headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. ప్రాంతీయ భాషగా తెలుగు: సమస్యలు, సవాళ్ళు

డా. బానోత్ స్వామి

పోస్ట్-డాక్టోరల్ పరిశోధకులు, తెలుగువిభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
వరంగల్, తెలంగాణ.
సెల్: +91 9603082128, Email: banothswamy128@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.10.2025        ఎంపిక (D.O.A): 30.09.2025        ప్రచురణ (D.O.P): 01.11.2025


వ్యాససంగ్రహం:

తెలుగు భాష ద్రావిడ కుటుంబం దక్షిణ-మధ్య శాఖకు చెందినది. సుదీర్ఘ చరిత్ర, ప్రాచీనత కలిగి, 2008లో శాస్త్రీయ భాషాహోదా పొందింది. నన్నయ్య మొదలు శ్రీనాథుడు, పోతన, గురజాడ వంటి కవులు దీని కీర్తిని పెంచారు. ప్రస్తుత ప్రపంచీకరణ, పట్టణీకరణ, నూతన విద్యా విధానాలు, సమాచార సాంకేతికత ప్రభావం తెలుగు భాషపై గణనీయంగా ఉంది. ఆంగ్ల భాష ఆధిపత్యం, విధానపరమైన లోపాలు, సాంకేతిక వనరులు కొరత, యువతలో భాషాభిమానం తగ్గడం, మీడియా ప్రభావం, ప్రాంతీయ భాషా భేదాలు తెలుగు మనుగడకు సవాళ్లుగా నిలుస్తున్నాయి. భాష జాతికి ఆత్మ, సంస్కృతికి ప్రతిబింబం అన్న భావనతో, తెలుగు భాష బలహీనపడడానికి గల కారణాలను విశ్లేషించడం, పరిష్కార మార్గాలను సూచించడం ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం. ఈ విశ్లేషణకు పూర్వ పరిశోధనలు, భాషా సాహిత్య విశ్లేషణలు, చరిత్ర గ్రంథాలు ఆధారం. తెలుగు భాషా ప్రాముఖ్యత క్షీణతపై ప్రస్తుత సాహిత్య చర్చను ఈ పరిశోధన అనుసంధానిస్తుంది. విద్యా పత్రికలు, యునెస్కో నివేదికలు, ప్రభుత్వ విధాన పత్రాలు, జనాభా గణన వివరాలు ఈ విశ్లేషణకు ద్వితీయ వనరులుగా ఉపయోగపడ్డాయి. ఈ పరిశోధన విశ్లేషణ పద్ధతిని అనుసరించి, తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను లోతుగా పరిశీలించింది. పరిశోధన పరిధి తెలుగు భాష ఆవిర్భావం నుండి నేటి దశ వరకు గల చారిత్రక పరిణామాలను వివరిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుకు గల ప్రాముఖ్యత దీని లక్ష్యం. ఈ పరిశోధన ఫలితాలు మాతృభాషా విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భాషాభివృద్ధి సాధించడం, ప్రాంతీయ సాహిత్యం ప్రోత్సహించడం, మీడియా సినీ రంగాల సహకారం, భాషా పరిశోధనా కేంద్రాల స్థాపన, ప్రజలలో భాషా గౌరవాన్ని పెంపొందించడం అవశ్యకం అని సూచిస్తాయి. తెలుగు భాష సంరక్షణ జాతి, సంస్కృతి మనుగడకు అత్యంత కీలకమని, భవిష్యత్తు తరాలకు తెలుగు వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ వ్యాసం నిర్ధారిస్తుంది.

