AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797
1. చిఱుతల రామాయణం: ఆధునికసమాజం
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ,
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్),
తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్–503 322, తెలంగాణ.
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
చిరుతల రామాయణం దేశకాల పరిస్థితులను అనుసరించి రూపుదిద్దుకున్నది. 1900–2000 సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణకు సాంస్కృతిక పునర్ వైభవాన్ని కల్పించిన ప్రక్రియ యక్షగానం. భజనల రూపంలో సమాజంలోకి రామాయణ గాథను తీసుకెళ్లాలని సంకల్పించిన వారు యక్షగాణ కళాకారులు, రచయితలు. యక్షగానం ద్వారా కలిగిన సామాజిక చైతన్యాన్ని చెప్పే వ్యాసమిది. వ్యాస ఉద్దేశం సాంస్కృతిక వేదిక ద్వారా ప్రజా చైతన్యం కలిగిన తీరు వివరించడం. యక్షగానం ద్వారా ప్రజలు సాంస్కృతిక వైభవాన్ని పొందుతారు. ఈ వైభవాన్ని చిరుతల రామాయణాన్ని చదివి, అర్థం చేసుకొని భావి పరిశోధకులకు పూర్వ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిచయం చేయడం. ఈ అంశంపై ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డా. ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, ఆచార్య యం. భాగయ్య తదితరులు పరిశోధన చేయటంతో పాటు కళాకారుల జీవితాలను అధ్యయనం చేసి వ్యాసాల రూపంలో పొందుపరిచారు. ఉదాహరణ పరిశీలిద్దాం. ‘‘యక్షగానం కన్నా చిరుతలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. భాగయ్య కవి రాసిన చిరుతల రామాయణం ఆడడానికి 4, 5 రాత్రుల పూర్తి సమయం పడుతుంది. కనురెప్ప వాల్చకుండా అలాగే చూసే ప్రజలు కోకొల్లలు ఉన్నారు. శ్రీ బాగయ్య కవి చిరుతల రచనల్ని స్వీకరించి ఆడిన చిరుతల దళాలెన్నో పల్లె ప్రజల హృదయాల్ని కొల్లగాట్టాయని" జానపద పరిశోధకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారంటారు.
Keywords: యజ్ఞయాగాదులు, రావణాసురుడు, వానరుల సహాయం, చెర్విరాల భాగయ్య, పరిష్కారం, సమయస్ఫూర్తి, సంకీర్తనలు, భజనలు, వీధి భాగవతం.
ఉపోద్ఘాతం:
చిరుతల ప్రదర్శన అనేక జానపదకళారూపాల సమాహార కళారూపం ఒక సమగ్ర కళారూపం భజన సంకీర్తల దరువులను, యక్షగాన దరువులను అడుగుల భజనను, ఈల–డోలు–హార్మోనియం– రాగాలు–చిరుతలు తదితర విద్య పరికరాలతో చిరుతల ప్రదర్శన రూపమెత్తింది. కథావస్తువును కలుపుకోవడంతో ఇది నాటకంగా పిలువబడిరది. ప్రారంభంలో ఏ ఇతివృత్తమైనా చిరుతల రామాయణంగానే ప్రసిద్ధి పొందింది. భారత ఇతివృత్తాలు, భాగవత ఇతివృత్తాలు, కాల్పనిక ఇతివృత్తాలు, చారిత్రక ఇతివృత్తాలు ఇవన్నీ చిరుతల నాటకం గ్రహించింది.
ప్రధానవిషయం:
చిరుతల ప్రదర్శనమంటే వస్తు సమ్మిశ్రితమై నృత్యంతో
కూడి అడుగుల –చిందులతో కూడుకుని కుండలాకార (వృత్తాకార) సమగ్ర–సమిష్టి నాట్య ప్రబంధ
ప్రదర్శన.
