AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. గాలివాన కథానిక: భారతీయ తాత్త్వికచింతన
డా. కె.వి.యన్.డి. వరప్రసాద్
సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం,
తూ.గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490921345, Email: prasad.tel@aknu.edu.in
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.10.2025 ఎంపిక (D.O.A): 31.10.2025 ప్రచురణ (D.O.P): 01.11.2025
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధనవ్యాసం పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన' కథానికలో భారతీయ తాత్త్విక చింతన విశ్లేషిస్తుంది. జీవితంలో ఏర్పడిన అనూహ్య ఘటనలు వ్యక్తిత్వపరివర్తనకు ఎలా దారితీస్తాయో, నియమబద్ధ జీవితానికి అతీతంగా మానవవిలువల ప్రాధాన్యతను ఎలా గుర్తిస్తాయో “రావుగారి” పాత్ర ద్వారా ఈ కథానిక స్పష్టం చేస్తుంది. భారతీయతలో సహజంగా కనిపించే ఈ తాత్త్వికత, కఠిన మనస్తత్వాన్ని సైతం కరుణతో ఎలా నింపుతుందో, కపిలవస్తు యువరాజు సిద్ధార్థుడు, సమ్రాట్ అశోకుడు, మహాత్మా గాంధీ వంటి వ్యక్తుల జీవనగమనాన్ని ప్రస్తావించడం ద్వారా పరిశోధన ఆవశ్యకతను సమర్థిస్తుంది. 'గాలివాన' కథా సంకలనాన్ని ఈ వ్యాసానికి ప్రాథమికవనరు.. భగవద్గీత, తైత్తరీయోపనిషత్తు వంటి వేద గ్రంథాల నుంచి తాత్త్విక సిద్ధాంతాలను సమర్థన, సమన్వయం కోసం ఉపయోగపడ్డాయి.. పాత్ర విశ్లేషణ, కథాంశ వివరణ పద్ధతులను అవలంబిస్తూ, రావుగారి ప్రవర్తనలో వచ్చిన పరిణామాన్ని భారతీయ తాత్త్విక చింతనతో అనుసంధానించడమైనది. ఈ కథానికలోని సంఘటనలను క్రమబద్ధంగా విశ్లేషిస్తూ, రావుగారిలోని మార్పును, సమత్వయోగం, 'ఆత్మవత్ సర్వభూతేషు' వంటి సూత్రాలకు ఎలా అన్వయించవచ్చో ఈ వ్యాసం వివరించింది. రావుగారు తన పర్సు దొంగిలించినా, తన ప్రాణాలను కాపాడిన ఆ మహిళను దొంగగా భావించకుండా, ఆమెను మానవతాపరిమళాలు వెదజల్లే మహోన్నతవ్యక్తిగా గుర్తించడం; పరిస్థితుల ఒత్తిడిలో వ్యక్తిత్వం ఎలా రూపాంతరం చెందుతుందో, నియమాలకు అతీతంగా మానవీయ సంబంధాలకు, అనురాగానికి స్థానం ఎలా లభిస్తుందో ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. ఈ పరిశోధన పాలగుమ్మి కథాశిల్పంలోని లోతైన తాత్త్వికతను, మానవతా విలువలను పాఠకులకు తెలియజేస్తుంది. ప్రస్తుత పరిశోధన కథా విశ్లేషణకు పరిమితమైంది. భవిష్యత్తు పరిశోధనలకు ఇలాంటి తాత్త్విక నేపథ్యం గల ఇతర రచనలను విశ్లేషించడానికి ఈ వ్యాసం ఉపకరస్తుంది.
Keywords: భారతీయ తాత్త్వికత, గాలివాన, పాలగుమ్మి పద్మరాజు, రావుగారు, మానవత్వం, సమత్వం, పాత్ర చిత్రణ, కథానికా విశ్లేషణ, నైతిక విలువలు, పరివర్తన.
1. పరిచయం
ధార్మికంగా, విలువలతో మనిషి జీవించాలనేది భారతీయత ప్రధాన లక్షణం. భారతీయత తాత్త్విక నేపథ్యం కలిగి ఉంది. భారతీయులకు తాత్త్విక చింతన పుట్టుకతోనే అలవడుతుంది. ఎంతటి కఠినమైన మనసున్నవారు, నిర్దయగా ప్రవర్తించేవారు సైతం జీవితంలో ఏదో ఒక ఘటనకు మనసు ఆర్ద్రమై, ప్రవర్తన మార్చుకుని, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు లేదంటే అంతర్ముఖులై భగవంతుని శరణు వేడతారు. అనాథలను, దీనులను, రోగగ్రస్తులను, మరణించినవారిని చూసి చలించిపోయిన కపిలవస్తు యువరాజైన సిద్ధార్థుడు అఖండ ఐశ్వర్యాన్ని, సామ్రాజ్యాన్ని పరిత్యజించి, సమస్యల పరిష్కారానికి అంతర్ముఖుడు కావడం భారతీయ తాత్త్విక చింతనకు నిదర్శనం. అధిక శాతం ఈ తాత్త్విక చింతన భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైనది.
