AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. కరోనా మహమ్మారి తెచ్చిన విలయం: కథాసాహిత్యంలో దాని ఆనవాళ్ళు
అప్పన్న ఇనపకుర్తి
పరిశోధకులు, తెలుగు విభాగం,
డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల,
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9966338730, Email: appannainapakurthi@gmail.com
డా. ఢిల్లీశ్వరరావు సనపల
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
సెల్: +91 9441944208, Email: eswar.dilli820@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 01.11.2025 ఎంపిక (D.O.A): 30.11.2025 ప్రచురణ (D.O.P): 01.12.2025
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో విశిష్ట స్థానం సంపాదించి, సమాజంలో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తున్న ప్రక్రియ కథ. కథలలో విభిన్న వస్తువులను తీసుకొని రాయడం పరిపాటే. ఈ నేపథ్యంలో విభిన్న వస్తువైవిధ్యంతో కరోనాకాలంలో కథలు వెలుపడ్డాయి. భాష ఎలాగైతే పరిణామశీలో సాహిత్యం కూడా కాలానుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను తనలో నింపుకొని సుసంపన్నమవుతుంది. ఉదాహరణకు ఆదికవి నన్నయ నుండి నేటివరకు సాహిత్యాన్ని తరచి చూసినప్పుడు ఈ పరిణామశీలత అగుపిస్తుంది. ఆధునిక కాలంలో వచ్చిన సాహిత్య ఉద్యమాలన్నీ సామాజిక స్పృహతో వెలువడినవే. అదేవిధంగా కవి కూడా సమాజంలో భాగమే కాబట్టి తనకాలపు నాటి సామాజిక అంశాలను స్పృశించకుండా దాటి వెళ్లడం సాధ్యం కాదు. కోవిడ్ కాలంలో కరోనా మహమ్మారి తెచ్చిన విలయం-కథా సాహిత్యంలో దాని ఆనవాళ్ళును ప్రస్తావిస్తూ, వస్తు వైవిద్యంతో కూడిన కథలను విశ్లేషిస్తుందీ వ్యాసం.
Keywords: కరోనా మహమ్మారి, భయం, నిరుద్యోగం, సామాజిక దూరం, ఆర్థిక సమస్యలు, క్వారంటైన్, మాస్కులు, ఆత్మస్థైర్యం, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్, లాక్ డౌన్, కరోనాబలి, ఆకలి, కరోనాసుగ్గి.
1. ప్రవేశిక
విధి విచిత్రమైనది, బలీయమైనది కూడా. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రపంచం కొన్నిసార్లు అందరినీ అదే బాటలో నడవమంటుంది. నేటి ఆధునిక కాలంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పేరుతో వచ్చిన మహమ్మారి సమస్త మానవాళికి చెందిన ఒక సంవత్సర కాలాన్ని చీకటిమయం చేసింది. మానవీయ, సామాజిక, సాంప్రదాయ, కుటుంబ విలువలకు మనిషి ఎంతపాటి విలువ ఇస్తాడో, వాటిని ఎంత తేలికగా వదులుకోగలడో తెలియజెప్పింది. కరోనా సమాజంలో భిన్నవర్గాలపై భిన్నప్రభావాలను చూపింది. శ్రామికులుగా ఉన్నవారిలో కొందరు పూర్తిగా పనిని, ఆదాయాన్ని కోల్పోయారు. చేతివృత్తుల వారికి, చిరువ్యాపారులకు, ప్రైవేట్ టీచర్లకు, వ్యవసాయదారులకు ఇలా చాలా వర్గాల ప్రజలకు దెబ్బ తాకింది. వారిలో కొందరు వృత్తులు మారారు, వ్యాపారాలు మార్చారు. దీనంతటికీ కారణం కరోనా వైరస్. కరోనా మహమ్మారి తెచ్చిన విలయం, కథా సాహిత్యంలో దాని ఆనవాళ్లను విశ్లేషించడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం.
2. కథాసాహిత్యంలో కరోనా ఆనవాళ్ళు
మనిషికి మహమ్మారికి మధ్య జరుగుతున్న యుద్ధంలో కవులు, రచయితలు, చిత్రకారులు, గాయకులు, మేధావులు, సామాజికవేత్తలు తమ తమ ఆయుధాలకు పదునుపెట్టారు. సాహిత్యంలో జీవితం ప్రతిఫలిస్తుంది. కరోనా మహమ్మారి తెచ్చిన విలయానికి స్పందించే హృదయమున్న ప్రతి ఒక్కరూ తాను చూసిన, అనుభవించిన, ఊహించిన అంశాలను ప్రధాన వస్తువుగా చేసుకొని విభిన్న సంఘటనలను కథల్లో చిత్రించారు. సామాజిక స్తంభన, ఆర్థిక సమస్యలు, వృత్తి విచక్షణారాహిత్యం, విలువల పతనం, భయం వంటి అంశాలను సాహిత్యంలో కథలుగా వెలువరించారు.