తెలుగులో వీధి భాగవతాల్లో
అంతర్భాగం చిరుతల భాగవతం. అట్లని వీధి రామాయణం, ప్రహసనం, ఢమిం, వ్యాయోగం, సమవాకారం, వీధి, అంకం,
ఈహామృగం ఇవీ దశరూపకాలు. తెలుగులో తొలి వీధి క్రీడాభిరామం. ఓరుగల్లు ఇతివృత్తంగా నడిచింది. వీధి
నాటకాల్లో ప్రధానమైనవి యక్షగానాలు, బయలాటలు, బహురూపులు. 15వ శతాబ్దం నాటి క్రీడాభిరామం మూలంగా ఆ తరువాత
యక్షగానాలు, చిరుతల ప్రదర్శనలు వచ్చాయి. అయితే రచయితలు రెండు మూడు రోజులు ప్రదర్శించేంత నిడివితో
వీటిని సంసిద్ధం చేశారు. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే చిరుతల రామాయణం, భాగవతాలున్నాయి. నిజాం
పాలించిన తెలుగు మరాఠీ, కర్ణాటక ప్రాంతంలోని పదహారు జిల్లాల్లో ప్రదర్శింపబడిరది. నిజాం పాలిత ప్రాంతాల్లో
తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి అడ్డుకట్టగా నిలిచిన నిరంకుశ నిజాం చర్యలకు ప్రతిఘటనా రూపకంగా యక్షగానమూ,
చిరుతల నాటకమూ విస్తరించింది.
తెలంగాణలో యక్షగాన పితామహుడుగా
పిలువబడుతున్న చెర్విరాల భాగయ్య, శతాధిక గ్రంథకర్త. చిరుతల సాహిత్య బ్రహ్మ. నాటి నిజాం నిరంకుశత్వాన్ని
ప్రతిబింబించే రద్దె రజాకరీ, జుల్మే రజాకరీలనే బుఱ్ఱ కథలు ప్రచురించి ప్రజల కళ్ళు తెరిపించాడు.
రజాకార్లు ఆ పుస్తకాలను తగులబెట్టించారు. నిజాం పోలీసులు ఆ పుస్తకాలను ఎవరి దగ్గర ఉన్నా వారిని
జైలులో వేస్తామని చాటింపు వేశారు. నిజాం ప్రభుత్వం వీటిని నిషేధించింది. అదివరకే యక్షగాన
చిరుతల నాటకాల్ని రచించి ప్రదర్శనలిప్పించారు భాగయ్య. మెదక్ జిల్లాలో, ప్రస్తుతమున్న రంగారెడ్డి
జిల్లాలో ఈ ప్రదర్శనలు చాటుమాటుగా ఆరంభమై, ఆ తర్వాత అచ్చయ్యాయి. అలా అచ్చయినవి ప్రజా జీవితంలోకి
వెళ్ళిపోయాయి.
చిరుతల నాటక ప్రదర్శన:
స్వాతంత్య్రానికి పూర్వమే ప్రచురణకు నోచుకున్న
చిఱుతల నాటకాలు స్వాతంత్య్రానంతరం చిఱుతల రామాయణాలు, చిఱుతల మైరావణం వంటివెన్నో ప్రచారాన్ని పొందాయి.
