headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. విశ్వనాథ వారి 'శివార్పణము' కావ్యం: అనిదంపూర్వభావదర్శనం

డా. ముళ్ళపూడి జయసీతారామశాస్త్రి

విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు,
శ్రీశంకర సంస్కృత కళాశాల,
రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440171622, Email: jaya.narayana2000@gmail.com
Download PDF


('శ్రీ విశ్వనాథ సత్యనారయణ స్మారకసమితి', హైదరాబాద్ - శ్రీ. పి.వి. నరసింహారావుగారి ఆధ్యక్ష్యంలో 1982లో ముద్రించిన విశిష్టగ్రంథం "విశ్వనాథశారద - (ప్రథమభాగము)" ఈ గ్రంథరాజంలోని ఈ అపురూప వ్యాసాన్ని తగిన మార్పులతో గౌరవపురస్సరంగా ముద్రించుకోడానికి అనుమతిచ్చిన వ్యాసరచయిత, సంస్కృతాంధ్రపండితశిరోమణి డా. ముళ్ళపూడి జయసీతారామశాస్త్రిగారికి 'ఔచిత్యమ్' పత్రిక తరపున ధన్యవాదాలు. - సంపాదకులు)

వ్యాససంగ్రహం:

కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో ఎన్నో పేరుపొందున కావ్యారాజాలున్నాయి. వాటి అన్నింటిలో అత్యంత ప్రసిద్ధిని గాంచిన కావ్యము "శివార్పణము". చారిత్రక ఇతివృత్తాలతో భారతీయతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ మహాకవి లేఖినీసాగరంలో ఉదయించిన ఆణిముత్యం ఈ కావ్యం. ఇందులో అపూర్వమైన వర్ణనలు కొలువుతీరేయి. విశ్వనాథవారి రచనావైదగ్ధ్యాన్ని పట్టిచూపే ఆధ్యాత్మిక, జాతీయత, చమత్కార, హాస్యప్రియత్వాలు, అనిదంపూర్వభావపరంపర మొదలైన అంశాలను శివార్పణకావ్యము ఆధారముగా వెలికితీసి సోదాహరణంగా ప్రకటించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. ఇందుకు బలాన్ని చేకూర్చే వివిధ శ్లోక, పద్య, సూక్తి సామగ్రిని ఆయా ఉపయుక్త గ్రంథాలనుండి ఉటంకించడమైనది. చారిత్రకసత్యాలను, భారతీయసమాజవాస్తవికకోణాలను వర్ణనాత్మకంగా ఆవిష్కరించడంలో విశ్వనాథ శివార్పణ కావ్య ప్రాముఖ్యాన్ని ఈ వ్యాసం మూర్తీభవింపజేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. అద్యతన పరిశోధక, విమర్శక, పాఠక వర్గానికి విశ్వనాథ వారి శైలిని అంచనా వెయ్యడంలో ఈ వ్యాసమొక కరదీపికగా భాసించగలదు.

Keywords: విశ్వనాథ, ఆధ్యాత్మికత, జాతీయత, చమత్కారం, అనిదంపూర్వభావనలు, చరిత్ర, శివాజీ.

1. ఉపోద్ఘాతం:

ఒక సూర్యుడు సమస్తజీవులకు తానొక్కొక్కడై తోచును. కొందరకు పరిశుద్ధ కాంతి ప్రదాతగా, మరికొందరకు రసగ్రాహకుని గాను రసప్రదాతగను, ఇంకొకరికి రాజపోషకునిగా, అన్యునకు దుర్నిరీక్ష్య తేజోరాళిగా, కశ్చిత్తునకు జాపకరునిగా చూపట్టును. "యాదృశీ భావనా యత్ర సిద్ధిః భవతి తాదృశీ" (స్కందపురాణం, అధ్యా. 227, శ్లో.39) అని మన చూపులతీరు తెన్నులను బట్టి ఎదుటి వ్యక్తుల వస్తువులు గుణములు మారుచుండును. మన కందరకును స్వచ్ఛముగా వివిధ వర్ణ విసర సంధరితమై కాన్పించు ప్రపంచము నేత్ర వ్యాధి గ్రస్తునకొక్కనికి పచ్చగా కన్పించును.

ఒక వ్యక్తి సంఘమును, సాంఘిక చైతన్యమును తిరస్కరించి మాటాడును అని పల్కుటకు ముందుగా నీవైపు తిరిగియున్న మూడు వేళ్ళు ఏమనుచున్నవో ఆత్మవిమర్శనము చేసికొనవలయును. అతనికి సంఘ మర్థము కానిచో నీకు తదేక దేశమగు వ్యక్తియే బోధ పడలేదే’ ఈ యెఱుక లేని వాని హేతువాదము ధాతువాదము.

