headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

8. ఆధునిక తెలుగు పత్రికలభాష: ప్రమాణీకరణ

డా. యం. ప్రసాద్ నాయక్

సహాయ ఆచార్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494697904, Email: prasadnaik6@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 06.11.2025        ఎంపిక (D.O.A): 27.11.2025        ప్రచురణ (D.O.P): 01.12.2025


వ్యాససంగ్రహం:

ఆధునిక తెలుగు పత్రికల భాష ప్రజలతో నిరంతరం మమేకమై సామాజిక మార్పులను ప్రతిబింబించే ముఖ్యమైన మాధ్యమం. అయితే వార్తల వేగం, అనువాద ప్రభావం, ఆంగ్ల పదాల అధిక వినియోగం వల్ల పత్రికల భాషలో ఏకరీతి కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక తెలుగు పత్రికల భాషను ప్రామాణీకరించడం అత్యవసరం. ప్రామాణీకరణ ద్వారా శుద్ధమైన వ్యాకరణం, స్పష్టమైన వాక్య నిర్మాణం, సరైన పద ప్రయోగం, సాంప్రదాయ - ఆధునిక పదాల సమతుల్య వినియోగం సాధ్యమవుతుంది. ఇది పాఠకులకు అర్థగ్రాహ్యతను పెంచడమే కాకుండా భాషా గౌరవాన్ని నిలబెడుతుంది. అంతేకాకుండా విద్య, పరిపాలన, మీడియా రంగాల్లో ఒకే విధమైన భాషా ప్రమాణాలు ఏర్పడేందుకు దోహదపడుతుంది. ఈ అధ్యయనం ఆధునిక తెలుగు పత్రికల భాషలో ఉన్న సమస్యలను విశ్లేషించి, ప్రామాణీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సూచిస్తుంది. ఫలితంగా తెలుగు భాష యొక్క సమృద్ధి, స్థిరత్వం మరియు భవిష్యత్ తరాలకు దాని పరిరక్షణకు ఈ ప్రయత్నం ఉపయోగకరంగా నిలుస్తుంది. ఈ వ్యాసంలో అనేక పూర్వ పరిశోధనలు, భాషా సాహిత్యానికి, పత్రికకు సంబంధించిన వ్యాసాలు వివిధ పుస్తకల్లో, పత్రికల్లో, సదస్సు సమావేశాల్లో ఆధునిక భాషా మరియు విశ్లేషణ గురించి వ్యాసాలు రావడం జరిగింది. చేకూరి రామారావు రాసినటువంటి భాషానువర్తనం, భాషాంతరంగం వంటి గ్రంథాలు, అలగే లక్ష్మణ రెడ్డి రచించినటువంటి తెలుగు భాష ప్రాచీనత- ఆధునికత మరియు ముద్ధాళి రఘురామ్, తెలుగు భాషా వైభవం మొ।। గ్రంథాలలో చాలావరకు చరిత్ర, తెలుగు సాహిత్య పరిణామం, పత్రికభాషా మొదలగు చరిత్ర వంటి గ్రంథాలు భాషా వికాసం, సాహిత్యాభివృద్ధిని అనుసంధానిస్తూ విలువైనసమాచారం అందించారు. ఆధునిక తెలుగు పత్రికలభాషా విద్య, సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావాల వల్ల తెలుగు భాష కొత్త పదాలు, భావ వ్యక్తీకరణలతో విస్తరిస్తోందని కొంత విశ్లేషణాత్మక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందని నా అభిప్రాయం.

Keywords: ఆధునికభాష, సామాజికమార్పు, పదప్రయోగం, పత్రికలభాష, ప్రామాణీకరణ, ప్రసార మాద్యమం

1. ప్రవేశిక

తెలుగు పత్రికలకు సాధారణ భాషకు భిన్నమైన ప్రత్యేక భాష ఉందని, దానికి ప్రమాణీకరణ అవసరమని ఈ శీర్షిక సూచిస్తున్నది. వర్తమాన పత్రికల భాష గురించి ప్రస్తావించడం, పరోక్షంగా ఆధునిక భాష గురించి చర్చించడమే అవుతుంది. కావున, తెలుగు పత్రికా భాషా స్వభావాన్ని అవగతం చేసుకుంటే; రేడియో, టి.వి. వంటి ఇతర ప్రసార మాధ్యమాల తెలుగు భాషపై స్థూల అవగాహన లభించినట్లే. పత్రికా రచన ఏకవ్యక్తి ప్రక్రియ కాదు. సంపాదకులు, ఉపసంపాదకులు, ప్రత్యేక వ్యాస రచయితలు, వ్యాఖ్యాతలు వంటి అనేక మంది భిన్న రకాల రచనలు చేస్తుంటారు.