Keywords: తెలుగు భాష, ద్రావిడ భాషలు, ప్రపంచీకరణ ప్రభావం, భాషా పరిరక్షణ, సాంకేతిక సవాళ్లు, విద్యా విధానం

1. ప్రవేశిక

తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. దీనికి సమీప బంధువులు తమిళం, కన్నడ, మలయాళం అయినప్పటికీ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష దక్షిణ-మధ్య ద్రావిడ శాఖకు చెందినది. తెలుగు భాష ప్రాకృత భాషల ప్రభావంతో అభివృద్ధి చెందింది. అశోకుని శాసనాలు, శాతవాహన రాజుల శిలాశాసనాలు వంటి వాటిలో తెలుగు పదాలకు ఆధారాలు కనిపిస్తాయి. ఇది చారిత్రక నేపథ్యంతో భాష ప్రాచీనతను సూచిస్తుంది (రమేష్ 1). ప్రాచీన కాలంలో తెలుగు భాష స్థానిక భాషా రూపంలో మాత్రమే ఉండేది. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధానంగా మాట్లాడతారు. భారతదేశంలో సుమారు 8 కోట్ల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. తెలుగుకు విశిష్టమైన లిపి, వ్యాకరణం, సాహిత్యం ఉన్నాయి. శ్రీనాథుడు, పోతన, వేమన, తెనాలి రామకృష్ణ, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు వంటి మహానుభావులు ఈ భాషకు కీర్తి తెచ్చారు. కొంత కాలం తరువాత ఆధునిక విద్యా విధానం ఆంగ్ల ఆధారితమవ్వడం, ఉద్యోగాల కోసం విదేశీ భాషలపై ఆధారపడడం వలన తెలుగు భాష సామాజిక స్థానం క్రమంగా బలహీనపడింది. ప్రపంచీకరణ, పట్టణీకరణ, నూతన విద్యా విధానం, సమాచార సాంకేతికత ప్రభావంతో ప్రాంతీయ భాషలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

1.1 పూర్వ పరిశోధనలు

ఈ వ్యాసంలో అనేక పూర్వ పరిశోధనలు, భాషా సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు వివిధ పత్రికల్లో, సదస్సు సమావేశాల్లో వర్తమాన భాషా విశ్లేషణ గురించి వ్యాసాలు రావడం జరిగింది. ఆంధ్ర సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య పరిణామం, ఆంధ్ర భాషా చరిత్ర వంటి గ్రంథాలు భాషా వికాసం, సాహిత్యాభివృద్ధిని అనుసంధానిస్తూ విలువైన సమాచారం అందించాయి. ప్రస్తుతం తెలుగు భాషా ప్రాముఖ్యత తగ్గిపోతున్నది అనే భావన కొంత వర్తమాన సాహిత్య అంశముగా విశ్లేషణ జరుగుతున్న సమయంలో తెలుగు భాష గురించి కొంత విశ్లేషణాత్మక సందేశాన్ని ఇవ్వడం వ్యాస భవిష్యత్తుకు దిక్సూచి అని నా అభిప్రాయం.

ముఖ్యంగా తెలుగు భాషా వినియోగం పై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. డా. అచ్చంపేట రాములు (2015)  “తెలుగు భాషా భవితవ్యము” అనే గ్రంథంలో విద్య, మీడియా, టెక్నాలజీ రంగాలలో తెలుగు వినియోగం తగ్గిపోతున్నదని చర్చించారు. ప్రొ. కోమరయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ (2018) లో ప్రాంతీయ భాషా బోధనలో ఉపాధ్యాయుల సన్నద్ధత, పాఠ్యాంశ నిర్మాణం లోపం వంటి సవాళ్లను గుర్తించారు. ఎన్ . కృష్ణమూర్తి అనే రచయిత “Linguistic Hierarchy in India” అనే పత్రంలో ప్రాంతీయ భాషలపై ఇంగ్లీష్ భాషా ఆధిపత్యం “symbolic power structure”గా వ్యవహరించబడుతోందని పేర్కొన్నారు.

1.2 పరిశోధనాపద్ధతి

ఈ వ్యాసాన్ని పూర్తిగా విశ్లేషణ పద్ధతి ద్వారా పొందుపరచడం జరిగింది. ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం ప్రస్తుత కాలంలో తెలుగు భాషా సమస్యలు, సవాళ్లను విశ్లేషణ పద్ధతి ద్వారా విశదపరచడం.

