headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

6. సాహిత్యవిమర్శలో బిసి వాదం: అట్టెం దత్తయ్య దృక్పథం

ఎ. విజయ్ కుమార్

రచయిత, విమర్శకులు,
నల్లకుంట, హైదరాబాద్
తెలంగాణ.
సెల్: +91 9573715656, Email: vijaykumaraithagoni@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.10.2025        ఎంపిక (D.O.A): 28.10.2025        ప్రచురణ (D.O.P): 01.11.2025


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో బీసీల పాత్ర గణనీయమైంది. తెలుగు సాహిత్యవిమర్శలో బీసీల ప్రాతినిథ్యం చాలా తక్కువ. అందువల్లనే బీసీ సాహిత్యంపై జరిగిన విమర్శ కుడా పరిమితంగానే ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో విమర్శకుడు అట్టెం దత్తయ్య తన అధ్యయంలో భాగంగా సాహిత్యంలో బీసీవాద చిత్రణకు సంబంధించిన సమచారాన్ని విశ్లేషిస్తూ తెలంగాణ బీసీవాద సాహిత్యం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ఉన్న సాహిత్య విమర్శనాత్మక దృష్టిని పరిశీలించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. తెలుగు సాహిత్యంలో బీసీవాదానికి సంబంధించిన చర్చ చాలా పరిమితంగా ఉన్నది. బీసీ వాదానికి సంబంధించినంత వరకు జూలూరు గౌరీ శంకర్, ప్రసేన్‌ “వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు” అనే కవిత్వ సంపుటికి రాసిన ముందుమాటలో కొంత బిసి వాదానికి సంబంధించిన చర్చ చేసారు. తర్వాత బి.ఎస్. రాములు “బిసి కథలు – ఒక విశ్లేషణ” (2011), చింతం ప్రవీణ్ కుమార్ “బిసి చౌక్” (2022), వంటి పుస్తకాలు వచ్చాయి. అక్కడక్కడ కవిత్వం, కథల రూపంలో బిసివాదం చర్చకు వచ్చింది. కానీ, ఉద్యమ స్థాయిలో చర్చ జరగలేదు. కారణం ఈ సామాజిక వర్గాలలో చైతన్యం లేకపపోవడం. ఈ పరిశోధన పత్రాన్ని రాయడానికి అట్టెం దత్తయ్య రాసిన “తెలగాణ బీసీవాద సాహిత్యం” అనే గ్రంథం ప్రధానఆకరం. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో “బహువచనం”, జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన “వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు”, చింతం ప్రవీణ్ కుమార్ ప్రచురించిన “బీసీ చౌక్” అనే గ్రంథం ద్వితీయ ఆకరాలు. వీటి ఆధారంగా బీసీవాద నేపథ్యం గురించి విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం చేసాను. సాహిత్యవిమర్శలో బీసీవాద సాహిత్య విమర్శ ప్రాతినిథ్యం, దాని విస్తరణకు ఈ అధ్యయనం తోడ్పాటునందిస్తుంది.

Keywords: బిసి వాదం, విమర్శ, అట్టెం దత్తయ్య, తాత్వికత, ఆర్థిక, రాజకీయ, కుల నిర్మూలన, బహుజన దృక్పథం

