headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. నిత్యబాలింత కవితాసంపుటి: సామాజికాంశాలు

గంజి కుమార్ రాజా

పరిశోధకులు, తెలుగు శాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం,
వేమనపురం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7730896943, Email: ganjikumarraja8@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.10.2025        ఎంపిక (D.O.A): 30.10.2025        ప్రచురణ (D.O.P): 01.11.2025


వ్యాససంగ్రహం:

ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి రాసిన 'నిత్య బాలింత' కవితాసంకలనం సమకాలీన సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఈ పరిశోధన సంకలనంలోని కవిత్వవస్తువులను విశ్లేషించడం ప్రధాన లక్ష్యం. పాఠకులలో ఆలోచన రేకెత్తించే అంశాలు, కవిత్వ నిర్మాణ శైలి, ప్రయోగాత్మక మాధుర్యం ఈ అధ్యయనానికి ప్రధానం. 'నిత్య బాలింత' అన్న శీర్షికకు రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి: ఒకటి ప్రకృతితో ముడిపడిన మట్టి తల్లిని నిత్య బాలింతగా దర్శించడం, రెండు ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే రైతన్న దృక్పథంలో భూమి పడే నొప్పులను గుర్తించడం. ఇది కవి సామాజిక స్పృహ, శ్రామిక పక్షపాత దృక్పథాలను ప్రస్ఫుటం చేస్తుంది. రాజకీయ, మత, ఆర్థిక, మానవ సంబంధాలు, కరువు, సమాజంలో స్త్రీ స్థానం, వలస జీవితాలు వంటి కీలక అంశాలు సంకలనంలో ప్రతిబింబిస్తాయి. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం, సామాజిక విమర్శల నేపథ్యంలో వెల్చేరు నారాయణరావు, జి. లక్ష్మీ నరసయ్య వంటి ప్రముఖుల రచనలను పరిశీలించి, వాటిని ఆధారం చేసుకుని ఈ అధ్యయనం కొనసాగింది. ఈ పరిశోధనకు ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి 'నిత్య బాలింత' కవితా సంకలనం ఆధారం. రచయిత ఇతర కవితా వ్యాస సంపుటాలు, కవిత్వ నిర్మాణ పద్ధతులు, కవిత్వం చర్చనీయాంశాలు వంటి ద్వితీయ ఆధార గ్రంథాలను కూడా పరిశోధన పరిధిలోకి తీసుకుని లోతైన విశ్లేషణ జరిగింది. పరిశోధన వర్ణనాత్మక విశ్లేషణ పద్ధతిలో సాగింది. కవితా సంకలనంలోని వివిధ ఖండికలను నేపథ్యం, వస్తువు, శైలి ఆధారంగా విశ్లేషించారు. ప్రకృతి-మానవ సంబంధం, రైతు చైతన్యం, వలస జీవితాలు, మత వివక్ష వ్యతిరేకత, స్త్రీ స్థితి, యువత ఆశాస్ఫూర్తి, సమయ ప్రాధాన్యత, స్నేహ బంధ విలువ వంటి ప్రధానాంశాలను గుర్తించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి 'నిత్య బాలింత' కవితా సంకలనంపై మాత్రమే దృష్టి సారించింది. కవిత్వం సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించడం, ప్రజలలో చైతన్యం నింపడం, ప్రపంచ శాంతిని మానవ సౌఖ్యాన్ని కాంక్షించడం, మంచిని ప్రోత్సహించడం, చెడును ఖండించడం ప్రధాన ఫలితాలుగా వెల్లడయ్యాయి. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా జరుగుతున్న అనేక సామాజిక పరిణామాలు ఈ కవిత్వంలో నిబిడీకృతమై ఉన్నాయి. ఈ అధ్యయనం కవి సామాజిక దృక్పథం, ఆయన కవిత్వ శైలిని లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. భవిష్యత్తు పరిశోధనలకు ఆయన ఇతర రచనలపై సమగ్ర విశ్లేషణకు ఇది ఒక ప్రాతిపదికగా నిలుస్తుంది. ప్రస్తుత పరిశోధన కవిత్వంలోని కొన్ని ప్రధానాంశాల విశ్లేషణకు మాత్రమే పరిమితమైంది.