1.3 ప్రస్తుత పరిశోధన పరిమితులు

ఈ వ్యాసం పరిధి ప్రధానంగా తెలుగు భాషా ఆవిర్భావం నుండి నేటి దశ వరకు జరిగిన చారిత్రక పరిణామాలను వివరించడంలో ఉంది. భారతదేశం అనేక సాహిత్యాలకు, అనేక భాషలకు నిలయం. అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే ప్రజల భాష తెలుగు ఔన్నత్యాన్ని తెలపడం కోసం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిధి ప్రాంతాల వరకు భాషా ప్రాముఖ్యత గురించి ఈ వ్యాస పరిధి, పరిమితి తెలుపుతుంది.

2. భాషా విశ్లేషణ

భాష మానవ సమాజానికి ఆత్మ వంటిది. అది సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు. ప్రజల సంస్కృతి, ఆలోచన, చరిత్ర, జీవన విధానం, ఆత్మగౌరవం వంటి విలువల సమూహం. ప్రాంతీయ భాషలు ఆ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ సంబంధిత విలువలకు ప్రతీక. తెలుగు భాష ప్రాధాన్యత ప్రపంచ భాషలలో ఏ భాషకు లేదని సాహిత్య నిరూపణగా చెప్పవచ్చు. భాష ఒక జాతి సాంస్కృతిక స్వరూపానికి ప్రతిబింబం. ఆ జాతిలో ఆలోచనలు, ఆచారాలు, చారిత్రక నేపథ్యం, కళలు, సాహిత్యం, సాంస్కృతిక విలువలు ఉంటాయి. ప్రాంతీయ భాష అట్టి విలువల సమూహం. ఆ దృష్టిలో చూసినట్లయితే తెలుగు భాష భారతదేశంలో అత్యంత పురాతనమైన, శ్రవ్యమైన, సాహిత్య సంపదతో నిండిన భాషలలో గొప్పది. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లుగా 'దేశభాషలందు తెలుగు లెస్స'. తెలుగు భాష సౌందర్యం, విస్తృతి, పరిపూర్ణమైన సాహిత్య ప్రక్రియల సంపద తెలుగుకు ఉన్నాయని మనం చూడవచ్చు. నేటి కాలంలో తెలుగు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మందికి పైగా మాట్లాడే భాషగా ఉంటూ, జాతీయ భాష హోదాలో తన ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది.

భారతదేశంలో 22 అధికారిక భాషలలో తెలుగు ఒకటి అయినప్పటికీ, తెలుగు భాషకు 2008లో భారత ప్రభుత్వం శాస్త్రీయ భాష (Classical language) హోదా ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభావంలో సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవడంలో ఒకపక్క తెలుగు భాష మాధ్యమంగా కొంత ఉన్నప్పటికీ, పాశ్చాత్య భాషలకు ప్రాధాన్యత ఇస్తూనే తెలుగు ప్రాంతీయ భాషకు సరియైన ఆదరణ లేకపోవడం, అధికార భాషగా అమలు కాకపోవడం మూలంగా అనేక సమస్యలు సవాళ్లకు దారి తీస్తోంది. ప్రపంచీకరణ ప్రభావం 1990 నుండి ప్రారంభమైన తర్వాత, అనేక సాంప్రదాయ వృత్తులు, ప్రాంతీయ భాషలు, గ్రామీణ ప్రాంత జీవితాలపై ఆధునిక మార్కెట్ వ్యవస్థ అనేక ప్రభావాలను చూపింది. వారికి తెలియకుండానే భాష, సంస్కృతిపై పాశ్చాత్య నాగరికత దాడి చేసింది. ఆ క్రమంలోనే తెలుగు భాష సాహిత్యంలో కొంత సృజన జరిగినప్పటికీ, ఆధునిక భాషా ప్రభావాల నియమాలు ప్రాంతీయ భాషలపై రుద్దబడ్డాయి (శివరామకృష్ణ 2).

తర్వాత కాలంలో నూతన విద్యా విధానాలలో ప్రపంచ మార్కెట్లో పాశ్చాత్య భాషలైన ఆంగ్లం కొన్ని విదేశీ భాషల సాంకేతిక విద్యా విధానం అమలు జరుగుతున్న క్రమంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను మనం గమనించవచ్చు.

