AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797
3. తెలుగులో హాస్యపత్రికలు: ఒక పరిశీలన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్,
కాకరపర్తి భావనారాయణ కళాశాల,
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9032044115. Email: krkrishna2011@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
సమాజంలో జరిగే సంఘటనలను వార్తలుగా అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన పత్రికలు కాలక్రమంలో అనేకవిధాలుగా తమ స్వరూప స్వభావాలు మార్చుకున్నాయి. పత్రికలు కేవలం జరిగిన విషయాలను తెలిపేవి మాత్రమే కాదు. అంతకుమించిన లక్ష్యం పత్రికలకు ఉంది. జాతీయోద్యమ సమయంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో పత్రికలు ముందువరుసలో ఉంటాయి. ఇలా, అనేక బాధ్యతలు భుజానికెత్తుకున్న పత్రికలు, కేవలం వార్తలకు మాత్రమే పరిమితం కాకుండా మనిషి సర్వాంగీణ వికాసం కోసం విభిన్న ఆవర్తన వ్యవధులు, విభిన్న అంశాల ప్రాధాన్యతతో ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక విభాగం హాస్యపత్రికలు. ఇతర పత్రికల సంఖ్యతో పోలిస్తే ప్రారంభం నుంచి ఇప్పటివరకు అతి తక్కువగా ఉన్నప్పటికీ సమాజంలో హాస్యపత్రికలు తమదైన ముద్రవేసాయి. స్వచ్ఛమైన హాస్యాన్ని సమాజ సభ్యులకు అందిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి. అయితే, ఆధునిక సాంకేతిక విప్లవ ప్రభావానికి హాస్యపత్రికలూ గురయ్యాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం ‘హాస్యానందం’ అనే పేరుతో ఒకే ఒక సంపూర్ణ హాస్యపత్రిక ప్రచురితమవుతోంది. ఇది వర్తమానం. భవిష్యత్తు గురించి ఆశ లేదు.
Keywords: పత్రికలు, హాస్యం, హాస్యపత్రికలు, ప్రచురణ, రామకృష్ణ
1. ఉపోద్ఘాతం:
భోజనం దొరక్కపోయినా భరిస్తాడేమో కానీ, మానవుడు సమాచారం కరవైతే మాత్రం తట్టుకోలేడు. తన సమాజంలో ఎక్కడ, ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూలహం అనుక్షణం మనిషిని వెన్నాడుతూనే ఉంటుంది. అయితే, ఇందులో వ్యక్తిగత భేదాల్ని బట్టి ఒక్కో వ్యక్తీ ఒక్కో రకమైన సమాచారం తెలుసుకోవాలని అనుకుంటాడు. కొందరు రాజకీయాలు, ఇంకొందరు క్రీడలు, సినిమాలు, విద్య, వైద్యం, వ్యాపారం... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ కావలసిన సమాచారం
అందించాలని పత్రికా సంపాదకులు, అధినేతలు నిరంతరం ఆలోచిస్తుంటారు. అందుకోసమే పరిశీలన, పరిశోధన చేస్తుంటారు.
ఇందులో భాగంగానే, హాస్య ప్రియులైన పాఠకుల కోసం హాస్యానికి కూడా వార్తాపత్రికల్లో చోటివ్వడం మొదలైంది.
ముందుగా పత్రిక అనే పదం ఎలా ఆవిర్భవించిందో పరిశీలిద్దాం.
2. పత్రిక - పదావిర్భావం:
పత్రిక అనే పదం తొలిరోజుల్లో కేవలం వ్యవహారరూపంలో వాడుకలో ఉండేది. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య క్రయవిక్రయాల ఒప్పందం మొదలైనవి రాతపూర్వకంగా భద్రపరచుకునే విధానానికి పత్రిక అనే పదాన్ని ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం రాతపూర్వకంగా సమాచారాన్ని చేరవేసుకునేందుకు ఉపయోగించే సాధనాన్ని పత్రిక అని వ్యవహరించడం ప్రారంభమైంది. శబ్దరత్నాకర రచయిత బహుజనపల్లి సీతారామాచార్యులు తన గ్రంథం (శబ్దరత్నాకరం: పుట 548)లో పత్రిక అనేపదానికి ‘వ్యవహారం యొక్క చెల్లుబడికై యొకరికొకరు వ్రాసుకొనడి పత్రము’1 అని అర్థం ఇచ్చారు. వార్తాపత్రిక అనే అర్థం ఈ నిఘంటువులో లేదు.
