AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. విధి- నిషేధరూప ఆప్తవచనం: అమరాంధ్రసాహిత్యసమన్వయం
డా. రొట్ట గణపతిరావు
సహాచార్యులు, తెలుగుశాఖ
ఆర్జీయుకేటీ శ్రీకాకుళం, ఎచ్చెర్ల
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494586342, Email: rotta.ganapatirao@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.10.2025 ఎంపిక (D.O.A): 30.09.2025 ప్రచురణ (D.O.P): 01.11.2025
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధన అమరాంధ్ర సాహిత్యాలలో విధి-నిషేధ రూప ఆప్తవచనాల సమన్వయాన్ని విశ్లేషిస్తుంది. సుభాషితాలు, ఆప్తవచనాలు సమాజానికి వ్యక్తిత్వ వికాసానికి అందించే నైతిక మార్గదర్శకత్వాన్ని వివరించడం దీని ప్రధాన లక్ష్యం. మానవ జీవన గమనాన్ని సక్రమంగా నడిపించుటకు, సామాజిక శ్రేయస్సు పెంపొందించుటకు ఆప్తవచనాల ఆవశ్యకతను శీర్షిక సమర్థిస్తుంది. పూర్వ పరిశోధనలు సుభాషితాలను పద్య సంకలనాలుగానో, ఆధునిక కవుల గ్రంథాలుగానో పరిగణించగా, ప్రస్తుత అధ్యయనం వీటిని శాస్త్రదృష్టితో, తార్కిక ప్రమాణాల నేపథ్యంలో పరిశీలించడం విలక్షణమైన పద్ధతి. విషయసేకరణకు సాంఖ్యకారిక, వాల్మీకి రామాయణం, కిరాతార్జునీయం, సరస్వతీకంఠాభరణం వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలు, నారాయణామాత్యుని హంసవింశతి వంటి తెలుగు కావ్యాలు ప్రాథమిక ఆధారాలు. ఈ పరిశోధన ప్రమాణాల వర్గీకరణ ద్వారా ఆప్తవచన విశిష్టతను తత్వశాస్త్ర కోణంలో విశ్లేషిస్తుంది. అనంతరం హంసవింశతి, వాల్మీకి రామాయణం, కిరాతార్జునీయం నుండి విధి, నిషేధ రూప ఆప్తవచనాలకు ఆచరణాత్మక ఉదాహరణలను అందిస్తుంది. ఆప్తుని గుర్తించడంలో ఎదురయ్యే సవాళ్ళను, వాటి సామాజిక ప్రాసంగికతను సాంఖ్య దర్శన సిద్ధాంతాల వెలుగులో సమీక్షిస్తుంది. ఈ అధ్యయనం ఆప్తవచనాల ప్రాముఖ్యతను, వాటిని పాటించకపోతే కలిగే నష్టాలను స్పష్టం చేస్తుంది. అయితే, ఆప్తుడు ఎవరో, ఆప్తుడు కానివాడు ఎవరో గుర్తించడం క్లిష్టమైన ప్రక్రియ. అతిదూరం, సామీప్యం, ఇంద్రియఘాతం, మనోఅవస్థానం, సూక్ష్మత్వం, వ్యవధానం, అభిభవం, సమానాభిహారం వంటి ఎనిమిది కారణాల వల్ల ఆప్తుని గుర్తించడం సవాలుగా మారుతుంది. ఈ సవాళ్ళను అధిగమించినప్పుడే వ్యక్తిత్వ వికాసం, సమాజ శ్రేయస్సు సిద్ధిస్తాయి. తత్వశాస్త్రాన్ని విద్యార్థులకు ప్రాథమిక విద్యాంశంగా బోధించడం భవిష్యత్తు పరిశోధనలకు బలమైన సూచన. ఇది మానవ జీవన సమతుల్యతకు, వివేకవంతమైన నిర్ణయాలకు పునాది వేస్తుంది.
