headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. యయాతి నవల: విమర్శనాత్మక విశ్లేషణ

డా. టి.డి. రాజన్న తగ్గి

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కన్నడ శాఖ,
కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయ
కలబురగి, కర్నాటక.
సెల్: +91 8904446344, Email: tdrajannathaggi@cuk.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 15.11.2025        ఎంపిక (D.O.A): 30.11.2025        ప్రచురణ (D.O.P): 01.12.2025


వ్యాససంగ్రహం:

భారతీయ సాహిత్య పరంపరలో పురాణ, చరిత్రలను ఆధునిక కాలఘట్టంతో పోల్చి చూసే ప్రయత్నం అనాది కాలంనుండి నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. ఇలా పురాణ కథనాలలోని పాత్రలను, జీవిత విలువలను మళ్ళి మళ్ళి సృజించే ప్రయత్నం జరుగుతూనే వస్తుంది. కాలకాలానికి విలువలను తరలించే ప్రయత్నంలో ఇలాంటి మరుసృష్టులు మొదలయ్యాయి. ఇలా పురాణ వస్తువుని ఆధారంగా పెట్టుకుని మరాఠి భాషలో స్వతంత్రంగా రాసిన నవల యయాతి. ప్రసిద్ధ ఇది మరాఠి రచయిత విష్ణు సుఖారాం ఖాండేకర్ 1959 లో రాసిన నవల. ఈ నవల పైచూపుకి నవలలా కనిపించినా కథ చెప్పే తీరుని బట్టి ఇదొక ఆత్మకతల గుచ్ఛం అనిపిస్తొంది. ఈ నవలలో పాత్రలే (యయాతి, దేవయాని, శర్మిష్ఠ) తమ కథను తాము చెప్తూ కొనసాగిస్తాయి. ఒకే కథను మూడు పాత్రలు విభిన్న దృక్పథంతో చెప్పే విధానమే ఈ నవల విశేషత. ఈ నవలను ఆధారంగా చేసుకుని ʼయయాతి : నవల విశ్లేషణʼ అనే శీర్షిక రూపొందించుకొని భిన్న దృక్పథంతో వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ వ్యాసంలో ఒకే కుటుంబలో వున్న ముగ్గురి వ్యక్తుల మనస్తత్వాలూ ఎలా భిన్నంగా మారినాయి అనే విషయన్ని విశ్లేషించడం జరిగింది. ఇంతకు మునుపు ఈ నవలను ఆధారంగా చేసుకుని ʼమహాక్షత్రియʼ అనే నవల, ʼయయాతిʼ అనే నాటకం,ʼ సంజీవినిʼ అనే నాటకాలు వచ్చినాయి. వీటన్నిటిని ఆధారంగా తీసుకొని యయాతి, దేవయాని మరియు శర్మిష్ఠ ఈ ముగ్గురి పాత్రను విశ్లేషణ చేయడం జరిగింది. ఈ వ్యాసాన్ని మనోదృక్పథంతో విశ్లేషించడానికి, నవలకు ప్రేరణ, ఆత్మకథలుగా కనిపించే నవల, నవల శిల్పం, యయాతి వ్యక్తిత్వం, యయాతి భోగాపేక్షలు, దేవయాని మరియు శర్మిష్ఠల భిన్న స్వభావం, స్నేహం ద్వేషంగా మారినది, స్వార్థంతో కూడిన పెళ్ళి, భిన్న ధ్రువాలు - అనే ఉపశీర్షికలతో విభజించుకున్నాను. జీవితంలో పెళ్ళి, బంధుత్వ, స్వార్థం, ప్రేమ, లైంగికాపేక్ష, ద్వేషం అనేవి ఈ నవలలో ఎలా ఉన్నాయి అనేవి మనోదృష్టితో విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసోద్దేశం.

Keywords: యయాతి, దేవయాని, శర్మిష్ఠ, కచ, ప్రేమ, స్వార్థ, ద్వేషం, ప్రతీకారం, శాపం.

1. ప్రవేశిక

భారతీయ సాహిత్య పరంపరలో పురాణ, చరిత్రలను ఆధునిక కాలఘట్టంతో పోల్చి చూసే ప్రయత్నం అనాది కాలం నుండి నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. ఇలా పురాణ కథనాలలోని పాత్రలను, యుద్ధపు కథనాలను, రాజు-రాణుల ప్రేమ కథలను, జీవిత విలువలను మళ్ళీ మళ్ళీ సృజించే ప్రయత్నం జరుగుతూనే వస్తుంది. కాలకాలానికి విలువలను తరలించే ప్రయత్నంలో ఇలాంటి మరుసృష్టులు మొదలయ్యాయి.