పందొమ్మిదో శతాబ్దం అనంతరం తెలుగు సమాజంలో ప్రజాభిప్రాయ నిర్మాణంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు, భాషా వినియోగంలో నిర్దిష్ట ప్రమాణాన్ని నెలకొల్పడంలో ఆధునిక తెలుగు పత్రికలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ప్రాంతీయ భాషా వైవిధ్యం, మాండలిక భేదాలు ఉన్నప్పటికీ; పాఠకులందరికీ అర్థమయ్యే సరళ, స్పష్టమైన తెలుగు భాషను వినియోగించేందుకు పత్రికలు కృషి చేస్తున్నాయి. ఈ ప్రక్రియనే భాషా ప్రమాణీకరణగా పరిగణించవచ్చు. ఆధునిక కాలంలో విద్య, సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావాల వల్ల నూతన పదజాలం, భావ వ్యక్తీకరణలతో తెలుగు భాష విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికలు సంప్రదాయ పదసంపదను పరిరక్షిస్తూ, అవసరమైన సందర్భాల్లో నూతన పదాలను స్వీకరిస్తూ భాషకు సమతుల్య రూపాన్ని అందిస్తున్నాయి. వ్యాకరణ శుద్ధి, శైలి సరళత, భావ స్పష్టత వంటి అంశాలపై పత్రికలు చూపుతున్న శ్రద్ధ భాషా ప్రమాణీకరణకు దోహదపడుతోంది.

2. ఆధునికభాష

భాషా శాస్త్రం ప్రకారం భాషలన్నీ సమానంగా శక్తిమంతమైనవే. దీని అర్థం మూలధాతువులో, అంటే భాషా యంత్రాంగంలో పటిష్టమైన భాషలు, పేలవమైన భాషలు అనే భేదం ఉండదని గ్రహించాలి. ఈ రకమైన అవగాహన ఈ శతాబ్దపు ప్రారంభంలో మాట్లాడే భాషలపై చేసిన పరిశోధనల మీద ఆధారపడి ఉంది. భాషలో వాక్యోత్పత్తి యంత్రాంగం – దీన్నే స్థూలంగా వ్యాకరణం అంటాం – బహుశా అన్ని భాషలకు దాదాపు సమానంగా ఉండవచ్చు. కానీ లిఖిత వ్యవస్థ ఉన్న భాషలలో నిల్వ సౌకర్యం (Storage Facility) వల్ల మాట్లాడే భాష కన్నా రాసే భాష సంపన్నమైనది. దీనికి కారణాలు ఊహించడం కష్టం కాదు. రాసే భాషలో లిఖిత వ్యాకరణాలు ఉంటాయి. వాటివల్ల పద వాక్యోత్పత్తి ప్రక్రియలను అధికోపయోగంలో పెట్టవచ్చు. రకరకాల కోశాలు ఉంటాయి. అవి పద సంపదను భద్రపరుస్తాయి. పై వివరణను బట్టి భాషా సమీకరణను గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు:

  • నవీకరణ అనేది లిఖిత భాషకు సంబంధించినది.
  • భాషాభివృద్ధికి నిల్వ వనరులు అవసరం. అవి రాసే భాషలోనే సాధ్యం.
  • అభివృద్ధి చెందిన సమాజాలలో భాషాప్రయోగ సందర్భాలు పెరుగుతాయి. ప్రయోగరీతులు, పద సంపద వృద్ధి చెందుతాయి. అర్థ నైశిత్యం, అర్థచ్ఛాయా భేదాలు పెరుగుతాయి.