కనులు మిరుమిట్లు గొల్పు తేజఃపుంజమును ఎదుర్కొని అభిముఖులమై ఎన్నడును చూడవలదు. కనులు బైర్లు క్రమ్మునే గాని ఆశించిన ప్రయోజనములు చేకూరపు. ఆతేజః ప్రసారమున కనుకూలముగా నిలబడి చూచినచో విశ్వమంతయు దృగ్గోచరమగును.
విశ్వనాథాధ్యయనమున కిది ప్రథమ సూచనము.

2. విశ్వనాథ శివార్పణము – దార్శనికవిషయములు:

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలందు మన దర్శనమునకు చిక్కెడి కొన్ని అంశములు – 1. అధ్యాత్మికత, 2. పాఠకులలో వ్యుత్పత్తిని పెంచుట, 3. జాతీయత, 4. అనిదంపూర్వములైన భావములు, 5. చమత్కారములు, 6. హాస్యప్రియత్వము మొదలగునవి. వారి సర్వగ్రంథముల యందు ఈ గుణములు ప్రత్యక్షము లయ్యెడివే. ప్రస్తుతము ‘శివార్పణము’ అను కావ్యముననుసరించి ఈ పరిశీలనము నొనర్పుదము.

2.1 ఆధ్యాత్మికత

పరమేశ్వరుని తత్వమును గూర్చి విచారము ఆధ్యాత్మికత కాగలదు. ఆత్మవిచారమన్నను అదియే. మన భావన కందిన దైవమును వేదాంత ప్రతిపాదిత మైన దానిగా నిరూపించుట కూడ ఆధ్యాత్మికతయే. కథాంశములందు, ప్రబంధ ప్రధానాంశ (ప్రబంధవ్యంగ్య) ప్రతిపాదనములందు, వర్ణనములందు సర్వత్ర ఈ ఆధ్యాత్మికత సాగి వచ్చుచునే ఉండును. భారతీయతలో ఈ వేదాంత ప్రీతి ప్రధానాంశము. సర్వవిధమైన భారతీయతను నరములలో, రక్తకణములలో, శ్వాసనిశ్వాసములలో జీర్ణించు కొనిన మహావ్యక్తి శ్రీ విశ్వనాథ ఉత్తమమానవుడు దైవాంశసంభూతుడే శివాజీపాత్రము నాశ్రయించి లలితామహాదేవి మహాలోక లాలసావిలాసములు క్రమ్ముకొన్నవి. కథాభాగములందు దేవీశక్తి ఎట్లనుసంధింపబడెనో తొలుత పరికింతము.

గోరక్షణము, శివాజీ విజయములు, సామ్రాజ్యస్థాపనము- ఇవి యిందలి ప్రధాన కథాంశములు. రాజవీథిలో నొకచోట తురకలు కొందరు గోవధ కుద్యమించిరి. పదేండ్లైనను నిండని బాలశివాజీ వారి నెదుర్కొనెను. గోవధకై కత్తినెత్తిన వాని చేయి ఎత్తినటులే నరుకంబడియె నుద్దేశించి "బాలకుండనని యాడకుడు ఏను విచిత్ర ఖడ్గవిద్యా నిపుణుండ, మీరు శతమైనను చాలరు నాదు కత్తికిన్" "నా పేరు శివాజీ, జ్ఞాపకము పెట్టుకొనుండిది ఏమి చేతునో, కారణజన్ముడేను-మిము కత్తికి కండగఁ జీల్తు నందరన్" అని తీండ్రించి పలుకును. తాను కారణ జన్ముడనని శివాజీకి తెలియదు. అతనికే కాదు సృష్టియందలి ఏ వ్యక్తికి తాను మహాత్ముడనని తెలియదు. అట్లు చెప్పికొనగల్గుట భగవంతునకే చెల్లును. కాని పై ఘట్టమున శివాజీ అనాలోచితముగ తాను కారణజమ్మడనని ప్రకటించుకొన్నాడు.

ఆ వాక్యములు అతనియందు తన యంశమును నిల్పిన పరాశక్తివి. ఆ దేవియే శివాజీ ఆకారముతో గోరక్షణము నొనర్చెను. తన మాటలకు ఆతనికి ఆశ్చర్యము కలిగియుండును. ఒకనాడు తల్లితో దేవాలయమునకు వెళ్లినాడాతడు.

"తన తల్లి ప్రక్క నిలబడి
వనితాకృతి బూని దైవభావమ్మేదో
తనయెడద శివాజీకిని
కనిపించిన యట్లు లీలగా నగుచుండున్." (2-65)

ఇట్లు బాల్యమునుండి శివాజీకి లలితా వరమేశ్వరి తల్లివలె కాన్పించి నడిపించెను.