3. సామాజిక స్తంభన
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన విలయం. ఇది ఆరోగ్య సమస్యగా మొదలై సమాజంలోని ప్రతి రంగానికి విస్తరించి అనేక సామాజిక స్తంభనలను కలిగించింది. ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవన విధానం స్తంభించిపోయింది. జనాల ప్రణాళికలను తారుమారు చేసింది. కుటుంబ సభ్యులను తల్లికి పిల్ల, పిల్లకు తల్లి కాకుండా విడదీసింది. అత్యవసర ప్రయాణాలను రద్దు చేసింది. విద్యార్థులను విద్యాలయాలకు దూరం చేసింది. వ్యాపారాలు మూతపడ్డాయి. రోజువారీ కూలీల జీవితం నాశనం అయ్యింది. వలస కార్మికులు ఆకలితో అలమటించారు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, మతపరమైన ఉత్సవాలు నిలిచిపోయాయి. సామాజిక దూరం పాటించడం వల్ల ఒంటరితనం, భయం, నిరాశ వలన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వలస కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. జనతా కర్ఫ్యూ పేరుతో రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు వంటి రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఈ సామాజిక స్తంభనకు సంబంధించిన కరోనా నేపథ్య కథలు అనేకం వెలువడ్డాయి. వాటిలో డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి గారు రాసిన “కరోనా బలి” కథలో కరోనాతో మరణించిన నరేష్ ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లిన తల్లి నరసమ్మ కొడుకు శవంపై పడి ఏడ్చినప్పుడు:
“గిట్ల శవాన్ని ముట్టుకోవద్దు. గిప్పుడే లారీ వచ్చి శవాలను తీసుకుపోతుంది.” - (కరోనా బలి- పుట- 39)
అని నరసమ్మతో దవాఖాన మనిషి పలికిన మాటల్లో కన్నకొడుకును చూడడానికైనా అవకాశం లేకుండా సామాజికదూరం పేరుతో తల్లి కొడుకుల బంధం దూరమయ్యింది. అలాగే జానకీదేవి షామీర్ రాసిన “కరోనా... కరుణించే నా....” అన్న కథలో హైదరాబాద్ లో నివాసముంటున్న గోపాల్ కు సడన్ గా జ్వరం వచ్చి ముసుగుతన్నుకు పడుకోవడంతో ఏం చేయాలో తోచలేదు భార్య రాధకు. డాక్టర్ దగ్గరకు వెళ్దామని ఇద్దరూ మాస్కులు ధరించి మొదటిసారి యుద్ధానికి వెళుతున్నట్లుగా బయటకు వచ్చారు. కరోనా కారణంగా మూడు నెలల నుండి వాడని స్కూటర్ స్టార్ట్ అవ్వడానికి కొంతసేపు మొరాయించింది. స్కూటర్ తో వెళుతున్నప్పుడు నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడం, ఎదురుగా బోసిపోయినట్లుగా ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ చూడగానే బావురుమన్నది రాధ మనస్సు. లాక్డౌన్ నెపంతో సమాజం ఎలా స్తంభించుకుపోయింది అన్న దానికి:
“మూసివేసిన సినిమా హాల్స్, హోటల్స్, దుకాణాలు, జనసంచారం లేని పెట్రోల్ బంకులు... చూస్తూ... ఎప్పుడు యథాస్థితికి వస్తుందా అని అనుకుంటూ... ఏదైనా వాడితేనే కదా దాని ఉత్పత్తి పెరిగేదంటూ ఆలోచిస్తూ కూర్చుంది రాధ”. - (కరోనా.... కరుణించేనా-పుట-352)
ఈ సన్నివేశాలను కరోనా కాలంలో సామాజిక స్తంభనకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. అంపశయ్య నవీన్ గారు రాసిన “వినోదయాత్ర” కథలో వినోదం కోసం వినోద్, ప్రకాష్ రెండు రోజులు విహారయాత్రకు హైదరాబాదు నుండి ముంబైకి విమానంలో వెళ్లారు. అక్కడ టాక్సీ బుక్ చేసుకుని ముంబై మొత్తం చూసి తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో సిటీలో అకస్మాత్తుగా పెద్ద హల్చల్ కనిపించింది. అదే లాక్డౌన్. దీని కారణంగా:
“ఆరోజు వాళ్ళు ఆహోటల్లోనే ఉండిపోయారు. సిటీ అంతా కర్ఫ్యూ పెట్టినట్లుగా మారిపోయింది. రోడ్లమీద మనుషులుగాని, బస్సులుగాని, టాక్సీలుగాని, కార్లుగానీ ఏవీ కనిపించడం లేదు. ఎవర్నడిగినా హైదరాబాదుకు మేం రామనే సమాధానం” - (వినోదయాత్ర-పుట-60)
ఇలా సమాజం స్తంభించుకుపోవడంతో వినోద్, ప్రకాష్ ముంబైలో చిక్కుకుపోయి, అనేక వ్యయప్రయాసలకు గురై హైదరాబాద్ చేరేటప్పటికి జీవచ్ఛవాలుగా మారడంతో వినోదయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది.
శిరంశెట్టి కాంతారావు రాసిన “లొల్లి” కథలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న కుందేల్ని అపార్ట్మెంట్లో ఉన్నవాళ్లంతా “కరోనా తగ్గిపోయిందాకా మీ ఊరెళ్లిపోండి” అనడంతో భార్యాబిడ్డలతో కాలినడకన మూడు రోజులకు సొంతూరు చేరుకున్నాడు. అప్పటికే కరోనా భయానికి సామాజిక నిబంధన కారణంగా పక్క ఊరి వాళ్ళు ఎవరూ తన గ్రామానికి రాకుండా సరిహద్దులో కంపగొట్టారు. స్వగ్రామానికి చేరుకున్న కుందేలు కంపదీయమన్నప్పుడు:
“అయ్యో అట్లాగా! మీరైతే ఏ తిప్పలు బడో వచ్చిండ్రుగాని నేనీ కంపతియాల్నంటె పెద్ద గొల్లొచ్చి చెప్పాలబిడ్డ! ఇది కులం కట్టడి” - (లొల్లి -పుట- 59)
అన్నాడు అంజయ్య. ఇలా మనుషుల మధ్యనున్న సంబంధాలు సామాజిక దూరం పేరుతో స్తంభించుకుపోయాయి. కాంతారావు గారు రాసిన మరొక కథ “అసలు- నకిలి” లో బతుకుతెరువు కోసం ఫణిగిరి నుండి హైదరాబాదుకు వెళ్లారు వరలక్ష్మి, సంజీవరావు దంపతులు. ఎక్కడ పనిచేసినా చాకిరీ ఎక్కువ ఫలితం తక్కువ, బాగుపడాలంటే ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచనతో భార్య వరలక్ష్మి టైలరింగ్ షాపు, పక్క షట్టర్లో రడీమేడ్ డ్రెస్సెస్ పెట్టారు. రెండేళ్లు గడిచేటప్పటికీ బ్యాంకులో కొంత డబ్బు జమవ్వడంతో కార్ ట్రావెల్స్ వ్యాపారం మొదలుపెట్టారు. అంతా సాఫీగా నడిచిపోతుందనుకుంటున్న సమయంలో, మనుషులు కాలం చేతిలో కీలుబొమ్మలన్న సత్యాన్ని రుజువు చేస్తూ ఊహించని విధంగా పుట్టుకొచ్చిన కరోనా రక్కసి భూగోళమంతటా మృత్యు ఘంటికలు మోగించడంతో లాక్ డౌన్ విధించడం వలన:
“అంతర్జాతీయ స్థాయి విమానాల నుండి గ్రామస్థాయి ఆటోల దాకా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జనజీవనమే పూర్తిగా స్తంభించుకుపోయింది.” - (అసలు నకిలి-పుట-73)
దీంతో ప్రయాణికులు బయటికే కదలకపోవడంతో వరలక్ష్మి టూర్స్ అండ్ ట్రావెల్స్ మూతబడింది. ఇది సామాజిక స్తంభనకు నిలువుటద్దంగా ఉదాహరించవచ్చు. నల్లూరు రుక్మిణి గారు రాసిన “ఆదరువులేని” కథలో అంజనాదేవి కుమారులు ఇద్దరూ ఉద్యోగులుగా దూర ప్రాంతంలో ఉండటం వల్ల, కరోనా గురించి రమాతో మాట్లాడుతూ:
“మా పిల్లల్ని చూసి ఆర్నెల్లు దాటింది. ఈ దేశంలో వున్నారేగానీ, వాళ్లు రావడానికి లేదు మేం పోవడానికి లేదు, మాకేదన్నా అయితే చివరి చూపు కూడా నోచుకోలేకపోతామేమో! అంది విచారంగా.” - (ఆదరవులేని-పుట-7)
లాక్ డౌన్ అనేది తల్లికి పిల్లలు, పిల్లలకు తల్లి కాకుండా దూరమవుతూ సామాజిక స్తంభనకు గురిచేసింది.