ఆ తర్వాత దాదాపు 50 సంవత్సరాలకు అంటే 1936లో వెలువడిన సూర్యరాయాంధ్ర నిఘంటువులో ‘వ్రాతకాధారమగు తాటియాకు కాగితం, వ్యవహారంలో పరస్పరం వ్రాసుకొనెడు పత్రం’ అనే అర్థాన్ని పత్రికకు ఇచ్చారు.
ముద్రణకు లేదా రాతకు కాగితాన్ని ఉపయోగించడానికి పూర్వం తాటాకులు లేదా భూర్జపత్రాలను ఉపయోగించేవారు. ఈ కారణంగా వ్యక్తులు వేటిని రాతకు ఉపయోగించేవారో వాటిని పత్రికలుగా వ్యవహరించడం మొదలైంది. ‘విడియాకులు’, ‘విడాకులు’ మొదలైన పదబంధాల ఉపయోగాన్నిబట్టి తొలిరోజుల్లో రాతకు పత్రాలను ఉపయోగించేవారని తెలుస్తోంది. ఈవిధంగా పత్రం నుంచి పత్రిక ఆవిర్భవించిందని భావించవచ్చు.
సాహిత్యపరంగా పత్రిక పదావిర్భావాన్ని పరిశీలిస్తే మొట్టమొదటగా పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నం తృతీయాశ్వాసంలో పత్రిక అనే పదం కనిపిస్తుంది. విరహవేదనతో ఉన్న ప్రద్యుమ్నుడు తన ప్రియురాలైన ప్రభావతికి తన ప్రణయభావాన్ని ఒక పత్రిక (లేఖ) ద్వారా తెలియజేస్తానని ఆలోచన చేసే సందర్భంలోని పద్యంలో పత్రిక అనే పదాన్ని సూరన ప్రయోగించాడు.
మత్తకోకిల.
అంచ తొయ్యలి దేవతాపతి యానచొప్పొనరించి యే
తెంచుటెన్నడు? దాని
చేత మదీయ హృద్గతి జెప్పి యే
బంచుటెన్నడు? గావునన్ వెస
బత్త్రికన్ లిఖియించి యా
యంచ కిప్పుడు పంచెదన్, సంతి
కంత దెల్పెడునట్లుగాన్2
(ప్రభావతీ ప్రద్యుమ్నం - తృతీయాశ్వాసం, పద్యం 27)
ఈవిధంగా పత్రం నుంచి పత్రిక అనే
పదం ఉద్భవించిందని రూఢ అవుతుంది. అయితే కాలక్రమంలో పత్రిక అనే పదానికి అనేక అర్థాలు మారుతూ వచ్చాయి.
వర్తమానంలో పత్రిక అనేపదానికి వార్తలు ప్రచురించే దినపత్రిక అనే అర్థం ఎక్కువగా వాడుకలో ఉంది. దినపత్రికలో
రీతిలో ఉండే వార, పక్ష, మాస తదితర పత్రికలకు కూడా ఈ అర్థాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే దినపత్రికలకు ఉన్న
అత్యధిక ప్రజాదరణ కారణంగా పత్రిక పదానికి వార్తాపత్రిక అనే పదమే సర్వసాధారణంగా వాడుకలో ఉంది. పత్రికకు
సమానార్థకంగా ఇంగ్లిషులో పేపర్ (Paper) అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కూడా పేపర్ అంటే
అది ఏ కాగితమైనా కావచ్చు. కానీ సర్వసాధారణంగా పేపర్ అంటే దినపత్రిక (News Paper) అనే భావమే అందరికీ
స్ఫురిస్తుంది.