తోరణ దుర్గవిజయమునకు ముందు జిజియానే "వేద రహస్యమూర్తి పాలనము చేసెడి" దానినిగా కవి చూపును. కొండన దుర్గము జయించిన పిమ్మట "ఎఱ్ఱ దాసాని పూనెత్తిన జిలుగు నా నది కొండకూతు క్రీబెదవి మెఱసె నట” శివాజీ పురందర దుర్గమును జయించి రాజపురందరుడైన సందర్భమున నాతని భ్రూయుగాంత స్థలియందు శ్రీచక్రసంచారిణియైన లలిక క్రాంతదర్శకుడైన కవిదృష్టికి కాన్పించెను.

"ఒక చక్రమ్ము చలించె శ్రీనడుమదా, వ్యూహంబుగా రేఖ రే
ఖకు మధ్యమ్మున సర్వ దైవములుగాఁ గార్తస్వరా భంబుగా
కకుబంతమ్ములు చాలనట్లుగ మనఃకంజాత సంజాతయై
చికురమ్ముల్ చెరలాడు మోముగ శివాజీ భ్రూయుగాంతస్థలిన్."

పార్వతీచరణమంజీరశింజినీనినాదములు “వినిపించన్ రాక విన్పించి నట్టిదిగా నిక్కముగాగ విన్పడినయట్లేయై శివాజీ మదిన్" తోచెనట క్రమముగా దుర్గముల నెన్నిటినో అతడు జయింపసా గెను "తులజా పురికేగి శివాజి దేవతా దర్శన మాచరింప" "ఇక ముందున్న యవి; పద’ నిలువ బోకు, వెనుక నేనుంటి నను కలధ్వనులు మ్రో"- ఇట్లా దేవి అనుగ్రహము తొను, ఆజ్ఞతోను తన విజయపరంపర సాగెను. కళాణ్యిదుర్గమును జయించి శివాజీ ఆర్థిక విజయమును సాధించెను. బిజపూరు నవాబు బెదిరింపులు బెండుపడినవి. జిజియా, శివాజీ తమ దుర్గమందున వెలయింప జేసిన దేవిని ఆరాధించుచున్నారు. "తులజాపురమునుండి మలకొండ దొరగారి అమ్మాయి తేజుతోనందు జొచ్చె"

బీజపూరు నవాబు పరమకపటియై శివాజీని కడతేర్చుటకు అఫజలు ఖానును నియోగించెను. ప్రతాపగడమున సంధి చర్చలు జరుగునట్టుల ఇరు వర్గముల వారును అంగీకరించిరి. తన యుపాయము ఫలింపబోవుచున్నదని అఫజలుడు మురిసిపోవుట దేవికి కన్నెఱ్ఱ కారణమయ్యెను.
"కుంభ నికుంభులన్ పదము గోటను చీల్చినతల్లి, తత్సమా
రంథము లాక్ష ఎఱ్ఱన యో, రక్తము చారలొ నేరరాద!".

ఆదేవికి కాలిమంట తల కెక్కన్ పాదములందు గూడ ఆ యెఱ్ఱందనము నిలిచియే యుండెనట! అఫ్జుల్ ఖాన్ వధ శివాజీ సాహసములలో మకుటాయమాన మయినది. కావున ఈ ఘట్టమున దేవీ ప్రభావమును శివాజీ యందు కవి పూర్తిగా సంధానించినాడు!

"శాకంభరీ క్రోధ సంజ్వల త్పదలాక్ష
కంకేళి పూచిన కరణినొప్పె
మాహేశ్వరీ సమున్మత్తాగ్ర పదలాక్ష
మందార సుమకాంతి చిందులాడె
భస్మాయుధాకృధాభరితో గ్రపదలాక్ష
నవజపారాగ సంతతి వహించె
నారాయణీ చోదనావ్యగ్ర పదలాక్ష
కోకనదాభ లక్ష్మీకమయ్యే
కోరి పూజాగృహమ్మున గూరుచున్న
శ్రీ శివాజీ హృదంతర సీమయందు
తల్ణిపదలాక్షకాంతు లుత్ఫుల్లములయి
అతని నేత్రాంచలమ్ములయందు జేరు."

అశోకమందార కోకనదములతో పూజించి భవానీపదములందలి లత్తుకరక్తిమను మరింత ఎఱ్ఱవాఱ జేసినాడు శివాజీ - అని సీసము నాల్గు పాదములందలి ధ్వన్యర్థము ఏకాగ్ర ధ్యానమువలన శివాజీ హృదయమునకు నేత్రములకు తల్లి పదలా క్షారుణిమ సోకినది అఫ్జల్ ఖాన్ గుండియ వ్రీల్చబడి మరోద్దరణయమున వ్రేల్చబడెను.