4. ఆర్థిక సమస్యలు
కరోనా మహమ్మారి తెచ్చిన విలయాల్లో అతిపెద్దది ఆర్థిక సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పేరుతో వచ్చిన మహమ్మారి సమస్త మానవాళికి చెందిన ఒక సంవత్సర కాలాన్ని చీకటి కాలం చేసింది. కరోనా సమాజంలో భిన్న వర్గాలపై భిన్న ప్రభావాలను చూపింది. లాక్ డౌన్లో వ్యాపారాలతో పాటు ఎన్నో కంపెనీలు, స్కూల్లు, హోటళ్ళు, సినిమా హాల్లు మూతపడ్డాయి. కొన్ని సంస్థలు వేతనం లేని సెలవులు ఇస్తూ ఊళ్లకు పంపాయి. ఇలా ఎంతోమంది శ్రామికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. శ్రీశ్రీ కవితలాగా “అటు చూస్తే బిడ్డల ఆకలి-ఇటు చూస్తే అప్పుల వాళ్ళు” అన్నట్లుగా వారి ఆర్థిక పరిస్థితి “పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది” అన్న వాస్తవాలను చిత్రీకరించే ఆనవాళ్ళు కలిగిన కథలు కొన్ని దర్శనమిస్తాయి. ఉదాహరణకు, డాక్టర్ వి. త్రివేణి రాసిన “ముళ్ళ కంచె” కథలో ఎల్లవ్వది దేవపల్లి, ఇద్దరు కొడుకులు. భర్త చనిపోవడంతో ఉన్న నాలుగు ఎకరాలు ఇద్దరికీ పంచి ఇచ్చింది. తర్వాత పెద్ద కొడుకు నాగభూషణం దగ్గర ఆరు నెలలు, చిన్న కొడుకు రాజమల్లు దగ్గర ఆరు నెలలు ఉండటానికి ఒప్పందం చేసుకున్నారు. ఉన్న ఊళ్ళో ఉపాధి లేక బొంబాయి వలస వెళ్లిన నాగభూషణం డబ్బా దుకాణం పెట్టుకుని కుటుంబ పోషణ చేస్తుండగా తల్లి వాటా ప్రకారం బొంబాయిలో ఉన్న పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళింది. తిరిగి చిన్న కొడుకు దగ్గరకు రావాలనుకుంటుండగానే కరోనా వచ్చి లాక్ డౌన్ పడింది. దానితో నెలన్నర రోజులు ఎక్కువ కావడంతో నాగభూషణం ఆర్థిక స్థితి “మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డ చందంగా” మారింది. వెంటనే తమ్ముడు రాజమల్లుకు తల్లిని తీసుకెళ్లమని ఫోన్ చేసి:
“అర్థం చేసుకోరా... ఇక్కడ పరిస్థితేమి బాగాలేదు. పనులు లేక రెండు నెలలు అవుతుంది. తింటానికి తిండి లేదు. పైసలు లేవు. ఇంట్లో ఒకటే పోరు, ముగ్గురు పిల్లలు, మేమిద్దరం. అమ్మ బతకాలంటే కష్టంగా ఉంది రా.....” - (ముళ్ళ కంచె-పుట-225)
అంటూ కష్టాలు చెప్పుకోవడంలో ఇక్కడ నాగభూషణం తల్లికి భోజనం పెట్టలేనంత దయనీయంగా మారిన పరిస్థితి అగుపిస్తుంది. అలాగే డాక్టర్ దేవేంద్ర మారోజు రాసిన “పార్ట్ టైమ్ లెక్చరర్” కథలో కరోనా కాలంలో సామాజిక పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. టీవీ పెట్టి చూస్తే ఒక పార్ట్ టైం లెక్చరర్ డాక్యుమెంటరీ వస్తుంది. కరోనా వల్ల జీతం లేక కుటుంబ పోషణకు అరటి పండ్లు వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చూసిన అతని విద్యార్థులు స్పందించి కొంత ధన సహాయం చేశారు. ఈ పరిస్థితిలో పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్ సార్ వారి జీతాలు గురించి వీడియో కాన్ఫరెన్స్ లో ఇలా చెప్పాడు:
“మార్చ్ లో లాక్ డౌన్ మొదలైంది. ఆన్లైన్ క్లాసులు తీసుకున్నట్టు ప్రూఫులు ఉంటేనే ఏప్రిల్ నెల జీతాలు మాత్రమే ఇస్తామన్నారు. మళ్లీ క్లాసులు ప్రారంభానికి ఆరు నెలలు పట్టొచ్చు. ఈ ఆరు నెలలు మీరు ఎలాగోలా సర్దుకుపోవాలి”. - (పార్ట్ టైమ్ లెక్చరర్ -పుట-298)
అని గోవింద్ సార్ పలికిన మాటలు జీతాలు లేక దయనీయంగా కాలం వెళ్లబుచ్చుకుంటున్న పార్ట్ టైం లెక్చరర్స్ ఆర్థిక కష్టాలు స్పష్టంగా తెలియవస్తున్నాయి. తాళ్లపల్లి యాకమ్మ రాసిన “దుఃఖనది” కథలో నాగన్న, శాంతమ్మ దంపతులు ఇంటిదగ్గర ఇద్దరు పిల్లలను, వారికి తోడుగా నాగన్న తల్లిని ఉంచి బొంబాయికి వలస పోతారు. ఇద్దరు మనుషులు కూడా తిరగలేనంత చిన్న రేకుల గదిలో నివాసం. ఇంతలో లాక్ డౌన్ కారణంగా అక్కడ త్రాగడానికి నీళ్లు కూడా దొరక్కపోవడంతో 'ఏం బొంబాయో ఏమో దేవుడా... దూరపు కొండలు