2.1. ప్రస్తుత సమస్యలు

2.1.1. తెలుగు భాష ప్రస్తుత తీరు

తెలుగు భాష చరిత్ర పరంగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, నేటి పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, ఆంగ్ల భాషా ప్రాబల్యం వంటి కారణాల వల్ల తెలుగు భాష వినియోగం తగ్గుముఖం పడుతోంది. మొదటగా, విద్యా వ్యవస్థలో తెలుగు స్థానహీనత ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడానికి ప్రోత్సాహం పొందుతున్నారు. ఫలితంగా తెలుగు మాధ్యమ పాఠశాలలు సంఖ్యలో తగ్గి, భాష పట్ల ప్రేమ, పట్టు క్రమంగా క్షీణిస్తోంది. సామాజిక మాధ్యమాలు (Social Media), డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా భాషలో “మిశ్రమ సంభాషణ” (Telugu-English mix) పెరుగుతోంది. ఇది భాషా స్వచ్ఛతను దెబ్బతీస్తుంది. కొత్త తరం “టెంగ్లిష్” (Telugu + English) శైలిలో మాట్లాడటంతో భాష అసలు వ్యాకరణం, పదకోశం క్రమంగా మసకబారుతోంది. ప్రాంతీయ భాషా భేదాలు కూడా కొన్నిసార్లు భాషా ఏకత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆధునికత, వినోద ప్రధాన సంస్కృతి వలన యువత సాహిత్యం పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. పుస్తకాల బదులు టెలివిజన్, ఇంటర్నెట్ వినోదం ప్రాధాన్యం పొందడంతో సాంప్రదాయ తెలుగు పఠనం తగ్గిపోయింది. ప్రభుత్వ విధానాల్లో భాషా ప్రాధాన్యం తగ్గిపోవడం. తెలుగు అధికార భాషగా గుర్తింపు పొందినా, ఆచరణలో మాత్రం ఆంగ్ల భాషా ప్రాబల్యం కొనసాగుతోంది. అధికార భాషా చట్టాలు అమలులో కొరతగా ఉండటం కూడా ఒక రకమైన సమస్యగా చెప్పవచ్చు (యునెస్కో రిపోర్ట్స్ 3).

2.2. తెలుగు భాష ప్రధాన సమస్యలు

2.2.1. ఆంగ్ల ప్రాబల్యం

భారత విద్యా వ్యవస్థలో ఆంగ్ల భాషకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించడం గౌరవప్రదంగా భావిస్తున్నారు. ఈ ధోరణి ప్రాంతీయ భాషలను విద్యా వ్యవస్థలో ద్వితీయ స్థానంలోకి జారుస్తోంది. ఆధునిక విద్య, ఉద్యోగావకాశాలు, సమాచార సాంకేతికతలో ప్రాంతీయ భాషలు ప్రాముఖ్యత కోల్పోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించడం వలన స్థానిక భాషల పట్ల ఆసక్తి తగ్గిపోతోంది.

2.2.2. విధాన లోపాలు

భాషా విధానాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో లోపాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక భాషలను బోధనామాధ్యమంగా ఉంచుతున్నామని చెబుతున్నప్పటికీ, ఆ భాషల్లో ఉన్నత విద్య అందించడం కష్టసాధ్యం. కొత్త విద్యా విధానాలు స్థానిక భాషలను ప్రోత్సహిస్తామని చెప్పినా, అమలులో వాటి స్థానం చాలా పరిమితం. పాఠ్యపుస్తకాల తయారీ ఉన్నత విద్యా బోధనలో ప్రాంతీయ భాషల వాడకం తక్కువగానే ఉంది. ఉదాహరణకు తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలకు ఉన్న ప్రాముఖ్యత మన తెలుగు రాష్ట్రాలలో లేదు. ఇక్కడ విధాన లోపాలు ఎక్కువగా ఉండటం వలన అవి ఆచరణ అమలు కాలేకపోతున్నాయి.