"భారతమందు నెల్లెడ శివాజియనన్ వినినంత గుండె బే
జారయి పోయెనందరకు, క్ష్మాపతులందరి గుండెజార, నీ
హారగిరీంద్ర కన్యపదమందలి నెత్తురుందగ్గి తల్లి చాం
ద్రీరుచి మందహాసలహరీ నవరీతులు వెల్గులెత్తగాన్."

ఖానువధకు ముందు రక్త కాంతులనీనిన అంబపాదములలో నేడు నెత్తురు తగ్గినది; చిరునవ్వుల వెన్నెలలు మోసులెత్తినవి.

ఔరంగ జేబు శివాజీని నిగ్రహించుటకు పయిష్టఖానుని పంపినాడు. అతడు పునాపురిని జయించి విడిసెను. వర్షా సమయ మయ్యది- "భూభృత్సుతాభ్రూనిర్వ్యాజ మహాంధకారములుగా పొల్చెన్ దిశల్ త్కృధాస్థానంబై చను కంటివెల్గులుగ వర్షంబుల్ విజృంభించుచున్" వర్షర్తువర్ణనమో! దేవీ పౌరోహిత్యమో భావుకుల భావనకే ఎరుక. ఒకనాటి అర్ధరాత్రమున "నరు కంబడె కుడి కేలున పొరిపొరిని షయిష్టఖాను బొట్టన వ్రేలు" - శివాజి సాధించిన యిట్టి పెక్కు గెలుపులలో దేవి తన శక్తి యుక్తులను వినియోగించినట్లు చాటుచు కవి ఆధ్యాత్మికతను సాధించినాడు "అంశమయ్యే శివాజీ నగాత్మసుతకు..." అనుట దీని సారాంశము.

2.2 పాఠకులలో వృత్పత్తిని పెంపొందించుట

పాఠకులలో వ్యుత్పత్తిని పెంపొందించుట విశ్వనాథవారి ఆదర్శము. లోక శాస్త్ర కావ్యజ్ఞానము వ్యుత్పత్తి పద వాచ్యము అందులోక కావ్య జ్ఞానములను పెంపొనర్చుట అన్యుల కావ్యముల వలనను వలనుపడవచ్చును. కాని శాస్త్రేతిహాసాది జ్ఞానమును విశ్వనాథుడు పెంపొనర్చిన రీతి అనితర సాధ్యము మచ్చునకు ఒండు రెండు-

తోరణదుర్గమును రేల పయినించి శివాజీ జయించెను. ఈ మహాకవి ఇట్లా విజయమును ప్రశంసించుచున్నాడు...

"సర్వభూతమ్ముల కెది నిశాసమయము
అపుడు మేల్కొనియుండు సంయమి; శివాజి
ఎల్లవేళల మేల్కొనియే చరించు
అనుచరులతోడి నిత్యసంయమి యతండు."

ఈ పద్యము వ్యాసప్రోక్తమయిన యోగిలక్షణమునకు అనుసరణమయి మెఱుగు పెట్టుట గమనార్హము.

"యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః." 
(భగవద్గీత. 2-69)

సర్వదేహులకు ఏది రాత్రియో ఆరాత్రిలో సంయమి మేల్కొని యుండును. భూతములన్నియు ఎపుడు మేల్కొని యుండునో అది ఆ సంయమికి నిశాసమయమట! సత్యగుణమును పగటిగను, తమస్సును చీకటిగను అధ్యవసాన మొనర్చి నాటి మహాభార తేతిహాసకర్త సంయమి లక్షణమును ప్రవచించినాడు. శ్లోక పూర్వభాగము శివాజీ విషయమున యథాతథముగా అన్వయించినది; మహాకవి నికషోట్టంకిత మంజు తేజఃపుంజము లుత్తర భాగమున పరివ్యాప్తములైనవి. ఇతరులు మేల్కొనియుండు సమయమున సయితము శివప్రభుడు 'మేల్కొనియే యుండును అందువలననే అతడు నిత్యసంయమి యని వాకొనబడినాడు. నాయకుని యందలి శివాంశప్రతిపాదనమున కీమార్పు సహాయకమని నిరూపింపవచ్చును. కావ్యరసాస్వాదమగ్నమైన సహృదయపాఠకుని మనస్సును ఇతిహాస జ్ఞాన సంభరిత మొనర్చి ఇతోధిక వ్యుత్పత్తిని గిల్గించుట కవి యుద్ధేశ్యము.