పురాణ వస్తువులను ఆధునిక దృక్పథంతో తీసుకురావడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి: పురాణ కథలను ఉన్నది ఉన్నట్టే తీసుకురావడం. రెండవది: రచయిత పురాణ వస్తువును కాలానికి, తన ఆలోచనకు తగినట్టు మార్చుకుని, చిన్న చిన్న మార్పులు చేర్పులతో పునఃసృష్టించడం. మొదటి దానిలో భాష తప్ప మిగతాదంతా యథావత్ చిత్రణ మాత్రమే ఉంటుంది. కానీ పునఃసృష్టిలో మాండలికంతో పాటు కాలానికి తగ్గట్టు తన కల్పనకు చాలా సవాళ్లుంటాయి. ఇలాంటి ప్రయత్నాన్ని కన్నడ జాతీయ కవియైన కువెంపు ‘ప్రతిమా విధానం’ అంటారు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని భాషలలోనూ జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.

ఇలా పురాణ వస్తువుని ఆధారంగా పెట్టుకుని మరాఠీ భాషలో స్వతంత్రంగా రాసిన నవల ‘యయాతి’. ఇది ప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సుఖారాం ఖాండేకర్ 1959లో రాసిన నవల. ఈ నవలకు మూల ఆధారం మహాభారతంలోని ఆదిపర్వంలో కనిపించే యయాతోపాఖ్యానంలోని కథ. అలాగే ఇది భాగవతంలో కనిపించే ఉపకథ కూడా.

2. నవలకు ప్రేరణ

ఈ నవల రాయడానికి ప్రేరణ అంటే రచయిత ఖాండేకర్ ఎల్లప్పుడూ చదువుతున్న పురాణగాథలు. ఇలా చదివేటప్పుడే యయాతి గురించి రాయాలని స్ఫురించింది. కానీ పురాణ వస్తువుని ఆధునిక దృక్పథంతో రాస్తే బాగుంటుందని చాలా కాలం ఆలోచించి రాసినట్టు రచయితే చెప్పాడు. ఇలా పురాణ పాత్రలను ఎంపిక చేసుకున్నప్పుడు రచయితకు ఎదురైన సమస్య ఏంటంటే, పురాణంలో ఉండే ప్రముఖ పాత్రలను ఎంపిక చేసుకోవాలనా? లేక ఉప ఆఖ్యానంలో కనిపించే ప్రముఖం కాని పాత్రలను ఎంపిక చేసుకోవాలనా? అనేది.

పురాణపు ప్రధాన పాత్రలను ఎంపిక చేసుకుంటే అక్కడ సృజన ప్రక్రియకు, ఆధునిక స్పర్శకు అవకాశాలుండవు. ఎందువలన అంటే ఇలాంటి వస్తువులుగానీ, పాత్రలు గానీ పాఠకుల మనస్సులో మార్చలేని కొన్ని నమ్మకాలు, నిర్ణయాలు పాతుకుపోయి ఉంటాయి. కాబట్టి రచయిత తన కల్పనకు తగినట్టుగా మనోస్వేచ్ఛగా మార్చడానికి వీలుండదు.

అందువలనే పురాణాలలో కనిపించే ఉప ఆఖ్యానంలోని యయాతి పాత్రను స్వీకరించి తమ సృజనక్రియతో మెరుగుపరచిన నవలే ఈ ‘యయాతి’. యయాతి పాత్రను తన నవలకు వస్తువుగా తీసుకోవడానికి ఇది ఒక కారణమైతే, మరొక కారణం - ఒక తండ్రి తను చేసిన తప్పిదాలకు ఫలితంగా పిల్లలకూ శాపం తగలడం, ఒక వ్యక్తి తన వృద్ధాప్యాన్ని కొడుకుకి ఇచ్చి కొడుకు యౌవనాన్ని తను తీసుకోవడం అనేది వింతగా ఉండటం ఈ రచయితకూ చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఈ రెండు ఆసక్తుల వలన రూపొందిన నవలే ఈ యయాతి.

3. ఆత్మకథగా కనిపించే నవల

ఈ నవల పైచూపుకి నవలలా కనిపించినా, కథ చెప్పే తీరుని బట్టి ఇదొక ఆత్మకథల గుచ్ఛం అనిపిస్తుంది. ఈ నవలలో రచయిత కథను చెప్పడం కన్నా అందులో ఉన్న పాత్రలే (యయాతి, దేవయాని, శర్మిష్ఠ) తమ కథను తాము చెప్తూ కొనసాగిస్తాయి. నవల కథాంశం ఒకటే అయినా చెప్పే తీరుని బట్టి ఇందులో మూడు ఆత్మకథలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఒకే కథను మూడు పాత్రలు విభిన్న దృక్పథంతో చెప్పే విధానమే ఈ నవల విశేషత అంటే అతిశయోక్తి కానే కాదు.