2.2.3. సాంకేతిక వనరుల కొరత

ప్రాంతీయ భాషలకు తగిన డిజిటల్ పరికరాలు, అనువాద యంత్రాలు, స్పెల్ చెకర్లు, వాయిస్ టెక్నాలజీలు లేవు. ఇది ఆ భాష ఆధునిక రూపాంతరాన్ని ఆపేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో భాషల జీవనం ఆన్‌లైన్ ప్రాముఖ్యతపై ఆధారపడుతోంది. కానీ తెలుగు, కన్నడ, ఒరియా, మరాఠీ వంటి ప్రాంతీయ భాషలకు సరైన సాఫ్ట్‌వేర్లు, యూనికోడ్ సదుపాయాలు, భాషా కార్పస్ వంటివి తక్కువగా అందుబాటులో ఉన్నాయి.

2.2.4. యువతలో భాషాభిమానం తగ్గుదల

సోషల్ మీడియా ప్రభావంతో పాశ్చాత్య సంస్కృతి వలన యువతలో భాష పట్ల గౌరవం తగ్గుతోంది. చాలామంది తమ భాషలో రాయడం చదవడం కంటే ఇతర భాషల్లో వ్యక్తీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా ప్రస్తుత యువతలో భాషా ఆదరణ తగ్గుతోంది.

2.2.5. నగరీకరణ భాషా సమూహాల అంతరాయం

ప్రాంతీయ భాషలు మాట్లాడే ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం వలన వారి పిల్లలు ఆ భాషను నేర్చుకోవడంలో వెనుకబడిపోతున్నారు. వలస జీవనం భాషా సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తోంది. కాలక్రమంలో వారికి తెలియకుండానే పరభాషా ఆధీనతకు లోనవుతున్నారు. ఫలితంగా ప్రాంతీయ భాష ఇంటి భాషగా మాత్రమే మిగిలిపోతుంది.

2.2.6. మీడియా వినోద రంగ ప్రభావం

టెలివిజన్, సినిమా, OTT వేదికల్లో మిశ్రభాషా వాడకం (ఉదాహరణకు: తెలుగు-ఇంగ్లీష్ మిశ్రమం) పెరగడం వలన శుద్ధభాష వినియోగం తగ్గిపోతోంది. Facebook, WhatsApp, Instagram, YouTube వంటి వేదికల్లో తెలుగు వాడకం విపరీతంగా పెరిగింది. లాటిన్ అక్షరాలలో తెలుగు మాట్లాడటం ఒక నూతన ధోరణిగా మారింది (ఉదాహరణకు: “nenu vachanu” వంటి వాక్యాలు). ఇది లిపి బలహీనతకు దారితీస్తోంది. డిజిటల్ మీడియా ద్వారా తెలుగు భాష విస్తరించినా, యంత్ర అనువాదాల ప్రభావం వలన భాషా ప్రమాణాలు, వ్యాకరణం దెబ్బతిన్నాయి.

2.2.7. తరాల మధ్య భాషా వైవిధ్యం

వృద్ధులు తమ మాతృభాషలో మాట్లాడుతారు. కానీ యువత అంతర్జాతీయ భాషల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరాల మధ్య భాషా ఖాళీ ఏర్పడుతోంది.

2.3. ప్రస్తుత తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్లు

తెలుగు భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, ఆధునిక సమాజంలో అది ఎదుర్కొంటున్న సవాళ్లు అనేకం. భాషా పరిరక్షణ, అభివృద్ధి, వినియోగం వంటి అన్ని రంగాలలో తెలుగు ప్రస్తుతం ఒక మార్గసంధానంలో నిలిచింది. ఈ సవాళ్లు సామాజిక, విద్యా, సాంకేతిక, రాజకీయ కోణాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి (తెలుగు విశ్వవిద్యాలయం జర్నల్ 4).