రామాయణంలోని చాలా అంశాలు సమకాలీన జీవనాన్ని ప్రతిబింబించి పరిష్కారాన్ని సూచించే దిశలో నడిచాయి. ఈ
చిఱుతల నాటక ప్రదర్శనపై భజనల ‘‘సోమా!/పాదవనామా! పట్టాభిరామా/ జయ జయ రామా!/జానకి రామా!/
ఆహా! రామా ఆయోధ్యరామ’’1 వర్తులాకారంలో (గుండంలో) నిలబడిగానీ, కూర్చుండి
మధ్య మధ్య లేస్తూ గానీ, చేతిలో చిరుతల నాడిస్తూ, ఆ దర్వుకూ – కాలి కదలికలకు అనుగుణంగా పాటలందుకుంటూ,
చిందులు వేస్తూ చేసే చిరుతల భజనే తెలంగాణా ప్రాంతంలో చిఱుతల రామాయణంగా పరిణమించింది. అడుగుల భజన, చిందు భజన,
చెక్క భజన, కులుకు భజన, పండరి భజన, తాళ భజన, కలాపంసొగసులు, యక్షగానం అడుగులు, వీధి భాగవతం ఇలా ఎన్నో కలిసి
చిరుతల నాట్యంగా, చిరుతల రామాయణంగా అవతారమెత్తింది. ఇవన్నీ చిరుతలను వికసింపజేస్తాయి. రెండు మూడు
రోజులు సాగడానికి కారణం కూడ నాటి సమాజ దుస్థితే. తెలంగాణలో సాంస్కృతిక పునర్వైభవం వికసింపజేయడానికి,
ప్రజాచైతన్యానికి సుదీర్ఘ ఇతివృత్తాలతో చిరుతల నాటకం సాగింది.
సాంస్కృతిక
అస్తిత్వం:
నేటి (2010 నుండి) తెలంగాణ సంస్కృతిలో
‘‘బతుకమ్మ’’ తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడే దిశలో పునర్వైభవ వికాసం
జరిగితే, నాటి మతేతర శక్తుల నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను చెర్విరాల భాగయ్య వంటి
మహానుభావులు తీసుకున్నారు. ‘‘జయ జయ రామ! జానకి రామా! దయాసాగర! శ్రీ తారక
నామా!’’2 హరి, రామ, నరసింహ భజనం సంప్రదాయమే ఇది. జన వ్యవహారంలోని
ఈ రాం (హరి) భజన ‘‘శ్రీ రామ రాముడోయి – రామ భజన / రామన్న రాముడోయి – రామ
భజన’’ ఇటువంటి రాంభజనే చిఱుతల రామాయణ ప్రాదుర్భావానికి ఒక ఆధారంగా నిలిచింది. భజనకు ఉండే
విధానాలు, పద్ధతులు, నియమాలు ఇవన్నీ చిరుతలకూ వర్తిస్తాయి.
‘‘భజన చేసే విధము తెలియండీ – ఓ
భక్తులారా
సుజనులను దూషింపబోకండీ
భజన చేసే విధము కనుగొని
భక్తి
నమ్రత కలిగి యెప్పుడు ॥భజన॥
ఒళ్లు మరచీ భజన చేయండీ – ఓ భక్తులారా!
నల్లనయ్యా! స్మరణ
వీడకండీ!
కల్లు సారా ద్రాగి చేసిన
కలియదోయీ భజన యెప్పుడు ॥భజన॥
సర్వమూ పరమాత్మ అనుకోండి! ఓ
భక్తులారా
సర్వ మతముల పారద్రోలండీ –
నిర్మలంగా చిత్తముంచీ
ధర్మ పథమున
నడువగోరీ’’3 ॥భజన॥
మంచివారిని దూషించవద్దు.
భక్తి నమ్రత కలిగి ఉండాలి. కల్లు సారా త్రాగరాదు. త్రాగి భజనలు చేయరాదు. అలా చేస్తే
పుణ్యం రాదు. అసత్యాలు పలుకరాదు. దీనివల్ల నిత్య సుఖాలు కలుగుతాయి. వివిధ మతాల
అభిప్రాయాలతో కలిసిపోవద్దు. అంతా పరమాత్మే అనుకోండి. నిర్మలమైన మనసుతో ధర్మపథాన నడవండి.
