AUCHITHYAM | Volume-04 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. మొల్ల రామాయణం : తెలుగు భాష, సమాజం, సంస్కృతి
ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి
ఆచార్యులు, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9949058611, Email: dvl1961@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ప్రాచీనసాహిత్యంలోని దేశిపదాలను, దేశీసమాజాన్ని, దేశీసంస్కృతిని వెలికితీసే ప్రయత్నం కోసం తపన చెందుతూ ఉడుతాభక్తితో తెలుగుమీద వున్న ప్రీతితో మొల్లరామాయణంలోని భాష, సమాజం, సంస్కృతిలో లభ్యమౌతున్న దేశీయతను గుర్తించడం ఈ వ్యాసోద్దేశ్యం. మొల్ల రామాయణం తీసుకోవడానికిగల కారణం మొల్లరామాయణ రచన స్త్రీ చేయటం. స్త్రీలు అనవసర బేషజాలకు పోకుండా ఇంటిభాషను కాపాడుతుంటారని ప్రతీతి. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాను.
Keywords: ప్రాచీనసాహిత్యం, తెలుగుదనం, భాష, సమాజం, సంస్కృతి, పరిశీలన, రామాయణం.
1. ఉపోద్ఘాతం:
భారతీయసంస్కృతికి ధార్మికజీవనవిధానానికి మణిదర్పణంగా ఎన్నదగినది వాల్మీకి రామాయణం. తరతరాలుగా యుగయుగాలుగా ఆదర్శదాంపత్యజీవన నిర్వచనానికి నిదర్శనంగా రామాయణం హైందవభారతంలో నిలదొక్కుకుని ప్రపంచ దేశాలలోకూడా చెరగని ముద్రవేసింది. రామాయణం అంటేనే భారతీయుల ఆత్మగా గుర్తింపునిచ్చింది. ఇంతటి మహత్తరకావ్యాన్ని వాల్మీకి సంస్కృతభాషలో నిర్మిస్తే భారతీయ భాషలన్నింటిలోకి ఇది అనూదితమైంది. తెలుగు సమాజంలో రామాయణాన్ని ఎందరో కవులు అనువాదం చేశారు, ఆశువుగా గానం చేస్తూనే ఉన్నారు. జనజీవితాన్ని ప్రభావితం చేయడంలోకూడా రామాయణానికి మించిన మరో కావ్యంలేదు.
తెలుగులోగిల్లు రామాయణ సౌరభాన్ని నిండుగా నింపుకున్నాయి అందుకే సీతారాములు తెలుగింటి ఆదర్శదంపతులు. నిత్యఆరాధ్యదైవాలు. రామాయణంలోని అరణ్యవాసం తెలుగు ప్రాంతంలోనిది కావడం తెలుగువారి అదృష్టం. ఈ ప్రదేశమంతా రాములవారి పాదస్పర్శతో పునీతమైన పవిత్రభూమిగా ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే తెలుగువారి నివాస గ్రామాలన్నింటా రామాలయాలు, రామమందిరాలు, హనుమంతుని విగ్రహాలతో భక్తిపారవశ్యం చెందుతుంటుంది. శ్రీరామనవమి తెలుగింటి కల్యాణవేదికై సీతారాముల కళ్యాణాలతో శోభాయమానంగా విందు వినోదాలతో అలరారుతుంటుంది. ఇంతగా తెలుగు దనాన్ని నింపుకున్న రామకథ అంటే చెవికోసుకోని ఆంధ్రులు ఉండరు. అందువల్లనే తెలుగువారు అన్ని శతాద్భులలోనూ రామాయణాన్ని రాస్తూనే వస్తున్నారు. అందులో ఒకరు మొల్ల. ఈవిడ తన రచన ద్వారా తెలుగు కుటుంబాన్ని రామాయణానికి అన్వయించినట్లుగా రచించారు అందులోని భాష సమాజం సంస్కృతి తెలుగు దనంతో నిండిఉండడం కన్పిస్తుంది.
2. తెలుగులో తొలి పద్యకవయిత్రి మొల్ల - పరిచయం :
తెలుగు కావ్యక్షేత్రంలో తొలి పద్యకవయిత్రి ఆతుకూరిమొల్ల. శివభక్తుడైన ఆతుకూరు కేస(న)య కూతురని చెప్పుకుంది. కాలసంబంధంగా విమర్శలున్నాయి కానీ మొల్ల శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికురాలు అంటారు. ఈవిడ వూరు, కాలం, కులం విషయంలో సాహిత్య చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. చిన్ననాటినుండి గురులింగజంగమార్చనా పరాయణుడైన తండ్రిని అనుసరిస్తూ కవిత్వ చమత్కారాలను అందిపుచ్చుకుని తన సాహితీక్షేత్రాన్ని రామాయణ పంటపొలంగా మార్చుకుంది.
3. మొల్ల రామాయణం - వైశిష్ట్యం :
“మొల్ల రామాయణము మొల్లపువ్వంత పరిమాణము. మల్లెపువ్వంత పరిమళము” అన్నారు. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు1. నిజంగా ఈ మాటలు మొల్ల రామాయణం చదివిన ప్రతి ఒక్కరికీ అనుభవైక్యవేద్యం. “సుగంధ సంవాసిత పుష్ప నామధారిణి ఐనందుకు మొల్ల సౌరభము వెదజల్లు చక్కని కవిత్వము చెప్పి ఆంధ్రసారస్వతమున శాశ్వతస్థానము సంపాదించినది” అన్నారు ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు.2 ఆతుకూరి మొల్లకు ముందు చాలామంది రామాయణాన్ని రచించినప్పటికీ తను రామాయణకథాకావ్యాన్ని రచించడంవల్ల లక్షణ సంపాద్యం, పుణ్యస్థితి లభిస్తాయి కాబట్టి చెపుతున్నానంటుందొక పద్యంలో-
అది రఘురాము చరితము
నాదరముగ విన్నఁ గ్రొత్తయై లక్షణ సం
పాదమ్మై పుణ్యస్థితి
వేదమ్మై తోఁచకున్న వెఱ్ఱినె చెప్పన్ (మొ.రా. అవతారిక -20)
4. మొల్లరామాయణం- రచనా రీతి :
మొల్ల రామాయణంలోని 869 గద్యపద్యాలలోని భాషాసాహిత్య సౌరభాన్ని ఆఘ్రానిస్తే దేశి పదసంపదకు సంస్కృతపాటవాన్ని మేళవించిన విషయం అర్థమౌతుంది. మొల్ల రామాయణంలో ఆరుకాండలున్నాయి. ఇందులో బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద కాండలను సంక్షిప్తంగానూ సుందర, యుద్ధ కాండలను విపులంగానూ రచించడంలో ఉచితానుచితా ప్రణాళిక వేసుకున్నారు. మొదటి నాలుగు కాండలలో కథను మహావేగంగా నడిపి చివరి రెండుకాండలైన సుందరకాండ యుద్ధకాండలను సమాజగతంగా విషయ నివేదనతో నింపాదిగా కొనసాగించారు. యుద్ధకాండను మూడు ఆశ్వాసాలుగా కూడా వింగడించారు.