Keywords: నిత్య బాలింత, ఎన్. ఈశ్వర్ రెడ్డి, కవిత్వం, సామాజిక స్పృహ, రైతు చైతన్యం, స్త్రీ స్థితి, వలస జీవితాలు.

1. పరిచయం

కవి వాంఛాకుహరాలలో పుట్టిన వేడి జ్వాల కవిత్వ రూపంలో వెల్లువిరిసింది. సమాజవాస్తవాలను ముడిసరుకుగా స్వీకరించి కవితలను రచించారు ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి. ఈయన నిత్య బాలింత అనే కవితా సంకలనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక సామాజిక వాస్తవాలను పాఠకుల కళ్ళ ముందుకు తెచ్చినట్టు అర్థం అవుతుంది. నిత్య బాలింత అనే మాటకు రెండు అర్థాలు నా శైలిలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి ప్రకృతితో ముడి వేసుకున్న నేల తల్లిని, మట్టిని నిత్య బాలింత లేదా పచ్చి బాలింతగా స్వీకరించాలి. రెండు ఆరు గాలం కష్టించి నేలను సేద్యం చేసే రైతు దృక్పథంలో ఈ శీర్షికను గుర్తించాలి. కర్షకుడు ఎల్లప్పుడూ కాయాన్ని పచ్చిపుండుగా చేసుకుని అనేక కష్టనష్టాలకు ఎదురీదుతూ సమాజంలో ముందుకు వెళ్ళడం చూస్తూనే ఉన్నాం. మౌలికంగా ఈ సంపుటికి రచయిత పెట్టిన శీర్షికను అర్థం చేసుకుంటే నిత్య బాలింతను పచ్చి బాలింతగా కూడ చూడవచ్చు. హాలికుడు తన చెమటను రక్తపు బిందువులా మార్చుకుని భూమిని సేద్యం చేస్తూ, ప్రపంచపు ఆకలి తీర్చడానికి చేస్తున్న వ్యవసాయంలో, భూమాత ప్రతిరోజు పచ్చిబాలింతగా నొప్పులను అనుభవిస్తోందని అనిపిస్తుంది. ఈ నిత్య బాలింత కవితా సంపుటి రచయిత ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి గారు. ఈయన యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా విద్యాబోధన చేస్తున్నారు. మొక్కవోని అంకుట దీక్షతో అభ్యుదయ కవిగా, శ్రామిక పక్షపాతిగా, సామాజిక స్పృహతో సమాజాన్ని స్పృశించి అనేక అంశాలను ఇందులో కవిత్వీకరించారు. ఈ సంపుటిలో ఉన్న కవితా వస్తువులను పరిశీలిస్తే పాఠకులకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయనేది అక్షర సత్యం. కవిత్వ నిర్మాణ శైలిని పట్టుకోగలిగితే, ఈయన శైలిలోని ప్రయోగ మాధుర్యం మనసును పట్టేసుకుంటుంది. రాజకీయ, మత, ఆర్థిక, మానవ సంబంధాలు, కరువు, సమాజంలో స్త్రీ స్థానం, వలస జీవితాలు వంటి అంశాల నేపథ్యంలో నిత్యబాలింత కవితా సంపుటి వచ్చింది.

2. ప్రకృతి మానవ సంబంధం

తన మొదటి కవితా ఖండికలోనే రచయిత మట్టికి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని బలంగా వినిపిస్తున్నారు:

తన దోసిట్లో పుట్టిన చెట్టు
ఆకాశాంచులకు విస్తరించిన
కొమ్మల భారంతో బరువెక్కిన
అచ్చం అమ్మలాగే
పేగు బంధాన్ని ఎప్పటికీ తెంచుకోలేవని
ఆత్మ బంధువు నా మట్టి తల్లి

పైన పేర్కొన్న కవితా పాదాలలో మట్టిని అమ్మతో పోల్చారు. దీనిలో భూమి, అమ్మ, ప్రేమ సమానంగా వ్యక్తీకరించబడ్డాయి. బిడ్డలకు ప్రేమ అందించడంలో తల్లి ఎంత నిస్వార్థంగా ఉంటుందో, భూమి తల్లి కూడా తన గర్భంలో పుట్టిన చెట్లు ఫల పుష్పాలతో విస్తారంగా విస్తరించినా ఆ బరువును భారంగా భావించదు. తల్లిలా ఆదరించి మోయడమే కర్తవ్యంగా భావిస్తుందని కవి తెలియజేస్తాడు.