ప్రాశ్చాత్యదృక్పథమును కొంత ఆవల బెట్టి భారతీయతాత్వికదృష్టితో పరిశీలించిన మేరుతంత్రాద్యుద్గ్రంథములలో పెక్కు విషయములు చారిత్రకములే యనుసంశము స్థిరమగును. కర్మ ప్రాధాన్యముగల భారతీయ సంస్కృతి కర్మహీనులను దేశబహిష్కరణ శిక్షకు అగ్గము చేసెను. ఏత ద్విధముగ బహిష్కృతులైన సంఘజీవులు కొందరు భారతీయ సిద్ధాంతములను మున్నుతా మాచరించిన వానిని కొన్నింటిని మరువకయే, తోడుగా మరికొన్ని వినూత్న సిద్ధాంతములను జోడించుకొని జీవితమును గడుప సాగిరి. మహమ్మదీయుల విగ్రహారాధనావ్యతిక్రమము, తద భావములు ఉపనిషత్ప్రతిపాదితములైన నిర్గుణోపాసనకు ఛాయలే.

"కొందరు లేచిపోయి యెటకో నట నెవ్వడో తండ్రియంచునున్
చిందులు త్రొక్కికొంచు నటశేఖరునిన్ శశి చూడ నేరకన్
ముందరి తల్లిదండ్రులకు బుట్టిన వారిని నెట్టజూచుచున్
చిందరవందరం జనము చేయుచు నుందురు సాపరాధులై ."

పూర్వము పేర్కొనిన యట్లు స్మృతి ప్రతిపాదితాంశములీ పద్యమునకు నేపథ్యములై పాఠకుని తజ్ఞు నొనర్చుచున్నవి.

"సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మా" (తైత్తరీయోపనిషత్తు, బ్రహ్మానందవల్లి, ప్రథమానువాకము)

"ఓం సత్ చిత్" (భగవద్గీత. 17-23) అను మున్నగు వాక్యములు వేద ప్రోక్తములై భారతీయ నిర్గుణోపాసనమునకు ఆధారభూతము లగుచున్నవి. అత్తరి సగుణారాధన, అందున బహుదేవతా పూజనములనేల ఆకాంక్షించుచున్నారు? అనుప్రశ్నమునకు ఆస్తిక మహాశయులు పెక్కురు నిరుత్తరులగు చున్నారు. అట్టి దుస్థితికి వ్యుత్పత్తి, దారిద్ర్యమే ప్రధానకారణము. దానిని పరాస్తమొనరించి భారతీయతత్వమును నియుక్తిదముగ స్థాపించుటయే విశ్వనాథ వారి జీవితాదర్శము. వారి సమాధాన సరళి యిది-

"రాజొక్కడే తాను రాజ్యంబు సేయునా
సకలవిద్యాసమజ్ఞాపయోధి
యైనను వేల పై యధికారు లుందురు
వేనికి వాడె రాజైన వాడు
రాజాజ్ఞ నిత్యనిర్వహణంబు సేయుచు
తనయధికారంబు సనిన పట్టు
రాజు తా క్రీడాపరాయణుండైనచో
నా ప్రతినిధులు రాజంత వారు
ఇచట లోకంబ దెట్టులో నచట సృష్టి
పాలనా చక్రమట్టులే, ప్రభువొకండె
దైవమొక్కండె వాడు చైతన్యమయిన
దైవమగు సర్వమైన చైతన్యమూర్తి".

"యథా మహాన వత్" అను ఉపమా ప్రామాణ్యముతో తార్కికులు పర్వతమందు అగ్నిని సాధించినట్లు పై రాజపాలనా దృష్టాంతముతో విశ్వనాథ ఏకానే కేశ్వరశ్వత్వమును నిరూపణము చేసిరి. ఈరీతి పాఠకులలో వ్యుత్పత్తిని పెంపు సేయుటకు కవి అవిరళ కృషి చేసినాడు.

2.3 జాతీయత

భారతీయసంస్కృతీపరిరక్షణము, ధార్మికప్రబోధము అను నుత్తమాదర్శములు విశ్వనాధవారి ప్రధానలక్ష్యములు. జాతీయతాదృక్పథమున సంస్కృతీపరిరక్షణాదులు ఏక దేశము. ఇట్టి లక్షణములకీ కావ్యమున పెక్కుచోట్ల చేటలోని వెలగలవలె నిదర్శనములు పెక్కులు. స్ఫుటముగా కాన్పించుచున్నవి. (దేశభక్తిరూపమైన జాతీయత ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషము మున్నగు ఖండ కావ్యములలో ప్రస్ఫుటము).

విస్సన్న చెప్పినదే వేదమన్నట్లు పాశ్చాత్య విమర్శకుల బోధలే పాక్చరిత్రవేత్తలకు శిరోధార్యములగుట విశ్వనాథవారికి కంటగింపైనది. అందులకు కారణము వారి జాతీయతాభినివేశ మేగాని పాశ్చాత్యాచార్యుల యెడ ఈర్ష్యా ద్వేషములు గావు.

"ఆత్మలాభంబు కొఱకు దురాత్ములెల్ల
మోసగింతురు సామాన్య భూప్రజలను."

అనునది వారి యా వేదనము. శివాజీని 'కొండయెలుక' యని 'విప్లవకారుడని’ వర్ణించిన చరిత్రకారులు కొందరు కలరు.