Keywords: ఆప్తవచనం, ప్రమాణాలు, సాంఖ్యదర్శనం, నీతి, విధి నిషేధాలు, అమరాంధ్ర సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం.
1. ప్రవేశిక
సుష్టు భాషితం సుభాషితం. సుభాషితం అనగానే మనమంతా వ్యాసుడు, కాళిదాసు, భర్తృహరి, భారవి, నన్నయ, తిక్కన వంటివారి కావ్యాలలోనో, లేదా ఆధునిక కవులు రచించిన గ్రంథాలలోనో, లేదంటే పరిశోధకులు సేకరించిన పద్య సంకలనాలలోనో మన మనసు పరుగులు తీస్తుంది. అది విదితమే. సుభాషితాలను ఆప్తవచనాలని, నీతిప్రబోధకాలని కూడా అనవచ్చు. మన సుభాషితాలను శాస్త్రదృష్టితో ఒక్కసారి ఆలోచనచేద్దాం. సమాజం సక్రమంగా నడవడానికి మహర్షులు, మహాకవులు సుభాషితాలను మనకందించారు. వాటిని ఆచరించి మన జీవన గమనాన్ని సజావుగా నడిపించుకోవాలి. ఇలా ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తే వారు బాగుపడతారు. వారి వల్ల కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుంది.
1.0 ప్రమాణం సిద్ధాంతం
సమాజం బాగుండాలంటే ప్రతీ ఒక్కరు చూసే దృష్టి మీద ఆధారపడుతుంది. దానికి ప్రమాణం ఎంతో సహకరిస్తుంది. ప్రమాణం ద్వారానే ప్రమేయం సిద్ధిస్తుంది. అనగా తెలియదగిన దానిని తెలుసుకోవడం ప్రమాణం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఈ ప్రమాణాలు మూడు విధాలు అని కపిలమహర్షి శిష్య పరంపరలోని ఈశ్వరకృష్ణులవారు ఈ విధంగా వివరించారు.
1.1. ప్రమాణాల వర్గీకరణ
దృష్టమనుమానమాప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్
త్రివిధం ప్రమాణమిష్టం, ప్రమేయసిద్ధిః ప్రమాణాద్ధి. (ఈశ్వరకృష్ణులవారు 4)
ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవచనం అనే ఈ మూడు ప్రమాణాలు సాంఖ్యదర్శనానుసారం చెప్పబడ్డాయి.
1.2. వివిధ దర్శనాలలో ప్రమాణాలు
ఈ ప్రమాణాల విషయంలో నైయ్యాయికులు, మీమాంసకులు ఈ మూడింటికన్నా అధికంగా పేర్కొన్నారు. నైయ్యాయికులు పైన చెప్పిన మూడింటితో బాటుగా ఉపమానాన్ని ప్రమాణంగా అంగీకరిస్తారు. జైమిని దర్శనానుసారం ప్రమాణాలు ఆరు అని చెప్పారు. జైమినీయుల ఆరు ప్రమాణాలు పైన చెప్పిన మూడింటిలో అంతర్గతాలు అని సాంఖ్యులు అంటారు. ఇతర దర్శనాలలో పేర్కొన్న ఇతర ప్రమాణాలు అన్నీ ఈ మూడు ప్రమాణాల్లోనే అంతర్భాగం అవుతాయి అని చెబుతున్నారు. వీరు కూడా అనుమాన ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు.
1.3. ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవచనం
సాధారణంగా దేని గురించి అయినా జ్ఞానం జ్ఞానేంద్రియాల వల్ల కలుగుతుంది. అదే ప్రత్యక్షం. ఇంద్రియ గోచరం కానివి అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధిస్తాయి. దాని ద్వారా కూడా తెలియని దాన్ని ఆప్తవచనం తెలియజేస్తుంది. దీనినే శబ్దప్రమాణం అని కూడా అంటారు.