3. తెలుగులో హాస్యపత్రికలు:
అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలుగులో వచ్చిన మొదటి హాస్యపత్రిక ‘ముద్దులు’. ఐ. వేంకట రమణయ్య సంపాదకత్వంలో అప్పటి కృష్ణాజిల్లా తెనాలికి సమీపంలోని పెదరావూరు ప్రాంతం నుంచి ఈ పత్రిక 01.01.1922 నుంచి వెలువడిరది. ఇది ద్వైమాసిక పత్రిక. అయితే, ఎంతకాలం నడిచించి, పత్రిక ప్రత్యేకతలు ఏమిటనే విషయంలో సాధికారికమైన సమాచారం లభించటం లేదు. అయితే, తొలి తెలుగు హాస్యపత్రిక మాత్రం ఇదే.
ఆ తర్వాత కొద్దికాలానికే, 01.08.1922 తేదీన కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుంచి కోసూరు గురునాథ మూర్తి సంపాదకత్వంలో ‘నవ్వుల తోట’ పేరుతో సరికొత్త హాస్య మాసపత్రిక వెలువడిరది. తనదైన ప్రత్యేకశైలి కారణంగా, అప్పట్లో ఈ పత్రిక పాఠకాదరణ బాగా పొందినట్లు తెలుస్తోంది.
ఈ పత్రికలో వచ్చిన శీర్షికల్లో ‘సంపాదకీయ వ్యాఖ్యానాలు, విలేఖరులకు బ్రత్యుత్తరములు, కబుర్లు, పిట్టకథలు..’ మొదలైనవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇందులో వచ్చిన వ్యంగ్య రచనల్ని పాఠకులు ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఈ పత్రికలో ‘విదూషకోపన్యాసము’ శీర్షికలో ప్రచురితమైన ‘స్త్రీల ప్రత్యేక సభ’ అనే వ్యాసం పాఠకుల్ని కడుపారా నవ్వించింది. అందులోని ఓ భాగం ఇలా సాగుతుంది... ‘పీతవర్ణపు పింగళాక్షులును, రక్తవర్ణపు రమణీమణులును, కృష్ణవర్ణపు కేశినులును, శుక్లవర్ణపు సుదతులు సభనలంకరించి యుండిరి. నేను చతికిలబడి jైుదారు నిముసములైనదో లేదో! జారుముళ్ళవారును, ముచ్చటముళ్ళవారును, ముందుకత్తిరింపులవారును, వలపలి పాపటలవారును, డాపలి పాపటలవారును, జారుముళ్ళవారును, జంటజడలవారును, కండ్ల జోళ్ళవారును, కాళ్ళజోళ్ళవారును, మేజోళ్ళవారును, మెడపట్టీల వారును, పైటలంగాలవారును, పట్కాలవారును, గూడకట్లవారును, కుచ్చెళ్ళవారును, జాకెట్లవారును, జారుపైటల వారును...’ అంటూ సాగిన ఈ వ్యాసం అప్పట్లో పాఠకులను ఎంతగానో నవ్వించింది. ఈ వ్యాస రచయిత పేరు ఇందులో ప్రచురితం కాలేదు. అసలు ఈ పత్రికలో మారుపేర్లతోనే రచనలు ఎక్కువగా వచ్చేవని ‘తెలుగు జర్నలిజం చరిత్ర’లో (పుట 112) నామాల విశ్వేశ్వరరరావు3 రాశారు.
ఎస్.జి. ఆచార్య సంపాదకుడిగా,
ఎన్.మునుస్వామి మొదలియార్ ప్రచురణకర్తగా 1928లో ‘చిత్రగుప్త’ పేరుతో ఓ పక్షపత్రిక
ప్రారంభమైంది. ‘జాతీయ హాస్యరస పక్షపత్రిక’ అని తనను తాను ఆ పత్రిక ప్రకటించుకుంది. ఈ పత్రిక 33
సంవత్సరాలకు పైగా నడిచింది.
ఈ పత్రికలో నాటికలు, కథలు, కార్టూనులు, కవితలు, జోకులతో పాటు, బహిరంగలేఖలు,
ఫ్లీట్ స్ట్రీట్ కథలు, పసిడి తునకలు, స్వీకృతి, కాలచక్రము, కార్డు కథలు, రసవాహిని, చిత్రగుప్త
డైరీ, గుసగుసలు, చిల్లర విషయాలు, ట్రంక్ టెలిఫోను, సినిమా లోకం మొదలైన శీర్షికలు కూడా
ప్రచురితమయ్యేవి.