2.3.1. ప్రపంచీకరణ సవాలు

ప్రపంచీకరణ యుగంలో కమ్యూనికేషన్ సాధనాలు, మీడియా, విద్యా విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలపై ఆధారపడుతున్నాయి. దీని వలన ఆంగ్లం వంటి భాషలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ప్రాంతీయ భాషలు ప్రపంచ మార్కెట్‌లో తమ స్థానం పొందడంలో వెనుకబడిపోతున్నాయి. ప్రపంచీకరణ కాలంలో ఆంగ్ల భాషా ప్రాబల్యం అన్ని రంగాలలో పెరుగుతోంది. అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతిక విజ్ఞానం, వృత్తి అవకాశాలు ఆంగ్లంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దీని వలన యువతలో తెలుగు పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా ప్రాధాన్యం తగ్గకుండా నిలవడం ఒక పెద్ద సవాలుగా మారింది.

2.3.2. డిజిటల్ యుగంలో భాషా జీవనం

డిజిటల్ ప్రపంచంలో భాషకు జీవం ఉంటేనే అది నిలుస్తుంది. కానీ ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ కంటెంట్, యాప్‌లు, ఆన్‌లైన్ కోర్సులు తక్కువగా ఉన్నాయి. యువత డిజిటల్ వేదికల్లో స్థానిక భాషను వాడకపోవడం వలన భాష ప్రాచుర్యం తగ్గుతోంది. తెలుగు మాధ్యమ పాఠశాలల సంఖ్య తగ్గిపోతుండటం, ఉన్నత విద్యలో తెలుగు బోధన అవకాశాలు తగ్గిపోవడం ఆందోళనకర విషయం. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల విస్తరణతో తెలుగు విద్యార్థులు తమ భాషా మూలాలను మరిచిపోతున్నారు. తెలుగు బోధనను ఆధునిక పద్ధతుల్లో ఆకర్షణీయంగా చేయడం ఒక సవాలుగా ఉంది.

2.3.3. సంస్కృతి-భాషా బంధం కోల్పోవడం

భాష, సంస్కృతి రెండు విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటాయి. భాషల క్షీణత వలన ప్రాంతీయ సాహిత్యం, జానపద కళలు, నానుడులు, పద్యరచన డిజిటల్ యుగంలో సాంకేతిక సహాయం లేకపోవడం వలన తెలుగు భాష అంతర్జాల స్థాయిలో అనుకున్నంత సమాచారం అందించలేకపోతోంది. ప్రతి భాష అభివృద్ధికి సాంకేతికత కీలకం. తెలుగు భాషలో సాఫ్ట్‌వేర్, యాప్‌లు, యూనికోడ్ ఫాంట్లు, వాయిస్ రికగ్నిషన్ వ్యవస్థలు పరిమితంగా ఉన్నాయి. భాషా కంప్యూటింగ్ రంగంలో తెలుగు వెనుకబడటం మరో సవాలు.

2.3.4. భాషా పునరుజ్జీవనంలో అవగాహన కొరత

ప్రజలలో భాషా పరిరక్షణ పట్ల అవగాహన తక్కువగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు తల్లిభాషలో మాట్లాడటానికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో “టెంగ్లిష్” (తెలుగు + ఆంగ్లం మిశ్రమం) ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫలితంగా తెలుగు పదకోశం, వ్యాకరణం క్రమంగా బలహీనమవుతున్నాయి. యువతరం స్వచ్ఛ తెలుగు మాట్లాడటంలో, వ్రాయడంలో ఆసక్తి చూపకపోవడం ఆందోళనకర అంశం.

2.3.5. ప్రభుత్వ నిర్లక్ష్యం

తెలుగు అధికార భాషగా గుర్తింపు పొందినా, ఆచరణలో ప్రభుత్వ వ్యవస్థల్లో ఆంగ్లం ప్రాబల్యం కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, శాసనసభల్లో తెలుగు వాడకం తక్కువగా ఉంది. భాషా విధానాల అమలులో పర్యవేక్షణ లేకపోవడం ఒక ప్రధాన సవాలు.

2.3.6. సాహిత్య చైతన్యం తగ్గుదల

ఇంటర్నెట్, సోషల్ మీడియా వలన పఠన సంస్కృతి తగ్గిపోయింది. పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిపోవడం, సాహిత్య సమాలోచనలలో భాషా సాహిత్యాలపై సంపూర్ణ పరిశోధనలు కొంత వరకే జరుగుతున్నాయి. కొత్త రచయితలకు ప్రోత్సాహం తగ్గిపోవడం తెలుగు సాహిత్యానికి ప్రతికూలంగా మారింది.

