AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797
12. సుభద్రా ధనంజయ, కల్యాణ - నాటక, కావ్యాలు: కల్పనలు
డా. సత్య గాయత్రి జనమంచి
తెలుగు లెక్చరర్,
ఎమ్.ఎన్.ఆర్.కాలేజ్,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9110369727. Email: drsatyagayatri.janamanchi@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ఒకే ఇతివృత్తాన్ని తీసుకొని నాటక,కావ్యాలుగా మలచినపుడు ఆయా నాటక,కావ్య ధర్మాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయవలసి ఉంటుంది.సుభద్ర ధనంజయం, సుభద్రాకల్యాణం నాటక కావ్యాలలో కవులు చేసిన ఆ కల్పనలు ఏంటి,ఈ కల్పనల వల్ల నాటక,కావ్యాలకు ఒనగూరిన ప్రయోజనం తెలియజేయడమే ఈ వ్యాసం లక్ష్యం. సుభద్రా ధనంజయం, సుభద్రా కల్యాణము కావ్య నాటకాల కల్పనలను తులనాత్మక పద్ధతి లో పరిశీలించాను. ఎంపిక చేసుకున్న కావ్యనాటకాలను ముందుగా అధ్యయనం చేసి వాటిని వ్యాస భారతం,నన్నయ్య భారతంతో పోల్చాను. అదేవిధంగాసంస్కృత నాటకాన్ని, తెలుగు కావ్యంతో పోల్చాను. ఆ మార్పుల వల్ల నాటక కావ్యాలకు చేకూరిన ప్రయోజనాన్ని తెలియజేశాను.
పూర్వ పరిశోధనలు:
అచ్యుతరామారావు, చావలి. తాళ్ళపాక తిమ్మక్క - సుభద్రాకల్యాణము - ఒక పరిశీలన. (1997. ఎం.ఫిల్. సిద్ధాంతవ్యాసం (అ.సి.గ్రం) ఆంధ్రవిశ్వకళాపరిషత్, వాల్తేరు) అనే పరిశోధన కేవలం సుభద్రాకల్యాణం మీద వచ్చింది. ఈ వ్యాసంలో సుభద్రాధనంజయం, సుభద్రాకల్యాణము నాటక కావ్యాలను తునాత్మకపద్ధతిలో విశ్లేషించాను. నాటకకావ్యాలను కాలక్రమాన్ని చూసినట్లయితే సుభద్రా ధనంజయం నాటకమే ముందు, తరువాత సుభద్రాకల్యాణ కావ్యము వచ్చాయి. సంస్కృత నాటకాన్ని చూసి తెలుగు కావ్యం రచించారనడానికి తగినన్ని ప్రమాణాలు లేవు. అయినప్పటికీ ఒక కథ తీసుకొని కవులు కావ్యనాటకాలుగా రచించడం వల్ల ఛాయామాత్రంగా ప్రభావం ఉండవచ్చని భావించి ఈ రెండు నాటక, కావ్యాలను ఈ వ్యాసంలో పరిశీలిస్తున్నాను.Keywords: నాటకం, కావ్యం, కల్పనలు, ఔచిత్యం, రసం, విభావం, అనుభావం
1. తాళ్ళపాక తిమ్మక్క - పరిచయం:
'సుభద్రా కల్యాణము' కావ్యాన్ని రాసింది తాళ్ళపాక తిమ్మక్క. ఈమె తొలి తెలుగు కవయిత్రి. ఈమె పదకవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యుని ప్రథమపత్ని. అన్నమాచార్యుడు 1424-1503 లోని వాడుగా శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు నిరూపించారు. అందువల్ల తిమ్మక్క కూడా ఈ కాలానికి చెందినదే. ఈమెనే తిరుమలాంబ అని, తిమ్మాంబ అని వ్యవహరిస్తారు. ఈమె సుభద్రా కళ్యాణాన్ని మంజరీ ద్విపదలో రచించింది.
"తిమ్మక్కగారి సుభద్రా కల్యాణానికి ఆధారం నన్నయగారి భారతమే. వారు ఆదిపర్వం అష్టమాశ్వాసంలో 135 గద్యపద్యాలలో 'విజయ విలాసం' రచించారు. (ఆది. 8-89 నుండి 223 దాకా). వారు చూపిన త్రోవలోనే తిమ్మక్క 1163 పాదాల ద్విపదకావ్యం వ్రాసింది. ఈమె తన రచనను కావ్యం అనే పెద్ద మాటలతో పిలువలేదు. ఇది పాట అని మాత్రమే చెప్పుకుంది. అయితే 'కడుమంచి తేట పలుకుల'తో చెప్పినట్టు తెలియజేసింది. కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయగారు మూలాతిక్రమణ చేసినట్లే ఈమె కూడా స్వతంత్రించి పాటకు జీవం పోసింది"1.