ఇట్లాంటి అవసరాలు పెరిగిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజమని, అట్లా అభివృద్ధి చెందిన సమాజానికి అనుగుణంగా పెరిగిన భాషలను అభివృద్ధి చెందిన భాషలని వ్యవహరిస్తాం. (చేకూరి రామారావు, భాషానువర్తనం, పుట. 70.)

3. వ్యావహారికభాషోద్యమం

వ్యావహారిక భాషోద్యమానికి ఆనాటి భాషా శాస్త్ర దృక్పథం ఎంతగానో తోడ్పడింది. గత శతాబ్దపు చారిత్రక భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. దాని వల్ల భాషలో మార్పు అనివార్యం అనే విషయం స్థాపితమైంది. అందుకే వ్యావహారిక భాషావాదుల వ్యాసాలలో ఎక్కడో ఒక చోట 'భాష మారుతుంది' అనే వాక్యం కనబడుతుంది. ఇది చారిత్రక భాషాశాస్త్ర ప్రభావం. గిడుగు రామమూర్తి గారు 1910–12 సంవత్సరాలలో విశాఖపట్నంలో ఉపాధ్యాయ పరిషత్తులో ఇచ్చిన ఉపన్యాసాల్లో ఈ విషయాన్నే నొక్కి చెప్పారు. ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు పాశ్చాత్యుల వలస వాదంలో భాగంగా ఆయా దేశాలలో లిఖితస్థితి లేని అనేక భాషలను అధ్యయనం చేశారు.

ఒకప్పుడు కావ్య భాషే అన్ని రచనా భేదాలకు పనికివస్తుందని కొందరనుకున్నట్లుగా, నేడు పత్రికా భాషే అన్నిటికీ పనికి వస్తుందనుకునేవారు ఉన్నారు. ఇందుకు భాషా వ్యవస్థా నిర్మాణంలో, వివిధ సమాచార ప్రసారంలో వీరికున్న అదృశ్యాధికారం కారణం. సాధారణ వ్యవహార భాష నుంచి పత్రికా రచన భాష ఏర్పడే మాట నిజమే అయినా, పత్రికా భాష ఇతర రంగాల వ్యవహార భాషను ప్రభావితం చేసే మాట కూడా వాస్తవమే. రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నుడైన కార్యకర్త మాట్లాడే భాష తాను చదివే పత్రికా భాష వల్ల ప్రభావితం కావటం మన అనుభవంలోని విషయమే. ఈనాటి విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకుల్లో అనేకులు తమ పరిశోధక వ్యాసాల్లో, గ్రంథాల్లో పత్రికా భాషా సదృశమైన పద రూపాలను, వాక్య రీతులను విరివిగా వాడటం గమనిస్తున్నాము.

ఇతరులు ఉపన్యాసాల్లో చేసే ప్రయోగాలను, రచనల్లో వాడే భాషా ప్రయోగాలను పత్రికల వారు తమ భాషలోకి మార్చే పద్ధతిని కూడా మనం గమనించవచ్చు. ఆధునిక వ్యవహార భాషను, దానిపై ఆధారపడ్డ ఆధునిక రచనా భాషను తెలుగు పత్రికలు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి వారి రచనా మార్గాలు, ప్రయోజనాలు భిన్నమైనా 'రంగనాయకమ్మగారి వాడుక భాషే రాస్తున్నామా ?', 'రవ్వా శ్రీహరిగారి వాడుక భాషలో అపప్రయోగాలు' అనే పుస్తకాలు ఈ విషయంలో కొంత సాక్ష్యాన్ని అందిస్తున్నాయి. బూదరాజు రాధాకృష్ణ గారి వంటి పండితులు తాము పనిచేస్తున్న పత్రికల వారిని సంస్కరించడానికి ప్రయత్నిస్తున్నా తపోశక్తి, మనోశక్తి వంటి సంధిరూపాలు, మిశ్రమ సమాసాలు విరివిగానే పత్రికా భాషలో కనిపిస్తున్నాయి. అవి అక్కడితో ఆగక, ఇతరేతర రచనా వ్యవహారాల్లోకి వెంటనే పాకుతున్నాయి.

