేకాకుండా న్యాయమూర్తినే యుద్ధవిరాళంగా వెయ్యి పౌన్లు అడుగుతాడు. ఫాల్ స్టాఫ్ గురించి పూర్వాశ్రమంలో ఎంతో తెలిసిన న్యాయమూర్తి ఒక పెన్నీ కూడా ఇవ్వనని వెళ్ళిపోతాడు.

క్విక్లీతో గొడవపడడం, అనునయించడం కొనసాగుతూనే ఉంది. ఒకసారి యువరాజును దూషించగా మారువేషంలో అక్కడే ఉన్న యువరాజు అది గమనించి వివరణ అడగగా, దానికి సమాధానంగా 'యువరాజా! మిమ్మల్ని కొంతమంది వికృతమైన ప్రవర్తనగలవారి ముందు విమర్శించిన మాట నిజం! అయితే అది కేవలం వాళ్ళు మిమ్మల్ని అభిమానించకుండా ఉండడానికి మాత్రమేనని' సమయస్ఫూర్తితో సమాధానమిస్తాడు. అలాగే డగ్లస్ తో యుద్ద సమయంలో చనిపోయినట్లు నటించడం, తరవాత ప్రిన్స్ హాల్ చంపిన హాట్ స్పర్ శవాన్ని భుజాన వేసుకొని తానే చంపానని ప్రకటించి, యువరాజుతో వాగ్వివాదానికి దిగడం ఫాల్ స్టాఫ్ చమత్కారపు సంభాషణకు ఉదాహరణలు.

ఈ విధంగా 29 సంవత్సరాలు క్విక్లీతోను, 22 సంవత్సరాలు పాయిన్స్ మొదలైన వారితోనూ స్నేహంగా మెలిగాడంటే ఇతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం వ్యక్తిత్వం లేని వ్యక్తిని అన్నిసంవత్సరాలు భరించడం ఎవరికైనా కష్టమే. అంతేకాకుండా భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి అధికారాన్ని చెలాయించాలనే వాంఛ కూడా అతనికి ఉంది.( ప్రిన్స్ హాల్ రాజయ్యాక). అయితే అతను అర్హతలకు తగిన ఉద్యోగం కాకుండా, తన స్నేహ ప్రభావంతో ఆ ఉన్నతాధికారాన్ని సంపాదించాలని కలలు కంటాడు. ఈ రకమైన ఆలోచనలతో ఉన్న ఫాల్ స్టాఫ్ చివరకు యువరాజు హాల్ రాజైన తరవాత ఆయన్నుండి లభించిన తిరస్కారంతో మనోవ్యాధికి గురై మంచం పట్టి మరణిస్తాడు. అంటే యువరాజును ఫాల్ స్టాఫ్ మనస్ఫూర్తిగానే ప్రేమిస్తాడు. అప్పటివరకూ తనతో కలసి తాగి, తిని, తిరిగిన యువరాజులో రాజైన తరవాత వచ్చే మార్పులను ఊహించడు. అందుకే ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తాడు. అయితే షేక్ స్పియర్ ‘ప్రిన్స్ హాల్ స్వగతం' లో వీరిని భవిష్యత్తులో తాను వదిలివేయబోతున్నట్లు మనకు వివరిస్తాడు.

”నాకు మీ గురించి తెలుసు, కానీ మరికొంత కాలం సమర్థిస్తాను... కానీ సమయం వచ్చినప్పడు మీ గురించి ఆలోచించక తప్పదు…(16)

ఈవిధంగా షేక్ స్పియర్ మానవతావిలువలకంటే అధికార విలువలకే అగ్రాసనం వేశాడని చెప్పవచ్చు. ఈ రచనాకాలంనాటి పరిస్థితులనుబట్టి అది అనివార్యమై ఉండవచ్చు. ఏది ఏమైనా ఆయన సృష్టించిన హాస్యపాత్రల్లోనే ఎన్నదగిన పాత్ర అయిన ఫాల్ స్టాఫ్ కేవలం ఆయన పాత్రల్లోనే గాక, విశ్వ సాహిత్యంలోనే ఎన్నదగిన పాత్రగా చెప్పుకోవచ్చు.

