AUCHITHYAM | Volume-06 | Issue-07 | June 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. భూషణం మాస్టారి కవిత్వం: సామాజికచైతన్యం
గొంటి బాబ్జి
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8688061477, Email: 2gontibabji@gmail.com
ఆచార్య జర్రా అప్పారావు
ప్రొఫెసర్ & హెడ్, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492495813, Email: drraojarra@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 25.04.2025 ఎంపిక (D.O.A): 28.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2025
వ్యాససంగ్రహం:
ఏ కవికైనా సరే అతను చుట్టూ ఒక సమాజం ఆ సమాజానికి ఒక చరిత్ర ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి సామాజికచారిత్రకపరిణామ గమనంలో సాహిత్యస్థానం నిర్ణయం అవుతుంది కవి ప్రగతివాసీలు అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు సామాజిక పరిణామానికి దోహదం చేసిన విప్లవకవి బోనం నాగభూషణం. భూషణం మాస్టారి కొత్తసృష్టి కవితాసంపుటి ఈ వ్యాసరచనకు ప్రాథమిక ఆకరం. సామాజికచైతన్యం గురించి వివిధ అభిప్రాయాలను పూర్వ పరిశోధనలు, వ్యాసాలు, విమర్శగ్రంథాల నుండి సేకరించి ఈ వ్యాసంలో పొందుపరిచాను. ఉపాధ్యాయుల వెట్టి చాకిరి, చాలీచాలని, సమయానికి అందని జీతాలు, పెద్ద కుటుంబాలతో పడే ఇక్కట్లు, గ్రామీణ స్థాయిలో జరిగే రాజకీయపరిణామాలు, ఆదివాసీల సమస్యలు, నిరుద్యోగం, అవినీతి, దోపిడి, లంచగొండితనం వంటి సామాజికరుగ్మతలు ఈయన కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. ఈ వ్యాసం భూషణం కవిత్వంలోని సామాజికచైతన్య అంశాలను, మోసపోయిన ప్రజలలో వీరి కవిత్వం కలిగించిన చైతన్య స్ఫూర్తిని విశ్లేషిస్తుంది.
Keywords: కవిత్వం, రాజకీయం, విద్యావ్యవస్థ, మధ్యతరగతి జీవనం, సామాజికచైతన్యం
1. ప్రవేశిక
నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం అనేది భావోద్వేగాలు, ఆలోచనలు, అనుభవాలను తెలియజేయడానికి సౌందర్య, ఉద్వేగభరితమైన భాషను ఉపయోగించే సాహిత్యం. అనుభవాన్ని వ్యక్తం చెయ్యటమే కాక, అది మనకు అనుభూతమయ్యేటట్లు చెయ్యటం కవిత్వం పని.
"అస్తవ్యస్తమైన మన దైనందిక అనుభవాలకి ఒక క్రమాన్ని, అర్ధాన్నీ కవిత్వం ఆపాదిస్తుంది. జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అందివ్వటమేనా కవిత్వం ధ్యేయం., అసంబద్ధమైన వాటిమధ్య సంబంధమే కవిత్వానికి అర్ధం చేకూరుస్తుంది. ఈ సంబంధమే కవిత్వ సారమూ, అది ప్రసరించే కాంతి." (భూషణం, భారత సాహిత్యనిర్మాతలు, పుట. 24)
2. రచయిత పరిచయం
రచయితకు దృక్పథాన్ని అతని జీవితం నేపథ్యమే ఏర్పరుస్తుంది. భూషణం మాస్టారు దారిద్ర్యా న్ని అనుభవించాడు. ఆకలే ఆదిగురువు అన్నట్టు పాఠశాలలో అడుగుపెట్టకముందే జీవితపాఠశాలలో పేదరికమే పెద్ద గురువై చాలా నేర్పింది తన జీవితంలో అనుభవించిన కష్ట నష్టాలకు ప్రపంచం తో పంచుకోవడానికి రచన ప్రక్రియను మాధ్యమంగా చేసుకున్నాడు దాంతో ఆయనకు సమాజంతో ఒక సజీవ సంబంధం ఏర్పడింది లోకంలో జరుగుతున్న పరిణామాలవల్ల కార్యకరణ సంబంధాన్ని పరిశీలించే పనిలో భాగంగానే ఆయన రచనాప్రస్థానం సాగింది. ఆయన పుట్టి పెరిగిన ఊరు దాటకపోయినా, ఉత్తమ సాహిత్యజీవనం ద్వారా ప్రజా సంస్కృతికసంఘాలలో క్రియాశీలకార్యకర్తగా పనిచేయడం ద్వారా లోకం పోకడని అంచనా కట్టగలిగాడు.