విదేశీయులు ఎంత నరమేధం చేసినా అంతటితో వారు ఆగిన దాఖలాలు లేవు. ఆ నరహంతల అంతంతోనే వారి దాష్టీకాలు పరిసమాప్తమయ్యాయి. భారతీయులలో ఇట్టిది కానరాదు. కళింగ యుద్ధ రక్తపాతాన్ని చూసి సమ్రాట్ అశోకుడు చలించిపోయి బుద్ధుని శరణాగతిని పొందారు. ఆధునిక కాలంలో మహాత్ముడు హింసను అహింసతో ఎదుర్కోవడం భారతీయత తాత్త్విక చింతనకు శిఖరాయమానం. భారతీయ తాత్త్వికతకు మహాత్ముడు నిలువెత్తు నిదర్శనం.
1.1 పూర్వపరిశోధనలు
- “పద్మరాజు గాలివాన జాతీయాంతర్జాతీయాలైన గాలివానలెన్నో గడిచి ప్రపంచ కథాభిమానుల హృదయాలు చూరగొన్నది” అని ప్రపంచకథానికల పోటీలో బహుమతిని పొందిన సందర్భంగా భారతిపత్రికలో ఓ వ్యాసం పేర్కొంది. “ఈ కథలో రావు మనస్తస్త్వము ముష్టెత్తుకునే మనిషి మనస్తత్వము పాఠకులకు చాలా సునిశితంగా ధ్వనిస్తాయి. రావు ఒక సూత్రబద్ధంగా నడిచిపోయే వ్యక్తి. గాలివానలో ఇతని సూత్రాలన్నీ పటాపంచలైపోయాయి. ... పద్మరాజుగారి కథ భారత భాషల్లోనేగాక ప్రపంచభాషల్లో కూడా తెలుగు భాషకు గౌరవం సంపాదించింది” అంటూ “ప్రపంచకథా బహూకృతి శ్రీపాలగుమ్మి పద్మరాజు” శీర్షికన భారతి, ఏప్రిల్ 1952 సంచికలో ఓ వ్యాసం గాలివాన కథానిక గొప్పదనాన్ని ప్రస్తావించింది (శాస్త్రి 298).
- ""లోవర్ డెప్త్" అంతర్జాతీయ కథానికల పోటీలో బహుమానం పొందిన మీ 'గాలివాన’ తీసుకోండి ఇందులో ప్రత్యేకించి ఒక సాంఘిక సమస్య లేదు. కాని ఆ కధ అంతటా వాస్తవ మనస్తత్వ చిత్రణ గోచరిస్తుంది. అందులో కనిపించే సాంఘిక సత్యం ఏమిటీ అంటే ఒక వాక్యంలో చెప్పటం సాధ్యం కాదు. కాని, అటువంటి సాంఘికసత్యం దానిలో తప్పకుండా ఉంది" అని కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా రచయిత పద్మరాజుతోనే ఒక సంభాషణలో తెలిపారు (కుటుంబరావు 212).
- "మానసిక చిత్తవృత్తుల యున్మీలనమును కథామాతృకలో పొదిగించుటకు పాలగుమ్మివారివంటి యువరచయితలు యత్నించుచున్నారు. వీరి 'గాలివాన' యను కథ అంతర్జాతీయ ప్రశస్తిని చేపట్టినది." అని తెలుగు విజ్ఞానసర్వస్వమే ఈ కథానికలోని మనోవిజ్ఞానశాస్త్రీయతను ధ్రువపరిచింది (తెలుగు విజ్ఞానసర్వస్వము, 627).
- “అంతర్జాతీయ కథానికారంగంలో పెద్దపీట వేయించుకొని దేశానికి ప్రతిష్ఠ చేకూర్చిన తెలుగు కథకుడు పాలగుమ్మి పద్మరాజుగారు (1915). ఈయన రాసిన 'గాలివాన అంతర్జాతీయ పోటీలో బహుమతి నందుకొన్న సొంత ఆంగ్ల మూలకధకు తెలుగుచేత.” అని పోరంకి వారు కథానికల్లో గాలివాన, రచయితల్లో పాలగుమ్మి స్థానాలను పేర్కొన్నారు (దక్షిణామూర్తి 145).