నేటి పత్రికల భాష అనే తీగెను కదిలిస్తే ఆధునిక రచనా భాష, ఆధునిక వ్యవహార భాష అనే డొంకలు కదులుతాయి. ఇక ప్రమాణీకరణ విషయం పరిశీలిస్తే, ఈ మాటను భాషా శాస్త్రంలోనూ, బయటా వేరు వేరు అర్థాల్లో వాడుతున్నారు. భాషా ప్రయోగ వైవిధ్యాన్ని తగ్గించి భాషను ఏకోన్ముఖం చేసే ప్రయత్నాన్ని ప్రమాణీకరణం అంటాం. ఇది అనుకున్నంత తేలిక కాదు. ఇతర భాషల సంగతి ఎటున్నా, తెలుగులో ఇది బహుకష్ట సాధ్యం అనిపిస్తున్నది. అందుకు కారణాలు అనేకం.

భాష నియత వ్యవహారం. రచనా భాషలోనూ ఆ నియతి అవసరం. నియతి సహజంగానూ ఉండవచ్చు లేక ఏర్పరచుకోనూవచ్చు. మాట్లాడే భాషలో అది సహజంగా ఏర్పడుతుంది. రచనా భాష మాట్లాడే భాష కన్నా భిన్నం కనుక, దానిపై ప్రభావాలు వివిధం కనుక, ప్రయోజనాలు విభిన్నం కనుక రచనా భాషలో ఏకత్వం సహజంగా ఏర్పడదు. దీనికి మానవ ప్రయత్నం అవసరం.

4. ఆధునికపత్రిక

ఆధునిక పత్రికా రచయితల్లో వార్తారచనకు పెద్దలు మరో నిర్వచనం కూడా ఇచ్చారు. అది 'సమకాలీన చరిత్ర' అని పేర్కొన్నారు. తెలుగులో ఆరంభ పత్రికలైన వృత్తాంతిని (1838), వర్తమానతరంగిణి (1842) ఇందుకు ఉపయుక్తమైన ఆనాటి శిష్టవ్యావహారిక భాషనే వాడాయి. సుజనరంజని (1862) వచ్చిన తర్వాతనే సాహిత్యానికి ప్రాధాన్యం పెరిగి భాష మారింది. పత్రికా భాష ఆనాడు, ఈనాడు కూడా సాహిత్యానికి పరిమితమై ఉండదు కదా? రాజకీయ, సామాజిక, విజ్ఞానశాస్త్ర, సాంకేతిక, న్యాయ తదితర అనేక విషయాలు వార్తా రూపంలో ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో పత్రికలలో ప్రచురితమవుతూ ఉంటాయి. కనుక పత్రికా భాషలో అవసరం కొద్దీ కొత్త పద నిర్మాణం జరుగుతుంది. కొత్త పలుకులు చేరుతాయి. వింజమూరి కృష్ణమాచార్యుల వారి సుజనరంజనితో ప్రారంభమై దాదాపు 150 ఏళ్లుగా సాగుతున్నదే. ఇలాంటి ప్రయత్నాన్ని క్రమబద్ధంగా చేసిన తొలిపత్రిక అదే.

పత్రికా నిర్వహణలో తమకు రెండు ఉద్దేశాలు ఉన్నట్టు కందుకూరి వీరేశలింగం 'వివేకవర్ధని' తొలి సంచికలో రాసుకున్నారు. ఒకటి దేశాభివృద్ధి అయితే, రెండవది భాషాభివృద్ధి. పత్రికా భాష ఆధునిక రచనా భాషగా, ఓ మోస్తరు ప్రమాణ భాషగా రూపొందింది. దీనికి అంతం లేదు. ఆకాశమే హద్దు అనే సూక్తి కూడా విషయ ప్రసారంలో అనలేము. (జి. ఎస్. వరదాచారి, తెలుగుభాష వైభవం, పుట 119.)

ఆధునిక పత్రికలు సమాజంలో సమాచారాన్ని వేగంగా, విస్తృతంగా ప్రజలకు చేరవేసే ముఖ్యమైన మాధ్యమాలుగా మారాయి. రాజకీయాలు, ఆర్థికం, విద్య, సంస్కృతి వంటి విభిన్న రంగాల వార్తలను సరళమైన భాషలో అందిస్తూ ప్రజాభిప్రాయ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముద్రిత రూపంతో పాటు డిజిటల్, ఆన్‌లైన్ వేదికల ద్వారా కూడా పత్రికలు అందుబాటులోకి రావడం వల్ల పాఠకుల పరిధి మరింత విస్తరించింది.