నునుపెక్కువన్నట్లు ఎక్కడ కూలి బాగా దొరుకుద్దని, నాలుగు పైసలు వెనకేసుకోవచ్చని ఆశతో పిల్లలను వదిలిపెట్టి వస్తిమి. ఇక్కడ పనుల్లేక పస్తులుంటిమి' అనుకుంటూ శాంతమ్మ చెవుల కమ్ములు అమ్మగా వచ్చిన వెయ్యి రూపాయలు పట్టుకొని సొంతూరికి నడక ప్రయాణం సాగించారు. ప్రయాణంలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోగా ఆకలితో అలమటిస్తూ కాళ్ళు బొబ్బలెక్కి అవి పగిలి రక్తాలు కారుతుండగా ఆకలి మంటలతో నీరసించి మార్గమధ్యంలో మరణించాడు నాగన్న. భర్తను పోగొట్టుకున్న శాంతమ్మ దుఃఖాన్ని దిగమింగుతూ ఎలాగైనా పిల్లల్ని చూడాలని ఆశతో బక్కచిక్కిన శవంలా ఇల్లు చేరిన శాంతమ్మను చూసి పరామర్శించిన అత్త శోకాలు తీసి ఏడుస్తూ:
“ఏం చెయ్యనే శాంతా! రోజు పిల్లలు నాయనమ్మ ఆకలలైతుందే అని ఏడుస్తుంటే కడుపు తరుక్కొని పోతుంది. నేనేమో మూడు కాళ్ల ముసలిని, కళ్ళు కనబడని కబోదిని. ఆ బడి నడిచినప్పుడు ఒక్క పూటన్న కడుపునిండ తింటున్నరు పిల్లలు అనుకున్న ఆబడి కూడ బందుబెట్టిరి, పిల్లల గోస తప్పకుంట ఆ దేవునికి తగులుతదే.....!” - (దుఃఖనది- పుట-51)
అని శాంతమ్మ అత్త పలికిన మాటల్లో నాగన్న కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కంటికి కట్టినట్లు అగుపిస్తున్నాయి. నిదానకవి నీరజ రాసిన “కరోనా కష్టాలు” కథలో ఒక నగరంలో “రెక్కాడితే గాని డొక్కాడని” ఎన్నో పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. కరోనా మహమ్మారి తెచ్చిన విలయం వారి జీవితాల్లో ఆకలి కేకలు వేయించింది. ఒక కాలనీలో అద్దెకుంటున్న రాములమ్మ, రంగయ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానం. వారి జీవనాధారమైన నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో ఎవ్వరూ ఊహించని రీతిగా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ ఇల్లు దాటి బయటకు రాకపోవడంతో వ్యాపారం నిలిచిపోయింది. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు “అమ్మ ఆకలి, అమ్మ ఆకలి” అని అలమటించడం చూసి రాములమ్మ ఎంతో కుమిలిపోయింది.
“ఈ చేతులతో ఎన్నో ఇడ్లీలు, దోసలు చేసి రోజూ ఎందరి ఆకలినో తీర్చాను. కానీ ఇప్పుడు కడుపున పుట్టిన పిల్లల ఆకలి తీర్చలేక పోతున్నాను”. - (కరోనా కష్టాలు-పుట-608)
అని బాధపడటంలో వారి కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులను చక్కగా చిత్రీకరించింది రచయిత్రి. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేస్తున్న వాళ్లది ఇదే పరిస్థితి. రాములమ్మ పక్క ఇంట్లో అద్దెకుండే కమలమ్మ భర్త తాగుబోతు. ముసలి తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. పది ఇళ్లల్లో పని మనిషిగా పనిచేస్తూ వారిపై ఆధారపడి, రెక్కల కష్టముతో కుటుంబ భారమంతా ఈడ్చుకొస్తుంది. అంతలోనే కరోనా రావడం వల్ల లాక్ డౌన్ విధించడంతో వారి కుటుంబ పరిస్థితి అతలాకుతలమైంది.
“కరోనా మూలంగా అపార్ట్మెంట్స్ లోకి పని మనుష్యులను రానిస్తారో, రానివ్వరో, ఒకవేళ రానివ్వకపోతే ఏం చేయాలి. కుటుంబాన్ని ఎలా పోషించాలి.” - (కరోనా కష్టాలు-పుట- 610)
ఇవే ప్రశ్నలు కమలమ్మను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఈ కథాంశంలో ముఖ్యంగా ఇళ్లల్లో పని చేసుకుంటున్న వారి జీవన వెతల్ని రచయిత్రి చక్కగా చిత్రీకరించింది. శిరంశెట్టి కాంతారావు గారి “కాలం నేర్పిన పాఠం” కథలో ఆంజనేయ శాస్త్రి గుడిలో అర్చకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో, కనీవినీ ఎరుగని విధంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్ డౌన్ కారణంగా జన జీవితమే స్తంభించిపోయింది. దీంతో ఆలయ పాలక కమిటీ వారు కానీ, భక్తులు కానీ, ఎవ్వరు కూడా గుడి ముఖం చూడడమే మానేశారు.