- ఇటీవల ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ నిర్వహించిన ఒక జాతీయసదస్సులో డా. ఈ. మురళీధర్ గాలివాన కథానికలో రచయిత పేర్కొన్న మానవమనస్తత్వం, సామాజికస్పృహకు సంబంధించిన అంశాలను తమ పత్రంలో చర్చించారు (మురళీధర్ 136).
పూర్వ అధ్యయనాలు గాలివాన కథానికలో వివిధకోణాలను, పాత్రల ప్రాముఖ్యాన్ని వివరించాయి. ప్రస్తుత వ్యాసం ఈ కథానికలోని భారతీయ తాత్వికచింతనను రావుగారి పాత్ర ఆధారంగా విశ్లేషిస్తుంది.
2. పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథ
ప్రముఖ కథారచయిత పాలగుమ్మి పద్మరాజు ప్రపంచ కథానికల పోటీలో బహుమతి పొందిన 'గాలివాన' కథలో ప్రధానపాత్ర “రావుగారు”. ఈ పాత్ర భారతీయతకు, భారతీయ తాత్త్వికతకు, తాత్త్విక చింతనకు నిలువెత్తు నిదర్శనం. నియమబద్ధంగా జీవించడంలోనే మనిషి సార్ధకత అని నమ్మిన వ్యక్తి రావుగారు. పరిస్థితుల కారణంగా నియమాలను, నియమపాలనను తోసిరాజనడం కూడా మానవ జీవన వికాసానికి అత్యంత ఆవశ్యకం అని రావుగారు నమ్మడంలో భారతీయ తాత్త్విక కెరటాలు మిన్నుముట్టాయి. ఒకప్పుడు కాదు అనుకున్నదే మరొకప్పుడు కావలసివస్తుంది. ఆ పరిస్థితుల ప్రభావాన్ని స్వాగతించగలగాలి. అలా స్వాగతించగలగడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి అనుగుణంగా పాలగుమ్మి రూపొందించిన పాత్ర రావుగారు.
2.1. రావుగారి నియమబద్ధ జీవనం
పాలగుమ్మి గారి గాలివాన కథ రావుగారి చుట్టూనే అల్లబడింది. రావుగారు నియమాలను, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించే క్రమశిక్షణగల వ్యక్తి. ఆయన న్యాయవాదిగా పనిచేసి యాభై ఏళ్లకే వృత్తి నుంచి విరమణ పొందారు. ఇంట్లో ఏ విషయానికైనా ఆయన మాటే చెల్లుబాటు. ఆయన భార్య ఆయన చెప్పుచేతల్లోనే నడుస్తుంది. ఆయన గీసిన గీత దాటదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె రావుగారికి నీడలాంటిది. ఆయన మాటకు భార్య బదులు పలుకుతుందేగానీ, ఆమె తనంతట తానుగా ఆయనతో మాట్లాడే అవసరం లేనంతగా రావుగారు కట్టడి చేశారు. ఆయన సంతానం కూడా అంతే. వారు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తారు. పిల్లల చదువులు, దుస్తులు, ఇతర వేషధారణ అన్నీ ఆయన చెప్పినట్టుగానే ఉండాలనేది ఆయన ఏర్పరుచుకున్న నియమం. పిల్లలను ఏనాడూ ఆ గీతను దాటనివ్వలేదు. తన ఆలోచనల ప్రకారమే ప్రతి విషయం జరుగుతుందని, తన చేతిలోనే అన్నీ ఉన్నాయని, అన్ని విషయాలను నియంత్రించగలనని ఆయన ఒక భావన కలిగి ఉన్నారు. కోర్టులో కూడా ఆయన వాదనకు తిరుగులేదు. ఇంట గెలిచి రచ్చగెలిచిన వ్యక్తి రావుగారు. కోర్టులో అయినా, ఇంట్లో అయినా ఆయన ఒకలాగే చలామణీ అవుతారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఒవల్టిన్ తగుమోతాదుగా రోజుకు రెండుసార్లు మాత్రమే తాగుతారు. ఇష్టమైనది కదా అని ఎక్కువగా తాగరు. ఉదయం లేచినది మొదలు రాత్రి పరుండబోయే వరకు ఏ పని ఏ సమయానికి చేయాలి, భోజన సమయం, విశ్రాంతి వంటివన్నీ కూడా ఆయన నిర్ణయించుకున్న నియమాల ప్రకారమే నిర్వహించుకుంటూ ఉంటారు.