1. ఉపోద్ఘాతం

"Existence precedes essence." - Jean Paul Sartre. సారం కంటే ముందే అస్తిత్వం ఉంటుందంటాడు ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే (Sartre). పుట్టిన ప్రతీసారి అస్తిత్వం ముందుగా మనిషిగానే గుర్తించబడుతుంది. ఆ తర్వాతే వారి లక్ష్యాలను ఎంచుకొని, తమ మార్గాన్ని వృత్తిని నిర్ణయించుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే పుట్టక ముందే, పుట్టబోయే వారు చేయాల్సిన వృత్తి నిర్దేశించబడుతుంది. అది మన దేశ ప్రజలపై రుద్దబడిన కుల కట్టుబాటు బానిసత్వం. మనిషి అనే ఉదాత్తమైన గుర్తింపు కంటే ఫలానా కులం వాడని వేసిన ముద్ర ఆ మనిషి చచ్చాక కూడా వెంటాడుతుంది. ఆ కుల కోరల వలనే ఉన్నత జ్ఞానం, సారవంతమైన గుణం కలిగిన డా. బి. ఆర్. అంబేడ్కర్‌ని లోకమంతా ప్రపంచ మేధావి అని కీర్తిస్తున్నా, మన దేశ అగ్ర కులతత్వం అతని మేధోశక్తిని గుర్తించ నిరాకరిస్తూనే ఉంది. అలాగే శూద్రులుగా చెప్పబడుతున్న బిసి కులాల ప్రతిభ, సామర్థ్యాలు అగ్రహార పీఠాల ఆధిపత్యం వలన చిన్నచూపుకు గురైతూనే ఉన్నది. బిసిలు అధిక సంఖ్యాకులుగా ఉండి సైతం తమ అస్తిత్వం కోసం వందల ఏళ్ల నుండి పెనుగులాడుతూనే ఉన్నారు. అగ్రకులాల కబంధ హస్తాల్లో చిక్కుకోవడం వలన తెలుగు సాహిత్యం అగ్రకుల సాహిత్య చరిత్రగా, వారి పాండిత్య సంపదగా వ్యక్తమవుతూ వచ్చింది. అక్షరాస్యతలో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన కులాల అస్తిత్వమే ఆ సాహిత్యంలో ప్రస్తావన లేకుండా పోయింది. స్వాతంత్య్రం వచ్చిన నలభై సంవత్సరాలు గడిచాకే తమ సొంత వాణిని వినిపించుకునే ప్రయత్నాలు ప్రారంభించే స్థితికి శూద్ర కులాలు నెట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో డానిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్క్ గార్డ్ (Kierkegaard), ఫ్రెంచ్ తత్త్వవేత్త జీన్ పాల్ సార్త్రే అస్తిత్వవాద ఉద్యమ ప్రభావంతో తెలుగు నేల మీద కూడా సబాల్ట్రన్ యుగం ప్రారంభమైంది. అప్పటిదాకా అగ్రకులాలు ఏ దారిలో పోతే ఆ దారినే గుడ్డిగా పోవడం; వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం సాహిత్యాన్ని రాయడం తప్ప వేరే దారిలో పోదామనే సోయి బహుజన కులాలలో కలుగలేదు.

2.1. బిసివాద సాహిత్యం – తాత్విక విశ్లేషణ

తొలి దశలో జ్యోతిబాపూలే, అంబేడ్కర్ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన స్రవంతికి భిన్నంగా అణగారిన వర్గాల వాణిని వినిపించడం సాహిత్యంలో మరో కోణం ప్రచారానికి వచ్చింది. అట్టడుగు వర్గాలపై వివక్ష, అణచివేత, అంటరానితనం తొలగడమే స్వాతంత్య్రంకు ముందు జరగాల్సిన అసలైన విముక్తి అని వారు ప్రకటించారు. ఆ అస్తిత్వ మూలాల వెలుగుల్లో సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. ఆ పరంపరలో భాగంగానే జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 2001లో 'స్పృహ సాహితీ సంస్థ' ద్వారా 'వెంటాడే కలాలు- వెనకబడిన కులాలు' అనే పేరుతో ఇరవై ఆరు మంది కవులు రాసిన మొట్ట మొదటి బి.సి. కుల కవిత్వ సంకలనం వెలువడింది (గౌరీ శంకర్, వెంటాడే కలాలు). ఆ తర్వాత ప్రారంభమైన బి.సి. వాద సాహిత్యపు ధార 'ఎలగటి వ్యవసాయం' వలనే సాగుతుంది. ఆ అస్తిత్వ రచనల ప్రవాహ ఉధృతి పెరగాల్సిన అవసరం ఉంది. దాన్ని పెంచే కృషిని "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" పుస్తకం ద్వారా ప్రేరేపిస్తున్నాడు దత్తయ్య.

అన్ని రంగాలలో దామాషా ప్రకారం వాటా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది వెనకబడిన కులాల మీద జరుగుతున్న వివక్షలు తిప్పి కొట్టాల్సిన సమయం. సమానమైన మనుగడ కోసం, మానవత్వం కోసం, సమ సమాజం కోసం వాదం ప్రశ్నిస్తుంది, పనిచేస్తుంది (దత్తయ్య 32).

సమానత్వ లోకమే బిసి వాద దృక్పథమని స్పష్టపరచడమనేది మొత్తం బిసి వాదానికే ఒక దిక్సూచి వంటిది. ఇది ఆయన భావ విస్తృతికి, వాద అవగాహనకు తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఉత్పత్తి కులాల సాహిత్యాన్ని దేశ యవనిక మీద నిలబెట్టాలంటే బలమైన బి.సి. వాద సాహిత్యం - విమర్శ రావాలంటాడు కవి, రచయిత, విమర్శకుడు డా. అట్టెం దత్తయ్య. చెప్పడమే కాదు అలాంటి పనిని తనే తలకెత్తుకొని "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే విమర్శనా గ్రంథ రచనతో సబ్బండ కులాల గొంతును ఎలుగెత్తి చాటుతున్నాడు.