చదలవాడ పిచ్చయ్య, ఠామరాపు సూర్యనారాయణరావు, రావూరు వెంకట సత్యనారాయణరావు, గొట్టిపాటి సుబ్బరాయ చౌదరి, రాయప్రోలు సుబ్బారావు, అనిసెట్టి సుబ్బారావు, కృత్తివాస తీర్థులు, ఘండికోట బ్రహ్మాజీరావు, మందరపు వెంకటేశ్వరరావు, తాళ్ళూరి రామానుజస్వామి, తూమాటి దొణప్ప, కప్పగంతుల సత్యనారాయణ, కె.బి.కె.పట్నాయక్ మొదలైన ప్రముఖులు ఈ పత్రికలో వ్యాసాలు రాసారు.
ఆ తర్వాత, ‘ఆనంద వాహిని’ పేరుతో హాస్య మాసపత్రిక 01.01.1930న మద్రాసు కేంద్రంగా వచ్చినట్లు రికార్డుల్లో ఉంది. ఈ పత్రిక సంపాదకుడు, ఇతర వివరాలు మాత్రం లభించడం లేదు. సరిగ్గా, ఇదే తేదీన పెద్దాపురం నుంచి ఎం.వి.సుబ్బారావు సంపాదకత్వంలో ‘ముద్దుల మూట’ పేరుతో మరో హాస్యపత్రిక వెలువడిరది. ఇది పక్ష పత్రిక.
పి.ఎస్.వేణుగోపాలస్వామి నాయుడు ప్రచురణకర్తగా, ఆర్.రంగనాయకమ్మ సంపాదకురాలిగా, మద్రాసు కేంద్రంగా 1932లో ‘వినోదిని’ పేరుతో ఓ హాస్యపత్రిక వెలువడిరది. క్లబ్బు కబుర్లు, కిచకిచలు, నవ్వు, బహుముఖాల అద్దం, సనాతన కాఫీ హోటల్, లౌ రోగములు, కళ్లెత్తి చూడని కారణం, ఇన్సూరెన్సు ప్రాయశ్చిత్తము, సైకిలు సరదా, బ్రహ్మదేవుడు తెల్లబోయాడు, ఏనుగబ్బాయి వివాహము, అనుమానం ప్రాణసంకటం, దయ్యాన్ని కాదంటూంటే, సోదె నా కొంప తీసింది, బి.వి.టప్పయ్య, అమ్మమ్మ, పిల్లి, ది ప్రణయలత భీమాకంపెనీ, పేచీల పెదబాబు మొదలైన శీర్షికలు, వ్యాసాలు ఈ పత్రికలో అచ్చయ్యాయి. ఇవన్నీ అప్పట్లో పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ పత్రికలో హాస్య విషయాలతో పాటు సాముద్రికశాస్త్రం, చదరంగం, గ్రంథసమాలోచన, రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురించేవారు. ప్రముఖ రచయిత చలం వ్రాసిన బ్రాహ్మణీకం నవల ఈ పత్రికలో ధారావాహికగా వెలువడిరది. విశ్వనాథ కవిరాజు, పూడిపెద్ది వేంకట రమణయ్య, కొడవటిగంటి కుటుంబరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, భాగవతుల శివశంకర శాస్త్రి మొదలైన హేమాహేమీలందరూ ఈ పత్రికలో వ్యాసాలు రాసారు.
‘హాస్యవల్లరి’ పేరుతో ఓ హాస్య మాసపత్రిక 01.02.1934 నుంచి వెలువడినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, అంతకుమించి మరే ఇతర సమాచారం లభించడం లేదు. అదే ఏడాది, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కె. కోటీశ్వరలింగం సంపాదకుడిగా కృష్ణాజిల్లా, మచిలీపట్నం నంచి ‘నవ్వులరాణి పేరుతో ఓ హాస్య మాసపత్రిక వెలువడిరది. ఈ పత్రిక కూడా అతి స్వల్పకాలంలో పాఠకాదరణ పొందింది.