“వాస్తవానికి నేను ఒక రాజునా? కాదు, ఒకప్పుడు మాత్రమే రాజును.” (1)

అనే యయాతి ఆత్మవిమర్శ మాటలతో మొదలయ్యే ఈ నవల,

“కామం, ధర్మం గొప్ప పురుషార్థాలు, చాలా ప్రేరణాత్మకమైన పురుషార్థాలు.” (2)

అనే యయాతి ప్రబుద్ధ మాటలతో ముగుస్తుంది. నవల ఆరంభం, ముగింపు యయాతి మాటలతోనే జరిగినా కూడా నవల మధ్యలో దేవయాని, శర్మిష్ఠ ఈ ఇద్దరూ కథను చెప్పే బరువుని తామూ మోస్తారు. వీరూ అదే కథను తమ కోణంలో చెబుతున్నట్టు నవల కొనసాగుతుంది.

ఈ నవల వస్తువు చాలా చిన్నదైనా, వివరణ మాత్రం చాలా పెద్దది. నవలలో ఈ పై చెప్పబడిన ముగ్గురూ ఒకే సంఘటనను మూడు భిన్న దృక్పథాలతో చెబుతూ పోవడం వలన నవల విస్తారమవుతూ సాగుతుంది. ఇది పాఠకుల మనస్సును ఆకట్టుకుంటూనే నడుస్తుంది.

4. నవల శిల్పం

ఈ నవల శిల్పం చాలా భిన్నంగా రూపుదిద్దుకుంది. ఇందులోని పాత్రలు వాళ్ళు తమ కథను వర్తమానం నుండి ప్రారంభించి, భూతకాలానికి తీసుకెళుతాయి. ఇక్కడ యయాతి గానీ, దేవయాని గానీ, శర్మిష్ఠ గానీ అందరూ తమ జీవితంలో అనుభవించిన సుఖ-దుఃఖాల, బాధా-బంధుత్వాల సంగతులను స్వగతపు తీరులో చెబుతారు. కొన్ని సమయాలలో అవి ఆత్మవిమర్శగా కూడా కనిపిస్తాయి. ఆయా పాత్రలు స్వయంగా ఆత్మావలోకనం చేసుకుంటున్నట్టు అనిపిస్తాయి. ఈ నవల శిల్పం గొప్పతనమేమిటంటే కథను ఒక్కరు ప్రారంభిస్తే మరొక్కరు అక్కడి నుండి కొనసాగిస్తారు. ఈ ముగ్గురూ తమరి కథను తాము చెప్పినా అందరూ ఒకే కథను కొనసాగించడం విశేషం. ముగ్గురి మాటల తీరు ప్రత్యేకంగానూ, భిన్నమైనదిగానూ ఉన్నా కూడా ఒకే కథ వేర్వేరు కోణాల్లో కొనసాగుతూ ఉంటుంది.

ఈ నవల వస్తువు రచయిత చెప్పే మాటలతో చూస్తే ఇది యయాతి అనబడే రాజు కామపు కథ. దేవయాని కుటుంబ కథ, తన ప్రతీకారపు కథ. శర్మిష్ఠ ప్రేమ కథ. కచుడి దార్శనిక తత్వపు కథ. పురుని త్యాగపు కథ… ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉన్నట్టు ప్రతి పాత్రా విశేషమైన స్వభావం గలవాటిలా కనిపిస్తాయి.

5. యయాతి వ్యక్తిత్వ పరిచయం

కథ ప్రారంభమయ్యేది మాత్రం యయాతి తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. తను కథను తన గత జీవితం నుంచి ప్రారంభిస్తాడు. ఆ కథలో యయాతి ఒక రాజు. కానీ కథ చెబుతున్న సమయంలో తను రాజు కాదు. అంటే తను రాజుగా ఉన్నప్పటి కాలం కథను చెబుతాడు. అంటే వర్తమానంలో నించుని భూతకాలం కథను చెబుతూ వెళుతాడు. అది ఎలా అంటే తానొక భ్రమ నుండి బయటపడిన దార్శనికుడిలా, తను ఎనలేని సుఖభోగాలను అనుభవించాలని కలగన్నా కూడా అవి వీలుకాలేదనే అసంతృప్త మనస్సుతో కథను ప్రారంభిస్తాడు. తను క్షణిక ఇంద్రియ సుఖాపేక్షల భ్రమల వెనుక పరిగెత్తే సామాన్య ప్రతినిధిగా ఉండేవాణ్ణని వినిపిస్తూ పోతాడు ఈ యయాతి.