డా. అట్టెం దత్తయ్య రాసిన ఈ "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే పుస్తకం 'బహుజనుల వీలునామా' అంటాడు డా. ఎస్. రఘు. నిజమే కాలం ఆరు ఋతువులుగా నడిచినట్లు ఈ పుస్తకంలో దత్తయ్య చేసిన విమర్శ కూడా పద్య కవిత్వం, పాట కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ అనే ఆరు ప్రక్రియలలో సాగి దారిదీపం అవుతుంది. ఈ గ్రంథం చారిత్రక దృక్పథంతో అనేక ఉదాహరణలతో పరామర్శించి మన ముందు పెట్టాడు. విడిగా ఈ ప్రక్రియలపై విస్తారమైన విమర్శ జరిగి ఉండొచ్చు. కానీ బి.సి. వాదంలో ఈ సాహిత్య ప్రక్రియలన్నిటిపై ఇప్పటిదాకా ఇటువంటి పుస్తకం రాలేదని చెప్పవచ్చు. తెలుగు బి.సి. వాద సాహిత్యాన్ని ఆరు ప్రక్రియలుగా పరిశీలించి, పరిశోధించి, విమర్శనా స్థాపన చేసిన విమర్శకుడు నాకు తెలిసి ఒక్క అట్టెం దత్తయ్య తప్ప మరెవ్వరూ లేరు. అటువంటి కృషిని 2021నాటికే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, పరిశోధకుడిగా తెలంగాణ బి.సి. వాద సాహిత్య విమర్శ పుస్తకం తీసుకొని రావడం గొప్ప కార్యంగా అభివర్ణించవచ్చు. పనిలో పనిగా, అనేక చర్చలు, వాదనల మధ్యన ఉన్న బహుజన పదానికి బదులుగా బి.సి. సాహిత్యం అనే నామ స్థాపన కూడా చేశాడు. ఇది సాహిత్య చరిత్రపై, భవిష్యత్ పై దత్తయ్యకు ఉన్న స్పష్టతను విశదపరుస్తుంది.

3. బిసివాద సాహిత్యం - ప్రక్రియావిశ్లేషణలు

3.1. పద్యకవిత్వం

ఈ 'తెలంగాణ బిసి వాద సాహిత్యం'లోని మొదటి భాగంలో తెలంగాణ పద్య కవిత్వంలోని బి.సి. వాదాన్ని వెతుకులాడాడు. నివురుగప్పిన నిప్పుని ఊది మంటను రాజేసినట్టు పదకొండవ శతాబ్దం పాల్కురికి సోమనాథుని లెగసీని తట్టి లేపుతున్నాడు. ఆయన రాసిన 'పండితారాధ్య చరిత్ర', 'బసవ పురాణం', 'వృషాధిప శతకం'లలో ఉన్న బి.సి. కులాల ప్రస్తావనల్ని, సబ్బండ వర్ణాల జాడను మన ముందు తవ్వి పోస్తున్నాడు అట్టెం దత్తయ్య. పద్యం సదా పండితుల పక్కలోనే కులికింది తప్ప పామరులను పట్టించుకున్న పాపాన పోలేదు.

ప్రాచీన కాలం నుండి పద్యం పండితుల చేతుల్లో పరిఢవిల్లుతుంది. ఛందః సౌందర్యం ప్రాస విన్యాసాల మేళవింపు ఉన్న ఈ పద్యం సామాన్యుడి బాధలను, వారిపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షతను, దోపిడీలను పట్టించుకోలేదు. శృంగారానికి, అంగరానికి, వర్ణన విన్యాసాలకు, సుత్తికే సరిపోయింది (దత్తయ్య 70).