ఇలా భజన విధానాన్ని వివరించిన సంకీర్తన ద్వారా ఇన్ని ప్రయోజనాలు సాధించే అవకాశముంది. తెలంగాణ ప్రజలు
వారి ఉనికిని కాపాడుకునే అవకాశముంది. బాలకాండ మొదలు రాముడు అరణ్యవాసం తరువాత రావణాసురుని వధ అనంతరం రామ
పట్టాభిషేకం వరకూ చిరుతల రామాయణం కొనసాగింది. ఇందులో రామాయణ కథను సమకాలీన సమాజానికి అన్వయిస్తూనే కథ
కొనసాగింది.
చిరుతల పద్ధతులు:
చిరుతల పద్ధతి ప్రకారం ప్రార్థన,
పాత్ర ప్రవేశం జరిగిన తర్వాత కథ ప్రారంభమవుతుంది. కథలోని పాత్రలు రామాయణ పాత్రలే అయినా, ఆధునిక సమాజపు
పాత్రలకు దగ్గరగా ఉన్నాయి. రావణుని ఆలోచన ప్రకారం విశ్వామిత్రుని యజ్ఞభంగం చేయడానికి తాటకి,
మారీచసుబాహువులు మద్యపానమర్తులై స్వైరవిహారం చేస్తారు. దశరథునికి శ్రీహరి పుట్టాడని, అతడే శ్రీరాముడని
మారీచసుబాహుల అంతానికి ఆయనను పురికొల్పమని దశరథున్ని విశ్వామిత్రుడు అడుగుతాడు. శ్రీరామ, లక్ష్మణులు యజ్ఞ
రక్షణకు పూనుకొని తాటకి, మారీచసుబాహులను వధిస్తారు. ఇదంతా నేటి కాల దుష్టుల నివారణ నిమిత్తం చెర్విరాల
భాగయ్య వ్రాసిందే.
సమాజంలోని స్త్రీల ఆలోచనలు
పరిపూర్ణంగా, నిలకడగా ఉండాలని విన్నవిస్తూ రచయిత కైకేయి అలుక వల్ల కలిగిన అనర్థాన్ని వివరిస్తాడు.
సవతి ప్రేమ సమాజానికి చేటని తెలియపరిచాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణం మంధర అని
తెలుసుకొని భరతుడు సిగ పట్టుకొని తిప్పుతాడు. ఇదంతా దృశ్య రూపంలో చిరుతల ప్రదర్శన చేసినపుడు స్త్రీల
ఆలోచనా విధానంలో మార్పు రావడం సహజం. శూర్పణఖ లాంటి వ్యక్తిత్వం లేని స్త్రీలకు కూడా తగిన బుద్ధి
చెప్పాలని కోరుకుంటాడు. లక్ష్మణుడు శూర్పణఖ వీపుపై శ్రీరాముడు వ్రాసిన వాక్యాలను చదివి
‘‘యోచి చూడగ మనల వంచించదలచె’’నని అర్థం చేసుకొని చెవులు, ముక్కు కోసి
పంపుతాడు.
మనుషులు చేసే మాయాజాలంలో
కొట్టుకుపోవద్దని మారీచుని వంటి మాయలేడులు సమాజంలో ఉంటాయని హెచ్చరించాడు భాగయ్య.
‘‘వినాశకాలే విపరీత బుద్ధి’’ అనుకొని బంగారు మాయలేడి రూపమెత్తుతాడు మారీచుడు.
విపరీత బుద్ధి వల్ల కలిగే భవిష్యత్తు వినాశనానికి నాంది మాయలేడి రూపం. ఇలాంటి వ్యక్తులను నేటి సమాజంలో
చూస్తున్నాం. సమయస్ఫూర్తితో తప్పించుకునే తత్వం అలవరచుకోవాలని రచయిత కోరుతాడు. చిన్న చిన్న కోరికలను
తీర్చమన్న సీత వలె కష్టాలకు గురి కాకూడదు. సమస్య పరిష్కారాన్ని కూడా చూపుతుందని చెప్పడానికి సుగ్రీవ,
ఆంజనేయ పాత్రలు ఉదాహరణలు.