ఈ సుభద్ర వివాహ గాథనే అనేక మంది కవులు తరువాత ప్రబంధంగా, నాటకంగా రచించారు. ప్రాచీనులలో చేమకూర వేంకటకవి, కూచిమంచి జగ్గకవి, ఆధునికులలో శ్రీ వావికొలను సుబ్బారావు, శ్రీ ముదిగొండ నాగ వీరయ్యశాస్త్రి ముఖ్యులు. కానీ ఈ కథను ప్రత్యేక గ్రంథంగా రూపొందించిన ఆద్యురాలు తిమ్మక్క.
2. కులశేఖరవర్మ - పరిచయం :
’సుభద్రాధనంజయం’ నాటక కర్త కులశేఖరవర్మ. ఇతడు కేరళదేశాన్ని పాలించిన మహారాజు. ఇతని రాజధాని మహోదయపురం. ఇతడు రచించిన సంస్కృత కృతులలో మొదటిది 'తపతీ సంవరణం', రెండవది 'సుభద్రా ధనంజయం'. ఇవి నాటకాలు. మూడోది 'ఆశ్చర్య మంజరి' అనే గద్య కావ్యం. ముకుందమాల ఇతడు రచించిన స్తోత్ర గ్రంథము. ఇతడు కేరళ దేశాన్ని పాలించి విరక్తుడై శ్రీరంగం చేరి 'పెరుమాళ్ తిరుమెళి' అనే దివ్యప్రబంధరచన చేసి పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా గుర్తింపు పొందాడు. ఇతడు రచించిన రచనలను బట్టి ఇతడు కవి, శాస్త్రజ్ఞుడు, లోకజ్ఞుడు, సత్వసంపన్నుడు, పరమభాగవతుడని తెలుస్తోంది. ఇతడు క్రీ.శ.1159(ఎ.డి.)కాలానికి చెందినవారు.
3. ఇతివృత్త పరిచయం:
పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకొని ఇంద్రప్రస్థంలో నివాసం ఉంటున్న సందర్భంలో నారదుడు వచ్చి సుందోపసుందులు అన్నదములు అయినా స్త్రీ కోసమే వారిద్దరూ శరీరాలు విడిచిపెట్టారు. కావున మీరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది ఉండేలా నియమం ఏర్పాటు చేసుకోండని నారదడు పాండవులకు సలహా ఇస్తాడు.
నారదుడి సలహా ప్రకారం ద్రౌపది ఒక్కరి దగ్గర ఉండగా వేరొకరు ఆ సమీపంలోకి కూడా రాకూడదని నియమం. ఈ నియమాన్ని అతిక్రమించినవారు ఒక సంవత్సరం. తీర్థయాత్రలు చేసిరావాలి. అయితే ద్రౌపది ధర్మరాజు దగ్గర ఉండగా ఒక విప్రుడు తన గోవులను రక్షించమని అర్జునుడిని వేడుకోవడంవల్ల అర్జునుడు ఆయుధాల కోసం ధర్మజుడిగృహానికి వెళ్తాడు. అర్జునుడు నియమాన్ని అతిక్రమించడం వల్ల ఒక సంవత్సరం తీర్థయాత్రకు బయలుదేరతాడు. దారిలో ఉలూచి, చిత్రాంగదలను వివాహం చేసుకొని ద్వారకకు వెళ్ళి శ్రీ కృష్ణుడిని కలుసుకొని శ్రీ కృష్ణుడి సహాయంతో కపట యతి వేషంలో సుభత్రతో సేవలు చేయించుకుంటాడు. సుభద్ర కపటయతి చేష్టలకు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడికి తెలియజేయగా, కృష్ణుడు నర్మగర్భంగా కపట యతి అర్జునుడేనని సూచిస్తాడు. వచ్చినవాడు అర్జునుడే అని గ్రహించిన సుభద్ర తాను అలంకరించుకొని కపట యతిని అర్జునుడి గురించి ప్రశ్నిస్తుంది.
కపట యతి తానే కిరీటినని తెలియజేసి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటానంటాడు. సుభద్ర అతనిని వారించి సిగ్గుతో అంతఃపురంలోకి వెళ్ళి విరహవేదన అనుభవిస్తుంది. రుక్మిణి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు వీరికి వివాహం జరిపిస్తాడు. సుభద్రార్జునులు అందరి దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని ఇంద్రప్రస్థానానికి పయనమౌతారు. బలరాముడికి ఈ కల్యాణాన్ని వ్యతిరేకించడం వల్ల యాదవసైన్యం సుభద్రను అర్జునుడు అపహరించుకుపోతున్నాడేమోనని భావించి అర్జునుడి పై బాణప్రయోగం చేస్తారు. అర్జునుడు వారిని ఎదిరించి సుభద్రను తీసుకొని స్వస్థలానికి చేరుకుంటాడు. అక్కడ సుభద్రార్జనులు అందరి ఆశీస్సులు పొందాక ధర్మరాజు ద్రౌపదితో సుభద్రార్జనుల శోభనానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పిమ్మట సుభద్రార్జునులు దాంపత్య జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.