పుట్టింది, పెరిగింది జీవిత కోసం జీవితపర్యంతం నివసించింది స్వగ్రామమే. దాని కేంద్రంగానే సహజంగా పల్లెల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఫ్యూడల్ భావజాలం దాని అవలక్షణాలు ఆధారంగా చేసుకుని ఆయన రచన సాగింది. ఉపాధ్యాయవృత్తిలో చేరిన తర్వాత టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన బాధ్యుడిగా ఉండడం రచయితగా ఆయన బాధ్యతను మరింత పెంచింది.
భూషణం శూలపాణి అనే కలం పేరుతో కూడా అనేక
రచనలు చేశాడు. ఆయన మొదటి కథ చిత్ర గుప్తలో అచ్చయ్యింది. 'కొండగాలి' నవల, 'తీర్పు', 'పులుసు',
'అడివంటుకుంది' మొదలయిన కథలు, "కొత్త సృష్టి" పేరుతో వెలువరించిన కవితా సంపుటి, 'కొత్త పంతులు'
'సాలెగూడు' వంటి నాటికలు, అనుభవాల నేపథ్యంలో వచ్చిన 'సిక్కోలు జీవితాలు', కాగా, ఇంతవరకు గ్రంధ
రూపాల్లో వెలువడ్డ రచనలు : ఏది సత్యం, ఏది అసత్యం (1968) న్యాయం (1972) అడివంటుకుంది (1973)
కొండగాలి (1974) భూషణం కథలు (1981) కొండగాలి కొన్ని కథలు, 1987 కొత్తగాలి (1998) వీటితోపాటు కొన్ని
వ్యాసాలు కూడా రాసాడు. అనేక రేడియో ప్రసంగాలు చేసారు. (భారత
సాహిత్య నిర్మాతలు, భూషణం, పుట. 4)
4. తెలుగుసాహిత్యంలో సామాజికచైతన్యం
సుదర్శనం ఆర్.ఎస్. “తెలుగుసాహిత్యంలో సామాజికచైతన్యం” అనే వ్యాసాన్ని (1969 ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక) రాశారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ - మానవతావాదదృక్పథము- సామాజికచైతన్యము అనే వ్యాసంలో “ "సామాజిక చైతన్యం" అనే పదబంధం మార్క్సిస్టు ఆలోచనా బీజం నుంచి మన దేశంలోకి వచ్చింది. ఈ వాదం ప్రకారం స్థూలంగా చెప్పాలంటే, సమాజ చైతన్యమే వ్యక్తి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ సమాజమే సూర్యుడు. వ్యక్తి కిరణం. ఇది క్రమంగా సాహిత్యానికి అన్వయించింది. ఆభ్యుదయ సాహిత్యోద్యమానికి తల్లివేరు ఈ సామాజిక చైతన్యమే.” అని తెలిపారు (అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు, పుట. 146). వెంకటప్పయ్య, టేకుమళ్ళ. “...సామాజిక వ్యవస్థకు పునాది ఆర్ధిక శక్తి. సామాజిక చైతన్య రూపాలన్నీ దీనిపై వచ్చిన ఉపరితలములే, మతము, రాజకీయము, కళలు మొదలైనవి సామాజిక చైతన్య రూపములోని భాగములు. వీటి ప్రభావం పరస్పరం ఒకదానిపై ఒకటి కలిగి ఉన్నప్పటికీ వీటన్నిటి తత్త్వాన్ని నిర్ణయించు పునాది మూల సూత్రము అయిన ఆర్ధిక సూత్రమే” (డా. అద్దేపల్లి రామ్మోహనరావు (సి.