5. రాసే భాష - మాట్లాడే భాష

రాసే భాష దూరాన్ని అధిగమిస్తుంది. ఒక కాలంలో ఒక జాతి సంపాదించిన జ్ఞానాన్ని మరో కాలానికి అందించటానికి మాట్లాడే భాషకు శక్తి చాలదు. మాట్లాడే భాషలో విషయ నిక్షేప విక్షేపాలకు మానవమేధా, జ్ఞాపక పరిమితులున్నాయి. విషయ వైఫల్యాన్ని, కాలాంతరంలో పరిమితులు లేకుండా అందించడానికి రాసే భాష శక్తిమంతమవుతుంది. (చేకూరి రామారావు, భాషానువర్తనం, పుట. 15.)

ప్రమాణ భాషకు రాతతో ఎక్కువ పని. మాండలిక భాషకు మాట్లాడటంతో ఎక్కువ పని. ప్రమాణ భాష మాట్లాడేవారు మాండలిక భాష కూడా మాట్లాడతారు. ఈ రెండూ ఒకరినే ఆశ్రయించే అవకాశం ఉంది. తెలుగు భాషకు భిన్న కాలాల్లో భిన్న భాషలతో సంబంధ బాంధవ్యాలేర్పడ్డాయి. అందువల్ల ఆయా భాషల్లో నుంచి చాలా పదజాలం తెలుగులోకి వచ్చి భాషా వ్యక్తీకరణను సంపన్నం చేసింది. తెలుగుకు మొదటి నుంచి సంస్కృత ప్రాకృతాలతో సాంస్కృతిక సంబంధాలున్నాయని చెప్పవచ్చు. అందువల్ల తెలుగులో తత్సమ, తద్భవ శబ్ద విభాగం అర్థవంతమైనది. (చేకూరి రామారావు, భాషాంతరంగం, పుట. 19.)

6. నూతన పదకల్పన

వేగంగా సాగే పత్రికా రచనలో అవసరం, అనివార్యత దృష్ట్యా పాత్రికేయులు నిరంతరం నూతన పదకల్పన చేస్తూ ప్రయోగిస్తుంటారు. తమకున్న సమయాన్ని, భాషా సామర్థ్యాన్ని బట్టి కొత్త పదాలు సృష్టిస్తున్నారు. అసెంబ్లీకి శాసనసభ, సెక్రటేరియట్‌కు సచివాలయం, రేడియోకు ఆకాశవాణి, నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్‌కు అలీన విధానం, Summitకు శిఖరాగ్ర సమావేశం, United Nationsకు ఐక్యరాజ్యసమితి, Security Councilకు భద్రతామండలి, Contempt of Courtకు కోర్టు ధిక్కారం, ప్రోరొగ్‌కు నిరవధిక వాయిదా, ప్రివిలేజ్ మోషన్‌కు సభాహక్కుల తీర్మానం, ఐ.పి.సి.కి భారత శిక్షా స్మృతి... ఇలా లెక్కలేనన్ని ఆంగ్ల పదాలకు పాత్రికేయులు తెలుగు మాటలు సృష్టించారు. (ముద్ధాళి రఘురామ్, తెలుగు భాషా వైభవం, పుట. 354.)

7. నూతన పదాలకల్పన – పత్రికలు ప్రసారసాధనాలు

పత్రికా భాష రోజు రోజుకు విచిత్రమైన పోకడలు పోతున్నదని పండితులు చెబుతున్నారు. ఎదుటి వాడికి భావం ఏమిటో బోధపడేలా రాయటమే పత్రికా రచన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఒకటీ అర భాషా దోషాలు దొర్లినా ప్రామాణిక భాషను రూపొందించే శిల్పులు పాత్రికేయులే. ఇటీవలి కాలంలో సైన్సు, టెక్నాలజీ రంగాల్లో కొత్త పదాలు చాలా వస్తున్నాయి. వాటికి సరైన పారిభాషిక పదాలను రూపొందించటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా పాత్రికేయులకూ కొత్త పరిభాషా కల్పన తప్పనిసరి అయింది. దీనికి తోడు పాత పదాలను కొత్త అర్థాల్లో ఉపయోగించటం ప్రారంభించారు. సంస్కృత పదాల సహాయంతో మరికొన్ని పదాలు, పదబంధాలు సృష్టిస్తున్నారు. (లక్ష్మణరెడ్డి, వి., తెలుగు భాష ప్రాచీనత ఆధునికత, పుట. 96.)