బతికున్నంత కాలం
పాలై, పరమాన్నమై ప్రవహించిన మట్టి రుచులు ఆస్వాదిద్దాం
మరణం తర్వాత మట్టి కడుపులోని మహత్వాన్ని ఆగ్రాణిద్దాం.
ఎప్పటికైనా మట్టి మట్టే
అది అమృతత్వానికి అమ్మ చెట్టే

అంటూ సమస్త జీవకోటికి అమృతత్వాన్ని పంచి పెడుతున్న నిత్య బాలింతైన మట్టి వాస్తవికతను కళాత్మకంగా మన కళ్ళ ముందు చిత్రించాడు.

3. రైతు చైతన్యం

కర్షక పక్షపాతిగా హాలికుని స్వరాన్ని, ఆవేదనను అర్థం చేసుకున్నారు. కాబట్టే నిత్య శ్రామికుడైన రైతు జీవన బతుకు ప్రస్తుతం ఎంత దీనంగా సాగుతుందో మట్టి సూర్యులు (7), కిసాన్ ఇండియా (49) కవితల్లో వివరించారు.

తారురోడ్లపై పట్టుదలను పరుచుకుని
అస్తిత్వ కవచం కోసం
తపస్సు చేస్తున్న విప్లవ పురుషులు వారు

అంటాడు కవి. 2020 సంవత్సరంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు ఢిల్లీ నడిబొడ్డున ఎముకలు కొరికే చలిలో మొక్కవోని అంకుటిత దీక్షతో రైతులు పోరాటాలు చేసి అడ్డుకున్నారు. రైతుల త్యాగాల ఫలితంగా 2023 సంవత్సరంలో పార్లమెంటు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం వారి కృషికి, పట్టుదలకు తార్కాణం. స్వాతంత్ర్యానికి పూర్వం ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో స్వేచ్ఛా జీవులుగా జీవించడం కోసం గాంధీ ఆధ్వర్యంలో 1942 సంవత్సరంలో చేయండి లేదా చావండి అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం నడిచింది. నేడు 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతు మనుగడ కోసం నిత్యం ప్రభుత్వాలతో దళారీ వ్యవస్థపైన కిసాన్ ఇండియా పేరిట పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరం.

పైరు పాపలకు
చెమట పాలిచ్చే దేహాన్ని
లాఠీ కర్రలతో ఛిద్రం చేస్తారా
ప్రాణ గింజలపైన పచ్చి విషం పోస్తారా

అంటూ కిసాన్ ఇండియా (49) కవితలో రైతు అస్తిత్వం కోసం తపన పడుతున్న రైతుల గురించి రాస్తారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఎంత తీవ్రమైన కష్టాలకు నష్టాలకు గురిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ రోడ్లపైన కదం తొక్కిన రైతు దేహాలపై లాఠీ చార్జీలు చేసి వారి మానసిక స్థితిపైన దెబ్బ కొట్టాలని చూసిన ప్రభుత్వాల మూర్ఖత్వాన్ని, పైశాచికత్వాన్ని కవి తీవ్రంగా నిరసిస్తున్నారు.

ప్రకృతి ప్రకోపంతో విరుచుకుపడితే సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులకు గురవుతాయో సీమ గుండెపై తుఫాను విషం (18) అనే కవితలో చూడవచ్చు.