ఇప్పుడు కథ చెబుతూ ఉన్న యయాతి వ్యక్తిత్వానికీ, కథలో ఉన్న యయాతికీ చాలా తేడాలు కనిపిస్తాయి. కథను వినిపించే యయాతి చాలా ప్రబుద్ధుడు, తెలివిగలవాడు, విశ్వాన్ని తెలుసుకున్నవాడు, భోగసుఖాలు ఎన్నటికీ తీరని దాహమని స్వయంగా తెలుసుకున్నవాడు. కానీ కథలో ఉన్న యయాతి లోలుపుడు, ఇంద్రియాపేక్ష గలవాడు, లంపటుడు, సుఖాన్ని వెంబడించి చాలా ప్రమాదాలను మీదకు లాక్కున్నవాడు. ఎల్లప్పుడూ అసంతృప్తితోనే ఉన్నవాడు.

ఈ అసంతృప్తి అనేది అతను బాల్యం నుంచీ పోషించుకుని వచ్చిన ఒక మనస్తత్వం. ఎందుకంటే చిన్నతనంలో ఎదురైన చాలా సంగతులు అతని మనఃస్థితిని మార్చివేస్తాయి. అందులో ఒకటి: తన తండ్రికి అగస్త్య అనబడే ఋషి నుండి వచ్చిన,

“ఈ నహుషుడు, ఇతని కొడుకులు ఎన్నటికీ సుఖంగా ఉండబోరు.” (3)

అనే శాపం. రెండవది: యయాతి అగ్ర సహోదరుడైన యతి అనేవాడు ఈ శాపపు కారణం వలన తను రాజకుమారుడైనా, భవిష్యత్తులో తనే రాజు కావలిసినవాడు అని తెలిసినా కూడా అంతఃపురాన్ని త్యజించి సన్యాసిగా మారడం. మూడవది: అతని తల్లి తన సౌందర్యం నశిస్తుందని శిశువుగా ఉన్న యయాతికి రొమ్ముపాలు ఇవ్వకుండా దాసి-పరిచారికలతో పాలు తాపించడం. ఇవన్నీ ఇతని మనస్సులో చాలా వ్యతిరేకతను రేకెత్తిస్తాయి. అప్పట్లో తన తల్లి మీద ఎంత కోపం ఉన్నదంటే ఒకవేళ

“ఋషిమునులలా తనకూ శపించే శక్తి సామర్థ్యం ఉండి ఉంటే తల్లిని శపించి శిలలా చేసేవాడిని.” (4)

అనిపించేంతగా. కాబట్టి వీటన్నిటి నుండి విముక్తుడు కావడానికి తన బాల్య, యౌవన దశలో చాలా సాహసపు ప్రక్రియలలో, ప్రేమ-ప్రణయం లాంటి సుఖభోగాలలో పూనుకుంటాడు.

6. భిన్న స్వభావం గల దేవయాని, శర్మిష్ఠ

ఇలాంటి మనస్థితిలో ఉన్న యయాతి జీవితంలోనికి మరి రెండు పాత్రలు ప్రవేశిస్తాయి. ఆ పాత్రలే ‘దేవయాని’, ‘శర్మిష్ఠ’. ఈ రెండు పాత్రలూ చాలా భిన్న స్వభావం గల పాత్రలు. ఈ ఇద్దరిలోను ప్రత్యేకమైన అహంకారాలు చోటు చేసుకున్నాయి. దేవయానికి - తను బ్రాహ్మణ కన్య, సౌందర్యానికి అధిదేవత అనే అహం. అదిగాక సంజీవిని విద్యని చేజిక్కించుకున్న శుక్రాచార్యుని ముద్దుల కూతురు. తన తండ్రి వలనే రాజులందరూ సుఖంగా ఉన్నారు అనే అహంకారం.

శర్మిష్ఠ - తను రాక్షస రాజువైన వృషపర్వుడి కూతురు. తండ్రి రాజు. తను క్షత్రియ కన్య. తనది అధికారం ఉండే వంశం. తన తండ్రి వద్ద బ్రాహ్మణ గురువు, ఆ గురువు కూతురు అందరూ దేహీ అంటూ ఉండాలనే అహం ఉంటుంది. విపర్యాసం ఏంటంటే ఈ రెండు భిన్న వ్యక్తిత్వం గల ఈ అమ్మాయిల మధ్య బాల్యం నుంచీ మంచి స్నేహం ఉంటుంది. కానీ ఈ నవలలో వీళ్ళ స్నేహం కనిపించేది గోరంత, ద్వేషం, ప్రతీకారం కనిపించేది కొండంత.

బ్రాహ్మణ కన్య అయిన దేవయాని తన జీవితంలో చాలామటుకు బాధలను అనుభవించి ఉంటుంది. అందులో ఒకటి: కచ అనబడే ఋషికుమారుడు తన ప్రేమను తిరస్కరించి,

“ఏ ఋషి కుమారడూ కూడా నిన్ను పెళ్ళాడడు.” (7)

అని శపించిన మాటలకు బాధపడింది. అలానే రాకుమారి శర్మిష్ఠ తన అహంకారంతో చెప్పిన,

“వృషపర్వుడైన నా తండ్రిని ఆశ్రయించిన పేద బ్రాహ్మణ కుమార్తెవు నీవు.” (8)

అనే హేళనతో కూడిన మాటలు బాధపెట్టాయి. ఈ రెండూ సందర్భాలు ఆమెకు ఈటెలా గుచ్చుతూ ఉంటాయి. కాబట్టి ఈమె వీటి నుంచీ బయటపడడానికి ఒక మంచి సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేగాక ఈ రెండు సంఘటనలకు ప్రతీకారం తీర్చుకోవడానికీ అదనుగా లభించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి అవకాశం యయాతి రూపంలో రానే వస్తుంది.