"ధర్మమున విప్లవమున భేదం బెరుగని
పాలనుండన్నచో ననవచ్చుగాని"

ధర్మ-విప్లవములకు భేదము తెలిసిన విజ్ఞులెవ్వరును అంగీకరింపజాలరు. శివాజీ విప్లవకారుడు కాడని విశ్వనాథవారి యు ద్దేశ్యము.

"జులుముచేసెడి వాని జుత్తును గొరిగింప
లంచముల్ గొను వాని లాగి పొడువ
మతము మా రెడివాని మతము మార్పిం చెడి
వానిని నీ జన్మ బ్రహ్మ సేసె
బ్రహ్మకంటెను మీరు పరమవివేకులు
ధరమీద నుండగా తగరటంచు
ప్రాణమ్ముతీయింప, వర కాంతలను భర్తృ
హీనల చెరిపెడి వానిబట్టి
కొఱతవేయింప బదినుంది గూడు సభను
కఠినశిక్షల నిడు నధికారులొప్ప
తా శివాజీయు విప్లవ దారు కాడు
పరమధర్మాత్ముడై న భూపతియగాని".

అని శివాజీ పాత్రమును భారతీయచారిత్రకదృక్పథముతో మన కన్నుల సాక్షాత్కరింపజేసి, విప్లవకారునిగా గాక పరమధార్మికుడైన భూపాలకునిగా చిత్రింపజేసి జాతీయ సంస్కృతీ పరిరక్షణమునకు పరోక్షముగా కృషిచేసినాడు. అట్లే విశ్వనాథవారి సాంఘిక ధర్మప్రబోధమునకు వేఱొక్క నిదర్శనము నీ సందర్భమున పేర్కొనుట యుచితము.

"ఇది యీరీతి పొనర్ప రన్నయది పోనీ ఇద్ది యిట్లూహసే
సెదరన్నట్టిది గూడ బుద్ధిపదముం జెందింప రానంత దు
ర్మదులై తల్లియు దండ్రి కూడ దమకాయంబూనివర్తించి రే
మొదవన్ మాకును మేముగా నొదవినా మూహింప నంచాడగా."

నేడు కొందరు యువతీయువకులలో తల్లిదండ్రుల యెడ అగౌరవము, అవినయము మున్నగు అవలక్షణములు' ప్రస్ఫుటములగుచున్నవి. కృతజ్ఞతా దూరములైన ఈ భావములు భారతీయ ధర్మవృక్షమునకు వేరుపురుగుల వంటివి "ప్రజాయై గృహమేధినామ్' (కాళిదాసు, రఘువంశము), ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః" (తై. ఉప. 1. 11. 1) మున్నగు వాక్యములు భారతీయసనాతనధర్మముకురములు. వీటిని సమర్థించుటకు పై యువతకు గల దుర్భావనలను ఖండించుట కవికి ఆవశ్యకమైనది.

2.4 చమత్కారము – హాస్యప్రియత్వము

విశ్వనాధవారి శబ్దార్థప్రయోగములో నెంతో చమత్కారముండును అది వారిదైన ప్రత్యేకత.

"తల్లి నవ్వులలోన తానమాడుచు నుండు
నొడలెన్నడును గాని తుడుచుకొనడు"

ఇందగతర్ధవైచిత్రి నరయుడు. భ్రమరాంబ నవ్వులలో స్నానము, చేసెవినుటయందే పొగను చిందులు వేసెను. ఆమె నవ్వులు ప్రవాహసదృశములుగానో, చంద్రికా సంకాశములుగానో ఉన్నవి. అందా భక్తునకు స్నానావకాశము లభించెను. హృదయతాపపరిహారమునకు ఆ తానము కన్న వేరుపాయము లేదు. కాని చమత్కార మేమనగా ఆ స్నానానంతరము శరీరమును తుడుచుకొనకుండుట అనగా ఆ సుధామందహాసములు దేహమునందే ఇంకిపోవలయును- అని కవి భావనామధురిమ.

ఇట్లే మరొక్క ఉదాహరణము -
బలవంతముగ మతాంతరీకరణము ఆమోదకరము గాదు అట్లే స్వధర్మము నెఱుంగక యే పరధర్మము, పరమతముల నాశ్రయించుట చిత్తమౌఢ్యమగును. శివపాత్రద్వారమున కవి వారిని ఖండింపుచున్నాడు.