ఈ పాడు తుఫాను
పాల మబ్బుల కోసం ఎదురుచూసిన
పంట పొలాలకు నీటి చిచ్చు పెట్టి
పచ్చటి పైరు బిడ్డల్ని
బురద నోటితో నిలువునా మింగేసింది

అంటూ సీమ బిడ్డగా కవిత్వం ద్వారా బాధిత రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా సంభవించే తుఫాను బీభత్సం సృష్టించే నష్టం ఎన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందో ఈ కవితలో ఏకరువు పెట్టారు. ఎప్పుడూ వర్షం రాక కోసం ఎదురుచూసే రైతులకు అనుకోని అకాల అతివృష్టికి చిగురుటాకులాగా వణుకుపోయిన రైతు బాధితుడిగా మారడం, రైతు మనఃస్థితిని వర్ణిస్తారు. కరువు బాధితుడిగా కనిపించడం కవి మనసును కలచివేసింది.

4. పల్లె జ్ఞాపకాలు వలస జీవితాలు

తాను పుట్టి పెరిగిన ఊరు నుండి వలసపోయిన ప్రజలను తిరిగి పల్లెకు రండి అందరం కలిసి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అనుభవాలు పంచుకుందాం అంటూ చేరబిలుస్తాడు. సంక్రాంతి, ఉగాది పర్వదినాలకు పల్లె బిడ్డల కోసం తల్లిలా ఎదురుచూస్తుందని ఈశ్వర్ రెడ్డి పల్లె పక్షాన నిలబడి పట్నాలకు వెళ్లిపోయిన గ్రామ మూలవాసులను ఆహ్వానించడాన్ని చూడవచ్చు. పల్లె గూటికి రండి (20), శుభమ్ దేహి శుభకృత్ (25) వంటి కవితలలో పల్లె తల్లి హృదయ వేదన స్పష్టంగా కనిపిస్తుంది.

తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను గమనిస్తే అతి ముఖ్యమైన పండుగగా పరిగణించబడేది, కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేది సంక్రాంతి. సంక్రాంతి పర్వదినాన రైతు తన పొలంలో కొత్తగా పండించిన వరి కంకులను, తీయనైన చెరుకు గడలను తెచ్చుకుని సంక్రాంతి శోభలో అలంకరణకు ఉపయోగిస్తాడు.

రండి! మట్టిని పిసికి అన్నం బయటకు తీస్తున్న
రైతు బ్రహ్మను ఆలింగనం చేసుకుందాం
మనిషంత సంతోషాన్ని నిలువునా అనుభవిద్దాం
జీవన ప్రయాణానికి కొండంత ఉత్సాహం అందిద్దాం.

తెలుగు ప్రజల మొదటి నెల ఉగాది పర్వదినంతో మొదలవుతుంది. అయితే కరోనా కలిగించిన నష్టాల నుండి మనుషులను కొత్త ఉత్సాహంతో జీవితం ప్రారంభించమని పిలుపునిస్తారు.

ఓ శుభకృత్ ఉగాది!
ఉరిమే ఉత్సాహాన్ని
మా జీవిత గాదుల్లో నింపిపో
మా ఆశక్త ఆశాంత బతుకుల్లో
శాంతి పువ్వై నిలిచి
వెలుగు దివ్వై వేడుక చెయ్యి

అని ప్రజల పక్షాన మంచిని కోరుకుంటున్నారు ఈశ్వర్ రెడ్డి.

5. రాయలసీమ గుర్తింపు భాషాభిమానం

ఆ మధ్య ఒక సినీ నటుడు ప్రేమపై చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను నిరసిస్తూ “నా ప్రాంత యాసను కించపరిచి / నీ వాచాలత్వాన్ని పదే పదే మాపై కక్కితే / ఎప్పుడో ఒకప్పుడు / గుండె పగిలే గుణపాఠ గునపం / నీ గొంతులో దిగుతుందని మర్చిపోకు” అని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈశ్వర్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా బలమైన ముద్ర వేసుకున్నారు. తను పుట్టి పెరిగిన, మాట్లాడిన గ్రామీణ మాండలిక యాసకు, భాషకు అన్యాయం జరుగుతుంటే ఒప్పుకోలేదని నిరూపించారు. తనదైన కోణంలో “సీమ గుండె గాయం” (34), “పల్లె గాయపడింది” (32) కవితా ఖండికలలో సీమను కించపరిచే వారిపై నిరసన వ్యక్తం చేశారు.