సమాజంలో వానరుల సహాయాన్ని
అర్థించవచ్చని చెప్పుటకు ఆంజనేయుణ్ణి ఉదాహరణగా తీసుకోవచ్చు. అపజయాల నుండి తప్పించుకోవడానికి ఉపాయ మార్గాలు
ఉన్నాయని అవి జరిగి తీరుతాయని త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని సీతాదేవికి చెబుతుంది. సీతను చెర నుండి
విడిపించడానికి, రావణుని వధకు రాముడే సంకల్పించాడు. మనుషుల్లో విభీషణుని వంటి వారూ ఉంటారని చెప్పడానికి
విభీషణుని సహాయమర్థించాడు రాముడు. అవలక్షణాలతో పోరాడి ఓడిరదానికంటే విభీషణుని మాదిరిగా సద్గుణాన్ని
కలిగి ఉండటం ఉత్తమం.
నేటి సమాజపు అన్వయం:
నేటి కాలంలో కూటికోసం గొంతులు
కోసేవారున్నారు. దీనికి ఉదాహరణగా తాటక, సుబాంగుల పాత్రలను చెప్పుకోవచ్చు. ‘‘ఏడనుంటివే
ముసలవ్వా! మన! యేలిక బిలిచెను గదనవ్వా! కూడు దొరికెను మాయవ్వా! కూడిపోవడమే ఓ
యవ్వా’’!. రావణాసురుడు యజ్ఞయాగాదుల విధ్వంసానికి పిలుస్తున్నాడని తెలుసు, అందుకే
వీరు సుసిద్ధమవుతారు. కూటి కొరకే తామీ పని చేస్తున్నట్లుగా వారి మాటల వల్ల తెలిసింది. మారీచుడు
పిలువగా తాటకి ఇలా అంటుంది. ‘‘ఉండరోరి యిపుడే వస్తా!! మనకున్నవన్నింటిని తిరిగేస్తా! తిండిలేకనే
గుండె పగిలితిని! కండలన్నీ మ్రగ్గంగ జొచ్చెను’’ ఈ విషయం మూల రామాయణంలో లేదు. కిరాయి గూండాలను
పెంచి పోషించే వారు భాగయ్య కాలంలో ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. ఈ విధ్వంసానికి కల్లు–సారాలు తాగి, మానవ
మారణహోమానికి పూనుకున్నారని భాగయ్య చిఱుతల రామాయణం చెబుతున్నది.
నేటికాలంలో తరగతి గదుల్లో, ప్రయోగశాలల్లో బోధన జరుగుతున్నది. మానసిక శిక్షణ
తరగతులు నడుస్తున్నాయి. పయనిస్తూ జ్ఞానబోధ చేయడంలో చిరుతల రామాయణానికి మూలం రామాయణమే అయినా
విశ్వామిత్ర రామచంద్రుల సంభాషణలో ఇది వినూత్నంగా భాసించింది. ‘‘భానుకులజులారా! మీకు
బాణ విద్య నేర్పెదా! మౌని వర్యవిూరలన్న! మాటనేను వినియెదా జిజ్ఞాసువు’’ ప్రయాణంలో
వినడానికి, చదువడానికి ఆసక్తి చూపాలన్నదే ఇక్కడి తాత్పర్యం. కారణమేదైనా అహల్య అనేక సంవత్సరాలు అదృశ్యగా
ఉంది. వాల్మీకి రామాయణం ‘‘అదృశ్య’’ అంటే కనబడకుండా ఉన్నది అని చెబుతుంది గాని
‘లీల’ అనలేదు? కాని చిరుతల రామాయణం అయినా దేశీ ప్రచారాన్నే స్వీకరించింది. తిట్లు,
శాపనార్థాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే, జీవితంలో ముఖం చాటేసే పరిస్థితి వస్తే, శక్తివంతులు వారికి శిక్షణ
నిచ్చి చైతన్యాన్ని నింపాలి. సమాజంలో తలఎత్తుకొనే విధంగా చేయాలి.