సాహిత్యపరంగా చూసినట్లయితే విలువలతో కూడిన సాహిత్యం వేరు, ప్రచార సాహిత్యం వేరు, పత్రికా సాహిత్యం వేరు. ఎలా ఉండాలో చెప్పడమే సాహిత్యానికి పరమావధి అయితే, ఎలా ఉన్నారో చెప్పటం పత్రికా సాహిత్యం. పత్రికలలో ఏది రాసినా పఠనీయత ఉండాలి. ప్రజల జీవితం కనిపించాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు ఉండాలి. అవి వాస్తవాలు అయి ఉండాలి. కనీసం వాస్తవానికి దగ్గరగానైనా ఉండాలి. ప్రజాభిప్రాయాలని సరళమైన భాషలో అందించాలి. (బూరుగుపల్లి వ్యాస కృష్ణ, తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు, సదస్సు వ్యాస సమాహారం.)

8. ఏకరూపత

లెక్కకు మిక్కిలిగా పాత్రికేయులు పత్రికా రంగంలోకి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మాండలికాల ప్రభావం ఉన్న, రకరకాల సామాజిక నేపథ్యం ఉన్న వారు పత్రికా రచన చేపట్టేసరికి భాష ఏకరూపత సాధించడం ఒక అవసరంగానూ, ఒక సవాలుగానూ పరిణమించింది. నిత్యం ఎంతమంది కలిసి రాస్తున్నా, పత్రికంతా భాషాపరంగా ఒకే విధంగా ఉండేలా చేస్తే పాఠకుల్లో అయోమయానికి అవకాశం లేకుండా ఉంటుంది.

9. అనువాదం

పత్రికా రచనలో అనువాదం అనివార్యం. నిత్యం దేశ విదేశాలకు చెందిన వార్తలు ఏజెన్సీల ద్వారా ఆంగ్లంలోనే వస్తాయి. వాటిని అప్పటికప్పుడు అనువాదం చేసి తీరాలి. పత్రికల్లో ముఖ్యంగా ఉపసంపాదకులుగా ఉన్నవారికి నిత్యం అనువాదం తప్పనిసరి. పాత్రికేయులు చాలావరకు అనుభవం మీద అనువాదం బాగా చేస్తున్నారు. చేసిన అనువాదం పాఠకుల ఆమోదం పొందుతోంది. (చెన్నయ్య, తెలుగుపత్రికల భాషా స్వరూపం, పుట 355.)

10. నుడికారం

పత్రికా భాషలో కృతకమైన భాష ఎక్కువగా ఉంటున్నది. కొన్ని వార్తలు ఆంగ్లం నుంచి అనువదించుకొనేవి కాగా, కొన్ని స్థానిక పాత్రికేయులే తెలుగులో నేరుగానే రాసేవి. ఆంగ్లం నుంచి అనువదించే వార్తలు అనువాద భాషతో కూడుకొని ఉంటాయి. (ముద్ధాళి రఘురామ్, తెలుగు భాషా వైభవం, పుట. 357.)