రావుగారికి ప్రతి విషయంపైన నిర్దుష్టమైన, దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయనకు బిచ్చమెత్తడం అనేది చాలా చికాకు కలిగించే విషయం. ఆయన బిచ్చగాళ్లను దరి రానివ్వరు సరికదా, వస్తే కోపంతో కసురుతారు. ఈ విషయం రైలుబండిలో ఆ బిచ్చగత్తెను చూసిన తరువాత అన్న 'ఫో... ఫో..." అనే కసురు ద్వారా గమనించవచ్చు. రావుగారి సహప్రయాణికులందర్నీ బిచ్చగత్తె పదే పదే బిచ్చమడిగి విసిగించింది. విసిగించినా ఆమె మాటల చమత్కారం కొందరి నుంచి బిచ్చాన్ని పొందడంలో సహాయపడింది. బిచ్చగత్తె విషయంలో రావుగారి వైఖరి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి బిచ్చం వేయకపోవడం, రెండోది కోపంతో గట్టిగా కసరడం. బిచ్చం వేయకపోవడం అనేది ఆయన పెట్టుకున్న నియమం. కసరడం అనేది అడుక్కోవడంపై ఆయనకున్న అసహనాన్ని వ్యక్తం చేయడం.
రావుగారికి ప్రసంగాలు చేయడం ఒక హాబీ. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం, విశ్లేషిస్తూ నేర్పుగా ప్రసంగించడం రావుగారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఉపన్యసించే విషయాల శీర్షికలు కూడా చాలా తమాషాగా ఉంటాయి. "సత్త్వము - తత్త్వము", "ప్రకృతి - పరిష్కృతి" వంటివి.
2.2. విధి ప్రణాళికలో మార్పు: గాలివాన ప్రభావం
ప్రస్తుతం "సామ్యవాదమూ రమ్య రసామోదము" అనే విషయంపై ప్రసంగించడానికి రావుగారు రైల్లో ప్రయాణిస్తున్నారు. ఈయన ఎక్కడికి వెళ్లినా, రైలో, బస్సో దిగేటప్పటికి ఈయన్ని రిసీవ్ చేసుకోవడానికి నిర్వాహకులు వస్తూ ఉంటారు. అక్కడ సమస్త సౌకర్యాలు ఉంటాయి. ఈయన ఇంట్లో ఉన్నా, పనులమీద దూరంగా వేరే ఊర్లు వెళ్లినా అక్కడ ఏ ఇబ్బంది రాకుండా ముందుగానే వసతులు సమకూర్చుకుంటారు. ఈసారి మాత్రం ప్రణాళికా రచనలో సిద్ధహస్తుడైన రావుగారి ప్రణాళిక, 'గాలివాన' వల్ల దెబ్బతింది. తీవ్రమైన గాలివానలో ఈయన స్టేషనులోనే ఉండిపోవాల్సి వచ్చింది. నిర్వాహకులు ఎవరూ ఈయన్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. తన లగేజీతో రైలు నుంచి దిగటమే కష్టమైంది. జీవితంలో తొలిసారి అసహాయత, నిస్సహాయ స్థితి, దిక్కులేని తనం, తోడులేకపోవడం, ఆదుకునే హస్తం లేకపోవడం అనేవి రావుగారి కళ్ళముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ క్షణంలో ఆయన అన్నీ ఉన్నా ఏమీ లేనివాడై పోయాడు. జీవితంలో తొలిసారి అలాంటి అనుభవం ఆయనకు ఎదురైంది.
తన సామాను దించుకోలేడు. తోటి ప్రయాణీకులు ఎవరూ సహాయం చేయరు. గాలివాన వల్ల కూలీలు అందుబాటులో లేరు. రావుగారి ఈ నిస్సహాయతను చూసి స్పందించిన బిచ్చగత్తె ఆ సామానును రైలు నుంచి కిందకు దించి పెడతానని చెప్పింది. రావుగారు మౌనంగా అంగీకరించారు. ఆమె సహకారంతో స్టేషనులోని విశ్రాంతిగదికి క్షేమంగా చేరుకున్నారు. కృతజ్ఞతగా రావుగారు ఆమెకు కొంత సొమ్మును ముట్టచెప్పారు. ఆమె ఆ సొమ్మును తీసుకుని నోట్లో ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయిందని పాలగుమ్మి ఆ సందర్భాన్ని చిత్రీకరించారు. ఆమె ఏమని గొణుక్కుందో కథకుడు చెప్పలేదు కానీ తప్పనిసరిగా రావుగారిమీద ఏదో సెటైర్ వేసి ఉంటుంది అనేది పాఠకుల ఊహకు వదిలేయడం గొప్ప శిల్పం.