“మూడు నెల్లుగా జీతం డబ్బులు పైసా గూడా రాక ఇబ్బందులు పడుతున్న అర్చకుడి కుటుంబ పరిస్థితి దయనీయంగా తయారైయింది.” - (కాలం నేర్పిన పాఠం- పుట- 43)
ఇలా ఇంట్లో సరుకులన్నీ నిండుకోవడంతో, పూటకు ఆరు కంచాలు ఎట్లా లేపాలో తోచక ఆంజనేయశాస్త్రి పడుతున్న ఆర్థిక ఇబ్బంది ఈ కథలో చక్కగా చెప్పబడింది.
5. వృత్తి విచక్షణా రాహిత్యం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మన సమాజంలోని అనేక రంగాలలో ఉన్న లోపాలను వెలుగులోనికి తీసుకొచ్చింది. ముఖ్యంగా వృత్తిపరమైన బాధ్యతల్ని నిర్వర్తించడంలో కొన్ని వర్గాలు నిర్లక్ష్యం, విచక్షణారహితంగా వ్యవహరించడం క్షోభకు గురిచేసింది. వృత్తిధర్మాన్ని పాటించడంలో కొందరు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించినప్పటికీ, మరికొందరు డాక్టర్లు, పోలీసులు, కార్పొరేట్ ఆసుపత్రులవాళ్ళు, ట్రావెల్స్ వారు లాక్ డౌన్ కాలాన్ని అవకాశంగా మార్చుకొని వృత్తి పట్ల విచక్షణారాహిత్యంగా ప్రవర్తించే సందర్భాన్ని కథకులు తమ కథల్లో చిత్రించారు. ఉదాహరణకు శిరంశెట్టి కాంతారావు రాసిన “గంపగుత్త” కథలో రాత్రి నిద్రలో పక్షవాతమొచ్చి ఉదయం లేవకపోవడంతో గుణమ్మకు కరోనా వచ్చిందన్న భయానికి దగ్గరకు పోడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇంతలో సర్పంచ్ వచ్చి గుణమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాళ్ళ బావమర్ది టాటా మ్యాజిక్ బేరమాడగా అతడు 30 కిలోమీటర్ల దూరానికి:
“పది వేలిస్తే బండిబెడ్తా లేకుంటే లేదు” - (గంపగుత్త -పుట-24)
అంటూ నిర్మొహమాటంగా పలికాడు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసయ్యను బయటేవుంచి, తానొక్కడే లోపలికెళ్ళి డాక్టర్ తో గుణమ్మ విషయమంతా వివరించిన సర్పంచ్:
“మంచి సౌండ్ పార్టీ నే డాక్టర్ సాబ్! మీదేందో మీరు తీస్కోని నన్ను గూడా జర కనిపెట్టండ్రి! అసలు పట్నం పోతామనన్నోళ్లను కాదని మీ కాడికి పట్టుకొచ్చిన” - (గంపగుత్త-పుట-25)
అంటూ పక్కా కమిషన్ ఏజెంట్ గా మాట్లాడడం, అతని మాటలకు భరోసా ఇచ్చిన డాక్టర్, హైదరాబాదులో ఉంటున్న గుణమ్మ కూతురు ధనమ్మతో ఫోన్లో మాట్లాడి, గుణమ్మకు వైద్యమేమీ చేయకుండానే:
“ముందైతే యాబైవేలు నా గూగుల్ పేకి కొట్టండి! చాలా రకాల టెస్ట్ లు చేయించేదుంది. తరువాత అవసరాన్ని బట్టి చెప్తాను” - (గంపగుత్త -పుట-26)
అన్నారు డాక్టర్. సరిగ్గా వారం తర్వాత గుణమ్మ మరణించింది. శవాన్ని ఇవ్వడానికి పదిలక్షలడిగిన డాక్టరుతో:
“వారం రోజులకు పది లక్షలబిల్లా? హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో గూడా వారం రోజులుకింత బిల్లెయ్యరు. సరే బిల్లెంతేసినా మనిషన్నా దక్కిందాంటే అదీ లేదు”. - (గంపగుత్త-పుట-29)
అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది ధనమ్మ. చివరకు శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుండగా అంబులెన్స్ ను ఆపించిన ఎస్సై ధనమ్మతో:
“ఓ యాబై వేలియ్యండి మేడమ్! మీకే ఇబ్బంది లేకుండా మొత్తం ఏర్పాటుజేస్తాను”. - (గంపగుత్త -పుట-30)
ఎన్ని జెప్పినా వ్యవహారం వ్యవహారమే అన్నట్టుగా మాట్లాడాడు ఎస్సై. ఇలా టాటా మ్యాజిక్ వాడు, మధ్యవర్తిగా సర్పంచ్, డాక్టర్, ఎస్సై వృత్తి విచక్షణారహితంగా గుణమ్మ కుటుంబీకులను దోచుకోవడం ఈ కథలో అడుగడుగునా కనిపిస్తుంది. డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ రాసిన “దుఃఖనది” కథలో నాగన్న వలసపోతూ తన పిల్లలని, తల్లిని ఇంటి దగ్గర ఉంచాడు. బడిలో పెట్టే మధ్యాహ్న భోజనం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి లాక్ డౌన్ కారణంగా బడి మూసివేయడంతో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారిని ప్రజాప్రతినిధులు (నాయకులు) పట్టించుకోకపోగా వలస నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆకలి బాధను తాళలేక మార్గమధ్యంలో భర్తను కోల్పోయి ఇంటికి చేరిన శాంతమ్మ కూడా మరణిస్తుంది. అలాంటి సమయంలో మాత్రం:
“ఎప్పుడూ ఆ గుడిసెలవైపు తొంగిచూడని ప్రజా ప్రతినిధులంతా వచ్చి శవానికి పూలదండ వేసి పిల్లలను ఓదార్చుతున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చారు. నాయకులందరూ చనిపోయినవారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి వెళ్లిపోయారు”. - (దుఃఖనది-పుట-55)
ఇక్కడ రాజకీయనాయకుల బాధ్యతారాహిత్యం తేటతెల్లమవుతుంది. నల్లూరు రుక్మిణి రాసిన “ఆధరవులేని” కథలో సుదూరప్రాంతాల నుండి వలస వచ్చి మైనింగ్ గనుల్లో పనిచేస్తున్న కార్మికుల దుస్థితి లాక్ డౌన్ వల్ల కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు సొంతూరికి పోతామంటే నిరాకరించి, అక్కడే ఉండమంటున్నారు కానీ వారిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టారు మైనింగ్ వ్యాపారులు.