5. మొల్లరామాయణం- రచనా వైశిష్ట్యం :
మొల్ల రామాయణం పూర్తిగా మొల్ల చేతులమీదనే రచింపబడడం విశేషం. అలతిఅలతి తెలుగు మాటలమధ్య సంస్కృత పదాలను సమసాలను కూర్చింది. రసస్ఫూర్తితో మృదుమధురంగా చమత్కార భరితంగా తనలోని కవిత్వకాంక్షని రచనలో విద్యమెఱయ, నేర్పుమెఱయ చూపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తేనేసోకిన నోరు ఎంత తీయగా ఉంటుందో అంతే ఆస్వాదన ఉండాలి కవిత్వం వింటే. శబ్దశుభగత్వం మాత్రమే ఉండి అర్థసౌందర్యం లేకుంటే ఆ పదాలతో కవిత్వం రాయడం వృధా అంటుంది మొల్ల. శబ్దంతోపాటుగా అర్థం స్ఫురించినపుడే ఆ రచన రక్తి కట్టి పాఠకలోకంలో నిలుస్తుంది. లేకుంటే మూగవాడు చెవిటివాడు కలసి ముచ్చటించిన రీతిగా ఉంటుందా కవిత్వం అంటుందీ పద్యంలో-
తేనెసోకనోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్ల దోచకుండ
గూఢ శబ్దములును గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటి వారి ముచ్చటగును (మొ.రా. అవతారిక -17)
అని తన రచనలో తెలుగు తేనెలను ఒలికించారు. ఇలా కావ్యమంతటా తెలుగు మాటలకు ప్రాధాన్య మిస్తూ భావం, సందర్భం, ఔచిత్యం కుదరదనుకున్న చోట్లలో మాత్రం తనకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని వినియోగించి పండితుల ప్రశంసకూ పాత్రురాలయింది. ఇలా మొల్లరామాయణంలో మొదటినుండి చివరివరకు ప్రతిచోటా దేశిపద సంపదను కొల్లబోయినంతగా కుమ్మరించి రచించింది.
రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని జనజీవనానికి దగ్గరగా తెచ్చి దేశ్య పదజాలంతో వెన్నెల నిండారబోసినట్లు అక్షరముత్యాలతో పద్యాలకూర్పు చేసి కావ్యానికి సరికొత్త గౌరవాన్ని అద్దింది మొల్ల. ప్రతిఘట్టం ఒక్కొక్క మచ్చుతునకగా మలచిన తీరు ప్రశంసనీయం. మొల్లరామాయణంలోని భాష సమాజం సంస్కృతులలో లభ్యమౌతున్న దేశీయత తెలుగుదనంతో నిండుకుండలా తొణికిసలాడుతుంది. అందువల్లనే మొల్ల రామాయణంలో చిత్రీకరించిన తెలుగింటి భాష, సమాజం, సంస్కృతులను పరిశీలించదలచడం ఈ పత్రం ప్రధాన ఉద్దేశం.
6. మొల్ల రామాయణం - భాష:
మొల్లరామాయణంలోని భాషను పరిశీలిస్తే మనకు మణిప్రవాళం గోచరించదు. దేశిపదాలు, దేశి పదబంధాలు, కందువమాటలు, ప్రతిధ్వనిరూపాలు, తెలుగునుడికారాలు మెండుగా కన్పిస్తాయి. పామర పండిత మెప్పుకోలుకై రచనలో అకడక్కడ తెలుగుమాట ఇమడనిచోట సంస్కృత పదాలను పదబంధాలనూ చొప్పించి రచించిన తీరు కనపడుతుంది. ఇవి విమర్శకులకు విమర్ర్శించడానికి గీటురాళ్లుగా నిలిచాయి. ఒక్కొక్కటి గమనిస్తే అనేకానేక విశేషాలు దొర్లుతాయి.
6.1 మొల్లరామాయణం - దేశిపద సంపద:
మాయావేషంలో వచ్చిన బంగారులేడిని చూచి సీత ఇష్టపడడం దాన్నిపట్టి తెచ్చేందుకు రాముడు ప్రయత్నించే సందర్బాన్ని అలతిఅలతి తెలుగు మాటలతో సీసపద్యంలో చిక్కగా కుదిర్చారు.
“తనుఁ బట్ట నొయ్యన వెనుకొని చనుదెంచు - నిలఱేనితలఁపుఁ దాఁదెలిసి తెలిసి
చేర్వ మెలఁగుచు బూరె మేయుచు డాసి - మెల్లన యంతంత మెలఁగి మెలఁగి
తననీడఁ గనుగొనితానె దిగ్గనదాఁటి - భయమునఁ బరువెత్తి పఱచిపఱచి
యొడరైనఁ బోవక యెడలయించి కనుఁగొన్నఁ - దరువుల నొయ్యన నొరసియొరసి
చెవులు నిక్కించి చూచుచు జెలఁగి చెలఁగి - పోవ రాముండు దవ్వుగాఁ బోయిపోయి
యెలమి మాయామృగంబని యెఱిఁగిమదిని - దీని జంపుదుఁగా కని తెగువఁజేసి”
(మొ.రా.అర.కాం.-31)
ఈ సీసపద్యంలో భయం, మృగం, మదివంటి సంస్కృత భాషాపదాలు తప్పిస్తే మిగిలినవన్నీ తేటతెనుగు మాటలు. అలాగే సుందరకాండలో మధువనంలో విహరిస్తున్న వానరసమూహపు చేష్టలను తెలుపు మరో పద్యంలోకూడా-
కాయలవ్రేటు లాడుచును గంతులు వైచుచుఁ బూవుఁదీవలం
దూయల లూఁగుచున్ దరువు లూఁపుచుఁబండ్లను బొట్టనిండఁగా
మేయుచు వెక్కిరింపుచును మిన్నక దాఁటుచు దోఁకలెత్తుచుం
గూయుచునేలదూఁకుచునుగుంపులుగూడికపీంద్రులెంతయున్ (మొ.రా.సుం.కాం. 234)
ఈ పద్యమంతటా తెలుగు దనాన్ని నింపిన వైనం కనపడుతుంది. ఇలా అడుగడుగునా తెలుగు పదాలప్రోదితో సమకూర్చుకున్న పద్యాలు అనేకం కన్పిస్తుంటాయి. మహామహులైన మేధావివర్గంలోని ఎందరో తెలుగు మాటలతో పద్యం అల్లడం సాధ్యంకాదు అంటుంటారు. కానీ మొల్ల రామాయణంలో అడుగడుగునా తెలుగుమాటల మూటలతో అల్లిన పద్యప్రపంచం అలరారుతుంటుంది.
రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోయినపుడు సీత కానరాక వ్యధతో రాముడు వనమంతా వెతుకులాడుతూ తపిస్తూ తిరుగాడుతుంటాడు. ఆ సందర్భంలో రాముడిని మొల్ల తెలుగు లోగిళ్ల మగనిగా మార్చేసింది. ఈ సందర్భంలోని ఒక పద్యంలో కూరలు, నోరు, రుచి, కూడు, తప్పిన, దుంపలు, దూడులు, కారము, తూచెను, కమ్మని, తేనె, చేదు, అయ్యె, అంత, కంటికి, నిద్ర, పొడ, కానని వంటి తెలుగు మాటల కూర్పుతో పద్యరచన చేశారు మొల్ల.
కూరలునోటికిన్ రుచులు గూడుత దప్పెను, దుంపదూఁడులుం
గారము తోఁచె జిహ్వకును గమ్మని తేనెలు చేఁదులయ్యె గం
గారయెఁ జిత్తమంతయును గంటికి నిద్ర రహింపదయ్యె శృం
గారమొలర్ప సీతఁ బొడఁగానమి రామనృపాల మౌళికిన్ (మొ.రా. కిష్కి.కాం. 25)
సీత సాంగత్యంలేని సమయాన కిష్కిందకు వచ్చిన రామునికి వర్షాకాలం కడచునంతవరకు మీరు ఈ మాల్యవంత పర్వతభాగంలో ఉండండి అని నిర్ణయించి వెళ్లిన వేళ వచ్చిన వర్షాన్ని చూసి రాముడు మనసు అతలాకుతలమై పోతుంది.
బ్రహ్మాండ మగలంగఁ బటబట ధ్వనులతో
నుఱుములంతంతకు నుఱుముచుండ
కడుభయంకరముగ వడమ్రోగు మోఁతలఁ
బిడుగులాడాడ గుభిల్లుమనఁగఁ
గ్రముకంబు లంతేసి కణములతోఁగూడఁ
గరుడు గట్టిన వడగండ్లు రాలఁ
గొరవి దయ్యంబుల వెఱపించు తెఱఁగున
విద్యుత్ప్రకాశమ్ము విస్తరిల్ల
ముసుగువేసిన చందాన మొగులుగప్పి
మీఱి నలుపెక్కి చీఁకట్లు కాఱుకొనఁగ
మించి కడవల నుదకంబు ముంచి తెచ్చి
కుమ్మరించిన గతి వాన గురిసెనపుడు (మొ.రా. కిష్కిం.కాం. 20)
వర్షఋతు వర్ణన సందర్భంలో చెప్పిన ఈ పద్యంలో అలతి అలతి తెనుగు మాటల సందన ఒకటి రెండు సంస్కృత పదాలను జోడించి చేసిన రచన కన్పిస్తుంది.ఈ పద్యంలో కలంగు, పటపట, ఉఱుము, అంతంత, ఉఱుముచుండ, కడు, మ్రోగు, మోత, పిడుగు, ఆడాడ, అంతేసి, కరుడుకట్టిన, వడగండ్లు, రాలు, కొరివి, తెఱగు, ముసుగు, వేయు, మొగులు, కప్పు, మీఱు, నలుపు, ఎక్కు, చీకట్లు, కాఱుకొను, మించు, కడవల, ముంచు, తెచ్చు, కుమ్మరించు, వాన, కురియు వంటి పదాలన్నీ దేశ్య పదాలే. ఇలా దేశ్యపదాలు అనేకానేకం అన్ని పద్యాలలోనూ నిండుగా కన్పిస్తాయి.
భాషలోని పదసంపదను పరిశీలిస్తే తెలుగు మాటలతో అల్లిన పద్యాలమధ్య సంస్కృతం చేర్చినవీ ఎక్కువగా కన్పిస్తాయి. పూర్తిగా సంస్కృత పదాలతోనూ సమాసాలతోనూ అల్లిన ప్రయోగాలు అరుదుగా కన్పిస్తాయి. తేటతెనుగు మాటలతో కూర్చిన పద్యాలే ఎక్కువ.
మొల్లరామయణంలో కన్పించే దేశ్య సంపద ఇంతాఅంతా కాదు. మచ్చుకి నామ క్రియా పదాలనుచూస్తే వాటిలో తెలుగునేల కన్పిస్తుంది. అండ్రు, అంతట, అందఱు, అంపిన, అణచి, అదిమి, అవిసి, అనుపు, అరుగు, ఆజి, ఆడిన, ఆఱడి, ఆలించి, ఆవల, ఇంక, ఇంపు, ఇడికొని, ఇత్తడి, ఇనుము, ఇమ్ము, ఇరువది, ఇల్లు, ఈడ్చు, ఉండ, ఉక్కసిలి, ఉడిపి, ఉడుపము, ఉబ్బు, ఉఱికి, ఉఱుము, ఊటాడి, ఊడగ, ఊలు, ఊరక, ఎగసి, ఎగ్గు, ఎడలి, ఎఱింగి, ఎలమి, ఏండ్లు, ఏగి, ఏగు, ఏటికి, ఏతెంచు, ఏనుగు, ఏఱు, ఏలు, ఒక్కడు, ఒక్కింత, ఒడలు, ఒడ్డాణంబు, ఒడ్డి, ఒనరు, ఒరిగె, ఓటమి, ఓడ, ఓదార్చు, ఓపక, ఓరగ, ఓర్చి, ఔదురు, కంచు, కంటె, కడకు, కడిమ, కదలక, కదళి, కనలి, కనియె, కలిమి, కవ్వము, కీడు, కూరలు, కెంపు, కొండ, కొమ్ములు, కోకలు, కోపము, కోరిక, కోల, కోళ్లు, క్రోతులు, గడ్డ, గతులు, గదిసి, గనుతి, గాలి, గెలుపు, చమురు, చలనం, చెంచెత, చెల్లు, చెల్మి, చేడియ, జంకు, జాడ, టక్కరి, టెక్కెము, డగ్గఱి, డోలు, తక్క, తగిలి, తనుక, తన్ను, తప్పెటలు, తమ్ములు, తరువు, తలపు, తవిలి, తఱిమె, తుమురు, తేనె, త్రోవ, దరువు, దవ్వున, దున్ను, నడుమ, నలుపు, నల్వురు, నవ్వు, నీలము, నీళ్లు, నెత్తురు, నేడు, పగలు, పటుతర, పట్టము, పట్టు, పడమర, పని, పనిచిన, పన్నుగ, పలికెను, పాలు, పెఱుకు, పేర్పు, పోరు, బయలు, బంతి, బయలు, బిట్టు, బెట్టు, బొబ్బలు, మిక్కిలి, మిమ్ము, మువ్వురు, మేడలు, రాయి, వంట, వెండి, ఇలా ఎన్నెన్నో తట్టెడు బుట్టడు బొట్టడు దేశ్యపదాలు.