2.3. తాత్త్విక పరిణామ దశలు: బిచ్చగత్తె సాంగత్యం
చీకటి రాత్రివేళ. నిర్మానుష్యం. రావుగారు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నియమాల ప్రకారం జీవించడం మాత్రమే తెలిసిన ఆయనకు ఆ క్షణాన్ని గడపడం కష్టమైపోయింది. ఏం కావాలో తెలియని స్థితి. గాలివాన జోరు హెచ్చైంది. తడిబట్టలు మార్చి పొడి బట్టలు వేసుకున్నా సురక్షితమైన ప్రదేశంలో ఉన్నా, ఆయనకు భద్రతగా అనిపించలేదు. మనసులో ఏదో అలజడి, అసంతృప్తి అలముకున్నాయి. దీన్నే భగవద్గీత "విషాదయోగం" అని చెప్పింది. ఈ స్థితి కలిగిన భారతీయులలో తాత్త్విక చింతన ప్రారంభమౌతుంది. సాధారణ మానవీయ సౌధం నుంచి అసాధారణ మానవతా సౌధంలోకి మొదటి మెట్టు ఎక్కడానికి ప్రయత్నించే స్థితి. చదువు, క్రమశిక్షణ, అనుభవం, రుజుమార్గం లాంటివి మనస్సుపై బాగా పనిచేసి తాత్త్విక చింతన వైపుకు నడిపిస్తాయి. ఇలాంటి స్థితి భారతీయులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అది భారతీయ తాత్త్విక చింతనకు పునాది. ఆ స్థితి యోగం. యోగం అంటే గీతలో భగవానుడు తెలియజేసిన సమత్వం స్పష్టంగా గీతా వాక్యమైతే “యోగస్యః కురుకర్మాణి సంగత్యక్త్వాధనంజయ! సిద్ధ్యసిద్ధ్యోఃనమో భూత్వా సమత్వం యోగ ముచ్యతే” అని ఉంది (భగవద్గీత 2.48).
ఇలాంటి స్థితిలో పాశ్చాత్యులైతే మద్యపాన సేవనం, స్త్రీలోలుత్వం లాంటి అమానుష దుర్వ్యాపారము వైపుకు మొగ్గు చూపిస్తారు. మనిషి ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్న తరుణంలో మంచి చెడుల విచారణ చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో అంటే అతను అనుకున్నదే ప్రమాణం అనుకొని సమాజ ఆమోదం ఉన్నా లేకపోయినా తనదైన భావనలో తాను ముందుకు సాగిపోతూ ఉంటాడు.
ఇక కథలోకి వస్తే గాలివాన విజృంభణ చూస్తే ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు నిర్మించినవి, దేవుడు సృష్టించినవి కూడా భూమి మీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్లు అనిపిస్తోంది. ఈ గందరగోళంలో మనోస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమైన కొన్ని శక్తులు విజృంభించినప్పుడు అర్థరహితం అయిపోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనానికి ఒడిగట్టినట్టయితే మానవుడు తన్ను తాను ఎలా రక్షించుకోగల్గుతాడు?
ఇదే స్థితిని రావుగారిలో చూస్తాం. ప్రస్తుతం రావుగారు ఒంటరివారు, నిరాశ్రయుడైపోయారు. చీకటి గదిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఒక మనిషి అస్తిత్వానికి తోడు అవసరం. తన మనసు పడే ఆందోళనకు సాంత్వన వాక్యాలు అవసరం. కానీ ఎటు చూసినా మనిషి జాడలేదు. చీకటి ఏకాంతాలు మాత్రమే తోడు. ప్రస్తుతం రావుగారికి కావాల్సింది ఆయన స్థాయి మనిషి కాదు. ఇంకా గొప్పవాడూ కాదు. ఎవరైనా పర్వాలేదు, మనిషి మాత్రం కావాలి. ఆయన భయం పోగొట్టే మనిషి కావాలి. ఆ మనిషి ఈయన ఉన్న గదిలో ఉంటే చాలు. ఆ మనిషికి క్రమశిక్షణ గాని, నియమబద్ధమైన జీవితం గాని అవసరం లేదు. డబ్బు, అధికారం, హోదా, చివరికి లింగం కూడా అవసరం లేదు. ఒక మనిషి మాత్రం కావాలి. రావుగారు మనస్సులో పరిపరివిధాలుగా బాధపడుతుంటారు. ఈ సన్నివేశంలో తాత్త్వికతను పాలగుమ్మి చూపించిన తీరు కథకు మంచి శిల్ప సౌందర్యాన్ని చేకూర్చింది. అప్పుడు రావుగారు ఉన్న చీకటి గదిలోకి, రావుగారు ఉన్నారో లేరో తెలియని బిచ్చగత్తె ప్రవేశించింది. ఆ ప్రవేశించిన నీడలాంటి మానవాకృతి రావుగారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ రావుగారిలో ఇంతవరకు కనిపించని కోణాన్ని పాలగుమ్మి ప్రదర్శించారు. అది ఆయన నేర్పు. ఆ వచ్చింది బిచ్చగత్తె అని రావుగారికి స్పష్టమైంది. ప్రయాణం సమయంలో ఆమె పొడ గిట్టని రావుగారు, ఆమె అస్తిత్త్వాన్ని చీకటి గదిలో సహించడమే కాదు, స్వాగతించారు. రైలు పెట్టెలో ఆమెను అసహ్యించుకున్న ఆయన తడిబట్టలతో చలికి గజగజ వణుకుతున్న ఆమెకు చక్కటి పంచెను ఇవ్వడంలోనే ఆయన తాత్త్విక చింతనా ద్వారాలను పాలగుమ్మి బార్లా తెరిచారు. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. పెట్టెతీసి, అందులోని బిస్కట్లు తీసుకుని తినడం ఆరంభించి, తానొక్కడే తింటున్నానన్న భావన స్ఫురించి మిగిలినవి తినడానికి ఆమెకు ఇస్తూ “ఇవే ఉన్నాయి తినడానికి” అని తక్కువ ఇస్తున్నట్లుగా సిగ్గుపడుతూ ఇవ్వడం భారతీయ తాత్త్విక చింతనలో మరో కోణం.