చెర్విరాల భాగయ్యతో పాటు కల్పగూరు కృష్ణమూర్తి రామాయణాన్ని చిరుతల రూపంలో
అందించారు. నేటికీ తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు, మెదక్ జిల్లాల్లో రామాయణానికి,
దశావతారాలకు మంచి పేరుంది. విజయదశమి, ఉగాది, సంక్రాంతి, దీపావళి, శరన్నవరాత్రులు, శ్రీరామ నవమి నవరాత్రులు
ప్రదర్శనకు అనుకూలంగా ఉన్నరోజులు. సూత్రధారుని పాత్రలో గురువుతో మొదలై దరువుతో, నినాదాలతో, గణేశ ప్రార్థనతో
అడుగులచిందులతో సాగుతుంది. నాటకం మధ్యలో నేటి సినిమాల మాదిరిగా లత్కూరు సాహెబ్, హాస్యగాడు, పిట్టల
దొర, గాంధోళిగాడు, సిత్రాలోడు అని అనేక పేర్లతో పిలువబడే హాస్యపాత్ర ఉంటుంది. ఈ పాత్రలన్నీ
ప్రదర్శించాలని అనువుగా చెర్విరాల భాగయ్య రామాయణ భారత భాగవతేతివృత్తాలను చేపట్టాడు. నిజాం ప్రభువు హిందువుల
పురాణాల కథల ప్రదర్శనలపై నిషేధం విధించడాన్ని సహించలేకపోయాడు. నిజాంకు వ్యతిరేకంగా భజన రూపంలోనే
ప్రచారం చేశాడు భాగయ్య.
ముగింపు:
చిరుతల ప్రదర్శన దేశకాల పరిస్థితులను అనుసరించి రూపుదిద్దుకున్నది. అతి ప్రాచీన కళారూపానికి నవీన సమగ్ర రూపకల్పనే చిరుతల ప్రదర్శన. అది ఎంత సనాతనమో అంత నూతనం. 1900 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు తెలంగాణ ప్రజా చైతన్యానికి సాంస్కృతిక పునర్వైభవానికి యక్షగాన, చిరుతల నాటకాలు పునాది వేస్తే, మలి తెలంగాణ ఉద్యమ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా బతుకమ్మ నిలిచింది. కాలానుగుణంగా నేపథ్యం ఒక్కటే కాని ప్రజల నాడికోసం ప్రదర్శనలు మారినాయి అంటే ప్రతిఫలనాలు సామాన్యప్రజల సాంస్కృతిక స్థిరీకరణ కొరకే.
పాదసూచికలు:
- చిరుతల రామాయణం, పుట–25
- చిరుతల రామాయణం, పుట–10
- చిరుతల రామాయణం, పుట–18
ఉపయుక్తగ్రంథసూచి:
- భాగయ్య చెర్విరాల – కలియుగ వర్తమాన కందార్థములు 1988 – కొండా వీరయ్య సన్స్; హైదరాబాదు.
- భాగయ్య చెర్విరాల – చిరుతల రామాయణం (1976) – శ్రీ మల్లికార్జున పబ్లికేషన్స్; హైదరాబాదు.
- భాగయ్య చెర్విరాల స్వీయచరిత్ర; వ్రాతప్రతి; పుటలు–28, 29.
- భాగయ్య చెర్విరాల – సుగ్రీవ విజయం (1986) – శిద్దేశ్వర పబ్లికేషన్స్; హైదరాబాదు.
- భాగయ్య చెర్విరాల – చిరుతల సుగ్రీవయ విజయం (1960) – శ్రీ మల్లికార్జున పబ్లికేషన్స్; హైదరాబాదు.
- శ్రీకాంత్ మొరంగపల్లి – తెలంగాణ యక్షగాన వాఙ్మయం (2014) – హైదరాబాదు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.