6.2 మొల్ల రామాయణం - దేశి పదబంధాలు :
పదాలేకాదు దేశ్యపదబంధాలుకూడా కొల్లలుగా కన్పిస్తాయి మచ్చుకి కొన్ని. అంటుదాన, అంతమీద, అందిచూడు, అడియాస, అరుగుదెంచి, ఆటకూటములు, ఆనవాలు, ఎడబాసి, ఎల్లకాలము, ఉబుసుపోక, ఒడుపుదప్పు, కట్టుకొంగు, కట్టుచీరె, కడికండలు, కనుఱెప్పలు, కరువలికొడుకు, కారుమొగులు, కాలగండం, కాల్బలము, కావేరిగుఱ్ఱం, కొంచుబోవు, కొంచువచ్చి, గాడుపుపట్టి, చిందరవందర, చిత్రకూటము, చుట్టిపట్టు, చూపుదళము, చెండాడు, చెఱసాల, జాఱవిడుచు, తగవేళ, తక్కుసేసి, తడకాళ్ళు, తమలావు, తలపూవు, తుచ్చపుపలుకులు, తూలదన్ని, తూలనాడు, తూలగొట్టు, తెగవేయు, తేటిగుంపు, తేలిపోవు, దుంపదూడులు, నిల్వద్రొక్కు, నెఱపూత, నేలకూలు, పండువెన్నెల, పదిపదులు, పలుపోకలు, పసదనంబులు, పసిడిఉండ, పసిపాప, పాలవెల్లి, పినతండ్రి, పిన్నపాపలు, పిల్లగ్రోళ్ళు, పూదేనెలు, పెచ్చుపెరుగు, పెద్దపిన్న, పెనుమంటలు, పెనుబొబ్బలు, పైటకొంగు, పొదరిండ్లు, పొరిపుచ్చక, పొలుపుమీరు, బంగారుకుండ, మడియగొట్టి, మఱునాడు, మిడివోవు, ముదితాపసి, మేటిపొద, మేలమాడు, మొలకనవ్వు, యిరుప్రక్కలు, వడగండ్లు, వడిగాలి, వడిద్రిప్పి, వలరాయుడు, విఱ్ఱవీగు, విలుకాండ్రు, వెళ్లబాఱు, వేగురుచుక్క, వేడుకముక్కలు, వేలేండ్రు, సవతిపోరు ఇలా మరెన్నో పదబంధాలు పద్యాలమాటున అడుగడుగునా కన్పిస్తుంటాయి.
7. మొల్లరామాయణం- కందువమాటలు/సన్నివేశ చమత్కృతులు :
మొల్లరామయణంలో అడుగడుగునా కందువమాటల ప్రయోగాలు కన్పిస్తుంటాయి. కందువ మాటలంటే సంభాషణలోగానీ, రచనలోగానీ వాక్యవిశేషణాలుగా, ఆశ్చర్యార్థకాలుగా, సన్నివేశ చమత్కృతులుగా, ఉపవాక్యాలుగా వినియోగిస్తుంటాం. వీటికి సందర్భోచితంగా ప్రత్యేకమైన అర్థం స్ఫురింపజేసుకోవాలి. ఇలాంటి మాటలు తెలుగు సమాజంలో మాటలమధ్య విపరీతంగా వాడుతుంటారు. ఈ రకమైన ప్రయోగాలను మొల్ల తన రచనలో ప్రయోగించి తెలుగింట రామప్రసన్నం చేయించిందని చెప్పవచ్చు.
కందువమాటలు, సామెత
లందముగాగూర్చి చెప్పునది తెలుగునకున్
బొందై, రుచియై, వీనుల
విందై, మఱికానుపించు విబుధుల మదికిన్ (మొ.రా.అవతారికా-18)
కందువమాటలంటే జీవద్భాషలోని సన్నివేశ చమత్కృతి ప్రయోగాలు. మొల్లరామయణంలో మొల్ల వినియోగించిన కందువమాటలు ఉదా: అల్లముబెల్లము, ఉబుసుపోకకు, ఈతిబాధలు, కనియును వినియును నెఱుగము, కుయ్యోమొఱ్ఱో, చిన్నంబోవుచు, నాకేమిదారి, పలపలనై తెల్లవాఱె, పేదనరుని పెద్దచేసి, పోరానిపోకలు, ప్రోద్దు పొడవక మునుపే, బాధలు విఱగడయ్యె, ముద్దుకొడుకుకుఱ్ఱ, మేలువార్త, మ్రింగబుట్టిన దెయ్యమో, విల్లా ఇది కొండా!, సందులగొందుల,..... ఇలాంటివి అనేకం ఎడనెడ కన్పిస్తాయి.
8. మొల్లరామాయణం - ప్రతిధ్వనిరూపాలు :
ప్రతిధ్వనిరూపాల ప్రయోగంలోకూడా మొల్ల తన చతురతని ప్రదర్శించింది. తెలుగు భాషా వినియోగంలో నిందార్థప్రయోగాల్లో అక్కసుతో అపహాస్యధోరణిలో “గి గీ”ల ప్రయోగం చేస్తారు. తెలుగు భాషకు ఒక సొబగును అందించిందీ ప్రయోగం. "నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వదీర్ఘంబులకు గిగీ లగు”3 రాముడు గీముడు, రామున్ గీమున్, అని రామునిపై గిగీలను రచిస్తూ, ఎక్కడో అక్కడక్కడ కాదు అన్ని ఒక్కచోటే అన్నట్లుగా పూర్తిగా గిగీలను వాడి తన రచనలోని శైలీవైశిష్ట్యాన్ని తెలియజేసింది. ఇందులో అంతకున్ గింతకున్, గాడ్పు గీడ్పు, దైత్యున్ గీత్యున్, రుద్రుడు గిద్రుడు, వల్లభుడు గిల్లభుడు, వహ్నిగిహ్ని, హరి గిరి, అని ఒక్క పద్యంలో రెండుపాదలల్లోనే ఏడు ప్రయోగాలు చూపించి పద్యాన్ని రక్తికట్టించారు. ఉదా:
హరిగిరి వహ్నిగిహ్ని బ్రళయాంతకుఁగింతకు, దైత్యుగీత్యువా
ర్వరుగిరు, గాడ్పుగీడ్పు, ధనవల్లభు గిల్లభు రుద్రుగిద్రుసం
గరమున నోర్చినట్టి దశకంధర! నీకు జయింపవచ్చునే
సురనగధీరు నుగ్ర రణశూరుఁ బయోధి గభీరురాఘవున్. (మొ.రా.యు.కాం. 3ఆ. 77)
ఇలాంటి ప్రయోగాలు కావ్యమంతటా సందర్భోచితంగా మిక్కుటంగా వినియోగించారు.