కాకతాళీయం కావచ్చేమో కానీ, సరిగ్గా ఇదే తేదీన ‘నవ్వుల మూట’ పేరుతో ఓ హాస్య మాసపత్రిక వెలువడినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ రికార్డుల్లో ఉంది. కానీ, ఇంతకుమించి మరే ఇతర వివరాలు లభ్యం కాలేదు.
‘ఆనంద’ పేరుతో జి.వి.భద్రాచారి సంపాదకత్వవంలో ఓ మాస పత్రిక 01.01.1937 నుంచి నెల్లూరు కేంద్రంగా కొంతకాలం నడిచింది. రాజమహేంద్రవరం కేంద్రంగా 01.01.1939 నుంచి ‘శ్రమజీవి’ పేరుతో ఓ వారపత్రిక చిలకమర్రి సత్యనారాయణాచార్య సంపాదకత్వంలో వెలువడిరది. హాస్యపత్రిక అని రికార్డుల్లో ఉన్నప్పటికీ పత్రిక పేరు ‘శ్రమజీవి’ అని ఉండటం పరిశోధకుల్లో చర్చకు దారితీసింది. పూర్తి వివరాలు లభించకపోవడంతో ఈ పత్రిక గురించి సాధికారికమైన ముగింపునకు పరిశోధకులు రాలేకపోయారు.
మద్రాసు కేంద్రంగా కె.రాధాకృష్ణ సంపాదకుడిగా 01.08.1952 నుంచి ‘గుండు సూది’ పేరుతో వచ్చిన మాసపత్రిక పాఠకుల్ని ఆకట్టుకుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా ముమ్మిడి కృష్ణమూర్తి సంపాదకుడిగా 01.08.1961 నుంచి కొంతకాలం పాటు ‘జోకర్’ పేరుతో ఓ పత్రిక వెలువడిరది. ప్రారంభంలో పాఠకాదరణ బాగా పొందినప్పటికీ, వ్యవస్థాగతమైన లోపాల కారణంగా పత్రిక ఎక్కువకాలం నడవలేదు.
హైదరాబాదు నుంచి జి.రాంబాబు సంపాదకుడిగా వచ్చిన ‘హాస్యప్రభ’ మాసపత్రిక (01.09.1976), అదే ప్రాంతం నుంచి శంకు సంపాదకుడిగా వచ్చిన ‘హాస్యప్రియ’ పక్ష పత్రిక (25.04.1987) కూడా పాఠకుల్ని బాగానే నవ్వించాయి. ‘సరదా’ పేరుతో ఓ పక్ష పత్రిక వెలువడినట్లు తెలుస్తున్నప్పటికీ, సంపాదకుడు తదితర వివరాలు మాత్రం తెలియటం లేదు. బరంపురం కేంద్రంగా కాంచనపల్లి వేంకట రంగారావు సంపాదకుడిగా ‘నవ్వుల తీవ’ పేరుతో ఓ మాస పత్రిక వెలువడిరది. దీని వివరాలు కూడా అసంపూర్ణంగా లభ్యమవుతున్నాయి.
హాస్యంతో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అక్టోబరు, 2001 తెలుగులో వెలువడిన హాస్య పక్షపత్రిక ‘హాసం’. వీణకు బదులు గిటార్ వాయిస్తున్నట్లు చిత్రించబడిన సరస్వతీదేవి చిత్రం ఈ పత్రికకు పతాకచిత్రం (లోగో)గా ఉండేది. ప్రారంభం నుంచే ఈ పత్రిక బాగా పాఠకాదరణ పొందింది. శాంతా బయోటెక్ కంపెనీ అధినేత కె.ఇ.వరప్రసాద్ రెడ్డి ఈ హాస్యపత్రిక వ్యవస్థాపకుడు. రాజా సంపాదకులు. ఇది హైదరాబాదులోని హుమ్మస్ ఇన్ఫోవే లిమిటెడ్ ద్వారా విడుదలయ్యేది. భారతీయ సంగీతానికి, హాస్యానికి అంకితమైన ఏకైక తెలుగు పత్రిక ఇది. పత్రికలో కథలు, సీరియల్స్, సంగీతానికి సంబంధించిన శీర్షికలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఈ పత్రిక ద్వారా ఎందరో ప్రముఖ సంగీతకారుల్ని, పాత తెలుగు సినిమాలను, సినీ ప్రముఖుల్ని పరిచయం చేశారు. దీనిలోని బాపూరమణీయం శీర్షిక ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఇది ఇంటర్నెట్‌లో కూడా లభించేది. సేకరించి దాచుకోవాలి అనేంతగా చక్కటి సమాచారం ఈ పత్రికలో ప్రచురించబడేది. కాని, సరైన ఆదరణ లభించక, ఈ పత్రిక 2004వ సంవత్సరంలో మూతబడిరది.