4. నాటకంలో కల్పనలు:
- దుర్యోధనుడు సుభద్రను వివాహం చేసుకోవాలని అలంబసుడనే రాక్షసుడిని పంపించి సుభద్రను అపహరించడం, ఆమెను అర్జునుడు రక్షించడం.
- సుభద్ర గాత్రిక జారిపడడం దాని మీద అర్జునుడి పదిపేర్లు లిఖించబడి ఉండడం. గాత్రిక వృత్తాంతమే పలుమార్లు పునరావృతం కావడం, గాత్రికను చూడగానే అర్జునుడు విరహవేదన నుండి ఉపశమనం పొందడం.
- సుభద్ర తనను రాక్షసబారి నుండి రక్షించిన పురుషుడిమీద, తనచేత సేవలు చేయించుకుంటున్న పరివ్రాజకుడి మీద, తన మేనత్త కొడుకైన అర్జునుడి మీద ప్రేమ కలగడం వల్ల పురుషత్రయాన్ని ప్రేమించానని తలచి శరీర త్యాగానికి సిద్ధపడడం.
- సుభద్ర అస్వస్థురాలైనందువల్ల యతికి సుభద్ర చేయవలసిన సేవలు రుక్మిణి చెయ్యడం.
- తన సేవకు సుభద్రరాలేదని అర్జునుడు విలపించడం.
- విదూషకుడు అర్జునుడితో పారిజాత వృక్షం దగ్గరకు వెళ్ళి సుభద్రను అడగమని సలహా ఇవ్వగా అర్జునుడు దానిని ఖండించడం.
- సుభద్ర సఖులు రహస్యంగా విదూషక, అర్జునుల మాటలు విని సన్యాసి నీ కోసమే తపిస్తున్నాడని సుభద్రకు తెలియ జేయడం.
- పురుషత్రయాన్ని ప్రేమించానన్న సుభద్ర శరీరత్యాగానికి సిద్ధపడగా అర్జునుడు ఆమెను రక్షించి గాంధర్వ వివాహం చేసుకోవడం.
- సుభద్ర తను ప్రేమించిన ముగ్గురు పురుషులు ఒక్కరే అని, అతడు అర్జునుడే అని తెలిసి ఆనందించడం.
- తీర్ధయాత్రాసమయం ఒక్క సంవత్సరం గడిచిపోయినా అర్జునుడు తిరిగిరాకపోవడం వల్ల కారణం తెలుసుకోమని ధర్మరాజు దీర్ఘధ్వగుడిని పంపించడం. సుభద్రా ధనంజయులు వివాహం చేసుకొని వస్తున్నారని తెలిసి పట్టణాన్ని అలంకరించమని ధర్మరాజు ప్రతీహారకుడిని ఆజ్ఞాపించడం.
- ద్రౌపదికి సపత్నీమత్సరం కలుగకుండా సుభద్ర గోపాలికా వేషంలో వస్తోందని తెలిసి ద్రౌపది బాధపడి అలా రావడం ఆమెకు ఇష్టమోకాదో తెలుసుకొని రమ్మని చేటిని ఆజ్ఞాపించడం.
- సుభద్ర అలంబసుడనే రాక్షసుడిచే తిరిగి అపహరింపబడడం అర్జునుడు మూర్ఛిల్లి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడడం.
- విదూషకుడు అర్జునుడికి ధైర్య వచనాలు నూరిపోసి కర్తవ్యోన్ముఖుడిని చేయడం.
- అపహరింపబడిన సుభద్రను కాత్యాయని దేవి రక్షించి అర్జునుడికి అప్పగించడం.
- కాత్యాయని దేవిచే రక్షింపబడ్డ సుభద్ర ద్రౌపది రూపంలో కన్పించడం.
- నిజ ద్రౌపది ఎవరో తెలుసుకోలేక అర్జునాదులు ఆందోళన చెందడం.
- నిజ ద్రౌపది తన భార్య శేషమే సుభద్రమ క్షేమంగా తీసుకువచ్చిందని ఆనందించడం.
- అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళడం తనకు బాధ కలిగించినా శ్రీకృష్ణుడితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని ధర్మరాజు తెలియజేయడం.