9. మొల్లరామాయణం – నుడికారాలు :
మాటకుమాట నుడికార ప్రయోగంతో పద్యాలను అల్లిన దిట్టతనంకూడా మొల్లరామాయణంలో కన్పిస్తుంది. జనవాసుల అనుభవసారాలైన పలుకుబడులను లెక్కకుమిక్కిలిగా పద్యాలమాటున బంధించారు. ఈ మాటలు కవిత్వానికి శోభ చేకూర్చడమేకాకుండా ఈ కావ్యం ప్రజాదరణ పొంది మొల్లను అక్కునచేర్చుకోడానికి కారణమయింది.
ఆఱడితెచ్చుట, ఉక్కణచడం, ఓపలేకపోవు, కంటికి నిద్రలేకపోవుట, కడతేఱు, కన్నుగీటడం, కాలుదువ్వుట, కాఱులాడడం, కూడునోటికిపోయెను, కోళ్లుకూయువేళ, గీటు అడంగుట, చిన్నబోవడం, చెవినిల్లుగట్టి పోరడం, తలక్రిందులజేయుట, తీఱిపోవు, దిక్కులేమితనం, నేలగూలు, పంచదారలపోల్కి, పగులందన్నిన, పీచమణచటం, పెట్టనికోట, పోరానిపోకలపోవుట, బుజంబుబుజంబు ద్రోపులాడుట, బొరిపుచ్చడం, మాఱాడనోడదం, మూగచెవిటివారిముచ్చట, యమునిపట్నం, లావుచాలదు, వినగరాని పల్కులు, వేగురుచుక్కబొడుచుట, సందులగొందుల దూఱిపారుట, సందులబట్టిపోవుట, ఇలా ఎన్నెన్నో మొల్ల రచనలో దొర్లుతుంటాయి.
పూర్వకవుల కావ్యపఠనంవల్ల నయితేనేమి, తన్నుతాను కావ్యప్రపంచంలో నిలదొక్కుకునేలా చేసుకునేందుకైతేనేమి మొల్ల నాటి సమాజంలోని కవులకు మించి తెలుగుదనాన్ని కడుపార నింపుకుని సంస్కృత పదాలను అవసరానికి మాత్రమే ప్రయోగించింది అని చెప్పవచ్చు. అతి సామాన్యమనుకునే అంశాలకు కావ్యగౌరవం కల్పించడమే కాకుండగా సమాజంలో సామాన్య జనవ్యవహారంలోని పదాలకున్న సౌందర్యాన్ని దర్శించి కవిత్వానికి వన్నె తేగలవీ పదాలని ఎంచి వాటిని మిన్నగా భావించడం మొల్లలోని భాషాసౌష్టవ పరిరక్షణకు నిదర్శనం.
10. మొల్ల రామాయణం- తెలుగు సమాజం :
మొల్ల రామాయణంలోని సమాజచిత్రణ చాలావరకు తెలుగు లోగిళ్లలోని సమాజస్థితిని తెలివిడి చేస్తుంది. స్త్రీలకు సంబంధించిన కుటుంబవిజ్ఞానాన్ని మిక్కుటంగా చొప్పించింది రామాయణంలో. రామాయణ కథాగమనమే కుటుంబ సంబంధమైంది. కానీ మొల్లరామాయణాన్ని తెలుగు కుటుంబ సౌరభంతో దిద్దితీర్చింది. వాల్మీకి రామాయణంలో చెప్పని విషయాలు మార్చిన విషయాలు అనేకం ఉన్నాయి. అవి చాలావరకు తెలుగు సమాజానికి దగ్గరగా ఉన్నాయి. అందుకే మొల్లని ఆదరణీయులు అక్కున చేర్చుకున్నారే కాని కాదనలేకపోయారు. వాటివల్ల ఔచిత్య పరిపోషణకు భంగంవాటిల్లలేదు. కావ్యానికి అవి మెరుగులై తోడ్పడ్డాయి అని విమర్శకులే అంగీకరించారు.
భూమిపై ఋతుక్రమాన్ని అనుసరించి ముక్కారు పంటలనూ పండించడంలోనూ, పశుసంపదను పెంచుకుంటూ పాడిని పెంపొందించుకోవటంలోను సాకేతపుర ప్రజలు చూపుతున్న ఉత్సుకతను చక్కటి కవిత్వంలో బంధించి వర్ణించింది. సాకేతపురంలోని కాపుల జీవనాన్ని సామాన్య జనజీవనంలోని కాపుజీవనంతో ముడిపెట్టి రచించింది.
పంటల భాగ్యోదయులై
పంటలపైఁ బంటలమర బ్రతుకుదురెపుడున్
బంటలుఁ బాడియుఁ గలయా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్ మొ.రా.బాల.కాం.-13
రాజ్యంమంతా సుభిక్షంగా ఉన్న తరుణంలో తనలో అనునిత్యం పెరుగుతున్న బెంగ వంశాభివృద్ధికై పుత్రసంతానం లేని బాధను దిగమింగుకోలేక వసిష్ఠుని పిలిచి సంతానలబ్ధికై ఏం చేయాలో చెప్పమని అడగగా వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం చేయవచ్చని చెప్పగా దాన్ని నిర్వహించి యాగఫలితంగా వచ్చిన పాయసాన్ని రెండుభాగాలుచేసి పెద్దభార్యలైన కౌసల్యకు, కైకేయికి ఇస్తాడు. కౌసల్య, కైక తమకు దక్కిన పాయసంలోనించి చెరిసగం తీసి ఇద్దరూ సుమిత్రకు ఇచ్చినట్లు మార్చారు. తెలుగు కుటుంబాలలో తోటికోడళ్లమధ్య, సవతులమధ్య పొరపొచ్చాలు సహజమేకానీ అన్యోన్యతా ఉంటుందనటానికిది నిదర్శనం.