7. స్నేహం ద్వేషంగా మారిన వైనం

వసంతోత్సవం రోజు దేవయాని, శర్మిష్ఠ ఇద్దరూ నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక ఆకస్మిక సంఘటన జరుగుతుంది. అదే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గాఢ స్నేహం ద్వేషంగా మారడానికి కారణమవుతుంది.

“ఈ స్నేహం అనేది ఒక్కొక్క సారి వికసించే పువ్వులా నవ్వుతుంది.
మరొకసారి బద్దలయ్యే జ్వాలాముఖిగా కూడా మారుతుంది.
అది కొన్ని సార్లు వెన్నెల కావచ్చు, మెరుపు తీగనూ కావచ్చు;
అది లేడిపిల్ల కావచ్చు, లేక నాగిణిగాను మారవచ్చు.” (9)

అనే రకంగా దేవయాని, శర్మిష్ఠల మధ్య ఉన్న అన్యోన్య బాంధవ్యం చెడిపోయి, వీళ్ళ మధ్య ద్వేషానికి ఆస్కారం తెచ్చే సందర్భాలు ప్రవేశం చేస్తాయి.

దేవయానికి కచుడు ప్రేమతో ఇచ్చిన దివ్య వస్త్రాన్ని పరిచారిక చేసిన తప్పిదం వలన శర్మిష్ఠ కట్టుకుంటుంది. దేవయాని తనకు కానుకగా వచ్చిన దివ్య వస్త్రాన్ని శర్మిష్ఠ కట్టుకున్నందుకు కోపం తెచ్చుకుని ఇద్దరి మధ్య తగాదాలు, గొడవలు ఏర్పడతాయి. తన తండ్రి వద్ద ఆశ్రయించిన ఒక బ్రాహ్మణ కన్య నన్ను నిలదీసిందనే కోపంతో శర్మిష్ఠ దేవయానిని ఒక బావిలో పడదోస్తుంది.

ఇక్కడి నుండి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఈ బావి సంఘటనను రచయిత రెండు మూడు వెర్షన్లలా వివరిస్తాడు. బావిలో పడిన దేవయాని తను అలా పడడానికి శర్మిష్ఠే కారణం, శర్మిష్ఠ నన్ను చంపాలని అలా చేసింది అంటుంది. శర్మిష్ఠ లేదు, అప్పుడు తాను బావి దగ్గరలో లేదు, నన్ను ముట్టుకోవడానికి ఇష్టంలేక వెనుక అడుగేస్తూ తనే జారి పడిపోయింది అని చెబుతుంది. ఇలా పడిపోయిన దేవయానిని పైకి ఎత్తి కాపాడిన యయాతి తన అమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అరుదుగా లభించిన అవకాశంగా తీసుకుంటాడు.

దేవయాని బావిలో పడ్డ తర్వాత అంత గాఢ సఖియైన శర్మిష్ఠ దేవయానిని కాపాడ్డానికి ప్రయత్నం చెయ్యకుండా వెళ్ళిపోతుంది. ఇది ఆమెలో ఉన్న ద్వేషపు వ్యక్తిత్వాన్ని చూపిస్తే, దేవయాని తనను రక్షించడానికి ఎవరైనా వస్తారేమో అని అరుస్తూ ఉండగా వేటకు వెళ్ళిన యయాతి ద్వారా రక్షింపబడినప్పుడు ఆమెలో తన ప్రాణం కాపాడుకోవాలనే ఆలోచన కన్నా తనను అవమానించి బావిలో పడదోసి పోయిన శర్మిష్ఠ మీద పగదీర్చుకోవాలి అనే పట్టు అధికంగా కనిపిస్తుంటుంది. అలానే తన ప్రేమను నిరాకరించి వెళ్ళిన కచుడుకి కూడా బుద్ధి చెప్పాలనే ఆతృత కూడా ఉంటుంది. కాబట్టి యయాతి తనను రక్షిస్తుండగా అతను హస్తినాపురపు రాజు అని తెలిసిన వెంటనే తన భవిష్యత్ జీవితాన్ని తనే రాసుకుంటున్నట్టు కుడి చేయి చాపి రక్షించాలని కోరుకుంటుంది.