5. నాటకంలో కల్పనల ఔచిత్యం:
సుభద్రను వివాహం చేసుకోవడానికి అర్జునుడు యతి వేషం ధరించడం వ్యాస భారతంలో లేదు. ఇది ఆంధ్ర మహాభారతం, భాగవతములోనే ఉంది. దీనిని కులశేఖరవర్మ గ్రహించి నాటకంలో ప్రవేశపెట్టాడు. ద్రౌపది ప్రీతికోసం సుభద్ర గోపాలికా వేషాన్ని ధరించడం సంస్కృత భారతంలో ఉంది. బలరాముడు సుభద్రను అర్జునుడి సేవకు నియమించడం, సుభద్ర అంతఃపురంలో అర్జునుడికి నివాసం ఏర్పాటు చెయ్యడం, సుభద్రకు బదులుగా యతి పరిచర్యకు రుక్మిణి ని నియమించడం, రైవతకోత్సవానికి బలరామాదులు వెళ్ళిన సమయంలో రహస్యంగా శ్రీకృష్ణుడు ఇంద్రాదులతో కలసి సుభద్రార్జునుల వివాహం జరిపించడం వంటి విషయాలు ఆంధ్ర మహాభారతంలో ఉన్నాయి. వీటిని కూడ గ్రహించి కులశేఖరవర్మ తన నాటకంలో ప్రవేశపెట్టాడు.
6. సుభద్రాధనంజయం నాటంలో కులశేఖరవర్మ కల్పించిన కల్పనలు:
- అలంబసుడనే రాక్షసుడు సుభద్రను అపహరించడం వలన అర్జునుడు ఆమెను రక్షిస్తాడు. ఆ సమయంలో సుభద్రార్జునులు ఒకరినొకరు చూసుకోవడం వలన వారిలో ఉద్దీపన విభావం కలిగి శృంగారరసానికి బీజం పడుతుంది.
- సుభద్రార్జునులకు అనురాగం ఏర్పడడానికి రాక్షసుడి కల్పన ఉపయోగపడింది. సుభద్ర గాత్రిక అర్జునుడికి దొరకడం, దాని మీద అర్జునుడి పదిపేర్లు ఉండడం అనే కల్పనలు అర్జునుడిలో బీజరూపంలో ఉన్న రతిని పరిపుష్టం చేయడానికి ఉపయోగపడింది. అర్జునుడు విరహవేదనని అనుభవిస్తున్న సమయంలో ఈ గాత్రిక అర్జునుడికి ఉపశాంతి కలిగించింది.
సుభద్ర తనను రాక్షసబారి నుండి రక్షించిన పురుషుడిని, యతిని, అర్జునుడిని ముగ్గురు పురుషుల్ని ఒకేసారి ప్రేమించానని బాధపడి మరణించడానికి సిద్ధపడుతుంది. ఈ కల్పన సుభద్ర సచ్ఛీలతను తెలియజేసి సుభద్ర పాత్రకి మరింత గౌరవాన్ని తెచ్చింది. - పంచమాంకంలో కూడ సుభద్రను రాక్షసుడు అపహరించడం వల్ల సుభద్రార్జునులకు వియోగం కలిగి విరహ విప్రలంభం పోషింపబడింది. అర్జనుడు సుభద్ర అపహరింపబడడం వల్ల తాను కూడా ఆత్మహత్య కు సిద్ధపడిన సందర్భంలో కరుణ రసం అభివ్యక్తం అయ్యింది.
"వయస్య! పరిత్యక్త జీవలోకనుఖస్య కా నామ బంధుష్వపేక్షా (సకరుణమ్) మాతః కుంతి భోజతనయే! అద్యప్రభృత్యనగతమపత్యవాత్సల్యమన్యేషు చతుర్షుళపుత్రేషు సంవిభజస్వ" (సు.ధ.పు. 123)
- అర్జనుడు తాను దేహ పరిత్యాగం చేస్తానని కుంతీ నేటి నుంచి నువ్వు అర్జనుడి పట్ల చూపించే పుత్ర వాత్సల్యాన్ని మిగిలిన నలుగురి పట్ల చూపించు అంటూ దుఃఖిస్తాడు. నాటకం లో నాయిక అపహరింపబడడం, నాయకుడు కూడా దేహత్యాగానికి సిద్ధపడడంవల్ల నాటకంలో కరుణ రసం పోషింపబడింది.
- వివాహ సమయంలో శచీదేవి మొదలైన ముత్తైదువులందరు సుభద్రార్జునులను అలంకరించే సందర్భంలో, అర్జునుడికి సహచరుడైన విదూషణుడు కూడా అలంకరించుకునే సందర్భంలో హాస్యరసం కన్పిస్తుంది.