4. ముగింపు:

మొత్తంమీద పై రెండు పాత్రల చిత్రీకరణను పరిశీలిస్తే గురజాడ గిరీశం- షేక్ స్పియర్ ఫాల్ స్టాఫ్ పాత్రల మధ్య ఎన్ని సామ్యాలు కనిపిస్తాయో అన్ని భేదాలును కూడా మనం గమనించవచ్చు. అయితే ఛాయామాత్రంగా గురజాడమదిలో ఫాల్ స్టాఫ్ ఉన్నాడని ఈ రెండుపాత్రలను సునిశితదృష్టితో పరిశీలిస్తే మనం గమనించవచ్చు. గిరీశం యువకుడైతే ఫాల్ స్టాఫ్ ఇంచుమించు ముసలివాడు. అయితే ఇద్దరి మధ్య ఉన్న సామ్యం ఆ పూటకి తమకు కావలిసినట్టు గడిస్తే చాలనుకోవడం. అలాగే అద్దరూ కోతల రాయుళ్లే. ఇద్దరూ కష్టపడకుండా జీవనాన్ని కొనసాగించాలనుకునేవారే. ఇద్దరూ అయాచితంగా సామర్ధ్యానికి మించి ఉన్నత పదవులు వరించాలనుకునేవారే. ఇద్దరి ఆలోచనలూ ఒకేతీరుగా ఉంటాయి. అలాగే ఇద్దరూ కొన్ని వ్యసనాలకు బానిసలు కూడా. ఈ విధంగా సామ్యాలకంటే ఈ రెండుపాత్రల మధ్య భేదాలే ఎక్కువగా కనిపిస్తాయి.

  1. పాదసూచికలు:
  1. ఆచార్య నాగభూషణశర్మ మొదలి, డా॥ ప్రసాద్ ఏటుకూరి, 'కన్యాశుల్కం-నూరేళ్ల సమాలోచన'. పేజి నెం. 216
  2. వేంకట అప్పారావు, గురజాడ, 'కన్యాశుల్కం'. పేజి నెం. 2
  3. అదే. పేజి నెం. 29, 30
  4. అదే. పేజి నెం. 38
  5. అదే. పేజి నెం. 46
  6. అదే. పేజి నెం. 39
  7. అదే. పేజి నెం. 63
  8. అదే. పేజి నెం. 99
  9. అదే. పేజి నెం. 45
  10.  అదే. పేజి నెం. 99
  11. రమణారెడ్డి, కె.వి., 'నూరేళ్ళ కన్యాశుల్కం'. పేజి నెం. 36
  12. Dr. Raghukul Tilak, 'William Shakespeare Henry IV, Part-1. Page No. 95.
  13.  "Prof. Dowden considers him as complex and as wonderful a creation as Hamlet himself. He is a strange compound of antithetical, i.e. opposite qualities. As Maurice Morgan writes: "He is a man at once young and old, enterprising and fat, a dupe and a wit, harmless and wicked, weak in principle and resolute by constitution, cowardly in appearance and brave in reality, a knave without malice, a liar without deceit and a knight. a gentleman, and a soldier without either dignity, decency or honour. This is a character which, though it may be decompounded, could not, I believe, have been formed, nor the ingredients of it duly mingled, upon any receipt whatever. It required the hand of Shakespeare himself to give to every particular part, alike, the same incongruous, identical Falstaff” - Dr. Raghukul Tilak, "William Shakespeare Henry IV, Part-1. Page No. 72.
  14. Peter Alexander, 'William Shakespeare'. Page No. 509
  15.  "My own knce! When I was about thy years, Hal, I was not an eagle's talon in the waist, I could have crept into any alderman's thumb ring" -  Dr. Raghukul Tilak, William Shakespeare Henry IV, Part-1, Page No.182
  16.  "I know you all, and will a while uphold....... time when men think least I will” -  Peter Alexander, 'William Shakespeare', Page No.483

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అప్పారావు, పి.యస్.ఆర్. (1967). తెలుగు నాటక వికాసం, నాట్యమాల ప్రచురణలు.
  2. తిరుమలరావు, సర్దేశాయి, (1994). కన్యాశుల్క నాటకకళ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
  3. మొదలి, నాగభూషణశర్మ. ప్రసాద్, ఏటుకూరి. (1994). 'కన్యాశుల్కం-నూరేళ్ల సమాలోచన', విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
  4. రమణారెడ్డి, కె.వి. (1992). 'నూరేళ్ళ కన్యాశుల్కం', చరిత ప్రచురణలు.
  5. వేంకట అప్పారావు, గురజాడ. (1996). 'కన్యాశుల్కం', విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
  6. సుదర్శనం, ఆర్.యస్.(1982). సాహిత్యంలో దృక్పధాలు, ఆర్. వసుంధరా దేవి.
  7. Peter Alexander, (2006). 'William Shakespeare', Collins Publishers, London.
  8. Raghukul, Tilak. (1986). 'William Shakespeare Henry IV, Part-1, Published by RamaBrothers, Pune.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]