ప్రపంచంలో మానవ జీవితంలో అన్నీ దృష్టి గోచరాలు కావు. అలాంటి వాటి విషయంలో అనుమాన ప్రమాణమే సాధనం. దాని ద్వారా కూడా తెలుసుకోలేనిది ఆప్తవచనం ద్వారా తెలుస్తుంది. అనగా ప్రత్యక్షంగా గాని, అనుమానం ద్వారా గాని తెలుసుకోలేని విషయాన్ని ఆప్తవచనం ద్వారా తెలుసుకోవచ్చు.
శ్లో. సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణాం ప్రతీతిరనుమానాత్
తస్మాదపి చాసిద్ధం పరోక్షమాప్తాగమాత్సిద్ధమ్. (ఈశ్వరకృష్ణులవారు 6)
1.4. ఆప్తవచనం విశిష్టత
ఆప్తవచనం అనగా శాస్త్రం, యదార్థవక్త పలుకులు. ఈ విషయాన్ని భోజుడు ఈ క్రింది శ్లోకంలో వివరించాడు.
యధాప్త వచనం తద్ధిజ్ఞేయమాగమ సంజ్ఞయా
ఉత్తమం మధ్యమంచాధ జఘన్యంచేతి తత్రిథా (భోజుడు)
ఆప్తుడు అనగా యదార్థవక్త. ఇతడి మాటలు వేద వచనాలవలె ప్రమాణాలు. ఇటువంటి ఆప్తవచనం ఉత్తమం, మధ్యమం, జఘన్యం అని మూడు రకాలు. ఉత్తమమైన ఆప్తవచనం విధి, నిషేధ రూపాల్లో రెండు రకాలుగా ఉంటుంది. మధ్యమమైన ఆప్తవచనం నిర్దిష్టవక్తృత్వం, అనిర్దిష్టవక్తృత్వం అని రెండు రకాలు. అదే విధంగా జఘన్యమైన ఆప్తవచనం కామ్యం, నిర్దిష్టమని రెండు రకాలుగా ఉంటుంది.
2. ఆప్తవచనం ఆచరణాత్మక ఉదాహరణలు
2.1. హంసవింశతిలో విధి - నిషేధ రూపాలు
నారాయణామాత్యులవారు రచించిన హంసవింశతిలో విధి, నిషేధ రూపాల్లో ఉత్తమ ఆప్తవచనం ద్వారా నీతి ప్రతిపాదింపబడింది. హంసవింశతిలో ప్రధాన నాయిక హేమావతికి, ఆమె భర్త విష్ణుదాసునకు హంస ఆప్త మిత్రం. ఇది యదార్ధవాది. బహు చమత్కారంగా మాట్లాడగల నేర్పుగలది. హేమావతికి కూడా సర్వస్వం హంసయే. విష్ణుదాసునకు హంస మీద ఎనలేని నమ్మకం. వీరిరువురికీ హంస ఎంత ఆప్తమిత్రమో ఈ క్రింది పద్యంలో చూడవచ్చు:
తే మణిఖచిత హేమ పంజర మధ్యమమున
ప్రేమ నాబాల్యముగ పెంచినట్టి
హంస రాజంబుగదియంగ నరిగి, తనదు
పయనమెరిగించి ఇంటిలో భద్రమనుచు 1-110
కం చెప్పంగ దగినమాటలు
సెప్పి మరాళంబు పనుప చిత్తంబునసొం
పుప్పతిల............................................... 1-111
విష్ణుదాసుడు ఇల్లు విడిచి వ్యాపారార్థం దూరదేశాలకు వెళ్ళాడు. విష్ణుదాసుడు తాను చిన్నతనం నుండి ప్రేమతో పెంచుకొన్న హంస వద్దకు వచ్చి, తన ప్రయాణ విషయం తెలిపి, ఇంటిలో భద్రమని చెప్పాడు. అంతేకాదు "మరాళం పనుప చిత్తం సొంపు ఉప్పతిల" అతడు బయలుదేరాడు. విష్ణుదాసునకు హంస మీద ఎంత నమ్మకం! హంస సరే పోయిరావయ్యా అంటే అతను సంతోషంతో బయలుదేరాడట. అది హంస పైన విష్ణుదాసునకు ఉన్న నమ్మకం. ఇలాంటి వారిని ఆప్తులు అంటారు.