"గాత్రికాం కంఠే సమర్పయతి) యద్యేవం మమాపి వరవయస్యస్య మణ్ణనేన భవితవ్యమ్ తత్ ప్రతిగ్రహ గృహీత యానాయా గాత్రికయాత్మానమ్ మల్లయిష్యామి."(సు. ధ. పు. 108).
హాస్యం మళ్ళీ 2 రకాలు. ఆత్మస్థం, పరస్థం. తాను నవ్వినపుడు అది ఆత్మస్థం. పరులను నవ్వించినపుడు పరస్థం.విదూషకుడు నవ్వుతూ తన వయస్యుడు అలంకరించుకోవడం వలన అతడు కూడా అలంకరించు కోవాలనుకుంటాడు. అయితే స్త్రీలు ధరించే గాత్రికను విదూషకుడు ధరించడం వలన హాస్యరసం స్ఫురించింది. విదూషకుడే నవ్వుతూ ఉండడం వలన హాస్యం ఆత్మస్థం. స్త్రీలు ధరించే గాత్రికను పురుషుడైన విదూషకుడు ధరించుట వికృత వేషం. ఈ వికృత వేషం హాస్య రసానికి విభావం. విదూషకుడు నవ్వుతూ ఉండడం అనుభావం.
నాటకంలో హాస్యరసానికి విదూషకుడి పాత్ర ఉపయోగపడింది. కానీ కావ్యంలో తిమ్మక్క బావ బావమరదుల వేళాకోళాలలో హస్యరసాన్ని చొప్పించింది. - అర్జునుడు రాక్షసుడిని ఎదుర్కొవడంలో వీరరసం ద్యోతకమౌతుంది. నాటకంలో అర్జునుడు సుభద్ర అపహరించబడిందని తెలిసి మూర్ఛిల్లుతాడు. విదూషకుడు అతడికి ధైర్య వచనాలు నూరిపోస్తాడు. ఉత్సాహాన్ని నింపుతాడు. అర్జునుడి ప్రతాపాన్ని శక్తిని కీర్తిస్తాడు.
“హా కృతాంతహతక ఏతస్య మహీంద్రనందనస్య భువనైకధనుర్ధరస్య వాసుభద్రమిత్రస్య ధర్మానుజస్యాప్రతీకారం వినిపాతం దర్శయన్ అద్యత్వమీశ్వరః సంవృత్తః" (సు. ధ. పు. 122)
అర్జునుడిని భువనైక ధనుర్ధరుడు, మహేంద్రనందనుడు, శ్రీకృష్ణుడికి మిత్రుడు అని కొనియాడతాడు. విదూషకుడి ధైర్య వచనాలకి మేల్కొన్న అర్జునుడు తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఉత్సాహంతో బయలు దేరతాడు.
"(ససంభ్రమ ముత్తిష్ఠన్) "ఆః కిం నామ కృతాగస్వ రిష్వ ప్రతి కుర్వాన్నాస్తే ధనంజయః (ఊర్ధ్వమవలోక్య) భోభోః పిశితాశనాపసద మత్రాణ వల్లభా ప్రాణాపహారిన్ స్వాగత్వా మద్బాణపాతం పరిహరసి”. (సు.ధ. పు. 124) - అర్జునుడు తన ప్రాణేశ్వరిని అపహరించిన రాక్షసుడిని యముడి దగ్గరకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. విదూషకుడు అర్జునుడి ప్రతాపాన్ని కీర్తించడం వల్ల వీరరసం వ్యక్తం అయింది. అర్జునుడు ధైర్యంతో రాక్షసుడి మీద బాణాలను ప్రయోగిస్తానంటాడు. ఈ ధైర్యం వీరరసానికి అనుభావం. ఈ విధంగా నాటకంలోని కల్పనలు సుభద్రార్జునుల పాత్రలకి వన్నెతెచ్చి నాటకం రసాత్మకంగా సాగడానికి ఉపకరించాయి.
7. కావ్యంలో కల్పనలు:
- నారదుడు ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మాదులతో సుందోపసుందులను గురించి చెప్పి ద్రౌపది విషయంలో అన్నదమ్ముల్ని ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పడం.
- అర్జునుడు ఉలూచి, చిత్రాంగదలను వివాహం చేసుకోవడం, పంచకన్యలకు శాపవిమోచనం కలిగించడం.
- కపటయతి వేషంలో ఉన్న అర్జునుడు సుభద్రను ఆటపట్టించడం. సుభద్ర యతి చేష్టలకు తట్టుకోలేక శ్రీకృష్ణుడికి ఫిర్యాదు చేయడం.