దీన్నే తైత్తరీయోపనిషత్తులో "శ్రద్దయా దేయం, అశ్రద్దయా న దేయం, శ్రియా దేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదా దేయం” అని చెప్పడాన్ని గమనించాలి (తైత్తరీయోపనిషత్తు 1.11.3).
ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వారికి సహకరిస్తూ ఏదైనా ఇస్తున్నప్పుడు 'తగినంతగా ఇవ్వలేకపోతున్నాం' అని భావిస్తూ, సిగ్గుపడుతూ ఇవ్వాలి గానీ బడాయి, గొప్పతనం ప్రదర్శిస్తూ ఇస్తున్నవాడు మహాదాత గా భావిస్తూ ఇవ్వకూడదు అనేది మన వైదిక ధర్మం. అదే తాత్త్విక చింతనకు మరోకోణంగా పాలగుమ్మి బిస్కట్ల ఘట్టాన్ని చిత్రించారు.
2.4. మానవత్వం: భయాందోళన
రైలు పెట్టెలో ఆమె ఉనికిని ఎంతమాత్రమూ సహించలేకపోయిన రావుగారు, స్టేషనులో రైలు దిగాక గాలివాన సందర్భంగా చీకటి గదిలో ఆమె అస్తిత్త్వాన్ని స్వాగతించడంతోపాటు ఆమెకు పొడి బట్టలు, బిస్కట్లు ఇవ్వడం అనేది ఆయనలోని మార్పును, సమత్వయోగాన్ని, 'ఆత్మవత్ సర్వభూతేషు' అనే సిద్ధాంతాలను, తాత్త్విక చింతన వైపు పాలగుమ్మి పయనింప చేసిన తీరు కథకు మంచి మలుపే గాక వన్నెలనద్దిందని చెప్పవచ్చు. ఆమెతో మాట్లాడటానికి రావుగారు ఉపక్రమించడం ఆయన మానవతా దృష్టితో మరో మెట్టు పైకి ఎక్కడమే. ఇరువురి సంభాషణలో పాలగుమ్మి కథన నైపుణ్యం, రావుగారి సహిష్ణుత పోటీ పడ్డాయి. ఆమె ఎలాగైనా జీవించగలదు. ఎవ్వరితోనైనా జీవించగలదు. జీవితాన్ని చాలా సునాయాసంగా తీసుకోగలదు. జీవించడానికి ఆమెకు అన్నీ ఉపకరణాలే, వ్యభిచారం, దొంగతనం లాంటివి కూడా ఆమెకు ఉపకరణాలే. విచ్చలవిడిగా ఎలాగైనా జీవించగలదు. ఆమె జీవన విధానం రావుగారి జీవితానికి పూర్తిగా విభిన్నమైంది. అయినా రావుగారు ఆమె చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నారు. ఆమెను బిచ్చగత్తెగానే సహించలేని రావుగారు ఆమె విచ్చలవిడి జీవితాన్ని విని సహనంగా ఉండిపోయారు. రావుగారి మనస్సును ఆ కల్లోల వాతావరణంలో ప్రశాంతత అలముకుంది. అది ఆమె వల్లే.