ఇక హేమావతి విషయంలో కూడా హంస ఇదే విధంగా ఆప్తమిత్రమే. చిత్రభోగ మహారాజుపై మరులు గొలిపేందుకు రాజదూతికైన హేల చాలా ప్రయత్నం చేస్తోంది. అంతటిని హంస గమనిస్తోంది. తన భర్త ఊరిలో లేని సమయంలో చిత్రభోగ మహారాజును కలిసేందుకు వెళ్ళాలనుకున్న హేమావతి ఒకరోజు సాయంత్రం చక్కగా అలంకరించుకొని తమకంతో వచ్చి హంస ముందు నిలిచింది. కాని హంస ఏమంటుందో అనే భయం కూడా ఉంది. ఒకవేళ హంస కాదంటే దాని మాట కాదని హేమావతి వెళ్ళలేదు. వారిద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. హేమావతికి తల్లి, తండ్రి, అనుగు చెలి అన్నీ హంసయే. ఈ విధంగా హంస తనకు పరమాప్తం. అటువంటి ఆప్తమిత్రానికి తన కోరిక తెలుపకుండా, సలహా తీసుకోకుండా వెళ్ళడం ఎలా అనే ఆలోచనే హేమావతిని అక్కడ నిలిచేటట్లు చేసింది. “నిలిచి దరస్మితంబైన నెమ్మొగమించుక వంచి ఆత్మతా దలచిన కార్యమెల్ల తిన్నని కల్కి పల్కుల తెలిపింది".
ఆ మాటలు విన్న హంస మనసులో చింతించి, కుకాంతలకు అటువంటి కోరికలు ఉండరాదని, అది సమాజహానికరమని చెప్పి తన ప్రాణసఖియైన హేమావతిని జారశృంగారం పట్ల విముఖురాలిని చేసేందుకు ప్రయత్నించింది.
ఉ. అక్కట భర్త కాపురము నారడిపుచ్చినృపాలమౌళితో
జొక్కి రమించు నందులకు జొచ్చినదావక సంధవర్గముల్
దక్కుచేతురమ్మ చరితవ్రతముల్ చెడునమ్మ జాతికిం
బక్కున నిందజెందు తలవంపులు దెత్తురటమ్మ మానినీ - 1-124
పరపురుష శృంగారాన్ని కోరడం భర్త కాపురాన్ని ఆరడి పుచ్చడమే. తద్వారా బంధుజనుల్లో చులకనవుతావు. ఇది జాతికి తలవంపులు తెచ్చే పని. మానినులకు ఇటువంటి కోరికలు ఉండరాదు అని హంస హేమావతికి చెప్పింది. అంతే కాకుండా
కం. పతి సేవయె భూషణములు
పతి సేవయె జీవనంబు భామామణికిం
పతి సేవయె సువ్రతములు
పతి సేవయె యిహము పరము భాగ్యములరయన్
అని హంస తన ఆప్తమిత్రమైన హేమావతికి పరపురుష సంగమాసక్తత గురించి, దానిలో ఉన్న ప్రమాదాలను గురించి వివరించి, అది తగని పని అని నిషేధ రూపంలో ఆప్తవచనాలు బోధించింది.