అంటూ పద్యం, పండితుల పక్షపాత వైఖరిని ఎండగట్టాడు దత్తయ్య. పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలో "గొల్ల స్త్రీలు పట్టణ వీధుల్లో చల్లను అమ్మేవారు" (పాల్కురికి, వృషాధిప శతకం 68) అని రాయడం; అలాగే బసవ పురాణంలో "వీథిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి 'బసవరో ' అని కేక పెట్టగా ఆమెను పడిపోకుండా బసవన కాపాడినాడు" (పాల్కురికి, బసవ పురాణం 2.108) ఇలా గొల్ల కురుమల ప్రస్తావన ఉన్న పురాణ సాహిత్యాన్ని వెలికి తీసే ఆధార పూర్వక ప్రస్తావన అట్టెం దత్తయ్య పరిశోధనా శ్రమకు నిదర్శనం. అదే విధంగా 1934లో 354 మంది తెలంగాణ కవుల కవిత్వంతో వచ్చిన గోలకొండ కవుల సంచికలో పది మందికి పైగా బి.సి.లు ఆనాడే కవిత్వం రాసిన విషయాన్ని లేవనెత్తాడు. 2020 సంవత్సరంలో దోరవేటి రాసిన 'శ్రమదేవో భవ' పుస్తకంలోని 25 వ పుట పద్య పంక్తులను సాక్ష్యంగా చూపుతూ గొల్ల కురుమలు పాల శాస్త్రవేత్తలు అని, ప్రజలకు పాలు, మజ్జిగ, వెన్న వంటి బలమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అలాంటి వారిని మాత్రం వెర్రివారిగా చూడటం ఆలోచింపదగిన అంశం అని బాధను వ్యక్తం చేస్తాడు అట్టెం దత్తయ్య (దోరవేటి 25). శ్రమను తక్కువ చేసే కుల సమాజ కునీతిని మన కళ్ల ముందు పెట్టాడు అట్టెం దత్తయ్య. టి. అనిత చెప్పిన "అప్పటి కాలంలో గొర్ల కాపరి వృత్తి బాగానే ఉండేదనే" దానికి భిన్నంగా ఆ వృత్తినే మళ్లీ ఎంచుకునే ఉచ్చులో పడకుండా వృత్తిని దాటి బయటికి పయనించి ఆధునిక సమాజంలోకి దూసుకుపోవాలని నేటి తరానికి సూచన చేస్తున్నాడు అట్టెం దత్తయ్య. అవుసుల భానుప్రకాశ్, రాధ శ్రీ వంటి వారితో పాటు పదిహేను మంది బి.సి. కవులు డెబ్బై పద్యాలలో రాసిన ఉప్పరులు, మున్నూరు కాపులు, దర్జీలు, విశ్వబ్రాహ్మణులు, పద్మ శాలీలు, కుమ్మరులు, గౌండ్లు, పిచ్చుకగుంట్ల వారు, మంగలి, మేదరులు, గంగిరెద్దులు, చాకలి, బెస్తలు ఇలాంటి వృత్తి, సేవా కులాల జీవన గమనంలో వేదనా భరితమైన సంక్షోభాన్ని తెలుపుతూ రచయిత వేదన చెందుతాడు. అక్షరం ముక్క రాని పిచ్చుకగుంట్లవారు ఆరు ఉప జాతులుగా ఉంటూ కామమ్మ, బాల నాగమ్మ, లక్ష్మమ్మ, సరోజమ్మ, సూర్య చంద్ర రాజుల చరిత్ర, కథా గేయాలను చదువు వచ్చిన వారి కంటే అలవోకగా పాడి తిండి కోసం అడుక్కొని జీవిస్తారు. కానీ వారిని ఇటు సమాజంలో గానీ అటు సాహిత్యంలో గానీ ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న మన ముందు ఉంచుతాడు రచయిత.