ఇంతకు మునుపు కచుడి ప్రేమలో ఉన్న దేవయానికి ఇప్పుడు కచుని రుద్రాక్ష హారం కన్నా రాజు మెడలో ఉన్న రత్నపు హారమే చాలా ప్రియమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే శర్మిష్ఠ, కచుడి మీద పగ తీర్చుకోవడానికి ఇదే సువర్ణావకాశం. దీన్ని అదునుగా తీసుకొని, యయాతికి అంటుంది,

“మీరు నా కుడి చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశారు. కాబట్టి ఇక మీదట నా చేతిని వదలకూడదు.” (10)

అని ఒక సమ్మోహనాస్త్రం వదులుతుంది.

ఇటు యయాతికి తన అమ్మ మీద పీకలదాకా కోపం ఉంటుంది. తను ప్రేమించిన అలకా అనే అమ్మాయిని తను క్షత్రియ కన్య కాదని, విషం పెట్టి చంపేస్తుంది. అలానే తన తండ్రి మరణానంతరం సామ్రాజ్యపు అన్ని నిర్ణయాలను తనే తీసుకుంటూ యయాతిని మూలదోస్తుంది. అతని పెళ్ళికి క్షత్రియ కన్య తప్ప వేరే ఏ కన్యనూ అంగీకరించక నిరాకరిస్తూ ఉంటుంది. ఇవి యయాతి మనస్సు మీద పెద్ద దెబ్బలా పడతాయి. కాబట్టి ఇప్పుడు తన అమ్మ మనస్సుని నొప్పించడానికి ఆమె మీద పగ తీర్చుకోవడానికి ఇదే సరైన మార్గం అని దేవయాని చెప్పిన మాటకు వెనక ముందు ఆలోచించకుండా సమ్మతిని తెలుపుతాడు.

8. స్వార్థంతో కూడిన దేవయాని-యయాతిల పెళ్ళి

ఇలా దేవయానికి యయాతిని పెళ్ళి చేసుకునేందుకు కొన్ని కారణాలుంటే, యయాతి దేవయానిని పెళ్ళి చేసుకున్నందుకు కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి. కాబట్టి ఇద్దరి మధ్యలో ప్రేమ కన్నా వ్యక్తిగత ప్రతీకారాలే ముఖ్యమవుతాయి. దేవయానికి రాజుని పెళ్ళి చేసుకుంటే తను మహారాణి అవుతాను, అప్పుడు శర్మిష్ఠకి తను హస్తినాపురపు మహారాణి అనే అహం, అధికారికత చూపించవచ్చును. అలాగే శర్మిష్ఠను తన తండ్రి ద్వారా తన దాసిగా పెట్టుకొని ఆమెను బాగా హింసించవచ్చును అనే ఆశ ఉంటుంది.

శర్మిష్ఠ ఒక రాజు కుమార్తె అయినా కూడా ఆ రాజు మాత్రం గురువు శుక్రాచార్యుడికి భయపడతాడు. శుక్రాచార్యుడు చెప్పినట్టు వింటాడు. కాబట్టి తన తండ్రి ద్వారానే శర్మిష్ఠ దేవయానికి దాసిగా మారాల్సి వస్తుంది. ఇక్కడ వృషపర్వుడికి తన కూతురి సుఖ సంతోషాల కన్నా తన సామ్రాజ్యమే ముఖ్యమని భావించినట్టు అనిపిస్తుంది.

దేవయాని యయాతిని పెళ్ళి చేసుకోవడంలో, యయాతి దేవయానిని పెళ్ళి చేసుకోవడంలో ఇద్దరి మధ్య పరస్పర స్వార్థం తప్ప ప్రేమ కనిపించదు. దేవయానికి ప్రతీకారం కోసం ఈ పెళ్ళి… యయాతికి తన తల్లి చేసిన ద్రోహానికి ప్రతీకారానికి పెళ్ళి. కాబట్టి ఈ ఇద్దరూ పరస్పర ప్రేమతో ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు. కాబట్టి వీళ్లిద్దరి మధ్య వాళ్ళవే కొన్ని అజెండాలు ఉన్నందువలన వీళ్ళ సంసారపు సరిగమల్లో చాలామటుకు అపస్వరాలే వినిపిస్తాయి.

దానికి తోడుగా దేవయానికి ఉండే అత్యంత ప్రబల అస్త్రమంటే తన తండ్రి శుక్రాచార్యుడు. ఇతను చాలా కోపిష్ఠి. చిన్న చితక ఏదైనా చీటికి మాటికి వెంటనే శపించే ఆసామి. కాబట్టి ఇలాంటి ధైర్యంతో యయాతిని తన చేతి వేళ్ళతో ఆడిస్తుంది. అందువలన వీళ్ళ సంసార దాంపత్యం దెబ్బ తింటుంది.