పాయసమ్ములు రెండు భాగముల్ గావించి
యగ్ర సతుల కీయ నందులోన
సగము సగము దీసి ముగుద సుమిత్రకు
నొసఁగి రంత నామె మెసవెఁ బ్రీతి (మొ.రా. బాల.కాం.-40)
వాల్మీకి రామాయణంలో లేకపోయినా తెలుగు కుటుంబంలోని జనజీవనవిధానాన్ని పద్యంలో ఇమిడ్చి మొల్ల తెలుగుదనం నింపారు.
అలాగే మరో సందర్భంలో గర్భవతులైన రాణుల అవస్థను వర్ణించే సందర్భంలో గర్భవతులైన స్త్రీలలో కలిగే శారీరక మార్పులను, రుచులపై కలిగే కోరికలను తెలుగువారి లోగిళ్లలో స్త్రీలు మాట్లాడుకునే విషయాలను మొల్ల తమ పద్యాలలో అందంగా కూర్చారు.
దవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
దెలుపెక్కి కన్నులు తేటలయ్యె
నీలకుంతల లని నెగడిన యామాట
నిలుపంగ నెఱులపై నలుపు సూపె
గురుకుచలనుమాట సరవి భాషింపంగఁ
దోరమై కుచముల నీరువట్టె
మంజుభాషిణులనుమాట దప్పకయుండ
మెలఁతల పలుకులు మృధువులయ్యె
గామినులటంట నిక్కమై కాంతలందు
మీఱి మేలైన రుచులపైఁ గోరికయ్యె
సవతిపోరనఁ దమలోన సారెసారె
కోకిలింతలు బెట్టు చిట్టుములుఁబుట్టె (మొ.రా. బాల.కాం.-42)
అనుపద్యం దాని తర్వాతి పద్యంకూడా గర్భస్థ స్త్రీల అవస్థను తెలుపుతుంది.
రాముని జననం విద్యాభ్యాసం తర్వాత విశ్వామిత్రుడు దశరథుని చేరి మునిజనులకు తపోభంగం కలుగజేస్తున్న రాక్షసులను సంహరించేందుకు రాముని తనతో పంపమని కోరుతాడు. సాధారణ కుటుంబాలలోని తండ్రిలాగే కాదుకూడదంటారు. పసివాడు అంటాడు. ఇప్పుడేకదా చదువుకుంటున్నాడు అప్పుడే రాక్షస సంహారమా అంటాడు. అపుడు రాజర్షి వశిష్టులవారు దశరథుని సముదాయించి రాముని పంపిస్తాడు.
ఘోరకాంతార మధ్యములో భీకరాకారంతో, అట్టహాసవికారాలతో ఉన్న రాక్షస స్త్రీయైన తాటకిని చంపమని చూపిస్తాడు కౌశిక మహర్షి.
తాటక వచ్చిన దదిగో
నాటగ నాఁడుదని మేలమాడక నీ వీ
పాటి పడనేయు మని తన
చాటున భయపడెడి రామచంద్రున కనియెన్ (మొ.రా.బాల.కాం.-52)
అపుడు రాముడు మనసులో స్త్రీని చంపటానికా తన చాపమున్నది. ఇది తెలిసి వీరులైనవారు ఆడిపోసుకోరా! నవ్వరా! ఇంతకన్నా అవమానం మరోటి ఉండదు అనుకుంటాడు. ఇక్కడ రాముడు ఒక సాదాసీదా మనిషిలాగానే ఆలోచించాడు తప్ప కారణజన్ముడుగా భావించలేదు.
ఈయాఁడుదానిఁ జంపఁగ
నాయమ్మున కేమి గొప్ప! నగరే వీరుల్
చీ యని రోయుచు నమ్ముని
నాయకుభయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్ (మొ.రా. బాల.కాం.-54.)
అది విన్న రాముడు మన తెలుగు ఇండ్లలోని పురుషులు స్త్రీలతో తగవుకి పోవడాన్ని ఇచ్చగించరు. మొల్ల రామాయణంలోకూడా రాముడు తాటకి విషయంలో మనస్సులో తెలుగింటి మగవారిలాగే తర్కించుకున్నాడు.
సీతాదేవిని చెరపట్టి లంకలో అశోకవనంలో శింశుపావృక్షంకింద ఉంచి రావణుడు అపుడపుడు వచ్చి రాముని హేళనచేస్తూ, అతని కీర్తిని మంటకలుపుతూ, అతని శౌర్యాన్ని కించపరుస్తూ, అశక్తుడని, లంకలో ప్రవేశించలేడని తన్ను వరించమని సకల భోగభాగ్యములు అందుకోవచ్చని ఆశపెడుతూ తనగొప్పలు తానే చెప్పుకుంటూ నోరు పారేసుకుంటున్న నీచ గుణ రావణుని ఇలా అంటుంది.
తన సాహసంబు తానే
కొనియాడు నతండు హీనగుణుఁడని వినుచున్
నిననీవ పొగడుకొంటివి
వినఁగూడదు నీదు నీతి విరహిత భాషల్ ( మొ.రా.సు.కాం-62)
రావణాసురుడి చెరలో ఉన్నప్పటికీ వెరవని ధైర్యంతో రావణుని ’నీవెంత హీనుడివో, నీ మాటల్లో తెలుస్తుంది. తనగొప్పతనాన్ని ఇతరులద్వారా వినాలికానీ తనకుతానే గొప్ప అనుకునే నీవు నాకు ఈ గడ్డి పోచతో సమానం’ అని నిరసించి పక్కనున్న పచ్చికలోనుంచి ఒక గడ్డిపోచను చూపి పక్కకువేస్తుంది. ఇక్కడకూడా మొల్ల ధైర్యవంతులైన స్త్రీలు జంకుబొంకులేకుండా పరపురుషులను పరుషవాక్యాలతో త్రోసిరాజే తెలుగుజాతి వీరనారీ తత్వాన్ని సీతలో చూపింది.
అలాగే సీతదేవి హనుమంతునితో సందేశం పంపుతూ “ఇపుడు నీవు చూశావే రావణాసురుడు కపట వేషం వేసుకొని కపట బుద్ధితో వాగిన కాఱుమాటలనుకూడా విన్నవి విన్నట్లు రామునికి తెలియజేయి. నామీద దయపుట్టేలా” అని మొల్ల ప్రయోగించిన సందర్భం సీతాదేవిని తెలుగింటి ఆడబిడ్డగా భావించిన తీరు సహజ సంభాషణా చాతుర్యానికి నిదర్శనంగా కన్పిస్తుంది.