ప్రపంచీకరణ ప్రభావం, పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వలన ఉన్నచోట అవకాశాలు లేకపోవడం, పిల్లల భవిష్యత్తు నిమిత్తం ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులను విడిచి విదేశాల్లో స్థిరపడిపోయిన వ్యక్తులు, గ్రామంలో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్న సందర్భాలను వివరిస్తారు. తన వారి కోసం నిత్యం పల్లె ఎదురుచూస్తుందని, ఆవేదన చెందుతూ వారి పక్షాన గళాన్ని వినిపిస్తూ “ఏడాదికి ఒక్కసారైనా వచ్చిపోండని, పక్షులు ఎగిరిపోతున్నాయి (95), తప్పక వచ్చిపో నాయనా (87), మేం బాగానే ఉన్నాం” కవితా పాదాలలో కవి ప్రాధేయ పడుతున్నారు.

నువ్వొస్తే
సంవత్సరకాలం సలిపిన
దిగులు గాయాలు ఊరడిల్లుతాయి
నువ్వొస్తే నాన్నను కమ్మేసిన
నిరాశ నిశి పటాపంచలవుతుంది
నువ్వొస్తే పల్లె తల్లి మళ్లీ జీవం పోసుకుంటుంది.

కన్న తల్లిదండ్రులకు బాసటగా నిలవాలని, సొంత ఊరు వదిలి వెళ్ళిన ఎందరో కొడుకుల జీవితాలకు ప్రతీకలుగా పై కవితలు నిలుస్తున్నాయి. గూడు విడిచి వెళ్ళిన తమ్ముడా ఒక్కసారి నీ తల్లిదండ్రులకు కనిపిస్తే వారి ప్రాణాలు ఊరడిల్లుతాయి. వాళ్ళు నీ మీద పెట్టుకున్న దిగులు పోయి మళ్లీ కాల గమనంలో ఆనందంగా జీవిస్తారు. నీ రాక కోసం పల్లె ఎదురుచూస్తుందని, వచ్చి పోరా నాయనా అంటూ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాడు.

6. మత వివక్ష వ్యతిరేకత శాంతి కాంక్ష

గత కొద్ది సంవత్సరాలుగా ఈ దేశంలో మతం పేరిట వెనుకబడిన తరగతులపైన, మైనార్టీ ప్రజలపైన, ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న దాడులను కవి నిరసించారు. రాజ్యాధికారం కోసం ప్రజలను మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొడుతూ ఆధిపత్యం చలాయిస్తున్న అనేక దుర్ఘటనలు ఈ మధ్య ఎక్కువగానే దర్శనమిస్తున్నాయి.

మీ మత పిచ్చికి కిరీటం పెట్టడం కోసం
మీ అజ్ఞానాన్ని సింహాసనంపై కూర్చోబెట్టడం కోసం
ఎన్ని వేల తలలని తెగ్గోస్తారు
ఎన్ని కోట్ల కలలని పేల్చేస్తారు.

ఒరేయ్ క్రూర హంతకుడా! ఈ హత్యాకాండను ఇప్పటికైనా ఆపరా
మనుషులంతా చచ్చాక నువ్వు ఏలబోయే నిశీధి శ్మశానం నిన్ను కూడా తప్పక మింగుతుందని మర్చిపోకు

అని హెచ్చరిస్తారు. వేమన నడయాడిన సీమలో జన్మించారు కాబట్టే వేమన దృక్పథం కవిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వేమన ఏ విధంగా అయితే సమాజంలోని మత దురాహంకారాలను, దురాచారాలను నిరసించారో, మతం పేరిట జరిగే క్రూరమైన హత్యాకాండలను అభ్యుదయ కవిగా నిరసన గళాన్ని వినిపించారు. ఈ హత్యాకాండను ఆపండిరా అనే ఖండిక శాంతిని కాంక్షిస్తుంది.