పరిస్థితుల ప్రభావంతో అనుకోని సందర్భంలో తాను నిర్ధారించుకున్న నియమాలను పక్కనపెట్టి మరీ బిచ్చగత్తెతో గడుపుతున్న రావుగారు ఆమెతో కాసేపు మాట్లాడాకా ఆమె మాట తీరు, ఆమె కోణంలోంచి జీవితాన్ని చూడటం, ఆమె తామరాకు మీద నీటిబొట్టులా జీవించగలగటం అనే విషయాలు రావుగారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి కానీ అసహ్యాన్ని కలిగించలేకపోయాయి. ఇది ఆయనలో వచ్చిన స్పష్టమైన మార్పు. అంతేకాదు ఆయనకు అవసరం కూడా. ఇద్దరూ ఒక విధమైన మాటల ప్రవాహంలో కొట్టుకుపోతూ పరిసరాలను మర్చిపోయి ఉన్నప్పుడు, పెద్దగా పిడుగుపడ్డ ధ్వని వచ్చినప్పుడు ఆయన చిన్నపిల్లాడిలా భయపడిపోయి ఆందోళనతో ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్లి బిచ్చగత్తెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె ఆయనను గట్టిగా హత్తుకుని చక్కటి ధైర్యవచనాలు చెప్పింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలివానలు, భూకంపాలు, ఉప్పెనలు లాంటి ఉత్పాతాలు ఆమెకు కొత్తకాదు, వాటికి భయపడదు, లెక్కచేయదు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలదు. రావుగారు గిరిగీసుకున్న మనిషి, ఆయన పరిధిలోనే ఆయన జీవితం. అంతకు మించి ఆయన మనస్సు వెళ్ళదు. రావుగారిని అదిమి పట్టుకుని ఆమె చెప్పిన అనునయ వాక్యాలలో మానవత్వం పరిమళించింది. అక్కడ ఆ మాటల్లో మానవతా శిఖరాన్ని పాలగుమ్మి పాఠకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
2.5. అంతిమ పరివర్తన: ఆత్మార్పణ, స్వీకారం
పాలగుమ్మి మాటల్లో ఈ సన్నివేశం ఇలా ఉంది:
"గుమ్మం పక్కనున్న మూలకి, ఆమె ఆయనను తీసుకువెళ్ళి ఆ మూలలో కూచోబెట్టింది. తనుకూడా దగ్గరగా కూర్చుని చేతులాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మధనం జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు. 'సరిగ్గా కూకొని నా సుట్టూ సేతు లేసుకోండి. కొంత ఎచ్చగుంటది. పాపం! బాబుగారు ఒణికిపోతున్నారు.' తల్లి ఒడిలో చంటి బిడ్డలా, కన్న కూతురు ఒడిలో పండు ముసలి తండ్రిలా రావుగారు బిచ్చగత్తె ఒడిలో ఒదిగిపోవడాన్ని పాఠకుల ముందుంచారు. అక్కడ నిర్భయస్థితి, ప్రశాంతత కలిగిన రావుగారు నిద్రలోనికి జారిపోయారు." (పద్మరాజు 77)
రావుగారికి మెలకువ వచ్చేసరికి తెల్లారిపోయింది. గదిలో ఒక్కడే ఉన్నాడు. అటూ ఇటూ చూసేటప్పటికి ఎవ్వరూలేరు. బిచ్చగత్తె లేదు. జేబులో మనీ పర్సు కూడా లేదు. "దొంగ ముండా" అనబోయి ఆమెమీద తనకు తెలియని అభిమానంతో మధ్యలోనే ఆగిపోయారు. బిచ్చగత్తె రావుగారికి ప్రాణదాతలా అనిపించింది. భయానకమైన చీకటి రాత్రి ఎడారిలో ఆమె ఒయాసిస్సులా అనిపించింది. రాత్రి ఆమె "నేనున్నాను" అంటూ లేకపోతే తన జీవితం ఏమయ్యేదో తలుచుకోవడానికే రావుగారికి భయం. తన పర్సును ఆమె దొంగిలించినా దొంగగా భావించలేదు. మనిషి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. ఈమె కూడా అంతే అనుకున్నారు. రైల్వే టిక్కెట్లు అమ్మే గదిలోకి వెళ్ళి చూస్తే అది కూలిపోయి ఉంది. కూలిన సామాను కింద బిచ్చగత్తె చచ్చిపడి ఉంది. ఆమె రెండు చేతులూ బయటకు చాచి ఉన్నాయి. రెండు చేతులలో డబ్బు ఉంది. కుడిచేతిలో రావుగారి పర్సు ఉంది. రావుగారు ఆమె మరణాన్ని చూచి తట్టుకోలేక చలించిపోయారు. ఆయన పేరు ఉన్న విజిటింగ్ కార్డును పర్సులోనుంచి తీసివేశారు. ఎందుకంటే ఆ పేరు చదివినవారు ఆయన డబ్బును దొంగిలించింది అని అనుకోవడం ఆయనకు ఇష్టంలేదు. రావుగారి దృష్టిలో ఆమె మానవతా పరిమళాలను వెదజల్లే మహోన్నతమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
నిస్వార్థంగా ఇతరులకు సాయపడే ఆమె తత్త్వం, జీవితం పట్ల ఆమె నిర్లిప్తత, దేనిమీదా విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉండటం, ఆమె మాటతీరు, ఆమె ధైర్యవచనాల ముందు ఆమె బిచ్చగాడి తనం, దొంగతనం వంటి లక్షణాలు రావుగారికి చాలా చిన్నవిగా తోచాయి.