కొసమెరుపు ఏమిటంటే... పత్రిక మూతబడిన తర్వాత అందులోని శీర్షికలకు విశేష ఆదరణ లభించడం. పత్రిక మూసివేసిన తర్వాత, శీర్షికలను ప్రత్యేక సంచికలుగా విడుదల చేస్తే, అవన్నీ బాగా అమ్ముడు కావడం పత్రికలోని అంశాల పట్ల పాఠకులు చూపించిన ఆదరణకు నిదర్శనంగా నిలుస్తుంది.
సునిశితమైన హాస్యానికి వ్యంగ్యాన్ని జోడిస్తూ విజయవాడ నుంచి 2003లో వెలువడిన ‘హాస్యానందం’ ఆధునిక కాలంలో ఓ చక్కని ప్రయత్నంగా కొనసాగింది. రాము పండా దీనికి సంపాదకుడు, ప్రచురణకర్త కూడా. సినీ, రాజకీయ వార్తలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ పత్రికలు నడుపుతున్న ఈకాలంలో కేవలం హాస్యాన్ని నమ్ముకుని పత్రికను ప్రారంభించడం పెద్ద సాహసమే అవుతుంది. ప్రారంభంలో ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ పత్రికను కొన్ని కారణాల వల్ల 2008, 2009 సంవత్సరాల్లో ప్రచురించలేదు. క్రీ.శ.2010 నుంచి తిరిగి ప్రారంభమై, ప్రస్తుతం గుంటూరు నుంచి ఈ రోజుకీ క్రమం తప్పకుండా వెలువడుతోంది.
చందు సంపాదకుడిగా ‘స్మైల్
ప్లీజ్’ పేరుతో 01.12.2005 నుంచి వెలువడిన హాస్య మాసపత్రిక అచిరకాలంలోనే పాఠకాదరణ పొందింది. ఎంత
త్వరగా ప్రాచుర్యంలోకి వచ్చిందో, అంత త్వరగా మూతబడటం హాస్యప్రియులకు నిరాశ మిగిల్చింది.
4.
హాస్యపత్రికలు - విషయ విశ్లేషణ:
హాస్యపత్రికలలో ప్రధానమైన అంశం హాస్యం. ఇందులో
ఎటువంటి చర్చకు తావులేదు. అయితే, ఆయా పత్రికలు ఎంచుకున్న విషయ వైవిధ్యం, పత్రికను తీర్చిదిద్దిన తీరు
మొదలైన అంశాలు పాఠకుల్ని ఆకట్టుకునే విషయంలో ప్రమముఖ పాత్ర పోషిస్తాయి.
ప్రారంభం నుంచి దాదాపుగా
పత్రికలన్నీ హాస్యరసంతో నిండిన కథలు ప్రచురించడానికే ప్రాధాన్యత ఇచ్చాయి. సుమారుగా 70 దశకం తర్వాత ఈ తీరులో
మార్పు వచ్చింది. వ్యంగ్యచిత్రాలు (కార్టూన్లు) ప్రచురించడానికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వటంతో హాస్యపత్రికల
వైపు పాఠకులు ఎక్కువగా మొగ్గుచూపడం మొదలైంది. మొదట్లో కేవలం అక్కడక్కడా వేసే కార్టూన్లు, క్రమంగా పత్రికను
శాసించే స్థాయికి ఎదిగాయి. కేవలం కార్టూన్ల వల్లే పత్రికలు నడిచే పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత కొద్ది
కాలానికి ప్రముఖ కార్టూనిస్టులు గీసే చిత్రాలతో ప్రత్యేక శీర్షికలు నిర్వహించడానికి పత్రికలు ప్రాధాన్యత
ఇచ్చాయి. ప్రతి నెలా ఓ కొత్త అంశం తీసుకుని, వాటి మీద ఓ కార్టూనిస్ట్‌తో చిత్రాలు గీయించి, ప్రత్యేక
శీర్షికతో వాటిని ప్రచురించడం అనే కొత్త విధానం వైపు పత్రికలు మొగ్గుచూపాయి. పాఠకులు కూడా ఈ శీర్షికల్ని
బాగా ఆదరించేవారు. క్రమంగా కార్టూను పోటీలు నిర్వహించడం ప్రారంభమైంది.