2.1.1. విధి రూపక ఆప్తవచనం
ఆ మాటలు విన్న హేమావతికి నచ్చలేదు. హంసవైపు అదోలా చూసింది. దానిని గమనించిన హంస మరొక ఎత్తు వేసింది. ఇక్కడనుండి హంస చెప్పిన కథలో హేమావతిని చిత్రభోగుని కలిసేందుకు వెళ్ళమనే చెబుతుంది. కాబట్టి హంస వాచనం విధియే. కాని కథను చెప్పడంలో హేమావతి చిత్రభోగునివద్దకు వెళ్ళవద్దనే ఉదాహరణలే కనిపిస్తాయి. అలా చేయడంలో ఆమెను నివారించేందుకే కాబట్టి ఇచ్చట వక్త వివక్షతను అనుసరించి విధి నిషేధ రూపంలో పర్యవసిస్తుంది. ఈ విధంగా చెప్పడం వలన హేమావతిలో మానసిక పరివర్తనం కలిగి, ఆమె చేయబోయే పని తప్పని తెలుసుకుంటుంది. అలా చేస్తే సమాజంలో లోకువౌతుందని తెలుసుకుంటుంది. చిత్రభోగునిపై విముఖతను చూపింది. అదే విధంగా పరదారాసక్త చిత్తుడైన చిత్రభోగ మహారాజు జరిగిందంతా నిజదూతిక ద్వారా విని ఇతిహాసాలలో ఉన్న ఉదాహరణలను గుర్తుచేసుకొని జార శృంగారం సమాజ హానికరమని మానసిక పరివర్తనం పొందాడు. ఇచ్చట ఆప్తమిత్రమైన హంస ద్వారా విధి, నిషేధ రూపాల్లో నీతిని ఉపదేశించడం జరిగింది.
2.2. మారీచుని ఆప్తవచనాలు: రావణుని పతనం
రామాయణంలో రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖ చెప్పిన మాటలకు లోబడి సీతాదేవిని అపహరించుటకు నిశ్చయించుకున్నాడు. అందుకు మారీచుడి సహాయం కోరాడు. అప్పుడు మారీచుడు అనేక ఆప్తవచనాలను రావణునికి ఈ విధంగా బోధించాడు.
అపి స్వస్తి భవేత్ తాత! సర్వేషాం భువి రక్షసామ్
అపి రామో న సంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసమ్ (వాల్మీకి, వా. రా. అరణ్య కాండ 37.4)
నాయనా! నీవు సీతను అపహరించికొనివచ్చినచో ఈ లోకమందలి రాక్షసులందరినీ శ్రీరాముడు నిర్మూలిస్తాడు.
అపి తే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజా
అపి సీతానిమిత్తం చ న భవేద్వ్యసనం మమ (వాల్మీకి, వా. రా. అరణ్య కాండ, 37.5)
అపి త్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశమ్
న వినశ్యేత్ పురీ లంకా త్వాయా సహ సరాక్షసా (వాల్మీకి, వా. రా. అరణ్య కాండ, 37.6)
జానకీదేవి నీ ప్రాణాలు తీయడానికే పుట్టింది. కామాత్ముడవైన నీవంటి నిరంకుశత్వ ప్రభువును పొందినందుకు లంకానగరమందలి సమస్త రాక్షసులకు, నీకు చేటు కలుగుతుంది.
అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజా
న త్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వనే (వాల్మీకి, వా. రా. అరణ్య కాండ, 37.18)
శ్రీరాముని బల పరాక్రమాలు ఊహింప శక్యంగానివి. జానకి ఆయన భార్య. రాముని రక్షణలో ఉన్న ఆమెను అపహరించుట నీకు తగిన పనికాదని ఎన్నెన్ని సార్లు నిషేధరూప ఆప్తవచనాలు చెప్పినా రావణుడు ఆ ఆప్తవచనాలను పెడచెవిన పెట్టాడు.
మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః
ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధమ్ (వాల్మీకి, వా. రా. అరణ్య కాండ, 40.1)
ఈ విధంగా మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములే అయినప్పటికీ మూర్ఖుడైన రావణుడు ఆయువు మూడినవాడు ఔషధమును సేవింపనట్లు ఆ మాటలను పెడచెవిన పెట్టాడు. తుదకు రావణాసురుడు అతని పరివారం నాశనమైంది.
2.3. లక్ష్మణుని ఆప్తవచనం: సీతాపహరణం
శ్రీమద్రామాయణంలో అరణ్యకాండలో పంచవటి వద్ద ఉన్న పర్ణశాలలో సీత ఉంది. ఆ పర్ణశాల చుట్టుపక్కల తిరుగుతున్న మాయలేడిని సీత ఆకర్షించింది. అది కావాలని తన భర్త రాముని కోరింది. దానిని పట్టుకుందామని వెంబడిస్తూ చాలాదూరం వెళ్ళాడు రాముడు. అది ఎప్పటికీ చిక్కనందున దానిపైకి బాణం వేశాడు. అప్పుడు ఆ లేడి రూపంలో ఉన్న మారీచుడు హా సీతా! హా లక్ష్మణా! అని కేకలు పెట్టాడు. ఆ కేకలు చెవిలో పడ్డ సీత రామునికేమైందోనని భయపడి అక్కడికి లక్ష్మణుని పంపడానికి ప్రయత్నించింది. కాని లక్ష్మణుడు దానిని మాయగా గుర్తించి, రాముడు మహాబలవంతుడు అని అతనికి ఎటువంటి హాని కలగదు అని లక్ష్మణుడు సీతతో ఎన్నిసార్లు ఈ క్రింది విధంగా చెప్పాడు. కాని సీత వినలేదు. అంతేకాకుండా ఎన్నో కారులాడింది.
అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి
న త్వామస్మిన్ వనే హాతుమ్ ఉత్సహే రాఘవం. (వాల్మీకి 45.13)
సమరమున శ్రీరాముడు అజేయుడు. ఆయనకు ఆపదను శంకించుట గాని, నీవు ఇట్లు పరుషముగా మాట్లాడుట గాని తగదు. శ్రీరాముడు లేని ఈ ఆశ్రమంలో నిన్ను ఒంటరిగా వదలి వెళ్లలేను అని ఎన్నిసార్లు నిషేధరూప ఆప్తవచనాలను చెప్పిననూ సీత ఆ ఆప్తవచనాలను వినలేదు. చివరకు ఆమె మాట్లాడిన పరుషోక్తులను భరించలేక లక్ష్మణుడు సీతను విడిచి వెళ్తాడు. సీతాపహరణం జరిగింది.
2.4. వనేచరుని ఆప్తవచనం: ధర్మరాజు విజయం
కిరాతార్జునీయంలో అరణ్యవాసంలో ధర్మరాజు వనేచరుడిని మిత్రుని (ఆప్తుని) గా చేసుకొన్నాడు. దుర్యోధనుడు రాజ్యపరిపాలన ఎలా చేస్తున్నాడో తెలుసుకొని రమ్మని వనేచరుణ్ణి నియమించాడు. అతడు దుర్యోధనుని రాజ్యంలోనికి ప్రవేశించి అన్ని చోట్లా తిరిగి గమనించి మరల ధర్మరాజు వద్దకు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా విన్నవించాడు. అప్పుడు ధర్మరాజు తన ఆప్తుడైన వనేచరుని వచనాలు విని తన కర్తవ్యాన్ని ఎంచుకొని ప్రణాళికను నిర్దేశించుకొని విజయాన్ని సాధించాడు. ఇది ఆప్తవచనం ఉపయోగం.