9. శర్మిష్ఠ-దేవయాని-యయాతి: భిన్న ధ్రువాలు

అలానే దేవయాని తన దాసిగా మార్చుకున్న శర్మిష్ఠకు ప్రతి సందర్భంలోనూ దుఃఖం, అవమానం కలిగించాలని ప్రతిక్షణం తన భోగ భాగ్యాలను ఎత్తి చూపిస్తుంటుంది. అలానే తన శోభనం రోజు శయనగృహం ముందు రాత్రంతా కాపలా ఉండేటట్టు ఆదేశించి తన పగ తీర్చుకుంటుంది. అయినా శర్మిష్ఠ మాత్రం తను కొంచెం కూడా బాధపడకుండా చాలా సంతోషంగానే ఉంటుంది. అలానే తను యయాతి ప్రేమను సంపాదించుకొని దేవయాని పగను రివర్స్ అయ్యేటట్టు చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న కోపం మరీ అతిరేకానికి చెంది, చంపడానికి ప్రయత్నించే స్థాయికి చేరుతుంది.

యయాతి, శర్మిష్ఠల మధ్య ప్రేమ మొలవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దేవయాని, యయాతి మధ్య ఉన్న అవగాహనా లోపం (Understanding Gap). రెండవది ఎల్లప్పుడూ స్త్రీలోలుడైన యయాతికి దేవయాని సుఖపెట్టకపోవడం. ఈ రెండు కారణాల వలన యయాతి శర్మిష్ఠ వ్యామోహంలో పడిపోతాడు. దీనివలన శర్మిష్ఠ గర్భవతి కూడా అవుతుంది. పరిస్థితి విషమ స్థితికి వెళ్ళినప్పుడు దేవయానికి భయపడి శర్మిష్ఠ అజ్ఞాతవాసానికి వెళ్ళాల్సి వస్తుంది.

ఈ నవలలో చాలా పెద్ద గ్యాప్ అంటే శర్మిష్ఠ అజ్ఞాతవాసానికి వెళ్ళిన 18 సంవత్సరాలు. యయాతి అంతఃపురం త్యజించి అశోకవనంలో గడిపిన 18 సంవత్సరాలు. తన తండ్రి ఎవరు అని తెలియకుండానే పెరిగిన పురుడి 18 సంవత్సరాలు. ఇవన్నీ సంగతులు చాలా తక్కువ వివరణతో ముగించినట్టు కనిపిస్తుంది.

10. పదిహేను రోజుల గడువు

ఈ 18 సంవత్సరాల తరువాత మరోసారి సంధించే సందర్భం మాత్రం ‘శర్మిష్ఠ’, తన కొడుకు ‘పురు’ ఇద్దరికీ సానుకూలంగా మారుతుంది. ఎందువలనంటే దస్యుల బందీగా ఉన్న దేవయాని కొడుకు ‘యదు’ని రక్షించి తీసుకొచ్చేది శర్మిష్ఠ కొడుకు పురుడే. కాబట్టి పురుకి హస్తినాపురం ఘనంగా స్వాగతం పలుకుతుంది. తద్వారా శర్మిష్ఠ కూడా ఏ ఆటంకాలు, ఆపదలూ లేకుండా హస్తినాపురానికి రావడానికి అవకాశం లభిస్తుంది.

ఇలా అందరూ ఒక చోట కలవడానికి నవలా రచయిత పెట్టిన గడువు 15 రోజులు. బందీగా ఉన్న దేవయాని కొడుకు ‘యదు’ నగరానికి రావడానికి 15 రోజుల గడువు. తపస్సుకు వెళ్ళిన శుక్రాచార్యుడు తిరిగి రావడానికి ఉన్నవి 15 రోజులు. బంగారు కురులుగల అమ్మాయిని తీసుకురావడానికి మందారుడికి యయాతి ఇచ్చిన గడువు 15 రోజులు. దేవయాని యదునికి పట్టాభిషేకం చేయడానికి ఉన్నవి 15 రోజులు… ఇలా ప్రతి ఒక్కటి 15 రోజుల తరువాత ప్రారంభమవుతాయి అనే సంగతులను పెట్టి రచయిత పాఠకులను కాలివేళ్ళ మీద నిలబడేటట్టు చేస్తాడు.