కథ ముగింపులో ఆయన అనుకున్నవిగా పాలగుమ్మి రాసిన మాటలు భారతీయ తాత్త్విక చింతనకు మహాభాష్యం. ఉద్విగ్నుడై ఆయన చెప్పిన మాటల్లో భారతీయ తాత్త్విక చింతన వెల్లువెత్తింది.
"రావుగారు అకస్మాత్తుగా చిన్నపిల్లవాడివలె ఏడుపు ప్రారంభించారు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నారు. గడచిన రాత్రి ప్రతీ చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మస్థైర్యాన్నీ, శాంతినీ, గాలివానకు తట్టుకోగల శక్తినీ చేకూర్చిన ఆ మూర్తి అక్కడే పడిపోయివుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్లు ఆయనకు అనిపించింది. తన పర్సు దొంగిలించినందుకుగాని, అంత గాలివానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టిక్కెట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరు తత్వం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమ పాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటునపడి ఉన్న మానవత్వాన్ని ఈ జీవి వికసించి జేసింది. ఆయన భార్యగాని, ఆయన పిల్లలలో ఎవరూగానీ ఆమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన, ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే." (పద్మరాజు 80)
రైలు పెట్టెలో ఆమె ఉనికిని భరించలేని రావుగారు చచ్చి శవమైపడి ఉన్న ఆమె నుదిటిపై ముద్దుపెట్టుకోవడం రావుగారిలో వికసించిన మానవత్వానికి ప్రతీక. భారతీయ తాత్విక చింతనకు పతాక. పాలగుమ్మి కథా శిల్పానికి, కథన నైపుణ్యానికి పరాకాష్ట.
ఉపసంహారం
- పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన' కథ భారతీయ తాత్త్విక చింతనను, మానవతా విలువలను అద్భుతంగా ఆవిష్కరించింది.
- కఠిన నియమాలను పాటించే రావుగారి పాత్ర, అనుకోని పరిస్థితులలో మార్పు చెంది, సమత్వ యోగాన్ని, ఆత్మవత్ సర్వభూతేషు సిద్ధాంతాన్ని ఆచరించింది.
- బిచ్చగత్తె నిస్వార్థ సేవ, మానవత్వం రావుగారిలో నిగూఢంగా ఉన్న కరుణను, ప్రేమను వెలికితీశాయి.
- ప్రకృతి విపత్తుల మధ్య మానవ సంబంధాల ప్రాముఖ్యత, బాహ్య స్థితిగతులకంటే అంతర్గత మానవత్వం గొప్పదని కథ చాటింది.
- రావుగారి పాత్ర పరివర్తన, బిచ్చగత్తె త్యాగం భారతీయ ఆధ్యాత్మిక విలువలకు, మానవతావాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- కుటుంబరావు, కొడవటిగంటి. కొకు వ్యాసప్రపంచం-5 సాహిత్యవ్యాసాలు. “ఉత్తమకథ, కుటుంబరావు, పద్మరాజుల సంభాషణ”, విప్లవరచయితల సంఘం, ఆంద్రప్రదేశ్ 2001.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు. స్వీయప్రచురణ. హైద్రాబాదు. 1988
- దయానంద (మూ). సుబ్బారావు, కోడూరి. (సంక.) వైదిక క్రాంతిపథం. తైత్తరీయోపనిషత్తు. శిక్షావల్లి, 1-11-3. గాయత్రీ ఆశ్రమము, సికింద్రాబాద్, 1996
- పద్మరాజు, పాలగుమ్మి. "గాలివాన" కథా సంకలనం. మొదటి భాగం. సత్య పబ్లికేషన్స్,
- భగవద్గీత. భక్తివేదాంత బుక్ ట్రస్ట్, ముంబయ్, 1984
- మురళీధరరావు, ఈ. "మానవమనస్తత్వం సామాజిక స్పృహ : పాలగుమ్మి పద్మరాజు" (వ్యాసం). తెలుగుసాహిత్యం - సామాజికస్పృహ జాతీయ సదస్సు - 2024 ప్రత్యేకసంచిక, Spl. Edition, Vol- 19, Issue 01, ISSN No. 2582-8738. March, 2024
- సోమశేఖరశర్మ, మల్లంపల్లి (సంపా.) తెలుగు విజ్ఞానసర్వస్వము మూడవ సంపుటము, తెలుగుభాషాసమితి, మద్రాసు. 1958
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