3.2. వచన కవిత్వం

రెండవ భాగం వచన కవితా విమర్శ. వాదం ప్రారంభంలో బి.సి. కులాల సాహిత్యం వచన కవిత్వంలోనే పొంగిపొర్లిందని చెప్పాలి. వృత్తులపై వచ్చిన కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహించింది. బి.సి. కవులు విద్యుత్ వేగంతో విద్వత్ రాగంతో కవిత్వాన్ని అలుగ దునికించారు. అందుకు సాక్ష్యంగా తొంభై రెండు మంది కవులు పదిహేడు కులాలను ప్రస్తావిస్తూ రాసిన నూట పదమూడు కవితలను "తెలంగాణ వచన కవిత్వం - బిసి వాదం" అనే భాగంలో చూడవచ్చు. వచన కవిత్వంలో 1996లో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన 'బహువచనం' సంకలనం నుండి 2020లో వచ్చిన 'బిసి కవితా సంకలనం' వరకు పదమూడు కవిత్వ సంకలనాలు, అలాగే కొన్ని వ్యక్తిగత సంపుటిలు వచ్చినట్లు తెలుపుతాడు రచయిత. వాటిలోని కవితలను అట్టెం దత్తయ్య పరిచయం చేసిన తీరు పాఠకులను అబ్బురపరుస్తది. అయితే "వెంటాడే కలాలు - వెనకబడిన కులాలు" సంకలనం వృత్తి, ఈతిబాధలు ప్రకటించే దశను దాటి బిసి వాద నినాదాన్ని ప్రకటించింది. అదే బిసి వాద సాహిత్యంలో ఓ పెద్ద మూలమలుపు. ఇలాంటి స్థితిలో అట్టెం దత్తయ్య తెచ్చిన ఈ గ్రంథం బిసి వాద సాహిత్యాన్ని మరో మెట్టుకు తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఇందులో వడ్డెర, కుమ్మరి, ఆరెకటికలు, గాండ్ల, జంగాల కులాలపై వచ్చిన వచన కవిత్వాన్ని వెలికితీసి చర్చిస్తాడు రచయిత. "వాడు మరణాన్ని గానం చేస్తాడు" అనే తైదల అంజయ్య రాసిన 'కాటి పాపలోడు' కవితను దత్తయ్య విమర్శకు పెట్టిన తీరు మనసును మెలిపెడుతుంది. వీరి బతుకుల్లో కన్నీళ్లకు కారణమెవ్వరని ప్రశ్నను లేవనెత్తుతాడు. ఇట్లా అనేక వృత్తుల బహుజనుల కవితలను దత్తయ్య విస్తృతంగా విశ్లేషించాడు. జనం వంటిపై ధగ ధగ మెరిసే నగలను అందించే కంసాలి వంటికి ఇంత కూడు కరువయిన దుస్థితిని, వడ్రంగి, మంగలి, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి వంటి చేతి వృత్తులపై ఆధారపడ్డ కులాలు ప్రపంచీకరణ కూడలిలో కుదేలై కూలబడ్డ జీవితాలపై వచ్చిన కవిత్వాన్ని ఈ పుస్తకంలో పరిశీలించిన తీరు దత్తయ్య సూక్ష్మ దృష్టిని, సునిశిత విమర్శకు నిదర్శనం. అగ్రకులాలు వారి అవసరాలకు బి.సి.లను కుల నిర్మాణంలో బందీలుగా మలిచారని, ఆ బంధనాల విముక్తికి బి.సి. వాద భావావేశం అందరికీ కలిగితేనే విముక్తి సాధ్యమని భావిస్తున్నాడు. అందుకు బహుజనులు ఐక్యత చాలా అవసరమని, బహుజనులకు పొలిటికల్ పవరే అంతిమ లక్ష్యంగా సాగాలని చైతన్య పరుస్తున్నాడు. ఇలా వచన కవిత్వంలో బి.సి. కులాల సామాజిక, సాంస్కృతిక మూలాలను తడిమి, బిసి వాద దృక్పథాన్ని విమర్శనాత్మకంగా చర్చకు పెట్టాడు అట్టెం దత్తయ్య.

3.3. పాట కవిత్వం

మూడవ భాగంలో "తెలంగాణ పాట - బిసి వాదం" అనే ప్రక్రియలో బి.సి.ల పాటలను పరిచయం చేస్తూ విశ్లేషించాడు. ఆదినుండి పాట ఏ ఆధిపత్యం లేని సొంత గొంతుకల మట్టి పరిమళంతో ఉబికి ప్రవాహం చెందుతుంది. బహుజన కులాల వారు శ్రామికులు కావడం వలన పాట వారి చెమటబొట్టును ముద్దాడి సరికొత్త గానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సరిగమపదనిసలు అగ్రకులాల ఒళ్ళో సేద తీరితే, జనపద సాహిత్యం బహుజనుల గొంతులో రాగాలు తీసింది. నిజానికి జనపదాలకు అగ్రహార పరివారాలకు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా స్పష్టమైన వైరుధ్యం ఉంది. మూలవాసులైన దళిత బహుజనులే వేల సంవత్సరాలుగా పాటను రక్షిస్తూ వస్తున్నారు. బి.సి.లు పాటను తమ ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడం వలన, వృత్తులతో కలపడం ద్వారా పాట మరింత పదునెక్కింది.

జానపద పాట మౌఖికంగా బి.సి. ఆశ్రిత కులాల వారు పాడుతూ, కథ రూపంలో చెబుతున్నారు. కానీ లిఖిత రూపంలో రావాలని, అప్పుడే బి.సి.ల గత చరిత్ర, వైభవం తెలుస్తుందనీ చెబుతూ పాటలను రికార్డు చేయాల్సిన అవసరాన్ని విమర్శకుడిగా ఈ తరానికి నొక్కి చెబుతున్నాడు దత్తయ్య.