"మతము మా రెడివాని, మతము మార్పించెడు
వానిని నీ జన్మ బ్రహ్మ సేసె
బ్రహ్మకం టెను మీరు పరమవివేకులు
ధరమీద నుండగా దగరటంచు"

శివాజి వారి ప్రాణమ్ములను తీయించెనట "స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః" (భగవద్గీత 3-35) అనిన ఆర్షధర్మమును పురస్కరించుకొని మతాంతరీకరణమును హాస్యసమ్మిశ్రముగా కవి పల్కెను. "శాంతించెన్ సుల్తానును, శాంతింపక యేమి చేయు" - ఇందు తొలి వాక్యార్థమును, ద్వితీయవాక్య మపహాస్యమొనర్చుచు సుల్తాను మాసామర్థ్యము వ్యక్త మొకర్చెను.

ఆర్థికమైన వెసులుబాటు వాంఛించిన శివప్రభుండు కళ్యాణి దుర్గముపై చూపులతూపుల నంపెను. ఆ దుర్గాధిపతి త్రైమాసికముగ సుల్తానుకు పంపెడి ధనము అతని కనుల గట్టినట్లుండెను. ఇట శివాజీ యొనర్చిన యుద్ధ వర్ణనము ప్రత్యేక వద్ద శిల్పసంభరితము.

"పారశీకు లరబ్బులు వానయన్న
వారికిని భీతి, యెండు దిబ్బల జనమ్ము"

"మిన్నులో జీరగా సన్న మబ్బని లేదు
యుర్వీధరము లిట్టె యురుమదొడగె
సన్నని గాలిగా సాగినయది లేద
బుంగలతో బడబోసె నీళ్లు
పర్వతాధ్వము సన్న బాట యిర్వంకల
బండలతో మూయబడియె నంత
కోసిన యట్లున్న కొండల ప్రక్కలు
వెసనెగ బ్రాకగవీలు లేదు.

విరిగిన పోయిన కత్తులు, వెలికిలబడు
దేహములు కాళ్లుచేతులు దెబ్బతిన్న
బంటులును, తలలొడళులు బగిలియున్న
గుఱ్ఱములతోడ సైన్యంబు బిఱ్ఱబిగిసె".

విచిత్రమైన యుద్ధవర్ణనయిది. తేటగీతి పాదములకు సీసపాదములకును కార్యకారణ భావసంబంధము పాటింపబడెను ప్రకృతిప్రభావము చేతనే తౌరుష్కసైనికులు అపజయముపాలైరి- అనియు కవిభావన.
ఇట్టి నిర్మాణమందలి శిల్పచమత్కారములకు పెక్కింటికి ఈగ్రంథము కాణాచి. ఈ ఉదాహరించుట స్థాలీపులాకముగా మాత్రమే.

2.5 అనిదంపూర్వములైన భావములు

విశ్వనాథవారి భావములు, ప్రతిపాదనములు ప్రబోధములు జాతిని కొన్ని దశాబ్దములు, శతాబ్ధములు తిరోగిమింపచేయునని ప్రాజ్ఞ విమర్శకుల అమూల్యాభిప్రాయము. తద్విచారణమునకు ముందుగా ఈ 'శివార్పణము' కావ్యమందలలి కొన్ని వాక్యములను హృదయులగు సుహృదయులకు నివేదింతును.

"ఎండమావు లుద్యోగాలు వృత్తులబడి
ప్రజలు తమ తమ బ్రతుకులు బ్రతుకవచ్చు
ప్రతినరు డబద్ధమని లేక బ్రతికె నేని
అందరు సమానులే పరమాత్మ యొకడె."

"జులుము చేసెడివాని జుత్తును గొరిగింప
లంచముల్ గోను వాని లాగిపొడువ."

"అందఱి దైవమొక్కటియె, అందఱి దైవము కర్మరూపమే."

"సొంత చదువులు చదివింపజొచ్చె ప్రజల
జన్మయెత్తిన దానికి జన్మముక్తి
ఆత్మవిద్యలోనున్న రహస్య మెఱిగి."

"జలము లేదొక్క చోటను చిలుము లేదు
లంచముల్ లేవు న్యాయమ్ము కంచె లేదు."

ఈ వాక్యములీ కవిని మూఢాచారపరాయణునిగా నిరూపించునా? లేదా ఇరువదియవ శతాబ్దివానిగా నిర్ణయించునా?

ఇప్పట్టున నొక్క యంశము గమనింపవలయును- కావ్యమున వెలువడిన భావములన్నియు కవి మనఃప్రతిబింబములు కావు. అట్లే కవి మానసిక భావములన్నియు కావ్యమున నుండవు, అవసరమును లేదు ఈ యెఱుక లేని వారు కావ్యవిమర్శనమునకు కడంకకుండుట మేల్తరము.