“అప్పటిదాకా! తమ గనుల్లో పనిచేస్తున్న కూలీలు తింటున్నారో? లేదో? చచ్చారా! బతికారా! అని పట్టించుకోలేదు యజమాని వెదవలు. వాళ్లేం తక్కువ వాళ్ళా రమా? ఒక్కొక్కప్పుడు కోటానుకోట్ల లాభాలు గడించే కార్పొరేట్లు మైనింగ్ వ్యాపారులు”. - (ఆదరువులేని-పుట-6)
అంత దుర్మార్గంగా వుంటరీ పెద్దపెద్ద వ్యాపారస్తులు. లాభాలే వాళ్ళ ధ్యేయం అంటూ అంజనాదేవి సంభాషణలో వ్యాపారుల బాధ్యతారాహిత్యాన్ని (విచక్షణారాహిత్యాన్ని) చూపించింది రచయిత్రి.
6. విలువల పతనం
కరోనా మహమ్మారి తెచ్చిన విలయాలలో విలువల పతనం ఒకటి. ఈ మహమ్మారి కేవలం ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాకుండా, సమాజంలో మనిషి వ్యక్తిగత జీవన శైలిలో విలువలపై పెద్ద ప్రభావం చూపింది. కరోనా సమయంలో సాటి మనిషికి సహాయం చేసి మానవ విలువలను నిలబెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే కావలసిన వారిని కూడా విడిచిపెట్టుకొని వారికి దూరంగా ఉంటూ విలువల పతనానికి దారి తీసిన సందర్భాలనూ చూడవచ్చు. ఉదాహరణకు డాక్టర్ కె.వి. కృష్ణకుమారి రాసిన “మానవత్వమా నువ్వెక్కడ?” కథలో యశోదాకు ఉన్న ఒక్కింటిని తన కొడుకు ప్రసాదదుకి రాసిచ్చింది. తాను చూపించే ప్రేమకు వాళ్లు తననెప్పుడూ దూరంగా పెట్టరని, ప్రేమగా చూసుకుంటారని యశోద నమ్మకం. కాని యశోదకు కరోనా సమయంలో మామూలుగా ఆయాసం, జలుబు వస్తే, అది కరోనానే అని అనుమానించి కోడలు రమణి తమ పిల్లల్ని దగ్గరకు పోనివ్వకుండా అత్తకు దూరంగా పెట్టింది. వాళ్ల అనుమానానికి యశోద మానసికంగా, శారీరకంగా మరింత కృంగిపోవడంతో, వాళ్ల అనుమానానికి మరింత బలం వచ్చి ప్రసాద్ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఏవో కొన్ని పరీక్షలు చేయించి, రెండు ఆటోలు మాట్లాడి ఒక ఆటోలో తల్లిని ఎక్కించి, ఎక్కడో దూరంగా ఆపించి, ఆమె చేతిలో కొంత డబ్బు ఉంచి:
“అమ్మా! నీకు కరోనా అని అనుమానంగా ఉంది. ఇంట్లో పెట్టుకోదలచుకోలేదు. పిల్లలున్నారు కదా.... అంటూ దండం పెట్టి వెళ్లిపోయాడు”. - (మానవత్వమా నువ్వెక్కడ-పుట-158)
తల్లి మాత్రం ఆటోలో తిరిగి ఇంటికి వెళ్ళగలదు కానీ ఎవరికోసం వెళ్లాలని అచేతనరాలైంది. కన్నతల్లిని కూడా ఈ విధంగా విడిచిపెట్టడం ప్రసాద్ లో విలువల పతనం కనిపిస్తుంది. బలభద్రపాత్రుని రమణి రాసిన “కర్మ” కథలో అవధాని గారి ఇంటికి రాత్రిపూట మాస్క్ తో, తెల్లని జుట్టుతో, సన్యాసిలా కనిపిస్తున్న వ్యక్తి వచ్చి:
“ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా బాబూ.... తెల్లారే వెళ్ళిపోతాను... హోటల్స్ కూడా లేవు” - (కర్మ-పుట-171)
అన్నాడు. దానికి సమాధానంగా అవధాని గారు, వాళ్ల భార్య (కాత్యాయని) ససేమిరా అంటూ తలుపు వేసెయ్య బోయారు. బాబూ వూరకే వద్దు, వెయ్యి రూపాయలిస్తాను అనడంతో “వెయ్యి రూపాయలు” అన్నమాటలు కాత్యాయినికి ఆశ పుట్టించింది.