బి.సి. ప్రధాన కులాల వారికి ఆశ్రిత గాయక కులాలు ఉండటం, వీరు ఆయా కులాలకు చెందిన వీరులు, సాహసికులు, నాయకులు, దాతల గొప్పతనాన్ని గానం చేస్తారు (దత్తయ్య 72)

అని దత్తయ్య చెబుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అర్థం చేయిస్తాడు. అదే సందర్భంలో వారి పాటలను, గాయకుల గురించి సాహిత్య సేకరణ, పరిశోధన జరగటం లేదని వాపోతున్నాడు. బి.సి. వాద ఉద్యమం బలంగా లేని కారణంగా ఆ వాదం మీద నిలబడి, ఆ దృక్పథంతో పాటలు రాసే బి.సి. పాటల రచయితల కొరత ఉందని దత్తయ్య గుర్తించాడు. మిత్ర పాటల్లో వృత్తి గోసతో పాటు రాజ్యాధికార స్పృహను రగిలిస్తాడంటాడు. వారి పాటల స్ఫూర్తితో బి.సి.లు తమ చైతన్యాన్ని, ఐక్యతను పెంచుకోవాల్సిన అవసరాన్ని కనిపిస్తుంది. "శత్రువును అంతం చేయడానికి సకల దిక్కుల నుంచి ముట్టడిస్తున్న మనుషుల్లాగా ఈ పాటలు కనిపించాయి" అని సీతారాం అన్నట్లు ఈ పాటలన్నింటి విశ్లేషణతో బి.సి.ల మనసుల్లోకి ఉద్యమ సన్నద్ధత ఎదురెక్కాల్సిన అవసరాన్ని దత్తయ్య ప్రతిపాదిస్తున్నాడు.

3.4. కథాసాహిత్యం

నాల్గవ భాగంగా కథా ప్రక్రియను పరిశీలించాడు. భారతదేశంలో బహుజనుల జీవితాల్లో పురాణేతిహాసాలకు మించి లోతైన యదార్థ గాథలుంటాయి. ఎవరి జీవితాల్ని కదిలించినా కథలు కెరటాలై పోటెత్తుతాయి. అవేవీ కాలక్షేపానికో, వ్యాపకం కోసమో చెప్పుకునే వట్టి కథలు కాదు. బహుజన బతుకుల ఎతలు, కథలన్నిటి నుండి పచ్చి కన్నీటి వాసన మనల్ని చుట్టుముడుతుంది. కనుక ఏ బి.సి. ఇంటి కడపను తడిమి చూసినా కథలు కట్టలు తెగి ఉబికి వస్తాయి. ముఖ్యంగా బి.సి. ఆశ్రిత కుల జీవనమంతా కథా, కథన సమాహారమే. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కన్ను తెరిచిన నుండి కన్ను మూసే వరకు ప్రతి కదలికా ఒక కథే. అదిమిపట్టి ఉంచిన చేతివృత్తి, సేవా కులాల అంతరంగాలను పరిశీలిస్తే కథలు ఉసిళ్ల పుట్టలా కదిలొస్తాయి. అయితే వాటిని అక్షరీకరించేదెవరు? ఒకవేళ అక్షరీకరించే కృషి చేస్తే, ఆ ప్రయత్నం కూడా ఇంకో కథే అవుతుంది.

కథా సాహిత్యంలో బి.సి. కులాల స్థితిగతులను ఎరుకజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటే ముందు నుండే దర్శనమిస్తాయి (దత్తయ్య 171)

అంటూ కథా సాహిత్యంలో బిసిల ఆనవాళ్లు వెలికితీస్తున్నాడు దత్తయ్య. తెలంగాణలో కథకు చారిత్రక నేపథ్యం ఉందని, ఉద్యమాలకు ఊపిరి అయ్యిందని, వర్తమానంలో బహుజన కులాల్లో మార్పులను కథ చూపెట్టిందనే కోణాన్ని విప్పి చెబుతూనే, ప్రపంచీకరణ కుల వృత్తులపై చేస్తున్న ధ్వంస రచనను వివరించాడు. బహుజన కథకులు బి.సి. కులాల శ్రమను, బాధితుల వేదనను ప్రకాశవంతంగా మలిచి ప్రపంచానికి అందించారు. అట్లాగే బిసిల అస్తిత్వాన్ని కథల్లోకి ఒంపి, చెమట చుక్కలకు చరిష్మా అద్దారు. ఇలా కథల ద్వారా బి.సి. రచయితలు బహుజన చైతన్యాన్ని ఒక మెట్టు ఎక్కించారని అట్టెం దత్తయ్య తీర్మానిస్తున్నాడు. మానవ వికాసానికి ఉత్పత్తి కులాల వారు తమ రక్తాశ్రువులు సర్వం ధార పోశారని విశ్లేషణాత్మకంగా వివరించాడు. బహుజన బతుకుల్లో అగ్గిపెట్టి, వారి జీవితాల ధ్వంసానికి పాల్పడ్డ అగ్రకులాలకు చెందిన రచయితలు పీడిత కులాల పట్ల కథలు రాయడం ఏమిటని సందేహం వ్యక్తంచేస్తున్నాడు.