గ్రం), పుట. 60) అని అభిప్రాయపడ్డారు. యస్. యాకోబ్, నాటకప్రక్రియలో “... సామాజిక చైతన్యరచనలు చేసిన వారిలో ఆత్రేయ” ముఖ్యులని తెలిపారు (తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ, జాతీయ సదస్సు 2024, ఆంధ్ర లొయోల కళాశాల పుట. 344) రామకృష్ణారావు "... సామాజిక చైతన్యప్రబోధం సినారె కవిత్వ ప్రధాన లక్ష్యం." అని పేర్కొన్నారు. (రామకృష్ణారావు, గోవిందరాజు. “తెలుగుకవితాకీర్తిశిఖరం” మార్చి 2011, చతుర. పుట. 89)” “సామాజికచైతన్యధోరణులు తెలుగుకథానిక మీద సుస్పష్టమైన ముద్ర వేశాయి.” (దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు, పుట. 415)
5. భూషణం కవిత్వం - సామాజిక చైతన్యం
ఆనాటి కవిత్వమంతా సామాజికవాతావరణం యదార్థదృశ్యాల్ని ప్రజల ముందు నిలబెట్టడానికీ, వారి మనస్సులలో తీవ్రమైన ప్రతిఘటన భావాన్ని బలపరచడానికి కృషి చేసింది. సామాజిక చైతన్యపూరితమై, సమస్యాపరిష్కారప్రబోధం చేస్తూ, ప్రయోజనాత్మకమైన ప్రాధాన్యం వున్నది. ఈ విధమైన సామాజికచైతన్యంతో రాసిందే భూషణం కవిత్వం. ఈ కవికి వస్తు స్వీకరణని గూర్చి స్పష్టమైన అభిప్రాయం వుంది. అందుకే 'ఎటువైపు' అనే గేయంలో యీ విధంగా చెప్పారు-
"జనంతో కలిసిపోయి జయజయ ధ్వానాలు
చెయ్యి
మనిషిలోన మండుతున్న అగ్నికి ఆజ్యం పొయ్యి!" (కొత్త సృష్టి కవితా సంపుటి, పుట. 13)
మొదటి రెండు పాదాల్లో సామాజిక చైతన్యమూ,
తర్వాత పాదాల్లో ప్రతిఘటన తీవ్రతా ధ్వనిస్తున్నాయి.
5.1
రాజకీయం
ఈనాటి విప్లవాత్మకమైన సాహిత్యలక్ష్యం
నానాటికీ దారుణంగా పరిణమిస్తున్న రాజకీయాలలోని కుళ్ళును బయట పెట్టడం. మన జీవితంలోని కష్టాలన్నిటికీ
రాజకీయమే మూలకారణమైనప్పుడు, దోపిడి చేసే ప్రతి వాడికీ రాజకీయమే పట్టుగొమ్మగా మారిపోయినప్పుడు,
రాజకీయాల విశ్వరూపంగా యీ సమాజం సాక్షాత్కరిస్తున్నప్పుడు. ఆ రాజకీయాల మీద కవిత్వం రాసి తీరవలసిందే.
భూషణంకి రాజకీయాల నగ్నస్వరూపాన్ని చూపించడంలో గల నేర్పు ఉన్నత ప్రమాణాల్లో వుంది.
'రాక్షసీ! నీ పేరు రాజకీయమా' అనే దాంట్లో
ఎన్నికల తతంగాన్ని యదాతథంగా వర్ణించారు.
"పంచాయితీ
పరిషత్తుల
పంచవన్నెల ఎన్నికల వన్నెలాడి
చూడు! ఎంచక్కా సాగి పోయిందహా!