2.3.7. ప్రాంతీయ భాషా భేదాల సవాలు

తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల భాషా శైలులు, ఉచ్చారణ భేదాలు కొన్నిసార్లు భాషా ఏకత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక ప్రమాణ భాషా రూపం ఆవిర్భవించడం కష్టమవుతోంది.

2.4. పరిష్కార మార్గాలు

2.4.1. మాతృభాషా విద్యకు ప్రాధాన్యత

ప్రాథమిక విద్యను తల్లిభాషలో బోధించడం వలన పిల్లలలో ఆలోచనా సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త విద్యా విధానాలు (NEP 2020) దీనికి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి వాటి అమలులో దృఢత్వం అవసరం. తగిన చర్యలు తీసుకోవాలి. సాంకేతిక విద్యతో పాటు, తెలుగు భాషకు విద్య విషయాలలో సమాన ప్రాధాన్యత కల్పించాలి.

2.4.2. సాంకేతిక పరిజ్ఞానంలో భాషా అభివృద్ధి

కంప్యూటర్, మొబైల్, కృత్రిమ మేధస్సు (AI) వంటి రంగాల్లో ప్రాంతీయ భాషలకు అనువాద యంత్రాలు, OCR, స్పీచ్ రికగ్నిషన్ వ్యవస్థలు రూపకల్పన చేయాలి. ఉదాహరణకు, సోషల్ సైన్స్ విభాగాలలో సాంకేతిక అధ్యయనాలలో ఒక అంశానికి సంబంధించిన విషయాన్ని అంతర్జాలంలో అడిగిన వెంటనే తగిన సమాచారం వస్తుంది. తెలుగు భాష సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని అంతర్జాలం త్వరగా సేకరించదు. దీనికి ప్రధాన కారణం తెలుగు భాషలో సాంకేతిక లోపాలు ఉండటం మనం గమనించవచ్చు.

2.4.3. ప్రాంతీయ సాహిత్య ప్రోత్సాహం

భాష అభివృద్ధికి సాహిత్య ప్రాచుర్యం ఎంతో అవసరం. స్థానిక రచయితల రచనలను పాఠ్యాంశాలలో చేర్చాలి. ప్రాంతీయ భాషా సాహిత్యాన్ని అంతర్జాలంలోకి అనువదించాలి. ఇలా చేయడం వలన ప్రాంతీయ సాహిత్యాన్ని భావి తరాలకు అందించవచ్చు.

2.4.4. మీడియా సినీ రంగాల సహకారం

టెలివిజన్, సినిమా, OTT వేదికల్లో భాషా ప్రమాణాలను కాపాడే కంటెంట్‌ను రూపొందించాలి. పత్రికా ప్రకటనలు, అంతర్జాల ప్రకటనలు తెలుగు భాషలో చేయడం వలన భాషను పరిరక్షించవచ్చు. ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.

2.4.5. భాషా పరిశోధనా కేంద్రాల స్థాపన

ప్రతి రాష్ట్రంలో భాషా పరిశోధన, అనువాద, డిజిటల్ డాక్యుమెంటేషన్ కేంద్రాలు ఉండాలి. తద్వారా ప్రాంతీయ భాషా సాహిత్యాన్ని పరిరక్షించవచ్చు. నిరంతర భాషా పరిశోధన కొనసాగుతుంది.

2.4.6. ప్రజలలో భాషా గౌరవ భావం పెంపుదల

పండుగలు, సాహిత్య సమ్మేళనాలు, భాషా దినోత్సవాల ద్వారా భాష పట్ల గౌరవం పెంచాలి. ప్రజలలో నిరంతరం భాషా సమ్మేళనాలు, భాషా కార్యక్రమాలు నిర్వహించాలి.