బి.సి.లు తమ బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న జీవితాలను స్వయంగా నిస్సిగ్గుగా రాసుకోవాలి. కానీ కొందరు బి.సి. కథా రచయితలు అగ్రవర్ణాల మెప్పుకోసం తన స్వంత అస్తిత్వాన్ని పక్కకు పెట్టి అనవసరమైనవన్నీ రాస్తున్నారు (దత్తయ్య 173)

అని కొద్ది మంది బి.సి. కథా రచయితల తీరు చూసి బాధపడుతున్నాడు. వారు తమ బానిస బుద్ధిని మార్చుకొని సొంత గాథలను రాసుకోవాలని హిత బోధ చేస్తున్నాడు. తమ సొంత జీవన గాథే బిసిలకు గొప్ప కథా వస్తువంటున్నాడు అట్టెం దత్తయ్య.

3.5. నవలా సాహిత్యం

మానవ జీవనాన్ని, సామాజిక సంబంధాల్ని ఆసాంతం వ్యక్తం చేయగలిగిన సాహిత్య ప్రక్రియ నవల ప్రక్రియను అయిదవ అధ్యాయంగా స్వీకరించాడు. "తెలంగాణ నవల - బిసి వాదం" అనే అధ్యాయంలో తెలంగాణలోని పదిహేను బి.సి. కులాల వృత్తి జీవితాల ఆధారంగా నవలలు వచ్చాయని నిర్ధారించాడు అట్టెం దత్తయ్య. వారి వేదనాభరితమైన స్థితిని ఇరవై రెండు మంది రచయితలు ముప్పై నవలల్లో చిత్రీకరించారని గుర్తించాడు. అయితే సమాజంలో అధిక సంఖ్యాక జనాభాగా ఉన్న వెనకబడిన కులాలపై నవల సాహిత్యం రావాల్సినంత రాలేదని దత్తయ్య నిరాశ చెందుతున్నాడు. తెలుగు రచయితలకు సాహిత్యం అంటే కవిత్వం మాత్రమేననే తప్పుడు అభిప్రాయం ఉందని కుండబద్దలు కొట్టినట్టు విమర్శిస్తున్నాడు. అగ్రకుల పద్య పండితులు కింది కులాలు సాహిత్యంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే కవిత్వానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలో ఉన్న అంతరార్థమని దత్తయ్య విమర్శ ద్వారా వెల్లడవుతుంది. నేటి బహుజన యువకవులు కూడా కవిత్వ ప్రక్రియకే అధిక మొగ్గు చూపడం వంటి భావ బానిసత్వం నుండి బయటపడాలని సూచిస్తున్నాడు. కాలువ మల్లయ్య 'చీకట్లో చిరుదీపం' (మల్లయ్య), లోక హరి 'సంఘము' (హరి), బి.ఎస్. రాములు 'జీవనయానం' (రాములు, జీవనయానం), నేరేళ్ల శ్రీనివాస్ గౌడ్ 'బ్రతుకు తాడు' (గౌడ్), ఎస్.ఎమ్. ప్రాణ్ రావు 'ప్రజా జ్యోతి పాపన్న' (రావు), శాంతి ప్రబోధ 'జోగిని' (ప్రబోధ), పెద్దింటి అశోక్ కుమార్ 'సంచారి' (కుమార్) వంటి వారు రాసిన నవలల్లో చేతివృత్తుల చెమ్మను పసిగట్టాడు. అట్లా ఈ నవలల్లో సబ్బండ బి.సి. కులాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవన గతులను దత్తయ్య పరిశీలించి, విమర్శనాత్మకంగా మన కళ్ళముందు ఉంచడంతో బి.సి. వాద తాత్వికత విస్తృతి మనకు గోచరిస్తుంది.