7. సమాజంలో స్త్రీ స్థితి

ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని నమ్మే భారతీయ హైందవ ధర్మం సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమాజంలో స్త్రీపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను, దాడులను నిరసిస్తూ కవిత్వ రూపంలో తన సానుభూతిని వ్యక్తం చేస్తారు. ఈ దేశ చరిత్రలో అత్యంత భయానక సంఘటనలు ఢిల్లీ నిర్భయ కేసు, కలకత్తా పీజీ డాక్టర్ కేసు, ఇంకా తెలుగు నేలపై దిశ, సుగాలి ప్రీతి వంటి ఆడబిడ్డలపైన జరిగిన మానభంగాలు, ప్రపంచం ఎదుట తలెత్తుకోకుండా చేసిన మణిపూర్‌ లోని సంఘటన, ఘోరంగా అత్యాచారం చేసి నగ్నంగా స్త్రీలను ఊరేగించడం వంటి దుర్మార్గాలు కవి హృదయాన్ని ద్రవింపజేశాయి. కాబట్టే స్త్రీ పక్షపాతిగా వారి వైపు నిలబడి బలమైన గొంతును వినిపించారు. స్త్రీలు కేవలం మగవాడి సుఖాలను తీర్చే భోగ వస్తువు మాత్రమే కాదని గుర్తు చేస్తారు. “అచ్చే దిన్” (42), “బహిరంగ న్యాయం కావాలి” (60) వంటి కవితా ఖండికలలో స్త్రీలపైన జరుగుతున్న దురాగతాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

పురుషాంగాన్ని సుఖపెట్టే దేహ వస్తువుగా
స్త్రీని చూసినంత కాలం ఈ విశ్వ గృహంలో
అమ్మ అమ్మగా ఎప్పటికీ మిగలదు

అనడమే గాక, నా దేశం డొల్లస్వామ్యం విశాల విశ్వ తెరపైన మౌనంగా రోదిస్తోందని ఎంతో వేదన వ్యక్తం చేస్తారు.

8. యువతలో ఆశావాదం

ప్రస్తుత భారతీయ యువ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఓటమిని అంగీకరించలేక జీవిత ప్రయాణంలో చేరవలసిన తీరాన్ని చేరక, ఇక జీవితమే వ్యర్థమని ఎంతోమంది మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. వారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు కవి. “మరణం పరిష్కారం కాదు” (47) అనే ఖండికలో.

మట్టిలో పాతేయబడ్డ విత్తనం
చినుకు పిలుపుతో సుషిప్త సమాధిని
బద్దలు కొట్టి బయటికి నడుస్తుంది

విత్తనం పాతి పెట్టబడినా అది రూపాంతరం చెంది పుడమిని చీల్చుకుని మొక్కై వస్తుంది. సమస్యలనే సుడిగుండాలలో మానవుడు నలిగినప్పుడే సువర్ణంలాగా రాటు తేలుతాడు. కాబట్టి కమ్ముకొస్తున్న చీకటి తెరలను ఆత్మవిశ్వాసంతో తెంచుకొని ముందుకు వెళ్ళమంటారు. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉందని హితవు చెబుతున్నారు ఈశ్వర్ రెడ్డి.

9. కాల ప్రాధాన్యత

మానవ జీవితంలో అన్నిటికంటే గొప్పది సమయమే అని పరిచయం చేస్తున్నారు. సమయం వృథాగా పోనీయక, అజ్ఞానుల్లా కాక, జ్ఞానుల్లా ప్రవర్తించుమని హితవు చెబుతారు. కాలం ప్రతి ఒక్కరికీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అన్ని వనరులను సమకూర్చిపెడుతుంది. వాటిని సద్వినియోగం చేసుకున్న వారు ఇలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి చరిత్రలో స్థిరంగా నిలబడిపోయారు. చెమట చుక్క చిందించబడకుండా ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు ఉన్నతంగా ఎదగలేదని తెలియజేస్తారు కవి.

కాలాన్ని గౌరవిస్తే
కష్టాలను దాటే రెక్కలిస్తుంది
కాలాన్ని కించపరిస్తే
కాళ్లను విరిచి మూల పడేస్తుంది
కాల గుహలో దాగిన
అనంత సంతోష రాశిని చేరాలంటే ప్రతి క్షణాన్ని చెమట
చమురుతో వెలిగించుకోవాలంటూ

సమాజానికి మంచిని బోధిస్తున్నారు “కాలం పెద్ద అధ్యాపకురాలు” (85) అనే ఖండికలో.