- శ్రీకృష్ణుడు అర్జునుడిని మందలించి, సుభద్రను స్వాంతన పరచడం.
- శ్రీకృష్ణుడు అర్జునుడి గొప్పతనాన్ని చెప్పి కపట యతియే అర్జునుడని చెప్పుకనే చెప్పడం. శ్రీకృష్ణుడి మాటలవల్ల యతివేషంలో వచ్చినవాడు అర్జునుడే అని తెలుసుకున్న సుభద్ర ముందు తాను అర్జునుడితో మాట్లాడలేక తాను పెంచిన చిలుక సహాయం తీసుకొని దానిచే మాట్లాడించడం.
- తరువాత సుభద్ర అర్జునుడి క్షేమ సమాచారాలను కపటి యతిని అడగటం.
- కపటయతి రూపంలో ఉన్న అర్జునుడు బయటపడి సుభద్రను గాంధర్వ వివాహం చేసుకుంటాననడం. సుభద్ర అర్జునుడిని వారించి అంతఃపురంలోకి వెళ్ళడం.
- వివాహానంతరం అత్తవారింట ఏ విధంగా ఉండాలో రుక్మిణి సుభద్రకు సూచనలివ్వడం.
- ధర్మరాజు ఆదేశంమేరకు ద్రౌపది సుభద్రాధనజంయులకు శోభనం ఏర్పాటుచెయ్యడం.
- అర్జునుడిని సుభద్రతో పంచుకుంటున్నందుకు ద్రౌపదికి బాధ కలగడం.
8. కావ్యంలో కల్పనల ఔచిత్యం:
తిమ్మక్క ఆంధ్ర మహాభారతం నుండి సుభద్రా కల్యాణ కథను గ్రహించినా మూలానికి అనేక మెరుగులు పెట్టి సుభద్రా కల్యాణాన్ని రచించింది. సుందోపసుందులు తపస్సు చేసిన తీరు, బ్రహ్మదేవుడు వీరికి వరాలు ఇవ్వడం, సుందోపసుందులు మారు రూపాలు ధరించి రాజులను, ఋషులను కిన్నెరలను బాధించడం వారు ఆ బాధలను తట్టుకోలేక బ్రహ్మకు విన్నవించడం, బ్రహ్మ ఆజ్ఞచేత విశ్వకర్మ సుందోపసుందులను సంహరించడానికి తిలోత్తమను సృష్టించడం. సుందోపసుందులు తిలోత్తమకోసం మరణించడం వంటి విషయాలను నారదుడు ధర్మరాజాదులతో చెప్పినట్టు నన్నయ భారతంలో ఉంది. తిమ్మక్క సుందోపసుందుల వృత్తాంతం విస్తృతంగా చెప్పకుండ సంగ్రహించి నాలగు వాక్యాలలోనే చెప్పింది:
"సుదతికై సుందోప - సుందుల చరిత
విదితముగ జెప్పెదను - వినుడంచుబలికె
సుందరి కొఱకునై - సూడు పుట్టంగ
సుందోపసుందులు - మంది మన్నైరి" (సు. క. పు. 1)
అని చెప్పింది. సుభద్రా కల్యాణ కథకి సుందోపసుందుల వృత్తాంతం ఆటంకంగా మారకూడదని భావించి సంక్షిప్త పరచడం ఔచిత్యవంతంగా ఉంది.
నన్నయ భారతంలో నియమాన్ని అతిక్రమించిన అర్జునుడు తీర్థయాత్రలకి బయలుదేరుతున్న సమయంలో ధర్మరాజు దొంగలను చంపి బ్రాహ్మణుడికి మేలు చేసినందువల్ల నియమాన్ని అతిక్రమించినట్టు కాదు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకంటాడు. తిమ్మక్క ధర్మరాజు అర్జునుడితో ఈ విధంగా పలుకుతాడు:
"నినువిడిచి యొక ఘడియ - నే నుండ లేను నను విడిచి యే రీతి - చనెదవోయన్న "(సు.క. పు. 3)
అంటూ అర్జునుడిని ఆపే ప్రయత్నం చేస్తాడు. నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడ ఉండలేను అనడంలో ధర్మరాజు సోదర ప్రేమను తిమ్మక్క చక్కగా వ్యక్తం చేసింది.