“ఏవండీ అసింటా పడుకోమనండి అంది భర్త చెవిలో” - (కర్మ-పుట-172)
డబ్బులు అనగానే ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చిన పరిస్థితిలో విలువలు దిగజారడం అగుపించును. శిరంశెట్టి కాంతారావు గారి “గంపగుత్త” కథలో గుణమ్మకు ఆరోగ్యం బాగులేక గ్రామస్తులంతా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన బిడ్డ ధనమ్మను తల్లిని చూడడానికి రమ్మని ఫోన్ చేసినప్పుడు:
“అమ్మో! హైదరాబాద్ నిండా కరోనా కేసులు బాబాయ్! మీ అల్లునికి అసలే ఒంట్లో మంచిగలేదు. నాకూ మోకాల్ల నొప్పులు, అడుగుదీసి అడుగెయ్యలేకపోతున్న ఏదన్నజేసి మీరే ఎట్లనో గట్ల పేటకు తీసుకుపొయ్యి ఆసుపత్రిల జాయిన్ జెయ్యండ్రి”. - (గంపగుత్త-పుట-22)
అనడంలో తల్లి పిల్లల మధ్య విలువలు పతనం స్పష్టమగును. కాంతారావు రాసిన “రోగం దానవరూపేణ” కథలో నారాయణమ్మ భర్త మరణించడంతో పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తుంది. ఒకానొక సమయంలో నారాయణమ్మకు జలుబు, దగ్గు, జ్వరమొచ్చింది. వైద్యం చేయించడానిక నాగమ్మ పెద్ద కొడుకు ఆర్.యం.పి డాక్టర్ ను తీసుకురాగా మంచం దగ్గరికి రాకుండానే ఇది కరోనా కేసులాగుంది అనడంతో:
“ఆమె ఏడుపు వింటూనే నాగమ్మ ఇంటి వాళ్ళంతా చప్పున తమ వాటాలోకెళ్ళి తలుపేసుకున్నారు” - (రోగం దానవరూపేణ-పుట-50)
తర్వాత ఆసుపత్రిలో చేర్పించి నారాయణమ్మకు కరోనా వచ్చిందని చెల్లెలి కొడుక్కి ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడు:
“ఆమె, మాకూ పెద్దమ్మే మీకు పెద్దమ్మే గాని, మీరు మీరు పాలోళ్ళు. మంచైన, చెడైనా మీకు బాధ్యతుంటది గాని మాకేముంటది?” - (రోగం దానవరూపేనణ-పుట-52)
అని నాగమ్మ పెద్ద కొడుకుతో పలికిన మాటలలో మానవీయ విలువలు ఎంత దిగజారిపోయాయో స్పష్టమగును.
7. భయం
కరోనా మహమ్మారి సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన విషగుళిక. కక్కలేక మింగలేక జీవనం సాగిస్తున్న సమయంలో ఓ నిశ్శబ్దం విప్లవంలా మన మధ్యకు ‘లాక్ డౌన్’ వచ్చి చేరింది. వేగంగా పయనిస్తున్న సామాజిక, సాంకేతిక ప్రగతికి ఒక్కసారిగా బ్రేక్ పడటంతో సమాజం భారీ కుదుపులకు గురై అనిశ్చితితో కూడిన భయం ఏర్పడింది. సమస్త మానవాళి భయం గుప్పట్లో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి భయానక సంఘటనలకు సంబంధించిన ఆనవాళ్ళు కరోనా నేపథ్య కథల్లో పరిశీలించవచ్చు. డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ రాసిన “దుఃఖనది” కథలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన నాగన్న, శాంతమ్మ దంపతులు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సొంతూరికి ప్రయాణమై వస్తున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ, మార్గమధ్యంలో నాగన్న స్పృహ తప్పి కుప్పకూలిపోయినప్పుడు భర్త శవాన్ని ఒడిలో పెట్టుకొని:
“ఏందయ్యా మాట్లాడవు, ఉలుకు పలుకు లేదు, చీకట్లో భయంగా వుందయ్యా ఒక్క మనిషి కూడా దరిదాపులో కనబడడం లేదూ.... ఏమయ్యా.... ఏమయ్యా! అంటూ దిక్కులు పిక్కటిల్లెలా అరిచింది శాంతమ్మ, శవాన్ని ఒడిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటు రోధించింది ఒంటరిగా” - (దుఃఖనది -పుట -51)
ఈ సంఘటనలో శాంతమ్మ పడిన వేదన, దుఃఖంతో కూడిన భయం వర్ణనాతీతం. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి రాసిన “కంచె” కథలో కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పుడు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న రమేష్ హాస్టల్ మూసి వేయడంతో పట్టణంలో ఉండలేక పల్లెకు పోలేక “ముందు నుయ్యి వెనుక గొయ్యి” చందంగా తన ప్రయాణం సాగిస్తున్నప్పుడు:
“సాటి మనిషిని చూసి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని తనలో తానే అనుకుంటూ భయం భయంగానే వాహనం ఎక్కి కూర్చున్నాడు” - (కంచె-పుట-192)
ఎక్కడికి వెళ్ళినా కరోనా రక్కసి కోరల్లో చిక్కుకునేలా ఉందని భయానికి గురైన రమేష్ పరిస్థితిని చక్కగా చిత్రీకరించింది రచయిత్రి. శిరంశెట్టి కాంతారావు రాసిన “ఆ నలుగురు” కథలో భవన నిర్మాణ కార్మికులుగా వలసపోయిన వారు లాక్ డౌన్ కారణంగా కరోనాకు భయపడి తిరుపతి నుండి ఊళ్ళోకి వచ్చారు. వచ్చిన వారం రోజులకు వాళ్లల్లో నలుగురికి కరోనా రావడంతో:
“గవర్నమెంట్ ఆసుపత్రి వాల్లొచ్చి వాళ్లను పట్టుకుపోయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఐసోలేషన్లో పెట్టారు. దెబ్బకు ఊరంతా భయంతో బెంబేలెత్తిపోతుంది.” - (ఆ నలుగురు- పుట-37)
ఇలా ఆసుపత్రులో వలస కార్మికులు, గ్రామంలో ప్రజలు భయం గుప్పట్లోకి వెళ్లిపోయిన సన్నివేశాలును స్పష్టంగా చిత్రీకరించారు రచయిత. కాంతారావు రాసిన “అపోహ” కథలో కరోనా కారణంగా విద్యార్థులు తమ అమూల్యమైన విద్యా సమయాన్ని కోల్పోయారన్న నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని స్కూల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టిన సందర్భంలో:
“మెస్సేజ్ చదువుకున్న ఉపాధ్యాయులంతా భయం భయంగానే పాఠశాలకు వెళ్లి ఆన్లైన్ క్లాసులు చెప్పి వస్తున్నారు”. - (అపోహ-పుట-95)
ఈ సమయంలో మేనేజ్మెంట్ మెసేజ్ చూసిన వాళ్లంతా ఇంటి నుండి అడుగు బయటకు పెట్టడమంటేనే కరోనా వచ్చి చస్తామన్న అపోహతో కూడిన భయం ఉపాధ్యాయులను ఆవరించింది. మణి వడ్లమాని రాసిన “భయం భయం” కథలో కృష్ణ వాళ్ళ అమ్మగారికి దగ్గుతో పాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం లాంటివి కనిపించడంతో కరోనా ఏమో అన్న భయంతో అడుగడుగునా ఇంటిల్లపాది భయపడుతూ చివరికి:
“కరోనా అని పేరు ఉచ్చరించినా అంటుకుపోతుందేమో అనే భయం కలుగుతుంది”. - (భయం భయం-పుట-250)
ఇలా కరోనా ఆ కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమస్త మానవాళికి చెందిన కుటుంబ వ్యవస్థను చిన్నాబిన్నం చేస్తూ భయం గుప్పట్లో నెట్టింది. కరోనా తెచ్చిన విలయాన్ని గురించి సగటు వ్యక్తుల సంభాషణకు ఉదాహరణగా నల్లూరి రుక్మిణి రాసిన “ఆదరువులేని” కథలో అంజనాదేవి, రమ పాత్రలు కనిపిస్తాయి. వారిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో....