10. స్నేహ బంధం విలువ

ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి స్నేహానికి పెద్ద పీట వేస్తారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, పగవాడు విస్తారమైన ముద్దు మాటల లాలనతో చెరుపుతాడని లోకంలో ఉన్న సత్యం. స్నేహం అన్నిటికంటే గొప్పదని అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు కవి. అటువంటి స్నేహాన్ని స్వార్థానికి లొంగని హిమగిరిలా స్వచ్ఛంగా నిలుపుకోవలసిన బాధ్యతను “స్నేహబంధం” (59) అనే ఖండికలో గుర్తు చేస్తున్నారు. స్నేహబంధంలో ఉండకూడని విషయాలను కూడా తెలియజేస్తారు.

ప్రియ మిత్రమా! కాస్త జాగ్రత్త!
చెప్పుడు మాటలకు చెవులు ఇస్తే
అసూయలు అవమానాల ముళ్ళు
మనసు పొరను ఛిద్రం చేస్తాయి
ఆత్మ బంధాలు ఆవిరైపోతాయి
వందేళ్ల సంతోషం కూడా ఒలికి పోతుంది 
అని సున్నితంగా పై మాటలతో అందరినీ హెచ్చరిస్తున్నారు.

ఉపసంహారం

నిత్య బాలింత కవితా సంకలనం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతుంది. ప్రజల హృదయాంతరాలను ఇందులో బలంగా ఆవిష్కరిస్తుంది. నిత్య బాలింత ఒక ప్రభావవంతమైన ఆలోచనలకు పునాది వేస్తుంది. సమకాలీన సమాజం స్పష్టంగా చూడడం, జరుగుతున్న పరిణామాల పట్ల చైతన్యంతో ఉండమని బోధించడం, ప్రపంచ శాంతి, మానవ సౌఖ్యాన్ని కోరుతూ మంచిని ప్రోత్సహించడం, చెడును ఖండించడం ఈశ్వర రెడ్డి కవిత్వంలో చూడవచ్చు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా నిత్యం జరుగుతున్న అనేక పరిణామాలు కవిత్వమై నిత్య బాలింతలో తారాడతాయి.

  • ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి 'నిత్య బాలింత' సంకలనంలో అనేక సామాజిక వాస్తవాలను, సమస్యలను కళాత్మకంగా చిత్రించారు.
  • ప్రకృతి పట్ల గౌరవం, రైతు పడే కష్టాలు, వలస జీవితాల ఆవేదన ఈ కవిత్వంలో ప్రధానాంశాలు.
  • రాయలసీమ సంస్కృతి, యాస పట్ల కవికి గల అభిమానం, మత వివక్ష వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తాయి.
  • సమాజంలో స్త్రీలపైన జరిగే దురాగతాలను ఖండించడం, యువతలో ఆశావాదాన్ని నింపడం, కాల ప్రాధాన్యతను వివరించడం, స్నేహ బంధం విలువను చాటడం కవిత్వ లక్షణాలు.
  • ఈ సంకలనం పాఠకులలో సామాజిక స్పృహను పెంపొందించడం, ఆలోచింపజేయడం వంటి ప్రయోజనాలను కలిగిస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఈశ్వర్ రెడ్డి, ఎన్. కన్నీటి సీమ. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2003.
  2. పైదే. మనసు పాట. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2009.
  3. పైదే. నాకొక మనిషి కావాలి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2020.
  4. పైదే. నాలో నువ్వు మినీ కవిత్వం. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2023.
  5. పైదే. సాహిత్యంలో సమాజం వ్యాస సంపుటి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2023.
  6. పైదే. నిత్యబాలింత కవితా సంపుటి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2025.
  7. పైదే. సమాజ హితం సాహిత్య మతం. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2025.
  8. నరసయ్య, జి. లక్ష్మీ. కవిత్వ నిర్మాణ పద్ధతులు. ప్రతీక పబ్లికేషన్, 2015.
  9. నరసయ్య, జి. లక్ష్మీ. కవిత్వం చర్చనీయాంశాలు. కర్షక ఆర్ట్స్ ప్రింటర్స్, 2021.
  10. వెల్చేరు, నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. ఎమెస్కో బుక్స్ ప్రై. లి., 2023.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]