శుక్రచార్యుడు తిరిగి వచ్చిన వెంటనే అతని కుమార్తెయైన దేవయాని యయాతి మీద చెప్పిన ఆరోపణకు ఆగ్రహంతో శుక్రాచార్యుడు యయాతికి పరోక్షంగా,

“పాపిష్ఠుడైన యయాతి ఇప్పుడే, ఈ క్షణంలోనే కుష్టుడైన వృద్ధుడై పోవాలి.” (11)

అని శపిస్తాడు. ఇలా శాపానికి గురైన యయాతి వెంటనే వృద్ధుడైపోతాడు. ఈ వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి శర్మిష్ఠ కొడుకు పురు ముందుకు వస్తాడు. అప్పుడు యయాతి మనస్సులో మరోసారి భోగలాలస మొలకెత్తినా, ఆ ఆనందం క్షణంలో ఆవిరైపోయేటట్టు పురుని తల్లి శర్మిష్ఠ ముందుకు వస్తుంది. పురు శర్మిష్ఠకు తనకు పుట్టిన కొడుకు అని తెలిసిన వెంటనే ఆమె మీద ఉన్న ప్రేమ వలన పురుని యౌవనం తీసుకున్నా కూడా మళ్ళీ అతనికే తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఇలా వృద్ధాప్యం తీసుకున్న వెంటనే చావు తప్పదు అని తెలిసినా కూడా శర్మిష్ఠ మీద ఉన్న ప్రేమ అలాంటి త్యాగానికి కూడా పురిగొల్పుతుంది. అయినా కచుడి వలన అంతా సుఖాంతం అవుతుంది.

ఇక్కడ పురు తన తండ్రి వృద్దాప్యాన్ని తీసుకోవడానికి అతనిలో కూడా స్వార్థం కనిపిస్తుంది. పురు యయాతి పుత్రుడు అయినా కూడా అతనికి హస్తినాపురం అంతఃపురంలో ఏ అస్తిత్వమూ ఉండదు. ఎందుచేతనంటే అతను వివాహేతర సంబంధానికి, అంటే శర్మిష్ఠ-యయాతి ప్రేమకు జన్మించినవాడు. కాబట్టి అతనికి దేవయాని నుంచీ ప్రేమ వాత్సల్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తను అసామాన్యమైన సాహసాన్ని ప్రదర్శించి యదుని కాపాడినందుకు ప్రజలందరూ పురువే రాజు అవ్వాలని ఏకగ్రీవంగా ఒత్తిడి చేస్తారు. అయినా ఆ పదవిని యదుడికి త్యాగం చేసి దేవయాని ప్రేమ సంపాదించుకుంటాడు. అందువలనే దేవయాని, శర్మిష్ఠల మధ్య ఉన్న ద్వేషం అంతమవుతుంది. యయాతికి దేవయానితో పాటు శర్మిష్ఠ కూడా దక్కుతుంది. పురుకి అంతఃపురంలో రాకుమారుడి హోదా లభిస్తుంది.

ఉపసంహారం

  • ఈ నవల ముగ్గురి కథగా కనిపించినా అందులో కచ, శుక్రాచార్య, పురు, రాజమాత ఈ పాత్రలూ కూడా అంతే ప్రాధాన్యంగా కనిపిస్తాయి.
  • కచ, శుక్రాచార్యులు ఇద్దరూ గురు శిష్యులయినా కూడా వ్యక్తిత్వం మాత్రం పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి.
  • శుక్రాచార్యుడు తను సంపాదించుకున్న సంజీవిని విద్య వలన అందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చూస్తాడు. మరియు కోపిష్ఠిగానూ, భయం పెట్టే రకంగానూ కనిపిస్తాడు.
  • కానీ కచుడు మాత్రం ఎవరికి ఏ ఆపద వచ్చినా అతను భరోసా వెలుగులా కనిపిస్తాడు. అందరికి అండగా ఉండి ధైర్యం నింపుతాడు.
  • ఇలా యయాతికి, దేవయానికి, శర్మిష్ఠకు, యతికి, రాజమాతకి, దేవతలకి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి అంటే ఈ కచుడు మాత్రమే. నవల అంతిమంగా సుఖాంతంగా ముగుస్తుంది.

సూచికలు

  1. యయాతి (కన్నడ అనువాదం), పుట 1
  2. అదే, పుట 404
  3. అదే, పుట 48
  4. అదే, పుట 9
  5. అదే, పుట 59
  6. అదే, పుట 121
  7. అదే, పుట 128
  8. అదే, పుట 138
  9. అదే, పుట 129
  10. అదే, పుట 143
  11. అదే, పుట 383

ఉపయుక్త గ్రంథసూచి

  1. గిరీశ్, కార్నాడ్. యయాతి (నాటకం). ధారవాడ: మనోహర గ్రంథమాలా, 1960.
  2. నరసింహశాస్త్రి, దేవుడు, మహాక్షత్రియ. బెంగళూరు: స్టాండర్డ్ బుక్ డిపో, 1966.
  3. రామేశ్వరావధాని, శ్రీమన్ మహాభారత. బెంగళూరు: భారత దర్శన ముద్రాణాలయ, 2014.
  4. విష్ణు సుఖారాం, ఖాండేకర్. యయాతి (తెలుగు అనువాదం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమి, 2000.
  5. పైదే. యయాతి (కన్నడ అనువాదం: వి.ఎం. ఇనాందార్). బెంగళూరు: అంకిత పుస్తకం, 2008.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]