ఇంత గొప్ప ప్రజాస్వామిక భూమిమీద!
కక్షలతో ఎత్తబడిన కర్రలు
కొట్టగా పగిలిన అనాధుల బుర్రలు!
రెండుగా చీల్చబడిన
గ్రామాలు
నిత్య సంఘర్షణల మధ్య నలిగిన జీవితాలు
బదిలీలు గావించబడ్డ
ఉపాధ్యాయులు
బడులలో చదువులేని భావిభారత పౌరులు
చెరచబడ్డ ఆడబిడ్డలు భరించిన రాక్షస
బాధలు
వేలంపాటల ప్రెసిడెంట్ల అపర శ్రీకృష్ణలీలలు"
(కొత్త సృష్టి కవితా సంపుటి, పుట 21.
)
ఇల్లాంటి దారుణ దృశ్యాల వ్యక్తీకరణ
చాలాచోట్ల దర్శనమిస్తుంది. భూషణం స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడు కావడంచేత, ఉపాధ్యాయులు
రాజకీయంగా పడ్డ బాధలు అనుభవపూర్వకంగా తెలిసినవాడు. అందువల్ల ఆ రాజకీయాల్ని చాలా నేర్పుతో తన
కవిత్వంలో వెల్లడించగలిగారు.
5.2 రచయితలు
వర్తమాన సాంఘిక సమస్యల నించి పూర్తిగా
పలాయనం చిత్తగించి, సంపాదనే పరమలక్ష్యంగా పరిగణించి, దైవ భక్తినీ, శృంగారానుక్తి నీ మేళవించిన
మధ్యతరగతి జీవితాల్ని వక్రంగా చిత్రించి, అంతరాత్మల్ని సైతం అమ్ముకొంటోన్న నేటి రచయితని, నిలదీసి
నిగ్గదీసిన భూషణం మాస్టారు "ఎటువైపు" అని
అడుగుతున్నాడు -
"ఇంకా రామాయణాన్ని కలవరించి
పలవరించి
కవిత్వంలో నింపడం తప్పు వద్దు!
పెట్టుబడిదారుల ముద్దుల పత్రికలు
గొలుసుకట్టు పత్రికలు పడవేసే పారితోషికపు
ఎంగిలిముద్దలు
ముట్టవద్దు!”
"చూడు ! ఈనాడు సామాన్యుని
గోడు!
ఇరవైయ్యేళ్ళ స్వాతంత్ర్యం పిదప
ఈ దేశం వట్టి బీడు
ఈ సోషలిజం వల్ల ప్రయోజనం కల్ల
ఈ ప్రణాళికలు డొల్ల -
మన ఆదాయం గుల్ల
యిప్పుడు యిరవై నాలుగ్గంటలూ
జైళ్లునోళ్లు
తెరచుకుంటున్నాయి.
యిప్పుడు ప్రజా
వెల్లువలు
ప్రభువుల దృష్టికి అల్లరిమూకలై
పోయాయి.
ఇక నుండి నీ గళం ఈ గీతాన్నే
ఆలపించాలి
ఇక నుండి నీ కలం ఈ వస్తువునే స్వీకరించాలి.
( కొత్త సృష్టి కవితా సంపుటి, పుట 16 )
నేటి కవికి యీ విధంగా కర్తవ్య ప్రబోధం సూచించిన తర్వాత, తాను ప్రజల కవినని భూషణం మాస్టారు నిర్ద్వంద్వంగా తెగేసి చెబుతాడు.
5.3 విద్యావ్యవస్థ
"కొఠారి కమీషన్ చేసిన మిఠాయి పొట్లం
యిప్పుడు
చిటారుకొమ్మన చిక్కడి చేతి
కందనంటున్నది!"