3. ఆప్తుని గుర్తించడం, సామాజిక ప్రాసంగికత
ఆప్తవచనాన్ని అనుసరించడం ద్వారా లాభాలు, అనుసరించకపోవడం ద్వారా నష్టాలు మన తెలుగు, సంస్కృత సాహిత్యాలలో చాలా ఉన్నాయి. అయితే ఆప్తుడు ఎవరు, ఆప్తుడు కానివాడు ఎవరు అనేది పెద్ద సమస్య. ఆప్తుడిని ఎందుకు సరిగా గుర్తించలేమో సాంఖ్యకారికలో ఈశ్వరకృష్ణులవారు ఈ విధంగా వివరించారు.
3.1. ఆప్తుని గుర్తించడంలో సవాళ్లు
అతిదూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోऽనవస్థానాత్,
సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభావాత్ సమానాభిహారాచ్చ (ఈశ్వరకృష్ణులవారు 7)
అనగా ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం సరిగ్గా కనబడటం లేదంటే ఆ పదార్థం అక్కడ లేనే లేదని అర్థం కాదు. ఇలా కనబడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి:
- చాలా దూరంగా ఉండటం.
- చాలా దగ్గరగా ఉండటం.
- ఇంద్రియ వైకల్యం.
- మనసు స్థిమితంగా లేకపోవడం.
- అతి సూక్ష్మంగా ఉండటం.
- ఏదో అడ్డుగా ఉండటం.
- మరొక దాని చేత ఆక్రమింపబడటం.
- సమానమైన వాటిలో కలిసిపోవడం.
దీనిని బట్టి ఎదుటనున్నవారు ఆప్తులా కాదా, ఎదుటనున్న వస్తువు లేక పదార్థం సరియైనదా కాదా అనే విషయం ఆ వస్తువు (పదార్థం) లేక ఆ వ్యక్తి మీద ఎంత ఆధారపడి ఉన్నదో, చూసేవారి మీద కూడా అంతే ఆధారపడి ఉన్నదని తెలుస్తోంది. ఈ నిర్ధారణను సరిగా చేసుకునే వ్యక్తి జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని, సరిగా నిర్ధారణ చేసుకోలేనివారి జీవితం అగమ్యగోచరంగా ఉంటుందని సాంఖ్యదర్శనం చెబుతుంది.
అందువలన వ్యక్తిత్వ వికాసం కోసం, సమాజ శ్రేయస్సు కోసం విద్యార్థులకు ముందుగా నేర్పించాల్సిన విద్య తత్వశాస్త్రం. ఆ తర్వాతనే మిగిలిన విద్యలు నేర్పించాలని నా భావన.
ఉపసంహారం
- సుభాషితాలు, ఆప్తవచనాలు మానవ సమాజానికి నైతిక విలువలను అందిస్తాయి.
- ప్రమాణాలు మూడు విధాలుగా ఉంటాయి: ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవచనం.
- ఆప్తవచనం అనేది యదార్థవక్త పలుకులు, ఇది శాస్త్రానికి సమానం.
- ఆప్తవచనాన్ని పాటించడం ద్వారా శుభాలు, విస్మరించడం ద్వారా నష్టాలు కలుగుతాయి.
- ఆప్తులను గుర్తించడం అనేది సరైన జ్ఞానం, వివేకం మీద ఆధారపడి ఉంటుంది.
- తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, సమాజ శ్రేయస్సు సాధ్యమవుతాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- ఈశ్వరకృష్ణుడు.సాంఖ్యకారికా. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, ప్రచురణ సంవత్సరం.
- భారవి.కిరాతార్జునీయం. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, ప్రచురణ సంవత్సరం.
- భోజుడు.సరస్వతీకంఠాభరణం. విజయవాడ: వేదమూర్తి & సంస్కృత గ్రంథమాల, ప్రచురణ సంవత్సరం.
- వాల్మీకి.వాల్మీకి రామాయణం. మద్రాస్: వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్, ప్రచురణ సంవత్సరం.
- వెంకటరత్నం, జి.; హంసవింశతి. విజ్ఞానసర్వస్వం. వరంగల్: విజ్ఞానధునీ ప్రచురణలు, సంవత్సరం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