నన్నయ భారతంలో సుభద్ర యతి ఆకారసౌష్టవాన్ని చూసి వచ్చినది అర్జునుడేమోనని అనుకుంటుంది. సుభద్రా కల్యాణములో యతిరూపంలో ఉన్న అర్జునుడు కావాలని కల్పించుకొని ఈ విధంగా పలుకుతాడు:
"ఇందు పురోహితం - డెవ్వరె నీకు
అందమైనట్టి ఘడి - యారమ్ము నేదె
అన్నియు నేల నీ - యాశ్రితుడ నేనె" (సు.క.పు. 18)
అంటూ నర్మగర్భంగా సుభత్రతో సరసాలు ఆడతాడు. ఈ విషయాన్ని సుభద్ర శ్రీకృష్ణుడికి తెలియజేస్తే కృష్ణుడు యతిరూపంలో ఉన్నది అర్జునుదేనని స్ఫురించేటట్టు మాట్లాడతాడు. కపట యతి రూపంలో ఉన్నది అర్జునుడేనని నిర్ధారించుకున్న సుభద్ర అలంకరించుకొని కపటయతిని అర్జునుడి గురించి అడుగుతుంది. కపటయతి సుభద్రతో చనువుగా ప్రవర్తించడం, సుభద్ర అలంకరించుకోవడం వంటి కల్పనలు సుభద్రార్జునులు మధ్య అనురాగాన్ని మరింత పెంచి శృంగార రసాన్ని పరిపుష్టం చేశాయి.
ముగ్ధ అయిన సుభద్ర అర్జునుడితో మాట్లాడడానికి సిగ్గుపడవచ్చని భావించిన తిమ్మక్క చిలుక చేత రాయబారాన్ని నడిపించింది. సుభద్ర పెంపుడు చిలుక అర్జునుడి భుజంపై వాలి ఈ విధంగా పలుకుతుంది:
"బావ లేలెమ్మని - బడలికల్ తెలిపి
మోవి గంటిని చేసి - ముద్దులు పెట్టె" (సు.క.పు.32)
అంటూ సుభద్రకు ఉన్న సిగ్గు అనే తెరదించే ప్రయత్నం చేసింది. చిలుక సుభద్రార్జునుల మధ్య ప్రణయ రాయబారాన్ని నడిపి సుభద్ర బెరుకును పోగొట్టడం ఔచిత్యవంతంగా ఉంది. చేమకూర వెంకటకవి కూడ విజయవిలాస ప్రబంధంలో తిమ్మక్కను అనుసరించి సుభద్రార్జునుల మధ్య చిలుక రాయబారాన్ని నడిపాడు.
నన్నయ భారతంలో సుభద్రతో అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుందామంటే మనకు పెద్దవాళ్ళే వివాహం చేస్తారని సుభద్ర అంతఃపురంలోకి వెళ్ళిపోతుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఏర్పాట్లు చేసి వివాహం జరిపిస్తాడు. సుభద్రా కల్యాణములో అంతఃపురంలోకి వెళ్ళిపోయిన సుభద్ర పట్ల అర్జనుడు విరహవేదన అనుభవిస్తూఈ విధంగా విలపిస్తాడు:
"యింతికి నాపేర - దేల చెప్పితిని కాంతయులోనికి - గ్రక్కున బోయె" (సు.క. పు. 35)
సుభద్ర కూడ అర్జునుడి వలన విరహాన్ని అనుభవిస్తుంది. పరస్పరం ఇరువురు మన్మథ బాణాలకు గురవడం వలన శృంగార రసం అభివ్యక్తమయింది. నన్నయ భారతంలో "అయ్యిరువుర యన్యోన్య ప్రణయంబులు దన దివ్య "జ్ఞానంబున జేసి" 2 అనడంతో సుభద్రార్జునుల పరస్పర అనురాగాన్ని శ్రీకృష్ణుడు. దివ్యజ్ఞానంతో తెలుసుకున్నాడు. కానీ సుభద్రా కళ్యాణములో విరహవేదనని అనుభవిస్తూ ముసుగు పెట్టిన సుభద్రను రుక్మిణి చూసి శ్రీ కృష్ణుడికి చెబుతుంది. శ్రీకృష్ణుడిని దివ్యపురుషుడిగా కాక సామాన్య మానవుడిగా తిమ్మక్క చిత్రించింది. కృష్ణుడిని దివ్యపురుషుడు కాక ఒక సాధారణ సోదరుడిగా చిత్రించడం వల్ల చదివే పాఠకులు కూడా శ్రీకృష్ణుడితో సహానుభూతి చెందుతారు. రుక్మిణి సుభద్రను ఆటపట్టించడంలో వదినా మరదళ్ల అనుబంధాన్ని తిమ్మక్క నేర్పుగా చెప్పింది.
వివాహానంతరం రుక్మిణి సుభద్రకు అత్తవారింట ఏ విధంగా మెలగాలో తెలియజేయడం, ద్రౌపది సుభద్ర పట్ల అసూయ చెందడం వంటి విషయాలలో తిమ్మక్క స్త్రీల మనస్తతత్వాన్ని చక్కగా చిత్రించింది.