చివరికి యీ విధంగా హెచ్చరిస్తాడు
"తరగని విరగని తామర తంపర యీనాటి గాధ
పోరాటం సలపనిదే మనని వదలిపోని బాధ”
(కొత్త సృష్టి కవితా సంపుటి, పుట 32 )
నాలుగు లక్షల మంది ప్రభుత్వోద్యోగులూ,
ఉపాధ్యాయులూ సమ్మె జేశారు. ఆ సమ్మె పోరాటానికి సిద్ధం కండని రచయిత యిచ్చిన పిలుపే "పిలుపు" కవిత.
దానిలో కొఠారి కమీషన్ సిఫార్సులను గురించి యెంతో వ్యంగ్యంగా చమత్కరించారు.
5.4
మధ్యతరగతి జీవనం
"మింగ మెతుకు లేకపోయినా మీసాలకు మాత్రం
వెన్న
మొన్న అన్నం తిన్నా నిన్న
వస్తుపడివున్నా” (కొత్త సృష్టి కవితా సంపుటి,
పుట.36 )
మధ్యతరగతి మనస్తత్వాన్ని ఎంతో
ప్రతిభావంతంగానే గాక వాస్తవికంగా చిత్రించిన వచన కవిత-రేఖామాత్రపు మధ్యతరగతి జీవితలేఖ. ఉన్న ఉద్యోగం
రాళ్ళతో తృప్తిపడుతో, లేకపోతే తిథి వార నక్షత్రాల పై ఆధారపడుతో, లాటరీ ద్వారానో యితరేతర మార్గాల
ద్వారానో భవిష్యత్తులో బాగా కలిసి రావాలని తిరుపతి వెంకన్నకి మొక్కుతో, పేడ పురుగుల్లాంటి బతుకుల్ని
యీడ్చే నేటి మధ్య తరగతి జీవితాల్ని పై విధంగా చిత్రీకరించారు.
6. ఉపసంహారం
- భూషణం మాస్టారు కవిత్వం వాస్తవపరిస్థితులతో నిండి ఉంది
- ఈయన కవిత్వం ప్రజలలో సామాజిక చైతన్య స్ఫూర్తిని రగిలించింది.
- కేవలం వాడుకలోవున్న మాటలతోనే గేయానికి తగిన లయను కల్పించి హృదయం ద్రవించే విధంగా కవిత్వీకరించారు. ఈ వ్యాసంలో ఆయన కవిత్వంలోని కొన్ని అంశాలను విశ్లేషించాం.
- భూషణం మాస్టారి కవిత్వం దగాపడ్డ
ప్రజలలో చైతన్యం కలిగించి ఉద్యమ నేపథ్యాన్ని అందించింది.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- చలం, జి.ఎస్,. భారతసాహిత్యనిర్మాతలు - భూషణం. తెలుగుసాహిత్య అకాడమీ, 2021
- జగన్నాథం, పేర్వారం (సం.) ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. "మానవతావాదదృక్పథము- సామాజికచైతన్యము" వ్యాసం. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు. (వ్యాససంకలనం). సాహితీ బంధు బృందం, వరంగల్లు. 1987.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు (సి.గ్రం.). ఉస్మానియావిశ్వవిద్యాలయం, 1988.
- భూషణం మాస్టారు. కొత్తసృష్టి కవితాసంపుటి. ఉపాధ్యాయ ప్రచురణలు, 1972
- యాకూబ్, యస్. "నాటకం - సామాజిక స్పృహ (వ్యాసం)". తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ జాతీయసదస్సు. ఆంధ్ర లొయోల కళాశాల, అమ్మనుడి, మార్చి, 2024
- రామకృష్ణారావు, గోవిందరాజు. “తెలుగుకవితాకీర్తిశిఖరం” చతుర, మార్చి 2011
- వెంకటప్పయ్య, టేకుమళ్ళ. డా. అద్దేపల్లి రామ్మోహనరావు (సి.గ్రం),
- సుదర్శనం, ఆర్.ఎస్,. “తెలుగుసాహిత్యంలో సామాజికచైతన్యం” ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక, 1969
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