మొత్తంగా చూస్తే, హాస్యపత్రికల్లో కథలు, ధారావాహికల వంటి రచనల కంటే, కార్టూన్ల కోసమే పాఠకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అయితే, ఇంతగా ఆదరణ ఉన్నప్పటికీ హాస్యపత్రికలు నడపలేక దాదాపుగా అందరు ప్రచురణకర్తలూ తమ పత్రికలు మూసేసారు. ప్రస్తుతం హాస్యానందం అనే ఒకే ఒక హాస్యపత్రిక వెలువడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే సంపూర్ణ హాస్య మాసపత్రిక.
హాస్య పత్రికలు ఎందుకు మూతబడుతున్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తే, ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొందరు ప్రచురణకర్తలతో ఈ వ్యాస రచయిత జరిపిన ముఖాముఖిలో వెల్లడైన విషయాలు ఇలా ఉన్నాయి.
అ) హాస్యరచనలు చేసే రచయితలు తగ్గిపోయారు. కేవలం అతి కొద్దిమంది మాత్రమే హాస్యరచనలు చెయ్యటానికి మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల వైవిధ్యత తీసుకురావటం కష్టమవుతోంది.
ఆ) సామాజిక మాధ్యమాల జోరులో హాస్యపత్రికల ప్రాధాన్యత తగ్గుతోంది. అతి స్వల్ప వ్యవధిలో పాఠకాదరణ పొందగలగడం వల్ల చిత్రకారులు, సామాజిక మాధ్యమాలకు ప్రాధాన్యత ఇస్తూ, రచయితలు పూర్తిస్థాయిలో పత్రికలకు రచనలు చెయ్యడం లేదు.
ఇ) రచయితల కోణంలో చూసినప్పుడు, ప్రచురణకర్తలు ఇస్తున్న పారితోషికం చాలా తక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో రచయితలు డబ్బులు ఎదురుపెట్టి మరీ రచన వేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందుకు రచయితలు ఆసక్తి చూపించడం లేదు.
ఈ) సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావటంతో పైరసీ సమస్య విపరీతంగా పెరుగుతోంది. అనేక కష్టనష్టాలు భరించి, ప్రచురణకర్త పత్రిక ప్రచురించి, అతి కొద్దిరోజుల్లోనే పత్రిక ‘సాఫ్ట్ కాపీ’ బయటకు వచ్చేస్తోంది. అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో ఈ కాపీని పోస్ట్ చేస్తుండటంతో పత్రికను కొని చదివే పాఠకులు అతి స్వల్పసంఖ్యలో ఉంటున్నారు. ఆర్థికంగా ప్రచురణకర్తలకు ఇది తీవ్రమైన నష్టాలకు గురిచేస్తోంది. ఈ కారణంగానూ ప్రచురణకర్తలు పత్రిక ప్రచురించాలన్న ఆలోచన విరమించుకుంటున్నారు.
ఈ సమస్యలన్నీ దాటుకుంటూ, అటు రచయితలు ఇటు పాఠకుల
సమూహాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం వెలువడుతున్న ఏకైక హాస్యపత్రిక
‘హాస్యానందం’. దాదాపు ప్రతి నెలా కార్టూన్ పోటీలు నిర్వహించడం, బెస్ట్
కార్టూన్ అవార్డు ఇవ్వడం, కథల పోటీలు నిర్వహించడంతో పాటు మరికొంచెం ముందుకువెళ్ళి
ఎస్.ఎం.ఎస్.పోటీలు నిర్వహిస్తూ ఈ పత్రిక పాఠకులకు నిరంతర హాస్యం అందించే ప్రయత్నం
చేస్తోంది.