“అవును రమా! టీవీ చూస్తున్నా, పేపరు చదువుతున్నా ఆందోళనగా వుంటోందమ్మా! అసలు ఒకరితో ఒకరం మాట్లాడితేనే వైరస్సు ఎక్కడ అంటుకుంటుందోనని భయంగా వుంది”. - (ఆదరువులేని-పుట-5)
అనే అంజనాదేవి మాటల్లో భయము వ్యక్తమవుతుంది. ఆమె మాటలు విన్న రమ కూడా:
“చివరకు శవాలును స్మశానంల్లోకి రాకుండా చేస్తుంటే... ఈ రోగం ఎంత భయంకరమైందో కనిపించడం లేదూ”! - (ఆదరువులేని-పుట-5)
అని సంభాషించడం సగటు సామాజిక పరిస్థితికి ఈ మాటలు దర్పణం పడతాయి. ఇలా కరోనా సమాజాన్ని చిగురుటాకులా వణికిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని అడుగడుగునా తేటతెల్లమవుతుంది.
ఉపసంహారం
- కరోనా మహమ్మారి మానవాళి చరిత్రలో ఒక మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది. ఈ మహమ్మారి ముగిసినా, దాని ఆనవాళ్ళు మానవ హృదయాల్లో, మన సంస్కృతి, సామాజిక వ్యవస్థ, సాహిత్యంలో చాలాకాలం పదిలంగా ఉండిపోతాయి.
- ఆకస్మిక లాక్ డౌన్ జనాల ప్రణాళికను తారుమారు చేసింది. కుటుంబ సభ్యులను విడదీసింది. అత్యవసర ప్రయాణాలను రద్దు చేసింది. పెద్దవాళ్ళను పిల్లల నుండి విడదీసింది.
- ఆర్థిక అసమానతలను కలిగించింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. యువతరం కాన్పులకు, కష్టాలకు పెద్దల అండ లేకుండా చేసింది.
- రకరకాల అనుమానాలు, సందేహాలూ, భయాలతో కొందరిని మానసికంగా కుంగదీసినది. మరికొందరిని చావు దిశకు మళ్లించినది.
- మొత్తంగా కరోనా కాలం మనిషి మానవత్వాన్ని అంచనా వేయగలిగిన ఓ కొలమానమైంది. అనారోగ్యాలు, చావులు సందర్భాలలో కూడా బంధుమిత్రులు, ఆత్మీయుల పలకరింపులకు దూరమై ఆదుకునే వాళ్ళు లేక నానా యాతనలు పడ్డారు.
- వలస కార్మికులు సొంత గూడుకు చేరుకోవడం గగనమైంది. ఇలా కరోనా మహమ్మారి తెచ్చిన విలయాన్ని, కరోనా నేపథ్య కథా సాహిత్యంలో దాని ఆనవాళ్లను కవులు, రచయితలు, రచయిత్రులు కంటికి కట్టినట్లుగా విశ్లేషించారు.
సూచికలు
- కరోనా బలి - 39.
- వినోదయాత్ర - 60.
- లొల్లి - 59, 60.
- అసలు-నకిలి - 73.
- ముళ్ళ కంచె - 225.
- పార్ట్ టైం లెక్చరర్ - 298.
- దుఃఖనది - 51, 55.
- కరోనా కష్టాలు - 608, 610.
- గంపగుత్త - 21, 25, 26, 29, 30.
- భయం భయం - 250.
- ఆదరువులేని - 5, 6, 7.
- కర్మ - 171, 172.
ఉపయుక్తగ్రంథసూచి
- అన్నపూర్ణ, పాతూరి. (సంపా.) వడలి రాధాకృష్ణ. కాలుతున్న కాలం. రెయిన్బో గ్రాఫిక్స్, 2021.
- కాంతారావు, శిరంశెట్టి. కాలం నేర్పిన పాఠం. (కథాసంపుటి) శ్రీశ్రీ ప్రింటర్స్, 2021.
- పవన్ కుమార్, కోడం. కరోనా@లాక్ డౌన్360, లయ పబ్లికేషన్స్ అక్టోబర్
- రజిత, అనిశెట్టి. కొమర్రాజు రామలక్ష్మి, బండారు సుజాత (సంపాదకులు)- కరోనాకాలం కథలు (శతాధిక రచయితల కథలు, కథనాలు) దీప్తి ప్రింటర్స్, 2020.
- రామకృష్ణ, అడపా. కరోనా కల్లోలం కథలు. డిసెంబర్
- విజయలక్ష్మి, అత్తలూరి. లాక్ డౌన్ వెతలు. రాజేశ్వరి ప్రచురణలు, జూలై
- శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, 1998.
- సిమ్మన్న, వెలమల. సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం, 2005.
- సుధాదేవి, తెన్నేటి (సంక.) - కొత్త (కరోనా)కథలు-4, కథా సంకలనం. వంశీ ప్రచురణ జూన్ 2021.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