ఇపుడు రావణుఁడేతెంచి కపటబుద్ధి
గర్వమునఁజేసి నన్నెన్ని కాఱులాడె
నన్నియును నీవు చెవులారవిన్న తెఱఁగు
పతికి దయపుట్టఁగా విన్నపంబు సేయు (మొ.రా.సుం.కాం-112)
ఇక్కడ దయపుట్టగ అనే మాట మొల్లవాడడంలో తెలుగుజాతి నీతినియమావళిని, సమాజ ధర్మనిరతిని రామాయణానికి అద్ది సహజ జీవన శైలితో రచించింది.
త్రిజట స్వప్న వృత్తాంతాన్ని మొల్ల ఎంతో చక్కగా తెలుగువారి జనజీవనానికి దగ్గరగా తీసుకొచ్చి సమాజస్థితిలో భాగం చేసింది. త్రిజట కలగన్నది. కలను తన జాతిజనంతో పంచుకుంది. అంతటితో గమ్ముగ ఉందా? లేదు. మరోమాట చేర్చింది. మనదేశమే సముద్రంలో మునిగిపోతుంది. మనకు దిక్కు ఈ సీతాదేవియే, మనం ఇకమీద సీతాదేవిని ఏమీ అనకూడదు. జాగ్రత్తగా కాపాడాలి అని హితవు చెపుతుంది. అంతటితో ఊర్కోక సీతాదేవిని ఇలా వేడుకొంటుంది.
అమ్మా వెఱవకు మదిలో
నిమ్ముగ మఱి వేడ్కనుండుమికఁ, నీ మగఁడున్
నెమ్మిగ నినుఁగొని పోవును
మమ్మందఱ మనుపుమమ్మ! మఱువక కరుణన్ (మొ.రా.సుం.కాం. 89)
నిరాశాసముద్రంలో మునిగి ఉన్న సీతదగ్గరకు త్రిజట వచ్చి చెప్పిన తీరు చాలా సహజంగా తెలుగువారి ఓదార్పు విధానానికి దగ్గరగా ఉండడమే కాకుండా రాక్షసస్త్రీల అవసరం తీర్చవలసిన బాధ్యతను మోపిన తీరును కూడా కుదురుగా ఏకవాక్యంలో పొందుపరిచారు.
11. మొల్లరామాయణం-తెలుగు సంస్కృతి :
11.1 జనన సంస్కారాలు :
పుత్రకామేష్ఠియాగ ఫలితంగా దశరథ మహారాజుగారి ముగ్గురు భార్యల్కకు కలిగిన నలుగురు బిడ్డలకు పురుటిరోజుల్లో ఎలాంటి అరిష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పదకొండవరోజున పురుడు కార్యక్రమం నిర్వహించి పిల్లలకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని నామకరణం చేశారు. కొంత పెద్దయ్యాక ఉపనయనాదులు ముగించారు. విద్యాభ్యాస పూజలుచేసి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించారు. విద్యాప్రవీణులుగా దిద్దితీర్చినారు. ఈ విషయాలనంతటినీ తీరుతీరుగా ఒక చిన్న వచనంలో విరచించారు మొల్ల.
11.2 వివాహం - స్వయంవరం చాటింపు :
జనకమహారాజు సీతాదేవికి వివాహంచేయాలని నిశ్చయించుకుని చాటింపుచేసి భూవరులను రప్పించి అందరూ వినేట్లు శివధనుస్సును ఎక్కుపెట్టిన వానికి నా బిడ్డ నిత్తునని ప్రకటన చేశారు.
ధరణీసుత యగుసీతకుఁ
బరిణయ మొనరింప జనక పార్థివుఁడిల భూ
వరసుతుల రండని స్వయం
వర మొగిఁజాటించె నెల్లవారలు వినఁగన్ మొ.రా.బాల.కాం.-60
11.3 ధనువు నెక్కుపట్టిన ధీరునకు సీతనిత్తునని జనకుని ప్రకటన - స్వయంవరానికి వెచ్చచేసిన రాజులు :
ఈ స్వయం వరానికై ద్రవిడ, కర్ణాటక , ఆంధ్ర, యవన, మహారాష్ట్ర, పాండ్య, ఘూర్జర, అలాట, బర్బర, మళయాల, గౌళ, కేరళ, సింధూ, కాశీ, కోసల, సాళ్వ, మగథ, మత్స, కళింగ, మాళవ, నేపాళ, ఉత్కల, కొంకణ, మద్ర, పౌండ్ర, వత్స, గాంధార, సౌరాష్ట్ర, వంగ, చోళ రాజ్యాలనుండి రాజకుమారులు, భూపనందనులు, ధరణీశపుత్రులు, నృపతనూభవులు, రాజసుతులు ఎందరెందరో వచ్చియున్నారు. జనకుని ప్రకటన విన్న విశ్వామిత్రుడుకూడా మిథిలానగరంలో స్వయంవరం జరిగే ప్రాంగణానికి రామలక్ష్మణులను తీసుకువెళతాడు.
11.4 శివధనుస్సుని తెచ్చిపెట్టు కార్యక్రమం :
గురుభుజశక్తి కల్గిన పదికోట్లమందితో హరుని విల్లుని తెచ్చి సభామధ్యమున బెట్టి పూజలు నిర్వహించారు.
11.5 స్వయంవరానికి వచ్చిన వారి మనోభావాలు :
రాజులు దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేస్తూ చాలామంది ఉండిపోయారు.
విల్లా యిదికొండా యని
తల్లడపడి సంశయంబుతలకొన మదిలో
బల్లిదులగు నృపనందను
లెల్లరు దౌదవుల నుండి రెంతయు బీతిన్ మొ.రా.బాల.కాం.73
11.6 స్వయంవరం నిర్వహణ :
కొంతమంది విల్లుని లేపలేక ఓడిపోయారు. మరికొందరు విల్లు ఎక్కుపెట్ట సాధ్యంకాక ఓడిపోయారు. కొందరు వల్లగాదని దూరందూరం ఉండిపోయారు. కొందరు మనకు వద్దులే అని వెనుతిరిగారు, రామునివంతు రాగానే తనవారినందరినీ మనస్కరించుకుని, గురువులకు నమస్కరించుకుని విల్లు ఎక్కుపట్టి వదలగా విల్లువిరిగి పడుతుంది.
ఇనవంశోద్భవుఁడైన రాఘవుఁడు భూమీశాత్మజుల్ వేడ్కతో
డను వీక్షింప మునీశ్వరుం డలరఁ గోదండంబు చేనంది చి
వ్వున మోపెట్టి గుణంబు పట్టి పటు బాహాశక్తితోఁ దీసినన్
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్ మొ.రా. బాలకాం. 106
రాముని సత్వసంపదకు మెచ్చి జనకుడు ఆనందించాడు. సీతాదేవికి మేను పొంగినది. అంటూ జనకుడు పెండ్లి ఏర్పాట్లకు సన్నద్ధమయ్యేరీతిని వర్ణించినది మొల్ల.