ఉపసంహారం

తెలుగు భాష కేవలం సంభాషణ సాధనం కాదు; అది మన జాతి, సంస్కృతి, చరిత్రకు ప్రతిబింబం. ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఈ భాషను కాపాడటం, దానికి కొత్త రూపం ఇవ్వడం మనందరి బాధ్యత. “భాష నిలిస్తే జాతి నిలుస్తుంది” ఈ వాక్యం ప్రతి తెలుగు వ్యక్తి మనసులో నిలవాలి. తెలుగు భాషను ప్రేమించడం, మాట్లాడడం, రాయడం మన గౌరవప్రదమైన కర్తవ్యముగా భావిస్తే మాత్రమే భవిష్యత్తు తరాలకు తెలుగు భాష సజీవంగా నిలుస్తుంది.

తెలుగు నానుడి ప్రకారం కవిశేఖరుడు శ్రీకృష్ణదేవరాయలు గర్వంగా ప్రకటించిన “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వాక్యం నేటికీ సత్యంగా ప్రతిధ్వనిస్తోంది. తెలుగు భాషా చరిత్ర గతాన్ని మాత్రమే కాక, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే గొప్ప వారసత్వం. ఈ భాషను కాపాడటం, అభివృద్ధి చేయడం ప్రతి తెలుగువాడి బాధ్యతగా, గౌరవకార్యంగా భావించాలి. భాషా జీవనం నిలబడాలంటే ప్రమాణభాష, ప్రజాభాష మధ్య సమతౌల్యం అవసరం.

మీడియా సంస్థలు భాషా బాధ్యతను గుర్తించి, సరైన తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. విద్యా రంగం, ప్రభుత్వ సంస్థలు, రచయితలు, మీడియా నిపుణులు కలిసి తెలుగు భాషను సమకాలీన ప్రపంచంలో జీవనశీలంగా నడిపించాలి.

  • తెలుగు భాష ద్రావిడ కుటుంబానికి చెందినది. దీనికి సుదీర్ఘ చరిత్ర, గొప్ప సాహిత్యం ఉన్నాయి.
  • ప్రపంచీకరణ, ఆంగ్ల భాషా ప్రాబల్యం, సాంకేతిక వనరుల కొరత, యువతలో భాష పట్ల ఆసక్తి లేకపోవడం తెలుగు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.
  • మాతృభాషా విద్యను ప్రోత్సహించడం, సాంకేతికతను తెలుగు భాషకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, ప్రాంతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడం అవసరం.
  • మీడియా, సినీ రంగాల సహకారం, భాషా పరిశోధన కేంద్రాల స్థాపన తెలుగు అభివృద్ధికి కీలకమైనవి.
  • భాషను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత. ఇది భవిష్యత్ తరాలకు భాషను అందించడానికి దోహదపడుతుంది. 

ఉపయుక్త గ్రంథసూచి

  1. తెలుగు విశ్వవిద్యాలయం జర్నల్. "మీడియా ప్రభావం – భాషా మార్పులు."
  2. యునెస్కో రిపోర్ట్స్. Language and Media in the Digital Era. 2020.
  3. రమేష్, ఎం. టెలివిజన్ భాషలో తెలుగు పరిణామం. విశ్వభారతి పబ్లికేషన్స్, 2016.
  4. రామకృష్ణ, గోపరాజు. భాషా చింతన. కెవిఆర్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011
  5. పైదే. తెలుగు భాషావికాసం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013
  6. రామారావు, కె. తరాల మధ్య విలువల మార్పు. తెలుగు అకాడమీ, 2018.
  7. శివరామకృష్ణ. డిజిటల్ మీడియా భాషా సంస్కృతి. ఆధునిక ప్రచురణలు, 2019.
  8. Census of India. Language Data. 2011.
  9. Devy, G. N. The Languages of India: A Cultural Survey. Sahitya Akademi, 2009.
  10. Government of India. National Education Policy Document, 2020 (NEP 2020).
  11. Mahapatra, B. "Regional Languages in the Digital Era." Indian Journal of Linguistics, 2017.
  12. Mallikarjun, B. "Indian Multilingualism, Language Policy and Education." Language in India Journal, 2004.
  13. Mallikarjun, B. Languages in India. 2004.
  14. Sudhakar, V. Generation Gap in Urban Families. Kakatiya University Press, 2021.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]