3.6. విమర్శ

ఇక ఆరో భాగంలో విమర్శ మీద దృష్టిసారించాడు. సాహిత్య ప్రక్రియల్లో ఆధునికమైన విమర్శ ప్రక్రియ వలన సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అట్టెం దత్తయ్య "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే విమర్శనా గ్రంథం ద్వారా బి.సి. వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని, బిసిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బి.సి. వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బి.సి. వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపిస్తున్నాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుందంటాడు. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బి.సి. వాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిస్తున్నాడు. బి.సి. సాహిత్య విమర్శ పుస్తకాలుగా నాలుగు వచ్చాయి. కథా సాహిత్యం మీద 'బి.సి. కథలు ఒక విశ్లేషణ 2000-2010' అనే బి.ఎస్. రాములు విమర్శ గ్రంథం 2011లో (రాములు, బి.సి. కథలు), కవిత్వ ప్రక్రియ మీద కవిత్వంలో 'బిసి సూర్యోదయం' 2015లో జూలూరి గౌరీ శంకర్ (గౌరీ శంకర్, కవిత్వంలో బి.సి.), ఆయన సంపాదకత్వంలోనే మరో వ్యాస సంకలనం 'ఒక కవితా ఇరవై కోణాలు' (గౌరీ శంకర్, ఒక కవితా), అలాగే బిసి వాద యువ కవిత్వంపై 'ప్రవాహం' చింతం ప్రవీణ్ సంపాదకత్వంలో 2017లో విమర్శనా గ్రంథాలు వచ్చాయి (ప్రవీణ్ కుమార్). అలాగే ఒక్కో ప్రక్రియను సమీక్షిస్తూ వ్యాసాలు కొంత మంది కవులు రాశారు. అలా విమర్శలో కొంత కృషి జరిగింది. కానీ అన్ని ప్రక్రియలు కలిపి విమర్శ రాలేదు. కానీ అట్టెం దత్తయ్య ఆరు ప్రక్రియలపై తెచ్చిన 'తెలంగాణ బి.సి. వాద సాహిత్యం' అనే సమగ్రమైన విమర్శనా గ్రంథం బి.సి. సాహిత్య విమర్శలో మహత్తర కృషిగా నిలిచిపోతుంది. రాబోయే బి.సి. సాహిత్య విమర్శకు ప్రామాణికమైన మైలురాయిగా దారి చూపుతుంది.

ఉపసంహారం

తెలుగు సాహిత్య విమర్శలో బీసీల ప్రాతినిథ్యం గురించిన చర్చ చాలా లోతైనది. అట్టెం దత్తయ్య "తెలంగాణ బిసి వాద సాహిత్యం" అనే ఈ గ్రంథం ద్వారా బిసి వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని, బిసిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బిసి వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బిసి వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపించాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుంది. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బిసి వాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిస్తున్నాడు.

  • అట్టెం దత్తయ్య "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే గ్రంథం బి.సి. సాహిత్యానికి ఒక సమగ్ర విమర్శనాత్మక దృక్పథాన్ని అందించింది.
  • ఈ పరిశోధన పద్యం నుండి విమర్శ వరకు వివిధ సాహిత్య ప్రక్రియలలో బి.సి. వాద అస్తిత్వ భావనలను విస్తృతంగా చర్చించింది.
  • బహుజన కులాల జీవితాలు, వృత్తులు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు సాహిత్య చరిత్రలో విస్మరించబడిన తీరును ఈ గ్రంథం స్పష్టంగా వెల్లడించింది.
  • అగ్రకులాల ఆధిపత్యం, పక్షపాత వైఖరులను ప్రశ్నిస్తూ, బి.సి. కులాలకు సొంత వాణి అవసరాన్ని నొక్కి చెప్పింది.
  • ఈ గ్రంథం బి.సి. కులాలలో ఐక్యత, చైతన్యం పెంచడం ద్వారా రాజకీయ శక్తిని సాధించాలని పిలుపునిస్తూ, భవిష్యత్ బి.సి. సాహిత్య విమర్శకు మార్గదర్శకంగా నిలిచింది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఐలయ్య షెపర్డ్, కంచె. 'హిందూ మతాంతర భారత దేశం'. హైదరాబాద్: భూమి బుక్ ట్రస్ట్.
  2. గౌరీశంకర్, జూలూరు. సంపా. 'వెంటాడే కలాలు- వెనకబడ్డ కులాలు'.  హైదరాబాద్: స్పృహ సాహితీ సంస్థ.
  3. పైదే. 'కవిత్వంలో బి. సి. సూర్యోదయం'. హైదరాబాద్: అడుగుజాడలు పబ్లికేషన్స్.
  4. పైదే. సంపా. 'ఒక కవితా ఇరవై కోణాలు'. హైదరాబాద్: స్పృహ సాహితీ సంస్థ.
  5. దత్తయ్య, అట్టెం. 'తెలంగాణ బి. సి. వాద సాహిత్యం'. హైదరాబాద్: ప్రణవం పబ్లికేషన్స్.
  6. ప్రవీణ్ కుమార్, చింతం. సంపా. ' ప్రవాహం'. హైదరాబాద్: బి. సి. రైటర్స్ వింగ్.
  7. రాములు, బి. ఎస్. 2011. 'బి.సి. కథలు ఒక విశ్లేషణ 2000-2010'. హైదరాబాద్ : విశాల సాహిత్య అకాడమి.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]