చిరుతొండనంబికథ వ్రాయుట కారణముగా శ్రీనాథుని వీరశైవునిగా భ్రమించుట యెట్టిదో, "నేలన్ జీవులు ముక్తిపొందుటకునై నిర్మించే దైవంబువే, దాలన్ గోవుల బ్రాహ్మణావళి........” అనిన విశ్వనాథ వారి వాక్యముల జూచి వారిని సనాతన సంకుచితాచార సమర్ధకులుగా భావించుట యట్టిదే. అట్టిది జాతి నెంతో వక్రమార్గమును పట్టించును. మహాసముద్రము నేక దేశమును చూచి అందు ముత్యములు రత్నములును ఆయా వ్యక్తుల దౌర్భాగ్యముచే కన్పించనిచో తవన్మాత్రమున దానిని రత్నాకరమన్న వారిని నిందించుట ఎట్టి పాక్షికగం కుచిరదృష్టియగునో విశ్వనాథను విమర్శించుట కూడ అట్టిదే. నేటి విమర్శలకీ పాక్షిక దృష్టియే నిదానము. రామాయణమున అయోధ్యకాండయందు జాబాలి తన నాస్తికమతాభినివేశము ప్రకటించుట చూచి ఆ ప్రక్కనేగల తత్ఖండన వాక్యముల నుదాహరింపక వాల్మీకిని నాస్తికునిగా వ్యాఖ్యాన మొనర్చుట, పై రీతిగా విశ్వనాథను విమర్శించుట రెండును ఒక్కటియే ముందుగనే నిర్ణయముల, సిద్ధాంతముల నొనర్చుకొని వానికి నుదాహరణములను ప్రోదియొనర్చు కొనుటచే ఈ విధము సాగుచున్నది.

పై నుదాహరించిన "నేలన్ జీవులు....” అను వాక్యముతో మరి కొంత దూరము దృష్టిని సారించినచో —

"బ్రాహ్మణ కులంబులో కర్మరహితులగురు
మ్లేచ్ఛులంబోలి యెందఱు లేరు జనులు!"

అను పల్కులు ప్రత్యక్షములగును. ఈ పద్యముల వరుసలో గోమహిమ ప్రతిపాదించుట కవి స్పష్టాభిప్రాయము. అది తెలిసినచో పూర్వ పద్యములయందలి భావప్రకటనౌచిత్యము సమర్థనీయమే యగును. కావున పచ్చని చూపులతో గాక, స్వచ్ఛమైన, సాత్త్విక మైన దృష్టితో మహాకవుల నధ్య యన మొనర్పగా ప్రాజ్ఞులగు సహృదయులకు మనవి.

3. ముగింపు:

విశ్వనాధవారి విశ్వతోముఖ ప్రతిభను వివరించుట ఒక్కరికి సాధ్యము గాదు. వేయి ముఖములు చాలవు. శివార్పణమున దేవీముఖముగా కవి పలుకులు చూడుడు.

"నన్నెరిగిన హరిహరులే
నన్నెరుగరు తక్కువారు నన్నెరుగుటయున్
మిన్నెగురుట మన్నుతినుట
నన్నెరుగుట నా ప్రసాదనమ్మున కలిమిన్."

ఆ మహాకవి ప్రసాదమున్నచో ఇసుమంత గుణగ్రహణ సమర్థత్వమును కాంచుదము. ఆ జిజ్ఞాసాదృష్టిలేక ప్రలాపింపసాగిన ఆయనమహాగజము.

ఈ పరిశీలనమునందు శివార్పణకావ్యము నాధారముగాగొని విశ్వనాధవారి కవితాదర్శన మేరీతిలో సాగవలెనో స్థూలారుంధతీన్యాయముగా వివరించితిని. తమకు తెలిసినదే ప్రపంచమనుకొనక మహాకవులను పరిశీలించెడి భిన్న దృష్టి నలవరచుకొన వలసినదిగా విజ్ఞప్తి యొనర్చితిని.

"తం సంతః శ్రోతుమర్హంతి, సదసద్వ్యక్తి హేతవః
హేమ్నః సంలఖ్యతేహ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపివా" (రఘువంశం, ప్రథమసర్గ-10)

 4. ఉపయుక్తగ్రంథసూచి

  1. అప్పన్నశాస్త్రి. బులుసు (వ్యాఖ్యా.). శ్రీమద్భగవద్గీత శంకర భాష్య తత్త్వభోదిని. శ్రీశారదాముద్రణాలయము, అమలాపురం. 1941
  2. కాళిదాసు & వేంకటరాయ శాస్త్రి, వేదము (వ్యాఖ్యా.). రఘువంశము. చంద్రికాముద్రణాలయము. మదరాసు. 1941.
  3. ప్రకాశరావు, శివలెంక. స్కందపురాణం. సరస్వతీపబ్లికేషన్స్. కాకినాడ. 1988.
  4. శాస్త్రి. జి.యల్.యన్. (వివరణ). తైత్తరీయోపనిషత్తు. జగద్గురుపీఠము. గుంటూరు. 1986.
  5. సత్యనారాయణ, విశ్వనాథ. శివార్పణము.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]