ఈ విధంగా తిమ్మక్క బావ బావమరదులు వేళాకోళాలు, బావామరదళ్ళ సరసాలు, వదినా మరదళ్ళ ఆటపట్టింపులు, సవతుల మధ్య సంఘర్షణ వంటి కల్పనలను కథలో చొప్పించి, తెలుగు నుడికారాలతో, సుభద్రా కల్యాణము కావ్యాన్ని రచించి ఆంధ్ర సాహిత్యంలో తొలి తెలుగు కవయిత్రిగా తిమ్మక్క శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది.
9. ముగింపు:
సుభద్రా ధనంజయం,సుభద్రా కల్యాణము నాటక కావ్యాల కల్పనలు ఆయా నాటక కావ్యాలకి వన్నె తెచ్చిపెట్టాయి.అయితే "కావ్యేషు నాటకం రమ్యమ్ " అన్నట్టు గా నాటక ధర్మాలైన పంచ సంధుల వలన నాటకం ఉత్కంఠ భరితంగా ఉంటుంది.సుభద్రా కల్యాణము కంటే సుభద్రా ధనంజయంలోని కల్పనలు మూలానికి మొరుగులు దిద్ది నాటకాన్ని చివరి వరకూ చదివేలా చేశాయి.
10. పరిశోధనా ఫలితాలు :
అలంబసుడనే రాక్షసుడి బారి నుండి సుభద్రను అర్జునుడి రక్షించడం వల్ల సుభద్ర కు అర్జునిడి పట్ల ఆసక్తి కలగడానికి ఉపయోగపడింది. సుభద్ర గాత్రిక మీద అర్జనుడి పది పేర్లు ఉండడంవల్ల సుభద్ర కూడా అర్జనుడు అంటే ఇష్టం మని తెలుస్తుంది. సుభద్ర పురుష త్రయాన్ని ప్రేమించానని ఆత్మహత్య కు సిద్ధపడడం వల్ల నాటకంలో కరుణ రసం పోషింపబడింది. సుభద్ర రూపంలో కాత్యాయని దేవి కనపడడం వల్ల నాటకంలో అద్బుత రసం,విదూషకడి వల్ల హాస్య రసం, అర్జనుడి దేహ పరిత్యాగం వల్ల కరుణ రసం,అర్జనుడు రాక్షసిని ఎదుర్కోవడం వల్ల వీర రసాలు పోషింపబడ్డాయి.
తిమ్మక్క సుందోపసుందుల కథను సంక్షిప్తంగా చెప్పడం వల్ల సుభద్ర కల్యాణము కథకి ఎటువంటి ఆటంకం కలుగలేదు. కులశేఖర కవి సుభద్ర కన్నా తాళ్ళపాక తిమ్మక్క సుభద్ర తెలివైనది.కారణం కులశేఖర కవి సుభద్ర కపట యతి గా వచ్చినది అర్జునుడే అని తెలుసుకోలేదు. తిమ్మక్క సుభద్ర శ్రీకృష్ణడి మాటలవల్ల కపట యతే అర్జనుడని తెలుసుకొని అర్జునుడిని ఆట పట్టిస్తుంది.
11. పాదసూచికలు:
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, పు. 101.
- శ్రీమదాంధ్ర మహాభారతము, పు. 843.
12. ఉపయుక్తగ్రంథసూచి:
- అచ్యుతరామారావు, చావలి. తాళ్ళపాక తిమ్మక్క-సుభద్రాకల్యాణము-ఒక పరిశీలన. (1997). ఎం.ఫిల్. సిద్ధాంతవ్యాసం (అ.సి.గ్రం) ఆంధ్రవిశ్వకళాపరిషత్, వాల్తేరు.
- అప్పారావు. పోణంగి.అనువాదము నాట్యశాస్త్రం, (1982). నాట్యమాల ప్రచురణ, హైదరాబాద్.
- ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం (2002). మొదటి సంపుటి,తెలుగు అకాడమి,హైదరాబాద్.
- తిమ్మక్క, తాళ్ళపాక. సుభద్రాకల్యాణము, ప్రభాకర శాస్ర్తి, వేటూరి.
- రంగాచార్యులు, చెలమచెర్ల. అనువాదం ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము, (1972), శివాజీ ప్రెస్ సికింద్రాబాద్.
- వెంకట సుబ్బయ్య, అప్పజోడు. (వ్యాఖ్యానము) (2000). శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము రెండవ భాగము, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.
- వెంకట కవి, చెమకూర. విజయవిలాసము, (2009). ఎమెస్కోబుక్స్, విజయవాడ.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, పోతుకూచి. అనువాదం (1975). సుభద్రా ధనంజయం, తెనాలి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.