ముగింపు:
సమాజానికి అత్యంత అవసరమైన ఔషధం
‘హాస్యం’. ఏరకంగా అయినా సరే, రోజులో సాధ్యమైనంత ఎక్కువ సేపు నవ్వుతూ ఉండండి అంటూ వైద్యులు కూడా
సలహాలు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన హాస్యం అందించే పత్రికల అవసరం సమాజానికి చాలా
ఉంది. స్వాతంత్ర్యం రావటానికి సుమారు రెండు దశాబ్దాలకు పూర్వమే తెలుగులో హాస్యపత్రికలు రావడం
మొదలైనప్పటికీ, మొత్తంగా వెలువడిన పత్రికల సంఖ్య 20 దాటలేదు. అధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య ఇంకా
తక్కువగా ఉంది.
ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలని పత్రికాధిపతులు, సంపాదకులు తీవ్రమైన
ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైవిధ్యభరితమైన శీర్షికలతో పాఠకులను ఆకట్టుకోవడానికి, పత్రికలో పాఠకుల
భాగస్వామ్యం పెంచడానికి కృషి చేస్తున్నారు. అయితే, ముద్రణఖర్చు విపరీతంగా పెరడటం, సాంకేతికత కారణంగా
డూప్లికేషన్ వంటి సమస్యలు పత్రికారంగాన్ని తీవ్రంగా ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. వీటన్నిటినీ
సమర్థంగా ఎదుర్కోవాలంటే పాఠకులు కూడా ప్రచురణకర్తలకు సహకరించాలి. పత్రికలను కొని చదివే అలవాటు పెంచుకోవాలి.
అప్పుడే రచయితలు కూడా ఉత్సాహంతో కలానికి పదునుపెడతారు. మంచి హాస్యం ద్వారా మంచి సమాజం కూడా
ఏర్పడుతుంది.
పాదసూచికలు:
- శబ్దరత్నాకరం, బహుజనపల్లి సీతారామాచార్యులు, పుట. 548
- ప్రభావతీ ప్రద్యుమ్నం, పింగళి సూరన, తృతీయాశ్వాసం, పద్యం. 27
- తెలుగు జర్నలిజం చరిత్ర, నామాల విశ్వేశ్వరరావు, పుట. 112
ఉపయుక్తగ్రంథసూచి:
- గోపాలరెడ్డి, జి., చక్రధర్, గోవిందరాజు (సం). 2001. తెలుగు పత్రికారంగం నిన్న నేడు రేపు. హైదరాబాదు : రచన జర్నలిజం కళాశాల.
- గోపాల్‌రెడ్డి, జి., హరిహరశర్మ, టి. (సం) 2003. జనమాధ్యమాలు సామాజిక బాధ్యత. హైదరాబాదు : రచన జర్నలిజం కళాశాల.
- గోపాల్‌రెడ్డి, జి., చక్రధర్ గోవిందరాజు. (సం) 2005. తెలుగు పత్రికలు ఆధునిక ధోరణులు. హైదరాబాదు : రచన జర్నలిజం కళాశాల
- చెన్నయ్య, జె. 1998. తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్.
- చంద్రశేఖర్, పగడాల. 2011. తెలుగు దినపత్రికల భాష ఆధునీకరణ (1914-1984). హైదరాబాదు : పగడాల పబ్లికేషన్స్.
- బాలశౌరిరెడ్డి. 2010. తెలుగు పత్రికల చరిత్ర (1947-2006). విజయవాడ: ఎమెస్కో పబ్లికేషన్స్
- రామచంద్ర, తిరుమల. 1989. తెలుగు పత్రికల సాహిత్య సేవ. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
- లక్ష్మణరెడ్డి, వి. 2002. తెలుగు జర్నలిజం అవతరణ వికాసం. హైదరాబాదు: రచన జర్నలిజం కళాశాల.
- వరదాచారి, జిఎస్. 1999. దిద్దుబాటు. హైదరాబాదు : రచన జర్నలిజం కళాశాల.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.