11.7 శుభ సందర్భాన్ని శుభలేఖగా పంపటం :
ఇందులో రాముడుశివధనుర్భంగం చేయగానే జనకమహారాజు సంతోషాతిశయంతో దశరథునికి శుభలేఖలు వ్రాయించి పంపారు.
11.8 పారవశ్యంతో దశరథులవారు పరివారంతో వేంచేయటం :
శుభలేఖను అండుకున్న దశరథుడు సంతోషంతో వశిష్టాది మునిజనులను, అరుంధతీ దేవివంటి మునిపత్నులను అంతఃపురంలోని రాణులను, సకలబంధువులను తీసుకుని తన పుత్రద్వయ సహితంబుగా కనక రథమ్ములపై తోడ్కొని మిథిలానగరానికి మేళతాళాలతో చెరుకున్నారు.
11.9 మగపెండ్లివారికి ఎదుర్కోలు:
మిథిలానగరం చేరిన మగపెండ్లివారిని జనకుడు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించి కాళ్లుకడిగి పూజించి కానుకలు సమర్పించారు. విడిది ఏర్పరిచారు.
11.10 వివాహం జరిపించడం :
ముహూర్తం ఆసన్నమవుతుందని వశిష్టులవారు గుర్తుచేయ కల్యాణవేదికవద్దకు వచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానములు చేయించి నిర్మలాంబరములు ఇచ్చి వేరువేరు వేదికలపై రామునకు తన కూతురైన సీతతోనూ, తన తమ్ముని బిడ్డలైన మాండవి, ఊర్మిళ, శ్రుతకీర్తిలను భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించారు జనకమహారాజు.
11.11 చదివింపులు :
నలుగురు అమ్మాయిలకూ నూఱేసి భద్రగజమ్ములను, వేయేసి తురంగములను, బదివేల దాసీజనమ్ములను, లక్షధేనువులను అరణంగా ఇచ్చారు.
11.12 మగపెండ్లివారికి ఇచ్చిన కానుకలు :
మగపెండ్లివారికి బహుమానంబుగా నవరత్నఖచిత భూషణమ్ములు, చీనిచీనాంబరంబులు, సుగంధి ద్రవ్యమ్ములు ఇచ్చి పూజించి అయోధ్యకు పంపారు.
ఇలా పెండ్లి తంతునంతటినీ అని చాలా సంక్షిప్తంగా పెండ్లి కార్యక్రమాన్నంతటినీ అలతిఅలతి మాటలతో క్లుప్తీకరించి సుదీర్ఘంగా ఒక వచనంలో ముగించారు.
12. ముగింపు:
ఇలా రామకథను ఆమూలాగ్రం తెలుగువారి జీవన సంస్కృతీ చిహ్నంగా మలచడంలో మొల్ల చూపిన నేర్పును అభినందించని విమర్శకులు పరిశీలకులు లేరు. అందువల్లనే మొల్లరామాయణం తెలుగువారికి రసజ్ఞ మనోజ్ఞంగా నచ్చింది. "అదభ్రశుభ్ర రుచితో నాచంద్రార్కము తులలేని మానికమైన జీవత్కావ్యరత్నమును సారస్వతమునకు అమూల్యాభరణముగా ప్రసాదించిన మొల్ల యనల్ప ధిషణా విభవము నభినందింతము" అన్న ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మాటలు మొల్ల రచనాశిల్పానికి ఆణిముత్యాల పేర్పుగా సమర్పణం4.
ఇలా మనం ప్రతికావ్యంలోని భాషను సమాజాన్ని సంస్కృతిని వెతుక్కొని మన ఇంటి భాష, మనదైన సమాజం, మన ఇండ్లల్లో, మనం మెలిగిన ప్రాంతంలో పాటించే సంస్కృతి ఎక్కడన్నా కానరాగలవేమోనని వెతుకులాడుకోవాలి. అపుడే మన ప్రాచీనసాహిత్యంలో మనదైన జీవన వైశిష్ట్యం మనకు అర్థం అవుతుంది. నాటినుండి నేటివరకు వెయ్యేండ్లు దాటిన తెలుగు సాహిత్యంలో మనవైన ముద్రలను పట్టుకొన సాధ్యమౌతుందేమో చూడాలి. అందుకు ప్రాచీన సాహిత్యంలోని భాషను సమాజాన్ని సంస్కృతిని ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయవలసి ఉంది. ఉపరితల దృక్పథంతో కాకుండా నిశిత పరిశీలనలతో సూక్ష్మ అంశాలను పరిశీలించి అధ్యయనం చేయవలసి ఉంది.
ఆ కోణంతోటే మొల్లరామాయణాన్ని పరిశీలించడం జరిగింది. ఇంపైన తెలుగు భాషను ప్రాచీనతను అందించే తెలుగుసమాజాన్ని, నాటినుండి నేటివరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెరగని సంస్కృతిని ముప్పేటగా నింపుకుని మొల్ల రామాయణం తెలుగువారికి దొడ్డకావ్యంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి ఉండదు.
13. పాదసూచికలు:
- తెలుగుసాహిత్యచరిత్ర-2 వ భాగం:1992 పుట. -352.
- మొల్లసాహితీ సౌరభం:2015. పుట.143.
- చిన్నయసూరి బాలవ్యాకరణము , ప్రకీర్ణక పరిచ్ఛేదము-సూత్రం సంఖ్య -22)
- ఆంధ్ర కవయిత్రులు:1980 -పుట. సం. 25
14. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణకుమారి నాయని : 1979, పరిశోధన, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు.
- దొరస్వామిశర్మ రావురి : 1972, తెలుగు సాహిత్యము-రామకథ, త్రివేణీ పబ్లిషర్స్, మద్రాసు.
- మలయవాసిని కోలవెన్ను : 2015, మొల్ల సాహితీ సౌరభం, శ్రీ ప్రభాసాంబ సాహితీ పీఠం,
విశాఖపట్టణం. - మొల్ల ఆతుకూరి : 1987, మొల్ల రామాయణము, బాల సరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
- లక్ష్మీకాన్తమ్మ ఊటుకూరి : 1980, ఆంధ్ర కవయిత్రులు(రెం.సం) స్వీయ ప్రచురణ, బాపట్ల.
- శేషగిరిరావు ఆండ్ర : 1995, ఆంధ్ర విదుషీమణులు, స్వీయ ప్రచురణ, విశాఖ పట్టణం
- Reddy G.N., 1988, Lectures on Telugu Studies, Satyasri publications,
Tirupati.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.