ఉపసంహారం

అందువల్ల ఆధునిక తెలుగు పత్రికలు కేవలం సమాచార వాహకాలు మాత్రమే కాకుండా, తెలుగు భాషను ఒక ప్రామాణిక రూపంలో స్థిరపరచే శక్తివంతమైన మాధ్యమాలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా పత్రికలు భాషా అభివృద్ధి, ప్రమాణీకరణలో కీలక పాత్రను కొనసాగిస్తాయని ఆశించవచ్చు. మొత్తంగా పరిశీలిస్తే, ఆధునిక తెలుగు పత్రికల భాషా ప్రమాణీకరణ ప్రక్రియ తెలుగు భాషాభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది. పత్రికలు సరళమైన, స్పష్టమైన, వ్యాకరణపరంగా శుద్ధమైన భాషను వినియోగించడం ద్వారా విస్తృత పాఠక వర్గానికి ఒక ప్రామాణిక తెలుగు రూపాన్ని పరిచయం చేస్తున్నాయి. ప్రాంతీయ మాండలికాల ప్రభావాన్ని సమతుల్యంగా నియంత్రిస్తూ, అవసరమైన చోట నూతన పదాలను స్వీకరించడం ద్వారా భాషను సమకాలీన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాయి. అందువల్ల ఆధునిక తెలుగు పత్రికలు కేవలం సమాచార వాహకాలు మాత్రమే కాకుండా, తెలుగు భాషకు స్థిరత్వం, ఏకరూపత కల్పించే శక్తివంతమైన సాధనాలుగా భవిష్యత్తులో కూడా తమ పాత్రను కొనసాగిస్తాయని చెప్పవచ్చు.

  • భాషలన్నీ సమాన శక్తిమంతమైనప్పటికీ, లిఖిత భాషకు ఉండే నిల్వ సౌకర్యం వల్ల అది నవీకరణకు, అభివృద్ధికి మూలాధారంగా నిలుస్తుంది.
  • వ్యావహారిక భాషోద్యమం, పత్రికా రంగం రెండూ పరస్పర పూరకాలుగా ఆధునిక తెలుగు భాషా వికాసానికి దోహదపడ్డాయి.
  • పత్రికలు కొత్త పదాల సృష్టికి (Coinage), అన్య భాషా పదాల అనువాదానికి వేదికలుగా మారి, సమకాలీన చరిత్రను లిఖించే సాధనాలుగా మారాయి.
  • వివిధ మాండలికాలు, సామాజిక నేపథ్యాలు ఉన్న పాత్రికేయుల వల్ల పత్రికా భాషలో ఏకరూపత సాధించడం ఒక సవాలుగా పరిణమించినా, అది ప్రామాణీకరణ దిశగా సాగుతున్న నిరంతర ప్రక్రియ.
  • సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పారిభాషిక పదాల కల్పనలో పత్రికల పాత్ర అత్యంత కీలకం.

సూచికలు

  1. చేకూరి రామారావు, భాషానువర్తనం, పుట.
  2. ముద్ధాళి రఘురామ్, తెలుగు భాషా వైభవం, పుట.
  3. లక్ష్మణ రెడ్డి, వి., తెలుగు భాష ప్రాచీనత ఆధునికత, పుట.
  4. బూరుగుపల్లి వ్యాస కృష్ణ, "తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు", (సదస్సు వ్యాస సమాహారం).
  5. చెన్నయ్య, తెలుగు పత్రికల భాషా స్వరూపం, పుట.

ఉపయుక్త గ్రంథసూచి

  1. చెన్నయ్య, జె. "తెలుగు పత్రికల భాషా స్వరూపం." తెలుగు భాషా వైభవం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
  2. రఘురామ్, ముద్ధాళి. "తెలుగు భాషా వైభవం." తెలుగు భాషా మహోత్సవాల ప్రసంగ వ్యాస సంకలనం, ప్రథమ ముద్రణ, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
  3. రామారావు, చేకూరి. భాషాంతరంగం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2000.
  4. రామారావు, చేకూరి. భాషానువర్తనం. చేర పబ్లికేషన్, హైదరాబాద్, 2000.
  5. లక్ష్మణ రెడ్డి, వి. తెలుగు భాష ప్రాచీనత ఆధునికత. నవసాహితి బుక్ హౌస్, విజయవాడ, 2006.
  6. వరదాచారి, జి. ఎస్. "పత్రిక భాష." తెలుగు భాషా వైభవం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
  7. వ్యాస కృష్ణ, బూరుగుపల్లి. "తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు." 7వ ప్రపంచ తెలుగు సదస్సు వ్యాస సమాహారం, త్రైమాస అంతర్జాల పత్రిక, 2022.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]